తరాలను తీర్చిదిద్దిన చందమామ
మా నాన్నగారు మాకు నేర్పిన ఒక మంచి అలవాటు పుస్తకాలు చదవడం. మాకు చిన్నతనంలోనే రామాయణ, భాగవతాలను పరిచయం చేశారు. అప్పట్లో రాజమండ్రి నుంచి గొల్లపూడి వీరాస్వామీ & సన్స్ వాళ్ళు తెలుగులో ముద్రించే బాలల బొమ్మల రామాయణం, మహాభారతాలు, ఇంకా తెనాలి రామకృష్ణ, బీర్బల్ కథలు, గద్య భాగవతం ఇలాంటి పుస్తకాలెన్నో మాకు చిన్నతనంలోనే కొని ఇచ్చి చదివించేవారు. అప్పటికి టి.వి. ఇంతటి విశ్వరూపం ధరించలేదు, ఆ పల్లెటూళ్ళో మాకు ఉండే సరదాలలో కధల పుస్తకాలు సింహభాగం వహించేవి.
నాలుగవ తరగతిలో ఉండగా అనుకుంటాను, ఒకసారి నాన్నగారు మా ముగ్గురిని తీసుకుని మా ఇంటికి సుమారు 1.5 కి.మీ దూరంలో ఉన్న శాఖా గ్రంధాలయానికి తీసుకుని వెళ్ళి మాకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు. చిన్నఫ్ఫుడు చాలా ఇష్టంగా చదివింది చందమామ పుస్తకం. ప్రతి నెలా సుమారు 7 లేదా 8 వ తారీఖులలో మా గ్రంథాలయానికి వచ్చేది. ఇది కాకుండా బాలజ్యోతి, బుజ్జాయి కూడా వచ్చేవి.
ప్రతి నెలా క్రొత్త చందమామ చదివే వరకు ఎంతో ఆతృతగా ఉండేది. నేను వెళ్ళేసరికి అది వేరే వాళ్ళ చేతుల్లో ఉంటే నేను ఇంక అతని ప్రక్కనే కూర్చుని ఎప్పుడు వదులుతాడా అని చూసేవాడిని. చందమామ చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా చదివేవారు.
ఒకవేళ పిల్లలు వచ్చినపుడు చందమామ, బాలజ్యోతి పుస్తకాలు పెద్దవాళ్ళ చేతుల్లో ఉంటే అక్కడ ఉండే లైబ్రేరియన్ వాళ్ళ దగ్గర తీసేసుకుని మాకు ఇప్పించేవాడు, ‘వాళ్ళు ఇక్కడికి వచ్చేదే వీటి కోసం, వాళ్ళు లేనప్పుడు మీరు చదవండి’ అని వాళ్ళకి చెప్తుంటే ఆయనమీద ఎంతో ఇష్టం కలిగేది.
చందమామ కథలు ఏవి కూడా ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఉండవు, అందులో ఉండేదంతా ఒక ఐడియల్ ప్రపంచం. వాటిలో దెయ్యాలు, రాక్షసులు, మంత్రగాళ్ళు, గయ్యాళి అత్తలు,దొంగలు అందరూ ఉండేవారు. కానీ ఎవ్వరూ మరీ క్రూరంగా ప్రవర్తించరు. కధా చివరిలో చెడ్డవాళ్ళు అందరూ మారిపోయినట్టు చూపేవాళ్ళు. ప్రతి కధలోను ఒక నీతి సూత్రం ఉండేది, సమాజానికి కావలసిన ఎదో ఒక విలువని భోధించేటట్టుగా ఉండేవి.
నీతి సూత్రం కానీ, తత్వశాస్త్రం కానీ మనకి సోదాహరణంగా వివరిస్తే బాగా అర్థం అవుతుంది, అందుకే వేదాలు ఉపనిషత్తుల్లో ఉండే నీతి సూత్రాలన్నీ మనకి కథలలో చేర్చి జనానికి అర్థమయ్యే విధంగా రామాయణ, భాగవతాల రూపంలో చెప్పారు కదా.
చందమామలో ఎత్తుగడ కూడా ఇదే, ఒక కధ చెప్పి అందులో ఎలా ప్రవర్తించకూడదో, ఏది తప్పో, ఏది ఒప్పో చిన్నపిల్లలకి అర్ధం అయ్యే రీతిలో వివరిస్తుంది.
పూర్వకాలంలో గురుకులాలలో ఇలా కధల ద్వారా నీతిని చెప్పడం (చిన్నయసూరి పంచతంత్రంలో కధల ద్వారా మూర్ఖులయిన రాజకుమారులను మార్చినట్టు) ఉండేది, కానీ ప్రస్తుత విద్యావ్యవస్థలో అది సాధ్యం కావడంలేదు, అమ్మ నాన్నలకు కధలు చెప్పే తీరిక ఉండదు.
సరిగ్గా ఇక్కడే చందమామ ఒక అద్భుతమయిన పాత్ర పోషించింది. మన పురాతన విద్యావిధానంలోని కథా సాంప్రదాయాన్ని ముద్రణా వ్యవస్థ ద్వారా చిన్నారులకు అందించింది.
చిన్న చిన్న కథల ద్వారా నీతిని భోధించడమే కాదు, లౌక్యంగా ఎలా ఉండాలో చందమామలోని గడసరి కోడళ్ళు చెప్పేవారు. ఒక విషయాన్ని వేరే విధంగా ఎలా అలోచించాలో (లేటరల్ థింకింగ్), నాణేనికి రెండో వైపు చూడడం ఎలాగో భేతాళ కథల ద్వారా నేర్పేది. అందులో ఉండే బొమ్మలు (వడ్డాది పాపయ్య బొమ్మలయితే మరీను) మనలను చదివించేటట్టు పురికొల్పుతాయి. ప్రతి పేజీలోను ఒక బొమ్మ తప్పకుండా ఉండేది.
నేను ఈరోజు మంచీ చెడూ, తప్పూ ఒప్పూ ఆలోచించగలుగుతున్నాను అంటే దానిలో చందమామలో చదివిన కథల ప్రభావం చాలా ఉంది. మా ఊరి లైబ్రరీ గోడ మీద ముట్నూరి కృష్ణరావు గారి మాటలు ఇలా రాసి ఉండేవి ” ఎంత పెద్ద రాజభవనం అయినా అందులో పుస్తకాలు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా ఉండలేను” అని.
ఈరోజు నా సరదాలలో సినిమాలు, టి.వి, అంతర్జాలం ఎన్ని వచ్చినా కానీ కొత్త పుస్తకం చూడగానే ఏదో తెలియని ఆనందం, అది చందమామ అయితే నిజంగా చిన్నపిల్లవాడిని అయిపోతాను.
కాలం చాలా శక్తివంతమయింది, సమస్త ప్రపంచం కాల ప్రభావానికి లోను అవుతుంది, చందమామ కూడా. కాలవశాన చందమామ తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఇదివరకు వచ్చే కధలు, అప్పటి భాషా చందమామలో ఇప్పుడు కనిపించడం లేదు.
నాకు అనిపిస్తూ ఉండేది, చందమామలోని పాత కధలన్నీ తిరిగి ముద్రించుకుంటూ పొతే బాగుండు అనీ, వారి దగ్గర 60 సంవత్సరాల బాల సాహిత్యం ఉంది, అది రాబోయే తరానికి పరిచయం చేస్తే బాగుండు అనీన్నూ.
ఈ మధ్య వారు మొదలుపెట్టిన అంతర్జాల ఎడిషన్ ద్వారా ఇది తీరగలదు అని సంతోషంగా ఉంది. ఎన్నో తరాలని తీర్చిదిద్దిన చందమామ రాబోయే తరాలకోసం సిద్దం అవుతోంది.
(ఈ చందమామ అనుభూతులు కింది బ్లాగుల లోనివి.)
http://omyfriend.blogspot.com/
http://telugubudugu.blogspot.com/2008/03/blog-post.html
రామకృష్ణ బైసాని
ఫుట్టింది – ధర్మాజీగూడెం, ప.గో.జిల్లా. చదివింది – ధర్మాజీగూడెం/చింతలపూడి/ఏలూరు/విశాఖపట్నం. ప్రస్తుత నివాసం – చెన్నపట్నం. చేస్తున్నది – సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.
2008 ఆగస్టు తర్వాత ఈ సైట్ అప్‌డేట్ అవుతున్నట్లు లేదు.
Filed under ఆన్‌లైన్ చందమామ రచనలు | Comment (0)చందమామ అనుభూతులు మరపురానివి
మా ప్రియ మిత్రుడు రాంకీ వలన మన చిననాటి నేస్తం చందమామను గుర్తుచేసుకునే అవకాశం కలిగింది.
ఈ సందర్భంగా చందమామతో నాకున్న అనుబంధాన్ని నెమరువేస్తున్నాను.
నా చిన్న తనంలో నాకు పుస్తక పఠనంపై అంతగా ఆసక్తి ఉండేది కాదు. కొబ్బరి మట్టలతో, తాటిటెంకలతో మొదలెట్టిన బంతాట(క్రికెట్) రెండు రూపాయల రబ్బరు బంతి కొని చెక్క బ్యాటుతో ఆడేవరకూ వచ్చింది. బంతి ఉంటే ఏడుపెంకులాట, బ్యాటు కూడా ఉంటే క్రికెట్, రెండూ లేకపోతే చెడుగుడు. ఇలా గడచిపోతున్న కాలంలో ఒకమారు మా సుశీలాబాయి టీచర్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళింట్లో చాలా పుస్తకాలు ఉండడం చూసాను.
వాళ్ళబ్బాయి మధు నా ఈడు వాడు కావడంతో ఇద్దరం కూర్చోని బొమ్మరిల్లు, చందమామ చదివాం. నా చేతిలో చందమామ బొమ్మరిల్లుతో పోలిస్తే కొంచం చిన్నదిగా అనిపించింది, అందుకని వెంటనే పుస్తకాలు మార్చుకుని చూసాను, రెండిటిలో చందమామే బావుందనిపించింది, ఎందుకో తెలియదు. అలా మొదలైన చందమామ పరిచయం కొన్నాళ్ళకి ఆగిపోయింది.
ఒక రోజు క్రికెట్ ఆడుతుండగా ఒక మిత్రుడు బాలమిత్రలోని ఒక మిని నవల కథ చెప్పాడు. అది ఒక రక్త పిచాచి కధ. అది నిజమో కాదోనని తను ఎక్కడ చవివాడో కనుక్కొని అక్కడకు వెళ్ళాను. అది శాఖా గ్రంధాలయం. బజారు దగ్గరే ఒక హోటల్ పక్కగా ఎవరికి బయటకు కనపడనట్లుగా ఉండేది.
ఆ రోజు మొదలు నాలుగు సంవత్సరాలు, ఎనిమిదో తరగతి వరకూ ఒక్క చందమామను కూడా వదల లేదు. ఎప్పుడు కూరగాయల కోసం బజారుకెళ్ళినా అక్కడ కనీసం పావుగంటైనా ఉండాల్సిందే. భేతాళ కథలు, రామాయణం వంటి సీరియల్స్‌తో మొదలుకొని , ఒక అయిదారు మూడు పేజీల కథలు, రెండు మూడు పిట్ట కథలు, పాతికేళ్ళనాటి చందమామ కథ, ఒక విదేశీ కథానువాద, వింత వార్తలు, ఇలా సాగేది ప్రస్థానం.
బొమ్మరిల్లు, బాలమిత్ర ఇలాంటివెన్ని ఉన్నా చందమామ స్థానం చందమామదే!!!
(ఈ చందమామ అనుభూతులను కింది బ్లాగు నుంచి తీసుకోవడమైంది.)
http://omyfriend.blogspot.com/2008/03/blog-post_6846.html
http://omyfriend.blogspot.com/
2008 తర్వాత ఈ బ్లాగులు అప్‌డేట్ అవుతున్నట్లు లేదు.
కృష్ణ కిశోర్ కటికిరెడ్డి (హరి)
Age: 30
Occupation: సాఫ్ట్ వేర్ నిపుణుడు
Location: నరసాపురం
ఫుట్టింది – సికింద్రాబాద్; పెరిగింది – నరసాపురం,ప.గో.జిల్లా ; చదివింది – సికింద్రాబాద్/నరసాపురం/పాలకొల్లు/విశాఖపట్నం ; ప్రస్తుత నివాసం – బెంగళూరు; వెలగబెడుతుంది – సాఫ్ట్ వేర్ ఉద్యోగం
హరి గారికి ఈ బ్లాగు కూడా ఉన్నట్లుంది.
http://avakaigongura.blogspot.com/
2007 తర్వాత ఈ బ్లాగూ అప్‌డేట్ కావడం లేదు.
అనగనగా ఒక చందమామ

అనగనగా ఒక చందమామ
అనగనగా ఒక చందమామ
ఏడుస్తున్న బిడ్డను లాలించేందుకు… కొసరి కొసరి గోరుముద్దలు తినిపించేందుకు… ఆకాశంలో వేలాడే చందమామని ఆశ్రయిస్తుంది అమ్మ.
అందుకే పాలుగారే ప్రాయంలోనే మనకు చందమామతో ఆత్మీయమైన అనుబంధం ఏర్పడుతుంది.
మిగతా బంధాల మాట ఎలా వున్నా చందమామతో ఏర్పడిన బంధం మాత్రం ఎన్నటికీ చెక్కు చెదరదు.
ఏ వయసులోనైనా, ఎంత యాంత్రికంగా మనుగడ సాగిస్తున్నప్పుడైనా తలెత్తి తనవంక చూస్తే చాలు చల్లని వెన్నెల స్పర్శతో మనసు పరవశమవుతుంది.
ఆకాశంలోని చందమామతో పాటు భూలోకంలోని మరో చందమామతో ఏర్పడే అనుబంధం కూడా అంత గాఢమైనదే.
చక్రపాణి, నాగిరెడ్డి గార్లు పిల్లలకోసం అలనాడే ఓ పత్రికకు ప్రారంభించడం, దానికి ”చందమామ” అని పేరు పెట్టడం ఎంతో అబ్బురమనిపిస్తుంది.
రెండో తరగతిలోనో మూడో తరగతిలోనో వున్నప్పుడే నాకు చందమామతో పరిచయం ఏర్పడింది.
ఎవరో మా ఇంటికి వచ్చిన వాళ్లు ఒక చందమామ ప్రతిని నాకు కావాలనే ఇచ్చారో, లేక మరిచిపోయి వదిలివెళ్లారో గుర్తులేదు కానీ నన్నది
తొలిచూపులోనే వశీకరించుకుంది.
క్లాసు పుస్తకాలలో లేని ఆకర్షణ ఏదో చందమామలో వుందని అప్పుడే అనిపించింది.
కొన్ని నెలలపాటు రోజుకు ఒకసారైనా ఆ చందమామని ముందేసుకుని తరగని ఆసక్తితో అందులోని బొమ్మల్ని తిరగేస్తూ కూర్చునేవాణ్ని.
ఒక్కో వాక్యాన్ని కూడబలుక్కుంటూ చదివేవాణ్ని.
అది చూసి మా అమ్మ నాకు అప్పుడే బోలెడంత చదువు వచ్చేసినట్టు మురిసిపోతూండేది.
నిజంగా నాకు చదువు మీద జిజ్ఞాసని పెంచిందీ, పుస్తకాలను ప్రేమించడం నేర్పిందీ చందమామే.
ఆ తరువాత కొంతమంది మిత్రులం కలిసి నాలుగో తరగతినుంచే తలా కొంత డబ్బు (!) వేసుకుని చందమామని కొనడం ప్రారంభించాం. రెండు మూడు
సీరియళ్లని బైండు కూడా చేయించాం. అది వేరే కథ.
చందమామలో దయ్యాలు, భూతాలు, మంత్రాలు, తంత్రాలు ఎన్నివున్నా బలమైన నీతిసూత్రం వల్ల కాబోలు ఆ కథలు నాలో మూఢనమ్మకాలను
గానీ, అశాస్త్రీయమైన ఆలోచనలను గానీ పెంచలేదు. పైగా మంచితనాన్ని, మానవతని, సృజనాత్మకతని పెంపొందించాయి.
చందమామ పుస్తకాలు…. కాంతారావు (విఠలాచార్య) సినిమాలు…. దారాసింగ్ కింగ్‌కాంగ్‌ల కుస్తీలు…… ఓహ్ బాల్యం ఎంత మధురమధురంగా వుండేదో.
ఒక చందమామ కొనాలన్నా…. 37 పైసలు పెట్టి ఒక సినిమా చూడాలన్నా … కనా కష్టంగా వుండేదారోజుల్లో మాకు.
అట్లాంటిది ఇప్పుడు ఒక ఊరి గ్రంథాలయానికి సరిపడేన్ని పుస్తకాలు ఇంట్లో వున్నా నా పిల్లలకు క్లాసు పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాల పట్ల ఆసక్తి కలగలేదు.
నేనే కలిగించలేకపోయానేమో.
అది నా ఒటమేనేమో.
వాళ్లు ఎంత ఉన్నత చదువులు చదివినా నాకిది తీరని వెలితిగా అనిపిస్తుంది. చాలా బాధనిపిస్తుంది.
సెల్లులు, వీడియో గేములు, కంప్యూటర్లు, చాటింగ్‌లు … వాళ్ల ప్రపంచమేవేరు. వాళ్ల అభిరుచులే వేరు.
ఈమధ్య కూడలిలో చందమామ గురించిన ప్రస్తావనలు చూసిన తరువాత ఇవన్నీ గుర్తొచ్చాయి.
పాత చందమామ సంచికలు ఇంటర్నెట్‌లో లభిస్తాయని తెలిసినప్పుడు ఎంత ఆశ్చర్యమనిపించిందో.
నేను ”గొడ్డలి పదును” అనే ఒకే ఒక చందమామ కథ రాశాను.
దానిని నెట్‌లో వెతికి వెతికి పట్టుకున్నప్పుడు ఎవరెస్ట్ శిఖరమెక్కినంత ఆనందం కలిగింది.
అట్లాగే చందమామ ఫోటో వ్యాఖ్యల పోటీలో నాకు మూడు నాలుగు సార్లు బహుమతులు వచ్చాయి. వాటిని కూడా వెతికి పట్టుకోవాలి.
చందమామ అభిమానులు పాత సంచికలకోసం ఈ కింది వెబ్‌సైట్‌ని చూడవచ్చు.
http://www.ulib.org/
(Advanced Search…Title : Chandamama, Language: Telugu)
ఈ సమాచారం అందించిన సహ బ్లాగర్లు
నాగమురళి,
వేణువు,
బ్లాగాగ్ని
గార్లకు కృతజ్ఞతలు.
ప్రభాకర మందార
http://uyyaala.blogspot.com/2009/03/blog-post.html
1988 నాటి చందమామలో ప్రచురించబడిన తన ఏకైక కథ ‘గొడ్డలి పదును’ ను 20 ఏళ్ల అనంతరం ఆన్‌లైన్‌లో మిత్రుల సహాయంతో చందమామ ఖజానా (ఆర్కైవ్స్) లో కనుగొన్న క్షణాల్లో ప్రభాకర మందార గారి స్పందనను ఇక్కడ పోస్టు చేస్తున్నాము.
Filed under ఆన్‌లైన్ చందమామ రచనలు, చందమామ చరిత్ర | Comments (3)మా చందమామ జ్ఞాపకాలు

బాల్యాన్ని ఎవరు మర్చిపోగలరు? బాల్యంతో ముడిపడిన చందమామ అనుభూతులను ఎవరు మర్చిపోగలరు? చందమామతో కలగలసిన ఆ పసితనాన్ని ఎవరు మరువగలరు? ఆ జ్ఞాపకాలను, చందమామ పరిమళాలను అందరికీ పంచండి. మనకంటూ మిగిలిన జాతి సంపద, సాంస్కృతిక సంపద చందమామ ఒక్కటే కదా…
చందమామ జ్ఞాపకాలను దశాబ్దాలుగా కొనసాగిస్తున్న వందలాదిమంది అభిమానులకు, బ్లాగర్లకు, నెటిజన్లకు ఆన్‌లైన్ చందమామను సాదర నిలయంగా మార్చాలనే ఆశయంతో http://telugu.chandamama.com లో “మా చందమామ జ్ఞాపకాలు” విభాగాన్ని రూపొందించాము.
తెలుగునాడులో ఎంతమంది చందమామతో తమ బాల్యజీవితంలోని తాదాత్మ్య క్షణాలను గుర్తుతెచ్చుకుంటూ పలవరిస్తున్నారో ఈ ప్రపంచానికి చాటి చెప్పాలనే చిరు ఆకాంక్షతో… ఆన్‌లైన్ చందమామలో ఈ విభాగాన్ని ఏర్పర్చాము.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49
తెలుగు జాతి సాంస్కృతిక సంపద అయిన చందమామను ఈ నాటికీ తమ జ్ఞాపకాల దొంతరలలో పదిలపరుచుకుంటున్న చందమామ అభిమానుల గుండె చప్పుళ్లను ఓ చోట చేర్చి అందరికీ పంచిపెట్టాలనే చిరు కోరికే ఈ “మా చందమామ జ్ఞాపకాలు” విభాగం రూపకల్పనకు మూలం.
జీవించడం కోసం ప్రపంచం నలుమూలలకు వలసపోయిన తెలుగు వారు చందమామ పత్రికతో తమ తరాల అనుబంధాన్ని నేటికీ ఎలా కాపాడుకుంటూ వస్తున్నారో, చందమామ జ్ఞాపకాలను పరస్పరం ఎలా పంచుకుంటున్నారో తెలిపే అమూల్యమైన వ్యాసాలు, లింకులు, తదితర సమాచారం ఈ విభాగంలో పొందుపర్చడం జరుగుతుంది.
చందమామతో తమ జ్ఞాపకాలను, అనుభూతులను ఈ విభాగంలో పంచుకోవాలని భావిస్తున్న అభిమానులకు, ‘చంపి’లకు(చందమామ పిచ్చోళ్లు) ఇదే మా సాదర ఆహ్వానం.
బాల్యంలో మీ చిన్ననాటి చిరునేస్తంగా పలకరిస్తూ వచ్చిన చందమామ జ్ఞాపకాలను మీరు తెలుగులో లేదా ఇంగ్లీషులో కింది లింకుకు పంపించగలరు. వీలయితే మీ ఫోటో, ప్రొఫైల్, ఈమెయిల్ చిరునామా తదితర వివరాలను కూడా పంపగలరు.
ఆన్‌లైన్ చందమామకు మీ ఈమెయిల్ చిరునామాను పంపగలిగితే త్వరలో తీసుకువస్తున్న చందమామ న్యూస్‌లెటర్‌ను మీకు ప్రతివారం నేరుగా మీ ఈమెయిల్ ద్వారా పంపడానికి వీలవుతుంది.
చందమామతో మీ జ్ఞాపకాలు, మీ స్వంత రచనలు, సలహాలు, సూచనలు, విమర్శలను కింది లింకు ద్వారా ఆన్‌లైన్ చందమామకు పంపగలరు.
చందమామ పిచ్చోళ్లకు, అభిమానులకు చందమామ తరపున ఇదే మా ఆహ్వానం. మీ అమూల్యమైన సమయంలో కొంత కేటాయించి ఆన్‌లైన్ చందమామకు చందమామతో మీ అనుబంధం గురించి, మీకు ఆసక్తి ఉన్న అంశాలపైనా చిన్ని చిన్ని రచనలు అయినా సరే రాసి పంపడానికి మీకు వీలవుతుందా?
కథలు, గేయాలు, మీకు నచ్చిన పద్యాలు, పాటలు, సైన్స్, టెక్నాలజీ, హాస్యం, మీకు తెలుసా, లోకజ్ఞానం, భారత దర్శిని, ప్రపంచ దర్శిని, సాహిత్యం, శ్రావ్యమైన సంగీతం మీ ఇతర అభిరుచులు, ఆసక్తులకు సంబంధించి ఏ విషయంపైన అయినా సరే మీరు రచనలు పంపగలరు.
ప్రతి చందమామ పిచ్చోడికి, పిచ్చోళ్లకి, అభిమానులకు చందమామ ఆన్‌లైన్ తమదిగా ఫీలయ్యే వేదికగా ఉండాలని మా ప్రగాడ కాంక్ష, విశ్వాసం కూడా. హృదయం నిండా చందమామ తలపులను దివ్యంగా పొదవుకున్న మీ వంటి అభిమానులకు ఆన్‌లైన్ చందమామ సాదర నిలయంగా మారాలని కోరుకుంటున్నాం. మీరు పంపే ఏ రచనను అయినా సరే మీ పేరుతోనే చందమామలో పోస్ట్ చేస్తాము.
మీ రచన మీ స్వంతమేనని, ఆన్‌లైన్ చందమామలో ప్రచురణకు దాన్ని పంపుతున్నట్లుగా చిన్న ధ్రువీకరణను మీ ఈమెయిల్ ఐడి ద్వారా abhiprayam@chandamama.com కు పంపితే చాలు.
చందమామతో మీ అనుబంధం గురించి ఇప్పటికే మీరు బ్లాగుల్లో, వెబ్‌సైట్లలో పోస్ట్ చేసి ఉంటే ఆ లింకులను (url) ఆన్‌లైన్ చందమామకు పంపగలరు. అన్నిటినీ ఒకచోట అమర్చి పాఠకులందరికీ అందించడానికి వీలవుతుంది.
ఈ లోపల మీనుంచి మీ వంటి చందమామ అభిమానుల నుంచి మాకు నిజమైన సహకారం ఒకటి కావాలి. ఆశిస్తున్నాం కూడా. ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న ఆన్‌లైన్ చందమామ రచన, డిజైన్, హోమ్ పేజీతో సహా ప్రతి ఒక్క అంశంపై మాకు మీ సలహాలు, సూచనలు, విమర్శలు, నిర్మోహమాటమైన అభిప్రాయాలు కావాలి.
చందమామ మరింత మెరుగుపడాలని, పాఠకుల కోరికలకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్న మా కోరికను మీరు మన్నించినట్లయితే ఈ కింది లింకులకు మీరు మీ సూచనలు, సలహాలు, ప్రతిపాదనలు దయచేసి పంపగలరు. మీకు తెలిసిన చందమామ అభిమానులకు, ‘చంపి’లకు కూడా ఈ సమాచారం వీలయితే పంపగలరు.
abhiprayam@chandamama.com
Online@Chandamama.com
చందమామ పాత సంచికలలోని కథలను చదువదలిస్తే కింది ఆర్కైవ్స్ లింకులో చూడండి. గత సంచికల కోసం వెనక్కు వెళ్లి మీ అభిమాన కథలను మళ్లీ చదవండి. మా ఆర్కైవ్‌లను చూసి, ఆనందించండి.
http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL
చందమామతో మీ జ్ఞాపకాలను ఆన్‌లైన్ చందమామకు తప్పక పంపించగలరు. చందమామ పాఠకులు, అభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం.
Filed under ఆన్‌లైన్ చందమామ రచనలు, చందమామ చరిత్ర, చందమామతో మా జ్ఞాపకాలు | Tags: Add new tag, చందమామ, చంపిలు, జ్ఞాపకాలు, పాఠకులు | Comment (0)చందమామ కథల మాంత్రికుడి సీరియల్స్ ప్రారంభం
దాసరి సుబ్రహ్మణ్యం గారు … మూడుతరాల చందమామ పాఠకులను అద్భుతలోకాల్లో విహరింపజేసిన సాహితీ స్రష్ట… జానపద సీరియళ్ళకు అపూర్వంగా రూపకల్పన చేసిన మేటి రచయిత. ప్రముఖ తెలుగు బ్లాగర్ వేణు గారు అన్నట్లుగా దాదాపు పాతికేళ్లపాటు చందమామ పాఠకులను తన అసమాన కల్పనా చాతుర్యంతో దుర్గమ అరణ్యాల్లోకీ, దుర్గాల్లోకీ, లోయల్లోకీ, సముద్రాల్లోకీ, మంత్రాల ద్వీపాల్లోకీ, మాయా సరోవరాల్లోకీ తీసుకువెళ్ళి, ఊహల స్వర్గంలో విహరింపజేసి ఉర్రూతలూగించిన కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు.
‘చందమామ’ పత్రికను తల్చుకోగానే చప్పున గుర్తుకొచ్చే కథలు ఏవి అంటే.. శిథిలాలయం, రాతి రథం, యక్ష పర్వతం, మాయా సరోవరం; ఇంకా… తోకచుక్క, ముగ్గురు మాంత్రికులు, కంచుకోట లాంటి ఉత్కంఠ భరిత జానపద ధారావాహికలు మదిలో మెదుల్తాయి. ఖడ్గ జీవదత్తులూ, జయశీల సిద్ధ సాధకులూ, ఏకాక్షీ చతుర్నేత్రులూ… ఇలా ఒక్కొక్కరే జ్ఞాపకాల వీధుల్లో పెరేడ్ చేస్తారు; మైమరపించేస్తారు. వీటి సృష్టికర్త దాసరి సుబ్రహ్మణ్యం గారు.
కాల భుజంగ కంకాళాలనూ, నరవానర నల్లగూబలనూ, గండ భేరుండ వరాహ వాహనాలనూ, మంత్ర తంత్రాల మాయాజాలాన్నీ సృష్టించి తెలుగు వారినీ, అనువాద రూపంలో ఇతర భారతీయ భాషల చదువరులనూ సమ్మోహనపరిచిన తెలుగు కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు. జానపద సీరియళ్ళకు అపూర్వంగా రూపకల్పన చేసిన సుబ్రహ్మణ్యం గారు భారతీయ కథకులలో అగ్రగణ్యులు.
ప్రపంచానికి హ్యారీ ప్యాటర్లు, స్పైడర్ మేన్లు, తెలియని కాలంలోనే, ‘తోకచుక్క’తో 1954లో మొదలైన ఆయన జానపద ఇంద్రజాలం 1978లో ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ దాదాపు అవిచ్ఛిన్నంగా కొనసాగింది. ‘తోకచుక్క’ దగ్గర్నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ అద్భుత కథలను తీర్చిదిద్దిన సుబ్రహ్మణ్య సృష్టి – చందమామ లోని ఈ ధారావాహికలు!
తోకచుక్క 1954
మకర దేవత 1955
ముగ్గురు మాంత్రికులు 1957
కంచుకోట 1958
జ్వాలాద్వీపం 1960
రాకాసిలోయ 1961
పాతాళదుర్గం 1966
శిథిలాలయం 1968
రాతిరథం 1970
యక్ష పర్వతం 1972
మాయా సరోవరం 1976
భల్లూక మాంత్రికుడు 1978
చందమామలో ఆయన రాసిన ఆ పన్నెండు సీరియల్స్ 24 సంవత్సరాలపాటు వరుసగా రాసినవి.
ఖడ్గవర్మ, జీవదత్తు, జయశీలుడు, సిద్ధ సాధకులూ, ఏకాక్షీ చతుర్నేత్రులూ వంటి పాత్రలతో రెండు, లేదా మూడు తరాల పిల్లలకు బాల్యపు హీరోలను అందించిన మేటి రచయిత సుబ్రహ్మణ్యం గారు. ‘తోకచుక్క’ దగ్గర్నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ అద్భుత కథలను తీర్చిదిద్దిన ఈయన చందమామలో యాబై నాలుగేళ్ళు పాటు (2006వరకూ) పనిచేసి, ఉద్యోగ విరమణ చేశారు.
చందమామలో ప్రారంభం నుంచి మాంత్రికులు, దెయ్యాలు, భూతాలు, పట్టువదలని విక్రమార్క భేతాళులు వంటి బాల్య జీవితాన్ని సమ్మోహనపరుస్తూ వచ్చిన కథలు, ధారావాహికలు అచ్చవుతూ వస్తున్నప్పటికీ దాసరి సుబ్రహ్మణ్యం గారి పన్నెండు ధారావాహికలు తెలుగు జాతికి, పిల్లలకు, పెద్దలకూ కథల రూపంలో అమృతాన్ని అందించాయంటే అతిశయోక్తి కాదు.
బండెడు పుస్తకాలు, కొండల లెక్కన పరీక్షలు, మార్కులు, అలివిమాలిన టార్గెట్లు, ఇంజనీరింగ్, డాక్టర్, సాప్ట్‌వేర్ కలల భారంలో బాల్యానికి బాల్యమే హరించుకుపోతున్న నేటి పిల్లల తరం కూడా మళ్లీ చందమామను పెద్దలకు లాగే హత్తుకోవాలనే ఆకాంక్షతో ఆయన 1966లో రాసిన పాతాళదుర్గం సీరియల్‌ను తిరిగి ఆన్‌లైన్ చందమామలో ఈ వారం నుంచి ప్రచురిస్తున్నాం. ఇప్పటికే ఆయన సీరియల్ ‘యక్షపర్వతం’ ఆన్‌లైన్ చందమామలో పూర్తిగా ప్రచురితమైన విషయం తెలిసిందే.
వరుస క్రమంలో కాకపోయినప్పటికీ, ప్రింట్ చందమామ, ఆన్‌లైన్ చందమామల మధ్య సాంకేతిక సమన్వయం కుదిరిన మేరకు సుబ్రహ్మణ్యంగారి అలనాటి ధారావాహికలను ఒక్కటొకటిగా ఆన్‌లైన్‌లో ప్రచురించబోతున్నామని తెలిపేందుకు సంతోషిస్తున్నాం.
వేణుగారికి నెనర్లు
మీ స్పందనను abhiprayam@chandamama.com పంపండి.
చందమామ గత సంచికలలోని కథలకోసం ఆర్కైవ్స్ లోకి వెళ్లి చూడండి.
http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL
చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరవండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49
చందమామ ప్రెస్సు : వికీపీడియా
చందమామ అందంగా రూపొందడానికి గల మరో కారణం నాణ్యమైన ముద్రణ. నాగిరెడ్డి తన తమ్ముడైన బి.ఎన్.కొండారెడ్డి (ఈయన మల్లీశ్వరి లాంటి కొన్ని సినిమాలకు కెమెరామాన్ గా పని చేశాడు) పేరుతో నడుపుతున్న బి.ఎన్.కె. ప్రెస్సులోనే మొదటినుంచి చందమామ ముద్రణ జరుగుతోంది.
నాగిరెడ్డి అతి ప్రతిభావంతంగా నడిపిన బి.ఎన్.కె.ప్రెస్ “చందమామ”ను అందంగా ముద్రిస్తూ ఉండేది. ఎన్నో కొత్త రకం అచ్చు యంత్రాలను మనదేశంలో మొట్టమొదటగా నాగిరెడ్డి కొని వాడడం మొదలుపెట్టాడు. ఈ విధంగా చక్రపాణి “సాఫ్ట్‌వేర్”కు నాగిరెడ్డి “హార్డ్‌వేర్” తోడై “చందమామ”ను విజయవంతంగా తీర్చిదిద్దింది.
అసలు చక్రపాణికి నాగిరెడ్డి పరిచయమైంది ఈ ప్రెస్సులోనే. శరత్ వ్రాసిన బెంగాలీ నవలలకు తాను చేసిన తెలుగు అనువాదాలను ప్రచురించే పని మీద చక్రపాణి అక్కడికి వచ్చాడు. తర్వాత నాగిరెడ్డి-చక్రపాణి పేర్లు స్నేహానికి పర్యాయపదంగా నిలిచిపోవడం చరిత్ర.
చందమామ మూసివేత- పునఃప్రారంభం
1998 అక్టోబరు నెలలో అనివార్య పరిస్థితుల్లో ప్రచురణ ఆగిపోయిన చందమామ 1999 డిసెంబరు నెలలో తిరిగి మొదలైంది. మోర్గాన్ స్టాన్లీ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ సేథి, కార్వీ కన్సల్టెంట్స్ కు చెందిన సుధీర్ రావు, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఎస్. నీలకంఠన్, ప్రముఖ చిత్రకారుడు ఉత్తమ్ కుమార్, మార్కెటింగ్ నిపుణుడు మధుసూదన్ లు చందమామ పునఃస్థాపనకు మూల కారకులు.
చందమామ ప్రత్యేకతలుగా గుర్తింపు పొందిన కథన శైలి, సాంకేతిక నైపుణ్యాలను రంగరించి పంచతంత్రం, జాతక కథలు లాంటివాటిని బొమ్మల కథలుగా రూపొందించి ఇతర పత్రికలకు అందజేయడానికి సిండికేషన్ ద్వారా ముందుకు వచ్చింది చందమామ. తెలుగు మరియు ఇతర భాషల్లో అనేక పత్రికలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాయి.
అప్పటి వరకూ పూర్తిగా బి.నాగిరెడ్డి కుటుంబ సభ్యులకే పరిమితమై ఉన్న చందమామ ప్రచురణ మరియు నిర్వహణ హక్కులు కొత్తగా స్థాపించబడిన చందమామ ఇండియా లిమిటెడ్ కు బదిలీ చేయబడ్డాయి. అందులో బి.నాగిరెడ్డి కుమారుడైన బి.విశ్వనాథరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు 40% వాటా, వినోద్ సేథి, సుధీర్ రావు, ఇతరులకు 60% వాటా ఇవ్వబడ్డాయి.
బి.విశ్వనాథరెడ్డి (విశ్వం) చందమామ సంపాదకుడుగానూ, ప్రచురణకర్తగానూ, చందమామ ఇండియా లిమిటెడ్ మానేజింగ్ డైరెక్టర్ గానూ కొన్నేళ్ళు కొనసాగాడు. చివరికి 2009 నాటికి చందమామ యాజమాన్యం ముంబైకి చెందిన జియోదెశిక్ అనబడే సాప్ట్‌వేర్ సంస్థ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం అన్ని బారతీయ భాషల్లోను చందమామ సంపాదకుడు, ప్రచురణకర్త ఎల్. సుబ్రహ్మణ్యన్.
బయటి లింకులు
చందమామ తెలుగు వెబ్‌సైటు
ఈమాట-చందమామ గురించి కొన్ని విషయాలు
“చందమామ” జ్ఞాపకాలు
ప్రచురణ పునరుద్ధరించిన చందమామ
ప్రచురణకర్త, సంపాదకుడు విశ్వనాథరెడ్డితో ఇంటర్వ్యూ
చందమామ చరిత్ర , ప్రొఫైల్ గురించి ప్రచురణకర్త, సంపాదకుడు విశ్వనాథరెడ్డి
చందమామ సింగపూరు తమిళం-ఇంగ్లీషు ద్విభాషా సంచిక
సంతాలీ భాషలో చందమామ విడుదల
60 వసంతాలు జరుపుకుంటున్న చందమామ
ఆగస్ట్ 1947 మాసం నాటి చందమామ
సెప్టెంబర్ 1947 మాసం నాటి చందమామ
అక్టోబర్ 1947 మాసం నాటి చందమామ
నవంబర్ 1947 మాసం నాటి చందమామ
డిసెంబర్ 1947 మాసం నాటి చందమామ
జనవరి 1948
ఫిబ్రవరి 1948
మార్చి 1948
చందమామ చిత్రకారులు : వికీపీడియా
వడ్డాది పాపయ్య
వడ్డాది పాపయ్య వేసిన చిత్రముతో చందమామ తెలుగు సంచిక”చందమామ”కు ప్రత్యేకత రావడానికి బొమ్మలు చాలా దోహదం చేశాయి. చక్రపాణి అంతవరకూ ఏ పత్రికలోనూ లేని విధంగా చందమామలో ప్రతి పేజీ లోనూ ఒక బొమ్మ వచ్చేటట్లు, కథ సరిగ్గా గీత గీసినట్లు బొమ్మ దగ్గరే ముగిసేటట్లు శ్రద్ధ తీసుకున్నాడు. తర్వాత ప్రారంభమైన పిల్లల పత్రికలన్నీ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. కాగా అరవయ్యేళ్ల తర్వాత చందమామే ఇప్పుడు ఆ పద్ధతిని తోసిరాజంటోంది. చందమామలో బొమ్మలు వేసిన కొందరు ప్రముఖ చిత్రకారులు:
వడ్డాది పాపయ్య
ఒక్క ఇంగ్లీషు తప్ప మిగిలిన భాషలన్నిట్లోనూ ముఖచిత్రాలు వడ్డాది పాపయ్య గీసినవే.
ఎం.టి.వి. ఆచార్య
1952 ప్రాంతాల్లో ఎం.టి.వి. ఆచార్య “చందమామ”లో ఆర్టిస్టుగా చేరాడు. మహాభారతం అట్టచివరి బొమ్మకూ, అట్టమీది బొమ్మకూ ఆయన అద్భుతమైన బొమ్మలు గీశాడు. ఆయనకు మనుషుల ఎనాటమీ క్షుణ్ణంగా తెలుసు. సుమారు 20 ఏళ్ళ పాటు కొనసాగిన మహాభారతం సీరియల్‌కు ఆయన వివిధ పాత్రల ముఖాలు ఏ మాత్రమూ మార్పు లేకుండా చిత్రీకరించాడు. అందరూ బుర్రమీసాల మహావీరులే అయినా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, దుర్యోధనుడు, ఇలా ప్రతి ఒక్కరినీ బొమ్మ చూడగానే పోల్చడం వీలయేది. భీష్ముడికి తెల్ల గడ్డమూ, బట్టతలా ఆయనే మొదటగా గీశాడు. భీష్మ సినిమాలో ఎన్.టి.రామారావు ఆహార్యమంతా “చందమామ”లో ఆయన వేసిన బొమ్మల నుంచి తీసుకున్నదే. ఆ తరవాత ఆయన వ్యక్తిగత కారణాలవల్ల బెంగుళూరుకు వెళ్ళిపోయాడు.
చిత్రా (టి.వి. రాఘవన్)
మొదట్లో “చందమామ”కు చిత్రా ప్రధాన ఆర్టిస్టుగా ఉండేవాడు. ప్రారంభ సంచిక ముఖచిత్రం ఆయనదే. చిత్రా చిత్రకళ నేర్చుకోలేదు. స్వంతంగా ప్రాక్టీసు చేశాడు. ఆయన మంచి ఫోటోగ్రాఫరట. ఒక సందర్భంలో బాపు చిత్రా బొమ్మలు తన కిష్టమనీ, గాలిలో ఎగిరే ఉత్తరీయం, ఆయన గీసే పద్ధతి తనకు బాగా నచ్చుతుందనీ అన్నాడు. అమెరికన్ కామిక్స్ “చందమామ” ఆఫీసులో చాలా ఉండేవి. వివిధ దేశాలవారి డ్రస్సులనూ, వెనకాల బిల్డింగుల వివరాలనూ చిత్రా వాటినుంచి తీసుకునేవాడు. ఈ కారణంగా విదేశీ కథలన్నీ సామాన్యంగా ఆయనకే ఇచ్చేవారు. దాసరివారి సీరియల్‌కు చిత్రా బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. అప్పుడప్పుడూ ఆయన బొమ్మల కోసమేనేమో అన్నట్టుగా సుబ్రహమణ్యం “మూడు కళ్ళూ, నాలుగు తలలూ ఉన్న వికృతాకారుడు” మొదలైన పాత్రలను కథలో ప్రవేశపెట్టేవాడు. మొసలి దుస్తులవాళ్ళూ, భల్లూకరాయుళ్ళూ చిత్రా బొమ్మలవల్ల ఆకర్షణీయంగా కనబడేవారు.
శంకర్
బేతాళుడు ఆవహించిన శవాన్ని భుజాన వేసుకుని, ఒక చేత్తో కత్తి దూసి చురుకైన కళ్ళతో చుట్టూ చూస్తూ ముందుకు అడుగేస్తున్న విక్రమార్కుడి బొమ్మను చూడగానే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు అది చందమామలోని బేతాళ కథకు శంకర్ వేసిన బొమ్మ అని. తమిళనాడుకు చెందిన ఆయన ఆర్ట్ స్కూల్లో చిత్రకళ నేర్చుకుని వచ్చినవాడు. టూరిస్టు వింతలవంటి ఒక పేజీ విషయాలకు ఫోటోను చూసి చిత్రీకరించడం ఆయన ప్రత్యేకత. మొత్తంమీద వీరిద్దరూ వివరాలతో కథలకు బొమ్మలువేసే పద్దతిని ప్రవేశపెట్టారు. అప్పుడప్పుడూ యువ దీపావళి సంచికల్లో కూడా కథలకు వీరు చిత్రాలు గీసేవారు.
బాపు
కొన్ని సంచికలకు బాపు కూడా బొమ్మలు వేశాడు. “చందమామ” ఫార్మాట్‌లో గీసినా ఆయన తన శైలిని మార్చుకోలేదు. ఉత్పల సత్యనారాయణాచార్య గేయ కథలకు ఆయన మంచి బొమ్మలు గీశాడు.
జయ, వీరా, రాజి లాంటి మరికొందరు చిత్రకారులు చందమామలో ఎక్కువగా బొమ్మలు వేసేవారు.
చందమామ రచయితలు : వికీపీడియా
దాసరి సుబ్రహ్మణ్యం (ఎడమ చివర), కుటుంబ రావు (కుడి చివర),మరొక సహోద్యోగి (మధ్య)
కొడవటిగంటి కుటుంబరావు:
1952 నుంచి 1980 లో చనిపోయే వరకూ చందమామకు సంపాదకుడిగా విశేషమైన కృషి చేశాడు (సంపాదకుడి పేరు వెయ్యటం చందమామ సంప్రదాయం కాదప్పట్లో). పురాణ గాథల్నీ, పరభాషా కథలను తేట తెలుగులో పిల్లలకు అందించడానికి ఆయన చేసిన కృషి అమోఘం. మొదట్లో బయటి రచయితలు పంపిన కథల వంటివి దాదాపుగా ఏవీ ఉండేవి కావు. రకరకాల మారుపేర్లతో కథలు, శీర్షికలన్నీ ఆయనే రాసేవాడు.
మంచి కథలు ఎవరైనా పంపితే వాటిని అవసరమనిపిస్తే కొడవటిగంటి కుటుంబరావు “మెరుగుపరిచి” తిరగరాసేవాడట. ఇతర భాషలలో వచ్చిన కథ నచ్చితే తెలుగులో తిరగరాయబడి, మళ్ళీ మామూలు ప్రోసెస్ ద్వారా అన్ని భాషల్లోకీ తర్జుమా అయేది. 1970ల తరవాత బైటినుంచి రచనలు రావడం, వాటిని “సంస్కరించి” ప్రచురించడం ఎక్కువైంది. క్లుప్తంగా, ఏ విధమైన యాసా చోటు చేసుకోకుండా సూటిగా సాగే కుటుంబరావు శైలిని చక్రపాణి “గాంధీగారి భాష” అని మెచ్చుకునేవాడట. ఇంకెవరు రాసినా ఆయనకు నచ్చేది కాదు.
కొడవటిగంటి కుటుంబరావు స్వయంగా పేరొందిన కథా/నవలా రచయిత కావటంవల్ల, ఆయన చందమామను సర్వాంగసుందరమైన ఆకర్షణీయ పత్రికగా, ప్రతి మాసం మలచేవాడు. దీనికి తోడు, ఎంతో కళా దృష్టి ఉన్న చక్రపాణి పర్యవేక్షణ ఎంతగానో ఉపకరించేది. కథలలో ఎక్కడా అసంబద్ధమైన విషయాలు ఉండేవి కావు. ప్రతి కథా చాలా సూటిగా, కొద్ది పాత్రలతో మంచి విషయాలతో నిండి ఉండేది.
ఇతర రచయితలు
విద్వాన్ విశ్వం
మొదట్లో చందమామలో కథలతో బాటు గేయాలు/గేయకథలు కూడా వస్తూ ఉండేవి. అప్పట్లో చందమామలో ద్విపద కావ్యం రూపంలో వచ్చిన పంచతంత్ర కథలను వ్రాసింది విద్వాన్ విశ్వం. తర్వాతి కాలంలో ఈ కథలను ఆయన చేతే చక్కటి వాడుక భాషలోకి మార్చి చందమామలో ప్రచురించారు. చందమామలో ఈ కథలకు బొమ్మలు వేసింది వడ్డాది పాపయ్య కాగా ఈ కథలను ద్విపద రూపంలోనూ, వచనరూపంలోనూ టి.టి.డి. వాళ్ళు ఒకే పుస్తకంగా ప్రచురించినప్పుడు బాపు చేత బొమ్మలు వేయించారు.
ఉత్పల సత్యనారాయణ
ఇటీవల కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన ఈయన చందమామలో వ్రాసిన గేయాలు సుప్రసిద్ధం.
వడ్డాది పాపయ్య
వపా కేవలం చిత్రకారుడే కాదు. రచయిత కూడా. కొడవటిగంటి కుటుంబరావు మొదలు పెట్టిన దేవీభాగవతం కథలను పూర్తి చేసింది ఆయనే. విష్ణుకథ పౌరాణిక సీరియల్ కూడా ఆయన వ్రాసిందే.
దాసరి సుబ్రహ్మణ్యం
చందమామలో దాదాపు మొదటినుంచీ ఉన్నవారిలో దాసరి సుబ్రహ్మణ్యం ఒకడు. మొదటి రంగుల సీరియల్ ఆయన ప్రత్యేకత. తోకచుక్క, మకరదేవత, ముగ్గురు మాంత్రికులు మొదలైన అద్భుతాల నవలలన్నీ ఆయనవే. ఎందుచేతనో చక్రపాణికి ఈ తరహా రచనలు నచ్చేవి కావు. పాఠకులకు మాత్రం అవి చాలా నచ్చేవి. ఒక దశలో వాటిని మాన్పించి బంకించంద్ర నవలను ప్రవేశపెట్టగానే సర్క్యులేషన్ తగ్గింది. దాంతో దాసరివారికి మళ్ళీ పనిపడింది. చక్రపాణి అభిరుచి, పాఠకుల అభిరుచి వేరని రుజువయింది.
ఏ.సి. సర్కార్
ప్రజల్లో బాగా పాతుకుపోయిన మూఢనమ్మకాలను తొలగించడానికి కొడవటిగంటి కుటుంబరావు చందమామ ద్వారా ప్రయత్నాలు చేశాడు. మహిమల పేరుతో అమాయక ప్రజలను మోసగించేవారి గుట్టుమట్లను బయట పెడుతూ ప్రత్యేకంగా ఏ.సి.సర్కార్ అనే ఇంద్రజాలికుడి చేత ఆసక్తికరమైన కథలు వ్రాయించాడు.
వసుంధర
ఒక్క చందమామలోనే ఏడు వందలకు పైగా కథలు రాసిన ఘనత వీరిది.
బూర్లె నాగేశ్వర రావు
ఈయన చాలా చక్కటి కధలు అనేకం రాశాడు.
మాచిరాజు కామేశ్వరరావు
చందమామలో దాదాపు గత ఇరవయ్యేళ్ళ కాలంలో వచ్చిన దయ్యాలు, పిశాచాల కథలన్నీ ఈయన రాసినవే.
మనోజ్ దాస్
ప్రస్తుతం భారత దేశంలో చిన్నపిల్లల కోసం రచనలు చేస్తున్న వారిలో అగ్రగణ్యుడు. మాతృభాష అయిన ఒరియా మరియు ఇంగ్లీషు భాషల్లో విరివిగా వ్రాయడమే గాక చందమామ కోసం వివిధ దేశాల జానపద, పురాణ గాథలను అనువదించాడు. చందమామలో జానపద సీరియల్ రచయిత పేరు వెయ్యడం ఒకేసారి జరిగింది. 1990లలో వచ్చిన “బంగారు లోయ” సీరియల్ రచయితగా మనోజ్ దాస్ పేరు వేశారు.
వీరు కాక ఎందరో ఇతర రచయితలు (పేరు పేరునా ఉదహరించాలంటే చాలా పెద్ద జాబితా అవుతుంది) వారివంతు కృషి చేసి చందమామను చక్కటి పత్రికగా తీర్చి దిద్దారు.
ఇతర భాషల్లో చందమామ – వికీపీడియా
సంస్కృత సంచిక. చందమామ ప్రస్తుతం తెలుగు (జూలై 1947 నుంచి), తమిళం(ఆగస్ట్ 1947 – అంబులిమామ), కన్నడం (1948), హిందీ (1949 – చందామామ), మరాఠీ (1952 – చాందోబా), మలయాళం (1952 – అంబిలి అమ్మావన్), గుజరాతీ (1954), ఇంగ్లీషు (1955), ఒరియా (1956), బెంగాలీ (1972), సింధీ (1975), అస్సామీ (1976), సంస్కృత (1979) భాషల్లోనేగాక ఆగస్ట్ 2004 నుంచి సంతాలీ (చందొమామొ) అనే గిరిజన భాషలోకూడా వెలువడుతోంది (మొత్తం పదమూడు భాషలు).
ఒక గిరిజన భాషలో వెలువడుతున్న మొట్టమొదటి పిల్లల పత్రిక చందమామ కావడం విశేషం. సింధీలో 1975 లో మొదలై కొంతకాలం నడిచి ఆగిపోయింది. గురుముఖి (పంజాబి భాష యొక్క లిపి) మరియు సింహళ (1978 – అంబిలిమామ) లో కూడ కొంతకాలం నడిచింది. పంజాబ్ మరియు శ్రీలంక ఘర్షణల తర్వాత ఆ భాషల్లో ప్రచురణ నిలిచిపోయింది.
చందమామను చూసి ముచ్చటపడిన అప్పటి శ్రీలంక ప్రధానమంత్రి , కొన్ని నెలల పాటు సింహళ సంచికకు కథలు కూడా అందించాడు. అంధుల కోసం 4 భాషల్లో (ఇంగ్లీషు, తమిళం, హిందీ, మరాఠి) బ్రెయిలీ లిపిలో(1980 నుంచి) కూడా కొంతకాలం నడిచి 1998లో ఆగిపోయింది. 2004 సంవత్సరం నుండి తెలుగు మరియు ఇంగ్లీషు బ్రెయిలీ లిపి (గుడ్డివారు చదవగలిగిన లిపి) సంచికలు తిరిగి ప్రచురించడం మొదలయింది.[1].
ఇంగ్లీషు.
అమెరికా, కెనడా దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల కోసం రెండుభాషల సంచిక (ఒకే పుస్తకంలో రెండు భాషల చందమామ) లు తెలుగు-ఇంగ్లీషు వెలువడుతున్నాయి. అలాగే, తమిళం-ఇంగ్లీషు, హిందీ-ఇంగ్లీషు భాషల్లో కూడా వెలువడుతున్నాయట. గుజరాతి-ఇంగ్లీషు ద్విభాషా పత్రిక కూడా విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని వినికిడి.
ఇక సింగపూరులోని పాఠకులకోసం ప్రత్యేకంగా అంబులిమామ పేరుతో ఇంగ్లీషు-తమిళ భాషల్లో ద్విభాషా సంచిక వెలువడుతోంది. కొత్తలో చందమామ ముందు తెలుగులో తయారయేదట. అది పైనెలలో తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వచ్చేది. ఎందుకంటే ఆ సంపాదకులకు తెలుగు చదవడం వచ్చు.
ఆ తరువాతి నెలలో తమిళంనుంచి మలయాళంలోనికీ, హిందీ నుంచి మరాఠీ, గుజరాతీల్లోకీ అనువాదం అయేది. ఏ భాషకా భాషలో వరస తప్పకుండా సంచికలు వచ్చేవి కనక ఎవరికీ ఇబ్బంది ఉండేదికాదు. ఇతర భాషల పాఠకులకు తెలుగే ఒరిజినల్ అని తెలిసేది కూడా కాదు.
తమిళంలో అంబులిమామా, మలయాళంలో అంబిలి అమ్మావన్, మరాఠీలో చాందోబా ఇలా ప్రతిదీ దేనికదిగా ప్రసిద్ధి చెందిన పత్రికలైపోయాయి. అయితే 1990ల నుండి, ముఖ్యంగా మనోజ్ దాస్ రచనలు ఎక్కువయ్యేకొద్దీ ఈ వరస తిరగబడింది. ఆయన చేసే రచనలు ముందుగా ఒరియా, ఇంగ్లీషు భాషల్లోనూ, ఆ తర్వాత తెలుగుతో సహా ఇతర భాషల్లోనూ వస్తున్నాయి.
సంపాదకులు, ప్రచురణకర్తలు
సంస్థాపకులు చక్రపాణి-నాగిరెడ్డి
పత్రిక ఉన్నతికి కృషి సల్పిన కొడవటిగంటి కుటుంబరావు, సంపాదకుడు (1952 నుండి 1980 వరకు)చందమామ సంస్థాపకుడు చక్రపాణి కాగా సంచాలకుడు నాగిరెడ్డి. చందమామ స్థాపించాలనే ఆలోచన పూర్తిగా చక్రపాణిదే. 1975లో చనిపోయే వరకూ ఎనలేని సేవచేశాడు. ప్రస్తుతం నాగిరెడ్డి కుమారుడైన విశ్వనాధ రెడ్డి చందమామ వ్యవహారాలు చూస్తూ, సంపాదక బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాడు.
చందమామ సంపాదకుల వ్యాఖ్యలు
“బాలసాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలికమైన భావనలను బలంగా నాటాలి. ధైర్యసాహసాలూ, నిజాయితీ, స్నేహపాత్రత, త్యాగబుద్ధీ, కార్యదీక్షా, న్యాయమూ మొదలైనవి జయించటం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు, ఎంత అవాస్తవంగా ఉన్నా పిల్లల మనస్సులకు చాలా మేలుచేస్తాయి…పిల్లల్లో దౌర్బల్యాన్ని పెంపొందించేది మంచి బాలసాహిత్యం కాదు…దేవుడి మీద భక్తినీ, మతవిశ్వాసాలనూ ప్రచారం చెయ్యటానికే రచించిన కథలు పిల్లలకు చెప్పటం అంత మంచిది కాదు…కథలో నెగ్గవలసినది మనుష్య యత్నమూ, మనిషి సద్బుద్ధీనూ”. -కొడవటిగంటి కుటుంబరావు
“ప్రతి ఒక్కరికీ తమ సంస్కృతీ సంప్రదాయాలను గురించిన ప్రాథమిక అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. ఘనమైన భారతీయ సాంస్కృతిక వారసత్వ సంపదను పదిలపరచి ఒక తరాన్నుంచి ఇంకో తరానికి అందించడమే లక్ష్యంగా చందమామ పని చేస్తోంది. గతానికీ, వర్తమానానికీ మధ్య వారధిగా నిలుస్తోంది.” -బి.విశ్వనాథరెడ్డి-విశ్వం (చందమామ ప్రస్తుతపు సంపాదకులు (2008), వ్యవస్తాపకులలో ఒకరైన నాగిరెడ్డి కుమారుడు)
చందమామకు ప్రముఖుల ప్రశంసలు
వివిధ ఎడిషన్ల గురించి మాట్లాడుతూ జవహర్‌లాల్ నెహ్రూ: “అసామాన్యమైన విషయం”
ప్రథమ భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాదు: “అక్షరాస్యతను పెంపొందించడంలో సహాయకారి”
పూర్వ ప్రధాని మొరార్జీ దేశాయ్: “పిల్లలకు చక్కని ఆరోగ్యకరమైన వినోదాన్ని అందిస్తోంది”
పూర్వ ప్రధాని ఇందిరాగాంధీ: చందమామ ఎన్నో భాషల్లో నిరంతరాయంగా ఒక్కమారు వస్తున్నది. ఇది పిల్లల్లో ఊహలను పెంచుతుంది. కళ పట్ల అవగాహన కలిగిస్తుంది. నేర్చుకోవాలనే ఆసక్తి పెంపొందిస్తుంది. సమాజంలోనూ, లోకంలోనూ కలసి మెలసి బ్రతికే సుగుణం నేర్పుతుంది.
పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్: భారతదేశపు సుసంపన్న, బహువిధ సాంస్కృతిక వారసత్వము నుండి ఏర్చి కూర్చిన కధలతో చందమామ లక్షలాది చిన్నారుల మనస్సులను మంత్రముగ్ధులను చేసింది. ఇన్ని భాషలలో ప్రచురించే సాహసాన్ని పెద్దయెత్తున అభినందించాలి.
మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్: (జూనియర్ చందమామగురించి) ఇది యువతరాన్ని చైతన్యపరుస్తుంది.
అమితాబ్ బచ్చన్ “నా చిన్నతనంలో నేను పశ్చిమ దేశాలకు చెందిన ‘కామిక్స్’ ప్రభావంలో ఉండేవాడిని. నా తల్లి తండ్రులు, నాకు చందమామను పరిచయం చేసినప్పటినుండి, ఆ పుస్తకాన్ని వదలలేదు. భారతదేశంలో చందమామ కథలు ప్రాచుర్యంలో లేని గృహం ఉంటుందని నేననుకోవటంలేదు…… నేను చందమామను నా మనమలకు, మనమరాళ్ళకు పరిచయం చేస్తాను” (చందమామ 60వ వార్షికోత్సవ సందర్భంగా, ప్రత్యేక సంచికను విడుదల చేస్తూ. – హిందు దిన పత్రిక, ఏప్రిల్ 18 2008 నుండి)
60 వసంతాల చందమామ
భారతదేశ స్వాతంత్ర్యానికి సరిగ్గా ఒక నెల ముందు ప్రారంభించబడిన చందమామ 2006 జులై కి 60 వసంతాలు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా మాట్లాడుతూ సంపాదకుడు విశ్వనాథరెడ్డి తన తండ్రిని, చక్రపాణిని గుర్తు చేసుకున్నాడు. పత్రిక ఇంకా వారు చూపిన బాటలోనే సాగుతోందని తెలిపాడు. నేటి తరం పిల్లల కోసం పత్రిక స్వరూపాన్ని మార్చే అలోచనేది లేదని తెలిపాడు.ఈ మధ్యనే ప్రముఖ భారతీయ సాఫ్ట్‌వేర్ సంస్థ, ఇన్ఫోసిస్ యొక్క సాంఘిక సేవా విభాగం,ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కర్ణాటకలో 6,000 కన్నడ మరియు ఇంగ్లీషు సంచికలు గ్రామీణ బాలలకు ఇవ్వడానికి చందమామతో ఒప్పందం కుదుర్చుకుంది.
చందమామలో జానపద కథలు : వికీపీడియా
జానపద కథలకు చందమామ కాణాచి. చందమామ కార్యాలయంలో అన్ని ప్రపంచదేశాల జానపద కథలు ఉండేవి. చందమామకు ఉన్నటువంటి గ్రంథాలయం మరెక్కడా లేదు. ఎంతో అద్భుతమైన జానపద కథలు చందమామలో వచ్చాయి. రాజులూ, వారి రాజ్యాలూ, రాజకుమారులూ, రాజకుమార్తెలూ, వారి స్వయంవరాలు, వారి సాహసాలు, మంత్రుల తెలివితేటలు, పరిపాలనా దక్షత, విదూషకుల హాస్యం/చురుకైన బుధ్ధి, ప్రభువుల విశాల హృదయం మరియు ముందుచూపు, జానపదులు, వారి అమాయకత్వంవంటి విషయాలు ఇతివృత్తంగా కొన్ని వందల కథలు వచ్చి పిల్లలను ఉత్తేజ పరిచాయి.
చందమామ శైలి, ఒరవడి
చందమామ శైలి సామాన్యమైన పదాలతో, చక్కటి నుడికారాలు, జాతీయాలు మరియు సామెతల తో కూడినది. పాఠకులను చీకాకు పరిచే పదప్రయోగాలూ, పదవిన్యాసాలూ ఉండేవి కావు. చదువుతుంటే కథగానీ మరేదైనా శీర్షికగానీ అందులోని భావం హృదయానికి హత్తుకుపోయే విధంగా ఉండేది. కొడవటిగంటి కుటుంబరావు(ఎక్కువకాలం చందమామకు సంపాదకులు)ఏ దేశ కథనైనా మన దేశానికీ, తెలుగు భాషకు సరిపోయేట్టు మలిచి వ్రాసేవాడట. చందమామలోని మరో ప్రత్యేకత – తేనెలూరే తియ్యటి తెలుగు. అసలు ఏ భారతీయ భాషైనా నేర్చుకోవడానికి ఆ భాషలోని చందమామ చదవడం ఉత్తమ మార్గం అనడం అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల పుస్తకాల్లో ఆకర్షణీయమైన బొమ్మలు వేయడం చందమామతోనే మొదలు. కథ, కథకి సంబంధించిన బొమ్మలు ఎలా ఉండాలో, ఏ నిష్పత్తిలో ఉండాలో చక్కగా చేసి చూపించి, మిగిలిన పత్రికలకు మార్గదర్శకమైంది. చందమామ శైలిని, ఒరవడిని, ఇతరులు అనుకరించడం లేదా అనుసరించడం చెయ్యగలిగారుగాని, కొత్త శైలినిగాని ఒరవడినిగాని ఇంతవరకు సృష్టించలేక పోయారు.
ఇతర శీర్షికలు
మహోన్నతమైన భారతీయ సాంస్కృతిక వైభవానికీ, వైవిధ్యానికీ అద్దం పట్టే శీర్షికలు అనేకం చందమామలో వచ్చాయి. సుభాషితాలు, బేతాళ కథలతోబాటు దశాబ్దాల కాలం నుంచి నిరాఘాటంగా నడుస్తున్న శీర్షిక ఫోటో వ్యాఖ్యల పోటీ. ఈ పోటీలో, రెండు చిత్రాలను ఇస్తారు. పాఠకులు ఆ రెండు చిత్రాలను కలుపుతూ ఒక వ్యాఖ్య పంపాలి. అన్నిటికన్న బాగున్న వ్యాఖ్యకి బహుమతి. ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టిన కథల పోటీల్లాంటివి పాఠకుల సృజనాత్మకతకు పదును పెడుతున్నాయి. పిల్లలకు విజ్ఞానం, వినోదం, వికాసం అందించడమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు కొత్త శీర్షికలతో ప్రయోగాలు చేయడం చందమామ ప్రత్యేకత.
ప్రత్యేక సంచికలు
గాంధీ శతజయంతి సందర్భంగా 1969లో వేసిన ప్రత్యేక సంచిక
చంద్రుని మీద మానవుడు కాలుమోపిన సందర్భంగా 1969లో వేసిన ప్రత్యేక సంచిక
అప్పుడు
చందమామ, మంచి ప్రాభవంలో ఉన్న రోజుల్లో వడ్డాది పాపయ్య, బాపు గార్ల రంగుల బొమ్మలతో, ప్రతి పేజీక్రింద అంచులలో దీపాల బొమ్మలతో, దీపావళికి ప్రత్యేక సంచిక ఉండేది. అలాగే, మనిషి మొట్టమొదటిసారి, చంద్రుడిమీద కాలుపెట్టిన చారిత్రాత్మక సంఘటన (జులై, 1969) సందర్భంగానూ, మహాత్మా గాంధీ శతజయంతి (అక్టోబరు, 1969) సందర్భంగానూ ప్రత్యేక చందమామలు వేయబడ్డాయి.
అలాగే, విజయా సంస్థ వారు హిందీలో “ఘర్ ఘర్ కి కహానీ” ప్రముఖ నటులు బల్రాజ్ సహానీతో తీసినపుడు, ఆ చిత్రం గురించి చందమామలో ప్రత్యేకంగా వ్రాసారు. ఆ చిత్రంలో, కుటుంబంలో తండ్రి – పిల్లల మధ్య సంబంధ బాంధవ్యాల గురించి చక్కగా చూపారు. అందుకనే కాబోలు, చందమామలో ప్రత్యేకంగా ప్రచురించారు. ఈ సంచికలు చందమామ ప్రతులు పోగుచేసేవారికి ఎంతో విలువైనవి, బంగారంతో సమానమైనవి.
ఇప్పుడు
2000 సం. నుండి ప్రతి సంవత్సరం నవంబరు సంచికను పిల్లల ప్రత్యేక సంచికగా రూపొందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 14 ఏళ్ళలోపు బాలబాలికలచేత కథలు వ్రాయించి, ఎంపికచేసిన బాల చిత్రకారుల్ని చెన్నై రప్పించి, ఆ కథలకు వారిచేత బొమ్మలు వేయిస్తున్నారు.
Filed under ఆన్‌లైన్ చందమామ రచనలు | Tags: చందమామ, జానపద కథలు, త్రివిక్రమ్ | Comment (0)బేతాళ కథలు : వికీపీడియా
బేతాళకథల మొదటి పుటలలో ఒకటి, చాలా కాలంగా ముద్రించబడుచున్నది
బేతాళకథ మొదటి కథ 1972లొ పునర్ముద్రించినప్పటిది. గుణాఢ్యుడు సంస్కృతములో రచించిన “బృహత్ కథ” బేతాళకథలకు మూలం. ఈ కథలను కొంతకాలము తరువాత “కథాసరిత్సాగరం” సంపుటి లోనికి చేర్చారు. మూలంలో 25 కథలు మాత్రమే ఉన్నాయి. చివరి కథలో బేతాళుడి ప్రశ్నలకు విక్రమార్కుడు జవాబులు చెప్పలేకపోతాడట. అంతటితో ఆ కథలు సమాప్తమవుతాయి. కాని, బేతాళ కథలలోని చివరి కథ అందుబాటులో లేదు.
మూలకథ
గోదావరీ తీరాన, ప్రతిష్ఠానపురానికి విక్రమార్కుడు రాజు. ఒక భిక్షువు ఆయనకు రోజూ ఒక పండు లోపల రత్నము పెట్టి ఇస్తూ, ఆయన ప్రాపకం సంపాదించటానికి ప్రయత్నించేవాడు. అలా పండులో రత్నం పెట్టి ఇస్తున్నట్లు, కొన్ని రోజుల వరకు రాజుకు తెలియదు. ఆ విషయం తెలిసిన రోజున, విక్రమార్కుడు భిక్షువు యొక్క విశ్వాసానికి మెచ్చి, కారణం చెప్తేగాని మర్నాడు పండు తీసుకోనని చెప్తాడు.
దానికి బిక్షువు, తను ఒక మంత్రాన్ని సాధించదలచాననీ అందుకు ఒక వీరుడి సహాయం కావాలనీ, విక్రమార్కుని నుండి తానా సహాయం ఆశిస్తున్నాననీ అడుగుతాడు. విక్రమార్కుడు తగిన సహాయం చెయ్యటానికి ఒప్పుకుంటాడు. బిక్షువు, రాబోయే కృష్ణ చతుర్దశి రాత్రి చీకటి పడగానే రాజును మహా శ్మశానానికి రమ్మంటాడు.
అలాగే విక్రమార్కుడు వెళ్తాడు. అక్కడే ఉన్న భిక్షువు, రాజును శింశుపా వృక్షం మీద వేళ్ళాడుతున్న పురుషుడి శవం తెచ్చి, తన సమీపంలో ఉంచమంటాడు. రాజు ఆ చెట్టు ఎక్కి వేళ్ళాడుతున్న శవాన్ని తాడు కోసి కింద పడవేస్తాడు. కిందపడగానే, శవం ఏడవటం మొదలుపెడుతుంది. బేతాళుదు ఆ శవాన్ని ఆవహించి ఉన్న సంగతి తెలుసుకోలేక విక్రమార్కుడు,
ఎందుకు నవ్వుతావు, పోదాం పద అంటాడు. రాజుకు ఇలా మౌనభంగం అవగానే నేలమీది శవం మాయమై, మళ్ళీ చెట్టు మీద వేళ్ళాడుతూ కనపడుతుంది. విక్రమార్కుడు బేతాళుడు పూని ఉన్న ఆ శవాన్ని మళ్ళీ కిందపడేసి, భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవటం మొదలు పెడతాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, నీకు వినోదంగా ఉండటానికి ఒక కథ చెబుతాను విను” అంటూ ఒక కథ చెప్తాడు. కథ చివర ప్రశ్న వేసి, “ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పక పొయ్యావో, నీ తల పగిలి పోతుంది” అంటాడు. విక్రమార్కుడు తన మౌనం వీడి ప్రశ్నకు తగిన సమాధానం చెపుతాడు. ఆ విధంగా, విక్రమార్కుడికి మౌనభంగం జరగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తెరిగి చెట్టు ఎక్కుతాడు.
చందమామలో ధారావాహిక
ఈ కథలు ఎంతో కాలం చందమామ పత్రికలో కథా స్రవంతిగా వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. ఇదొక చిత్రమైన కథల సంపుటి. ప్రతి మాసం ఒక సంఘటన (విక్రమార్కుడు చెట్టుమీదనుంచి శవాన్ని దించి, భుజాన వేసుకొని) తో మొదలయ్యేది, అలాగే, మరొక సంఘటన (విక్రమార్కుడికి ఆ విధంగా మౌన భంగం కాగానే, శవంలోని బేతాళుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు)తో అంతమయ్యేది.
ప్రతి కథలోనూ, విక్రమార్కుడు మోస్తున్న శవంలోని భేతాళుడు, విక్రమార్కుడికి “శ్రమ తెలియకుండా విను” అని ఓ చక్కటి కథ చెప్పేవాడు. చివరకు, ఆ కథకు సంబంధించి చిక్కు ప్రశ్న/లు వేసేవాడు. అలా ప్రశ్నలు వేసి, విక్రమార్కుడికి ఒక హెచ్చరిక చేసేవాడు “ఈ ప్రశ్నలకి సమాధానం తెలిసీ చెప్పకపొయ్యావో, నీ తల వెయ్యి వక్కలవుతుంది” అని.
మౌనం వీడితే వ్రత భంగం అయ్యి, వచ్చినపని చెడుతుంది, సమాధానం తెలిసీ చెప్పకపోతే ప్ర్రాణానికి ప్రమాదం. పాపం విక్రమార్కుడు ఏం చేస్తాడు? తప్పని పరిస్థితులలో, తన మౌనం వీడి, ఆ చిక్కు ప్రశ్నకు చాలా వివరంగా జవాబు చెప్పేవాడు. ఈ విధంగా ప్రతినెలా శవంలోకి బేతాళుడు ప్రవేశించి, కథ చెప్పి, ప్రశ్నలడిగి, హెచ్చరించి, విక్రమార్కుడికి మౌన భంగం చేసి, అతడు వచ్చిన పని కాకుండా చేసేవాడు. అలా పై నెలకి కథ మొదటికి వచ్చేది.
బేతాళ కథ మొదటి కథ ఎలా ఉంటుందో అన్న పాఠకుల అసక్తిని గమనించి గాబోలు, చందమామ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, 1972 జూలైలో మొదటి బేతాళకథ రంగులలో పునర్ముద్రించారు. చందమామలో, మొదట చెప్పబడిన కథకు పేరు పెట్టలేదు. ఆ తరువాత కథలన్నిటికీ కథ మొదటి పుటలో పైన కథ పేరు, కింద “బేతాళ కథలు” అని వేయసాగారు.
బేతాళ కథలకు మొదటి పేజీలో వేసే బొమ్మ చాలా సార్లు మార్చి మార్చారు. అలాగే కథ చివరి పుటలో, బేతాళుడు ఎగిరి పోతూ ఉండటం, విక్రమార్కుడు కత్తి దూసి వెంట పడుతుండటం కూడా చాలా రకాలుగా వెయ్యబదినది. అందులో కొన్ని, చిత్రాలు వ్యాసం చివర చూడవచ్చు.
శీర్షికగా బేతాళ కథలు
అసలు, బేతాళ కథలు పాతిక మాత్రమే! కాని, చందమామలో వందల కొలది మామూలు కథలను (ఇప్పటివరకు 600 పైగా) బేతాళ కథలుగా ఎంతో నేర్పుగా మార్చి ప్రచురించారు. సాధారణమైన పిల్లల కథల్లోంచి, కథ చివర, ప్రతి నెలా, ఒక చిక్కు ప్రశ్నను సృష్టించడం, దానికి చక్కటి సమాధానం చెప్పించడం, సామాన్య విషయం కాదు.
అతి కష్టతరమైన ఈ పనిని, దశాబ్దాల పాటు నిరాఘాటంగా కొనసాగించడం, చందమామ నిబద్ధతకు, నైపుణ్యానికి, చక్కటి నిదర్శనం. తెలుగు జానపద సాహిత్యంలోని పేరొందిన ఒక కథా సంపుటిని తీసుకుని, ఆ కథలను ప్రచురించటమే కాక, అదే పంధాలో అనేక ఇతర కథలను ప్రచురించి, చిన్న పిల్లలకు(పెద్దలకు కూడ) చక్కటి ఆలోచనా పద్ధతి, సందేహాలను ప్రశ్నల రూపంగా వ్యక్తపరచటం, తర్కంతో కూడిన చక్కటి సమాధానాలు ఇచ్చే నేర్పరితనం ఈ శీర్షిక ద్వారా చందమామ వారు అందచేశారు.
కథా సంపుటి లేదా ధారావాహికగా మొదలు పెట్టబడినా, చివరకు ఒక కథా శీర్షికగా స్థిరపడినాయి ఈ బేతాళ కథలు. తెలుగు పత్రికా చరిత్రలో అన్ని శీర్షికలకన్న ఎక్కువకాలం ప్రచురించబడిన, ఇంకా ప్రచురించబడుతున్న శీర్షిక ఇది ఒక్కటే అయి ఉండవచ్చును. ఈ చక్కటి సాహిత్య ప్రక్రియ వెనుక ప్రసిద్ధ రచయిత, చందమామకు ఎక్కువకాలం సంపాదకుడిగా పనిచేసిన, కొడవటిగంటి కుటుంబరావు కృషి ఎంతగానో ఉన్నది.
మరి కొన్ని పిల్లల పత్రికలు, బొమ్మరిల్లు వంటివి ఇదే పద్దతిలో కథలను (కరాళ కథలు) సృష్టించటానికి పయత్నించాయి. కాని, అంతగా విజయం సాధించలేక పోయాయి.
Filed under ఆన్‌లైన్ చందమామ రచనలు | Tags: చందమామ, ధారావాహిక, బేతాల కథలు | Comment (0)చందమామ కథలు : వికీపీడియా
చందమామ కథలు
ప్రస్తుత చందమామ ముఖ చిత్రము
చందమామలో దయ్యం బొమ్మ
భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు. సున్నిత హాస్యంతో, విజ్ఞాన, వినోదాత్మకమైన చక్కటి చందమామ కథలు చక్రపాణి నిర్దేశకత్వంలో కొడవటిగంటి కుటుంబరావు పెట్టిన ఒరవడిలోనే సాగుతూ, తరాలు మారినా పాఠకులను ఎంతో అలరించాయి. ఇప్పటికీ అప్పటి కథలు మళ్ళీ మళ్ళీ ప్రచురించబడి అలరిస్తూనే ఉన్నాయి.
ఆశ్చర్యకరమైన విషయమేమంటే, చందమామలో దయ్యాల కథలు కూడా పుష్కలంగా ఉండేవి. కాని, అవి పిల్లల్లో మూఢ నమ్మకాలను పెంచేవిగా ఉండేవి కావు. దయ్యాలంటే సామాన్యంగా భయం ఉంటుంది, ముఖ్యంగా పిల్లలకు. అయితే, చందమామలోని కథలు అటువంటి కారణంలేని భయాలను పెంచి పోషించేట్లుగా ఉండేవి కావు. చందమామ కథల్లో ఉండే దయ్యాల పాత్రలు ఎంతో సామాన్యంగా, మనకి సరదా పుట్టించేట్లుగా ఉండేవి. అవి ఎక్కడైనా కనిపిస్తాయేమో చూద్దాం అనిపించేది.
దయ్యాలకు వేసే బొమ్మలు కూడా సూచనప్రాయంగా ఉండేవి గానీ పిల్లలను భయభ్రాంతులను చేసేట్లు ఉండేవి కాదు. సామాన్యంగా దయ్యాల పాత్రలు రెండు రకాలుగా ఉండేవి – ఒకటి, మంచివారికి సాయం చేసే మంచి దయ్యాలు, రెండు, కేవలం సరదా కోసం తమాషాలు చేసే చిలిపి దయ్యాలు.
దాదాపు ఆరు దశాబ్దాలుగా లక్షలాది మంది పిల్లల్ని ఆకట్టుకుంటూ, వారిని ఊహాలోకంలో విహరింపజేస్తున్న చందమామ కథలు, వారు సత్ప్రవర్తనతో, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేట్లుగా, నిజాయితీ, లోకజ్ఞానం, నైతిక ప్రవర్తన, కృతజ్ఞత, వినయం, పెద్దల పట్ల గౌరవం, ఆత్మాభిమానం, పౌరుషం, దృఢ సంకల్పం మొదలగు మంచి లక్షణాలను అలవరచుకునేలా చేస్తూవచ్చాయి.
Filed under ఆన్‌లైన్ చందమామ రచనలు | Comment (0)చందమామ ధారావాహికలు : వికీపీడియా
చందమామ ధారావాహికలు
చందమామ పత్రిక చక్కటి ధారావాహికలకు పెట్టింది పేరు. “చిత్ర” వేసిన అద్భుతమైన బొమ్మలతో ఎంతో ఆసక్తికరమయిన కథనంతో, సరళమైన భాషలో ఒక్కొక్క చందమామ ధారావాహిక (Chandamama Serial) అనేక నెలలలపాటు జరిగేది. ప్రతి నెల ఒక ఆసక్తి కరమయిన ఘటనతో ఆపేవారు, అంటే మళ్ళీ నెల వరకు అసక్తితో చదువరులు ఎదురు చూసేటట్లు చేసేవారు. పాత్రలు ఒక డజనుకి మించి ఉండేవికాదు.
“చిత్ర” గారు ఒక్కొక్క పాత్రకు మొదటిసారి బొమ్మ ఎలా వేసారో, ధారావాహిక అయ్యేవరకు కూడా, ఆ పాత్రలు అల్లాగే కనిపించేవి. ప్రతి ధారావాహికలోనూ ఇద్దరు నాయకులు ఉండేవారు: శిఖిముఖి – విక్రమకేసరి, ధూమకుడు – సోమకుడు, ఖడ్గవర్మ-జీవదత్తుడు మొదలగు నాయక ద్వయాలు పాఠకులను ఎంతగానో అలరించేవారు. కథా నాయికలు చాలా తక్కువగా కనిపించేవారు.
కథకు ఎంతవరకు అవసరమో అంతవరకే కనబడేవారు. శిధిలాలయంలో ఒక్క నాగమల్లి పాత్ర తప్ప మిగిలిన కథానాయికలందరూ నామ మాత్రమయినవారే. ఒక్క నవాబు నందిని మరియు దుర్గేశ నందిని తప్ప మిగిలిన ధారావాహికలన్నీ కూడా భారతదేశపు రాజ్యాలలోనూ పల్లెటూళ్ళలోనూ జరిగినట్లు వ్రాసేవారు.
అన్ని ధారావాహికలలో రాజులు, వారి రాజ్యాలు, అప్పుడప్పుడు రాక్షసులు, మాంత్రికుల పాత్రలు మరియు కథలు ఉండేవి. ఒక్క రాజుల కథలేకాక సాహస వంతమయిన యువకుల గురించి (రాకాసి లోయ, ముగ్గురు మాంత్రికులు, తోక చుక్క మొదలగునవి) కూడా ధారావాహికలు వచ్చేవి. అంతేకాకుండా, పురాణాలు, చరిత్ర కు సంబంధించిన ధారావాహికలు కూడా ప్రచురించారు.
అంతే కాదు ప్రపంచ సాహిత్యంలోని గొప్ప అంశాలన్నీ చందమామలో కథలుగా వచ్చాయి. ఉపనిషత్తుల్లోని కొన్ని కథలూ, కథా సరిత్సాగరం, బౌద్ధ జాతక కథలు, జైన పురాణ కథలు, వెయ్యిన్నొక్క రాత్రులు (అరేబియన్ నైట్స్) ఇలా ప్రపంచ సాహిత్యంలోని విశిష్టమైన రచనలు అన్నీ మామూలు కథల రూపంలో వచ్చాయి.
భాసుడు, కాళిదాసు మరియు ఇతర సంస్కృత రచయితల నాటకాలూ, ఆంగ్లములోని షేక్‌స్పియర్ నాటకాలు ఎన్నిటినో కథల రూపంలో పాఠకులు చదవగలిగారు. ఇవికాక గ్రీకు పురాణాలైన ఇలియడ్, ఒడిస్సే, వివిధ దేశాల జానపద కథలూ, పురాణ కథలూ, ప్రపంచ సాహిత్యంలోని అద్భుత కావ్యగాథలూ అన్నీ చందమామలో సులభమైన భాషలో వచ్చాయి. పురాణాలే గాక ఇతర సాహిత్య రత్నాలైన కావ్యాలు శిలప్పదిగారం, మణిమేఖలై లాంటివి కూడా వచ్చాయి.
చందమామ ధారావాహికల పుట్ట. అందుకనే 1960-1980లలో పెరిగి పెద్దయిన పిల్లలు, అప్పటి ధారావాహికలను, కథలను మర్చిపోలేకపోతున్నారు.
సాధారణ ధారావాహికలు
తోకచుక్క
మకర దేవత
ముగ్గురు మాంత్రికులు
విచిత్ర కవలలు
రాకాసి లోయ
పాతాళ దుర్గం
శిధిలాలయం
రాతి రథం
యక్ష పర్వతం
కంచుకోట
జ్వాలాద్వీపం
మాయా సరోవరం
భల్లూక మాంత్రికుడు
బంగారులోయ (చందమామలో రచయిత పేరు ప్రచురించిన ఏకైక సీరియల్)
అపూర్వుడి సాహసయాత్రలు
బందిపోటు యువరాజు
తండ్రీకొడుకులు
ఐదు ప్రశ్నలు
విచిత్ర పుష్పం
భువన సుందరి (గ్రీకు పురాణగాథ ఇలియడ్)
రూపధరుడి యాత్రలు (గ్రీకు పురాణగాథ ఒడిస్సీ)
దుర్గేశ నందిని
నవాబు నందిని
సమ్రాట్ అశోక
చారిత్రక ధారావాహికలు
నెహ్రూ కథ
భారత చరిత్ర
పురాణ ధారావాహికలు
రామాయణం
కృష్ణావతారం
మహాభారతం
శివ పురాణం
శివ లీలలు
విఘ్నేశ్వరుడు
వీర హనుమాన్
విష్ణుకథ
జగన్నాథ చరిత్ర (పూరీ జగన్నాథాలయ నిర్మాణం వెనకున్న కథ)
దేవీభాగవతం
పైన చెప్పినవి కాక అరణ్య పురాణం అని ఒక చక్కని ధారావాహిక ప్రచురించారు. ఈ ధారావాహికకు ఆధారం రుడ్యార్డ్ కిప్లింగ్ ([Rudyard Kipling) వ్రాసిన ఆంగ్ల నవల The Jungle Book. ఈ ఒక్క ధారావాహికకు మాత్రం, వడ్డాది పాపయ్య గారు బొమ్మలు వేసేవారు. అదే విధంగా విష్ణుశర్మ రచించిన పంచతంత్రం కూడా చక్కటి భాషలో ధారావాహికగా పూర్తిగా ప్రచురించారు. ఈ ధారావాహికకు కూడా, వడ్డాది పాపయ్య గారే బొమ్మలు వేసేవారు.
కథా స్రవంతులు
పరోపకారి పాపన్నచక్కటి విషయాలతో కథాస్రవంతులు కూడా ప్రతి నెలా ఉండేవి. అందులో ముఖ్యమైనవి:
పరోపకారి పాపన్న కథలు
బండ భీమన్న కథలు
తాతయ్య కథలు
జాతక కథలు
ఐంద్రజాలిక కథలు
అరేబియా కథలు (అరేబియన్ నైట్స్)
ఇవేకాక గంగ, యమున, సరస్వతి, నర్మద, గోదావరి, కృష్ణ, కావేరి లాంటి భారతదేశపు నదుల పుట్టుక గురించి, ప్రసిద్ధ దేవాలయాల నిర్మాణాల గురించి ఆసక్తికరమైన కథలను, వివిధ దేశాల పురాణగాథలను కూడా ధారావాహికలుగా అందించింది చందమామ.
1960 ప్రాంతంలో పాఠకులను విశేషంగా ఆకట్టుకున్న పరోపకారి పాపన్న కథలు కొన్నాళ్ళ క్రితం దూరదర్శన్ లో ధారావాహికగా వచ్చాయి.
చిన్న ధారా వాహికలు
అప్పుడప్పుడు 4-5 నెలలు నడిచే చిన్న ధారావాహికలు వేసేవారు. అందులో కొన్ని:
సింద్ బాద్ యాత్రలు
అబూకీర్-అబూసీర్
భూతాలు చేసిన పెళ్ళి
మాయదారి ముసలిది
చందమామ – త్రివిక్రమ్ బాట
చందమామ గురించి త్రివిక్రమ్ గారు తదితరులు వికీపీడియాలో పోస్టు చేసిన పెద్ద వ్యాసాన్ని చిన్న చిన్న భాగాలుగా ఈ బ్లాగులో మొదట ప్రచురిస్తున్నాము. చందమామ పత్రిక చరిత్ర గురించి, దాని విశేషాల గురించి అంతర్జాలంలో విపులంగా, వీలైనంత మేరకు వాస్తవానికి అతి దగ్గరగా చెప్పిన, రాసిన వ్యక్తి ఎవరు అని అడిగితే మొదట త్రివిక్రమ్ గారి పేరే చెప్పుకోవాలి.
అనేకమంది రచయితలు, అభిమానులు చందమామ గురించి రాసినా, ప్రస్తుతం రాస్తూ ఉన్నా అంతర్జాలంలో చందమామ విశేషంగా వ్యాప్తి పొందడానికి, బ్లాగర్లు చందమామను తమదిగా హత్తుకోవడానికి మూల కారకులు త్రివిక్రమ్ గారే అని అంటే అతిశయోక్తి కాదు. చందమామ పత్రిక, దాని యాజమాన్యంలో మార్పులు, పత్రికలో చోటు చేసుకుంటున్న కొత్త మార్పులు వంటి ఇటీవలి చరిత్రను కూడా తాజాగా పొందుపర్చి అంతర్జాల పాఠకులకు అందివ్వడంలో త్రివిక్రమ్ గారే మొదటి వరుసలో ఉన్నారు.
అంతర్జాలంలో చందమామ పిచ్చోళ్లు లేదా ‘చంపి’ అనే పదబంధం బాగా వ్యాప్తిలోకి రావడానికి, వీరంతా కలిసి చందమామను నెట్‌లోంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకుని తెలుగుజాతి సంపదనే తమదిగా జాగ్రత్త పర్చుకున్న అద్భుత చరిత్రకు శ్రీకారం చుట్టింది, ప్రేరణ ఇచ్చిందీ కూడా త్రివిక్రమ్ గారి చందమామ వ్యాసమే -వికీపీడియా- అని చెప్పాలి.
తర్వాత చందమామ పత్రిక, దాంట్లో గత 50, 60 ఏళ్లుగా పనిచేస్తున్న వారి గురించి, చందమామ శైలి, చరిత్ర గురించి సాధికారికంగా చెప్పగలిగిన వ్యక్తి రోహిణీ ప్రసాద్ గారు -కొడవటిగంటి కుటుంబరావు గారి అబ్బాయి. అమెరికాలో న్యూక్లియర్ ఫిజిక్స్ రంగంలో పనిచేస్తున్నారు-.
నాగమురళి, బ్లాగాగ్ని (ఫణి), ఇటీవల వేణు గారు కూడా చందమామ అభిమానుల కోవలో మంచి రచనలు చేయడం, విలువైన సమాచారం అందివ్వడం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో చందమామను డౌన్‌లోడ్ చేయడానికి తన వంతుగా సాప్ట్‌వేర్ ప్రోగ్రామ్ రూపకల్పన చేసి అందించిన బ్లాగాగ్ని (ఫణి) గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి.
సదాశయంతో, సదుద్దేశంతో వ్యక్తులు చేసే చిన్నపాటి మంచి పనులు కూడా ఒక సమాజపు కథల దాహాన్ని తీర్చడానికి ఎంతగా తోడ్బడగలదో చెప్పడానికి బ్లాగాగ్ని గారి ఉదంతం ఓ సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.
చందమామ పిచ్చోళ్లు ఆన్‌లైన్‌లో స్వంతంగా ఓ కమ్యూనిటీని సైతం ఏర్పర్చుకుని చందమామ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు, కలబోసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే 1940ల చివరినాటి చందమామలు, 50, 60, 70ల నాటి చందమామలను ఎవరు చదివారు అంటూ ఆన్‌లైన్ పోల్ సర్వే కూడా నిర్వహిస్తూ వీరు చందమామను తమ సజీవ జ్ఞాపకంగా మల్చుకుంటున్నారు.
తెలుగుజాతి సాంస్కృతిక సంపద చందమామను తమ జీవితంలో ఓ భాగం చేసుకున్న, చేసుకుంటున్న ఇలాంటి చందమామ పిచ్చోళ్లకు హృదయ పూర్వక అభివందనలు తెలియజేస్తున్నాను.
వీరి రచనలు, అభిప్రాయాలు, వ్యాఖ్యలను, వీరిలో కొందరితో నేను వ్యక్తగతంగా పెట్టుకున్న పరిచయ విశేషాలను కూడా వివరంగా ఈ బ్లాగులో ఉంచాలని చిరు ప్రయత్నం చేస్తున్నాను. కేవలం చందమామ చరిత్ర, వివరాలు, జ్ఞాపకాలతో కూడిన ఈ బ్లాగును చందమామ అభిమానులు తమదిగా చేసుకుంటారని, చేసుకోవాలని ఆశిస్తూ…
ఎందరో చందమామ అభిమానులు…. అందరికీ వందనాలతో..
రాజు
చందమామ
చందమామ పాత సంచికలను చదవదలిచిన వారు ఈ కింది లింకుపై క్లిక్ చేయండి. మీకు కావలిసిన సంచిక నెల, సంవత్సరం ఎంచకుని చూడండి. 1947 నుంచి 80ల దాకా పాత సంచికలను ఇందులో చూడవచ్చు.
http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL
ఇప్పుడిప్పుడే రూపు దిద్దుకుంటున్న ఆన్‌లైన్ చందమామను చూడండి. మీ వ్యాఖ్యలు కింది లింకుకు పంపండి.
చందమామతో పాఠకులు, అభిమానులు తమ జ్ఞాపకాలను పంచుకోవడానికి గాను అవకాశమిస్తున్న కింది లింకును చూడండి. చందమామతో మీ చిన్ననాటి అనుబంధాన్ని పాఠకులతో పంచుకోండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=1907
Filed under ఆన్‌లైన్ చందమామ రచనలు, చందమామతో మా జ్ఞాపకాలు | Comment (0)చందమామ కథ
“…. దాదాపు ఆరు దశాబ్దాలుగా లక్షలాది మంది పిల్లల్ని ఆకట్టుకుంటూ, వారిని ఊహాలోకంలో విహరింపజేస్తున్న చందమామ కథలు, వారు సత్ప్రవర్తనతో, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేట్లుగా, నిజాయితీ, లోకజ్ఞానం, నైతిక ప్రవర్తన, కృతజ్ఞత, వినయం, పెద్దల పట్ల గౌరవం, ఆత్మాభిమానం, పౌరుషం, దృఢ సంకల్పం మొదలగు మంచి లక్షణాలను అలవరచుకునేలా చేస్తూవచ్చాయి.
భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు. టెలివిజన్, వీడియో ఆటలు, కార్టూన్ నెట్ వర్క్ లూ మొదలైనవి లేని రోజుల్లో, పిల్లలకు ఉన్న ఎంతో వినోదాత్మకమూ, విజ్ణానదాయకమూ అయిన కాలక్షేపం, చందమామ ఒక్కటే. చందమామ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని పిల్లలే కాదు వారి తల్లిదండ్రులూ ఉవ్విళ్ళూరుతుండేవారు.
చందమామ పత్రిక చక్కటి ధారావాహికలకు పెట్టింది పేరు. ధారావాహికలన్నీ భారతదేశపు రాజ్యాలలోనూ పల్లెటూళ్ళలోనూ జరిగినట్లు వ్రాసేవారు. అన్ని ధారావాహికలలోనూ రాజులు, వారి రాజ్యాలు, అప్పుడప్పుడు రాక్షసులు, మాంత్రికులకు సంబంధించిన పాత్రలు మరియు కథలు ఉండేవి. ఒక్క రాజుల కథలేకాక సాహస వంతమైన యువకుల గురించి (రాకాసి లోయ, ముగ్గురు మాంత్రికులు, తోకచుక్క మొదలగునవి) కూడా ధారావాహికలు వచ్చేవి.
అంతేకాకుండా, పురాణాలు, చరిత్రకు సంబంధించిన ధారావాహికలు కూడా ప్రచురించారు. చందమామ ధారావాహికల పుట్ట. అందుకనే 1960-1980లలో పెరిగి పెద్దలైన పిల్లలు, అప్పటి ధారావాహికలను, కథలను మర్చిపోలేకపోతున్నారు.
ప్రపంచ సాహిత్యంలోని గొప్ప అంశాలన్నీ చందమామలో కథలుగా వచ్చాయి. ఉపనిషత్తుల్లోని కొన్ని కథలూ, కథా సరిత్సాగరం, బౌద్ధ జాతక కథలు, జైన పురాణ కథలు, వెయ్యిన్నొక్క రాత్రులు(అరేబియన్ నైట్స్), ఇలా ప్రపంచ సాహిత్యంలోని విశిష్టమైన రచనలన్నీ మామూలు కథల రూపంలో వచ్చాయి. భాసుడు, కాళిదాసు మరియు ఇతర సంస్కృత రచయితల నాటకాలూ, ఆంగ్లములోని షేక్‌స్పియర్ నాటకాలు ఎన్నిటినో కథల రూపంలో పాఠకులు చదవగలిగారు.
ఇవికాక గ్రీక్ పురాణాలైన ఇలియడ్, ఒడిస్సీ, వివిధ దేశాల జానపద కథలూ, పురాణ కథలూ, ప్రపంచ సాహిత్యంలోని అద్భుత కావ్యగాథలూ అన్నీ చందమామలో సులభమైన భాషలో వచ్చాయి. పురాణాలేగాక ఇతర భాషా సాహిత్య రత్నాలైన కావ్యాలు శిలప్పదిగారం, మణిమేఖలై లాంటివి కూడా వచ్చాయి.
అసలు బేతాళ కథలు పాతిక మాత్రమేనని తెలిసినవారు చెబుతారు. చందమామలో వందల కొలది మామూలు కథలను బేతాళ కథలుగా ఎంతో నేర్పుతో(గా) మార్చి ప్రచురించారు. సాధారణమైన పిల్లల కథల్లోంచి, కథ చివర, ప్రతినెలా, ఒక చిక్కు ప్రశ్నను సృష్టించడం, దానికి చక్కటి సమాధానం చెప్పించడం, సామాన్య విషయం కాదు. అతి కష్టమైన ఈ పనిని, దశాబ్దాలపాటు నిరాఘాటంగా కొనసాగించడం చందమామ నిబద్ధతకు, నైపుణ్యానికి, చక్కటి నిదర్శనం.
జానపద కథలకు చందమామ కాణాచి. చందమామ కార్యాలయంలో అన్ని ప్రపంచదేశాల జానపద కథలు ఉండేవి. చందమామకు ఉన్నటువంటి గ్రంథాలయం మరెక్కడా లేదు. ఎంతో అద్భుతమైన జానపద కథలు చందమామలో వచ్చాయి. రాజులూ, వారి రాజ్యాలూ, రాజకుమారులూ, రాజకుమార్తెలూ, వారి స్వయంవరాలు, వారి సాహసాలు, మంత్రుల తెలివితేటలు, పరిపాలనా దక్షత, విదూషకుల హాస్యం, చురుకైన బుధ్ధి, ప్రభువుల విశాల హృదయం మరియు ముందుచూపు, జానపదులు, వారి అమాయకత్వంవంటి విషయాలు ఇతివృత్తంగా కొన్ని వందల కథలు వచ్చి పిల్లలను ఉత్తేజ పరిచాయి.
అసలు ఏ భారతీయ భాషైనా నేర్చుకోవడానికి ఆ భాషలోని చందమామ చదవడం ఉత్తమ మార్గం అనడం అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల పుస్తకాల్లో ఆకర్షణీయమైన బొమ్మలు వేయడం చందమామతోనే మొదలు. కథ, కథకి సంబంధించిన బొమ్మలు ఎలా ఉండాలో, ఏ నిష్పత్తిలో ఉండాలో చక్కగా చేసి చూపించి, మిగిలిన పత్రికలకు మార్గదర్శకమైంది. చందమామ శైలిని, ఒరవడిని, ఇతరులు అనుకరించడం లేదా అనుసరించడం చెయ్యగలిగారుగాని, కొత్త శైలినిగాని ఒరవడినిగాని ఇంతవరకు సృష్టించలేక పోయారు.
“బాలసాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలికమైన భావనలను బలంగా నాటాలి. ధైర్యసాహసాలూ, నిజాయితీ, స్నేహపాత్రత, త్యాగబుద్ధీ, కార్యదీక్షా, న్యాయమూ మొదలైనవి జయించటం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు, ఎంత అవాస్తవంగా ఉన్నా పిల్లల మనస్సులకు చాలా మేలుచేస్తాయి…పిల్లల్లో దౌర్బల్యాన్ని పెంపొందించేది మంచి బాలసాహిత్యం కాదు…దేవుడి మీద భక్తినీ, మతవిశ్వాసాలనూ ప్రచారం చెయ్యటానికే రచించిన కథలు పిల్లలకు చెప్పటం అంత మంచిది కాదు…కథలో నెగ్గవలసినది మనుష్య యత్నమూ, మనిషి సద్బుద్ధీనూ”. -కొడవటిగంటి కుటుంబరావు….”
చందమామ కధలు ఏవి కూడా ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఉండవు, అందులో ఉండేదంతా ఒక ఐడియల్ ప్రపంచం. వాటిలో దెయ్యాలు, రాక్షసులు, మంత్రగాళ్ళు, గయ్యాళి అత్తలు, దొంగలు అందరూ ఉండేవారు. కానీ ఎవ్వరూ మరీ క్రూరంగా ప్రవర్తించరు. కధ చివరిలో చెడ్డవాళ్ళు అందరూ మారిపోయినట్టు చూపేవాళ్ళు. ప్రతి కధలోను ఒక నీతి సూత్రం ఉండేది, సమాజానికి కావలసిన ఏదో ఒక విలువని బోధించేటట్టుగా ఉండేవి.
ఇది చందమామ గురించి త్రివిక్రమ్ గారు తదితరులు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తూ వస్తున్న వివరాలు.
ఇక నా విషయానికి వస్తే…
భారతీయ బాలసాహిత్యానికి ఒరవడి దిద్దిన చందమామ గురించి రెండే్ళ్ల క్రితం వికీపీడియాలో త్రివిక్రమ్ గారి పరిచయ వ్యాసం గురించి చదివిన తర్వాత ఇటీవలే ఆ పత్రిక ఆన్‌లైన్ విభాగంలో చేరడం వరకు అంతా కలలోలాగా సాగిపోయింది.
చందమామతో తమ బాల్యాన్ని పెనవేసుకుని పైకి ఎదిగిన నాటి తరం జ్ఞాపకాలను ఒక చోట గుదిగుచ్చి దానికి చందమామ నేటి చరిత్ర, రేపటి భవిష్యత్తుకు సంబంధించిన సమాచారంతో ఒక చరిత్రను చందమామ అభిమానుల ముందుకు తేవాలని చేసిన ప్రయత్నంలో భాగంగా గత రెండు నెలలుగా ఆన్‌లైన్‌లో చందమామ గురించి వచ్చిన, వస్తున్న కథనాలు, వ్యాసాలు, జ్ఞాపకాలను సేకరిస్తూ వస్తున్నా..
చందమామపై జ్ఞాపకాలను విడిగా వెతికి చదువుకోవడం బదులుగా ఒకే బ్లాగులో వీటన్నిటినీ పోస్ట్ చేసి ఉంచితే చందమామ అభిమానులకు ఉపయోగకరంగా ఉంటుందన్న ఆలోచనతో http://blaagu.com/chandamamalu/ పేరిట ఓ బ్లాగును తెరుస్తున్నా. త్రివిక్రమ్ గారి జ్ఞాపకాలతో మొదలు పెట్టి ఇంతవరకు నేను సేకరించిన చందమామపై బ్లాగర్ల కథనాలు అన్నిటినీ పోస్ట్ చేయాలని బావిస్తున్నా.
నాటినుంచి నేటిదాకా చందమామను తమ హృదయపు లోతుల్లో ఉంచుకుని ప్రేమిస్తూ వస్తున్న అభిమానులందరికీ ఇదొక వేదికగా ఉంటుందని ఆశిస్తున్నా. నా దృష్టికి రాకుండా మిగిలిపోయిన ఇతర రచయితల చందమామ జ్ఞాపకాలను కూడా పాఠకులు, నెటిజన్లు పంపితే అందరికీ ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నా.
చందమామ చరిత్రను, నాలుగైదు దశాబ్దాలుగా తెలుగు తరాలను మంత్రముగ్ధులను చేస్తున్న చందమామ జ్ఞాపకాలను ఒకే చోట అందిస్తున్న ఈ బ్లాగును ఆదరిస్తారని, చందమామ అభిమానులకు పంచిపెడతారని ఆశిస్తూ..
మొదట చందమామ గురించి త్రివిక్రమ్ గారు వికీపీడియాలో పోస్టు చేసిన పెద్ద వ్యాసాన్ని చిన్న చిన్న బాగాలుగా ప్రచురించడం జరుగుతుంది. తర్వాత రోహిణీ ప్రసాద్, వేణు గార్లు తదితర చందమామ అభిమానుల రచనలు వరుసగా పొందు పర్చడం జరుగుతుంది.
ఈ బ్లాగులో కామెంట్ రూపంలో లేదా నా పర్సనల్ మెయిల్ ఐడి (krajasekhara@gmail.com) కి కూడా మీకు తెలిసిన చందమామ సమాచారాన్ని, మీరు మరువని చందమామతో మీ బాల్యపు జ్ఞాపకాలను పంపుతారని, పంపాలని కోరుకుంటూ….
రాజశేఖర రాజు
Filed under ఆన్‌లైన్ చందమామ రచనలు | Comment (0)Hello world!
బ్లాగు కు స్వాగతం. ఇది మీ మొదటి టపా. దీనిని మార్చి లేదా తొలగించి, బ్లాగడం మొదలు పెట్టండి.
Filed under ఆన్‌లైన్ చందమామ రచనలు | Comment (1)






