రోగాలపై గెలిచిన వైద్యుడు

June 20th, 2011

ఈరోజు ఆంద్రజ్యోతి నవ్య విభాగంలో “రోగాలపై గెలిచిన యోధుడు” పేరిట ఒక అద్భుత కథనం వచ్చింది. యోగాసనాలు అంటేనే మనకు సాంప్రదాయక భావజాలం అంటూ ఆలోచనలు వచ్చేస్తుంటాయి కదా..  కాని 75 ఏళ్ల డాక్టర్ తన జీవితాన్నే ప్రయోగశాలగా చే్సుకుని మొండివ్యాధులను తగ్గించుకుని ఒక్క మందుబిళ్ల కూడా మింగకుండా ఆరోగ్యంగా.. కొత్త జీవితాన్ని అనుభవిస్తున్న వైనాన్ని ఈ కథనం వివరిస్తోంది.

తనకు తాను ప్రయోగశాలగా మారి. ఒక మిత్రుడి సహాయంతో యోగాసనాలు ప్రారంభించి ఒక్కొక్క జబ్బునే తొలగించుకుంటూ వచ్చిన ఈయన ప్రస్తుతం అన్ని జబ్బులకూ ఒకే ఒక్క దివ్యౌషధం యోగా అంటున్నారు. మానసిక ప్రశాంతతను కొన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేమని కేవలం నాలుగు ఆసనాలు, ఒక ప్రాణాయామంతో దీన్ని సాధించుకోవచ్చని చెబుతున్న ఈ పూర్వ డాక్టర్ ఈ తరానికి తన జీవితం ఒక పాఠం కావాలని తన జీవిత సత్యాన్ని ఆంధ్రజ్యోతి పాఠకులతో పంచుకున్నారు.

అన్ని జబ్బులూ డబ్బుతో నయం కావని, ఇక్కడే యోగా అవసరముంటుందని చెబుతున్న ఈయన ఈ తరానికి అన్నీ తొందరే నని, నూటికి అరవై మంది యోగాను అత్యుత్సాహంతో ప్రారంభించి నెల తిరక్కుండానే మానేస్తారని, దీనివల్ల మరొకసారి తిరిగి వీరు యోగాను మొదలుపెట్టలేరని అక్షరలక్షల్లాంటి సత్యాన్ని మనముందుంచారు.

లేటువయసులో మిత్రుడి సాయంతో యోగాను మొదలుపెట్టిన ఈయన దేశంలో ఎక్కడ యోగా పోటీలు జరిగినా 75 ఏళ్ల వయసులోనూ పాల్గొంటూ ఏదో ఒక పతకంతో  తిరిగి వస్తుంటారు. ఇలా 50 పతకాల సాధించారు.

పతకాల విషయం పక్కన పెట్టండి. మనం పెరటి వైద్యాన్ని, పోపుల వైద్యాన్ని ఎప్పుడో మర్చిపోయాం కదా.. నిద్రలేవగానే చెంబెడు నీళ్లు లేదా గ్లాసుడు నీళ్లు తాగితే జీవితంలో తలనొప్పి అనేది మన చెంతకు రాదనే సత్యాన్ని కూడా మనం మర్చిపోయాం. బెడ్ కాఫీ గాళ్లం కదా.

నేను ఎనిమిదో తరగతి చదువుతుండగా మా తెలుగు టీచర్ సహదేవరెడ్డిగారు ఇచ్చిన జలవైద్యంపై సూచనను పాటించాను. 1975 నుంచి ఈనాటివరకు నీళ్లు తాగకుండా దినచర్య మొదలెట్టింది లేదు.. నమ్మండి నమ్మకపోండి… ఈ 35 ఏళ్ల నుంచి నేను తలనొప్పి అనేదాన్ని ఎరగను.

మా  తెలుగు టీచర్ గారే చెప్పిన ఆసనాలను కూడా ఎం.ఏ రెండో సంవత్సరం వరకు అంటే పదేళ్లపాటు కొనసాగించాను. ఆసనాలలోనే అతి కష్టమైన శీర్షాసనం, మయూరాసనం వంటివాటిని ఈనాటికీ కూడా నేను సునాయాసంగా వేయగలను.

కాని మలి జీవితంలో యోగాసనాలు వదిలేశాను. మరీ ముఖ్యంగా 2002 తర్వాత కుర్చీకి అంటుకుని కూర్చుండే ఉద్యోగ జీవితంలోకి -ఆన్‌లైన్ మీడియా, అనువాదాలు- వచ్చిపడ్డాక అందరికీ వస్తున్నట్లే నాకు షుగర్ కూడా వచ్చేసింది. ఉదయాన్నే నీళ్లు తాగడమనే అలవాటును నేటికీ కొనసాగిస్తున్న నేను యోగాసనాలను పదేశ్ల తర్వాత వదిలేశాను. మనిషి జీవితానికి ప్రాణాధారమైన నడకను కూడా గత పదేళ్లుగా వదిలేశాను. ఫలితం నా కళ్లముందే నాకు బ్రహ్మాండంగా కనపడుతోంది. చెమట కారకుండా బతికే బతుకు ఎలా ఉంటుందో నాకు అర్థమవుతూనే ఉంది..

కనీసం ఇప్పటికయినా ఈ అపురూప కథనం నాకు కనువిప్పు తేవాలని కోరుకుంటూ, ఈ కథనాన్ని చదివి కొంతమంది అయినా ప్రేరణ పొందుతారని ఆశిస్తూ..

ఆంద్రజ్యోతిలో వచ్చిన ఈ అపురూప కథనం లింకులను ఇక్కడ చూడండి.

రోగాలపై గెలిచిన వైద్యుడు

యోగాతో ఎన్ని ప్రయోజనాలంటే..

ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌ హోమ్ వేజీలో కూడా ఈ కథనం వచ్చే ఆదివారం వరకు ఉంటుంది.

ఆంద్రజ్యోతి వెబ్‌సైట్‌లో కనిపించని ఈ కథనం పరిచయ భాగాన్ని ఇక్కడ చూడండి.
ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ పెద్దాయన ఓ ఎంబీబీఎస్ డాక్టర్. వయసు 75 ఏళ్లు. ఎన్నో జబ్బులను నయం చేసిన ఈయనకే పట్టుకున్నాయి చాలా జబ్బులు. అలాగని జీవితమంతా వాటితో పోరాడి.. పోరాడి… అలసిపోలేదు ఈ డాక్టర్. శరీరాన్నే ఒక ప్రయోగశాల చేసుకున్నారు. దీర్ఘకాలిక రోగాలను సైతం ఓడించారు. రోగాల్నే కాదు.. దేశవ్యాప్తంగా బోలెడు పతకాలను  సైతం గెల్చుకున్నారు. ఇప్పుడు ఒక్క మందుగోళీ కూడా మింగకుండా.. ఆరోగ్యంగా.. కొత్త జీవితాన్ని అనుభవిస్తున్న ఆయన్ను ఇదెలా సాధ్యం అంటే.. ‘అంతా యోగా మహిమ’ అంటారు. ఈ తరానికి ఆరోగ్యపాఠంలా పనికొచ్చే తన జీవితాన్ని మనకు చెబుతున్నారు డాక్టర్ హేమసుందరరావు. ఆ విశేషాలే ఈ  వారం ఫస్ట్ పర్సన్…

డా. హేమసుందరరావు

ఆంధ్రజ్యోతి సౌజన్యంతో…

RTS Perm Link