అరచేతిలో అందాల ‘చందమామ’
‘చందమామ’ జ్ఞాపకాలకు సంబంధించి ‘అమ్మఒడి’ ఆదిలక్ష్మిగారిది ఓ వినూత్న అనుభవం. చిన్నప్పుడు నాన్న చదివి వినిపిస్తే తప్ప చందమామ కథను వినలేని అశక్తత లోంచి ‘నేనే చదువు నేర్చుకుంటే పోలా’ అనే పట్టుదలతో, స్వయంకృషి తోడుగా శరవేగంగా చదువు నేర్చుకున్న అరుదైన బాల్యం తనది. ఈ తీపి జ్ఞాపకాలను ఆమె మాటల్లోనే ఇక్కడ కొద్దిగా విందాం..
“నాన్నకి చదవటం వచ్చు కాబట్టి కదా చక చకా చదివేసాడు. మొదటి సారి ఇష్టంగా చదివేసేవాడు. మళ్ళీ చదవమంటే కుదరదనే వాడు.
’అదే నాకూ చదవటం వస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు, ఎంచక్కా చదివేసుకోవచ్చు’ - అన్న భావన, అక్షర క్రమం తెలియకుండానే మనసుకి అందింది. చదవటం రాక చందమామ బొమ్మలు పదేపదే చూసుకునే కొద్దీ పసి మనస్సు లోతుల్లో అక్షరాలు నేర్చుకోవాలనే తపన పెరిగింది.
వీధిబడిలో చేర్చగానే, ఇష్టంగా మారాం చేయకుండా అక్షరాలు నేర్చేసాను. పెద్ద బాలశిక్ష చాలా కొద్దీ రోజుల్లో పూర్తి చేసాను. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేటప్పటికే నాకు కథలు చదవటం వచ్చేసింది.
ఆ విధంగా చందమామ నాకు చదవటం నేర్పింది. చదువు కోవాల్సిన అవసరం నేర్పింది. చదువు నేర్పిన గురువుని గౌరవించటమూ నేర్పింది.”
చందమామ ద్వారా చదవటం నేర్చిన, చదువు నేర్పిన గురువును గౌరవించడం నేర్చిన ఆదిలక్ష్మిగారు, ఒకప్పుడు నాన్నతో తను పొందిన అనుభవాన్ని తన పాపాయి నుంచి కూడా ఎదుర్కొన్నారట. చందమామ కథను ఒకసారి చదివి వినిపిస్తే మళ్లీ మళ్లీ వినాలి అనే కుతూహలంతో తప్పుల తడకగా చందమామ కథను చదివి నవ్వించే పాప, ఒకట్రెండుసార్లు చదివి ఇక కుదరదంటే “నేను పెద్దయ్యాక నా పాపకి నీలా చదవను ఫో అనను. ఎన్నిసార్లయినా చదివి వినిపిస్తాను తెలుసా?” అంటూ బుంగమూతి పెట్టేదట.
ఇదీ చందమామ ఘనత, చందమామతో బంధం అల్లుకున్న తరతరాల తెలుగు కుటుంబాల ఘనత. ఆదిలక్ష్మిగారు, ఆమె జీవన సహచరుడు, వారి పాపాయి దశాబ్దాలుగా నింగిలోని చందమామతో పాటు నేలమీది ‘చందమామ’తో కూడా చెలిమి కొనసాగిస్తున్నారు. నేలమీది ‘చందమామ’తో ఇటీవలి వరకు ప్రత్యక్ష సంబంధం లేని ఆదిలక్ష్మి గారు ఇటీవలే చందమామతో పరిచయంలోకి వచ్చారు.
నాన్న ద్వారా పరిచయం అయిన చందమామను కన్నకూతురికి కూడా పరిచయం చేయడమే కాదు… తాను పాఠాలు చెబుతున్న స్కూలు పిల్లలకు కూడా కథామృతాన్ని పంచిపెడుతూ, రేపటి తెలుగు తరాన్ని తయారుచేస్తున్న ఆదిలక్ష్మిగారూ… మీ చందమామ కుటుంబాన్ని చూసి చందమామ సిబ్బందిగా మేం గర్వపడుతున్నాం.
చందమామతో మీ జ్ఞాపకాలను పంచుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఆదిలక్ష్మిగారి అరచేతిలో అందాల ‘చందమామ’ జ్ఞాపకాల పూర్తి పాఠం కోసం కింది చందమామ వెబ్‌సైట్ లింకులో చూడండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2444
ఈ కథనానికి గాను మార్చిన ఫోటో ఆదిలక్ష్మిగారి అమ్మాయి గీతాప్రియది. ఈమె చిన్నవయసులోనే ‘ఆహా ఓహో’ అనే బ్లాగు నడుపుతున్నారు. http://paalameegada.blogspot.com/
ఈ బ్లాగు కూడా సహజంగా కథలకే ప్రాధాన్యత ఇస్తూండటం గమనార్హం. చూడగలరు.
చందమామ పాఠకులు తమ చందమామ జ్ఞాపకాలను కింది లింకుకు పంపగలరు.
Filed under చందమామతో మా జ్ఞాపకాలు | Tags: అగ్ని, ఆకాశం, ఆదిలక్ష్మి, ఇతిహాసాలు, ఒంటికొమ్ము, కవలలు, కొడుకులు, గజదొంగలు, గాలి, గ్రామాధికారులు, చందమామ, చింతచెట్టు, చేపలు, జానపదం, జ్ఞాపకాలు, దెయ్యాలు, నీళ్లు, పంచభూతాలు, పాత్రలు, బొమ్మలు, భూమి, మాంత్రికులు, రాక్షసులు, రాజు, వింతలోకాలు, వేట | Comments (7)గుణాఢ్యుడి బేతాళ కథలు
“అనగనగనగా ఒక ఊర్లో ఓ రాజు ఉండేవాడట. ఆయనకేమో ఏడుగురు కొడుకులంట. వాళ్లేమో చేపలు పట్టాలని ఒక రోజు వేటకు పోయారట.. ఊకొట్టండిరా.. ఉలకరు పలకరూ….” తొలి వాక్యం చదువుతుంటేనే మనందరికీ అర్థం అవుతుంది. ఒక అమ్మో, అక్కో, చెల్లో తన చుట్టూ పిల్లలను కూచోబెట్టుకుని ఈ భూమ్మీద ఎక్కడో ఓచోట ‘కత’ చెబుతోందని. పిల్లలు రాత్రి మీరాక తూగు కళ్లతోనే ‘కత’లు వింటూ, ఊకొడుతున్నారని.
ఈ ప్రపంచంలో ఎవరు మర్చి పోగలరు దీన్ని? తరతరాలుగా మానవజాతి బాల్యాన్ని ఉద్దీపింప జేసిన, చేస్తున్న స్వప్నలోకం కదా ఇది. మరి, రెండు వేల సంవత్సరాలుగా భారతీయులను ఉత్కంఠ భరిత వాతావరణంలోకి తీసుకుపోయిన, నేటికీ తమదైన ప్రభావం వేస్తున్న గొప్ప కథల మాటేమిటి? అవి….బేతాళ పంచవింశతి పేరుతో విశ్వవిఖ్యాతమైన కథలు. అవి చందమామ పత్రిక చరిత్రకు శిరోభూషణంగా వెలుగొందుతున్న అజరామర కథలు.
ఆంధ్ర దేశంలొనే కాదు ప్రపంచమంతటా కూడా చిన్నపిల్లలకు నిద్రపోవడానికి తల్లిదండ్రులు చిన్న చిన్నకథలు చెప్పడం బాగా అలవాటు. ఇవి ప్రపంచ జానపద సంస్కృతిలో భాగం. పాత కాలపు కథల్లో తూర్పుదేశాల కథలు ప్రసిద్ధిపొందాయి. కథ అంటే కొంత సత్యాంశతో కూడిన కల్పిత గద్యం. ప్రధానంగా కథలు ముఖ్యంగా నీతి, ధర్మం, సాహసం, ఔదార్యం, శృంగారం వంటి విషయాలు ప్రధాన వస్తువుగా నడుస్తాయి. చందమామ కథలు కూడా ఈ గీత వెంబడే పయనిస్తూ వచ్చాయి.
చందమామ కథల ప్రత్యేకతలు
చదవడానికి, వినటానికి మధ్య వారను చెరిపివేసిన చరిత్ర చందమామ కథలది. చందమామ మాసపత్రికలో ప్రచురించబడ్డ కథలే చందమామ కథలు. చందమామ మొదట్లో పిల్లల కథలకు ప్రత్యేకించబడినదే కావచ్చు కాని అది క్రమేణా పెద్దలు చదివే పిల్లల కథలకు పేరు పడింది. విశ్వనాథ సత్యనారాయణ వంటి వారిని కూడా సమ్మోహనపర్చిన చరిత్ర చందమామ కథలది.
దేశంలో చదవగలిగిన, సాహిత్యంతో అంతో ఇంతో పరిచయం కలిగిన ప్రతి కుటుంబమూ, చందమామను తన పిల్లలకు బహూకరించిన ఘనచరిత్రను కలిగి ఉందంటే, ఈనాటికీ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తోందంటే కథా సాహిత్యంలో చందమామ సాధించిన ఘనత ఏమిటో అర్థమవుతుంది. చందమామ కథలు చదువుతూ పెరిగిన పిల్లలు ఐదారు తరాలవరకు ఉంటారు. చందమామ కథల ముఖ్యమైన ప్రత్యేకత సరళమైన భాష, చక్కటి శైలి, చిన్న చిన్న పదాలు ఆపైన వాటి అర్ధవంతమైన వాడుక.
చందమామ కథలన్నీ కూడ ప్రస్తుతపు ఆధునిక ప్రపంచానికి సంబంధించినవి కావు. మధ్యయుగాల జానపద సంస్కృతికి మూలకందాలుగా మిగిలిన ఆనాటి మానవ జీవితానుభవాలను అందరికీ అర్థమయ్యే సరళ భాషలో కథల రూపంలో చందమామ తెలుగువారికి, భారతీయులకు అందించింది.
చందమామ కథల్లో ఆనాటికీ, ఈనాటికీ, ఏనాటికీ కూడా వన్నెచెదరని ఆణిముత్యాలు “బేతాళ కథలు.” ఇవి వందలాది సంవత్సరాల క్రితం గుణాడ్యుడు అనే కవి రాసిన బృహత్కథలో భాగంగా చరిత్రకెక్కాయి. ఈ 25 కథలు ఒకే ఒక రాత్రి కాలంలో బేతాళుడికి, విక్రమాదిత్యుడికి మధ్య జరిగిన మౌనభంగ పరిణామాలకు ప్రతిరూపం.
క్రీ.శ. 1వ శతాబ్ధిలో గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృత భాషలో బృహత్కథ అనే పెద్ద కథా కావ్యం వ్రాశాడు. కాశ్మీరదేశ గాథననుసరించి పైశాచీప్రాకృతమున బృహత్కథను రచించిన గుణాఢ్యుడు, ఆంధ్రరాజస్థానాన్ని అలంకరించిన విద్వాంసుడు. బృహత్కథ అనే పెద్ద తానులో బేతాళ పంచవింశతి ఓ ముక్కగా చెప్పవచ్చు. పంచవింశతి అంటే ఇరవై అయిదు. ఇది మూలంలో బేతాళ కథల సంఖ్య.
బృహత్కథ రాసి ఇప్పటికి 2 వేల సంవత్సరాలు గడిచాయి. శతాబ్దాలు, సహస్రాబ్దాలు గడిచినా గుణాడ్యుడి బేతాళ కథల అందం చెక్కుచెదరలేదు. వందల ఏళ్లు గడిచినా ఈ కథల గుబాళింపు తగ్గనే లేదు. చందమామ పుణ్యమా అని బేతాళ కథలు అనగానే అవి పిల్లల కథలు అని చాలామందికి అనిపించవచ్చు. వాస్తవానికి బేతాళ కథలు పిల్లల కథలు కావు. ఒరిజనల్ బేతాళ కథల్లో చాలావరకు శంగార కథలే అంటే ఆశ్చర్యం వేస్తుంది.
అయితే బేతాళ కథలు పేరుతో గత 55 ఏళ్లుగా బాలల మాసపత్రిక ‘చందమామ’ వందలాది కథలను అందిస్తూ వస్తున్నందవల్ల బేతాళ కథలు అంటే పిల్లల కథలుగానే చాలామందికి స్పురిస్తున్నాయి. నిజం చెప్పాలంటే బేతాళ కథలు మార్చి రాయాలని తీసుకున్న నిర్ణయం చందమామ చరిత్రనే ఓ కొత్త దశకు మళ్లించింది. ప్రపంచ చరిత్రలో ఏ పత్రికా సాధించలేనంత అద్బుత రికార్డును చందమామకు కట్టబెట్టినవి కూడా ఈ బేతాళ కథలే మరి.
జీవితంలో ఎన్నో చిక్కుముడులు ఉంటాయని ఎన్నో ధర్మసూత్రాలు ఎదురవుతాయని, వాటిని పరిష్కరించడానికి విచక్షణ, విజ్ఞత అవసరమని బేతాళ కథలు మనకి తెలియజేస్తాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ఈ మూల కథల్లో లభించే పరిష్కారాలన్నింటితో మనం ఏకీభవించవలసిన అవసరం లేదు.
త్రివిక్రమాదిత్యుడు లేక తెలుగులో బాగా ప్రాచుర్యంలో ఉన్న విక్రమార్కుడి విచక్షణ సర్వకాల సర్వావస్థల్లోనూ చెల్లిపోతుంది అని ఎవరూ భావించనవసరం లేదు. బేతాళ కథలులో దేవుళ్లూ, దెయ్యాలూ, మాయలూ, మర్మాలూ అన్నీ ఉన్నాయి. బలులున్నాయి. చచ్చినవాడిని బతికించడాలు ఉన్నాయి. వీటిని పాఠకులు విమర్శనాత్మకంగానే పరిశీలించాలి. మనదైన విచక్షణతోనే వీటిని స్వీకరించాలి.
ఈ మూలకథలు రాసిననాటికి ఇప్పటికీ ఎన్నో శతాబ్దాలు గడిచాయి. జీవితంలో మంచి చెడుల విచక్షణలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. మనందరికీ తెలుసు. ఒకనాడు మంచి అనుకున్నది ఈనాడు కాకపోవచ్చు. ఈ కథల్లో ఉన్న ఒక సుగుణం ఏమిటంటే ఏ విషయంలో అయినా మంచిచెడులనూ, ధర్మాధర్మాలనూ, ఉచితానుచితాలనూ వేరు చేసి చూడాలంటే ఎంతో వివేచనా, ఎంతో తర్కశక్తీ అవసరమని మనకివి తెలియజేస్తాయి. అనుకున్న పని సాధించాలంటే ఎంతో ఓపికా పట్టుదలా అవసరమని చెబుతాయి. ప్రమాదాల బారినుంచి తప్పించుకోవాలంటే కేవలం ధైర్యం ఒక్కటే చాలదు. తెలివి కూడా కావాలని బేతాళ కథలు మనకు బోధిస్తాయి.
ఇరవై అయిదు భాగాలతో కూడిన బేతాళ మూల కథలు గతంలోనూ వావిళ్ల వారి ప్రచురణల కింద వచ్చాయి. ఈ మధ్య కూడా తెలుగులో బేతాళ కథలు, ఆధునిక బేతాళ కథలు పేరుతో పలు పుస్తకాలు వచ్చాయి. ఈ కోవలో వచ్చిన మరో పుస్తకం ‘గుణాఢ్యుడి బేతాళ కథలు’. ఎన్ని సామ్రాజ్యాలు కూలినా, వ్యవస్థలు అంతర్ధానమైపోయినా, జీవన విలువలు క్రక్కదలి పోయినా, ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా గుణాఢ్యుడి బేతాళ కథలకున్న పటుత్వం సడలలేదు. రెండు వేల సంవత్సరాలుగా కాలపరీక్షకు తట్టుకుని నిలబడిన గొప్ప కథలివి.
తెలుగు పాఠకలోకానికి అనువాద మాంత్రికుడు సహవాసి అందించిన చివరి పుస్తకం ఇది. సహవాసి తన జీవితం చివరి దశలో అందించిన అరుదైన అనుసృజన ఇది. ఈ కథలను చదువుతుంటే జబ్బుపడిన మనిషి రాసినట్లుగా పాఠకునికి తెలీదని, అదే సహవాసి విశేషమని ప్రచురణ కర్తలు చెప్పారు. ‘గుణాఢ్యుడి బేతాళ కథలు’ ను పీకాక్ క్లాసిక్స్ వారు 2008లో ప్రచురించారు.
చందమామలో బేతాళ కథలను గత నాలుగైదు తరాలుగా చదువుతున్న పాఠకులు, అభిమానులు ఈ పుస్తకాన్ని గుండెలకు హత్తుకోవచ్చు. బేతాళ కథలు మొదటి భాగం ఎలా మొదలైంది, విక్రమాదిత్యుడు బేతాళుడు సంధించిన చిక్కుముడిని విప్పలేకపోయినప్పుడు ఏమి జరుగుతుంది అనేదే పెద్ద ఉత్కంఠ భరితమైన అంశం.
బేతాళ కథలు కధాసాహిత్య చరిత్రలో, ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఎలా నిలిచిపోయాయో తెలుసుకోవాలంటే ‘గుణాఢ్యుడి బేతాళ కథలు’ కొని చదవండి. 135 పుటల ఈ అపురూప పుస్తకం వెల 50 రూపాయలు. ఇది విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ వంటి పుస్తకాల అంగళ్లవద్ద ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి.
ఇప్పటికే కొని ఉంటే సరి. లేకపోతే ఇప్పుడైనా ఈ పుస్తకాన్ని కొని చదవండి. సాహిత్య అభిమానులు, చందమామ ప్రియులు కూడా కలకాలం దాచుకుని భద్రపర్చుకోవాల్సిన గొప్ప పుస్తకం ఇప్పుడు చక్కటి అనువాదంతో మీముందు ఉంది మరి.
Filed under ఆన్లైన్ చందమామ రచనలు | Tags: గుణాఢ్యడు, చందమామ, జానపదం, పంచవింశతి, బృహత్కథ, బేతాళకథలు, సంస్కృతి | Comments (3)







