సైన్స్ రచనల్లో సరికొత్త ఒరవడి: కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

September 20th, 2012

అంతర్జాలంలో, ప్రత్యామ్నాయ పత్రికల్లో, దినపత్రికల్లో పాపులర్ సైన్స్ రచయితగా ఒక మెరుపులా మెరిసి అర్థాంతరంగా మననుంచి వెళ్లిపోయిన మంచి రచయిత కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు. ఒక మిత్రురాలు అన్నట్లుగా…. మనకి అభివృద్ధితో కూడిన ఆధునిక జీవనాన్ని అందించిన పాత తరం క్రమేపీ కనుమరుగయిపోతోంది.. ఆ జాబితాలో రోహిణి ప్రసాద్ గారి పేరు కూడా చేరింది. ‘నాకైతే కుటుంబరావుగారే మరో సారి కన్ను మూసినట్టు అనిపించింది’ అన్నారామె.

తనకు పట్టున్న విషయాలను అందరికీ పంచిపెట్టడంలో అసాధారణ నైపుణ్యం చూపడమే కాదు. భావప్రచారం కోసం ఇంటర్నెట్‌ను, ప్రింట్ మీడియాను ఇంత విస్తృతంగా ఉపయోగించుకున్న రచయిత ఇటీవలి కాలంలో లేరని చెప్పాలి. సంవత్సరాలుగా వెంటాడుతున్న మధుమేహాన్ని కూడా ధిక్కరించి ఇంత తీవ్రాభినివేశంతో రచనలు చేసిన మరొక రచయితను ఈ మధ్య కాలంలో మనం చూసి ఉండం. మానవ సమిష్టి శ్రమ ఫలితమైన సాంకేతిక ఆవిష్కరణలను ఉపయోగించుకోవడంలో షరా మామూలుగానే వెనుకబడుతున్న ప్రగతిశీల సంస్థలను, పత్రికా నిర్వహణకర్తలపై ఆయన ఎన్ని మొట్టికాయలు వేశారో మరి.

తను కొన్న పుస్తకాన్ని, తన వద్దకు వచ్చిన పుస్తకాన్ని వెంటనే చదవటం, దానిపై పది ముక్కలు రాసి పంపటంలో అసాధారణ వేగాన్ని చూపిన తండ్రి కొడవటిగంటి కుటుంబరావు గారి సాహిత్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారీయన.

జీవిత విశేషాలు

అణుభౌతిక శాస్త్రవేత్త, పాపులర్ సైన్స్ రచయిత, సంగీతకారుడు, వక్త కొడవటిగంటి రోహిణీప్రసాద్ గత ఐదు సంవత్సరాలలో ఏడు పాపులర్ సైన్స్ పుస్తకాలు ప్రచురించి దాదాపు పది పత్రికలలో శాస్త్రవిజ్ఞాన విషయాలను సుబోధకంగా విరివిగా రాస్తున్న రచయితగా, ఇటీవలి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్ర విజ్ఞాన విషయాలపై ప్రసంగాలు చేస్తున్న వక్తగా తెలుగు సమాజంలో సుప్రసిద్ధులయ్యారు.

సుప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు – వరూధిని దంపతుల కొడుకుగా రోహిణీప్రసాద్ డిగ్రీ వరకు మద్రాసులో చదువుకున్నారు. చిన్ననాటి నుంచి శాస్త్రీయ సంగీతం మీద చాలా ఆసక్తి కనబరిచి సితార్ వాదన అభ్యసించారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అణు భౌతిక శాస్త్రంలో ఎంఎస్సీ చేసి, ట్రాంబేలోని భాభా అణు పరిశోధనా కేంద్రం (బార్క్)లో శాస్త్రవేత్తగా చేరారు. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి అణుధార్మికత అన్వేషణ సాధనాల గురించి పరిశోధనా పత్రానికి పి.హెచ్.డి పొందారు. మూడు దశాబ్దాలుగా బొంబాయిలోనే ఉద్యోగం చేసిన రోహిణీప్రసాద్, ఉద్యోగ విరమణ తర్వాత అమెరికాలోని అట్లాంటాలో కొంతకాలం కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఇటీవల ఇసిఐఎల్‌లో కన్సల్టెంట్‌గా పనిచేయడానికి హైదరాబాద్ వచ్చారు.

బొంబాయి రోజుల నుంచే రోహిణీప్రసాద్‌లో సంగీత, సాహిత్య అభిరుచులు ఎంతగానో విస్తరించాయి. పాపులర్ సైన్స్ రచనలు చేయడం ప్రారంభించారు. పదవీ విరమణ అనంతరం ఆయన సాహిత్య సృష్టి మరింతగా విస్తరించింది. సైన్స్ వ్యాసాల తొలి సంపుటం ‘జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం’ 2008లో వెలువడింది. అప్పటి నుంచీ ఆయన తెలుగులో ప్రధాన స్రవంతి పత్రికలలోనూ, ప్రత్యామ్నాయ పత్రికలలోనూ పాపులర్ సైన్స్ వ్యాసాలు రాస్తూ వచ్చారు. మధుమేహం కారణంగా తీవ్ర అస్వస్థతతో ముంబై జస్లోక్ ఆసుపత్రిలో సెప్టెంబర్ 8న కన్నుమూశారు. తన శరీరాన్ని మట్టిలో కలపడం కాకుండా, వైద్యపరిశోధనల కోసం ఆసుపత్రికి ఇవ్వాలన్న ఆయన కోరికను కుటుంబం నెరవేర్చింది.

విస్తృతస్థాయి రచనలు

ప్రజాసాహితి, వీక్షణం, అరుణతార, విశాలాంధ్ర, ఆంధ్రభూమి, ది హాన్స్ ఇండియా వంటి పత్రికలు… ఈమాట.కామ్, ఎపివీక్లీ.కామ్, పొద్దు.నెట్, ప్రజాకళ. ఒఆర్‌జి, ప్రాణహిత.ఒఆర్‌జి వంటి వెబ్‌సైట్లలో సైన్స్, సంగీతం, భాష, సాహిత్యం, విశిష్టవ్యక్తులతో జ్ఞాపకాలు,.. ఇలా గత పన్నెండేళ్లుగా ఎంతో వైవిధ్యపూరిమైన రచనలను శరవేగంగా విస్తృత స్థాయిలో అందించిన ప్రజా రచయిత రోహిణీ ప్రసాద్.

తండ్రి కొ.కు. మార్క్సిస్ట్ పదజాలాన్ని వాడకుండా, సామాజిక, ఆర్థిక పరిణామాలను ప్రగతిశీల కోణం నుంచి విశ్లేషిస్తూ కల్పనాసాహిత్యంలో కొత్త పుంతలు తొక్కి చరిత్ర సృష్టిస్తే,, తనయుడు కమ్యూనిజం పేరెత్తకుండా శాస్త్రీయతకు, అశాస్త్రీయతకు మధ్య ఉన్న తేడాను ఎవరినీ నొప్పించకుండా వీలైనంత సయమనంతో, అందరినీ ఆలోచింపజేసేలా రాయడంలో నిష్ణాతుడయ్యారు.

ఆయన గడిపిన చివరి సంవత్సరాలు వ్యక్తిగా తనను తీవ్రమైన అధ్యయనానికి, విస్తృతమైన రచనావ్యాసంగానికి అంకితం చేసి ఉండవచ్చు. అదే సమయంలో పాపులర్ సైన్స్ రచనా ప్రక్రియ తన ద్వారా ఒక కొత్త ఒరవడిని అందుకుంది. ఎక్కడా సిద్ధాంతం పేరెత్తకున్నప్పటికీ, సైన్స్ ఆవిష్కరణల పరిణామాన్ని హేతుపూర్వకంగా వివరించడంలో విశ్లేషించడంలో, సూటిగా విషయాన్ని అన్ని వర్గాల పాఠకులకు అందించి అర్థం చేయించడంలో అసాధారణ నైపుణ్యం చూపిన ప్రజ్ఞాశాలి ఈయన.

సైన్స్ పరిశోధనలు ఆవిష్కరిస్తున్న తాజా పరిణామాలను ఎంత సులభ శైలిలో ఆయన పేర్కొంటారో, ఆ పరిణామాలను వివరిస్తున్నప్పుడు చిన్న చిన్న పదబంధాలతో ఆయన చేసే వ్యాఖ్యలు ఎన్నో మెరుపు వాక్యాలను సృష్టించాయి. తన ప్రధాన రచన కంటే తను చేసిన వ్యాఖ్యలు మళ్లీ మళ్లీ చదువుకోవాలనిపించేంత ఆసక్తి కలిగిస్తాయి. అలాగని మూల పాఠాన్ని తేలికపరుస్తున్నట్లు కాదు.

వెంట్రుకవాసిలో ర్యాంకును, సీటును లేకుండా చేసే పోటీ ప్రపంచపు పరుగుపందెంలో, సాఫ్ట్‌‍వేర్ మాయాజాలంలో పడి పుస్తక అధ్యయనం అంటే ఏమిటో తెలియనంతగా కొట్టుకుపోతున్న యువతరం కూడా ఆయన రచనలను విశేషంగా చదవటం ప్రారంభించిందని తెలిసినప్పుడు ఆయన నూటికి నూరుపాళ్లూ తన లక్ష్య సాధనలో విజయం సాధించినట్లే లెక్క. ఒకే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పవలసి వచ్చినప్పుడు అనివార్యంగా కనిపించే పునరావృత్తి లోపం కూడా గమనించనంతగా తన రచనలు మనల్ని ముందుకు నడిపిస్తాయి.

‘జీవశాస్త్ర విజ్ఞానం సమాజం’ అనే పుస్తకం ప్రజాసాహితి ప్రచురించిన ఆయన తొలి పుస్తకాల్లో ఒకటి. వృత్తిరీత్యా పరమాణు శాస్త్రవేత్తే అయినప్పటికీ, జీవపరిణామ శాస్త్రంలో జరుగుతున్న విప్లవాత్మమైన ఆవిష్కరణలను విభ్రమంగా పరిశీలిస్తూ తన దృష్టికి వచ్చిన ప్రతి కొత్త భావనను తెలుగు మాత్రమే తెలిసిన పాఠకులకు వివరించాలనే అభిప్రాయంలో రచయిత రాసి ప్రచురించిన విలువైన వ్యాస సంపుటి ఇది. ఇవి కేవలం శుద్ధ సైన్స్ వ్యాసాలే అయితే వాటికి ఇంత ప్రాచుర్యం లభించేది కాదేమో.

ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలపై గతితార్కిక దృక్పథం నుండి చేసిన వ్యాఖ్యలు, వ్యంగ్యోక్తులు, చురకలు, నిక్కచ్చి విమర్శలతో కూడుకోవటంతో రచయిత సైన్స్ వ్యాసాలకు విశిష్ట ప్రాముఖ్యత లభించింది. ఈ వ్యాసాలు చదువుతున్నప్పుడు ఎంగెల్స్ 130 సంవత్సరాల క్రితం అప్పటి సైన్స్ పరిణామ గతిపై రచించిన ప్రామాణిక పుస్తకం ‘డయలెక్టిక్స్ ఆఫ్ నేచుర్’ గుర్తొచ్చిందంటూ ఈ పుస్తకం పరిచయకర్త అతిశయ రహితంగానే చెప్పారు.

దైవశక్తి కాదు… భౌతిక శక్తి…

“దేవుడున్నాడని వాదించేవారితో లేడని చెప్పడంతో ఊరుకోకుండా జరుగుతున్న సంఘటనల వెనక ఎటువంటి భౌతిక శక్తులు పనిచేస్తాయో హేతువాదులు వివరించగలగాలి. అని “భౌతిక వాద దృక్పధం ఆవశ్యకత’ అనే వ్యాసంలో సూచించిన రచయిత మూఢవిశ్వాసాలకు కొత్తరంగులు పులుముకుంటూ, వాటిని బలపరచడం తమ జన్మహక్కయినట్లు ప్రవర్తించే ఆధునిక ఆటవికులపై అనేక వ్యాసాల్లో వ్యంగ్యవిమర్శలు చేశారు.

‘ఈరోజు మనమనుకున్నది రేపు తప్పు కావచ్చు’ అనే ఏకవాక్యం ద్వారా శాస్త్రీయ ఆలోచనలు నిత్య ప్రయోగాలతో ఎలా మారుతూ వచ్చాయో అత్యంత స్పష్టంగా వివరించారు. 19వ శతాబ్దంలో సమాజంలో ఉనికిలో ఉన్న అనేక సత్యాలు 20వ శతాబ్దపు నూతన ఆవిష్కరణల వెలుగులో పాక్షిక సత్యాలుగా, అసత్యాలుగా తేలిపోయాయని, యావత్తు మానవ, సమాజ పరిణామాల విజ్ఞానం ఇలా సత్యాసత్యాల నిర్దిష్ట ప్రయోగ ప్రక్రియల్లోంచే నిగ్గుదేలుతూ వస్తోందని, స్తంభించిన ఆలోచనలకు, అజ్ఞానానికి సంబంధించిన మతభావనలకు, ప్రకృతిలోని రహస్యాలను నిరంతరం వెదుకుతూ, పాతభావనలను సరిదిద్దుతూ, తిరస్కరిస్తూ కొత్త భావనలను ఊహించే శాస్త్ర భావనలకు ఏరకంగానూ పొత్తు కుదరదని తేల్చిచెప్పారు.

అదే సమయంలో ప్రాచీన కాలపు ప్రజల విశ్వాసాలు అప్పటి పరిమితమైన సైన్స్‌లో భాగమేనని చెప్పడంలో రచయిత ఏమాత్రం వెనుకాడలేదు. సంతానోత్పత్తి సామర్థ్యానికి ప్రతీకలైన అమ్మతల్లి బొమ్మలు, లింగరూపాలు వంటివి తమ మనుగడకు మేలు జరుగుతుందని నమ్మిన ప్రజలు చేస్తూవస్తున్న తంతులేనని, ఇవి అప్పటి సమాజ శ్రేయస్సు కోసం జరిపిన తంతులే తప్ప, మతం పేరుతో అల్పసంఖ్యాకులు ఇతరులను మభ్యపెట్టే దశ అప్పటికింకా ప్రారంభం కాలేదని చెబుతారు. ప్రాచీనుల సామూహిక జీవిత అవసరాల్లో భాగంగా ఏర్పడిన ఈ రకమైన తంతులను వివరించే కృషి కూడా సైన్స్‌లో భాగమేనంటారు.

ప్రకృతిలోని ప్రతి పరిణామాన్ని సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తూ వచ్చిన ప్రాచీన మానవులు, గుహల్లో మారుమోగే చప్పుళ్లకు, ప్రతిధ్వనులకు కూడా అతీత శక్తులను ఆపాదించి ఉంటారని, ప్రపంచమంతటా ప్రాచీన ఆరాధనా స్థలాలలో పుట్టిన మంత్రోచ్చాటనలకు శక్తిని ఆపాదించడం వెనుక ఇదే దాగి ఉందని రచయిత వ్యాఖ్యానిస్తారు. మంత్రాల ఉచ్చారణకు ఇప్పటికీ మన దేశంలో ఎంతో శక్తిని ఆపాదించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తారు.

‘అమరమైనది’ ఆత్మకాదు. ‘జన్యుపదార్థం’

చావుపుటకలు అనే వ్యాసంలో ‘ఆత్మకు చావు లేదు’ అనే సాంప్రదాయ భావనకు వ్యతిరేకంగా సైన్స్ పరంగా అద్భుత వ్యాఖ్య చేశారీయన.  మనవాళ్లు అనుకుంటున్నట్లుగా మనలో ‘అమరమైనది’ -శాశ్వతమైనది- ఆత్మకాదు. ‘జన్యుపదార్థం’ అని తేల్చి చెబుతూ షాక్ కలిగిస్తారు. ఎన్నో సంవత్సరాలు బతికి, ఆలోచించి, నవ్వి, ఏడ్చి, ఏదో ఒకనాడు శ్వాస పీల్చడం మానేసిన మనిషి ఉనికికి చావు అనేది శాశ్వతమైన అంతం అని అంగీకరించడానికి ‘మనసొప్పదు’. కానీ జీవపరిణామానికి మరణం అనేది తప్పనిసరి అవసరం అంటూ రిచర్డ్ డాకిన్స్ -‘Selfish Gene,’ ‘The Blind watchmaker’ గ్రంథాల రచయిత- భావనను పరమ తార్కికంగా వ్యాఖ్యానిస్తారు రచయిత.

చచ్చిన తర్వాత మనలో ‘నశించనిది’ ఏదీ ఉండదని, మనిషి శరీరం యంత్రపరంగా నూట యాభై ఏళ్లకు మించి ‘నడవద’ని, అది అరిగి, తరిగి, శిథిలమవుతుందని, అందుకే నూట ఇరవై దాటిన ‘శతాధిక’ వృద్ధులెవరూ ప్రపంచంలో ఉండరంటూ సంభ్రమం గొలిపించే వ్యాఖ్య చేస్తారు. మొత్తం మీద జీవపరిణామంలో చావు అనేది ప్రకృతి పరంగా చూస్తే లాభదాయకం -cost effective-. నానాటికీ అరిగిపోయే ప్రతి ప్రాణి శరీరాన్ని బాగుచేస్తూ కలకాలం మన్నేట్టు చెయ్యడం కంటే ఆ శరీరంలో పనికొచ్చే పదార్థాన్ని కొత్త శరీరంలో ప్రవేశపెట్టి ముసలి శరీరాన్ని అవతలికి నెట్టడమే ప్రకృతికి సులభం అవుతుంది. కాబట్టి పనికొచ్చే పదార్థం అంటే మనలో జన్యుపదార్థమేనని పేర్కొంటూ ఆత్మల శాశ్వతత్వాన్ని, అమరత్వాన్ని చావు దెబ్బ కొడతారు.

అన్నిటినీ ఆడించే శక్తి, అన్నిటిని సృష్టించిన సృష్టికర్త అనే ఆటవిక దశలోని మానవుల మానసిక భావనలను ఆధునిక సైన్స్ పూర్వ పక్షం చేస్తోందని, ప్రాణులు పుట్టడం, పెరుగుదల, వాటిలో కలిగే శారీరక మార్పులు వంటి వాటన్నింటినీ నియంత్రించడం సాధ్యమేనని విజ్ఞానశాస్త్రం నిరూపిస్తోందని, మనిషే సృష్టికర్త అవుతున్న ప్రస్తుత కాలంలో ‘విశ్వామిత్ర సృష్టి’ని ఎవరైనా చేయవచ్చని సవాలు చేస్తున్నారు రోహిణీ ప్రసాద్.

“జీవరాశి చరిత్ర యావత్తూ డిఎన్ఎ తదితర జన్యుపదార్థాలన్నీ తమను తాము పునసృష్టి చేసుకునే కార్యక్రమం మాత్రమే. ప్రాణులన్నీ ఇందుకు తల ఒగ్గవలసిందే. ఇందులో వివేకమూ, వివేచనా మొదలైనవాటికి స్థానం ఉన్నట్లు కనబడదు” అని వ్యాఖ్యానించడం ద్వారా దైవ సృష్టి భావనను ఎదుర్కొన్నారీయన.

అలాగే మనుషులందరూ సమానం కాదనే విషయం జన్యు స్థాయిలో కూడా సరైనదే అని తేలుతోందని, కాని ఈ విషయం సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి మనని ప్రేరేపించాలి. బలహీనులను గాలికి వదిలేయకుండా కాపాడుకుని, జంతువులకు, మనకు భేదం ఉందనేని నిరూపించాలి అని వ్యాఖ్యానించడం ద్వారా జన్యుపరమైన అసమానతలను సమాజంలోని అసమానతలతో సరిచేసి పోల్చరాదని సూచిస్తారు.

‘జీవశాస్త్ర విజ్ఞానం సమాజం’ అనే పుస్తకం పొడవునా రోహిణీ ప్రసాద్ గారు గుప్పించిన స్పూర్తిదాయకమైన వాక్యాలూ, వ్యాఖ్యలను మనం ఇక్కడ చూడవచ్చు.

“దీర్ఘాయుస్సు కలిగించే ప్రత్యేక జన్యువు ఏదీ లేదు కానీ మనకు మంచి ఆరోగ్యాన్ని, పటుత్వాన్ని ఇవ్వగలిగిన జన్యువులు చాలానే ఉన్నాయి.

చావు అనేది జన్యువుల అంతిమ వైఫల్యం అనుకోవచ్చు. అలాగే ముసలితనం కూడా క్రమంగా జరిగిన, జరుగుతున్న జన్యుపరమైన క్షీణత అని భావించవచ్చు.

‘అమరత్వం’ సిద్ధించకపోయినా ఆయుర్దాయం పెరుగుతుంది.”

–చావు గురించి వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న జడాత్మక తాత్విక భావనల స్థానంలో ‘జన్యువుల అంతిమ వైఫల్యమే చావు’ అనే భావనను మనకాలపు  సైంటిస్టు మాత్రమే ప్రతిపాదించగలడు.

“కష్టాల్లో ఉన్నవాళ్లు దేవుణ్ణి తలుచుకున్నట్లుగా, ప్రపంచవ్యాప్తంగా అంటురోగాలు లేదా వాటి గురించిన భయం పెరిగినప్పుడల్లా ప్రజల్లో సైన్స్ విషయాల పట్ల కాస్త ఆసక్తి పెరుగుతుంది.

ఇప్పుడు మనకున్న స్వాతంత్ర్యమల్లా టీవీలు చూస్తూ ఇండియన్ ఐడల్ గురించి ఎస్‌ఎమ్ఎస్‌లు పంపటమే.

పక్కవాడికేసి చూడకుండా బస్సుల్లో కూర్చున్నప్పుడు కూడా చెపుల్లో పెట్టుకు వినడానికి సీడి ప్లేయర్లూ, కేసెట్ ప్లేయర్లూ ఉన్నాయి. మరీ గుబులు పుడితే మొక్కుకోవడానికి దేవుళ్లూ, బాబాలూ, జైలుకెళ్లని స్వాములార్లూ ఉండనే ఉన్నారు.

పొట్టకోసం చదివే చదువులూ, సైన్సూ ఒంటబట్టే అవకాశం ఎలాగూ లేదు కనక అదంతా మర్చిపోయిన ‘విద్యాధికులు’ అన్నిటినీ ఆడించే పవరు గురించి ఊహలల్లుకుంటూ ఉంటారు.

అన్నిటికీ అతీతంగా ‘జన్మరాహిత్యం’ సాధించడమే గొప్ప అని ప్రతిపాదించబడింది. ప్రాణమూ, స్పృహా అన్నీ త్యజించాక ‘గొప్ప’ అనే భావన ఎలా కలుగుతుందీ ఎవరికీ తెలీదు.”

‘నొసటి రాత’ నొసటి మీద కాక అతి సూక్ష్మ జీవకణాల్లో నిక్షిప్తమై ఉందనడంలో సందేహం లేదు.

–పైవాటిలో ఏ వాక్యం చూసినా, సమాజ నడకపై, అవాంఛనీయ విశ్వాసాలపై తీవ్రమైన సెటైరే కనబడుతుంది మనకు.

“క్షణాల్లో రోగాలు నయం చేసెయ్యగలమని మందుల కంపెనీలు కేకలు పెట్టడంతో మామూలు ప్రజలు ప్రతిదానికీ ఇటువంటివి వాడటం మొదలుపెడితే జబ్బుకన్నా చికిత్సే ప్రమాదకరం అవుతుంది.”

–రోగనిరోధానికి అవసరమైన మందులు మాత్రమే ఇవ్వకుండా ఎంత చిన్న పెద్ద డాక్టరైనా సరే విటమిన్ టాబ్లెట్లు ఇస్తున్నాడంటే అతడు పూర్తిగా మందుల కంపెనీలకు అమ్ముడుపోయినట్లే లెక్క. నూటికి 75 శాతం వ్యాధులు కేవలం ఆహారం తీసుకోవడం ద్వారానే తగ్గిపోతాయని డాక్టర్ సమరం గారు పాతికేళ్లుగా మొత్తుకుని చెబుతున్నా మనం వినం. మన దగ్గరి సందులోని డాక్టర్ మాటంటే అంత గురి మనకు. సూదిమంది పొడిస్తేనే వాడు సరైన డాక్టర్ అనే ఒకప్పటి పల్లెజనం నమ్మకం ఎంతమంది డాక్టర్లకు బతుకునిచ్చిందో మరి.

జన్యుప్రయోగాల్లో… మూడుకాళ్ల కోడిపిల్లలనూ, ఆవులంత పాలివ్వగలిగిన ఎలుకలనూ శాస్త్రవేత్తలూ కృత్రిమంగా సృష్టించగలుగుతున్నారంటే ప్రాణుల ఎదుగుదలను నియంత్రించే ప్రక్రియలను అర్థం చేసుకున్నారని తెలుస్తోంది.

పాశ్చాత్య దేశాల్లో  పనిచేసే చాలామంది శాస్త్రవేత్తలు దైవసృష్టిని ఏ మాత్రమూ నమ్మనివారే. ఎటొచ్చీ వాళ్లు మన భౌతికవాదుల్లాగా మార్క్సిస్టులై ఉండకపోవచ్చు. మార్కిజానికి వ్యతిరేకులైనా కావచ్చు. వారి ప్రయోగాలు మాత్రం హేతువాదానికి బలం చేకూర్చుతాయి. ఆ వివరాలు కొన్నయినా తెలుసుకోవడం భౌతికవాదులకు అవసరం.”

–సిద్ధాంతంపై అతిప్రేమ, సిద్ధాంత వ్యతిరేకులపై గుడ్డి వ్యతిరేకత ఏ సమాజానికైనా మంచిది కాదు. మార్క్సిస్టు వ్యతిరేకుల ప్రయోగాలు కూడా హేతువాదానికి బలం చేకూర్చుతాయనడంలో రచయిత జీవిత కాలసాధన ద్వారా పొందిన అనుభవమే కనబడుతుంది మనకు.

“పునరుత్పత్తికి జీవకణాలు ప్రస్తుతపు ఆత్మహత్య పద్ధతిని ‘ఎన్నుకున్నాయంటే’ జీవపరిణామ క్రమంలో తక్కిన పద్ధతుల కన్నా ఇదే బలంగా నిలవగలిగిందని ఊహించాలి. ఇది ప్రకృతి సిద్ధంగా ‘అతీత శక్తుల’ ప్రమేయమేమీ లేకుండా జరిగిన పరిణామం.”

–జీవరాసుల చావు పుట్టుకల ప్రక్రియలో దాగిన ‘ప్రకృతి ఎంపిక’ను ఎంత ప్రభావవంతంగా రచయిత ఇక్కడ చెప్పారో చూడండి మరి. అందుకే ముసలితనం, చావు అనేవి ప్రకృతిపరంగా ‘విధివిధానం’ అనిపిస్తాయంటారీయన. 300 కోట్ల సంవత్సరాలనుంచి జీవకణాలు తమ చుట్టూ ఉన్న పరిస్థితులకు తట్టుకుంటూ తమ మనుగడనీ, సంతానోత్పత్తిని కొనసాగించడానికి విజయవంతంగా ప్రయత్నించిన ఈ కణాల ఫార్ములాయే ‘చావుపుట్టుకలు’ అంటూ జీవన్మరణ రహస్యాన్ని సైన్స్ పరిభాషలో నిర్వచిస్తారు రచయిత.

“డైనోసార్ల పుట్టుక, ఎదుగుదల ప్రక్రియ భూమ్మీద 16 కోట్ల సంవత్సరాలు కొనసాగిందంటే ఇది ఎంత విజయవంతమైన జీవపరిణామమో ఊహించుకోవచ్చు… మనవాళ్లకు డైనోసార్ల సంగతి తెలిసి ఉంటే దాన్ని కూడా విష్ణువు అవతారంగా అభివర్ణించేవారేమో కాని, ఈ భయంకర ప్రాణులను ఏ దేవుడు ఏ ఉద్దేశంతో అన్ని కోట్ల ఏళ్లు ఉండేట్టు సృష్టించాడో, అవి ఎందుకు అంతరించాల్సి వచ్చిందో పురాణాలు చెప్పవు. సైన్స్ మాత్రం అతి సామాన్యమైన కారణాలతో వివరణలిస్తుంది.”

“వ్యక్తుల బలహీనతల్ని ఉపయోగించుకునే దొంగస్వాములూ, నిజాయితీగానే తప్పుడు నమ్మకాలను ప్రచారం చేసే మహనీయులూ తెలిసి కొందరూ, తెలియక కొందరూ అనేకమందిని తప్పుదారి పట్టిస్తున్నారు. జలుబును ఏమాత్రం నయం చెయ్యని ఇన్‌హేలర్లలాగా మూఢనమ్మకాల, తప్పుడు వేదాంతమూ చాలామందికి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తున్నాయనేది నిజమే. అయినా యధార్థమేమిటో తెలుసుకోవడం ఆధునిక మానవుడికి జన్మహక్కు వంటిది. అది విప్లవానికి ఆయుధం కూడా.”

పరమాణువు నుంచి జీవ పరిణామం వరకు…

పతాక స్థాయికి చేరిన రచయితలోని ఈ భావ స్పష్టత వృత్తి జీవితం నుంచే తనకు అలవడినట్లుంది. పరమాణు భౌతికశాస్త్రంలో 70 పరిశోధనా పత్రాలు, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, భౌతికవాదంలో మరో 300 వ్యాసాలు రాసిన ఈ ఘనాపాఠి… బాబా అణు పరిశోధన కేంద్రంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ‘You shape the work. Work shapes you.’ అనే భావనను నమ్ముకున్నారట.  “ఏ పనినీ వద్దనే ప్రసక్తేలేదు. అలా ఏ పనినైనా దిగ్విజయంగా చేసే స్థాయికి వెళ్ళాను. చేసే ప్రతిపనినీ, అంతర్జాతీయ సదస్సులకు పంపే ప్రతి పేపర్‌ను ఇతరుల దృక్కోణం నుంచి చూడటం, విస్పష్టంగా, ఎటువంటి సందేహాలకూ తావులేకుండా రాయడం, చెప్పాలనుకన్న విషయాన్ని సూటిగానూ, అర్ధమయ్యేరీతిలో కమ్యునికేట్‌ చేయడం వీటిపైనే నా దృష్టి అంతా వుండేది. బహుశా ఈ స్కిల్‌ నేను పెరిగిన వాతావరణం, నేను చదివిన పుస్తకాలే నాకు ఇచ్చాయి. తెలుగులోకి అనువాదమైన రష్యన్‌ సాహిత్యం, సైన్స్‌ పుస్తకాలు, నాన్న రచనలు నేను మొదటిగా చదివిన పుస్తకాలు. చిన్నతనంలో మా నాన్న ఏర్పరచిన వాతావరణమే దీనికి కారణం.”

“పరమాణు శాస్త్రవేత్తనైన నేను జీవశాస్త్రం వ్యాసాలు రాయాలనుకోవడం మరో మలుపు. అదీ ఆసక్తి వున్న సాధారణ మనిషికి బోధపడే రీతిలో రాయాలనుకోవడం … సాహసమే. అయితే నేను దానిలో విజయం సాధించాననే అనుకుంటాను. గతితార్కిక భౌతికవాదాన్ని నమ్మడంతో, ప్రజలందరూ బహుముఖ పార్శ్వాలను కలిగివుండే సమాజం సాధ్యమేనని నమ్మడంతో ఇప్పుడు మన పని ముగిసిపోవడంలేదు. దానిని ఆచరిస్తూ, పదిమందికీ చెప్పడమనే అవసరం రోజురోజుకూ మరింత విస్పష్టంగా కళ్ళముందు గోచరిస్తోంది. నా దారి నాకు స్పష్టంగా కనబడుతూనే వుంది.’’ (అరుణపప్పు గారి బ్లాగ్ నుంచి)

ప్రపంచంలోనే అతి కష్టమైన పని ఏదో చెప్పండిరా చూద్దాం అంటూ చిన్నప్పుడు స్కూల్లో మా తెలుగు మాస్టారు ప్రశ్నించేవారు. కొండలెక్కడం, బరువుమోయడం అంటూ మా అనుభవంలో మాకు తెలిసినదల్లా జవాబే అనుకుని చెప్పేవాళ్లం. అన్నిటినీ ఖండించి మా మాస్టారు ఒక చిన్నమాటతో తేల్చేసేవారు.

ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పని ఏమిటంటే  ‘సులభంగా రాయడమేరా’ అనేవారాయన.

రోహిణీ ప్రసాద్ గారు అలా సులభంగా రాయడాన్ని సాధించారు. అది శాస్త్రం కావచ్చు, శాస్త్రీయ సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరినీ చదివించే సరళశైలి రచనలను ఆయన తెలుగు సమాజానికి అందించారు.

సైన్సుకు సంబంధించిన పుస్తకాలతోపాటు ఆయన అంతర్జాలంలో సరళమైన రీతిలో తెలుగులోవ్యాసాలు రాసారు. వాటిలో ప్రతి ఒక్కటీ విలువైనదే. పరిచయమున్న వారందరికీ షాక్ కలిగిస్తూ ఆయన ఇంత అర్థాంతరంగా పోవడం వారి కుటుంబానికి, మిత్రులకూ ఎంత నష్టమో, తెలుగు పాపులర్ సైన్స్ రచనా ప్రక్రియకు అంతకంటే అధిక నష్టం.

గత నాలుగేళ్లలో ఆయన రాసిన ‘జీవ శాస్త్ర విజ్ఞానం-సమాజం’, ‘మానవ పరిణామం’, ‘విశ్వాంతరాళం’, ‘జీవకణాలు-నాడీకణాలు’, ‘ప్రకృతి-పర్యావరణం’, ‘మనుషులు చేసిన దేవుళ్లు’, ‘అణువులు’ వంటి సైన్స్ పుస్తకాలు పాఠకులను ఆలోచింపజేయడమే కాకుండా సైన్స్ విషయాల్లోని సంక్లిష్టతను తొలగించాయని ప్రతీతి పొందాయి.

ప్రతి హేతువాదీ, భౌతికవాదీ, సామాజిక కార్యకర్తా రోహిణీ ప్రసాద్ గారి సైన్స్ రచనలను స్వంతం చేసుకోవాలి, నిబద్ధతతో అధ్యయనం చేయాలి.

ఆయన వదిలివెళ్లిన రచనలు చదివే బాధ్యత మనపై ఉంది. వినమ్రంగా ఆయనకు మనం ఇవ్వగలిగే నివాళి ఇదొక్కటే మరి.

 

(This full length article was edited and published in Prajasakthi daily paper and website on 16-09-2012 by same heading. Now i am posting this full article for broder purpose. My heartious thanks to Prajasakthi and perticularly its Rajamundry edition chief Mr. Satya ji for his friendly support. I couldn’t type this in telugu as i am not having unicode font in my hand now.)

K.Raja Sekhara Raju

07305018409

Hyderabad

 

 

RTS Perm Link

రోహిణీ ప్రసాద్ సంస్మరణ సభ

September 14th, 2012

అణుభౌతిక శాస్త్రవేత్త, పాపులర్ సైన్స్ రచయిత, సంగీతకారుడు, వక్త కొడవటిగంటి రోహిణీప్రసాద్ సంస్మరణ సభ సెప్టెంబర్ 15 (శనివారం) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరుగుతుంది. ఎన్. వేణుగోపాల్ సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. దివికుమార్, గీతా రామస్వామి, కాకరాల, బాబు గోగినేని, వరవరరావు తదితరులు వక్తలుగా పాల్గొని ప్రసంగిస్తారు. గత ఐదు సంవత్సరాలలో ఏడు పాపులర్ సైన్స్ పుస్తకాలు ప్రచురించి దాదాపు పది పత్రికలలో శాస్త్రవిజ్ఞాన విషయాలను సుబోధకంగా విరివిగా రాస్తున్న రచయితగా, ఇటీవలి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్ర విజ్ఞాన విషయాలపై ప్రసంగాలు చేస్తున్న వక్తగా రోహిణీప్రసాద్ తెలుగు సమాజంలో సుప్రసిద్ధులయ్యారు.

సుప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు – వరూధిని దంపతుల కొడుకుగా రోహిణీప్రసాద్ డిగ్రీ వరకు మద్రాసులో చదువుకున్నారు. చిన్ననాటి నుంచి శాస్త్రీయ సంగీతం మీద చాలా ఆసక్తి కనబరిచి సితార్ వాదన అభ్యసించారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అణు భౌతిక శాస్త్రంలో ఎంఎస్సీ చేసి, ట్రాంబేలోని భాభా అణు పరిశోధనా కేంద్రం (బార్క్)లో శాస్త్రవేత్తగా చేరారు. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి అణుధార్మికత అన్వేషణ సాధనాల గురించి పరిశోధనా పత్రానికి పి.హెచ్.డి పొందారు. మూడు దశాబ్దాలుగా బొంబాయిలోనే ఉద్యోగం చేసిన రోహిణీప్రసాద్, ఉద్యోగ విరమణ తర్వాత అమెరికాలోని అట్లాంటాలో కొంతకాలం కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఇటీవల ఇసిఐఎల్‌లో కన్సల్టెంట్‌గా పనిచేయడానికి హైదరాబాద్ వచ్చారు.

బొంబాయి రోజుల నుంచే రోహిణీప్రసాద్‌లో సంగీత, సాహిత్య అభిరుచులు ఎంతగానో విస్తరించాయి. పాపులర్ సైన్స్ రచనలు చేయడం ప్రారంభించారు. బొంబాయిలోని కాలనిర్ణయ్ పంచాంగంక్యాలెండర్‌లో తెలుగు సాహిత్యాన్ని చేర్చడంలో సహాయం చేశారు. పదవీ విరమణ అనంతరం ఆయన సాహిత్య సృష్టి మరింతగా విస్తరించింది. సైన్స్ వ్యాసాల తొలి సంపుటం ‘జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం’ 2007లో వెలువడింది. అప్పటి నుంచీ ఆయన తెలుగులో ప్రధాన స్రవంతి పత్రికలలోనూ, ప్రత్యామ్నాయ పత్రికలలోనూ పాపులర్ సైన్స్ వ్యాసాలు రాస్తూ వచ్చారు. సమాజంలో శాస్త్రీయ దృష్టిని పెంపొందించడానికి విద్యార్థుల స్థాయి నుంచే పాపులర్ సైన్స్ ఉపన్యాసాలు ఏర్పాటు చేయాలనీ, తాను ఎక్కడికైనా వచ్చి ఉపన్యాసం ఇస్తాననీ చెపుతూ ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వంద చోట్ల ఉపన్యసించారు.

– కొడవటిగంటి రోహిణీప్రసాద్ మిత్రులు

(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)

రోహిణీ ప్రసాద్ సంస్మరణ సభ

http://andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/sep/14/edit/14edit6&more=2012/sep/14/edit/editpagemain1&date=9/14/2012

 

RTS Perm Link

సంగీత, సాహిత్య, శాస్త్రాల మేలుకలయిక: కె. రోహిణీ ప్రసాద్

September 11th, 2012

మనిషి సాధించవలసిన జ్ఞానార్జన స్పెషలైజేషన్ పేరిట ముక్కలుగా విభజించబడుతున్న కాలంలో మనముంటున్నాం. ఫలితంగా ఒక కోర్సును మాత్రమే మనం చదవగలం. జీవితమంతా ఒక వృత్తిలోనే మనం ఉండగలం. ఒక మనిషి రెండు, మూడు రంగాల్లో ప్రవేశించటం సాధ్యమేమో కాని అన్నింటిలో నిష్ణాతుడు కావడం మన కాలంలో కష్టసాధ్యం.

సమాజం ఏర్పర్చిన ఈ రకం జ్ఞాన విభజననుంచి బయటపడిన అరుదైన వ్యక్తి కొడవటివటిగంటి రోహిణీప్రసాద్. అరవైమూడేళ్ల వయస్సులో గత శనివారం అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారీయన. సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత అయిన రోహిణీప్రసాద్ పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశారు.

మనిషి సజీవంగా ఉండాలంటే బహుముఖంగానే ఉండాలన్నది కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గారి నమ్మిక. ఈ విశ్వాసమే జీవితాంతం ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది. ఈ విషయంలో కొడవటిగంటి కుటుంబరావు గారి కౌటుంబిక, సాహిత్య, సాంస్కృతిక, శాస్త్రీయ వారసత్వానికి ఈయన ప్రతిరూపం.

తదనంతర జీవితంలో మూడున్నర దశాబ్దాలపాటు భాభా అణు పరిశోధనా కేంద్రం -బార్క్‌-లో రేడియేషన్‌ సెంటర్‌‌లో హెడ్‌‌గా పనిచేసిన ఈయనకు జీవితం చివరివరకూ సంగీతంపై వ్యామోహం పోలేదు. సంగీతం, సాహిత్యం, శాస్త్రం మూడింటిలో అభిరుచి, ఆసక్తులను చివరివరకూ కొనసాగించడం మన సమాజంలో అరుదైన ఘటన. ఒక వ్యక్తి ఇన్ని రంగాల్లో ప్రావీణ్యత చూపడం, తుదివరకు వాటిపై తన ముద్ర వేయడం కూడా ఆయనకు కుటుంబ నేపధ్యంలోంచే సాధ్యమైంది.

ఇంట్లో సాహిత్య వాతావరణం, తండ్రివల్ల ప్రజాస్వామిక, శాస్త్రీయ దృక్పధం తోడుగా ఈయన చిన్నప్పటినుంచే వివిధ జ్ఞాన రూపాలపై ఆసక్తి పెంచుకున్నారు. చిన్నప్పుడు అక్క, తమ్ముడితో చదువుల పోటీలో సున్నా మార్కులే వస్తుంటే తండ్రి కుటుంబరావుగారు అన్న ఒక్క ముక్క ఆయన జీవితాన్ని నిప్పుకణంలా వెలిగించింది. “చదువుకోకపోతే ఎవరికి నష్టం? వాళ్లే మట్టికొట్టుకుపోతారు” అంటూ కొ.కు. చేసిన ఒకే ఒక వ్యాఖ్య ఈయన జీవితమంతటినీ అలర్ట్ చేసింది. ‘సంగీతజ్ఞానం తప్ప వీడికి చదువురాదు’ అని కుటుంబం నిశ్చితాభిప్రాయానికి వచ్చేసినప్పటికీ కొ.కు. గారి ఆ వ్యాఖ్యే తన భావిజీవితాన్ని అణుపరిశోధనల వరకు నడిపించిందంటారీయన.

చదువులో సున్నలు వచ్చినా సంగీతం అంటే చిన్నప్పటినుంచే చెవికోసుకునేవారు. తండ్రి కొ.కు. అద్భుతంగా వాయించే హార్మోనియం పెట్టెపైనే తను కూడా వాయిస్తూ పొల్లుపోకుండా రాగాలు నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే పద్యాలు, పాటలు రాయడం, వాటికి రాగాలు కట్టడం, నృత్యరూపకాల్ని రూపొందించడం అలవడింది. ఉన్నత విద్య చదువుకుంటున్న విశాఖపట్నంలో సితార్‌నూ వదలలేదు. ఉద్యోగ రీత్యా బొంబాయి వచ్చిన తర్వాత సంగీత సాధన కొనసాగిస్తున్న క్రమంలో అక్కడి తెలుగువారితో కలిసి తెలుగు సాహిత్య సమితిని ప్రారంభించి కుమార సంభవం బాలేకు 55 రాగాలతో సంగీత రూపకల్పన చేశారు. కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడస్సీ నృత్యాలను కలబోసి కృష్ణపారిజాతం బ్యాలే రూపొందించారు.

ఇవి బాగా పేరుకెక్కడంతో సంగీతం తన జీవితంలో భాగమైపోయింది. కర్నాటక సంగీతం, హిందూస్తానీ సంగీతంలో నిష్ణాతులైన గాయకులు అప్పట్లో తరచుగా కొకు గారి ఇంటికి వస్తుండంతో వారి మాటలను వినడం ద్వారానే ఆయన సంగీతంపై తీవ్ర వ్యామోహం పెంచుకున్నారు. ముంబైలో సంగీత కచ్చేరీలు ఇవ్వడం సరేసరి. క్రమంగా సితార్ తన జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. ప్రముఖ సితార్ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ శిష్యరికం సితార్ వాయిద్యంపై నైపుణ్యాన్ని పెంచింది. 1986లో యునెస్కో ఆధ్వర్యంలో నిర్వహించిన 40వ వార్షికోత్సవంలో సితార్ విద్వాంసుడిగా రోహిణీప్రసాద్ పలు ప్రశంసలు అందుకున్నారు. హిందూస్థానీ, కర్నాటక జుగల్‌బందీలో నిష్ణాతుడయ్యాక 90లలో అమెరికాలోని పలు నగరాలలో సంగీత కళా ప్రదర్శనలు ఇచ్చారు కూడా. ఈ అణుభౌతిక శాస్త్రవేత్త, శాస్త్రీయ సంగీతానికి కూడా సమస్థాయిని ఇచ్చి గౌరవించడం మరీ విశేషం.

ముంబైలో జరిగే సంగీత కచ్చేరీల గురించి, అక్కడి సుప్రసిద్ద సవాయీ గంధర్వ ఉత్సవ విశేషాల గురించి ఆయన ఒక ఇమెయిల్‌లో ఇచ్చిన వివరణ ఎంతో ఆసక్తి గొలుపుతుంది. దశాబ్దాల క్రితం తను చూసిన, పాల్గొన్న అంశాలను కూడా నిన్న మొన్న జరిగినట్లుగా వివరించడం ఆయన అసాధారణ జ్ఞాపకశక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. మచ్చుకు ఒకటి.

“మూడు దశాబ్దాలకు పైగా ముంబయిలో ఉన్నప్పటికీ నేను ఒక్కసారి మాత్రమే (1971లో) సవాయీ గంధర్వ ఉత్సవానికి హాజరయాను. ఎందుకంటే అక్కడికి వచ్చే కళాకారులందరూ ముంబయిలో తరుచుగా కచేరీలు చేసేవారు. కిరానా సంప్రదాయానికి చెందిన భీంసేన్ జోషీ తన గురువు పేరిట జరిపే ఈ 3 రోజుల సంగీతోత్సవం చలికాలంలో జరిగినప్పటికీ అప్పట్లో అయిదారు వేలమంది ప్రేక్షకులను ఆకర్షించేది. రాత్రి 8 ప్రాంతాల మొదలైన కచేరీలు పొద్దున్న 6 దాకా ఎడతెగక సాగేవి. చివరిరోజున మాత్రం మధ్యాహ్నం 12 దాకా జరిగేది. అందరికన్నా తరవాత భీంసేన్ కచేరీ జరిగేది. ముగింపు కోసం పాడే (సింధు) భైరవి రాగం మాత్రం సవాయీ గంధర్వ రికార్డు మోగించి వినిపించేవారు. 1971లో జరిగిన ఉత్సవంలో మా గురువు ఇమ్రత్ ఖాన్‌గారి సితార్ కచేరీ, బిర్జూ మహారాజ్ కథక్ నృత్యానికి శాంతాప్రసాద్ తబలా సహకారం, కిరానా గాయని హీరాబాయీ బడోదేకర్‌కు సన్మానం వగైరాలన్నీ జరిగాయి.”

పరమాణు భౌతికశాస్త్రంలో 70 పరిశోధనా పత్రాలు, జీవశాస్త్రం భౌతిక శాస్త్రం భౌతికవాదంలో మరో మూడొందల పైగా వ్యాసాలు రాసిన ఘనుడు రోహిణీ ప్రసాద్. ఇవన్నీ ఒక ఎత్తైతే భారతీయ సంగీతకారులపై, సంగీతవాయిద్యాలపై రోహిణీప్రసాద్ ఇచ్చిన చరిత్ర డాక్యుమెంటేషన్ ఒకెత్తు. 2000 సంవత్సరం నుండి 2012 జనవరి వరకూ హిందూస్తానీ, కర్నాటక సంగీతంలో ఘనాపాఠీలుగా తాననుకున్న విశిష్టవ్యక్తుల జీవిత విశేషాలను, భారతీయ సంగీత రాగాలను వరుసగా ఈమాట.కామ్ వెబ్ పత్రికలో వ్యాసరూపంలో పొందుపర్చారు.

“సంగీతం, సాహిత్యం, బొంబాయిలో ప్రవాసాంధ్ర జీవితం గురించి రోహిణీప్రసాద్ గారు చేసిన అనేక రచనలు, వివిధ అంశాల మీద ఆయన అభిప్రాయాలు ఈమాట పత్రికలో చదవొచ్చు.”

శాస్త్రీయసంగీతంలో, ముఖ్యంగా హిందూస్తానీసంగీతంలో, విశేషమైన ప్రతిభ ఉన్న ఈయన ప్రధానంగా సితార్‌ వాద్యకారులు. ముంబైలో ఎన్నో లలితసంగీత కార్యక్రమాలు ఇచ్చారు, ఇప్పించారు. సంగీతం గురించిన అనేక విశేషాలను వివరిస్తూ వారు రాసిన వ్యాసాలు సంగీతంతో ఇంతకుముందు పరిచయం లేని వారికి కూడా దాన్లో ఆసక్తిని, అభిరుచిని కలిగిస్తాయని పేరు పొందాయి. ఈయన భారతీయ సంగీతకారులు, సంగీత రాగాలు, సంగీత వాయిద్యాల విశేషాల గురించి దాదాపు నలభై వ్యాసాలను ఇంతవరకు ప్రచురించడం గమనార్హం.

‘శ్రుతి మించని రాగం,’ ‘మన శాస్త్రీయ సంగీతం,’ ‘రాగాలూ స్వరాలూ,’ ‘శ్రుతిలయల నందనవనం,’ ‘సినిమా పాటల్లో తాళం, నడకలు, విరుపులు,’ ‘పాటల్లో లయవిన్యాసాలు,’ ‘హిందూస్తానీ సంగీతం,’ సంగీతంతో కుస్తీ,’ ‘జుగల్‌బందీ కచేరీలు,’ ‘కీబోర్డ్ మీద రాగాలు,’ ‘హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు,’ ‘కల్యాణి రాగం – అనుబంధం,’ ‘హిందోళ రాగం – అనుబంధం,’ ‘భావతరంగాల సింధువు: భైరవి,’ ‘ఖమాజ్/ఖమాచ్/ కమాస్ రాగం,’ ‘పుష్ప విలాపం – రాగాలతో సల్లాపం’ వంటి పలు రచనలలో.. సంగీతంలోని రాగాలు స్వరాలు, లయ విన్యాసాలు, తాళం నడకలు, విరుపుల గురించిన ప్రాధమిక సమాచారాన్ని ఈయన అత్యంత సులభరీతిలో పాఠకులకు అందించారు. సంగీతం అంటే ఓనమాలు తెలియని వారికి కూడా ఆసక్తి కలిగించే రచనలివి.

హిందూస్తానీ సంగీతంలో దిగ్గజాలపై ‘సితార్, సుర్‌బహార్‌ల సవ్యసాచి ఉస్తాద్ ఇమ్రత్‌ఖాన్,’ ‘గురువుల సంస్మరణ కొనసాగిస్తున్న గాయని ప్రభా ఆత్రే,’ ‘అత్యుత్తమ హిందుస్తానీ గాయకుడు బడేగులాం ఆలీఖాన్,’ ‘వాద్య సంగీతానికి అద్భుత దీవం వెలిగించిన అల్లాఉద్దీన్‌ఖాన్,’ ‘తబలా మాంత్రికుడు అహ్మద్‌‍జాన్ థిరక్వా,’ ‘గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్‌ఖాన్,’ ‘సర్వోత్తమ సితార్ విద్వాంసుడు ఉస్తాద్ విలాయత్‌ఖాన్’ వంటివారిపై అపురూప విషయాలను పంచుకున్నారు. దక్షిణ భారతీయ సంగీతజ్ఞులు ‘మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి,’ ‘సార్థక నామధేయుడు సంగీతరావు,’ ‘నౌషాద్,’ ‘ఓపీ నయ్యర్,’ ‘బాలమురళీ కృష్ణ,’ ‘బాలమురళీ కృష్ణ సంగీతం,’ ‘అసామాన్య సంగీత దర్శకుడు సి.ఆర్. సుబ్బరామన్,’ ‘సంగీతరస పానశాల ఘంటసాల’ వంటి ప్రముఖుల కృషి వివరాలు కూడా అందించారు.

ఈయన అందించే విషయం, శైలి ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తెలుసుకోవడానికి “మన శాస్త్రీయ సంగీతం‘ అనే ఈయన ఒక్క రచన చదివితే చాలు. “అనాదిగా ప్రజలు పాడుకొనే జానపద సంగీతం నుంచి పుట్టి,”సంస్కృతీకరించబడి” ప్రస్తుతపు రూపాన్ని సంతరించుకున్న మన శాస్త్రీయ సంగీతం ఈనాటి “ప్రజల” సంగీతమైన సినీగీతాలనూ, “లలిత” సంగీతాన్ని విశేషంగా ప్రభావితం చేసింది. మారుమూల పల్లెల్లో సినిమా “షోకులు” సోకనివారు మాత్రం ఇంకా తమ జానపద సంగీతం పాడుకుంటూనే ఉన్నారు. గద్దర్‌ వంటి గాయకులు ఆ బాణీలను అనుసరించి తమ భావాలను అతి సమర్ధవంతంగా ప్రకటించడం చూస్తూనే ఉన్నాం.”

శాస్త్రీయ సంగీతపు మూలాలు కూడా అనాది ప్రజల జానపద సంగీతంలోంచే పుట్టాయని చదివితే చారిత్రక క్రమంలో సంగీతం అభివృద్ధి చెందిన తీరు పట్ల ఆసక్తి కలుగుతుంది. “శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం అనేది ఒక శిక్షలాగా అనిపించకూడదు.” అనే వీరి అభిప్రాయం చదివేవారి కళ్లల్లో మెరుపును సృష్టిస్తుంది.

“జ్ఞాపకశక్తి ఉండాలి. నేర్చిన ప్రతీదీ కంఠస్థం కావాలి. అభ్యాసం రాక్షస సాధనలాగా ఉండాలి. సాధన చేస్తున్నప్పుడు ఏ అభ్యాసం వల్ల ఏ ఫలితం కలుగుతుందో చూచాయగానైనా తెలియాలి. గాత్రం నేర్చుకోనివారు కూడా విధిగా తాము వాయించబోతున్నది పాడి చూచుకోవాలి. ఈ  పాడడం ఎంత ముఖ్యమో చాలా మందికి తెలియదు. స్వరజ్ఞానం లేనివారికి అది అబ్బే అవకాశం, పాడుకోవడం వల్ల పెరుగుతుంది.”

ఒక మిత్రుడన్నట్లుగా, సైన్స్, సంగీతం, సాహిత్యం మూడింటిలోనూ ప్రావీణ్యత సాధించిన బహుముఖ ప్రజ్ఞాశాలి రోహిణీ ప్రసాద్ గారు ఇంత హఠాత్తుగా నిష్క్రమించటం అనూహ్యం, జీర్ణించుకోలేని వాస్తవం! శాస్త్రీయ అంశాలను -సంగీత మెలకువలను కూడా- హేతువాద దృక్పథంతో సరళంగా, ఆత్మీయమైన శైలిలో వివరించటంలో ఆయన కొ.కు.ను గుర్తుకుతెస్తారు! ఒక రచయితగా, సంగీతకారుడిగా, శాస్త్రవేత్తగా, హేతువాదిగా ఆయన వంటి వ్యక్తి మళ్లీ పుట్టడానికి చాలా కాలం పడుతుంది.

ముగింపు
ఇవ్వాళ రోహిణీ ప్రసాద్ మన ముందు లేరు. సంగీతంలోని ప్రాధమిక విషయాలను మంచినీళ్ల ప్రాయంలా వివరించిన వీరి రచనలు ఇకనైనా ప్రచురించవలసిన అవసరం ఉంది. సంగీత వాయిద్యాలపై, హిందూస్తానీ, కర్నాటక సంగీత విద్వాంసులపై, ఘంటసాల వంటి అమరగాయకులపై, చిత్రసంగీత దర్శకులపై ఈయన రచనలు ఈమాట.కామ్‌లో మరోసారి చదువుతున్నప్పుడు ఒకటే ఆలోచన. శాస్త్రీయ. సంగీతంపై, చిత్రసంగీతంపై ఇంత ప్రభావవంతమైన రచనలు చేసిన ఈయన కృషి ఎందుకు ఇన్నాళ్లుగా పుస్తక రూపం దాల్చలేదనిపిస్తుంది. ఈమాట.కామ్ వారు ఇప్పటికయినా ఈ పనికి పూనుకోగలిగితే సంగీత చరిత్ర డాక్యుమెంటేషన్‌లో రోహిణీప్రసాద్ గారి ‘ఆత్మావిష్కారం’ తెలుగు పాఠకులందరికీ అందుతుంది.

రోహిణీప్రసాద్ గారితో పరిచయమున్న వారు ఇప్పుడాయన గురించి పంపుతున్న స్పందనలు ఆయన బహుముఖ వ్యక్తిత్వాన్ని మరింత తేటతెల్లంగా చేస్తున్నాయి. మొత్తం సంగీత చరిత్రనే తన చేతివేళ్లమీద పెట్టుకున్న ఈ ప్రతిభామూర్తిని, సాహిత్యం, సైన్స్, అనువాదాలు, సంగీతం వంటి పలు రంగాల్లో తన మేధస్సును ప్రశంసించడం సరే సరి. తనను కలిసేందుకు వచ్చిన వారికి పాత హిందీ, తెలుగు పాటలు, గజల్స్ కూడా పాడి వినిపించి తన్మయులను చేసేవారట. ఇతరుల సంతోషాన్ని తాను ఆస్వాదించేవారట. అత్యంత స్పష్టంగా సభల్లో సైన్స్ గురించి ఇతర విషయాల గురించి ఈయన ప్రసంగాలు విన్నవారు ఈయన భావస్పష్టతను మర్చిపోలేమని చెబుతున్నారు.

ఇన్ని రంగాల్లో ప్రావీణ్యమున్న ఈ విశిష్టవ్యక్తిని ఆంధ్రజ్యోతిలో ఆయనపై వచ్చిన నివాళి వ్యాసం చూసేంతవరకు తెలుసుకోలేక పోయామని కొందరంటున్నారు. వాదాలకు, వివాదాలకు అతీతంగా జాతి సంపదగా వెలుగొందవలసిన మనుషులు అజ్ఞాతంగానే ఉండిపోవలసిరావడం, తెలిసిన వారికి మాత్రమే వారి పరిచయ సుగంధాలు మిగలటం కన్న విషాదం ఏముంటుంది?

మరోసారి… భారతీయ సంగీత రీతులపై ఆయన రచనలు పుస్తకంగా వెలువడితే ఆయన కృషి, సంగీత చరిత్రపై ఆయన ఆలోచనలు ప్రపంచానికి మరింతగా అందే అవకాశం ఉంటుంది.

(ఈ కథనం కోసం అరుణపప్పు గారు రోహిణీ ప్రసాద్‌గారితో చేసిన ఇంటర్వ్యూనుంచి, ఈమాట.కామ్ వెబ్‌సైట్ నుంచి కొన్ని వివరాలు తీసుకోవడం జరిగింది. వీరికి కృతజ్ఞతలు.)

ఆన్‌లైన్‌లో చందమామ పరిచయం: రోహిణీప్రసాద్ కృషి
తెలుగువారి బాల్యానికి, ఇంకా చెప్పాలంటే భారతీయుల బాల్యానికి ఐకాన్‌గా నిలిచిపోయిన ‘చందమామ, పత్రిక గురించి ఈమాట.కామ్ లో రోహిణీప్రసాద్ గారు 2006లో అందించిన ‘చందమామ జ్ఞాపకాలు’ రచన ఆన్‌లైన్ పాఠకలోకంలో ఒక సంచలనం కలిగించింది.

26. “చందమామ” జ్ఞాపకాలు

చందమామ దిగ్గజ చిత్రకారుల గురించి, కొకుతో సహా సంపాదక బృందం గురించి, చందమామ చరిత్ర గురించి స్థూలంగా తెలిపిన ఈ రచన తెలుగుదేశంలో, విదేశాల్లో కూడా చందమామ గురించి కొత్త ఆసక్తి కలిగించింది. చందమామ అభిమానులు, ఆరాధకులు కలిసి చందమామ పిచ్చోళ్లు అనే స్వయం ప్రకటిత సంస్థగా ఏర్పడి చందమామ పత్రిక గురించి సంవత్సరాలపాటు ప్రచారం చేసుకుంటూ వెళ్లిన చరిత్రకు ఈ వ్యాసమే నాందిపలికింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చందమామ ప్రియులకు 1947 జూలై తొలి సంచిక నుంచి 2012 ఆగస్టు సంచిక వరకు సాఫ్ట్‌కాపీల రూపంలో లభ్యమవుతున్నాయంటే దానికి రో.ప్ర గారి తొలి వ్యాసమే మూలం.

తండ్రిలాగా కల్పనా సాహిత్యంలో రోహిణీ ప్రసాద్ గారు పెద్దగా రచనలు చేసి ఉండకపోవచ్చు కాని 2010 నుంచి చందమామలో కొన్ని పిల్లల కథలు రాశారు. తను రాసిన బేతాళ కథ కూడా ఆ సంవత్సరమే ప్రచురించబడింది. చందమామకు చాలా ఆలస్యంగా పరిచయమైన ఈయన 2010లో తెలుగు మినహా ఇతర భాషలలో చందమామ పత్రిక అనువాదకుల కోసం ఎంపికైన తెలుగు కథలను ఇంగ్లీషులోకి అనువదించారు.

ఒక అక్షరం కూడా వంకబెట్టడానికి వీల్లేదని చందమామ యాజమాన్యం నుంచి ప్రశంసలందుకున్నంత చక్కని అనువాదం ఆయనది. ఈ క్రమంలోనే 1947 నుంచి 1953 వరకు చందమామ పాత సంచికలలోని కథలన్నింటినీ ఆంగ్లంలోకి మార్చే బృహత్ ప్రాజెక్టులో ఆయన కీలకపాత్ర పోషించారు. మెరుపువేగంతో, ఖచ్చితమైన పదజాలంతో చందమామ కథలకు ఆయన చేసిన అనువాదాలు చందమామ ఆన్‌‌లైన్ లైబ్రరీలో ప్రస్తుతం భద్రంగా అమరి ఉన్నాయి.

RTS Perm Link

మనం కోల్పోయిన ఆలోచనా ధార

September 10th, 2012

తెలుగు సమాజం అరుదైన ఆలోచనా ధారను కోల్పోయింది. నండూరి రామమోహన్ రావు సైన్స్ రచనలు తర్వాత శాస్త్ర విషయాలను ఇంత తేలికగా, ఇంత హేతుపూర్వకంగా తెలుగువారికి అందించిన రోహిణీ ప్రసాద్ మేధస్సు ఇంత త్వరగా ఆగిపోవడం పెద్ద విషాదమే.

ఒక కుటుంబం తన ప్రియతముడిని కోల్పోయింది. మిత్రులు తమ ఆప్తుడిని కోల్పోయారు. కానీ ఒక సమాజం అరుదైన ఆలోచనా ధారను కోల్పోయింది. తెలుగు సమాజానికి ఇటీవల కాలంలో అద్వితీయ సైన్స్ రచయితగా పరిచయమైన కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ శనివారం మన నుంచి దూరమైనారు.

మిత్రులు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి స్మృతిలో ఆంధ్రజ్యోతిలో ఈరోజు ప్రచురించబడిన నా నివాళి పూర్తిపాఠం కింది లింకులో చూడగలరు.

మనం కోల్పోయిన ఆలోచనా ధార

http://andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/sep/11/edit/11edit4&more=2012/sep/11/edit/editpagemain1&date=9/11/2012

రాయగలిగిన శక్తి, అధ్యయనంపై ఆసక్తి ఉండి కూడా మెయిన్‌స్ట్రీమ్ పత్రికలకు రచనలు పంపకుండా బ్లాగ్ రచనలకు ఎందుకు పరిమితమవుతున్నారు అంటూ రోహిణీప్రసాద్ గారు గత కొంత కాలంగా నాకు ప్రేరణనిస్తూ, ప్రోత్సహిస్తూ, మందలిస్తూ హెచ్చరించేవారు. బ్లాగ్ రచనలు కొన్నాళ్లు ఆపివేయండంటూ కూడా నాపై విసుక్కున్నారు.

కాని ఆయనకు నివాళి పలకడం ద్వారానే మెయిన్‌స్ట్రీమ్ పత్రికా రచనలోకి అడుగుపెట్టవలసి ఉంటుందని నేను ఎన్నడూ ఊహించలేదు. జీవితంలో ఎన్నడూ చూడని, ఇక చూడలేని ఈ గురుసమానుడికి, ప్రేరణకర్తకు ఈ విధంగా గురుదక్షిణ ఇవ్వాల్సి ఉందని ఎన్నడూ అనుకోలేదు.

………………………..

అలాగే.. ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అరుణపప్పు గారు గతంలో ప్రచురించిన రోహిణీ ప్రసాద్ గారి జ్ఞాపకాలను ఇక్కడ చూడగలరు.

మనిషి సజీవంగా ఉండాలంటే బహుముఖంగానే ఉండాలని నమ్మే రోహిణీప్రసాద్‌ గారు సంగీతం, సాహిత్యం, శాస్త్రం వంటి విభిన్న రంగాల్లో ఇంత వైవిధ్య పూరితమైన కృషి చేయడం ఎలా సాధ్యమో హృద్యంగా ఇక్కడ చెప్పారు.

“…ఇన్ని డైమెన్షన్‌లు ఎట్లా అంటే  ఏదో ఒకదానిలో తలమునకలై కూరుకుపోవడం, తీరికలేనట్లు ఉండటం, ఎంత జ్ఙానం సంపాదించినా ఇంకా మిగిలే వుందని అనుకోవడం… ఎవరి భావనలు వారివేకదా! అందుకే సైన్స్‌ వ్యాసాలు రాసే నేను, కాలచక్రం పత్రికకూ ఎడిటర్‌గా వుండగలిగాను. భౌతిక విషయాలను మాత్రమే నమ్మే నేను సాయి చాలీసా రాశాను.”

“….పరమాణు శాస్త్రవేత్తనైన నేను జీవశాస్త్రం వ్యాసాలు రాయాలనుకోవడం మరో మలుపు. అదీ ఆసక్తి వున్న సాధారణ మనిషికి బోధపడే రీతిలో రాయాలనుకోవడం … సాహసమే. అయితే నేను దానిలో విజయం సాధించాననే అనుకుంటాను. గతితార్కిక భౌతికవాదాన్ని నమ్మడంతో, ప్రజలందరూ బహుముఖ పార్శ్వాలను కలిగివుండే సమాజం సాధ్యమేనని నమ్మడంతో ఇప్పుడు మన పని ముగిసిపోవడంలేదు. దానిని ఆచరిస్తూ, పదిమందికీ చెప్పడమనే అవసరం రోజురోజుకూ మరింత విస్పష్టంగా కళ్ళముందు గోచరిస్తోంది. నా దారి నాకు స్పష్టంగా కనబడుతూనే వుంది.’’

తన బాల్యంలో  విద్యా, ఉద్యోగ జీవితంలో మిగిల్చుకున్న అరుదైన జ్ఞాపకాలను హృద్యంగా ఆయన మాటల్లోనే వినాలంటే కింది లింక్ చూడండి. ఇది కూడా గతంలో ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది.

రోహిణీప్రసాద్ గారికి నివాళి
http://arunapappu.wordpress.com/2012/09/10/%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A3%E0%B1%80%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D-%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B5/

 

RTS Perm Link

మా నాన్న విషాదమరణం – కొడవటిగంటి కార్తీక్

September 9th, 2012

ప్రియమైన మిత్రులకు,
మా నాన్న డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు నిన్న మధ్యాహ్నం ముంబయ్‌లో కన్నుమూశారనే వార్తను మీకు తీవ్ర విషాదంతో తెలియజేస్తున్నాను. కొంత కాలంగా అస్వస్థతతో ఉంటున్న ఆయన కొద్దిరోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.

నాన్న శ్రేయోభిలాషులు, రేపు  (సెప్టెంబర్ 10) ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్యలో ఆయన భౌతిక దేహాన్ని ముంబై, వడాల ఈస్ట్ లోని లాయిడ్స్ ఎస్టేట్‌లో కడసారి దర్శించవచ్చు. తర్వాత ఆయన భౌతికదేహాన్ని గ్రాంట్ మెడికల్ కాలేజీకి తీసుకెళతాము. ఆయన కోరిక మేరకు ఆయన భౌతిక దేహాన్ని వైద్య అధ్యయనం, పరిశోధనలకు గాను సమర్పిస్తున్నాము.

మా నాన్నగారికి మీరు ఇన్నాళ్లుగా అందించిన తోడ్పాటుకు మా కుటుంబం తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

ఇన్నాళ్లుగా మీ అందరితో పరిచయాలు, సహ సంబంధాలను ఆయన ఎంతో ఆస్వాదించారు. మీతో పరిచయం తనను జ్ఞానవంతుడిగా చేసిందని ఆయన భావించేవారు.

ఒక రచయితగా, సంగీతకారుడిగా, శాస్త్రవేత్తగా, హేతువాదిగా ఆయన వంటి వ్యక్తి మళ్లీ పుట్టడానికి చాలా కాలం పడుతుందని మీ అందరి తరపున చెప్పాలనుకుంటున్నాను.

మరోసారి, మా నాన్న, మా కుటుంబం యొక్క శ్రేయోభిలాషులుగా ఉంటూ వస్తున్న మీ అందరికీ మేము వినమ్రంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.

ధన్యవాదాలతో,
కార్తీక్ కొడవటిగంటి.

Karthik Kodavatiganti
2303-D, Lloyds Estate,
Wadala East
Mumbai 400037
Mobile: +91-98190-44855
Home: +91-22-2414-3274

Email: k_karthik@outlook.com

 

కార్తీక్ గారు,

నాన్నగారి ఫోన్ నంబర్ తప్పితే ఇన్నాళ్లుగా మీతో కాని  లలిత గారితో కాని నేరుగా సంభాషించే వీలు లేకపోయింది. ‘శరీరం చాలా బాధపెడుతున్నా తన మనస్సు, బుద్ధి చాలా చురుకుగా ఉందం’టూ ముంబై ఆసుపత్రిలో మీ మాతృమూర్తి లలితగారు పది రోజుల క్రితం ఆయన ఫోన్ నుంచి చెప్పిన మాటలే ఆయన తరపున నాకు అందిన చివరి సందేశం.

చందమామలో నా ఉద్యోగ జీవితం గడిపిన గత మూడున్నరేళ్ల కాలంలో ఆయనతో పరిచయం నా ఆలోచనలను, జీవితాన్ని కూడా ప్రకాశవంతం చేసింది. పల్లెటూరి నుంచి జీవిక కోసం వచ్చిన వారు మహానగరాల్లో ఎదుర్కొనే జీవన సంక్లిష్టతలను ఆయన ఎంతో వివరంగా విశ్లేషిస్తూ ధైర్యం చెప్పేవారు.

అమెరికా నుంచి, ముంబై నుంచి, హైదరాబాద్ నుంచి గత మూడేళ్లుగా ఎన్నిసార్లు ఆయన ఫోన్ ద్వారా సంభాషించారో, చాట్ చేశారో, మెయిల్స్ పెట్టారో లెక్క తెలీటం లేదు. దురదృష్ట మేమిటంటే రెండు వారాల ముందు ఆయనను, లలితగారిని, వరూధినిగారిని తొలిసారిగా కలిసే అవకాశం నాకు నేనుగా పొగొట్టుకున్నాను.

శారీరకంగా చాలా ఇబ్బంది పడుతున్నా సాయంత్రం నాలుగు గంటల వరకు అమీర్ పేటలో బంధువుల ఇంటిలో వేచి చూశానని ఆయన చెప్పినప్పుడు నేను క్షమాపణ చెప్పాను కాని ఆయనను ఇక ఎన్నటికీ చూడలేనని కనీసంగా కూడా ఊహించలేకపోయాను.

సెప్టెంబర్ రెండోవారంలో హైదరాబాద్‌కు వస్తాను కాబట్టి ఈసారి తప్పక కలుస్తానని నేరుగా నాన్నగారి ఇంటికే వచ్చి కలుస్తానని ఆయనకు చెప్పాను. కాని ఇక సాధ్యం కాదని, ఆయన అప్పటికే జీవితంలో చివరి చలనం వైపు అడుగులేస్తున్నారని ఊహించలేకపోయాను.

హైదరాబాద్‌కు వచ్చి కూడా ఆయనను చూడలేకపోవడం ఘోరమైన తప్పిదం. కాని ఇలా జరుగుతుందని ఎవరు ఊహించగలరు?

ఇంగ్లీష్ చదవలేని తెలుగు వారికి తాను విస్తృతంగా పరిశీలిస్తున్న శాస్త్ర, సాంకేతిక విషయాలను, నూతన ఆవిష్కరణలను సులభశైలిలో పుస్తకాల రూపంలో అందివ్వాలనే మహా సంకల్పం ఆయనను అవిరామ శ్రామికుడిగా మార్చింది. ఆయన ఆయుర్దాయాన్ని కూడా ఈ మహాసంకల్ప భారమే క్షీణింపజేసిందేమో..

తండ్రి కుటుంబరావు గారి రచనా వారసత్వాన్ని కొనసాగించడంలో అత్యంత వేగంతో అక్షరాలను కూర్చి రచనలు చేయడంలో ఆయనది అనితరసాధ్యమైన మార్గం.

నండూరి రామమోహన్ రావు గారి  సైన్స్ రచనలు తర్వాత శాస్త్ర విషయాలను ఇంత తేలికగా, ఇంత హేతుపూర్వకంగా తెలుగువారికి అందించిన నాన్నగారి మేధస్సు ఇంత త్వరగా ఆలోచించడాన్ని ఆపివేయడం వ్యక్తులుగా మీ కుటుంబానికి, మిత్రులకు ఎంత విషాదకరమో, తెలుగు  పాపులర్ సైన్స్ రచనలకు అంత నష్టకరమైన విషయం కూడా.

తెలిసిన విషయాలను పదిమందికి విస్తృతస్థాయిలో చెప్పడానికి పత్రికలు ముఖ్యమార్గమని, ఎక్కువమంది పాఠకులకు మన భావాలను చెప్పగలిగే అవకాశాలను ఎన్నటికీ వదులుకోవద్దని ఆయన పదే పదే చెప్పేవారు. చివరి రోజుల్లో ఆయన ఈ విషయమై నన్ను మందలిస్తూ పంపిన చివరి ఇమెయిల్‌ని ఇక మరువలేను.

నాలుగేళ్ల స్వల్పకాలంలో ‘విశ్వాంతరాళం’, మానవ పరిణామం, ‘జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం’, ‘జీవకణాలు -నాడీ కణాలు,’ ‘ప్రకృతి పర్యావరణం,’ ‘అణువులు’, ‘దేవుడు చేసిన మనుషులు’ వంటి ఎనిమిది పాపులర్ సైన్స్ పుస్తకాలు రాశారు. శాస్త్ర సంబంధ రచనలు అంటే పెద్దగా ఆసక్తి చూపని తెలుగు పాఠకలోకంలో తెలుగు ప్రచురణల చరిత్రలో అవి ఎంత సంచలన విజయం సాధించాయో ఇవ్వాళ అందరికీ తెలుసు.

మూడేళ్ల స్వల్ప పరిచయంలో ఆయన నా పట్ల పితృసమాన వాత్సల్యాన్నే ప్రదర్శించారు. ఈ కష్టకాలంలో మీరు ఒకరికొకరు తోడుగా, ధైర్యంగా ఉంటారని, అమ్మను, నాన్నమ్మను జాగ్రత్తగా చూసుకుంటారని కోరుకుంటున్నాను. తండ్రిగా, విజ్ఞానవేత్తగా, హేతుచింతనకారుడిగా ఆయన అందించిన ప్రేరణే మీ కుటుంబానికంతటికీ మనోధైర్యాన్ని ఇస్తుందని భావిస్తున్నాను.

తన శరీరాన్ని మట్టిలో కలపటం కాకుండా వైద్య పరీక్షలకు, మానవ శ్రేయస్సు కోసం అందివ్వాలన్న ఆయన కోరికను మీరు నెరవేరుస్తున్నందుకు ఈ విషాద సమయంలో కూడా ఒకింత సంతోషంగా ఉంది. ఒక శాస్త్రజ్ఞుడికి, హేతువాదికి, తండ్రికి మీరు మీ కుటుంబం ఇస్తున్న ఈ నివాళికంటే మించినది ఏదీ ఉండదు.

మీరు తండ్రిని పోగొట్టుకున్నారు.  కాని జీవిక కోసం చెన్నయ్ నుంచి హైదరాబాద్‌కు మారాలనుకుంటున్న నాకు ‘మనం దేంట్లోనైనా పనిచేయగలం, కష్టపడగలం, కొత్త విషయాలను నేర్చుకోగలం, భాగ్యనగరంలో అనేక అవకాశాలున్నాయి, ధైర్యంగా రండి’ అంటూ చివరి వరకూ ప్రోత్సాహాన్ని, ప్రేరణను  అందించిన ఒక గొప్ప సహాయ హస్తాన్ని, ఆప్యాయ స్వరాన్ని నేను శాశ్వతంగా పోగొట్టుకున్నాను.

ఇన్నాళ్లుగా ఏ సమయంలో అయినా సరే  కాల్ చేయగానే ‘రాజుగారూ బాగున్నారా’ అంటూ పలుకరించిన నాన్నగారి మొబైల్ ఇక మూగపోతుందన్న వాస్తవాన్ని భరించలేకున్నాను.

ప్రస్తుతం నాకున్న ఆర్థిక వనరుల పరిమితి కారణంగా చివరి చూపుకు కూడా ముంబైకి నేను రాలేకపోతున్నందుకు క్షమించండి.

మీరు ఈ మెయిల్‌‍లో ఇచ్చిన మొబైల్ నంబర్‌కు కాల్ చేయాలంటే కూడా సాహసించలేకపోతున్నాను.

మీరు నిబ్బరంగా ఉంటారని, ఉండాలని కోరుకుంటూ..
రాజశేఖరరాజు.
చెన్నయ్
7305018409

krajasekhara@gmail.com

…………………….

కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి కుమారుడు కార్తీక్ తమ నాన్నగారి మిత్రులకు, శ్రేయోభిలాషులకు కాస్సేపటిక్రితం ఈమెయిల్ ద్వారా కింది సమాచారం పంపారు. వారు పంపిన ఇంగ్లీష్ ఇమెయిల్ పాఠాన్ని ఇక్కడ చూడవచ్చు.

Sad demise – Kodavatiganti Rohiniprasad

Dear Friends

It is with deep sorrow that I inform you of the passing of my father, Dr Kodavatiganti Rohiniprasad, yesterday afternoon in Mumbai. He had been ill for a brief while and was hospitalised during his last days.

His well wishers can pay their last respects tomorrow morning (10th Sep) between 9AM – 10.30 AM at Lloyds Estate, Wadala East, Mumbai. Thereafter he will be taken to Grant Medical College where his body will be donated for medical study and research, as per his wish.

On behalf of our family I would like to thank you all for your support to my father. He thoroughly enjoyed his interactions with you all and believed that it enriched him.

I think I can say on behalf of you all that a person of his caliber – Writer, Musician, Scientist and Rational Thinker – may not be found for a long time to come.

Once again, we sincerely thank you for being well wishers of my father and our family.

Best Regards,

Karthik Kodavatiganti
2303-D, Lloyds Estate,
Wadala East
Mumbai 400037
Mobile: +91-98190-44855
Home: +91-22-2414-3274

Email: k_karthik@outlook.com

RTS Perm Link

కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ రచనల సూచిక:

September 8th, 2012

శాస్త్రీయ సంగీతం, సినీ సంగీతం, సినిమా, సంస్కృతి, విశిష్ట వ్యక్తులు, చందమామ జ్ఞాపకాలు వంటి పలు అంశాలపై 2000 సంవత్సరం మార్చి నెల నుంచి  2012 జనవరి వరకు కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సుప్రసిద్ధ ఆన్‌లైన్ పత్రిక ఈమాట.కామ్‌లో ప్రచురించిన రచనల సూచికను ఒకేచోట ఇక్కడ చూడగలరు.

ఒక రచయిత తమ కోసం పంపిన రచనలన్నింటి వివరాలను ఒకేచోట చేర్చి అందరికీ అందించిన ఈమాట.కామ్ వారికి కృతజ్ఞతలు.

మిత్రులు రోహిణీ ప్రసాద్ గారు గత నాలుగేళ్లుగా ఎపివీక్లీ.కామ్‌లో క్రమం తప్పకుండా సైన్స్ రచనలను ప్రచురిస్తూ వస్తున్నారు. ఏ ఒక్క వారం కూడా ఆయన తన రచనను పంపకుండా ఆపింది లేదు.

అలాగే వీక్షణం, ప్రజాసాహితి, అరుణతార వంటి ప్రత్యామ్నాయ పత్రికలలో, ఆంధ్రభూమి, హెచ్ఎంటివి వారి ఇంగ్లీష్ పత్రిక “The Hans India”లో,  ప్రజాకళ.ఒఆర్‌జి, ప్రాణహిత.ఒఆర్‌జి వంటి వెబ్ పత్రిలలో అసంఖ్యాకంగా రచనలు చేస్తూ వచ్చారు. చందమామ  పత్రికకు కూడా ఆయన కథలు, రచనలు 2009 నుంచి 2011 వరకు పంపారు. దురదృష్టవశాత్తూ -?- చందమామ ఆయన సేవలను కొనసాగించలేకపోయింది. 2009 చివరి నుంచి 2010 మధ్య వరకు తెలుగు మినహా ఇతర భాషల చందమామ అనువాదకులకోసం ఆయన ఇంగ్లీషులోకి చేసిన తెలుగు కథల అనువాదాలు సుప్రసిద్ధాలు.

అలాగే 1947 నుంచి 53 వరకు చందమామ పాతసంచికలలోని కథలను అన్నిటినీ ఇంగ్లీషు లోకి మార్చే బృహత్తర ప్రాజెక్టులో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. 1947-1970 వరకు తెలుగు చందమామ సంచికలలోని కథలను ఇంగ్లీషులోకి మార్చాలని తలపెట్టిన ఈ ప్రాజెక్టు కూడా చందమామ పూర్తి చేయలేకపోయింది.

తండ్రి కొడవటిగంటి కుటుంబరావు గారి సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని అక్షరాలా కొనసాగించిన అరుదైన రచయిత రోహిణీ ప్రసాద్ గారు. ఇటీవలే ముంబైలోని తమ స్వంత ఇంటిలోనుంచి కుటుంబరావుగారికి చెందిన దాదాపు వెయ్యి పుస్తకాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నాన్న తను కొన్న పుస్తకాన్ని దేన్నీ చదవకుండా వదిలిపెట్టలేదని. ఆయన కామెంట్లు, గీతలు లేని పుస్తకం అంటూ లేదని, పుస్తకం కొంటే, తన వద్దకు పుస్తకాలు వస్తే  తప్పకుండా చదివిన అలవాటును ఆయన చివరివరకూ కొనసాగించారని ఇటీవలే ఆయన నాతో పంచుకున్నారు.

కుటుంబరావుగారు అధ్యయనం చేసిన అపురూప పుస్తకాలను వేటినీ పోగొట్టవద్దని, అమ్మేయవద్దని వీలైతే సుందరయ్య విజ్ఞానకేంద్రం వంటి పుస్తక సంరక్షణ కేంద్రాలకు వాటిని అందించమని కోరాను. ఆయన జీవన సహచరి లలిత గారు,  అబ్బాయి కార్తీక్, అమ్మాయి యామిని ఆయన సంరక్షించిన పుస్తకాలను భద్రపర్చవలసిన అవసరం ఉంది.

ఆన్‌లైన్ పత్రిక ఈమాట.కామ్‌లో ప్రచురించిన రచనల సూచికను ఒకేచోట ఇక్కడ చూడగలరు.

కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ రచనల సూచిక:

http://eemaata.com/em/?page_id=28&aa=%E0%B0%95%E0%B1%8A%E0%B0%A1%E0%B0%B5%E0%B0%9F%E0%B0%BF%E0%B0%97%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF+%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A3%E0%B1%80%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D%E2%80%8C

 

1. ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం

జనవరి 2012 » వ్యాసాలు

2. కినిమా పత్రికనుంచి

జనవరి 2012 » వ్యాసాలు

3. కినిమా మాసపత్రిక: హాస్యనటుల అనుభవాలు

నవంబర్ 2011 » వ్యాసాలు

4. భావతరంగాల సింధువు: భైరవి

జూలై 2011 » వ్యాసాలు

5. కృష్ణం వందే జగద్గురుం

జనవరి 2010 » వ్యాసాలు

6. కొడవటిగంటి కుటుంబరావు రచనలలో కుటుంబ నేపథ్యం

నవంబర్ 2009 » వ్యాసాలు

7. పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం

సెప్టెంబర్ 2009 » వ్యాసాలు

8. వ్యాసానుబంధం (గుర్రం జాషువా పాపాయి పద్యాలు)

అనుబంధం

9. బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు

జనవరి 2009 » వ్యాసాలు

10. బాలమురళీకృష్ణ సంగీతం

నవంబర్ 2008 » వ్యాసాలు

11. బాలమురళీకృష్ణ

సెప్టెంబర్ 2008 » వ్యాసాలు

12. 88 ఏళ్ళ యువకులు

జూలై 2008 » వ్యాసాలు

13. హిందోళ రాగం – అనుబంధం

మే 2008 » వ్యాసాలు

14. కల్యాణి రాగం – అనుబంధం

మార్చి 2008 » వ్యాసాలు

15. సర్వోత్తమ సితార్ విద్వాంసుడు ఉస్తాద్ విలాయత్‌ఖాన్

జనవరి 2008 » వ్యాసాలు

16. హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు

నవంబర్ 2007 » వ్యాసాలు

17. సత్యజిత్ రాయ్ – ఓ చిన్న ఉపోద్ఘాతం

వ్యాసాలు

18. కీబోర్డ్ మీద రాగాలు

సెప్టెంబర్ 2007 » వ్యాసాలు

19. గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్ ఖాన్

జూలై 2007 » వ్యాసాలు

20. జుగల్‌బందీ కచేరీలు

మే 2007 » వ్యాసాలు

21. ఓ.పీ.నయ్యర్‌

మార్చి 2007 » వ్యాసాలు

22. సంగీతంతో కుస్తీ

సెప్టెంబర్ 2006 » వ్యాసాలు

23. నౌషాద్‌

జూలై 2006 » వ్యాసాలు

24. బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు

మే 2006 » వ్యాసాలు

25. మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి

మార్చి 2006 » వ్యాసాలు

26. “చందమామ” జ్ఞాపకాలు

జనవరి 2006 » వ్యాసాలు

27. హిందూస్తానీ సంగీతం

నవంబర్ 2005 » వ్యాసాలు

28. హా (స్యం) సం (గీతం)

సెప్టెంబర్ 2005 » వ్యాసాలు

29. సంగీతరావుగారి చిన్ననాటి సంగతులు

జూలై 2005 » వ్యాసాలు

30. ఘంటసాల ప్రతిభకు మచ్చుతునక “కుంతీకుమారి”

మే 2005 » వ్యాసాలు

31. సార్థక నామధేయుడు సంగీతరావు

మార్చి 2005 » వ్యాసాలు

32. తబలా “మాంత్రికుడు” అహ్మద్‌జాన్‌ థిరక్వా

జనవరి 2005 » వ్యాసాలు

33. సంగీతానికి స్పందన

నవంబర్ 2004 » వ్యాసాలు

34. వాద్య సంగీతానికి అద్భుతదీపం వెలిగించిన అల్లాఉద్దీన్‌ఖాన్‌

జూలై 2004 » వ్యాసాలు

35. అత్యుత్తమ హిందుస్తానీ గాయకుడు బడేగులాం అలీ ఖాన్‌

మార్చి 2004 » వ్యాసాలు

36. సినిమా పాటల్లో తాళం నడకలు, విరుపులు

జనవరి 2004 » వ్యాసాలు

37. పాటల్లో లయవిన్యాసాలు

నవంబర్ 2003 » వ్యాసాలు

38. అసామాన్య సంగీతదర్శకుడు సి.ఆర్.సుబ్బరామన్

జూలై 2003 » వ్యాసాలు

39. గురువుల సంస్మరణ కొనసాగిస్తున్న గాయని ప్రభా అత్రే

మే 2003 » వ్యాసాలు

40. సితార్‌,సుర్‌బహార్‌ల సవ్యసాచి ఉస్తాద్‌ ఇమ్రత్‌ఖాన్‌

మార్చి 2003 » వ్యాసాలు

41. శ్రుతిలయల నందనవనం

జనవరి 2003 » వ్యాసాలు

42. సంగీతరస పానశాల ఘంటసాల

మార్చి 2002 » వ్యాసాలు

43. రాగాలూ స్వరాలూ

మార్చి 2001 » వ్యాసాలు

44. మన శాస్త్రీయ సంగీతం

జూలై 2000 » వ్యాసాలు

45. శ్రుతిమించిన రాగం

మే 2000 » వ్యాసాలు

46. ఓహో యాత్రికుడా..

మార్చి 2000 » వ్యాసాలు

RTS Perm Link

కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు ఇకలేరు.

September 8th, 2012

ఇప్పుడే అందిన దుర్వార్త.

అణుధార్మిక శాస్త్రవేత్త, శాస్త్ర, సంగీత, సాహిత్య రంగాలలో సుపరిచితులు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు కాసేపటికి ముందు కన్నుమూశారని ఇప్పుడే తెలిసింది. గత పది రోజులుగా అస్వస్థులై ముంబైలో జెస్లోక్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ శనివారం మధ్యాహ్నమే కన్నుమూశారని విశ్వసనీయంగా తెలిసింది. -ఉదయం 11 గంటలకు పోయారని నిర్ధారించబడింది-  దీర్ఘకాలంగా డయాబెటిక్‌తో ఇబ్బందిపడుతున్న ప్రసాద్ గారికి గత కొద్ది రోజులుగా కిడ్నీ సమస్య తీవ్రమై కోలుకోలేకపోయారు. ఈరోజు ఉదయమే ఆయనకు అమర్చిన వెంటిలేటర్ తీసివేశారని తెలుస్తోంది.

సరిగ్గా రెండువారాలకు ముందు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన్ను కలిసే అవకాశం కొద్దిలో తప్పిపోయింది. ప్రత్యక్షంగా చూడలేకపోయినప్పటికీ, గత మూడు సంవత్సరాలుగా ఆయనతో నాకు వ్యక్తిగతంగా, భావజాల పరంగా కూడా అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. చందమామ కథలకు ఆర్నెల్లపాటు ఆయన చక్కటి అనువాదాలను విస్తృత స్థాయిలో చేశారు కూడా. చివరి దశలో చందమామకు కథలు, సైన్స్ రచనలు పంపారు.

శాస్త్రరంగంలో తాజా ఆవిష్కరణలు, శాస్త్ర భావనల గురించి 50 పుస్తకాలు రాయాలని ఆయన సంకల్పించారు. గత రెండేళ్లుగా ‘విశ్వాంతరాళం’, మానవ పరిణామం, ‘జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం’, జీవకణాలు -నాడీ కణాలు, ప్రకృతి పర్యావరణం, ‘అణువులు’, ‘దేవుడు చేసిన మనుషులు’ వంటి ఎనిమిది పాపులర్ సైన్స్ పుస్తకాలు రాశారు. ఇవి సంచలన విజయం సాధించాయి కూడా. కొన్ని రచనలు మూడు నాలుగు ముద్రణలు కూడా పొందాయి.

వివిధ పత్రికలు, ఆన్‌లైన్ మీడియాకు గత అయిదారేళ్లుగా ఈయన విస్తృతంగా రచనలు పంపుతున్నారు. సైన్స్, సంగీతం, సాహిత్యం మూడింటిలోనూ ప్రావీణ్యత సాధించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.

ఆయన గురించి మరిన్ని వివరాలు త్వరలో…

శాస్త్ర విషయాలపై ఆయన రాసిన గొప్ప రచనలలో ఒకటి ఇక్కడ చూడండి.

చావుపుటకలు – డా.కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

http://prajakala.org/mag/2008/02/krp_feb_essay

 

RTS Perm Link