అరచేతిలో అందాల ‘చందమామ’
‘చందమామ’ జ్ఞాపకాలకు సంబంధించి ‘అమ్మఒడి’ ఆదిలక్ష్మిగారిది ఓ వినూత్న అనుభవం. చిన్నప్పుడు నాన్న చదివి వినిపిస్తే తప్ప చందమామ కథను వినలేని అశక్తత లోంచి ‘నేనే చదువు నేర్చుకుంటే పోలా’ అనే పట్టుదలతో, స్వయంకృషి తోడుగా శరవేగంగా చదువు నేర్చుకున్న అరుదైన బాల్యం తనది. ఈ తీపి జ్ఞాపకాలను ఆమె మాటల్లోనే ఇక్కడ కొద్దిగా విందాం..
“నాన్నకి చదవటం వచ్చు కాబట్టి కదా చక చకా చదివేసాడు. మొదటి సారి ఇష్టంగా చదివేసేవాడు. మళ్ళీ చదవమంటే కుదరదనే వాడు.
’అదే నాకూ చదవటం వస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు, ఎంచక్కా చదివేసుకోవచ్చు’ – అన్న భావన, అక్షర క్రమం తెలియకుండానే మనసుకి అందింది. చదవటం రాక చందమామ బొమ్మలు పదేపదే చూసుకునే కొద్దీ పసి మనస్సు లోతుల్లో అక్షరాలు నేర్చుకోవాలనే తపన పెరిగింది.
వీధిబడిలో చేర్చగానే, ఇష్టంగా మారాం చేయకుండా అక్షరాలు నేర్చేసాను. పెద్ద బాలశిక్ష చాలా కొద్దీ రోజుల్లో పూర్తి చేసాను. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేటప్పటికే నాకు కథలు చదవటం వచ్చేసింది.
ఆ విధంగా చందమామ నాకు చదవటం నేర్పింది. చదువు కోవాల్సిన అవసరం నేర్పింది. చదువు నేర్పిన గురువుని గౌరవించటమూ నేర్పింది.”
చందమామ ద్వారా చదవటం నేర్చిన, చదువు నేర్పిన గురువును గౌరవించడం నేర్చిన ఆదిలక్ష్మిగారు, ఒకప్పుడు నాన్నతో తను పొందిన అనుభవాన్ని తన పాపాయి నుంచి కూడా ఎదుర్కొన్నారట. చందమామ కథను ఒకసారి చదివి వినిపిస్తే మళ్లీ మళ్లీ వినాలి అనే కుతూహలంతో తప్పుల తడకగా చందమామ కథను చదివి నవ్వించే పాప, ఒకట్రెండుసార్లు చదివి ఇక కుదరదంటే “నేను పెద్దయ్యాక నా పాపకి నీలా చదవను ఫో అనను. ఎన్నిసార్లయినా చదివి వినిపిస్తాను తెలుసా?” అంటూ బుంగమూతి పెట్టేదట.
ఇదీ చందమామ ఘనత, చందమామతో బంధం అల్లుకున్న తరతరాల తెలుగు కుటుంబాల ఘనత. ఆదిలక్ష్మిగారు, ఆమె జీవన సహచరుడు, వారి పాపాయి దశాబ్దాలుగా నింగిలోని చందమామతో పాటు నేలమీది ‘చందమామ’తో కూడా చెలిమి కొనసాగిస్తున్నారు. నేలమీది ‘చందమామ’తో ఇటీవలి వరకు ప్రత్యక్ష సంబంధం లేని ఆదిలక్ష్మి గారు ఇటీవలే చందమామతో పరిచయంలోకి వచ్చారు.
నాన్న ద్వారా పరిచయం అయిన చందమామను కన్నకూతురికి కూడా పరిచయం చేయడమే కాదు… తాను పాఠాలు చెబుతున్న స్కూలు పిల్లలకు కూడా కథామృతాన్ని పంచిపెడుతూ, రేపటి తెలుగు తరాన్ని తయారుచేస్తున్న ఆదిలక్ష్మిగారూ… మీ చందమామ కుటుంబాన్ని చూసి చందమామ సిబ్బందిగా మేం గర్వపడుతున్నాం.
చందమామతో మీ జ్ఞాపకాలను పంచుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఆదిలక్ష్మిగారి అరచేతిలో అందాల ‘చందమామ’ జ్ఞాపకాల పూర్తి పాఠం కోసం కింది చందమామ వెబ్సైట్ లింకులో చూడండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2444
ఈ కథనానికి గాను మార్చిన ఫోటో ఆదిలక్ష్మిగారి అమ్మాయి గీతాప్రియది. ఈమె చిన్నవయసులోనే ‘ఆహా ఓహో’ అనే బ్లాగు నడుపుతున్నారు. http://paalameegada.blogspot.com/
ఈ బ్లాగు కూడా సహజంగా కథలకే ప్రాధాన్యత ఇస్తూండటం గమనార్హం. చూడగలరు.
చందమామ పాఠకులు తమ చందమామ జ్ఞాపకాలను కింది లింకుకు పంపగలరు.
Filed under చందమామతో మా జ్ఞాపకాలు | Tags: అగ్ని, ఆకాశం, ఆదిలక్ష్మి, ఇతిహాసాలు, ఒంటికొమ్ము, కవలలు, కొడుకులు, గజదొంగలు, గాలి, గ్రామాధికారులు, చందమామ, చింతచెట్టు, చేపలు, జానపదం, జ్ఞాపకాలు, దెయ్యాలు, నీళ్లు, పంచభూతాలు, పాత్రలు, బొమ్మలు, భూమి, మాంత్రికులు, రాక్షసులు, రాజు, వింతలోకాలు, వేట | Comments (7)పాతాళదుర్గం – 5

పాతాళదుర్గం - 5
అద్భుతమైన ఊహాశక్తి, నిసర్గ పద సౌందర్యంతో, కల్పనా చాతుర్యంతో దాసరి సుబ్రహ్మణ్యంగారు 1950, 60, 70లలో చందమామ పత్రికలో చెక్కిన అపరూప కథాశిల్పాల్లో ‘పాతాళ దుర్గం’ ఒకటి. ఆయన 1972లో రాసిన ‘యక్షపర్వతం’ ధారావాహిక (13 భాగాలు) ను ఇప్పటికే telugu.chandamama.com లో ప్రచురించిన విషయం తెలిసిందే.
బండెడు పుస్తకాలు, కొండల లెక్కన పరీక్షలు, మార్కులు, అలివిమాలిన టార్గెట్లు, ఇంజనీరింగ్, డాక్టర్, సాప్ట్వేర్ కలల భారంలో బాల్యానికి బాల్యమే హరించుకుపోతున్న నేటి పిల్లల తరం కూడా మళ్లీ చందమామను పెద్దలకు లాగే హత్తుకోవాలనే ఆకాంక్షతో ఆయన 1966లో రాసిన ‘పాతాళదుర్గం’ సీరియల్‌ను తిరిగి ఆన్లైన్ చందమామలో ప్రచురిస్తున్నాం.
“….రాకుమారి కాంతిసేనను ఎత్తుకుపోయిన కుంభీరుడనే రాక్షసుడు, కొండప్రాంతం చేరి, గుహలో ప్రవేశించబోతూండగా కాలశంబరుడనే మాంత్రికుడి వల్ల గాయపడ్డాడు. చెట్టు మీదినుంచి ధూమకసోమకులు ఇదంతా గమనించారు. హఠాత్తుగా ఎక్కణ్ణుంచో ఒక బాణం వచ్చి, కాలశంబరుడికి తగిలింది. ఆ వెంటనే అతడూ, రాక్షసుడూ దాపులనున్న గుహల్లోకి పరిగెత్తారు.
కదంబ సైనికులు కొందరు, ‘‘అడుగో, రాక్షసుడు! అడుగో, రాక్షసుడు!’’ అని కేకలు పెడుతూ గుహల కేసి పరిగెత్తుకు రావటం, చెట్టు మీద వున్న ధూమక సోమకులు చూశారు. శత్రువుల కంటబడకుండా వుండేందుకు వాళ్ళిద్దరూ మరింత గుబురుగా వున్న చెట్లకొమ్మల్లోకి ఎగబాకారు.
‘‘రాక్షసుడెక్కడ? వాడు పారిపోకుండా చుట్టుముట్టండి!’’ అంటూ ఒక ఆశ్వికుడు కత్తి ఝళిపిస్తూ సైనికుల మధ్యకు వచ్చాడు. అతడు కదంబరాజు ఉగ్రసేనుడు. అతణ్ణి చూస్తూనే సోమకుడు పళ్ళుకొరికి బాణం ఎక్కుపెట్ట బోయేంతలో, ధూమకుడు చప్పున అతణ్ణి వారిస్తూ, చెవిలో మెల్లిగా ఏమో చెప్పాడు.
అంతలో నలుగురైదుగురు కదంబ సైనికులు ఉగ్రసేనుడి దగ్గిరకు పరిగెత్తుకుంటూ వచ్చి, ‘‘మహారాజా! రాక్షసుణ్ణి మేం గాయపరిచాం. ఇదుగో చూడండి, ఇక్కడ భూమ్మీద నెత్తురు గుర్తులు. కాని, వాడు చీకట్లో ఏదో గుహలోకి పారిపోయాడు,’’ అన్నారు…..”
ఈ వారం ప్రచురించిన పాతాళదుర్గం 5వ భాగం పూర్తి పాఠం కోసం కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=36&sbCId=138&stId=2266
పాతాళదుర్గం ధారావాహిక కోసం ఈ కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=36&sbCId=138
ఈ ధారావాహికపై మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.
Filed under చందమామ కథలు | Tags: ఆన్లైన్ చందమామ, ఉగ్రసేనుడు, కధాశిల్పం, కాంతిసేన, కాలశంబరుడు, కుంభీరుడు, చందమామ, దాసరి సుబ్రహ్మణ్యం, ధారావాహిక, ధూమకసోమకులు, పాతాళదుర్గం., యువరాజు, రాకుమారి, రాజు, రాణి | Comment (0)