నాన్నా! చందమామ తీసుకురానా!!
(చందమామ అనుకోగానే గుర్తొచ్చేవి బొమ్మలే అంటున్నారు మేధాగారు. చందమామలో కథల కంటే కూడా బొమ్మలు చాలా బావుండేవని తన అభిప్రాయం. యువరాణి ఎంత అందంగా ఉంటుందో చూడాలంటే చందమామలోనే చూడాలంటున్నారు. కథలు కూడా ఏ వ్యక్తిత్వ వికాసానికీ తీసిపోని విజ్ఞాన గనులట. “గుణపాఠాలు నేర్చుకునే కధలు, మార్పు(పశ్చాత్తాపం) గురించిన కధలు, మంచిగా ఉండేవాళ్ల కధలు.. చిన్నప్పటి నుండి ఇలాంటివి చదవడం వల్ల, మనకి తెలియకుండానే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాం.. ఎప్పుడైనా తప్పు చేయాల్సి వచ్చినా భయమేస్తుంది, ఆ కధలోలా నాకు కూడా ఏమైనా జరుగుతుందేమో అని..” అంటున్నారు.
తరాలుగా చందమామను చదువుతూ వచ్చిన వారి మనోభావాలకు చందమామ జ్ఞాపకాలు ఓ ప్రతీక. ‘మా బామ్మ చదివింది చందమామ, మా అమ్మ చదివింది చందమామ, నేను చదివాను చందమామ..’ అంటూ గ్రైఫ్ వాటర్ ప్రకటనను గుర్తు చేయడం ద్వారా చందమామను ఇంటిల్లిపాదీ ఎలా తమ హృదయాలకు హత్తుకునేవారో తేల్చి చెప్పారు. చక్కటి చందమామ జ్ఞాపకాలు పంపిన మేధాగారికి కృతజ్ఞతాభినవందనలు. నాలోనేను పేరిట చక్కటి బ్లాగును కూడా తను నిర్వహిస్తున్నారు.
“ఇప్పటికీ బస్టాండ్‌లో బస్ కోసం నించున్నప్పుడు నాన్నగారు ‘చందమామ తీసుకురానా!’ అంటుంటారు..” బిడ్డకు చందమామను కొనిపెట్టే తండ్రి… చందమామను పిల్లలకు కొని ఇవ్వగలిగిన తెలుగు కుటుంబాలు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే పని చేస్తున్నాయనుకుంటాను. ఏమయినా మీ జన్మ ధన్యమైనది. మీ నాన్నగారికి చందమామ తరపున మనఃపూర్వక వందనాలు.
మేధాగారి చందమామ జ్ఞాపకాల పూర్తి పాఠాన్ని ఇక్కడ చదవండి.)
చందమామ – 1970/80/90 ల తరానికి పరిచయం అక్కర్లేని పత్రిక.. పిల్లల పత్రికల్లో అగ్రతాంబూలం అందిపుచ్చుకున్న పత్రిక. కేవలం పిల్లల పత్రిక అంటే, చంపిలు నా మీద దండెత్తే ప్రమాదం కూడా ఉంది..
చందమామతో పరిచయం ఎలా జరిగిందో గుర్తు లేదు కానీ, నేను చదివిన మొదటి పుస్తకం మాత్రం చందమామే!.. అదేదో గ్రైఫ్‌వాటర్ ప్రకటనలోలా, మా బామ్మ చదివింది చందమామ, మా అమ్మ చదివింది చందమామ, నేను చదివాను చందమామ..!
అప్పట్లో చందమామ వస్తుంది అంటే చకోర పక్షుల్లా ఎదురు చూసే వాళ్ళం.. మేము ఉన్న ఊర్లో ఈ పుస్తకాలు దొరికేవి కాదు, అందుకని ప్రక్క ఊరికి వెళ్ళి తీసుకు వచ్చేవారు నాన్నగారు.. ఈ రోజు వెళ్ళి తీసుకు వస్తాను అంటే, నాన్నగారు వచ్చేసరికల్లా, చదువంతా పూర్తి చేసుకుని, ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం.. అది రాగానే, నా కంటే నాకు అని గొడవలు, పోట్లాటలు..
చందమామ అనుకోగానే, గుర్తొచ్చేవి బొమ్మలు.. కధల కంటే కూడా బొమ్మలు చాలా బావుండేవి.. రాము(రాముడు మంచి బాలుడు) ఇలానే ఉంటాడేమో.. పాపం విక్రమార్కుడు ఇలా బేతాళుడిని మోసుకువెళ్ళేవాడా, అబ్బ ఆ యువరాణి ఎంత అందంగా ఉందో! గయ్యాళి గంగమ్మ ఇలానే ఉంటుందా.. బొమ్మలు అంటే ముఖచిత్రం గురించి కూడా చెప్పాలి.. ఆ నెలలో ఏమైనా పండగలు ఉంటే వాటికి తగ్గ బొమ్మలతో అందంగా ముస్తాబై ఉండేది..
కధల గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఏ వ్యక్తిత్వ వికాసానికి తీసిపోని విజ్ఞాన గనులు. విలువలు నేర్పుతూ, ఊహాశక్తిని పెంపొందిస్తూ, సమస్యల చిక్కుముడులు ఎలా విప్పదీయాలో చూపిస్తూ, క్రొత్త విషయాలు నేర్పుతూ, చరిత్రని గురించిన సంగతులు, పురాణాలు, ఇతిహాసాలు.. ఒహటేమిటి, అదీ-ఇదీ అని కాదు, లేనిది లేనే లేదు..
నీతి కధల్లోనే ఎన్నో రకాలు.. గుణపాఠాలు నేర్చుకునే కధలు, మార్పు(పశ్చాత్తాపం) గురించిన కధలు, మంచిగా ఉండేవాళ్ల కధలు – ఇలా ఎన్నో.. చిన్నప్పటి నుండి ఇలాంటివి చదవడం వల్ల, మనకి తెలియకుండానే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాం.. ఎప్పుడైనా తప్పు చేయాల్సి వచ్చినా భయమేస్తుంది, ఆ కధలోలా నాకు కూడా ఏమైనా జరుగుతుందేమో అని.. అలా పిల్లల వ్యక్తిత్వాలని తీర్చిదిద్దే పత్రిక చందమామ అంటే అతిశయోక్తి కాదేమో..
ఇక విక్రమార్కుడి కధలు అసలు సిసలు విశ్లేషణా సామర్థ్యం ఉన్న కధలు.. మరీ చిన్నప్పుడు ముగింపు చదివితే తప్ప ఇలా పరిష్కరిస్తారు అని తెలిసేది కాదు.. తరువాత తరువాత కాస్త కాస్త విశ్లేషణ చేయడం, అప్పుడప్పుడు నేను అనుకున్నట్లు లేకపోతే అమ్మతో ఎందుకు ఇలా ఉంది, ఇలా కూడా ఉండచ్చు కదా అని వాదనలు.
ఇక సీరియల్స్.. యండమూరిలు, యధ్ధనపూడిలు, డాన్ బ్రౌన్‌లు సరిపోరు అనిపిస్తుంది.. ఆ సీరియల్ కోసం మళ్ళీ నెల ఆగాలంటే అమ్మో అనిపించేది.. ముగింపు వచ్చిన సంచిక ప్రక్కన పెట్టుకుని మళ్ళీ అన్ని భాగాలు చదివితే తప్ప తృప్తిగా ఉండేది కాదు.
వీటన్నింటితో పాటు, ప్రముఖుల జీవిత చరిత్రలు చిట్టి-పొట్టి కధల రూపంలో వస్తుండేవి.. ఇక్కడ కూడా మళ్ళీ బొమ్మలదే ప్రముఖ పాత్ర..
మొదట్లో సంపాదకీయం చదివేదాన్ని కాదు కానీ, కొంచెం పెద్దయిన తరువాత అది కూడా చదవడం మొదలుపెట్టాను.. తక్కువ పదాలలో, చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా ఎలా చెప్పాలో తెలుస్తుంది!
ఇవన్నీ ఒకెత్తు, పురాణాల గురించిన కధలు ఇంకో ఎత్తు. ఇప్పుడంటే డేటాబేస్ బాగా దెబ్బతింది కానీ అప్పట్లో, పురాణాలలో ఏ కధ గురించి అడిగినా కూడా తడుముకోకుండా చెప్పగలిగి ఉండేదాన్ని.. మా తమ్ముడైతే ఒకడుగు ముందుకేసి, మా పిన్నిలని, మామయ్యలని ఎక్కడెక్కడి ప్రశ్నలో అడిగి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు.
ఇంకా ప్రకటనలు, మీకు తెలుసా అంటూ క్విజ్‍లు, బొమ్మకి వ్యాఖ్యలు.. అదో నోస్టాల్జియా..
కొసమెరుపేంటంటే, ఇప్పటికీ బస్టాండ్‌లో బస్ కోసం నించున్నప్పుడు నాన్నగారు ‘చందమామ తీసుకురానా!’ అంటుంటారు..
–మేధా
http://nalonenu.blogspot.com
మేధాగారి చందమామ జ్ఞాపకాలను చందమామ వెబ్‌సైట్‌లో కూడా కింది లింకులో చూడగలరు
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2433
మీ చందమామ జ్ఞాపకాలను కూడా రాసి కింది లింకుకు పంపగలరు.
abhiprayam@chandamama.com
ప్రతి ఇంట్లో చందమామ ఉన్న అందమైన కాలం
చిన్నప్పటి విషయాలు అందరికి అన్ని గుర్తుండవు. నా సంగతి అంతే అనుకోండి. కాని చందమామతో అనుబంధం జీవితాంతం మనసులోనుండి పోదు పోలేదు అని నేను, నాలాంటి ఎందరో చంపిల అభిప్రాయం అని ఖచ్చితంగా చెప్పగలను. స్కూలులో చెప్పిన తెలుగు పాఠాలకంటే అమ్మ ఇంట్లో చదివించిన చందమామ వల్లే నాకు తెలుగు మీద ఆసక్తి, పట్టు కలిగింది అని గర్వంగా చెప్పుకుంటాను.
పిల్లలున్న ప్రతి ఇంట్లో చందమామ ఉండి తీరాల్సిందే అనే అందమైన కాలం అది. అమ్మలు, నాన్నలు తమకోసం, తమ పిల్లల కోసం చందమామ కొనేవారు. ప్రతి నెల క్లాసు ప్రోగ్రెస్ రిపోర్ట్ కంటే ఎక్కువగా (అంతకంటే ఎక్కువగా) చందమామ కోసం ఎదురుచూపులు. అది రాగానే నాకు, తమ్ముళ్ళకు మధ్య బల ప్రదర్శన. నాదే గెలుపనుకోండి.
అప్పుడప్పుడు ఆ పుస్తకం వాళ్ళ కంటపడకుండా మొత్తం చదివేసి డ్రాయింగ్ రూం లో పెట్టేయడం. ఇక ఎవరేమన్నా చేసుకోండి నేను చదివేయడం ఐపోయింది అని ..కాని గంటలో పుస్తకం అవ్వగొట్టి నేలంతా ఎదురుచూడాలంటే మాత్రం విసుగేసేది. అమ్మ చదివే వారపత్రికలలాగా చందమామ కూడా వారానికోటి వేస్తే వీళ్ల సొమ్మేం పోతుంది. డబ్బులిచ్చే కొంటాము కదా అని పదో క్లాసు వరకు తిట్టుకున్నాను కూడా………
జ్యోతి గారూ,
పిల్లలున్న ప్రతి ఇంట్లో చందమామ ఉండి తీరాల్సిందే అనే మెరుపువాక్యంతో అదరగొట్టేశారు. వ్యక్తిగతంగా సమాచారం పంపకున్నా మీరు చందమామ జ్ఞాపకాలు స్వయంగా పంపారు. అందుకు మనఃపూర్వక కృతజ్ఞతలు.. ఆన్‌లైన్ చందమామతో మీ చందమామ జ్ఞాపకాల బంధం ఇలాగే కొనసాగుతుందని.. కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాము.
“పిల్లలున్న ప్రతి ఇంట్లో చందమామ ఉండి తీరాల్సిందే అనే అందమైన కాలం అది.”
చందమామ స్వర్ణయుగ చరిత్రకు ఈ వాక్యం సాక్షీభూతంగా నిలుస్తోంది కదా..
“అమ్మ చదివే వారపత్రికలలాగా చందమామ కూడా వారానికోటి వేస్తే వీళ్ల సొమ్మేం పోతుంది. డబ్బులిచ్చే కొంటాము కదా అని పదో క్లాసు వరకు తిట్టుకున్నాను కూడా.”
అమ్మా.. అమ్మమ్మా.. ఎంత పెద్ద ఆశండీ మీకు. ఇక్కడ నెలకు ఓ సంచిక తీసుకువస్తూంటేనే మా పని “అయిపోతోంది” అన్నిరకాలుగా.. ఇక వారానికోసారా…
“క్లాసు పుస్తకాలు బోర్ కొడితే పాత చందమామలు తీసి సింగిల్ పేజీ కథలు చదవడం అలవాటు.”
అన్ని కాలాలకు వర్తించే గొప్ప మాట..
“పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళ కోసం తెప్పించే చందమామలు ముందు నేనే చదివేదాన్ని.”
చందమామ బతుకుతోందంటే మీవంటి ఆరాధకుల వల్లే కాబోలు.
“పుస్తకం చేత పట్టుకుని కథలో లీనమై చదువుతుంటే ఉండే ఆనందం, తన్మయత్వం, ఆన్‌లైన్‌లో.. కంప్యూటర్‌లో చదివితే వస్తుందా? రాదు గాక రాదు గాక రాదు..”
చందమామను కొని భద్రపెట్టుకున్న వారికి పుస్తకం పట్టుకుని చదివే భాగ్యం ఉందనుకోండి. ఆ భాగ్యం లేనివారి మాటేమిటి? అందుకే.. ఇలాంటివారికోసమే… నాలాంటి వారికోసమే.. ఆన్‌లైన్ ఆర్కైవ్స్‌లో పాత చందమామల నిధి ఓ పెన్నిధిలాగా ఉపయోగపడుతోంది. అయితే రిఫరెన్స్ కోసం చందమామ కథలు వెతుక్కోవాలంటే పుస్తక రూపంలో ఉన్న సౌలభ్యం ఆన్‌లైన్‌లో ఉండదనుకోండి. చందమామ కథల మొత్తం కేటలాగ్‌ను (గత 62 సంవత్సరాల సంచికలవి) రూపొందించి పాఠకులకు అందుబాటులోకి తెస్తే బాగుంటుందేమో మరి.
జ్యోతిగారి చందమామ జ్ఞాపకాల పూర్తి పాఠం కిందిలింకులో చదవండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2244
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.
చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49
చందమామతో చెలిమి – మా చందమామ జ్ఞాపకాలు

చందమామ జ్ఞాపకాలు : త్రివిక్రమ్
త్రివిక్రమ్ గారూ,
మనఃపూర్వక కృతజ్ఞతలు. పని ఒత్తిళ్లలో ఉండి కూడా ఆలస్యంగా అయితేనేం, మీ చందమామ జ్ఞాపకాలను “చందమామతో చెలిమి మా చందమామ జ్ఞాపకాలు’ పేరిట తీపిగుర్తులుగా ఆన్‌లైన్ చందమామకు పంపారు.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2166
ఈ శీర్షిక మొదలు పెట్టినప్పుడు మొదట మీదే రావలసి ఉండె. మొత్తంమీద 30, 40 సంవత్సరాల క్రితం తెలుగు చదవగలిగిన కుటుంబాలు ఆంధ్రరాష్టం నలుమూలలా సాగించిన చందమామ ఒరవడిని మీ ‘చందమామతో చెలిమి’ కథనం చక్కగా వివరించింది. చదువుతుంటే మా యింట్లో నాన్న చందమామను తొలిసారిగా తీసుకువచ్చి మాకు పరిచయం చేసిన నాటి అమృత గడియలు ఒక్కసారిగా జ్ఞాపకానికి వచ్చాయి.
రెండు మూడు తరాల క్రితం కుటుంబానికి చందమామకు లంకె కుదర్చాలంటే నాన్నే ప్రధాన ఆధారం. అందుకే తెలుగునాట చందమామ నాన్నల ఆదరణ సాక్షిగా మొగ్గతొడిగిందంటే అతిశయోక్తి కాదనుకుంటా. (అమ్మల ప్రోత్సాహం, తమపిల్లలకు వారు కథలతో జోకొట్టడం వంటివి ఉన్నప్పటికీ, ఊకొడితే చాలు ఆ గడియకో కథ చెబుతూ పిల్లల కథా దాహాన్ని తీర్చడంలో అమ్మల పాత్ర తక్కువేమీ కాదు)
ఈ శీర్షిక కేవలం చందమామ అభిమానులకు, ‘చంపి’ లకు, పాఠకులకు మాత్రమే సంబంధించింది కాబట్టి వీలైనంత మంది చందమామ ప్రేమికులు తమ చందమామ జ్ఞాపకాలను కింది లింకుకు తమ ఫోటోతో సహా పంపితే బాగుంటుంది.
చందమామను తన సవతుల్లో ఒకటిగా భావించిన మీ జీవన సహచరి చివరకు తానే చందమామ ప్రేమికురాలిగా మారడం…
ఇంతకంటే చందమామకు ఏం కావాలి. తెలుగు జాతికి, చందమామకు ఏర్పడిన ఈ రుణానుబంధం ఎన్నటికీ చెరిగి పోకూడదని ఆశించడం తప్ప మనం ఏం చేయగలం చెప్పండి.
అంతవరకూ పాఠకుల ‘చందమామ జ్ఞాపకాలు’ కోసం నిరీక్షిస్తూ…
రాజు.
త్రివిక్రమ్ గారి ‘చందమామతో చెలిమి’ కథనం కోసం కింది లింకులో చూడగలరు
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2166
ఆన్‌లైన్ చందమామ హోమ్ పేజీలో కూడా చూడగలరు.
telugu.chandamama.com కు మీ రచనలు, చందమామ జ్ఞాపకాలు, సూచనలను కింది లింకుకు పంపండి.
Filed under చందమామతో మా జ్ఞాపకాలు | Tags: అమ్మ, కడప, కుటుంబం, చందమామ, చందమామ జ్ఞాపకాలు, చందమామతో చెలిమి, చంపిలు, త్రివిక్రమ్, నాన్న, పోటీ | Comments (2)మా చందమామ జ్ఞాపకాలు

బాల్యాన్ని ఎవరు మర్చిపోగలరు? బాల్యంతో ముడిపడిన చందమామ అనుభూతులను ఎవరు మర్చిపోగలరు? చందమామతో కలగలసిన ఆ పసితనాన్ని ఎవరు మరువగలరు? ఆ జ్ఞాపకాలను, చందమామ పరిమళాలను అందరికీ పంచండి. మనకంటూ మిగిలిన జాతి సంపద, సాంస్కృతిక సంపద చందమామ ఒక్కటే కదా…
చందమామ జ్ఞాపకాలను దశాబ్దాలుగా కొనసాగిస్తున్న వందలాదిమంది అభిమానులకు, బ్లాగర్లకు, నెటిజన్లకు ఆన్‌లైన్ చందమామను సాదర నిలయంగా మార్చాలనే ఆశయంతో http://telugu.chandamama.com లో “మా చందమామ జ్ఞాపకాలు” విభాగాన్ని రూపొందించాము.
తెలుగునాడులో ఎంతమంది చందమామతో తమ బాల్యజీవితంలోని తాదాత్మ్య క్షణాలను గుర్తుతెచ్చుకుంటూ పలవరిస్తున్నారో ఈ ప్రపంచానికి చాటి చెప్పాలనే చిరు ఆకాంక్షతో… ఆన్‌లైన్ చందమామలో ఈ విభాగాన్ని ఏర్పర్చాము.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49
తెలుగు జాతి సాంస్కృతిక సంపద అయిన చందమామను ఈ నాటికీ తమ జ్ఞాపకాల దొంతరలలో పదిలపరుచుకుంటున్న చందమామ అభిమానుల గుండె చప్పుళ్లను ఓ చోట చేర్చి అందరికీ పంచిపెట్టాలనే చిరు కోరికే ఈ “మా చందమామ జ్ఞాపకాలు” విభాగం రూపకల్పనకు మూలం.
జీవించడం కోసం ప్రపంచం నలుమూలలకు వలసపోయిన తెలుగు వారు చందమామ పత్రికతో తమ తరాల అనుబంధాన్ని నేటికీ ఎలా కాపాడుకుంటూ వస్తున్నారో, చందమామ జ్ఞాపకాలను పరస్పరం ఎలా పంచుకుంటున్నారో తెలిపే అమూల్యమైన వ్యాసాలు, లింకులు, తదితర సమాచారం ఈ విభాగంలో పొందుపర్చడం జరుగుతుంది.
చందమామతో తమ జ్ఞాపకాలను, అనుభూతులను ఈ విభాగంలో పంచుకోవాలని భావిస్తున్న అభిమానులకు, ‘చంపి’లకు(చందమామ పిచ్చోళ్లు) ఇదే మా సాదర ఆహ్వానం.
బాల్యంలో మీ చిన్ననాటి చిరునేస్తంగా పలకరిస్తూ వచ్చిన చందమామ జ్ఞాపకాలను మీరు తెలుగులో లేదా ఇంగ్లీషులో కింది లింకుకు పంపించగలరు. వీలయితే మీ ఫోటో, ప్రొఫైల్, ఈమెయిల్ చిరునామా తదితర వివరాలను కూడా పంపగలరు.
ఆన్‌లైన్ చందమామకు మీ ఈమెయిల్ చిరునామాను పంపగలిగితే త్వరలో తీసుకువస్తున్న చందమామ న్యూస్‌లెటర్‌ను మీకు ప్రతివారం నేరుగా మీ ఈమెయిల్ ద్వారా పంపడానికి వీలవుతుంది.
చందమామతో మీ జ్ఞాపకాలు, మీ స్వంత రచనలు, సలహాలు, సూచనలు, విమర్శలను కింది లింకు ద్వారా ఆన్‌లైన్ చందమామకు పంపగలరు.
చందమామ పిచ్చోళ్లకు, అభిమానులకు చందమామ తరపున ఇదే మా ఆహ్వానం. మీ అమూల్యమైన సమయంలో కొంత కేటాయించి ఆన్‌లైన్ చందమామకు చందమామతో మీ అనుబంధం గురించి, మీకు ఆసక్తి ఉన్న అంశాలపైనా చిన్ని చిన్ని రచనలు అయినా సరే రాసి పంపడానికి మీకు వీలవుతుందా?
కథలు, గేయాలు, మీకు నచ్చిన పద్యాలు, పాటలు, సైన్స్, టెక్నాలజీ, హాస్యం, మీకు తెలుసా, లోకజ్ఞానం, భారత దర్శిని, ప్రపంచ దర్శిని, సాహిత్యం, శ్రావ్యమైన సంగీతం మీ ఇతర అభిరుచులు, ఆసక్తులకు సంబంధించి ఏ విషయంపైన అయినా సరే మీరు రచనలు పంపగలరు.
ప్రతి చందమామ పిచ్చోడికి, పిచ్చోళ్లకి, అభిమానులకు చందమామ ఆన్‌లైన్ తమదిగా ఫీలయ్యే వేదికగా ఉండాలని మా ప్రగాడ కాంక్ష, విశ్వాసం కూడా. హృదయం నిండా చందమామ తలపులను దివ్యంగా పొదవుకున్న మీ వంటి అభిమానులకు ఆన్‌లైన్ చందమామ సాదర నిలయంగా మారాలని కోరుకుంటున్నాం. మీరు పంపే ఏ రచనను అయినా సరే మీ పేరుతోనే చందమామలో పోస్ట్ చేస్తాము.
మీ రచన మీ స్వంతమేనని, ఆన్‌లైన్ చందమామలో ప్రచురణకు దాన్ని పంపుతున్నట్లుగా చిన్న ధ్రువీకరణను మీ ఈమెయిల్ ఐడి ద్వారా abhiprayam@chandamama.com కు పంపితే చాలు.
చందమామతో మీ అనుబంధం గురించి ఇప్పటికే మీరు బ్లాగుల్లో, వెబ్‌సైట్లలో పోస్ట్ చేసి ఉంటే ఆ లింకులను (url) ఆన్‌లైన్ చందమామకు పంపగలరు. అన్నిటినీ ఒకచోట అమర్చి పాఠకులందరికీ అందించడానికి వీలవుతుంది.
ఈ లోపల మీనుంచి మీ వంటి చందమామ అభిమానుల నుంచి మాకు నిజమైన సహకారం ఒకటి కావాలి. ఆశిస్తున్నాం కూడా. ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న ఆన్‌లైన్ చందమామ రచన, డిజైన్, హోమ్ పేజీతో సహా ప్రతి ఒక్క అంశంపై మాకు మీ సలహాలు, సూచనలు, విమర్శలు, నిర్మోహమాటమైన అభిప్రాయాలు కావాలి.
చందమామ మరింత మెరుగుపడాలని, పాఠకుల కోరికలకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్న మా కోరికను మీరు మన్నించినట్లయితే ఈ కింది లింకులకు మీరు మీ సూచనలు, సలహాలు, ప్రతిపాదనలు దయచేసి పంపగలరు. మీకు తెలిసిన చందమామ అభిమానులకు, ‘చంపి’లకు కూడా ఈ సమాచారం వీలయితే పంపగలరు.
abhiprayam@chandamama.com
Online@Chandamama.com
చందమామ పాత సంచికలలోని కథలను చదువదలిస్తే కింది ఆర్కైవ్స్ లింకులో చూడండి. గత సంచికల కోసం వెనక్కు వెళ్లి మీ అభిమాన కథలను మళ్లీ చదవండి. మా ఆర్కైవ్‌లను చూసి, ఆనందించండి.
http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL
చందమామతో మీ జ్ఞాపకాలను ఆన్‌లైన్ చందమామకు తప్పక పంపించగలరు. చందమామ పాఠకులు, అభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం.
Filed under ఆన్‌లైన్ చందమామ రచనలు, చందమామ చరిత్ర, చందమామతో మా జ్ఞాపకాలు | Tags: Add new tag, చందమామ, చంపిలు, జ్ఞాపకాలు, పాఠకులు | Comment (0)![Chandamama Collection Edition art1[6]_400-519](http://blaagu.com/chandamamalu/files/2010/03/Chandamama-Collection-Edition-art16_400-519.jpg)







