‘మాయాబజార్‌’లో వెలిగిన భస్మాసురుడు

July 9th, 2011

మానవజాతి సాగించిన సాంకేతిక అన్వేషణలో సినిమా మాధ్యమానికి మహత్తర స్థానముందని తలపండిన విజ్ఞులు ఎప్పుడో ప్రకటించారు. ఇటీవలే 75 ఏళ్లు పూర్తి చేసుకున్న తెలుగు సినిమా చరిత్ర గతంలోకి ఓసారి తొంగిచూస్తే నటనకు భాష్యం చెప్పిన మహానటులు, కడకంటి చూపులతో లక్షభావాలను పలికించి, వశీకరించిన మేటి నటీమణులు, సంగీత సాహిత్యాలకు, సినిమా నిర్మాణంలో తలమానికంగా నిలిచే కెమెరా విన్యాసాలకు, అబ్బురపర్చే దర్శకత్వ ప్రతిభకు మారుపేరుగా నిలిచే సాంకేతిక నిపుణులు ఎంతోమంది తెలుగు సినీ వినీలాకాశంలో స్వర్ణకాంతులను వెలయించి తమదైన గొప్ప వారసత్వాన్ని భవిష్యత్తరాలకు అందించి వెళ్లారు.

ఇలాంటి అరుదైన నటీనటుల్లో గురు గోపీనాథ్ ఒకరు. కేరళలో కథాకళి నృత్యరూపకానికి ఆధునిక కాలంలో ప్రాణం పోసిన మహనీయ గురువు గోపీనాథ్. ఆయన కేరళవాసులకు కథాకళి బ్రహ్మ కాగా మనకు మాయాబజార్ సినిమాతో ఒక మహాద్భుత నటుడిగా మిగిలిపోయారు.

మోహినీ భస్మాసుర

మాయాబజార్ సినిమాలో మోహినీ భస్మాసుర రూపకంలో మూకాభినయంతో ఘటోత్కచుడినే కాకుండా లక్షలాది ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గోపీనాధ్ ఒక మలయాళ నటుడేకాదు. కథాకళికి ప్రాణప్రతిష్ట చేసిన మేటి నాట్యాచార్యుడు కూడా. సినిమాలో భస్మాసురుడిగా ఆయన నటవైభవాన్ని తెలుసుకునే ముందు ఆయన జీవిత విశేషాలను కాస్త వివరంగా తెలుసుకుందాం.

కథాకళికి మారుపేరు గురు గోపీనాథ్…
గురు గోపీనాథ్ 20 శతాబ్దిలోని భారతీయ నృత్య చరిత్రలో నిరుపమాన వ్యక్తిత్వంతో వెలుగొందారు. భారతీయ సాంప్రదాయ నృత్యంలో ఆయన మేటి నాట్యాచార్యుడు. తన జీవిత ప్రారంభంలో గోపీనాథ్ చేసిన కృషి ఫలితంగానే కథాకళి నృత్యం కేరళలోనూ విదేశాల్లోనూ ప్రఖ్యాతి గాంచింది.

నృత్యకారుడిగా గోపీనాథ్ సాధించిన అత్యున్నత విజయం ఏదంటే కథాకళిని నృత్యగురువులకు, విద్యార్థులకు, ప్రేక్షకులకు మరింతగా సుబోధకం చేయడమే. ఇందుకుగాను తన సృజనాత్మకతను మేళవించి, ప్రాచ్య నృత్యరూపంగా పేరొందిన ఈ పురాతన నృత్యంనుంచి నూతన నృత్య శైలిని రూపొందించారు. ఆయన కృషివల్లే ఈ నృత్యం కథాకళి నటనం అని తర్వాత కేరళ నటనం అని పేరు పొందింది.

1908 జూన్ 24న కేరళలోని అలెప్పీ జిల్లాలో అంబాలప్పుజ తాలూకా చంపక్కులమ్‌లో మాధవి అమ్మ మరియు కైఫ్పిల్లి శంకర పిళ్లై దంపతులకు జన్మించిన గోపీనాథ్ కథాకళిని, వ్యవసాయాన్ని సాంప్రదాయిక వృత్తిగా స్వీకరించిన పెరుమన్నూర్ కుటుంబానికి చెందినవారు.

13 ఏళ్ల ప్రాయంలోనే కథాకళిని నేర్చుకోవడం ప్రారంభించిన గోపీనాథ్ 12 ఏళ్లపాటు కఠోర దీక్షతో ముగ్గురు సుప్రసిద్ధ గురువుల వద్ద కథాకళిని నేర్చుకున్నారు. కథాకళి నాట్యంలో సుప్రసిద్ధులైన కళామండలం కృష్ణయ్యర్, కళామండలం మాధవన్, ఆనంద శివరామ్ వంటి ప్రముఖులతో కలిసి ఆయన శిక్షణ పొందారు.

కథాకళి నృత్యం లోని రెండు రీతుల్లోనూ గోపీనాథ్ నిష్ణాతుడిగా పేరొందారు. జన్మతః కళాకారుడిగా గుర్తింపుపొందిన గోపీనాథ్ కథాకళి సాంప్రదాయరీతిని ఔపోసన పడుతూనే ఈ సాంప్రదాయాన్ని నవ్యరీతులతో విస్తరించడంతో తన స్వంత ప్రతిభను అద్భుతరీతిలో ప్రదర్శించారు.

తన సృజనాత్మక ప్రతిభ వల్లే భారతీయ నాట్యరీతుల్లో పేరొందిన కథాకళి 1930లలోనే ప్రపంచ ఖ్యాతి పొందింది. ఆధునిక ప్రపంచానికి తగినట్లుగా సృజనాత్మక శైలిని రూపొందించిన గోపీనాథ్ కేరళ నటనం పేరిట కొత్త నృత్యరీతిని కూర్చారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గురు గోపీనాథ్ శైలిని కథాకళి అనే వ్యవహార పేరుతో పిలుచుకుంటున్నారు.

కథాకళికి గోపీనాథ్‌తో వెలుగు రేఖలు

సాంప్రదాయక రూపం విషయంలో ఏ మాత్రం రాజీపడని నాటి ప్రజానీకానికి తన కొత్త నృత్యరీతిని పరిచయం చేసి ఒప్పించడంలో, మెప్పించడంలో గురు గోపీనాథ్ అద్భుత సామర్థ్యం కనపర్చారు. రాజమందిరాలకు, దేవాలయ ప్రాంగణాలకు మాత్రమే పరిమితమై ఉన్న కథాకళిని విస్తృత ప్రజారాసుల చెంతకు చేర్చడంలో అనన్య సామాన్య కృషిని తలపెట్టిన క్రమంలో తనదైన సొంత శైలిని ఆవిష్కరించారు.

దాదాపు 12 సంవత్సరాలపాటు ఏకధాటిగా నేర్చుకోవలసి ఉన్న కథాకళికి కొత్త సిలబస్ తయారు చేయడమే కాక శిక్షణా సమయాన్ని కూడా గణనీయంగా తగ్గించిన ఘనత గోపీనాథ్‌కే చెల్లింది. ఈ క్రమంలో అయన కథాకళి ప్రాచీన సంప్రదాయానికి, దాని సారానికి ఎలాంటి విఘాతం కల్పించలేదు.

రూపంలో సాంప్రదాయంగా కనిపిస్తూనే, సారంలో బహళ జనామోదాన్ని పొందే దిశగా కథాకళికి వెలుగు రేఖలద్దారు. ఒక్కమాటలో చెప్పాలంటే కథాకళి మరియు కేరళకు గోపీనాథ్ ప్రతిరూపంలా నిలిచారు. సాంప్రదాయ నృత్యాన్ని అర్థం చేసుకునే పాటి పాండిత్యం లేని సాధారణ భారతీయ ప్రజానీకం గోపీనాథ్ ఆవిష్కరణతో కథాకళిని ఆస్వాదిస్తూ పరవశించిపోయే స్థితికి చేరుకున్నారంటేనే గోపీనాథ్ కృషి ఏపాటిదో మనకు తెలుస్తుంది.

భారతీయ నాట్య రీతులు బైబిల్, ఆంగ్లికన్ లేదా సామాజిక వస్తువుతో ప్రయోగాలు చేయడానికి చాలా కాలం ముందే అంటే 1940, 50లలోనే గోపీనాథ్ విభిన్న నృత్యరీతులను రూపొందించారు. శ్రీ ఏసునాథ విజయం, దివ్య నాదం, సిస్టర్ నివేదిత, చండాల బిక్షుకి, కేరళ పిరవి (కేరళ రాష్ట్ర ఆవిర్భావంపై) వంటివి ఆయన ఎన్నుకున్న బ్యాలెట్లలో కనిపిస్తాయి.

అలాగే ఢిల్లీలోని రామ్ లీలా ప్రదర్శనలపై రూపొందిన నృత్యరూపకం ఆయన ప్రతిభకు సజీవ తార్కాణంలా నిలుస్తుంది. జీవిత చరమాంకంలో ఆయన రూపొందించిన రామాయణం నృత్యరూపకం బహుళ ప్రజాదరణను పొందింది. గోపీనాథ్ రామాయణ నృత్యరూపకం కేరళ వ్యాప్తంగా 1500 సార్లు ప్రదర్శించబడిందంటేనే దాని గొప్పతనం ఏమిటో సుబోధకమవుతుంది.

చారిత్రకంగా చూస్తే కథాకళి నాట్యరీతి, శిక్షణ కేవలం పురుషులకు మాత్రమే సంబంధించింది. అయితే కథాకళిని యువతులు కూడా ప్రదర్శించవచ్చని చూపించిన మొదటి వ్యక్తి గురు గోపీనాథ్.

నర్తిస్తూనే తుదిశ్వాస విడిచిన గోపీనాథ్

అమెరికాలోని మిచిగాన్‌లో జన్మించిన ఈషర్ ల్యూలా షేర్మన్ -రాగిణి దేవి- కి గోపీనాథ్ డ్యాన్స్ పార్టనర్‌గా ఉండేవారు. వీరిరువురు కలిసి ముంబైలో 1932లో తమ తొలి స్టేజి ప్రదర్శనను ఇచ్చారు. ఇది సాధించిన విజయంతో వీరు మరిన్ని ప్రదర్శనలను దేశవ్యాప్తంగా ఇవ్వగలిగారు. ప్రదర్శన, ప్రసంగాలతో కూడిన ఈ భారతీయ సాంప్రదాయ నృత్యం వీరిరువురి మేళవింపుతో బహుళ ప్రజాదరణకు నోచుకుంది.

1930లలో యువ గోపీనాథ్ ప్రదర్శనను తిలకించిన రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ నృత్యకారుడిని బహువిధాలా ప్రశంసిస్తూ ఇలా రాశారు.

“గోపీనాథ్ నిజమైన కళాకారుడు. భారత్‌లో కానీ ప్రపంచంలో కాని గోపీనాథ్‌తో సరితూగగలవారు ఎక్కువమంది లేరని ఘంటాపధంగా చెప్పగలను. నృత్యం భారతీయ ఉజ్వల సంపదగా వెలుగొందిన పురాస్మృతులను ఈయన తిరిగి నా మనోనేత్రం ముందుకు తీసుకువచ్చారు. మనమధ్య ఈయన ప్రదర్శన ఒక గొప్ప పాఠం స్థాయిలో ఉంది. తిరిగి ఇప్పుడు నృత్యం తనదైన రీతుల్లో మనముందుకు వచ్చింది. గోపీనాథ్ నాట్యశైలి మనలను సరైన దారిలో వెళ్లడానికి మనకు మార్గం చూపుతుంది. ఈ విషయంలో మనం ఇప్పటికీ అంథకారం నుంచి బయటకు రాలేకున్నాం.”

నర్తనమే ఆయన శ్వాస

మళయాళ చిత్ర పరిశ్రమ గురు గోపీనాథ్‌ను మళయాళీ చలనచిత్ర ప్రారంభ నటులలో ఒకరిగా గుర్తించింది. ప్రహ్లాద సినిమాలో హిరణ్యకశిపుడిగా గోపీనాథ్ నటించారు. ఇది మళయాళీ చలనచిత్ర చరిత్రలో ఆరవ చిత్రంగాను, సౌండ్ ట్రాక్ కలిగిన మూడవ చిత్రంగానూ పేరొందింది. ‘జీవితనౌక’ సినిమాలో జీసస్ క్రైస్త్‌, ‘భక్తకుచేల’ చిత్రంలో పూతనగాను ఆయన నటించారు.

పైగా, కథాకళిలోని 9 విభిన్న భావోద్వేగాలను చూపించగల అరుదైన నృత్య కళాకారులలో గోపీనాథ్ ఒకరు. ముఖం లోని సగభాగంలో వివిధ భావ వ్యక్తీకరణలను పలికించగల మేటి కళాకారుడీయన.

తాను ముందునుంచి కోరుకున్నట్లుగా స్టేజీమీద మేకప్‌తోనే కన్నుమూశారు. 1987 అక్టోబర్ 9న కేరళలోని ఎర్నాకులంలో ఉన్న ఫైన్ ఆర్ట్స్ హాల్‌లో, తన సుప్రసిద్ధ రామాయణం నృత్యరూపకంలో దశరథ మహారాజు పాత్రలో నర్తిస్తూనే గోపీనాథ్ పరమపదించారు. తన నాట్యజీవితంలో భాగంగా ప్రపంచంలో పలుదేశాలను ఆయన సందర్శించారు.

అమెరికా, రష్యా, శ్రీలంక వంటి పలుదేశాల్లో ఆయన నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. స్వతంత్ర భారత్ తరపున 1954లో రష్యా పర్యటించిన తొలి సాంస్కృతిక బృందంలో ఈయన సభ్యుడిగా ఉన్నారు. 1961లో ఫిన్లాండ్‌లోని హెల్సింకిలో జరిగిన 8వ ప్రపంచ యువజనోత్సవాల్లో సాంప్రదాయ నృత్యాలకు గాను న్యాయనిర్ణేతగా ఆయన ఆహ్వానం అందుకున్నారు.

భస్మాసురుడిగా నట విశ్వరూపం
నృత్యకారుడిగా గోపీనాధ్ గారి విశ్వరూపం దర్శించాలంటే తెలుగు, తమిళ చలన చిత్ర చరిత్రలో అజరామర కావ్యంగా పేరొందిన ‘మాయాబజార్’ సినిమాలో మోహినీ భస్మాసుర రూపకాన్ని చూసి తీరాలి.

తాను ఎవరి తలపై చేయి పెడితే వారు భస్మమయ్యేటట్లుగా శివుడి వరం పొందిన భస్మాసురుడు, ఆ వర నిర్ధారణ కోసం శివుని నెత్తిపైనే చెయ్యి పెట్టబోయి, తదనంతర పరిణామాలలో మోహిని రూపంలోని మహావిష్ణువు మాయలో పడి, తన నెత్తిమీద తానే చేయిపెట్టుకుని భస్మమైపోయిన ఘటనను నభూతో నభవిష్యతి అన్న రీతిలో గోపీనాథ్ నర్తించి చూపారు.

ఈ పది నిమిషాల రూపకం చూస్తున్నంతసేపు మనకు తెరపై భస్మాసురుడే కనిపిస్తుంటాడు. భీకరాకారుడైన రాక్షసుడు నర్తిస్తుంటే ఎలా ఉంటాడు అని చెప్పడానికి తెలుగు సినిమాలలో మనకు ఉన్న ఏకైక నిదర్శనం ఈ భస్మాసురుడే. వందల సినిమాల్లో నటించామని గొప్పలు చెప్పుకునే మన నట మహానుభావులు, ఒకే ఒక చిత్రంతో గోపీనాథ్ వెండితెర ముందు ఆవిష్కరించిన నట విశ్వరూపాన్ని చూసయినా కాస్త నమ్రతను ప్రదర్శస్తే బాగుంటుందేమో…!

అసురుడి మొరటుతనానికి, ఆ భారీకాయుడి ధాష్టీకానికి, రూపకం మొదటినుంచి చివరివరకూ ప్రాణప్రతిష్ట చేసిన గోపీనాథ్ ఆవిధంగా తనదైన సాంప్రదాయ నృత్య నర్తనతో అభిమానుల్లోనే కాక దక్షిణ భారత చలనచిత్ర ప్రేక్షకులు హృదయాల్లో అజరామరంగా నిలిచిపోయారంటే ఆశ్చర్య పోవలసిన పనిలేదు.

తెలుగువారి సాంస్కృతిక సంపదల్లో ఒకటిగా పేరొందిన మాయాబజార్ సినిమాలో శ్రీ వసుమర్తి కృష్ణమూర్తి గారి నృత్య దర్శకత్వంలో భస్మాసురుడిగా నర్తించిన గురు గోపీనాథ్ నట విశ్వరూప ప్రదర్శనను కింది లింకులలో చూడండి.

మోహినీ భస్మాసుర

మాయాబజార్ – గురు గోపీనాధ్

నోట్: కథాకళి గోపీనాథ్ గారిపై పై మూడు కథనాలు నేను వెబ్‌దునియా.కామ్ తెలుగు విభాగంలో పనిచేస్తున్నప్పుడు ‘నాటి వెండి కెరటాలు’ అనే సినిమా విభాగంలో రాసినవి. గోపీనాధ్ గారి శతజయంతి సందర్భంగా వెబ్‌దునియా మలయాళం వెబ్‌సైట్‌ ఎడిటర్ శశిమోహన్ గారు చిన్న కథనం ప్రచురిస్తూ మాయాబజార్‌లో భస్మాసురుడిగా గోపీనాధ్ నటించిన ఘటనను పునస్కరించుకుని తెలుగు వెబ్‌‌సైట్‌లోనూ ఆయనపై కథనం రాయమని సూచించారు. దానిప్రకారం తనపై మూడు కథనాలను తెలుగులో ప్రచురిస్తే శశిమోహన్ గారు మహదానందపడిపోయారు.

యూట్యూబ్‌లోని పై లింకు తెరిచి గోపీనాధ్ గారి నటనను చూడండి. మనం ఓ  పదినిమిషాలపాటు మన ఎస్వీరంగారావు గారిని కూడా మర్చిపోతాం. ఇంత చేసి ఈ రూపకం మూకాభినయంతో కూడింది. టాకీ యుగం వచ్చాక తెలుగులో గాత్రం లేకుండా అభినయంతో మాత్రమే సాగిన అరుదైన రూపకాల్లో ఇది ఒకటి.

ఈ లింకు చూసిన తర్వాత మీకు చిన్న పరీక్ష.

మాయాబజార్ సినిమాలోని మోహినీ భస్మాసుర రూపకంలో భస్మాసురుని బురిడీ కొట్టించిన మోహిని పాత్రధారిణి అయిన ఆ కొంటెపిల్ల ఎవరో కాస్త చెబుతారా? ఈ ‘పిల్ల’ వివరాల కోసం మన కాలపు డిజిటల్ డేటా రుషి శ్యామ్ నారాయణ్ గారు 20 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారట. కాని ఫలితం దక్కలేదు. ఈ రోజు రాత్రి భస్మాసురుడితో పాటు  ఈమెకూడా ఉన్న నలుపు తెలుపు ఇమేజ్ తను పంపితే చూసి ఎవరీవిడ అని అడిగాను.  ఈ ‘పిల్ల’కోసం తాను కూడా 20 ఏళ్లుగా వెతుకుతున్నానని ఆయన సరదాగా అన్నారు. మాయాబజార్ సినిమా టైటిల్స్‌లో ఈ పిల్ల పోటో లేదా అనంటే ‘ఆ పని కూడా అయిపోయింది. దొరకలేదనే’శారీయన.

కవికోకిల పాట కొంటె పిల్ల

ఈమె ఎవరో కనుక్కోండి అంటూ ‘కవికోకిల’ అనే అలనాటి అద్భుత తెలుగు వీడియో పాటను కూడా నాకు గూగుల్ టాక్ లో జోడించి మరీ సవాల్ కొట్టారు కనుక్కోండి చూద్దాం అంటూ.

‘కవికోకిల తీయని పలుకులలో’ అంటూ లలితా రావు -?- నటించగా సుశీల పాడిన ఆ పాట వీడియో లింకు ఇక్కడ చూడండి. సినిమా పేరు ‘చివరకు మిగిలేది’.

Kavi Kokila.mp4

(ఇప్పుడు నా బ్లాగులో లింక్ అప్‌డేషన్ పనిచేయలేదు కాబట్టి గూగుల్‌లో పై లింకును కాపీ చేసి ఈ అద్భుతమైన పాటను చూస్తూ వినండి.)

బొమ్మలో కంటే ఆ పాటలో ఆమె మరింత అద్భుతంగా కనిపిస్తూ వెలిగిపోయింది. చివరకు ఈమె వివరాలకోసం కూడా మనం విఎకె రంగారావు గారిని పట్టుకోవలసిందేనా అంటే ‘చివరిమార్గం అదేనం’టూ ముక్తాయించారు శ్యామ్ గారు.

ఒక నటి నటనా సోయగానికి, ఒక  గాయకురాలి గాన సౌరభానికి నిర్వచనంలా నిలిచే అతి కొద్ది పాటల్లో ఇదీ ఒకటి. సుశీల గారి గానజీవితంలో మెరిసిన అత్యద్భుత పాటలలో ఇదీ ఒకటి. వినగానే జమునారాణి  లేదా వసంత పాటలా అనిపించినా ఇది సుశీలమ్మ పాటే.

-ఇక్కడ అప్రస్తుతం అనుకోకుంటే సుశీలగారికి బాగా నచ్చే పాట “పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా” మూడేళ్ల క్రితం మద్రాసులో ఆమెకు ఇంటర్నేషనల్ తెలుగు అసోసియేషన్ తరపున స్వర్ణాభిషేకం జరిగినప్పుడు ఆమె వీరాభిమాని, ఐఎఎస్ రాజ్‌కుమార్ గారు చేసిన అభ్యర్థనను మన్నించి ఆమె ఈ పాటను సగం వరకు చూసి పాడినప్పుడు ఆహూతుల చప్పట్లతో స్టేడియం ప్రతిధ్వనించింది.

http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/0804/21/1080421020_1.htm

ముఖ్యంగా ‘శేషతల్పమున…’ అంటూ నాలుకను పై దవడ వైపుకు చాపి ఆమె పాడుతుంటే పాట వినడం కంటే ఆమె గొంతులో, ఆ గాన ఝరిలో ఓ దివ్యత్వం. దండం పెట్టి పాట వినటం తప్ప ఏమివ్వగలం మనం. –

‘చివరకు మిగిలేది’ అని 1960లలో వచ్చిన ఈసినిమాకు ఒక బెంగాలీ సినిమా మాతృక. బెంగాలీలో మంచి విజయం సాధించిన ఈ సినిమా తెలుగువారికి నచ్చదని సావిత్రి గారు నటించడానికి వ్యతిరేకించినా, చిత్రనిర్మాతలు ఉప్పునూతుల పురుషోత్తమరెడ్డిగారు, మరొకరు కలిసి అక్కినేని నాగేశ్వరరావు గారి సహాయంతో ఆమెను ఒప్పించి నటింపజేశారట.

కవికోకిల తీయని పలుకులలో అనే ఈ పాట మనల్ని మంత్రముగ్ధులను చేసినప్పటికీ, సావిత్రి గారన్నట్లే అప్పట్లో ఈ సినిమా ఒక రోజు కూడా సరిగా ఆడలేదట.

ఈ వివరాలన్నీ శ్యామ్ నారాయణ్ గారు ఇప్పుడే చెప్పారు. మొత్తానికి ఆరునెలలు కష్టపడి ఈ సినిమా బెంగాలీ మాతృకను, తెలుగులో చివరకు మిగిలేది రీమేకింగ్‌ని, తర్వాత హిందీలో వచ్చిన ఇదే మాతృక సినిమాను మొత్తం మూడు సినిమాలను మంచి ప్రింట్‌లో ఉన్నవి శ్యామ్ గారు పట్టేశారట. ఇందుకు ఆరునెలల సమయం పట్టిందాయనకు. ఎవరికయినా ‘చివరికి మిగిలేది’ సినిమా కావాలంటే శ్యామ్ గారికి మెయిల్ పంపండి చాలు.

<syamnarayana.t@gmail.com>

మన సావిత్రిని పోలిన ఆ ‘పిల్ల’ ఎవరో చెప్పి ఎవరయినా కాస్త పుణ్యం కట్టుకుంటారా?

శ్యామ్ గారు సరదాగా పిలిచే ఈ కొంటెపిల్ల లలితారావు అని, ఈ కథనం నెట్‌లో చూసిన శశిరేఖ గారు వ్యాఖ్య పెడుతూ చెప్పారు. అంతిమంగా నిర్ధారణ అయినంతవరకు ఆమే ఈమె అనుకుందాం మరి.

లలితారావు

Final note: మొత్తం మీద మాయాబజార్‌లో మోహిని పాత్రధారిణి, చివరికి మిగిలేది సినిమాలో “కవికోకిల తీయని పలుకులలో’ పాటలో నటించిన నటి వివరాలు పూర్తిగా తెలిశాయి. పెళ్లికాక ముందు ఈమె లలితారావు. పెళ్లయ్యాక లలితా శ్రీనివాసన్. ప్రస్తుతం ఈమె వయస్సు 67 సంవత్సరాలు. తొలినాళ్లలో కర్నాటకలోని హసన్‌లో పెరిగిన ఈమె ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. 19 ఏళ్ల వయస్సులోనే పెళ్లయినప్పటికీ నాట్యం పట్ల అవరోధాలు లేని కుటుంబవాతావరణంలో గడిపిన ఈమె 1984లో కర్నాటకలో తొలి క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్‌ని ప్రారంభించారు. ఈ రోజుకీ ఈమె నాట్యమే లోకంగా బతుకుతున్నారు. ఈమె గురించి 2011 ఏప్రిల్ 29న హిందూ పత్రిక బెంగళూరు ఎడిషన్లో Little steps up the ladder అనే పేరిట ఒక కథనం కూడా వచ్చింది. వీటి వివరాలను శశిరేఖ గారు మరో వ్యాఖ్యలో తెలిపారు.

“Her name is confirmed. Birth name: Lalitha Rao & After Marriage: Lalitha Srinivasan – Checkout the article on Hindu with her photograph:”

http://www.hindu.com/fr/2011/04/29/stories/2011042950800300.htm

పూర్తి కామెంట్ కోసం కింది కామెంట్లలో చూడండి.

ఈ వివరాలు తెలియజేసిన  శశిరేఖ గారు చాలా కాలం నుంచి చివరికి మిగిలేది సినిమాకోసం వెతుకుతున్నారట. శ్యామ్ గారికి ఆ సినిమా కావాలని మెయిల్ కూడా పెట్టారు.

శ్యామ్ గారూ,  ఈమె కోరిక నెరవేరుస్తారు కదూ..!

రాజు
చందమామ

RTS Perm Link