Archive for March 31st, 2009

భూమ్యాకాశాల బంధమా…?!

hello-friend

చేసిన మంచిని మరవని తత్త్వం నీది
మంచితోపాటు చెడునూ మరవలేని మనస్తత్త్వం నాది

నువ్వేమో… ఆకాశం, నేనేమో భూమండలం
నువ్వు ప్రపంచాన్ని చుట్టేస్తే.. నేనేమో నిన్ను చుట్టేస్తా..!

నేను లేకపోతే భూమండలమే లేదంటావు నువ్వు
నేనంటూ ఉంటేనే కదా ఆకాశానికి చోటంటాను నేను

ఎందులోనూ ఎవ్వరమూ తీసిపోయేది లేదు
అన్నింట్లోనూ ఎవరికి వారే సాటి

ఆలోచనలు, అభిరుచులు దాదాపు ఒక్కటైనా
అభిప్రాయాల్లో మాత్రం ఎప్పుడూ చెరో దారే

ప్రతిదాన్నీ లైట్‌గా తీసుకోమంటావు నువ్వు
జీవితమే లైట్‌గా అవకూడదంటాను నేను

కోరి కోరి కష్టాల్లో పడవద్దని నేను హెచ్చరిస్తే…
ఏ పుట్టలో ఏముందో ఎవరికి తెలుసంటావు నువ్వు

ఎవరైనా శాసిస్తే ఒప్పుకోనంటావు నువ్వు
మంచి కోసం శాసించినా తప్పులేదంటాను నేను

వాదనల్లో పోటాపోటీ… మెట్టు దిగే ప్రశక్తే లేదు..
మొదలెట్టింది ఎక్కడో.. వెళ్తోంది ఎక్కడికో…

చివరకు..

పడ్డాక తెలుస్తుందిలే.. అని అలకతో నేను కునుకేస్తే
వస్తే రానీ.. పోతే పోనీ.. అంటూ ధీమాగా ఉంటావు నువ్వు

రాజీ కుదిరే మార్గమే కరువాయే
నా అలకతో సమస్తం నిశ్శబ్దం
నీ కినుకతో అంతా నిరాసక్తం

కాలం అలా మెల్లిగా కదుల్తుంటే,
“ముల్లును ముల్లుతోనే..” నానుడి గుర్తొచ్చిందో.. ఏమో…?
ధీమాకు వీడ్కోలు చెప్పి, నువ్వూ… అలకపాన్పునెక్కావు

నువ్వో వైపూ.. నేనోవైపు..
అలక పాన్పుకు అంటుకుపోయినా…
మాటలే లేకపోయినా… ఊరుకుందునేమో
నీ ఉపవాస దీక్షకు దిగొచ్చేశా

బువ్వ తినమని బుజ్జగిస్తే…
ఇద్దరం కలిసే తిందామన్నావు
అంతే…
వాదనలు, సమస్యలు, పరిష్కారాలు
వేటిదారిన అవి చెప్పా పెట్టకుండా చెక్కేశాయి

నీకూ… నాకూ మధ్యా ఉండే
ఈ అనుబంధమే కలకాలం మనల్ని
కలిపి ఉంచుతోంది..

కాదంటావా నేస్తం….?

9220 pages viewed, 14 today
3582 visits, 4 today
FireStats icon Powered by FireStats