మన గుమ్మడి : మన తిమ్మరుసు

January 27th, 2010

MahamantriThimmarusu_400-300

ఈటీవీలో రాత్రి 11 గంటలకు మహామంత్రి తిమ్మరుసు చిత్రం ప్రసారం చేశారు. గుమ్మడి వేంకటేశ్వరరావు గారు మనమధ్య లేరు. ఆయన జీవంపోసిన మహామంత్రి తిమ్మరుసు పాత్ర ఉంది. అది చూసిన ప్రతిసారీ రాజనీతికి సంబంధించిన దుష్టపాఠాలను చెబుతూనే ఉంది. ఇంకో అయిదు వందలేళ్లు గడిచినా తిమ్మరుసు పాత్రకు చరిత్రలో మసక అంటదు. మాసిపోదు కూడా..

రాజుల్ మత్తులు, వారి సేవలు నరకప్రాయంబు… అంటూ పద్యం. పద్య సాహిత్యం సామాజిక దౌష్ట్యాన్ని నిరసించలేదని చెప్పిందెవరు?

ఈ పద్యం చరిత్రలో ఏ సందర్బంలో రాయబడిందో తెలీదు కానీ, ఒక మహాసామ్రాజ్యాన్ని తన యుక్తి, చతురతల బలం మీద నిర్మించి పెట్టిన మహామంత్రిని ఆయన అడుగులకు మడుగులొత్తిన మహారాజే అనుమానించిననాడు గదా తిమ్మరుసు జీవన్మృతుడయింది.

దక్షిణభారత దేశ చరిత్రలో ఓ స్వర్ణయుగానికి కారణ భూతుడైన మహామాత్య్డు తాను ఉలిపెట్టి చెక్కిన కృష్ణదేవరాయలే తనను అనుమానించిన క్షణంలో కదా విజయనగర చరిత్ర అంతానికి నాంది జరిగింది. దశాబ్దాలుగా ప్రోది చేసుకున్న ఓ మహా విశ్వాసానికి ఇంత అపచారం జరిగినప్పుడు కదా ఎదురేలేని విజయనగర సామ్రాజ్యం బీటలు వారిపోయింది.

గుమ్మడి గారు తప్ప మరెవరినైనా మహామంత్రి తిమ్మరుసు పాత్రకు న్యాయం చేయగలిగేవారా? ఆయన నటించిన 500 పైగా సినిమాలు మొత్తంగా లేకుండా పోయినా సరే మహామంత్రి తిమ్మరుసు చిత్రం ఒక్కటి నిలిస్తే చాలు ఆయన పేరు ఆచంద్రతారార్కమై ఉంటుంది.

ఇది చరిత్ర కాకపోవచ్చు. పుక్కిటి పురాణం కావచ్చు. చారిత్రక ఆధారాలకు ఈ కథలో తావు లేకపోవచ్చు. కానీ నమ్మినవారిని నామరూపాలు లేకుండా చేసే క్రూరాత్ములు 500 సంవత్సరాల తదుపరి చరిత్రలోనూ పొడసూపుతున్నప్పుడు, ఇలాంటివి జరగవని, జరగలేదని మనం భావించడానికి కూడా ఆస్కారం లేదు.

ఇద్దరు మనుషుల సంబంధంలో, ఒక పనిలో, ఒక వ్యవస్థ నిర్మాణంలో, ఓ సామ్రాజ్య వైభవంలో కూడా వ్యక్తుల మధ్య విశ్వాసం అనేది అంతరిస్తే అక్కడ మానవాత్మ అనేది ఇక ఉండదు. అటు రాయలు, ఇటు మహామంత్రి తిమ్మరుసు ఈ సత్యాన్ని ఎంత చక్కగా చాటిచెప్పారు.

గుమ్మడి గారూ, మీరు లేని లోకంలో మేం ఉంటున్నాం. ఓ ‘మహామంత్రి తిమ్మరుసు’లో ఓ ‘పండంటి కాపురం’లో ఓ ‘మాయాబజార్‌’లో మిమ్మల్ని చూసుకుంటా రాజరికపు పాఠాలను నేర్చుకుంటాం. మీరు వదిలిపెట్టి వెళ్లిన పాత్రల్లో మిమ్మల్ని చూసుకుంటూ పాత్రలో ఒదిగిపోవడం అంటే ఏమిటో తెలుసుకుంటూ బతికేస్తాం.

మీరు లేరని ఎనరన్నారు? పౌరాణిక, జానపద, చారిత్రిక, సాంఘిక చిత్రాలన్నిటిలోనూ పాత్రపోషణ. అత్యంత విరుద్ధమైన వసిష్ట, విశ్వామిత్ర పాత్రల ధారణ. దశరధునిగా, భీష్మునిగా, ధర్మరాజుగా, కర్ణునిగా, సత్రాజిత్, బలరాముడు,భృగుమహర్షి, మొదలైన పౌరాణిక పాత్రలకు జీవం పోసిన మూర్తిమత్వం.

మన చరిత్రలో గుమ్మడి అనే పెద్దాయనను ఇలాగే తల్చుకుందాం. తెలుగు సినిమాలో అప్పటికే స్టార్ల కాలం ప్రబలిన కాలంలో హీరోలను, వారి స్టార్‌డమ్‌లను అధిగమించి తన పేరునే చిత్రం టైటిల్‌గా మార్చుకోగలిగిన గొప్పపాత్రలు ధరించిన మేటినటుడిగా ఆయనను గుర్తుంచుకుందాం.

ఆ సినిమాలో చివరి పాట. పాషాణ హృదయాలను సైతం కరిగిస్తూ ఓ వేగు పాడిన పాట ఇది.

చరిత్ర ఎరుగని మహాపాతకము మా దేశానికి పట్టినదా

ఆంధ్రదేవా వెంకటేశ్వరా, విరూపాక్షస్వామీ

ఉపకారమె ఒకనేరమా అపకారమె ప్రతిపలమా

ఇదే నీ విధానమా మౌనమె నీ సమాధానమా

చరిత్ర ఎరుగని మహాపాతకము మా దేశానికి పట్టినదా

నాల్గు పాదముల ధర్మము నడిచే రోజు నేటితో తీరినదా

చరిత్ర ఎరుగని మహాపాతకము మా దేశానికి పట్టినదా

గుమ్మడి గారూ, మీరే చెప్పాలి. కోల్పోయిన మీ కళ్లు చెప్పే భారత రాజనీతి చరిత్ర మర్మం ఏమిటి? నాల్గు పాదముల ధర్మము నడిచే రోజు నేటితో తీరినదా!

RTS Perm Link

తెలుగు సినిమా విశ్వరూపం “మాయాబజార్”

January 11th, 2010

దాదాపు 30 ఏళ్ల క్రితం రాయచోటిలో ఇంటర్ చదువుతున్న రోజుల్లో -1978-79- ఈనాడు ‘సితార’ సినీపత్రికలో ఓ సినిమాను సమీక్షిస్తూ ఇలా ప్రకటించారు. ‘ఇప్పటికి పాతికేళ్ల క్రితం జన్మించిన తెలుగువారు ఎవరయినా ఈ సినిమా గనుక చూడకపోయి ఉంటే అలాంటి వాళ్లు తెలుగు వారు కాదు.’ ఒక్కసారిగా నాకు, మా రూమ్మేట్లకు భయం పుట్టుకుంది. ‘ఇదేమి ఖర్మరా స్వామీ సినిమా చూడకపోతేనే తెలుగువాళ్లం కాకపోతామా’ అని అప్పట్లో మా చిన్నిబుర్రలకు అనిపించింది.

కానీ సితారలో ఆ చిత్ర సమీక్ష పూర్తిగా చదివాక ఆ వాక్యం నిజమే అనిపించింది. పాత సినిమాలంటే చెవికోసుకునే మేం రాయచోటి సినిమా హాళ్లలో అడపా దడపా వచ్చే వాటిని క్రమం తప్పకుండా పలకరించేవాళ్లం. కానీ పల్లెటూర్లో ఉంటూ హైస్కూలు చదువులో ఉన్నప్పుడు కాని, రాయచోటిలో డిగ్రీ చదివినప్పుడు కాని ఆ సినిమాను చూసే అవకాశం నాకు రాలేదు. అది ఎలా తప్పిపోయిందో నాకు తెలీదు. తర్వాత పీజీ చదువుల కోసం తిరుపతి వచ్చినప్పుడు కాని ఆ సినిమా చూసే అవకాశం రాలేదు. అలా పాతికేళ్ల వయసు లోపే ఆ సినిమాను చూసి నేనూ తెలుగువాడినే అని గర్వంగా ఫీలయిపోయాను. అది ఒక చరిత్ర.

ఆ సినిమా ఏదో ఇంకా మీకు తట్టలేదా? ఆ చిత్రం పేరు మీకు ఇంకా తట్టకపోయి ఉంటే మీరూ తెలుగు వారు కారనే చెప్పాలి మరి..

భయపడకండి.

అది… “మాయాబజార్”

శశిరేఖా పరిణయం అని కూడా చెప్పుకునే ‘మాయాబజార్’

అద్భుతం అనే మాటకు అసలైన నిర్వచనంగా నిలిచిపోయిన చిత్రం

“ఇది ప్రపంచ చలన చిత్ర చరిత్రకు మా వంతు చేర్పు’  అని తెలుగోడు సగర్వంగా సమర్పించిన అజరామర చిత్రం.

అది మహాభారతంలో జరగని ఒక కల్పిత గాథ ఆధారంగా తెలుగువారు రమణీయంగా అల్లుకున్న కమనీయ కథా చిత్రం.

ఇది ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యుత్తమమైన స్క్రీన్ ప్లే అని పెద్దలు కొనియాడిన మేటి చిత్రం.

షావుకారు, పాతాళభైరవి, మిస్సమ్మ, జగదేకవీరుని కథ, గుండమ్మ కథ లాంటి జనరంజక చిత్రాలను నిర్మించిన విజయా సంస్థ తెలుగు సినీ అభిమానులకందించిన మరొక అపురూప కళాఖండం.

స్క్రీన్‌ప్లే, సంగీతం, సాహిత్యం, కళాదర్శకత్వం, ఛాయాగ్రహణం, స్పెషల్ ఎఫెక్టులు, మాటలు, పాటలు, గానం, నటన, అన్నిటికంటే మించి మండుటెండలో పండువెన్నెలను సృష్టించిన విజయా వారి వెన్నెల.. వీటన్నిటి మహాద్భుత విశ్వరూపం మాయాబజార్.

దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఇంత చక్కటి పొందికతో అమరిన, ఒదిగిపోయిన చిత్రం ప్రపంచ చలన చిత్ర చరిత్రలో అరుదుగా జరుగుతూంటుంది. ఈ ఘనతను మన తెలుగు సినిమా  50 ఏళ్ల క్రితమే సాధించిందంటే.. అది తెలుగువారికి సంబరం కలిగించదా..

అందుకే గత యాభై ఏళ్లుగా తెలుగు వారు ఈసినిమాను విరగబడి చూస్తూనే ఉన్నారు. ఈ సినిమా ఇప్పుడు విడుదలైనా సరే హాళ్లు, పల్లెటూరి టెంట్‌లు నిండిపోతాయంటే మాయాబజార్ సత్తా ఏమిటో అర్థం అవుతుంది.

ప్రపంచ యవనికపై తెలుగు సినిమా గర్వంగా ఛాతీ విరుచుకుని నిలబడేలా చేసిన మహత్తర చిత్రం. 78 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో టాప్ టెన్‌ చిత్రాలను బేరీజు చేస్తే ఈ నాటికీ నంబర్‌వన్ స్థానంలో నిలబడే దన్ను కలిగిన చిత్రం. శతాబ్దాల మానవ వినోద చరిత్రలో ఓ గొప్ప విప్లవంగా నిలిచిన సినిమాకే కొత్త నిర్వచనం ఇస్తూ గత యాభై ఏళ్లుగా ఇది రసజ్ఞుల హృదయాలను కదిలిస్తూనే ఉంది.

కంప్యూటర్ మాయాజాలం, గ్రాఫిక్స్ మంత్రలోకాలు ప్రస్తుతం వెండితెరని, సినిమా రూపురేఖలనే సమూలంగామార్చివేస్తున్నప్పటికీ తెలుగు ప్రేక్షకుల స్మృతి పథంలో చెరగని ముద్రవేస్తున్న మేటి చిత్రం మాయాబజార్.

ఎందరో చిత్ర సమీక్షకులు, సినిమా ప్రేమికులు అన్నట్లు, అంటున్నట్లు….

మాయాబజార్…

తెలుగు జాతి సంపద
తెలుగు జాతి సంస్కృతి
తెలుగు జాతి సంతకం
తెలుగు జాతి మురిపెం

అంతే కాదు.. 

అది..

మన బాల్యం…
మన పద్యం
మన పాట…
మన పురా జ్ఞాపకం…
మన జీవితం…
మన చరిత్ర…
మన సర్వస్వం…

ఒక్కమాటలో చెప్పాలంటే దీనికి జాతి, కుల, మత, ప్రాంత భేదాలు లేవు.

విడిపోవడాన్ని ప్రస్తుతం తారకమంత్రంగా జపిస్తున్న తెలుగు జాతికి మిగిలిన ఏకైక సమైక్య భావన మాయాబజార్. ఇది మనదీ, మన సినిమా, మన అద్భుత కృషి అంటూ రాష్ట్రం నలు చెరగులా భవిష్యత్ తరాలు కూడా చెప్పుకుని పరవశించే మలయ పవన సోయగం.

తెరపై నలుపు తెలుపు రంగులతో దశాబ్దాలుగా సమ్మోహనం చేస్తూవచ్చిన మాయాబజార్ త్వరలో సప్తవర్ణ కాంతులీనబోతోంది. విడిపోయినా, విడిపోకపోయినా తెలుగు జాతి పాడుకునే మంత్రం మాయాబజార్. తెలుగు సినిమా చరిత్ర లోనే వెన్నెలనింత అందంగా ఇంకెక్కడా చూడలేదు అని కోట్లమందిని భ్రమింపజేసిన మహాద్భుతం. సందేహముంటే లాహిరి లాహిరి లాహిరిలో పాటను మళ్లీ చూస్తూ వినండి. దాన్ని మండుటెండలో తీశారు. అది విజయావారి ఎండవెన్నెల. కెమెరా మాయకు చిక్కి చల్లబడిన మండువెన్నెల.

హిందీవాళ్లకు ‘మొఘల్ ఇ అజమ్,’ ‘నయాదౌర్’ చిత్రాలు నలుపుతెలుపుల నుండి రంగుల ప్రపంచంలోకి వచ్చినట్లే.. మన ‘మాయాబజార్’ యాభై ఏళ్ల తర్వాత గోల్డ్‌స్టోన్ సంస్థ నిబద్ధ కృషి ఫలితంగా సకల వర్ణ శోభితంగా తయారై మనముందుకు వస్తోంది. రాజకుమారిగా సావిత్రి రాజసాన్ని, రాక్షసుడిగా ఘటోత్కచుడి సాటిలేని ఆహార్యాన్ని, లాహిరి లాహిరి పాటలో రాత్రి -నట్టెండ-  అందాలను వర్ణభరితంగా చూడడానికి సిద్ధంగా ఉండండి మరి.

ఎవరూ కనిపెట్టకుండా మాటలు ఎలా పుడతాయి అనే గొప్ప సత్యాన్ని మాయాబజారే చెప్పింది మనకు. అందుకే గత యాభై ఏళ్లుగా అది మాటల కనికట్టుతో తెలుగువారిని తనవద్దకు రప్పించుకుంటోంది.

నిజమే.. “మాయాబజార్ ఎన్ని సార్లు చూసినా, ఎన్ని సార్లు చదివినా బోర్ కొట్టదు. కమ్మటి ముద్దపప్పు, అవకాయ భొజనం, సుఖమైన నిద్ర, మాయాబజార్ సినిమా .. వీటికి ప్రత్యామ్నాయాలుంటాయా?” ఉండవు గాక ఉండవు..

“యాభై ఏళ్ళ ‘మాయా’బజార్”, “మనయింటి బంగారం మాయాబజార్”, “తెలుగు సినిమాకు పెద్దబాల శిక్ష మాయాబజార్”, “అర్ధ శతాబ్ది అద్భుత అనుభూతి మాయాబజార్” ఇవీ మన తెలుగు పత్రికలు పెట్టిన శీర్షికలు.

కెవి రెడ్డి దర్శకత్వం, సాలూరి, ఘంటసాల సంగీతామృతం, పింగళి మాటల మూటలు, మార్కస్ బార్ట్‌లే కెమెరా కన్ను, హర్బన్స్ సింగ్ అలనాటి గ్రాఫిక్స్ మాయాజాలం, ఘంటసాల , పి.లీల , పి.సుశీల , మాధవపెద్ది సత్యంల గాంధర్వగానపు కువకువలు, తెలుగు సినిమాలో చరితార్థుడిగా నిలిచిన శ్రీకృష్ణుడు, పాటల కథానాయకుడు నాగేశ్వరరావు. తెలుగు చిత్ర వైభవానికి పట్టం కట్టిన ఎందరో.. ఎందరెందరో..

ఇందుకోసమే మాయాబజార్‌ను చూడాలి.

తెలుగువాళ్లం ఇప్పటిలాగే కాదు. మరోలా కూడా ఉంటాం అని నిరూపించడానికైనా మాయాబజార్ చూడాలి.

మాయా బజార్ చిత్రం విడుదల సందర్భంగా ‘చందమామ’ కథల పత్రికలో ఈ సినిమా పూర్తి కథను చక్కటి భాషలో ప్రచురించారు. అది చదివితే ఆ సినిమా కథ మొత్తం తెలుసుకోవచ్చు. April 1957 చందమామలో ఇది వచ్చింది. ఆన్‌లైన్ చందమామ ఆర్కైవ్స్ -భాండాగారం- లోని 1957 చందమామ ఏప్రిల్ సంచిక 13-20 పుటలలో ఈ కథను కింది లింకుపై క్లిక్ చేసి -మీ భాష, సంవత్సరం, నెల ఎంపిక చేసుకుని- చదవగలరు.

http://www.chandamama.com/archive/storyArchive.php

వికీపీడియాలో కూడా ఈ కథను పీడీఎఫ్‌గా ఇచ్చారు.
మాయాబజార్ సినిమా కథ

ముందస్తు హెచ్చరిక: రంగుల మాయాబజార్‌ను చూడకపోతే కూడా మనం తెలుగువాళ్లం కాదన్నమాటే.. తస్మాత్ జాగ్రత్త..

RTS Perm Link