నాన్నా! చందమామ తీసుకురానా!!

March 12th, 2010

(చందమామ అనుకోగానే గుర్తొచ్చేవి బొమ్మలే అంటున్నారు మేధాగారు. చందమామలో కథల కంటే కూడా బొమ్మలు చాలా బావుండేవని తన అభిప్రాయం. యువరాణి ఎంత అందంగా ఉంటుందో చూడాలంటే చందమామలోనే చూడాలంటున్నారు. కథలు కూడా ఏ వ్యక్తిత్వ వికాసానికీ తీసిపోని విజ్ఞాన గనులట. “గుణపాఠాలు నేర్చుకునే కధలు, మార్పు(పశ్చాత్తాపం) గురించిన కధలు, మంచిగా ఉండేవాళ్ల కధలు.. చిన్నప్పటి నుండి ఇలాంటివి చదవడం వల్ల, మనకి తెలియకుండానే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాం.. ఎప్పుడైనా తప్పు చేయాల్సి వచ్చినా భయమేస్తుంది, ఆ కధలోలా నాకు కూడా ఏమైనా జరుగుతుందేమో అని..” అంటున్నారు.

తరాలుగా చందమామను చదువుతూ వచ్చిన వారి మనోభావాలకు చందమామ జ్ఞాపకాలు ఓ ప్రతీక. ‘మా బామ్మ చదివింది చందమామ, మా అమ్మ చదివింది చందమామ, నేను చదివాను చందమామ..’ అంటూ గ్రైఫ్ వాటర్ ప్రకటనను గుర్తు చేయడం ద్వారా చందమామను ఇంటిల్లిపాదీ ఎలా తమ హృదయాలకు హత్తుకునేవారో తేల్చి చెప్పారు. చక్కటి చందమామ జ్ఞాపకాలు పంపిన మేధాగారికి కృతజ్ఞతాభినవందనలు. నాలోనేను పేరిట చక్కటి బ్లాగును కూడా తను నిర్వహిస్తున్నారు.

“ఇప్పటికీ బస్టాండ్‌లో బస్ కోసం నించున్నప్పుడు నాన్నగారు ‘చందమామ తీసుకురానా!’ అంటుంటారు..” బిడ్డకు చందమామను కొనిపెట్టే తండ్రి… చందమామను పిల్లలకు కొని ఇవ్వగలిగిన తెలుగు కుటుంబాలు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే పని చేస్తున్నాయనుకుంటాను. ఏమయినా మీ జన్మ ధన్యమైనది. మీ నాన్నగారికి చందమామ తరపున మనఃపూర్వక వందనాలు.

మేధాగారి చందమామ జ్ఞాపకాల పూర్తి పాఠాన్ని ఇక్కడ చదవండి.)

చందమామ – 1970/80/90 ల తరానికి పరిచయం అక్కర్లేని పత్రిక.. పిల్లల పత్రికల్లో అగ్రతాంబూలం అందిపుచ్చుకున్న పత్రిక. కేవలం పిల్లల పత్రిక అంటే, చంపిలు నా మీద దండెత్తే ప్రమాదం కూడా ఉంది.. 🙂

చందమామతో పరిచయం ఎలా జరిగిందో గుర్తు లేదు కానీ, నేను చదివిన మొదటి పుస్తకం మాత్రం చందమామే!.. అదేదో గ్రైఫ్‌వాటర్ ప్రకటనలోలా, మా బామ్మ చదివింది చందమామ, మా అమ్మ చదివింది చందమామ, నేను చదివాను చందమామ..!

అప్పట్లో చందమామ వస్తుంది అంటే చకోర పక్షుల్లా ఎదురు చూసే వాళ్ళం.. మేము ఉన్న ఊర్లో ఈ పుస్తకాలు దొరికేవి కాదు, అందుకని ప్రక్క ఊరికి వెళ్ళి తీసుకు వచ్చేవారు నాన్నగారు.. ఈ రోజు వెళ్ళి తీసుకు వస్తాను అంటే, నాన్నగారు వచ్చేసరికల్లా, చదువంతా పూర్తి చేసుకుని, ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం.. అది రాగానే, నా కంటే నాకు అని గొడవలు, పోట్లాటలు..

చందమామ అనుకోగానే, గుర్తొచ్చేవి బొమ్మలు.. కధల కంటే కూడా బొమ్మలు చాలా బావుండేవి.. రాము(రాముడు మంచి బాలుడు) ఇలానే ఉంటాడేమో.. పాపం విక్రమార్కుడు ఇలా బేతాళుడిని మోసుకువెళ్ళేవాడా, అబ్బ ఆ యువరాణి ఎంత అందంగా ఉందో! గయ్యాళి గంగమ్మ ఇలానే ఉంటుందా.. బొమ్మలు అంటే ముఖచిత్రం గురించి కూడా చెప్పాలి.. ఆ నెలలో ఏమైనా పండగలు ఉంటే వాటికి తగ్గ బొమ్మలతో అందంగా ముస్తాబై ఉండేది..

కధల గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఏ వ్యక్తిత్వ వికాసానికి తీసిపోని విజ్ఞాన గనులు. విలువలు నేర్పుతూ, ఊహాశక్తిని పెంపొందిస్తూ, సమస్యల చిక్కుముడులు ఎలా విప్పదీయాలో చూపిస్తూ, క్రొత్త విషయాలు నేర్పుతూ, చరిత్రని గురించిన సంగతులు, పురాణాలు, ఇతిహాసాలు.. ఒహటేమిటి, అదీ-ఇదీ అని కాదు, లేనిది లేనే లేదు..

నీతి కధల్లోనే ఎన్నో రకాలు.. గుణపాఠాలు నేర్చుకునే కధలు, మార్పు(పశ్చాత్తాపం) గురించిన కధలు, మంచిగా ఉండేవాళ్ల కధలు – ఇలా ఎన్నో.. చిన్నప్పటి నుండి ఇలాంటివి చదవడం వల్ల, మనకి తెలియకుండానే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాం.. ఎప్పుడైనా తప్పు చేయాల్సి వచ్చినా భయమేస్తుంది, ఆ కధలోలా నాకు కూడా ఏమైనా జరుగుతుందేమో అని.. అలా పిల్లల వ్యక్తిత్వాలని తీర్చిదిద్దే పత్రిక చందమామ అంటే అతిశయోక్తి కాదేమో..

ఇక విక్రమార్కుడి కధలు అసలు సిసలు విశ్లేషణా సామర్థ్యం ఉన్న కధలు.. మరీ చిన్నప్పుడు ముగింపు చదివితే తప్ప ఇలా పరిష్కరిస్తారు అని తెలిసేది కాదు.. తరువాత తరువాత కాస్త కాస్త విశ్లేషణ చేయడం, అప్పుడప్పుడు నేను అనుకున్నట్లు లేకపోతే అమ్మతో ఎందుకు ఇలా ఉంది, ఇలా కూడా ఉండచ్చు కదా అని వాదనలు.

ఇక సీరియల్స్.. యండమూరిలు, యధ్ధనపూడిలు, డాన్ బ్రౌన్‌లు సరిపోరు అనిపిస్తుంది.. ఆ సీరియల్ కోసం మళ్ళీ నెల ఆగాలంటే అమ్మో అనిపించేది.. ముగింపు వచ్చిన సంచిక ప్రక్కన పెట్టుకుని మళ్ళీ అన్ని భాగాలు చదివితే తప్ప తృప్తిగా ఉండేది కాదు.

వీటన్నింటితో పాటు, ప్రముఖుల జీవిత చరిత్రలు చిట్టి-పొట్టి కధల రూపంలో వస్తుండేవి.. ఇక్కడ కూడా మళ్ళీ బొమ్మలదే ప్రముఖ పాత్ర..

మొదట్లో సంపాదకీయం చదివేదాన్ని కాదు కానీ, కొంచెం పెద్దయిన తరువాత అది కూడా చదవడం మొదలుపెట్టాను.. తక్కువ పదాలలో, చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా ఎలా చెప్పాలో తెలుస్తుంది!

ఇవన్నీ ఒకెత్తు, పురాణాల గురించిన కధలు ఇంకో ఎత్తు. ఇప్పుడంటే డేటాబేస్ బాగా దెబ్బతింది కానీ అప్పట్లో, పురాణాలలో ఏ కధ గురించి అడిగినా కూడా తడుముకోకుండా చెప్పగలిగి ఉండేదాన్ని.. మా తమ్ముడైతే ఒకడుగు ముందుకేసి, మా పిన్నిలని, మామయ్యలని ఎక్కడెక్కడి ప్రశ్నలో అడిగి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు.

ఇంకా ప్రకటనలు, మీకు తెలుసా అంటూ క్విజ్‍లు, బొమ్మకి వ్యాఖ్యలు.. అదో నోస్టాల్జియా..

కొసమెరుపేంటంటే, ఇప్పటికీ బస్టాండ్‌లో బస్ కోసం నించున్నప్పుడు నాన్నగారు ‘చందమామ తీసుకురానా!’ అంటుంటారు..

–మేధా
http://nalonenu.blogspot.com

మేధాగారి చందమామ జ్ఞాపకాలను చందమామ వెబ్‌సైట్‌లో కూడా కింది లింకులో చూడగలరు
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2433

మీ చందమామ జ్ఞాపకాలను కూడా రాసి కింది లింకుకు పంపగలరు.
abhiprayam@chandamama.com

RTS Perm Link

చందమామ కథల ఖజానా

August 7th, 2009
చందమామ 1960 దీపావళి సంచిక

చందమామ 1960 దీపావళి సంచిక

ఆన్‌లైన్ చందమామ (telugu.chandamama.com) ఆర్కైవ్స్ విభాగం – ఖజానా లేదా భాండాగారం -లో 1947 జూలై ప్రారంభ సంచిక నుంచి 1980 వరకు చందమామ సంచికలను వరుస క్రమంలో ప్లాష్ పైళ్ల రూపంలో పాఠకులకు కింది లింకులో అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే.

http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

ఈ లింకులో తెరుచుకునే పేజీలో భాష (తెలుగు) సంవత్సరం (ఉదా. 1947), నెల (జూలై) ఎంచుకుని ‘వెళ్లండి’ పై క్లిక్ చేసి మీరు కోరిన సంచికను చూడవచ్చు. ఇంతవరకు అందరికీ తెలిసిన విషయమే.

అయితే తొలి 33 సంవత్సరాల చందమామ సంచికలను స్కాన్ చేసి పిడిఎఫ్ ఫార్మాట్‌లోకి, తర్వాత ప్రస్తుత ఫ్లాష్ పైళ్ల రూపంలోకి మార్చే క్రమంలో అనివార్యంగా కొన్ని తప్పులు చోటుచేసుకున్నాయి. స్కానింగ్ సమయంలో ఒరిజనల్ సంచికలో పేజీలు మడతపడిన విషయం గమనించకుండా అలాగే స్కాన్ చేయడంతో ఆ చోటులోని తెలుగు పాఠం కనిపించకుండా పోవడం. దాన్ని అలాగే ఆన్‌లైన్ చందమామలో అప్‌లోడ్ చేయడం జరిగిపోయాయి.

ఇంకా కొన్ని చోట్ల ఒక నెలకు బదులు మరో నెల పేరుతో ఫైల్ నేమ్ రూపొందించడంతో ఏది సరైంది, ఏది తప్పు కాపీ అనేది తెలీకుండా పాఠకులు ఇబ్బంది పడుతూ వచ్చారు. కొంతమంది పాఠకులు ఈ లోపాలను గుర్తించి తెలిపితే 1957 సంవత్సరం సంచికలలోని గందరగోళం ఈ మద్యే సరిచేయడం జరిగింది.

దశాబ్దాల చందమామలను ఒకే సారి స్కాన్ చేయడమే ఓ పెద్ద బృహత్ కార్యం. వనరుల సమస్య అలా ఉంది స్కానింగ్ సమయపు మానవ ప్రయత్నంలో లోపాలు జరగడం సహజం కాబట్టి, వాటిని సరిచెయ్యడం కూడా ఓ పెద్ద కార్యక్రమమే అవుతుంది. వనరుల కొరత కారణంగా చందమామ ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తూనే మూడు దశాబ్దాల ఆర్కైవ్స్‌ను పేజీ పేజీ పరిశీలిస్తూ తనిఖీ చేయడం కష్టసాధ్యం.

అందుకే ఈ విషయంలో చందమామ పాత సంచికల అభిమానులు, పాఠకుల సహాయం ఎంతైనా అవసరముంది. చందమామ ఆర్కైవ్స్ చూస్తున్న వారు తమ దృష్టికి వచ్చిన లోపాలను… అంటే స్కాన్ చేసిన పేజీలలో కొన్ని చోట్ల మడతలు పడి పాఠం కనిపించకుండా పోవడం, పేజీలకు పేజీలే మిస్ కావడం, సంచికల సంవత్సరం, నెలల పేర్లు తప్పుగా నమోదు కావడం వంటి లోపాలను గమనించినప్పుడు అలాగే వదిలివేయకుండా కింది లింకుకు సంబంధిత సమాచారం తప్పక పంపించగలరు

abhiprayam@chandamama.com

చందమామ కథల ఖజానాను క్లీన్‌గా ఉంచే బాధ్యత సంస్థకు, పాఠకులకు ఇరువురికీ సంబంధించిన విషయం. పాఠకులు ఫీడ్‌బ్యాక్ ఇక్కడ  చాలా అవసరమవుతుంది.

ఉదాహరణకు… ఈరోజే బెంగళూరు నుంచి శివరామ్ ప్రసాద్ గారు 1960 నవంబర్ చందమామ దీపావళి సంచికలో మార్కోపోలో సాహసయాత్రలు ధారావాహిక -సీరియల్- 8వ భాగం పూర్తిగా ఆర్కైవ్స్‌లో లేని విషయం తెలియపర్చారు. ముందు వెనుకల ఈ సీరియల్ సేకరించి చదివిన ప్రసాద్ గారు 8వ భాగం ఆర్కైవ్స్‌లో లేని విషయం కనుగొని వెంటనే సమాచారం నెట్ ద్వారా పంపారు.

1960 నవంబర్ చందమామ హార్డ్ కాపీ సంస్థ కార్యాలయంలో ఉన్న కారణంగా వెంటనే దీనిపై స్పందించి చందమామ లైబ్రరీ నిర్వాహకులను సంప్రదిస్తే వారు మార్కోపోలో 8వ భాగం లేని విషయం నిర్థారించుకుని 3 గంటలు కష్టపడి పూర్తిగా సంచిక మొత్తాన్ని మళ్లీ స్కాన్ చేసి పంపించారు. దీన్ని వచ్చే సోమవారం ఆన్‌లైన్ చందమామ ఆర్కైవ్స్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది.

ప్రసాద్ గారు ఈ విషయం గుర్తించి సమాచారం పంపడం మూలంగా ఈ లోపం సరిదిద్దుకోవడానికి వీలు కలిగింది. పాఠకుల, అభిమానుల పరిశీలన పత్రిక లోపాల సవరణలో ఎంతగా ఉపయోగపడతాయో ఈ ఉదంతం తేటతెల్లం చేస్తోంది కదూ.

అందుకే చందమామ పాఠకులు, అభిమానులకు మరోసారి విజ్ఞప్తి. ఇలాంటి పేజీల గల్లంతు, పాఠం గల్లంతు తదితర గల్లంతుల విషయాన్ని మీరు ఆన్‌లైన్ చందమామ దృష్టికి కింది లింకు ద్వారా తీసుకురండి.

abhiprayam@chandamama.com

చందమామ పత్రిక, దాని అమూల్య కథా భాండాగారం మనందరిదీ కాబట్టి తలొ చేయ్యి వేస్తే కాని అది ఖచ్చితమైన రూపంలో అందుబాటులోకి రాదు. కాబట్టి లోపాలు కనిపించినప్పుడు అంతటితో వదిలివేయకుండా ఇలా పరస్పరం షేర్ చేసుకుంటే అవి వీలైనంత చక్కగా పరిష్కరించబడి పాఠకులకు చందమామ సరైన రూపంలో అందాలన్న ఆశయం సకాలంలో నెలవేరుతుంది.

ఈ విషయాన్ని కాస్త ఆలోచిస్తారా..

నోట్: శివరామ్ ప్రసాద్ గారు సూచించిన అంశాలను పట్టించుకునే క్రమంలో మార్కోపోలో సాహసయాత్రలు నేను మళ్ళీ చదవటం జరిగింది. నిజంగానే మార్కోపోలో ఆసియా పర్యటన విశేషాలను చక్కటి శైలితో ఈ ధారావాహిక పొందుపర్చింది. 1960 ఏప్రిల్ చందమామ సంచికనుంచి ఈ సీరియల్ ప్రారంభమైంది. వీలు దొరికితే మీరూ తప్పక ఈ సీరియల్‌ను మరోసారి చదవగలరు.

ఈ సీరియల్ పూర్తి పాఠాన్ని శివరామ్ ప్రసాద్ గారు తన బ్లాగులో ఈరోజే పెట్టారు. ఒకే చోట సీరియల్ మొత్తాన్ని చూడాలనుకునేవారు ఆయన బ్లాగులోంచి తీసుకోవచ్చు.

http://saahitya-abhimaani.blogspot.com/

మీ బ్లాగులో పెట్టకముందే ఈ ధారావాహికను తొలుత నాకే పంపారు. ధన్యుడిని ప్రసాద్ గారూ..

RTS Perm Link