చెప్పాలి… గుర్తుండిపోయేలా..!!

పొద్దుట్నుంచీ ఒకటే ఆలోచన
ఏదో రాయాలి, చెప్పాలి
ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి
చెప్పాలన్న విషయంలో స్పష్టత ఉన్నా,
ఎలా ప్రారంభించాలో తెలియని అయోమయం

కానీ చెప్పాలి..
తానున్నంతవరకూ గుర్తుండిపోయేలా
అనుక్షణం గుర్తు చేస్తుండేలా
అసలు మరపు అనేదే ఎరుగకుండా
సూటిగా చెప్పాలి
కానీ ఎలా…?

రోజులా రేపు తెల్లారుతుంది
అదేం పెద్ద విషయం కాదు
ఆ రేపటిలోనే ఎంతో విషయం ఉంది
ఆ రేపటిలోనే ఎంతో జీవితం ఉంది
ఆ రేపటి రోజునే
మా ప్రియమైన పుత్నరత్నం
దేవకన్యలు తోడురాగా
ఈ భూమిమీద వాలిపోయాడు

మావాడి ప్రతి పుట్టినరోజునా
వచ్చే గిఫ్ట్‌లను చూస్తూ.. ఆ దేవుడికి
మనసులో థ్యాంక్స్ చెప్పేస్తుంటా
ఎందుకంటే…
ఆ దేవుడు చాలా పెద్ద గిఫ్ట్‌ను
తన రూపంలో మాకు ఇచ్చినందుకే…

విషయం పక్కదారిపట్టకముందే…
బ్యాచిలర్‌గా చివరి పుట్టినరోజు
జరుపుకుంటున్న ముద్దుల తనయుడా…
పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇది అందరూ చెప్పేదే
కానీ పెళ్లంటే…
కొత్తల్లో లోకాన్నే మర్చిపోయేలా ఉండటమూ కాదు
పాతబడేకొద్దీ అనుమానాలూ, అవమానాలూ కాదు
పెళ్లంటే ఇద్దరి మధ్య ఉండే నమ్మకం

పరస్పరం నమ్మకం, ప్రేమాభిమానాలతో
మీ జీవితం నల్లేరుమీద నడకలా
మూడు పువ్వులు, ఆరు కాయలుగా
హాయిగా, ఆనందంగా సాగిపోవాలని
ఇలాంటి పుట్టినరోజులు
మరిన్ని జరుపుకోవాలని
మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ…
విష్ యూ హ్యాపీ బర్త్ డే మై డియర్ సన్…!!


(డిసెంబర్ 21న పుట్టినరోజు జరుపుకోబోతున్న మా పుత్రరత్నానికి ఆశీస్సులతో…)

RTS Perm Link

మనిషికి విలువా?

ఆకాశంలో నల్లటి మేఘాల్లాగా
నా మదిలోనూ దిగులు మబ్బులు

అమ్మా..
ఈ లోకంలో పచ్చనోట్లకున్నంత
విలువ మనుషులకు లేదు కదూ..?
రాకెట్‌కంటే వేగంగా మావాడి ప్రశ్న
ఇందాకటి దిగులుకి కారణం ఇదే

మనుషులకూ విలువుందని
అబద్ధం చెప్పలేని నిస్సహాయత
మనిషి సృష్టించిన ఆ నోట్లు
నేడు ఆ మనిషినే ఆడిస్తున్నది నిజం

లేదు నాన్నా…
పచ్చనోటుకంటే మనుషులకే విలువెక్కువని
గొంతు పెగుల్చుకుని చెప్పబోతున్నానా…
ఆస్తి కోసం తల్లినే నరికిన తనయులు
అంటూ… విషయం విషాదమైనదైనా
ముఖంనిండా నవ్వులతో
న్యూస్ రీడర్ వార్తా పఠనం..

ఎక్కడో పాతాళంలోంచి
మనుషులకే విలువెక్కువ నాన్నా
అంటూ నా మనసు ఘోషించినా
పచ్చనోటుముందు
రక్త సంబంధాలు బలాదూర్
వార్తా కథనం పచ్చిగా చెప్పేసింది..

మనసు మూగగా రోదిస్తుంటే..
ఇందాకటి దిగులు మేఘాలు
కన్నీటి జల్లులై…
మనుషులకే విలువుండే రోజులు
తప్పక వస్తాయంటూ…
నన్ను ఊరడించాయి…
ఆరోజులు వస్తాయా…?!

RTS Perm Link

పట్టుకుంటే వదలనుగాక వదలను…!!

నన్నో అంటువ్యాధి అంటుంటారు కొందరు
పట్టుకుంటే ఫ్లూ లా వదలనంటారు మరికొందరు

అదెలాగంటే…

ఎవరి ముఖంలోనైనా నేను కనిపించానంటే చాలు
ఎదుటివారి నుంచి బదులుగా నవ్వులే నవ్వులు…

అలా ఒకరినుంచి ఇంకొకరికి, మరికొందరికి
నేను ఓ అంటువ్యాధిలా అల్లుకుపోయి
ఫ్లూ వ్యాధినై పట్టుకుంటానన్నమాట..

ఓ చిన్నపాటి చిరునవ్వునైన నేను
ఒకరినుంచి మరొకరికి అలా.. అలా…
ప్రయాణించి, ప్రయాణించి
ప్రపంచమంతటా చుట్టేస్తాను…
అంటువ్యాధిలా అల్లుకుపోతానన్నమాట…

పేరుకు అంటువ్యాధి అంటారేమోగానీ…
వ్యాధి లక్షణాలు నాలో ఏమాత్రం లేవు సుమా..
మనుషుల్ని, మనసుల్ని
ఉత్సాహంతో ఉరకలేయించటమే
నా అసలు లక్షణం, లక్ష్యం…
అందుకే.. అందరూ నన్ను
“లాంగ్ లివ్ స్మైల్ ఇన్‌ఫెక్షన్” అంటూ
పెద్ద మనసుతో దీవించేస్తుంటారు తెలుసా..?

RTS Perm Link

నాన్న లేని అమ్మ..!!

నువ్వు దూరమై ఏడాది గడుస్తున్నా
కాలం ఎప్పట్లాగే పరుగెడుతోంది
కాలంతోపాటు మనుషులు కూడా…

నువ్వు దూరమైన అమ్మకూడా
కాలంతో నిశ్శబ్దంగా అడుగులేస్తోంది
అయితే నువ్వు ఉన్నప్పటి అమ్మకూ
నువ్వు లేనప్పటికీ అమ్మకూ
తేడా ఇప్పుడే స్పష్టమవుతోంది

నువ్వు లేని ఆమె గతంలోలా
పెద్దరికంగా, ధైర్యంగా లేనేలేదు
ఆమెలో ఏదో తెలీని బాధ
అలాగనీ దాన్ని బయటపడనీయదు
నోరువిప్పి చెప్పదు
బహుశా.. తానే బాధపడితే
పిల్లలు ఇంకెంత బాధపడతారోనని
లోలోపలే కుములుతోందేమో…

అందుకే.. తను మరీ చిన్నపిల్లయిపోయింది
ఇప్పుడు ఆమె మాకు అమ్మకాదు
మేమే ఆమెను పాపలా చూడాల్సి వస్తోంది

పసిపిల్లలు తెలీని వారిని చూస్తే
హడలిపోయినట్లుగా..
ఆమె మాకు కష్టాలొస్తే హడలిపోతోంది
తెలిసినవారిని పిల్లలు హత్తుకున్నట్లుగా
మాకు సంతోషం కలిగితే
గుండెలకు హత్తుకుని ఆహ్వానిస్తోంది…

అదేంటమ్మా అలా చేస్తున్నావ్? అంటే,
చిన్నపిల్లలా ఉడుక్కుంటోంది…
నా పిల్లలు నాకే మంచి చెడ్డలు చెప్పటమా?
అని ప్రశ్నించటం మానేసి…
అందరూ నన్నే అంటున్నారనీ
అమాయకంగా ఏడుస్తోంది…

అందుకే ఆమెను ఓ పసిపాపలా
కంటికి రెప్పలా కాపాడుకోవటం మినహా…
పై లోకానికి వెళ్లిన ఓ నాన్నా…
నిన్ను తెచ్చివ్వలేని నిస్సహాయులం మేం…
ఆమెకి కలలోనైనా కనిపించి
నువ్వు ఉన్నప్పటి మా అమ్మలా
తనని ఉండమని చెప్పవూ…?!

RTS Perm Link

వాళ్లెవరూ వెళ్లలేదే.. నువ్వే ఎందుకెళ్లాలి…?

ఉదయంనుంచీ మా చిన్నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో గుర్తులేదుగానీ.. సాయంకాలంగా మళ్లీ ఫోన్ చేశాను..

ఇటువైపునుంచి “ఇప్పుడెలా ఉంది?” అన్నాను..

“అబ్బా.. తల్లీ నేను బాగానే ఉన్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు.. మరీ అంత తిక్క అయితే ఎలా..?” అన్నాడు అటువైపునుంచి..

“అది కాదు నాన్నా.. నీరసంగా ఉందా..? ఏమైనా తిన్నావా..? ఏవైనా పండ్లు, లేదా బిస్కెట్లు తెప్పించుకుని తింటే కొంచెం శక్తి వస్తుంది కదా..” అన్నాను

“అవేమీ అవసరం లేదు.. నేను బాగానే ఉన్నాను. నేనేమైనా పేషెంటునా, నువ్వు మరీ అంతగా ఇదైపోతున్నావు” అన్నాడు కొంచెం కోప్పడుతూ..

“సర్లే నువ్వు కోప్పడకు.. జాగ్రత్తగా ఇంటికి రా.. అది సరే బండి నడిపేందుకు ఓపిక ఉందా..?” అనగానే,

“పిన్నీ.. నేను ఆరోగ్యంగానే ఉన్నా, ఎలాంటి నీరసం లేదు ఇంటికి జాగ్రత్తగానే వస్తాను, ఇంటికి వచ్చాక వివరంగా మాట్లాడదాం..” అన్నాడు.

ఆ తరువాత వంట పని ముగించుకుని, మావాడి కోసం ఎదురుచూస్తూ కూర్చున్నా..

చూస్తుండగానే చిన్నా వచ్చేశాడు.. రోజూ రాత్రికి ఇంటికి రాగానే తనను అంతగా పరిశీలించి చూడని నేను, ఈరోజు మాత్రం మొహంలోకి గుచ్చి గుచ్చి చూస్తున్నా.. నా చూపుల్ని చూసిన తనకి నవ్వు వచ్చేసింది. అయినా నా కోపాన్ని చూసి ఆపుకుంటూ ప్రెషప్ అయ్యి వచ్చాడు. తినడానికి వేరుశెనగ గింజలు వేయించి పెట్టాను.

గింజల్ని తింటూ ముసిముసిగా నవ్వుతున్న తనతో “నువ్వు చేసేది ఏమైనా బాగుందా చిన్నా..” అన్నాను.

“ఏంటి పిన్నీ, వేరుశెనగ గింజలు తినడం కూడా తప్పేనా, ముందే చెబితే తినకపోదును కదా..” అన్నాడు బుంగమూతి పెట్టి.

“వెధవా జోకులేశావంటే నాలుగు వడ్డిస్తాను” అంటూ చెయ్యి ఎత్తాను.

“అమ్మా తల్లీ శాంతించు.. ఇప్పుడేం కొంపలు అంటుకుపోయాయని పొద్దుట్నుంచీ అలా గాబరా పడిపోతున్నావు..” అన్నాడు సానునయంగా

“అది కాదు నాన్నా.. ఒంట్లో ఒక్క చుక్క రక్తం తయారవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుందో, ఎంత బాగా తినాలో కదా..!!” అన్నాను

“అయ్యో పిచ్చితల్లీ అదేమంత పెద్ద విషయం కాదు.. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు బాగా తీసుకుంటే ఎంత ఆ రక్తం తిరిగి కొన్ని రోజులకే ఒంట్లో చేరిపోతుంది” అన్నాడు

(ఇక్కడ మీకో విషయం చెప్పాలి.. ఇవ్వాళ ఉదయాన్నే మావాడు ఎవరికో “ఓ పాజిటివ్” రక్తం అవసరం అని వెళ్లి రక్తం ఇచ్చి వచ్చాడు. తను నిన్న రాత్రే నాకీ విషయం చెప్పగానే వద్దని అన్నాను. అయినా వినకుండా తను వెళ్లి రక్తం ఇచ్చేసి, ఓ సర్టిఫికెట్‌తో ఇంటికి వచ్చాడు. దానిమీదే ఇందాకటినుంచి మా ఇద్దరికీ తగవు నడుస్తోంది)

“అయినా చెన్నైలో ఇంతమంది ఉండగా, ఓ  పాజిటివ్ రక్తం నీకే ఉందా.. ఇంకెవరికీ లేదా..? వాళ్లెవరూ వెళ్లలేదే.. నువ్వే ఎందుకు వెళ్లాలి…?” అంటూ వాదనకు దిగాను.

“ఉన్నారు కాదనను.. అయితే ఓ పాజిటివ్ రక్తం ఉన్నవాళ్లందరూ రక్తదానం చేయడానికి అర్హులు కారు.. వాళ్లు పూర్తి ఆరోగ్యంతో ఉండాలి. బీపీ, షుగర్, లాంటి జబ్బులూ ఉండకూడదు. ముఖ్యంగా ఉదయాన్నే రక్తం ఇచ్చేందుకు రాత్రిపూట తాగకుండా (మద్యం) ఉండాలి… లాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి పిన్నీ అర్థం చేసుకో” ఓపికగా చెప్పసాగాడు.

“ఆరోగ్యంగా ఉండేవాళ్లే రక్తం ఇవ్వాలన్నావుగా.. మరి బక్కగా ఉండేవాళ్లు కూడా రక్తం ఇవ్వవచ్చా…?” ఎదురు ప్రశ్నించా.

(చిన్నా మాతోనే ఉంటూ, ఇక్కడే ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పుడూ కంప్యూటర్‌తో తంటాలు పడుతూ కూర్చుని ఉంటాడు. ఆఫీసులో పని ఎలాగూ తప్పదు కదా అనుకున్నా, తను ఇంటికి వచ్చాక కూడా కంప్యూటర్ ఇ-మెయిల్స్, ఛాటింగ్, గేమ్స్ అంటూ ఎప్పుడోగానీ నిద్రపోడు. ఎక్కువసేపు కూర్చుని చేసే జాబ్ కాబట్టి, కాస్త పొట్ట వచ్చింది కానీ.. తన శరీరం మాత్రం బక్కగా ఉంటుంది. దాంతో రక్తం ఇచ్చి వచ్చినందుకు నాకు కాస్త దిగులుగానే ఉంది.)

“తిక్కదానా.. ఎందుకు మరీ ఇంత అమాయకంగా తయారయ్యావు.. కొడుకుపై ప్రేమ ఉండాలేగానీ, మోతాదుకు మించి వద్దు తల్లీ..! ఆరోగ్యంగా ఉండేవాళ్లు సన్నగా ఉన్నా సరే, రక్తం ఇవ్వవచ్చమ్మా…” అన్నాడు నవ్వుతూ..

“ఆహా.. అలాగా..! రక్తం అవసరమైన దాతలకు రక్తదానం చేసి సహాయపడాలని నీలా చాలామంది రక్తం ఇస్తున్నారు సరే.. అయితే నిజంగా రక్తం అవసరమైనవారికే అది చేరుతోందా..? రోజూ పేపర్లో చూస్తూనే ఉన్నాం కదా.. చాలామంది రక్తాన్ని కూడా అమ్ముకుంటున్నారట కదా..?” వాదనలో కొంచెమైనా తగ్గుతాడని అన్నా..

“సరే పిన్నీ.. నువ్వు చెప్పినట్లుగా రక్తదానం చేసినా, అది చేరాల్సిన వారికి చేరటం లేదని ఒప్పుకుంటున్నా.. అయితే రక్తాన్ని అమ్ముకుంటున్నవారినుంచీ కొనుక్కుంటున్నవారైనా రక్తం అవసరమయ్యే కదా కొంటారు.. అలాగైనా సరే రక్తం అవసరమయ్యే వారికే చేరుతుంది కదా..! అయినా రక్తం ఇచ్చిన వెంటనే దాన్ని అలాగే అవసరమైన వారికి ఎక్కించేయరు. దాన్ని మళ్లీ ఏవేవో ప్రాసెస్ చేస్తారు. అందుకోసం అవసరమయ్యే ఎక్విప్‌మెంట్‌కు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఎంతో కొంత ఛార్జ్ చేయటం సహజమే కదా..!” అన్నాడు.

“సర్లే.. వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి.. ఓ పట్టాన ఒప్పుకోవు కదా.. ఇప్పటికి ఇచ్చావుగానీ, ఇంకోసారి మాత్రం అలా రక్తం ఇచ్చేసి వస్తే ఊరుకునేది లేదు..” హెచ్చరించా…

“సరే తల్లీ.. ఇక నువ్వు వెళ్లమన్నా వెళ్లను.. ఓ మూడు నెలలు ఆగి ఆ తరువాత వెళ్తాన్లే..!!”

“ఆరి బడవా.. మళ్లీ మూడు నెలల తరువాత వెళ్తావే.. ఏం ఆటలుగా ఉందా..?” అన్నా ఆవేశంగా..

“అవును పిన్నీ.. ఒకసారి రక్తం ఇచ్చాక మళ్లీ మూడు నెలల వరకూ ఇవ్వకూడదట.. ఆ తరువాత మళ్లీ ఇవ్వవచ్చట”

“నాయనా.. ఇప్పటికి చేసింది చాలు.. మళ్లీ నన్ను కంగారు పెట్టకు” అన్నాను బ్రతిమలాడుతూ..

అప్పటిదాకా సరదాగా, ఓపికగా బదులిస్తున్న మావాడు కాస్త సీరియస్ అయ్యాడు.. “నువ్వు మరీ ఇంత సెల్ఫిష్ అయితే ఎలాగ పిన్నీ..! ఇంత పెద్ద నగరంలో ‘ఓ పాటిటివ్ రక్తం’ ఉన్నవాళ్లు ఎంతో మంది ఉండగా నేనే ఎందుకు ఇవ్వాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటే.. పాపం రక్తం అత్యవసరమైన వారి పరిస్థితి ఏంటి..?” అన్నాడు.

“నేను ఇవ్వాళ రక్తం ఇచ్చింది నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఓ మధ్య వయస్సు ఆమెకి.. పాపం వాళ్లకి ఇక్కడి భాష అర్థం కాకపోవటంతో ఎవరైనా దాతలను రక్తం కోసం అడిగేందుకు పక్క బెడ్‌లలో ఉండేవారి సాయం తీసుకుని మరీ ఫోన్ చేయించారు తెలుసా..?”

“ఆమెకి హార్ట్ ఆపరేషన్ జరగాల్సి ఉంది.. ఆమెకి అవసరమైన రక్తం ఇప్పటికే ఒకరు ఇచ్చారు. అది సరిపోక పోవటంతో నాకు కాల్ చేశారు.. ఆమెతో పాటు ఆమె భర్త, కొడుకు వచ్చారు.. హార్ట్ ఆపరేషన్ సక్రమంగా జరుగుతుందో, లేదోనని వాళ్లు ఎంత కంగారుగా ఉన్నారు తెలుసా..? ఎవరో ఒకరు రక్తం ఇస్తార్లే అని అందరూ అలాగే అనుకుంటే.. పాపం ఆమె పరిస్థితి ఏమిటి.. ఓ కొడుకికి తల్లిని, ఓ భర్తకు భార్యను లేకుండా చేసిన పాపం మూటగట్టుకోమా..”

అప్పటిదాకా ఎదురు ప్రశ్నిస్తూ ఉన్న నావైపు నుంచీ ఎలాంటి సౌండ్ రావటం లేదు… మావాడు చెప్పుకుంటూ పోతున్నాడు..

“లివర్ లేక మీ బాబు, సరయిన సమయంలో ఆక్సిజన్ అందక మా బాబు ఈ లోకం విడిచి వెళ్లిపోయిన సంగతి మర్చిపోయావా..?”

“కారణాలు ఏమైతేనేం.. మీ నాన్నను, మా నాన్నను పోగొట్టుకున్నాం, ఇప్పుడు ఆ అబ్బాయికి తల్లిని లేకుండా చేద్దామా..? ఆ పాపం మనకి వద్దు పిన్నీ.. మనలాగా వాళ్లు కష్టపడవద్దు.. అందుకే రక్తం సంతోషంగా ఇచ్చి వచ్చాను.. ఆమెకి హార్ట్ ఆపరేషన్ సక్రమంగా జరిగి, మంచి ఆరోగ్యంతో ఇంటికి తిరిగివెళ్లాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.. నువ్వు కూడా ఆ దేవుడికి మొక్కుకో..!” అన్నాడు తృప్తిగా.

“అయినా అమ్మాయిలతో తిరిగితేనే, చెడు స్నేహాలు చేస్తేనో తిట్టాలిగానీ… నీ కొడుకు ఓ మంచిపని చేసి వచ్చాడు.. దానికి సంతోషపడకుండా ఇలా సతాయిస్తావేంటి తల్లీ…?” అంటూ దగ్గరికి వచ్చాడు.

అప్పటికే నేను మరీ ఇంత స్వార్థంగా తయారయ్యానేంటబ్బా అనుకుంటూ, తల కిందికి వాల్చేసి కూర్చుని ఉన్నా…

“మా చిన్నా దగ్గరికి వచ్చి, నా తలపైకెత్తి.. ఇప్పటికైనా అర్థమయ్యిందా..? ఇంకెప్పుడూ నన్ను రక్తం ఇవ్వొద్దని అడ్డు చెప్పవుకదా..” అన్నాడు.

“వూ.. హూ..” కళ్లతోనే బదులిచ్చా..

“వెరీగుడ్.. మామంచి పిన్నివి కదూ.. అయితే నేను నీ పేరును కూడా ఆన్‌లైన్‌లో రిజిష్టర్ చేసేస్తా.. నువ్వు కూడా రక్తం అవసరమైనవారికి రక్తదానం చేస్తావు కదూ..!” అన్నాడు.

“తప్పకుండా చేస్తా నాన్నా..!! ఇంకెప్పుడూ అంత సెల్ఫిష్‌గా ఉండనుగాక ఉండను, ఇప్పటికైనా నా కళ్లు తెరిపించావు..” అంటూ మా చిన్నాని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అన్నం వడ్డిస్తానంటూ వంటింట్లోకి అడుగులేశాను.

(పైన చెప్పినదాని సారాంశం మీకందరికీ ఇప్పటికే అర్థం అయ్యే ఉంటుందనుకుంటున్నా.. నిజంగా ఈ సమాజంలో నాలాంటి చాలామంది స్వార్థంగా ఆలోచిస్తుండటం సహజమే. తాను, తనవాళ్లు బాగుంటే చాలనుకునే స్వార్థం నుంచి బయటపడి, ఆపదలో ఉన్నవారికి, సహాయం కావాల్సిన వారికి మన చేతనైనంత సాయం చేయడంలో ఉన్న తృప్తి అంతా, ఇంతా కాదని ఈరోజు మా చిన్నాని చూస్తే నాకు అర్థమైంది.. అది మీతో పంచుకుందామనే ఇలా…)

RTS Perm Link

నువ్వులేవు.. నీ జ్ఞాపకాలున్నాయి..

కొందరు సుఖాల్లోనే తారసపడతారు
మరికొందరు కష్టాల్లోనూ చేయూతనిస్తారు
నువ్వు మాత్రం ఎప్పుడూ చెంతనే ఉంటావు
కళ్లు మూసినా, తెరచినా
నిద్రపోయినా, మేల్కొన్నా
నవ్వినా, ఏడ్చినా
ఎక్కడ ఉన్నా, ఏం చేసినా
నా ప్రతి కదలికలోనూ
చిరునవ్వుతో జీవిస్తుంటావు

కానీ.. నువ్వు దగ్గరున్నప్పుడు
నీకు ఏవంటే ఇష్టమో, నీకేం కావాలో
నీకంటూ ఇష్టాయిష్టాలున్నాయో, లేదో
ఏవీ.. ఏవీ..
తెలుసుకునేందుకు ప్రయత్నించలేదు
ఇప్పుడు.. నువ్వు లేని ఈ జీవితంలో
ప్రతిరోజూ, ప్రతి పనిలోనూ
తనకు ఇదంటే ఇష్టమో కాదో
ఇవన్నీ తనకు కావాలనిపించేదో ఏంటో
ఎప్పుడూ అడిగినవన్నీ అమర్చటమేగానీ
నోరు తెరచి ఇది కావాలని అడగలేదే..?
ఆలోచనలు మది గట్లు తెంచుకుంటాయి

అంతే…
నోటిదాకా వెళ్లింది, గొంతులో అడ్డుపడుతుంది
చెంపలపై వెచ్చని కన్నీరు
చేతిలో బొట్లుగా రాలుతుంటే
ఆ కన్నీటి బొట్లను
చిరునవ్వులు చిందించే నీ పలువరుసలో
ముత్యాలుగా మార్చి
నవ్వుతూ ముందుకు నడిపిస్తావు
నువ్వో జ్ఞాపకం అనుకున్నా..
నిజమై నాకు ఊపిరి పోస్తున్నావు….

—- ఎప్పటికీ తిరిగిరాని నాన్న కోసం…


RTS Perm Link

నువ్వు లేని ఊరు.. నీ మాటల్లేని ఇల్లు…!!

 

child_hands

పొద్దుట్నుంచీ వచ్చే ప్రతి బస్సునూ
అందులో రాబోయే తన మనిషినీ
రెండు కళ్లు వెతుకుతూనే ఉన్నాయి
నిమిషాలు, గంటలు గడుస్తున్నా
రావాల్సిన మనిషి రాలేదు
రెండు కళ్ల వెతుకులాట ఆగనూ లేదు

సూర్యుడు నడినెత్తికి వచ్చినా
మనిషి రాలేదు, చూపులు ఆగలేదు
ఎట్టకేలకు…
రావాల్సిన మనిషి బస్సు దిగ్గానే..
రెండు కళ్లూ తృప్తిగా, సంతోషంగా
అటువైపు పరుగులు తీశాయి

పొద్దుట్నుంచీ ఎదురు చూస్తున్నా..
ఇప్పుడా రావటం….?
ప్రశ్నించాయి ఆ కళ్లు

అదెంటీ.. నేను ముందే చెప్పానుగా
ఈ టైంకే వస్తానని
మరెందుకలా పొద్దుట్నుంచీ చూడటం
అవతలి కళ్ల ఎదురు ప్రశ్న..?

నీకేంటి అలాగే చెబుతావ్…
మా ఆరాటం మాదీ..
నా రక్తంలో రక్తం నన్ను
చూసేందుకు వస్తుంటే
తొందరగా చూడాలని ఉండదా మరి..?

తిరిగి ఊరెళ్తుంటే…
అప్పుడే వెళ్లాలా అంటూ
అవే కళ్లు మళ్లీ వేడుకోలు
తప్పదు మరి.. మళ్లీ వస్తాగా అంటే,
భారంగా వర్షిస్తూ ఆ కళ్ల వీడ్కోలు

చాలా సంవత్సరాలు ఇలాగే…

కానీ ఈరోజు..
నా కోసం ఎదురుచూసే
ఆ రెండు కళ్ల కోసం
రోజుల తరబడీ ఎదురుచూస్తున్నా
ఆ కళ్ల జాడ కనిపించటం లేదు

ఎదురుచూపులు, వీడ్కోళ్లతోనే
అలసిపోయిన ఆ కళ్లు…
శాశ్వత విశ్రాంతి కోసం
రక్తంలో రక్తాన్ని వదిలేసి
అందరాని దూరాలకు
ఆనందంగా వెళ్లిపోయాయి

ఇప్పుడు నా కోసం
వెతుకులాడే కళ్లు
ఎదురుచూసే ఆ మనిషి
వేడుకోల్లు, వీడ్కోళ్లు
ఏవీ ఏవీ లేనే లేవు…

కనిపించకుండా పోయిన ఆ కళ్లు
ఎవ్వరికీ, ఎప్పటికీ కనిపించవు
అయినా…
కనిపించే తన ప్రతిరూపమైన నాకు
ఎప్పుడూ చూపునిస్తూనే ఉంటాయి…..!!

(నవంబర్ 7, 2009న అనారోగ్యం కారణంగా అకస్మాత్తుగా మరణించిన మా “నాన్న”గారికి కన్నీటితో…..)

RTS Perm Link

మాట ఇస్తావు కదూ..?!

mothers-love

నీ కళ్లు…
నవ్వుల పువ్వులై పలుకరించాలని

నీ చూపు…
వెండి వెలుగులు విరజిమ్మాలని

నీ పెదవులు…
ఎల్లప్పుడూ నిజమే చెప్పాలని

నీ ముఖం…
ప్రశాంతతకు మారుపేరవ్వాలని

నీ మాటలు…
నేనున్నాననే ధైర్యాన్నివ్వాలని

నీ మౌనం…
మాటల సీతాకోకలై ఎగరాలని

నీ చేతులు…
పదిమందికి ఆసరా అవ్వాలని

నీ నడక…
అందరూ నిన్నే అనుసరించాలని

మాట ఇస్తావు కదూ..?!

RTS Perm Link

ఈ పాపం ఎవ్వరిది..?

Child

ఈరోజు ఉదయాన్నే ఆఫీస్‌కు వెళ్తుంటే.. ట్రాఫిక్ కాస్త ఎక్కువగా ఉండటంతో బస్ స్లోగా వెళ్తోంది. కిటికీవైపు కూర్చున్న నేను బస్టాపుల్లో, ప్లాట్‌ఫాంపై నిలుచున్న జనాలు అవతలివైపుకు చాలా ఆసక్తిగా చూస్తుండం గమనించాను. వీళ్లంతా అంత ఆసక్తిగా ఏం చూస్తున్నారబ్బా..?  అనుకుంటూ ఇటువైపు తలతిప్పి చూశాను.

అక్కడ పట్టుపని ఐదేళ్లు కూడా ఉండని ఓ చిన్న అమ్మాయి ఒక తాడుపై నడుస్తూ కనిపించింది. తాడుపై నడవటంలో ఆశ్చర్యం ఏముంది అంటారేమో…? ఏడడుగుల ఎత్తులో అటూ ఇటూ కర్రలకు కట్టిన ఒక తాడుపై నడుస్తోంది తను. కిందన ఆమె తల్లి ఒక డప్పును వాయిస్తుంటే, ఆ అమ్మాయి పక్కనే ఇంకో డప్పు వాయిస్తూ తండ్రి తనతో ఆ ఫీటు చేయిస్తున్నాడు.

అంత చిన్నమ్మాయి ఆ తాడుపై బ్యాలెన్స్ చేస్తూ నడవటమే కాకుండా, చేతుల్లో ఓ లావాటి కర్రను కూడా పట్టుకుని నడుస్తోంది. అంతేకాదు ఆ అమ్మాయి తాడుమీద ఎలా నడుస్తోందంటే… ఒక అడుగు కింద చిన్న ప్లేటునొకదాన్ని పెట్టుకుని, ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఈ ప్లేటును కూడా ముందుకు తీసుకెళ్తోంది.

కర్ర, ప్లేటులు కిందపడకుండా, తాను పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఏకకాలంలో ఆ చిన్న అమ్మాయి పడుతున్న… కష్టం చూస్తుంటే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ అమ్మాయి పక్కనే డప్పు వాయిస్తూ నడుస్తున్న తండ్రిని, తల్లిని చూస్తే చెప్పలేనంత కోపం వచ్చింది.

చూడు నాన్నా వాళ్లెలా చేస్తున్నారో అన్నట్లుగా నేను మా అబ్బాయి వైపు చూశాను. వాడి ముఖం అప్పటికే కోపంతో ఎర్రగా కందిపోయి ఉంది. హాయిగా ఆడుతూ, పాడుతూ స్కూలుకెళ్లాల్సిన వయసులో తమను సాకాల్సిన తల్లిదండ్రులనే సాకుతున్న ఈ చిన్నారుల గురించి తల్చుకుంటే గుండెల్లో కలుక్కుమంటుంది.

చాలా సందర్భాలలో ఈ అమ్మాయిల్లాంటి చాలామంది.. తల్లిదండ్రులకు ఆసరాగా (బలవంతగానో, ఇష్టంగానో) ఏదో ఒక పనిచేస్తూ ఉన్నారు. పొట్టకూటికోసం చాలామంది చిన్నారులు యాచక వృత్తిలోనూ.. మరికొంత మంది చిత్తు కాగితాలు ఏరుకుంటూ తల్లిదండ్రులతో కనిపించటం నేడు షరా మామూలే..!

పలకా, బలపం పట్టి అక్షరాలు దిద్దాల్సిన చిట్టి పొట్టి చేతులతో ఇంటింటికి వెళ్ళి యాచించే పిల్లలు.. ఇటుక బట్టీలు, హోటల్స్, పెట్రోల్ బంక్‌లు, వ్యవసాయ కూలి పనులకు వెళ్తూ అడుగడుగునా దుర్భర జీవనాలు గడుపుతున్న బాలలే నేడు ఎటుచూసినా దర్శనమిస్తున్నారు.

ఈ బాల యాచకులను, బాల కార్మికులను మినహాయిస్తే.. పలు వ్యాపార సంస్థల్లో వెట్టిచాకిరి చేస్తు కాలం వెళ్ళదిస్తున్న 14 సంవత్సరాల వయస్సు గల బాలల సంఖ్య కూడా కొకోల్లలుగానే ఉంది. పిల్లలను పనుల్లో పెట్టకుంటే చట్టరీత్యా చర్యలు తప్పవని తెలిసినప్పటికి, కొంత మంది వ్యాపారులు చిన్నారులను బాల కార్మికులుగా మార్చడం మామూలైంది.

ఇక ప్రభుత్వాల విషయానికి వస్తే.. బాల కార్మిక వ్యవస్థను శాశ్వతంగా నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకున్న దాఖలాలేమీ కనిపించటం లేదు. ఒకవేళ తీసుకున్నా అవి పేపర్, టీవీ ప్రకటనల్లో మాత్రమే..! అనేక పథకాలు చేపట్టి బాలలను పాఠశాలల్లో చేర్పించామని సంబంధిత అధికారులు కాకి లెక్కలు చూపిస్తున్నారేగానీ.. వాస్తవం మరో రకంగా ఉంటోంది.

అయితే ఈ పరిస్థితిని ఇలాగే వదిలేయాల్సిందేనా..? దీనికి పరిష్కారమే లేదా..?

 

RTS Perm Link

జీవితం.. మరణం.. ప్రేమ..!!

Life

జీవితం…
ఇచ్చినదాన్ని పొందాలంటే
మనమూ దానికి కొంత ఇవ్వాలి

అది ఏదయినా, ఎంతయినా
తప్పక ఇవ్వాల్సిందే
ఒకదాన్ని పొందాలంటే
ఇంకోదాన్ని వదిలేయాల్సిందే..!

జీవితం…
పట్టరాని సంతోషాన్నిస్తే…

రోదనలు, వేదనలు..
కష్టాలు, నష్టాలు…
కన్నీళ్ళు, కడగండ్లు..
అన్నీ దానికిచ్చేస్తాం

శాంతి, సంతోషాలు
నవ్వులు, పువ్వులు
ఆశలు, అనుబంధాలు
అన్నీ తిరిగి తెచ్చుకుంటాం..!

జీవితం…
ఓ పసిబిడ్డలాంటిది
కల్మషం లేని నవ్వులాంటిది
అందుకే…
మరణం అమరత్వపు ఖ్యాతి అయితే,
జీవితం మరణంలేని ప్రేమకు ఖ్యాతి…!

RTS Perm Link

ఉండాలోయ్ ఉండాలి..!

Bhanumathi2

ఫిలింకు పాట
పిల్లలకు ఆట
రాజుకు కోట
ఉండాలోయ్ ఉండాలి

అత్తకు నోరు
దేవుడికి తేరు
స్టారుకు కారు
ఉండాలోయ్ ఉండాలి

స్టేజీకి తెర
కత్తికి ఒర
చేపకు ఎర
ఉండాలోయ్ ఉండాలి

యింటికి అమ్మ
నిమ్మకి చెమ్మ
కొలువుకి బొమ్మ
ఉండాలోయ్ ఉండాలి

తలుపుకి గడి
దేవుడికి గుడి
అవ్వకు మడి
ఉండాలోయ్ ఉండాలి

జూదరికి పేక
గొడ్లకి పాక
గాంధీకి మేక
ఉండాలోయ్ ఉండాలి

అరవలకు పొగాకు
ఆంధ్రులకు గోగాకు
మళయాళులకు తేయాకు
ఉండాలోయ్ ఉండాలి

(దివంగత పి.భానుమతీ రామకృష్ణ.. నవంబరు 1947 చందమామ పత్రికలో పాపాయిల కోసం రాసిన ఓ బుజ్జిగీతం… ఆ మహానటి జన్మదినం (సెప్టెంబర్ 7) సందర్భంగా మీ కోసం…)

RTS Perm Link

స్నేహితులు… అచ్చం నీలాగే…!!

friend10

అందరికీ స్నేహితులు ఉంటారు
అచ్చం నీలాగే…

నీతో ఉంటే కాలం ఉనికిని
నన్ను నేనే మర్చిపోతుంటా
ఎందుకంటే…
నన్ను నీలోనే కదా చూస్తున్నా

నీతో ఉంటే నవ్వుల పువ్వుల వికసిస్తాయి
మమతానురాగాలు పరిమళిస్తాయి
దయతో హృదయాన్ని స్పృశిస్తావు
ప్రేమతో మనసును జయిస్తావు
నువ్వో అద్భుత శక్తివి..
అంతకుమించిన ఆసరావి…

నీ సుతిమెత్తని మందలింపులు
నన్నెంతగా మార్చాయని
నిర్లిప్తపు రోజులెంత మారాయని
కాలమెలా పరుగులు తీస్తోందని
నీవులేనప్పటి నిండుదనం
నీ రాకతో పరిపూర్ణం….

స్వచ్ఛమైన స్నేహానికి
చిరునామాగా మిగిలిన నేస్తమా…
నేను నిజంగా నమ్ముతున్నా
అందరికీ నీలాంటి స్నేహితులుంటారని
మరి అచ్చం నీలాంటి స్నేహాన్ని చూడాలంటే…
నా స్నేహితుడిని చూపించాల్సిందే…!!


——– స్నేహితుల రోజు శుభాకాంక్షలతో…

RTS Perm Link

భావ కుసుమ పరిమళం

flower2

ఎప్పుడయినా ఇది విన్నారా
ఇలాంటి పువ్వుల్ని ఎక్కడైనా చూశారా
వీటికి నీరు, మట్టి, సూర్యరశ్మి
వేటితోనూ పనిలేదు

ఎండాకాలంలో అయినా
చలికాలంలో అయినా
కష్టాల్లోనూ, సుఖాల్లోనూ
సర్వకాల సర్వావస్థల్లోనూ
ఇవెప్పుడూ వికసిస్తూనే ఉంటాయి

చాలా అరుదుగా మాత్రమే
చిన్నవిగా ఉంటాయేగానీ
నిత్యం పెరుగుతూనే ఉంటాయి
రేకులు కొన్ని రాలిపోయినా
రూపం కాస్త మారినా…
మళ్లీ మళ్లీ పెరుగుతూ…
మరింత అందంగా వికసిస్తుంటాయి

అలాంటి పువ్వుల్లో నేనూ ఒకరినే
వాటి పేరే “ప్రేమ”…!!

RTS Perm Link

చిన్ని ఆశలే కానీ… తీరేదెలా…?!

women-dreams

నక్షత్రాలన్నింటినీ గుత్తులుగా చేసి
మా ఇంటి పై కప్పుకు వేలాడదీయాలని
ఆకాశంలోని చందమామను లాక్కొచ్చి
నా కొప్పులో చక్కగా తురుముకోవాలని

వెన్నెల చల్లదనాన్నంతా
పెద్ద పెద్ద డబ్బాలలో నింపేసి
మా ఇంటినిండా దాచేసుకోవాలని
జలపాతాల నీటినంతా
నా దోసిళ్లతో బంధించేయాలని

అభయారణ్యాల అందాన్నంతా
మా పెరట్లో తోటగా చేసేయాలని
అడవిమల్లెల సువాసనంతా
మా ఇంటిమల్లెలు దోచేసుకోవాలని
కోకిలమ్మ రాగాలన్నీ
మా పాప గొంతుతో వినాలని

ఎన్నె ఎన్నెన్నో…
చిన్ని చిన్ని ఆశలే…..!!
కానీ, తీరేదెలా……….?????

RTS Perm Link

కల కానిది… నిజమైనది…!!

dream1

నా కల
తిరిగిరాని బాల్యం కోసం
అమ్మమ్మ చెప్పే కథల కోసం
తాతయ్య తెచ్చే మిఠాయిల కోసం
పంట కాలువల్లో… యేటినీళ్ళలో
అమ్మ కొంగుతో చేపల్ని పట్టేందుకోసం
తమ్ముళ్లతో చేసిన అల్లరి కోసం
నాన్న చెంపపై ఇచ్చిన గుర్తుల కోసం
అదే చెంపపై ఇచ్చిన ముద్దుల కోసం

***** *****

నా కల
శాంతించిన సూర్యుడి కోసం
నాట్యం చేసే చినుకుల కోసం
రైతన్నల కళ్లల్లో వెలుగు కోసం
అమ్మ ముఖంలో నవ్వు కోసం

***** *****

నా కల
తుపాకులు లేని రాజ్యం కోసం
యాసిడ్ దాడుల్లేని రోజు కోసం
నిజమైన రాజకీయాల కోసం
ప్రశాంతంగా బ్రతికే జనాల కోసం
ఎళ్లవేళలా పరితపించే శాంతి కోసం

***** *****

నా కల
స్వార్థం లేని మనుషుల కోసం
కల్మషం లేని నవ్వుల కోసం
ఎల్లలు లేని సంతోషం కోసం
బతుకంతా పెనవేసే స్నేహం కోసం
చివరిదాకా అంటిపెట్టుకునే ప్రేమ కోసం

***** *****

నా కలలన్నీ…
వెచ్చనివే… కానీ తడిగా ఉంటాయి
ఊహలే… కానీ సృజనాత్మకమైనవి
జ్ఞాపకాలే… కానీ ఉల్లాసాన్నిస్తాయి
సాధారణమైనవే… కానీ ఆలోచింపజేస్తాయి
కలలు, జ్ఞాపకాలు అన్నీ నావే… కానీ
వాస్తవ ప్రపంచం మనందరిదీ….!!

RTS Perm Link

Next Page »

RTSMirror Powered by JalleDa