Archive for February, 2009

అమ్మలా లాలించే నేస్తమా..!

friendship2

కొన్ని నవ్వులు
మరికొన్ని అల్లర్లు
ఇంకొన్ని అలకలు
లెక్కలేనన్ని గొడవలు
అంతే స్థాయిలో రాజీలు
అంతంలేని పేచీలు
ఆరాటాలు.. పోరాటాలు..!

సంతోషాలు సాగుతాయి
కష్టాలు తరుగుతాయి
బాధలు పెరుగుతాయి
నవ్వులు వికసిస్తాయి
సంకెళ్లు విడిపోతాయి
విషాదం కూడా
సంగీతం అవుతుంది

జలజలా కారే కన్నీటి
సవ్వడులను వినే రెండు చెవులు
ఓదార్చే రెండు పెదవులు
ధైర్యం చెప్పే రెండు చేతులు
ఆసరా ఇచ్చే ఓ భుజం
అమ్మలా లాలించే
ఓ నేస్తం నాకు మాత్రమే సొంతం…!

నిరంతర ప్రయాణం…!

kid

నిన్ను కలిసేదాకా..
రాత్రులన్నీ చల్లగా
రోజులన్నీ నిశ్శబ్దంగా
నాకే వినిపించనంతగా
నా హృదయ స్పందన…

అదే నిన్ను కలిసాక
నా చేతులెప్పుడూ ఖాళీగా లేవు
నా మనస్సెప్పుడూ మౌనంగా లేదు
చూస్తుండగానే…
నిమిషాలు కాస్తా.. గంటల్లాగా
గంటలు కాస్తా… రోజుల్లాగా
రోజులు కాస్తా.. వారాలు, నెలలుగా
కాలం మునుముందుకు…

నిన్ను చూసేదాకా…
ఆకాశంలోని నక్షత్రాలు
వెలసిపోయినట్లుగా ఉండేవి
అదే నిన్ను చూశాక…
ఆ నక్షత్రాల్లో మెరుపు
జీవితంలోనూ వెలుగు

నువ్వు తోడుంటే…
నా శక్తి రెట్టింపవుతుంది
తినే తిండి, పీల్చే గాలి
అన్నీ బలవర్ధకాలే….!

నువ్వు లేని రోజున
నా ప్రపంచం శూన్యం
మళ్లీ…
ఓ అద్భుతమైన రోజున
నిన్ను చేరేందుకు
ఆగదు ఈ నిరంతర ప్రయాణం…!

మర్చిపోలేనన్నావు కానీ….!

sorry

మర్చిపోలేనన్నావు కానీ..
క్షమించటం మరిచావు
అయినప్పటికీ…
నీ స్నేహం కావాలి
నిజంగా నీకు తెలుసో లేదోగానీ
ఊపిరాగిపోయేదాకా నీ స్నేహం కావాలి

నువ్వు నా పక్కన లేని రోజున
కాలం కదుల్తోందా అనిపిస్తుంది
నీ తియ్యటి పిలుపులను
అంతం లేని కబుర్లను
కలిసి తిరిగిన ప్రాంతాలను
పంచుకున్న ఆనందాలను

కళ్లు కన్నీటి సంద్రాలయినప్పుడు
నేనున్నానని ధైర్యం చెప్పే
నులివెచ్చటి నీ స్పర్శను
అన్నింటినీ… అన్నింటికీ
దూరంగా జరిగిపోయినట్లు
గుండెల్లో ఒకటే బాధ…

ఆరోజేం జరిగిందో…
ఎందుకు వాదులాడామో
ఎందుకు దూరమయ్యామో
మాటల గాయాలు
మళ్లీ వెనక్కి రావు

కానీ..
అన్నింటినీ మర్చిపోయి
మళ్లీ తిరిగొస్తావని
నన్ను మన్నిస్తావనీ…
మళ్లీ నిన్ను చూసే
అదృష్టాన్ని ప్రసాదిస్తావని
చెమర్చిన కళ్లతో ఎదురుచూస్తూ…!

భాషలెన్నయితేనేం… భావం ఒక్కటే కదా…!

తెలుగు… నేను నిన్ను ప్రేమిస్తున్నాను
కన్నడం… నా నిన్ను ప్రీతిసువే
తమిళం… నాన్ ఉన్నై కాదలిక్కిరేన్
మళయాళం… జ్ఞాన్ నిన్నే ప్రేమిక్కునుం
హిందీ… మై తుఝే ప్యార్ కర్‌తా హూ
చైనీస్… ఓ పోనీ
ఫ్రెంచ్… జయిట్ ఇం
ఇంగ్లీషు… ఐ లవ్ యూ
పర్షియన్… మాన్ దూస్త్ దస్తనే షుమా
రష్యన్… జగ్ అలస్కాడిగ్

భాషలెన్నయినా భావం మాత్రం ఒక్కటే కదా.. ప్రేమ నిండిన పెదవుల్లోంచి తియ్యగా పలికే ప్రేమానుభూతులు ఇవే కదా… ఎన్ని రకాలుగా నిర్వచించినా స్వచ్ఛతకు సంకేత పదమే ప్రేమ…

ప్రేమంటే “రెండు మనసుల కలయిక. ‘ఆద్యంతమూ లేని అమరానందమే ప్రేమ.. ఏ బంధము లేని అనుబంధమే ప్రేమ.. ప్రేమ దివ్య రాగము.. ప్రేమ దైవ రూపము’ అంటాడు మనసు కవి ఆత్రేయ..

“ప్రేమ లేని ముద్దు మరణం కంటే మేలు” అనేది జోయా అనే రచయిత్రి రాసిన ఓ మెరుపు వాక్యం…  ప్రేమ (నిజమైన)లేని జీవితం మరణంతో సమానమని నా అభిప్రాయం. సత్యాన్ని గ్రహించి, ఆచరించిన వారే నిజమైన ప్రేమికులవుతారు. స్వచ్ఛమైన ప్రేమకు మరణం అనేది ఉండదు.

అయితే… భార్యాభర్తల మధ్య పుట్టే ప్రేమ మానవజాతికే శుభకరమని, స్నేహితుల మధ్య ప్రేమ మానవాళిని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని, “వ్యసన పరాయణ కాముక ప్రేమ సమస్త మానవాళినీ భ్రష్టు పట్టిస్తుందని…” చెప్పిన బెకన్ మహాశయుడి మాటలను ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవడం చాలా అవసరం.

నిజమైన ప్రేమికులకు, నిజమైన ప్రేమకు వందనం… అభివందనం…

హ్యాపీ వాలెంటైన్ డే… ప్రేమికుల రోజు శుభాకాంక్షలు… కాదలిర్ దిన నళ్ వాళ్తుకల్…..!!!!

కాసేపు ఇలా వినరాదూ..?

కాసేపిలా నా మాటలు వినవా
ప్లీజ్… మళ్లీ ఆ పదం ఎప్పుడూ చెప్పొద్దు
మొదటిసారి నువ్వు నన్ను కలిసిన రోజుల్ని
ఓసారి మళ్లీ గుర్తు తెచ్చుకోవాలనుంది
ఎంతలా మాటల కోసం తపనపడ్డాం
ఎన్ని జ్ఞాపకాలను కలబోసుకున్నాం
ఒక్కసారి గుర్తు తెచ్చుకో
అప్పట్లో నీకు నామీద ఉండే శ్రద్ధని…!

ఇప్పుడు ఆలోచిస్తే ఎంతలా దూరమయ్యాం
ఎంతలా రోదించాను
ప్లీజ్ నన్నాపవద్దు… మాట్లాడవద్దు..
చెప్పేది పూర్తిగా వింటే చాలు
ఒక్కటి మాత్రం గుర్తుంచుకో
నీకెప్పుడూ అబద్ధాలు చెప్పలేదుగానీ,
ముక్కలు ముక్కలుగా పగిలిపోయిన
నా గుండె గొంతుక మూగ భాషను
మాత్రం ఎప్పుడో చెప్పాను

ఆ గాయం ఉంది చూశావూ…
చాలా పదునైంది, అంతకంటే లోతైంది
భరించలేని బాధతో మనసును మెలిపెట్టేది
సంవత్సరాలుగా ఇలాగే సాగుతూనే ఉంది
ఆ బాధాకర క్షణాలను
లెక్క పెట్టలేనన్ని కన్నీళ్లను
ఎప్పటికీ మర్చిపోలేనేమో..?

అయితే…
ఇప్పుడిప్పుడే జీవితాన్ని మళ్లీ పునర్నిర్మించుకుంటున్నా
గతం తాలూకూ గాయాలు మళ్లీ పునరావృతం కాకుండా
కష్టమైనప్పటికీ మర్చిపోయే ప్రయత్నంలో ఉన్నా

గాయాల సంగతి పక్కకు నెట్టేస్తే
నా జీవిత యాత్రలో
మర్చిపోలేని సుగంధానివి
విడదీయరాని అనుభూతివి
పాత గాయాలు కష్టపెట్టినా
నువ్వు ప్రసాదించిన చిన్ని చిన్ని
సంతోషాలను గుర్తు తెచ్చుకుని మరీ
తనివితీరా ఆస్వాదిస్తున్నా….
ఊపిరున్నంతదాకా నిన్ను మరవలేను నేస్తం…!

స్పామ్ మెయిల్స్‌తో జర జాగ్రత్త తమ్మీ…!

స్పామ్ పేరుతో మీ ఇన్‌బాక్స్‌కు చేరే చెత్త ఈ-మెయిల్స్‌తో ఇకపై జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, ఇలాంటి మెయిల్స్‌లోనే ఉగ్రవాదులు వారి సహచరులకు కోడ్ భాషలో రహస్య సమాచారాన్ని పంపుతుండవచ్చు. అందుకని మీ ఇన్‌బాక్స్‌ను తరచుగా చెక్ చేసుకుంటూ ఉండటం మంచిది.

ఉగ్రవాదులు ఇంటర్‌నెట్ లాంటి అధునాతన పరిజ్ఞానాన్ని ఎంతో సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంతకుమునుపైతే వీరు కోడ్ భాషలో ఉండే ఈ-మెయిల్స్ ద్వారా సమాచారాన్ని వారి సహచరులకు చేరవేసేవారు. ఇలాంటి సందర్భంలో ఎప్పుడో ఒకసారి ఉగ్రవాద నిరోధక బృందాలు వాటిని ట్రేస్ చేయగలిగేవి. ఐపీ అడ్రస్ ద్వారా ఎవరు, ఎవరికి మెయిల్ పంపారో గుర్తించి, వారు ఎక్కడ ఉన్నారో గుర్తుపట్టే వీలుండేది. అయితే ప్రస్తుతం ఉగ్రవాదులు తెలివిమీరిపోయారు.

అందుకనే… “ఈ-మెయిల్ ఒక్కరికి పంపితేనే కదా మనకు సమస్య… అందుకే తమ సహచరులతో పాటు వేలు, లక్షల మందికి ఈ-మెయిల్స్‌ను పంపితే, మనల్ని ఎవరూ గుర్తించలేరు” అని నిర్ణయించుకున్న ఉగ్రవాదులు ఒకేసారి కొన్న లక్షల మంది స్పామ్ మెయిళ్లను పంపేస్తున్నారు. ఇలా లక్షల సంఖ్యలో స్పామ్ మెయిళ్లను చేరేవేసే సాఫ్ట్‌వేర్‌లు, వెబ్‌సైట్లు లెక్కకుమించి ఉండటంతో వీరి పని మరీ సులువై పోయింది.

ఇలా స్పామ్ మెయిళ్లను పంపడం వల్ల ఆ మెయిళ్లను ట్రేస్ చేసినప్పటికీ, ఎవరికి ఎవరు పంపారో గుర్తించలేక ఇంటెలిజెన్స్ వాళ్లు తలపీక్కోవాల్సి వస్తుంది. స్పామ్ సమస్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోవడం వెనుకనున్న అసలు కారణం ఇదే అయి ఉండవచ్చునని కూడా ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు.

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు అందిస్తున్న యాంటీ స్పామ్ సాఫ్ట్‌వేర్‌ల వల్ల 99 శాతం నెటిజన్ల ఇన్‌బాక్స్‌లకు స్పామ్ మెయిళ్లు చేరలేవని అందరికీ తెలిసిందే. ఒకవేళ చేరినప్పటికీ కనీసం ఓపెన్ చేసి చదవకుండానే దాదాపు అందరూ వాటిని తీసిపారేస్తుంటారు. ఒకరిద్దరు చదవాలని చూసినా, సంకేత భాషలో ఉండటం వల్ల వారికేమీ అర్థం కాదు. అందుకే అన్ని విధాలుగా ఇది సురక్షిత మార్గమని తలచిన ఉగ్రవాదులు దీన్ని ఎంచుకుంటుండవచ్చని ఇంటెలిజెన్స్ వారి అభిప్రాయం.

ఈ స్పామ్ మెయిళ్ల ద్వారా కేవలం మెయిల్స్ మాత్రమే కాకుండా… మల్టీ మీడియా ఫైల్స్, వీడియో, ఆడియో ఫైల్స్ ద్వారా కూడా ఎన్‌క్రిప్టెడ్ సందేశాలను కూడా పంపించేందుకు వీలవుతుండటం వల్ల ఉగ్రవాదులు స్పామ్‌లతో చెలరేగుతున్నారట… కాబట్టి నెటిజన్లూ.. ఈ-మెయిల యూజర్లూ స్పామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉంటారు కదూ..!

నీరూ-నిప్పూ లవ్వాడుకున్నాయి

నీరూ-నిప్పూ ప్రేమించుకున్నాయి. పెళ్లి చేసుకోవాలనుకున్నాయి. అయితే వాటికున్న పరస్పర వ్యతిరేక లక్షణాలే పెళ్లికి అడ్డంగా నిలిచాయి. నిప్పు తాకితే నీరు ఆవిరై పోతుంది. నీరు నిప్పుపై పడితే చల్లారి పోతుంది. మరి పెళ్లి చేసుకోవడం ఎట్లా..? అని అవి దీర్ఘంగా ఆలోచించాయి.

ఎంతకీ దారీ, తెన్నూ తెలియక పోవడంతో.. తమ తమ చుట్టాలను సంప్రదించాయి నీరూ, నిప్పూ. నీరేమో తన బంధువులైన వానను, మంచును అడిగింది. అవి సలహా చెప్పక పోవడమే గాకుండా, “మనకు వాటికి జన్మ జన్మల వైరం ఎట్లా కుదురుతుందంటూ” కోప్పడ్డాయి.

నిప్పేమో తన బంధువులైన పిడుగును, అగ్ని పర్వతాన్ని అడిగింది. అవి కూడా నిప్పుమీద ఇంతెత్తున లేచాయి. నీరూ, నిప్పు ప్రేమను ఎవరూ అర్థం చేసుకోలేదు. పైగా, అదెలా సాధ్యం అని వీటినే ప్రశ్నించాయి, కోప్పడ్డాయి, కుదరదన్నాయి.

అందరిలాగే పెళ్లి చేసుకుని, పిల్లా జెల్లలతో హాయిగా ఉండాలనుకుంటున్న నీరూ, నిప్పూ ఆశ తీరే దారే కనిపించలేదు. చివరికి మేధావి అయిన ప్రకృతిని తన అధీనంలోకి తీసుకున్న కార్మికుడి వద్దకెళ్లి… ఎలాగైనా సాయం చేయమని అడిగాయి.

అతను ఆలోచించి.. సరేలే.. మీ ఇద్దరికీ పెళ్లి నేను చేస్తాను అని హామీ ఇచ్చాడు. చెప్పినట్లుగా పెళ్లి ముహూర్తం నిర్ణయించి, ఇరువైపులా చుట్టాలను పిలిచాడు. పెళ్లి వచ్చిన చుట్టాలు ఈ పెళ్లి వద్దని, ప్రమాదకరమని కార్మికుణ్ణి హెచ్చరించాయి. నానా రాద్ధాంతం చేశాయి.

అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఉన్న కార్మికుడు పెద్దలను ఒప్పించాడు. ఎంతో వైభవంగా పెళ్లి జరిపించాడు. నీరూ, నిప్పును బాయిలర్ అనే కొత్త ఇంట్లో కాపురం ఉంచాడు. ఎవ్వరూ కాదన్నా కూడా తమకు సాయంగా నిలిచి పెళ్లి చేసిన కార్మికుడికి మనసారా కృతజ్ఞతలు చెప్పాయి నీరూ, నిప్పూ…

ఇద్దరూ అన్యోన్యంగా కాపురం చేసుకోసాగారు. వీరికి ఆవిరి అనే కొడుకు పుట్టాడు. ఈ ఆవిరి గాడికి నీటి గొప్పతనం, సముద్రం తెలివితేటలు.. పిడుగు, అగ్ని పర్వతాల శక్తి సామర్థ్యాలు వచ్చాయి. ఆవిరిగాణ్ణి చూసి అందరూ సంతోషపడ్డారు. వీడేమో చక్కగా రైళ్లను నడుపుతున్నాడు, ధాన్యం దంచుతున్నాడు. ఎన్నెన్నో ఘనకార్యాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు.

నీరూ, నిప్పూలకు పెళ్లి చేయటమే ప్రమాదమని వారించిన బంధుమిత్రులు.. ఇతర ప్రజానీకం అందరూ ఇప్పుడేమో ఆవిరిగాణ్ణి మెచ్చుకుంటున్నారు. ఇంత పెద్ద సాహసం చేసి రెండింటినీ కలిపిన కార్మికుడికి కృతజ్ఞతలు చెబుతున్నారు.