తొమ్మిది గంటలతోనే అంతమవుతున్న నరకం

December 18th, 2011

“ఇండియా లో సాఫ్ట్-వేర్ రంగం : where are we going?” అనే శీర్షికతో మిత్రులు బొందలపాటి ప్రసాద్ గారు రెండు రోజుల క్రితం తమ బ్లాగులో టపా ప్రచురించారు. ఎనిమిది గంటల పని తొమ్మిది గంటల పనిగా మారిన సాఫ్ట్‌వేర్ రంగంలో మారిన పరిస్థితులను 150 ఏళ్ల క్రితం కారల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రచనలో ప్రతిపాదించిన సూత్రీకరణతో అన్వయిస్తూ ప్రసాద్ గారు ఒక అర్థవంతమైన చర్చను లేవనెత్తారు.

కాస్త ఆలస్యంగా స్పందిస్తూ ఇవ్వాళ తన బ్లాగులో నేను పోస్ట్ చేసిన వ్యాఖ్యను అందరి పరిశీలన కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాను. ఇండియా లో సాఫ్ట్-వేర్ రంగం అనే ప్రసాద్ గారి పూర్తి టపా కోసం ఈ కథనం కింది లింకులో చూడండి.

మార్క్సిజం అమలులో పరిమితులుండటం గురించి చెప్పాల్సి వస్తే.. సర్వకాలాల్లోనూ, సకల సమాజాలకూ అన్వయించదగిన, అమలు చేయదగిన సర్వ సమగ్ర సంపూర్ణ సిద్ధాంతం ఈ ప్రపంచంలోనే కాదు ఏ ప్రపంచంలో కూడా సాధ్యం కాదు అన్నది బహుశా అందరికీ తెలిసిన విషయమే. మార్క్సిజం కూడా దీనికి లోబడేదే.

మార్క్స్ సైద్ధాంతిక వైధానికాన్ని రాజకీయంగా, సామాజికంగా అమలు పర్చడంలో గత శతాబ్దం పొడవునా వివిధ దేశాలలో కొనసాగిన ఆచరణ మానవ సమాజానికి కొన్ని అద్భుత ప్రయోగాలను అందించింది. కాని అదే సమయంలో విప్లవ విజయానంతరం సోషలిస్టు “రాజ్యం” ఏర్పడిన క్రమంలో దాని అన్వయంలో జరుగుతూ వచ్చిన తీవ్రమైన పొరపాట్లు ఆ సిద్ధాంతపు సమగ్ర దృక్పధంపైనే అనుమానాల నీలి నీడలు ప్రసరించడానికి అవకాశమిచ్చాయన్నది కాదనలేని సత్యం. ఈ విషయంలో ఇక్కడి చర్చలో పాల్గొన్న మిత్రుల స్పందనను తృణీకరించనవసరం లేదు.

కాని వ్యవసాయిక, చేతి ఉత్పత్తుల దశను దాటి పెట్టుబడి ఆధారిత ఉత్పత్తి విధానం సమాజ ఉనికిలోకి వచ్చి, బలపడుతున్న దశలో మార్క్స్ చేసిన సూత్రీకరణలు ఈనాటికీ మన సమాజానికి అన్వయించబడుతున్నాయా లేదా అన్నదే మన చర్చకు ప్రాతిపదిక కావాలి. ఈ విషయంలో మీరు మార్క్సిజాన్ని సాఫ్ట్‌వేర్ రంగ పరిస్థితికి అన్వయించి చెప్పిన అభిప్రాయాలు చాలా విలువైనవి.

“అప్పట్లో రోజుకి ఎనిమిది గంటలే ఆఫీసు లో ఉండేవాళ్ళం… టెక్నాలజీ పెరిగితే, పని తగ్గి మనిషి సుఖపడాలి. జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలి. మరి ఇప్పుడు సాఫ్ట్-వేర్ ఇంజినీర్లు, మునుపెన్నడూ లేనంత కష్టపడుతున్నారు. ఒత్తిడికి లోనవుతున్నారు. పని గంటలు తొమ్మిదికి పెరిగాయి.”

మీ వాక్యాలకు సంబంధించి ఒక చిన్న వివరణ. మీరు ఎనిమిది గంటల పనిని, ఇప్పుడు తొమ్మిది గంటల పనినీ, సౌకర్యాల రూపంలో ‘పార్టీలు’ పరమపదించిన పనినీ చవిచూశారు. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్‌లో భాగంగా మీ జీవితం ఇలా సాగింది సాగుతోంది.

“క్లయింట్లు కంపెనీలను పిండుతుంటే, కంపెనీలు ఉద్యోగులను పిండుతున్న” కొత్త బంగారులోకంలో ఈ తొమ్మది గంటల పని కూడా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్లపై ఎంత భౌతిక, మానసిక ఒత్తిడిని పెంచిందో మన కళ్ళముందే ఘోరాతి ఘోరాతిమైన అనుభవాలను వార్తలుగా చూస్తున్నాము. మీది షిప్టుల వారీ పని కాబట్టి నరకం మీకు తొమ్మిది గంటలతోనే అంతమవుతోంది. (మీ ఒత్తిడికి ప్రతిఫలంగా మీరు సాధారణ ఉద్యోగులు కలలో కూడా ఊహించనంత అధిక మొత్తాలను ఈ మాంద్య పరిస్థితుల్లో కూడా పొందుతూండవచ్చు.)

కాని కాల్ సెంటర్లు, డేటా ఎంట్రీ బిజినెస్‌లు, సాఫ్ట్‌వేర్ లోకలైజేషన్‌ ప్రక్రియల వంటి రంగాలలో పనిచేస్తున్న వేలాది, లక్షలాదిమంది పరిస్థితి ఏమిటి? సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ రంగం అనేది ట్రేడ్‌యూనియన్లు పెట్టుకోవడానికి వీలులేని ఆధునిక అసంఘటిత రంగం కిందికే వచ్చినప్పటికీ, సాఫ్టవేర్ ప్రోగ్రామింగ్‌పై ఆధారపడి ఉనికిలోకి వచ్చిన సాఫ్ట్‌వేర్ లోకలైజేషన్ వంటి రంగాలు అంతకంటే మించిన అమానుష పని పరిస్థితులను సృష్టిస్తున్నాయి.

ఎవరి విషయమో వద్దు. నా విషయంలోనే చూద్దాం. నేను మూడేళ్లకు ముందు భారతదేశంలో 9 ప్రాంతీయ భాషా వెబ్‌సైట్లను నడుపుతున్న ఒక ఉత్తరాది సంస్థ చెన్నయ్ శాఖలో పనిచేశాను. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి 7 గంటల వరకు అంటే 10 గంటల పాటు సాధారణ పనివేళలయితే సరిగ్గా క్లయింట్ నుంచి ఒక అర్జెంట్ పని అంటూ సరిగ్గా 7 గంటలకు హెడ్డాఫీస్ నుంచి ఈమెయిల్ వస్తుంది.

అంతకుముందు చేసిన మైక్రోసాఫ్ట్ లేదా గూగుల్, లేదా యాహో, మోటరోలా, నోకియా, రిలయెన్స్ లోకలైజేషన్ -తేలిగ్గా చెప్పాలంటే అనువాదం లేదా స్థానికీకరణ- పనులను వెంటనే మోడిపై చేసి పంపాలంటూ తాఖీదు వస్తుంది. ‘ఇట్ ఈజ్ అప్రిషియబుల్ టు డూ దిస్ వర్క్ టుడే’ అని ఇక్కడి వారి సన్నాయి నొక్కులు కూడా ఉంటాయనుకోండి. ఫలితం ఏమిటంటే పదిగంటల రోజువారీ పనికి అదనంగా ఏ రాత్రి రెండు గంటల వరకో పని పూర్తి చేసి అప్పుడు ఇంటికి వెళ్లడం లేదా అక్కడే పడుకుని తెల్లారి లేచిపోవడం. ఇలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు సంవత్సరాలు ప్రతి నెలలో ఇలా 16 గంటలు పనిచేసే అనుభవాలను పదే పదే ఎదుర్కొన్నాము మేము.

పైగా, 2005లో మైక్రోసాఫ్ట్ కంపెనీ, ప్రాంతీయ భాషల్లో లెక్సికాన్ -పదకోశం- తయారీ కోసం మా సంస్థకు ప్రాజెక్టు ఇస్తే దాంట్లో భాగంగా తెలుగులో రెండున్నర కోట్ల పదాలు, పద వ్యుత్పత్తి రూపాలు – base words and generated words – రూపొందించడానికి ఐదున్నర నెలలపాటు సెలవు కూడా తీసుకోకుండా మా తెలుగు lexicon టీమ్ పనిచేసింది. ప్రారంభంలో ఈ లెక్సికాన్ టూల్‌తో ఎలా పనిచేయాలో, సరైన రూపంలో పద వ్యుత్పత్తి రూపాలను ఎలా రూపొందించాలో తెలియక పని మందగించిపోయింది. పలితంగా చివర్లో లీవు లేకుండా పనిచేయవలసి వచ్చింది.

ఒక అరుదైన  రికార్డు సాధించామన్న పేరు రావడం.. 90 శాతం వరకు తెలుగు నామవాచక, క్రియాపదాలను ఈ టూల్‌తో ఒడిసిపట్టామన్న గర్వం మాకు మిగలడం. మా ప్రమోషన్, శాలరీ హైక్ వంటివి పెరగడానికి ఈ పని దోహదం చేయడం జరిగిందనుకోండి. తీరా చూస్తే మైక్రోసాఫ్ట్ ఈ రెండున్నర కోట్ల పదాల, పదరూపాల లెక్సికన్ ప్రాజెక్టును అటకెక్కించేసింది. వ్యక్తులుగా మాకూ, సంస్థగా మైక్రోసాప్ట్‌కూ, తెలుగు సమాజానికి కూడా ఏ రకంగా కూడా ఈ బృహత్తర పనివల్ల ప్రయోజనం లేకుండా పోయింది. ఇది వేరే విషయం. కాని మనుషులుగా మేం కోల్పోయిందేమిటి?

ఇలా మనుషులను పది గంటలపాటు, పద్నాలుగు పదహారు గంటల పాటు రొడ్డ కొట్టుడు పనిచేయిస్తే మనుషులు ఎలా మిగులుతారో, ఏమైపోతారో, వారి చుట్టూ అల్లుకున్న కుటుంబ, మానవీయ సంబంధాలు ఎలా అదృశ్యమవుతాయో చెప్పవలసిన పనిలేదు. ఇంత పని ఎవరు చేయమని చెప్పారు అని ఎవరైనా నిలదీయవచ్చు. మేం కాకపోతే మరొకరు ఈ పని చేస్తారు. ఆధునిక పెట్టుబడిదారీ విధానం కూడా తనకు అవసరమైన కార్మిక శక్తిని రిజర్వుగా పెట్టుకోవడంలో పనిచేయలేని, పని చేయనని మొరాయించే కార్మికులను తొలగించి వారి స్థానాన్ని రిజర్వు కార్మికులతో భర్తీచేయడంలో ఆరితేరిపోయింది.

పెట్టుబడిదారీ వ్యవస్థ వికసిస్తున్న కాలంలో తొలి తరం ప్యాక్టరీల్లో, గనుల్లో పిల్లలను, పెద్దలను కూడా పదహారు గంటలపాటు పనుల్లోకి దింపి యజమానులు సాగిస్తున్న అమానుష దోపిడీని బూర్జువా వర్గ ప్రతినిధులే ఖండించక తప్పని అనివార్య పరిస్థితుల్లో, పదహారు గంటల పనివిధానంలోని అమానుషత్వాన్ని బలంగా ఎత్తిచూపి 8 గంటల పనివిధానాన్ని నాటి సమాజంలో అమలుచేయాలని కోరిన వాడు కారల్ మార్క్స్. ఇది సామాజిక ఆమోదం పొంది చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎనిమిది గంటల పని విధానం 20 శతాబ్దిలో ఉనికిలోకి వచ్చింది.

కాని ఇప్పుడు జరుగుతున్నదేమిటి? సమాజం మొత్తంగా పోరాడి సాధించుకున్న 8 గంటల పనివిధానం ఇవ్వాళ తలకిందులైపోయింది. “టెక్నాలజీ పెరిగితే, పని తగ్గి మనిషి సుఖపడాలి. జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలి.” అనే మనిషి ఆశ, ఆశయం సరిగ్గా తలకిందులైపోయి ఆఫీసులో, ఇంట్లో కూడా పనిని గురించే ఆలోచించవలసిన భయానక పరిస్థితులు మనకళ్లముందే ఏర్పడిపోయాయి.

మా సీనియర్ ఒకరు మా సంస్థను వీడి అయిదేళ్ల క్రితం మరొక సాఫ్ట్‌వేర్ క్వాలిటీ ప్రాసెస్ కంపెనీకి అధిక జీతంపై ఆశతో వెళ్లారు. రెండు నెలల తర్వాత మా అందరినీ కలవాలని మా ఆఫీసుకు వచ్చారు. ఎలా ఉంటున్నారు అని అడిగితే అయిదు పనిదినాలు, రెండు వారాంతపు సెలవులు అంటూ నిట్టూర్చారు. ఎందుకీ నిట్టూర్పు అని అడిగితే వచ్చే వారం ఆఫీసులో ఎవరి కొంపలు అంటుకుపోతాయో అని శని, ఆదివారాల్లో నిద్ర కూడా పట్టడం లేదంటూ వాపోయారు. ఇలాంటి పని ఒత్తిడి, ఉద్యోగ భయాలు అందరికీ ఇదే విధంగా వర్తిస్తున్నాయని కూడా చెప్పలేము. కాని సమాజం ఎన్నటికీ కోరుకోకూడని పని పరిస్థితులు వచ్చేశాయి.

కార్మికుడి అదనపు శ్రమసమయాన్ని, విశ్రాంతి సమయాన్ని కూడా పెట్టుబడిదారుడు ఉపయోగించుకుంటున్న క్రమంలోనే పెట్టుబడి పోగు పడుతోందని మార్క్స్ అప్పట్లో సూత్రీకరించాడు. ఇది ఈరోజుకీ వాస్తవంగా ఉందా లేదా తప్పుగా నిరూపించబడిందా అనేదే మన పరిశీలనాంశంగా ఉండాలి. మార్క్స్ చెప్పినదాంట్లో మార్క్సిజంలో పరిమితులు ఉంటే ఉండనివ్వండి. ఎవరి కొంపలూ మునగవు. కాని ఈరోజు సాఫ్ట్‌వేర్ కార్మికులు -వైట్ కాలర్ ఉద్యోగులే కావచ్చు- అనుభవిస్తున్న జీవిత విషాదాన్ని, అనవసర విషాదాన్ని మార్క్స్ ఆరోజే ఉత్పత్తి క్రమంలో పని పరిస్థితుల పునాదిగా ఊహించాడు. ఇది ఈనాటికీ నిరూపితమవుతున్న సత్యం.

మా పక్కవీధిలోని చాకలాయన రోజూ ఉదయం 7 గంటలకు కొట్టు తెరిచి సాయంత్రం 6 వరకు పనిచేస్తాడు. అది కూడా గొడ్డు చాకిరీయే అనుకోండి. తనకోసం, తన జీవిక కోసం ఆ గొడ్డుచాకిరీకి తలవంచే ఆయన సరిగ్గా రాత్రి 8 గంటలయ్యేసరికి భోజనం ముగించుకుని కొట్టు ముందు బల్లమీదే పడుకుని ఆదమరిచి నిద్రపోతుంటాడు. పదే పదే ఈ సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు నాకు స్పురించేదొకటే. చీకూచింతా లేని ఈ చాకలాయన జీవితం గొప్పా లేదా ధనసంపాదన పేరుతో, బతకాలంటే పరుగుపందెం తీయక తప్పదనుకుంటూ ఒళ్లూ, మనసూ కూడా హూనం చేసుకుంటున్న మనలాంటి వారి జీవితం గొప్పా అని.

అమెరికా వాడో లేదా ఏ ఇతర ఔట్ సోర్సింగ్ దేశమో మీకు, నాకు పని అప్పగించి నిద్రపోతాడు. మనం నిద్రమానుకుని పనిచేసి వాడికి అప్పగించి తర్వాత పగటి పూట నిద్రపోతాము. ఇది నిజంగా ‘రాక్షస’ పని. మానవ శారీరక, సహజ ప్రక్రియలకు భిన్నమైన పనిపద్ధతులకు మనం అలవడుతున్నాము. చివరకు ఎవరికోసం అంటే మనకోసం కాదు. ఎవడికోసమో మన జీవితంలో ప్రకృతి సహజమైన నిద్రాసమయాన్ని ధ్వంసం చేసుకుని భార్య పగలూ, భర్త రాత్రీ పనిచేసే పరిస్థితుల్లో కూరుకుపోతున్నాము. సింపుల్‌గా చెప్పాలంటే చాకలాయన నేటికీ తన కోసం మాత్రమే తన పనిచేసుకుపోతున్నాడు. మనం వ్యాపారుల కోసం, కంపెనీల కోసం పనిచేస్తూ జీవితం నుంచి పరాయీకరణ పాలవుతున్నాము.

“….in proportion as the use of machinery and division of labour increases, in the same proportion the burden of toil also increases, whether by prolongation of the working hours, by the increase of the work exacted in a given time or by increased speed of machinery, etc”

అందుకే మార్క్సిజంలోని పరిమితులను మనం తప్పక పరిశీలిద్దాము. కాని శ్రమవిభజన లక్షోపలక్షలుగా విస్తరించుకు పోతున్న క్రమంలో మనుషుల మీద పడుతున్న అనంత భారం గురించి మార్క్స్ నూటయాభై ఏళ్ల క్రితం కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో చెప్పిన పై మంత్ర సదృశ వాక్యాలలోని సత్యాన్ని కూడా అంగీకరిద్దాము. దీనికి పరిష్కారాన్ని వెదికే క్రమంలోనే మనం విభేదించవచ్చు.

వ్యవసాయం గిట్టుబాటవుతున్న పరిస్థితులు ముప్పయ్యేళ్లకు ముందున్న విధంగా నేడు కూడా కొనసాగుతున్నట్లయితే నేను పల్లె విడిచి మహానగరాల దారి పట్టి ఉండేవాడిని కాదనుకుంటాను. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అనుభవంతో చెబుతున్నాను. కరెంట్ సక్రమంగా అంది, నీటి వనరులు సక్రమంగా లభ్యమై, కాసింత గిట్టుబాటు ధరలకు గ్యారంటీ ఇచ్చే పరిస్థితులు పల్లెల్లో ఇప్పటికీ ఉంటే, నీ పంట నువ్వు పండించుకుని నీ కూరగాయలు నీవు పండించుకుని బతికే వ్యవసాయం కంటే గౌరవనీయమైన వృత్తి ఈ ప్రపంచంలో మరొకటుండదనే నా దృఢాభిప్రాయం.

కాని పైన చెప్పిన వాటిలో వేటికీ గ్యారంటీ కనబడని రోజుల్లో మా పెద్దవాళ్లు ‘సేద్యంతో బతకలేరు పోయి చదువుకోండిరా’ అని పట్టణాలకు తరిమారు. వ్యవసాయ రంగ దుస్థితిపై వాళ్ల అంచనా ఎంత సత్యభూయిష్టమైందో మనందరికీ తెలుస్తూనే ఉంది. అందుకే మనం ఇప్పుడిలా బతుకుతున్నాము.

బతకాల్సి వస్తోంది అంటే ఇంకా బాగుంటుందేమో..

ఈ టపాకు మూలమైన పూర్తి కథనంకోసం కింది లింకులో చూడగలరు.

ఇండియా లో సాఫ్ట్-వేర్ రంగం : where are we going?

RTS Perm Link