చందమామ : ఓ పరామర్శ
ఇది చందమామలో ‘ఆర్కైవ్‌లు’ అనే పదాన్ని తెలుగు చేయడానికి సంబంధించి ఈ మధ్యే ఓ మిత్రుడితో జరిగిన ఈమెయిల్ చర్చ. ఈ చర్చలో చందమామకు సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు రావడంతో వాటిని ఇక్కడ పొందుపర్చడమైంది. ఈ కథనంలో ముద్దక్షరాలతో ఉన్న భాగాలు మా మిత్రుడి వ్యాఖ్యలని గుర్తించాలి.
రావు గారూ,
ఆన్లైన్ చందమామలోని ఆర్కైవ్‌లు అనే పదప్రయోగంపై మీ జోడింపుకు ధన్యవాదాలు. అది కధల భాండాగారానికి ఆంగ్ల పదం. తెలుగు పదాన్ని కేటగిరీగా ఉంచాలనుకున్నా మొదట్లో స్పేస్ అందుకు అనుమతించడం లేదని ఆర్కైవ్ అనే పదాన్నే ఎంచుకోవడం జరిగింది.తర్వాత సాంకేతిక కారణాలతో అది అలాగే కొనసాగుతూ వస్తోంది. ఆర్కైవ్స్ అంటే మరీ ఇంగ్లీషులాగా ఉంటుందని ఎస్‌కు బదులు ‘లు’ తగిలించి ఆర్కైవ్‌లు అని ఉంచడమైంది. ఇది మన డుమువుల తంటా అనుకోండి.
ఈ కథల భాండాగారంలో 1947 నుంచి 90 వరకు వచ్చిన చందమామ కథలు అలాగే ఆన్లైన్ పుస్తక రూపంలో లభ్యమవుతాయి. త్వరలో 2000 సంవత్సరం వరకు కథలను దీంట్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
“నాకు తెలిసి తెలుగు బాగా బతికి బట్టకడుతున్నది బహుశా… మీ ‘చందమామ’ వంటి పత్రికల్లోనే”
“మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు… ఇక్కడే మేం ఇంకా ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని పనిచేయవలసి ఉంటుంది. అక్షర దోషం లేకుండా, తప్పులు లేకుండా, పిల్లలు, పెద్దలు ఇష్టపడే విషయాలు ఏవీ వదలకుండా, ముఖ్యంగా చందమామ పట్ల పాతతరం వారి మనోభావాలు దెబ్బతినకుండా.. పత్రికను నడపడం అంటే చాలా కష్టమే. పాత కంటెంట్ వద్దు నూతన తరాల అభిరుచులకు అనుగుణమైన చందమామ రావాలి అనే యాజమాన్యం వైఖరికి, పాత కథలే మాకు ముద్దు.. అవే వెయ్యండి అనే పాత తరం పాఠకులకు మధ్య చందమామ ప్రస్తుతం నలుగుతోంది.
సరైన సమయంలోనే దీంట్లోకి అడుగుపెట్టాననుకోండి. ఎవరివైపు మొగ్గితే ఎవరికి కోపం వస్తుందో.. ఇరు పక్షాల మధ్య బ్యాలెన్స్‌గా నడవడం నేర్చుకోవాలిప్పుడు. నిజంగా చందమామ పాఠకులు, వారి లేఖలు, పత్రికలో కొత్తదనం పేరిట జరుగుతున్న మార్పులపై అలనాటి పాఠకుల శాపనార్ధాలు ఇవన్నీ చూస్తుంటే కొత్త లోకంలో అడుగుపెట్టినట్లే ఉంది లెండి. ఏమయినా మరోవైపు భయం కూడా ఉంది.”
“ఒకటి మాత్రం నిజమండీ,. చందమామ కలెకర్స్ ఎడిషన్ కోసం కథలు అనువాదం చేయవలసి వచ్చినప్పుడు అదో కొత్త అనుభవం. ఇంగ్లీష్ ముక్క వాడకుండా ఆ మధ్యయుగాల రాజూ రాణీల కథలు తెలుగు చేయాలి. సాధ్యమా అనుకున్నాను. కానీ పుటలు నడిచే కొద్దీ సంపూర్ణ తెలుగు అనువాదం వంట బట్టిందనుకోండి. ఇలా రాయలేమేమో అని భయపడ్డాను. కాని అలా కూడా రాయవలసిన అవసరం నాకు చందమామే నేర్పిందనుకోండి.”
“చందమామ మాత్రమే కాదనుకోండి. అయితే భాష, విషయం వరకు చూస్తే మూడు నాలుగు తరాల పిల్లలు, పెద్దలపై చందమామ ప్రభావం చరిత్రలో నిలిచిపోయేలాగే ఉంది. 10 సంవత్సరాల వయసులో చందమామ చదవడం మొదలు పెట్టిన వారు ఇప్పుడు 73 సంవత్సరాల వయసులో కూడా చందమామలను ఆప్యాయంగా కొని చదువుతూ రేపటి తరం పిల్లల కోసం భద్రపరుస్తూ వస్తున్న తీరు ప్రపంచ చరిత్రలోనే ఏ పత్రిక విషయంలోనూ జరిగి ఉండదనుకుంటాను.
ఇలాంటి ఘటనలు ఒకటీ రెండూ కాదు. వందల మంది పాత తరం పిల్లలు నేటి పెద్దలు చందమామతో తమ అనుబంధాన్ని ఇప్పటికీ మర్చిపోలేకున్నారు. ఇన్ని సమస్యల మధ్య కూడా చందమామ ఇంకా బతికి ఉందంటే అది ఇలాంటి ఘనతర పాఠకుల వల్లేననిపిస్తోంది.”
“గత రెండు మూడు నెలలుగా చందమామ అభిమానులైన బ్లాగర్లతో పరిచయాలు పెంచుకుని, అభిప్రాయాలు పంచుకుని బ్లాగురూపంలో వ్యక్తిగతంగా నేను చేసిన కృషి ఫలించిందనే చెప్పాలి. చందమామ అభిమానుల ఆదరణ సాక్షిగానే నా పర్సనల్ బ్లాగు చందమామకే అధికారిక బ్లాగుగా మారింది. ఇంతకుమించిన గౌరవం ఇంకేం కావాలి.
ఇప్పుడు చందమామ బ్లాగు చందమామ అభిమానులు నిత్యం పంచుకునే వేదికగా మారింది. ప్రపంచంలో ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు చందమామ బ్లాగును దానిలోని వంద కథనాల్లో తమకు నచ్చినదాన్ని చూస్తున్నారు. తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇంతకు మించి నా బ్లాగుకు,నా జీవితానికి ఏం కావాలి?”
“మచిలీ పట్నం సమీపంలోని ఓ గ్రామీణ ప్రాంతం నుంచి వారం క్రితం ప్రభావతి అనే ఓ చందమామ చందాదారు ఉత్తరం పంపారు. మారుమూల ప్రాంతమేమో మరి.. పిన్ నంబర్ వేయలేదు. నేరుగా మాట్లాడడానికి మొబైల్, ల్యాండ్ లైన్ నంబర్లు పొందుపర్చలేదు. పైగా తమ చందా నెంబర్ కూడా వేయలేదు.వీరు రామాయణం సీరియల్ కోసమే చందమామకు చందా కట్టారట. కానీ ఈ సంవత్సరం దాదాపు నాలుగైదు నెలల చందమామలు వారికి చేరలేదట.నవంబర్ సంచిక కూడా రాలేదు.పైగా ఫిబ్రవరి నెల ఇంగ్లీష్ చందమామ అందిందట. రామాయణం సీరియల్ కోసం చందమామను తెప్పించుకుంటుంటే ఇంగ్లీష్ చందమామను ఏం చేసుకోనూ అని ఆమె బాధ.
ఆమె గతంలో చందమామలు రానప్పుడు వెంటనే ఆఫీసుకు ఉత్తరం పంపారో నాకు తెలీదు. ఆ ఉత్తరం చూసిన వెంటనే వివరాలను సంబంధిత చందమామ విభాగానికి మెయిల్ చేస్తూ వీలయితే వారు పొందకుండా పోయిన అన్ని చందమామలను వారికి ప్రత్యేక మినహాయింపు కింద పంపవలసిందిగా సూచించాను. గ్రామీణ ప్రాంతం నుంచి చందమామ తెప్పించుకుంటున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయమని ఇటువంటి వారిని చందమామ ఎన్నటికీ పోగొట్టుకోకూడదని, కారణాలేవయినా సరే.. వారికి పరిహారంగా ఆ చందమామలను త్వరలో పంపాలని సలహా ఇచ్చాను.ప్యాకింగ్ విభాగం వారు సానుకూలంగా స్పందించారనుకోండి.”
“…రావు గారూ, నాదో చిన్న కోరిక. మీ పిల్లలకు చందమామ కొనిపిస్తారా లేదా. అయితే ఎప్పుడు? దీన్ని పోటీ పత్రిక లేదా సైట్‌గా చూడవద్దండి. చందమామ మన జాతి సాంస్కృతిక సంపద. తరాలు గడిచినా అది పిల్లలను పెద్దలను ఆకట్టుకుంటూనే ఉంది. పరాయి రాష్ట్రంలో ఉన్నప్పటికీ మీ పిల్లలు కూడా చందమామ పాఠకులుగా అయితే బాగుంటుందేమో కదూ.. ఆలోచించండి..”
“మా పిల్లలకు చందమామ. ముందు వారికి నేను తెలుగు నేర్పాలి. మీ పత్రిక కోసమైనా నేర్పుతాను. అలాగైనా పరాయి రాష్ట్రంలో పరాయి భాషను నేర్చుకుంటున్న మా పిల్లలు పరాయి రాష్ట్రంవారు కాకుండా తెలుగువారుగానే ఉంటారు. మరొక విషయం ఏమిటంటే భవిష్యత్ దర్పణంలో తమిళనాడులో తెలుగుకు “తెగులు” ఏ స్థాయిలో ఉండబోతోందోనన్న ఆందోళన కూడా నాలో కలిగింది. కానీ ఏం చేద్దామండీ.”
“…తమిళనాడులో తెలుగు నేర్చుకున్న వారు ఒక రకంగా శాపగ్రస్తులే. వారిలో కష్టపడే తత్వం, ర్యాంకులు తెచ్చుకునే సామర్థ్యం ఉన్నా ఇది సరైందా, తప్పా అనే భాషా పరిజ్ఞానం లేకుండానే వారి జీవితంలో తదుపరి దశల్లోకి పోతున్నారు. ఇదే వారిని చివరివరకూ వెంటాడుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే, తమిళనాడులో అంతంతమాత్రంగానే తెలుగు పట్ల ప్రభుత్వం చూపిస్తున్న ఆదరణ మరికాస్త కరువైతే వచ్చే తరాల పిల్లల పరిస్థితి ఎలా మారుతుందో ఊహించడం కూడా సాధ్యం కాదు. పరాయిరాష్ట్రంలో తెలుగు నేర్చుకోలేని వారి దౌర్భాగ్యం ఇది. వాళ్ల చేతుల్లో లేని దానికి, వాళ్లు నేర్చుకోలేకపోయిందానికి కూడా వారే బలవుతున్నారేమో కదా..”
మీ అభిమాన పూర్వకమైన పలకరింపుకు..
హృదయపూర్వక కృతజ్ఞతలతో..
రాజు.
Filed under ఆన్లైన్ చందమామ రచనలు | Tags: ఐవిఆర్, కతలు, కథలు, చందమామ, చందమామలు, తెలుగు, పరామర్శ, పలకరింపు, బాండాగారం, భాష, రావుగారు | Comment (1)శంకర్ గారి నోట కమ్మటి తెలుగుమాట

శంకర్ గారి తెలుగు మాట
శంకర్ గారికి ఇప్పుడు ఫర్వాలేదు. రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాతే ఆయన చందమామ కార్యాలయానికి రావచ్చు. ఆపీసుకు రాకుండా ఇంట్లో నుంచే తాను పనిచేసుకునే అవకాశాన్ని, సౌలభ్యాన్ని కల్పిస్తామని చందమామ వారు ఎప్పుడో తనకు సూచించినప్పటికీ ఒంటరిగా కాకుండా మనుషుల్లో ఉంటూ పనిచేసుకోవడంపై మమకారంతో ఆయన స్వచ్చందంగా చందమామ ఆఫీసుకు వస్తున్నారు. ఆయన స్వస్థత పొందిన సందర్భంగా ఆయనలోని ఓ అరుదైన గుణాన్ని చందమామ అభిమానులతో పంచుకోవాలని ఉంది.
ఈ మూడు నెలల పరిచయ కాలంలో తనతో మాట్లాడిన ప్రతిసారీ ఆయన చక్కటి తెలుగులో మాట్లాడటం గమనించాను. మద్రాసులో ఉన్న లేదా తమిళనాడులో ఉన్న తెలుగువారు రెండు భాషల సంపర్క ప్రభావానికి గురై తెలుగు క్రియకు నుకారాంతాన్ని జోడించి వినగానే నవ్వు వచ్చేలా పదజాలాన్ని ప్రయోగించడం నాకు గత 13 ఏళ్లుగా అనుభవమే.
వాక్యం చివరలో వచ్చును, తెచ్చును, కొట్టును, పాడును, చేయును, పూడ్సును అని మద్రాసుకు మాత్రమే తెలిసిన పద ప్రయోగాలతో కూడిన వింత భాషను చదువుకున్న తెలుగువారే ఉపయోగించడం చాలా సహజంగా ఉంటోంది. అలాంటిది… తమిళుడైన శంకర్ గారు స్వచ్ఛమైన తెలుగును తియ్యగా పలుకడం చూస్తుంటే విన్నప్పుడల్లా ఆశ్చర్యమేస్తూ ఉంటుంది.
మూడు వారాల క్రితం ఈ విషయమై సందేహ నివృత్తికోసం ఆయననే నేరుగా అడిగేశాను. ఆ సందర్భంగా భాషాధ్యయన, భాషాభ్యసన చరిత్రలోనే అపూర్వమైన విషయాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. జన్మతా తమిళుడైన మీరు ఇంత స్వచ్ఛంగా తెలుగులో ఎలా మాట్లాడగలుగుతున్నారని అడిగితే ఇలా సమాధానం చెప్పాపాయన.
రాయడం, చదవడం తెలియక పోయినా తెలుగు బాగా మాట్లాడడానికి వారి తల్లి ప్రధమ కారకురాలట. ఎందుకంటే చిన్నతనంలో తల్లి బయట పనులు చేసే క్రమంలో మద్రాసులోనే అన్ని భాషలవారితో పరిచయాలు ఏర్పడ్డాయట. ఒకసారి వింటే చాలు అట్టే పట్టేసుకునేటటువంటి నిశిత గ్రాహ్య శక్తితో ఆమె ఏకకాలంలోనే అయిదారు భాషలను అలవోకగా నేర్చుకుని మాట్లాడేదట.
అప్పట్లో మద్రాసు అంటే తెలుగు నాడు అని లెక్క కాబట్టి ఈమె ఇంట్లో తెలుగు కూడా ఉపయోగించేదట. ఇది బాల్య ప్రభావం కాగా, ఆయన నోట తీయటి తెలుగు మాట రావడానికి మరో కారణం తెలుసుకుంటే గమ్మత్తుగా ఉంటుంది.
మరేంలేదు.. చందమామే శంకర్ గారికి తెలుగు భాషను నేర్పింది. అదీ చక్కటి తెలుగు భాషను మాట్లాడటం నేర్పించింది. ఎలా అంటే కథలకు బొమ్మలు వేసేటప్పుడు విషయాన్ని చిత్రకారులు తమ తమ మార్గాలలో గ్రహిస్తారు. రచయిత లేదా సంపాదకుడు కథను తన మాటల్లో వివరిస్తే దాన్ని బట్టి బొమ్మలు గీసేవారు ఒక రకం, కథను పాయింట్లుగా రాసి ఇస్తే దాన్ని చూసుకుని బొమ్మలు గీసేవారు కొందరు.
శంకర్ గారికి కథను పూర్తిగా చెప్పించుకుని తర్వాత మనసులో బొమ్మను ఊహించుకుని గీయటం అలవాటు. ఎవరో ఒకరి వద్ద తెలుగులో ముందుగా కథను పూర్తిగా చదివించుకుని వింటారీయన. తర్వాత కథకు తగిన బొమ్మ గీయటానికి పూనుకుంటారు.
ఇలా ఒకటి, రెండూ, మూడూ కాదు.. 57 ఏళ్లుగా చందమామ కథను తెలుగులో చదివించుకున్న క్రమంలో శంకర్ గారికి యాదృచ్ఛికంగా తెలుగు మాట్లాడటం వచ్చేసింది. మరి తెలుగు యాస లేకుండా ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటే ఇంకా గమ్మత్తైన విషయం చెప్పారీయన. దానికి కూడా చందమామే కారణమట.
ఎలాగంటే.. చందమామ మొదటినుంచీ ప్రాంతీయ యాసలకు దూరంగా ఉంది. ఒక్కో ప్రాంతానికే పరిమితమై ఉండే రకం జాతీయాలకు, నుడికారాలకు, వర్ణనలకు చందమామ చాలా దూరంగా ఉంది. ఒక ప్రాంతం వారికి అర్థం కాని రీతిలో ఉండే యాసను పత్రికలోకి ఎందుకు తెస్తారు అనేది చక్రపాణి గారి మార్కు వ్యాఖ్య.
దీంతో చందమామను ఆబాలగోపాలమూ, ప్రాంత భేదాలెరుగకుండా తెలుగు దేశంలోని అన్ని రీజియన్లు తమ స్వంతం చేసుకునేవి. ఈ క్రమంలోనే శంకర్ గారికి చందమామ భాష వచ్చేసింది. చిత్రరచనకోసం చందమామ కథలను దశాబ్దాలుగా చదివించుకుని వింటూ వచ్చిన శంకర్ గారు అలా చందమామ భాషకు దాసోహమైపోయారు.
“మా తెలుగు బాల్యానికి ధన్యవాదాలు” అని గత రాత్రి పంపిన టపాలో నేను రాసినట్లుగా “ఐ నెవర్ స్పీక్ తెలుగు” బాపతు గాళ్లు రాజ్యమేలుతున్న పాడు కాలమిది. తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్ది బతుకుతున్న విషకీటకాలు చెప్పే చదువుల రంధిలో తెలుగు దేశం ప్రస్తుతం కాలిపోతోంది.
ఇక్కడ… 55 సంవత్సరాలుగా చందమామ అనుబంధంతో జీవితం పండించుకుంటూ వచ్చిన కేసీ శివశంకరన్ అనే ఓ తమిళుడు.. అదే… మన శంకర్ గారు… చందమామ కథా శ్రవణం సాక్షిగా తెలుగు మాటలు నేర్చుకుని తెలుగు భాష విలువను ఆకాశమంత ఎత్తులో నిలిపారు. జీవిత ఔన్నత్యానికి, పతనానికి వార మనకు ఇక్కడ సులభంగానే బోధపడుతోంది కదా!
శంకర్ గారూ, మీకూ, మీరు వాడే ఆ చక్కటి చందమామ భాషకు శతకోటి వందనాలు..
మీ నోట జాలువారే ఆ చందమామ భాష తియ్యదనాన్ని ఆస్వాదించేందుకోసమయినా మీరు ఆరోగ్యంగా ఉంటూ, మాతో కలిసి మరి కొంతకాలం పనిచేయండి. మా చిన్ని జీవితాలకు ఇది చాలు…
Filed under ఆన్లైన్ చందమామ రచనలు | Tags: కథలు, చందమామ, చందమామభాష, తమిళుడు, తెలుగు, మద్రాసు, యాస, శంకర్, శివశంకరన్ | Comment (0)చందమామ ఓ అందాల భామ

చందమామ - అందాలభామ
మధ్యయుగాల కథల కాణాచి చందమామ అని నిన్న ఈ బ్లాగులో పోస్ట్ చేసిన కథనంపై ఎన్ కృష్ణమూర్తిగారు కవితా రూపంలో స్పందించారు. భాషాంతరీకరణ రూపంలో పంపిన ఆయన పంపిన ఈ వ్యాఖ్యను తెలుగులోకి మార్చి ఇక్కడ పోస్ట్ చేశాము.
చందమామను కథల చందమామగా, అందాలభామగా వర్ణిస్తూ ఆయన పంపిన ఈ కవితాత్మక ఆప్తవాక్యాలకు చందమామ తరపున కృతజ్ఞతలు.
చందమామ అది కథల చందమామ
చందమామ అది అందాల భామ,
చందమామను చూచి పులకించు మేను,
చందమామను చూచి ఆలోచనలు రేకెత్తు మదిలో,
చిట్టి చిట్టి మనసులో నీతిని నింపు,
చిట్టి చిట్టి బుర్రబుర్రలకు పదును పెట్టు చందమామ,
భేషు భేషు చందమామ,
భావి తరాల కోసం బ్రతకాలి చందమామ.
Filed under చందమామతో మా జ్ఞాపకాలు | Tags: అందాలభామ, ఆప్తవాక్యం, కథలచందమామ, కథలు, కవిత, కృష్ణమూర్తి, చందమామ, తెలుగు | Comment (0)ప్రతి ఇంట్లో చందమామ ఉన్న అందమైన కాలం
చిన్నప్పటి విషయాలు అందరికి అన్ని గుర్తుండవు. నా సంగతి అంతే అనుకోండి. కాని చందమామతో అనుబంధం జీవితాంతం మనసులోనుండి పోదు పోలేదు అని నేను, నాలాంటి ఎందరో చంపిల అభిప్రాయం అని ఖచ్చితంగా చెప్పగలను. స్కూలులో చెప్పిన తెలుగు పాఠాలకంటే అమ్మ ఇంట్లో చదివించిన చందమామ వల్లే నాకు తెలుగు మీద ఆసక్తి, పట్టు కలిగింది అని గర్వంగా చెప్పుకుంటాను.
పిల్లలున్న ప్రతి ఇంట్లో చందమామ ఉండి తీరాల్సిందే అనే అందమైన కాలం అది. అమ్మలు, నాన్నలు తమకోసం, తమ పిల్లల కోసం చందమామ కొనేవారు. ప్రతి నెల క్లాసు ప్రోగ్రెస్ రిపోర్ట్ కంటే ఎక్కువగా (అంతకంటే ఎక్కువగా) చందమామ కోసం ఎదురుచూపులు. అది రాగానే నాకు, తమ్ముళ్ళకు మధ్య బల ప్రదర్శన. నాదే గెలుపనుకోండి.
అప్పుడప్పుడు ఆ పుస్తకం వాళ్ళ కంటపడకుండా మొత్తం చదివేసి డ్రాయింగ్ రూం లో పెట్టేయడం. ఇక ఎవరేమన్నా చేసుకోండి నేను చదివేయడం ఐపోయింది అని ..కాని గంటలో పుస్తకం అవ్వగొట్టి నేలంతా ఎదురుచూడాలంటే మాత్రం విసుగేసేది. అమ్మ చదివే వారపత్రికలలాగా చందమామ కూడా వారానికోటి వేస్తే వీళ్ల సొమ్మేం పోతుంది. డబ్బులిచ్చే కొంటాము కదా అని పదో క్లాసు వరకు తిట్టుకున్నాను కూడా………
జ్యోతి గారూ,
పిల్లలున్న ప్రతి ఇంట్లో చందమామ ఉండి తీరాల్సిందే అనే మెరుపువాక్యంతో అదరగొట్టేశారు. వ్యక్తిగతంగా సమాచారం పంపకున్నా మీరు చందమామ జ్ఞాపకాలు స్వయంగా పంపారు. అందుకు మనఃపూర్వక కృతజ్ఞతలు.. ఆన్లైన్ చందమామతో మీ చందమామ జ్ఞాపకాల బంధం ఇలాగే కొనసాగుతుందని.. కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాము.
“పిల్లలున్న ప్రతి ఇంట్లో చందమామ ఉండి తీరాల్సిందే అనే అందమైన కాలం అది.”
చందమామ స్వర్ణయుగ చరిత్రకు ఈ వాక్యం సాక్షీభూతంగా నిలుస్తోంది కదా..
“అమ్మ చదివే వారపత్రికలలాగా చందమామ కూడా వారానికోటి వేస్తే వీళ్ల సొమ్మేం పోతుంది. డబ్బులిచ్చే కొంటాము కదా అని పదో క్లాసు వరకు తిట్టుకున్నాను కూడా.”
అమ్మా.. అమ్మమ్మా.. ఎంత పెద్ద ఆశండీ మీకు. ఇక్కడ నెలకు ఓ సంచిక తీసుకువస్తూంటేనే మా పని “అయిపోతోంది” అన్నిరకాలుగా.. ఇక వారానికోసారా…
“క్లాసు పుస్తకాలు బోర్ కొడితే పాత చందమామలు తీసి సింగిల్ పేజీ కథలు చదవడం అలవాటు.”
అన్ని కాలాలకు వర్తించే గొప్ప మాట..
“పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళ కోసం తెప్పించే చందమామలు ముందు నేనే చదివేదాన్ని.”
చందమామ బతుకుతోందంటే మీవంటి ఆరాధకుల వల్లే కాబోలు.
“పుస్తకం చేత పట్టుకుని కథలో లీనమై చదువుతుంటే ఉండే ఆనందం, తన్మయత్వం, ఆన్లైన్లో.. కంప్యూటర్లో చదివితే వస్తుందా? రాదు గాక రాదు గాక రాదు..”
చందమామను కొని భద్రపెట్టుకున్న వారికి పుస్తకం పట్టుకుని చదివే భాగ్యం ఉందనుకోండి. ఆ భాగ్యం లేనివారి మాటేమిటి? అందుకే.. ఇలాంటివారికోసమే… నాలాంటి వారికోసమే.. ఆన్లైన్ ఆర్కైవ్స్‌లో పాత చందమామల నిధి ఓ పెన్నిధిలాగా ఉపయోగపడుతోంది. అయితే రిఫరెన్స్ కోసం చందమామ కథలు వెతుక్కోవాలంటే పుస్తక రూపంలో ఉన్న సౌలభ్యం ఆన్లైన్లో ఉండదనుకోండి. చందమామ కథల మొత్తం కేటలాగ్‌ను (గత 62 సంవత్సరాల సంచికలవి) రూపొందించి పాఠకులకు అందుబాటులోకి తెస్తే బాగుంటుందేమో మరి.
జ్యోతిగారి చందమామ జ్ఞాపకాల పూర్తి పాఠం కిందిలింకులో చదవండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2244
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.
చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49
చందమామ జ్ఞాపకాలు

చందమామ జ్ఞాపకాలు : శివరాంప్రసాద్ కప్పగంతు.
శివరాం ప్రసాద్ గారూ,
మనఃపూర్వక కృతజ్ఞతలు. అడిగిన వెంటనే తీరిక చేసుకుని మరీ మీ చందమామ జ్ఞాపకాలు పంపారు. మీరు కోరినట్లు మీరు సూచించిన ఫోటోయే ఆన్లైన్ చందమామలో ప్రచురించాము. పెద్ద పెద్ద పేరాలను చిన్నవిగా చేయడం తప్పిస్తే మీరు పంపిన పూర్తి పాఠాన్ని యధాతథంగా ప్రచురించాము. నిన్ని త్రివిక్రమ్ గారు, ఇవ్వాళ మీరు… వెంటవెంటనే చందమామ జ్ఞాపకాలను పంపడం.. నిజంగా చక్కటి అనుభూతి.
‘చందమామలో బొమ్మలను ఉదహరించకపోతే, చందమామ జ్ఞాపకాలేమిటి’ చక్కటి వ్యాఖ్య. కొత్తగా వచ్చిన చంద్రబాల అలనాటి చందమామను గుర్తుకు తెస్తూ బొమ్మలతో అదరగొడుతోంది. దాంట్లో పూర్తి పేజీ రంగుల చిత్రాలను చూస్తుంటే చందమామ పోగొట్టుకున్నదేమిటో అర్థమవుతుంది. ఇప్పటికైనా చందమామ మేలుకుంటే మంచిది.
‘కొత్త చందమామను షాపువాళ్ళు వరుసగా పెట్టినప్పుడు, ఆ దుకాణానికే గొప్ప అలంకరణ చేసినట్టుగా ఉండేది’
మళ్లీ ఆరోజులు రావాలనే కోరుకుంటున్నా. మన అందరి ఆశలు, ఆకాంక్షలు, డిమాండ్లు అన్నీ ఒక్కటొక్కటిగా నెరవేరుతాయనే అనుకుంటున్నా. పాత చందమామలు దుకాణాల్లో పేర్చి ఉన్న ఫోటోలు ఒకటో రెండు దొరికితే బాగుండు. చందమామ ఆఫీసులో పేర్చి ఉన్న చందమామలను చూస్తుంటేనే మనసు తుళ్లింతలు పోతుంది. అలాంటింది పాత చందమామల ముఖచిత్రాల గురించి చెప్పపనిలేదు.
‘ఇంతటి అద్భుతమైన బొమ్మలను సేకరించి, ఒక పుస్తకం వెయ్యగలిగితే చందమామ వారు తెలుగు సాహిత్యానికి చిత్రలేఖన కళకు ఎంతగానో సేవచేసినవారిగా చరిత్రకు ఎక్కుతారు’.
ఇప్పుడు చందమామ అభిమానులు, పాఠకులు, చంపిలు పత్రికకు పంపే డిమాండ్లలో దీన్నికూడా మొదటి వరుసలో చేర్చాలి. చందమామకు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇంగ్లీషులో కలెక్టర్ ఎడిషన్ వేసి తెలుగు వారి సెంటిమెంట్లను గాయపర్చారు. కనీసం ఈ ప్రతిపాదనను అయినా చందమామ నిర్వాహకులు పరిగణనలోకి తీసుకుని చందమామ ఆస్థాన చిత్రకారుల త్రయం గీసిన చిత్రాలను ఒక పుస్తకంగా వేస్తే అది ఓ అద్భుత ఆవిష్కరణగా చరిత్రలో మిగులుతుంది.
చక్కటి రిజల్యూషన్‌తో చందమామ చిత్రాలను ప్రచురిస్తే ఎంత ఖర్చైనా వెచ్చించి తీసుకోవడానికి పాఠకులు పూనుకుంటారనే నా నమ్మకం. Chandamama Collector’s edition పుస్తకం చివర్లో Art Galleryలో చిత్రాలు ఓసారి చూడండి. అదిరిపోయేలా వేశారు. మళ్లీ మెయిన్ పుస్తకంలో వేసిన చిత్రాలు అంత కళగా లేవు. కాని అరుదైన పుస్తకంగా దీన్ని మనం కొని భద్రపర్చుకోవచ్చు.
చందమామ చిత్రాలు పుస్తక రూపంలో రావాలంటే చందమామకు అభిమానులు పంపే ఉత్తరాలు, ఈ మెయిళ్లలో దీన్నికూడా చేర్చి పంపించాలి. చందమామ ధారావాహికలు, చందమామ చిత్రాలు వంటివి తిరిగి ముద్రించబడితే ఎంతగా పాఠకుల ఆదరణ పొందుతాయో నిజంగానే నిర్వాహకులకు తెలియకపోవచ్చు కూడా. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడితే ఈరోజు కాకపోతే రేపయినా వీటి పునర్ముద్రణ విషయం ఆలోచిస్తారు.
అందుకే వీలయినంత మంది చంపిల, చందమామ అభిమానుల, పాఠకుల ఈమెయిళ్లు మనం సేకరించగలగితే ఏక కాలంలోనే నిర్దిష్ట సంఖ్యలో పాఠకులు ఓ ప్రత్యేక అంశంపై డిమాండును మరిత బలంగా పంపించడానికి అవకాశముంటుంది. అలా అది యాజమాన్యంపై తప్పకుండా ప్రభావం చూపుతుంది కూడా. ఎంతలేదన్నా సంఖ్యా బలానికి ప్రాధాన్యత ఉన్న కాలం కదా ఇది.
దీన్నే నా బ్లాగులో కూడా చందమామ అభిమానులకోసం పోస్ట్ చేస్తాను.
మరోసారి మీ చందమామ జ్ఞాపకాలకు కృతజ్ఞతలు.
మీ చందమామ జ్ఞాపకాల కోసం కింది లింకును తెరవండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2176
రాజు.
నోట్: చందమామ అభిమానులకు, చంపిలకు విజ్ఞప్తి. చందమామతో మీ బాల్య, తదుపరి జీవిత జ్ఞాపకాల గురించి రెండు పుటలకు మించని కథనం కింది లింకుకు పంపగలరు. మీ ఫోటోతో సహా పంపితే మరీ మంచిది. తెలుగు పాఠకుల చందమామ జ్ఞాపకాలకు ఆన్లైన్ చందమామ వేదిక కావాలన్న మా ఆకాంక్షను మన్నిస్తారని ఆశిస్తూ..
చందమామ జ్ఞాపకాలు పంపవలసిన లింకు
Filed under చందమామతో మా జ్ఞాపకాలు | Tags: చందమామ, చిత్ర, చిత్రలేఖనాలు, చిత్రాలు, జ్ఞాపకాలు, తెలుగు, దుర్గయ్య, నాన్న, భాష, మద్రణ, వడ్డాది పాపయ్య, శంకర్, శివరామ్ ప్రసాద్, షాపు | Comment (1)






