ఊహలకు రెక్కలు తొడిగిన అందాల చందమామ
ఇనగంటి రవిచంద్ర గారూ,
మీ చందమామ జ్ఞాపకాలు పంపిస్తూ తెలుగుభాషలోని తీయదనాన్నంతటినీ రంగరించిపోసినట్లుగా కిందివాక్యాలు రాశారు.
“మట్టి వాసన తప్ప మరో ప్రపంచం తెలియని నాకు బాహ్యప్రపంచపు ద్వారాలు తెరిచింది చందమామ.”
“చందమామలో ఉండేవి మామూలు కథలు కావు. ఊహా ప్రపంచంలోకి లాక్కుపోయే రెక్కల గుర్రాల్లాంటివి.”
“చిన్నపిల్లల మనసులు అప్పుడే పంటకు సిద్ధం చేసిన నేలలాంటివి. వాటిలో ఎలాంటి విత్తనాలు నాటితే అలాంటివి మొక్కలే మొలకెత్తుతాయి.”
“పెద్దయ్యే కొద్దీ బాహ్యప్రపంచపు వాస్తవాలతో మెదడు మొద్దుబారిపోతుందేమో గాని చిన్నపిల్లల ఊహలకు హద్దే లేదు. ఊహ ఎప్పుడూ ఆనందమే. అలాంటి ఊహలకు రెక్కలు తొడిగింది అందాల చందమామ.”
“నా వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించింది ఒకరు మా అమ్మమ్మ అయితే మరొకరు చందమామ.”
మీరు ఇంకా చిన్నవారే.. చందమామ నాలుగవ లేదా అయిదవ తరం పాఠకుల కోవకు చెంది ఉంటారనుకుంటున్నాను.అయినా చందమామ పట్ల అభిమానంలో పాత తరాలకు తీసిపోని అనురక్తి మీది.
ముఖ్యంగా “మట్టి వాసన తప్ప మరో ప్రపంచం తెలియని నాకు బాహ్యప్రపంచపు ద్వారాలు తెరిచింది చందమామ.” అనే మీ వాక్యం చదువుతుంటే గుండె పట్టేసింది నాకయితే.
చిన్నతనంలో చందమామతో మా అనుబంధపు జ్ఞాపకాల తడి తగులుతోందిప్పుడు..
మీరు చల్లగుండాలని, మీ అక్క గారి పిల్లలకు కూడా చందమామను పరిచయం చేస్తున్న మీ మమకారం చల్లగుండాలని, ఈ సాంప్రదాయం అనంతంగా ఇలా సాగిపోవాలని మేము కూడా మనసారా కోరుకుంటున్నాము.
బాల్యంలో చందమామను మీకు పరిచయం చేసిన మీ అమ్మమ్మ గారికి చందమామ పరామర్శలు తెలియజేయండి.
ఏప్రిల్ చివరలో పంపిన మీ చందమామ జ్ఞాపకాలను అనివార్య కారణాల వల్ల ఇంత ఆలస్యంగా ప్రచురిస్తున్నందుకు క్షమాపణలు.
రవిచంద్రగారి చందమామ జ్ఞాపకాలు పూర్తి పాఠంకోసం కింది లింకును తెరవండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2450
NB:
మీ చందమామ జ్ఞాపకాలను పాఠకులతో పంచుకోదలిచారా? అయితే..
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.
మీ లేదా మీ పిల్లల ఫోటోతో సహా పంపండి.
చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49
అరచేతిలో అందాల ‘చందమామ’
‘చందమామ’ జ్ఞాపకాలకు సంబంధించి ‘అమ్మఒడి’ ఆదిలక్ష్మిగారిది ఓ వినూత్న అనుభవం. చిన్నప్పుడు నాన్న చదివి వినిపిస్తే తప్ప చందమామ కథను వినలేని అశక్తత లోంచి ‘నేనే చదువు నేర్చుకుంటే పోలా’ అనే పట్టుదలతో, స్వయంకృషి తోడుగా శరవేగంగా చదువు నేర్చుకున్న అరుదైన బాల్యం తనది. ఈ తీపి జ్ఞాపకాలను ఆమె మాటల్లోనే ఇక్కడ కొద్దిగా విందాం..
“నాన్నకి చదవటం వచ్చు కాబట్టి కదా చక చకా చదివేసాడు. మొదటి సారి ఇష్టంగా చదివేసేవాడు. మళ్ళీ చదవమంటే కుదరదనే వాడు.
’అదే నాకూ చదవటం వస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు, ఎంచక్కా చదివేసుకోవచ్చు’ - అన్న భావన, అక్షర క్రమం తెలియకుండానే మనసుకి అందింది. చదవటం రాక చందమామ బొమ్మలు పదేపదే చూసుకునే కొద్దీ పసి మనస్సు లోతుల్లో అక్షరాలు నేర్చుకోవాలనే తపన పెరిగింది.
వీధిబడిలో చేర్చగానే, ఇష్టంగా మారాం చేయకుండా అక్షరాలు నేర్చేసాను. పెద్ద బాలశిక్ష చాలా కొద్దీ రోజుల్లో పూర్తి చేసాను. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేటప్పటికే నాకు కథలు చదవటం వచ్చేసింది.
ఆ విధంగా చందమామ నాకు చదవటం నేర్పింది. చదువు కోవాల్సిన అవసరం నేర్పింది. చదువు నేర్పిన గురువుని గౌరవించటమూ నేర్పింది.”
చందమామ ద్వారా చదవటం నేర్చిన, చదువు నేర్పిన గురువును గౌరవించడం నేర్చిన ఆదిలక్ష్మిగారు, ఒకప్పుడు నాన్నతో తను పొందిన అనుభవాన్ని తన పాపాయి నుంచి కూడా ఎదుర్కొన్నారట. చందమామ కథను ఒకసారి చదివి వినిపిస్తే మళ్లీ మళ్లీ వినాలి అనే కుతూహలంతో తప్పుల తడకగా చందమామ కథను చదివి నవ్వించే పాప, ఒకట్రెండుసార్లు చదివి ఇక కుదరదంటే “నేను పెద్దయ్యాక నా పాపకి నీలా చదవను ఫో అనను. ఎన్నిసార్లయినా చదివి వినిపిస్తాను తెలుసా?” అంటూ బుంగమూతి పెట్టేదట.
ఇదీ చందమామ ఘనత, చందమామతో బంధం అల్లుకున్న తరతరాల తెలుగు కుటుంబాల ఘనత. ఆదిలక్ష్మిగారు, ఆమె జీవన సహచరుడు, వారి పాపాయి దశాబ్దాలుగా నింగిలోని చందమామతో పాటు నేలమీది ‘చందమామ’తో కూడా చెలిమి కొనసాగిస్తున్నారు. నేలమీది ‘చందమామ’తో ఇటీవలి వరకు ప్రత్యక్ష సంబంధం లేని ఆదిలక్ష్మి గారు ఇటీవలే చందమామతో పరిచయంలోకి వచ్చారు.
నాన్న ద్వారా పరిచయం అయిన చందమామను కన్నకూతురికి కూడా పరిచయం చేయడమే కాదు… తాను పాఠాలు చెబుతున్న స్కూలు పిల్లలకు కూడా కథామృతాన్ని పంచిపెడుతూ, రేపటి తెలుగు తరాన్ని తయారుచేస్తున్న ఆదిలక్ష్మిగారూ… మీ చందమామ కుటుంబాన్ని చూసి చందమామ సిబ్బందిగా మేం గర్వపడుతున్నాం.
చందమామతో మీ జ్ఞాపకాలను పంచుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఆదిలక్ష్మిగారి అరచేతిలో అందాల ‘చందమామ’ జ్ఞాపకాల పూర్తి పాఠం కోసం కింది చందమామ వెబ్‌సైట్ లింకులో చూడండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2444
ఈ కథనానికి గాను మార్చిన ఫోటో ఆదిలక్ష్మిగారి అమ్మాయి గీతాప్రియది. ఈమె చిన్నవయసులోనే ‘ఆహా ఓహో’ అనే బ్లాగు నడుపుతున్నారు. http://paalameegada.blogspot.com/
ఈ బ్లాగు కూడా సహజంగా కథలకే ప్రాధాన్యత ఇస్తూండటం గమనార్హం. చూడగలరు.
చందమామ పాఠకులు తమ చందమామ జ్ఞాపకాలను కింది లింకుకు పంపగలరు.
Filed under చందమామతో మా జ్ఞాపకాలు | Tags: అగ్ని, ఆకాశం, ఆదిలక్ష్మి, ఇతిహాసాలు, ఒంటికొమ్ము, కవలలు, కొడుకులు, గజదొంగలు, గాలి, గ్రామాధికారులు, చందమామ, చింతచెట్టు, చేపలు, జానపదం, జ్ఞాపకాలు, దెయ్యాలు, నీళ్లు, పంచభూతాలు, పాత్రలు, బొమ్మలు, భూమి, మాంత్రికులు, రాక్షసులు, రాజు, వింతలోకాలు, వేట | Comments (7)చందమామ తీపి జ్ఞాపకాలు
“చందమామ నా ప్రాణనేస్తం. అమ్మ తన చిన్నప్పుడు చందమామ, తోకచుక్క, పాతాళదుర్గం, చదువుతూ పెరిగింది. నేను అక్క, అన్న, చందమామ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూసేవాళ్లం. నేను సంస్కృతం నేర్చుకోవడం మొదలు పెట్టిన తరువాత సంస్కృతంలో చందమామ చదివేదాన్ని.
పెళ్లయి అమెరికా వెళ్లిన తరవాత అక్కడికి కూడా ప్రతినెలా, నాకోసం చందమామ వచ్చేది. నా స్నేహితులు, బంధువులు కూడా అంత క్రమంగా నాకు ఉత్తరాలు రాసేవారు కాదేమో! కాని, ప్రతినెలా క్రమం తప్పకుండా అనేక కథలు, కబుర్లు పట్టుకుని నాకోసం వచ్చేది చందమామ.
నేను 2000 సంవత్సరం ఆంగ్ల చందమామ ఫోటో కేఫ్షన్‌లో బహుమతి గెలుచుకున్నాను. అంబరమంత సంబరం వేసింది నాకు. ఇందులో పాతికేళ్ల నాటి కథలు ఎంత బాగుంటాయో! తరతరాలను ప్రభావితం చేస్తోంది చందమామ. మా అమ్మవాళ్ల తరం, మా తరం, ఇప్పుడు నా కూతురు,అందరూ చందమామ అభిమానులే!
మంచి అలవాట్లు, నీతి, నిజాయితీ, స్నేహం, విశ్వాసం నేర్పుతూనే పిల్లలకు పుస్తకాలు చదవటం నేర్పుతోంది చందమామ. టీవీ, కేబుల్‌తో ఇప్పుడు జనం పుస్తకాలను చదవడం తగ్గించేశారు. చిన్నపిల్లలు చందమామ చదివితే, సద్గుణాలన్నింటితోపాటు పుస్తకాలు క్రమంగా చదవడం నేర్చుకుంటారు. ఎలాగూ ఇందులో పౌరాణికాలు, రామాయణం, భారత, భాగవతాదులు వస్తాయి కాబట్టి చిన్నప్పుడే మన సంస్కృతిని పిల్లలు నేర్చుకుంటారు.”
–శ్రీలేఖ కొచ్చెర్లకోట
(శ్రీలేఖ గారు సుప్రసిద్ధ చారిత్రక నవలా రచయిత శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారి కుమార్తె. పెళ్లయి అమెరికా వెళ్లిన తర్వాత కూడా దాదాపు పదిహేను సంవత్సరాల పాటు చందమామను తెప్పించుకుని చదివారు. ఇటీవలే స్వదేశం తిరిగొచ్చాక హైదరాబాద్‌లో జర్నలిస్టుగా పనిచే్స్తూ దాదాపు 50 పైగా పిల్లల కథలను రాశారు. ముఖ్యంగా రోజూ తమ బాబుకు పడుకునే ముందు కథ చెబుతూ నిద్రపుచ్చే అలవాటు. ఆ అలవాటునుంచే పిల్లలకు ఏ కథలు చెబితే ఆసక్తికరంగా ఉంటుందో అనుభవ పూర్వకంగా తెలుసుకున్న ఈమె అలాంటి కథలనే ఎంచుకుని రాస్తున్నట్లు చెప్పారు.
అలా ఈ వారం “Mayank and Magic seed” అనే కథ ఇంగ్లీషులో రాసి పంపారు. చదువుపై శ్రద్ధలేకుండా, మాట వినకుండా అల్లరి చిల్లరగా మెలిగే కొడుకుకు ఓ సన్యాసి ద్వారా మహిమాన్విత మామిడి విత్తనాన్ని ఇప్పించిన అమ్మ తనలో ఎలా మార్పు తీసుకువచ్చిందో చెప్పే కథ. మామిడి వనాన్ని రూపొందించడంలో సహాయం చేసి కొడుకు జీవితాన్ని మార్చిన ఇతివృత్తంతో కూడిన కథ. పేరుకు చిన్న కథే అయినా మహిమగల మామిడి విత్తనం పేరుతో పిల్లవాడిలో పరివర్తన తీసుకువచ్చిన చక్కటి కథ.
చూడగానే దీన్ని తెలుగుతో సహా ప్రాంతీయ భాషల చందమామలకు వేసుకుంటామని చెప్పడం జరిగింది. ఆమె ఇంగ్లీష్ చందమామ కోసం పంపిన కథను ఇలా హైజాక్ చేసి ప్రాంతీయ భాషలకోసం ఎంచుకున్నాము. ఆమె కోరిక మేరకు దీన్ని ఇంగ్లీష్ చందమామ పరిశీలనకు కూడా పంపిస్తామని చెప్పడమైంది. మామిడివిత్తనంలో మహత్తు మాటేమిటో గాని, సన్యాసి మాటలపై గురితో చదువుపై దృష్టి పెట్టిన మాయాంక్ రోజూ మామిడి చెట్టుకు నీళ్లు పోయడం ద్వారా పెద్ద చేసి దాని విత్తనాలను కూడా నాటి బీడుభూమిలో మామిడి చెట్ల వనాన్నే సృష్టించిన అపురూపమైన కథ ఇది.
కథ పంపినందుకు ఆమెకు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెబుతూ చందమామ జ్ఞాపకాలు కూడా రాసి పంపమని చెబితే ఆ రోజే తన జ్ఞాపకాలను రాసి పంపారు. పాతకథలను తీసివేయడం ద్వారా ఇంగ్లీష్ చందమామ క్వాలిటీ పడిపోయిందన్న బాధను కూడా నిష్కర్షగానే చెప్పారు.
శ్రీలేఖ గారూ, చందమామకు కథ, జ్ఞాపకాలు, ఫీడ్‌బ్యాక్ కూడా ఒకే రోజులోనే పంపినందుకు ధన్యవాదాలు. పిల్లలకు కథలు చెప్పడంలో చక్కటి అనుభవం సాధించిన మీరు ఇలాంటి కథలను మళ్లీ మళ్లీ చందమామకు పంపగలరని ఆశిస్తున్నాము.
మీకు మన:పూర్వక కృతజ్ఞతలు.
చందమామ
మీ చందమామ జ్ఞాపకాలను కూడా రాసి కింది లింకుకు పంపగలరు. ఈ మెయిల్ సౌకర్యం లేనివారు పోస్ట్ ద్వారా కూడా ఇంగ్లీషు లేదా తెలుగులో మీ జ్ఞాపకాలను చందమామ చెన్నయ్ చిరునామాకు పంపగలరు.
abhiprayama@chandamama.com
తెలుగు చందమామ వెబ్‌సైట్‌లో చందమామ జ్ఞాపకాలు విభాగంలో కథనాలకోసం కింది లింకులో చూడండి
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49
చందమామ జ్ఞాపకమే కాదు.. ఒక అనుభవం!
చందమామ అనగానే గుర్తుకి వచ్చేవి – వడ్డాది పాపయ్య గారు వేసిన ముఖ చిత్రాలు, సంపాదకీయం కింద కొలను, హంసలు, పైన వెన్నెల విరిసే చందమామ, ఆ చిత్రంలో వస్తూ ఉండే మార్పులూ, శంకర్ గారి పొందికైన బొమ్మలు, చిత్రా గారి చిత్ర విచిత్రాలు, చక్కని తెలుగు, నచ్చే కథలు. చందమామతో ఇంకో తోబుట్టువుతోనో, స్నేహితులతోనో పెనవేసుకుని ఉండేటటువంటి అనుబంధమూను.
చందమామతో పాటు మరిన్ని పిలల్ల పత్రికలూ ఉన్నా, భాషలో, కథల ఎంపికలో, మరీ ముఖ్యంగా బొమ్మలలో చందమామకి ఉన్న ప్రత్యేకత చందమామదే. చందమామ అభిమానులు చాలా మందికంటే విరుద్ధంగా తెలియనితనమో, పంచుకునే మనస్తత్వమో, పత్రికలను చదువుకోవడానికి అరువిచ్చి చాలా పోగొట్టుకున్నాము.
తర్వాత బంధువుల ఇంట్లో భోషాణంలాంటి పెద్ద చెక్క పెట్టె నిండా చందమామలుంటే వెళ్ళినప్పుడల్ల గబ గబా తీసుకుని చదివేదాన్ని. మమ్మల్ని కలవడానికి వస్తున్నావా, చందమామల కోసమా అని వారన్నా కూడా పట్టించుకునే దాన్ని కాదు. మరి వారు కూడా ఇంటికి పట్టుకెళ్ళనిచ్చే వారు కాదు కదా.
మా ఇంటికి చందమామ వచ్చే రోజుల్లో, చందమామ రాగానే పోటీ పడి ఎవరు ముందు చదవగలుగుతామా అని ఆత్ర పడడమూ, అందరు చందమామ అభిమానులలాగానే మాకూ పరిపాటిగా ఉండేది. మా బేరాలు ఇలా ఉండేవి.
బొమ్మలు చూసి ఇస్తాను అనో, ఒక్క పేజీ కథ ఒకటి చదివి ఇచ్చేస్తాననో, లేక పోతే చదివే వారి పక్కనే కూర్చుని వారితో పాటే చదవడమో, రక రకాలుగా ప్రయత్నాలు సాగుతుండేవి మొదటి రుచి అందుకోవాలని. అలా హడావిడిగా మొత్తం పత్రిక తిరగేసినా, అందరి వంతులూ అయిపోయాక తీరిక సమయాలలో ఎవరికి వాళ్ళం తొందర లేకుండా మళ్ళీ మళ్ళీ చదువుకునే వాళ్ళం. ఇక ఆ తర్వాత బొమ్మలు మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చూసుకునే వాళ్ళం. అలా చూసుకుంటూనే ఉండే వాళ్ళం. ఆ కథల గురించీ, బొమ్మల గురించీ చర్చించుకునే వాళ్ళం.
చందమామ పూర్తి రంగులలో వచ్చినప్పుడు బేతాళ కథల ముందు విక్రమార్కుడి బొమ్మ తిరిగి రంగులలో శంకర్ మళ్ళీ వేశారని మా అన్నయ్య చెప్తే, అప్పుడు మేము find the differences ఆట లాగా తేడాలు వెతికి పట్టుకోవటానికి తెగ ప్రయత్నించాము. అసలు నమ్మలేకపోయాము. ఇక పౌరాణికాలకు వేసే బొమ్మలన్నీ ఒక ఎత్తైతే, పేజీ నిండా వేసే బొమ్మ అలా చూస్తున్న కొద్దీ చూడాలనిపించేది. ఆ దృశ్యంలోని వివరాలు వాటంతట అవే ఒక కథ చెప్పేవి, ఆ దృశ్యంలోనే ఒక పాత్రగా ఆదృశ్యంలో పాలు పంచుకుంటున్న అనుభూతిని ఊహించుకుంటూ ఎంతోసేపు గడిపేయగలిగే దాన్ని.
ఇక మాలో చిన్న వాళ్ళకి శంకర్ గారి బొమ్మలు ఎక్కువ ఇష్టంగా అనిపించేవి. తర్వాత తర్వాత చిత్రా గారి బొమ్మలనూ అర్థం చేసుకుని ఇంకా బాగా ఆనందించగలిగాము. వడ్డాది పాపయ్య గారు వేసిన బొమ్మలైతే అసలు ఎంత చూసినా తనివి తీరేది కాదు. ఆయన వేసిన ప్రతి బొమ్మలోనూ తన సంతకమే కాకుండా సంతకంలాంటి చిన్న బొమ్మను ప్రతిసారీ ఎక్కడో ఒక చోట ఉంచుతారని మా అన్నయ్య చెపితే అప్పట్నుంచీ ఆయన బొమ్మలలో ఆ గుర్తు కోసం వెతకటం ఇంకో సరదా అయ్యింది మాకు.
ఇంకా తీరిక దొరికినప్పుడు, మరీ ముఖ్యంగా సెలవలప్పుడు, చందమామ బొమ్మలు కాపీ చేసే ప్రయత్నాలు చేసే వాళ్ళము. మా రెండో అన్నయ్య బొమ్మలు బాగా వేస్తాడని మా ఇంట్లో మా అందరి నమ్మకం. తనూ అందుకు తగ్గట్టే అసలు మేము ప్రయత్నించడానికి కూడా సాహసం చెయ్యలేని వడ్డాది పాపయ్య గారి బొమ్మలను చూసి ప్రయత్నించే వాడు. అందులో వినాయకుడి కథలు ధారావాహికంగా వస్తున్నప్పుడు గణపతి బొమ్మలను చూసి తను వేయడం గుర్తుంది.
చందమామ బొమ్మల గురించి ఎంత చెప్పినా తక్కువే. కొందరు బాలమిత్ర వంటి పత్రికలలో కూడా బాగా వేసే వారు. ఐనా చందమామ బొమ్మలు మనసును పూర్తిగా నింపేసేవి. ఇక బొమ్మల నుంచి కాస్త కథల జ్ఞాపకాల మీదికి దృష్టి మళ్ళిస్తాను. ఒక పేజీ కథల ఆకర్షణ ఏంటంటే , పైన చెప్పినట్టు బేరాలకి పనికి వచ్చేది. చాలా సార్లు అవి యుక్తికి సంబంధించినవో, హాస్యమో అయ్యుండేవి. భేతాళ కథలు లోకం, వ్యవహారం, నీతీ, సమగ్రత గురించిన విలువలకి బీజాలు తెలియకుండానే మనసులో నాటేవి. ఆలోచింప చేసేవి. అవి కాక 25 ఏళ్ళ నాటి చందమామ కథలు, చైనా జానపద కథలు, సీరియళ్ళూ వేటికవే సాటి. ఆ వైవిధ్యాన్ని మించి మరిన్ని కొత్త కథలు.
నేను చందమామలు చదివే రోజుల్లో, చివరికి శంకర్ బొమ్మలతో ఒక ధారావాహికం వచ్చేది. అలాంటి వాటిల్లో ఒక దాంట్లో తేనె పూసిన రొట్టెలు బలే నోరూరించేవి. ఇంకో దాంట్లో మేలి ముసుగు గురించి చెప్పడమూ, బొమ్మల్లో అటువంటి వస్త్రాలలోని పారదర్శకత్వం చిత్రీకరణ గుర్తుండి పోయాయి. ఇంకో ధారావాహికం, ఆర్కైవులలో వెతికి పట్టుకున్నాను. గంధర్వ చక్రవర్తి కూతురు కథ. అందులో హీరో ఆ అమ్మాయి రెక్కలను దాచేస్తాడు. ఆమె అవి తిరిగి సంపాదించడానికి చాలా ప్రయత్నిస్తుంది. మళ్ళీ చదవాలి. ఆ కథ చాలా నచ్చేది నాకు. నాకిప్పటీకీ చందమామ కథలు చిత్రించిన దృశ్యాలలోకి (బొమ్మలే కాదు, కథలూ మాటలతో చిత్రీకరించేవి), లోకాలలోకి వెళ్ళిన అనుభూతి గుర్తుకు వస్తుంది, కథలకన్నా కూడా ఎక్కువగా.
ఇంకా, పౌరాణిక ధారావాహికాల్లో వినాయకుడి కథ ఎక్కువ గుర్తుకు వస్తోంది. ఆ బొమ్మలు మళ్ళీ. ఇక ఏం చెప్పాలి. వినాయకుడి విగ్రహాల పోటీ, అందులో మట్టితో చేసిన చిన్న విగ్రహానికి బహుమతి రావడం, మేము ప్రతి సంవత్సరం మట్టి బొమ్మ తెచ్చుకుని రంగులు వేసి పూజ చేఉకోవడంలో ఉన్న ఆనందాన్ని మరింత పెంచాయి. కృష్ణుడు పాలు పితుకుతూ చంద్రుడి ప్రతిబింబాన్ని పాలలో చూడడం అందరికీ తెలిసిన కథే.
దానికి దారి తీస్తూ సాయంకాల సమయంలో వాతావరణాన్ని వర్ణించిన తీరు నిజంగా కళ్ళకి కట్టినట్లు ఉండేది. ఇప్పటికీ అప్పుడప్పుడూ అలా ఆ చిత్రం అలా మనసు కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది.
అలా గుర్తుకు వచ్చే ఎన్నో జ్ఞాపకాలను అనుభవించగలను కాని, రాయడానికి పూనుకోవడం పెద్ద సాహసమే అవుతుంది.
ఒక కథ, ‘విచిత్రపురి’ అని ఒక బాటసారికి దారి తప్పినప్పుదు ఒక విచిత్రమైన ఊళ్ళో వింత అనుభవాలు(కాలికి దెబ్బ తగిలితే కాలుని తీసి వైద్యం చేసి మళ్ళీ అతికించడం లాంటివి) కలుగుతాయి.
చివరికి తన ఊరికి వచ్చి ఆ విచిత్రమైన అనుభవాలను చెప్తే ఎవరూ నమ్మరనుకుంటాను. చెప్పాను కదా, కథ కంటే కథ మిగిల్చిన అనుభూతులు ఎక్కువగా మిగిలాయని.
ఇప్పుడు ఆ కథ గురించి రాస్తుంటే అప్పుడు అది చదువుతున్నప్పుడు కలిగిన అనుభూతే కలుగుతోంది. మాటలలో పెట్టడం చాత కావట్లేదంతే.
చందమామ ఒక జ్ఞాపకమే కాదు ఒక అనుభవం.
లలిత (తెలుగు4కిడ్స్.కామ్)
http://telugu4kids.com
(చందమామ జ్ఞాపకాలను హృద్యంగా పాఠకులతో పంచుకున్నందుకు లలితగారికి ధన్యవాదాలు. )
ఈ కథనం పూర్తి పాఠాన్ని ఆన్‌లైన్ చందమామలో కూడా చూడగలరు
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2436
మీ చందమామ జ్ఞాపకాలను కూడా కింది లింకుకు పంపగలరు.
Filed under చందమామతో మా జ్ఞాపకాలు | Tags: ఆచార్య, కథ, కుటుంబరావు, కొకు, కొలను, గంధర్వ, చందమామ, చక్రపాణి, చక్రవర్తి, చిత్రా, జ్ఞాపకాలు, దాసరి, ధారావాహికం, నాగిరెడ్డి, పాపయ్య, పూజ, పౌరాణికం, బహుమతి, బేతాళకథలు, బొమ్మలు, భోషాణం, ముద్దావిశ్వనాధం, రాజారావు, రాజీ, వపా, విగ్రహం, విచిత్రపురి, వినాయకుడు, విశ్వం, విశ్వనాథరెడ్డి., వెన్నెల, శంకర్, శక్తిదాస్, సంపాదకీయం, హంస | Comment (1)నాన్నా! చందమామ తీసుకురానా!!
(చందమామ అనుకోగానే గుర్తొచ్చేవి బొమ్మలే అంటున్నారు మేధాగారు. చందమామలో కథల కంటే కూడా బొమ్మలు చాలా బావుండేవని తన అభిప్రాయం. యువరాణి ఎంత అందంగా ఉంటుందో చూడాలంటే చందమామలోనే చూడాలంటున్నారు. కథలు కూడా ఏ వ్యక్తిత్వ వికాసానికీ తీసిపోని విజ్ఞాన గనులట. “గుణపాఠాలు నేర్చుకునే కధలు, మార్పు(పశ్చాత్తాపం) గురించిన కధలు, మంచిగా ఉండేవాళ్ల కధలు.. చిన్నప్పటి నుండి ఇలాంటివి చదవడం వల్ల, మనకి తెలియకుండానే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాం.. ఎప్పుడైనా తప్పు చేయాల్సి వచ్చినా భయమేస్తుంది, ఆ కధలోలా నాకు కూడా ఏమైనా జరుగుతుందేమో అని..” అంటున్నారు.
తరాలుగా చందమామను చదువుతూ వచ్చిన వారి మనోభావాలకు చందమామ జ్ఞాపకాలు ఓ ప్రతీక. ‘మా బామ్మ చదివింది చందమామ, మా అమ్మ చదివింది చందమామ, నేను చదివాను చందమామ..’ అంటూ గ్రైఫ్ వాటర్ ప్రకటనను గుర్తు చేయడం ద్వారా చందమామను ఇంటిల్లిపాదీ ఎలా తమ హృదయాలకు హత్తుకునేవారో తేల్చి చెప్పారు. చక్కటి చందమామ జ్ఞాపకాలు పంపిన మేధాగారికి కృతజ్ఞతాభినవందనలు. నాలోనేను పేరిట చక్కటి బ్లాగును కూడా తను నిర్వహిస్తున్నారు.
“ఇప్పటికీ బస్టాండ్‌లో బస్ కోసం నించున్నప్పుడు నాన్నగారు ‘చందమామ తీసుకురానా!’ అంటుంటారు..” బిడ్డకు చందమామను కొనిపెట్టే తండ్రి… చందమామను పిల్లలకు కొని ఇవ్వగలిగిన తెలుగు కుటుంబాలు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే పని చేస్తున్నాయనుకుంటాను. ఏమయినా మీ జన్మ ధన్యమైనది. మీ నాన్నగారికి చందమామ తరపున మనఃపూర్వక వందనాలు.
మేధాగారి చందమామ జ్ఞాపకాల పూర్తి పాఠాన్ని ఇక్కడ చదవండి.)
చందమామ – 1970/80/90 ల తరానికి పరిచయం అక్కర్లేని పత్రిక.. పిల్లల పత్రికల్లో అగ్రతాంబూలం అందిపుచ్చుకున్న పత్రిక. కేవలం పిల్లల పత్రిక అంటే, చంపిలు నా మీద దండెత్తే ప్రమాదం కూడా ఉంది..
చందమామతో పరిచయం ఎలా జరిగిందో గుర్తు లేదు కానీ, నేను చదివిన మొదటి పుస్తకం మాత్రం చందమామే!.. అదేదో గ్రైఫ్‌వాటర్ ప్రకటనలోలా, మా బామ్మ చదివింది చందమామ, మా అమ్మ చదివింది చందమామ, నేను చదివాను చందమామ..!
అప్పట్లో చందమామ వస్తుంది అంటే చకోర పక్షుల్లా ఎదురు చూసే వాళ్ళం.. మేము ఉన్న ఊర్లో ఈ పుస్తకాలు దొరికేవి కాదు, అందుకని ప్రక్క ఊరికి వెళ్ళి తీసుకు వచ్చేవారు నాన్నగారు.. ఈ రోజు వెళ్ళి తీసుకు వస్తాను అంటే, నాన్నగారు వచ్చేసరికల్లా, చదువంతా పూర్తి చేసుకుని, ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం.. అది రాగానే, నా కంటే నాకు అని గొడవలు, పోట్లాటలు..
చందమామ అనుకోగానే, గుర్తొచ్చేవి బొమ్మలు.. కధల కంటే కూడా బొమ్మలు చాలా బావుండేవి.. రాము(రాముడు మంచి బాలుడు) ఇలానే ఉంటాడేమో.. పాపం విక్రమార్కుడు ఇలా బేతాళుడిని మోసుకువెళ్ళేవాడా, అబ్బ ఆ యువరాణి ఎంత అందంగా ఉందో! గయ్యాళి గంగమ్మ ఇలానే ఉంటుందా.. బొమ్మలు అంటే ముఖచిత్రం గురించి కూడా చెప్పాలి.. ఆ నెలలో ఏమైనా పండగలు ఉంటే వాటికి తగ్గ బొమ్మలతో అందంగా ముస్తాబై ఉండేది..
కధల గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఏ వ్యక్తిత్వ వికాసానికి తీసిపోని విజ్ఞాన గనులు. విలువలు నేర్పుతూ, ఊహాశక్తిని పెంపొందిస్తూ, సమస్యల చిక్కుముడులు ఎలా విప్పదీయాలో చూపిస్తూ, క్రొత్త విషయాలు నేర్పుతూ, చరిత్రని గురించిన సంగతులు, పురాణాలు, ఇతిహాసాలు.. ఒహటేమిటి, అదీ-ఇదీ అని కాదు, లేనిది లేనే లేదు..
నీతి కధల్లోనే ఎన్నో రకాలు.. గుణపాఠాలు నేర్చుకునే కధలు, మార్పు(పశ్చాత్తాపం) గురించిన కధలు, మంచిగా ఉండేవాళ్ల కధలు – ఇలా ఎన్నో.. చిన్నప్పటి నుండి ఇలాంటివి చదవడం వల్ల, మనకి తెలియకుండానే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాం.. ఎప్పుడైనా తప్పు చేయాల్సి వచ్చినా భయమేస్తుంది, ఆ కధలోలా నాకు కూడా ఏమైనా జరుగుతుందేమో అని.. అలా పిల్లల వ్యక్తిత్వాలని తీర్చిదిద్దే పత్రిక చందమామ అంటే అతిశయోక్తి కాదేమో..
ఇక విక్రమార్కుడి కధలు అసలు సిసలు విశ్లేషణా సామర్థ్యం ఉన్న కధలు.. మరీ చిన్నప్పుడు ముగింపు చదివితే తప్ప ఇలా పరిష్కరిస్తారు అని తెలిసేది కాదు.. తరువాత తరువాత కాస్త కాస్త విశ్లేషణ చేయడం, అప్పుడప్పుడు నేను అనుకున్నట్లు లేకపోతే అమ్మతో ఎందుకు ఇలా ఉంది, ఇలా కూడా ఉండచ్చు కదా అని వాదనలు.
ఇక సీరియల్స్.. యండమూరిలు, యధ్ధనపూడిలు, డాన్ బ్రౌన్‌లు సరిపోరు అనిపిస్తుంది.. ఆ సీరియల్ కోసం మళ్ళీ నెల ఆగాలంటే అమ్మో అనిపించేది.. ముగింపు వచ్చిన సంచిక ప్రక్కన పెట్టుకుని మళ్ళీ అన్ని భాగాలు చదివితే తప్ప తృప్తిగా ఉండేది కాదు.
వీటన్నింటితో పాటు, ప్రముఖుల జీవిత చరిత్రలు చిట్టి-పొట్టి కధల రూపంలో వస్తుండేవి.. ఇక్కడ కూడా మళ్ళీ బొమ్మలదే ప్రముఖ పాత్ర..
మొదట్లో సంపాదకీయం చదివేదాన్ని కాదు కానీ, కొంచెం పెద్దయిన తరువాత అది కూడా చదవడం మొదలుపెట్టాను.. తక్కువ పదాలలో, చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా ఎలా చెప్పాలో తెలుస్తుంది!
ఇవన్నీ ఒకెత్తు, పురాణాల గురించిన కధలు ఇంకో ఎత్తు. ఇప్పుడంటే డేటాబేస్ బాగా దెబ్బతింది కానీ అప్పట్లో, పురాణాలలో ఏ కధ గురించి అడిగినా కూడా తడుముకోకుండా చెప్పగలిగి ఉండేదాన్ని.. మా తమ్ముడైతే ఒకడుగు ముందుకేసి, మా పిన్నిలని, మామయ్యలని ఎక్కడెక్కడి ప్రశ్నలో అడిగి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు.
ఇంకా ప్రకటనలు, మీకు తెలుసా అంటూ క్విజ్‍లు, బొమ్మకి వ్యాఖ్యలు.. అదో నోస్టాల్జియా..
కొసమెరుపేంటంటే, ఇప్పటికీ బస్టాండ్‌లో బస్ కోసం నించున్నప్పుడు నాన్నగారు ‘చందమామ తీసుకురానా!’ అంటుంటారు..
–మేధా
http://nalonenu.blogspot.com
మేధాగారి చందమామ జ్ఞాపకాలను చందమామ వెబ్‌సైట్‌లో కూడా కింది లింకులో చూడగలరు
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2433
మీ చందమామ జ్ఞాపకాలను కూడా రాసి కింది లింకుకు పంపగలరు.
abhiprayam@chandamama.com
చందమామ తోడుగా పెరిగి పెద్దవాడినయ్యా!

పల్లెల్లో పూర్వం లంకెబిందెలు బయటపడినట్లుగా తెలుగునేలలో ఈ నాటికీ అటకలమీదనుంచి, పాత భోషాణాల్లోంచి పాత చందమామ సంచికలు బయటపడుతున్నాయి. అదీ కూడా 1960ల నాటి అపురూపమైన చందమామలు. వార్త వింటూనే ఉన్న మతి పోతున్న స్థితి. కొందరికి భాగ్యం అనేది ఈ రూపంలో కూడా లభిస్తుండగా, మరి కొందరికి ఉన్న సంపదలు ఊడిపోతున్నాయి.
హైదరాబాద్ నివాసి, కన్సల్టెంట్ కృష్ణబాలు గారి కథ ఇది. చందమామ అంటేనే వెర్రెత్తిపోయే ఈ కథల ప్రేమికుడు తాను అపరూపంగా దాచుకున్న చందమామ బౌండ్ పుస్తకాలను మొత్తంగా తన బంధువొకరు తస్కరించేశాడని వాపోతున్నాడు. ఆరోజునుంచి తనకు ఒక పాత చందమామ కూడా కనిపించలేదట.
సాహిత్య అభిమాని శివరామ్ ప్రసాద్ గారు ఆరు నెలల క్రితం ఈయనను సులేఖ బ్లాగులో పట్టుకుని చందమామలు తిరిగి సేకరించుకునే వెసలుబాటు గురించి మెయిల్ చేసేంతవరకు ఈయనది నిరాశా ప్రపంచమే. భూమి గుండ్రంగా ఉన్నది చందాన ఆయన ఇప్పుడు పోయిన చోటే సంపదలను తిరిగి వెతుక్కుంటున్నారు.
ఈయన 2007 అక్టోబర్ 11న తన బ్లాగులో పోస్ట్ చేసిన ఆంగ్ల కథనం దీనికి మూలం.
చందమామ తోడుగా తను పుట్టి పెరుగుతూ వచ్చానని అంటూ కృష్ణ బాలు గారు చెబుతున్న ఆ చందమామ జ్ఞాపకాల దొంతరను మనమూ విందామా!
అనువాదం మూలాన్ని I grew with Chandamama! అన్న ఆన్‌లైన్ స్టోరీ నుంచి తీసుకోవటమైంది.
చందమామ తోడుగా పెరిగి పెద్దయ్యా! అనే ఈ కథనం పూర్తి పాఠాన్ని ఇక్కడ చూడండి.
చందమామ తోడుగా పెరిగి పెద్దవాడినయ్యా!
ఎంత మంచి రోజు. ఈ రోజు శుభవార్తతో నిద్రలేచా. అయితే ఇది రాజకీయ వార్త కాదు ఆధ్యాత్మిక వార్త అంతకంటే కాదు. నా జీవితాన్ని వెలిగించేటటువంటి మంచి వార్త.
చందమామ ప్రచురణల పునరుద్ధరణ వార్త. నిజంగా అచ్చెరువు గొల్పే వార్తే. చెన్నయ్ నుంచి వస్తున్న ఈ పిల్లల (నిజానికి కాదు) మాస పత్రిక 1950, 60, 70, 80ల కాలంలో దక్షిణ భారత దేశంలోని లక్షలాది కుటుంబాలపై చెరగని ముద్ర వేసింది.
చందమామ అంటే పడి చస్తాను. చందమామ తోడుగా పెరుగుతూ వచ్చాను మరి. చందమామ కథలు నన్ను ఉత్తేజపర్చి, బోధించి, మనిషిగా నిలబెట్టాయి. నన్ను సంతోషపెట్టాయి. నా ఊహా ప్రపంచంలో ఓ భాగమయ్యాయి. పిల్లల్లో సహజసిద్ధంగా ఉండే కాల్పనిక ప్రపంచపు ఊహలను ఆవి సంతృప్తి పర్చాయి. ఒక హ్యారీ పోటర్, ఓ ఎనిడ్ బ్లైటన్ కథల్లా అవి నేటి తరం పిల్లలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తుత్తున్నాయి.
చందమామ కథలు నీతి నియమాలను సర్వ సాధారణ రీతిలో బోధిస్తాయి. ప్రతి చందమామ కథలోని సారాంశం మనలో మంచి భావాలను పెంచి పోషిస్తూ వచ్చింది. చాలా వరకు ఇదంతా స్వచ్చందంగా జరుగుతూ వచ్చింది. చందమామ కథలు మా చిరు హృదయాలను తట్టిలేపాయి. అవి ఇప్పటికీ మాలో పనిచేస్తూనే ఉన్నాయి. జీవితం చివరి క్షణాల వరకు చందమామ కథలు మనలో నిండే ఉంటాయి.
పల్లె సీమల గురించిన మన అవగాహనను, జాతి మహత్తర సంస్కృతిని, నాగరికతను చందమామ కథలు మరింత ఉద్దీప్తం చేశాయి. మన ప్రాచీన మేధో సంపదను కథ రూపంలో చందమామ మనముందుకు తీసుకువచ్చింది. అదే సమయంలో చందమామ కథలు మూఢనమ్మకాలు, దురాచారాల గురించి పిల్లల మనస్సులను నిరంతరం హెచ్చరిస్తూ వచ్చాయి.
తెలుగు జాతీయాలు, పదజాలం, అక్షరదోషాలను గురించి చందమామ కథలే మనకు బోధిస్తూ వచ్చాయి. నిజం చెప్పాలంటే పాఠశాల సిలబస్ కంటే చందమామే మన మాతృభాషను ఎక్కువగా బోధిస్తూ వచ్చిందంటే అతిశయోక్తి కాదు.
పైగా, చందమామ కథల్లోని ఇతివృత్తం కాలుష్యానికి, వాదప్రతివాదాలకు, పస లేని సూక్తులకు, అన్నిటికి మించి కుహనా సిద్ధాంతాలకు చాలా దూరంగా ఉండేది.
అదే సమయంలో పిల్లల మెదళ్లకు మేతపెట్టే అద్బుత కల్పనలకు చందమామ కథలు నెలవుగా ఉండేవి.
ప్రతి చందమామ ధారావాహిక కూడా ‘ఇంకా ఉంది’ అనే పేరుతో ముగిసేది.
ఇది పిల్లల్లో ఉత్సాహాన్ని, ఆత్రుతను మరింతగా పెంచి మరుసటి నెల పత్రిక కోసం వారు ఆబగా ఎదురుచూసేలా చేసేది.
పాతాళదుర్గం, రాకాసిలోయ, దుర్గేశనందిని, నవాబు నందిని వంటి ధారావాహికలతో సరితూగగలిగే సీరియళ్లు నేటి కాలంలో కలికానికైనా కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా అవి ఆరోజుల్లో మమ్మల్ని కట్టిపడేశాయి. మర్యాద రామన్న కథలు, గుండు భీమన్న కథలు, పరోపకారి పాపన్న కథలు వంటి కథలు మాలో సద్బుద్ధులను పెంచి పోషించేవి.
వీటన్నిటికి మించి చందమామ ముద్రించే అద్భుత చిత్రాలు సంవత్సరాలుగా మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ వచ్చాయి. సాటిలేని చిత్రకారులు చిత్ర, శంకర్ నిర్విరామంగా గీస్తూ వచ్చిన చిత్రాలు, డ్రాయింగులు మమ్మల్ని అద్భుతలోకాలకు తీసుకెళ్లేవి.
ఎంతో వ్యయప్రయాసలకు లోనైప్పటికీ పలు సంవత్సరాల చందమామ బైండు కాపీలను నేను పొందగలిగాను. కాని మా బంధువు ఒకరు వాటిని మొత్తంగా తస్కరించారు. ఆనాటి నుంచి చందమామ పాత కాపీలు ఒక్కటంటే ఒక్కటి కూడా నా వద్ద లేవు.
అయినప్పటికీ నా చందమామ జ్ఞాపకాలను ఇప్పటికీ మనసులో గుర్తు చేసుకుంటూ సంతోషపడుతుంటాను. చివరకు నా బ్లాగులో ఉంచిన కొన్ని కథలు సైతం చందమామ నుంచి తీసుకున్నవే.
థ్యాంక్యూ మామా, తెలుగు చందమామ ప్రింట్ కాపీ నా చేతికి వచ్చే క్షణంకోసం నేను వేచి ఉంటున్నా…
కృష్ణ బాలు – 2007
Filed under చందమామతో మా జ్ఞాపకాలు | Tags: అక్షరదోషాలు, అటకలు, చందమామ, చందమామకథలు, జాతీయాలు, జ్ఞాపకాలు, దురాచారాలు, నాగరికత, పదజాలం, పాఠశాల, భోషాణాలు, మాతృభాష, మూఢనమ్మకాలు, మేథోసంపద, లంకెబిందెలు, సంస్కృతి, సారాంశం, హ్యారీపోటర్ | Comment (0)వంద కథనాల చందమామ బ్లాగు

చందమామ తొలిసంచిక ముఖచిత్రం
మిత్రులారా! ఇవ్వాళ్టితో నా బ్లాగులో వంద పోస్టులు చేరాయి. నాలుగు నెలల క్రితం అంటే జూలై 7న ‘చందమామ’ జ్ఞాపకాలను పదిలపర్చాలన్న చిరుకోరికతో, సదసత్సంశయంతో మొదలుపెట్టిన ‘చందమామలు’ బ్లాగు ‘చందమామ చరిత్ర’ సాక్షిగా నేటికి 130 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే ఈ పోస్టుతో కలిపి ఈ నాలుగు నెలలూ ఈ బ్లాగులో పొందుపర్చిన కథనాలు, కథలు, పరిచయాలు, జ్ఞాపకాలు సరిగ్గా వందకు చేరుకున్నాయి. ఈ నాలుగు నెలల కాలంలోనే దాదాపుగా 14 వేల హిట్లు కూడా ఈ బ్లాగు సాధించింది.
ప్రధానంగా పాఠకులు, చందమామ అభిమానులు… మీరే ఈ విజయానికి నిజమైన కారకులు. తొలి పేరాలో సదసత్సంశయం అని ఎందుకు వాడానంటే చందమామతో అనుభూతులు, జ్ఞాపకాలు, పరిచయాలు ప్రధానంగా ఈ బ్లాగులో ఉంచాలని మొదట్లో అనుకున్నప్పుడు ఓ చిన్నపాటి సందేహం కూడా కలిగింది
గతంలో ఉజ్వలంగా వెలిగిన ఈ నిరుపమాన కథల పత్రిక గురించి, దాని చరిత్ర గురించి, మరుగున పడిన చందమామ అంతర్గత విషయాల గురించి, దాంట్లో దశాబ్దాలుగా పనిచేస్తూవచ్చిన ధీమంతుల గురించి రాస్తే ఎవరు చూస్తారు, ఎవరికి చందమామ గత చరిత్రను చదవగలిగిన ఓపిక, తీరిక ఈ స్పీడ్ యుగంలో ఉందని భయపడిన మాట వాస్తవం. అందుకే మంచి పనిని కించిత్ సంశయంతోనే మొదలు పెట్టాను.
అయితే ఆగస్టు నెలలో కూడలి, జల్లెడ, హారం వంటి తెలుగు బ్లాగుల సమాహారంలో చేరిన తర్వాత ఈ బ్లాగులో కదలిక పుంజుకుంది. చందమామతోడుగా బాల్యంలో పెరిగి పెద్దయిన వారు, చందమామను మధ్యలో స్కూలు, కాలేజీ రోజుల్లో చదివి దానిపై మమకారం పెంచుకున్నవారు, ఒక ఇంటలెక్చువల్ ప్యాషన్‌తో చందమామ చరిత్రను తలపులనిండా ఉంచుకుని తమ బ్లాగుల్లో అలనాటి చందమామపై మంచి మంచి వ్యాసాలు, కథనాలు ఇప్పటికే పోస్ట్ చేసిన వారు, చేస్తున్నవారు… సామాన్యుల నుంచి మాన్యుల వరకు, ఇలా ప్రతి ఒక్కరూ.. ఈ బ్లాగును తమ స్వంతం చేసుకున్నారు.
చందమామ చరిత్రను, వ్యక్తుల పరంగా, కథల పరంగా, సంఘటనల పరంగా అక్షరబద్ధం చేస్తూ వచ్చిన ప్రతి దశలోనూ మీరంతా హితవచనాలు పలుకుతూ, విలువైన వ్యాఖ్యల ద్వారా నాలో మరింత ప్రోత్సాహాన్ని ప్రోది చేశారు. రాష్ట్రం సరిహద్దులు దాటి ప్రపంచం నలుమూలలనుంచి మీరు ఎప్పటికప్పుడు ఈ బ్లాగును చూస్తూ, వ్యాఖ్యలు రాస్తూ, వ్యక్తిగతంగా కూడా ఈమెయిల్ సందేశాలు పంపుతూ చందమామ చరిత్రను సాధ్యమైన మేరకు వెలికి తీయాలన్న నా కుతూహలాన్ని రెట్టింపు చేశారు.
నిజం చెప్పాలంటే ఒక బ్లాగర్‌కు తోటి బ్లాగర్లతో, ఒక చిన్న రచయితకు తోటి రచయితలతో, చందమామ అభిమానులతో ఏర్పడిన స్నేహం, పరిచయం, హృదయ స్పందనలు ఉద్దీప్తం చెందిన రోజులివి. సరిగ్గా 10 నెలల క్రితం ఆన్‌లైన్ చందమామలో ఉద్యోగిగా చేరిన నాకు గత నాలుగు నెలలుగా మనసుకు స్వాంతన కలిగించిన రోజులివి.
గత 30 ఏళ్లుగా చందమామ ప్రింట్ ఎడిషన్‌లో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేస్తున్న బాలుగారు, ఇదే చందమామలో 1952 నుంచి గత 57 సంవత్సరాలుగా శ్రమిస్తూ వచ్చిన చందమామ చిత్రమాంత్రికుడు శంకర్ గారు… నేను లేవనెత్తిన ప్రతి సందేహాన్ని ఓపిగ్గా వివరించడం ద్వారా చందమామ గత చరిత్ర తలుపుల వద్ద నన్ను నిలబెట్టారు.
చందమామ తీరంలో గవ్వలు ఏరుకోవడానికి ఆబగా పరుగెత్తిన నన్ను సంస్థ లోపలనుంచి ప్రోత్సహించడంలో, అడిగిన ప్రతి సమాచారాన్ని దాచుకోకుండా చెప్పడంలో వీరు అందించిన నిజమైన సహకారం జీవితకాలంలో మరువలేను. అలాగే చందమామ అమూల్యనిధిని – సర్వశ్రీ చిత్రా, ఎంటీవీ ఆచార్య, శంకర్, వడ్డాది పాపయ్య గార్లు గీసిన చిత్రాలు- పరిరక్షించిన వైనం గురించి చందమామ లైబ్రేరియన్ బాలసుబ్రహణ్యం గారు ఇచ్చిన సమాచారం కూడా మరువలేనిది.
ఈ బ్లాగు మొదలు పెట్టేటప్పుడు ఈ బ్లాగులక్ష్యం గురించి నాగురించి పరిచయంలో ఇలా రాసుకున్నాను.
“తెలుగు జాతి సాంస్కృతిక సంపద అయిన చందమామను ఈ నాటికీ తమ జ్ఞాపకాల దొంతరలలో పదిలపర్చుకుంటున్న చందమామ అభిమానుల గుండె చప్పుళ్లను ఓ చోట చేర్చి అందరికీ పంచిపెట్టాలనే చిరు కోరికే ఈ బ్లాగ్ రూపకల్పనకు మూలం.
…జీవించడం కోసం ప్రపంచం నలుమూలలకు వలసపోయిన తెలుగు వారు చందమామ పత్రికతో తమ తరాల అనుబంధాన్ని నేటికీ ఎలా కాపాడుకుంటూ వస్తున్నారో, పరస్పరం చందమామతో తమ జ్ఞాపకాలను ఎలా పంచుకుంటున్నారో తెలిపే అమూల్యమైన వ్యాసాలు, లింకులు, తదితర సమాచారం కోసం ఈ బ్లాగులో చూడవచ్చు. చందమామ చరిత్ర, చందమామ కథల సమీక్ష, పరిచయం, వ్యక్తుల పరామర్శ తదితర చందమామ సంబంధింత సమాచారాన్ని ఈ బ్లాగులో అందరూ చూడవచ్చు.”
చందమామ సంస్థ లోపలనుంచి నేను గత నాలుగు నెలలుగా సేకరించిన సమాచారం, పత్రిక చరిత్ర, అడపా దడపా అంతర్గత విషయాలు ఈ బ్లాగు పాఠకులకు, చందమామ అభిమానులకు, పెద్దలకు ఏ మేరకు సమ్మతమైనాయో, ఉపయోగపడ్డాయో నాకయితే తెలీదు కాని ప్రతి కథనంలోనూ, మీరు చేస్తూ వచ్చిన వ్యాఖ్యలు, స్పందనలు, హితోక్తులు మాత్రమే, ఇంత తక్కువ కాలంలో ఈ బ్లాగులో వంద పోస్టులు పూర్తి కావడానికి ప్రేరణగా నిలిచాయని వినమ్రంగా చెబుతున్నాను.
వ్యక్తిగతంగా నేను రూపొందించుకున్న ఈ బ్లాగు చివరకు సంస్థకే అధికారిక బ్లాగుగా మారిందంటే ఇంతకు మించిన విజయం మరొకటి ఉండదనే అనుకుంటున్నాను. ఇది నా స్వంత బ్లాగుగా ఉండకపోవచ్చు కానీ చందమామ అభిమానులందరి ఆదరణను పొందిన బ్లాగుగా మీరిచ్చిన ఈ భాగ్యాన్ని, సంతోషాన్ని, మహదానుభూతిని జీవితం చివరి వరకు మర్చిపోలేను.
చందమామ చరిత్రపై మీరు చూపుతూ వచ్చిన ఈ ఆదరణ, అభిమానం రేపోమాపో చందమామపై రాసే, రాయబోయే ప్రతి బ్లాగరుకూ అందిస్తారని, ప్రతి చందమామ చరిత్ర కథనాన్ని, మన చందమామ గత వైభవాన్ని ఇలాగే పంచుకుంటారని, పంచుకుంటూ ఉండాలని కోరుకోవడం తప్ప ఈ తరుణంలో మరేమీ చెప్పలేను.
మీ అందరికీ శతసహస్రవందనాలతో
చందమామ రాజు
చిత్రా, శంకర్, ఆచార్యలపై మరికొంత
వేణూ గారూ! చాలా పొరపాటు జరిగిపోయింది. చందమామ కలెక్టర్ ఎడిషన్‌ను తెలుగులో ప్రచురించే పనుల్లో ఉండి గత వారం రోజులపైగా అనువాదాల ఒత్తిడిలో ఉండి ఇంటర్నెట్ చాలా తక్కువగా చూడటం. మధ్యలో ఓ మూడురోజులు తప్పనిసరై తిరుపతి, కడపలకు వెళ్లవలసిరావడంతో మీ హృదయంలోంచి వచ్చిన ఈ అపరూప కథనం -”చందమామ’పై చెరగని సంతకం ‘చిత్రా’- చూడటం కుదరలేదు.
ఇవ్వాళ కూడా ఎందుకో మీ బ్లాగును రెఫర్ చేయాలనిపించి తెరిచి చూస్తే మహాద్భుత దృశ్యం ఇదిగో ఇలా కళ్లముందు సాక్షాత్కరించింది. రెండు రోజులు కూడలి, జల్లెడ, హారం కేసి చూడలేకపోయినా, చందమామ అభిమానుల బ్లాగులు తెరువలేకపోయినా ఎంత ప్రమాదం జరుగుతుందో ఇప్పటికి ఏ నాలుగోసారో, అయిదో సారో నా అనుభవంలోకి వచ్చింది. అందులో తాజాగా మీది.
అందుకే కనీసం చందమామ అభిమానులు అయినా తాము కొత్తగా ఏదైనా రాసినప్పుడు ప్రత్యేకించి చందమామ గురించి, దాని చిత్రకారుల గురించి కథనం రాసిన పక్షంలో ఆ విషయాన్ని ఊరికే పోస్ట్ చేసి ఊరుకుండటం కాకుండా మనందరి ఈమెయిళ్లు కాస్త ఒపికగా సేకరించి అందరికీ బల్క్‌మెయిల్ రూపంలో మన కొత్త లింకులను పరస్పరం పంపగలిగితే ఎంత బాగుంటుందని గతంలోనే నేను రెండు మూడు సార్లు మొత్తుకున్నాను కూడా.
ఎందుకంటే అగ్రిగేటర్ సైట్లలో మన కథనాలు ఉంచినా, తాజాగా మంచి కథనాలు పోస్ట్ చేసినా సరే్ ఒక్కోసారి కాదు చాలాసార్లు అనివార్యంగా వాటిని సకాలంలో చూడలేని ఘటనలు నా అనుభవంలో చాలా సార్లు వచ్చాయి. ఇకనైనా మనం ఇలాంటి సందర్భాల్లో స్వయంగా మన రచనల పరస్పర పంపకం చేస్తేనే బాగుంటుందని బలంగా భావిస్తున్నా..
పరిమిత వనరులతో అయినా సరే చిత్రాగారి బొమ్మల గురించి ఇంత చక్కటి కథనం ప్రచురించారు. ఇదే మీరు చందమామ ఆఫీసుకు వచ్చి చిత్రా, ఎంటీవీ ఆచార్య, శంకర్, వపా గార్ల చిత్రాలు భారీ సైజులో చూడగలిగితే మీరు, శివరాం ప్రసాద్ గారు వంటి వారు ఎంత చక్కటి ప్రేరణ పొంది ఉండేవారో మాటల్లో చెప్పలేను.
కాని ఒక్కటి మాత్రం చెప్పగలను. దాసరి సుబ్రహ్మణ్యం, చిత్రా గార్ల గురించి మీరు చేసిన కృషి చందమామ చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది. ఇదే విధమైన క్వాలిటీ రైటింగ్‌ను మీరు, శివరాం గారు, తదితరులు కొనసాగించగలరని ప్రగాఢంగా ఆశిస్తున్నాను.
దీని కొనసాగింపుగా చిత్రా, శంకర్ గార్లపై నేను పొందుపర్చిన వార్తా విశేషాల సమాచారం ఓ పెద్ద కథనంలాగా తయారవడంతో దాన్ని మీ బ్లాగులో కామెంట్ రూపంలో పెట్టడం బాగుండదనే ఉద్దేశంతో ఈ మొత్తం కథనాన్ని నా చందమామ చరిత్ర బ్లాగులో పోస్ట్ చేయాలనుకుంటున్నాను.
చిత్రా గారి అస్తమయం గురించి “చందమామ గుండె పగిలిన వేళ” అనే పేరుతో నా బ్లాగులో రెండు వారాలక్రితం కథనం రాస్తూ ఆయన జీవిత వివరాల గురించి వచ్చే టపాలో తెలుసుకుందామని రాశాను. శంకర్ గారు ఆయన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు తెలిపారు. పైగా ఆయన 40 లేదా 50 ఏళ్ల క్రితం తన ఫోటో ఆల్బమ్‌లలో దాచుకున్న అపరూప చిత్రాలను ఒక్కటొక్కటిగా మాకు అంద జేస్తున్నారు.
సరిగ్గా వారం రోజుల క్రితమే ఆయన చిత్రాగారి అపరూప చిత్రాలు కొన్ని మాకు అందించారు. అవి అంత స్పష్టంగా లేకపోవచ్చు కానీ, చిత్రలేఖనంతో జీవితం పండించుకున్న ఇద్దరు చిత్రకారుల అపరూప జ్ఞాపకాలుగా చూడగలిగితే వాటి విలువ మనకు తెలుస్తుంది. అసలు చిత్రాగారికి ఫోటోగ్రపీపై ఉన్న అవగాహనను మరింత మెరుగుపర్చిందీ, ఆయనకు ఉత్తమ నాణ్యత కలిగిన కెమెరాలను దగ్గరుండి చూపించి మరీ కొనేలా చేసీందీ శంకర్ గారేనట.
చందమామ కలెక్టర్ ఎడిషన్‌లో ఉన్న గ్రూప్ పోటోలోని ఫోటోల్లో చిత్రాగారిని తదితర ప్రముఖులను గుర్తుపట్టి శంకర్ గారు గతవారంలో వివరంగా రాసి ఇచ్చినప్పుడు నాకు ఒక్కసారిగా ఎగిరి గంతేయాలనిపిపించింది. చిత్రాగారి సమకాలికులు, చందమామ తొలి ఇన్‌ఛార్జ్ ఎడిటర్ రాజారావు గారి టీమ్ సభ్యులు ముద్దా విశ్వనాధం గారి ఫోటోలు ఇక దొరకవు అని నిశ్చయించుకున్న తరుణంలో అతి స్పష్టంగా కనిపించే ఆయన ఫోటోను శంకర్ గారు ప్రసాదించారు.
ఎంటీవీ ఆచార్య గారి ఫోటోయే ఇంకా దొరక్కుండా మిగిలిపోయింది. ఆయన వ్యక్తిగత చరిత్ర కాని, చందమామలో ఆయన పోషించిన పాత్ర కాని చెప్పేవారు కూడా కనిపించే పరిస్థితి లేదు. ఆయన తన పనులమీద పదే పదే చందమామను విడిచి బెంగళూరు వెళ్లిపోవడం, తన చిత్రాల ప్రదర్శన పట్లే మక్కువ పెట్టి రష్యా వంటి దేశాలకు కూడా వెళ్లడం, ఈ క్రమంలో చందమామలో తను గీసిన అపరూప చిత్రాల ఒరిజినల్ నమూనాలను తన వెంట తీసుకుపోయి తిరిగి ఇవ్వకుండా అట్టే పెట్టుకోవడం వంటి ఘటనలతో శంకర్ గారికి కూడా ఎంటీవీ ఆచార్య గారిపై పెద్దగా గౌరవభావం లేనట్లు కనిపిస్తోంది. కన్నడ మేధావి వర్గాలలో ఆచార్య గారి గురించి జరిగిన చర్చలు ఆన్‌లైన్‌లో అక్కడక్కడా కనిపిస్తున్నప్పటికీ తన వ్యక్తిగత వివరాలు దాదాపుగా దొరకని స్థితి.
వేణు గారూ, మీ తదుపరి ప్రాజెక్టు ఎంటీవీ ఆచార్య గారిమీదే అయితే మీ సోర్సులో మీరూ తన వ్యక్తిగత వివరాలకోసం ప్రయత్నించగలరు. అలా కాక వపాగారిపై మీరు దృష్టి పెడుతున్నట్లయితే తన గురించిన సమాచారం కొంచెం నా వద్ద కూడా ఉంది. ఈ మధ్యే 70, 80ల నాటి ఆయన ఫోటోను స్వాతి వార పత్రిక వారినుంచి సంగ్రహించాము.
చిత్రాగారి వ్యక్తిగత, ఉద్యోగ జీవితం గురించి శంకర్‌గారు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. కాని కలెక్టర్ ఎడిషన్ అనువాదాల పనిలో ఉండి గత వారం, పది రోజులుగా ఈ విషయం పక్కకు పోయింది. మీరు, ఇంతకుముందే శివరాం ప్రసాద్ గారు చిత్రాగారి చిత్రాల గురించి రాసిన సమాచారానికి ఆయన వ్యక్తిగత వివరాలు కూడా తోడయితే ఓ సమగ్ర చిత్రం వస్తుందనే నా అభి్ప్రాయం.
అలాగే శంకర్ గారి గురించి తమిళ, ఆంగ్ల పత్రికలలో ప్రచురించిన అయిదారు వ్యాసాలను కూడా ఆయన ఈ మధ్యే ఇచ్చారు. 1960లలో చందమామ సిబ్బంది సిలోన్ యాత్రకు సంబంధించిన పూర్తి ఆల్బం కూడా ఇచ్చారు. ఇంకా 1946లో స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో కోర్సు పూర్తయిన సందర్భంగా తీసుకున్న గ్రూప్ ఫోటో కూడా ఆయన ఇన్నాళ్లుగా భద్రపర్చారు. ఎన్ని అరుదైన చిత్రాలను ఆయన కాపాడుకుంటూ వచ్చారంటే ఒక్క మాటలో వర్ణించలేము.
ఈ అనువాదాల ఒత్తిడి నా అన్నిపనులనూ మింగేస్తోంది. కానివ్వండి ఆలస్యంగా అయినా సరే. వీరి వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ఖాళీని పూడ్చడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను..
కాని ఒక్కటి మాత్రం చెప్పగలను. దాసరి సుబ్రహ్మణ్యం, చిత్రా గార్ల గురించి మీరు చేసిన కృషి చందమామ చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది. ఇదే విధమైన క్వాలిటీ రైటింగ్‌ను మీరు, శివరాం గారు, తదితరులు కొనసాగించగలరని ప్రగాఢంగా ఆశిస్తున్నాను.
చందమామ కలెక్టర్స్ ఎడిషన్ -60 ఏళ్ల సందర్భంగా ప్రచురించినది-, చందమామ చిత్రకారుల చిత్రాలపై విడి విడి పుస్తకాల ప్రచురణ కు సంబంధించిన పనులు ఊపు అందుకుంటున్నాయి. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈసారి ఇవి ఖాయంగా వెలుగు చూస్తాయనిపిస్తోంది.
“చందమామ’పై చెరగని సంతకం ‘చిత్రా’ ” పేరిట వేణుగారు రాసిన కథనం ఇక్కడ చదవండి.
http://venuvu.blogspot.com/2009/10/blog-post.html
“చిత్ర – చందమామ అద్భుత చిత్రకారుడు” పేరిట శివరాం ప్రసాద్ గారు రాసిన కథనం ఇక్కడ చదవండి.
Filed under చందమామ చరిత్ర | Tags: ఆచార్య, చందమామ, చరిత్ర, చిత్రా, జ్ఞాపకాలు, వపా, వేణు, శంకర్, శివరాం | Comments (2)పండుటాకుల పాట

చందమామ 1947
ఇది 1947 జూలై చందమామ మొదటి సంచికలోని కథ. దీనిని ఆన్‌లైన్ చందమామ పాఠకులకు అందిస్తున్నాం. పచ్చనాకు ఎండుటాకును వెక్కిరిస్తే, నీకూ నాగతే అంటూ ఎండుటాకు నవ్విందనే కథ దాదాపుగా మనందరికీ తెలిసిందే..
దాన్ని మరొక రకంగా దాదాపు 62 ఏళ్ల క్రితం చందమామ తన తొలిసంచికలో ఎంత అద్భుతంగా ఈ చిన్ని కథలో వివరించిందో చూడండి.
పండుటాకుల పాట
“…..అనగా అనగా ఒక పెద్ద రావిచెట్టు. ఆచెట్టు మీద పెద్ద కొమ్మ. ఆ కొమ్మకొక చిన్ని రెమ్మ. ఆ రెమ్మకొక చిన్ని చిగురుటాకు. చిగురుటాకును గాలి చల్లగా జోకొట్టింది. సూర్యకిరణాలు వెచ్చగా మేలు కొలిపాయి. ఆనందంతో ఉబ్బిపోయింది చిగురుటాకు.
అంతలో ఒక పాట సన్నగా వినిపించింది. ఆ పాట చుట్టుపట్ల చెట్లమీదినుంచి సన్నసన్నగా వినిపించింది. ఈ పాటను పండుటాకులు విన్నాయి. అవి కూడా పాట అందుకున్నాయి. రావిచెట్టుమీది పండుటాకులన్నీ పాడసాగాయి.
చిగురుటాకు ఈ పాట విన్నది. ఈ పాట ఏమిటో దానికి అర్థం కాలేదు. పండుటాకులు రాలే వేళయింది. అని చెప్పింది పక్క ఆకు.
రాలి కిందపడటంలో ఆనందం ఉండి ఉండాలి అనుకున్నది చిగురుటాకు. రాలి కిందపడే భాగ్యం తనకు లేదే అని విచారించింది చిగురుటాకు…..”
ఈ కథ గురించిన పూర్తి పాఠం చదవాలంటే కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=92&stId=2270
మీ స్పందనను abhiprayam@chandamama.com పంపండి.
Filed under చందమామ కథలు | Tags: అడవి, కథలు, చందమామ, చిగురుటాకు, జ్ఞాపకాలు, పండుటాకు, పండుటాకులు, పచ్చనాకు, రావిచెట్టు | Comments (4)చందమామ-నా తొలి నేస్తం
“….చందమామ, ఆ పేరులోనే ఏదో మహత్తు ఉన్నట్టుంది. నెలకొకసారి నింగిలో మెరిసిపోయే చందమామ అన్నా, నిండుగా చేతుల్లో ఒదిగిపోయే చందమామ అన్నా ఇష్టపడని వారు ఎవరు? నామటుకు నాకు చందమామ అన్నా, దానిలో బుజ్జిగా ఒదిగిపోయిన కుందేలు పిల్ల అన్నా మహా ఇష్టం, ఇది నేల మీద జాబిల్లి గురించే నింగిలోని జాబిల్లి గురించి కాదు.
మాకు పుస్తక పఠనాభిలాష మా అమ్మగారి నుండి వారసత్వంగా వచ్చింది. ప్రతి నెలా మొదటి వారంలో నాన్న గారి సైకిల్ బెల్ ఎప్పుడు మోగుతుందా అని ఆత్రంగా ఎదురు చూసే వాళ్ళము నేనూ, నా అన్నయ్యలూ. నాన్న సైకిల్ దిగటంతోనే యుద్ధం మొదలు, చందమామ నేను మొదట చదవాలీ అంటే నేను మొదట చదవాలి అని.
చిన్నదాన్ని కాబట్టి ఎప్పుడూ ఓడిపోయేదాన్ని నేను, వాళ్ళిద్దరు చదివిన తర్వాత అంటే సుమారుగా వారం తర్వాత వరకూ నా చేతికి చిక్కేది కాదు చందమామ. నాకేమో కొత్త పుస్తకాన్ని అలా చేతుల్లోకి తీసుకుని అందులోంచి వచ్చే ఒకలాంటి కమ్మటి సువాసనని ఆస్వాదిస్తూ చదవాలి అని తెగ కోరిక, కానీ అది చాలా యేళ్ళ వరకూ తీరలేదు…..”
సాయిలక్ష్మిగారూ,,
మీ చందమామ జ్ఞాపకాలను పంపినందుకు హృదయపూర్వక కృతక్షతలు. సరిగ్గా మీ చిన్ననాటి అనుభవాలే మావి కూడా.. మాది కొంచెం పెద్ద కుటుంబమే మరి. నాలుగు కుటుంబాలలో పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు 15 మందికి పైగా ఉన్న బాల్యం మాది. కుటుంబానికి ఒక పత్రిక చొప్పున అప్పట్లో చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి పత్రికలను తెప్పించినా అవి మా అందరికీ సరిపోయేవి కావు. అవతలివాడికి దొరికిన చందమామ ఇతర పత్రికలు ఎప్పుడు మాకు దొరుకుతాయనే ఎదురుచూసేవాళ్లం.
చివరకు పొలాలకు నీళ్లు కట్టేందుకు రాత్రిపూట ఊరిబయటకు పోతే టార్చి లైటు వెలుతురులో వీటిని ఆబగా చదివి అవతలి వారికి ఇచ్చేయవలసినంత పోటీ ఉండేది మాలో.. ఇలా ఆంధ్ర సచిత్రవారపత్రిక, ఆంధ్రప్రభ, తర్వాత రోజుల్లో ఆంధ్రజ్యోతి, యువ, విజయ, ఇలా ఏ వార, మాస పత్రిక కనిపించినా సరే అవి మా అందరికీ ఇలాగే బట్వాడా అయ్యేవి.
ఒక్కోసారి ముఖచిత్రం గాని ఆకర్షించిందంటే పోటీలు మీద పోటీలు. నువ్వు చదివిన తర్వాత నాకివ్వు అంటే నాకివ్వు అని.. వ్యవసాయ జీవితమూ, చందమామతో సహా కథల పత్రికల అధ్యయనమూ రెండూ కలిసిపోయిన బాల్యం మాది. పొలాల్లో ఎనుములు -గేదెలు- మేపుకుంటూ భారతం, రామాయణం, ఎమెస్కో పుస్తకాలు, చివరకు శ్రీశ్రీ మహాప్రస్థాన గేయాలు కూడా బాల్యంలో ముఖ్యంగా 6,7,8 తరగతుల్లో చదువుకున్నాం, పాడుకున్నాం అంటే నమ్ముతారా..!
ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, తర్వాత ఈనాడు… దినపత్రికలను కూడా ఇలాగే వంతులు వేసుకుని మరీ చదువుకున్నాం మేం. అందరూ అన్నీ కొనే స్తోమత లేకపోవడమే దీనికి కారణం. పంచాయతీ సహకారంతో ఊర్లో లైబ్రరీ పెట్టించుకుని అన్ని పత్రికలను తెప్పించుకోవాలనేది మా ఊరిలో చదువుకున్నవారి కల. అది గత నలభైఏళ్లుగా కలగానే సాగుతోంది. లైబ్రరీలకు బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోయిన ప్రస్తుత కాలంలో ఇక ఇలాంటివి ఎప్పటికీ కలలే..
దానికి తోడు ఊర్లలో ప్యూడల్ అహాలు, అహంకారాలు, భేషజాలు కూడా తక్కువేం కాదు. ఏ మంచి పనిని కూడా చిట్టచివరి క్షణంలో నిలువునా పాతేసే రకం అహంకారాలు. సంవత్సరం క్రితం ఊరినుంచి వలసపోయిన వారు తలా ఇంతని వేసుకుని చుట్టుపక్కల గ్రామాలకు ఉపయోగపడేలా మెడికల్ క్యాంపును పెట్టాలని పథకం వేసుకుని కూడా చివరి క్షణంలో ఎవరు గొప్ప అనే గ్రామీణ అహాలు, రాజకీయాల బారిన పడి ఎవరిదారిన వారు పోయిన చరిత్ర మా ఊరిది.
మరి అభివృద్ధి జరుగలేదా అంటే చాలానే జరుగుతోంది. తారురోడ్లు, బోర్లు, కొత్త కొత్త సేద్యాలు.. వాహనాలు, విలాసాలు వీటికి తక్కువేం లేదు. కానీ.. ఎక్కడో ఏదో లోపం… అర్థమయ్యీ ఆర్థం కాని లోపం… గత ఆదివారం శివరాం గారు చూపించిన మానెక్‌షా ఉపన్యాసం ఈ విషయాన్నే చక్కగా చెప్పింది. దేశంలో అందరూ నాయకులే, కాని తప్పులకు బాధ్యతలు వహించని నాయకులు, బాధ్యతను మోయడానికి ముందుకురాని నాయకులు.. ఇలాంటి నేపథ్యంలో నువ్వెంత అంటే నువ్వెంత రకం భావాలు రాజ్యమేలవా మరి..!
అయినా చదువుకున్నాం. బురదమళ్లలో దిగి సేద్యం చేసిన జీవితం నుంచి పట్టణాల్లో ఉద్యోగ జీవితం వరకు పయనించివచ్చాం. కానీ మా బంగారు బాల్యాన్ని ఎవరో లాగేసుకున్న స్థితి. మా కాళ్ల కింద నేల మాది కాకుండా పోయినట్లు అనిపించే పాత జ్ఞాపకాలు.. వీటిలో తళుక్కుమనే చందమామ జ్ఞాపకాలు. మా బాల్యం పొడవునా నిజజీవితంలోనూ, చందమామలోనూ వెంటాడుతూ వచ్చిన దెయ్యాలు, పిశాచాలు. చెరువుకట్టమీద రాత్రిపూట పోతూ పక్కన ఏదో నీడ కదిలితే దయ్యం వచ్చేసిందంటూ పారుకున్న రోజులు.
మీరు, సునీత గారూ విక్రమార్కుడు మీ కలల రాకుమారుడిగా చెప్పడం చూస్తుంటే ఆరోజు ఆడపిల్లలను విక్రమార్కుడు ఇంతగా ఆకర్షించాడా అనిపిస్తుంది. చందమామ రాజకుమారిల గురించి మీ వర్ణణ అద్భుతంగా ఉంది. వపా హృదయరాణులు వారు. అలా కాక ఇంకెలా ఉంటారు వారు..
“చందమామ మారుతోంది, కానీ ఆ మార్పు మంచి వైపుగా ఉండాలి అన్నదే నా కోరిక. నేను అనుభవించిన ఆ ఆనందం నా తర్వాతి తరం కూడా అనుభవించాలి అన్న చిన్న స్వార్ధం.” అంటూ చివర్లో చెప్పారు. మీది చిన్న స్వార్థం కాదు చాలా పెద్ద స్వార్ధమే. చందమామ రూపురేఖలనే మార్చేసే పెద్ద స్వార్దం. మీరు బాల్యంలో అనుభవించిన ఆ ఆనందం మీ తర్వాతి తరంవారు కూడా అనుభవించాలి అనే మీకోరిక తీరాలనే ఆశిస్తున్నాం. మీ కోరిక కూడా చందమామ బాల్యంలాగే మిగిలిపోతుందేమో మరి..
ఏదేమైనా మీ చందమామ జ్ఞాపకాలకు మన:పూర్వక కృతజ్ఞతలు…
సాయిలక్ష్మిగారి చందమామ జ్ఞాపకాలు పూర్తి పాఠం చదవాలంటే కింది లింకును దయచేసి తెరువండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2269
మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.
మీ చందమామ జ్ఞాపకాలను పాఠకులతో పంచుకోదలిచారా?
abhiprayam@chandamama.com కు పంపండి. మీవి లేదా మీ పిల్లల ఫోటోలు కూడా పంపండి.
చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49
విక్రమార్కుడూ… నా రాకుమారుడూ…

చందమామ రాజకుమారి
“…. నాన్న చేతిలో పుస్తకాలు, వేమన పద్యాలూ, సుమతీ శతకం కష్టంగానూ, నాకు నేను ఇష్టంగా చదవగలిగింది నాకు గుర్తున్నంత వరకూ చందమామ మాత్రమే. చందమామ అనగానే రంగురంగుల అట్ట మీద బొమ్మ, లోపల ఏ బొమ్మైనా తెలుపు నీలిరంగు, లేదా తెలుపూ, వూదా కలిసిన పింకూ, ఇలా ఉండేది.
ఐతే చక్కటి రాజకుమారి వంటి నిండా నగలతో ముఖం కనిపించే పలుచటి ముసుగు (సాలార్ జంగ్ మ్యూజియంలో రెబెక్కా లాగా) ఉద్యానవనంలో వ్యాహ్యాళికి వెళితే ఆ ఉద్యానవనంలో ఉండే చిన్న చిన్న పొదలూ వాటి నిండా సందులేకుండా పూలూ, కల్పన అనే అనుకున్నాను మొన్న మొన్న స్టాంఫార్డ్ లో స్ప్రింగ్ చివర్లో విరపూసిన అజేలియాలని చూసిందాకా. చూడగానే చిన్నప్పటి చందమామ కధల్లో రాకుమారి తోట గుర్తుకొచ్చింది.
ఎర్రటి ఎండ, మజ్జిగ, కొద్దిగా ఉప్పు కలిపిన అన్నము, నంజుకునేందుకు దోసకాయి పచ్చడి, చందమామలో చీనాదేశపు రాకుమారి కధ. కధానాయకుడు వాంగో, చాంగో అయివుంటాడు. తెలుపు రేడియం గ్రీను కలిసిన కిమోను వేసుకుని నడినెత్తిన ముడి, ముడిలో అడ్డంగా పుల్ల (ఇప్పుడైతే ఆ పుల్ల నాదగ్గరకూడా ఉన్నది. చైనా ట్రిప్ వెళ్ళొచ్చిన నా స్నేహితురాలు బహుమతిగా ఇచ్చింది) ఇలాంటి బొమ్మతో కధ చదివిందే ఓ ఇరవైసార్లు చదవడం. ఇవన్నీ అర కొర ఙ్ఞాపకాలే………”
సునీత గారూ.. మీ చందమామ జ్ఞాపకాలు పంపినందుకు మనఃపూర్వక కృతజ్ఞతలు.. మళ్లీ ఓసారి చందమామ రాజకుమారిని, ఆ అద్భుత ఉద్యానవనాలను… ముగ్ధ సుకుమార నిసర్గ సౌందర్య రేరాణులను చందమామ పాఠకుల మనోప్రపంచపు తలపుల్లోకి తెచ్చి ఉంచారు. మీ వర్ణనను తలుచుకుంటూంటేనే ఎంత ఆహ్లాదంగా ఉందో..!
పైగా పిశాచాలు, మాంత్రికులు… తెలుగు పిల్లల మానసిక ప్రపంచాన్ని వెలిగించిన అద్భుత పాత్రలు.. అరబ్బులకు అల్లాఉద్దీన్‌లా మంచిని ప్రేమించే, మంచివైపు నిలిచే పిశాచాలు, మాంత్రికులు మనకూ ఉన్నారు.. చందమామ ద్వారా. రాత్రిపూట ఇల్లు వదిలి బయటకు రావాలంటే గజగజా వణికే పల్లెటూరి పిల్లల ఊహా ప్రపంచంలోకి చందమామ పిశాచాలు మెత్తగా ప్రవేశించేవి. మంచి దొంగలాగా మంచి దయ్యాలు, మంచి పిశాచాలు… చందమామలో తప్ప మరెక్కడ చూడగలిగాం మనం..
‘భట్టి విక్రమార్క కధలు చందమామ సిగ్నేచరు.’ చక్కటి వాక్యం.. మీ బాల్యపు రాకుమారుడు విక్రమార్కుడు. చక్కటి ఎంపిక.
మీ చందమామ జ్ఞాపకాలు మరికొందరు చందమామ ప్రియులు, అభిమానులకు తమ జ్ఞాపకాలు రాసి పంపేందుకు ప్రేరణ ఇస్తాయని ఆశిస్తున్నాము..
మిమ్మల్ని ఆరునెలలు హింస పెట్టినా సరే తెలుగు నేర్చుకున్న మీ పాపాయికి చందమామ తరపున శుభాకాంక్షలు
మీ పిల్లలు చందమామను తమకు తామే చదువుకోగల శుభ ఘడియలు రావాలని మనసారా కోరుకుంటూ..
వీలైతే.. మీరున్న ప్రాంతంలో చందమామ పాఠకులు ఉన్నట్లయితే వారిని కూడా చందమామ జ్ఞాపకాలు రాసి పంపమని కోరగలరు.
చందమామ జ్ఞాపకాలు చందమామ పాఠకులు స్వంత వేదిక. వీలైనంత ఎక్కువమంది ఈ వేదికను పంచుకోవడానికి మీ వంటి వారు తలా ఓ చేయి వేస్తారని ఆశించవచ్చు కదూ…
చందమామ జ్ఞాపకాలు పంపేటప్పుడు మీ ఫోటో లేదా మీ పిల్లల ఫోటో తప్పక జతచేయగలరు. జ్ఞాపకాల హోం పేజీలో ఆ ఫోటోలను ప్రచురించగలము.
సునీత గారు పంపిన చందమామ జ్ఞాపకాలు పూర్తి పాఠం చదవాలంటే కింది లింకుపై క్లిక్ చెయ్యండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&&stId=2262
మీ స్పందనను abhiprayam@chandamama.com పంపండి.
మీ చందమామ జ్ఞాపకాలను పాఠకులతో పంచుకోదలిచారా? అయితే..
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి. మీ లేదా మీ పిల్లల ఫోటోతో సహా పంపండి.
చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49
పరోపకారి పాపన్న కథల సేకర్త ఎం.రంగారావు…

పరోపకారి పాపన్న
అతడు…కర్నాటకలో మంగుళూరు (దక్షిణ కెనరా) కు చెందిన పసివాడు. తండ్రి చేసిన అప్పులను తీర్చడానికి చిన్నతనంలోనే మంగళూరు నగరంలో ఓ ఇంట్లో పనికి కుదిరాడు. వంటపని చేస్తూ బతుకు సాగించాడు. చదువు సంధ్యలు లేకుండా సంవత్సరాలు గడిపాడు. తండ్రి చేసిన అప్పు పూర్తిగా తీర్చేసిన తర్వాత కుటుంబంతో పాటు తమిళనాడుకు వలస వచ్చాడు.
అటునుంచి మన రాష్ట్రంలో నెల్లూరు, గూడూరు పట్టణాల వరకు వలసపోయాడు. రాష్ట్రాల సరిహద్దులు దాటి సాగిన ఈ వలస జీవితంలో మాతృభాష కన్నడకు తోడుగా కొంతవరకు తెలుగు కూడా నేర్చుకున్నాడు. రెండో భాషలో కొద్ది ప్రావీణ్యం అందించిన గొప్ప అవకాశం దన్నుతో అలనాటి చిత్రకారుడు ఎంటీవీ ఆచార్య గారి సిఫార్సుతో చందమామలో అడుగుపెట్టాడు.
ఆయనే ఎం.రంగారావు. చందమామ కన్నడ భాషా ఎడిటర్‌గా 1950ల ప్రారంభం నుంచి నాలుగు దశాబ్దాల పాటు పనిచేసిన రంగారావు గారు. చందమామకు రంగారావు గారు చేసిన గొప్ప దోహదం ఏదంటే పరోపకారి పాపన్న కథలు, గుండుభీమన్న కథలను సేకరించి తెలుగులో రాసి ఇవ్వడం. కన్నడ జానపద సంప్రదాయంలోంచి పుట్టుకొచ్చిన ఈ కథలు తెలుగు కథా సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఓ కన్నడిగుడు తెలుగు బాల సాహిత్యానికి అందించిన అమూల్యమైన కథలివి.
చందమామలో ప్రచురించబడిన ధారావాహికలలో ముఖ్యమైనది పరోపకారి పాపన్న కథలు. 1962 నుంచి ఈ కథలు చందమామలో సీరియల్ రూపంలో వచ్చాయి. ‘ఈ కథలు ఎంత ప్రాచుర్యం పొందాయంటే, ఎవరైనా కొంచెం మంచికి పోయి సహాయపడితే, అటువంటివారిని ‘పరోపకారి పాపన్నరా వాడు’ అని పిలవటం వాడుక అయ్యింది.’ అలాగే అంతకు ముందు ఈయన రాసిన గుండు భీమన్న అనే మరో సీరియల్ కూడా చందమామలో వచ్చింది. దీన్ని కుటుంబరావు గారు రాకముందు తెలుగు ఎడిటర్‌గా ఉన్న రాజారావుగారు సాపుచేసి మొదట తెలుగులో ప్రచురించారు.
కర్నాటక ప్రాంతానికి చెందిన ఓ పిల్లవాడు బాలకార్మికుడిగా, వంటమనిషిగా జీవితం ప్రారంభించి సాహిత్యం వాతావరణం ఉన్న కుటుంబాల్లో పెరిగి స్వయంకృషితో రచయితగా పరిణమించడమే కాక, తదనంతర కాలంలో చందమామ కన్నడ ఎడిటర్‌గా రూపొందిన క్రమం గత 60 సంవత్సరాలుగా మరుగున పడిపోవడమే ఓ విషాదంగా చెప్పాలి. చదువు నేర్చుకోవడం ద్వారా ఓ వంటమనిషి జీవితంలో సంభవించిన మౌలిక మార్పుకు రంగారావు గారు నిలువెత్తు సంకేతంలా చరిత్రలో నిలిచిపోయారు.
ఈ కథనం పూర్తి పాఠం చూడాలంటే కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2260
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.
గమనిక: కన్నడ చందమామ పూర్వ ఎడిటర్ రంగారావు గారి వివరాల సేకరణకు ఇద్దరు ప్రేరణగా నిలిచారు. ఒకరు రోహిణీ ప్రసాద్ గారు. మూడు నెలల క్రితం ఆయనతో సంబంధంలోకి వచ్చినప్పుడు ఆయన పత్యుత్తరమిస్తూ చందమామలో గతంలో పనిచేసిన కన్నడ ఎడిటర్ రంగారావు గారు, తమిళ ఎడిటర్ స్వామినాథన్ గారు తదితరులను ప్రస్తావిస్తూ వీలైతే వారి గురించిన వివరాలు కనుక్కోవలిసిందిగా కోరారు.
అలాగే శివరాం ప్రసాద్ గారు.. పరోపకారి పాపన్నలోకి పరకాయప్రవేశం చేశారా అన్నట్లుగా ఇటీవలే తన బ్లాగులో రెండు మంచి కథనాలను పోస్ట్ చేశారు. కన్నడ జానపద మూలానికి చెందిన పాపన్న, గుండుభీమన్న తెలుగులోకి ఎలా వచ్చారనే కుతూహలం వీరిద్దరి ప్రేరణలకు తోడైన క్షణాల్లో ఈ వ్యాసం రూపు దిద్దుకుంది. అందుకు వారిద్దరికీ కృతజ్ఞతాభివందనలు…
రంగారావు గారికి సంబంధించిన ఇతర అంశాలు ఇంకా వెలుగులోకి రావల్సి ఉంది. చందమామ సీనియర్ ఉద్యోగులు శంకర్, బాలు గార్లతో మాట్లాడే క్రమంలో ఈ అదనపు వివరాలు లభిస్తాయనే ఆశిద్దాం…
Filed under చందమామ చరిత్ర | Tags: ఎడిటర్, కథలు, కన్నడం, కుటుంబరావు, గుండుభీమన్న, గూడూరు, చందమామ, చక్రపాణి, చెన్నయ్, జ్ఞాపకాలు, దాసరి సుబ్రహ్మణ్యం, నాగిరెడ్డి, నెల్లూరు, పరోపకారి, పాపన్న, మంగుళూరు, ముద్దావిశ్వనాధం, రంగారావు, రాజారావు, విశ్వనాథరెడ్డి. | Comments (11)చందమామ శంకర్ గారి జీవిత వివరాలు…

శంకర్ గారు
చందమామ చిత్రమాంత్రికులు శంకర్ గారు 1946 నుంచి చిత్రలేఖన పనిని వృత్తిగా ఎంచుకున్నారు. అప్పటినుంచి చిత్రాలు గీయడమే తప్ప మరొక వ్యాపకం పెట్టుకున్న చరిత్ర లేదు. నిజంగా చెప్పాలంటే బొమ్మలు గీయడం. పరమ భక్తిప్రపత్తులతో పనిలో దిగటం తప్ప మరొక పని ఈయనకు తెలియదు.
ఏమీ తెలియకపోవడం కూడా మంచిదయ్యిందేమో మరి. చందమామ చిత్రప్రపంచానికి, చిత్రలేఖన చరిత్రకు వన్నెలద్దిన గొప్ప హస్తనైపుణ్యం మన కాలం ప్రపంచానికి సజీవంగా ఇన్ని దశాబ్దాలుగా మిగలడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చు.
ప్రస్తుతం వయసు మీద పడిన కారణంగా (85 ఏళ్లు) వారంలో తొలి మూడు రోజులు మాత్రమే చందమామ కార్యాలయానికి వచ్చి పని చేస్తారు. గురు, శుక్ర వారాల్లో మాత్రం ఇంటివద్దే ఉంటూ చందమామ చిత్రాలు గీస్తారు.
రోడ్లమీద మలుపుల్లో, గతుకుల్లో ఊగుతూ వచ్చే క్యాబ్‌లో అందరితోపాటు కూర్చుని 85 ఏళ్ల వయసులో రోజూ ఆఫీసుకు రాలేనని చెబితే యాజమాన్యం ఈయనకు మినహాయింపు ఇచ్చి చివరి రెండు రోజులు ఇంటివద్దే పనిచేయడానికి వీలు కల్పించింది. మొదటి మూడు రోజులు ప్రింట్ చందమామ వర్క్ ప్లాన్ అమలుకోసం తప్పక రావలసి ఉంటుంది.
వయోభారం మీద పడుతూనే ఉన్నా సరే.. ‘జీవితం చివరి వరకూ చందమామలోనే పనిచేయాల’నే సంకల్పబలం సాక్షిగా శంకర్ గారు చందమామ ఆఫీసుకు వస్తూనే ఉన్నారు. జీతం పట్ల, పదవి పట్ల, హోదా పట్ల కించిత్ ఆశలు, ఆకాంక్షలు కూడా లేని ఈ నిగర్వి… మా వంటి తదుపరి తరాలకు, ప్రస్తుతం చందమామలో పనిచేస్తున్న పిల్లలకు (20 నుంచి 25 ఏళ్ల వయసులోపు) ఓ అద్భుతమైన ‘శ్రామిక ఉదాహరణ’లాగే ఉంటారు.
పని సంస్కృతికి నిలువుటద్దంలా నిలిచే ఈ మహనీయ మూర్తిమత్వం మాతో ఉంది. మేం ఆయనతో కలిసి పనిచేస్తున్నాం. ఆయనతో మా ఉద్యోగ జీవితాన్ని, మాటలను, చూపులను, ప్రయాణాన్ని కూడా పంచుకుంటున్నాం అనే విషయం తల్చుకుంటేనే మాకు ఒళ్లు గగుర్పొడుస్తూ ఉంటుంది.
శంకర్ గారి జీవిత వివరాల పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2253
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&sbCId=&stId=2253&pg=1
ప్రతి ఇంట్లో చందమామ ఉన్న అందమైన కాలం
చిన్నప్పటి విషయాలు అందరికి అన్ని గుర్తుండవు. నా సంగతి అంతే అనుకోండి. కాని చందమామతో అనుబంధం జీవితాంతం మనసులోనుండి పోదు పోలేదు అని నేను, నాలాంటి ఎందరో చంపిల అభిప్రాయం అని ఖచ్చితంగా చెప్పగలను. స్కూలులో చెప్పిన తెలుగు పాఠాలకంటే అమ్మ ఇంట్లో చదివించిన చందమామ వల్లే నాకు తెలుగు మీద ఆసక్తి, పట్టు కలిగింది అని గర్వంగా చెప్పుకుంటాను.
పిల్లలున్న ప్రతి ఇంట్లో చందమామ ఉండి తీరాల్సిందే అనే అందమైన కాలం అది. అమ్మలు, నాన్నలు తమకోసం, తమ పిల్లల కోసం చందమామ కొనేవారు. ప్రతి నెల క్లాసు ప్రోగ్రెస్ రిపోర్ట్ కంటే ఎక్కువగా (అంతకంటే ఎక్కువగా) చందమామ కోసం ఎదురుచూపులు. అది రాగానే నాకు, తమ్ముళ్ళకు మధ్య బల ప్రదర్శన. నాదే గెలుపనుకోండి.
అప్పుడప్పుడు ఆ పుస్తకం వాళ్ళ కంటపడకుండా మొత్తం చదివేసి డ్రాయింగ్ రూం లో పెట్టేయడం. ఇక ఎవరేమన్నా చేసుకోండి నేను చదివేయడం ఐపోయింది అని ..కాని గంటలో పుస్తకం అవ్వగొట్టి నేలంతా ఎదురుచూడాలంటే మాత్రం విసుగేసేది. అమ్మ చదివే వారపత్రికలలాగా చందమామ కూడా వారానికోటి వేస్తే వీళ్ల సొమ్మేం పోతుంది. డబ్బులిచ్చే కొంటాము కదా అని పదో క్లాసు వరకు తిట్టుకున్నాను కూడా………
జ్యోతి గారూ,
పిల్లలున్న ప్రతి ఇంట్లో చందమామ ఉండి తీరాల్సిందే అనే మెరుపువాక్యంతో అదరగొట్టేశారు. వ్యక్తిగతంగా సమాచారం పంపకున్నా మీరు చందమామ జ్ఞాపకాలు స్వయంగా పంపారు. అందుకు మనఃపూర్వక కృతజ్ఞతలు.. ఆన్‌లైన్ చందమామతో మీ చందమామ జ్ఞాపకాల బంధం ఇలాగే కొనసాగుతుందని.. కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాము.
“పిల్లలున్న ప్రతి ఇంట్లో చందమామ ఉండి తీరాల్సిందే అనే అందమైన కాలం అది.”
చందమామ స్వర్ణయుగ చరిత్రకు ఈ వాక్యం సాక్షీభూతంగా నిలుస్తోంది కదా..
“అమ్మ చదివే వారపత్రికలలాగా చందమామ కూడా వారానికోటి వేస్తే వీళ్ల సొమ్మేం పోతుంది. డబ్బులిచ్చే కొంటాము కదా అని పదో క్లాసు వరకు తిట్టుకున్నాను కూడా.”
అమ్మా.. అమ్మమ్మా.. ఎంత పెద్ద ఆశండీ మీకు. ఇక్కడ నెలకు ఓ సంచిక తీసుకువస్తూంటేనే మా పని “అయిపోతోంది” అన్నిరకాలుగా.. ఇక వారానికోసారా…
“క్లాసు పుస్తకాలు బోర్ కొడితే పాత చందమామలు తీసి సింగిల్ పేజీ కథలు చదవడం అలవాటు.”
అన్ని కాలాలకు వర్తించే గొప్ప మాట..
“పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళ కోసం తెప్పించే చందమామలు ముందు నేనే చదివేదాన్ని.”
చందమామ బతుకుతోందంటే మీవంటి ఆరాధకుల వల్లే కాబోలు.
“పుస్తకం చేత పట్టుకుని కథలో లీనమై చదువుతుంటే ఉండే ఆనందం, తన్మయత్వం, ఆన్‌లైన్‌లో.. కంప్యూటర్‌లో చదివితే వస్తుందా? రాదు గాక రాదు గాక రాదు..”
చందమామను కొని భద్రపెట్టుకున్న వారికి పుస్తకం పట్టుకుని చదివే భాగ్యం ఉందనుకోండి. ఆ భాగ్యం లేనివారి మాటేమిటి? అందుకే.. ఇలాంటివారికోసమే… నాలాంటి వారికోసమే.. ఆన్‌లైన్ ఆర్కైవ్స్‌లో పాత చందమామల నిధి ఓ పెన్నిధిలాగా ఉపయోగపడుతోంది. అయితే రిఫరెన్స్ కోసం చందమామ కథలు వెతుక్కోవాలంటే పుస్తక రూపంలో ఉన్న సౌలభ్యం ఆన్‌లైన్‌లో ఉండదనుకోండి. చందమామ కథల మొత్తం కేటలాగ్‌ను (గత 62 సంవత్సరాల సంచికలవి) రూపొందించి పాఠకులకు అందుబాటులోకి తెస్తే బాగుంటుందేమో మరి.
జ్యోతిగారి చందమామ జ్ఞాపకాల పూర్తి పాఠం కిందిలింకులో చదవండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2244
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.
చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49
చందమామ జ్ఞాపకాలు అమృతాలు

పాత చందమామల కట్నం
” జ్ఞాపకం అంటే గతించినది. అంటే మృతం. కొన్ని జ్ఞాపకాలు మాత్రం అమృతాలు. చందమామ జ్ఞాపకాలు. అచ్చంగా అలాంటివే. నేను రెండవ తరగతి చదువుతున్నప్పుడు మా అమ్మ మొట్టమొదటి సారి చందమామ కొని తెచ్చింది, నాకూ మా అన్నకూనూ. వీధిబడి కాబట్టి తెలుగు మీడియంలోనే చదువు. అప్పటికి తెలుగు చదవడం, కొన్ని తెలుగు పద్యాలు నోటికి రావడం, ఇంతే తెలిసింది నాకు. ఆ చందమామ చదవగానే చాలా డవుట్లు వచ్చాయి……”
రవిగారూ,
మధ్యాహ్నమే 11-09-09 మీ చందమామ జ్ఞాపకాలు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాము. మీకు చెప్పడం మర్చిపోయాను. మీ ఫోటోను సముద్రం డామినేట్ చేసేసింది. వేరేది లేకపోవడంతో ఇదే కొంచెం మార్చి ఆన్‌లైన్ చందమామలో పెట్టాము. చూడండి.
మీ చందమామ జ్ఞాపకాలులో మీకు దొరికిన అమూల్యమైన కట్నం గురించి రాసారు. బహుశా ఇంత గొప్ప కట్నం మరెవ్వరికీ దొరకదేమో కూడా. చందమామల కట్నం.. పాత చందమామల కట్నం. అదీ మీ శ్రీమతిగారు తీసుకురావడం.
ఎంత గొప్ప సంపద. ఇంకా వేరే కట్నం కావాలా మీకు?
ముందే చెప్పినట్లు హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను రేపటినుంచి రెండు రోజులు కూర్చుని ‘చంపి’ల మెయిల్ ఐడీలు నావద్ద ఉన్నవి ఒకచోటకు చేరుస్తాను. కనీసం ఓ యాభై ఐడీలు అయినా ఉంటాయని అనుకుంటున్నాను. కొన్ని కూడగానే మీకు పంపిస్తాను. మనం పరస్పరం షేర్ చేసుకుందాం.
శివరామ్ ప్రసాద్ గారు ఇప్పటికే చందమామ ప్రియులు పేరిట యాహూలో ఓ చందమామ ప్రియుల బృందాన్ని రూపొందించారు. మీరు చేరారో లేదో తెలియదు. వీలైతే శివరాం గారి బ్లాగ్ ఓ సారి చూడండి. మీకు తెలిసిన చందమామ అభిమానులకు కూడా ఈ విషయం తెలుపగలరు.
http://saahitya-abhimaani.blogspot.com/
ఇప్పటికి ఉంటాను.
రాజు.
—————
10-09-09 10.30 PM
రవిగారూ, వంద కృతజ్ఞతలు.
ఇంత త్వరగానా…. ఊహించలేదు.
అయితే నాకు ఇక్కడ పాత చందమామల ఇమేజీ, మీ జ్ఞాపకాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వీలైతే మీ ఫోటో ఒకటి తప్పక పంపించండి. మీ ఫోటోతో సహా మీ జ్ఞాపకాలను ప్రచురించగలము. మీ చందమామ జ్ఞాపకాలను రేపే ప్రచురించగలం. తప్పక ఆ లింకుకే మీ ఫోటోను పంపగలరు.
ఒక్క మాటలో. చందమామ చదువుతున్నప్పుడు మీకు వచ్చిన సందేహాలు అప్పట్లో మాకూ వచ్చాయండీ. సరిగ్గా ఇవే సందేహాలు. ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి చదువుతూంటే.. ‘వపా అంటే ఏమిటి,’ ‘ఇంకావుంది .. ఎక్కడ..’ ఆహా.. 35 ఏళ్లు వెనక్కి పోయినట్లుంది నాకు.
చింతచెట్లమీద దెయ్యాల గురించి చందమామలో కథల మాటేమిటో గానీ, మా చిన్నప్పుడు పొద్దు గూకి చీకటి పడిందంటే చాలు పల్లెటూళ్లలో ఇళ్లల్లోంచి బయటకు వచ్చే వాళ్లం కాదు. చివరకు పాస్ పోసుకోవాలంటే కూడా అమ్మను తోడుకోసం లేపాల్సిందే.
మరోసారి ధన్యవాదాలు.
మీ మెయిల్ ఐడీని నా వద్ద ఉన్న చంపిల ఐడీల జాబితాలో బద్రపరుస్తున్నా. తదుపరి కమ్యూనికేషన్‌కి ఇది చాలా అవసరం. మీకు తెలిసిన చంపిల మెయిల్ ఐడీలను కూడా మీ వీలునుబట్టి సేకరించగలరు. మనందరివీ కలుపుకుంటే చాలా మంచే జరుగుతుంది.
————-
10-09-09
చందమామ జ్ఞాపకాలు రాసి పంపమని రవిగారిని కోరినప్పుడు ఆయన స్పందన, నా ప్రతిస్పందన కింద చూడగలరు.
చందమామతో..అబ్బో, ఎన్ని అనుభవాలో.. అసలు నేను చదువు నేర్చుకున్నదే చందమామతోనండి. వేణు గారి అనుభవాలు చదివినప్పుడే, రాయాలనిపించింది. తప్పక రాస్తాను.
మా అమ్మ గారిప్పుడు లేరండి. అందమైన రాత్రి ఆకాశంలో ఓ అందమైన చుక్కను చూస్తే, అమ్మ, తోకచుక్కా రెండూ గుర్తుకు వస్తాయి!
నా దగ్గరా చాలా పాత చందమామలున్నాయండి. (బవుండు వేసి కొన్ని, విడి ప్రతులుగా కొన్ని) వర్షం తర్వాత మట్టి వాసనా, ఈ పుస్తకాల సగంధం తల్చుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది.
——
ఓ.. క్షమించండి. మాకూ అమ్మ లేదిప్పుడు.
‘అందమైన రాత్రి ఆకాశంలో ఓ అందమైన చుక్కను చూస్తే, అమ్మ, తోకచుక్కా రెండూ గుర్తుకు వస్తాయి!’
కళ్లు చెమ్మగిల్లుతున్నాయి మీ వ్యాఖ్య చదువుతుంటే.
పాత చందమామల సుగంధ పరిమళాలను చవిచూసే భాగ్యవంతులలో మీరూ ఒకరు. జీవిత పయనంలో సేకరించిన అమూల్య సాహిత్యాన్ని పొగొట్టుకుంటూ వచ్చిన అభాగ్యుల జాబితాలో నా పేరు ఉంది. ఏం చేస్తాం.
అందుకే మీరంతా పాత చందమామల గురించి చెబుతున్నప్పుడల్లా గుండె కనలి కనలి, చేసేదేమీ లేక ఈరోజే ఈనెల అన్ని భాషల్లోని చందమామలను (12) ఓ సెట్ ఆఫీసులో కొనుక్కుని తీసుకుని వచ్చాను. కనీసం ఈ రకంగా అయినా తృప్తి పడవచ్చు కదా. నా వద్దా 12 బాషల్లో చందమామలు ఉన్నాయి అనుకుంటా. ఈ సెట్‌ను మంచి జ్ఞాపకం లాగే భద్రపర్చుకుంటాను.
ఇలా అంటున్నానే కాని మళ్లీ ఎవరు ఇంటికొచ్చి అడుక్కుని వీటిని కూడా తీసుకుపోతారేమో అని భయంగా ఉందనుకోండి. మొహమాటం ముందు పుట్టి తర్వాత మనం పుట్టాం మరి. ఏం చేస్తాం మరి.
చందమామ జ్ఞాపకాలు పంపుతానని చెప్పారు. పంపకముందే కృతజ్ఞతలు..
మీ
రాజు.
రవి గారి ‘చందమామ జ్ఞాపకాలు’ చూడాలంటే కింది లింకును తెరవండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2209
Filed under చందమామతో మా జ్ఞాపకాలు | Tags: కట్నం, కథలు, చందమామ, జ్ఞాపకాలు, దెయ్యాలు, పాపాయి, బేతాలకథలు, రవి, వేణు | Comment (0)చందమామ జ్ఞాపకాలు

చందమామ జ్ఞాపకాలు : శివరాంప్రసాద్ కప్పగంతు.
శివరాం ప్రసాద్ గారూ,
మనఃపూర్వక కృతజ్ఞతలు. అడిగిన వెంటనే తీరిక చేసుకుని మరీ మీ చందమామ జ్ఞాపకాలు పంపారు. మీరు కోరినట్లు మీరు సూచించిన ఫోటోయే ఆన్‌లైన్ చందమామలో ప్రచురించాము. పెద్ద పెద్ద పేరాలను చిన్నవిగా చేయడం తప్పిస్తే మీరు పంపిన పూర్తి పాఠాన్ని యధాతథంగా ప్రచురించాము. నిన్ని త్రివిక్రమ్ గారు, ఇవ్వాళ మీరు… వెంటవెంటనే చందమామ జ్ఞాపకాలను పంపడం.. నిజంగా చక్కటి అనుభూతి.
‘చందమామలో బొమ్మలను ఉదహరించకపోతే, చందమామ జ్ఞాపకాలేమిటి’ చక్కటి వ్యాఖ్య. కొత్తగా వచ్చిన చంద్రబాల అలనాటి చందమామను గుర్తుకు తెస్తూ బొమ్మలతో అదరగొడుతోంది. దాంట్లో పూర్తి పేజీ రంగుల చిత్రాలను చూస్తుంటే చందమామ పోగొట్టుకున్నదేమిటో అర్థమవుతుంది. ఇప్పటికైనా చందమామ మేలుకుంటే మంచిది.
‘కొత్త చందమామను షాపువాళ్ళు వరుసగా పెట్టినప్పుడు, ఆ దుకాణానికే గొప్ప అలంకరణ చేసినట్టుగా ఉండేది’
మళ్లీ ఆరోజులు రావాలనే కోరుకుంటున్నా. మన అందరి ఆశలు, ఆకాంక్షలు, డిమాండ్లు అన్నీ ఒక్కటొక్కటిగా నెరవేరుతాయనే అనుకుంటున్నా. పాత చందమామలు దుకాణాల్లో పేర్చి ఉన్న ఫోటోలు ఒకటో రెండు దొరికితే బాగుండు. చందమామ ఆఫీసులో పేర్చి ఉన్న చందమామలను చూస్తుంటేనే మనసు తుళ్లింతలు పోతుంది. అలాంటింది పాత చందమామల ముఖచిత్రాల గురించి చెప్పపనిలేదు.
‘ఇంతటి అద్భుతమైన బొమ్మలను సేకరించి, ఒక పుస్తకం వెయ్యగలిగితే చందమామ వారు తెలుగు సాహిత్యానికి చిత్రలేఖన కళకు ఎంతగానో సేవచేసినవారిగా చరిత్రకు ఎక్కుతారు’.
ఇప్పుడు చందమామ అభిమానులు, పాఠకులు, చంపిలు పత్రికకు పంపే డిమాండ్లలో దీన్నికూడా మొదటి వరుసలో చేర్చాలి. చందమామకు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇంగ్లీషులో కలెక్టర్ ఎడిషన్ వేసి తెలుగు వారి సెంటిమెంట్లను గాయపర్చారు. కనీసం ఈ ప్రతిపాదనను అయినా చందమామ నిర్వాహకులు పరిగణనలోకి తీసుకుని చందమామ ఆస్థాన చిత్రకారుల త్రయం గీసిన చిత్రాలను ఒక పుస్తకంగా వేస్తే అది ఓ అద్భుత ఆవిష్కరణగా చరిత్రలో మిగులుతుంది.
చక్కటి రిజల్యూషన్‌తో చందమామ చిత్రాలను ప్రచురిస్తే ఎంత ఖర్చైనా వెచ్చించి తీసుకోవడానికి పాఠకులు పూనుకుంటారనే నా నమ్మకం. Chandamama Collector’s edition పుస్తకం చివర్లో Art Galleryలో చిత్రాలు ఓసారి చూడండి. అదిరిపోయేలా వేశారు. మళ్లీ మెయిన్ పుస్తకంలో వేసిన చిత్రాలు అంత కళగా లేవు. కాని అరుదైన పుస్తకంగా దీన్ని మనం కొని భద్రపర్చుకోవచ్చు.
చందమామ చిత్రాలు పుస్తక రూపంలో రావాలంటే చందమామకు అభిమానులు పంపే ఉత్తరాలు, ఈ మెయిళ్లలో దీన్నికూడా చేర్చి పంపించాలి. చందమామ ధారావాహికలు, చందమామ చిత్రాలు వంటివి తిరిగి ముద్రించబడితే ఎంతగా పాఠకుల ఆదరణ పొందుతాయో నిజంగానే నిర్వాహకులకు తెలియకపోవచ్చు కూడా. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడితే ఈరోజు కాకపోతే రేపయినా వీటి పునర్ముద్రణ విషయం ఆలోచిస్తారు.
అందుకే వీలయినంత మంది చంపిల, చందమామ అభిమానుల, పాఠకుల ఈమెయిళ్లు మనం సేకరించగలగితే ఏక కాలంలోనే నిర్దిష్ట సంఖ్యలో పాఠకులు ఓ ప్రత్యేక అంశంపై డిమాండును మరిత బలంగా పంపించడానికి అవకాశముంటుంది. అలా అది యాజమాన్యంపై తప్పకుండా ప్రభావం చూపుతుంది కూడా. ఎంతలేదన్నా సంఖ్యా బలానికి ప్రాధాన్యత ఉన్న కాలం కదా ఇది.
దీన్నే నా బ్లాగులో కూడా చందమామ అభిమానులకోసం పోస్ట్ చేస్తాను.
మరోసారి మీ చందమామ జ్ఞాపకాలకు కృతజ్ఞతలు.
మీ చందమామ జ్ఞాపకాల కోసం కింది లింకును తెరవండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2176
రాజు.
నోట్: చందమామ అభిమానులకు, చంపిలకు విజ్ఞప్తి. చందమామతో మీ బాల్య, తదుపరి జీవిత జ్ఞాపకాల గురించి రెండు పుటలకు మించని కథనం కింది లింకుకు పంపగలరు. మీ ఫోటోతో సహా పంపితే మరీ మంచిది. తెలుగు పాఠకుల చందమామ జ్ఞాపకాలకు ఆన్‌లైన్ చందమామ వేదిక కావాలన్న మా ఆకాంక్షను మన్నిస్తారని ఆశిస్తూ..
చందమామ జ్ఞాపకాలు పంపవలసిన లింకు
Filed under చందమామతో మా జ్ఞాపకాలు | Tags: చందమామ, చిత్ర, చిత్రలేఖనాలు, చిత్రాలు, జ్ఞాపకాలు, తెలుగు, దుర్గయ్య, నాన్న, భాష, మద్రణ, వడ్డాది పాపయ్య, శంకర్, శివరామ్ ప్రసాద్, షాపు | Comment (1)మా చందమామ జ్ఞాపకాలు

బాల్యాన్ని ఎవరు మర్చిపోగలరు? బాల్యంతో ముడిపడిన చందమామ అనుభూతులను ఎవరు మర్చిపోగలరు? చందమామతో కలగలసిన ఆ పసితనాన్ని ఎవరు మరువగలరు? ఆ జ్ఞాపకాలను, చందమామ పరిమళాలను అందరికీ పంచండి. మనకంటూ మిగిలిన జాతి సంపద, సాంస్కృతిక సంపద చందమామ ఒక్కటే కదా…
చందమామ జ్ఞాపకాలను దశాబ్దాలుగా కొనసాగిస్తున్న వందలాదిమంది అభిమానులకు, బ్లాగర్లకు, నెటిజన్లకు ఆన్‌లైన్ చందమామను సాదర నిలయంగా మార్చాలనే ఆశయంతో http://telugu.chandamama.com లో “మా చందమామ జ్ఞాపకాలు” విభాగాన్ని రూపొందించాము.
తెలుగునాడులో ఎంతమంది చందమామతో తమ బాల్యజీవితంలోని తాదాత్మ్య క్షణాలను గుర్తుతెచ్చుకుంటూ పలవరిస్తున్నారో ఈ ప్రపంచానికి చాటి చెప్పాలనే చిరు ఆకాంక్షతో… ఆన్‌లైన్ చందమామలో ఈ విభాగాన్ని ఏర్పర్చాము.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49
తెలుగు జాతి సాంస్కృతిక సంపద అయిన చందమామను ఈ నాటికీ తమ జ్ఞాపకాల దొంతరలలో పదిలపరుచుకుంటున్న చందమామ అభిమానుల గుండె చప్పుళ్లను ఓ చోట చేర్చి అందరికీ పంచిపెట్టాలనే చిరు కోరికే ఈ “మా చందమామ జ్ఞాపకాలు” విభాగం రూపకల్పనకు మూలం.
జీవించడం కోసం ప్రపంచం నలుమూలలకు వలసపోయిన తెలుగు వారు చందమామ పత్రికతో తమ తరాల అనుబంధాన్ని నేటికీ ఎలా కాపాడుకుంటూ వస్తున్నారో, చందమామ జ్ఞాపకాలను పరస్పరం ఎలా పంచుకుంటున్నారో తెలిపే అమూల్యమైన వ్యాసాలు, లింకులు, తదితర సమాచారం ఈ విభాగంలో పొందుపర్చడం జరుగుతుంది.
చందమామతో తమ జ్ఞాపకాలను, అనుభూతులను ఈ విభాగంలో పంచుకోవాలని భావిస్తున్న అభిమానులకు, ‘చంపి’లకు(చందమామ పిచ్చోళ్లు) ఇదే మా సాదర ఆహ్వానం.
బాల్యంలో మీ చిన్ననాటి చిరునేస్తంగా పలకరిస్తూ వచ్చిన చందమామ జ్ఞాపకాలను మీరు తెలుగులో లేదా ఇంగ్లీషులో కింది లింకుకు పంపించగలరు. వీలయితే మీ ఫోటో, ప్రొఫైల్, ఈమెయిల్ చిరునామా తదితర వివరాలను కూడా పంపగలరు.
ఆన్‌లైన్ చందమామకు మీ ఈమెయిల్ చిరునామాను పంపగలిగితే త్వరలో తీసుకువస్తున్న చందమామ న్యూస్‌లెటర్‌ను మీకు ప్రతివారం నేరుగా మీ ఈమెయిల్ ద్వారా పంపడానికి వీలవుతుంది.
చందమామతో మీ జ్ఞాపకాలు, మీ స్వంత రచనలు, సలహాలు, సూచనలు, విమర్శలను కింది లింకు ద్వారా ఆన్‌లైన్ చందమామకు పంపగలరు.
చందమామ పిచ్చోళ్లకు, అభిమానులకు చందమామ తరపున ఇదే మా ఆహ్వానం. మీ అమూల్యమైన సమయంలో కొంత కేటాయించి ఆన్‌లైన్ చందమామకు చందమామతో మీ అనుబంధం గురించి, మీకు ఆసక్తి ఉన్న అంశాలపైనా చిన్ని చిన్ని రచనలు అయినా సరే రాసి పంపడానికి మీకు వీలవుతుందా?
కథలు, గేయాలు, మీకు నచ్చిన పద్యాలు, పాటలు, సైన్స్, టెక్నాలజీ, హాస్యం, మీకు తెలుసా, లోకజ్ఞానం, భారత దర్శిని, ప్రపంచ దర్శిని, సాహిత్యం, శ్రావ్యమైన సంగీతం మీ ఇతర అభిరుచులు, ఆసక్తులకు సంబంధించి ఏ విషయంపైన అయినా సరే మీరు రచనలు పంపగలరు.
ప్రతి చందమామ పిచ్చోడికి, పిచ్చోళ్లకి, అభిమానులకు చందమామ ఆన్‌లైన్ తమదిగా ఫీలయ్యే వేదికగా ఉండాలని మా ప్రగాడ కాంక్ష, విశ్వాసం కూడా. హృదయం నిండా చందమామ తలపులను దివ్యంగా పొదవుకున్న మీ వంటి అభిమానులకు ఆన్‌లైన్ చందమామ సాదర నిలయంగా మారాలని కోరుకుంటున్నాం. మీరు పంపే ఏ రచనను అయినా సరే మీ పేరుతోనే చందమామలో పోస్ట్ చేస్తాము.
మీ రచన మీ స్వంతమేనని, ఆన్‌లైన్ చందమామలో ప్రచురణకు దాన్ని పంపుతున్నట్లుగా చిన్న ధ్రువీకరణను మీ ఈమెయిల్ ఐడి ద్వారా abhiprayam@chandamama.com కు పంపితే చాలు.
చందమామతో మీ అనుబంధం గురించి ఇప్పటికే మీరు బ్లాగుల్లో, వెబ్‌సైట్లలో పోస్ట్ చేసి ఉంటే ఆ లింకులను (url) ఆన్‌లైన్ చందమామకు పంపగలరు. అన్నిటినీ ఒకచోట అమర్చి పాఠకులందరికీ అందించడానికి వీలవుతుంది.
ఈ లోపల మీనుంచి మీ వంటి చందమామ అభిమానుల నుంచి మాకు నిజమైన సహకారం ఒకటి కావాలి. ఆశిస్తున్నాం కూడా. ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న ఆన్‌లైన్ చందమామ రచన, డిజైన్, హోమ్ పేజీతో సహా ప్రతి ఒక్క అంశంపై మాకు మీ సలహాలు, సూచనలు, విమర్శలు, నిర్మోహమాటమైన అభిప్రాయాలు కావాలి.
చందమామ మరింత మెరుగుపడాలని, పాఠకుల కోరికలకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్న మా కోరికను మీరు మన్నించినట్లయితే ఈ కింది లింకులకు మీరు మీ సూచనలు, సలహాలు, ప్రతిపాదనలు దయచేసి పంపగలరు. మీకు తెలిసిన చందమామ అభిమానులకు, ‘చంపి’లకు కూడా ఈ సమాచారం వీలయితే పంపగలరు.
abhiprayam@chandamama.com
Online@Chandamama.com
చందమామ పాత సంచికలలోని కథలను చదువదలిస్తే కింది ఆర్కైవ్స్ లింకులో చూడండి. గత సంచికల కోసం వెనక్కు వెళ్లి మీ అభిమాన కథలను మళ్లీ చదవండి. మా ఆర్కైవ్‌లను చూసి, ఆనందించండి.
http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL
చందమామతో మీ జ్ఞాపకాలను ఆన్‌లైన్ చందమామకు తప్పక పంపించగలరు. చందమామ పాఠకులు, అభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం.
Filed under ఆన్‌లైన్ చందమామ రచనలు, చందమామ చరిత్ర, చందమామతో మా జ్ఞాపకాలు | Tags: Add new tag, చందమామ, చంపిలు, జ్ఞాపకాలు, పాఠకులు | Comment (0)
![Chandamama Collection Edition art2[6]_400-500](http://blaagu.com/chandamamalu/files/2010/03/Chandamama-Collection-Edition-art26_400-500.jpg)

![Chandamama Collection Edition art1[6]_400-519](http://blaagu.com/chandamamalu/files/2010/03/Chandamama-Collection-Edition-art16_400-519.jpg)







