రూపం-సారం : సాహిత్యంపై బాలగోపాల్

March 8th, 2012

బాలగోపాల్

 

 

 

 

 

 

 

 

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఇటీవలే ఒక అరుదైన పుస్తకాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. పుస్తకం పేరు “రూపం-సారం : సాహిత్యంపై బాలగోపాల్.” ఇది పౌర, మానవహక్కుల నేత బాలగోపాల్ సాహిత్య రచనల సంకలనం.

కె. బాలగోపాల్ (1952-2009) మానవహక్కుల వేదిక నాయకులు, ప్రముఖ న్యాయవాది, రచయిత, వ్యాసకర్త

మనిషి జీవితంలో సాహిత్యానికి గల పాత్రను లోతైన తాత్విక దృక్పధంతో పరిశీలించి చేసిన విశ్లేషణలు ఈ పుస్తకంలో ఉన్నాయి. స్థిరపడిపోయిన ఎన్నో మౌలిక భావనలను, ధోరణులను ప్రశ్నిస్తూ విస్తారమైన అన్వేషణ సాగించారాయన. సాహిత్యంపై చెదురుమదురుగానే అయినా చిక్కగా రాసిన వ్యాసాలు, సమీక్షలు, ముందుమాటలు, ఇంటర్వ్యూల సంకలనమిది.

భారతీయ చరిత్ర రచన, అధ్యయన పద్దతులపై మౌలిక ప్రభావం చూపిన సుప్రసిద్ధ చరిత్రకారులు డిడి కొశాంబి రచనల అధ్యయనంతో మార్క్సిజం వైపు ఆకర్షితులైన బాలగోపాల్ 1980ల మొదటి నుంచి 2009లో ఆకస్మిక మరణం పొందేవరకు 30 సంవత్సరాలపాటు అటు అధ్యయనానికి, ఇటు తానెంచుకున్న పౌర హక్కులు, మానవ హక్కుల రంగాలలో ఆచరణకు సజీవ ఉదాహరణగా నిలిచిపోయిన విశిష్టవ్యక్తి. పౌరహక్కుల కోసం, తదనంతరం మానవహక్కుల కోసం 30 ఏళ్లపాటు భారతదేశ వ్యాప్తంగా కాలికి బలపం పట్టుకుని తిరిగిన అద్వితీయ చరిత్ర బాలగోపాల్‌ది.

పౌర హక్కుల కోసం గొంతెత్తినందుకు రాజ్య వ్యవస్థ అభిశంసనకు గురయ్యాడు. మరోవైపు ప్రజా ఉద్యమాలలో సహించరాని ధోరణులపై గళమెత్తినందుకు సమకాలీన విప్లవోద్యమం అభిశంసనకు కూడా గురయ్యాడు. అటు రాజ్యం  ఇటు ప్రజాఉద్యమం రెండు శక్తుల నుంచి నిరసన, అభిశంసనను ఎదుర్కొన్న అరుదైన చరిత్ర ఈయనది.  రాజ్యవ్యవస్థను, ఇటు ప్రజా ఉద్యమాలను వాటి గుణగుణాల ప్రాతిపదికన ఉతికి ఆరేసిన అరుదైన వ్యక్తిత్వం బాలగోపాల్‌ది.

పౌర హక్కులలో ఉద్యమాల బాధితుల హక్కులు భాగం కావా అనే విమర్శపై ప్రతిస్పందన దాని కార్యకారణ ఫలితాలు బాలగోపాల్ ఆలోచనా దృక్పధాన్ని కొత్త మలుపు తిప్పివేశాయనడం ఇప్పుడు నిర్వివాదాంశం.

ప్రపంచ పౌర హక్కుల చరిత్రలో ఏ హక్కుల ఉద్యమకారుడు, ఉద్యమకారిణి తిరగనంత విస్తృతంగా సువిశాల భారతదేశమంతటా పయనించి తన హక్కుల వాణిని మూడు దశాబ్దాల పాటు అలుపెరగకుండా వినిపించిన అరుదైన కార్యకర్త బాలగోపాల్.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమెరికా దాకా యావత్ ప్రపంచం కూడా మనిషి పట్ల, హక్కుల విధ్వంసం పట్ల బాలగోపాల్ తపనను. ఆర్తిని గుర్తిస్తూ ఆయనకు నివాళి పలుకుతోంది. ఒక తెలుగువాడు ప్రపంచ పౌర హక్కుల యవనికపై ప్రసరింపజేసిన దివ్యకాంతి మానవాళి హక్కుల చరిత్రలోనే మకుటాయమానంగా భవిష్యత్తరాలపై కూడా తనదైన ప్రభావాన్ని వేయనుంది.

పౌర, మానవ హక్కుల ఉద్యమం ప్రధాన భూమికగా జీవితాన్ని పండించుకున్న బాలగోపాల్ తెలుగు ప్రాచీన, ఆధునిక సాహిత్యంపై, రచయితలపై, సాహిత్యంలో సామాజిక ప్రతిపలనాలపై చేసిన అద్వితీయ రచనలన్నిటినీ కలిపి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ “రూపం-సారం : సాహిత్యంపై బాలగోపాల్” అనే పుస్తకం ఇటీవలే ప్రచురించింది.

ఒక 30 సంవత్సరాల నిరంతర ఉద్యమ చలనంలో ఉంటూ కూడా  తెలుగు సాహిత్యం నుంచి మొదలు కుని ప్రపంచ సాహిత్యం వరకు కూడా తను సాగించిన అధ్యయనాన్ని, వ్యక్తీకరించిన అభిప్రాయాలను ఒకే చోట చేర్చి అభిమానులకు, సాహిత్య ఆసక్తి పరులకు అందించిన విశిష్ట పుస్తకం “సాహిత్యంపై బాలగోపాల్”

“ఏడుతరాలు” రాసిన  ఎలెక్స్ హేలీ దృక్పథ విశ్లేషణ నుంచి, కవిసేన నుంచి, కన్యాశుల్కం నుంచి, రావి శాస్త్రి సారా కథల నుంచి, కుటుంబరావు మధ్యతరగతి నేపథ్యం పరిమితుల నుంచి తను పరిశీలించిన ప్రతి ఒక్క రచనపైనా తనదైన మెరుపు వాక్యాలను, విశ్లేషణలను చేసి సీనియర్ విమర్శకులతో పాటు ఒకటి రెండు తరాల యువతీయువకులను కూడా విశేషంగా ఆకర్షించిన గొప్ప రచనలు ఈ పుస్తకంలో మనం చూడవచ్చు.

ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్ గారు బాలగోపాల్‌ రచనల ప్రాశస్త్యంపై ఒక తరం అభిప్రాయాలకు వాణినిస్తూ ఈ పుస్తకం ముందుమాటలో ఇలా రాశారు.

“ఆ కాలపు తరగలపై తేలివచ్చిన మేధావులలో బాలగోపాల్ ఒకరు. కళ్ళు మిరుమిట్లు గొలిపి కొత్త వెలుగులు కురిపించిన యువకుడిగా బాలగోపాల్ ఒకే ఒక్కడు. ఎంతో వినయంగానే అయినప్పటికీ, తను జ్ఞానం అనుకున్న దానిమీద తిరుగులేని విశ్వాసాన్ని, ఆ జ్ఞానం మీద తనకున్న అధికారాన్ని ధ్వనింపజేస్తూ మాట్లాడేవాడు. రాసేవాడు.ఇంద్రవెల్లీ, సింగరేణీ భవిష్యత్తు మీది ఆశను ఉద్దీపింపజేస్తుండగా, ఉద్వేగాలకు బలమయిన ఆలంబన కోసం జ్ఞానదాహంతో తపించిపోయిన, అప్పుడప్పుడే కళ్లు తెరుస్తున్న మా బోంట్లం ప్రతి సృజనాక్షరాన్నీ జల్లెడ పట్టేవాళ్లం. ఒక సాధికారికమయిన గొంతు కోసం మోహం వాచి ఉన్నట్లు మధుసూదనరావుని, బాలగోపాల్‌ని ఆసక్తిగా ఆత్రంగా వినేవాళ్లం, చదివేవాళ్లం. ఎంతో తేలికగా అర్థమయ్యే వారి  రచనల ఆసరాతో అజ్ఞానపు చీకట్లను, దుష్టభావాలను అవలీలగా తరిమివేయవచ్చని అనుకునే వాళ్లం. ఎందుకో మధుసూదనరావులో ఆవేశమే ఆకర్షించేది. బాలగోపాల్‌‍ని చదివిన ప్రతిసారీ మా బుద్ది ఒక అంగుళం ఎదిగినట్లు అనిపించే్ది.”

సాహిత్య అధ్యయనం తన రంగం కాదని చెప్పుకుంటూనే, తెలుగు సాహితీ విమర్శ కలకాలం గుర్తు పెట్టుకునే మెరుపువాక్యాలు, భావాలను గుప్పించిన అరుదైన కలం బాలగోపాల్‌ది. స్వయంగా జీవిత పర్యంతమూ తానెన్నుకున్న రంగంలో ఉద్యమిస్తూ కూడా “ఉద్యమాలు మానవ జీవితంలో ఎప్పుడూ ఒక చిన్న భాగం మాత్రమే. సాహిత్యం పాత్ర దానికి పరిమితం కాదు. అది జీవితమంత విస్తృతమైనది.” అనే కాంతి ప్రసారిత వాక్యాలను బాలగోపాల్ కాక మరెవ్వరు ప్రకటించగలరు?

సాహిత్యంపై ఆయన భావాలలో కొన్నింటిని మచ్చుకు ఇక్కడ చూద్దాము.

“దేనికయినా ఒక్క వాక్యంలో నిర్వచనం ఇవ్వడంలో సమస్యలున్నాయి కాని, సాహిత్యం పాత్రను ఒక్క వాక్యంలో నిర్వచించడమంటే, జీవితంలోని ఖాళీలను పూర్తి చేయడం సాహిత్యం పాత్ర అని చెప్పవచ్చు.”

“మన కళ్లముందు ఉండీ మనం చూడని, చూడజాలని విషయాలనేకం ఉంటాయి. కొన్ని భయం వల్ల చూడము. కొన్ని అభద్రత వల్ల చూడము. కొన్ని ఒక బలమైన భావజాలం ప్రభావం వల్ల మన ఎదుట ఉండీ మనకు కనిపించవు. ఒక్కొక్కసారి మనకు అలవడిన దృక్కోణం వల్లగానీ, మనం ఎంచుకున్న దృక్కోణం వల్ల గానీ, కొన్ని విషయాలు కళ్లముందే ఉండీ కనిపించవు. వీటిలో విడివిడి విషయాలే కావు. సామాజిక క్రమాలు కూడా ఉంటాయి. వీటిని మనకు చూపించడం సాహిత్యం చేసే పనులలో ఒకటి.”

“సాహిత్యాన్ని కేవలం ఉద్యమాల నేపథ్యంలో చర్చించడం పొరబాటు. ఉద్యమాలు మానవ జీవితంలో ఎప్పుడూ ఒక చిన్న భాగం మాత్రమే. సాహిత్యం పాత్ర దానికి పరిమితం కాదు. అది జీవితమంత విస్తృతమైనది.”

రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి సాహిత్య వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న మనవడు బాలగోపాల్. పాతికేళ్ల క్రితం “రూపం-సారం’ పేరిట తెలుగు సామాజిక, సాహిత్య ప్రతిఫలనాలపై ప్రచురించబడిన ఆయన రచనల సంకలనం నాటి తెలుగు సాహిత్య లోకంలో ఒక సంచలన ఘటన. వేల్చేరు నారాయణరావు గారు ఒక సందర్భంలో తొలిసారిగా ప్రస్తావించిన ‘మెరుపు వ్యాక్యాలు’ పదప్రయోగం బాలగోపాల్ రచనలల్లో పదుల సంఖ్యలో మనం చూడవచ్చు.

బాలగోపాల్ భావజాలంతో మనం ఏకీభవించవచ్చు, తిరస్కరించవచ్చు, కాని జీవిత పర్యంతమూ పౌర మానవ హక్కుల కోసం పరితపించిన వ్యక్తి సాహిత్యంపై ప్రకటించిన అభిప్రాయాలను మనం చదవడానికి ఇవేవీ అభ్యంతరాలు కాకపోవచ్చు.

బాలగోపాల్‌ జీవిత, ఉద్యమ, రచనలపై మిత్రులు రూపొందించిన అరుదైన వెబ్‌సైట్‌లో “రూపం-సారం : సాహిత్యంపై బాలగోపాల్” పుస్తకం పిడిఎఫ్ రూపంలో దొరుకుతోంది. మానవహక్కులపై తాత్విక దృక్పథం వంటి అరుదైన తన రచనలు కూడా కొన్ని ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

మనం కాలం ప్రసవించిన ఈ మేటి హక్కుల నేత వాణిని మనమూ విందామా!!!

రూపం-సారం : సాహిత్యంపై బాలగోపాల్

http://balagopal.org/wp-content/uploads/2012/01/5.RUPAM-SARAM.pdf

ఈ మేటి హక్కుల నేత చిన్నప్పుడు చందమామ వీరాభిమాని అనే విషయం ఆయన సోదరి మృణాళినిగారికి తప్ప ఆంద్రదేశంలో ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. కింది కామెంట్‌లో ఆ హృద్యమైన విషయాన్ని చూడగలరు.

 

RTS Perm Link