Archive for April, 2009

“గురివింద గింజ తన నలుపెరగదంట”

womens

గురివింద గింజ ముందు భాగమంతా ఎర్రగా ఉండి… వెనుకవైపున ఓ నల్లటి మచ్చ కలిగి ఉంటుంది. కానీ తన నలుపు సంగతి మర్చిపోయిన అది, ఈ ప్రపంచంలో తనకంటే గొప్ప అందగత్తె లేనే లేదని భ్రమపడుతూ ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ గురివింద సామెత తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కానేరదు.


అదే విధంగా ఈ గురివింద చందంగా వ్యవహరిస్తూ.. తమలోని లోటుపాట్లను పక్కనపెట్టి, ఇతరులను తప్పుపట్టడమే పనిగా పెట్టుకున్నవాళ్లు మన సమాజంలో కోకొల్లలు. ఇలాంటి వాళ్లు గోతికాడ నక్కల్లాగా కాచుకు కూర్చొని… పక్కిళ్లలో, ఎదురిళ్లలో ఎప్పుడు ఏం జరుగుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు.


పాపం.. పొరుగిళ్లలోని జనాలు ఇలాంటి వారి పాల బడ్డారే అనుకోండి, ఇంకేముందీ కథలూ, కాకరకాయలూ, అదనపు మసాలాలూ జోడించి ఒక బ్రహ్మాండమైన స్టోరీని తయారు చేసి ఊరూ, వాడా ఏకం చేసేస్తారు. ఇలాంటి ఇరుగు, పొరుగు వారితో సమస్యలు దాదాపు చాలామందికి అనుభవమయ్యే ఉంటుంది.


అలాగని… అందరు ఇరుగు, పొరుగువారు పై లిస్టులోని వారేనని జమకట్టడం లేదండోయ్..! ఇలాంటివారూ ఉంటారని మాత్రమే చెప్పదలచుకున్నా. అలాగే… కాస్త మంచిగా బ్రతుకుతుంటే చూసి ఓర్వలేని జాబితా కొందరిదయితే, పేరుకు స్నేహితులమని చెప్పుకుంటూ, పక్కనే ఉంటూ బల్లెంలాగా తయారయ్యేవారు కొంతమంది… ఇలా రకరకాల వ్యక్తులు మన జీవితాల్లో తారస పడుతుంటారు.


ముఖ్యంగా నేను చెప్పదలచుకుంది… ఎదుటివారిని కాకుల్లా, గద్దల్లా, పందుల్లా పీక్కుతింటూ పైశాచిక ఆనందాన్ని అనుభవించే కొంతమంది మనుష్యరూపంలో ఉండే జంతువులను (పాపం జంతువులు బాధపడతాయేమో) ఉద్దేశించి మాత్రమే. అలాంటివారికి మనం తగిన గుణపాఠం నేర్పాలనుకోవడం కుక్కతోకను సరిచేయడం లాంటిదే. అలాగని… మన సమాజంలో మంచివాళ్లు, మంచితనం చచ్చిపోలేదు.


అబ్బా… ఇది అందరికీ తెలిసిందే కదా… మళ్లీ మీ సోది ఏంటండీ అనుకోవద్దు. పైన చెప్పుకున్న అనుభవాలనే గత కొంతకాలంగా ప్రత్యక్షంగా చూస్తుండటంతో ఆవేదన తట్టుకోలేక ఇలా పంచుకుంటున్నా…! మా పక్కింట్లో ఉండే కొంతమంది, ఎదురింట్లో ఉండేవారిని మాటల తూటాలతో, కట్టుకథలతో, అప్పటికప్పుడే అల్లుతున్న స్టోరీలతో ఎలా ఆడుకుంటూ, ఆనందిస్తున్నారో చూస్తే.. భరించలేనంత అసహ్యం వేస్తోంది.


ఎవరినయినా మానసికంగా, సామాజికంగా దెబ్బకొట్టాలంటే ఉన్న ఏకైక ఆయుధం… “వ్యక్తిగత జీవితాలపై దాడి” అన్న విషయాన్ని బాగా పసిగట్టినట్లున్నారు పై సదరు పక్కింటి పుణ్యాత్ములు.. ఎప్పుడో, ఏదో ఒక సందర్భంలో చిన్న మాట పట్టింపులు వచ్చిన పాపానికి ఎదురింటివాళ్లను ఫుట్‌బాల్ ఆడేసుకుంటున్నారు.


“పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనిపించి”నట్లుగా… వీరు చేసినదాన్ని కప్పిపుచ్చుకునేందుకు…. ఎదుటివారిలో లేని లోపాన్ని క్రియేట్ చేసి, దానికి రోజుకో రకంగా మసాలాలు దట్టించి మరీ… మాంచి గమ్మత్తయిన వంటకాలను రోజుకొకటి తయారు చేసి… దారినపోయేవాళ్లకు, తెలిసినవాళ్లకు, తెలియనివాళ్లకు… ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్లకు, వీళ్లకు అని తేడా లేకుండా ఎవరికంటే వారికి… ఉచితంగా, కమ్మగా వడ్డించేస్తున్నారు.


పాపం.. అంత మంచి కమ్మటి భోజనం తిన్నవారు ఊరకే ఉంటారా చెప్పండి. వారికి తోచిన మరిన్ని సలహాలు, సూచనలు, మెచ్చుకోల్లు లాంటి.. అన్నింటినీ ఉచితంగా వీరికి (చేసిన సహాయాన్ని మర్చిపోకుండా ప్రతిసహాయం చేయకపోతే ఎలా మరి..?) ఇచ్చేసి చల్లగా తప్పుకుంటున్నారు.


ఓ రోజు అప్పుడే ఇంటికి చేరుకుంటున్న నన్ను ఎదురింటివాళ్లు పిలిచి, మా పక్కింటివారి ఆగడాలను చెప్పి వాపోయారు. ఏం చేద్దామండీ… వారి పాపాన వారే పోతారు అని చెప్పడం మినహా ఏమీ చేయలేక మెల్లిగా పైకి వచ్చాను. అలా అన్నానేగానీ, మనసులో మాత్రం వాళ్లు ఇంత అన్యాయానికి పాల్పడతారా..? అన్న కోపంతో ముఖమంతా జేవురించుకుపోయింది.


అయినా వీళ్లు ఎవరికి ఎవరూ ఏమీకారు. సొంత బంధువులూ కాదు, చుట్టాలు కాదు, స్నేహితులు కాదు… మరెందుకు ఆ ఎదురింటివారిపై వీరికి ఇంత పగ అని ఎంత ఆలోచించినా అంతుబట్టలేదు. ఇక్కడ ఇంకో గమ్మత్తయిన విషయం ఏంటంటే.. ఎవరైతే వీరి ఆగడాలకు బలవుతున్నారో, అదే ఇంట్లోని కొంతమంది వ్యక్తులు వీరితో సన్నిహితంగా ఉండటం.


సన్నిహితంగా ఉండే వ్యక్తుల ద్వారా తెలుసుకున్న చాలా సాధారణ విషయాలను కూడా… పై ప్రబుద్ధులు కట్టుకథలల్లేసి, నోటి దురదను తీర్చేసుకుంటున్నారు. వీరికి కావాల్సింది కాలక్షేపం. ప్రతిరోజూ పొద్దు గడవటం. ఏ పనీ లేకుండా ఉంటే బుర్ర ఊరకే ఉంటుందా.. బుర్రకు పని చెప్పాలి కదా.. అందుకే ఇలా విర్రవీగుతుంటారు. ఇలాంటివారిని ఏమనాలో, ఏం పేరు పెట్టాలో నాకైతే బోధపడటం లేదు.


మీకేమైనా తెలిస్తే చెప్పరూ…!

RTS Perm Link

పరిగెత్తే కాలానికి బంధాలు

restless-women

కాలం…. కలికాలం…
ముగిసింది చలికాలం
మండుతోంది వేసవికాలం
పగలయితే ఎండలకాలం
రాత్రయితే వెన్నెలకాలం

కుర్రకారుకు రంగుల కాలం
పెద్దవాళ్లకు ఖర్చుల కాలం
ఉండనే ఉంది ముసుర్ల కాలం
అయితేనేం వెరవదు కాలం

బంధాలు కలకాలం
బాధ్యతలు ఎల్లకాలం
సుఖపడేది ఏ కాలం
అసలుంటుందా మంచికాలం…??!!

RTS Perm Link

వెలుగు రేఖల వెతుకులాటలో…!

beautyofearth7

నా ఆలోచనలన్నీ
మనసు అనే విరిగిన ముక్కను
తీసుకొచ్చి చేతిలో పెట్టాయి
అప్పుడు నాకేమనిపించిందో తెలుసా
సూర్యుడే మెల్లిగా కిందికి పడిపోతున్నట్లు…!

నా ఆలోచనలన్నీ
సంతోషం అనే కలకండ ముక్కను
తీసుకొచ్చి నోట్లో వేశాయి
అప్పుడు నాకేమనిపించిందో తెలుసా
చంద్రుడే హాయిగా కిలకిలా నవ్వుతున్నట్లు…!

నా ఆలోచనలన్నీ
ఆశ అనే రేపటిని
తీసుకొచ్చి ముందు నిలిపాయి
అప్పుడు నాకేమనిపించిందో తెలుసా
సూర్య, చంద్రులే పోటీ పడుతున్నట్లు…!

RTS Perm Link

RTSMirror Powered by JalleDa