చందమామ పిలుపు

October 8th, 2009
కారుమేఘాలు కురిపించిన కుంభవృష్టి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ కనీ వినీ ఎరుగని ఉత్పాతాన్ని చవిచూస్తోంది. దీంతో రిజర్వాయర్ల కడుపు చీల్చుకుంటూ వెల్లువెత్తిన వరద ఉధృతి తెలుగు నేలను కకావికలం చేసింది. పడగెత్తిన ప్రకృతి విలయతాండవం బారిన పడి సర్వం కోల్పోయి, నిండా నీరైపోయిన కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, కృష్ణా, గుంటూరు, కడప, అనంతపూర్, విశాఖపట్నం జిల్లాలు ఇప్పుడు సాటిమనుషుల సహాయం కోసం కోటికళ్లతో ఎదురుచూస్తున్నాయి.

ఊరూవాడా బురదమయం అయిపోయిన కనీవినీ ఎరుగని విపత్కర స్థితిలో సహాయం చేయవలసిందిగా కోరడానికి కూడా గొంతు పెగలని స్థితిలో లక్షలాది మంది ప్రజలు మనుషుల స్పందనకోసం వేచి చూస్తున్నారు. ఎందుకిలా జరిగింది అని ప్రశ్నించేందుకు, నిలదీసేందుకు, ఆరోపణలు గుప్పించేందుకు ఇది సమయం కాదు.

ఆంధ్రప్రదేశ్‌లో వరద బారిన, బురద బారిన పడి నలుగుతున్న లక్షలాది మంది ప్రజల విషాదాన్ని ‘చందమామ’ తనదిగా భావిస్తోంది. చేతనైనంతగా ధనం, వస్తురూపాల్లో సహాయపడే ఆపన్న హస్తాలకు చందమామ చేతులు జోడించి నమస్కరిస్తూ సహాయాన్ని మరింతగా కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి  చేస్తోంది.

లక్షలమంది నిరాశ్రయులై, అంచనాలకు సైతం అందని స్థాయిలో జరిగిన ఈ దారుణ నష్టాన్ని భర్తీ చేయడానికి ఎందరు ఎన్నిరకాలుగా సహాయం చేసినా సరిపోదు  కాబట్టి పునరావాస చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు, టీటీడీ వంటి ధర్మసంస్థలూ (7 కోట్ల విరాళం అందించింది), మీడియా చేస్తున్న ప్రయత్నాలకు వ్యక్తులుగా ప్రతిఒక్కరూ చేయూతనివ్వాలని చందమామ పిలుపునిస్తోంది.
 
దేశదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు, చందమామ పాఠకులు, అభిమానులు, రాష్ట్రంలో సహాయం చేయగల స్థితిలో ఉన్న వారు. ప్రతిఒక్కరూ వరదబాధితులకు తమ వంతు సహాయం చేయాలని చందమామ అర్థిస్తోంది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ చేయలేం అనే రీతిలో దెబ్బతిన్న మనవారిని, తెలుగువారిని ఆదుకోవడానికి కలిసిరావలసిందిగా విన్నవిస్తున్నాం.

మన కళ్లముందు సర్వస్వం కోల్పోయి శక్తి ఉడిగిపోయిన మనవారికి, మన తెలుగు ప్రజలకు జీవితంపై కాసింత ఆశను కలిగించే దిశగా మానవీయ సహాయాన్ని పంపవలసిందిగా చందమామ కోరుతోంది. కాసింత తిండి, బట్ట, తాగడానికి నీరు, వ్యాధుల నివారణకు మందులు… కోటి ఆశలతో ఎదురు చూస్తున్న మనవారికి వీటిలో ఏది మనవద్ద ఉండి సమర్పించినా అది వారి జీవితాశలకు ఆలంబనంగా ఉంటుందని చందమామ గుర్తుచేస్తోంది.

వరద బాధితులను ఆదుకోవడానికి రాష్ట్రం ఏకమైంది. చిన్నా..పెద్దా, పేద..ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేయడానికి ముందుకు కదులుతున్నారు. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ వరద పీడితులకు ఆసరాగా నిలబడటానికి చేయిచేయి కలిపి ముందుకు సాగుతున్నారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్యులు, ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, సినీ నటులు, వ్యాపారస్తులు, పత్రికలు, టీవీఛానళ్లు, స్వచ్ఛంద సంస్థలతో పాటు ఎంతో మంది సాధారణ ప్రజానీక వరద బాధితులకోసం తమవంతు సహాయాన్ని చేస్తున్నారు. విద్యార్థులు వీధి వీధి తిరిగి విరాళాలను సేకరిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు బస్టాండ్లలో హుండీలు పెట్టి సేకరిస్తున్నారు.

ఇలా వరద బాధితులకోసం యావత్‌ రాష్ట్రం ఏకమయి మానవతా హృదయాన్ని చాటుకొంటోంది. ఇప్పటికే పలు సంస్థలు స్వచ్చందంగా విరాళాలను, సహాయాలను ఒకచోట చేర్చి వరదబాధితులకు అందించడానికి తమ వంతుగా కృషి చేస్తున్నాయి.

ప్రాణాలు మాత్రమే దక్కించుకని బిత్తర చూపులు చూస్తున్న మనవారిని ఆదుకోవడానికి మనం కూడా మనకు చేతనైన సహాయం చేద్దాం. కొన్ని సంస్థల ఫండ్ వివరాలను ఇక్కడ ఇస్తున్నాం.

మీ విరాళాలు పంపవలసిన సంస్థల వివరాలు.

1. ‘ ముఖ్యమంత్రి సహాయనిధి , ఆంధ్రప్రదేశ్ ‘ పేరిట క్రాస్ చేసిన చెక్ , డీడీలు పంపాలి

2. ‘ ప్రధానమంత్రి సహాయనిధి , ఢిల్లీ ‘ పేరిట క్రాస్ చేసిన చెక్ , డీడీలు పంపాలి.

3. రెడ్ క్రాస్ , ఆంధ్రప్రదేశ్ ‘Indian Red Cross Society, AP State branch’ పేరిట నగదు , క్రాస్ చేసిన చెక్ , డీడీలు పంపాలి.

ఇక్కడ పేర్కొన్న చిరునామాలే కాకుండా, మీడియా, టీవీ ఛానెళ్లు ప్రకటిస్తున్న హెల్ప్‌లైన్లు, రిలీఫ్ పండ్‌లు ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే దానికి, మీ సహాయం ఎంత చిన్నదైనా సరే దయచేసి అందించాలని చందమామ అభ్యర్థిస్తోంది.

మీ వీధిలో, ఊర్లో,  మీ కాలనీలో వరద బాధితుల కోసం విరాళాలు, వస్తువులు సేకరించే ప్రతి మానవతా మూర్తికి, సంస్థకు మీ ఆపన్న హస్తాన్ని అందించాలని చందమామ కోరుతోంది.

సందేహ నివృత్తికోసం మీ స్పందనలను abhiprayam@chandamama.com కు పంపండి.

RTS Perm Link

చందమామతో చెలిమి – మా చందమామ జ్ఞాపకాలు

September 1st, 2009
చందమామ జ్ఞాపకాలు : త్రివిక్రమ్

చందమామ జ్ఞాపకాలు : త్రివిక్రమ్

త్రివిక్రమ్ గారూ,
మనఃపూర్వక కృతజ్ఞతలు. పని ఒత్తిళ్లలో ఉండి కూడా ఆలస్యంగా అయితేనేం, మీ చందమామ జ్ఞాపకాలను “చందమామతో చెలిమి మా చందమామ జ్ఞాపకాలు’ పేరిట  తీపిగుర్తులుగా ఆన్‌లైన్ చందమామకు పంపారు.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2166

ఈ శీర్షిక మొదలు పెట్టినప్పుడు మొదట మీదే రావలసి ఉండె. మొత్తంమీద 30, 40 సంవత్సరాల క్రితం తెలుగు చదవగలిగిన కుటుంబాలు ఆంధ్రరాష్టం నలుమూలలా సాగించిన చందమామ ఒరవడిని మీ ‘చందమామతో చెలిమి’ కథనం చక్కగా వివరించింది. చదువుతుంటే మా యింట్లో నాన్న చందమామను తొలిసారిగా తీసుకువచ్చి మాకు పరిచయం చేసిన నాటి అమృత గడియలు ఒక్కసారిగా జ్ఞాపకానికి వచ్చాయి.

రెండు మూడు తరాల క్రితం కుటుంబానికి చందమామకు లంకె కుదర్చాలంటే నాన్నే ప్రధాన ఆధారం. అందుకే తెలుగునాట చందమామ నాన్నల ఆదరణ సాక్షిగా మొగ్గతొడిగిందంటే అతిశయోక్తి కాదనుకుంటా. (అమ్మల ప్రోత్సాహం, తమపిల్లలకు వారు కథలతో జోకొట్టడం వంటివి ఉన్నప్పటికీ, ఊకొడితే చాలు ఆ గడియకో కథ చెబుతూ పిల్లల కథా దాహాన్ని తీర్చడంలో అమ్మల పాత్ర తక్కువేమీ కాదు) 

ఈ శీర్షిక కేవలం చందమామ అభిమానులకు, ‘చంపి’ లకు, పాఠకులకు మాత్రమే సంబంధించింది కాబట్టి  వీలైనంత మంది చందమామ ప్రేమికులు తమ చందమామ జ్ఞాపకాలను కింది లింకుకు తమ ఫోటోతో సహా పంపితే బాగుంటుంది.

చందమామను తన సవతుల్లో ఒకటిగా భావించిన మీ జీవన సహచరి చివరకు తానే చందమామ ప్రేమికురాలిగా మారడం…
ఇంతకంటే చందమామకు ఏం కావాలి. తెలుగు జాతికి, చందమామకు ఏర్పడిన ఈ రుణానుబంధం ఎన్నటికీ చెరిగి పోకూడదని ఆశించడం తప్ప మనం ఏం చేయగలం చెప్పండి.

అంతవరకూ పాఠకుల ‘చందమామ జ్ఞాపకాలు’ కోసం నిరీక్షిస్తూ…

రాజు.

 

త్రివిక్రమ్ గారి ‘చందమామతో చెలిమి’ కథనం కోసం కింది లింకులో చూడగలరు

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2166

ఆన్‌లైన్ చందమామ హోమ్ పేజీలో కూడా చూడగలరు.

telugu.chandamama.com కు మీ రచనలు, చందమామ జ్ఞాపకాలు, సూచనలను కింది లింకుకు పంపండి.

abhiprayam@chandamama.com

RTS Perm Link