చిత్రా, శంకర్, ఆచార్యలపై మరికొంత
వేణూ గారూ! చాలా పొరపాటు జరిగిపోయింది. చందమామ కలెక్టర్ ఎడిషన్‌ను తెలుగులో ప్రచురించే పనుల్లో ఉండి గత వారం రోజులపైగా అనువాదాల ఒత్తిడిలో ఉండి ఇంటర్నెట్ చాలా తక్కువగా చూడటం. మధ్యలో ఓ మూడురోజులు తప్పనిసరై తిరుపతి, కడపలకు వెళ్లవలసిరావడంతో మీ హృదయంలోంచి వచ్చిన ఈ అపరూప కథనం -”చందమామ’పై చెరగని సంతకం ‘చిత్రా’- చూడటం కుదరలేదు.
ఇవ్వాళ కూడా ఎందుకో మీ బ్లాగును రెఫర్ చేయాలనిపించి తెరిచి చూస్తే మహాద్భుత దృశ్యం ఇదిగో ఇలా కళ్లముందు సాక్షాత్కరించింది. రెండు రోజులు కూడలి, జల్లెడ, హారం కేసి చూడలేకపోయినా, చందమామ అభిమానుల బ్లాగులు తెరువలేకపోయినా ఎంత ప్రమాదం జరుగుతుందో ఇప్పటికి ఏ నాలుగోసారో, అయిదో సారో నా అనుభవంలోకి వచ్చింది. అందులో తాజాగా మీది.
అందుకే కనీసం చందమామ అభిమానులు అయినా తాము కొత్తగా ఏదైనా రాసినప్పుడు ప్రత్యేకించి చందమామ గురించి, దాని చిత్రకారుల గురించి కథనం రాసిన పక్షంలో ఆ విషయాన్ని ఊరికే పోస్ట్ చేసి ఊరుకుండటం కాకుండా మనందరి ఈమెయిళ్లు కాస్త ఒపికగా సేకరించి అందరికీ బల్క్‌మెయిల్ రూపంలో మన కొత్త లింకులను పరస్పరం పంపగలిగితే ఎంత బాగుంటుందని గతంలోనే నేను రెండు మూడు సార్లు మొత్తుకున్నాను కూడా.
ఎందుకంటే అగ్రిగేటర్ సైట్లలో మన కథనాలు ఉంచినా, తాజాగా మంచి కథనాలు పోస్ట్ చేసినా సరే్ ఒక్కోసారి కాదు చాలాసార్లు అనివార్యంగా వాటిని సకాలంలో చూడలేని ఘటనలు నా అనుభవంలో చాలా సార్లు వచ్చాయి. ఇకనైనా మనం ఇలాంటి సందర్భాల్లో స్వయంగా మన రచనల పరస్పర పంపకం చేస్తేనే బాగుంటుందని బలంగా భావిస్తున్నా..
పరిమిత వనరులతో అయినా సరే చిత్రాగారి బొమ్మల గురించి ఇంత చక్కటి కథనం ప్రచురించారు. ఇదే మీరు చందమామ ఆఫీసుకు వచ్చి చిత్రా, ఎంటీవీ ఆచార్య, శంకర్, వపా గార్ల చిత్రాలు భారీ సైజులో చూడగలిగితే మీరు, శివరాం ప్రసాద్ గారు వంటి వారు ఎంత చక్కటి ప్రేరణ పొంది ఉండేవారో మాటల్లో చెప్పలేను.
కాని ఒక్కటి మాత్రం చెప్పగలను. దాసరి సుబ్రహ్మణ్యం, చిత్రా గార్ల గురించి మీరు చేసిన కృషి చందమామ చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది. ఇదే విధమైన క్వాలిటీ రైటింగ్‌ను మీరు, శివరాం గారు, తదితరులు కొనసాగించగలరని ప్రగాఢంగా ఆశిస్తున్నాను.
దీని కొనసాగింపుగా చిత్రా, శంకర్ గార్లపై నేను పొందుపర్చిన వార్తా విశేషాల సమాచారం ఓ పెద్ద కథనంలాగా తయారవడంతో దాన్ని మీ బ్లాగులో కామెంట్ రూపంలో పెట్టడం బాగుండదనే ఉద్దేశంతో ఈ మొత్తం కథనాన్ని నా చందమామ చరిత్ర బ్లాగులో పోస్ట్ చేయాలనుకుంటున్నాను.
చిత్రా గారి అస్తమయం గురించి “చందమామ గుండె పగిలిన వేళ” అనే పేరుతో నా బ్లాగులో రెండు వారాలక్రితం కథనం రాస్తూ ఆయన జీవిత వివరాల గురించి వచ్చే టపాలో తెలుసుకుందామని రాశాను. శంకర్ గారు ఆయన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు తెలిపారు. పైగా ఆయన 40 లేదా 50 ఏళ్ల క్రితం తన ఫోటో ఆల్బమ్‌లలో దాచుకున్న అపరూప చిత్రాలను ఒక్కటొక్కటిగా మాకు అంద జేస్తున్నారు.
సరిగ్గా వారం రోజుల క్రితమే ఆయన చిత్రాగారి అపరూప చిత్రాలు కొన్ని మాకు అందించారు. అవి అంత స్పష్టంగా లేకపోవచ్చు కానీ, చిత్రలేఖనంతో జీవితం పండించుకున్న ఇద్దరు చిత్రకారుల అపరూప జ్ఞాపకాలుగా చూడగలిగితే వాటి విలువ మనకు తెలుస్తుంది. అసలు చిత్రాగారికి ఫోటోగ్రపీపై ఉన్న అవగాహనను మరింత మెరుగుపర్చిందీ, ఆయనకు ఉత్తమ నాణ్యత కలిగిన కెమెరాలను దగ్గరుండి చూపించి మరీ కొనేలా చేసీందీ శంకర్ గారేనట.
చందమామ కలెక్టర్ ఎడిషన్‌లో ఉన్న గ్రూప్ పోటోలోని ఫోటోల్లో చిత్రాగారిని తదితర ప్రముఖులను గుర్తుపట్టి శంకర్ గారు గతవారంలో వివరంగా రాసి ఇచ్చినప్పుడు నాకు ఒక్కసారిగా ఎగిరి గంతేయాలనిపిపించింది. చిత్రాగారి సమకాలికులు, చందమామ తొలి ఇన్‌ఛార్జ్ ఎడిటర్ రాజారావు గారి టీమ్ సభ్యులు ముద్దా విశ్వనాధం గారి ఫోటోలు ఇక దొరకవు అని నిశ్చయించుకున్న తరుణంలో అతి స్పష్టంగా కనిపించే ఆయన ఫోటోను శంకర్ గారు ప్రసాదించారు.
ఎంటీవీ ఆచార్య గారి ఫోటోయే ఇంకా దొరక్కుండా మిగిలిపోయింది. ఆయన వ్యక్తిగత చరిత్ర కాని, చందమామలో ఆయన పోషించిన పాత్ర కాని చెప్పేవారు కూడా కనిపించే పరిస్థితి లేదు. ఆయన తన పనులమీద పదే పదే చందమామను విడిచి బెంగళూరు వెళ్లిపోవడం, తన చిత్రాల ప్రదర్శన పట్లే మక్కువ పెట్టి రష్యా వంటి దేశాలకు కూడా వెళ్లడం, ఈ క్రమంలో చందమామలో తను గీసిన అపరూప చిత్రాల ఒరిజినల్ నమూనాలను తన వెంట తీసుకుపోయి తిరిగి ఇవ్వకుండా అట్టే పెట్టుకోవడం వంటి ఘటనలతో శంకర్ గారికి కూడా ఎంటీవీ ఆచార్య గారిపై పెద్దగా గౌరవభావం లేనట్లు కనిపిస్తోంది. కన్నడ మేధావి వర్గాలలో ఆచార్య గారి గురించి జరిగిన చర్చలు ఆన్‌లైన్‌లో అక్కడక్కడా కనిపిస్తున్నప్పటికీ తన వ్యక్తిగత వివరాలు దాదాపుగా దొరకని స్థితి.
వేణు గారూ, మీ తదుపరి ప్రాజెక్టు ఎంటీవీ ఆచార్య గారిమీదే అయితే మీ సోర్సులో మీరూ తన వ్యక్తిగత వివరాలకోసం ప్రయత్నించగలరు. అలా కాక వపాగారిపై మీరు దృష్టి పెడుతున్నట్లయితే తన గురించిన సమాచారం కొంచెం నా వద్ద కూడా ఉంది. ఈ మధ్యే 70, 80ల నాటి ఆయన ఫోటోను స్వాతి వార పత్రిక వారినుంచి సంగ్రహించాము.
చిత్రాగారి వ్యక్తిగత, ఉద్యోగ జీవితం గురించి శంకర్‌గారు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. కాని కలెక్టర్ ఎడిషన్ అనువాదాల పనిలో ఉండి గత వారం, పది రోజులుగా ఈ విషయం పక్కకు పోయింది. మీరు, ఇంతకుముందే శివరాం ప్రసాద్ గారు చిత్రాగారి చిత్రాల గురించి రాసిన సమాచారానికి ఆయన వ్యక్తిగత వివరాలు కూడా తోడయితే ఓ సమగ్ర చిత్రం వస్తుందనే నా అభి్ప్రాయం.
అలాగే శంకర్ గారి గురించి తమిళ, ఆంగ్ల పత్రికలలో ప్రచురించిన అయిదారు వ్యాసాలను కూడా ఆయన ఈ మధ్యే ఇచ్చారు. 1960లలో చందమామ సిబ్బంది సిలోన్ యాత్రకు సంబంధించిన పూర్తి ఆల్బం కూడా ఇచ్చారు. ఇంకా 1946లో స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో కోర్సు పూర్తయిన సందర్భంగా తీసుకున్న గ్రూప్ ఫోటో కూడా ఆయన ఇన్నాళ్లుగా భద్రపర్చారు. ఎన్ని అరుదైన చిత్రాలను ఆయన కాపాడుకుంటూ వచ్చారంటే ఒక్క మాటలో వర్ణించలేము.
ఈ అనువాదాల ఒత్తిడి నా అన్నిపనులనూ మింగేస్తోంది. కానివ్వండి ఆలస్యంగా అయినా సరే. వీరి వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ఖాళీని పూడ్చడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను..
కాని ఒక్కటి మాత్రం చెప్పగలను. దాసరి సుబ్రహ్మణ్యం, చిత్రా గార్ల గురించి మీరు చేసిన కృషి చందమామ చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది. ఇదే విధమైన క్వాలిటీ రైటింగ్‌ను మీరు, శివరాం గారు, తదితరులు కొనసాగించగలరని ప్రగాఢంగా ఆశిస్తున్నాను.
చందమామ కలెక్టర్స్ ఎడిషన్ -60 ఏళ్ల సందర్భంగా ప్రచురించినది-, చందమామ చిత్రకారుల చిత్రాలపై విడి విడి పుస్తకాల ప్రచురణ కు సంబంధించిన పనులు ఊపు అందుకుంటున్నాయి. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈసారి ఇవి ఖాయంగా వెలుగు చూస్తాయనిపిస్తోంది.
“చందమామ’పై చెరగని సంతకం ‘చిత్రా’ ” పేరిట వేణుగారు రాసిన కథనం ఇక్కడ చదవండి.
http://venuvu.blogspot.com/2009/10/blog-post.html
“చిత్ర – చందమామ అద్భుత చిత్రకారుడు” పేరిట శివరాం ప్రసాద్ గారు రాసిన కథనం ఇక్కడ చదవండి.
Filed under చందమామ చరిత్ర | Tags: ఆచార్య, చందమామ, చరిత్ర, చిత్రా, జ్ఞాపకాలు, వపా, వేణు, శంకర్, శివరాం | Comments (2)ఈ వారం బేతాళ కథ – రెండు నెమళ్లు

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, ఇంత అర్ధరాత్రివేళ, భీతిగొలిపే ఈ శ్మశాన వాతావరణం, ఏదో సాధించి తీరాలన్న పట్టుదల కారణంగా, నీకు అత్యంత సహజంగా కనబడుతున్నట్టు, నాకు అనుమానం కలుగుతున్నది. కానీ, ప్రకృతిలోని వైపరీత్యాలూ, అందులోని జీవరాసుల ప్రవర్తనా గురించిన అంచనా వేయవలసి వచ్చినప్పుడు, పండితులూ, పామరుల మధ్య ఎంతో భేదభావం గమనించగలం. ఇందుకు ఉదాహరణగా నీకు, చంద్రశర్మ అనే ఒక చిత్రకారుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,’’ అంటూ ఇలా చెప్పసాగాడు:
ఒకానొకప్పుడు సువర్ణదేశాన్ని పాలించిన సువర్ణదేవ మహారాజు గొప్ప భూతదయాపరుడు. తనదేశంలోని ప్రకృతి పరిసరాలను కాపాడుకోవాలనీ, అందుకుగాను చెట్లకూ, అక్కడ నివసించే పశుపక్ష్యాదులకు కూడా ఎలాంటి హానీ జరక్కుండా రక్షించుకోవాలనీ అందరికీ చెబుతూండేవాడు. ఆయన ప్రతి సంక్రాంతికి ఎడ్లకు పరుగుపందాలతో పాటువాటిలో చూడముచ్చటగా వుండేవాటికి మంచి బహుమతులు కూడా ఇస్తూండేవాడు. ప్రకృతిదృశ్యాలను అందచందాలతో చిత్రించిన చిత్రకారులను కూడా ఘనంగా సన్మానించేవాడు.
రాజధానికి దాపునగల ఒక గ్రామంలో వున్న చంద్రశర్మ మంచి చిత్రకారుడు. ఎవరైనా తమ రూపచిత్రం కావాలని కోరితే, కొద్దిసేపట్లో చిత్రించి ఇచ్చేవాడు. అందువల్ల, ఎంతోమంది ధనవంతులు అతడిచేత తమ చిత్రాలను గీయించుకునేవారు. ఒకసారి చంద్రశర్మ, రాజుగారు సంక్రాంతి నాడు ఏర్పాటుచేసే చిత్రకళా పోటీలలో పాల్గొనదలచి – రెండు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పుగల చెక్కపలక మీద, రెండు అందమైన నెమళ్ళు పురివిప్పి ఒకదానికొకటి ఎదురుగా నాట్యం చేస్తున్నట్టు చిత్రించాడు.
ఆ చిత్రాన్ని చూసిన ఒకడు, ‘‘ఆహా, ఎంత అద్భుతం! పురివిప్పిన నెమళ్ళు కళ్ళ ఎదుట నాట్యం చేస్తున్నట్లే వుంది. దీన్ని ఇంటి ముఖ ద్వారానికి వేలాడదీస్తే, ఇంటికే చెప్పరానంత కళ వస్తుంది,’’ అంటూ మెచ్చుకున్నాడు. చిత్రకళలో పరిచయం వున్న మరొకవ్యక్తి, ‘‘మన చంద్రం, నెమలి కంఠం రంగులు బాగా కలిపాడు. ఆ రంగులు అలా ఎవరూ కలపలేరు; ఒకవేళ కలిపినా, ఆ మెరుపు రాదు. రాజుగారు చూస్తే, దీనికి వంద బంగారు నాణేలిచ్చి తనదిగా చేసుకుంటారు,’’ అన్నాడు.
ఈ వారం బేతాళ కథ పూర్తి పాఠం -4 పుటలు- కోసం కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=36&sbCId=97&stId=2287
గమనిక: ఈ కథ చివరలో బేతాళుడు సంధించిన ప్రశ్నకు విక్రమార్కుడు ఇచ్చిన జవాబును ముందుగా చదవకుండా మీరే ఆలోచించి సమాధానం చెప్పండి చూద్దాం. సమాధానం తెలిసీ చెప్పకపోయారో…. మీ శిరస్సు….. అంతే…….
ఆన్‌లైన్ చందమామలో ఇప్పటివరకు ప్రచురించిన 64 బేతాళ కథలు చదవాలని ఉందా?
అయితే కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=36&sbCId=97
మీ స్పందనను abhiprayam@chandamama.com పంపండి.
Filed under చందమామ కథలు | Tags: చందమామ, చంద్రం, చంద్రశర్మ, చిత్రకారుడు, చిత్రపటం, ధనవంతులు, నెమలికంఠం, నెమళ్లు, పండితులు, పామరులు, బంగారు, బేతాళ, బేతాళ కథలు, బేతాళుడు, మహారాజు, విక్రమార్కుడు, విక్రముడు, సంక్రాంతి, సాహసం, సువర్ణదేవుడు | Comments (7)కాకతీయ రుద్రమ్మ
ఇది చందమామ తొలి సంచిక -1947 జూలై- లో ప్రచురించిన కథ. దీపావళి సందర్భంగా మనం ప్రతిసారీ సత్యభామను తలుచుకుంటాం. నరకాసురుడిపై యుద్ధ సమయంలో కృష్ణుడితో సరిసమానంగా రధంపై ఆసీనురాలై నరకాసురవధలో సమాన పాత్ర పోషించిన ధీరవనిత సత్యభామ. చరిత్రలో వాస్తవంగా కూడా ఓ మహాసామ్రాజ్య భారాన్ని పురుషవేషం దాల్చి మోసి కాపాడిన ధీరవనిత మరొకరు ఉన్నారు.
ఆమె కాకతి రుద్రమ్మ. రుద్రమ్మ గణపతిదేవుడు, నారమ్మల ముద్దుబిడ్డ. దక్షిణదేశ చరిత్రలో అతి గొప్ప సామ్రాజ్యాలలో ఒకటిగా పేరుపొందిన కాకతీయ సామ్రాజ్య చక్రవర్తిని ఆమె. మహిళా లోకానికి మణిపూసగా మిగలిన రుద్రమ్మ కథను ఈ దీపావళి సందర్భంగా చందమామ పాఠకులకు అందిస్తున్నాం.
కథ చదవండి.
మనం మూడుసార్లు మహాసామ్రాజ్యం స్థాపించాము. మొదటిది ఆంధ్ర సామ్రాజ్యం, రెండోది కాకతీయ సామ్రాజ్యం, మూడోది విజయనగర సామ్రాజ్యం, ఈ మూడు సామ్రాజ్యాలు దక్షిణదేశానికి చేసిన సేవ అంతా ఇంతా కాదు. వీటిని నెలకొల్పకుండా ఉన్నట్లయితే దక్షిణదేశ చరిత్ర మరొక విధంగా ఉండేది.
ఈ సామ్రాజ్యాలను సమర్థతతో పరిపాలించిన వారు స్త్రీలు కూడా ఉన్నారు. వారిలో రుద్రమ్మ ముఖ్యురాలు.
కాకతి గణపతిదేవ మహారాజుకు ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా రుద్రమ్మ ఒక్కతే, తండ్రి తరువాత రాజ్యం చేయవలసింది ఆమే, అందువల్ల గణపతి దేవుడు రాజుకు కావలసిన విద్యలన్నీ రుద్రమ్మకు చెప్పించసాగాడు. రుద్రమ్మ కత్తిసాము నేర్పింది. గుర్రపుస్వారీ నేర్పింది. సేనలను నడప నేర్చింది. కోటలు పట్ట నేర్చింది. ఇంకా మంచి రాజుకు ఎన్ని విద్యలు కావాలో అన్ని విద్యలూ నేర్చుకుంటూ వుంది.
కాకతి రుద్రమ్మ కథ పూర్తి పాఠం చదవాలంటే కింది లింకును క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=92&stId=2286
Filed under ఆన్‌లైన్ చందమామ రచనలు | Tags: ఆంద్రసామ్రాజ్యం, కాకతిరుద్రమ్మ, కాకతీయసామ్రాజ్యం, గణపతిదేవుడు, చందమామ, దీపావళి, నరకాసురుడు, రుద్రమదేవి, రుద్రమ్మ, విజయనగరసామ్రాజ్యం, సత్యభామ | Comment (0)చందమామ ఆత్మకథ
పూర్వకాలంనుంచి భారతీయ జనపదాల నోళ్లలో నానుతున్న లెక్కలేనన్ని కథలను సేకరించి, గుదిగూర్చి, ఆ కథల్లోని నీతి, ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలను పిల్లలకు, ప్రజలకు అందజేయాలని చక్రపాణి గారు కలగన్నారు. ఆ మహత్తర స్వప్నమే 1947లో చందమామగా సాకారమైంది. ఇది చక్రపాణి గారి మానసపుత్రిక, ఆయన కన్న వేల కలల ప్రతిరూపం చందమామ.
ప్రాచీన సంస్కృతిలోని అత్యుత్తమ భావనలను పిల్లలకు అందించాలని, భారతీయ కథలను తమ భావి జీవన సంస్కృతికి పునాదిగా వేసుకుని తరించేలా చేయాలని చక్రపాణి కన్న కలలు సాకారమవడానికి దశాబ్దకాలం పట్టింది. పల్లీయ సంస్కృతిని అణువణువునా పుణికిపుచ్చుకున్న సీమ బిడ్డ నాగిరెడ్డి రూపంలో ఓ మహనీయుడు తోడయిన మహత్తర క్షణాలు చక్రపాణి కలలకు వాస్తవరూపమిచ్చాయి.
భారతీయ పత్రికా ప్రచురణ చరిత్రలో అపూర్వమైన ఘటనకు అలా బీజం పడింది. నాగిరెడ్డి ‘హార్డ్‌వేర్’ చక్రపాణి ‘సాఫ్ట్‌వేరు’ అని ఇప్పుడు మనం పిలుచుకుంటున్న ఆ అద్వితీయ చరిత్రకు నాంది పలికిన క్షణాలకు చందమామ స్వయంగా అక్షరరూపమిచ్చింది.
పాఠకులూ, అభిమానులూ ఎన్నాళ్లనుంచో వినడానికి కుతూహలపడుతున్న చందమామ ఆత్మకథను 1954 నవంబర్ దీపావళి ప్రత్యేక సంచిక తొలిసారిగా వినిపించింది. దీంట్లో ‘చందమామ కథ’ పేరిట 13 పేజీలలో ఓ పెద్ద వ్యాసం ప్రచురించారు.
రచయితలు రచనలు పంపినది మొదలు, పత్రికను తయారుచేసి రవాణా చేయడం— కలకల్లాడే ఆ చందమామను పాఠకులు అందుకుని ఆహ్లాదంతో చదువుకోవడం వరకూ జరిగే అన్ని దశలనూ, పరిణామాలనూ కళ్లకు కట్టినట్లు చూపించడమే ఈ “చందమామ కథ” లోని విశేషం.
చందమామ సంస్థాపకులు, సంపాదకులు, రచయితలు, చిత్రకారులు, ప్రెస్, ప్రింటింగ్, ప్యాకింగ్ విభాగం, చందమామ స్వంత రాజభవనాలు మొదలైన చందమామ కథా కమీమిషులను మొత్తంగా గుదిగూర్చి ఈ వ్యాసంలో పొందుపర్చారు. దీనిని రెండు భాగాలుగా ఆన్‌లైన్‌లో ప్రచురిస్తున్నాము. తొలి భాగం ఇక్కడ పొందుపరుస్తున్నాము.
అన్‌లైన్ చందమామలో ఈ కథనంకోసం వేసిన ఫోటోలు సర్వశ్రీ నాగిరెడ్డి, చక్రపాణి, వీరి పుత్రులు ప్రసాద్, తిరుపతిరావు (వరుసక్రమంలో) గా గుర్తించగలరు.
చందమామ కథ తొలి భాగం పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2285
చందమామ కథ పూర్తి పాఠంకోసం (13 పుటలు) ఆసక్తి కలవారు చందమామ ఆర్కైవ్స్‌లో కింది లింకు తెరిచి లోపలి పుటలలో చూడగలరు.
http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL
చందమామ ఓ అందాల భామ

చందమామ - అందాలభామ
మధ్యయుగాల కథల కాణాచి చందమామ అని నిన్న ఈ బ్లాగులో పోస్ట్ చేసిన కథనంపై ఎన్ కృష్ణమూర్తిగారు కవితా రూపంలో స్పందించారు. భాషాంతరీకరణ రూపంలో పంపిన ఆయన పంపిన ఈ వ్యాఖ్యను తెలుగులోకి మార్చి ఇక్కడ పోస్ట్ చేశాము.
చందమామను కథల చందమామగా, అందాలభామగా వర్ణిస్తూ ఆయన పంపిన ఈ కవితాత్మక ఆప్తవాక్యాలకు చందమామ తరపున కృతజ్ఞతలు.
చందమామ అది కథల చందమామ
చందమామ అది అందాల భామ,
చందమామను చూచి పులకించు మేను,
చందమామను చూచి ఆలోచనలు రేకెత్తు మదిలో,
చిట్టి చిట్టి మనసులో నీతిని నింపు,
చిట్టి చిట్టి బుర్రబుర్రలకు పదును పెట్టు చందమామ,
భేషు భేషు చందమామ,
భావి తరాల కోసం బ్రతకాలి చందమామ.
Filed under చందమామతో మా జ్ఞాపకాలు | Tags: అందాలభామ, ఆప్తవాక్యం, కథలచందమామ, కథలు, కవిత, కృష్ణమూర్తి, చందమామ, తెలుగు | Comment (0)మధ్యయుగాల కథలకు కాణాచి చందమామ
కలెక్టర్ ఎడిషన్
ఆ కోవకు చెందిన సుప్రసిద్ధ పిల్లల పత్రికలలో వీటిని చేర్చవచ్చు. టింకిల్, బాలమిత్ర, బొ్మ్మరిల్లు, గోకులం, చంపక్, పూంథాలిర్, రత్నబాల, బుజ్జాయి తదితర పత్రికలు. ఇవన్నీ కూడా తమ స్వంత పాఠకులు, అభిమానులతో విశిష్టత పొందాయి.
వీటిలో ప్రతి పత్రిక కూడా తమవైన ప్రత్యేక కథలతో ఓ ప్రత్యేకతను సంతరించుకుంటూ వచ్చాయి. టీవీ మీడియా ప్రభుత్వ యాజమాన్యంలోని టీవీ ఛానెళ్ల యాజమాన్యం నియంత్రణలో ఉన్న కాలంలో, మనసులను ఆకర్షించడానికి మరే ఇతర వినోద సాధనాలూ అందుబాటులో లేని కాలంలో ఈ కథలను పిల్లలూ, యువతీ యువకులూ చక్కగా ఆస్వాదించారు.
అయితే ఈ పత్రికల్లో ఏవి కూడా ప్రారంభించబడిన మరుక్షణం అద్భుత విజయాలను సాధించిన డిసి అండ్ మార్వెల్ పత్రికల మాదిరి ప్రపంచ ప్రఖ్యాతి పొందకపోయి ఉండవచ్చు, కానీ, ఇవి దశాబ్దాలుగా తమ పాఠకుల అభిమానం, ఆదరణను చూరగొన్నాయి.
అయితే కాలం మారే కొద్దీ, దేశంలో క్రీడలు, టీవీ మీడియా వంటి ఇతర వినోద సాధనాలు పెరుగుతున్న పరిస్థితుల్లో, ఆధునిక తరం పిల్లల సంఖ్య పెరిగే కొద్దీ ఒకప్పుడు పేరు ప్రఖ్యాతులతో అలరించిన ఈ పత్రికలు తమ మనుగడను కొనసాగించలేక ఉనికిలో లేకుండా పోయాయి.
వీటిలో ఇప్పుడు చాలా కొద్ది పత్రికలు మాత్రమే ఇప్పుడు కూడా ప్రచురణ రంగంలో ఉంటున్నాయి. సంఖ్యాపరంగా పాఠకులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, నేటి కాలపు ఆశలకు అనుగుణంగా కథలను, కంటెంటును మార్చుకుంటూ ఇవి మనుగుడ సాగిస్తున్నాయి.
ఇలాంటి పత్రికలలో చందమామ ఒకటి. మధ్యయుగ భారతీయ కథలకు ఇది కాణాచి. చందమామ కథలు రాజులు, రాణులు, రాజకుమారులు, రాజకుమారిలు, వారి సాహసకృత్యాలు, హాస్యప్రవృత్తికి మారుపేరుగా ఉండేవి. చందమామను బి.నాగిరెడ్డి 1947 జూలై నెలలో స్థాపించారు. ఆనాటికి ఈయన దక్షిణభారతంలోనే పేరుమోసిన సినీ నిర్మాత, ఆసియాలో అతిపెద్ద సినిమా స్టూడియోగా పేరు పొందిన విజయా స్టూడియోస్ (చెన్నయ్) యజమాని.
వ్యవస్థాపకుడి ధనబలం దన్ను, భారతీయ పురాణగాధలు, జానపదకథలు ఆధారంగా సాగే అద్భుతమైన అమ్మకాలు చందమామను ఉన్నత శిఖరాలకు చేర్చాయి. అచిరకాలంలోనే చందమామ ఓ ఇంగ్లీష్ ఎడిషన్‌తో పాటు మరో 12 భారతీయ భాషల్లో ప్రచురణకు నోచుకోవడంతో దాని అమ్మకాలు విపరీతంగా ఉండేవి.
1947 జూలై నెలలో మొదలైన చందమామ అయిదు దశాబ్దాలపాటు నిరంతరాయంగా కొనసాగి 1998లో కార్మిక సమస్యలుగా చెప్పబడుతున్న వాటి కారణంగా సంవత్సరం పైగా నిలచిపోయింది. సంవత్సరం లోపే తిరిగి మొదలైన చందమామ ఈనాటికీ కొనసాగుతూ ఉంది.
చందమామ కీర్తి ఎంతగా వ్యాపించిందంటే ప్రపంచ ప్రఖ్యాత సంస్థ డీస్నీ భారత ప్రచురణరంగంలోకి ప్రవేశించే ఉద్దేశ్యంతో ఉండి చందమామను కొనుగోలు చేయాలని ప్రయత్నించింది. తెరవెనుక సాగిన అనేక ప్రయత్నాలు, వ్యతిరేకతల కారణంగా డీస్నీ ప్రయత్నం వమ్మయిపోయింది.
చందమామపై మక్కువ గల నలుగురు ఉత్తర భారతీయ టెక్నోక్రాట్లు చందమామలో అధిక వాటాలు తీసుకుని కొన్నేళ్లు నిర్వహించారు. చివరకు నిర్వహణా సమస్యల కారణంగా వారు వైదొలగడంతో 2007లో చందమామ జియోదెసిక్ -Geodesic- అనే టెక్నాలజీ కంపెనీ చేతుల్లోకి వెళ్లిపోయంది. దాదాపు రూ. 10 కోట్లకు చందమామను కొనుగోలు చేసిన ఈ కలకత్తా ఆధారిత సంస్థ చందమామ పాత సంచికలను డిజిటలీకరించి అన్ని పాత సంచికలను భద్రపర్చేందుకు నడుం కట్టింది.
జియోదెసిక్ కార్పొరేట్ వెబ్‌సైట్‌లో చందమామ పాత సంచికలను 2008 మొదట్లో పీడీఎఫ్ రూపంలో ఉంచారు. కానీ, తర్వాత ఇవి ఆన్‌లైన్‌లో చదవడానికి అనువుగా ఫ్లాష్ పైళ్ల రూపంలో పెట్టారు. 2009 తొలి నాలుగు నెలలకాలంలో ఇంగ్లీష్ చందమామ ఎడిషన్‌లో గత సంవత్సరాలకు సంబంధించిన సీడీలు ఇవ్వడం ప్రారంభించారు. మార్కట్ వ్యూహంలో భాగంగా తీసుకున్న ఈ చర్య వల్ల ఇంగ్లీష్ చందమామల చందాలు బాగా పెరిగాయని ప్రతీతి.
2007 సంవత్సరం చందమామకు 60వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా చందమామ కాపీ బుక్ పేరిట ఓ కలెక్టర్స్ ఎడిషన్ అని ఓ పుస్తకం ఇంగ్లీషులో తెచ్చారు. చందమామ స్వర్ణయుగం నాటి వివిద ప్రచురణలలోని అద్భుత దృశ్యాలలోకి ఈ పుస్తకం తీసుకెళుతుంది. దశాబ్దం క్రితం కథలనే ఎక్కువగా నింపారని విమర్శలు ఉన్నప్పటికీ చందమామ తొలితరం చిత్రకారులు వేసిన అత్యద్భుత చిత్రాలు, కళ్లు చెదిరే ఆర్ట్‌వర్క్‌ను ఈ కాపీటేబుల్ పుస్తకంలో అచ్చేశారు.
వైభవోజ్వల శకంతో పోలిస్తే చందమామ తన చిత్రకథా సంపద సుగంధ పరిమళాలను చాలావరకు పోగొట్టుకున్నప్పటికీ చందమామను ప్రేమించే, అభిమానించే పాతతరాల పాఠకులకు, చందమామ చరిత్రను స్థూలంగా అయినా తెలుసుకోవాలని కుతూహలం ఉండే కొత్తతరం పాఠకులకు ఈ కలెక్టర్ ఎడిషన్ ఓ మేరకు చక్కగా ఉపయోగపడుతుంది. తొలిపేజీల్లో చందమామ చరిత్రకు సంబంధించిన సమీక్ష, మధ్యపేజీల్లో బేతాల కథలతో పాటు వివిధ కథలు లభ్యమవుతున్నాయి.
పైగా చివరి పేజీల్లో తక్కువే అయినప్పటికీ చందమామ చిత్రమాంత్రికులు చిత్రా, ఎంటీవీ ఆచార్య, శంకర్, వపాతో పాటు రజీ, శక్తిదాస్, కేశవరావు తదితర చిత్రకారులు గీసిన హై రిజల్యూషన్ చిత్రాలు పాఠకులు కళ్లకు మిరుమిట్లు గొలుపుతాయి. 60 సంవత్సరాల సందర్భంగా తెలుగులో పుస్తకం విడుదల చేయకపోవడం ఓ మచ్చలా మిగిలి ఉన్నా, ఆసక్తిగల పాఠకులకు ఓ నజరానాగా చందమామ కాపీ బుక్ మిగిలిపోతుంది.
ఎ4 సైజుతో చక్కటి ఆయిల్ పేపర్‌తో, నీట్‌గా బౌండ్ చేసిన ప్యాకేజీతో ఉన్న ఈ పుస్తకం వెల 449లు. సామాన్య పాఠకుడికి ఈ ధర మింగుడు పడకపోవచ్చు. ఈ పుస్తకం చందమామ వెబ్‌సైట్‌లో 20 శాతం డిస్కౌంటుతో లభ్యమవుతోంది. రూ.900 రూపాయల ఖరీదు చేసే కాపీబుక్, చందమామ రామాయణం కార్టూన్ రంగుల పుస్తకాలను ఈ దీపావళి సందర్భంగా రూ.670లకే కాంబో ప్యాక్ కింద ఇస్తున్నారు.
లోపలి కవర్ పేజీలలో చందమామ కలెక్టర్ ఎడిషన్ గురించి, పత్రిక చరిత్ర గురించి విశ్వంగారి వ్యాసం ఉన్నప్పటికీ 60 ఏళ్ల సందర్భంగా వచ్చిన ఈ ప్రత్యేక ఎడిషన్‌లో చందమామ సుప్రసిద్ధ కథకులు, సంపాదకులు, చిత్రకారుల గురించి ప్రస్తావన కూడా చేయకపోవడం బాధాకరమే అయినప్పటికీ ఈ తరుణంలో కూడా చందమామ పాలసీ -రచయితలు, చిత్రకారులకు ప్రచారమివ్వని పాలసీ- అమలయ్యిందనే చెప్పాలి.
ఓ దశాబ్ది కాలంలో దేశ కాల పరిస్థితుల్లో వచ్చిన పెను మార్పుల కారణంగా ఇతర పిల్లల పత్రికలతో పాటు చందమామ కూడా బాగా దెబ్బతినిపోయింది. ఒకప్పుడు ఆరేడు లక్షల ప్రతులతో భారతీయ భాషల్లో వెలువడిన చందమామ సర్క్యులేషన్ ఇప్పుడు బాగా పడిపోయింది.
సంవత్సరం అజ్ఞాతవాసపు దెబ్బ ఈనాటికి చందమామ మార్కెట్‌పై తన దెబ్బ వేస్తూనే ఉంది. దానికి తోడు మారుతున్న పిల్లల అభిరుచులకు అనుగుణంగా మనమూ మారాలనే తలంపుతో చందమామ రూపురేఖలు మార్చడానికి చేసిన ప్రయత్నం ప్రత్యేకించి తెలుగు చందమామ వీరాభిమానుల్లో తీరని అసంతృప్తి కలిగించింది.
మొత్తం 13 భాషలు, మరో జూనియర్ చందమామతో వస్తున్న చందమామ ప్రచురణలు పరిమిత ప్రింట్లతోనే నడుస్తూ వస్తున్నాయి.
మొత్తంమీద చందమామకు ఇది సంధియుగం. ఎన్ని మార్పులు వస్తున్నప్పటికీ అప్పుడూ, ఇప్పుడూ చందమామను కొని చదవడంపై ఇప్పటికీ ఆసక్తి చూపుతున్న సాధారణ పాఠకుల కొనుగోళ్లపైనే చందమామ ప్రస్తుతం మనుగడ సాధిస్తోంది.
పాఠకుల అభిరుచులకు అనుగుణంగా చందమామ మారుతుందా లేదా కాలమాన పరిస్థితుల్లో మార్పులు పేరిట ప్రయోగాలు, నూతన తరం పిల్లల్లో మార్కెట్ అవకాశాల గమ్యం గమనంలో కొట్టుకుపోతుందా అనేది కాలానికే వదిలిపెట్టాల్సిన ప్రశ్న.
ఎ4 సైజుతో, భారీ సైజు చిత్రాలతో నడుస్తున్న ఇంగ్లీష్ చందమామ అమ్మకాలు క్రమక్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో దేశీయ భాషల్లో చందమామలను కూడా కాస్త ధర పెంచి పెద్ద సైజులో తీసుకువస్తే బాగుంటుందనే అభిప్రాయాలు బలపడుతున్న నేపథ్యంలో చందమామ సంధిదశలో పయనిస్తోంది.
చందమామ గమ్యం, గమనం మరింత మెరుగుపడుతుందని, మారుతున్న తరాల అభిరుచులు, పాతతరాల మనోద్వేగాలు పరస్పరం ఘర్షించడం ద్వారా చందమామ మరింత ముందుకు పోగలదనే ఆశిస్తున్నాం.
ఈ పెద్ద వ్యాసంపై పాఠకులు, అభిమానుల నుంచి స్పందనలు ఆశిస్తూ..
Filed under చందమామ చరిత్ర | Tags: ఆచార్య, కలెక్టర్ ఎడిషన్, కాపీ బుక్, కొకు, చందమామ, చక్రపాణి, చరిత్ర, చిత్రా, నాగిరెడ్డి, పిల్లలు, బ్రాండ్, వపా, శంకర్ | Comments (2)చందమామ గుండె పగిలిన వేళ…!

శిధిలాలయం - చిత్రా
ఆయన… భారతదేశంలోని పిల్లలందరి ముఖాలూ వికసించడానికి చందమామలో ‘చిత్ర’జ్యోతులు వెలిగించిన ఓ మహనీయుడు. 1950, 60, 70ల కాలంలో విశేష ప్రాచుర్యం పొందిన చందమామ కార్యాలయాన్ని సందర్శించిన వేలాది దక్షిణ భారత ప్రజలు, ఉత్తరాది వారు కూడా ప్రత్యేకించి ఈ మేటి చిత్రకారుడి చూడటానికి ఆసక్తి, ఆత్రుత ప్రదర్శించేవారు.
దీన్ని బట్టే ఓ మూడు దశాబ్దాల చందమామ పాఠకులపై ఆయన వేసిన ప్రభావం ఏమిటో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. చిత్రలేఖనంలో ఎటువంటి శిక్షణ పొందకున్నప్పటికీ, స్వయం కృషితో అభ్యాసం చేసి, చిత్రకళలో నైపుణ్యం సంపాయించి, దేశవ్యాప్తంగా ఆబాలగోపాలాన్ని దశాబ్దాల పాటు అలరిస్తూ వచ్చిన సాటిలేని హస్త నైపుణ్యం ఆయన సొత్తు.
కథల పత్రికలో బొమ్మలు వేయడానికి సంబంధించి చక్రపాణి గారి మనో ప్రపంచంలో రూపొందిన శైలిని తన చిత్రకళా నైపుణ్యంతో ఒక వరవడిగా తీర్చిదిద్దిన ఘనత ఈ మహనీయ చిత్రకారుడిదే. కథ లేదా ధారావాహికకు సంబంధించి మొదటినుంచి చివరివరకూ ఒకేలాగ ఉండేలా పాత్రలకు ఆయన గీసిన బొమ్మలు అటు పిల్లలను ఇటు పెద్దలను కూడా అబ్బురపరచేవి.
చందమామ కథలతో పాటు చందమామ ధారావాహికలకు నభూతో నభవిష్యతి లాగా ఆయన వేసిన బొమ్మలు చందమామ పాఠకుల జ్ఞాపకాలలో దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా, చిరస్థాయిగా నిలిచిపోయాయి. కథ గొప్పా, కథకు గీసిన బొమ్మ గొప్పా అని పరీక్ష పెడితే రెండూ సమానంగా నిలిచేంత చరిత్రకు కారణభూతమైన చిత్రకళానైపుణ్యం ఆయన స్వంతం.
చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యంగారి అపూర్వ సృష్టిగా నిలిచిపోయిన రాకాసి లోయ, ముగ్గురు మాంత్రికులు, శిధిలాలయం, రాతి రథం మొదలైన చందమామ ధారావాహికలకు ఆయన గీసిన బొమ్మలు, ఎంతగానో పాఠకుల మెప్పు పొందటానికి, చందమామ ప్రాచుర్యం పెరగటానికి తోడ్పడినాయి.
ఆయనే చందమామ అద్భుత చిత్రకారుడు చిత్రా గారు. చందమామలో వస్తున్న చిత్రాల శిల్పం సృష్టించిన వారు చిత్రా. ఆయన చిత్రాలు చందమామలో సుమారు పదివేలు వెలువడ్డాయి. తెలుగులో పిల్లల పత్రికలన్నీ కూడ, చందమామ పత్రిక ఏర్పరిచిన ఆనాటి చిత్రకథా పంథానే ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నాయి.
ప్రారంభించినది మొదలుగా చందమామ ప్రధాన చిత్రకారుడిగా ఉండి, బారతదేశమంతటా అనేక లక్షలమందికి అభిమానపాత్రుడైన గొప్ప చిత్రకారులు ’చిత్రా’ గారు. ఆయన 1947నుంచి మూడు దశాబ్దాలుగా అవిశ్రాంతంగా చందమామలో పనిచేస్తూ 1978 మే 6న కన్నుమూశారు.
చిత్రా వెలిగించిన జ్యోతి ఎన్నటికీ ఆరదు
‘భారతదేశంలోని పిల్లలందరి ముఖాలూ వికసించడానికి చిత్రా వెలిగించిన జ్యోతి ఎన్నటికీ ఆరదు’ అని 1978 జూన్ చందమామ సంచికలో చిత్రాగారిపై శ్రద్ధాంజలిని ప్రచురించారు. చక్రపాణి గారి అస్తమయం తర్వాత ‘చిత్రా’ అస్తమయం చందమామకు తీరని లోటని ఈ శ్రద్ధాంజలి పేర్కొంది.
అది చందమామ గుండె పగిలిన సందర్భం. నిజంగానే చందమామ చిత్రాలకు తీరని లోటుగా మిగిలిన దుర్ఘటన. చందమామ తదుపరి భవిష్యత్తునే యాదృచ్చికంగా ఊహించిన అరుదైన ఈ శ్రద్ధాంజలిని చందమామ పాఠకులకోసం అందిస్తున్నాం.
చిత్రా గారి అస్తమయం వార్తను చందమామలో రాసినవారు కొడవటిగంటి కుటుంబరావు గారు.
ఈ శ్రద్ధాంజలి పూర్తి పాఠం కోసం కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2277
మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.
గమనిక: చిత్రాగారి అరుదైన జీవిత వివరాలకు త్వరలో ఇక్కడే చూడగలరు.
Filed under చందమామతో మా జ్ఞాపకాలు | Tags: చందమామ, చిత్ర, చిత్రకారులు, టీవీ రాఘవులు, దాసరిసుబ్రహ్మణ్యం, పాఠకులు, ముగ్గురు మాంత్రికులు, రాకాసి లోయ, రాతి రథం., శిధిలాలయం, సీరియల్స్ | Comments (2)తెనాలి రామలింగం
ఇది 1947 చందమామ తొలి సంచిక -జూలై- లోని కథ. చందమామ సుప్రసిద్ధి గాంచిన తన కథా, చిత్ర రూపురేఖలకు ఇంకా అలవాటుపడని కాలంలో బొమ్మలు లేకుండా వచ్చిన కథ ఇది. కాళికాదేవి వెయ్యితలలను మనిషి దృక్పధంలోంచి చూసి పక్కున నవ్విన ధీరుడి కథ ఇది. అదేంటో తెలుసుకోవాలంటే దీనిని పూర్తిగా చదవండి.
తెనాలి రామలింగం పేరు తెలియని పిల్లలు ఉండరు. అతనికి ఆ పేరు ఎలా వచ్చిందనుకున్నారు? తెనాలిలో పుట్టాడు కనుక తెనాలి రామలింగమయ్యాడు. ఆ రోజుల్లో తెనాలి చిన్న ఊరు.
చిన్నప్పటినుంచి రామలింగం వట్టి చిలిపివాడు. అతనికి నదురు బెదురు ఏ కోశానా ఉండేది కాదు. తనకు నచ్చనిదాన్ని వెక్కిరించడంలో మొనగాడు.
ఒకరోజున రామలింగం వీధిలో ఆడుకుంటూ ఉన్నాడు. ఒక యోగి ఆ దారిని పోతూ అతన్ని చూశాడు. రామలింగం రూపురేఖల్లోనూ, అతని మాటల్లోనూ యోగికి తెలివితేటలు కనిపించాయి. వెంటనే ఆయన రామలింగాన్ని దగ్గరికి పిలిచి శక్తిమంత్రం ఉపదేశించి ఇలా చెప్పాడు :
“నాయనా! ఈ మంత్రం వెయ్యిసార్లు కాళికాదేవి గుడిలో జపిస్తే దేవి నీకు ప్రత్యక్షమవుతుంది. వెయ్యి తలలతో కనిపిస్తుంది. నీవు భయపడకూడదు. అప్పుడు దేవి మెచ్చి నీవు కోరుకున్న వరం ఇస్తుంది.” అని చెప్పి యోగి వెళ్లిపోయాడు.
ఒక మంచిరోజు వచ్చిందాకా ఆగి ఆనాటి అర్థరాత్రిపూట రామలింగం ఒంటరిగా కాళికాదేవి గుడికి వెళ్లి యోగి చెప్పిన మంత్రం వెయ్యిసార్లు జపించాడు. కాళికాదేవి వెంటనే వేయి తలలతో ప్రత్యక్షమైంది. రామలింగం భయపడలేదు. అతనికి ఏమి తోచిందో ఏమో ఫక్కున నవ్వాడు.
ఈ కథ పూర్తి పాఠం చదవాలంటే.. కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=92&stId=2271
Filed under చందమామ కథలు | Tags: కథలు, కాళికాదేవి, గుడి, చందమామ, తెనాలి, తెనాలిరామలింగం, పిల్లలు, బొమ్మలు, యోగి, రామలింగం, రామలింగడు, రెండుచేతులు, వెయ్యితలలు, శక్తిమంత్రం | Comment (0)పండుటాకుల పాట

చందమామ 1947
ఇది 1947 జూలై చందమామ మొదటి సంచికలోని కథ. దీనిని ఆన్‌లైన్ చందమామ పాఠకులకు అందిస్తున్నాం. పచ్చనాకు ఎండుటాకును వెక్కిరిస్తే, నీకూ నాగతే అంటూ ఎండుటాకు నవ్విందనే కథ దాదాపుగా మనందరికీ తెలిసిందే..
దాన్ని మరొక రకంగా దాదాపు 62 ఏళ్ల క్రితం చందమామ తన తొలిసంచికలో ఎంత అద్భుతంగా ఈ చిన్ని కథలో వివరించిందో చూడండి.
పండుటాకుల పాట
“…..అనగా అనగా ఒక పెద్ద రావిచెట్టు. ఆచెట్టు మీద పెద్ద కొమ్మ. ఆ కొమ్మకొక చిన్ని రెమ్మ. ఆ రెమ్మకొక చిన్ని చిగురుటాకు. చిగురుటాకును గాలి చల్లగా జోకొట్టింది. సూర్యకిరణాలు వెచ్చగా మేలు కొలిపాయి. ఆనందంతో ఉబ్బిపోయింది చిగురుటాకు.
అంతలో ఒక పాట సన్నగా వినిపించింది. ఆ పాట చుట్టుపట్ల చెట్లమీదినుంచి సన్నసన్నగా వినిపించింది. ఈ పాటను పండుటాకులు విన్నాయి. అవి కూడా పాట అందుకున్నాయి. రావిచెట్టుమీది పండుటాకులన్నీ పాడసాగాయి.
చిగురుటాకు ఈ పాట విన్నది. ఈ పాట ఏమిటో దానికి అర్థం కాలేదు. పండుటాకులు రాలే వేళయింది. అని చెప్పింది పక్క ఆకు.
రాలి కిందపడటంలో ఆనందం ఉండి ఉండాలి అనుకున్నది చిగురుటాకు. రాలి కిందపడే భాగ్యం తనకు లేదే అని విచారించింది చిగురుటాకు…..”
ఈ కథ గురించిన పూర్తి పాఠం చదవాలంటే కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=92&stId=2270
మీ స్పందనను abhiprayam@chandamama.com పంపండి.
Filed under చందమామ కథలు | Tags: అడవి, కథలు, చందమామ, చిగురుటాకు, జ్ఞాపకాలు, పండుటాకు, పండుటాకులు, పచ్చనాకు, రావిచెట్టు | Comments (4)చందమామ-నా తొలి నేస్తం
“….చందమామ, ఆ పేరులోనే ఏదో మహత్తు ఉన్నట్టుంది. నెలకొకసారి నింగిలో మెరిసిపోయే చందమామ అన్నా, నిండుగా చేతుల్లో ఒదిగిపోయే చందమామ అన్నా ఇష్టపడని వారు ఎవరు? నామటుకు నాకు చందమామ అన్నా, దానిలో బుజ్జిగా ఒదిగిపోయిన కుందేలు పిల్ల అన్నా మహా ఇష్టం, ఇది నేల మీద జాబిల్లి గురించే నింగిలోని జాబిల్లి గురించి కాదు.
మాకు పుస్తక పఠనాభిలాష మా అమ్మగారి నుండి వారసత్వంగా వచ్చింది. ప్రతి నెలా మొదటి వారంలో నాన్న గారి సైకిల్ బెల్ ఎప్పుడు మోగుతుందా అని ఆత్రంగా ఎదురు చూసే వాళ్ళము నేనూ, నా అన్నయ్యలూ. నాన్న సైకిల్ దిగటంతోనే యుద్ధం మొదలు, చందమామ నేను మొదట చదవాలీ అంటే నేను మొదట చదవాలి అని.
చిన్నదాన్ని కాబట్టి ఎప్పుడూ ఓడిపోయేదాన్ని నేను, వాళ్ళిద్దరు చదివిన తర్వాత అంటే సుమారుగా వారం తర్వాత వరకూ నా చేతికి చిక్కేది కాదు చందమామ. నాకేమో కొత్త పుస్తకాన్ని అలా చేతుల్లోకి తీసుకుని అందులోంచి వచ్చే ఒకలాంటి కమ్మటి సువాసనని ఆస్వాదిస్తూ చదవాలి అని తెగ కోరిక, కానీ అది చాలా యేళ్ళ వరకూ తీరలేదు…..”
సాయిలక్ష్మిగారూ,,
మీ చందమామ జ్ఞాపకాలను పంపినందుకు హృదయపూర్వక కృతక్షతలు. సరిగ్గా మీ చిన్ననాటి అనుభవాలే మావి కూడా.. మాది కొంచెం పెద్ద కుటుంబమే మరి. నాలుగు కుటుంబాలలో పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు 15 మందికి పైగా ఉన్న బాల్యం మాది. కుటుంబానికి ఒక పత్రిక చొప్పున అప్పట్లో చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి పత్రికలను తెప్పించినా అవి మా అందరికీ సరిపోయేవి కావు. అవతలివాడికి దొరికిన చందమామ ఇతర పత్రికలు ఎప్పుడు మాకు దొరుకుతాయనే ఎదురుచూసేవాళ్లం.
చివరకు పొలాలకు నీళ్లు కట్టేందుకు రాత్రిపూట ఊరిబయటకు పోతే టార్చి లైటు వెలుతురులో వీటిని ఆబగా చదివి అవతలి వారికి ఇచ్చేయవలసినంత పోటీ ఉండేది మాలో.. ఇలా ఆంధ్ర సచిత్రవారపత్రిక, ఆంధ్రప్రభ, తర్వాత రోజుల్లో ఆంధ్రజ్యోతి, యువ, విజయ, ఇలా ఏ వార, మాస పత్రిక కనిపించినా సరే అవి మా అందరికీ ఇలాగే బట్వాడా అయ్యేవి.
ఒక్కోసారి ముఖచిత్రం గాని ఆకర్షించిందంటే పోటీలు మీద పోటీలు. నువ్వు చదివిన తర్వాత నాకివ్వు అంటే నాకివ్వు అని.. వ్యవసాయ జీవితమూ, చందమామతో సహా కథల పత్రికల అధ్యయనమూ రెండూ కలిసిపోయిన బాల్యం మాది. పొలాల్లో ఎనుములు -గేదెలు- మేపుకుంటూ భారతం, రామాయణం, ఎమెస్కో పుస్తకాలు, చివరకు శ్రీశ్రీ మహాప్రస్థాన గేయాలు కూడా బాల్యంలో ముఖ్యంగా 6,7,8 తరగతుల్లో చదువుకున్నాం, పాడుకున్నాం అంటే నమ్ముతారా..!
ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, తర్వాత ఈనాడు… దినపత్రికలను కూడా ఇలాగే వంతులు వేసుకుని మరీ చదువుకున్నాం మేం. అందరూ అన్నీ కొనే స్తోమత లేకపోవడమే దీనికి కారణం. పంచాయతీ సహకారంతో ఊర్లో లైబ్రరీ పెట్టించుకుని అన్ని పత్రికలను తెప్పించుకోవాలనేది మా ఊరిలో చదువుకున్నవారి కల. అది గత నలభైఏళ్లుగా కలగానే సాగుతోంది. లైబ్రరీలకు బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోయిన ప్రస్తుత కాలంలో ఇక ఇలాంటివి ఎప్పటికీ కలలే..
దానికి తోడు ఊర్లలో ప్యూడల్ అహాలు, అహంకారాలు, భేషజాలు కూడా తక్కువేం కాదు. ఏ మంచి పనిని కూడా చిట్టచివరి క్షణంలో నిలువునా పాతేసే రకం అహంకారాలు. సంవత్సరం క్రితం ఊరినుంచి వలసపోయిన వారు తలా ఇంతని వేసుకుని చుట్టుపక్కల గ్రామాలకు ఉపయోగపడేలా మెడికల్ క్యాంపును పెట్టాలని పథకం వేసుకుని కూడా చివరి క్షణంలో ఎవరు గొప్ప అనే గ్రామీణ అహాలు, రాజకీయాల బారిన పడి ఎవరిదారిన వారు పోయిన చరిత్ర మా ఊరిది.
మరి అభివృద్ధి జరుగలేదా అంటే చాలానే జరుగుతోంది. తారురోడ్లు, బోర్లు, కొత్త కొత్త సేద్యాలు.. వాహనాలు, విలాసాలు వీటికి తక్కువేం లేదు. కానీ.. ఎక్కడో ఏదో లోపం… అర్థమయ్యీ ఆర్థం కాని లోపం… గత ఆదివారం శివరాం గారు చూపించిన మానెక్‌షా ఉపన్యాసం ఈ విషయాన్నే చక్కగా చెప్పింది. దేశంలో అందరూ నాయకులే, కాని తప్పులకు బాధ్యతలు వహించని నాయకులు, బాధ్యతను మోయడానికి ముందుకురాని నాయకులు.. ఇలాంటి నేపథ్యంలో నువ్వెంత అంటే నువ్వెంత రకం భావాలు రాజ్యమేలవా మరి..!
అయినా చదువుకున్నాం. బురదమళ్లలో దిగి సేద్యం చేసిన జీవితం నుంచి పట్టణాల్లో ఉద్యోగ జీవితం వరకు పయనించివచ్చాం. కానీ మా బంగారు బాల్యాన్ని ఎవరో లాగేసుకున్న స్థితి. మా కాళ్ల కింద నేల మాది కాకుండా పోయినట్లు అనిపించే పాత జ్ఞాపకాలు.. వీటిలో తళుక్కుమనే చందమామ జ్ఞాపకాలు. మా బాల్యం పొడవునా నిజజీవితంలోనూ, చందమామలోనూ వెంటాడుతూ వచ్చిన దెయ్యాలు, పిశాచాలు. చెరువుకట్టమీద రాత్రిపూట పోతూ పక్కన ఏదో నీడ కదిలితే దయ్యం వచ్చేసిందంటూ పారుకున్న రోజులు.
మీరు, సునీత గారూ విక్రమార్కుడు మీ కలల రాకుమారుడిగా చెప్పడం చూస్తుంటే ఆరోజు ఆడపిల్లలను విక్రమార్కుడు ఇంతగా ఆకర్షించాడా అనిపిస్తుంది. చందమామ రాజకుమారిల గురించి మీ వర్ణణ అద్భుతంగా ఉంది. వపా హృదయరాణులు వారు. అలా కాక ఇంకెలా ఉంటారు వారు..
“చందమామ మారుతోంది, కానీ ఆ మార్పు మంచి వైపుగా ఉండాలి అన్నదే నా కోరిక. నేను అనుభవించిన ఆ ఆనందం నా తర్వాతి తరం కూడా అనుభవించాలి అన్న చిన్న స్వార్ధం.” అంటూ చివర్లో చెప్పారు. మీది చిన్న స్వార్థం కాదు చాలా పెద్ద స్వార్ధమే. చందమామ రూపురేఖలనే మార్చేసే పెద్ద స్వార్దం. మీరు బాల్యంలో అనుభవించిన ఆ ఆనందం మీ తర్వాతి తరంవారు కూడా అనుభవించాలి అనే మీకోరిక తీరాలనే ఆశిస్తున్నాం. మీ కోరిక కూడా చందమామ బాల్యంలాగే మిగిలిపోతుందేమో మరి..
ఏదేమైనా మీ చందమామ జ్ఞాపకాలకు మన:పూర్వక కృతజ్ఞతలు…
సాయిలక్ష్మిగారి చందమామ జ్ఞాపకాలు పూర్తి పాఠం చదవాలంటే కింది లింకును దయచేసి తెరువండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2269
మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.
మీ చందమామ జ్ఞాపకాలను పాఠకులతో పంచుకోదలిచారా?
abhiprayam@chandamama.com కు పంపండి. మీవి లేదా మీ పిల్లల ఫోటోలు కూడా పంపండి.
చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49
చందమామ పిలుపు
ఊరూవాడా బురదమయం అయిపోయిన కనీవినీ ఎరుగని విపత్కర స్థితిలో సహాయం చేయవలసిందిగా కోరడానికి కూడా గొంతు పెగలని స్థితిలో లక్షలాది మంది ప్రజలు మనుషుల స్పందనకోసం వేచి చూస్తున్నారు. ఎందుకిలా జరిగింది అని ప్రశ్నించేందుకు, నిలదీసేందుకు, ఆరోపణలు గుప్పించేందుకు ఇది సమయం కాదు.
ఆంధ్రప్రదేశ్‌లో వరద బారిన, బురద బారిన పడి నలుగుతున్న లక్షలాది మంది ప్రజల విషాదాన్ని ‘చందమామ’ తనదిగా భావిస్తోంది. చేతనైనంతగా ధనం, వస్తురూపాల్లో సహాయపడే ఆపన్న హస్తాలకు చందమామ చేతులు జోడించి నమస్కరిస్తూ సహాయాన్ని మరింతగా కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తోంది.
లక్షలమంది నిరాశ్రయులై, అంచనాలకు సైతం అందని స్థాయిలో జరిగిన ఈ దారుణ నష్టాన్ని భర్తీ చేయడానికి ఎందరు ఎన్నిరకాలుగా సహాయం చేసినా సరిపోదు కాబట్టి పునరావాస చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు, టీటీడీ వంటి ధర్మసంస్థలూ (7 కోట్ల విరాళం అందించింది), మీడియా చేస్తున్న ప్రయత్నాలకు వ్యక్తులుగా ప్రతిఒక్కరూ చేయూతనివ్వాలని చందమామ పిలుపునిస్తోంది.
దేశదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు, చందమామ పాఠకులు, అభిమానులు, రాష్ట్రంలో సహాయం చేయగల స్థితిలో ఉన్న వారు. ప్రతిఒక్కరూ వరదబాధితులకు తమ వంతు సహాయం చేయాలని చందమామ అర్థిస్తోంది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ చేయలేం అనే రీతిలో దెబ్బతిన్న మనవారిని, తెలుగువారిని ఆదుకోవడానికి కలిసిరావలసిందిగా విన్నవిస్తున్నాం.
మన కళ్లముందు సర్వస్వం కోల్పోయి శక్తి ఉడిగిపోయిన మనవారికి, మన తెలుగు ప్రజలకు జీవితంపై కాసింత ఆశను కలిగించే దిశగా మానవీయ సహాయాన్ని పంపవలసిందిగా చందమామ కోరుతోంది. కాసింత తిండి, బట్ట, తాగడానికి నీరు, వ్యాధుల నివారణకు మందులు… కోటి ఆశలతో ఎదురు చూస్తున్న మనవారికి వీటిలో ఏది మనవద్ద ఉండి సమర్పించినా అది వారి జీవితాశలకు ఆలంబనంగా ఉంటుందని చందమామ గుర్తుచేస్తోంది.
వరద బాధితులను ఆదుకోవడానికి రాష్ట్రం ఏకమైంది. చిన్నా..పెద్దా, పేద..ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేయడానికి ముందుకు కదులుతున్నారు. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ వరద పీడితులకు ఆసరాగా నిలబడటానికి చేయిచేయి కలిపి ముందుకు సాగుతున్నారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్యులు, ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, సినీ నటులు, వ్యాపారస్తులు, పత్రికలు, టీవీఛానళ్లు, స్వచ్ఛంద సంస్థలతో పాటు ఎంతో మంది సాధారణ ప్రజానీక వరద బాధితులకోసం తమవంతు సహాయాన్ని చేస్తున్నారు. విద్యార్థులు వీధి వీధి తిరిగి విరాళాలను సేకరిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు బస్టాండ్లలో హుండీలు పెట్టి సేకరిస్తున్నారు.
ఇలా వరద బాధితులకోసం యావత్ రాష్ట్రం ఏకమయి మానవతా హృదయాన్ని చాటుకొంటోంది. ఇప్పటికే పలు సంస్థలు స్వచ్చందంగా విరాళాలను, సహాయాలను ఒకచోట చేర్చి వరదబాధితులకు అందించడానికి తమ వంతుగా కృషి చేస్తున్నాయి.
ప్రాణాలు మాత్రమే దక్కించుకని బిత్తర చూపులు చూస్తున్న మనవారిని ఆదుకోవడానికి మనం కూడా మనకు చేతనైన సహాయం చేద్దాం. కొన్ని సంస్థల ఫండ్ వివరాలను ఇక్కడ ఇస్తున్నాం.
మీ విరాళాలు పంపవలసిన సంస్థల వివరాలు.
1. ‘ ముఖ్యమంత్రి సహాయనిధి , ఆంధ్రప్రదేశ్ ‘ పేరిట క్రాస్ చేసిన చెక్ , డీడీలు పంపాలి
2. ‘ ప్రధానమంత్రి సహాయనిధి , ఢిల్లీ ‘ పేరిట క్రాస్ చేసిన చెక్ , డీడీలు పంపాలి.
3. రెడ్ క్రాస్ , ఆంధ్రప్రదేశ్ ‘Indian Red Cross Society, AP State branch’ పేరిట నగదు , క్రాస్ చేసిన చెక్ , డీడీలు పంపాలి.
ఇక్కడ పేర్కొన్న చిరునామాలే కాకుండా, మీడియా, టీవీ ఛానెళ్లు ప్రకటిస్తున్న హెల్ప్‌లైన్లు, రిలీఫ్ పండ్‌లు ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే దానికి, మీ సహాయం ఎంత చిన్నదైనా సరే దయచేసి అందించాలని చందమామ అభ్యర్థిస్తోంది.
మీ వీధిలో, ఊర్లో, మీ కాలనీలో వరద బాధితుల కోసం విరాళాలు, వస్తువులు సేకరించే ప్రతి మానవతా మూర్తికి, సంస్థకు మీ ఆపన్న హస్తాన్ని అందించాలని చందమామ కోరుతోంది.
సందేహ నివృత్తికోసం మీ స్పందనలను abhiprayam@chandamama.com కు పంపండి.
Filed under ఆన్‌లైన్ చందమామ రచనలు | Tags: ఆంధ్రప్రదేశ్, ఎంఓ, కడప, కర్నూలు, కృష్ణా, గుంటూరు రిజర్వాయర్, చందమామ, చెక్, జాతీయవిపత్తు, డీడీ, నల్గొండ, నాగార్జునసాగర్, పిలుపు, ప్రకాశం బ్యారేజ్, ప్రధానమంత్రి, మహబూబ్‌నగర్, ముఖ్యమంత్రి, రెడ్‌క్రాస్, వరద, శ్రీశైలం | Comment (1)చందమామలో శంకర్‌గారు అడుగుపెట్టినవేళ
చందమామ శంకర్ గారు
చరిత్రలో కొన్ని ఘటనలకు అద్భుతగుణాలు, మహిమలు ఆపాదించబడుతుండటం మనకందరికీ తెలిసిన విషయమే.. హంపీ చరిత్రలో కుందేలు రేచుకుక్కను తరిమిన ధీరగాథ చాటువులుగా ఈ నాటికీ జనం నోళ్లలో నానుతూ ఉంది. ఒక సామ్రాజ్యం కాని, ఒక చరిత్ర కాని, దీర్ఘకాలం కొనసాగినప్పుడు, ఆ కొనసాగింపు వెనుక నేపథ్యం గురించి కథలు కథలుగా చరిత్రలో వ్యాప్తిలోకి వస్తుండటం కూడా కద్దు. చరిత్రను ప్రభావితం చేసిన ఘటనలు పలురూపాలల్లో జనం మధ్య ప్రచారంలో ఉంటూ రంజింపజేస్తుంటాయి కూడా.
మరి చందమామ పత్రికతో చిత్రకారుడు శంకర్ గారి అనుబంధం మాటేమిటి? దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న చందమామ-శంకర్ సాంస్కృతిక బంధం మాటేమిటి? ఒక చిత్రకారుడు తన జీవితంలో ముప్పావు భాగాన్ని చిత్రలేఖనానికి అంకితం చేయటం ఏమిటి? అందులోనూ తెలుగువారి “సాంస్కృతిక రాయబారి” అని గుర్తింపుకు నోచుకున్న చందమామలో గత యాభైఆరేళ్లుగా నిర్విరామంగా బొమ్మలు గీసుకుంటూ పోవడం ఏమిటి?
ఇది బహుశా ఘనతవహించిన ఓ సామ్రాజ్యపు కథ కాకపోవచ్చు. లేక అరుదైన ఘటనలతో ఉక్కిరి బిక్కిరి చేసే చరిత్ర కానే కాకపోవచ్చు.. కాని చందమామ పత్రికలో శంకర్‌గారు చేరిన క్రమానికి తనదైన చరిత్ర ఉంది. యజమానుల విశ్వాసం, ఉద్యోగుల కృతజ్ఞత పరస్పరం అల్లుకున్న మానవీయబంధం ఈ చరిత్రతో పెనవేసుకునిపోయింది. అందుకే శంకర్‌గారు అద్భుత చిత్రకారుడిగా ఎదుగుతూ రావడం ఎంత వాస్తవమో… ఆ ఎదుగుదలలో అధికభాగం చందమామతోటే ముడిపడి ఉండటం కూడా అంతే వాస్తవం.
ఇది నాగిరెడ్డి గారి సంకల్పానికి, శంకర్ గారి విధేయత, కృతజ్ఞత తోడైన గొప్ప పరిణామానికి నాంది. జీవితం చివరి వరకు చందమామతోనే ఉంటానని శంకర్ గారు మొదట్లో ఎక్కడా ప్రకటించలేదు. కాని 85 ఏళ్ల ముదివయస్సులో పడ్డాక ఆయన తన జీవితంలో ఒకే ఒక కోరికను గట్టిగా కోరుకుంటున్నారు. చివరి శ్వాస వరకు చందమామతోనే ఉంటానన్నదే ఆ కోరిక.
ఇంతటి పటుతర బంధం చందమామతో ముడిపటడానికి దారితీసిన పరిస్థితులేమిటి, దానిపై వ్యక్తుల ప్రభావం ఏమిటి, దాన్నే శంకర్ గారు ఇలా గర్వంగా ప్రకటిస్తున్నారు. “నాగిరెడ్డి గారి పిలుపుతో నేను చందమామలో చేరాను. ఏ ముహూర్తంలో అడుగుపెట్టానో కానీ, 55 ఏళ్లకు పైగా దాంట్లోనే కొనసాగుతూ ఉన్నాను. ఆయన పిలిచారు. నేను వచ్చాను అంతే. ఆయన ఇవ్వాళ లేరు. అయినా నా సంకల్పం మారలేదు. చివరిదాకా చందమామలోనే కొనసాగాలనే కోరికా మారలేదు. వయసు సహకరించక ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ఇష్టమైన బొమ్మలు వేయకుండా ఉండలేను.” ఇది ఆయనకే సాధ్యమైన దృఢసంకల్పం.
చందమామ చిత్రకారుడిగా దశాబ్దాలపాటు ఆయన సృష్టించిన ఘనత, రికార్డులు మనందరికీ కొద్దో గొప్పో తెలుసు. అయితే తమిళ పత్రికలోంచి చందమామలోకి ఆయన రాక, తదనంతర పరిణామాలు గురించి ఏ కొద్దిమందికో గాని తెలిసే అవకాశం లేదు. ఈ వారం చందమామలో అడుగుపెట్టిన వేళావిశేషపు ఘనతను ఆయన ద్వారానే తెలుసుకుందాం.
ఈ కథనం పూర్తి పాఠం చూడాలంటే కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2267
ఈ కథనం మీకు నచ్చితే దయచేసి మీ అభిప్రాయం కింది చిరునామాకు పంపండి.
చిత్రలేఖనంతో పరిచయం, ప్రవేశం, ప్రావీణ్యత ఉన్న తెలుగు బ్లాగర్లు శంకర్ గారి చిత్రలేఖన రీతుల గురించి తెలుసుకోవాలంటే వారు తమ ప్రశ్నలను కూడా పై చిరునామాకు పంపితే ఆయన సమాధానాలివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆసక్తి గల పాఠకులు, శంకర్ గారి అభిమానులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అభ్యర్థిస్తున్నాము.
శ్రీ శంకర్, చిత్రా, వపా వంటి అపరూప చిత్రకారులను చందమామ కానీ, చందమామ పాఠకులు కాని ఇప్పటికీ మర్చిపోలేకున్నారు. ఎన్నటికీ మర్చిపోలేరు. చందమామను భారతీయ బాలసాహిత్యంలో, కథాసాహిత్యంలో శిఖర స్థాయిలో నిలబెట్టడానికి వీరు చేసిన కృషి అసామాన్యం. ఆన్‌సైన్ చందమామలోని చందమామ జ్ఞాపకాలు విభాగంలో శంకర్ గారిపై ఇంతవరకు 3 భాగాలు ప్రచురించాము. వాటి లింకులు కింద చూడగలరు.
చందమామ చిత్రమాంత్రికుడు
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&&stId=2203
చివరి శ్వాసవరకు చందమామ తోటే ఉంటా…
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&&stId=2211
చందమామ శంకర్ గారి జీవిత వివరాలు
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2253
పాతాళదుర్గం – 5

పాతాళదుర్గం - 5
అద్భుతమైన ఊహాశక్తి, నిసర్గ పద సౌందర్యంతో, కల్పనా చాతుర్యంతో దాసరి సుబ్రహ్మణ్యంగారు 1950, 60, 70లలో చందమామ పత్రికలో చెక్కిన అపరూప కథాశిల్పాల్లో ‘పాతాళ దుర్గం’ ఒకటి. ఆయన 1972లో రాసిన ‘యక్షపర్వతం’ ధారావాహిక (13 భాగాలు) ను ఇప్పటికే telugu.chandamama.com లో ప్రచురించిన విషయం తెలిసిందే.
బండెడు పుస్తకాలు, కొండల లెక్కన పరీక్షలు, మార్కులు, అలివిమాలిన టార్గెట్లు, ఇంజనీరింగ్, డాక్టర్, సాప్ట్‌వేర్ కలల భారంలో బాల్యానికి బాల్యమే హరించుకుపోతున్న నేటి పిల్లల తరం కూడా మళ్లీ చందమామను పెద్దలకు లాగే హత్తుకోవాలనే ఆకాంక్షతో ఆయన 1966లో రాసిన ‘పాతాళదుర్గం’ సీరియల్‌ను తిరిగి ఆన్‌లైన్ చందమామలో ప్రచురిస్తున్నాం.
“….రాకుమారి కాంతిసేనను ఎత్తుకుపోయిన కుంభీరుడనే రాక్షసుడు, కొండప్రాంతం చేరి, గుహలో ప్రవేశించబోతూండగా కాలశంబరుడనే మాంత్రికుడి వల్ల గాయపడ్డాడు. చెట్టు మీదినుంచి ధూమకసోమకులు ఇదంతా గమనించారు. హఠాత్తుగా ఎక్కణ్ణుంచో ఒక బాణం వచ్చి, కాలశంబరుడికి తగిలింది. ఆ వెంటనే అతడూ, రాక్షసుడూ దాపులనున్న గుహల్లోకి పరిగెత్తారు.
కదంబ సైనికులు కొందరు, ‘‘అడుగో, రాక్షసుడు! అడుగో, రాక్షసుడు!’’ అని కేకలు పెడుతూ గుహల కేసి పరిగెత్తుకు రావటం, చెట్టు మీద వున్న ధూమక సోమకులు చూశారు. శత్రువుల కంటబడకుండా వుండేందుకు వాళ్ళిద్దరూ మరింత గుబురుగా వున్న చెట్లకొమ్మల్లోకి ఎగబాకారు.
‘‘రాక్షసుడెక్కడ? వాడు పారిపోకుండా చుట్టుముట్టండి!’’ అంటూ ఒక ఆశ్వికుడు కత్తి ఝళిపిస్తూ సైనికుల మధ్యకు వచ్చాడు. అతడు కదంబరాజు ఉగ్రసేనుడు. అతణ్ణి చూస్తూనే సోమకుడు పళ్ళుకొరికి బాణం ఎక్కుపెట్ట బోయేంతలో, ధూమకుడు చప్పున అతణ్ణి వారిస్తూ, చెవిలో మెల్లిగా ఏమో చెప్పాడు.
అంతలో నలుగురైదుగురు కదంబ సైనికులు ఉగ్రసేనుడి దగ్గిరకు పరిగెత్తుకుంటూ వచ్చి, ‘‘మహారాజా! రాక్షసుణ్ణి మేం గాయపరిచాం. ఇదుగో చూడండి, ఇక్కడ భూమ్మీద నెత్తురు గుర్తులు. కాని, వాడు చీకట్లో ఏదో గుహలోకి పారిపోయాడు,’’ అన్నారు…..”
ఈ వారం ప్రచురించిన పాతాళదుర్గం 5వ భాగం పూర్తి పాఠం కోసం కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=36&sbCId=138&stId=2266
పాతాళదుర్గం ధారావాహిక కోసం ఈ కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=36&sbCId=138
ఈ ధారావాహికపై మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.
Filed under చందమామ కథలు | Tags: ఆన్‌లైన్ చందమామ, ఉగ్రసేనుడు, కధాశిల్పం, కాంతిసేన, కాలశంబరుడు, కుంభీరుడు, చందమామ, దాసరి సుబ్రహ్మణ్యం, ధారావాహిక, ధూమకసోమకులు, పాతాళదుర్గం., యువరాజు, రాకుమారి, రాజు, రాణి | Comment (0)విక్రమార్కుడూ… నా రాకుమారుడూ…

చందమామ రాజకుమారి
“…. నాన్న చేతిలో పుస్తకాలు, వేమన పద్యాలూ, సుమతీ శతకం కష్టంగానూ, నాకు నేను ఇష్టంగా చదవగలిగింది నాకు గుర్తున్నంత వరకూ చందమామ మాత్రమే. చందమామ అనగానే రంగురంగుల అట్ట మీద బొమ్మ, లోపల ఏ బొమ్మైనా తెలుపు నీలిరంగు, లేదా తెలుపూ, వూదా కలిసిన పింకూ, ఇలా ఉండేది.
ఐతే చక్కటి రాజకుమారి వంటి నిండా నగలతో ముఖం కనిపించే పలుచటి ముసుగు (సాలార్ జంగ్ మ్యూజియంలో రెబెక్కా లాగా) ఉద్యానవనంలో వ్యాహ్యాళికి వెళితే ఆ ఉద్యానవనంలో ఉండే చిన్న చిన్న పొదలూ వాటి నిండా సందులేకుండా పూలూ, కల్పన అనే అనుకున్నాను మొన్న మొన్న స్టాంఫార్డ్ లో స్ప్రింగ్ చివర్లో విరపూసిన అజేలియాలని చూసిందాకా. చూడగానే చిన్నప్పటి చందమామ కధల్లో రాకుమారి తోట గుర్తుకొచ్చింది.
ఎర్రటి ఎండ, మజ్జిగ, కొద్దిగా ఉప్పు కలిపిన అన్నము, నంజుకునేందుకు దోసకాయి పచ్చడి, చందమామలో చీనాదేశపు రాకుమారి కధ. కధానాయకుడు వాంగో, చాంగో అయివుంటాడు. తెలుపు రేడియం గ్రీను కలిసిన కిమోను వేసుకుని నడినెత్తిన ముడి, ముడిలో అడ్డంగా పుల్ల (ఇప్పుడైతే ఆ పుల్ల నాదగ్గరకూడా ఉన్నది. చైనా ట్రిప్ వెళ్ళొచ్చిన నా స్నేహితురాలు బహుమతిగా ఇచ్చింది) ఇలాంటి బొమ్మతో కధ చదివిందే ఓ ఇరవైసార్లు చదవడం. ఇవన్నీ అర కొర ఙ్ఞాపకాలే………”
సునీత గారూ.. మీ చందమామ జ్ఞాపకాలు పంపినందుకు మనఃపూర్వక కృతజ్ఞతలు.. మళ్లీ ఓసారి చందమామ రాజకుమారిని, ఆ అద్భుత ఉద్యానవనాలను… ముగ్ధ సుకుమార నిసర్గ సౌందర్య రేరాణులను చందమామ పాఠకుల మనోప్రపంచపు తలపుల్లోకి తెచ్చి ఉంచారు. మీ వర్ణనను తలుచుకుంటూంటేనే ఎంత ఆహ్లాదంగా ఉందో..!
పైగా పిశాచాలు, మాంత్రికులు… తెలుగు పిల్లల మానసిక ప్రపంచాన్ని వెలిగించిన అద్భుత పాత్రలు.. అరబ్బులకు అల్లాఉద్దీన్‌లా మంచిని ప్రేమించే, మంచివైపు నిలిచే పిశాచాలు, మాంత్రికులు మనకూ ఉన్నారు.. చందమామ ద్వారా. రాత్రిపూట ఇల్లు వదిలి బయటకు రావాలంటే గజగజా వణికే పల్లెటూరి పిల్లల ఊహా ప్రపంచంలోకి చందమామ పిశాచాలు మెత్తగా ప్రవేశించేవి. మంచి దొంగలాగా మంచి దయ్యాలు, మంచి పిశాచాలు… చందమామలో తప్ప మరెక్కడ చూడగలిగాం మనం..
‘భట్టి విక్రమార్క కధలు చందమామ సిగ్నేచరు.’ చక్కటి వాక్యం.. మీ బాల్యపు రాకుమారుడు విక్రమార్కుడు. చక్కటి ఎంపిక.
మీ చందమామ జ్ఞాపకాలు మరికొందరు చందమామ ప్రియులు, అభిమానులకు తమ జ్ఞాపకాలు రాసి పంపేందుకు ప్రేరణ ఇస్తాయని ఆశిస్తున్నాము..
మిమ్మల్ని ఆరునెలలు హింస పెట్టినా సరే తెలుగు నేర్చుకున్న మీ పాపాయికి చందమామ తరపున శుభాకాంక్షలు
మీ పిల్లలు చందమామను తమకు తామే చదువుకోగల శుభ ఘడియలు రావాలని మనసారా కోరుకుంటూ..
వీలైతే.. మీరున్న ప్రాంతంలో చందమామ పాఠకులు ఉన్నట్లయితే వారిని కూడా చందమామ జ్ఞాపకాలు రాసి పంపమని కోరగలరు.
చందమామ జ్ఞాపకాలు చందమామ పాఠకులు స్వంత వేదిక. వీలైనంత ఎక్కువమంది ఈ వేదికను పంచుకోవడానికి మీ వంటి వారు తలా ఓ చేయి వేస్తారని ఆశించవచ్చు కదూ…
చందమామ జ్ఞాపకాలు పంపేటప్పుడు మీ ఫోటో లేదా మీ పిల్లల ఫోటో తప్పక జతచేయగలరు. జ్ఞాపకాల హోం పేజీలో ఆ ఫోటోలను ప్రచురించగలము.
సునీత గారు పంపిన చందమామ జ్ఞాపకాలు పూర్తి పాఠం చదవాలంటే కింది లింకుపై క్లిక్ చెయ్యండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&&stId=2262
మీ స్పందనను abhiprayam@chandamama.com పంపండి.
మీ చందమామ జ్ఞాపకాలను పాఠకులతో పంచుకోదలిచారా? అయితే..
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి. మీ లేదా మీ పిల్లల ఫోటోతో సహా పంపండి.
చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49
పరోపకారి పాపన్న కథల సేకర్త ఎం.రంగారావు…

పరోపకారి పాపన్న
అతడు…కర్నాటకలో మంగుళూరు (దక్షిణ కెనరా) కు చెందిన పసివాడు. తండ్రి చేసిన అప్పులను తీర్చడానికి చిన్నతనంలోనే మంగళూరు నగరంలో ఓ ఇంట్లో పనికి కుదిరాడు. వంటపని చేస్తూ బతుకు సాగించాడు. చదువు సంధ్యలు లేకుండా సంవత్సరాలు గడిపాడు. తండ్రి చేసిన అప్పు పూర్తిగా తీర్చేసిన తర్వాత కుటుంబంతో పాటు తమిళనాడుకు వలస వచ్చాడు.
అటునుంచి మన రాష్ట్రంలో నెల్లూరు, గూడూరు పట్టణాల వరకు వలసపోయాడు. రాష్ట్రాల సరిహద్దులు దాటి సాగిన ఈ వలస జీవితంలో మాతృభాష కన్నడకు తోడుగా కొంతవరకు తెలుగు కూడా నేర్చుకున్నాడు. రెండో భాషలో కొద్ది ప్రావీణ్యం అందించిన గొప్ప అవకాశం దన్నుతో అలనాటి చిత్రకారుడు ఎంటీవీ ఆచార్య గారి సిఫార్సుతో చందమామలో అడుగుపెట్టాడు.
ఆయనే ఎం.రంగారావు. చందమామ కన్నడ భాషా ఎడిటర్‌గా 1950ల ప్రారంభం నుంచి నాలుగు దశాబ్దాల పాటు పనిచేసిన రంగారావు గారు. చందమామకు రంగారావు గారు చేసిన గొప్ప దోహదం ఏదంటే పరోపకారి పాపన్న కథలు, గుండుభీమన్న కథలను సేకరించి తెలుగులో రాసి ఇవ్వడం. కన్నడ జానపద సంప్రదాయంలోంచి పుట్టుకొచ్చిన ఈ కథలు తెలుగు కథా సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఓ కన్నడిగుడు తెలుగు బాల సాహిత్యానికి అందించిన అమూల్యమైన కథలివి.
చందమామలో ప్రచురించబడిన ధారావాహికలలో ముఖ్యమైనది పరోపకారి పాపన్న కథలు. 1962 నుంచి ఈ కథలు చందమామలో సీరియల్ రూపంలో వచ్చాయి. ‘ఈ కథలు ఎంత ప్రాచుర్యం పొందాయంటే, ఎవరైనా కొంచెం మంచికి పోయి సహాయపడితే, అటువంటివారిని ‘పరోపకారి పాపన్నరా వాడు’ అని పిలవటం వాడుక అయ్యింది.’ అలాగే అంతకు ముందు ఈయన రాసిన గుండు భీమన్న అనే మరో సీరియల్ కూడా చందమామలో వచ్చింది. దీన్ని కుటుంబరావు గారు రాకముందు తెలుగు ఎడిటర్‌గా ఉన్న రాజారావుగారు సాపుచేసి మొదట తెలుగులో ప్రచురించారు.
కర్నాటక ప్రాంతానికి చెందిన ఓ పిల్లవాడు బాలకార్మికుడిగా, వంటమనిషిగా జీవితం ప్రారంభించి సాహిత్యం వాతావరణం ఉన్న కుటుంబాల్లో పెరిగి స్వయంకృషితో రచయితగా పరిణమించడమే కాక, తదనంతర కాలంలో చందమామ కన్నడ ఎడిటర్‌గా రూపొందిన క్రమం గత 60 సంవత్సరాలుగా మరుగున పడిపోవడమే ఓ విషాదంగా చెప్పాలి. చదువు నేర్చుకోవడం ద్వారా ఓ వంటమనిషి జీవితంలో సంభవించిన మౌలిక మార్పుకు రంగారావు గారు నిలువెత్తు సంకేతంలా చరిత్రలో నిలిచిపోయారు.
ఈ కథనం పూర్తి పాఠం చూడాలంటే కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2260
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.
గమనిక: కన్నడ చందమామ పూర్వ ఎడిటర్ రంగారావు గారి వివరాల సేకరణకు ఇద్దరు ప్రేరణగా నిలిచారు. ఒకరు రోహిణీ ప్రసాద్ గారు. మూడు నెలల క్రితం ఆయనతో సంబంధంలోకి వచ్చినప్పుడు ఆయన పత్యుత్తరమిస్తూ చందమామలో గతంలో పనిచేసిన కన్నడ ఎడిటర్ రంగారావు గారు, తమిళ ఎడిటర్ స్వామినాథన్ గారు తదితరులను ప్రస్తావిస్తూ వీలైతే వారి గురించిన వివరాలు కనుక్కోవలిసిందిగా కోరారు.
అలాగే శివరాం ప్రసాద్ గారు.. పరోపకారి పాపన్నలోకి పరకాయప్రవేశం చేశారా అన్నట్లుగా ఇటీవలే తన బ్లాగులో రెండు మంచి కథనాలను పోస్ట్ చేశారు. కన్నడ జానపద మూలానికి చెందిన పాపన్న, గుండుభీమన్న తెలుగులోకి ఎలా వచ్చారనే కుతూహలం వీరిద్దరి ప్రేరణలకు తోడైన క్షణాల్లో ఈ వ్యాసం రూపు దిద్దుకుంది. అందుకు వారిద్దరికీ కృతజ్ఞతాభివందనలు…
రంగారావు గారికి సంబంధించిన ఇతర అంశాలు ఇంకా వెలుగులోకి రావల్సి ఉంది. చందమామ సీనియర్ ఉద్యోగులు శంకర్, బాలు గార్లతో మాట్లాడే క్రమంలో ఈ అదనపు వివరాలు లభిస్తాయనే ఆశిద్దాం…
Filed under చందమామ చరిత్ర | Tags: ఎడిటర్, కథలు, కన్నడం, కుటుంబరావు, గుండుభీమన్న, గూడూరు, చందమామ, చక్రపాణి, చెన్నయ్, జ్ఞాపకాలు, దాసరి సుబ్రహ్మణ్యం, నాగిరెడ్డి, నెల్లూరు, పరోపకారి, పాపన్న, మంగుళూరు, ముద్దావిశ్వనాధం, రంగారావు, రాజారావు, విశ్వనాథరెడ్డి. | Comments (11)ఇష్టం లేని పని చేయవలసి వస్తే….
ఇష్టపడి చేసేది కష్టమైనా సరే సంతోషంగా చేస్తారు అని నానుడి.. మరి, లౌకిక వాంఛలవల్ల కలిగే అనర్థాలను గుర్తించి, సన్యాసం అవలంబించి, యాభై ఏళ్ళపాటు హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటూ గడిపిన కృష్ణద్వైపాయనుడు కాని, జగత్ప్రసిద్ధి పొందిన దాతలు తాతా, తండ్రీ మార్గాన్ని అనుసరిస్తూ వచ్చిన మాండవ్యుడు కాని, పసితనంలోనే ఓ భర్తకు భార్యగా మెట్టింటికి వచ్చి జీవితం గడిపిన మహిళ కాని ఎందుకు తమ తమ విధులను ఇష్టంగా చేయలేకపోయారు.
అందుకు వారికి జీవితంలో ఒరిగిందేమిటి….? చివరికి వారికి మిగిలిందేమిటి…? పేమాభిమానాలు లేకుండానే సంవత్సరాల పాటు కాపురం చేసిన భార్య చివరకు అనివార్య పరిస్థితుల్లో ఈ చేదునిజాన్ని భర్తకే చెప్పవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు, తర్వాత ఆ భార్య గతి ఏమిటి? వంటి మౌలిక విలువల సారాన్ని తెలుసుకోవాలంటే ఈ కింది కథను చదవండి. అనుభవం ప్రాతిపదికగా మనిషిలో కలిగే పరివర్తనను అద్భుతంగా చెప్పిన ఈ జాతక కథను మీరు తప్పక కింది లింకులో చదవండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=93&stId=2254
మీ స్పందనను abhiprayam@chandamama.com పంపండి.
Filed under చందమామ కథలు | Tags: కాపురం, చందమామ, జాతకకథలు, తపస్తు, దానం, పరివర్తన, బోధిస, బోధిసత్వుడు, లోకంతీరు | Comment (0)ఏదుపందికి పొట్టి తోక ఏర్పడింది!
మనం చిన్నప్పుడు అనేక కథలను వినే ఉంటాం.. చందమామపై చెట్టుకింద ముసలమ్మ ఒకతే కూర్చుని ఎందుకు దోసెలు పోస్తా ఉంది? అనేది ఓ కథ. బహుశా ఈ కథను అందరూ తమ తమ ప్రాంతాల సంస్కృతి, వాడుకకు అనుగుణంగా వినే ఉంటారు. ఇంకో అద్భుత కథ. పిల్లి రెంటికి పోయాక ఎందుకు మట్టివేసి మూసిపెడుతుంది?
ఇలాంటివే మరికొన్ని కథలు… ఉడతకు వీపు మీద చారలు ఎందుకు ఏర్పడ్డాయి? కుక్కతోక ఎప్పుడూ వంకరగానే ఎందుకుంటుంది? కుక్క ఒంటికి పోసే ప్రతిసారీ ఎందుకు వాసన చూస్తూ ఉంటుంది? మన నిత్య జీవితంలో మనం చూసే ప్రతి జంతువు, చెట్టు, రాయి.. ఇలా కంటికి కనిపించే వస్తువులన్నింటిమీదా మనుషులు అల్లుకున్న అద్భుతమైన కాల్పనిక కథలు ఇవి.
శాస్త్ర విజ్ఞానం పెరిగే కొద్దీ పై ప్రశ్నలకు మనం హేతుపూర్వకంగా సమాధానాలు పొందవచ్చు. అవి మరింత హేతుబద్ధంగా ఉండవచ్చు కూడా.. కాని పల్లెటూళ్లలో బాల్య జీవితం అప్పటికీ ఇప్పటికీ కూడా కాల్పనిక ప్రపంచం, కాల్పనిక ఊహల మీదే ఆధారపడి ఉందనిపిస్తుంది.
ఉడత వీపు మీద చారలు ఫలానా జన్యుమార్పుల వల్ల కలిగిందని సైన్స్ చెబుతున్నా.. సేతువు కట్టడంలో ఉడత చేసిన సాయానికి రాముడు ప్రేమగా దాని వీపు నిమిరితే దాని గుర్తుగా చారలు ఏర్పడ్డాయి అనే కథ పిల్లల మనస్సులపై, బాల్యపు ఊహలపై ఎంత గట్టి ప్రభావం వేస్తుందో మాటల్లో చెప్పలేం…
శాస్త్రీయ విజ్ఞానం సమాజానికి ఎంత అవసరమో.. పిల్లల ఊహా ప్రపంచానికి వన్నెలద్దే కాల్పనిక కథలు కూడా అంతగానే అవసరమే.. అందుకే భవిష్యత్తు సమాజాలు సైతం పిల్లల కాల్పనిక కథలకు పెద్ద పీట వేయాల్సిందే… సోషలిస్టు పునాదుల మీద ఏర్పడ్డ సోవియట్ సమాజం ప్రపంచ బాల సాహిత్యంలోనే తలమానికంగా నిలిచిన వందలాది కాల్పనిక చిత్రకథలను పెద్ద ఎత్తున ప్రచురించిన విషయం తెలిసిందే కదా..
ఏ సమాజమైనా జంతువులు పాత్రలుగా మానవ మనస్తత్వాన్ని విపులీకరించే బాల సాహిత్యానికి పెద్ద పీట వేస్తూ వస్తోంది.
ఏదుపందికి పొట్టి తోక ఎలా ఏర్పడింది అనే కథ కూడా ఈ కోవకు చెందిందే..
ఇదొక చెరూకీ కథ. ఇప్పటి జంతువులకన్నా పూర్వకాలం నాటి జంతువులు పెద్దవిగానూ, దృఢంగానూ, తెలివిగలవిగానూ ఉండేవని చెరూకీ జాతివాళ్ళు విశ్వసించేవారు. అవి మనుషులతో కలిసిమెలిసి తిరుగుతూ సరిసమానంగా ఉండేవని కూడా వాళ్ళు నమ్మేవారు.
ఆ కాలంనాటి ఒక ఏదుపందికి ఒకనాడు విపరీతంగా ఆకలి వేసింది. ఎవరైనా తన బొరియలోకి ఇంత తిండి పడేస్తే ఎంత బావుణ్ణు! అన్న ఆశతో ఆలోచించసాగింది. కొంతసేపటికి దానికి కొన్నాళ్ళ క్రితం మనుషులుంటున్న ఇంటివైపుగా తాను పరిగెత్తుతున్నప్పుడు వాళ్ళు చెప్పుకుంటూండగా తన చెవిని పడ్డ, ‘కోరికలే గుర్రాలయితే, మూర్ఖులే వాటి మీద స్వారీ చేస్తారు’ అనే సూక్తి గుర్తుకు వచ్చింది. అది చటుక్కున లేచింది.
తన మూర్ఖత్వం కాకపోతే, ఎవరు పనికట్టుకుని తన బొరియలోకి ఆహారం తెచ్చిపెడతారు? తనే వెళ్ళి సంపాయించడం తప్ప మరో మార్గంలేదనుకున్నది. తను వెలుపలికి వెళ్ళక తప్పదు. అంటే సురక్షతమైన తన బొరియను వదిలిపెట్టాలి. వెలుపల తనను వేటాడే జంతువుల కంటబడకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే అవి, తనను పట్టి తినేయగలవు. మరుక్షణమే తనలోని భయాన్ని తలుచుకుని నవ్వుకున్నది. తను ఎన్నిసార్లు చావు నుంచి తప్పించుకోలేదు? అపాయం నుంచి తప్పించుకోవడానికి తనకు ఎన్నెన్ని ఉపాయాలు తెలుసు!
ఈ కథ కావాలంటే కింది లింకును చూడండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=92&&stId=1402
మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపగలరు.
Filed under చందమామ కథలు | Tags: ఆకలి, ఆహారం, ఏదుపంది, కథలు, చందమామ, చెరూకీ, జంతువు, పొట్టితోక, బొరియ | Comment (0)చందమామ శంకర్ గారి జీవిత వివరాలు…

శంకర్ గారు
చందమామ చిత్రమాంత్రికులు శంకర్ గారు 1946 నుంచి చిత్రలేఖన పనిని వృత్తిగా ఎంచుకున్నారు. అప్పటినుంచి చిత్రాలు గీయడమే తప్ప మరొక వ్యాపకం పెట్టుకున్న చరిత్ర లేదు. నిజంగా చెప్పాలంటే బొమ్మలు గీయడం. పరమ భక్తిప్రపత్తులతో పనిలో దిగటం తప్ప మరొక పని ఈయనకు తెలియదు.
ఏమీ తెలియకపోవడం కూడా మంచిదయ్యిందేమో మరి. చందమామ చిత్రప్రపంచానికి, చిత్రలేఖన చరిత్రకు వన్నెలద్దిన గొప్ప హస్తనైపుణ్యం మన కాలం ప్రపంచానికి సజీవంగా ఇన్ని దశాబ్దాలుగా మిగలడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చు.
ప్రస్తుతం వయసు మీద పడిన కారణంగా (85 ఏళ్లు) వారంలో తొలి మూడు రోజులు మాత్రమే చందమామ కార్యాలయానికి వచ్చి పని చేస్తారు. గురు, శుక్ర వారాల్లో మాత్రం ఇంటివద్దే ఉంటూ చందమామ చిత్రాలు గీస్తారు.
రోడ్లమీద మలుపుల్లో, గతుకుల్లో ఊగుతూ వచ్చే క్యాబ్‌లో అందరితోపాటు కూర్చుని 85 ఏళ్ల వయసులో రోజూ ఆఫీసుకు రాలేనని చెబితే యాజమాన్యం ఈయనకు మినహాయింపు ఇచ్చి చివరి రెండు రోజులు ఇంటివద్దే పనిచేయడానికి వీలు కల్పించింది. మొదటి మూడు రోజులు ప్రింట్ చందమామ వర్క్ ప్లాన్ అమలుకోసం తప్పక రావలసి ఉంటుంది.
వయోభారం మీద పడుతూనే ఉన్నా సరే.. ‘జీవితం చివరి వరకూ చందమామలోనే పనిచేయాల’నే సంకల్పబలం సాక్షిగా శంకర్ గారు చందమామ ఆఫీసుకు వస్తూనే ఉన్నారు. జీతం పట్ల, పదవి పట్ల, హోదా పట్ల కించిత్ ఆశలు, ఆకాంక్షలు కూడా లేని ఈ నిగర్వి… మా వంటి తదుపరి తరాలకు, ప్రస్తుతం చందమామలో పనిచేస్తున్న పిల్లలకు (20 నుంచి 25 ఏళ్ల వయసులోపు) ఓ అద్భుతమైన ‘శ్రామిక ఉదాహరణ’లాగే ఉంటారు.
పని సంస్కృతికి నిలువుటద్దంలా నిలిచే ఈ మహనీయ మూర్తిమత్వం మాతో ఉంది. మేం ఆయనతో కలిసి పనిచేస్తున్నాం. ఆయనతో మా ఉద్యోగ జీవితాన్ని, మాటలను, చూపులను, ప్రయాణాన్ని కూడా పంచుకుంటున్నాం అనే విషయం తల్చుకుంటేనే మాకు ఒళ్లు గగుర్పొడుస్తూ ఉంటుంది.
శంకర్ గారి జీవిత వివరాల పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2253
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&sbCId=&stId=2253&pg=1
ఆకాశంలోకి అమాంతంగా ఎగురగలిగినా…

గోవిందుడి లంఘనం
చందమామ కథలు దశాబ్దాలుగా పిల్లల ఊహా ప్రపంచంలో ఓ భాగమయ్యాయి. పిల్లల్లో సహజసిద్ధంగా ఉండే కాల్పనిక ప్రపంచపు ఊహలను ఆవి సంతృప్తి పర్చాయి. చందమామ కథలు నీతి నియమాలను సర్వ సాధారణ రీతిలో బోధిస్తాయి. ప్రతి చందమామ కథలోని సారాంశం పిల్లల్లోనే కాక పెద్దల్లో కూడా మంచి భావాలను పెంచి పోషిస్తూ వచ్చింది. చాలా వరకు ఇదంతా పనిగట్టుకుని బోధించినట్లుగా కాకుండా, సహజాతిసహజంగా, స్వచ్చందంగా జరుగుతూ వచ్చింది.
మన ప్రాచీన మేధో సంపదను కథ రూపంలో చందమామ మనముందుకు తీసుకువచ్చింది. పల్లె సీమల గురించిన మన అవగాహనను, జాతి మహత్తర సంస్కృతిని, నాగరికతను చందమామ కథలు మరింత ఉద్దీప్తం చేశాయి.
‘విద్యావంతుడు’ అనే శీర్షికతో వచ్చిన బేతాళకథ దీనికి ఓ ఉదాహరణగా నిలుస్తుంది. ఇది చందమామ మరో కథల మాంత్రికుడు వసుంధర గారు రాసిన కథ. 2003 సంవత్సరం చందమామ సంచికలో ఇది అచ్చయింది. అంతకు ముందే కూడా ఇది ముద్రణ పొందిందేమో తెలియదు.
రామాయణ కాలంనాటి వానరులకు మల్లే ఆకాశంలోకి అమాంతంగా ఎగురగలిగిన అమోఘ శక్తి మనిషికి సిద్ధించడం అనే ఊహే మనిషి మనస్సును పరవశింపజేస్తుంది. నా చిన్నప్పటి స్వప్న ప్రపంచంలో నేను కూడా కోతి కొమ్మచ్చి ఆట ఆడుతూ చెట్టు మీదనుంచి ఆటలో భాగంగా దుముకుతున్నప్పుడు కింద పడకుండా అలాగే పైకి ఎగిరి పోయేలాంటి కలలు చాలాసార్లే వచ్చాయి.
మనిషిలో అద్భుతశక్తులు నిజంగా ఉంటే కూడా అవి మనిషి ఇబ్బందులను తీర్చాలే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకు, స్వార్ధాలకు, ధనసంపాదనకు ఉపయోగపడకూడదనే మానవీయ విలువను ఈ కథ అతి సరళంగా చాటి చెబుతోంది.
‘‘జీవితం కొత్త విద్యలు నేర్చుకునేందుకేనా! హాయిగా రోజులు వెళ్ళిపోవడానికి డబ్బు సంపాదించాలి. ఉన్నంతలో నలుగురికీ సాయపడాలి. జీవితమంతా కొత్త విద్యలు నేర్చుకుంటూ గడిపివేయడం, నాకిష్టముండదు,’’ అంటూ ఈ కథలో వాదించిన గోవిందుడు చివరకు రాజశేఖరుడి వంటి గొప్ప కీర్తిమంతుడే తన వద్దకు శిష్యరికం కోసం వచ్చినప్పుడు, మనసు పొరల్లో కరడు గట్టిన అహాన్ని చంపుకున్నాడు. మానవ జీవన పరమార్థాన్ని ఆకళింపు చేసుకుని వినయమనే ఉత్తుంగ శిఖరాలను చేరుకున్నాడు.
ఇది నీతి కథ కాదు. జాతి కథ. విశ్వ మానవాళి ఆచరించి తీరవలసిన కథ.
విద్యావంతుడు కథను తప్పకుండా కిందిలింకులో చదవండి..
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=36&sbCId=97&stId=2251
మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపగలరు.
Filed under చందమామ కథలు | Tags: గోవిందుడు, చందమామ, బేతాళ కథలు, రాజశేఖరుడు, వసుంధర, విద్యావంతుడు. | Comment (0)ప్రతి ఇంట్లో చందమామ ఉన్న అందమైన కాలం
చిన్నప్పటి విషయాలు అందరికి అన్ని గుర్తుండవు. నా సంగతి అంతే అనుకోండి. కాని చందమామతో అనుబంధం జీవితాంతం మనసులోనుండి పోదు పోలేదు అని నేను, నాలాంటి ఎందరో చంపిల అభిప్రాయం అని ఖచ్చితంగా చెప్పగలను. స్కూలులో చెప్పిన తెలుగు పాఠాలకంటే అమ్మ ఇంట్లో చదివించిన చందమామ వల్లే నాకు తెలుగు మీద ఆసక్తి, పట్టు కలిగింది అని గర్వంగా చెప్పుకుంటాను.
పిల్లలున్న ప్రతి ఇంట్లో చందమామ ఉండి తీరాల్సిందే అనే అందమైన కాలం అది. అమ్మలు, నాన్నలు తమకోసం, తమ పిల్లల కోసం చందమామ కొనేవారు. ప్రతి నెల క్లాసు ప్రోగ్రెస్ రిపోర్ట్ కంటే ఎక్కువగా (అంతకంటే ఎక్కువగా) చందమామ కోసం ఎదురుచూపులు. అది రాగానే నాకు, తమ్ముళ్ళకు మధ్య బల ప్రదర్శన. నాదే గెలుపనుకోండి.
అప్పుడప్పుడు ఆ పుస్తకం వాళ్ళ కంటపడకుండా మొత్తం చదివేసి డ్రాయింగ్ రూం లో పెట్టేయడం. ఇక ఎవరేమన్నా చేసుకోండి నేను చదివేయడం ఐపోయింది అని ..కాని గంటలో పుస్తకం అవ్వగొట్టి నేలంతా ఎదురుచూడాలంటే మాత్రం విసుగేసేది. అమ్మ చదివే వారపత్రికలలాగా చందమామ కూడా వారానికోటి వేస్తే వీళ్ల సొమ్మేం పోతుంది. డబ్బులిచ్చే కొంటాము కదా అని పదో క్లాసు వరకు తిట్టుకున్నాను కూడా………
జ్యోతి గారూ,
పిల్లలున్న ప్రతి ఇంట్లో చందమామ ఉండి తీరాల్సిందే అనే మెరుపువాక్యంతో అదరగొట్టేశారు. వ్యక్తిగతంగా సమాచారం పంపకున్నా మీరు చందమామ జ్ఞాపకాలు స్వయంగా పంపారు. అందుకు మనఃపూర్వక కృతజ్ఞతలు.. ఆన్‌లైన్ చందమామతో మీ చందమామ జ్ఞాపకాల బంధం ఇలాగే కొనసాగుతుందని.. కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాము.
“పిల్లలున్న ప్రతి ఇంట్లో చందమామ ఉండి తీరాల్సిందే అనే అందమైన కాలం అది.”
చందమామ స్వర్ణయుగ చరిత్రకు ఈ వాక్యం సాక్షీభూతంగా నిలుస్తోంది కదా..
“అమ్మ చదివే వారపత్రికలలాగా చందమామ కూడా వారానికోటి వేస్తే వీళ్ల సొమ్మేం పోతుంది. డబ్బులిచ్చే కొంటాము కదా అని పదో క్లాసు వరకు తిట్టుకున్నాను కూడా.”
అమ్మా.. అమ్మమ్మా.. ఎంత పెద్ద ఆశండీ మీకు. ఇక్కడ నెలకు ఓ సంచిక తీసుకువస్తూంటేనే మా పని “అయిపోతోంది” అన్నిరకాలుగా.. ఇక వారానికోసారా…
“క్లాసు పుస్తకాలు బోర్ కొడితే పాత చందమామలు తీసి సింగిల్ పేజీ కథలు చదవడం అలవాటు.”
అన్ని కాలాలకు వర్తించే గొప్ప మాట..
“పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళ కోసం తెప్పించే చందమామలు ముందు నేనే చదివేదాన్ని.”
చందమామ బతుకుతోందంటే మీవంటి ఆరాధకుల వల్లే కాబోలు.
“పుస్తకం చేత పట్టుకుని కథలో లీనమై చదువుతుంటే ఉండే ఆనందం, తన్మయత్వం, ఆన్‌లైన్‌లో.. కంప్యూటర్‌లో చదివితే వస్తుందా? రాదు గాక రాదు గాక రాదు..”
చందమామను కొని భద్రపెట్టుకున్న వారికి పుస్తకం పట్టుకుని చదివే భాగ్యం ఉందనుకోండి. ఆ భాగ్యం లేనివారి మాటేమిటి? అందుకే.. ఇలాంటివారికోసమే… నాలాంటి వారికోసమే.. ఆన్‌లైన్ ఆర్కైవ్స్‌లో పాత చందమామల నిధి ఓ పెన్నిధిలాగా ఉపయోగపడుతోంది. అయితే రిఫరెన్స్ కోసం చందమామ కథలు వెతుక్కోవాలంటే పుస్తక రూపంలో ఉన్న సౌలభ్యం ఆన్‌లైన్‌లో ఉండదనుకోండి. చందమామ కథల మొత్తం కేటలాగ్‌ను (గత 62 సంవత్సరాల సంచికలవి) రూపొందించి పాఠకులకు అందుబాటులోకి తెస్తే బాగుంటుందేమో మరి.
జ్యోతిగారి చందమామ జ్ఞాపకాల పూర్తి పాఠం కిందిలింకులో చదవండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2244
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.
చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49







