అందమైన చందమామ బంధం

మా చందమామ జ్ఞాపకాలు
సిహెచ్ వేణు గారికి
మనఃపూర్వక కృతజ్ఞతలు.
పని ఒత్తిడిలోనూ తీరిక చేసుకుని మీరు పంపిన చందమామ జ్ఞాపకాలు -’అందమైన చందమామ బంధం’- అందింది (06-09-09). కోరగానే మీ అమూల్యమైన చందమామ జ్ఞాపకాలను ఆన్‌లైన్ చందమామకు పంపినందుకు కృతజ్ఞతలు.
“నేను పుట్టకముందు ప్రచురితమై నేను గతంలో ఎన్నడూ చూడని చందమామలనూ చదవగలిగానంటే ఇంటర్నెట్టే కారణం.”
మీరన్నది నిజం. ఎంత నాసిరకంగానే అయినప్పటికీ ఆన్‌లైన్‌లో చందమామ ఆర్కైవ్‌లు పెట్టకపోయి ఉంటే 50, 60 ఏళ్ల క్రితంనాటి అద్భుత కథలను ఇలా మనం చదివే వాళ్లం కాము. నాకు తెలిసి 60 ఏళ్ల సంచికలను మొత్తంగా ఆన్లైన్‌లో పెట్టాలని నిర్ణయించుకుని ఆ పనిలో ముందుకు సాగుతున్న పత్రిక చందమామ మినహా ప్రపంచంలోనే మరొకటి ఎక్కడాలేదు. నేషనల్ జాగ్రఫీ వాళ్లు కూడా 112 సంవత్సరాల సంచికలను టోకున సీడీలలో పెట్టి అమ్మారు తప్ప ఉచితంగా ఆన్‌లైన్‌లో పొందుపర్చలేదు.
ఆన్‌లైన్‌లో 60 సంవత్సరాల క్రితం నాటి అపరూప సంచికలు. ఒక్కచోటే అన్ని చందమామలు… తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది నాకు. వేణుగారూ ఈ విషయంపైనే మీరు ఎందుకు ఓ కథనం రాసి మీ బ్లాగులో పెట్టకూడదు? చందమామ యాజమాన్యం తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఇంటర్నెట్‌లో చందమామ ఆర్కైవ్స్ ఒకటి.
ఏ మహత్తర క్షణంలో ఈ నిర్ణయం తీసుకున్నారో కాని తెలుగు వాళ్లకు తమదైన సాంస్కృతిక సంపద కళ్లముందు కనిపిస్తోందిప్పుడు. ఇప్పుడు కొన్ని కారణాల రీత్యా అంతకు ముందు ఉన్న పీడీఎఫ్ డౌన్లోడ్ సౌకర్యం తీసివేసి చదవగలిగేలా ఫ్లాష్ ఇమేజ్ ఫార్మేట్‌లో చందమామలను ఇంటర్నెట్‌లో పెట్టారు.
“అనంతమైన ప్రకృతిలో ఒదిగిన అరణ్య సౌందర్యం చందమామ బొమ్మల్లో అద్భుతంగా సాక్షాత్కరిస్తుంది.”
“సజీవమైన, చక్కని తెలుగు వాడుక భాష చందమామ ద్వారానే నాకు అందింది. బాల్యంలోనే నాలో తరగని పఠనాసక్తిని పెంచింది చందమామే!”
“చందమామ అంటే అక్షరాల్లో సంపూర్ణంగా వ్యక్తం కానంత అపురూపమైన అనుబంధం!”
మీ ‘చందమామ జ్ఞాపకాలు’ లో ఇవన్నీ మెరుపు వాక్యాలే మరి. అక్షర సత్యాలు కూడా. ఈరోజు కూడా మనం ఒక పరీక్ష పెట్టుకోవచ్చు. ఎవరైతే బాల్యంలో కథలు వినడానికి, కథలు చదవడానికి దూరమైపోయారో వారు సాహిత్యానికి కూడా దూరమైపోయి ఉంటారు. . వారి కుటుంబంలో సాహిత్య వాతావరణం కూడా దూరంగానే ఉంటుంది.
బాల్యంలో ఎలాంటి సాహిత్య పరిచయం లేనివారు మధ్యలో సాహిత్య వాతావరణంలోకి రావడం కూడా అరుదుగానే జరుగుతుందనుకుంటాను.
అయితే సమాజంలో లక్షలాది మంది ఇప్పటికీ సాహిత్యానికి, పుస్తక పఠనానికి దూరంగా ఉంటూ ఉండడానికి సామాజిక, ఆర్థిక, బౌద్ధిక కారణాలు ఎన్నో ఉన్నాయనుకోండి.
పని గట్టుకుని మంచి పుస్తకం మనం ఇచ్చి, కొనిపించి చదివించినట్లయితే కొంతమంది పిల్లల్లో ఈనాటికీ పుస్తకాల పట్ల అనురక్తి ఏర్పడుతోంది. అంటే పిల్లలు పుస్తకాలు చదవరనే మాట వట్టిదే. వారికి చదివే అవకాశం, తీరిక సమయాన్ని ఇంట్లో, పాఠశాలల్లో కల్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
జీవితంలో పోరాటం అవసరమైన పరిస్థితుల్లో కాకుండా, మంచి సాహిత్యం చదివి, అన్యాయంపై ఆగ్రహంతో ఉద్యమాల బాటను ఎంచుకున్న వారు ఎంతోమంది ఉన్నారని నా అనుభవంలో తెలిసింది.
వేణుగారూ.. చెప్పుకుంటూ పోతే కాలం సరిపోదు. మరి సెలవు.
మీ చందమామ జ్ఞాపకాలను ఒక్కరోజు వ్యవథి తీసుకుని రేపు (07-09-09) తప్పకుండా ఆన్‌లైన్‌లో ప్రచురించగలం. వచ్చిన వెంటనే ప్రచురించడం రివాజు అయినప్పటకీ, మా ఆన్‌లైన్ కంటెంట్ హెడ్ ఆఫీసుకు రాకపోవడంతో ఈ ఇబ్బంది ఏర్పడింది. ఒకసారి ఆమెతో మీ జ్ఞాపకాలను పంచుకున్న తర్వాత రేపు అంటే మంగళవారం దీన్ని తప్పక పోస్ట్ చేయగలం. ఇది చిన్న సాంకేతిక విషయంతో ముడిపడిన విషయం మాత్రమే అని గుర్తించగలరు….
అన్యధా భావించరని ఆశిస్తూ….
మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలతో.. ఈ చందమామ జ్ఞాపకాల అనుబంధం ఇలాగే కొనసాగుతుందని ప్రగాఢంగా ఆశిస్తూ…
మీ
చందమామ
వేణుగారి చందమామ జ్ఞాపకాలు చదవాలనుకుంటే ఈ కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2197
బీవీ ఫణి, రోహిణీ కుమార్, త్రివిక్రమ్, శివరామ్ ప్రసాద్ గార్లు ఇదివరకే పంపిన వారి చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49
………………………….
మా చందమామ జ్ఞాపకాలు
చందమామ జ్ఞాపకాలను దశాబ్దాలుగా తమ హృదయంలో పొదవుకుని భద్రపర్చుకున్న వందలాదిమంది చందమామ అభిమానులకు, బ్లాగర్లకు, నెటిజన్లకు ఆన్‌లైన్ చందమామను సాదర నిలయంగా మార్చాలనే ఆశయంతో telugu.chandamama.com లో “మా చందమామ జ్ఞాపకాలు” విభాగాన్ని రూపొందించాము. చందమామతో తమ జ్ఞాపకాలను, అనుభూతులను ఈ విభాగంలో పంచుకోవాలని భావిస్తున్న అభిమానులకు ఇదే మా ఆహ్వానం.
ఆ రోజుల్లో మీ చిన్ననాటి చిరునేస్తంగా పలకరిస్తూ వచ్చిన చందమామ జ్ఞాపకాలను మీరు తెలుగులో లేదా ఇంగ్లీషులో కింది లింకుకు పంపించగలరు. వీలయితే మీ ఫోటో, ప్రొఫైల్ వివరాలను కూడా పంపగలరు.
చందమామ పాతసంచికలలోని కథలను చదువదలిస్తే కింది ఆర్కైవ్స్ లింకులో చూడండి. గత సంచికల కోసం వెనక్కు వెళ్లి మీ అభిమాన కథలను మళ్లీ చదవండి. మా ఆర్కైవ్‌లను చూసి, ఆనందించండి.
http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL
నోట్:
చందమామ అభిమానులందరినీ ఉర్రూత లూగించే ఒక చల్లటి వార్త త్వరలో మీ ముందుకు… సర్వశ్రీ ఎంటీవీ ఆచార్య, చిత్ర, వడ్డాది పాపయ్య, శంకర్ గార్ల పేర్లు తెలుసు కదూ.. చందమామ చరిత్రకే మణిభూషణాలను దిద్దిన ఈ అపరూప చిత్రకారులకు సంబంధించిన ఓ మంచి విషయం కోసం త్వరలో ఇక్కడే కలుసుకుందాం.
చందమామ.
Filed under చందమామతో మా జ్ఞాపకాలు | Tags: ఆచార్య, ఆర్కైవ్స్, కథలు, చందమామ జ్ఞాపకాలు, చిత్రకారులు చిత్ర, త్రివిక్రమ్, బివి ఫణి, రోహిణీ కుమార్, వపా, వేణు, శంకర్, శివరామ్ ప్రసాద్ | Comment (0)చందమామ జ్ఞాపకాలు

చందమామ జ్ఞాపకాలు : శివరాంప్రసాద్ కప్పగంతు.
శివరాం ప్రసాద్ గారూ,
మనఃపూర్వక కృతజ్ఞతలు. అడిగిన వెంటనే తీరిక చేసుకుని మరీ మీ చందమామ జ్ఞాపకాలు పంపారు. మీరు కోరినట్లు మీరు సూచించిన ఫోటోయే ఆన్‌లైన్ చందమామలో ప్రచురించాము. పెద్ద పెద్ద పేరాలను చిన్నవిగా చేయడం తప్పిస్తే మీరు పంపిన పూర్తి పాఠాన్ని యధాతథంగా ప్రచురించాము. నిన్ని త్రివిక్రమ్ గారు, ఇవ్వాళ మీరు… వెంటవెంటనే చందమామ జ్ఞాపకాలను పంపడం.. నిజంగా చక్కటి అనుభూతి.
‘చందమామలో బొమ్మలను ఉదహరించకపోతే, చందమామ జ్ఞాపకాలేమిటి’ చక్కటి వ్యాఖ్య. కొత్తగా వచ్చిన చంద్రబాల అలనాటి చందమామను గుర్తుకు తెస్తూ బొమ్మలతో అదరగొడుతోంది. దాంట్లో పూర్తి పేజీ రంగుల చిత్రాలను చూస్తుంటే చందమామ పోగొట్టుకున్నదేమిటో అర్థమవుతుంది. ఇప్పటికైనా చందమామ మేలుకుంటే మంచిది.
‘కొత్త చందమామను షాపువాళ్ళు వరుసగా పెట్టినప్పుడు, ఆ దుకాణానికే గొప్ప అలంకరణ చేసినట్టుగా ఉండేది’
మళ్లీ ఆరోజులు రావాలనే కోరుకుంటున్నా. మన అందరి ఆశలు, ఆకాంక్షలు, డిమాండ్లు అన్నీ ఒక్కటొక్కటిగా నెరవేరుతాయనే అనుకుంటున్నా. పాత చందమామలు దుకాణాల్లో పేర్చి ఉన్న ఫోటోలు ఒకటో రెండు దొరికితే బాగుండు. చందమామ ఆఫీసులో పేర్చి ఉన్న చందమామలను చూస్తుంటేనే మనసు తుళ్లింతలు పోతుంది. అలాంటింది పాత చందమామల ముఖచిత్రాల గురించి చెప్పపనిలేదు.
‘ఇంతటి అద్భుతమైన బొమ్మలను సేకరించి, ఒక పుస్తకం వెయ్యగలిగితే చందమామ వారు తెలుగు సాహిత్యానికి చిత్రలేఖన కళకు ఎంతగానో సేవచేసినవారిగా చరిత్రకు ఎక్కుతారు’.
ఇప్పుడు చందమామ అభిమానులు, పాఠకులు, చంపిలు పత్రికకు పంపే డిమాండ్లలో దీన్నికూడా మొదటి వరుసలో చేర్చాలి. చందమామకు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇంగ్లీషులో కలెక్టర్ ఎడిషన్ వేసి తెలుగు వారి సెంటిమెంట్లను గాయపర్చారు. కనీసం ఈ ప్రతిపాదనను అయినా చందమామ నిర్వాహకులు పరిగణనలోకి తీసుకుని చందమామ ఆస్థాన చిత్రకారుల త్రయం గీసిన చిత్రాలను ఒక పుస్తకంగా వేస్తే అది ఓ అద్భుత ఆవిష్కరణగా చరిత్రలో మిగులుతుంది.
చక్కటి రిజల్యూషన్‌తో చందమామ చిత్రాలను ప్రచురిస్తే ఎంత ఖర్చైనా వెచ్చించి తీసుకోవడానికి పాఠకులు పూనుకుంటారనే నా నమ్మకం. Chandamama Collector’s edition పుస్తకం చివర్లో Art Galleryలో చిత్రాలు ఓసారి చూడండి. అదిరిపోయేలా వేశారు. మళ్లీ మెయిన్ పుస్తకంలో వేసిన చిత్రాలు అంత కళగా లేవు. కాని అరుదైన పుస్తకంగా దీన్ని మనం కొని భద్రపర్చుకోవచ్చు.
చందమామ చిత్రాలు పుస్తక రూపంలో రావాలంటే చందమామకు అభిమానులు పంపే ఉత్తరాలు, ఈ మెయిళ్లలో దీన్నికూడా చేర్చి పంపించాలి. చందమామ ధారావాహికలు, చందమామ చిత్రాలు వంటివి తిరిగి ముద్రించబడితే ఎంతగా పాఠకుల ఆదరణ పొందుతాయో నిజంగానే నిర్వాహకులకు తెలియకపోవచ్చు కూడా. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడితే ఈరోజు కాకపోతే రేపయినా వీటి పునర్ముద్రణ విషయం ఆలోచిస్తారు.
అందుకే వీలయినంత మంది చంపిల, చందమామ అభిమానుల, పాఠకుల ఈమెయిళ్లు మనం సేకరించగలగితే ఏక కాలంలోనే నిర్దిష్ట సంఖ్యలో పాఠకులు ఓ ప్రత్యేక అంశంపై డిమాండును మరిత బలంగా పంపించడానికి అవకాశముంటుంది. అలా అది యాజమాన్యంపై తప్పకుండా ప్రభావం చూపుతుంది కూడా. ఎంతలేదన్నా సంఖ్యా బలానికి ప్రాధాన్యత ఉన్న కాలం కదా ఇది.
దీన్నే నా బ్లాగులో కూడా చందమామ అభిమానులకోసం పోస్ట్ చేస్తాను.
మరోసారి మీ చందమామ జ్ఞాపకాలకు కృతజ్ఞతలు.
మీ చందమామ జ్ఞాపకాల కోసం కింది లింకును తెరవండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2176
రాజు.
నోట్: చందమామ అభిమానులకు, చంపిలకు విజ్ఞప్తి. చందమామతో మీ బాల్య, తదుపరి జీవిత జ్ఞాపకాల గురించి రెండు పుటలకు మించని కథనం కింది లింకుకు పంపగలరు. మీ ఫోటోతో సహా పంపితే మరీ మంచిది. తెలుగు పాఠకుల చందమామ జ్ఞాపకాలకు ఆన్‌లైన్ చందమామ వేదిక కావాలన్న మా ఆకాంక్షను మన్నిస్తారని ఆశిస్తూ..
చందమామ జ్ఞాపకాలు పంపవలసిన లింకు
Filed under చందమామతో మా జ్ఞాపకాలు | Tags: చందమామ, చిత్ర, చిత్రలేఖనాలు, చిత్రాలు, జ్ఞాపకాలు, తెలుగు, దుర్గయ్య, నాన్న, భాష, మద్రణ, వడ్డాది పాపయ్య, శంకర్, శివరామ్ ప్రసాద్, షాపు | Comment (1)






