అమెజాన్‌లో చందమామ

ప్రవాస భారతీయులకు, చందమామ అభిమానులకు శుభవార్త. “చందమామ కలెక్టర్స్ ఎడిషన్” – 60 సంవత్సరాల విశేష సంచిక-ను, “చందమామ రామాయణం” కార్టూన్ పుస్తకాన్ని (అన్ని పేజీలూ రంగుల్లో) స్వదేశం నుంచి తెప్పించుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్న విదేశాల్లో ఉంటున్న భారతీయులకు ఈ రెండు పుస్తకాలు ఇప్పడు ఆన్‌లైన్‌లో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చాయి.
![Chandamama Collection Edition art1[6]_400-519 Chandamama Collection Edition art1[6]_400-519](http://blaagu.com/chandamamalu/files/2010/01/Chandamama-Collection-Edition-art16_400-519.jpg)
చందమామ 60 సంవత్సరాల ఉజ్వల శకానికి సంబంధించిన కథలు, చిత్రాలతో చందమామ సంస్థ 2008లో “Chandamama- Celebrating 60 Wonderful Years” అనే పేరుతో ఓ కలెక్టర్స్ ఎడిషన్‌ను ప్రచురించింది. అలాగే, ఇతిహాసాలలో బాగా ప్రాచుర్యం పొందిన రామాయణంను “Chandamama’ Ramayana – An epic Journey” పేరిట కార్టూన్‌లలోకి మార్చి ఆద్యంతం రంగుల పుటల్లో తీసుకువచ్చింది (2008)

హార్డ్‌కవర్‌లో, అద్భుతమైన పేపర్ క్వాలిటీతో రూపొందిన ఈ రెండు విశిష్ట పుస్తకాలను అమెజాన్.కామ్‌లో ఒక్కొక్కటి 43.85 డాలర్ల చొప్పున చందమామ అభిమానులు తీసుకోవచ్చు. -అమెజాన్.కామ్ వారి నిర్ణయం బట్టి ప్యాకింగ్ రుసుము కింద 3 డాలర్లను అదనంగా చెల్లించవలసి ఉంటుంది. -
చాలా కాలం తర్వాత చందమామ ఈ రెండు ప్రచురణల ద్వారా, పూర్తిస్థాయిలో ఓ రంగుల ప్రపంచాన్ని పాఠకుల ముందుకు తీసుకువచ్చింది. ‘చందమామ’ చరిత్రకు వన్నెలద్దుతున్న ఈ పుస్తకాలను మీరు ఇకపై నేరుగా అమెజాన్.కామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఇంటర్నెట్‌లో amazon.com ను తెరిచి Searchలోని కేటగిరీలలోనుంచి ‘Books’ని సెలెక్ట్ చేసుకుని పక్కనున్న ఖాళీ స్థలంలో సెర్చ్‌వర్డ్‌గా Chandamama పదాన్ని టైప్ చేసి Go పై క్లిక్ చేయండి. అమెజాన్‌లో చందమామ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ రెండింటిని లేదా మీకు నచ్చిన దానిని ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసి నేరుగా మీ ఇంటికే తెప్పించుకోవచ్చు.
చందమామ కలెక్టర్స్ ఎడిషన్ – 2008 పుస్తకంపై సమీక్ష, వ్యాఖ్యలకోసం కింది లింకులో చూడండి.
చందమామ కలెక్టర్స్ ఎడిషన్ – 2008
![Chandamama Collection Edition art2[6]_400-500 Chandamama Collection Edition art2[6]_400-500](http://blaagu.com/chandamamalu/files/2010/01/Chandamama-Collection-Edition-art26_400-500.jpg)
పై రెండు పుస్తకాలను భారతీయ భాషల్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి కాస్త సమయం పట్టవచ్చు. అలాగే చందమామ అలనాటి చిత్రకారులు సర్వశ్రీ చిత్రా, ఎంటీవీ ఆచార్య, శంకర్, వపా గార్లు చిత్రించిన అద్భుత చిత్రాల సంకలనం అతి త్వరలో చందమామ పాఠకులకు, అభిమానులకు అందుబాటులోకి రానుంది.
చందమామ చిత్రాలకున్న ప్రాధాన్యత జగమెరిగిన సత్యమే కాబట్టి మీతోపాటు చందమామలో పనిచేస్తున్న మేము కూడా ఎంతో ఆసక్తిగా వాటికోసం ఎదురుచూస్తున్నాం.
అమెజాన్‌లో చందమామ పుస్తకాల కొనుగోలుకు సంబంధించిన లింకులకోసం ఇక్కడ కూడా చూడగలరు
Chandamama CTB and Ramayan is available on amazon.com…
For ordering the Candamama Collector’s edition (“Chandamama- Celebrating 60 Wonderful Years”) and Ramayana (“Chandamama’ Ramayana – An epic Journey”) in cartoons -all pages in colour-,
….see and use the below mentioned links.
OR
Ordering from Amazon.com is quick and easy
సత్వర అర్డర్ కోసం
మీ
చందమామ
వంద కథనాల చందమామ బ్లాగు

చందమామ తొలిసంచిక ముఖచిత్రం
మిత్రులారా! ఇవ్వాళ్టితో నా బ్లాగులో వంద పోస్టులు చేరాయి. నాలుగు నెలల క్రితం అంటే జూలై 7న ‘చందమామ’ జ్ఞాపకాలను పదిలపర్చాలన్న చిరుకోరికతో, సదసత్సంశయంతో మొదలుపెట్టిన ‘చందమామలు’ బ్లాగు ‘చందమామ చరిత్ర’ సాక్షిగా నేటికి 130 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే ఈ పోస్టుతో కలిపి ఈ నాలుగు నెలలూ ఈ బ్లాగులో పొందుపర్చిన కథనాలు, కథలు, పరిచయాలు, జ్ఞాపకాలు సరిగ్గా వందకు చేరుకున్నాయి. ఈ నాలుగు నెలల కాలంలోనే దాదాపుగా 14 వేల హిట్లు కూడా ఈ బ్లాగు సాధించింది.
ప్రధానంగా పాఠకులు, చందమామ అభిమానులు… మీరే ఈ విజయానికి నిజమైన కారకులు. తొలి పేరాలో సదసత్సంశయం అని ఎందుకు వాడానంటే చందమామతో అనుభూతులు, జ్ఞాపకాలు, పరిచయాలు ప్రధానంగా ఈ బ్లాగులో ఉంచాలని మొదట్లో అనుకున్నప్పుడు ఓ చిన్నపాటి సందేహం కూడా కలిగింది
గతంలో ఉజ్వలంగా వెలిగిన ఈ నిరుపమాన కథల పత్రిక గురించి, దాని చరిత్ర గురించి, మరుగున పడిన చందమామ అంతర్గత విషయాల గురించి, దాంట్లో దశాబ్దాలుగా పనిచేస్తూవచ్చిన ధీమంతుల గురించి రాస్తే ఎవరు చూస్తారు, ఎవరికి చందమామ గత చరిత్రను చదవగలిగిన ఓపిక, తీరిక ఈ స్పీడ్ యుగంలో ఉందని భయపడిన మాట వాస్తవం. అందుకే మంచి పనిని కించిత్ సంశయంతోనే మొదలు పెట్టాను.
అయితే ఆగస్టు నెలలో కూడలి, జల్లెడ, హారం వంటి తెలుగు బ్లాగుల సమాహారంలో చేరిన తర్వాత ఈ బ్లాగులో కదలిక పుంజుకుంది. చందమామతోడుగా బాల్యంలో పెరిగి పెద్దయిన వారు, చందమామను మధ్యలో స్కూలు, కాలేజీ రోజుల్లో చదివి దానిపై మమకారం పెంచుకున్నవారు, ఒక ఇంటలెక్చువల్ ప్యాషన్‌తో చందమామ చరిత్రను తలపులనిండా ఉంచుకుని తమ బ్లాగుల్లో అలనాటి చందమామపై మంచి మంచి వ్యాసాలు, కథనాలు ఇప్పటికే పోస్ట్ చేసిన వారు, చేస్తున్నవారు… సామాన్యుల నుంచి మాన్యుల వరకు, ఇలా ప్రతి ఒక్కరూ.. ఈ బ్లాగును తమ స్వంతం చేసుకున్నారు.
చందమామ చరిత్రను, వ్యక్తుల పరంగా, కథల పరంగా, సంఘటనల పరంగా అక్షరబద్ధం చేస్తూ వచ్చిన ప్రతి దశలోనూ మీరంతా హితవచనాలు పలుకుతూ, విలువైన వ్యాఖ్యల ద్వారా నాలో మరింత ప్రోత్సాహాన్ని ప్రోది చేశారు. రాష్ట్రం సరిహద్దులు దాటి ప్రపంచం నలుమూలలనుంచి మీరు ఎప్పటికప్పుడు ఈ బ్లాగును చూస్తూ, వ్యాఖ్యలు రాస్తూ, వ్యక్తిగతంగా కూడా ఈమెయిల్ సందేశాలు పంపుతూ చందమామ చరిత్రను సాధ్యమైన మేరకు వెలికి తీయాలన్న నా కుతూహలాన్ని రెట్టింపు చేశారు.
నిజం చెప్పాలంటే ఒక బ్లాగర్‌కు తోటి బ్లాగర్లతో, ఒక చిన్న రచయితకు తోటి రచయితలతో, చందమామ అభిమానులతో ఏర్పడిన స్నేహం, పరిచయం, హృదయ స్పందనలు ఉద్దీప్తం చెందిన రోజులివి. సరిగ్గా 10 నెలల క్రితం ఆన్‌లైన్ చందమామలో ఉద్యోగిగా చేరిన నాకు గత నాలుగు నెలలుగా మనసుకు స్వాంతన కలిగించిన రోజులివి.
గత 30 ఏళ్లుగా చందమామ ప్రింట్ ఎడిషన్‌లో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేస్తున్న బాలుగారు, ఇదే చందమామలో 1952 నుంచి గత 57 సంవత్సరాలుగా శ్రమిస్తూ వచ్చిన చందమామ చిత్రమాంత్రికుడు శంకర్ గారు… నేను లేవనెత్తిన ప్రతి సందేహాన్ని ఓపిగ్గా వివరించడం ద్వారా చందమామ గత చరిత్ర తలుపుల వద్ద నన్ను నిలబెట్టారు.
చందమామ తీరంలో గవ్వలు ఏరుకోవడానికి ఆబగా పరుగెత్తిన నన్ను సంస్థ లోపలనుంచి ప్రోత్సహించడంలో, అడిగిన ప్రతి సమాచారాన్ని దాచుకోకుండా చెప్పడంలో వీరు అందించిన నిజమైన సహకారం జీవితకాలంలో మరువలేను. అలాగే చందమామ అమూల్యనిధిని – సర్వశ్రీ చిత్రా, ఎంటీవీ ఆచార్య, శంకర్, వడ్డాది పాపయ్య గార్లు గీసిన చిత్రాలు- పరిరక్షించిన వైనం గురించి చందమామ లైబ్రేరియన్ బాలసుబ్రహణ్యం గారు ఇచ్చిన సమాచారం కూడా మరువలేనిది.
ఈ బ్లాగు మొదలు పెట్టేటప్పుడు ఈ బ్లాగులక్ష్యం గురించి నాగురించి పరిచయంలో ఇలా రాసుకున్నాను.
“తెలుగు జాతి సాంస్కృతిక సంపద అయిన చందమామను ఈ నాటికీ తమ జ్ఞాపకాల దొంతరలలో పదిలపర్చుకుంటున్న చందమామ అభిమానుల గుండె చప్పుళ్లను ఓ చోట చేర్చి అందరికీ పంచిపెట్టాలనే చిరు కోరికే ఈ బ్లాగ్ రూపకల్పనకు మూలం.
…జీవించడం కోసం ప్రపంచం నలుమూలలకు వలసపోయిన తెలుగు వారు చందమామ పత్రికతో తమ తరాల అనుబంధాన్ని నేటికీ ఎలా కాపాడుకుంటూ వస్తున్నారో, పరస్పరం చందమామతో తమ జ్ఞాపకాలను ఎలా పంచుకుంటున్నారో తెలిపే అమూల్యమైన వ్యాసాలు, లింకులు, తదితర సమాచారం కోసం ఈ బ్లాగులో చూడవచ్చు. చందమామ చరిత్ర, చందమామ కథల సమీక్ష, పరిచయం, వ్యక్తుల పరామర్శ తదితర చందమామ సంబంధింత సమాచారాన్ని ఈ బ్లాగులో అందరూ చూడవచ్చు.”
చందమామ సంస్థ లోపలనుంచి నేను గత నాలుగు నెలలుగా సేకరించిన సమాచారం, పత్రిక చరిత్ర, అడపా దడపా అంతర్గత విషయాలు ఈ బ్లాగు పాఠకులకు, చందమామ అభిమానులకు, పెద్దలకు ఏ మేరకు సమ్మతమైనాయో, ఉపయోగపడ్డాయో నాకయితే తెలీదు కాని ప్రతి కథనంలోనూ, మీరు చేస్తూ వచ్చిన వ్యాఖ్యలు, స్పందనలు, హితోక్తులు మాత్రమే, ఇంత తక్కువ కాలంలో ఈ బ్లాగులో వంద పోస్టులు పూర్తి కావడానికి ప్రేరణగా నిలిచాయని వినమ్రంగా చెబుతున్నాను.
వ్యక్తిగతంగా నేను రూపొందించుకున్న ఈ బ్లాగు చివరకు సంస్థకే అధికారిక బ్లాగుగా మారిందంటే ఇంతకు మించిన విజయం మరొకటి ఉండదనే అనుకుంటున్నాను. ఇది నా స్వంత బ్లాగుగా ఉండకపోవచ్చు కానీ చందమామ అభిమానులందరి ఆదరణను పొందిన బ్లాగుగా మీరిచ్చిన ఈ భాగ్యాన్ని, సంతోషాన్ని, మహదానుభూతిని జీవితం చివరి వరకు మర్చిపోలేను.
చందమామ చరిత్రపై మీరు చూపుతూ వచ్చిన ఈ ఆదరణ, అభిమానం రేపోమాపో చందమామపై రాసే, రాయబోయే ప్రతి బ్లాగరుకూ అందిస్తారని, ప్రతి చందమామ చరిత్ర కథనాన్ని, మన చందమామ గత వైభవాన్ని ఇలాగే పంచుకుంటారని, పంచుకుంటూ ఉండాలని కోరుకోవడం తప్ప ఈ తరుణంలో మరేమీ చెప్పలేను.
మీ అందరికీ శతసహస్రవందనాలతో
చందమామ రాజు







