చందమామ లైబ్రేరియన్‌కు ప్రశంసల చిరుజల్లులు

October 5th, 2009

చందమామ గ్రంధాలయ నిర్వాహకులు బాలమురుగన్ అలనాటి చందమామ చిత్రకారుల అపరూప చిత్రాలను సంరక్షించిన క్రమంపై 2వ తేదీన నేను రాసిన బ్లాగ్ పోస్టుకు తక్షణ స్పందనలు వచ్చాయి. చందమామ చిత్రాల సంరక్షణలో ఘనతర కృషి సల్పిన తన నిబద్ధతకు ఈ స్పందనలు మరింతగా జీవం పోసేలా ఉన్నాయి.

మూడు రోజుల సెలవు తర్వాత ఈ సోమవారం చందమామ ఆఫీసుకు రాగానే క్యాబ్‌లోంచి దిగుతూ తను కనిపించారు. రాగానే తనపై, తన చందమామ చిత్రాల పరిరక్షణ కృషిపై అక్టోబర్ 2న బ్లాగులో ఆర్టికల్ పోస్ట్ చేశానని, దానికి మంచి ప్రశంసలు, స్పందనలు వచ్చాయని, తన అధికారిక ఈ మెయిల్‌కు కూడా కొందరు మెయిల్స్ పంపి ఉంటారని చెప్పాను.

విషయం వినగానే చాలా సంతోషపడ్డారు. తర్వాత లైబ్రరీలో సిస్టం తెరిచి తనకు వచ్చిన అభినందనలను మెయిల్ ద్వారా చూసుకుని పంపిన వారికి కృతజ్ఞతలు తెలియ జేస్తూ వ్యక్తిగతంగా మెయిల్స్ పంపుతూ నాకు కృతజ్ఞతలు తెలియ జేశారు. ఈ సందర్భంగా ఆయన తెలియజేసిన కింది విషయాలు మనం కూడా పంచకుంటే బాగుంటుందని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

ఆఫీసుకు వచ్చిన గంట తర్వాత శంకర్ గారి పోటోల గురించి, ఆయన గురించి ఇటీవల దొరికిన అరుదైన సమాచారం గురించి అడిగేందుకు ఫోన్ చేస్తే ముందుగా థ్యాంక్స్ చెప్పారు. తన ఉద్యోగం, స్థాయి, వయసు ఇలా ఏ రకంగా చూసినా తాను చాలా చిన్నవాడినని. ఉద్యోగ విధిలో భాగంగానే ఒకింత దీక్షతో చందమామ చిత్రకారుల చిత్రాలను దొరికిన మేరకు భద్రపర్చడంపై ఇంతమంది ప్రశంసలు కురిపించడం తాను ఊహించలేకపోతున్నానని చెప్పారు.

తాను చేసిన పనికి జీవితంలో ఎన్నడైనా ప్రశంసలు వచ్చిన సందర్భం ఇదేనని, ఎన్నడూ లేనంత సంతోష క్షణాల మధ్య తానిప్పుడు గడుపుతున్నానని ఫోన్‌లో చెబుతుంటే ఇటువైపునుంచి కదిలిపోవటం నా పనయింది.

గత కొంతకాలంగా తను చేస్తున్న పని ఎంత ఘనతర చరిత్రను పొందుపర్చుకుందో గ్రహించకుండా కామ్‌గా పనిచేసుకుంటూ పోయిన బాలమురుగన్, ఆ పనివిలువను గుర్తించినవారు దేశ దేశాలనుంచి ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో ప్రశంసలు పంపుతుంటే కదిలిపోయారు.

జీవితంలో ఏదైనా పనికి ఇతరులనుంచి ప్రశంసలు పొందిన బంగారు క్షణాలు ఇవేనని ఆయన చెప్పిన నిజాయతీతో కూడిన ఆ మాటల సారం మనందరికీ అర్థమయిందిగా..

మనిషి సేవను, పనిని, దీక్షాభావాన్ని తోటివారు గుర్తించినప్పుడు కలిగే ఆనందం సాధారణమైంది కాదు. అదొక దివ్యానందం. బాలాగారు ఇవ్వాళ ఆ దివ్యానంద స్థితిలోనే ఉన్నారు. చందమామ ఆఫీసులో ఓ సామాన్యుడికి సంతోషం కలిగించిన వారందరికీ – రోహిణీ ప్రసాద్, గిరిధర్, వేణు, శివరాం ప్రసాద్ గార్లు తదితర తెలుగు చందమామ అభిమానులు, విశిష్ట బ్లాగర్లకు- పేరుపేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

మీ అభిమానం, ఆదరణ, గుర్తింపు, ప్రోత్సాహ బలం సాక్షిగా బాలా గారు రేపటినుంచి మరింత దీక్షగా తన పనిని కొనసాగిస్తారని విశ్వసించడంలో సందేహమే లేదు. ఆయనకు మరింత సంతోషం కలిగించేలా తెలుగులో బ్లాగర్లు పంపిన ప్రశంసలు, నా బ్లాగులో రాసిన కథనాన్ని రేపు తనకు చదివి వినిపిస్తాను.

 చందమామ లైబ్రేరియన్ బాలాగారి అపరూప కృషికి ప్రశంసలు అందిస్తూ చందమామ పాఠకులు, అభిమానులు, విశిష్ట బ్లాగర్లు పంపిన మెయిల్ సందేశాలను కింద చూడగలరు.

1.

Mr. Balamurugan, Your dedication is very praise-worthy. As Mr. Kutumba Rao’s son, I used to visit Chandamama office and saw Mr. Vaddadi Papayya many times. My favourite pastime was to sit and watch Mr. Chitra sketching his drwaings. Have Mr. Baburao and Armugam retired? Comment by Rohiniprasad — 10/01/2009 @ 5:58 pm

2.

ఇది నిజంగా మహా అద్భుతం. చిన్నప్పటి నుంచి చాల మందిలా నేనూ చందమామ అభిమానినే. ప్రతి నెలా చందమామ కొని, కతలు చదవక ముందే బొమ్మలన్నీ ఎన్నొ సార్లు తెగ తిరగేసేవాడ్ని. శ్రీ వపా, శంకర్, చిత్ర, రాజి బొమ్మలంటే అప్పుదూ ఇప్పుడూ ప్రాణమే. అప్పటి మేటి చిత్రకారులందరి ఒరిజినల్ చిత్రాలను సంరక్షించడం అంటే అషామాషి విషయమేంకాదు. ఈలాంటి అద్భుతాన్ని సాధించిన శ్రీ బాల మురుగన్ గారు నిజంగా అభినందనీయులు. ఆ ఒరిజినల్ చిత్రాలు త్వరలో అభిమానులు చూసే భాగ్యం వస్తుందని ఆశిస్తున్నాను.

గిరిధర్ పొట్టెపాళెం

http://giri-art.blogspot.com/ http://giridharp.tripod.com/Arts/giriInk1.html#2 Comment by గిరిధర్ పొట్టెపాళెం — 10/01/2009 @ 6:09 pm

3.

రాజు గారూ! బాలా గారి గురించీ, ఆయన తపన గురించీ చదువుతుంటే ఎంత అద్భుతంగా ఉందో! “కిందపడుతున్న పసిబిడ్డలను అమాంతం లేవనెత్తి హత్తుకునే తల్లిదండ్రుల రీతిలో ఈయన ఆ చిత్రాలను గుండెలకు హత్తుకున్నారు…” “….కాని మనకెవరికీ తెలీని రీతిలో ఆ అలనాటి అపరూప చిత్రాలను మన కోసం భద్రపర్చడానికి ఇక్కడ ఓ సామాన్యుడు మౌనంగా, నిరామయంగా, నిబద్ధంగా పనిచేసుకుంటూ పోయాడు…” ఉద్వేగ భరితంగా మీరు రాసిన తీరు ఎంత ఉత్తేజకరంగా ఉందంటే…మీకు ఎన్ని అభినందనలు తెలిపినా సరిపోదు! Comment by వేణు — 10/01/2009 @ 9:25 pm

4

రాజుగారూ, నిన్న ఏమన్నారు!! గవ్వలు ఏరుకుంటున్నారా. అవునండి గవ్వల్లాగ కనపడే ముత్యాలను ఏరుతున్నారు. తెలీనివాళ్ళకు గవ్వే, తెలిసిన మీలాంటివాళ్ళ చేతిలో పడితే ముత్యం అవుతుంది. పొగడ్తకాదుసుమా! నిఝంగా చెప్తున్నాను.

మీరు బాలమురుగన్ గారి గురించి వ్రాసింది (మెయిల్‌లో మీరు హెచ్చరించారు అద్భుతం అని) చదువుతుంటే ఆనందభాష్పాలు అలా జాలువ్రాలిపోయినాయి (నా భాషకూడ మారిందండోయ్). ఆ ఆనందం చాలాసేపు అలా నిలిచిపోయింది.

ఎప్పుడు ఎక్కడ ఒక్క పైసా జీతం ఎక్కువైతే అక్కడకు రోజు మధ్యలో కూడ ఎగిరిపొయ్యే మనుషులున్న ఈ ప్రపంచంలో, బాలుగారి వంటి వారు ఉండటం ఆశ్చర్యం, చందమామకు అదృష్టం. మరి చందమామవారు గమనించుకున్నారో లేదొ.

వెనువెంటనే, కళ్ళుకూడ తుడుచుకోకుండా(మసక మసకగా కనిపిస్తున్నాసరే) బాలాగారికి ధన్యవాదాలతో ఒక మెయిలు పంపాను. రాజుగారూ, మీరు చందమామలో ఉండే ఇటువంటి మరిన్ని ఆణిముత్యాలను వెలికి తెండి.

Comment by SIVARAMAPRASAD KAPPAGANTU — 10/01/2009 @ 10:23 pm

ఇకపోతే బాలాగారి ఈమెయిల్ ఐడీకి కూడా నేరుగా కొందరు సందేశాలు పంపారు.

Hello Bala Murugan Garu,

I am from Andhra Pradesh and living in America for the last 12 years. I came to know about you today in a Telugu blog. I was really happy to read that you have preserved many of Sri Vaddadi, Chitra, Sankar and Acharya. It is really great to know about you. I have been a big fan of these Artists since my childhood. I used to be a regular reader of Chandamama in my childhood. I love these Artists and their works. In fact I used to copy some of their drawings too.

I do drawings and paintings in my leisure time.
I still have one that I did in my childhood. This one was a mere copy of Sri Sankar’s work in Chandamama.
It is displayed here at http://giridharp.tripod.com/Arts/giriInk1.html#2

I really appreciate your efforts in preserving these valuable Art works. If you can display them to the public on the internet it would be really great.

Once again, Hats Off to your efforts.

Regards
Giri
http://giri-art.blogspot.com
http://www.giri-art.com

————

బాలాగారు తనను ప్రశంసిస్తూ మెయిల్స్ పంపిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ కింది మెయిల్ పంపారు. తెలుగుపాఠకుల, బ్లాగర్ల ప్రశంసలు పొందగలగడం ఎంతో అదృష్టకరమైనదని తను ఫీలవుతూ మెయిల్ ముగించారు చూడగలరు.

Dear Sir, Thank you very much for your kind letter dated October 02, 2009. It is extremely nice of you to congratulate me for my work;

through I feel that I have just carried out my work sincerely and to the best of my abilities. It is a real pleasure to get compliments from person like you and I consider myself extremely fortunate to receive the same.

Thanking you once again.

We will try to full fill your wish ASAP.

Regards,

Arul Bala Murugan. S Librarian Chandamama India Ltd., Ph: 044-43992828 Ext: 810 Email: arul.balamurugan@chandamama.com Visit us at:

www.chandamama.com చందమామ లైబ్రేరియన్ బాలాగారిపై చందమామ చిత్రాల అపరూప పరిరక్షకుడు పేరుతో నేను రాసిన బ్లాగు లింకును ఇక్కడ చూడగలరు.

http://blaagu.com/chandamamalu/2009/10/01/%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b0%ae%e0%b0%be%e0%b0%ae-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2-%e0%b0%85%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b1%82%e0%b0%aa-%e0%b0%b8%e0%b0%82/

RTS Perm Link

చందమామ చిత్రాల అపురూప సంరక్షకుడు

October 1st, 2009

వడ్డాది పాపయ్య గారి వీరారాధకుడు చందమామ లైబ్ర్రేరియన్ రూపంలో ఈరోజు తటస్త పడ్డారు. తన నాలుగు పదుల జీవితంలో ఏ కళలూ తెలీని ఈ సామాన్యుడు చందమామ చిత్రకారులు గీసిన వందలాది అద్భుత చిత్రాలను కాపాడటంలో, వాటికి ప్రేములు కట్టి భద్రపర్చటంలో సాటిలేని కృషి చేశారు. నిజంగా ఈరోజు సాయంత్రం నేను కనుగొన్న ఈ సత్యం నాకు నోట మాట రానీయకుండా చేసింది.

అలనాటి చిత్రకారులు చిత్రా, ఆచార్య, శంకర్, వపా గార్లు కాగితం గీసిన అద్భుత చిత్రాలను అనితర సాధ్యమైన రీతిలో కాపాడి భారీ సైజులో (48×28 cm సైజు) ఫ్రేములు కట్టించి భద్రపర్చారు. ఈయన పేరు ఎ. బాలమురుగన్. ఈ చిత్రకారులు గీసిన దాదాపు 800 ఒరిజనల్ చిత్రాలు ఈరోజు చందమామ ఆఫీసులో ప్రేములలో, సిస్టమ్‌లో భద్రంగా ఉన్నాయంటే సాటిలేని నిబద్ధతతో ఈయన చేసిన మహనీయ కృషే కారణం.

ముఖ్యంగా వడ్డాది పాపయ్య గారు గీసిన 490 మేటి చిత్రాలను ఈయన ఇంతవరకు చందమామ ఆఫీసులో భద్రపర్చారు. తన కంప్యూటర్లో ఆ చిత్రాలను చూస్తున్నప్పుడు నిజంగా నాకు మతిపోయినంతపనయింది. 800 చిత్రాలు… 60 ఏళ్ల చరిత్ర… చందమామ చిత్ర సౌందర్యానికి మళ్లీ ప్రాణంపోసిన చరిత్ర… ఒకే ఒక్కడు దీనికి కారణం..

నాలుగేళ్ల క్రితం ఈయన చందమామలో చేరినప్పుడు ఈ మేటి చిత్రాలు అన్నింటినీ అట్టపెట్టెలలో పడేసి చిత్తుకాగితాలలా చందమామ ఆఫీసులోని పై అంతస్తులో పడవేసి ఉన్నారట. పుస్తకాలను సర్దుతూ ఎందుకో సందేహం వచ్చి వీటిని పరిశీలించినప్పుడు ఇవి బయటపడ్డాయట.

నిజంగా అవి.. చందమామ పెన్నిధిని తరతరాలవరకు సంరక్షించడానికి నాంది పలికిన అపురూప క్షణాలు. పెట్టెల్లోని చిత్రాలన్నీ పేపర్ కవర్ రక్షణ లేకుండా దుమ్మూధూళీలో పడి, ఎండకు ఎండుతూ కనిపించాయట. కిందపడుతున్న పసిబిడ్డలను అమాంతం లేవనెత్తి హత్తుకునే తల్లిదండ్రుల రీతిలో ఈయన ఆ చిత్రాలను గుండెలకు హత్తుకున్నారు.

ఆ క్షణం ఓ అద్భుత కార్యక్రమానికి నాంది పలికినట్లయింది. సంవత్సరాలుగా అట్టపెట్టెల్లో ఎలాంటి సంరక్షణా లేకుండా అనాధల్లా పడిఉన్న ఆ చిత్రాలను బాలమురుగన్ -బాలా, బాలా గారూ అని పిలుస్తుంటాము- పదిలపర్చటానికి కంకణం కట్టుకున్నారు. ముందుగా ఓ పలుచటి పొరలాంటి కాగితాన్ని ఆ అన్ని చిత్రాలకు అడ్డుపొరగా పెట్టి వాటికి దుమ్మూ, ధూళీ తగులకుండా చేశారు.
తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఒరిజనల్ చిత్రాలకు రంగులద్దించి భారీసైజులో చిత్రాలను తయారుచేయించి భద్రపర్చారు. ఆ తర్వాత ఒరిజనల్ చిత్రాలను అదే క్వాలిటీతో స్కాన్ చేసి సిస్టమ్‌లో భద్రపర్చారు.

ఇందుకోసం ఆయన చందమామ యాజమాన్యం వద్ద ప్రాధేయపడ్డారు. కొంత డబ్బు అదనంగా కేటాయిస్తే ఈ అన్ని చిత్రాలను చిరకాలం ఉండేటట్లుగా కాపాడతానని నచ్చచెప్పారు. ఎట్టకేలకు చందమామ సీఈఓలలో ఒకరు దీనికి ఆమోదం తెలిపి కొంత నగదు ఈ ప్రాజెక్టుకోసం కేటాయించారు.

అంతరించిపోవలసిన చందమామ అద్భుత చిత్రాల నిసర్గ సౌందర్యం ఓ సామాన్యుడి అసమాన సంకల్ప దీక్ష కారణంగా మనకు, మన తర్వాతి తరాల వారికోసం పరిరక్షించబడి సమున్నతంగా నిలబడింది ఇవ్వాళ. మానవ ప్రమేయంతో సిద్ధించే మహా కార్యాలలో ఒకటిగా చెప్పదగిన ఈ పరమాద్భుత చర్యకు మూలకారకులు బాలమురుగన్.

ఇవ్వాళ్టిదాకా తను మాకందరికీ లైబ్రేరియన్ బాలమురుగన్. ఇప్పుడు ఈ నిజం బహిర్గతమయ్యాక మా దృష్టిలో ఆయన ఓ దివ్య తేజోమూర్తి. మా కంటే చిన్నవాడిని ఎక్కువగా పొగడకూడదు కానీ… చందమామ చరిత్రను, దాని వైభవోజ్వల చిత్ర శకాన్ని ఒంటిచేత్తో పరిరక్షించిన ఈ దొడ్డమనిషిని ఇన్నాళ్లుగా మేం కనుక్కోలేకపోయాం.

తెలుగు వారు, ముఖ్యంగా చందమామ ప్రియులు. చందమామ పాఠకులు శత సహస్ర గళాలతో నిండు నూరేళ్లు బతకాలంటూ ఆశీర్వదించవలసిన క్షణమిది. శంకర్ గారిని, తనను త్రాసులో వేసి తూచితే త్రాసు సరిసమానంగా తూగుతుందనే మా అభిప్రాయం. ఎవరి గొప్ప వారిదే కదా..

ప్రమేయరహితంగా, యాదృచ్చికంగా తను చేసిన ఈ ఘనతర కృషి గొప్పదనం గురించి తనకు బహుశా తెలియక పోవచ్చు. మరిన్ని చిత్రాలు కాపాడలేకపోయామే, తరచుగా ఆఫీసులు మార్చుతున్న చందమామ వ్యవహారాల వల్ల అరుదైన సమాచారం, చిత్రాలు, అలనాటి సంపదను పోగొట్టుకుంటున్నామే అనే బాధ.

ఇంకొంత డబ్బు కేటాయించి ఉంటే చందమామ చిత్రాలకు మరింత మేలు జరిగి ఉండేదే అని బాధపడతారీయన. ఇప్పటికీ ఈ చిత్రాల విషయంలో చేయవలసింది ఎంతో ఉంది అంటూ మథన పడతారీయన.

రేపో మాపో చందమామ కొంత కోలుకుని అమ్మకాలు పెరిగి, ఆర్థిక సౌష్టవం పొందగలిగి చందమామ చిత్రాలను పుస్తక రూపంలో ప్రచురించగలిగితే మనందరం గుర్తుపెట్టుకోవలసిన గొప్ప మనిషి బాలమురుగన్. మనదంటూ ఘనంగా చెప్పుకోదగిన ఓ మహత్తర సాంస్కృతిక సంపద మనకు ఇవ్వాళ భౌతికంగా మిగిలిందంటే, రేపో మాపో అది మనందరికీ అందే అవకాశం కూడా కలిగిందంటే దానికి కారకులు ఈయనే అని చెప్పాలి.

చందమామ చిత్రాల గురించి బ్లాగర్లుగా, పాఠకులుగా, అభిమానులుగా మనం గత కొంతకాలంగా సమాచారం పంచుకుంటూ వస్తున్నాం. కాని మనకెవరికీ తెలీని రీతిలో ఆ అలనాటి అపరూప చిత్రాలను మన కోసం భద్రపర్చడానికి ఇక్కడ ఓ సామాన్యుడు మౌనంగా, నిరామయంగా, నిబద్ధంగా పనిచేసుకుంటూ పోయాడు.

నిజం చెప్పాలంటే ఇంత ఘనతర కృషిని ఆయన చందమామ ఉద్యోగిగా చేయలేదు. చేపట్టలేదు కూడా. వడ్డాది పాపయ్యగారి మీద ప్రేమతో, వీరారాధనతో, పూజ్యభావంతో చేసుకుపోయారు. చందమామలోని ఏ ఇతర చిత్రకారుల కంటే వపా గారు తనకే సాధ్యమైన పరిశీలనా, విశ్లేషణా శక్తితో సందర్భ సహిత చిత్రాలను గీశారని, ఎవరూ ఈయనకు సాటిరారని చెబుతూ ఊగిపోతారీయన.

మిరిమిట్లు గొలిపే ప్రకాశవంతమైన చిత్రాలు గీయడంలో చిత్రాగారు, వపాగారు ఇద్దరూ సిద్ధహస్తులే అయినప్పటికీ కథకంటే పాత్రకు అనుగుణమైన చిత్రాలను గీయడంలో పపాగారి దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరంటూ పరవశించిపోతారీయన. రాముడిని అడవులకు పంపేందుకు దశరధుడితో కైక చెప్పిస్తున్న ఘటనలో కైక వెనుక స్తంభానికి విషపామును సంకేతంగా చిత్రించడం వపాగారికే చెల్లు అంటారు.

అలాగే చాణక్య కథలో చంద్రగుప్తుని చంపించడానికి ప్రయోగించబడిన విషకన్య విషయను చిత్రించినప్పుడు ఆమె చీర కొంగు నుంచి స్టష్టాస్పష్టంగా విషనాగులను చిత్రించడం వపాకే చెల్లునంటారు. ఇలా ఒకటా రెండా వపా గారి ప్రతిచిత్రానికి తనదైన భాష్యం చెప్పడంలో ఆరితేరిన నైపుణ్యం ఈయన సొత్తు. వపాగారి గురించి, ఆయన చిత్ర విశేషాల గురించి గంట సేపు మనం కూర్చుందాం అని అడిగితే సంతోషంగా ఒప్పుకున్నారు.

అంతకు మించి ఈయనకు అరుదైన చందమామ జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. చిన్నప్పుడు వీళ్ల ఇంట్లో అన్నదమ్ములు అల్లరి చిల్లరిగా తిరుగుతూ, ఆడుతూ కాళ్లూ చేతులూ విరగ్గొట్టుకుని మూలబడితే వాళ్లమ్మ టైమ్ పాస్ కోసం అని మద్రాసులో పేవ్‌మెంట్ల మీద అప్పట్లో దొరికిన చందమామలను కేజీల లెక్కన కొని తెచ్చి పడేసేదట.

దీంతో అవి చదువుతూ కాలం గడపటం. చందమామలు చదువుతూ తమ విరిగిన కాళ్లు చేతులను నయం చేసుకున్నామని తలుచుకు తలుచుకు చెబుతారు బాలమురుగన్. కాళ్లు చేతులు విరగ్గొట్టుకుని తీరిగ్గా చందమామలు చదువుకోవడం. ఆహా. ఆహాహా.. ఇలాంటి చందమామ జ్ఞాపకాలు బహుశా మనలో ఎవరికీ ఉండవని నా తిరుగులేని హామీ..

చందమామ చిత్రాల పరిరక్షణ ద్వారా జీవితాన్ని పండించుకున్న ఈ మాన్యుడికి చందమామలో పనిచేయడం అంటే వపాగారి కోసం పనిచేయడమే… జీతం తక్కువ అని తెలుసు, అది ఏమంత ఎక్కువగా పెరగదని తెలుసు. బయట తనకు అనేక అవకాశాలు ఉన్నాయని తెలుసు..  తనలో అసంతృప్తి ఎక్కడో అంతరాళాల్లో ఏర్పడుతోందని తెలుసు… అయినా ఫర్వాలేదు.. వపాగారి మీద ప్రేమతో, ఆరాధనతో, ఏకలవ్య దీక్షతో చందమామలోనే కొనసాగుతానని చెబుతున్నప్పుడు ఈయన కళ్లలో నీళ్లు మెదిలాయి. తనతో పాటు నాకు కూడా…

జీవితాంతం తనను ఓ విషయం బాధిస్తూంటుందని వాపోతారు. అదేమంటే తను వపాగారిని చూడలేకపోయారు మరి. వపా బతికి ఉన్నప్పుడే, చందమామలో పనిచేస్తున్నప్పుడే తను కూడా చందమామలో చేరి ఉంటే…. ఇంకొంత కాలం ముందే తాను పుట్టిఉంటే.. ఎంత బాగుండేది. అంటూ ఆవేదన…

ప్రపంచం నలుమూలల్లో ఉన్న మిత్రులారా, చందమామ అభిమానులారా! ఇది మాకథ.. చందమామ కథ, చందమామలో పనిచేస్తున్న మనుషుల కథ. జీతం కోసం మాత్రమే పనిచేయని వారి మనోద్వేగాల కథ. “పరోపకారి పాపన్న కథల సేకర్త ఎం. రంగారావు” అనే పేరుతో పోస్ట్ చేసిన నా బ్లాగ్ కథనానికి రవిగారు వ్యాఖ్యలో పేర్కొన్నట్లుగా… “చందమామ ఉద్యోగుల… ఉద్యోగమూ, జీవితమూ, ఆనందమూ, దుఃఖమూ అన్నీ చందమామతోనే ముడివడిపోయాయి.”

అందుకే చందమామ ఉద్యోగులందరి తరపున చేతులు జోడించి చెబుతున్నా.. చందమామ రచనలు, చిత్రాలు, రూపకల్పన విషయంలో గతంతో పోలిస్తే జరుగుతున్న.. జరుగుతున్నాయని మీరు ఫీలవుతున్న తప్పులన్నిటికీ మమ్మల్ని మన్నించండి… మేం తెలిసి తప్పులు చేయలేదు…

మేం చందమామకు పూర్వ వైభవం తేలేకపోవచ్చు. అది సాధ్యం కాదు కూడా.. ఎందుకంటే ఓ చక్రపాణి… ఓ కుటుంబరావు… ఓ చిత్రా… ఓ ఆచార్య… ఓ వపా.. ఓ శంకర్ ఈ ప్రపంచంలో ఒక్కసారే జన్మిస్తారు.. ఓ స్వర్ణయుగం… ఓ వైభవోజ్వల శకం.. ఓ చిత్ర,కథా సమ్మేళనల నిసర్గ సౌందర్యం మళ్లీ మళ్లీ పునరావృతం కాదు. మేం నాటి వైభవాన్ని తీసుకురాలేకపోవచ్చు…

కానీ పాఠకుల అభిప్రాయానికి విరుద్దంగా పోయేదేదీ మనుగడ సాధించలేదు అనే విశ్వాసంతోటే చందమామలో మంచి మార్పులు వస్తాయనే విశ్వాసం తోటే… మేం ఇక్కడ పనిచేస్తున్నాం… ఆ విశ్వాసం పట్ల మీకు నమ్మకం ఉన్నట్లయితే.. చందమామను ఆదరిచండి. బాలమురుగన్ వంటి అసామాన్యుల కృషికి కాసింత ప్రోత్సాహం ఇస్తూ వారిని అభినందించండి.. కింద పొందుపర్చిన బాలమురుగన్ గారి ఈమెయిల్ చిరునామాకు మీ స్పందనను తెలియజేయండి.. (ఇంగ్లీషులో అయితే మరీ మంచిది)

arul.balamurugan@chandamama.com

తాను తెలుగువాడే అయినా తమిళదేశంలో పెరిగిన కారణంగా తెలుగు చదవటం, రాయడం తెలియదు. తెలుగు కొద్దిగా మాట్లాడగలరు.. ఇంట్లో తల్లి తెలుగు మహిళ కాబట్టి చిన్నతనంలో కాళ్లు విరిగిన కుమారులకు చందమామలిచ్చి చదివించింది. నాటి చందమామల రుణం ఇప్పుడు బాలమురుగన్ ఈ రూపంలో తీర్చుకుంటున్నారేమో..

వీలయితే ఆయన చందమామ ఆఫీస్ ల్యాండ్ లైన్ నంబర్ 044 43992828 extn. 810 కు ఫోన్ చేసి కాసిన్ని అభినందనలు తెలియజేయండి. ఆయన అంకితభావాన్ని మనం ఇలాగే గౌరవిద్దాం. ఈ మూడురోజులూ మాకు సెలవు. కాబట్టి ఆపీసు తిరిగి సోమవారమే తెరుచుకుంటుంది.

ఓ వ్యక్తిగత పనిమీద నేను శుక్రవారం ఉదయం బెంగళూరు వెళుతున్నాను. బహుశా శివరాం ప్రసాద్ గారికి నేను అందుబాటులో ఉండవచ్చు. పునఃకలయిక వచ్చే సోమవారమే మరి.. మిత్రులారా.. అంతవరకు సెలవు….

RTS Perm Link