చందమామ భాష, వస్తువు – బాలసాహిత్యంలో నూతన ధోరణులు

February 11th, 2011

(చందమామ అభిమానిగా, బాలసాహిత్యంలో గత కొన్ని దశాబ్దాలుగా వస్తున్న పెనుమార్పులను గమనిస్తూ వస్తున్న ఉపాధ్యాయుడిగా మిత్రులు ఎ.నాగరాజుగారు కొన్ని విలువైన విషయాలను ఉత్తరం రూపంలో పంచుకున్నారు. చందమామ భాష, వస్తువుకు బాలసాహిత్యంలో నూతన ధోరణులకు సంబంధించి తను లేవనెత్తిన ప్రతిపాదనలను చందమామ పాఠకులు, అభిమానులు, చంపిలు కూడా పరిశీలిస్తే మంచిదనే అభిప్రాయంతో తన ఉత్తరాన్ని యధాతథంగా ఇక్కడ ప్రచురించటమయింది. తను లేవనెత్తిన అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. చందమామ కథల సంప్రదాయం చెక్కుచెదరకుండా ఉండటంపై మనకు ఎంత బలంగా అయినా అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ వెయ్యి ఆలోచనలు సంఘర్షించనీయండి అనే సూక్తి ప్రాతిపదికన ఈ చందమామ అభిమాని, టీచరు అభిప్రాయాలను చదవటంలో, పరిశీలించడంలో మనకు భిన్నాభిప్రాయాలు ఉండనవసరం లేదని నా భావన. ఈ విషయంపై చర్చ జరిగితే మంచిదే కదా..)

ఇప్పుడు వ్యాసం పూర్తి పాఠం కింద చూడగలరు.

బాలసాహిత్యం గురించి ఆలోచించినప్పుడు అనుకోకుండా దొర్లిన కొన్ని ఆలోచనలను మీకు రాస్తున్నాను.

ధారాళంగా చదవడం అలవాటయిన రోజులనుంచీ చందమామ నాకు పరిచయం. మా ఊళ్ళో అప్పుడే కొత్తగా ప్రారంభించిన గ్రంథాలయం నాకా భాగ్యాన్ని కలిగించింది. చందమామ నాకు నేర్పిన అలవాటు ఆత్రంగా చదవడం. అది అప్పటి నుంచీ కొనసాగుతూనే వస్తున్నది. గ్రంథాలయంలో  కొత్తగా వచ్చిన  పుస్తకాన్ని కొద్దిగా చదివి వదిలితే, మరుసటి రోజుకు నాకు అందుతుందో లేదో అన్న భయం నన్నా పని చేయించేది. అందుకే ఆత్రంగా ఏకబిగిన చదివేవాన్ని.

హైస్కూలుకొచ్చాక నా పుస్తక ప్రపంచం  పెద్దదవుతూ వచ్చినా చందమామ స్థానం ప్రత్యేకంగా ఉంటూనే వచ్చింది. మరీ ముఖ్యంగా దాంట్లోని భేతాళ కథలు, ధారావాహికలు – చందమామ ప్రత్యేకతను గుర్తుతెచ్చుకోవడానికి వెంటనే స్ఫురించేవి. భేతాళ కథలలో సమాజపు విఙ్ఞతను సూక్ష్మంగా మలచి ఒక సమస్యలో చెప్పడం, ధారావాహికలలోని కొత్తప్రపంచం చాలా ఆసక్తి కరంగా ఉండేవి. ధారావాహికలను నిర్వహించిన తీరు, బొమ్మలు, పుస్తకం ఫార్మాట్, దాంట్లో ఉన్న అక్షరాల దగ్గరనుండి ప్రతీదీ తన ప్రత్యేకతను చాటుకుంటున్నట్టుగానే కనిపించేవి.

హైస్కూల్ చదువు తర్వాత నాకు చందమామ పూర్వంలా అందుబాటులో లేదు. అయితే అప్పుడప్పుడూ చూస్తుండేవాన్ని. ప్రస్తుతం కూడా అదే స్థితి కొనసాగుతుంది. సాహిత్యంతో నాకున్న కొద్దిపాటి పరిచయం వల్లనైతేనేమీ, ఉపాధ్యాయునిగా పనిచేస్తూ  ఉండడం వల్లనైతేనేమీ  బాలసాహిత్యం గురించి ఎప్పుడో  ఒకసారి  తప్పక చేయాల్సిన ఆలోచనలు నన్ను చందమామకు సంబంధించిన ఙ్ఞాపకాలవైపు నడిపించేవి.  ప్రస్తుత చందమమ స్వరూపాన్ని బొమ్మ కట్టించేవి.

అయితే ఏదో అసంతృప్తి నాలో కలిగేది. దీనిని నేను అంత సీరియస్‍గా పట్టించుకొనేవాన్ని కాను. మిత్రుడు రాజశేఖరరాజుతో మాట్లాడుతున్నప్పుడు అవే విషయాలు తిరిగి ముందుకొచ్చేవి. దీనిపై నాకు నేనే వివరణ ఇచ్చుకోవలసిస స్థితి ఒకటి వచ్చింది. దాన్ని రాజుతో ఒక లౌడ్ థింకింగ్‍లాగా పంచుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనతో దీన్ని తనకు రాస్తున్నాను.

కాలానుగుణంగా వచ్చే మార్పులను తనలో ఎలా, ఎంతవరకూ ఇముడ్చుకోగలుగుతుందన్న దాన్నిబట్టే దేనికైనా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు బాల సాహిత్యం పేరుతో అందుబాటులో ఉన్న దేనికైనా కూడా ఇది వర్తిస్తుంది. తొలి రోజుల్లో నేను చదివిన చందమామకూ, ఇప్పటి చందమామకూ గుణాత్మకంగా పెద్దతేడా  కనిపించడం లేదని చెబుతున్నందుకు నన్ను క్షమించాలి. ఇది ఎలా సాధ్యం. ఇలా ఉండడం మంచిదేనా అని ఆలోచిస్తున్నప్పుడు సాహిత్యంలో వచ్చిన మార్పులన్ని నాలో మెదులుతున్నాయి.

ముఖ్యంగా ఎనభైలలో వచ్చిన సామాజికచలనాలు సాహిత్యపు వస్తువులోనూ, దాని వ్యక్తీకరణలోనూ గుణాత్మకమైన మార్పులను తీసుకొనివచ్చాయి. ఈ మార్పులు చాలా ప్రశ్నలకు వాటి మూలాలనుండి జవాబులనిచ్చాయి. ఈ సందర్భంగా జరిగిన చర్చల ప్రభావం వల్లనైతేనేమీ, సరాసరి సామాజిక ఆచరణనుండే సంతరించుకున్న అనుభవాలనుండైతేనేమీ సాహిత్యం ఇంతకు ముందు లాగా ఉండలేని స్థితి వచ్చింది.

ప్రజలభాషను సాహిత్యంలోకి, దానికున్న విశిష్టలక్షణాలన్నింటితో సహా  సాహిత్యంలోనికి తేవడానికి ప్రయత్నాలు జరిగాయి. ‘శిష్టుల’ సంస్కరణ వేటు పడని అసలైన నాటు భాష, నాటు వ్యక్తీకరణలు, ఆహార్యం, నాటువైన కవి/ కథా సమయాలు ముందుకొచ్చాయి. ఈ రకంగా రూపంలోనూ, సారంలోనూ ఒక మంచి జరిగింది.

ఇవి ఒక వైపు కొనసాగుతూ ఉండగానే వీటి ప్రతిఫలనాలు బాలసాహిత్యంపై కూడా పొడసూపడం మొదలుపెట్టాయి. బాలల ప్రపంచం గురించి, చదువు గురించి ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న కొందరు మేధావులు, ఉపాధ్యాయులు, సంస్థలు, ప్రత్యామ్నాయంగా అప్పటికే పనిచేస్తున్న కొన్ని పాఠశాలలూ పిల్లల చదువులో  విడదీయరాని భాగంగా బాలసాహిత్యాన్ని గుర్తించారు. బడి బయట నిలదొక్కుకుంటున్న మార్పులను, అవగాహనలను బడిలోకి తీసుకొని వచ్చారు.

దీంతో పిల్లలు చదవడం, రాయడం అనే భావనలలోనే గొప్ప మార్పులు వచ్చాయి. చదవడం, రాయడం రెండూనూ అభివ్యక్తిలో భాగం కనుక, ప్రాథమిక దశలో ఈ రెండే అతి కీలకమైన అంశాలు కనుక వీళ్ళు గొప్ప ప్రజాస్వామిక అవగాహనతో “సంస్కరణ” జోలికి  పోకుండా పిల్లలు వాళ్ళు మాట్లాడే పద్ధతిలోనే, వాళ్ళు మాట్లాడే యాసలోనే, వాళ్లకు తెలిసిన మాటలతో, పాటలతో, ఆటలతో- వాళ్ల ప్రాంతానికి,  వాళ్ళ సంస్కృతికి చోటు కల్పిస్తూ చదువు చెప్పే ప్రయత్నం చేసారు.

(ఇక్కడ సంస్కరణ అంటే కథను అన్ని ప్రాంతాలవారు అర్థం చేసుకోవడానికి వీలుగా మార్చి రాయడం, పిల్లల భాషలో, వారి యాసలో, వారు చెప్పే, రాసే  స్వంత కథలను ప్రామాణిక భాష అనబడుతున్న, మనకు బాగా అలవాటయిపోయిన పుస్తక భాషలోకి మార్చి రాయడం. ఎడిటర్లు, కూర్పరులు, సంకలన కర్తలు అని పిలువబడుతున్న వారి చేతిలో పడి నలిగిన ప్రతి కథా, రచనా ఇలాంటి ‘సంస్కరణ’ పాలబడిన కథగానే చెప్పాలి)

దీంట్లో భాగంగా వాళ్ళు పిల్లలు చెప్పే కథలను వాళ్ళ గొంతులతో రికార్డు చేసారు. వాళ్లు చెప్పిన కథలకబ్బిన సుగంధాన్ని లోకానికి తెలియజేయడానికి పిల్లలచేతే కథలు రాయించారు. సరిగ్గా ఈ దశలోనే కొంతమంది కథకులు చిన్నప్పుడు అమ్మదగ్గరో, నానమ్మ దగ్గరో విన్న కథలను అదే గొంతుకతో తిరగ రాసారు.

ఈ రెండూ ఈ రోజు బయట మనకు మార్కెట్లో దొరుకుతున్న బాల సాహిత్యానికి నాందిపలికాయి. ప్రపంచీకరణ ప్రభావం వల్లనైతేనేమీ, గూడు కట్టుకుంటున్న నోస్టాల్జియా వల్లనైతేనేమీ ఈ రకమైన సాహిత్యానికి గొప్ప ఆదరణ లభించింది. పాఠకులు తము కోల్పోతున్న ప్రపంచాన్ని ఈ సాహిత్యంలో చూసుకొని స్వాంతన పొందుతున్నారు.

మొత్తంగా ఈ సాహిత్యం తెచ్చిన మార్పులు రెండు. ఒకటి, రూప పరంగా ఇది ఇంతకు  మునుపెన్నడూ లేని అసలైన బాల సాహిత్యాన్ని లిఖిత మాధ్యమంలోనికి తెచ్చింది. రెండు, సారంలో అధిక సంఖ్యాకుల జీవితానికి ఇది పట్టం కట్టింది.

భాషను ఈ సాహిత్యం ఎంతగా శుద్ధి చేసిందో చెప్పనలివికాదు. ఒకే కథ వివిధ మాండలికాల్లో ఎలా ఉంటుందో మొదటిసారి పాఠకుల అనుభవంలోకి వచ్చింది. ఒకే కథకు ఎన్ని రకాల పాఠాంతరాలు ఉండవచ్చునో కూడా ఇది ఊహకు అందేలా చేసింది.

ఒక ప్రాంతంలో ప్రచారంలో ఉన్న “కోతికి ముల్లు గుచ్చకున్న కథ” మరో  ప్రాంతంలోకొచ్చేసరికి ఏఏ మార్పులతో ఉండవచ్చునోనన్న ఆసక్తిని పాఠకునిలో కలిగించడమే ఇవి సాధించిన గొప్ప విజయం. ప్రజల భాషకూ, వారి వ్యక్తీకరణకూ ఇన్నాళ్లకు లభించిన గొప్ప చోటు.

ఇక బాల సాహిత్యంలో ఎలాంటి వస్తువు ఉండాలి అన్న గంభీరమైన చర్చకు కూడా మన కాలం తేలికగానే జవాబిచ్చింది. పిల్లలు చదువుకునే కథలు వాళ్ల చుట్టూ ఎప్పుడూ తారాడేవిగానే ఉండాలి. అవి వాళ్ల సమాజపు మంచీ చెడులతో ఒక తాత ( మనలాగా చదువుకోని తాత అయితే మంచిదేమో కదా !) తన మనవడికి అప్రయత్నపూర్వకంగా చెప్పినట్టుగా ఉండాలి. అవి వట్టి కథలేనా ? పాటలు, సామెతలు, పొడుపుకథలు, నానుడులు, పదాలు, గాథలు, ఙ్ఞాపకాలు, పురాణాలు(కుల పురాణాలు). వీటిలో ఉండే వస్తువేమిటి ? అక్షరాలా అది వాళ్ల జీవితం. అధిక సంఖ్యాకుల జీవితం.

ఈ రోజు బాల సాహిత్యం రాస్తున్న రచయితలకూ, వాటిని ముద్రిస్తున్న రచయితలకూ వీటి గురించి స్పృహ ఉందా? అంటే దానికి జవాబు వాళ్ళే చెప్పాలి. మానవ చైతన్యం లోనికి వచ్చే ప్రతీ విషయాన్నీ ఇలా నిగ్గతీసి జవాబు పొందడం కష్టం. కానీ వాళ్ళు చేస్తున్న పని వెనుక ఈ చరిత్ర ఉందని గుర్తించక తప్పదు.

మరి చందమామ వీటిలో ఎన్నిటినీ, ఎంతవరకూ అందిపుచ్చుకోగలిగింది ? పిల్లలు మాట్లాడుకునే భాషకు చందమామలో ఎంత స్థానం ఉంది? పిల్లలు తమ పెద్దవాళ్ళ దగ్గర  వింటున్న కథల్లాగా లేకుంటే తమలో తాము చెప్పుకునే కథల్లాగా అవి జీవంతో జవజవ లాడుతున్నాయా ?

(భవిష్యత్తులో కధలు పుస్తకాల రూపంలోనే కాకుండా ఆడియో, వీడియో రూపంలో పాఠకులకు మరింత దగ్గరికి వచ్చినప్పుడు పాఠకులు పుస్తకాలు చదవడం కాకుండా వినడం, చూడడం అనే సరికొత్త టెక్నాలజీ రూపంలోకి వచ్చినప్పుడు చందమామ కథ ఇప్పటిలా వర్ణన రూపంలో ఉంటుందా లేదా పక్తు సంభాషణల రూపంలో ఉంటుందా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పవలసి ఉంటుంది.)

పిల్లలతో పాటుగా, మారుతున్న సమాజంలోని పిల్లలతో పాటుగా  చందమామ కథలు ముందుకు సాగగలవా?

చివరగా ఒక మాట చెప్పక పోతే నేను చెప్పదలుచుకున్నది సరిగా చెప్పనట్లే అవుతుంది. భాష గురించి మన వాళ్ళు పడుతున్న ఆందోళనను నేను అర్థం చేసుకుంటున్నాను. అమెరికా ఒడ్డున కూర్చొనో, లేకుంటే ఆ దరిదాపుల్లోనో ఉండి భాష గురించి ఆపసోపాలు పడుతున్నారని వీళ్ల గురించి వస్తున్న విమర్శలను కూడా నేనిప్పుడు గుర్తుకు తేవడం లేదు.

భాషను ఒక విడి అంశంగా చూడొద్దని మాత్రమే నేను అభిప్రాయపడుతున్నాను. భాష మన జీవితంలో ఒక భాగమని అనుకుంటే భాష ఉంటుందా, పోతుందా, ఉంటే ఏ మార్పులు వస్తాయి ? అసలు నిజంగా భాష అంటే ఏమిటి ? భాషనెవరు  కాపాడాలి ? ఎట్లా కాపాడాలి ? అన్న ప్రశ్నలకు తేలికగానే జవాబు దొరికి తీరుతుంది.
ఎ.నాగరాజు.

నోట్:
నాగరాజు గారు తిరుపతిలోని మా కుటుంబ స్నేహితురాలి భర్తగా ఈ మధ్యే పరిచయం అయ్యారు. తను గిద్దలూరు నివాసి. అక్కడే 15 ఏళ్లుగా ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు. 1980 తర్వాత, ప్రత్యేకించి 90ల మొదట్లో ప్రపంచీకరణ ప్రారంభమయ్యాక మొత్తం సమాజంలోనూ, సాహిత్యంలోనూ వస్తున్న తీవ్రమార్పులను నిశితంగా గమనిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో గత కొన్నేళ్లుగా విద్యా కరిక్యులమ్‌లో వస్తున్న మార్పులు ఆధారంగా బాలసాహిత్యంలో చోటు చేసుకుంటున్న కొత్త పరిమాణాలను ఒక టీచరుగా అతి దగ్గరనుండి పరిశీలిస్తున్నారు.

పైగా జీవితం తొలినాళ్లలో ఆత్రంగా చదవడాన్ని అలవాటు చేయించిన చందమామ పత్రిక పట్ల తనకు ఈనాటికీ అభిమానం మెండుగానే ఉంటోంది. దాదాపు సంవత్సర కాలంగా తనను చందమామపై, బాలసాహిత్యంలో అప్పుడూ, ఇప్పుడూ వస్తున్న మార్పులపై ఏదయినా రాయమని అడుగుతూ వచ్చాను. అది ఇన్నాళ్లకు అక్షరరూపం దాల్చింది.

80లకు ముందునాటి బాల సాహిత్య అవసరాలను అద్భుతంగా తీర్చి గొప్ప పాత్ర పోషించిన చందమామకు, 80ల తర్వాత మారుతూ వస్తున్న సమాజ పరిణామాలతో సంబంధం లేకుండా పాత శైలి, సారంతోనే కొనసాగుతూ వస్తున్న చందమామకు మౌలికంగా తేడా లేకపోవడంపై తను మొదటినుంటీ పెను ఆశ్చర్యం ప్రకటిస్తూ వచ్చారు.

60 సంవత్సరాలుగా ఒక పిల్లల పత్రిక లేదా పెద్దలూ పిల్లలూ కూడా చదివే పిల్లల పత్రిక…. మారుతున్న సమాజ పరిణామాలతో పనిలేకుండా పాత శైలికి, పాత కంటెంటుకే  పరిమితం కావడం ఎలా సాధ్యం అన్నది తనకు పెద్ద ప్రశ్నలాగా మిగిలిపోయింది.

కథను, రచయితనుంచి, మేధావులనుంచి, చేయి తిరిగిన కలాల నుంచి తప్పించి నేరుగా తరగతి గదిలోనే పిల్లల వద్దకు రప్పించి విద్యావ్యవస్థ ప్రస్తుతం తీసుకువస్తున్న మార్పులకు చందమామే కాదు ఏ పిల్లల పత్రికయినా, బాలసాహిత్యమయినా ఎలా దూరంగా ఉంటుందన్నది తన ప్రశ్న.

పిల్లలు తమ ఇంట్లో, తమ పరిసరాలలో చూస్తున్న, వింటున్న వాటిని తమ భాషలో రాయడం, చెప్పడం, వినిపించడం వంటి కొత్త ప్రక్రియ ప్రస్తుతం ప్రభుత్వ విద్యావ్యవస్థలోనే పెద్ద ఎత్తున చోటుచేసుకుందని. దాదాపు 300కు పైగా బాల సాహిత్య పుస్తకాలను ఈ ప్రాతిపదికన అచ్చేసి ప్రతి స్కూలులోనూ పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చారని టీచర్‌గా తను గమనిస్తున్న అనేక అంశాలను ఆయన పంచుకున్నారు.

ఈ సందర్భంగా కొత్తపల్లి.ఇన్ ఆన్‌లైన్ పత్రిక – (దీన్ని ప్రింటులో కూడా తీసుకువస్తున్నారు) వంటి బాలసాహిత్య పత్రికలు సాధిస్తున్న విజయం, కథ విషయంలో తీసుకువస్తున్న మార్పులు మా చర్చలోకి వచ్చాయి.

http://kottapalli.in/

చందమామ చాలా విషయాల్లో ఈనాటికీ మడి గట్టుకుని కూర్చోవడానికి చందమామ ప్రియపాఠకుల తీవ్రాభినివేశమే కారణమని, 50ల నుంచి 80ల దాకా చందమామ కథల సుగంధ పరిమళాల రుచిని చూసిన అలనాటి పాఠకులు కాని, వారి నుండి వారసత్వంగా చందమామను చదువుతూ వస్తున్న యువపాఠకులు కాని చందమామ తన ఒరవడి నుంచి కాస్తంత గీత దాటినా సహించడం లేదని తనతో సంభాషణల సందర్భంగా తెలిపాను.  64 సంవత్సరాలుగా కొనసాగుతున్న శైలి, వస్తువు విషయంలో ఏలాంటి మార్పులు చేయడానికి కూడా ససేమిరా అంటున్న తరహా పాఠకాభిమానులు చందమామ పత్రికకు తప్ప మరే ఇతర పత్రికకూ బహుశా ఉండబోరని చెప్పాను.

సమాజం, పిల్లల అవసరాలు శరవేగంగా మారిపోతున్న నేటికాలంలో భవిష్యత్ తరాల పిల్లల వాణిగా చందమామ మిగలాలంటే, ఉనికి కొనసాగించాలంటే చందమామలో కంటెంటును మార్చవలసిందేనన్న బలమైన అభిప్రాయం నూతన యాజమాన్యంలో ఉంది. విశ్వనాధరెడ్డిగారు చందమామలో కొనసాగుతున్న కాలంలోనే కొత్త మార్పులు చందమామలో ప్రారంభమైపోయాయి. ఆయన కొన్ని కొత్తమార్పులను ఆమోదించడం, కొన్నింటిని వ్యతిరేకించటం జరిగినప్పటికీ మార్కెట్‌లో పత్రిక నిలబడాలంటే అనివార్యంగా క్లయింట్  ఆధారితమైన,  ప్రమోషనల్ ప్రాతిపదికతో కూడిన, ప్రకటనలకు సంబంధించిన మార్పులు తప్పనిసరి అనే అవగాహన, పత్రిక ఉనికికి సంబంధించిన అవసరాలలోంచే పుట్టుకొచ్చింది. దీంతో పాఠకుల నుంచి ఎన్ని తీవ్రమైన నిరసనలు వచ్చినా ప్రస్తుతం చందమామలో కనీసం 15 నుంచి 20 పేజీలు వరకు కంటెంట్ కొత్త పోకడలు పోతూ ఉంది. దీనిపై పాఠకులూ, అభిమానులూ ఎంత అయిష్టత ప్రకటించినా ఇప్పట్లో దీన్ని మార్చడం అసాధ్యం.

మిగిలిన 60 పైగా పేజీలను పూర్తిగా కథలకే కేటాయించి పత్రికను 70 శాతం పాత స్వభావంతోనూ, 30 శాతం ఆధునిక రూపంలోనూ  నడుపుతుండటం అందరికీ తెలిసిన విషయమే. కథలకు మాత్రమే పరిమితమైన పత్రికలో ఎలాంటి ప్రేరణను ఇవ్వని జోక్స్, జీకే, యురేకా, కెరీర్ వంటి నిస్సారపు అంశాలు చోటు చేసుకోవడంపై పాతతరం పాఠకులు విరుచుకుపడుతున్నా పత్రిక మనుగడ అవసరాలతో ఈ కొత్త తరహా విషయం చందమామలో కొనసాగక తప్పదు. ఈ కొత్త కంటెంట్ దాదాపుగా యాడ్స్‌తో ముడిపడి ఉంటోంది కనుక దీన్ని తొలగించడం ప్రస్తుతానికి అసంభవం.

ఉన్నంతలో జరుగుతున్న మంచి ఏమంటే చందమామలో తొలి 60 లేదా 70 పేజీలను కథలతో నింపడమే. దీంట్లో కూడా అడపాదడపా వస్తున్న సమకాలీన కథలను పాఠకులు మెచ్చడం లేదు. మధ్యయుగాల వస్తువు, వేషభాషలతో కూడిన కథలను మాత్రమే పాఠకులు ఈనాటికీ డిమాండ్ చేస్తున్నారు. పైగా చందమామ వైభవోజ్వల చరిత్రకు నిదర్శనంగా మిగిలిన సీరియల్స్, రామాయణ, మహాభారతాలు, ఇతర పాత కథలను ప్రింట్ చేసి ఇవ్వవలసిందిగా పాఠకులు కోరుతున్నారు.

ఇప్పటికే 1947నుంచి 2005 వరకు 58 ఏళ్ల చందమామలను ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆర్కైవ్స్ రూపంలో ఇస్తున్నాం కదా. మళ్లీ వాటిని పుస్తకాలుగా కొత్తగా ప్రింట్ చేసి ఇవ్వడం ఎందుకు అన్నది పైవారి దృక్పథం. తెలుగుతో సహా ప్రాతీయ భాషల్లో చందమామ కథలు, సీరియల్స్ ముద్రిస్తే ఏమాత్రం లాభదాయకం కాదన్నది మార్కెట్ పరంగా పైవారి అంచనా.

అందుకే చందమామ ప్రచురణలు ఇటీవలి కాలంలో ప్రధానంగా ఇంగ్లీషుకే  పరిమితమవుతున్నాయి. చందమామ పుట్టి 60 సంవత్సరాలైన  సందర్భంగా మూడేళ్ల క్రితం తీసుకువచ్చిన చందమామ కలెక్టర్స్  ఎడిషన్ -కాపీ టేబుల్ బుక్- కాని, చందమామ కార్టూన్ రామాయణం (సంపూర్ణ రంగుల పుస్తకం) కాని, గత సంవత్సరం ముద్రించబడి సంచలనాత్మక విజయం సాధించిన చందమామ Art Book కాని ఇంగ్లీషులోనే ముద్రించబడటానికి ఇదే కారణం.

పైగా వీటిని 40, 50 శాతం కమీషన్లతో పుస్తకాల షాపులకు ఇవ్వడం కాకుండా పాఠకులకు నేరుగా చందమామే ప్రత్యక్ష అమ్మకం రూపంలో పంపుతోంది. మూడు నాలుగేళ్లు కాపీలు నిల్వ చేసి మరీ అమ్ముతున్నారు.

త్వరలోనే  చందమామ కథలకు ఆధునిక టెక్నాలజీని జోడించి కథలను కామిక్స్ రూపంలో త్రీ-డీ రూపంలో పెద్ద ఎత్తున కూర్చి మార్కెట్లో నిలబడాలని ప్రస్తుత చందమామ భావిస్తోంది. బహుశా ఈ సంవత్సరంలోనే ఈ కొత్తరకపు డిజిటల్ చందమామ ఉత్పత్తులు మొబైల్, టీవీ రంగంలో కనబడవచ్చు.

కాగా, “ఎంత ఖర్చయినా సరే చందమామ ప్రచురణలకు అయ్యే ఉత్పత్తి ఖర్చులను మొత్తంగా మేమే భరిస్తాం, అవసరమైతే మహా దాతల సహాయం కూడా తీసుకుంటాం, దాసరి సుబ్రహ్మణ్యం గారి సీరియల్స్, రామాయణ భారతాలు తదితర సీరియల్స్ అన్నిటినీ మీరు తిరిగి పుస్తకాలుగా ముద్రించండి” అంటూ చందమామ అభిమానుల డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే వస్తోంది. ఇది పూర్తిగా యాజమాన్యం హక్కులకు సంబంధించిన విషయం కాబట్టి వారి అనుమతి ఉంటే తప్ప చందమామ ప్రచురణలు సాధ్యం కాదు.

అదే సమయంలో, చందమామ కథ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మార్పులు సంతరించుకోవలసిందేననీ, ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోడంలో ఎవరూ వెనుకబడరాదని, చందమామ కథలు కూడా దీనికి మినహాయింపు కారాదని శ్రీ అవసరాల రామకృష్ణారావు వంటి వయో, జ్ఞాన వృద్థులు పత్రికలో కొత్త మార్పులను స్వాగతిస్తున్నారు. పాత తరానికి సంబంధించిన తమవంటి వారు ఇంటర్నెట్, ఆన్‌లైన్, ఈమెయిల్స్ వంటి కొత్త టెక్నాలజీ జోలికి పోలేకపోవడం వృద్ధులుగా తమ బలహీనతేనని ఆయన నిజాయితీగా గతవారం ఫోన్ సంభాషణలో అంగీకరించారు కూడా.

ఈయన చందమామ తొలి సంచిక -1947 జూలై- లో కథ రాసిన తరానికి చెందిన వారు. మనకు తెలిసినంతవరకూ తొలి చందమామలో కథ రాసి ఇప్పటికీ సాహిత్య వ్యాసంగం చేస్తూ ఉన్నది వీరొక్కరే. ఈ మధ్యనే హైదరాబాద్‌లో చందమామ సీరియల్స్ రచయిత, 54 ఏళ్లపాటు చందమామలో నిరవధికంగా పనిచేసిన దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్థంతి సందర్భంగా రచన శాయిగారు, దాసరి వెంకటరమణగారి ద్వారా ఆయన పరిచయం కావడం. చందమామ జ్ఞాపకాలు కావాలని ఆయనను ఇటీవల అభ్యర్థిస్తే నిన్ననే పంపారు. బోనస్‌గా కొత్త కథ కూడా రాసి పంపారు.

నిజంగా మాకిది తుళ్లింత, థ్రిల్లింతలా  ఉంది. ఈయన జ్ఞాపకాలను, కొత్త కొథను జూలై సంచికలో తీసుకువస్తే చందమామ పుట్టిన నెలకు అదొక అపరూపమైన విశేషంగా ఉంటుందని శాయి గారు ఇచ్చిన సలహా మేరకు చెన్నయ్‌లో మా పైవారితో సంప్రదిస్తే, అవసరాల గారు 1947 తొలి చందమామలో రాసిన తొలి కథను, ఇప్పుడు పంపిన చందమామ జ్ఞాపకాలను, బోనస్‌గా పంపిన కొత్త  కథను కూడా వచ్చే జూలై సంచికలోనే వేద్దామని, ఎడిటర్‌తో ఈ విషయం చర్చిద్దామని అన్నారు. మొత్తానికి మంచి పరిణామం.

ఈలోపల మరొక పరిణామం. ఈ ఫిబ్రవరి నెల చందమామలో ఎన్నడూ లేనిది మూడు కథల్లో ఆధునిక ఆహార్యంతో కూడిన బొమ్మలు వచ్చాయి. గతంలో పాతికేళ్ల క్రితం కాబోలు ‘సత్తెకాలపు సత్తెయ్య’ కథకు మాత్రమే ఇలా ప్యాంట్, షర్టు తొడిగిన కథ వచ్చి అంతటితో ఆగిపోయింది. కాని ఈ ఫిబ్రవరి సంచికలో మూడు కథలు ఆధునిక బొమ్మలు తగిలించుకోవడం పట్ల సాంప్రదాయిక అభిమానులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఈ కథలు పర్యావరణానికి, ఆధునిక సమాజానికి సంబంధించిన కథలు కావడంతో ఆధునిక వేషంతో బొమ్మలు వేయించడం తప్పనిసరైంది.

కాని గౌరీశంకర్ గారి వంటి పెద్దలు వీటిని చూసి తట్టుకోలేకపోయారు. గౌరీశంకర్ గారు 35 ఏళ్ల క్రితం విజయబాపినీడుగారు దిగ్విజయంగా నడిపిన ‘విజయ’ మాసపత్రికలో నెలనెలా సినిమాలపై సమీక్షలు  రాస్తూ వేలాది మంది పాఠకులను ఉర్రూతలూగించిన మేటి విమర్శకులు. విజయ మాస పత్రికలో కొత్త సినిమాలకు ఆయన రాసే సమీక్షలు చదివి సినిమాకు వెళ్లాలా వద్దా అని అప్పటి యువతరం నిర్ణయించుకునేది. ఆయన కామర్స్ లెక్చరర్‌గా రిటైర్ అయ్యాక ఇప్పుడు కూడా సినీ కథలు రూపొందిస్తూ చిత్రసీమతో సన్నిహిత సంబంధంలో ఉంటున్నారు.

చందమామ వీరాభిమానుల్లో ఉగ్ర వీరాభిమానిగా గౌరీశంకర్ గారిని కూడా చేర్చవచ్చు. ‘ పల్కు దారుణాఖండల శస్త్ర తుల్యంబు’ చందాన నవనీతాన్ని పోలిన మృదూక్తులతో సంభాషణ జరిపే ఈయన చందమామలో చెడు మార్పుల విషయం వచ్చేసరికి, మెత్తగానే మాట్లాడుతున్నప్పటికీ,  ఫోన్ వదిలి పారిపోవాలన్నంత తీవ్ర స్పందనను వ్యక్తీకరిస్తారు.  అయితే మా ఇద్దరి సంభాషణలూ ఇద్దరు చందమామ అభిమానులు తీవ్రంగా చర్చించుకుంటున్నట్లే ఉంటాయి తప్ప ఎన్నడూ పరిమితి దాటింది లేదు కాబట్టి ప్రమాదం లేదు. .

చందమామ మార్పులపై అభిమానుల స్పందన ఎలా ఉంటోందో ఆయన మాటల్లోనే ఇక్కడ చూడండి.

పట్టు వస్త్ర ధారణతో ఇన్నాళ్లూ పవిత్రంగా ఉన్న చందమామ, పిబ్రవరి సంచికలో, పిట్టలదొరలా మారిపోయింది. ప్యాంటు షర్టూ లాంటి వస్త్రధారణ గల బొమ్మలతో, చందమామ కురిపించే చల్లని వెన్నెల కరిగిపోయి, అభిమానుల కళ్లల్లో కన్నీరు మిగిలింది. చందమామ కున్న సంప్రదాయకళ పోయి, ఎబ్బెట్టుగా మారింది. ఇలాంటి కథలూ చిత్రాలూ పూర్తిగా అభ్యంతరకరం, పరిహరించండి. (వ్యాపారంలో కిటుకు, సొంత ఇల్లు, ఇంటింటికో పువ్వు కథలకు వేసిన చిత్రాలు పూర్తిగా అభ్యంతరకరం.)

అంతేకాదు, పాఠకులనుంచి అభిప్రాయాలు కోరే మీరు అవేవీ పాటిస్తున్నట్లుగా మాత్రం లేదు. పత్రిక తగ్గించిన సైజును పెంచారని సంతోషిస్తుంటే, మరో వైపు పేపర్ క్వాలిటీని తగ్గించారు. ఇదేం చెలగాటం? ఇప్పుడు చందమామ చింకిచీర కట్టుకున్న సీతాదేవిలా ఉంది. ఇంకా ఎన్నాళ్లీ అరణ్యవాసం?

ఎన్నాళ్లు పాఠకుల సహనం మీద ఈ క్రూర పరిహాసం?

మీరు మారనంటారా, సరే అయితే మేమే మారతాం. వేరే పత్రికలకు….\

కె.గౌరీశంకర్, హైదరాబాద్

దారుణాఖండల శస్త్రతుల్యంబు రకంతో మెత్తగా పొడిచే గౌరీశంకర్ గారు పైకి అలా అంటారు కాని ఎంత అయిష్ఠత ఉన్నా, ఇంతవరకూ చందమామను కొనకుండా వదిలింది లేదు. మంచిని అమాంతంగా పైకెత్తడం, తేడా వస్తే అంతు చూడడం గౌరీశంకర్ గారి విషయంలోనే కాదు, ప్రతి చందమామ పాఠకాభిమాని సహజ స్వభావమే ఇలా ఉంటోంది.

నేను గతంలోనే ఈ బ్లాగులో అన్నట్లు, చందమామ బలం, బలహీనత చందమామది కాదు. అది కేవలం చందమామ పాఠకులదే. 64 ఏళ్లుగా చందమామ పురోగతికి సంబంధించిన ప్రతి అడుగులో పాఠకుల అభిప్రాయమే రాజ్యమేలుతోంది. అప్పుడూ, ఇప్పుడూ కూడా చందమామ దశ దిశను నిర్దేశిస్తున్నది పాఠకాభిమానులే. పాఠకుల అభిప్రాయానికి అనుగుణంగా లేని ఏ పత్రికా బతికి బట్టకట్టలేదు అనేది నిజమే. కాని చందమామ విషయంలో ఇది మరీ నిజం.

బలవంతంగా, పాఠకుల ఇచ్ఛతో పనిలేకుండా పైనుంచి అడపాదడపా మార్పులను తీసుకు వచ్చినా బడితె బాదుడుతో, ఉత్తరాల ఆయుధాలతో చందమామ బాధ్యులకు హెచ్చరిక బాణాలను పంపి మరీ తమకు ఇష్టం లేని మార్పులను రద్దుచేయించుకున్న ఘనత ఒక్క చందమామ పాఠకులకే ఉంది.

నిజాన్ని పచ్చిగా చెప్పాలంటే గత రెండేళ్ల పైగా చందమామకు, పాఠకులకు మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. పత్రికలో కాస్త మంచి మార్పు ప్రవేశ పెడితే అమాంతగా చందమామను తమ స్వతం చేసుకుని పైకెత్తడం, తేడా వచ్చిందంటే ఉత్తరాలతో  కొట్టడం చందమామ పాఠకులే చెల్లు.

నిజంగానే చందమామ సిబ్బంది భయపడుతున్నది వారి పాఠకులకు మాత్రమే అంటే నమ్మండి.  ఈ ఇరవయ్యేళ్లలో ఎన్నడూ లేనిది చందమామలో ప్రతి నెలా 20 కథలు, సీరియల్స్ వస్తున్నాయంటే, కనీసం నెలలో 10 నుంచి 14 కథల వరకు కొత్త కథలు ప్రచురించబడుతున్నాయంటే గత కొంత కాలంగా చందమామ రచయితల తీవ్ర స్పందనే కారణం.

కథలు కొత్తవైనా, పాతవైనా ఎక్కువగా ప్రచురించబడినప్పుడల్లా పాఠకులు, అభిమానులు పత్రికకు బ్రహ్మరథం పడుతున్నారు. ‘మా కథలు మాకివ్వండి తర్వాత మీరే గంగలో అయినా మునగండి.’ అనేది పాఠకుల, అభిమానుల నిశ్చితాభిప్రాయం. చందమామ పాఠకులు ఇంత బలమైన, పోరాటతత్వం కలిగిన వారు కాబట్టే, చందమామ దిశా దశా మార్చిపడేస్తామని భీషణ ప్రతిజ్ఞలు చేసినవారు, చేస్తున్నవారు కూడా తరచుగా వెన్ను చూపవలసి వస్తోంది.

చందమామలో ఏం జరుగుతోంది, పాఠకులకూ, చందమామకు మధ్య బంధం ఎన్నెన్ని పోకడలు పోతోంది వివరంగా తెలియజెబుదామన్న ఆత్రుతలో మా మిత్రుడి వ్యాసం కంటే మించిన పరిమాణంలో నా నోట్‌ను చొప్పించానే తప్ప ఇక్కడ మరొక ఉద్దేశం లేదు. ఈ కోణంలోంచి  కూడా  మా మిత్రుడి కథనంపై అందరమూ స్పందిస్తే బాగుంటుందని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం.

వందపూలు వికసించాలి, వేయి బావాలు ఘర్షించాలి.

ఇది చైనా సామెత మాత్రమే కాదు. మన రుగ్వేదంలో కూడా సరిగ్గా ఇలాంటి సూక్తి ఉన్నట్లు, చదివినట్లు గుర్తు.

నాగరాజు గారూ, మీ అనుభవాన్ని, చందమామ పట్ల మీ అనురక్తిని రెండు భిన్న కోణాల్లో ప్రదర్శించి మంచి కథనం పంపారు. మీకు కృతజ్ఞతలు.

మీ
రాజు.

RTS Perm Link