హితసూచిని – రాజశేఖర చరిత్ర

January 26th, 2010

kandukuri3

మెరుగైన సమాజం పేరుతో సెక్సును, రేటింగ్ పెంచుకోవడం రూపంలో నానా చెత్త ప్రసారాలు చేస్తున్న టీవీ9 -అంటే మిగతా టీవీలు చాలా పవిత్రంగా ఉన్నాయని కాదు- ఈ ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత, దాదాపు 150 ఏళ్ల క్రితం ప్రచురించబడిన రెండు తెలుగు పుస్తకాలపై అరుదైన చర్చకు అవకాశమిచ్చింది. అన్ని మసాలా కార్యక్రమాలు, రేటింగులకోసం రుబ్బుళ్లు పూర్తయ్యాక రాత్రి ఒంటిగంట సమయంలో ఇద్దరు తెలుగు ప్రముఖులచేత ఈ చర్చా కార్యక్రమం నడిపారు. ఆ సమయానికి నాలాంటి నిద్రరాని వాళ్లు, కంప్యూటర్ ముందు కూర్చుని టీవీ చూస్తూ పనులు చేసుకునే కొందరు తప్ప తెలుగు వాళ్లు దాదాపుగా నిద్రపోయి ఉంటారు. రేటింగ్ పెరగడానికి ఏ మాత్రం అవకాశం రాని ప్రసారం కాబట్టి దీన్ని రాత్రి ఒంటిగంటకు తోసేసారు. అయినా సరే టీవీల్లో అరుదుగా వస్తున్న సాహిత్య చర్చల్లో ఇదీ ఒకటిగా గుర్తించాలి.

“1990 తర్వాత ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక రంగాలలో కాలానికి వెనుకబడిపోతోందా అని అనుమానం వేస్తోంది. 150 ఏళ్ల క్రితం కందుకూరి వీరేశలింగం రాజశేఖర చరిత్ర నవల ద్వారా, సామినేని ముద్దు నరసింహం హితసూచిని ద్వారా తెలుగువారికి హేతుబద్దంగా జీవించడంపై పాఠాలు నేర్పారు. ఈ రెండు పుస్తకాలను ప్రస్తుతం పీకాక్ క్లాసిక్స్ ప్రచురించింది. ఇప్పటి పాఠకులకు వీటి అవసరం చాలా ఉంద”ని వకుళాభరణం రామకృష్ణ, వేదవతి గారు ఈరోజు అంటే 24 అర్థరాత్రి దాటాక ఒంటిగంటకు టీవీ9లో జరిగిన చర్చలో పాల్గొని చెప్పారు.

kandukuri4_400

150 ఏళ్ల క్రితం వీరేశలింగం, సామినేని ముద్దు నరసింహం తమ రచనల ద్వారా మూఢనమ్మకాలను నమ్మకండి, హేతుబద్దంగా జీవించండి, దేవుళ్లపేరిట దేవతల పేరిట సాగుతున్న ఛాందసాలను నమ్మకండి అని వాదించి మహిళలతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు తమ రచనల ద్వారా హితబోధ చేసారని. కాని ప్రస్తుతం తెలుగు దేశంలో వాతావరణం చూస్తే మనం కాలాన్ని దాటటం కాకుండా కాలంలో వెనుకకు పోతున్నామా అనిపిస్తూ ఉంటుందని రామకృష్ణ, వేదవతిగారు ఈ చర్చలో ఆవేదన వ్యక్తం చేసారు.

ముఖ్యంగా 1990 తర్వాత పలు కారణాల వల్ల తెలుగు సమాజంలో హేతువు, హేతుబద్ధంగా ఆలోచించడం, తార్కికంగా జీవించడం వంటివి కనుమరుగు అవుతూ వస్తున్నాయని వీరు చెప్పారు. కంప్యూటర్ విప్లవం సమాజాన్ని ముందుకు తీసుకుపోయిందో లేదో గాని అస్ట్రాలజీ, రాశిఫలాలను డేటా, ఆడియో, వీడియో రూపంలో అప్‌లోడ్ చేస్తూ, అర్థబిత్తల హీరోయిన్ల చర్మ ప్రదర్శనలతో వెబ్‌సైట్లు తాము తరిస్తూ ప్రజలను తరింపజేస్తున్న కాలం వచ్చేసింది. న్యూస్ పోర్టళ్లుగా చెప్పుకుంటున్న కొన్ని తెలుగు వెబ్‌సైట్ల ధూర్త పోకడ ఇలా తెల్లారుతోంది.

150 ఏళ్ల భావ సంస్కారం తర్వాత వెనుక పట్టు పడుతున్న తెలుగు సమాజానికి కనువిప్పు కలిగించేందుకు రాజశేఖర చరిత్ర, హితసూచిని పుస్తకాలను తిరిగి పీకాక్ క్లాసిక్స్ వారు వీటిని తిరిగి ప్రచురించారు. ఒక్కొక్కటి 120 పుటలు గల ఈ రెండు పుస్తకాల వెల చెరొక 50 రూపాయలు. విశాలాంద్రలో తదితర అన్ని పుస్తకాల షాపులలో ఇవి దొరుకుతాయి.

ఆధునిక తెలుగు సమాజంలో సంఘసంస్కరణకు రెక్కలు తొడిగిన ఆ తొలికాలంలో, ఇద్దరు మహనీయులు సామాజిక విషయాలపై, మనిషి ఆలోచనలపై, జీవన ధోరణిపై కొత్త సంస్కారానికి దారి తీసిన చరిత్రను మనం అర్థం చేసుకోవాలంటే సులభ వ్యావహారిక శైలిలో పై ఇద్దరు ప్రముఖుల చేత సంక్షిప్తం చేయించి పీకాక్ క్లాసిక్స్ వారు తెచ్చిన ఈ రెండు పుస్తకాలను ఇప్పటి పాఠకులు, సాహిత్య పఠనంపై ఆసక్తి గలవారు తప్పక తీసుకోవాలి. జనవరి రెండో వారంలో ముగిసిన చెన్నయ్ బుక్ ఫెయిర్‌లో వీరేశలింగం గారి నవల రాజశేఖర చరిత్ర తీసుకున్నాను. హితసూచిని దొరకలేదు.

ఒక జాతి సామాజిక, సాంస్కృతిక చరిత్రలో కొత్త మలుపుకు నాందిపలికిన నూతన భావధారను మరోసారి మననం చేసుకోవడానికయినా మన తీరిక సమయాన్ని ఈ రెండు పుస్తకాల అధ్యయనం కోసం వెచ్చిద్దాం రండి. పీకాక్ క్లాసిక్స్ వారికి అభినందనలు… కృతజ్ఞతలు…

RTS Perm Link

మా తెలుగు మాస్టారూ…మా తెలుగు పద్యమూ…

January 3rd, 2010

 

Raju 1979 (200 dpi Colour perfect)

పల్లెటూరి బడిలో 8వ తరగతి చదువుతున్న రోజులు….7వ తరగతి నుంచి అప్పుడే పెద్దక్లాసుకు ఎగబాకివచ్చిన రోజులు.. (1974) మా క్లాసుకు రెండు సెక్షన్‌లు. 8 ఎ, 8 బి. మా బి సెక్షన్‌కి తెలుగు టీచర్‌గా సహదేవరెడ్డి సార్ వచ్చేవారు. పురాణాలు, ప్రబంధాలు, చక్కటి పద్యపఠనాలతో క్లాసును ఉర్రూతలూగించేవారు..

ఇంగ్లీష్, సైన్స్, లెక్కలు సబ్జెక్ట్‌లతో పరమ విసుగ్గా ఉండే మాకు తెలుగు క్లాస్ అంటే చాలు చెవులు నిక్కబొడుచుకుని ఆయన రాక కోసం ఎదురు చూసేవాళ్లం. మామూలుగానే తెలుగు క్లాసు అంటే పిల్లల తూగును, నిద్రమత్తును వదిలించేదని అప్పట్లో గుర్తింపు పొందింది. అందుకే లెక్కలు, సైన్స్ మధ్యలో లేదా సైన్స్, ఇంగ్లీష్ మధ్యలో తెలుగు క్లాసును ఇరికించేవారు. ఇది తెలుగు టీచర్లను కాస్త మండించేదనుకోండి.

మా సహదేవరెడ్డి సార్ తెలుగు ప్రాచీన సాహిత్యం పట్ల మాలో ఎంత గాఢానురక్తిని క్లాసులో పెంచి పోషించేవారంటే ఏ ఒక్కరం కూడా తెలుగు క్లాస్‌ను తప్పించుకునే వాళ్లం కాదు. స్వతహాగా గత జీవితంలో హరికథాగానం చేసి బతికిన ఆయన రాగయుక్తంగా ప్రబంధపద్యాలు పాడి వినిపిస్తుంటే మంత్రముగ్ధులం అయ్యేవాళ్లం.

పద్యాన్ని మొదటిసారి రాగయుక్తంగా, రెండోసారి మామూలుగా చదివి వినిపించే ఆయన నేర్పుకు మేం దాసోహమయ్యేవాళ్లం. పద్యాన్ని రాగయుక్తంగా పాడకుండా చదివి వినిపించాలన్న నిబంధన ఇంటర్, డిగ్రీ, పిజి తరగతులలో అప్పటికే అమలవుతున్నందువల్ల మేం పై చదువులకు వెళ్లే కొద్దీ తెలుగు పద్య గాన మహిమా శ్రవణానుభవం మాకు కొరవడిందనుకోండి.

ఆ పురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా
షాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ
క్షాపరతంత్రు డంబురుహగర్భ కులాభరణం బనారతా
ధ్యాపనతత్పరుండు ప్రవరాఖ్యు డలేఖ్యతనూవిలాసుడై

అటజని గాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్జరీ
పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వన
స్పుట నటనానురూప పరిపుల్ల కలాపి జాలమున్ గ్ర
కట శరత్కరేణు కర కంపిత జాలము శీత సాలమున్

అంటూ సంస్కృత సమాస పద భూయిష్టమైన మనుచరిత్రలోని ప్రవరుడి ఘట్టాలను పాడి వినిపిస్తుంటే, మాకు ఒక్క పదం అర్థం కాకపోయినా ఒళ్లు పులకరించిపోయేది. రేడియోలో ఘంటసాల, సుశీల, లీల, జిక్కి పాటల, పద్యాల పారవశ్యం ఒక వైపు, ఇల్లు వదిలాక స్కూల్లో తెలుగు పద్య శ్రవణానందం మరోవైపు… మా బాల్యం ఎంత హాయిగా గడిచిపోయిందో…

వ్యావసాయిక జీవన సంస్కృతిలో పెరిగిన మా కష్టాలను తాత్కాలికంగా మర్చిపోయేలా చేసిన ఈ పాటలు, పద్యాలు ఒక రకంగా చెప్పాలంటే పారే యేటినీటిలో స్నానంలాగా, మా తరాన్ని సేదతీర్చేవి,

తెలుగు పాట… తెలుగు పద్యం… ఈ రెండింటికి నోచుకున్న పచ్చకాలం మాది. ఇవి లేని పల్లె జీవితాన్ని ఊహించుకోలేం. ఇప్పటికీ ఘంటసాల పద్యాలు రేడియోలోనో, టీవీలోనో, సినిమాల్లోనో, లేక ఇంట్లో మా సిస్టమ్‌లోనో వింటూ ఉంటే ప్రపంచాన్ని అలాగే మర్చిపోవాలన్నంత మైమరపు… తదనంతర జీవితంలో ఎన్ని డక్కీమొక్కీలు తిన్నా, సొంతఊరు వదిలి చదువు కోసం, ఆశయం కోసం, జీవిక కోసం ఎన్నెన్ని ప్రాంతాలు తిరిగినా ఆ తెలుగు పద్య గాన శ్రవణా సౌరభం నానుంచి దూరం కాలేదు.

“కనియెన్ రుక్మిణి, చంద్రమండల ముఖున్, కంఠీరవేంద్రావలగ్ను…” అంటూ శ్రీకృష్ణపాండవీయం సినిమాలో తొలిసారి శ్రీకృష్ణుడిని రుక్మిణి సందర్శించిన తీరును ఘంటసాల పాడగా వింటూంటే… ప్రాణం అలాగే వదిలేసినా చాలు అనిపించేంత ఆత్మానందం (?) సంగీతం, మృదంగ ధ్వని, లయ, గానం కలగలసిన ఆ మహిమాన్విత అనుభూతిని ఈ నాటికీ మర్చిపోలేను.

ఇలాంటి ఎన్ని పద్యాలు ఎన్ని పర్యాయాలు భట్టీ కొట్టి మరీ మా బాల్యంలో మేం నడుస్తున్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు, కొండలు గుట్టలు ఎక్కుతున్నప్పుడు మేం పాడుకునేవారిమో… దీనికంతటికీ మా తెలుగు టీచర్ పెట్టిన పద్య బిక్షే మూలం.

తెలుగు పద్యాన్ని తలుచుకున్నప్పుడల్లా ఘంటసాల గారి గానం ఒకవైపు, మా తెలుగు టీచర్ గారి గంభీర శ్రవణం ఒకవైపు ఈ నాటికీ నేను కలలో కూడా మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు. తెలుగు పద్యగానామృతాన్ని మాకు పంచిపెట్టడంతో పాటు ఎన్ని వెలలేని జీవిత సత్యాలను ఆయన ఆ మూడేళ్ల మా స్కూలు జీవితంలో మాకు నూరిపోశారో….

(కానీ ఆయనలో ఒకే ఒక్క అంశం నాకు నచ్చలేదు. కవిత్వం అంటే ప్రబంధ సాహిత్యమేనని ఢంకా భజాయించే ఆయన వచన కవిత్వం అన్నా, ముఖ్యంగా శ్రీశ్రీ కవిత్వం అన్నా ఒళ్లు మంట ఆయనకు. ఎందుకంటే చందస్సుల  సర్ప పరిష్వంగాన్ని చీల్చి చండాడుతానని శ్రీశ్రీ మహాప్రస్థానంలో కవితా ఓ కవితాలో తేల్చి చెప్పాడు మరి.  పద్యమన్నా, చందస్సు అంటే పడి చచ్చే ఆయనకు వాటిపై శ్రీశ్రీ కొట్టిన దెబ్బ మండించిందనుకుంటాను. పద్యం పట్ల ఆయన అభిమానం శ్రీశ్రీ కవిత్వాన్నే తోసి పారవేసింది -నెగేట్-.  క్లాసులో ఆయన శ్రీశ్రీని తిడుతుంటే మేం నవ్వుకునే వాళ్లం.  ఎందుకంటే అప్పటికే అంత నిశితంగా కాకపోయినా పత్రికలలో, రేడియో ప్రసంగాలలో శ్రీశ్రీ గురించి అంత చిన్న వయసులోనే ఎంతో కొంత తెలుసుకుని ఉన్నాం. ఆ తర్వాత ఇంటర్ దాటి డిగ్రీ, తర్వాత యూనివర్సిటీ చదువులకు వచ్చాక, ప్రగతిశీల సాహిత్యం అందుబాటులోకి వచ్చాక  జీవిత దృక్పథమే మారిపోయిందనుకోండి.)

ఈ రోజు ఆయన ఉన్నారో లేరో.. కానీ, కడప జిల్లా సుండుపల్లి మండలంలోని మా గుట్టకిందరాచపల్లె (జి.కె.రాచపల్లి) హైస్కూలు, 8, 9, 10 తరగతుల్లో మేం కూర్చున్న ఆ తెలుగు తరగతి గదులు, ఆ గదుల్లో కుర్చీలో మూర్తీభవించిన గానగంధర్వుడిలా మా సహదేవరెడ్డి సార్… ఇంకా ఇప్పటికీ గొంతెత్తి పాడుతున్నట్లు, జీవితంలో మేం కోల్పోతూ వస్తున్న ఎన్నెన్నో మధురానుభవాలను తట్టి లేపుతున్నట్లు…. పద్యం అనే తెలుగు జాతి సంపద సాక్షిగా మమ్మల్ని మనసారా ఆశీర్వదిస్తున్నట్లు…

మర్చిపోలేను… తెలుగు పద్యం అంటే రాజులు, రాణుల అంగాగ వర్ణనలకు ప్రాధాన్యమిచ్చిన ఫ్యూడల్ సాహిత్య ప్రతీక అంటూ గడచిన శతాబ్ద కాలంగా తెలుగు సాహితీలోకంలో ఎన్ని వాదోపవాదాలు పదే పదే కొనసాగుతూ వస్తున్నప్పటికీ… మర్చిపోలేను… పద్యరూపంలోని ఆ లయాన్విత సంగీత ఝరిని… ఆ విశ్వవీణానాదాన్ని…. పద్యగానంతో, శ్రవణంతో మా బాల్యజీవితాన్ని వెలిగించిన, మా సహదేవరెడ్డి మాస్టారు చిరస్మృతులను మర్చిపోలేను.

రాజు
blaagu.com/chandamamalu

RTS Perm Link