మన్నించు మహానుభావా!

July 28th, 2011

చందమామ కార్యాలయానికి ఉదయం యధాప్రకారం బస్సులో వెళుతూ రోజువారీ ఆలవాటుగా పేపర్‌తో పాటు జూలై నెల ‘నడుస్తున్న చరిత్ర’ మాసపత్రిక పేజీలు తిరగేస్తుంటే మధ్యపేజీల్లో ‘మన్నించు మహానుభావా’ అంటూ ఆర్ద్రంగా పలకరించిందో కథనం. ఇటీవలే కన్ను మూసిన నటరాజ రామకృష్ణగారితో మిత్రుడు ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు నెమరువేసుకున్న పాత జ్ఞాపకాలకు అక్షరరూపం ఇది. ఈ మూడు పేజీల హృద్య కథనం రెప్పలార్చకుండా చదివినప్పుడు కళ్లు చెమ్మగిల్లాయి.

మన చుట్టూ, మన ఎరుకలోకి రాకుండా, ఎంత మంది మహనీయులు ఒక లక్ష్యం కోసం జీవితకాలం నిబద్ధ కృషి చేస్తూ కనుమరుగవుతున్నారో అనే వేదన మనస్సును కదిలించేసింది. ముఖ్యంగా ఉమా తన నాన్నతోపాటు తొలిసారిగా రామకృష్ణగారిని కలిసినప్పుడు వారికి ఎదురైన అపురూప సత్కారం, వందేళ్లకాలం నుంచి సమాజంచేత చీత్కరించబడుతున్న నాట్యకళాకారిణులను, దేవదాసీల దుర్భరజీవితాలను తల్చుకుంటూ రామకృష్ణ గారు రోదించిన వర్ణన చదువుతున్నప్పుడు… ‘ఆయన నన్ను కోరుకునే కొద్దీ నేను దూరం కావడం మొదలెట్టాను. ఆ మహాకళాకారుడికి అంత దగ్గర ఉండే శక్తి నాకు లేదం’టూ తన కథనాన్ని ఉమా ముగించిన తీరును చూస్తున్నప్పుడు నేనెక్కడ ఉండి చదువుతున్నానో కూడా మర్చిపోయాను.

ఉమా.. పదిహేనేళ్లుగా తిరుపతిలో మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా వాలు కుర్చీలో కూర్చున్న భంగిమలో ఉన్న నాన్న ఫోటోని చూస్తుండిపోయానే కాని ఆయన గురించి నాకు పెద్దగా తెలీదు. మిత్ర సంబంధాలకు అవతల మీ ఈ జ్ఞాపకం మీలోని ఓ కొత్త మనిషిని చూపిస్తోంది.

“ఒక్కొక్కసారి ప్రేమనూ అభిమానాన్నీ స్వీకరించడానికి కూడా చాలా శక్తి కావాలి. అంత శక్తి లేక నేను నటరాజ రామకృష్ణను చాలా కోల్పోయాను, సరిగ్గా మా నాయనను కోల్పోయినట్లే.”

“ఇప్పటిదాకా వాళ్ళు జీవించిన జీవితం చెడ్డదని వాళ్ళు అనుకోకూడదు. వాళ్ళు గొప్ప కళాకారులు. కళాకారులమనే తృప్తితోనే వాళ్ళు కన్ను మూయాలి. కన్ను మూయకముందే వాళ్ళకా తృప్తి కలిగించాలి’ అనేవాడాయన.

“నాట్యం కోసం కుటుంబానికి దూరమైన ఆయన శిష్యులమీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఆశ పెట్టుకున్నాడు. తను నమ్మినవాటి కోసం తన సంపదమంతా ఖర్చు చేసిన ఆయన తన శిష్యులే తన ఆస్తి అనుకున్నాడు. అయితే, యీ ఆశలన్నీ భగ్నమవుతున్నట్టుగా నాకు ఆయన మాటలను బట్టీ అనిపించేది. ఆయన నాట్యకళకు వారసులున్నారు. అద్భుత అభినయాలతో వారు అలరించగలరు. అయితే, ఆయన కోరుకున్న తీరులో మాత్రం ఆ కళావారసత్వం కొనసాగదేమో అనే దిగులు నాకు ఆయనలో కనిపించేది.

ఆంధ్రనాట్యం గురించీ, పురిణి గురించీ ఆయన మాట్లాడే మాటలేవీ నాకు అర్థమయ్యేవి కాదు. అయితే ఆ అద్భుత కళారూపాల వెనుక వున్న కన్నీళ్ల గురించిన ఆయన వేదన మాత్రం నాకు అర్థమయ్యేది. బహుశా అదే ఆయనను నాకూ, నన్ను ఆయనకూ దగ్గర చేసిందేమో. ఆ దగ్గరితనమే నన్ను భయపెట్టేది. ఆయన నన్ను కోరుకునే కొద్దీ నేను దూరం కావడం మొదలుపెట్టాను. ఆ మహాకళాకారుడికి అంత దగ్గరగా వుండే శక్తి నాకు లేదు. ఆయన ఆఖరి రోజుల్లోగానీ, ఆయన మరణించిన తర్వాత గానీ నేను హైదరాబాద్‌ వెళ్ళలేదు. వెళ్ళే శక్తి నాకు లేకపోయింది.”

నటరాజ రామకృష్ణ గారి ఆంతరంగిక హృదయాన్ని స్పర్శిస్తున్న ఈ అపురూప కథనంకోసం కింది లింకును చూడండి.

మన్నించు మహానుభావా!
http://maavooru.wordpress.com/2011/07/15/%E0%B0%AE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B1%81-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A8%E0%B1%81%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BE/

RTS Perm Link