నాన్నా! చందమామ తీసుకురానా!!
(చందమామ అనుకోగానే గుర్తొచ్చేవి బొమ్మలే అంటున్నారు మేధాగారు. చందమామలో కథల కంటే కూడా బొమ్మలు చాలా బావుండేవని తన అభిప్రాయం. యువరాణి ఎంత అందంగా ఉంటుందో చూడాలంటే చందమామలోనే చూడాలంటున్నారు. కథలు కూడా ఏ వ్యక్తిత్వ వికాసానికీ తీసిపోని విజ్ఞాన గనులట. “గుణపాఠాలు నేర్చుకునే కధలు, మార్పు(పశ్చాత్తాపం) గురించిన కధలు, మంచిగా ఉండేవాళ్ల కధలు.. చిన్నప్పటి నుండి ఇలాంటివి చదవడం వల్ల, మనకి తెలియకుండానే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాం.. ఎప్పుడైనా తప్పు చేయాల్సి వచ్చినా భయమేస్తుంది, ఆ కధలోలా నాకు కూడా ఏమైనా జరుగుతుందేమో అని..” అంటున్నారు.
తరాలుగా చందమామను చదువుతూ వచ్చిన వారి మనోభావాలకు చందమామ జ్ఞాపకాలు ఓ ప్రతీక. ‘మా బామ్మ చదివింది చందమామ, మా అమ్మ చదివింది చందమామ, నేను చదివాను చందమామ..’ అంటూ గ్రైఫ్ వాటర్ ప్రకటనను గుర్తు చేయడం ద్వారా చందమామను ఇంటిల్లిపాదీ ఎలా తమ హృదయాలకు హత్తుకునేవారో తేల్చి చెప్పారు. చక్కటి చందమామ జ్ఞాపకాలు పంపిన మేధాగారికి కృతజ్ఞతాభినవందనలు. నాలోనేను పేరిట చక్కటి బ్లాగును కూడా తను నిర్వహిస్తున్నారు.
“ఇప్పటికీ బస్టాండ్‌లో బస్ కోసం నించున్నప్పుడు నాన్నగారు ‘చందమామ తీసుకురానా!’ అంటుంటారు..” బిడ్డకు చందమామను కొనిపెట్టే తండ్రి… చందమామను పిల్లలకు కొని ఇవ్వగలిగిన తెలుగు కుటుంబాలు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే పని చేస్తున్నాయనుకుంటాను. ఏమయినా మీ జన్మ ధన్యమైనది. మీ నాన్నగారికి చందమామ తరపున మనఃపూర్వక వందనాలు.
మేధాగారి చందమామ జ్ఞాపకాల పూర్తి పాఠాన్ని ఇక్కడ చదవండి.)
చందమామ – 1970/80/90 ల తరానికి పరిచయం అక్కర్లేని పత్రిక.. పిల్లల పత్రికల్లో అగ్రతాంబూలం అందిపుచ్చుకున్న పత్రిక. కేవలం పిల్లల పత్రిక అంటే, చంపిలు నా మీద దండెత్తే ప్రమాదం కూడా ఉంది..
చందమామతో పరిచయం ఎలా జరిగిందో గుర్తు లేదు కానీ, నేను చదివిన మొదటి పుస్తకం మాత్రం చందమామే!.. అదేదో గ్రైఫ్‌వాటర్ ప్రకటనలోలా, మా బామ్మ చదివింది చందమామ, మా అమ్మ చదివింది చందమామ, నేను చదివాను చందమామ..!
అప్పట్లో చందమామ వస్తుంది అంటే చకోర పక్షుల్లా ఎదురు చూసే వాళ్ళం.. మేము ఉన్న ఊర్లో ఈ పుస్తకాలు దొరికేవి కాదు, అందుకని ప్రక్క ఊరికి వెళ్ళి తీసుకు వచ్చేవారు నాన్నగారు.. ఈ రోజు వెళ్ళి తీసుకు వస్తాను అంటే, నాన్నగారు వచ్చేసరికల్లా, చదువంతా పూర్తి చేసుకుని, ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం.. అది రాగానే, నా కంటే నాకు అని గొడవలు, పోట్లాటలు..
చందమామ అనుకోగానే, గుర్తొచ్చేవి బొమ్మలు.. కధల కంటే కూడా బొమ్మలు చాలా బావుండేవి.. రాము(రాముడు మంచి బాలుడు) ఇలానే ఉంటాడేమో.. పాపం విక్రమార్కుడు ఇలా బేతాళుడిని మోసుకువెళ్ళేవాడా, అబ్బ ఆ యువరాణి ఎంత అందంగా ఉందో! గయ్యాళి గంగమ్మ ఇలానే ఉంటుందా.. బొమ్మలు అంటే ముఖచిత్రం గురించి కూడా చెప్పాలి.. ఆ నెలలో ఏమైనా పండగలు ఉంటే వాటికి తగ్గ బొమ్మలతో అందంగా ముస్తాబై ఉండేది..
కధల గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఏ వ్యక్తిత్వ వికాసానికి తీసిపోని విజ్ఞాన గనులు. విలువలు నేర్పుతూ, ఊహాశక్తిని పెంపొందిస్తూ, సమస్యల చిక్కుముడులు ఎలా విప్పదీయాలో చూపిస్తూ, క్రొత్త విషయాలు నేర్పుతూ, చరిత్రని గురించిన సంగతులు, పురాణాలు, ఇతిహాసాలు.. ఒహటేమిటి, అదీ-ఇదీ అని కాదు, లేనిది లేనే లేదు..
నీతి కధల్లోనే ఎన్నో రకాలు.. గుణపాఠాలు నేర్చుకునే కధలు, మార్పు(పశ్చాత్తాపం) గురించిన కధలు, మంచిగా ఉండేవాళ్ల కధలు – ఇలా ఎన్నో.. చిన్నప్పటి నుండి ఇలాంటివి చదవడం వల్ల, మనకి తెలియకుండానే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాం.. ఎప్పుడైనా తప్పు చేయాల్సి వచ్చినా భయమేస్తుంది, ఆ కధలోలా నాకు కూడా ఏమైనా జరుగుతుందేమో అని.. అలా పిల్లల వ్యక్తిత్వాలని తీర్చిదిద్దే పత్రిక చందమామ అంటే అతిశయోక్తి కాదేమో..
ఇక విక్రమార్కుడి కధలు అసలు సిసలు విశ్లేషణా సామర్థ్యం ఉన్న కధలు.. మరీ చిన్నప్పుడు ముగింపు చదివితే తప్ప ఇలా పరిష్కరిస్తారు అని తెలిసేది కాదు.. తరువాత తరువాత కాస్త కాస్త విశ్లేషణ చేయడం, అప్పుడప్పుడు నేను అనుకున్నట్లు లేకపోతే అమ్మతో ఎందుకు ఇలా ఉంది, ఇలా కూడా ఉండచ్చు కదా అని వాదనలు.
ఇక సీరియల్స్.. యండమూరిలు, యధ్ధనపూడిలు, డాన్ బ్రౌన్‌లు సరిపోరు అనిపిస్తుంది.. ఆ సీరియల్ కోసం మళ్ళీ నెల ఆగాలంటే అమ్మో అనిపించేది.. ముగింపు వచ్చిన సంచిక ప్రక్కన పెట్టుకుని మళ్ళీ అన్ని భాగాలు చదివితే తప్ప తృప్తిగా ఉండేది కాదు.
వీటన్నింటితో పాటు, ప్రముఖుల జీవిత చరిత్రలు చిట్టి-పొట్టి కధల రూపంలో వస్తుండేవి.. ఇక్కడ కూడా మళ్ళీ బొమ్మలదే ప్రముఖ పాత్ర..
మొదట్లో సంపాదకీయం చదివేదాన్ని కాదు కానీ, కొంచెం పెద్దయిన తరువాత అది కూడా చదవడం మొదలుపెట్టాను.. తక్కువ పదాలలో, చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా ఎలా చెప్పాలో తెలుస్తుంది!
ఇవన్నీ ఒకెత్తు, పురాణాల గురించిన కధలు ఇంకో ఎత్తు. ఇప్పుడంటే డేటాబేస్ బాగా దెబ్బతింది కానీ అప్పట్లో, పురాణాలలో ఏ కధ గురించి అడిగినా కూడా తడుముకోకుండా చెప్పగలిగి ఉండేదాన్ని.. మా తమ్ముడైతే ఒకడుగు ముందుకేసి, మా పిన్నిలని, మామయ్యలని ఎక్కడెక్కడి ప్రశ్నలో అడిగి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు.
ఇంకా ప్రకటనలు, మీకు తెలుసా అంటూ క్విజ్‍లు, బొమ్మకి వ్యాఖ్యలు.. అదో నోస్టాల్జియా..
కొసమెరుపేంటంటే, ఇప్పటికీ బస్టాండ్‌లో బస్ కోసం నించున్నప్పుడు నాన్నగారు ‘చందమామ తీసుకురానా!’ అంటుంటారు..
–మేధా
http://nalonenu.blogspot.com
మేధాగారి చందమామ జ్ఞాపకాలను చందమామ వెబ్‌సైట్‌లో కూడా కింది లింకులో చూడగలరు
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2433
మీ చందమామ జ్ఞాపకాలను కూడా రాసి కింది లింకుకు పంపగలరు.
abhiprayam@chandamama.com
ఈ వారం బేతాళ కథ – రెండు నెమళ్లు

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, ఇంత అర్ధరాత్రివేళ, భీతిగొలిపే ఈ శ్మశాన వాతావరణం, ఏదో సాధించి తీరాలన్న పట్టుదల కారణంగా, నీకు అత్యంత సహజంగా కనబడుతున్నట్టు, నాకు అనుమానం కలుగుతున్నది. కానీ, ప్రకృతిలోని వైపరీత్యాలూ, అందులోని జీవరాసుల ప్రవర్తనా గురించిన అంచనా వేయవలసి వచ్చినప్పుడు, పండితులూ, పామరుల మధ్య ఎంతో భేదభావం గమనించగలం. ఇందుకు ఉదాహరణగా నీకు, చంద్రశర్మ అనే ఒక చిత్రకారుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,’’ అంటూ ఇలా చెప్పసాగాడు:
ఒకానొకప్పుడు సువర్ణదేశాన్ని పాలించిన సువర్ణదేవ మహారాజు గొప్ప భూతదయాపరుడు. తనదేశంలోని ప్రకృతి పరిసరాలను కాపాడుకోవాలనీ, అందుకుగాను చెట్లకూ, అక్కడ నివసించే పశుపక్ష్యాదులకు కూడా ఎలాంటి హానీ జరక్కుండా రక్షించుకోవాలనీ అందరికీ చెబుతూండేవాడు. ఆయన ప్రతి సంక్రాంతికి ఎడ్లకు పరుగుపందాలతో పాటువాటిలో చూడముచ్చటగా వుండేవాటికి మంచి బహుమతులు కూడా ఇస్తూండేవాడు. ప్రకృతిదృశ్యాలను అందచందాలతో చిత్రించిన చిత్రకారులను కూడా ఘనంగా సన్మానించేవాడు.
రాజధానికి దాపునగల ఒక గ్రామంలో వున్న చంద్రశర్మ మంచి చిత్రకారుడు. ఎవరైనా తమ రూపచిత్రం కావాలని కోరితే, కొద్దిసేపట్లో చిత్రించి ఇచ్చేవాడు. అందువల్ల, ఎంతోమంది ధనవంతులు అతడిచేత తమ చిత్రాలను గీయించుకునేవారు. ఒకసారి చంద్రశర్మ, రాజుగారు సంక్రాంతి నాడు ఏర్పాటుచేసే చిత్రకళా పోటీలలో పాల్గొనదలచి – రెండు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పుగల చెక్కపలక మీద, రెండు అందమైన నెమళ్ళు పురివిప్పి ఒకదానికొకటి ఎదురుగా నాట్యం చేస్తున్నట్టు చిత్రించాడు.
ఆ చిత్రాన్ని చూసిన ఒకడు, ‘‘ఆహా, ఎంత అద్భుతం! పురివిప్పిన నెమళ్ళు కళ్ళ ఎదుట నాట్యం చేస్తున్నట్లే వుంది. దీన్ని ఇంటి ముఖ ద్వారానికి వేలాడదీస్తే, ఇంటికే చెప్పరానంత కళ వస్తుంది,’’ అంటూ మెచ్చుకున్నాడు. చిత్రకళలో పరిచయం వున్న మరొకవ్యక్తి, ‘‘మన చంద్రం, నెమలి కంఠం రంగులు బాగా కలిపాడు. ఆ రంగులు అలా ఎవరూ కలపలేరు; ఒకవేళ కలిపినా, ఆ మెరుపు రాదు. రాజుగారు చూస్తే, దీనికి వంద బంగారు నాణేలిచ్చి తనదిగా చేసుకుంటారు,’’ అన్నాడు.
ఈ వారం బేతాళ కథ పూర్తి పాఠం -4 పుటలు- కోసం కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=36&sbCId=97&stId=2287
గమనిక: ఈ కథ చివరలో బేతాళుడు సంధించిన ప్రశ్నకు విక్రమార్కుడు ఇచ్చిన జవాబును ముందుగా చదవకుండా మీరే ఆలోచించి సమాధానం చెప్పండి చూద్దాం. సమాధానం తెలిసీ చెప్పకపోయారో…. మీ శిరస్సు….. అంతే…….
ఆన్‌లైన్ చందమామలో ఇప్పటివరకు ప్రచురించిన 64 బేతాళ కథలు చదవాలని ఉందా?
అయితే కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=36&sbCId=97
మీ స్పందనను abhiprayam@chandamama.com పంపండి.
Filed under చందమామ కథలు | Tags: చందమామ, చంద్రం, చంద్రశర్మ, చిత్రకారుడు, చిత్రపటం, ధనవంతులు, నెమలికంఠం, నెమళ్లు, పండితులు, పామరులు, బంగారు, బేతాళ, బేతాళ కథలు, బేతాళుడు, మహారాజు, విక్రమార్కుడు, విక్రముడు, సంక్రాంతి, సాహసం, సువర్ణదేవుడు | Comments (7)చందమామ-నా తొలి నేస్తం
“….చందమామ, ఆ పేరులోనే ఏదో మహత్తు ఉన్నట్టుంది. నెలకొకసారి నింగిలో మెరిసిపోయే చందమామ అన్నా, నిండుగా చేతుల్లో ఒదిగిపోయే చందమామ అన్నా ఇష్టపడని వారు ఎవరు? నామటుకు నాకు చందమామ అన్నా, దానిలో బుజ్జిగా ఒదిగిపోయిన కుందేలు పిల్ల అన్నా మహా ఇష్టం, ఇది నేల మీద జాబిల్లి గురించే నింగిలోని జాబిల్లి గురించి కాదు.
మాకు పుస్తక పఠనాభిలాష మా అమ్మగారి నుండి వారసత్వంగా వచ్చింది. ప్రతి నెలా మొదటి వారంలో నాన్న గారి సైకిల్ బెల్ ఎప్పుడు మోగుతుందా అని ఆత్రంగా ఎదురు చూసే వాళ్ళము నేనూ, నా అన్నయ్యలూ. నాన్న సైకిల్ దిగటంతోనే యుద్ధం మొదలు, చందమామ నేను మొదట చదవాలీ అంటే నేను మొదట చదవాలి అని.
చిన్నదాన్ని కాబట్టి ఎప్పుడూ ఓడిపోయేదాన్ని నేను, వాళ్ళిద్దరు చదివిన తర్వాత అంటే సుమారుగా వారం తర్వాత వరకూ నా చేతికి చిక్కేది కాదు చందమామ. నాకేమో కొత్త పుస్తకాన్ని అలా చేతుల్లోకి తీసుకుని అందులోంచి వచ్చే ఒకలాంటి కమ్మటి సువాసనని ఆస్వాదిస్తూ చదవాలి అని తెగ కోరిక, కానీ అది చాలా యేళ్ళ వరకూ తీరలేదు…..”
సాయిలక్ష్మిగారూ,,
మీ చందమామ జ్ఞాపకాలను పంపినందుకు హృదయపూర్వక కృతక్షతలు. సరిగ్గా మీ చిన్ననాటి అనుభవాలే మావి కూడా.. మాది కొంచెం పెద్ద కుటుంబమే మరి. నాలుగు కుటుంబాలలో పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు 15 మందికి పైగా ఉన్న బాల్యం మాది. కుటుంబానికి ఒక పత్రిక చొప్పున అప్పట్లో చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి పత్రికలను తెప్పించినా అవి మా అందరికీ సరిపోయేవి కావు. అవతలివాడికి దొరికిన చందమామ ఇతర పత్రికలు ఎప్పుడు మాకు దొరుకుతాయనే ఎదురుచూసేవాళ్లం.
చివరకు పొలాలకు నీళ్లు కట్టేందుకు రాత్రిపూట ఊరిబయటకు పోతే టార్చి లైటు వెలుతురులో వీటిని ఆబగా చదివి అవతలి వారికి ఇచ్చేయవలసినంత పోటీ ఉండేది మాలో.. ఇలా ఆంధ్ర సచిత్రవారపత్రిక, ఆంధ్రప్రభ, తర్వాత రోజుల్లో ఆంధ్రజ్యోతి, యువ, విజయ, ఇలా ఏ వార, మాస పత్రిక కనిపించినా సరే అవి మా అందరికీ ఇలాగే బట్వాడా అయ్యేవి.
ఒక్కోసారి ముఖచిత్రం గాని ఆకర్షించిందంటే పోటీలు మీద పోటీలు. నువ్వు చదివిన తర్వాత నాకివ్వు అంటే నాకివ్వు అని.. వ్యవసాయ జీవితమూ, చందమామతో సహా కథల పత్రికల అధ్యయనమూ రెండూ కలిసిపోయిన బాల్యం మాది. పొలాల్లో ఎనుములు -గేదెలు- మేపుకుంటూ భారతం, రామాయణం, ఎమెస్కో పుస్తకాలు, చివరకు శ్రీశ్రీ మహాప్రస్థాన గేయాలు కూడా బాల్యంలో ముఖ్యంగా 6,7,8 తరగతుల్లో చదువుకున్నాం, పాడుకున్నాం అంటే నమ్ముతారా..!
ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, తర్వాత ఈనాడు… దినపత్రికలను కూడా ఇలాగే వంతులు వేసుకుని మరీ చదువుకున్నాం మేం. అందరూ అన్నీ కొనే స్తోమత లేకపోవడమే దీనికి కారణం. పంచాయతీ సహకారంతో ఊర్లో లైబ్రరీ పెట్టించుకుని అన్ని పత్రికలను తెప్పించుకోవాలనేది మా ఊరిలో చదువుకున్నవారి కల. అది గత నలభైఏళ్లుగా కలగానే సాగుతోంది. లైబ్రరీలకు బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోయిన ప్రస్తుత కాలంలో ఇక ఇలాంటివి ఎప్పటికీ కలలే..
దానికి తోడు ఊర్లలో ప్యూడల్ అహాలు, అహంకారాలు, భేషజాలు కూడా తక్కువేం కాదు. ఏ మంచి పనిని కూడా చిట్టచివరి క్షణంలో నిలువునా పాతేసే రకం అహంకారాలు. సంవత్సరం క్రితం ఊరినుంచి వలసపోయిన వారు తలా ఇంతని వేసుకుని చుట్టుపక్కల గ్రామాలకు ఉపయోగపడేలా మెడికల్ క్యాంపును పెట్టాలని పథకం వేసుకుని కూడా చివరి క్షణంలో ఎవరు గొప్ప అనే గ్రామీణ అహాలు, రాజకీయాల బారిన పడి ఎవరిదారిన వారు పోయిన చరిత్ర మా ఊరిది.
మరి అభివృద్ధి జరుగలేదా అంటే చాలానే జరుగుతోంది. తారురోడ్లు, బోర్లు, కొత్త కొత్త సేద్యాలు.. వాహనాలు, విలాసాలు వీటికి తక్కువేం లేదు. కానీ.. ఎక్కడో ఏదో లోపం… అర్థమయ్యీ ఆర్థం కాని లోపం… గత ఆదివారం శివరాం గారు చూపించిన మానెక్‌షా ఉపన్యాసం ఈ విషయాన్నే చక్కగా చెప్పింది. దేశంలో అందరూ నాయకులే, కాని తప్పులకు బాధ్యతలు వహించని నాయకులు, బాధ్యతను మోయడానికి ముందుకురాని నాయకులు.. ఇలాంటి నేపథ్యంలో నువ్వెంత అంటే నువ్వెంత రకం భావాలు రాజ్యమేలవా మరి..!
అయినా చదువుకున్నాం. బురదమళ్లలో దిగి సేద్యం చేసిన జీవితం నుంచి పట్టణాల్లో ఉద్యోగ జీవితం వరకు పయనించివచ్చాం. కానీ మా బంగారు బాల్యాన్ని ఎవరో లాగేసుకున్న స్థితి. మా కాళ్ల కింద నేల మాది కాకుండా పోయినట్లు అనిపించే పాత జ్ఞాపకాలు.. వీటిలో తళుక్కుమనే చందమామ జ్ఞాపకాలు. మా బాల్యం పొడవునా నిజజీవితంలోనూ, చందమామలోనూ వెంటాడుతూ వచ్చిన దెయ్యాలు, పిశాచాలు. చెరువుకట్టమీద రాత్రిపూట పోతూ పక్కన ఏదో నీడ కదిలితే దయ్యం వచ్చేసిందంటూ పారుకున్న రోజులు.
మీరు, సునీత గారూ విక్రమార్కుడు మీ కలల రాకుమారుడిగా చెప్పడం చూస్తుంటే ఆరోజు ఆడపిల్లలను విక్రమార్కుడు ఇంతగా ఆకర్షించాడా అనిపిస్తుంది. చందమామ రాజకుమారిల గురించి మీ వర్ణణ అద్భుతంగా ఉంది. వపా హృదయరాణులు వారు. అలా కాక ఇంకెలా ఉంటారు వారు..
“చందమామ మారుతోంది, కానీ ఆ మార్పు మంచి వైపుగా ఉండాలి అన్నదే నా కోరిక. నేను అనుభవించిన ఆ ఆనందం నా తర్వాతి తరం కూడా అనుభవించాలి అన్న చిన్న స్వార్ధం.” అంటూ చివర్లో చెప్పారు. మీది చిన్న స్వార్థం కాదు చాలా పెద్ద స్వార్ధమే. చందమామ రూపురేఖలనే మార్చేసే పెద్ద స్వార్దం. మీరు బాల్యంలో అనుభవించిన ఆ ఆనందం మీ తర్వాతి తరంవారు కూడా అనుభవించాలి అనే మీకోరిక తీరాలనే ఆశిస్తున్నాం. మీ కోరిక కూడా చందమామ బాల్యంలాగే మిగిలిపోతుందేమో మరి..
ఏదేమైనా మీ చందమామ జ్ఞాపకాలకు మన:పూర్వక కృతజ్ఞతలు…
సాయిలక్ష్మిగారి చందమామ జ్ఞాపకాలు పూర్తి పాఠం చదవాలంటే కింది లింకును దయచేసి తెరువండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2269
మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.
మీ చందమామ జ్ఞాపకాలను పాఠకులతో పంచుకోదలిచారా?
abhiprayam@chandamama.com కు పంపండి. మీవి లేదా మీ పిల్లల ఫోటోలు కూడా పంపండి.
చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49
చందమామలో శంకర్‌గారు అడుగుపెట్టినవేళ
చందమామ శంకర్ గారు
చరిత్రలో కొన్ని ఘటనలకు అద్భుతగుణాలు, మహిమలు ఆపాదించబడుతుండటం మనకందరికీ తెలిసిన విషయమే.. హంపీ చరిత్రలో కుందేలు రేచుకుక్కను తరిమిన ధీరగాథ చాటువులుగా ఈ నాటికీ జనం నోళ్లలో నానుతూ ఉంది. ఒక సామ్రాజ్యం కాని, ఒక చరిత్ర కాని, దీర్ఘకాలం కొనసాగినప్పుడు, ఆ కొనసాగింపు వెనుక నేపథ్యం గురించి కథలు కథలుగా చరిత్రలో వ్యాప్తిలోకి వస్తుండటం కూడా కద్దు. చరిత్రను ప్రభావితం చేసిన ఘటనలు పలురూపాలల్లో జనం మధ్య ప్రచారంలో ఉంటూ రంజింపజేస్తుంటాయి కూడా.
మరి చందమామ పత్రికతో చిత్రకారుడు శంకర్ గారి అనుబంధం మాటేమిటి? దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న చందమామ-శంకర్ సాంస్కృతిక బంధం మాటేమిటి? ఒక చిత్రకారుడు తన జీవితంలో ముప్పావు భాగాన్ని చిత్రలేఖనానికి అంకితం చేయటం ఏమిటి? అందులోనూ తెలుగువారి “సాంస్కృతిక రాయబారి” అని గుర్తింపుకు నోచుకున్న చందమామలో గత యాభైఆరేళ్లుగా నిర్విరామంగా బొమ్మలు గీసుకుంటూ పోవడం ఏమిటి?
ఇది బహుశా ఘనతవహించిన ఓ సామ్రాజ్యపు కథ కాకపోవచ్చు. లేక అరుదైన ఘటనలతో ఉక్కిరి బిక్కిరి చేసే చరిత్ర కానే కాకపోవచ్చు.. కాని చందమామ పత్రికలో శంకర్‌గారు చేరిన క్రమానికి తనదైన చరిత్ర ఉంది. యజమానుల విశ్వాసం, ఉద్యోగుల కృతజ్ఞత పరస్పరం అల్లుకున్న మానవీయబంధం ఈ చరిత్రతో పెనవేసుకునిపోయింది. అందుకే శంకర్‌గారు అద్భుత చిత్రకారుడిగా ఎదుగుతూ రావడం ఎంత వాస్తవమో… ఆ ఎదుగుదలలో అధికభాగం చందమామతోటే ముడిపడి ఉండటం కూడా అంతే వాస్తవం.
ఇది నాగిరెడ్డి గారి సంకల్పానికి, శంకర్ గారి విధేయత, కృతజ్ఞత తోడైన గొప్ప పరిణామానికి నాంది. జీవితం చివరి వరకు చందమామతోనే ఉంటానని శంకర్ గారు మొదట్లో ఎక్కడా ప్రకటించలేదు. కాని 85 ఏళ్ల ముదివయస్సులో పడ్డాక ఆయన తన జీవితంలో ఒకే ఒక కోరికను గట్టిగా కోరుకుంటున్నారు. చివరి శ్వాస వరకు చందమామతోనే ఉంటానన్నదే ఆ కోరిక.
ఇంతటి పటుతర బంధం చందమామతో ముడిపటడానికి దారితీసిన పరిస్థితులేమిటి, దానిపై వ్యక్తుల ప్రభావం ఏమిటి, దాన్నే శంకర్ గారు ఇలా గర్వంగా ప్రకటిస్తున్నారు. “నాగిరెడ్డి గారి పిలుపుతో నేను చందమామలో చేరాను. ఏ ముహూర్తంలో అడుగుపెట్టానో కానీ, 55 ఏళ్లకు పైగా దాంట్లోనే కొనసాగుతూ ఉన్నాను. ఆయన పిలిచారు. నేను వచ్చాను అంతే. ఆయన ఇవ్వాళ లేరు. అయినా నా సంకల్పం మారలేదు. చివరిదాకా చందమామలోనే కొనసాగాలనే కోరికా మారలేదు. వయసు సహకరించక ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ఇష్టమైన బొమ్మలు వేయకుండా ఉండలేను.” ఇది ఆయనకే సాధ్యమైన దృఢసంకల్పం.
చందమామ చిత్రకారుడిగా దశాబ్దాలపాటు ఆయన సృష్టించిన ఘనత, రికార్డులు మనందరికీ కొద్దో గొప్పో తెలుసు. అయితే తమిళ పత్రికలోంచి చందమామలోకి ఆయన రాక, తదనంతర పరిణామాలు గురించి ఏ కొద్దిమందికో గాని తెలిసే అవకాశం లేదు. ఈ వారం చందమామలో అడుగుపెట్టిన వేళావిశేషపు ఘనతను ఆయన ద్వారానే తెలుసుకుందాం.
ఈ కథనం పూర్తి పాఠం చూడాలంటే కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2267
ఈ కథనం మీకు నచ్చితే దయచేసి మీ అభిప్రాయం కింది చిరునామాకు పంపండి.
చిత్రలేఖనంతో పరిచయం, ప్రవేశం, ప్రావీణ్యత ఉన్న తెలుగు బ్లాగర్లు శంకర్ గారి చిత్రలేఖన రీతుల గురించి తెలుసుకోవాలంటే వారు తమ ప్రశ్నలను కూడా పై చిరునామాకు పంపితే ఆయన సమాధానాలివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆసక్తి గల పాఠకులు, శంకర్ గారి అభిమానులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అభ్యర్థిస్తున్నాము.
శ్రీ శంకర్, చిత్రా, వపా వంటి అపరూప చిత్రకారులను చందమామ కానీ, చందమామ పాఠకులు కాని ఇప్పటికీ మర్చిపోలేకున్నారు. ఎన్నటికీ మర్చిపోలేరు. చందమామను భారతీయ బాలసాహిత్యంలో, కథాసాహిత్యంలో శిఖర స్థాయిలో నిలబెట్టడానికి వీరు చేసిన కృషి అసామాన్యం. ఆన్‌సైన్ చందమామలోని చందమామ జ్ఞాపకాలు విభాగంలో శంకర్ గారిపై ఇంతవరకు 3 భాగాలు ప్రచురించాము. వాటి లింకులు కింద చూడగలరు.
చందమామ చిత్రమాంత్రికుడు
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&&stId=2203
చివరి శ్వాసవరకు చందమామ తోటే ఉంటా…
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&&stId=2211
చందమామ శంకర్ గారి జీవిత వివరాలు
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2253
విక్రమార్కుడూ… నా రాకుమారుడూ…

చందమామ రాజకుమారి
“…. నాన్న చేతిలో పుస్తకాలు, వేమన పద్యాలూ, సుమతీ శతకం కష్టంగానూ, నాకు నేను ఇష్టంగా చదవగలిగింది నాకు గుర్తున్నంత వరకూ చందమామ మాత్రమే. చందమామ అనగానే రంగురంగుల అట్ట మీద బొమ్మ, లోపల ఏ బొమ్మైనా తెలుపు నీలిరంగు, లేదా తెలుపూ, వూదా కలిసిన పింకూ, ఇలా ఉండేది.
ఐతే చక్కటి రాజకుమారి వంటి నిండా నగలతో ముఖం కనిపించే పలుచటి ముసుగు (సాలార్ జంగ్ మ్యూజియంలో రెబెక్కా లాగా) ఉద్యానవనంలో వ్యాహ్యాళికి వెళితే ఆ ఉద్యానవనంలో ఉండే చిన్న చిన్న పొదలూ వాటి నిండా సందులేకుండా పూలూ, కల్పన అనే అనుకున్నాను మొన్న మొన్న స్టాంఫార్డ్ లో స్ప్రింగ్ చివర్లో విరపూసిన అజేలియాలని చూసిందాకా. చూడగానే చిన్నప్పటి చందమామ కధల్లో రాకుమారి తోట గుర్తుకొచ్చింది.
ఎర్రటి ఎండ, మజ్జిగ, కొద్దిగా ఉప్పు కలిపిన అన్నము, నంజుకునేందుకు దోసకాయి పచ్చడి, చందమామలో చీనాదేశపు రాకుమారి కధ. కధానాయకుడు వాంగో, చాంగో అయివుంటాడు. తెలుపు రేడియం గ్రీను కలిసిన కిమోను వేసుకుని నడినెత్తిన ముడి, ముడిలో అడ్డంగా పుల్ల (ఇప్పుడైతే ఆ పుల్ల నాదగ్గరకూడా ఉన్నది. చైనా ట్రిప్ వెళ్ళొచ్చిన నా స్నేహితురాలు బహుమతిగా ఇచ్చింది) ఇలాంటి బొమ్మతో కధ చదివిందే ఓ ఇరవైసార్లు చదవడం. ఇవన్నీ అర కొర ఙ్ఞాపకాలే………”
సునీత గారూ.. మీ చందమామ జ్ఞాపకాలు పంపినందుకు మనఃపూర్వక కృతజ్ఞతలు.. మళ్లీ ఓసారి చందమామ రాజకుమారిని, ఆ అద్భుత ఉద్యానవనాలను… ముగ్ధ సుకుమార నిసర్గ సౌందర్య రేరాణులను చందమామ పాఠకుల మనోప్రపంచపు తలపుల్లోకి తెచ్చి ఉంచారు. మీ వర్ణనను తలుచుకుంటూంటేనే ఎంత ఆహ్లాదంగా ఉందో..!
పైగా పిశాచాలు, మాంత్రికులు… తెలుగు పిల్లల మానసిక ప్రపంచాన్ని వెలిగించిన అద్భుత పాత్రలు.. అరబ్బులకు అల్లాఉద్దీన్‌లా మంచిని ప్రేమించే, మంచివైపు నిలిచే పిశాచాలు, మాంత్రికులు మనకూ ఉన్నారు.. చందమామ ద్వారా. రాత్రిపూట ఇల్లు వదిలి బయటకు రావాలంటే గజగజా వణికే పల్లెటూరి పిల్లల ఊహా ప్రపంచంలోకి చందమామ పిశాచాలు మెత్తగా ప్రవేశించేవి. మంచి దొంగలాగా మంచి దయ్యాలు, మంచి పిశాచాలు… చందమామలో తప్ప మరెక్కడ చూడగలిగాం మనం..
‘భట్టి విక్రమార్క కధలు చందమామ సిగ్నేచరు.’ చక్కటి వాక్యం.. మీ బాల్యపు రాకుమారుడు విక్రమార్కుడు. చక్కటి ఎంపిక.
మీ చందమామ జ్ఞాపకాలు మరికొందరు చందమామ ప్రియులు, అభిమానులకు తమ జ్ఞాపకాలు రాసి పంపేందుకు ప్రేరణ ఇస్తాయని ఆశిస్తున్నాము..
మిమ్మల్ని ఆరునెలలు హింస పెట్టినా సరే తెలుగు నేర్చుకున్న మీ పాపాయికి చందమామ తరపున శుభాకాంక్షలు
మీ పిల్లలు చందమామను తమకు తామే చదువుకోగల శుభ ఘడియలు రావాలని మనసారా కోరుకుంటూ..
వీలైతే.. మీరున్న ప్రాంతంలో చందమామ పాఠకులు ఉన్నట్లయితే వారిని కూడా చందమామ జ్ఞాపకాలు రాసి పంపమని కోరగలరు.
చందమామ జ్ఞాపకాలు చందమామ పాఠకులు స్వంత వేదిక. వీలైనంత ఎక్కువమంది ఈ వేదికను పంచుకోవడానికి మీ వంటి వారు తలా ఓ చేయి వేస్తారని ఆశించవచ్చు కదూ…
చందమామ జ్ఞాపకాలు పంపేటప్పుడు మీ ఫోటో లేదా మీ పిల్లల ఫోటో తప్పక జతచేయగలరు. జ్ఞాపకాల హోం పేజీలో ఆ ఫోటోలను ప్రచురించగలము.
సునీత గారు పంపిన చందమామ జ్ఞాపకాలు పూర్తి పాఠం చదవాలంటే కింది లింకుపై క్లిక్ చెయ్యండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&&stId=2262
మీ స్పందనను abhiprayam@chandamama.com పంపండి.
మీ చందమామ జ్ఞాపకాలను పాఠకులతో పంచుకోదలిచారా? అయితే..
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి. మీ లేదా మీ పిల్లల ఫోటోతో సహా పంపండి.
చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49
![Chandamama Collection Edition art1[6]_400-519](http://blaagu.com/chandamamalu/files/2010/03/Chandamama-Collection-Edition-art16_400-519.jpg)







