చందమామ ఒక పుస్తకం మాత్రమే కాదు…

September 3rd, 2010

మా చందమామ ఒక పుస్తకం మాత్రమే కాదు .. మా జీవితంలో భాగం, చెరపలేని ఓ మధురానుభూతి

భవదీయుడు చక్రవర్తి అమెరికాలోని రెడ్డింగ్ అనే ప్రదేశం నుంచి వ్రాయునది. ఇక్కడ నాకు తెలిసిన చాలమంది పిల్లలున్న తల్లులకు చందమామ అంతర్జాలంలో కనబడుతోందన్న విషయం తెలియకే నేను తెలుగు గుంపులో ఒక చర్చను మొదలు పెట్టాను. అందులో  రాజ శేఖర రాజు గారు కూడా పాలు పంచుకున్నారు. తత్ఫలితమే ఈ ఉత్తరం. అలాగే ఈ జాబు వెనకాల మరో విషయం దాగి ఉంది. అది చందమామ వారు ఆపి వేసిన మరో ఫీచర్. అదే రాము శ్యాముల కధలు.

నాకు ఊహ తెలిసి దాదాపు ఎనభయ్యో దశకం మొదట్లో అలవాటు అయ్యిందనుకుంటాను. మా నాన్నగారు తెచ్చి ఇచ్చేవారు. మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం వల్ల అప్పుడప్పుడు తెచ్చేవారు కాదు, కానీ విజయవాడలోని సత్యన్నారాయణ పురంలో ఓ పురాతన గ్రంధాలయం వారు ఈ పుస్తకాలను నలుగురికి అందుబాటులో ఉంచేవారు. మా నాన్నగారు కొనని పక్షంలో మేము అక్కడికి వెళ్ళి చదివే వాళ్ళం.

మేము ఇద్దరు అన్నదమ్ములం, నేను చిన్నవాడిని. అన్నయ్య పేరు విజయ శ్యామ కుమార్. ముద్దుగా అందరూ శ్యామూ అనే వారు. మా నాన్న గారు చందమామ తెచ్చినప్పుడల్లా మేము అన్నింటికన్నా ముందుగా చివరి పేజీలో వచ్చే రాముశ్యాముల చిత్ర కధలను చదివి ఆనందించే వారము.. అలా ఎంతకాలం గడిచిందో తెలియదు కాని ఓ సంచికనుంచి ఆ చిత్ర కధలను ఆపి వేశారు. మేము చాలా భాద పడ్డాము. మా చుట్టాలు అందరూ మమ్మల్ని రాము శ్యాము గానే పలకరించే వారంటే అది అతిశయోక్తి కాదేమో. ఇలా చందమామ మా జీవితంలో ఓ వీడలేని అనుభూతిగా మిగిలి పోయిందంటే మీరు నమ్మరు. వీలైతే అలాంటిదేదైనా తిరిగి ప్రారంభించ మనవి.

అలాగే పైన చెప్పినట్టు ఆర్థిక పరిస్తితి కారణంగా ఒకటే చందమామని ఇద్దరం ఒక్కసారే చదవాల్సి వచ్చినప్పుడు ఇద్దరం ఒక అంగీకారానికి వచ్చేవాళ్ళం, “ప్రక్కప్రక్కనే కూర్చుని చదువుదాం, ఒక వేళ నేను ఈ పేజీ చదవడం పూర్తి అయిపోతే మరో పేజీని కొద్దిగా తీసి ఉంచు నేను అవతలి పేజీలో చదువుకుంటూ ఉంటాను నువ్వు ఇవతలి పేజీలోది చదువుకో” అని ఇద్దరం ఓరకమైన రాజీకి వచ్చేవాళ్ళం.

అవన్ని మధురానుభూతులుగా మిగిలిపోయ్యాయి. “పండక్కి ఏమి కావాలిరా పిల్లలూ” అని మా నాన్నగారు అడిగితే ”చందమామ కావాలి” అని ఎన్ని సార్లు పేచీ పెట్టామో మీకు తెలియదు. ఒక వేళ చందమామని కొనిస్తాం మరింకేం కావాలంటే మరో చందమామ అనే వాళ్లమే కాని మరింకేం కావాలనే వాళ్ళం కాదంటే మీరు నమ్ముతారా. అప్పట్లో మా మట్టి బుర్రకి చందమామ నెలకు ఒకసారే వస్తుందంటే అర్థం అయ్యేది కాదు.

ఉద్యోగంలో పెద్దవాళ్ళం అయ్యాం.. సమాజంలో ఓ స్థాయి వచ్చింది.. స్థాయికి అనుగుణంగా కొంచం గంభీరంగా బ్రతకాలి.. బ్లా.. బ్లా.. (అంటే వగైరా వగైరా అన్నమాట)  అన్న ముసుగులో బ్రతికేస్తున్న నాలాంటి వాళ్ళకు ఆ జ్ఞాపకాలే అమృత ధారలు. అలాంటి అమృతాన్ని అందించిన చందమామ నిజంగా ఈ తరానికే కాకమోయినా ఏతరానికైనా ఒక చక్కని బహుమతే అని నా అభిప్రాయం. మీరు ఇలాగే పది కాలాలపాటు పచ్చగా వర్ధిల్లుతూ ఉండాలనేది నా ప్రార్ధన.

అలాగే పాత పుస్తకాలను మీరు కొంచం హై రిజల్యూషన్ తో స్కాన్ చేస్తే బాగుంటుందని నా మనవి. కొన్ని కొన్ని సార్లు పాత కధలు చదువుదాం అనుకుంటే కుదరటం లేదు. ఏది ఏమైనా ఓ మంచి సంకల్పానికి నాంది పలికిన ఈ చందమామ ప్రారంభకులకు మరియు ఇప్పటిదాకా ఈ సంచికను నడిపిస్తూ ముందుకు తీసుకు వెళుతున్న తరతరాల యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ధన్య జీవులు మీరు.

Regards,
చక్రవర్తి । Chakravarthy
Project Lead,
LiquidHub,
USA Mobile – 267-344-5275
GKElite Office – 610(921)1469 Ex 3018

శ్రీ చక్రవర్తి గారికి,
“మా చందమామ ఒక పుస్తకం మాత్రమే కాదు .. మా జీవితంలో భాగం, చెరపలేని ఓ మధురానుభూతి” అంటూ మీరు పంపిన అభిప్రాయ లేఖ హృద్యంగా ఉంది. రామూ శ్యాము మొదలుకుని చందమామ గతంలో ప్రవేశపెట్టిన మంచి శీర్షికలు కొన్ని ఇప్పుడు కొనసాగలేదు. కాలానుగణంగా, వనరుల పరంగా ఆచరణ సాధ్యం కాని వాటిని తీసివేయడం అప్పుడూ ఇప్పుడూ జరుగుతూనే ఉంది. పాఠకులు, అభిమానులు ఇలాంటి నిలిపివేతల పట్ల ఎంత అసంతృప్తి వ్యక్తం చేసినా యాజమాన్యం దృష్టికోణంలో ఈ రకం మార్పులు తప్పటం లేదు.

ఉదాహరణకు గత 60 ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా కొనసాగిన ఫోటో వ్యాఖ్యల పోటీ ఈ జూలై సంచిక నుంచి ఆగిపోయింది. కారణం తాజా ఫోటోలు పంపించడంలో ఫోటో సేకర్తలలో ఆసక్తి సన్నగిల్లడం. దీంతో పాత ఫోటోలనే వేయవలసి వచ్చేది. ఇది సరైంది కాదని భావించడంతో దీన్నికూడా తీసివేశారు. మనకు ఇష్టం లేకపోయినా కొన్ని సంప్రదాయాలు చందమామకు దూరమవుతున్నాయి. తప్పదు.

మీరు రాము-శ్యాము తోపాటు చందమామను మీ చిన్నతనంలో అన్నదమ్ములు ఇద్దరూ ఎలా పంచుకుని చదువుతూ వచ్చారో చదువుతుంటే మాకూ మా బాల్యం తటిల్లున మెరిసింది. మేం నాలుగు  కుటుంబాలకు చెందిన 16 మంది పిల్లలం. అన్నతమ్ముళ్లు, అక్కా చెల్లెళ్లు అందరం పల్లెలో ఉండి చదువుకుంటూ ఉంటున్నప్పుడు 1970ల మొదట్లో పండువెన్నెలలాగా చందమామ పరిచయమయ్యింది.

అప్పటినుంచి ఓ ఆరేడేళ్ల కాలం మా అందరి బాల్యం చందమామ జ్ఞాపకాలతోటే గడిచిపోయింది. ఇంతమంది పిల్లలకూ, పెద్దలకూ కూడా టౌన్ నుంచి తెచ్చే ఒకే చందమామ ఆధారం కావడంతో వారంరోజుల పాటు చందమామ కనబడేది కాదు. ఎవరు చదువుతున్నారో, ఎవరు తీసుకెళుతున్నారో తెలిసేది కాదు. అందుకే ఫలాని వారి వద్ద చందమామ ఉందని తెలిస్తే చాలు… పోటీలు పడి ఒప్పందాలు చేసుకునేవాళ్లం. నీ తర్వాత నాకే ఇవ్వాలి అంటూ.

అదీ కుదరకపోతే రాత్రి పూట పొలాలకు నీళ్లు మలిపేటప్పుడు -నలభై ఏళ్లకు ముందు కూడా కరెంటు కోతలు పల్లెల్లో ఇలాగే ఉండేవి- టార్చి లైటు వెలుతురులో ఒక కయ్యనుంచి మరో కయ్యకు నీళ్లు మలిపేటప్పుడు దొరికే విరామ కాలంలో లైటు వేసుకుని మరీ చందమామను ఆబగా చదువుతూ ఆనందించేవారం. నెలరోజులు రావలసిన బ్యాటరీలు 15 రోజులకే అయిపోతే ఇంట్లో పెద్దలు తిట్టేవారు. “బ్యాటరీలను తింటున్నారట్రా. ఇంతత్వరగా కాలిపోతున్నాయి” అని. “మాకేం తెలుసు.. మడికి నీళ్లు కట్టేందుకోసమే లైటు తీసుకెళుతున్నాం” అని వాదించేవాళ్లం. ఇలా చందమామను రాత్రిపూట లైటు వేసుకుని మరీ చదవాల్సి రావడంతో ఆ ఆలవాటు తర్వాత ప్రతి పుస్తకాన్ని వినూత్న రూపంలో చదివేలా మాకు నేర్పింది.

పశువులను మేపడానికి వెళ్లినప్పుడు, పంటపొలాలను కాపలా కాయడానికి వెళ్లినప్పుడు, ఆడుకోవడానికి వెళ్లినప్పుడు. ఒక ఊరి నుంచి మరో ఊరికి ప్రయాణించవలసి వచ్చినప్పడు, ఊరికి దూరంగా ఉన్న పొలాలు, చేల వద్దకు వెళుతున్నప్పుడు నడకలో కూడా ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ పోవడం అనే అలవాటు మాకు చందమామ వల్లే అబ్బింది. ఇది ఎంతగా అలవాటయ్యిందంటే 35 సంవత్సరాల తర్వాత అదే చందమామ ఆఫీసులో పని చేసే అవకాశం వచ్చినప్పుడు కూడా ఉదయం పూట, సాయంత్రం పూట బస్సులో వెళుతున్నప్పుడు కూడా ఏదో ఒక పుస్తకం చదువుతూ పోయే అలవాటు కొనసాగుతూనే ఉంది.

ప్రతి కుటుంబమూ చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు వంటి పుస్తకాలను విడిగా కొనలేని ఆర్థిక పరిస్థితుల కారణంగానే, ఒకరు తెస్తే అందరూ చదువుకోవడం అనేది మాకు అప్పట్లో అలవాటయ్యింది. పైగా పల్లెలు కాబట్టి మాకు లైబ్రరీలు అంటూ ఉండేవి కావు. ఈ రోజు మా పల్లెలోంచి దాదాపు 40 మంది పైగా ఉన్నత చదువుల భాగ్యంతో అమెరికా, తదితర దేశాలకు వలసలు వెళ్లిపోయినా, ఈనాటికీ మా పల్లెకు లైబ్రరీ లేదు. దాదాపు దేశంలోని పల్లెలన్నింటి పరిస్థితి ఇంతేనేమో.

మీరు ఆన్‌లైన్‌లో చందమామను చూస్తున్నప్పుడు చదవడానికి కూడా వీలు లేనంతగా స్కానింగ్ పాడయి ఉంటే వెంటనే

abhiprayam@chandamama.com

లేదా

rajasekhara.raju@chandamama.com
ఈమెయిల్స్‌కి ఆ విషయం తెలుపుతూ సమాచారం పంపితే సాధ్యమయినంత త్వరలో మళ్లీ కొత్తగా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయగలము.
చాలా మంది పాఠకులు ఇలా పేజీలు చిరిగాయనో, సరిగా కనిపించలేదనో రిపోర్ట్ చేస్తే గతంలోనూ చర్యలు చేపట్టాము. కాబట్టి మీరు కూడా సూచనలు పంపితే తప్పక పరిహరించగలము. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉన్న 53 ఏళ్ల చందమామలను మళ్లీ సరిచూడటం, సరిచేయడం వంటి పనులకు మావద్ద వనరులు తగినంతగా లేవు కాబట్టే ఆన్‌లైన్ చందమామ పాఠకుల సహాయం ఈ విషయంలో చాలా అవసరం.

అలాగే మీరు ఈ లేఖలో పంపిన మీ జ్ఞాపకాలను ఆన్లైన్ తెలుగు చందమామలో, చందమామ బ్లాగులో మీ చందమామ జ్ఞాపకాలు పేరిట ప్రచురించగలము. మీకు అభ్యంతరం లేనట్లయితే మీ సమ్మతి తెలుపుతూ మీ ఫోటో, మీ సోదరుడి పోటో – కలిపి గాని లేదా విడిగా గాని- కూడా స్కాన్ చేసి పైన తెలిపిన ఈమెయిల్ చిరునామాలకు పంపండి. వచ్చే శుక్రవారం మీ చందమామ జ్ఞాపకాలను పై రెండు సైట్లలోనూ ప్రచురిస్తాము. మీ చందమామ జ్ఞాపకాలను మరింత వివరంగా పొడిగించి పంపాలనుకుంటే అలా కూడా చేయండి.

ఇంతవరకు దేశ దేశాలలో ఉన్న చందమామ పాఠకులు, అభిమానులు దాదాపు 40 మంది తమ చందమామ జ్ఞాపకాలను పంపారు. వారి జ్ఞాపకాలు కింది లింకులో మీరు చూడవచ్చు.

http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

మీరే కాకుండా అమెరికాలో మీకు తెలిసిన చందమామ అభిమానులు, పాఠకులు, ముఖ్యంగా పిల్లలున్న తల్లులకు అవకాశముంటే ఈ విషయం మీరు తెలియజేసి వారి చందమామ జ్ఞాపకాలను కూడా రాసి, టైప్ చేసి, స్కాన్ చేసి పంపమనండి. తెలుగు టైపింగ్ రాదనుకుంటే ఇంగ్లీషులో లెటర్ రూపంలో ఈ మెయిల్ చేసినా చాలు. లేదా తెలుగులో రాసి స్కాన్ చేసి పంపినా సరే. లేదా ట్రాన్స్‌లిటరేషన్ రూపంలో రోమన్ ఇంగ్లీషులో రాసి టైప్ చేసి పంపినా సరే,.. వాటిని మేము వారి పోటోలు లేదా వారి పిల్లల పోటోలతో పాటు ప్రచురించగలము.

జీవితంకోసం విదేశాలకు వలసవెళ్లిన చందమామ అభిమానులతో కూడా నిత్య సంబంధాలు కలిగి ఉండాలన్నదే చందమామ ఆకాంక్ష. మీరు మీకు తెలిసిన చందమామ అభిమానులకు ఈ విషయం తెలియజేయండి.

అలాగే చందమామకు కథలు -1, 2, 3, 4 పేజీల కథలు, బేతాళ కథలు రాసి పంపగలవారు ఉంటే వారికి చందమామ తరపున సాదర స్వాగతం పలుకుతున్నాం. ఇప్పటికే గోదావరి లలితగారు (telugu4kids.com) ఆదూరు హైమవతి గారు కూడా తమ కథలు చందమామకు అమెరికా నుంచే పంపారు. కొన్ని ప్రచురణకు తీసుకున్నాము కూడా.

అమెరికాలోని తెలుగు చందమామ అభిమానులు, పాఠకులు తమ చందమామ జ్ఞాపకాలు, స్వీయరచనలు చందమామకు పంపించాలని మేం మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. మీరు మీ పరిధిలో ఉన్న మిత్రులకు, పరిచయస్తులకు వీలైనంతమందికి ఈవిషయం తెలియజేయగలరు.
ముందుగా మీ ఇద్దరి సోదరుల ఫోటోలు కాని, లేదంటే మీ ఫోటో కాని పంపుతూ మీ జ్ఞాపకాల ప్రచురణకు సమ్మతి తెలుపుతూ ఈమెయిల్ చేయగలరు.

అలాగే గత రెండు సంవత్సరాలుగా చందమామ తరపున కొన్ని మంచి ప్రచురణలు వచ్చాయి. ప్రీమియం క్వాలిటీ కావడంతో కాస్త ధర ఎక్కువగా ఉంటుంది కాని జీవిత కాలం చందమామ అభిమానులు దాచుకోవలసిన మంచి పుస్తకాలు. ఆర్థిక లేమినుంచి కాస్త బయపడి ఉంటారు కనుకు మీరు కూడా వీలయితే, ఆసక్తి ఉంటే చందమామ ప్రచురణలను తీసుకోగలరు.

1.  Chandamama Collector’s Book – 60 సంవత్సరాల ప్రత్యేక కథల సంచిక
2. Chandamama Ramayanam – సంపూర్ణ రంగుల కార్టూన్ పుస్తకం
3. Chandamama Art Book – చందమామ చిత్ర మాంత్రికులు చిత్రా, ఎంటీవీ ఆచార్య, శంకర్, వపా చిత్రించిన 400 వర్ణచిత్రాల పుస్తకం 1,2 భాగాలు

చందమామ సంప్రదాయానికి తగినట్లుగా ఈ పుస్తకాలలో ప్రతి పేజీలో వర్ణచిత్రాలతో ప్రచురించారు. పై రెండు పుస్తకాలు డిస్కౌంట్ తో రూ.800ల లోపు వెలతో ఇస్తున్నారు.

చివరిదైన ఆర్ట్ బుక్ 2010లో ప్రచురించిన తాజా పుస్తకం. కోట్లాది భారతీయ పాఠకులను గత 60 ఏళ్లుగా జానపద, పౌరాణిక, కాల్పనిక కథా చిత్ర మంత్ర జగత్తులో విహరింపజేస్తూ వచ్చిన చందమామ చిత్ర మాంత్రికులు చిత్రా, ఎంటీవీ ఆచార్య, శంకర్, వపా గార్లు గీసిన 400 మేటి వర్ణచిత్రాల సంకలనం ఈ పుస్తకం. నిస్సందేహంగా చందమామ నుంచి వచ్చిన ప్రచురణలలో ఇదొక మాస్టర్ పీస్. A4 కంటే పెద్ద సైజులో పూర్తి పేజీలో ఒక వర్ణచిత్రాన్ని పొందుపర్చిన ఈ రెండు భాగాల పుస్తకం చందమామ చిత్రప్రపంచం గురించి తెలిసిన పాఠకులు, అభిమానులకు కన్నుల విందు అని చెప్పడం అతిశయోక్తి కాదు.

400 పేజీలతో (Size: 9.5 x 12.5 inch) కూడిన ఈ రెండు భాగాల పుస్తకం వెల స్వదేశంలో Rs.1500. -ప్రీమియం క్వాలిటీతో ప్రచురిస్తున్నారు కాబట్టి చందమామ సంకలనాల ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి కాని. జీవితకాలం దాచుకోదగిన మంచి పుస్తకాలు అనడంలో సందేహం లేదు. మీరు ఆసక్తి ఉంటే ఆర్ట్ బుక్ వివరాలకోసం chandamama.com హోమ్ పేజీలోని Art Book యాడ్ చూడండి.

http://www.chandamama.com/artbook/

దాని ధరవరలు, ఎలా తెప్పించుకోవాలి అనే విషయాలు వివరంగా పై లింకులో పొందువర్చారు. అమెరికాకు దీన్ని తెప్పించుకోవాలంటే పోస్టేజీతో పాటు 60 డాలర్లు అవుతుంది.

నిస్సందేహంగా చందమామ ప్రీమియం క్వాలిటీ ప్రచురణలు మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకుని చేస్తున్నవి కావు. ఆసక్తి కలిగిన అధికాదాయ వర్గాల ప్రజలు మాత్రమే వీటిని కొనగలరు. చందమామ పాఠకులు మొదటినుంచి దిగువ, ఎగువ మధ్యతరగతి పాఠకులే కాబట్టి వారికి ప్రయోజనం కలిగించేలా తక్కువ ధరలతో పుస్తకాలు ప్రచురిస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తపరిచినా, యాజమాన్యం ఎందుకో హై ఎండ్ మార్కెట్ పైనే దృష్టి పెట్టింది.
అందుకే అధిక ధర ఉన్నప్పటికీ ఆసక్తి కలిగిన, కొనగలిగిన పాఠకులకు మాత్రమే ఈ పుస్తకాలను సిఫార్సు చేస్తున్నాము.

వివిధ భాషల్లో చందమామ జానపద కథలను ఆడియో రూపంలో అందించే పెద్ద ప్రాజెక్టు ఒకటి ఇటీవలే చేపట్టారు. పూర్తవగానే దీని  వివరాలు తెలియజేస్తాము.

అన్నిటికంటే మించి ఇటీవలి కాలంలో రచన సంపాదకులు శ్రీ శాయి గారు శ్రమకోర్చి తీసుకువచ్చిన 2010 మే నెల రచన ప్రత్యేక సంచిక గురించి చెప్పుకోవాలి. చందమామ పత్రికలో 1952 నుంచి 1980 దాకా అవిరామంగా వెలువడిన 12 ఆణిముత్యాల్లాంటి సీరియల్స్ ప్రచురించబడిన విషయం చందమామ అభిమానులందరికీ తెలిసిన విషయమే. తెలుగునాట ఆబాలగోపాలమూ నాటికి, ఈనాటికీ చెప్పుకుంటున్న కలవరిస్తున్న ఈ అపూర్వ ధారావాహికలను రాసిన ఒకే ఒక్కడు మాన్యులు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు.

తోకచుక్క, శిధిలాలయం, రాతిరథం, ముగ్గురు మాంత్రికులు, రాకాసిలోయ, పాతాళదుర్గం వంటి 12 సీరియల్స్ చందమామ కథా కీర్తికి కలికితురాయిలు. ఈ ఏడాది జనవరి 27న దాసరిగారు కన్నుమూసిన సందర్బంగా ఆయన జీవిత, సాహిత్య రచనా విశేషాలను, చందమామలో ఆయన ధారావాహికల వైభవోజ్వల గత చరిత్రను కరతలామలకంగా రచన మే నెల ప్రత్యేక సంచికలో ప్రస్తావించారు. దాదాపు 40మంది చందమామ రచయితలు, పాఠకులు, అభిమానులు దాసరి గారి గురించి, ఆయనతో తమ పరిచయం గురించి రాసిన, తమను తాము పరామర్శించుకున్న అపరూప జ్ఞాపకాల వల్లరి రచన మే ప్రత్యేక సంచికగా రూపొందింది.

ఈ సంచిక విశేషాలు తర్వాత జూన్, జూలై రచన సంచికలలో కూడా వచ్చాయి. ఈ మూడు నెలల పుస్తకాలు ప్రతి చందమామ పాఠకులు, అభిమానులూ జీవితాంతం దాచుకోవలసిన అపురూప పుస్తకాలంటే అతిశయోక్తి కాదు. మేనెల ప్రత్యేక సంచిక వెల రూ.50.00 కాగా తక్కిన రెండు సంచికల వెల కలిపి రూ.50.00.  ఇంకా ఈ పుస్తకాలను పొందలేకపోయిన వారు వందరూపాయలు చెల్లించి రచన పత్రిక సంపాదకులు శాయిగారి వద్దనుంచి తెప్పించుకోవచ్చు.

రచన శాయి గారి చిరునామా
Y V S R S Talpa Sai
Editor – RACHANA Telugu Monthly
1-9-286/2/P Vidyanagar
Hyderabad – 500 044
e mail : rachanapatrika@gmail.com
Ph : 040 – 2707 1500
Mobile : + 99485 77517
visit : www.rachana.net

చందమామ సీరియల్స్ గురించి, వాటి రూపకర్త దాసరి సుబ్రహ్మణ్యం గారి గురించి సమగ్ర వివరాలను తెలుసుకోదలిచిన వారు రచన మే, జూన్, జూలై సంచికలను తప్పక తీసుకుని భద్రపర్చుకోగలరు.

భూమి గుండ్రంగా ఉన్నట్లుగా చందమామ చెన్నయ్ నాలుగు మూలలా తిరిగి తిరిగి మళ్లీ తన మాతృస్థానానికే వచ్చింది. వడపళని ప్రాంతంలోని మురుగన్ కోయిల్ సమీపంలో, పాత చందమామ భవంతి -ఇప్పుడు లేదు-కి కూతవేటు దూరంలోనే చందమామ కొత్త ఆఫీసు ఉంది. ప్రధాన కార్యాలయం ముంబైలో జియోదెశిక్ భవంతిలో ఉండగా చెన్నయ్‌లో ఎడిటోరియల్ బోర్డ్ ఆఫీస్ మాత్రం ఉంది. 12 భారతీయ భాషల ఎడిటింగ్, లే అవుట్ డిజైనింగ్, ఫైనల్ మేకప్ పనులు చెన్నయ్ ఆఫీసులోనే జరుగుతున్నాయి.

Chandamama India Ltd.
No.2 Ground Floor,
Swathi Enclave,
Door Nos.5 & 6
Amman Koil Street,
Vadapalani,
Chennai- 600026.
Phone No: 044 43992828 Ext. 819

RTS Perm Link

చందమామ : అమ్మ జ్ఞాపకాలు

August 20th, 2010

అక్షరాల రుచి చూపించిన అమ్మ, కళల పట్ల కూడా అభిరుచి పెంపొందేలా నన్ను పెంచింది. చాలా ఏళ్ల వరకు సంతానం కలగని మా పెద్దమామయ్య సంరక్షణలో తాతగారింట పెరిగాన్నేను. నాన్న ఉద్యోగ రీత్యా కలకత్తాలో ఉండేవారు. వేసవి సెలవుల్లో స్నేహితులంతా తాతగారిళ్లకు వెళ్తుంటే నేను మాత్రం అమ్మా, నాన్న దగ్గరికి వెళ్తుండేవాణ్ణి.

వేసవి సెలవుల రెండు నెలల్లో కూడబెట్టిన జ్ఞాపకాలు మూటగట్టుకుని మళ్లీ వేసవి వరకూ అవే జ్ఞాపకాలతో గడిపేవాణ్ణి. సెలవులు ముగిశాక, అమ్మనీ, నాన్ననీ వీడి తాతగారింటికి తిరుగు ప్రయాణమయ్యేటపుడు ఆ చిన్నతనంలో నేననుభవించిన మనోవేదన నాకింకా గుర్తే.

తాతగారింట్లో హద్దుమీరిన ముద్దువల్ల అల్లరి అంచులు దాటిన నాకు క్రమశిక్షణ నేర్పించింది అమ్మే, కిటికీ గుండా వెన్నెల కిరణాలు పడుతుంటే, నిద్రపోయేముందు సుద్దులు చెబుతూ, చక్కని పాటలు పాడుతూ, మంచి మంచి కథలు చెబుతూ బలమైన వ్యక్తిత్వానికి పునాది వేసింది అమ్మ.

అమ్మ ఏకసంధాగ్రాహి. ఎక్కడ ఏ శ్లోకాలు, పాటలు చదివినా, విన్నా చక్కగా గుర్తుపెట్టుకునేది. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టడం, పెద్ద చదువులు చదువుకోలేకపోవడం వంటి ప్రతిబంధకాల వలన ఆమె ప్రతిభ ఇంటి నాలుగ్గోడలకే పరిమితమైపోయింది. మిక్కిలి ఆత్మగౌరవం, నిజాన్ని నిర్భయంగా వెల్లడించడం, తెగువ, ధైర్య సాహసాలు, ఆమె విశిష్ట వ్యక్తిత్వానికి నిదర్శనాలు.

తొమ్మిదో తరగతికి వచ్చాక మళ్లీ అమ్మ సంరక్షణలోకి పూర్తిగా వచ్చాను. ఇంట్లో ఆడపిల్లలు లేని కారణంగా అమ్మకి వంటింట్లోనూ, ఇంటి పనుల్లోనూ సహాయం చేస్తుండటం వల్ల సొంతంగా పనులు చేసుకునే అలవాటు అబ్బింది. తర్వాతి రోజుల్లో ఎయిర్‌ఫోర్స్‌లో చేరాక ఆ శిక్షణ ఎంతో ఉపకరించింది.

హైస్కూలు రోజుల్లో అమ్మకోసం లైబ్రరీ నుండి పక్కటౌన్ సోంపేట కాలేజీకి వెళ్లే రోజుల్లో మధ్యాహ్నం భోజనానికి అమ్మ డబ్బులిస్తే (కాలేజీకి క్యారేజీ మోసుకెళ్లడం నామోషీగా భావించడం వల్ల) ఆ డబ్బులతో పత్రికలు కొనేసి, రోజంతా ఆకలితో గడిపేసే వాణ్ణి. అందుకే చందమామకి నేను రాసే కథల్లో ‘కంచిలి’, ‘సోంపేట’ పేర్లు కలిసి వచ్చేలా ‘కంచిపేట’ అనే ఊహాజనిత పట్టణాన్ని సృష్టించుకున్నాను.

అమ్మకు దగ్గరయ్యానని సంబరపడుతున్న సమయంలోనే, చిన్నతనంలోనే ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం రావడంతో మళ్లీ అమ్మకు దూరమవ్వాల్సి వచ్చింది. ట్రైనింగ్‌లో ఉండగా ప్రతిరోజూ ఓ ఉత్తరం రాసి పైన సీరియల్ నెంబర్ వేసి మరీ పోస్ట్ చేసేవాణ్ణి. నా ఉత్తరం కోసం పిచ్చిదాన్లా ఎదురుచూసేది అమ్మ. మళ్లీ తర్వాతి ఉత్తరం అందేవరకు పదే పదే ఆ ఉత్తరాన్ని చదువుకునేది. నారాక గూర్చి ముందుగా తెలిశాక ఆ తేదీ కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూసేది.

అమ్మతో నాది చాలా ప్రత్యేకమైన అనుబంధం. బహుశా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అలానే అనుకుంటూ ఉండవచ్చు. తనకు ఇరవై ఏళ్ల వయసులో జన్మించాన్నేను. సముద్రంలా ఎప్పుడూ గంభీరంగా ఉండే నాన్న పడ్డ కష్టాలు అమ్మ అప్పుడప్పుడూ కథల్లాగా చెప్పడం వల్ల నాన్న మొదటినుంచి నాకు రోల్ మోడల్ అయ్యారు.

మూడేళ్ల క్రితం అమ్మకి తన 49వ ఏట అండాశయ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కొన్ని రోజుల పాటు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను. కేన్సర్ పేరు వింటేనే కృంగిపోతారని ఇంట్లో ఎవరికీ ఈ విషయం తెలయబర్చలేదు. అప్పుడే దృఢంగా నిశ్చయించుకున్నాను. ‘నా లక్ష్యం అమ్మని బతికించుకోవాలి’. చాలా దీనావస్థలో అమ్మని నాతో బాటు అంబాలా (హర్యానా)కుతీసుకువచ్చాను.

అమ్మ ధైర్యం, తెగువ కలది కనుక చికిత్స మొదట్లో సానుకూల ఫలితాన్ని ఇచ్చింది. ఆ తొలిరోజుల్లో నేను అక్షరాలా ప్రపంచాన్ని మరిచిపోయాను. ఆ సమయంలోనే గర్భవతి అయిన నా భార్యని కూడా అంతగా పట్టించుకోలేకపోయేవాణ్ణి.

అప్పుడే నాకు కుటుంబంలో ప్రేమ, అప్యాయత, అనుబంధాల విలువ తెలిసింది. అమ్మ, నాన్న, నేను, నా భార్య.. మా నలుగురం ఒక ప్రపంచంలో జీవించాము. అమ్మని ఒక గాజుబొమ్మలా చూసుకున్నాను.

నా భార్య ప్రసవం వరకూ బతికనా చాలనుకున్న అమ్మ చక్కగా తేరుకుని, నాకు బాబు పుట్టేవరకూ ఉండి, వాణ్ణి చూసుకుని మురిసిపోయింది. ఇలా ఈ మూడేళ్ల కాలం -  జీవితకాలపు అనుభవాలను నేర్పింది. మా నలుగురి మధ్యా బంధం గాఢత పెరిగింది. ఇన్నాళ్లూ ఒంటరిగా ఉన్న నాకు కుటుంబ విలువల మాధుర్యం తెలిసింది.

ఇంకా ఎన్నో భవిష్యత్ ప్రణాళికలు, ఆశలు, ఊహలు, అమ్మ, నాన్న, నేను చిన్ని (నా భార్య) కూర్చుని చర్చించుకునేవాళ్లం. నా అత్యాశ దేవుడికి నచ్చలేదేమో! అమ్మని నాకు అర్థంతరంగా దూరం చేశాడు. అమ్మ ఆరోగ్యం నయమైందని ఎందరు దేవుళ్లకు ఎంతగా మొక్కానో అందరూ కలిసి నన్ను మోసం చేసినట్లనిపించింది. అమ్మ మరి నాతో లేదన్న తలంపు నిత్యం గుండెని పిండేస్తోంది.

పత్రికల్లో నా కవితలూ, కథలూ (విశేషించి ‘చందమామ’లో) అచ్చయినప్పుడల్లా ఉబ్బి, తబ్బిబ్బయిపోయే మా అమ్మ పేరు చంద్రకళ. ఇంట్లో నా ముద్దు పేరు చందు. చనిపోవడానికి ఒకరోజు ముందు చందు బాబూ అని నవ్వుతూ పిల్చిన అమ్మ నా చేతుల్లోనే చివరి శ్వాస విడిచి, శాశ్వతంగా దూరమైంది.

ఆమె ఆలోచనలతో ప్రేరేపితుడినై నేను చేసే ప్రతి పనికీ ఎంతో ప్రోత్సహించే అమృతమూర్తి, నా ప్రతి విజయానికీ ఎంతో మురిసిపోయే మా అమ్మ భౌతికంగా దూరమైనా, మానసికంగా నాతోనే, నాలోనే ఉంది. త్యాగాలమయమైన ఆమె జీవితమే నాకు స్పూర్తి, ఆమె ఆశయాల సాధనే నా జీవిత లక్ష్యం.

నా ప్రాణప్రదమైన అమ్మ స్మృతులు ఇలా నలుగురితో పంచుకునేందుకు ప్రేరేపించిన రాజు గారికి కృతజ్ఞతలు.
–మల్లారెడ్డి మురళీ మోహన్
26-07-2010
మురళీ మోహన్ గారూ,

మీరు పంపిన అమ్మ జ్ఞాపకాలు అందాయి కన్నతల్లి గురించి మీరు భావోద్వేగంతో రాసిన ఆ అమృత వాక్యాలు చదువుతుంటే కళ్లు చమర్చాయి. ఎందుకంటే తల్లిదండ్రులను అర్థాంతరంగా పోగొట్టుకున్నవాళ్లం మేం. అందుకే మీ బాధ నన్ను అంతగా కదిలించింది. మీ ఉత్తరం అందుకున్న రోజే మెయిల్ చేయాలనుకున్నాను కాని పని ఒత్తిడితో కుదరలేదు.

మీకు మంచి వార్త ఈ మధ్య మళ్లీ మీ కథలు మరో నాలుగు ఎంపికయ్యాయి. ‘లౌక్యం’, ‘తిక్కరాజు పాలన’, ‘దివ్యపురుషుడు’ ప్రకృతి మహిమ”. నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఒక రచయిత కథలు ఇలా వరుసగా ఎంపిక కావడం చందమామ ఇటీవలి చరిత్రలో ఇదే మొదటిసారి. కథ చివరలో మీరు ముగిస్తున్న తీరు ఇక్కడ మా కంటెంట్ హెడ్ సౌమ్య గారిని చాలా బాగా ఆ కట్టుకుంటోంది. అందుకే ఒకే రచయిత కథలు వరుసగా వేయకూడదన్న పాలసీని కూడా పక్కన పెట్టి మిమ్మల్ని మరిన్ని కథలు రాసి పంపవలసిందిగా ఆమె కోరారు. ప్రత్యేకించి సింగిల్ పేజీ, టూపేజీ, త్రీ పేజీ కథలను ప్రధానంగా రాయమని మిమ్మల్ని ఆమె కోరారు. మీరు పాత కథలను చక్కటి ఫార్మేట్ ఎంచుకుని 2 పేజీలు కథలుగా మలుస్తున్నట్లుగానే సమకాలీన అంశాలతో కూడిన కథలను కూడా రాసి పంపగలరు.

అమ్మ కాన్సర్‌తో హఠాత్తుగా పోయిన వార్త ఆమెకు చెప్పి మీ ఉత్తరం జ్ఞాపకాల వివరాలు చెబితే సౌమ్య గారు కూడా కదిలిపోయారు. మీకు తన సహానుభూతి తెలియ జేయమని చెప్పారు. లౌక్యం కథలో ‘అన్నిటికంటే తీయనైనది తల్లి ప్రేమ’ అంటూ మీరు రాసింది చదివి వినిపిస్తుంటే, ఆమె మీ కథ ప్రింట్ అవుతున్నప్పుడు చివరలో తల్లి స్మృతిలో రచయిత రాసిన కథ గా బ్రాకెట్లో వేయమని కూడా చెప్పారు. ఏ మాత్రం వీలయినా ఈ సలహాను పాటిస్తాము.

మీరు కథను ముగిస్తున్న తీరు పట్ల ఆమె తన అభినందనలు మీకు తెలియ జేయమన్నారు. హర్యానాలో ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తూ కథలు పంపుతున్నారని విని ఆమె ఆశ్చర్యపోయారు. మీరు ఎయిర్‌ఫోర్స్‌లో  ఏ పని చేస్తున్నారని అడిగారు. తెలియదన్నాను. వీలయితే మీ బయోడేటా,  మీ అభిరుచులు, చందమామతో మీ పరిచయం, చందమామకు కథలు ఎప్పట్నుంచి పంపుతున్నారు –అంటే గత సంవత్సరం నుంచే పంపుతున్నారా లేదా ఇంతకు ముందు కూడా పంపించారా-  వంటి వివరాలు క్లుప్తంగానే పంపగలరు. చందమామ కథకులుగా మీ ప్రొఫైల్ మా వద్ద ఉంటే మంచిది కదా..

మీ మొబైల్ కి ఈరోజు చాలా సార్లు కాల్ చేశాను. (09034179713) కాని పనిచేయలేదు. కారణం తెలియదు. ఒకవేళ మీ మొబైల్ మారి ఉంటే కింద పొందుపర్చిన నా మొబైల్‌కి ఫోన్ చేయగలరు.

(ప్రస్తుతం మురళి గారి మొబైల్ పనిచే్స్తోంది)

అమ్మ జ్ఞాపకాల వేదన నుంచి కొంచెం కోలుకుని ఉంటారని ఆశిస్తున్నాము.

అమ్మ జ్ఞాపకాలుపై మీరు పంపిన రచన ఈ శుక్రవారమే చందమామ వెబ్‌సైట్‌లో, బ్లాగులో ప్రచురించగలము. వీలయితే, అమ్మ ఫోటోలను ఒకటి రెండు స్కాన్ చేసి త్వరగా పంపగలరు.

అమ్మను బతికించుకోవాలి అనే లక్ష్యంతో మూడేళ్లు కష్టపడ్డారు మీరు. విడి కుటుంబాల జీవన సంస్కృతి, ముసలి వయసులో పెద్దలకు పిల్లల అండ సరిగా అందనీయకుండా చేస్తున్న నేపథ్యం ప్రస్తుతం మన సమాజాన్ని ఆవరించి ఉంది. కాని అమ్మలో అమృతమూర్తిని చూసుకుంటూ మీరు మూడేళ్లు అమ్మను పసిపాపలా చూసుకున్నారు. కేన్సర్ మహమ్మారి ముందు మీరు ఓడిపోయి ఉండవచ్చు. కాని అవసరమైన సమయంలో పెద్దలకు చివరి వరకు అండగా నిలిబడవలసిన మానవీయ విలువను ప్రతిష్టించడంలో మీరు చివరివరకు గెలిచారు. అమ్మకు చివరి క్షణాల్లో చందమామ వంటి చల్లదనాన్ని పంచిపెట్టారు. ఆ రకంగా మీది సార్థక జీవితం.

మురళి గారూ, మీ జీవితం పొడవునా వెన్నెల కురిపించిన అమ్మ.. చివరి వరకూ గోరుముద్దలు తినిపించి మైమరింపించిన అమ్మ  చంద్రకళ ఎక్కడికీ పోలేదు. మనతోటే ఉంది. పున్నమి నాటి చందమామ కేసి చూడండి. మనందరినీ పలకరిస్తూ ఆమె నవ్వుతూ కనబడుతుంది. అక్కడే కాదు మన చందమామలో కూడా ఆమె ఉంది. లోకంలో అందరు అమ్మల ప్రేమాభిమానాలకు ప్రతిరూపంగా ఆమె చందమామలో శ్వాసిస్తోంది. మేము కూడా ఇక్కడి నుంచి ఆమెకు నమస్కరిస్తున్నాం.

అమ్మ జ్ఞాపకాలను చందమామతో, పాఠకులతో కూడా పంచుకుంటున్నందుకు మనఃపూర్వక కృతజ్ఞతలతో
రాజు.
NB: మురళీ మోహన్ అమ్మ చంద్రకళ గారి జ్ఞాపకాలను ఫోటోలతో సహా చూడాలంటే చందమామ వెబ్‌సైట్ లోని కింది లింకును తెరిచి చూడండి. ప్రస్తుతం బ్లాగు.కామ్ వారు ఇమేజ్ అప్‌డేషన్ సౌకర్యం తొలగించడంతో ఈ బ్లాగులో పాత కథనాల బొమ్మలు కూడా కనిపించడం లేదు.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2465

RTS Perm Link

కూరగాయల కథ

June 25th, 2010

బుడంకాయంత బుడ్డోడికి వంకాయంత వజ్రం దొరికిందట, ఆ బుడంకాయంత బుడ్డోడు ఆ వంకాయంత వజ్రాన్ని బీరకాయంత బీరువాలో దాచాడంట. ఆ చాచటాన్ని దోసకాయంత దొంగోడు చూస్తాడు. ఆ దోసకాయంత దొంగోడు బీరకాయంత బీరువా దగ్గరికి వచ్చి ఆ వంకాయంత వజ్రాన్ని తీస్తుంటే మునక్కాయంత ముసలవ్వ చూసి గుమ్మడికాయంత పోలీస్ స్టేషన్ కెళ్లి పొట్లకాయంత పోలీసులకు చెప్పుతుంది.

ఆ పొట్లకాయంత పోలీసులొచ్చి ఆ దొంగని పట్టుకొని, కాకరకాయంత కర్రతో కొట్టి, సొరకాయంత స్టేషన్లో ఉంచి, ఆ వంకాయంత వజ్రాన్ని ఆ బుడంకాయంత బుడ్డోడికి ఇప్పిస్తారు. అప్పుడు వాడు సంతోషించి, ఆ మునక్కాయంత ముసలవ్వకి చెంచలాకంత చెయ్యితో బచ్చలాకంత బహుమానం ఇస్తాడు.
- బి. గిరిబాబు

పాతాళదుర్గం 17 వ భాగాన్ని ఆన్‌లైన్ చందమామలో ప్రచురించవలసిందిగా కోరుతూ చందమామ మెయిల్ కమ్యూనికేషన్‌లోకి వచ్చిన బోయ గిరిబాబు గారు అడక్కుండానే తన చందమామ జ్ఞాపకాన్ని ఈ చిన్ని కథ రూపంలో పంపారు. కూరగాయలకు, మనుషులకు, వస్తువులకు, పోలిక పెట్టి కథ నడిపించే తీరు అచ్చంగా మన దేశంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న స్వచ్ఛమైన మౌఖిక సంప్రదాయానికి నమూనాగా నిలుస్తుంది.

ప్రస్తుతం ప్రింట్ చందమామలో ఇలాంటి కథలు అచ్చు వేయనప్పటికీ, మనందరి బాల్యం ఇలాంటి మౌఖిక కథలతో, ఊకొడితే గాని నోట్లోంచి ఊడిపడని కథలతోనే నడిచి ఉంటుంది.ఒకప్పుడు పల్లెటూళ్లలో పదిమంది పిల్లలు, పెద్దలు కూడితే చాలు… “ఒక ఊళ్లో ఒక రాజు ఉండేవాడంట. ఆతడికి ఏడుగురు కొడుకులంట..” అంటూ టకారాంత ప్రయోగంతో కథను అల్లుకుంటూ పోయే హృద్యమైన వాతావరణం రాజ్యమేలేది.

బుడంకాయంత బుడ్డోడు, వంకాయంత వజ్రం, బీరకాయంత బీరువా, దోసకాయంత దొంగోడు, మునక్కాయంత ముసలవ్వ, గుమ్మడి కాయంత పోలీస్ స్టేషన్, పొట్లకాయంత పోలీసులు.. మౌఖిక సాహిత్య శైలిలో కూడా ఆది ప్రాస ఎంత చక్కగా కుదిరిందో ఈ కథలో పోలికలన్నీ చెబుతున్నాయి.

రచయితలు, కథకులు పంపుతున్న కథలు సవరణకు గురైనప్పుడు ప్రత్యేక వ్యావహారిక భాషలోకి మారిపోయి వాటి సహజత్వం కోల్పోతున్నాయేమో అనిపిస్తుంటుంది. కాని సవరణలు లేకుండా, శిష్ట సాహిత్య రీతులకు అవతలనే ఉంటూ టకార ప్రయోగంతో మనిషి అల్లుకుంటున్న సహజమైన కథలను కూడా రికార్డు చేయవలసిన అవసరముంది. ఇప్పటికే ఇలాంటి ఎన్ని అపరూప కథలు -బహుశా వీటికి సాహిత్య గౌరవం లేకపోవచ్చు- తెలుగునేలపై అంతరించిపోయాయో చెప్పలేము.

మా చిన్నప్పుడు అంటే 1970లలో అమ్మ దగ్గిర, అవ్వ దగ్గర, తాత దగ్గిర కూర్చుని కథలు చెప్పించుకుని పిల్లలందరం సంబరపడేవాళ్లం. కొన్నాళ్లకు స్కూళ్లకు పోయాక, టౌన్లకు పోయాక కొత్త సినిమాలు, పాతసినిమాలు చూసే అవకాశం వచ్చినవారిని మధ్యలో కూచో బెట్టుకుని సినిమా కథ మొత్తం ఆ అదృష్టవంతుల నోట్లోంచి చెప్పించుకుంటూ గంటల కొద్దీ గడిపేవాళ్లం. ఇలా బాల్యమంతా కథలే. ఇంటర్మీడియట్‌లోకి వచ్చాక ఆ కథల ప్రపంచం స్థానంలో కొత్త సాహిత్యం, అభిరుచులతో కాలం కొట్టుకుపోయింది.

తన చిన్ని చందమామ జ్ఞాపకం ద్వారా మళ్లీ అందరి బాల్యాన్ని గుర్తు చేసిన గిరిబాబు గారికి ధన్యవాదాలు.
మీ చందమామ జ్ఞాపకాలను పోస్ట్ ద్వారా చందమామ ఆఫీసుకు-చెన్నయ్ చిరునామా మళ్లీ వడపళనికి మారింది- కాని, కింది ఈమెయిల్ ఐడీకి కాని పంపండి.
abhiprayam.@chandamama.com

తెలుగు ఆన్‌లైన్ చందమామలో చందమామ పాఠకులు, అభిమానులు, రచయితలు పంపిన చందమామ జ్ఞాపకాలకోసం కింది లింక్‌పై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

RTS Perm Link

‘చందమామ’ జ్ఞాపకాలతో వృధ్ధాప్యమూ పసితనమే…!!

June 18th, 2010

చందమామ యాజమాన్యం ‘ చందమామను (1947-2000) అన్‌లైన్‌లో పెట్టడమే ఓ గొప్ప సేవ! యధాలాపంగా కధలు చదువుతుండగా 1947 నాటికధ చదివి  ‘ నేను పుట్టిన సంవత్సరం నాటికధ’ నాలో స్పందన  కల్గించింది. చదివే ఊహ నాకు  కలిగినప్పటినుండీ చందమామను మానాయనగారు కొనితెచ్చేవారు.పెరిగేకొద్దీ’ కాసులు ‘దాచుకుని చందమామ కొని చదివి నాతర్వాతి వారికి వివరిస్తూ, ఊరిస్తూ చెప్పిన జ్ఞాపకం నాకింకాఉంది.

చందమామకు ఫోటో వ్యాఖ్యలు పంపాలనీ, దాన్లో అచ్చులో నాపేరు చూచుకోవాలనే కోరిక అమితంగా ఉండేది. చందమామకు కధలు వ్రాయాలనీ, అచ్చులో పేరుతోపాటుగా ఆ నా కధకు ఎలాంటి బొమ్మలు వేస్తారో అనే ఊహతో  పసితనమంతా గడచిపోయింది. ఆ ప్రయత్నం మాత్రం ఎందుకో జరగలేదు.అప్పట్లో పోస్టుకార్డు కొనడమే కష్టం, ఇహ కవరుకొని వ్రాసి పంపడమంటే మహా కష్టం.

చదువు, ఉపాధ్యాయ వృత్తిలో ఉద్యోగం, పల్లెల్లో పని చేయడం, నీతికధల పిరీయడ్‌లో పాత చందమామ కధలు పిల్లలకు  మరికొంత సంభాషణలు, వివరణలు జోడించి ఆసక్తిదాయకంగా చెప్పడం కూడానాకింకా గుర్తుంది. పల్లెల్లో పని చేసేప్పుడు స్కూల్ లోని పిల్లలందరిచేతా నయాపైసలు కూడబెట్టించి, చందమామ పుస్తకాలు నెలనెలా నేనే కొని పట్టు కెళ్ళి చదివించడమూ, ఆపైన వాటిని ‘ స్కూల్ లైబ్రరీ’లో ఉంచడమూ కూడా నాకింకాగుర్తే!.
         
స్కూల్‌లో చదువుకునేప్పుడు బోర్ కోట్టే పిరీయడ్‌లో నోట్‌బుక్‌లో చందమామ సంచిక పెట్టుకుని చదివిన రోజులూ గుర్తే. తోటి స్నేహితులు చూస్తే వారినీ  చదువుకోమని చూపిన సంఘటన ఇప్పటికీ నవ్వుతెప్పిస్తుంది. చందమామ చేసినంత సాహిత్యసేవ ఇంతింతనరానిది. చిన్నతనంలోనే పిల్లలకు, చదవడాన్నీ, కధలపట్ల మమకారాన్నీ నేర్పినది మాత్రం  చందమామే!

చందమామ నా ఉద్యోగ జీవితంలో బోధనకు సహకరించడమేకాక, ఆధ్యాత్మిక జీవితంలోనూ సహకరించడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. చందమామ ఎప్పటికీ అందరికీ ‘మామే!’ మరి. చందమామ జ్ఞాపకాలతో  వృధ్ధాప్యమూ పసితనంగానే ఉంటున్నది.  చందమామ జ్ఞాపకాలు మీఅందరితో పంచుకోడమూ ఎంతో ‘థ్రిల్లింగ్’గా ఉంది..

నేను 40 సంవత్సరాలు ఊపాధ్యాయినిగా పని చేసి విశ్రాంతి పొందిఉన్నాను. నా సర్వీసులో అంతా ‘ చందమామ కధల,నాస్టూడెంట్స్‌కు  చెప్తూ, చదివిస్తూ, వారికి తెలుగు నేర్ప్డమేకాక, కధలపట్ల ఆసక్తి  పెంచాను.నా అనుభవాలతో చిన్న చిన్న కధలు వ్రాస్తుండటం నావిశ్రాంత జీవనంలో కాలక్షేపంగా  ఉంది.

నా జీవితంలో 40సంవత్సరాలు పిల్లలతో గడపడం వల్ల నాకు పిల్లలతో మాట్లాడటమన్నా, వారికి పనికి వచ్చే పనులు కధలు, గేయాలు, నీతినేర్పే ఆటలు  క్రొత్తక్రొత్తవి  తయారు చేయడమన్నా మహా ఇష్టం. నాకు 64 సం.లు వచ్చినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా పిల్లలతోనే గడుపుతుంటాను, వారిలో ఒకరిగా, శేష జీవితాన్ని చందమామ స్నేహంతో గడపాలనేది నా కోరిక.
 
మామిత్రుడు  ఒక హైస్కుల్  ప్రధానోపాధ్యాయుడు  ఒకసభలో మాట్లాడుతూ ‘నేను హాయిగానిద్రపోతాను  అన్ని ఆలోచనలు మరచి, ఎందుకంటే పడుకునే ముందు చందమామ చదువుతాను’ అనిచెప్పారు. చందమామ పిల్లలకే కాక పెద్దలకూ మితృడేనన్నమాట!
చందమామ జ్ఞాపకాలు కోకొల్లలు. ఇంకా మరి కొన్ని ‘చందమామ జ్ఞాపకాలు’ మరోసారి…

“…..చందమామ కొనాలని ముందుగానే డబ్బు కూడబెట్టుకునే దాన్ని. ఆరోజుల్లో ఉపాధ్యాయుల జీతాలు చాలాతక్కువ. వారంలో ఓరోజు 5 కిలోమీటర్ల దూరంలో ఉండే స్కూల్‌కు నడిచి  ఆడబ్బుతో చందమామ వచ్చినరోజే కొని ఇంటికి వెళ్ళగానే ముందుగా ఫొటో వ్యాఖ్యలు చూసి, ‘అయ్యో ఇలా నేను వ్రాసి ఉండవలసింది’ అనుకుని, ఆనెల వ్యాఖ్యల గురించీ, ఆ వారమంతా ఆలోచించడమూ ఇంకా గుర్తుంది. చందమామ ‘ పిల్లలమామగా ‘ ‘మామ కాని మామ  చందమామ’. ఆకాశంలో చందమామ వెన్నెలనిస్తే, ఈచందమామ విజ్ఞానాన్నిస్తాడని  నా స్టుడెంట్స్‌కు  చెప్పడమూ గుర్తుంది.

చందమామ పిల్లల నేస్తమనీ, దాన్ని మించిన నేస్తం మరేదీ లేదనే నమ్మకంతో స్కూల్ పిల్లలచే చందమామ తప్పక ప్రతినెలా చదివించాను.. ఉద్యోగ జీవితంలో బోధనకు చందమామ బొమ్మలను, కథలను ఉపయోగించుకున్నాను.. కుమార్తె, కుమారులకూ చందమామ చదవడం అలవరచాను… 40 సంవత్సరాలు ఊపాధ్యాయినిగా పని చేసి, నా సర్వీసులో అంతా’ చందమామ కధలను, నా స్టూడెంట్స్‌కు చెప్తూ, చదివిస్తూ, వారికి తెలుగు నేర్ప్డమేకాక, కధలపట్ల ఆసక్తి  పెంచాను…”

శ్రీమతి ఆదూరి హైమవతి గారూ,

మీ ఆత్మనివేదనను జ్ఞాపకాల రూపంలో చందమామ కోసం పరిచి చూపారు.. మీ చిన్ని జీవితంలో మీరు చేసిన -పైన ఉటంకించిన- ప్రతి పనీ మంచిదే. మీ జన్మ సార్థకం అని మీరు వినమ్రంగా చెప్పుకున్నారు. కాని చందమామ జన్మ సార్థకమైందని మేం అనుకుంటున్నాము.

అక్షరాక్షరంలో పిండివెన్నెల చిలికించి మీరు అల్లిన వాక్యాలు చూస్తుంటే నాకు ఇటీవలే, రచన మే నెల ప్రత్యేక సంచిక -చందమామ కథల మాంత్రికుడు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారిపై ప్రత్యేక సంచిక- చూసిన సందర్భంగా ఢిల్లీలో కేంద్రమంత్రిత్వ శాఖలో కార్యాలయ కార్యదర్శిగా పనిచేస్తున్న మేడేపల్లి శేషు గారు చెప్పిన కింది మాటలు గుర్తుకొస్తున్నాయి.

“పిల్లలకు మెదడు ఒక్కటే కాదు, మనసూ ఉంటుందని గ్రహించకుండా వాళ్ళను ‘చదువుల యంత్రాలుగా’ మారుస్తున్న మన ప్రస్తుత విద్యవిధానమంటే నాకు మొదటినుంచీ అసహ్యమే. వాళ్ళను మరింత అసహ్యకరమైన వినోద (?) కార్యక్రమాలకు బలికావించే టి.వి. చానెల్సు అన్నా, ఇప్పటి సినిమాలన్నా నాకు మరింత అయిష్టం. నాకే కనుక విద్యావిధానాన్ని నిర్ణయించే అధికారమిస్తే, నెలకో రోజు ‘చందమామ’ చదివే పీరియడ్ పెడతాను. మార్కులతో పనిలేకుండా, వాళ్లకు కొన్ని పాఠ్య అంశాలు ప్రవేశపెడతాను. మంచి పుస్తకాలు చదివిస్తాను. మంచి చలన చిత్రాలు చూపిస్తాను. పరీక్షలకు బదులు వాటిగురించి చర్చ పెడతాను…

…..జ్ఞానంతోపాటు పిల్లల్లో మనసూ, బుద్ధీ కూడా వికసించాలి. అప్పుడే వాళ్లకు పరిపూర్ణ వ్యక్తిత్వం వస్తుంది. ఏ చదువు చదివితే ఎంత సంపాదించవచ్చు అనే పద్ధతిలోనే నడుస్తోంది మన ప్రస్తుత విద్యావిధానం. ఇది ఎటు వెళ్లి ఎటు తేలుతుందో అర్థం కాకుండా ఉంది. భాష, సాహిత్యం, కళలు అనేవి ఉపయోగంలేని వ్యాపకాలు అనే ధోరణి బాగా ప్రబలుతోంది. ఇది ముందు తరాలకు చాలా ప్రమాదం.”

మీకులాగే మేడేపల్లి శేషు గారి కల ఫలించాలని, మన రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు, బాలబాలికలకు చందమామ పత్రిక అందాలని, క్లాసుల్లో చందమామ చదివే పీరియడ్ అంటూ ఒకటి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మేం కూడా హైస్కూలులో తరగతి గదుల్లో టీచర్ పాఠం చెబుతుంటే చందమామ చదువుతూ పట్టుబడి దెబ్బలు తిన్నవాళ్లమే మరి.

కొసమెరుపు:

హైమవతి గారూ,
చందమామ నుంచి మీకు చల్లటి వార్త.

మీ ‘సందేశం’ కథను చందమామ ప్రచురణకు తీసుకుంటున్నాము. బహుశా మీ కథ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ప్రచురించబడవచ్చు. ప్రాథమిక ఎంపిక ఈరోజే పూర్తయింది.

చందమామలో కథ చూసుకోవాలనుకున్న మీ జీవిత కాల ఆకాంక్షను నెరవేరుస్తున్నందుకు మాకూ సంతోషంగా ఉంది. కొన్ని తరాల పిల్లలకు చందమామ కథలను, బొమ్మలను పరిచయం చేసిన మనీషి మీరు. మీ కథను ప్రచురించబోతూ చందమామ తనను తానే గౌరవించుకుటోందని భావిస్తున్నాము.

మీరు ఆరోగ్యం కాపాడుకుంటూ, ఇలాగే వీలు  కలిగినప్పుడల్లా 1, 2, 3 పేజీల కథలను పంపుతుంటారని ఆశిస్తున్నాము. మీరు ఉన్నది అమెరికాలోనే అయినప్పటికీ చందమామకూ మీకు అట్టే దూరం లేదు లెండి.

చందమామతో మీ ఈ కొత్త అనుబంధం కూడా దీర్ఘకాలం కొనసాగుతుందని ఆశిస్తున్నాము.

చందమామలో కథ చూసుకోవాలనుకుంటున్న మీ చిన్న ఆశను నెరవేర్చటానికి శాయశక్తులా ప్రయత్నిస్తాము. మీరు చిన్న కథలు ఇలాగే పంపిస్తూ ఉండండి. చందమామకు మీరు కధలు పంపటం మాకు గౌరవం, సంతోషం కూడా.

ఆదూరి హైమవతి గారి చందమామ జ్ఞాపకాల పూర్తి పాఠం కోసం.. కింది చందమామ వెబ్‌సైట్ లింకు చూడండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2453

మీ చందమామ జ్ఞాపకాలను పాఠకులతో పంచుకోదలిచారా? అయితే..
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.  మీ లేదా మీ పిల్లల ఫోటోతో సహా పంపండి.

లేదా
పోస్టులో కూడా, మారిన చందమామ కొత్త చిరునామా (చెన్నయ్‌)కు మీ జ్ఞాపకాలు పంపండి.

Chandamama India Limited
No.2 Ground Floor, Swathi Enclave
Door Nos.5 & 6, Amman Koil Street
Vadapalani, Chennai – 600026
Phone :  +91 44 43992828 Extn: 818

RTS Perm Link

ఊహలకు రెక్కలు తొడిగిన అందాల చందమామ

June 7th, 2010

ఇనగంటి రవిచంద్ర గారూ,

మీ చందమామ జ్ఞాపకాలు పంపిస్తూ తెలుగుభాషలోని తీయదనాన్నంతటినీ రంగరించిపోసినట్లుగా కిందివాక్యాలు రాశారు.

“మట్టి వాసన తప్ప మరో ప్రపంచం తెలియని నాకు బాహ్యప్రపంచపు ద్వారాలు తెరిచింది చందమామ.”

“చందమామలో ఉండేవి మామూలు కథలు కావు. ఊహా ప్రపంచంలోకి లాక్కుపోయే రెక్కల గుర్రాల్లాంటివి.”

“చిన్నపిల్లల మనసులు అప్పుడే పంటకు సిద్ధం చేసిన నేలలాంటివి. వాటిలో ఎలాంటి విత్తనాలు నాటితే అలాంటివి మొక్కలే మొలకెత్తుతాయి.”

“పెద్దయ్యే కొద్దీ బాహ్యప్రపంచపు వాస్తవాలతో మెదడు మొద్దుబారిపోతుందేమో గాని చిన్నపిల్లల ఊహలకు హద్దే లేదు. ఊహ ఎప్పుడూ ఆనందమే. అలాంటి ఊహలకు రెక్కలు తొడిగింది అందాల చందమామ.”

“నా వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించింది ఒకరు మా అమ్మమ్మ అయితే మరొకరు చందమామ.”

మీరు ఇంకా చిన్నవారే.. చందమామ నాలుగవ లేదా అయిదవ తరం పాఠకుల కోవకు చెంది ఉంటారనుకుంటున్నాను.అయినా చందమామ పట్ల అభిమానంలో పాత తరాలకు తీసిపోని అనురక్తి మీది.

ముఖ్యంగా “మట్టి వాసన తప్ప మరో ప్రపంచం తెలియని నాకు బాహ్యప్రపంచపు ద్వారాలు తెరిచింది చందమామ.” అనే మీ వాక్యం చదువుతుంటే గుండె పట్టేసింది నాకయితే.

చిన్నతనంలో చందమామతో మా అనుబంధపు జ్ఞాపకాల తడి తగులుతోందిప్పుడు..

మీరు చల్లగుండాలని, మీ అక్క గారి పిల్లలకు కూడా చందమామను పరిచయం చేస్తున్న మీ మమకారం చల్లగుండాలని, ఈ సాంప్రదాయం అనంతంగా ఇలా సాగిపోవాలని మేము కూడా మనసారా కోరుకుంటున్నాము.

బాల్యంలో చందమామను మీకు పరిచయం చేసిన మీ అమ్మమ్మ గారికి చందమామ పరామర్శలు తెలియజేయండి.

ఏప్రిల్ చివరలో పంపిన మీ చందమామ జ్ఞాపకాలను అనివార్య కారణాల వల్ల ఇంత ఆలస్యంగా ప్రచురిస్తున్నందుకు క్షమాపణలు.

రవిచంద్రగారి చందమామ జ్ఞాపకాలు పూర్తి పాఠంకోసం కింది లింకును తెరవండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2450
NB:
మీ చందమామ జ్ఞాపకాలను పాఠకులతో పంచుకోదలిచారా? అయితే..
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి. 
మీ లేదా మీ పిల్లల ఫోటోతో సహా పంపండి.

చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

RTS Perm Link

బాల్య సంస్కారం నేర్పిన చందమామ

May 14th, 2010

చందమామకు రెగ్యులర్‌గా కథలు పంపుతున్న మాన్యులు శ్రీ జొన్నలగడ్డ మార్కండేయులు గారు. రాజమండ్రిలో పుట్టి సమీపంలో ఉన్న పేరవరం గ్రామంలో పెరిగిన ఈయన  చిన్నప్పుడు చందమామ కోసం ఎదురుచూపులు చూసిన మరపురాని జ్ఞాపకాలు ఆయన పంపిన చందమామ ముచ్చట్లలో తడుముతూ, యాభై ఏళ్ల క్రితం రాజమండ్రి రావాలంటే లాంచీలలో, నావలలో ఒంటెద్దు బళ్లలో ప్రయాణం చేయవలసిన అపురూప జ్ఞాపకాలను చందమామ పాఠకులతో పంచుకున్నారు.

బాల్యంలో తాను చదివిన చందమామ కథలలోని వర్ణనను తమ చుట్టూ పరిసరాలకు అన్వయించుకుంటూ పరవశం చెందిన మార్కండేయులుగారు, “పెరట్లో దబ్బ చెట్టు కాయకపోతే చందమామ కథ చదివిన మేము లంకె బిందెలున్నాయని చెట్టు చుట్టూ తవ్వేశాము. లంకెబిందెలు దొరకలేదు గాని నేల గుల్లబారిందో ఏమో దబ్బచెట్టు కొద్ది రోజుల్లోనే పూత పూసి విరగకాసింది.” అంటూ చందమామ బాల్యాన్ని హృద్యంగా పంచుకున్నారు.

పైగా సంచార గ్రంధాలయాల లెక్కన ఊర్లుకు సైకిళ్లలో, తోపుడు బళ్లలో చందమామ, బాలమిత్ర తదితర కథల పుస్తకాలు,వారపత్రికలు తీసుకువచ్చి తెలుగువారి పుస్తక పఠనాభిరుచికి అపురూప తోడ్పాటు అందించిన రెడ్డి వంటి సాధారణ వ్యక్తుల చరిత్రను ఆయన ఈ చందమామ ముచ్చట్లలో తడిమారు.

ఎదుటివారిని ఏకవచనంతో సంబోధించిన ఘటనలో చందమామ చిన్నప్పుడు నేర్పిన సంస్కారాన్ని ఆయన తన ముచ్చటలో మనతో పంచుకున్నారు.

చందమామ ముచ్చట్లను ఆయన ఈ మెయిల్ ద్వారా ఏప్రిల్ చివరిలోనే పంపినప్పటికీ, గత రెండు వారాలుగా అనివార్య కారణాల వల్ల చందమామ వెబ్‌సైట్‌లో, బ్లాగులో పోస్టే చేయలేక పోయాము. ఆలస్యానికి క్షంతవ్యులము. అలాగే చందమామ అభిమాని ఇనగంటి రవిచంద్ర గారు కూడా చందమామ జ్ఞాపకాలను ఏప్రిల్ చివరలో పంపారు. వచ్చే శుక్రవారం వారి చందమామ జ్ఞాపకాలను పోస్ట్ చేయనున్నాము.

శ్రీ మార్కండేయులు గారు పంపిన చందమామ ముచ్చట్ల పూర్తి పాఠం కోసం కింది చందమామ వెబ్‌సైట్‌ లింకులో చూడగలరు.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2448

RTS Perm Link

బాలసాహిత్య సిరి చందమామ

April 26th, 2010

“తెలుగు సాహిత్యంలో బాల సాహిత్యానికి పెద్ద పీట వేసిన వారిలో చందమామ కుటుంబం ఒకటి. బాలసాహిత్యాన్ని బాలలే కాకుండా ఆబాల గోపాలం చదువుకొని ఆనందించే స్థాయికి తీసుకువచ్చిన ఘనత కూడా చందమామ కుటుంబానిదే అని చెప్పడం చర్విత చరిణమే! చందమామలో పనిచేసిన సాహిత్య కారులు బాలసాహిత్యానికి తమ ఊపిరులు ఊదారు. వారిలో సంచాలకులు చక్రపాణి నాగిరెడ్డి గార్ల వ్యవస్థాపక నైపుణ్యానికి తమ కలం బలంతో సాహిత్యాన్ని అత్యున్నత స్థానానికి తీసుకుపోయిన వారిలో కొడవటిగంటి కుటుంబరావు, దాసరి సుబ్రహ్మణ్యం ఆచంద్రతారార్కం తమ పేర్లు సాహిత్యాకాశంలో వెలిగింప చేశారు. చందమామకు అందిన కథలను చక్రపాణి గారి ఒరవడికి అనుకూలంగా తీర్చిదిద్దిన ఘనత వర్ణనాతీతం. పాఠకులకు కథ అందిన తీరు అమోఘంగా ఉంటే ఆ కథనందించిన వారికి తమ కథ అద్దుకున్న సొబగులు అంతకంటే అమోఘంగా కనిపించేవి.”

అంటూ చందమామ గురించి ఆప్తవ్యాక్యాలు పంపిన శ్రీ ఎమ్‌వీవీ సత్యనారాయణ గారు గత యాభైఏళ్లుగా మొదట అభిమాన పాఠకుడిగా, తర్వాత కథా రచయితగా చందమామతో సజీవ సంబంధాల్లో ఉంటూ వస్తున్నారు. తాను ఆరాధించే కుటుంబరావు గారు తన కథ ఆమోదించబడిన వార్త తెలిపితే సంతోషం. కుటుంబరావు గారి చేతుల్లో తమ కథలు పడ్డాయనే టెన్షన్, కొకు గారి సరసనే యువ మాసపత్రికలో తన కథ కూడా ప్రచురించబడితే అంబరమంత ఆనందం.

తదనంతర కాలంలో దాసరి సుబ్రహ్మణ్యం గారితో పరిచయం చివరి దాకా కొనసాగడం.. ఇవీ సత్యనారాయణ గారు తమ జీవితం పొడవునా పెంచుకుని వస్తున్న చందమామ జ్ఞాపకాలు. గత 30 ఏళ్లకు పైగా చందమామకు కథలు పంపుతూనే వస్తున్న ఈయన అలుపెరుగని చందమామ వీరాభిమాని. రెమ్యునరేషన్ మాట అటుంచితే చందమామ పత్రికలో తమ కథ పడితే చాలు.. అదే పరమానందంగా భావిస్తూ వచ్చిన అలనాటి కథకుల జాబితాలో సత్యనారాయణ గారిది కూడా తొలి వరుసే. గత 8 నెలల కాలంలో చందమామ జ్ఞాపకాలను కూడా పోస్ట్ ద్వారా పంపిన తొలి రచయిత ఈయనే మరి.

“చందమామ ఈనాడూ, ఆనాడూ, ఏనాడూ బాలలకు నిండు చందమామే! చందమమతో నా అనుబంధం యాభై ఏళ్ల నాటిదంటే అది నాకెందుకో పులకరింత కలిగించే అంశం. బాలసాహిత్యానికి చందమామ సృష్టించిన ఒరవడి ఆచంద్ర తారార్కం నిలిచే ఉంటుంది. తరాలు మారతాయి. చందమామ వెన్నెల మాత్రం అన్ని తరాలమీద ఒకే రకంగా ప్రసరిస్తుంది. తెలుగు వారి నట్టింట పత్రిక ఇప్పుడు రాష్ట్ర్రాల సరిహద్దులు చెరుపుకుంటూ ప్రయాణం సుస్థిరం చేసుకుంది. తెలుగు వారి కథలే ఇతర భాషల్లోకి తర్జుమా కావడం తెలుగు రచయితలకు గర్వకారణం. తెలుగు వెలుగుల జయకేతనం చందమామ. తరతరాల అందరి మామ చందమామ.”

ఇవి చందమామ పత్రికపై సత్యనారాయణ గారి ఆత్మీయ వాక్యాలు. రిటైరైన తర్వాత కూడా చందమామకు కథలు పంపించడానికి ఉత్సాహం చూపుతున్న సత్యనారాయణ గారికి చందమామ తరపున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు. మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చందమామకు రచనలు పంపగలరని, సూచనలు పంపించగలరని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.

ఎంవీవీ సత్యనారాయణ గారి చందమామ జ్ఞాపకాల పూర్తి పాఠం కోసం కింది లింకులో చూండండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2446

మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.

మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.  మీ లేదా మీ పిల్లల ఫోటోతో సహా పంపండి.
చందమామ.

RTS Perm Link

అరచేతిలో అందాల ‘చందమామ’

April 9th, 2010

గీతాప్రియ

‘చందమామ’ జ్ఞాపకాలకు సంబంధించి ‘అమ్మఒడి’ ఆదిలక్ష్మిగారిది ఓ వినూత్న అనుభవం. చిన్నప్పుడు నాన్న చదివి వినిపిస్తే తప్ప చందమామ కథను వినలేని అశక్తత లోంచి ‘నేనే చదువు నేర్చుకుంటే పోలా’ అనే పట్టుదలతో, స్వయంకృషి తోడుగా శరవేగంగా చదువు నేర్చుకున్న అరుదైన బాల్యం తనది. ఈ తీపి జ్ఞాపకాలను ఆమె మాటల్లోనే ఇక్కడ కొద్దిగా విందాం..

“నాన్నకి చదవటం వచ్చు కాబట్టి కదా చక చకా చదివేసాడు. మొదటి సారి ఇష్టంగా చదివేసేవాడు. మళ్ళీ చదవమంటే కుదరదనే వాడు.

’అదే నాకూ చదవటం వస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు, ఎంచక్కా చదివేసుకోవచ్చు’ - అన్న భావన, అక్షర క్రమం తెలియకుండానే మనసుకి అందింది. చదవటం రాక చందమామ బొమ్మలు పదేపదే చూసుకునే కొద్దీ పసి మనస్సు లోతుల్లో అక్షరాలు నేర్చుకోవాలనే తపన పెరిగింది.

వీధిబడిలో చేర్చగానే, ఇష్టంగా మారాం చేయకుండా అక్షరాలు నేర్చేసాను. పెద్ద బాలశిక్ష చాలా కొద్దీ రోజుల్లో పూర్తి చేసాను. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేటప్పటికే నాకు కథలు చదవటం వచ్చేసింది.

ఆ విధంగా చందమామ నాకు చదవటం నేర్పింది. చదువు కోవాల్సిన అవసరం నేర్పింది. చదువు నేర్పిన గురువుని గౌరవించటమూ నేర్పింది.”

చందమామ ద్వారా చదవటం నేర్చిన, చదువు నేర్పిన గురువును గౌరవించడం నేర్చిన ఆదిలక్ష్మిగారు, ఒకప్పుడు నాన్నతో తను పొందిన అనుభవాన్ని తన పాపాయి నుంచి కూడా ఎదుర్కొన్నారట. చందమామ కథను ఒకసారి చదివి వినిపిస్తే మళ్లీ మళ్లీ వినాలి అనే కుతూహలంతో తప్పుల తడకగా చందమామ కథను చదివి నవ్వించే పాప, ఒకట్రెండుసార్లు చదివి ఇక కుదరదంటే “నేను పెద్దయ్యాక నా పాపకి నీలా చదవను ఫో అనను. ఎన్నిసార్లయినా చదివి వినిపిస్తాను తెలుసా?” అంటూ బుంగమూతి పెట్టేదట.

ఇదీ చందమామ ఘనత, చందమామతో బంధం అల్లుకున్న తరతరాల తెలుగు కుటుంబాల ఘనత. ఆదిలక్ష్మిగారు, ఆమె జీవన సహచరుడు, వారి పాపాయి దశాబ్దాలుగా నింగిలోని చందమామతో పాటు నేలమీది ‘చందమామ’తో కూడా చెలిమి కొనసాగిస్తున్నారు. నేలమీది ‘చందమామ’తో ఇటీవలి వరకు ప్రత్యక్ష సంబంధం లేని ఆదిలక్ష్మి గారు ఇటీవలే చందమామతో పరిచయంలోకి వచ్చారు. 

నాన్న ద్వారా పరిచయం అయిన చందమామను కన్నకూతురికి కూడా పరిచయం చేయడమే కాదు… తాను పాఠాలు చెబుతున్న స్కూలు పిల్లలకు కూడా కథామృతాన్ని పంచిపెడుతూ, రేపటి తెలుగు తరాన్ని తయారుచేస్తున్న ఆదిలక్ష్మిగారూ… మీ చందమామ కుటుంబాన్ని చూసి చందమామ సిబ్బందిగా మేం గర్వపడుతున్నాం. 

చందమామతో మీ జ్ఞాపకాలను పంచుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఆదిలక్ష్మిగారి అరచేతిలో అందాల ‘చందమామ’ జ్ఞాపకాల పూర్తి పాఠం కోసం కింది చందమామ వెబ్‌సైట్ లింకులో చూడండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2444

ఈ కథనానికి గాను మార్చిన ఫోటో ఆదిలక్ష్మిగారి అమ్మాయి గీతాప్రియది. ఈమె చిన్నవయసులోనే ‘ఆహా ఓహో’ అనే బ్లాగు నడుపుతున్నారు.  http://paalameegada.blogspot.com/
ఈ బ్లాగు కూడా సహజంగా కథలకే ప్రాధాన్యత ఇస్తూండటం గమనార్హం. చూడగలరు.

చందమామ పాఠకులు తమ చందమామ జ్ఞాపకాలను కింది లింకుకు పంపగలరు.

abhiprayam@chandamama.com

RTS Perm Link

చక్రపాణి ప్రేరణతో రచయితనయ్యా..

April 1st, 2010

Tiru Kalanikethan balu garu

రచన పట్ల నా అనురక్తి 80 ఏళ్ల ముదివయస్సులో కూడా కొనసాగుతోంది. బడిలో చదువుకునే రోజుల్లోనే నాలో రాయాలనే కుతూహలం ఏర్పడింది. సుప్రసిద్ధ తమిళ రచయిత తమిళన్ రచనలతో ప్రభావితుడినయ్యాను. శక్తివంతమైన అతడి రచనా విధానం త్వరలోనే నన్ను ఆయన అభిమానిగా మార్చేసింది. ఏదో ఒకటి రాయాలి అనే నా తపనను ఇది మరింతగా పెంచింది.చెన్నయ్ లోని కన్నెమెరా లైబ్రరీని చాలాసార్లు సందర్శించేవాడిని. అక్కడ అరేబియన్ నైట్స్  వంటి పుస్తకాలను చదువుతూ ఆస్వాదించేవాడిని.

అయితే 1950లలో పిల్లలకోసం పెద్దగా పుస్తకాలు ఉండేవి కావు. ఆ సమయంలో పిల్లల పఠనావసరాలను తీర్చడానికి అంబులిమామ -తమిళ చందమామ- పత్రిక మాత్రమే వచ్చేది. ఈ పత్రిక గురించి మరింతగా తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో అప్పట్లోనే నేను చందమామ ఆఫీసుకు వెళ్లాను. అక్కడ ఓ పెద్దమనిషితో సమావేశమయ్యాను. ఆయనే చక్రపాణి అని తర్వాత చెప్పారు.

ఆయన నాతో ఎంతో ఆదరంగా మాట్లాడారు. ఎలా రాయాలి అనే విషయంపై నాకు అమూల్యమైన సలహాలు ఇచ్చారు. దీని తర్వాత ఆయన నన్ను 10-12 బీర్బల్ కథలను  రాయమని కోరారు. చందమామ చక్రపాణిగారితో ఈ అనుబంధం నా రచనా వృత్తిని ముందుకు తీసుకుపోయింది. ఆ ప్రభావంతోనే ఇవ్వాళ కూడా నేను మంజరి, దినమణి, దినమలర్, దినతంతి వంటి ప్రముఖ తమిళ పత్రికలకు కథలు, వ్యాసాలు రాసి పంపుతుంటాను 

నా అభిప్రాయం ప్రకారం చక్రపాణి శక్తియుక్తుల వల్లే చందమామ గత 60 ఏళ్లుగా తన ప్రజాదరణను నిలబెట్టుకుంటోంది.

చందమామ పాఠకులకు శుభాకాంక్షలు.

(కళానికేతన్ బాలు  పేరుతో ఎస్ బాలసుబ్రహ్మణ్యన్ గారు గత 50 ఏళ్లకు పైగా చందమామలో ఫోటో వ్యాఖ్యలకు క్రమం తప్పకుండా ఫోటోలు తీసి పంపుతున్నారు. ఒక ఆల్బమ్ నిండా ఒకే సారి పకృతి, జీవులు,జీవితం గురించిన  విశేషాలతో కూడిన వైవిధ్యభరితమైన ఫోటోలను ఆయన పంపుతుంటారు. చిన్నపాటి పాత కెమెరాతో ఫోటోలు తీయడమే తప్ప ఆధునిక టెక్నాలజీ జోలికి పోని ఈయనను చందమామ పనిమీద ఇటీవల ఫోన్ ద్వారా మాట్లాడినప్పుడు తన చందమామ జ్ఞాపకాలను పంచుకున్నారు.

తొలి పరిచయం తర్వాత చందమామ చక్రపాణి గారితో చక్కటి సాన్నిహిత్య సంబంధం ఏర్పడిందని ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకుని తిరిగేవారమని అలనాటి వెచ్చటి జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. చందమామకు తన కంట్రిబ్యూషన్, అంబులిమామ పత్రిక నెలవారీగా అందడం ఇవి తన జీవితంలో అత్యంత సంతోషకర క్షణాలుగా ఉంటున్నాయని. చెప్పారు.

రచన విషయంలో చక్రపాణి గారి సలహాలు విని, పాటించిన బాలుగారు 80 ఏళ్ల వయసులో కూడా ప్రముఖ తమిళ పత్రికలన్నింటికీ ఇప్పటికీ రచనలు పంపుతూనే ఉన్నారు. ఫోటోలు మాత్రమే కాకుండా చిన్న చిన్న కథలు చందమామకోసం పంపించవలసిందిగా కోరితే ఈ నెలలోనే నాలుగు కథలు రాసి పంపారు. వాటిలో ఒకటి ఎంపిక చేయడమైంది.

ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన “సహస్ర చంద్రోదయ దర్శనా”లను పూర్తి చేసుకున్న కళానికేతన్ బాలు గారు చందమామ సీనియర్ కంట్రిబ్యూటర్‌గా మాకు ప్రేరణగా నిలుస్తున్నారు.

ఆయన ఆరోగ్యంగా ఉండాలని, చివరివరకు రచనా వ్యాసంగం కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. ఆయనకు పూర్ణ జీవిత శుభాకాంక్షలు.
చందమామ

RTS Perm Link

చందమామ తీపి జ్ఞాపకాలు

March 19th, 2010

“చందమామ నా ప్రాణనేస్తం. అమ్మ తన చిన్నప్పుడు చందమామ, తోకచుక్క, పాతాళదుర్గం, చదువుతూ పెరిగింది. నేను అక్క, అన్న, చందమామ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూసేవాళ్లం. నేను సంస్కృతం నేర్చుకోవడం మొదలు పెట్టిన తరువాత సంస్కృతంలో చందమామ చదివేదాన్ని.

పెళ్లయి అమెరికా వెళ్లిన తరవాత అక్కడికి కూడా ప్రతినెలా, నాకోసం చందమామ వచ్చేది. నా స్నేహితులు, బంధువులు కూడా అంత క్రమంగా నాకు ఉత్తరాలు రాసేవారు కాదేమో! కాని, ప్రతినెలా క్రమం తప్పకుండా అనేక కథలు, కబుర్లు పట్టుకుని నాకోసం వచ్చేది చందమామ.
 
నేను 2000 సంవత్సరం ఆంగ్ల చందమామ ఫోటో కేఫ్షన్‌లో బహుమతి గెలుచుకున్నాను. అంబరమంత సంబరం వేసింది నాకు. ఇందులో పాతికేళ్ల నాటి కథలు ఎంత బాగుంటాయో! తరతరాలను ప్రభావితం చేస్తోంది చందమామ. మా అమ్మవాళ్ల తరం, మా తరం, ఇప్పుడు నా కూతురు,అందరూ చందమామ అభిమానులే!

మంచి అలవాట్లు, నీతి, నిజాయితీ, స్నేహం, విశ్వాసం నేర్పుతూనే పిల్లలకు పుస్తకాలు చదవటం నేర్పుతోంది చందమామ. టీవీ, కేబుల్‌తో ఇప్పుడు జనం పుస్తకాలను చదవడం తగ్గించేశారు. చిన్నపిల్లలు  చందమామ చదివితే, సద్గుణాలన్నింటితోపాటు పుస్తకాలు క్రమంగా చదవడం నేర్చుకుంటారు. ఎలాగూ ఇందులో పౌరాణికాలు, రామాయణం, భారత, భాగవతాదులు వస్తాయి కాబట్టి చిన్నప్పుడే మన సంస్కృతిని పిల్లలు నేర్చుకుంటారు.”

–శ్రీలేఖ కొచ్చెర్లకోట

(శ్రీలేఖ గారు సుప్రసిద్ధ చారిత్రక నవలా రచయిత శ్రీ ముదిగొండ శివప్రసాద్  గారి కుమార్తె. పెళ్లయి అమెరికా వెళ్లిన తర్వాత కూడా దాదాపు పదిహేను సంవత్సరాల పాటు చందమామను తెప్పించుకుని చదివారు. ఇటీవలే స్వదేశం తిరిగొచ్చాక హైదరాబాద్‌లో జర్నలిస్టుగా పనిచే్స్తూ దాదాపు 50 పైగా పిల్లల కథలను రాశారు. ముఖ్యంగా రోజూ తమ బాబుకు పడుకునే ముందు కథ చెబుతూ నిద్రపుచ్చే అలవాటు. ఆ అలవాటునుంచే పిల్లలకు ఏ కథలు చెబితే ఆసక్తికరంగా ఉంటుందో అనుభవ పూర్వకంగా తెలుసుకున్న ఈమె అలాంటి కథలనే ఎంచుకుని రాస్తున్నట్లు చెప్పారు.

అలా ఈ వారం “Mayank and Magic seed” అనే కథ ఇంగ్లీషులో  రాసి పంపారు. చదువుపై శ్రద్ధలేకుండా, మాట వినకుండా అల్లరి చిల్లరగా మెలిగే కొడుకుకు ఓ సన్యాసి ద్వారా మహిమాన్విత మామిడి విత్తనాన్ని ఇప్పించిన అమ్మ తనలో ఎలా మార్పు తీసుకువచ్చిందో చెప్పే కథ. మామిడి వనాన్ని రూపొందించడంలో సహాయం చేసి కొడుకు జీవితాన్ని మార్చిన ఇతివృత్తంతో కూడిన కథ. పేరుకు చిన్న కథే అయినా మహిమగల మామిడి విత్తనం పేరుతో పిల్లవాడిలో పరివర్తన తీసుకువచ్చిన చక్కటి కథ.

చూడగానే దీన్ని తెలుగుతో సహా ప్రాంతీయ భాషల చందమామలకు వేసుకుంటామని చెప్పడం జరిగింది. ఆమె ఇంగ్లీష్ చందమామ కోసం పంపిన కథను ఇలా హైజాక్ చేసి ప్రాంతీయ భాషలకోసం ఎంచుకున్నాము. ఆమె కోరిక మేరకు దీన్ని ఇంగ్లీష్ చందమామ పరిశీలనకు కూడా పంపిస్తామని చెప్పడమైంది. మామిడివిత్తనంలో మహత్తు మాటేమిటో గాని, సన్యాసి మాటలపై గురితో చదువుపై దృష్టి పెట్టిన మాయాంక్ రోజూ మామిడి చెట్టుకు నీళ్లు పోయడం ద్వారా పెద్ద చేసి దాని విత్తనాలను కూడా నాటి బీడుభూమిలో మామిడి చెట్ల వనాన్నే సృష్టించిన అపురూపమైన కథ ఇది.

కథ పంపినందుకు ఆమెకు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెబుతూ చందమామ జ్ఞాపకాలు కూడా రాసి పంపమని చెబితే ఆ రోజే తన జ్ఞాపకాలను రాసి పంపారు. పాతకథలను తీసివేయడం ద్వారా ఇంగ్లీష్ చందమామ క్వాలిటీ పడిపోయిందన్న బాధను కూడా నిష్కర్షగానే చెప్పారు. 

శ్రీలేఖ గారూ, చందమామకు కథ, జ్ఞాపకాలు, ఫీడ్‌బ్యాక్ కూడా ఒకే రోజులోనే పంపినందుకు ధన్యవాదాలు. పిల్లలకు కథలు చెప్పడంలో చక్కటి అనుభవం సాధించిన మీరు ఇలాంటి కథలను మళ్లీ మళ్లీ చందమామకు పంపగలరని ఆశిస్తున్నాము.

మీకు మన:పూర్వక కృతజ్ఞతలు.
చందమామ

మీ చందమామ జ్ఞాపకాలను కూడా రాసి కింది లింకుకు పంపగలరు. ఈ మెయిల్ సౌకర్యం లేనివారు పోస్ట్ ద్వారా కూడా ఇంగ్లీషు లేదా తెలుగులో మీ జ్ఞాపకాలను చందమామ చెన్నయ్ చిరునామాకు పంపగలరు.
abhiprayama@chandamama.com

తెలుగు చందమామ వెబ్‌సైట్‌లో చందమామ జ్ఞాపకాలు విభాగంలో కథనాలకోసం కింది లింకులో చూడండి
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

RTS Perm Link

చందమామ జ్ఞాపకమే కాదు.. ఒక అనుభవం!

March 17th, 2010

చందమామ అనగానే గుర్తుకి వచ్చేవి – వడ్డాది పాపయ్య గారు వేసిన ముఖ చిత్రాలు, సంపాదకీయం కింద కొలను, హంసలు, పైన వెన్నెల విరిసే చందమామ, ఆ చిత్రంలో వస్తూ ఉండే మార్పులూ, శంకర్ గారి పొందికైన బొమ్మలు, చిత్రా గారి చిత్ర విచిత్రాలు, చక్కని తెలుగు, నచ్చే కథలు. చందమామతో ఇంకో తోబుట్టువుతోనో, స్నేహితులతోనో పెనవేసుకుని ఉండేటటువంటి అనుబంధమూను. 

చందమామతో పాటు మరిన్ని పిలల్ల పత్రికలూ ఉన్నా, భాషలో, కథల ఎంపికలో, మరీ ముఖ్యంగా బొమ్మలలో  చందమామకి ఉన్న ప్రత్యేకత చందమామదే. చందమామ అభిమానులు చాలా మందికంటే విరుద్ధంగా తెలియనితనమో, పంచుకునే మనస్తత్వమో, పత్రికలను చదువుకోవడానికి అరువిచ్చి చాలా పోగొట్టుకున్నాము.

తర్వాత బంధువుల ఇంట్లో భోషాణంలాంటి పెద్ద చెక్క పెట్టె నిండా చందమామలుంటే వెళ్ళినప్పుడల్ల గబ గబా తీసుకుని చదివేదాన్ని. మమ్మల్ని కలవడానికి వస్తున్నావా, చందమామల కోసమా అని వారన్నా కూడా పట్టించుకునే దాన్ని కాదు. మరి వారు కూడా ఇంటికి పట్టుకెళ్ళనిచ్చే వారు కాదు కదా. 

మా ఇంటికి చందమామ వచ్చే రోజుల్లో, చందమామ రాగానే పోటీ పడి ఎవరు ముందు చదవగలుగుతామా అని ఆత్ర పడడమూ, అందరు చందమామ అభిమానులలాగానే మాకూ పరిపాటిగా ఉండేది. మా బేరాలు ఇలా ఉండేవి.

బొమ్మలు చూసి ఇస్తాను అనో, ఒక్క పేజీ కథ ఒకటి చదివి ఇచ్చేస్తాననో, లేక పోతే చదివే వారి పక్కనే కూర్చుని వారితో పాటే చదవడమో, రక రకాలుగా ప్రయత్నాలు సాగుతుండేవి మొదటి రుచి అందుకోవాలని. అలా హడావిడిగా మొత్తం పత్రిక తిరగేసినా, అందరి వంతులూ అయిపోయాక తీరిక సమయాలలో ఎవరికి వాళ్ళం తొందర లేకుండా మళ్ళీ మళ్ళీ చదువుకునే వాళ్ళం. ఇక ఆ తర్వాత బొమ్మలు మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చూసుకునే వాళ్ళం. అలా చూసుకుంటూనే ఉండే వాళ్ళం. ఆ కథల గురించీ, బొమ్మల గురించీ చర్చించుకునే వాళ్ళం.

చందమామ పూర్తి రంగులలో వచ్చినప్పుడు బేతాళ కథల ముందు విక్రమార్కుడి బొమ్మ తిరిగి రంగులలో శంకర్ మళ్ళీ వేశారని మా అన్నయ్య చెప్తే, అప్పుడు మేము find the differences ఆట లాగా తేడాలు వెతికి పట్టుకోవటానికి తెగ ప్రయత్నించాము. అసలు నమ్మలేకపోయాము. ఇక పౌరాణికాలకు వేసే  బొమ్మలన్నీ ఒక ఎత్తైతే, పేజీ నిండా  వేసే బొమ్మ అలా చూస్తున్న కొద్దీ చూడాలనిపించేది. ఆ దృశ్యంలోని వివరాలు వాటంతట అవే ఒక కథ చెప్పేవి, ఆ దృశ్యంలోనే ఒక పాత్రగా ఆదృశ్యంలో పాలు పంచుకుంటున్న అనుభూతిని ఊహించుకుంటూ ఎంతోసేపు గడిపేయగలిగే దాన్ని.

ఇక మాలో చిన్న వాళ్ళకి శంకర్ గారి బొమ్మలు ఎక్కువ ఇష్టంగా అనిపించేవి. తర్వాత తర్వాత చిత్రా గారి బొమ్మలనూ అర్థం చేసుకుని ఇంకా బాగా ఆనందించగలిగాము. వడ్డాది పాపయ్య గారు వేసిన బొమ్మలైతే అసలు ఎంత చూసినా తనివి తీరేది కాదు. ఆయన వేసిన ప్రతి బొమ్మలోనూ తన సంతకమే కాకుండా సంతకంలాంటి చిన్న బొమ్మను ప్రతిసారీ ఎక్కడో ఒక చోట ఉంచుతారని మా అన్నయ్య చెపితే అప్పట్నుంచీ ఆయన బొమ్మలలో ఆ గుర్తు కోసం వెతకటం ఇంకో సరదా అయ్యింది మాకు.

ఇంకా తీరిక దొరికినప్పుడు, మరీ  ముఖ్యంగా సెలవలప్పుడు,  చందమామ బొమ్మలు కాపీ చేసే ప్రయత్నాలు చేసే వాళ్ళము. మా రెండో అన్నయ్య బొమ్మలు బాగా వేస్తాడని మా ఇంట్లో మా అందరి నమ్మకం. తనూ అందుకు తగ్గట్టే అసలు మేము ప్రయత్నించడానికి కూడా సాహసం చెయ్యలేని వడ్డాది పాపయ్య గారి బొమ్మలను చూసి ప్రయత్నించే వాడు. అందులో వినాయకుడి కథలు ధారావాహికంగా వస్తున్నప్పుడు గణపతి బొమ్మలను చూసి తను వేయడం గుర్తుంది.  

చందమామ బొమ్మల గురించి ఎంత చెప్పినా తక్కువే. కొందరు బాలమిత్ర వంటి పత్రికలలో కూడా బాగా వేసే వారు. ఐనా చందమామ బొమ్మలు మనసును పూర్తిగా నింపేసేవి. ఇక బొమ్మల నుంచి కాస్త కథల జ్ఞాపకాల మీదికి దృష్టి మళ్ళిస్తాను. ఒక పేజీ కథల ఆకర్షణ ఏంటంటే , పైన చెప్పినట్టు బేరాలకి పనికి వచ్చేది. చాలా సార్లు అవి యుక్తికి సంబంధించినవో, హాస్యమో అయ్యుండేవి. భేతాళ కథలు లోకం, వ్యవహారం, నీతీ, సమగ్రత గురించిన విలువలకి బీజాలు తెలియకుండానే మనసులో నాటేవి. ఆలోచింప చేసేవి. అవి కాక 25 ఏళ్ళ నాటి చందమామ కథలు, చైనా జానపద కథలు, సీరియళ్ళూ వేటికవే సాటి. ఆ వైవిధ్యాన్ని మించి మరిన్ని కొత్త కథలు.

నేను చందమామలు చదివే రోజుల్లో, చివరికి శంకర్ బొమ్మలతో ఒక ధారావాహికం వచ్చేది. అలాంటి వాటిల్లో ఒక దాంట్లో తేనె పూసిన రొట్టెలు బలే నోరూరించేవి. ఇంకో దాంట్లో మేలి ముసుగు గురించి చెప్పడమూ, బొమ్మల్లో అటువంటి వస్త్రాలలోని పారదర్శకత్వం చిత్రీకరణ గుర్తుండి పోయాయి. ఇంకో ధారావాహికం, ఆర్కైవులలో వెతికి పట్టుకున్నాను. గంధర్వ చక్రవర్తి కూతురు కథ. అందులో హీరో ఆ అమ్మాయి రెక్కలను దాచేస్తాడు. ఆమె అవి తిరిగి సంపాదించడానికి చాలా ప్రయత్నిస్తుంది. మళ్ళీ చదవాలి. ఆ కథ చాలా నచ్చేది నాకు. నాకిప్పటీకీ చందమామ కథలు చిత్రించిన దృశ్యాలలోకి (బొమ్మలే కాదు, కథలూ మాటలతో  చిత్రీకరించేవి), లోకాలలోకి వెళ్ళిన అనుభూతి గుర్తుకు వస్తుంది, కథలకన్నా కూడా ఎక్కువగా.
 
ఇంకా, పౌరాణిక ధారావాహికాల్లో వినాయకుడి కథ ఎక్కువ గుర్తుకు వస్తోంది. ఆ బొమ్మలు మళ్ళీ. ఇక ఏం చెప్పాలి. వినాయకుడి విగ్రహాల పోటీ, అందులో మట్టితో చేసిన చిన్న విగ్రహానికి బహుమతి రావడం, మేము ప్రతి సంవత్సరం మట్టి బొమ్మ తెచ్చుకుని రంగులు వేసి పూజ చేఉకోవడంలో ఉన్న ఆనందాన్ని మరింత పెంచాయి. కృష్ణుడు పాలు పితుకుతూ చంద్రుడి ప్రతిబింబాన్ని పాలలో చూడడం అందరికీ తెలిసిన కథే.

దానికి దారి తీస్తూ సాయంకాల సమయంలో  వాతావరణాన్ని వర్ణించిన తీరు నిజంగా కళ్ళకి కట్టినట్లు ఉండేది. ఇప్పటికీ అప్పుడప్పుడూ అలా ఆ చిత్రం అలా మనసు కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది.
అలా గుర్తుకు వచ్చే ఎన్నో జ్ఞాపకాలను అనుభవించగలను కాని, రాయడానికి పూనుకోవడం పెద్ద సాహసమే అవుతుంది.
 
ఒక కథ, ‘విచిత్రపురి’ అని ఒక బాటసారికి దారి తప్పినప్పుదు ఒక విచిత్రమైన ఊళ్ళో వింత అనుభవాలు(కాలికి దెబ్బ తగిలితే కాలుని తీసి వైద్యం చేసి మళ్ళీ అతికించడం లాంటివి) కలుగుతాయి.
చివరికి తన ఊరికి వచ్చి ఆ విచిత్రమైన అనుభవాలను చెప్తే ఎవరూ నమ్మరనుకుంటాను. చెప్పాను కదా, కథ కంటే కథ మిగిల్చిన అనుభూతులు ఎక్కువగా మిగిలాయని.

ఇప్పుడు  ఆ కథ గురించి రాస్తుంటే అప్పుడు అది చదువుతున్నప్పుడు  కలిగిన అనుభూతే కలుగుతోంది. మాటలలో పెట్టడం చాత కావట్లేదంతే.
 
చందమామ ఒక జ్ఞాపకమే కాదు ఒక అనుభవం. 

లలిత (తెలుగు4కిడ్స్.కామ్)
http://telugu4kids.com

(చందమామ జ్ఞాపకాలను హృద్యంగా పాఠకులతో పంచుకున్నందుకు లలితగారికి ధన్యవాదాలు. )

ఈ కథనం పూర్తి పాఠాన్ని ఆన్‌లైన్ చందమామలో కూడా చూడగలరు

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2436

మీ చందమామ జ్ఞాపకాలను కూడా కింది లింకుకు పంపగలరు.

abhiprayam@chnadamama.com

RTS Perm Link

నాన్నా! చందమామ తీసుకురానా!!

March 12th, 2010

(చందమామ అనుకోగానే గుర్తొచ్చేవి బొమ్మలే అంటున్నారు మేధాగారు. చందమామలో కథల కంటే కూడా బొమ్మలు చాలా బావుండేవని తన అభిప్రాయం. యువరాణి ఎంత అందంగా ఉంటుందో చూడాలంటే చందమామలోనే చూడాలంటున్నారు. కథలు కూడా ఏ వ్యక్తిత్వ వికాసానికీ తీసిపోని విజ్ఞాన గనులట. “గుణపాఠాలు నేర్చుకునే కధలు, మార్పు(పశ్చాత్తాపం) గురించిన కధలు, మంచిగా ఉండేవాళ్ల కధలు.. చిన్నప్పటి నుండి ఇలాంటివి చదవడం వల్ల, మనకి తెలియకుండానే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాం.. ఎప్పుడైనా తప్పు చేయాల్సి వచ్చినా భయమేస్తుంది, ఆ కధలోలా నాకు కూడా ఏమైనా జరుగుతుందేమో అని..” అంటున్నారు.

తరాలుగా చందమామను చదువుతూ వచ్చిన వారి మనోభావాలకు చందమామ జ్ఞాపకాలు ఓ ప్రతీక. ‘మా బామ్మ చదివింది చందమామ, మా అమ్మ చదివింది చందమామ, నేను చదివాను చందమామ..’ అంటూ గ్రైఫ్ వాటర్ ప్రకటనను గుర్తు చేయడం ద్వారా చందమామను ఇంటిల్లిపాదీ ఎలా తమ హృదయాలకు హత్తుకునేవారో తేల్చి చెప్పారు. చక్కటి చందమామ జ్ఞాపకాలు పంపిన మేధాగారికి కృతజ్ఞతాభినవందనలు. నాలోనేను పేరిట చక్కటి బ్లాగును కూడా తను నిర్వహిస్తున్నారు.

“ఇప్పటికీ బస్టాండ్‌లో బస్ కోసం నించున్నప్పుడు నాన్నగారు ‘చందమామ తీసుకురానా!’ అంటుంటారు..” బిడ్డకు చందమామను కొనిపెట్టే తండ్రి… చందమామను పిల్లలకు కొని ఇవ్వగలిగిన తెలుగు కుటుంబాలు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే పని చేస్తున్నాయనుకుంటాను. ఏమయినా మీ జన్మ ధన్యమైనది. మీ నాన్నగారికి చందమామ తరపున మనఃపూర్వక వందనాలు.

మేధాగారి చందమామ జ్ఞాపకాల పూర్తి పాఠాన్ని ఇక్కడ చదవండి.)

చందమామ – 1970/80/90 ల తరానికి పరిచయం అక్కర్లేని పత్రిక.. పిల్లల పత్రికల్లో అగ్రతాంబూలం అందిపుచ్చుకున్న పత్రిక. కేవలం పిల్లల పత్రిక అంటే, చంపిలు నా మీద దండెత్తే ప్రమాదం కూడా ఉంది.. :)

చందమామతో పరిచయం ఎలా జరిగిందో గుర్తు లేదు కానీ, నేను చదివిన మొదటి పుస్తకం మాత్రం చందమామే!.. అదేదో గ్రైఫ్‌వాటర్ ప్రకటనలోలా, మా బామ్మ చదివింది చందమామ, మా అమ్మ చదివింది చందమామ, నేను చదివాను చందమామ..!

అప్పట్లో చందమామ వస్తుంది అంటే చకోర పక్షుల్లా ఎదురు చూసే వాళ్ళం.. మేము ఉన్న ఊర్లో ఈ పుస్తకాలు దొరికేవి కాదు, అందుకని ప్రక్క ఊరికి వెళ్ళి తీసుకు వచ్చేవారు నాన్నగారు.. ఈ రోజు వెళ్ళి తీసుకు వస్తాను అంటే, నాన్నగారు వచ్చేసరికల్లా, చదువంతా పూర్తి చేసుకుని, ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం.. అది రాగానే, నా కంటే నాకు అని గొడవలు, పోట్లాటలు..

చందమామ అనుకోగానే, గుర్తొచ్చేవి బొమ్మలు.. కధల కంటే కూడా బొమ్మలు చాలా బావుండేవి.. రాము(రాముడు మంచి బాలుడు) ఇలానే ఉంటాడేమో.. పాపం విక్రమార్కుడు ఇలా బేతాళుడిని మోసుకువెళ్ళేవాడా, అబ్బ ఆ యువరాణి ఎంత అందంగా ఉందో! గయ్యాళి గంగమ్మ ఇలానే ఉంటుందా.. బొమ్మలు అంటే ముఖచిత్రం గురించి కూడా చెప్పాలి.. ఆ నెలలో ఏమైనా పండగలు ఉంటే వాటికి తగ్గ బొమ్మలతో అందంగా ముస్తాబై ఉండేది..

కధల గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఏ వ్యక్తిత్వ వికాసానికి తీసిపోని విజ్ఞాన గనులు. విలువలు నేర్పుతూ, ఊహాశక్తిని పెంపొందిస్తూ, సమస్యల చిక్కుముడులు ఎలా విప్పదీయాలో చూపిస్తూ, క్రొత్త విషయాలు నేర్పుతూ, చరిత్రని గురించిన సంగతులు, పురాణాలు, ఇతిహాసాలు.. ఒహటేమిటి, అదీ-ఇదీ అని కాదు, లేనిది లేనే లేదు..

నీతి కధల్లోనే ఎన్నో రకాలు.. గుణపాఠాలు నేర్చుకునే కధలు, మార్పు(పశ్చాత్తాపం) గురించిన కధలు, మంచిగా ఉండేవాళ్ల కధలు – ఇలా ఎన్నో.. చిన్నప్పటి నుండి ఇలాంటివి చదవడం వల్ల, మనకి తెలియకుండానే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాం.. ఎప్పుడైనా తప్పు చేయాల్సి వచ్చినా భయమేస్తుంది, ఆ కధలోలా నాకు కూడా ఏమైనా జరుగుతుందేమో అని.. అలా పిల్లల వ్యక్తిత్వాలని తీర్చిదిద్దే పత్రిక చందమామ అంటే అతిశయోక్తి కాదేమో..

ఇక విక్రమార్కుడి కధలు అసలు సిసలు విశ్లేషణా సామర్థ్యం ఉన్న కధలు.. మరీ చిన్నప్పుడు ముగింపు చదివితే తప్ప ఇలా పరిష్కరిస్తారు అని తెలిసేది కాదు.. తరువాత తరువాత కాస్త కాస్త విశ్లేషణ చేయడం, అప్పుడప్పుడు నేను అనుకున్నట్లు లేకపోతే అమ్మతో ఎందుకు ఇలా ఉంది, ఇలా కూడా ఉండచ్చు కదా అని వాదనలు.

ఇక సీరియల్స్.. యండమూరిలు, యధ్ధనపూడిలు, డాన్ బ్రౌన్‌లు సరిపోరు అనిపిస్తుంది.. ఆ సీరియల్ కోసం మళ్ళీ నెల ఆగాలంటే అమ్మో అనిపించేది.. ముగింపు వచ్చిన సంచిక ప్రక్కన పెట్టుకుని మళ్ళీ అన్ని భాగాలు చదివితే తప్ప తృప్తిగా ఉండేది కాదు.

వీటన్నింటితో పాటు, ప్రముఖుల జీవిత చరిత్రలు చిట్టి-పొట్టి కధల రూపంలో వస్తుండేవి.. ఇక్కడ కూడా మళ్ళీ బొమ్మలదే ప్రముఖ పాత్ర..

మొదట్లో సంపాదకీయం చదివేదాన్ని కాదు కానీ, కొంచెం పెద్దయిన తరువాత అది కూడా చదవడం మొదలుపెట్టాను.. తక్కువ పదాలలో, చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా ఎలా చెప్పాలో తెలుస్తుంది!

ఇవన్నీ ఒకెత్తు, పురాణాల గురించిన కధలు ఇంకో ఎత్తు. ఇప్పుడంటే డేటాబేస్ బాగా దెబ్బతింది కానీ అప్పట్లో, పురాణాలలో ఏ కధ గురించి అడిగినా కూడా తడుముకోకుండా చెప్పగలిగి ఉండేదాన్ని.. మా తమ్ముడైతే ఒకడుగు ముందుకేసి, మా పిన్నిలని, మామయ్యలని ఎక్కడెక్కడి ప్రశ్నలో అడిగి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు.

ఇంకా ప్రకటనలు, మీకు తెలుసా అంటూ క్విజ్‍లు, బొమ్మకి వ్యాఖ్యలు.. అదో నోస్టాల్జియా..

కొసమెరుపేంటంటే, ఇప్పటికీ బస్టాండ్‌లో బస్ కోసం నించున్నప్పుడు నాన్నగారు ‘చందమామ తీసుకురానా!’ అంటుంటారు..

–మేధా
http://nalonenu.blogspot.com

మేధాగారి చందమామ జ్ఞాపకాలను చందమామ వెబ్‌సైట్‌లో కూడా కింది లింకులో చూడగలరు
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2433

మీ చందమామ జ్ఞాపకాలను కూడా రాసి కింది లింకుకు పంపగలరు.
abhiprayam@chandamama.com

RTS Perm Link

చందమామ కథలూ, జ్ఞాపకాలూ…

February 26th, 2010

chandamama-logo-306-300

సీతారాం ప్రసాద్ గారూ, చందమామ బ్లాగులో ‘మీ విశ్వాసాలతో మేం ఏకీభవించకపోవచ్చు…’ అనే నా మునుపటి కథనంపై వ్యాఖ్యల ద్వారా మీరు చందమామ బ్లాగును చూశారు. దాంతోపాటు చందమామ వెబ్‌సైట్‌ను కూడా తొలిసారి చూసి మీ ఆనందాన్ని వ్యాఖ్యలద్వారా పంచుకున్నారు.

చందమామ వెబ్‌సైట్‌ని మీరు చూసి సంతోషం వ్యక్తం చేసినందుకు మీకు కృతజ్ఞతలు. చందమామ అభిమానిగా మీరు చందమామ వెబ్‌సైట్, బ్లాగుతో అనుబంధాన్ని కొనసాగిస్తారని దృఢంగా విశ్వసిస్తున్నాం. మీ కోసం, చందమామ పాఠకులకోసం కింది వివరాలు పొందుపరుస్తున్నాం.

1947 నుంచి 2000 వరకు అన్ని చందమామలు ఆన్‌లైన్ చందమామ ఆర్కైవ్స్‌లో ఉన్నాయి కనుక మీరు వీలైనప్పుడల్లా ఆర్కైవ్స్‌ను చూసి చందమామ కథలను ఆస్వాదించవచ్చు.

ప్రపంచంలో ఏ పత్రికా, ఏ వెబ్‌సైట్ కూడా తన పాఠకులకు అందించని విధంగా 53ఏళ్లుగా చందమామలో వచ్చిన వేలాది కథలను చందమామ ఆన్‌లైన్ ద్వారా తన పాఠకులకు అదీ ఉచితంగా అందిస్తోంది. -త్వరలో 2008 వరకు చందమామ కథలను ఆన్‌లైన్ భాండాగారంలో ఉంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.-

చందమామ కథల భాండాగారంలో పొందుపర్చిన వేలాది కథలు, ధారావాహికల కోసం కింది లింకులో చూడండి.
చందమామ కథల భాండాగారం

దీనికి పాఠకులుగా, అభిమానులుగా మీరెంత సంతోషిస్తున్నారో చందమామ సిబ్బందిగా మేం అంత గర్వపడుతున్నాం. తెలుగు జాతికే కాదు భారతీయ కథల ప్రేమికులందరికీ ఆన్‌లైన్ భాండాగారం ద్వారా కథామృతాన్ని ఉచితంగా పంచిపెట్టగలుగుతున్నందుకు చందమామ పత్రిక, అందులో పనిచేస్తున్న సిబ్బంది జీవితం ధన్యమైందనే మేం భావిస్తున్నాం.

60 ఏళ్లుగా వస్తున్న చందమామ కథలను పైసా ఖర్చు లేకుండా ఆన్‌లైన్ ద్వారా పాఠకులకు అందించడానికి మేం గత సంవత్సర కాలం పైగా చేసిన కృషిని మీ వంటి పాఠకులు, అభిమానులు చూసి, చదివి హృదయపూర్వకంగా పంపుతున్న అభినందనలు చూసినప్పుడల్లా మాకందరికీ ఒకటే అనుభూతి.. జీవితంలో మర్చిపోలేని ఓ మహత్కార్యాన్ని చందమామ సిబ్బందిగా మేం సాధించామని ఉప్పొంగిపోతుంటాము.

ఇన్ని వేల కథలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న చందమామ ప్రియులకు, అభిమానులకు అందించడానికి తెర వెనుక యాజమాన్యం, సిబ్బంది పడిన, పడుతున్న కష్టం మేం చెప్పుకోకూడదు. కాని మీలాంటివారు ఆన్‌లైన్ ఆర్కైవ్స్‌లో చందమామ పాత కథలను చదివినప్పుడు, మర్చిపోలేని ఆ బాల్య జ్ఞాపకాలను మీరు మళ్లీ గుర్తుచేసుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నప్పడు మేం పొందుతున్న సంతోషం మాత్రం మాటల్లో వర్ణించలేము. ఒక జీవితకాలానికి సరిపడే మహదానందానుభూతి మమ్మల్ని కదిలించివేస్తుంటుంది.

ఈ సందర్భంగా మీకూ, చందమామ అభిమానులకు ఒక విజ్ఞప్తి. చందమామ సిబ్బందిగా మేం చేస్తున్న ఈ కృషిలో లోపాలు, దిద్దుకోవలసిన అంశాలు మీ దృష్టికి వస్తే తప్పక మాతో ఈమెయిల్స్ ద్వారా, చందమామ ఆఫీసుకు ఉత్తరాల ద్వారా పంచుకోగలరు.

చందమామ పత్రిక, వెబ్‌సైట్ నిర్వహణకు సంబంధించి మీరు పంపే వ్యాఖ్యలు, ఉత్తరాలు మా పనికి మరింత విలువ తీసుకునివస్తాయి. చందమామలో మీరు కోరుకుంటున్న ఇతర అంశాలను కూడా వ్యాఖ్యల ద్వారా పంపగలరు.

అలాగే… చందమామ అభిమానులు, పాఠకులు తమ బాల్య జీవితంలో చందమామతో పరిచయం పొందిన మర్చిపోలేని క్షణాలను అందరితో పంచుకోవడానికి గాను “మా చందమామ జ్ఞాపకాలు” పేరిట ఆన్‌లైన్ చందమామలో ఓ విభాగం తెరిచాము.
మా చందమామ జ్ఞాపకాలు

ఇప్పటికే 20మంది పాఠకులు, అభిమానులు, ప్రముఖ బ్లాగర్లు చందమామతో బాల్య జ్ఞాపకాల మధుర క్షణాలను తల్చుకుంటూ ఆన్‌లైన్ చందమామకు తమ అనుభూతులను రాసి పంపారు. మీరూ, ఇతర చందమామ అభిమానులు కూడా ఈ విభాగంలోని కథనాలు చూసి చందమామ పత్రికతో మీ తొలి పరిచయం అనుభవాలను కూడా పంచుకోవాలని కోరుతున్నాం.

“మా చందమామ జ్ఞాపకాలు”  పూర్తిగా చందమామ పాఠకుల, అభిమానులకు అంకితమైన విభాగం కనుక వీలైనంత ఎక్కువమంది పాఠకులు, ఆన్‌లైన్‌ చందమామతో పరిచయం ఉన్న పాఠకులు తమ చందమామ జ్ఞాపకాలను తప్పక పంపించాలని కోరుకుంటున్నాం.

ఇన్నేళ్ల చందమామ జీవితంలో పాఠకులకు నచ్చిన చందమామ కథలు చాలానే ఉంటాయి. చందమామలో మీకు నచ్చిన కథ, కథలు, సీరియల్స్ గురించి పరిచయం చేస్తూ కథనాలు రాసి పంపితే వాటిని మీ పేరుతో తెలుగు ఆన్‌లైన్ చందమామలో ప్రచురించగలం.

ఆన్‌లైన్‌లో మీకు నచ్చిన చందమామ కథల పరిచయం, మీ చందమామ జ్ఞాపకాలు వంటి కథనాలను కింది లింకుకు పంపగలరు. అలాగే చందమామ వెబ్‌సైట్‌, అందులోని కథలపై మీ అభిప్రాయాన్ని కూడా కింది లింకుకు పంపగలరు.
abhiprayam@chandamama.com   (telugu online chandamama)

సీతారాం ప్రసాద్ గారూ,

మీ వంటి సహృదయపాఠకులను పొందడం ‘చందమామకు గర్వకారణం. నా వెనుకటి కథనంపై మీ వ్యాఖ్య ఆధారంగా మళ్లీ ఈ కథనం ప్రచురిస్తున్నాను. మీ వ్యాఖ్య వ్యక్తిగతం కాదు కాబట్టి చందమామ పాఠకులతో పంచుకోవడం అవసరమని భావించి మిమ్మల్ని సంబోధిస్తూ రూపొందించిన ఈ కథనాన్ని ప్రచురించడానికి సాహసిస్తూ, ఇందుకు అన్యధా భావించరని ఆశిస్తున్నాను

మీ పర్సనల్ ఈ మెయిల్‌ వ్యాఖ్య లింకులో ఉంది కాబట్టి, చందమామపై విశేష వ్యాసాలు, విశిష్ట కథనాలు ప్రచురిస్తూ వస్తున్న ప్రముఖ చందమామ బ్లాగర్ల బ్లాగ్ లింకులను నేను సేకరించగలిగినంత మేరకు మీకు పంపిస్తాను. మీ ఈమెయిల్‌ను కూడా చందమామ అభిమానుల ఈమెయిళ్ల జాబితాలో పొందుపరుస్తున్నాను. 

చందమామతో మీ అనుబంధం దీర్ఘకాలం కొనసాగుతుందని, కొనసాగాలని మనసారా కోరుకుంటూ…

రాజశేఖర రాజు,
అసోసియేట్ ఎడిటర్
rajasekhara.raju@chandamama.com  (telugu online & print chandamama)

తెలుగు చందమామ వెబ్‌సైట్ లింక్
http://www.chandamama.com/lang/index.php?lng=TEL

(తెలుగు చందమామ వెబ్‌సైట్. or)
www.telugu.chandamama.com

గమనిక. చందమామతో తమ బాల్య జ్ఞాపకాలను, చందమామ కథల పరిచయాన్ని తెలుగులో పంపడానికి టైపింగ్ తెలియని వారు ఇంగ్లీషులో కూడా వాటిని పంపవచ్చు.

నోట్: సీతారాం ప్రసాద్ గారు కింది బ్లాగ్‌లో “ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్” పేరిట చక్కటి సీరియల్ కథ రాశారు. వీలైతే చూడగలరు.

http://bondalapati.wordpress.com/

RTS Perm Link

చందమామలు ప్రసాదించినవారికి…!

January 13th, 2010

chandamama-logo-306-300

అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ నుంచి మద్రాసుకు పనిమీద వచ్చిన మా మోహన్ అన్న -కె.మోహన్ రాజు-ను ఈ జనవరి 1న చెన్నయ్ ఐఐటి గెస్ట్ హౌస్‌లో కలిశాను. తను ఎస్కేయూలో ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. పోతూ పోతూ ఇంగ్లీష్, తెలుగు చందమామలు పాతవి కొత్తవి కొన్ని పట్టుకెళ్లాను. చందమామలో నా పని వివరాలు తెలుసుకుని నేను తీసుకువచ్చిన కొత్త చందమామలు తిరగేశారు.

ఈ సందర్భంగా ఆయనకూ, చందమామకూ అనుబంధం చాలా కాలం కొనసాగిన వైనం మొదటిసారిగా తెలియవచ్చింది. 1970ల చివరలోఆయన ఎస్కే యూనివర్శిటీలో రీసెర్చ్ మొదలెట్టారు. అప్పటినుంచి రీసెర్చ్ పూర్తయి అదే వర్శిటీలో ఉద్యోగం సంపాదించిన తర్వాత కూడా ఆయన చందమామలను కొని పదిలపర్చడం సాగించారట.

దాదాపు 1996 వరకు దాదాపు 15 ఏళ్లకు పైగా చందమామలను ఆయన క్రమం తప్పకుండా తీసుకుని సంవత్సరానికి రెండు బౌండ్ల లెక్కన వాటిని భద్రపర్చారట. చిన్నప్పటినుంచి తాను కొంటూ వచ్చిన ఏ పుస్తకాన్నయినా చదవకుండా వదిలిపెట్టింది లేదని, ఇప్పటికీ ఆనాటి పత్రికలు తన ఇంటిలో లైబ్రరీలో భద్రంగా ఉంచానని ఆయన తెలిపారు.

తాను చెప్పే ఆర్గానిక్ సబ్జెక్ట్ కోసం స్వంత ఖర్చులతో వేలరూపాయలు విలువచేసే పుస్తకాలు కూడా ఎన్నో కొని పదిలపర్చారు. టీచింగ్ కోసం అవసరమై ఓసారి దాదాపు 20 వేల రూపాయలు ఖరీదు చేసే సబ్జెక్ట్ పుస్తకం కూడా అమెరికా నుంచి తెప్పించుకున్నారట.

ఈ సందర్భంగా పుస్తకాల గురించి, వాటిని పోగొట్టకుండా భద్రపర్చుకోవడం గురించి ఆయన నాకు పాఠం చెప్పారు. పుస్తకం విలువ తెలియని వారే పుస్తకాలు అరువు తీసుకుని తర్వాత తిరిగి ఇవ్వరని, అలాగే పుస్తకాల విలువ తెలిసినవారు కొన్న తర్వాత ఎప్పటికీ వాటిని పోగొట్టుకోరని ఆయన చెప్పారు. 20 ఏళ్లుగా జీవితం మలుపుల్లో వందలాది పుస్తకాలను కొని, సేకరించి పోగొట్టుకున్న నాకు గతుక్కుమంది ఒక్కసారిగా. కానీ ఇదొక అనివార్యత. అంతే…

96-98లో చందమామ అజ్ఞాతవాసం చేసిన కాలంలో ఆయనకు చందమామతో సంబంధం తెగిపోయింది. తర్వాత దాన్ని తీసుకోలేక పోయానని, తిరిగి చందా కట్టాలని ఎన్నోసార్లు అనుకున్నానని ఇప్పుడు నువ్వే కలిశావు కాబట్టి ఈ జనవరి నుంచి ఇంగ్లీషు, తెలుగు చందమామలు చందా కడతానని చెప్పారు.

చందమామకు తిరిగి చందా కడతానని తను చెప్పడం సంతోషం కలిగిస్తున్నప్పటికీ మా అన్న చెప్పిన మరో అంశంపైనే దృష్టి పెట్టాను. చందమామ పాత కాపీలు చందమామ అభిమానులకు అడపాదడపా దొరుకుతున్నాయని తెలిసినప్పుడు వారి కంటే ముందుగా నేను ఎగిరి గంతేసి పాత చందమామలు దొరికాయోచ్ అని బ్లాగులో పెట్టి అందరితో పంచుకున్నవాడిని..

పాత చందమామలు

పాత చందమామలు

ఇప్పుడు మా పెద్దనాన్న కుమారుడు, మా అన్న వద్దే 15 ఏళ్ల పైగా చందామామలు ఉన్నాయని వినగానే గాల్లో తేలిపోయాను. ‘ఇంతకూ ఏం చేస్తారు వాటిని’ అని అడిగాను. మీరు వాటిని వదిలించుకోవాలని ఎప్పటికయినా అనుకుంటే వెంటనే నాకు కబురంపమని, అఘమేఘాలమీద వచ్చి వాలిపోతానని చెప్పాను.

ఆయన అంత సులభంగా చందమామలను వదులుకోరని అర్థమవుతున్నప్పటికీ ఎందుకైనా మంచిదని ఓ రాయి వేశాను. ఒకవేళ తాను చందమామలు ఎవరికయనా ఇచ్చేయాలనుకుంటే.. ముందువరుసలో మనమే ఉంటే మంచిది కదా.. చావుతెలివి కూడా ఒక్కోసారి పనికివస్తుంది కదా..

ఇక చందమామకు చందా కట్టడం గురించి… ఆయన చందా కడతానని సంవత్సరానికి ఎంతవుతుందో చెప్పమని అడిగారు. ఒక్కసారిగా నా ఆలోచనలు 35 సంవత్సరాలు వెనక్కు వెళ్లాయి. మేం హైస్కూల్ చదువుతున్న రోజుల్లో అంటే ఆరేడు తరగతుల్లోనే మాకు చందమామతో పరిచయం ఏర్పడడానికి మూలకారకులు మా సుధాకర్, పురుషోత్తం, మోహన్ అన్నలే కారణం.

మా నాన్న తొలిసారిగా చందమామను తెచ్చి చదవండిరా.. జ్ఞానమొస్తుంది అన్నప్పటికీ అప్పట్లో చందమామ క్రమం తప్పకుండా మా కుటుంబాల్లోని పిల్లలందరికీ అందడానికి కారకులు మా అన్నలే. పనిమీద రాయచోటికి, కడపకు పోతున్న ప్రతిసారీ చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు తెమ్మని మేం అడగటం, వారిలో ఎవరో ఒకరు వాటిని తీసుకురావడం. మా కుటుంబాల్లో ఇంటిల్లిపాదీ వాటిని అపురూపంగా దాచుకుని దాచుకుని మరీ చదవటం. ముందుచదివిన వారు ఇంకా చదవని వారికి ఆ కథలు చెప్పి ఊరించడం. ఇలా మా అందమైన చందమామ బాల్యానికి వెలుగురేఖలు తెచ్చింది వీరు. 

ఈ కృతజ్ఞతా భావంతోటే ఇప్పుడు మా మోహనన్న చందా కడతానని అనేసరికి ‘వద్దులేండి నేనే ఈ సంవత్సరం చందా కట్టి మీకు పంపుతాను’ అని అన్నాను. దాదాపు ఏడెనిమిదేళ్లు మా బాల్యం నిండా చందమామ తీపి గురుతులను పంచిన వారికి నేను చూపించవలసిన కనీస కృతజ్ఞత అని ఆ క్షణంలో నాకు అనిపించింది. ఈరోజే తెలుగు, ఇంగ్లీష్ చందమామలకు గాను చందమామ ఆఫీసులో మా మోహనన్న ఇంటి చిరునామా ఇచ్చాను.

మా బాల్యాన్ని చందమామ అనుభూతులతో నింపినవారికి రుణం ఇలా తీర్చుకుంటున్నానేమో మరి. మా పురుషోత్తం అన్నకు కూడా చందమామ ఇవ్వాలి. ఆయనకు ఇద్దరు కూతుళ్లు స్వప్న, సంధ్య. 70ల చివర్లో వీరిని ఎత్తుకుని పెంచాము. చందమామ కథలు చెప్పి జోకొట్టాము.

మా కళ్లముందు చిన్న పిల్లలుగా మెలిగిన వీరు ఈరోజు చదువుల్లో ముందుకు పోయారు, స్వప్న ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చదువు ముగించి అక్కడే ఉద్యోగం చేస్తోంది. పురుషోత్తం అన్న, మధు వదిన కూడా ఇప్పుడు కూతురును చూడడానికి ఆస్ట్రేలియా వెళ్లారు. తిరిగి రాగానే వారికి చందమామ పంపాలి. సుధాకర్ అన్న ఇప్పుడు లేరు. వారి పిల్లలిద్దరూ అమెరికా బాటపట్టారు. కాబట్టి దొరకరు.

రుణాలను ఒక్కోసారి జీవితకాలంలో కూడా తీర్చడం సాధ్యం కాకపోవచ్చు.. కానీ చందమామను పంచిపెట్టిన మా అన్నల రుణం ఇలా తీర్చుకునే అవకాశం దొరకడం నిజంగా నన్ను ఉత్తేజితుడిని చేస్తోంది. నేను పంపుతున్న చందమామను ఈ వయసులో కూడా వారు చదువుతారని నాకు నమ్మకం ఉంది.

NB: చందమామ పాఠకులు, అభిమానులు, పెద్దలు, పిన్నలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ చందమామ జ్ఞాపకాలను ఆన్‌లైన్ చందమామ ప్రచురణకోసం పంపడం మరవకండి.

రేపటినుంచి ఈ ఆదివారం వరకు బెంగళూరులో మా చెల్లెలు ఇంటికి వెళుతున్నాను. తిరిగి 18వ తేదీనే కలుసుకుందాం. అంతవరకు సెలవు.

రాజు
mobile: 9884612596
Email: krajasekhara@gmail.com
rajasekhara.raju@chandamama.com

RTS Perm Link

ఆన్‌లైన్‌లో 53 ఏళ్ల చందమామలు

December 31st, 2009

First issue cover of TELUGU

చందమామ కథలు

“భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు. సున్నిత హాస్యంతో, విజ్ఞాన, వినోదాత్మకమైన చక్కటి చందమామ కథలు చక్రపాణి నిర్దేశకత్వంలో కొడవటిగంటి కుటుంబరావు పెట్టిన ఒరవడిలోనే సాగుతూ, తరాలు మారినా పాఠకులను ఎంతో అలరించాయి. ఇప్పటికీ అప్పటి కథలు మళ్ళీ మళ్ళీ ప్రచురించబడి అలరిస్తూనే ఉన్నాయి.”

చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారి 12 అద్వితీయ ధారావాహికలు, (తోకచుక్క, శిధిలాలయం, రాకాసిలోయ, యక్షపర్వతం, పాతాళదుర్ఘం వగైరా) 55 ఏళ్లుగా చందమామలో నిరవధికంగా ప్రచురితమవుతున్న బేతాళకథలు, పరోపకారి పాపన్న, తాతయ్య చెప్పిన కథలు, గుండుభీమన్న, సాహసయాత్రలు, గ్రీకు పురాణ గాధలు చందమామ కథల చరిత్రలో మకుటాయమానంగా నిలిచి ఈనాటికీ పాఠకుల ఆదరణ పొందుతూ వస్తున్నాయి.

చందమామలో దయ్యాల కథలు కూడా పుష్కలంగా ఉండేవి. కాని, అవి పిల్లల్లో మూఢ నమ్మకాలను పెంచేవిగా ఉండేవి కావు. దయ్యాలంటే సామాన్యంగా భయం ఉంటుంది, ముఖ్యంగా పిల్లలకు. అయితే, చందమామలోని కథలు అటువంటి కారణంలేని భయాలను పెంచి పోషించేట్లుగా ఉండేవి కావు. చందమామ కథల్లో ఉండే దయ్యాల పాత్రలు ఎంతో సామాన్యంగా, మనకి సరదా పుట్టించేట్లుగా ఉండేవి. అవి ఎక్కడైనా కనిపిస్తాయేమో చూద్దాం అనిపించేది.

దయ్యాలకు వేసే బొమ్మలు కూడా సూచనప్రాయంగా ఉండేవి గానీ పిల్లలను భయభ్రాంతులను చేసేట్లు ఉండేవి కాదు. సామాన్యంగా దయ్యాల పాత్రలు రెండు రకాలుగా ఉండేవి – ఒకటి, మంచివారికి సాయం చేసే మంచి దయ్యాలు, రెండు, కేవలం సరదా కోసం తమాషాలు చేసే చిలిపి దయ్యాలు. తెలుగు నాట దెయ్యాల కథలకు విశేష గౌరవం కల్పించిన ఘనత చందమామది.

మనుషులకు సహాయం చేసే దెయ్యాలు, రాక్షసులు, మనిషి కష్టాలు సుఖాలలో తోడు వచ్చే దెయ్యాలు చందమామ కథల్లో తప్ప ఇంకెక్కడ ఉంటాయి. అందుకే అప్పటి దెయ్యాల కథలను చందమామ పాఠకులు ఈనాటికీ గుండెలకు హత్తుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.

“దాదాపు ఆరు దశాబ్దాలుగా లక్షలాది మంది పిల్లల్ని ఆకట్టుకుంటూ, వారిని ఊహాలోకంలో విహరింపజేస్తున్న చందమామ కథలు, వారు సత్ప్రవర్తనతో, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేట్లుగా, నిజాయితీ, లోకజ్ఞానం, నైతిక ప్రవర్తన, కృతజ్ఞత, వినయం, పెద్దల పట్ల గౌరవం, ఆత్మాభిమానం, పౌరుషం, దృఢ సంకల్పం మొదలగు మంచి లక్షణాలను అలవరచుకునేలా చేస్తూవచ్చాయి.”

చందమామ చిత్రాలు

తెలుగు సాహిత్యం చదివిన వారిలో ” చందమామ “, ” యువ ” పత్రికలు కొంతవరకైనా చదవని వారు ఉండరు. కాలానుగుణముగా ఈ పత్రికలకు లక్షల అభిమానులను సంపాయించుకున్నాయి. అవి అంత జనాదరణ పొందడానికి కారణం చక్కటి కధలు, వాటితో ఉండే సందర్భోచిత కధా చిత్రాలు. ముఖ చిత్రం కూడ తనదైన శైలిలో ప్రత్యేకత ఉట్టిపడుతూంటుంది.

ఆ ఊహా చిత్రాలను తమ మనస్సులోంచి, కుంచెతో రూపుదిద్ది జీవం పోసిన చందమామ చిత్రకారులు చిత్రా, వడ్డాది పాపయ్య (వపా), ఎంటీవీ ఆచార్య, శంకర్ గార్లు. దాదాపు అరవై ఏళ్ళ పాటు – ” చందమామ ” పత్రిక ముఖ చిత్రాలు, కధా చిత్రాల ద్వారా వీరు తమ కుంచెతో చిత్రకళాద్భుతాలు సృస్టిస్తూ కధలను కళ్ళకి కడుతూ దేశంలో చదువరుల అభిమానాన్ని సంపాయించుకుంటూ వచ్చారు.

తెలుగు చదువరులు మరచిపోలేని ” చందమామ – ముఖ చిత్రాలు ” వీరి చిత్రకళా సృష్టే. చందమామ పత్రిక ముఖ చిత్రాలు, విభిన్న కధా చిత్రాలు రూపొందించి, చదువరులను, విశేషించి వారి అభిమానాన్ని ఆకట్టుకున్నారు. ఒకటా రెండా… ఏకంగా 63 సంవత్సరాలుగా వీరి చిత్రాలు చందమామను అలరిస్తూ వస్తున్నాయి. చందమామను పోలిన అనేక పత్రికలు చోటు చేసుకున్నా, చందమామ ప్రత్యేక దృక్పథాన్ని, పరంపరను సాధించలేక పోయాయి.

దివ్య పురుషులను, దేవతలను కళ్ళకి కట్టినట్టు చిత్రీకరించిన వపా… మహాభారతం పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసిన ఆచార్య, రామాయణం తదితర పౌరాణిక గాధలకు అద్వితీయమైన చిత్రాలు గీయడమే కాక బేతాల కథల చిత్రకారుడిగా యావద్దేశాన్ని మురిపిస్తున్న శంకర్, జానపద చిత్రలేఖన శైలీ విన్యాసంతో చందమామ చిత్రకారులలోనే అద్వితీయుడిగా నిలిచిన చిత్రా… వీరితో పాటు రాజీ, జయ..  చందమామ కీర్తిప్రతిష్టల చరిత్రలో వీరు కలికితురాయిలు.

గత 57 ఏళ్లుగా చందమామలో కొనసాగుతూ సహచరుల వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్న శంకర్ గారు ఒకే పత్రికలో దాదాపు ఆరుదశాబ్దాలుగా పనిచేస్తూ వస్తున్న అరుదైన గౌరవాన్ని పొందుతున్నారు. చందమామ చిత్రకారుల చిత్రాలు కధలను కళ్ళకి కడతాయి. తెలియకుండానే చదువరుల హృదయం ఆకట్టుకుంటూ, మనసులను రంజింపజేస్తాయి.

ఆన్‌లైన్‌‍లో చందమామ భాండాగారం

భారతీయ కథా సాహిత్యంలో ఇంతటి ఘనతర చరిత్రను సాధించిన చందమామ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కూడా లభ్యమవుతున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో పాఠకులు చదవడానికి వీలుగా రూపొందించిన చందమామ కథలు ఆనాటి, నేటి పాఠకులకు సమానంగా కనువిందు చేస్తూ భారతీయ పాఠకుల కథల దాహాన్ని తీరుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

చందమామ పాతకాపీలు లేనివారు, అప్పట్లో తీసుకుని కూడా పోగొట్టుకున్నవారు. నేటి తరాలకు చెందిన పిల్లలు, పెద్దలు కూడా చందమామ పాత కథలకు ఆన్‌లైన్ చందమామ భాండాగారం -ఆర్కైవ్స్- లో చూడవచ్చు. ఈ మహత్తర కృషికి గత సంవత్సరం నాంది పలికిన తర్వాత నేటికి, ప్రారంభం సంచిక -1947- నుంచి 2000 సంవత్సరం చివరివరకు తెలుగు తదితర పది భారతీయ భాషల్లో చందమామలు ఆన్‌లైన్ చందమామ ఆర్కైవ్స్ విభాగంలో పాఠకులకు అందించడం జరిగింది. త్వరలో 2008 వరకు కూడా చందమామలను ఆన్‌లైన్‌లో అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చందమామ పాఠకులారా..! రండి మనదైన జాతి సంపదను ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంచడానికి చందమామ చేసిన కృషిని స్వీకరించండి. ప్రపంచ ప్రచురణా రంగ చరిత్రలోనే తన పాఠకులకు 53 ఏళ్ల పాత సంచికలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చిన అరుదైన పత్రిక చందమామే అని ఈ సందర్భంగా సవినయంగా గుర్తు చేస్తున్నాం.

మీ చందమామను, మన చందమామను ఎప్పటిలాగే ఆదరిస్తారని, మీ పిల్లలకు, భవిష్యత్ తరాల పిల్లలకు చందమామ పత్రికను అరుదైన బహుమతిగా పంచిపెడుతూ వస్తారని మనసారా ఆశిస్తున్నాం

పది భారతీయ భాషల్లో -తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడం, మరాఠీ, మలయాళం, ఒరియా, బెంగాలీ, సంస్కృతం- చందమామలను ఆన్‌లైన్ భాండాగారంలో చూడడానికి కింది లింకుపై క్లిక్ చేయండి. మీ భాషను, సంవత్సరాన్ని, నెలను ఎంపిక చేసుకుని ఇష్టమైన చందమామ కథను ఆస్వాదించండి

http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

సమస్త భారత పాఠక లోకానికి, చందమామ ప్రియులకు ఇదే చందమామ ఆహ్వానం.

దయచేసి మీ అభిప్రాయాన్ని, సూచనలను కింది లింకుకు  పంపండి.

abhiprayam@chandamama.com

చందమామ పాఠకులకు, అభిమానులకు, కథల ప్రేమికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు…

RTS Perm Link

చందమామ తోడుగా పెరిగి పెద్దవాడినయ్యా!

December 20th, 2009

chandamama beemboy

పల్లెల్లో పూర్వం లంకెబిందెలు బయటపడినట్లుగా తెలుగునేలలో ఈ నాటికీ అటకలమీదనుంచి, పాత భోషాణాల్లోంచి పాత చందమామ సంచికలు బయటపడుతున్నాయి. అదీ కూడా 1960ల నాటి అపురూపమైన చందమామలు. వార్త వింటూనే ఉన్న మతి పోతున్న స్థితి. కొందరికి భాగ్యం అనేది ఈ రూపంలో కూడా లభిస్తుండగా, మరి కొందరికి ఉన్న సంపదలు ఊడిపోతున్నాయి.
 
హైదరాబాద్‌ నివాసి, కన్సల్టెంట్ కృష్ణబాలు గారి కథ ఇది. చందమామ అంటేనే వెర్రెత్తిపోయే ఈ కథల ప్రేమికుడు తాను అపరూపంగా దాచుకున్న చందమామ బౌండ్ పుస్తకాలను మొత్తంగా తన బంధువొకరు తస్కరించేశాడని వాపోతున్నాడు. ఆరోజునుంచి తనకు ఒక పాత చందమామ కూడా కనిపించలేదట.

సాహిత్య అభిమాని శివరామ్ ప్రసాద్ గారు ఆరు నెలల క్రితం ఈయనను సులేఖ బ్లాగులో పట్టుకుని చందమామలు తిరిగి సేకరించుకునే వెసలుబాటు గురించి మెయిల్ చేసేంతవరకు ఈయనది నిరాశా ప్రపంచమే. భూమి గుండ్రంగా ఉన్నది చందాన ఆయన ఇప్పుడు పోయిన చోటే సంపదలను తిరిగి వెతుక్కుంటున్నారు.

ఈయన 2007 అక్టోబర్ 11న తన బ్లాగులో పోస్ట్ చేసిన ఆంగ్ల కథనం దీనికి మూలం.

చందమామ తోడుగా తను పుట్టి పెరుగుతూ వచ్చానని అంటూ కృష్ణ బాలు గారు చెబుతున్న ఆ చందమామ జ్ఞాపకాల దొంతరను మనమూ విందామా!

అనువాదం మూలాన్ని I grew with Chandamama! అన్న ఆన్‌లైన్ స్టోరీ నుంచి తీసుకోవటమైంది.

చందమామ తోడుగా పెరిగి పెద్దయ్యా! అనే ఈ కథనం పూర్తి పాఠాన్ని ఇక్కడ చూడండి.

చందమామ తోడుగా పెరిగి పెద్దవాడినయ్యా!

ఎంత మంచి రోజు. ఈ రోజు శుభవార్తతో నిద్రలేచా. అయితే ఇది రాజకీయ వార్త కాదు ఆధ్యాత్మిక వార్త అంతకంటే కాదు. నా జీవితాన్ని వెలిగించేటటువంటి మంచి వార్త.

చందమామ ప్రచురణల పునరుద్ధరణ వార్త. నిజంగా అచ్చెరువు గొల్పే వార్తే. చెన్నయ్ నుంచి వస్తున్న ఈ పిల్లల (నిజానికి కాదు) మాస పత్రిక 1950, 60, 70, 80ల కాలంలో దక్షిణ భారత దేశంలోని లక్షలాది కుటుంబాలపై చెరగని ముద్ర వేసింది.

చందమామ అంటే పడి చస్తాను. చందమామ తోడుగా పెరుగుతూ వచ్చాను మరి. చందమామ కథలు నన్ను ఉత్తేజపర్చి, బోధించి, మనిషిగా నిలబెట్టాయి. నన్ను సంతోషపెట్టాయి. నా ఊహా ప్రపంచంలో ఓ భాగమయ్యాయి. పిల్లల్లో సహజసిద్ధంగా ఉండే కాల్పనిక ప్రపంచపు ఊహలను ఆవి సంతృప్తి పర్చాయి. ఒక హ్యారీ పోటర్‌, ఓ ఎనిడ్ బ్లైటన్‌ కథల్లా అవి నేటి తరం పిల్లలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తుత్తున్నాయి.

చందమామ కథలు నీతి నియమాలను సర్వ సాధారణ రీతిలో బోధిస్తాయి. ప్రతి చందమామ కథలోని సారాంశం మనలో మంచి భావాలను పెంచి పోషిస్తూ వచ్చింది. చాలా వరకు ఇదంతా స్వచ్చందంగా జరుగుతూ వచ్చింది. చందమామ కథలు మా చిరు హృదయాలను తట్టిలేపాయి. అవి ఇప్పటికీ మాలో పనిచేస్తూనే ఉన్నాయి. జీవితం చివరి క్షణాల వరకు చందమామ కథలు మనలో నిండే ఉంటాయి.

పల్లె సీమల గురించిన మన అవగాహనను, జాతి మహత్తర సంస్కృతిని, నాగరికతను చందమామ కథలు మరింత ఉద్దీప్తం చేశాయి. మన ప్రాచీన మేధో సంపదను కథ రూపంలో చందమామ మనముందుకు తీసుకువచ్చింది. అదే సమయంలో చందమామ కథలు మూఢనమ్మకాలు, దురాచారాల గురించి పిల్లల మనస్సులను నిరంతరం హెచ్చరిస్తూ వచ్చాయి.

తెలుగు జాతీయాలు, పదజాలం, అక్షరదోషాలను గురించి చందమామ కథలే మనకు బోధిస్తూ వచ్చాయి. నిజం చెప్పాలంటే పాఠశాల సిలబస్ కంటే చందమామే మన మాతృభాషను ఎక్కువగా బోధిస్తూ వచ్చిందంటే అతిశయోక్తి కాదు.

పైగా, చందమామ కథల్లోని ఇతివృత్తం కాలుష్యానికి, వాదప్రతివాదాలకు, పస లేని సూక్తులకు, అన్నిటికి మించి కుహనా సిద్ధాంతాలకు చాలా దూరంగా ఉండేది.

అదే సమయంలో పిల్లల మెదళ్లకు మేతపెట్టే అద్బుత కల్పనలకు చందమామ కథలు నెలవుగా ఉండేవి.

ప్రతి చందమామ ధారావాహిక కూడా ‘ఇంకా ఉంది’ అనే పేరుతో ముగిసేది.

ఇది పిల్లల్లో ఉత్సాహాన్ని, ఆత్రుతను మరింతగా పెంచి మరుసటి నెల పత్రిక కోసం వారు ఆబగా ఎదురుచూసేలా చేసేది.

పాతాళదుర్గం, రాకాసిలోయ, దుర్గేశనందిని, నవాబు నందిని వంటి ధారావాహికలతో సరితూగగలిగే సీరియళ్లు నేటి కాలంలో కలికానికైనా కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా అవి ఆరోజుల్లో మమ్మల్ని కట్టిపడేశాయి. మర్యాద రామన్న కథలు, గుండు భీమన్న కథలు, పరోపకారి పాపన్న కథలు వంటి కథలు మాలో సద్బుద్ధులను పెంచి పోషించేవి.

వీటన్నిటికి మించి చందమామ ముద్రించే అద్భుత చిత్రాలు సంవత్సరాలుగా మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ వచ్చాయి. సాటిలేని చిత్రకారులు చిత్ర, శంకర్ నిర్విరామంగా గీస్తూ వచ్చిన చిత్రాలు, డ్రాయింగులు మమ్మల్ని అద్భుతలోకాలకు తీసుకెళ్లేవి.

ఎంతో వ్యయప్రయాసలకు లోనైప్పటికీ పలు సంవత్సరాల చందమామ బైండు కాపీలను నేను పొందగలిగాను. కాని మా బంధువు ఒకరు వాటిని మొత్తంగా తస్కరించారు. ఆనాటి నుంచి చందమామ పాత కాపీలు ఒక్కటంటే ఒక్కటి కూడా నా వద్ద లేవు.

అయినప్పటికీ నా చందమామ జ్ఞాపకాలను ఇప్పటికీ మనసులో గుర్తు చేసుకుంటూ సంతోషపడుతుంటాను. చివరకు నా బ్లాగులో ఉంచిన కొన్ని కథలు సైతం చందమామ నుంచి తీసుకున్నవే.

థ్యాంక్యూ మామా, తెలుగు చందమామ ప్రింట్ కాపీ నా చేతికి వచ్చే క్షణంకోసం నేను వేచి ఉంటున్నా…

కృష్ణ బాలు – 2007

RTS Perm Link

చందమామ ఓ అందాల భామ

October 16th, 2009
చందమామ - అందాలభామ

చందమామ - అందాలభామ

మధ్యయుగాల కథల కాణాచి చందమామ అని నిన్న ఈ బ్లాగులో పోస్ట్ చేసిన కథనంపై ఎన్ కృష్ణమూర్తిగారు కవితా రూపంలో స్పందించారు. భాషాంతరీకరణ రూపంలో పంపిన ఆయన పంపిన ఈ వ్యాఖ్యను తెలుగులోకి మార్చి ఇక్కడ పోస్ట్ చేశాము. 

చందమామను కథల చందమామగా, అందాలభామగా వర్ణిస్తూ ఆయన పంపిన ఈ కవితాత్మక ఆప్తవాక్యాలకు చందమామ తరపున కృతజ్ఞతలు.

 చందమామ అది కథల చందమామ

 చందమామ అది అందాల భామ,

చందమామను చూచి పులకించు మేను,

చందమామను చూచి ఆలోచనలు రేకెత్తు మదిలో,

చిట్టి చిట్టి మనసులో నీతిని నింపు,

చిట్టి చిట్టి బుర్రబుర్రలకు పదును పెట్టు చందమామ,

భేషు భేషు చందమామ,

భావి తరాల కోసం బ్రతకాలి చందమామ.

RTS Perm Link

తెలుగు పిల్లల్లారా!

October 13th, 2009

క్రింద భూలోకంలో, పైన ఆకాశంలో నేను చూసిన వింతలు, విడ్డూరాలు అన్నీ చెప్పుతాను అంటూ తెలుగు పిల్లలకు ముద్దు ముద్దు మాటలు చెబుతూ ‘చందమామ’ ఈ భూమ్మీద అడుగు పెట్టిన మహత్తర క్షణం అది.

1947 జూలై తొలి సంచిక సందర్భంగా చందమామ సంపాదకీయం తెలుగు పిల్లలను ఉద్దేశించి చేసిన చల్లటి పరామర్శ ఇది. ఆ పరామర్శ అచిరకాలంలోనే భారతదేశంలోని పిల్లలందరినీ మలయమారుతంలా స్పర్శించింది. చల్లగా… వెచ్చగా… నింగిలో మెరిసే చందమామలా…

ఎలాగో ఇక్కడ చదవండి మరి!

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=92&stId=2278

మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.

చందమామ గత సంచికలలోని కథలకోసం ఆర్కైవ్స్ లోకి వెళ్లి చూడండి.

http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

RTS Perm Link

చందమామ గుండె పగిలిన వేళ…!

October 13th, 2009
శిధిలాలయం - చిత్రా

శిధిలాలయం - చిత్రా

ఆయన… భారతదేశంలోని పిల్లలందరి ముఖాలూ వికసించడానికి చందమామలో ‘చిత్ర’జ్యోతులు వెలిగించిన ఓ మహనీయుడు. 1950, 60, 70ల కాలంలో విశేష ప్రాచుర్యం పొందిన చందమామ కార్యాలయాన్ని సందర్శించిన వేలాది దక్షిణ భారత ప్రజలు, ఉత్తరాది వారు కూడా ప్రత్యేకించి ఈ మేటి చిత్రకారుడి చూడటానికి ఆసక్తి, ఆత్రుత ప్రదర్శించేవారు.

దీన్ని బట్టే ఓ మూడు దశాబ్దాల చందమామ పాఠకులపై ఆయన వేసిన ప్రభావం ఏమిటో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. చిత్రలేఖనంలో ఎటువంటి శిక్షణ పొందకున్నప్పటికీ, స్వయం కృషితో అభ్యాసం చేసి, చిత్రకళలో నైపుణ్యం సంపాయించి, దేశవ్యాప్తంగా ఆబాలగోపాలాన్ని దశాబ్దాల పాటు అలరిస్తూ వచ్చిన సాటిలేని హస్త నైపుణ్యం ఆయన సొత్తు.

కథల పత్రికలో బొమ్మలు వేయడానికి సంబంధించి చక్రపాణి గారి మనో ప్రపంచంలో రూపొందిన శైలిని తన చిత్రకళా నైపుణ్యంతో ఒక వరవడిగా తీర్చిదిద్దిన ఘనత ఈ మహనీయ చిత్రకారుడిదే. కథ లేదా ధారావాహికకు సంబంధించి మొదటినుంచి చివరివరకూ ఒకేలాగ ఉండేలా పాత్రలకు ఆయన గీసిన బొమ్మలు అటు పిల్లలను ఇటు పెద్దలను కూడా అబ్బురపరచేవి.

చందమామ కథలతో పాటు చందమామ ధారావాహికలకు నభూతో నభవిష్యతి లాగా ఆయన వేసిన బొమ్మలు చందమామ పాఠకుల జ్ఞాపకాలలో దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా, చిరస్థాయిగా నిలిచిపోయాయి. కథ గొప్పా, కథకు గీసిన బొమ్మ గొప్పా అని పరీక్ష పెడితే రెండూ సమానంగా నిలిచేంత చరిత్రకు కారణభూతమైన చిత్రకళానైపుణ్యం ఆయన స్వంతం.

చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యంగారి అపూర్వ సృష్టిగా నిలిచిపోయిన రాకాసి లోయ, ముగ్గురు మాంత్రికులు, శిధిలాలయం, రాతి రథం మొదలైన చందమామ ధారావాహికలకు ఆయన గీసిన బొమ్మలు, ఎంతగానో పాఠకుల మెప్పు పొందటానికి, చందమామ ప్రాచుర్యం పెరగటానికి తోడ్పడినాయి.

ఆయనే చందమామ అద్భుత చిత్రకారుడు చిత్రా గారు. చందమామలో వస్తున్న చిత్రాల శిల్పం సృష్టించిన వారు చిత్రా. ఆయన చిత్రాలు చందమామలో సుమారు పదివేలు వెలువడ్డాయి.  తెలుగులో పిల్లల పత్రికలన్నీ కూడ, చందమామ పత్రిక ఏర్పరిచిన ఆనాటి చిత్రకథా పంథానే ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నాయి.

ప్రారంభించినది మొదలుగా చందమామ ప్రధాన చిత్రకారుడిగా ఉండి, బారతదేశమంతటా అనేక లక్షలమందికి అభిమానపాత్రుడైన గొప్ప చిత్రకారులు  ’చిత్రా’ గారు. ఆయన 1947నుంచి మూడు దశాబ్దాలుగా అవిశ్రాంతంగా చందమామలో పనిచేస్తూ 1978 మే 6న కన్నుమూశారు.

చిత్రా వెలిగించిన జ్యోతి ఎన్నటికీ ఆరదు

‘భారతదేశంలోని పిల్లలందరి ముఖాలూ వికసించడానికి చిత్రా వెలిగించిన జ్యోతి ఎన్నటికీ ఆరదు’ అని 1978 జూన్ చందమామ సంచికలో చిత్రాగారిపై శ్రద్ధాంజలిని ప్రచురించారు. చక్రపాణి గారి అస్తమయం తర్వాత ‘చిత్రా’ అస్తమయం చందమామకు తీరని లోటని ఈ శ్రద్ధాంజలి పేర్కొంది.

అది చందమామ గుండె పగిలిన సందర్భం. నిజంగానే చందమామ చిత్రాలకు తీరని లోటుగా మిగిలిన దుర్ఘటన. చందమామ  తదుపరి భవిష్యత్తునే యాదృచ్చికంగా ఊహించిన అరుదైన ఈ శ్రద్ధాంజలిని చందమామ పాఠకులకోసం అందిస్తున్నాం.

చిత్రా గారి అస్తమయం వార్తను చందమామలో రాసినవారు కొడవటిగంటి కుటుంబరావు గారు.

ఈ శ్రద్ధాంజలి పూర్తి పాఠం కోసం కింది లింకుపై క్లిక్ చేయండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2277

మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.

గమనిక: చిత్రాగారి అరుదైన జీవిత వివరాలకు త్వరలో ఇక్కడే చూడగలరు.

RTS Perm Link

చందమామ-నా తొలి నేస్తం

October 10th, 2009

“….చందమామ, ఆ పేరులోనే ఏదో మహత్తు ఉన్నట్టుంది. నెలకొకసారి నింగిలో మెరిసిపోయే చందమామ అన్నా, నిండుగా చేతుల్లో ఒదిగిపోయే చందమామ అన్నా ఇష్టపడని వారు ఎవరు? నామటుకు నాకు చందమామ అన్నా, దానిలో బుజ్జిగా ఒదిగిపోయిన కుందేలు పిల్ల అన్నా మహా ఇష్టం, ఇది నేల మీద జాబిల్లి గురించే నింగిలోని జాబిల్లి గురించి కాదు.

మాకు పుస్తక పఠనాభిలాష మా అమ్మగారి నుండి వారసత్వంగా వచ్చింది. ప్రతి నెలా మొదటి వారంలో నాన్న గారి సైకిల్ బెల్ ఎప్పుడు మోగుతుందా అని ఆత్రంగా ఎదురు చూసే వాళ్ళము నేనూ, నా అన్నయ్యలూ. నాన్న సైకిల్ దిగటంతోనే యుద్ధం మొదలు, చందమామ నేను మొదట చదవాలీ అంటే నేను మొదట చదవాలి అని.

చిన్నదాన్ని కాబట్టి ఎప్పుడూ ఓడిపోయేదాన్ని నేను, వాళ్ళిద్దరు చదివిన తర్వాత అంటే సుమారుగా వారం తర్వాత వరకూ నా చేతికి చిక్కేది కాదు చందమామ. నాకేమో కొత్త పుస్తకాన్ని అలా చేతుల్లోకి తీసుకుని అందులోంచి వచ్చే ఒకలాంటి కమ్మటి సువాసనని ఆస్వాదిస్తూ చదవాలి అని తెగ కోరిక, కానీ అది చాలా యేళ్ళ వరకూ తీరలేదు…..”

సాయిలక్ష్మిగారూ,,
మీ చందమామ జ్ఞాపకాలను పంపినందుకు హృదయపూర్వక కృతక్షతలు. సరిగ్గా మీ చిన్ననాటి అనుభవాలే మావి కూడా.. మాది కొంచెం పెద్ద కుటుంబమే మరి. నాలుగు కుటుంబాలలో పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు 15 మందికి పైగా ఉన్న బాల్యం మాది. కుటుంబానికి ఒక పత్రిక చొప్పున అప్పట్లో చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి పత్రికలను తెప్పించినా అవి మా అందరికీ సరిపోయేవి కావు. అవతలివాడికి దొరికిన చందమామ ఇతర పత్రికలు ఎప్పుడు మాకు దొరుకుతాయనే ఎదురుచూసేవాళ్లం.
 
చివరకు పొలాలకు నీళ్లు కట్టేందుకు రాత్రిపూట ఊరిబయటకు పోతే టార్చి లైటు వెలుతురులో వీటిని ఆబగా చదివి అవతలి వారికి ఇచ్చేయవలసినంత పోటీ ఉండేది మాలో.. ఇలా ఆంధ్ర సచిత్రవారపత్రిక, ఆంధ్రప్రభ, తర్వాత రోజుల్లో ఆంధ్రజ్యోతి, యువ, విజయ, ఇలా ఏ వార, మాస పత్రిక కనిపించినా సరే అవి మా అందరికీ ఇలాగే బట్వాడా అయ్యేవి.

ఒక్కోసారి ముఖచిత్రం గాని ఆకర్షించిందంటే పోటీలు మీద పోటీలు. నువ్వు చదివిన తర్వాత నాకివ్వు అంటే నాకివ్వు అని.. వ్యవసాయ జీవితమూ, చందమామతో సహా కథల పత్రికల అధ్యయనమూ రెండూ కలిసిపోయిన బాల్యం మాది. పొలాల్లో ఎనుములు -గేదెలు- మేపుకుంటూ భారతం, రామాయణం, ఎమెస్కో పుస్తకాలు, చివరకు శ్రీశ్రీ మహాప్రస్థాన గేయాలు కూడా బాల్యంలో ముఖ్యంగా 6,7,8 తరగతుల్లో చదువుకున్నాం, పాడుకున్నాం అంటే నమ్ముతారా..!

ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, తర్వాత ఈనాడు…  దినపత్రికలను కూడా ఇలాగే వంతులు వేసుకుని మరీ చదువుకున్నాం మేం. అందరూ అన్నీ కొనే స్తోమత లేకపోవడమే దీనికి కారణం. పంచాయతీ సహకారంతో ఊర్లో లైబ్రరీ పెట్టించుకుని అన్ని పత్రికలను తెప్పించుకోవాలనేది మా ఊరిలో చదువుకున్నవారి కల. అది గత నలభైఏళ్లుగా కలగానే సాగుతోంది. లైబ్రరీలకు బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోయిన ప్రస్తుత కాలంలో ఇక ఇలాంటివి ఎప్పటికీ కలలే..

దానికి తోడు ఊర్లలో ప్యూడల్ అహాలు, అహంకారాలు, భేషజాలు కూడా తక్కువేం కాదు. ఏ మంచి పనిని కూడా చిట్టచివరి క్షణంలో నిలువునా పాతేసే రకం అహంకారాలు. సంవత్సరం క్రితం ఊరినుంచి వలసపోయిన వారు తలా ఇంతని వేసుకుని చుట్టుపక్కల గ్రామాలకు ఉపయోగపడేలా మెడికల్ క్యాంపును పెట్టాలని పథకం వేసుకుని కూడా చివరి క్షణంలో ఎవరు గొప్ప అనే గ్రామీణ అహాలు, రాజకీయాల  బారిన పడి ఎవరిదారిన వారు పోయిన చరిత్ర మా ఊరిది.

మరి అభివృద్ధి జరుగలేదా అంటే చాలానే జరుగుతోంది. తారురోడ్లు, బోర్లు, కొత్త కొత్త సేద్యాలు.. వాహనాలు, విలాసాలు వీటికి తక్కువేం లేదు. కానీ.. ఎక్కడో ఏదో లోపం… అర్థమయ్యీ ఆర్థం కాని లోపం… గత ఆదివారం శివరాం గారు చూపించిన మానెక్‌షా ఉపన్యాసం ఈ విషయాన్నే చక్కగా చెప్పింది. దేశంలో అందరూ నాయకులే, కాని తప్పులకు బాధ్యతలు వహించని నాయకులు, బాధ్యతను మోయడానికి ముందుకురాని నాయకులు.. ఇలాంటి నేపథ్యంలో నువ్వెంత అంటే నువ్వెంత రకం భావాలు రాజ్యమేలవా మరి..!

అయినా చదువుకున్నాం. బురదమళ్లలో దిగి సేద్యం చేసిన జీవితం నుంచి పట్టణాల్లో ఉద్యోగ జీవితం వరకు పయనించివచ్చాం. కానీ మా బంగారు బాల్యాన్ని ఎవరో లాగేసుకున్న స్థితి. మా కాళ్ల కింద నేల మాది కాకుండా పోయినట్లు అనిపించే పాత జ్ఞాపకాలు.. వీటిలో తళుక్కుమనే చందమామ జ్ఞాపకాలు. మా బాల్యం పొడవునా నిజజీవితంలోనూ, చందమామలోనూ వెంటాడుతూ వచ్చిన దెయ్యాలు, పిశాచాలు. చెరువుకట్టమీద రాత్రిపూట పోతూ పక్కన ఏదో నీడ కదిలితే దయ్యం వచ్చేసిందంటూ పారుకున్న రోజులు.

మీరు, సునీత గారూ విక్రమార్కుడు మీ కలల రాకుమారుడిగా చెప్పడం చూస్తుంటే ఆరోజు ఆడపిల్లలను విక్రమార్కుడు ఇంతగా ఆకర్షించాడా అనిపిస్తుంది. చందమామ రాజకుమారిల గురించి మీ వర్ణణ అద్భుతంగా ఉంది. వపా హృదయరాణులు  వారు. అలా కాక ఇంకెలా ఉంటారు వారు..

“చందమామ మారుతోంది, కానీ ఆ మార్పు మంచి వైపుగా ఉండాలి అన్నదే నా కోరిక. నేను అనుభవించిన ఆ ఆనందం నా తర్వాతి తరం కూడా అనుభవించాలి అన్న చిన్న స్వార్ధం.” అంటూ చివర్లో చెప్పారు. మీది చిన్న స్వార్థం కాదు చాలా పెద్ద స్వార్ధమే. చందమామ రూపురేఖలనే మార్చేసే పెద్ద స్వార్దం. మీరు బాల్యంలో అనుభవించిన ఆ ఆనందం మీ తర్వాతి తరంవారు కూడా అనుభవించాలి అనే మీకోరిక తీరాలనే ఆశిస్తున్నాం. మీ కోరిక కూడా చందమామ బాల్యంలాగే మిగిలిపోతుందేమో మరి..

ఏదేమైనా మీ చందమామ జ్ఞాపకాలకు మన:పూర్వక కృతజ్ఞతలు…

సాయిలక్ష్మిగారి చందమామ జ్ఞాపకాలు పూర్తి పాఠం చదవాలంటే కింది లింకును దయచేసి తెరువండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2269
మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.

మీ చందమామ జ్ఞాపకాలను పాఠకులతో పంచుకోదలిచారా?
abhiprayam@chandamama.com కు పంపండి.  మీవి లేదా మీ పిల్లల ఫోటోలు కూడా పంపండి.

చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

RTS Perm Link