Archive for October, 2007

Emotional Intelligence.

Monday, October 8th, 2007

హల్లో ఫ్రెండ్స్,
మొన్న శుక్రవారం మొదలు పెట్టాను బుక్ చదవటం. ఎలాగూ శనివారం,ఆదివారం ఆఫీస్ ఉండదు కదా, బుక్ పూర్తిగా చదివి ఆదివారం సాయంత్రం మీతో దాంట్లోని విశేషాలు పంచుకుందాం అనుకున్నాను.కానీ ఆ రెండు రోజులూ తీరిక లేకపోవటం వల్ల అది చదవటం పూర్తి కాలేదు.కానీ మిమ్మల్ని ఇంకా వెయిట్ చేయించటం ఇష్టం లేదు నాకు. కాబట్టి చదివినంత వరకు విశేషాలు రాస్తాను. ఒకవేళ మీకు అవి నచ్చితే మిగిలింది కూడా ఇలాగే మీతో షేర్ చేస్కుంటాను,సరేనా… ఇక విశేషాలల్లోకి వెళ్దాం..
బుక్ పేరు: Emotional Intelligence
రచయిత పేరు: Daniel Goleman

మొదటి అధ్యాయంలో మెదడులోని ఏయే భాగాలు బయట నుండి వచ్చే ఇంఫర్మేషన్ని ఎలా ప్రాసెస్ చేస్తాయి అనే సంగతి చెప్పాడు… ప్రాణుల పరిణామక్రమంలో మెదడులో కొన్ని చాలా బేసిక్ పనులను మాత్రమే చేసేదిట, ఊపిరి తీస్కొవటం, మెటబాలిజం ని కంట్రోల్ చెయ్యటం లాంటి పనులు. ఇది కొత్త విషయాలను నేర్చుకోగలిగేది కాదు.తర్వాత ఈ మెదడునుండి ఎమోషనల్గా రియాక్ట్ అయ్యే మెదడుగా మారింది.ఏదైన వాసన చూసినప్పుడు అది తనని వేటాడే జంతువైతే పారిపోవటం,తను వేటాడాల్సిన జంతువైతే అటాక్ చెయ్యటం ఇలాంటివి చెయ్యగలిగేది.. తర్వాత ఈ మెదడు నుండి తెలివిగా అలోచించగలిగే మెదడుగా రూపాంతరం చెందింది.దీన్నే నియొకార్టెక్స్ అంటారు.. మన కళలూ, నాగరికత ఇవన్నీ నియొకార్టెక్స్ యొక్క ఫలాలే..నియొకార్టెక్స్ లేని జీవులల్లో తల్లి ప్రేమ, కుటుంబ భావనలు ఉండవు.దీనికి ఉదాహరణ పాములలాంటి సరీసృపాలను చెప్పుకోవచ్చు.

మనమప్పుడప్పుడూ వింటూ ఉంటాం క్షణికావేశంలో హత్య చెసాడనో,కొట్టాడనో..(మొన్న కె.కె గారి సుపుత్రుడిలాగా అన్నమాట!)అసలలా ఎలా చెస్తారు పర్యవసానాలు లెక్కచెయ్యకుండా అనిపిస్తుందా?? దానికి కారణం కూడా మన మెదడులోనే ఉందంట.మన మెదడులో రెండు ముఖ్య భాగాలుంటాయంట. ఒకటి నియొకార్టెక్స్(విశ్లేషించే మెదడు) రెండోది అమిగ్డాలా(ఫీల్ అయ్యే మెదడు).సాధారణంగా ఙానెంద్రియాలు తెచ్చే ఇంఫర్మషన్ ముందు నియొకార్టెక్స్ కి వెళుతుంది.అది దాన్ని విశ్లేషిస్తుంది.తర్వాత అమిగ్డాలా ఆ విశ్లేషణ పై ఆధారపడి నిర్ణయం తీసుకుంటుంది.అమిగ్డాలాకి నియొకార్టెక్స్ నుండి వచ్చే విశ్లేషణాత్మక సమచారం కంటే ముందే ఙానెంద్రియాల నుండి నేరుగా కొంత సమాచారం వస్తుంది. ఐతే అది పరిపూర్ణమైనది మాత్రం కాదు,కాని తొందరగా వస్తుంది.అసాధారణ పరిస్తితులల్లో అమిగ్డాలా ఈ సమాచారం ఆధారంగా నిర్ణయం తీస్కుంటుంది.అది పూర్తిగా లేకపొవటం వల్ల,అమిగ్డాలా కి విశ్లేషించే సమయం,సామర్థ్యం లేకపొవటం వల్ల ఆ నిర్ణయాలు సరియైనవి కాకపోవచ్చు.

కానీ అతి తక్కువ సమయంలో,అసంపూర్తి సమాచారంతో వేగంగా నిర్ణయ తీస్కునే అమిగ్డాలా సామర్థ్యం ప్రమాద సమయాలల్లో చాల ఉపయోగకరం.ఏదైన జంతువు మన మీద అటాక్ చెసినప్పుడు అది ఏ జంతువో ఏంటో అనలైజ్ చెయ్యటం కన్నా పారిపోవటం చాలా ముఖ్యం కదా.

సరే, ఇది కాసేపు పక్కన పెడదాం.

చివరకి మనం ఒక మ్యాచ్ గెలిచాం.ఇవ్వళ మా ఆఫీస్ లో మ్యాచ్ పుణ్యమా అని నెట్ వర్క్స్ అన్నీ స్లో అయ్యి మా ఐ.టి. డిపార్ట్మెంట్ గగ్గోలుపెట్టింది-లైవ్ మ్యాచ్ ఆఫీస్ లో పెట్టకండి బాబోయ్ అని!!!

ఇక ముగించే ముందు జోకు: మాకు ఇంటర్ చదివేటప్పుడు వెంకట్రావ్ అని ఒక లెక్చరర్ ఉండేవారు.చాలా లావు మనిషి.ఆయనకి కొత్తగా పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ రోజు కాలేజ్ కి వచ్చేటప్పుడు ఒక చేతికి రెండు ఉంగరాలు, మెడలో గొలుసు వేసుకొని టిప్-టాప్ గా వచ్చారు.ఆయన లావాటి రెండు వేళ్ళకి రెండు ఉంగరాలు చూసి మా ఫ్రెండ్ సౌమ్య “ఈయనకి ఆడపిల్ల పుడితే ఆ రెండు ఉంగరాలతో రెండు గాజులు చేయించొచ్చు” అని కామెంటు.

gud night friends..

wait for my next post…

Saturday, October 6th, 2007

ఒక మాంచి పుస్తకం గురించి చెప్పాలి,రేపో ఎల్లుండో పుస్తకం చదవటం అయిపోగానే చెప్తాను..స్టార్టింగ్ అయితే చాలా బాగుంది….

keep waiting for my next post…

ఇట్లు
చిత్ర లేఖ.

కబుర్ల్…

Friday, October 5th, 2007

నిన్న నెట్ సరిగ్గా లేకపోవటం వల్ల పోస్ట్ చెయ్యలేకపోయాను..

సైబర్ టవర్స్ పక్కన ఉన్న ఒక వరస చెట్లన్నీ నరికేసారండీ, రోడ్డు విస్తరణ కోసం.. ఆ పక్కన నిలబడితే చెట్ల వల్ల లోపల బిల్డింగ్ కనిపించేది కాదు, అలాంటిది, ఇప్పుడు ఆ రోడ్డంతా బోసిగా కనిపిస్తుంది.. రెండు నెలల ముందు జూబ్లి హిల్స్ లొ కూడా ఇలాగే రెండు పక్కలా ఉన్న చెట్లన్నీ నరికేసారు రోడ్డు వెడల్పు చెయ్యడానికి….భగవంతుడా……. ఇదేనా అభివృద్ధి అంటే???
ఏం అభివృద్దో నండీ, అన్నట్టు మీకో సంగతి తెలుసా, పరిశ్రమలు, నగరీకరణ, జి.డి.పి ఇలాంటి విషయాలని ప్రాతిపదికగా తీస్కుంటే, భూటాన్ అట్టడుగున ఎక్కడో ఉంటుందంట, కానీ ప్రజల మానసిక ఆనందం, శాంతి ఇలాంటి విషయలని ప్రాతిపదికగా తీస్కుంటే భూటాన్ నంబర్ వన్ అంట.. అభివృద్ధి,ఫాక్టరీలు, కార్లు లేకుండానే సంతోషంగా బతకొచ్చని నిరూపిస్తున్నారు..
ఇంతకీ వాళ్ళ ఆనందపు రహస్యం ఏంటి అంటారా??? ఏం లేదండీ, ప్రకృతికి వీలైనంత దగ్గరగా జీవించటం, అనవసరమైన నగరీకరణ జోలికి వెళ్ళాక పోవటం మొదలైనవి.. ప్రకృతికి, పరిసరాలకి ఎక్కువ డిస్టర్బెన్స్ కలిగించకూడదనే ఉద్దెశ్యం తో పర్యాటకులని కూడా పరిమిత సంఖ్య లోనె అనుమతిస్తారంట.. మంచి పాలసీ…

రెండు రూపాయల టికెట్ కి యాభై రూపాయలిచ్చినా విసుక్కోకుండా, గొణగకుండా,కనీసం ఛేంజ్ ఉన్నాయా అని ఇంకోసారి అడగకుండా ఓపికగా చిల్లరిచ్చిన కండక్టర్ ని చూసానండీ ఇవ్వాళ.. ఇంకా విజయవంతమైన మొదటి వారం కాలేదేమో అని డౌట్ వచ్చింది.కానీ మరీ అంత ఇనెక్స్పీరియన్సెడ్ లాగా కూడా ఏమీ అనిపించలేదు..ఏమో లెండి.. పురుషులందు పుణ్య పురుషులు వేరయా కదా…

“అల్లరి పిల్లలని భరించినట్టే పెద్దవాళ్ళనీ (వాళ్ళ ఛాదస్తాన్ని అని) భరించాలమ్మా..” అని ఇవ్వాళ రాధ-మధు లో డైలాగు..వదిలించుకోవాలని చూడొద్దని ఒరిజినల్ మీనింగు..

శుభరాత్రి చెప్పుకునే ముందు జోకాలి కదా( అదేనండీ జోక్ చెప్పాలి కదా) ఇది చాలా రోజుల క్రితం జోకు…
ఒక సారి ఏదో మ్యాచ్ లో, రమేష్ పవార్ షర్ట్ ని ఇంకెవరో ప్లేయర్ వేస్కున్నాడు, చాలా సేపటి వరకు పవారే ఆడుతున్నాడనుకున్నం. లాస్ట్ కి తెలిసింది ఇంకెవడో వాడి షర్ట్ వేస్కున్నాడని..మా అత్త వాళ్ళ అబ్బాయి కొంచం ఆశ్చర్యపడి.. “అయ్యా అలా కూడా వేస్కుంటారా??” అని అడిగాడు.. దానికి మా శ్రీధరన్న “అట్లేం లేదు మనోళ్ళకి, ఏది ఉతికింది ఉంటే అదే వేస్కుంటారు..” అని జవాబు…

ఇంక సెలవ్… శుభరాత్రి…..

పల్లీ పల్లీ పల్లీ…..

Wednesday, October 3rd, 2007

శ్రీనగర్ లో తీవ్రవాదులతో జరిగిన పోరాటం లో హైదరాబాద్ కి చెందిన యువ మేజర్ కె.ఆర్.వినయ్ మరణించారు. పాపం ఇంకో నెల రోజుల్లో ఆయన పెల్లి ఉండిందంట..కేవలం హీరోల పిల్లల పెళ్ళి వేడుకల వార్తలనే కాదు, ఇలాంటి త్యాగమూర్తుల త్యాగాలని కూడా మొదటి పేజీ లో వేసి గౌరవించాలి. (కీపిటప్ ఈనాడు..)

పాపం మన సి.పి.ఐ నారాయణ గారు గాంధి జయంతి రోజున చికెన్ తింటూ పేపరోళ్ళ కంట్లో పడ్డారు. కానీ నిజాయితీ గ ఒప్పుకుని క్షమాపణ చెప్పి,ఇంకో సంవత్సరం పాటు చికెన్ తిననని ప్రమణం చేసారు——జీవితాంతం మానేస్తానని సినిమా దైలాగులు చెప్పకుండా కేవలం సంవత్సరం అని మాత్రమె చెప్పారంటే నిజంగానే చెప్పరేమో అనిపిస్తుంది.
ఏమైనా నిజాయితీ పరుల సంఖ్య లెఫ్ట్ పార్తీలల్లో కెక్కువేనంట.ఇంకో సంగతి నేను విన్నదేంటంటే, వాళ్ళ యం.పి లు , యం.ఎల్.ఏ లు వాళ్ళ జీతం లో సగం పార్టీ కార్యకర్తల జీతాలు చెల్లించడానికి ఖర్చు పెడతారంట..

పాపం కర్నాటకలో భా.జ.పా పరిస్థితే హీనంగా తయారయ్యింది.కుమారస్వామి సీట్ ఇచ్చేలాగా కనిపించట్లేదు.ఇది కమలనాథులకు రెండో అనుభవం లెండి..ఒకసారి మాయావతి తో కుడా ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకొని బోర్లా పడ్డారు.. అయినా మళ్ళీ అంతే..

సరే ఇంక రాజకీయాలు పక్కన పెడదాం..

ఈ మధ్య నేను ఒక సీరియల్ చూస్తున్నాను మా టి.వి లొ. అమ్మమ్మ డాట్ కాం అని..బానే ఉంటుంది కానీ ఎదవ డిటైల్స్ ఎక్కువ.. కాఫీ తాగే సీన్ ఉందనుకోండి కాఫీ చేత్తో తీస్కోవటం,గ్లాసు నోట్లో పెట్టుకొవటం, మొదటి సిప్ నుండి చివరి సిప్ దాకా మొత్తం కాఫీ అంతా అయిపొయేదాకా తాగిస్తాడు. ప్రస్తుతానికి అందులొ హీరోగారు అమెరికా లో ఉన్నారు, వాళ్ళ అమ్మ , మన హీరోయిన్ ఊళ్ళో జనాలని ఉద్ధరించటంలొ బిజీ.. ఇందులో జో అని ఒక పాత్ర ఉండెది.. మాంచి పంచ్ డైలాగ్స్ ఉన్న పాత్ర అది… ఈ మధ్య రావట్లేదు. వస్తే, మళ్ళీ ఏవైనా మాంచి దైలాగులు వినిపిస్తే మీకు చెప్తాన్లెండి.. ఇప్పుడు గుర్తులేవు ఏవీ..

ఎప్పటిలాగే మళ్ళీ ఒక జోకేస్కుని ముగిద్దాం..

మా ఆఫీసులో శంకర్ గారని చెప్పాను కదా, ఇది వారిది..
రోజూ లాగే టీ కి వెళ్ళేటప్పుడు నన్ను పిలిచారు రమ్మని..
నేను “తాగి వచ్చాను” అని చెప్పాను..
దానికి ఆయన “ఎంటో ఆఫీసుకి తాగి కూడా వస్తున్నారు ఈ మధ్య” అని ..

పల్లీ బఠణీలకి స్వాగతం..

Tuesday, October 2nd, 2007

నమస్తే అండీ…..
సివరాఖరికి నా బద్దకాన్ని కొంచెం పక్కన పెట్టి,నా సొంత బ్లాగ్ క్రియేట్ చేస్కుంటున్నాను ఇవ్వాళ
కానీ విపరీతంగా ఆలోచించాను, అసలేం రాయాలి కంటే ముందు
అసలేం పేరు పెట్టాలి అని, కూసింత తెలుగుదనం కనిపించాలని నా కోరిక…
అందుకని మునిమాణిక్యం వారి కాంతాన్ని, నండూరి వారి యెంకిని, విశ్వనాథ్ గారి స్వాతి ముత్యాన్ని
యండమూరి గారి వెన్నెల్లో ఆడపిల్లని,ముళ్ళపూడి వారి బుడుగుని పరిశీలించానండీ, కాని ఈ పేర్లు వింటే నా బ్లాగ్ కంటె ముందు,వేరే గొప్పవాళ్ళు గుర్తొచ్చేస్తున్నారు కదండీ అందుకే ఆ ప్రయత్నం మానేస్కున్నాను.మరి టైం పాస్ పల్లి-బఠాణి అని పెడదాం అనుకున్నాను,కాని అది మరమరాలకి కాపీ లాగా అనిపించింది.అందుకని, చిత్రలేఖ అని పేరుని కంఫర్మ్ చేస్కున్నాను, కొంచెం కొత్తగా, అందంగా ఉంది రెలెవెంట్ గా కూడా ఉంటుందని సెలెక్ట్ చేసానండీ..ఎలా ఉందంటారు ఆ..???

పేరుకే ఇంత సోదా అంటారా, సరే కంటెంట్ లోకి వెళ్దాం…

అయినా మనకి కబుర్లకి కరువా చెప్పండి, రాష్త్రంలో దేవుడి పాలన నడుస్తుంది. మధ్యంతరం మట్టిగడ్డ
అని ప్రతిపక్షాలు, అధికార పక్షాలు రెండేళ్ళ ముందు నుండే రెడీ అయిపోతున్నారు…వాళ్ళదేం పోయింది, ఇంకో వైపు యాభయ్యేళ్ళ యంగ్ హీరోలు(బాలన్స్ అవుతుందని, మినిమం ఇద్దరు పాతికేళ్ళ హీరోయిన్స్ ని పెడతారు వీళ్ళకి),అఫ్ కోర్స్ మధ్యలో మంచి కాఫీలంటి సినిమాలూ ఉన్నాయనుకోండి… వరల్డ్ కప్ గెలిచిన ఇండియా టీం ఉండనే ఉంది..ఇంకో పక్క మ ఆఫీసులో మాంచి చణుకులు విసిరే శంకర్ గారు, దిమ్మ తిరిగె సెటైర్లేసే మా ఫ్రెండ్ జానకి… ఇవన్నీకలిపి కొడితె టైం పాస్ పల్లీ బఠణీస్ తో చిత్ర లేఖ రెడీ…

ఇవ్వాళ గాంధి జయంతి కదా. మీకో సంగతి తెలుసా గాంధి గారు తన ఆత్మ కథ “సత్యంతో నా ప్రయోగాలు”(My Experiments With Truth)ని యరవాడ జైల్లొ ఉండగ రాసారటండీ నవజీవన్ పత్రిక కోసం..గాంధి జయంతి ఇప్పుడు ఇక ప్రపంచ అహింసాదినం కూడా.. దీని కొసం న్యూయర్క్ వెళ్ళిన సొనియా గాంధికి స్వాగతం చెప్పటానికి “గాంధి పేరుని కలుషితం చేయొద్దని” బోర్డులు పెట్టారంట…

మన రాష్ట్రం లొ వై.యస్. గారు వరాల జల్లు కురిపిస్తున్నారు.. రెండు రూపాయలకి కిలో బియ్యం , పొలీసు ఉద్యోగాలు, ఇందిరమ్మ అని హడావిడి చేసేస్తున్నారు. బాబేమో ఉచిత విద్యుత్ అని కాంగ్రెస్ ని కాపీ కొట్టేసారు. వై.యస్. హెలికప్టర్ ఎక్కితే రోశయ్య గరికి గుండె దడ అంట. . ఏమేం వరాలిస్తాడో అని..

కర్నాటకలొ చూస్తే మళ్ళీ మధ్యంతరం వచ్చేలాగా ఉంది..

ఇక తమిళనాడు వాళ్ళైతె ప్రపంచం ఎవ్వరినీ లెక్క చెయ్యరేమో అనిపిస్తుంది నాకైతే. బంద్ వద్దని సుప్రీం అన్నా లెఖ్ఖ లేకుండా చేసి చూపించారు.

అన్నట్టు చిరుత యావరేజ్ అని విన్నాను.. డాన్స్ బాగా చేసాండంట కదా… చిరు తనయుడు కదా చెయ్యకుండా ఎలా ఉంటాడులెండి..

ఇవ్వాల్టి ఈ పోస్ట్ ని మా జానకి సెటైర్ తో ముగిస్తానేం..
ఒక సారి మా అనంత్ అన్నాడు ఏదో మాట వరసకి “మనకేంటి కింగులం” అని
దానికి మా జానకి “అవును, తుగ్లక్ కూడా కింగే” అని రెటార్ట్ ఇచ్చింది..
ఇంకేముంది.. మాడు మొహం బై అనంత్…

ఇంక ఇవ్వాల్టికి సెలవు తీస్కుంటానండీ .. నా డొక్కు లాప్-టాప్ లబోదిబో అంటుంది..