అంపశయ్య మీద ఉన్న బాలసాహిత్యాన్ని రక్షించుకుందామా!!!

December 14th, 2011

ప్రియ మిత్రులకు అభివందనాలు,

మీకు భుజాన భేతాళుడిని చురకత్తిలాంటి చూపులతో మెలితిరిగిన కోరమీసంతో గంభీరంగా స్మశానంలోనుండి నడిచివెళ్తున్న విక్రమార్కుడు గుర్తున్నాడా?

మీకు ఒంటికన్ను రాక్షసుడు, అతనితో సాహసోపేతంగా యుద్ధం చేసి రాజకుమారిని ఆమె రాజ్యానికి తీసుకుని వస్తున్న సాహస వీరుడు గుర్తున్నాడా?

పోనీ మీకు మెలితిరిగిన తోకతో చూడగానే భయపెట్టేలా కాక ముద్దుగ అనిపిస్తూ, చెడ్డ అత్తగారి భరతం పట్టి మంచి కోడలికి సహాయం చేసిన అందమైన దెయ్యాలు గుర్తున్నాయా?

వీటిలో ఏ ఒక్కటి గుర్తున్నా మీరు చిన్నప్పుడు నాలాగనే ఖచ్చితంగా ఏ చందమామనో, బొమ్మరిల్లునో పదిలంగా దాచుకుని చదివిన అదృష్టవంతులు అయ్యి ఉంటారు. మరి మన ముందు తరం సంగతో ఇప్పటి పిల్లలకు బాల సాహిత్యం అంటే హ్యారీ పాటర్, టింటిన్, సిండ్రెల్లా మరోటో మరోటో మనది కాని సాహిత్యమే కానీ మనము గ్రోలిన రుచులు వారికేవి?

మంచి దెయ్యాల గురించి, సాహస వీరుల గురించి, భేతాళుడి గురించి వారికి తెలిసే అవకాశం ఎంత ఉంది, ఆ అవకాశం వారికి మనం ఎంతవరకూ ఇస్తున్నాము ఇంగ్లీషులో చదివితే గ్లోబల్ మార్కెట్ లో విలువ పెరుగుతుంది, నిజమే కానీ తెలుగులో అదీ వారి మాతృభాషలో అందమైన కథలున్నాయి, వాటిలో నీతితో పాటు బ్రతుకు మార్గాలు ఉంటాయని కానీ అసలు తెలుగులో కథలు ఇంత బాగుంటాయి అన్న అనుభవం కానీ వారికి మిగులుస్తున్నామా?

నా దృష్టిలో ఈ తరం పిల్లలు అత్యంత దురదృష్టవంతులు, మాతృ భాషలో మాట్లడటమే మహాపరాధంగా భావించే తల్లితండ్రులు, బడి యాజమాన్యాలు ఒకవైపైతే, మనసుని కట్టిపడేసే బాల సాహిత్యం అందుబాటులో లేకపోవటం మరొకవైపు. ఇప్పటి తరానికి ఆ లోటు ని పూడ్చటానికీ, ఆనాటి రుచులని అందించటానికి మొక్కవోని దీక్షతో నడుము కట్టారు రచన పత్రిక నిర్వాహకులు శాయి గారు.

ఈ బృహత్కార్యంలో భాగంగా ఆయన దాసరి సుబ్రమణ్యంగారు ఒకప్పుడు యువ, బొమ్మరిల్లు పత్రికలకోసం రచించిన అగ్ని మాల, మృత్యులోయ సీరియల్స్‌ను విడి సంపుటాలుగా ఈ యేడాది మొదట్లో మన ముందుకు తెచ్చారు. ఈ సారి అప్పట్లో ప్రమోద పిల్లల కథలో వచ్చిన కపాల దుర్గం సీరియల్ వచ్చే జనవరి నాటికి ప్రచురించబోతున్నారు.  అలాగే దాసరిగారు చందమామకు కాకుండా ఇతర పత్రికలలో రాసిన మరొక ఇరవై సీరియల్స్ ను లభ్యత మేరకు మన ముందుకు తెచ్చే మెగా ప్రాజెక్టు కు సిద్ధ పడ్డారు.

ఈ బృహత్కార్యం లో ఆయనకు తెలుగు భాష మీద బాల సాహిత్యం మీద మక్కువ ఉన్న అభిమానుల అండదండల అవసరం చాలా ఉంది. మనం చేసే ఏ చిన్న సహాయమైనా చాలా విలువైనదే.

మీకు వీలున్నంత వరకూ ఎంత చిన్న ఆర్ధిక సహయమైనా సరే అది మనం ఒక రోజు ఆటో ఎక్కితే ఖర్చయ్యేంత చిన్నదైనా, ఒక రోజు ఏ పిజా హట్ కో వెళ్ళి సంబరాలు జరుపుకున్నంత పెద్దదైనా, మీకు తోచిన సహాయం అందించి ఈ కార్యాన్ని విజయవంతం చేయండి. బాల సాహిత్యాన్ని బ్రతికించండి.

ఈ లేఖని చదివి చెత్త బుట్ట లో కి నెట్టివేయకుండా మీకు తెలిసిన నలుగురు మిత్రులకి పంపండి. మనం నిత్యం ఎన్నో స్పాం లేఖలని పేరు పేరునా ఎందరో మితృలకి పంపుతాము, దానివల్ల ప్రయోజనం ఉన్నా లేకపోయినా. ఈ లేఖ చదివి ఏ కొంతమంది స్పందించినా మన భావి తరానికి చక్కటి సాహిత్యాన్ని వారు జీవితాంతం గుర్తుపెట్టుకునేలా బహుమతిగా అందించిన వారము అవుతాము. ఆసక్తి ఉన్నవారు వాహిని బుక్ ట్రస్ట్ (vahini book trust)పేరిట చెక్ పంపించగలరు

స్పందించిన ప్రతివారికీ ముందస్తుగానే కృతజ్ఞతలు తెలుపుతూ

మీ నేస్తం
సాయి లక్ష్మి కోరాడ.

నేనెవరు

నేను వృత్తిరీత్యా సాంకేతిక నిపుణురాలిని, ప్రవృత్తి రీత్యా పుస్తకాభిమానిని, స్వస్థలం భాగ్యనగరం. నాతరం పిల్లలు చాలా మందిలాగానే తెలుగులో పుట్టి, పదవ తరగతి వరకూ తెలుగు మాధ్యమంలో చదివి, ఆ తెలుగు తీయతనానికి ముగ్ధురాలినై తెలుగు సాహిత్యం మీద మక్కువ పెంచుకున్న సామాన్యురాలిని. తెలుగులో ఉత్తమ సాహిత్యం కరువైపోతోంది అని బాధపడుతూ కూర్చోకుండా నాకు చేతనైనంతలో ఏదైనా చేయాలి అని తాపత్రయ పడుతున్న పాఠకురాలిని, అంతే.

 

(“నాతరం పిల్లలు చాలా మందిలాగానే తెలుగులో పుట్టి, పదవ తరగతి వరకూ తెలుగు మాధ్యమంలో చదివి, ఆ తెలుగు తీయతనానికి ముగ్ధురాలినై తెలుగు సాహిత్యం మీద మక్కువ పెంచుకున్న సామాన్యురాలిని.”

సాయి లక్ష్మి గారూ,

తెలుగును, బాలసాహిత్యాన్ని కలకాలం బతికించే చిన్ని మాటలండీ ఇవి.

చందమామ పట్ల, ఉత్తమ సాహిత్యం పట్ల మీ అభిమానం, ఆదరణ కొనసాగుతుందని, ఇలాగే కొనసాగాలని మనసారా కాంక్షిస్తూ..

మీకూ, మిత్రులకూ హృదయపూర్వక కృతజ్ఞతలు.

రాజు)

రచన శాయి గారి చిరునామా, ఈమెయిల్, ఫోన్

Y.V.S.R.N. Talpa Sai
Rachana magazine
1-9-286/2/p
yadlapati vari illu
vidyanagar,
near to Ramnagar Gundu
hyderabad – 500044
040-27071500
040-27077599
99485 77517

Emails

rachanapatrika@gmail.com
rachanapatrika@hotmail.com

www.rachana.net

Vahini book trust, 1-9-286/3, Vidya Nagar, Hyderabad -500044

NB: ఈ కథనం ఈ బ్లాగులో ప్రచురించడానికి వెనుక నేపథ్యం గురించి కామెంట్ విభాగంలో చూడగలరు.

పెద్ద గమనిక: ఈ ఏడాది జనవరిలో దాసరి సుబ్రహ్మణ్యం గారి మృత్యులోయ, అగ్నిమాల, దాసరి గారి కథల సంపుటికి స్వచ్చందంగా ఆయన ఆభిమానులు తమ శక్తి మేరకు తోడ్పాటు నందించారు. ఈ ప్రకటన వీరికి సంబంధించినది కాదు. గతంలో తోడ్పాటు నందించిన వారిపై మళ్లీ భారం పెట్టడం తగదని శాయిగారి దృఢాభిప్రాయం.  వారు మినహా ఇతర బాల సాహిత్య అభిమానులకు మాత్రమే ఈ ప్రకటన వర్తిస్తుందని తెలియపరుస్తున్నాము.

రచనపై, శాయిగారిపై పడుతున్న అదనపు బారాన్ని కొంచెం తగ్గించినా చాలు అన్నదే ఈ ప్రకటన ఉద్దేశం.

 

RTS Perm Link

జానపద కథా వైశంపాయనుడు దాసరి పుస్తకావిష్కరణ

January 30th, 2011

హైదరాబాద్‌ సిటీ సెంట్రల్ లైబ్రరీ సమావేశ మందిరంలో జనవరి 27 సాయంత్రం జరిగిన  దాసరి సుబ్రహ్మణ్యం గారి 3 పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతానికి ఇక్కడ చూడగలరు.  సాధారణ పాఠకుల కంటే కథకులు, రచయితలు, ప్రచురణకర్తలే అధికంగా పాల్గొన్న ఈ సభలో, చందమామ సీరియల్స్  రచయిత, జానపద కథా వైశంపాయనుడు దాసరి గారు నాలుగు దశాబ్దాల క్రితం బొమ్మరిల్లు, యువ మాసపత్రికలలో రాసిన  రెండు అపరూప సీరియల్స్‌ని, ఆయన రాసిన 40 ఇతర కథలను కలిపి మూడు పుస్తకాలుగా వాహినీ బుక్ ట్రస్ట్ ప్రచురించింది.

ఎవరు లేకుంటే నేటి తరం పాఠకులకు కూడా అలనాటి జానపద సీరియల్స్ చదివే అవకాశం, చందమామ వైభవోజ్వల చరిత్రను తెలుసుకునే అవకాశం ఉండేది కాదో ఆ మంచి మనిషి రచన పత్రిక సంపాదకులు శ్రీ శాయిగారు,  ఆయనకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ఈ బృహత్ యజ్ఞంలో తనదైన పాత్ర వహిస్తున్న శ్రీ దాసరి వెంకటరమణ గారు పది మంది మాట, చేత సాయంతో తీసుకువచ్చిన అరుదైన పుస్తకాలివి.

ప్రపంచం ఇంతగా ఎదగని మంచి కాలంలో విలసిల్లిన మన కథా సాంస్కృతిక వైభవాన్ని మళ్లీ మనముందు ఆవిష్కరించడానికి వీరు చేసిన ప్రయత్నాలు, ఉడతాభక్తిగా ఈ గొప్ప కృషిలో తలొక పాలు పంచుకున్న మాన్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతాభివందనలు.

ఈ పుస్తకావిష్కరణ ఫోటోలను చూడటానికి ముందు చందమామ అభిమాని, మనసులో మాటలు పదిమందితో పంచుకునే సుజాత గారు హృద్యంగా తెలిపిన ఈ సభ విశేషాలను క్లుప్తంగా కింది లింకులో చూడగలరు.

వచ్చేశాయి…అద్భుత జానపద నవలలు !

http://manishi-manasulomaata.blogspot.com/2011/01/blog-post_28.html

ఒకే ఒక్క మాట. ఈ పుస్తకాలను కొని చదవకపోతే, మన పిల్లలకు, ముందుతరాల వారికి చెప్పి, చూపి చదివించకపోతే మన ఒకనాటి కథా సంస్కృతికి దూరంగా ఉన్నట్లే. తెలుగు జనపదాలలో పుట్టి పెరిగిన కథ విశ్వరూపాన్ని మనం దాసరి గారి ఈ రెండు సీరియల్స్ -మృత్యులోయ,  అగ్నిమాల- లో సమగ్రంగా దర్శించగలం.

మృత్యులోయ – బొమ్మరిల్లు పత్రికలో 39 నెలల పాటు వచ్చిన పెద్ద సీరియల్

అగ్నిమాల – చక్రపాణి గారి కోరిక మేరకు దాసరి సుబ్రహ్మణ్యం గారు యువ మాసపత్రికలో రాసిన     మహోజ్వల జానపద నవల

దాసరి సుబ్రహ్మణ్యం కథలు – విలక్షణ కథాంశాలు, అసాధారణ శిల్పం, సజీవమైన పాత్రల మేలుకలయికతో జీవితపు పలు పార్శ్వాల్ని తడిమి మనసులను చెమ్మగిల్లజేసే ఆధునిక కథలు

ఈ మూడు పుస్తకాల వెల రూ. 360 మాత్రమే.  ప్రజల కొనుగోలు శక్తి కునారిల్లుతున్న పాడుకాలంలో ఇంత వెలపెట్టి పుస్తకాలు కొనే శక్తి మనలో చాలామందికి లేకపోవచ్చు.

కాని లాభాపేక్ష అనేది లేశమాత్రంగా కూడా లేని శాయి గారు పది కాలాల పాటు మళ్లీ మళ్లీ ఇలాంటి అరుదైన పుస్తకాలను మనకు అందించాలంటే మనం పుస్తకాలను తప్పక తీసుకోవలసిందే. ఇంతకు మించి ఒక్క మాట అదనంగా చెప్పినా ఇక అతిశయోక్తిగానే ఉంటుంది. ఈ పుస్తకం ప్రచురణ ఖర్చులయినా వస్తే దాసరి గారి మరి కొన్ని సీరియల్స్‌ ప్రచురణ భారాన్ని తలకెత్తుకుంటానని శాయిగారు సభలోనే చెప్పారు కూడా.

దయచేసి ఈ పుస్తకాలను కొనండి. మంచి ప్రయత్నాన్ని ఆదరించండి.

ఈ మూడు పుస్తకాలూ దొరకు చోటు

వాహినీ బుక్ ట్రస్ట్,
1-9-286/పి/2విద్యా నగర్
హైదరాబాదు

ఫోన్ :040-27071500

మొబైల్: 09948577517 (‘రచన’ శాయి గారి సెల్‌ఫోన్)

వీలైనంత త్వరలో ఈ ఆవిష్కరణ సభ గురించి మరికొన్ని వివరాలను ఇక్కడే తెలుసుకుందాము.

ఇక సభలో తీసిన కొన్ని పోటోలను అందినమేరకు ఇక్కడ చూద్దాం.

దాసరి సుబ్రహ్మణ్యం గారు

బొమ్మరిల్లు సీరియల్

మృత్యులోయ వెనుకపేజీ

మృత్యులోయ ఇన్నర్ కవర్

మృత్యులోయ ఇన్నర్ కవర్

అగ్నిమాల - యువ సీరియల్

అగ్నిమాల వెనుకపేజీ

దాసరి కథలు కవర్ పేజీ

ఆవిష్కరణ సభలో దాసరి గారి రచనల ప్రదర్శన

భాగ్యనగరి సిటీ సెంట్రల్ లైబ్రరీ హాల్‌లో గోడ బొమ్మలు

శ్రీ విజయబాపినీడు, శ్రీ దాసరి వెంకటరమణ, శ్రీ సురేష్ - మంచిపుస్తకం ఫేమ్

శ్రీ దాసరి వెంకట రమణ

చందమామ ఫ్యామిలీ

సభకు విచ్చేసిన వారిలో కొందరు మాన్యులు

దాసరి గారి మూడు పుస్తకాల గురించి ఇక ఏమీ చెప్పనవసరం లేదు. ప్లీజ్… కొని చదవండి. మీ పిల్లలచేత చదివించండి.  వాళ్లకు  చదివే సమయం అంటూ ఉంటే…..

(దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్థంతి మరియు పుస్తకావిష్కరణకు చెందిన ఫోటోలు, పుస్తకాల కవర్ పేజీ బొమ్మలు సకాలంలో పంపిన రచన శాయి గారికి, దాసరి వెంకట రమణ గారికి కృతజ్ఞతలు)

రాజు

చందమామ

RTS Perm Link

దాసరి సుబ్రహ్మణ్యంగారి అరుదైన జీవిత రికార్డు

January 24th, 2011

54 ఏళ్లు ఇక్కడే ఉన్నారు.

చందమామ సీరియల్స్ ద్వారా అయిదారు దశాబ్దాలుగా లక్షలాది పాఠకులను ఉర్రూతలూగిస్తూ వచ్చిన మాన్యులు దాసరి సుబ్రహ్మణ్యం గారి వ్యక్తిగత జీవితం కూడా పరమ సాధారణ స్థితిలో దాదాపు అజ్ఞాతంగా ఎటువంటి పటాటోపాలు లేకుండా కొనసాగింది. 1952 నుండి 2006 వరకు 54 ఏళ్లపాటు అనితర సాధ్యమైన విధంగా చందమామలో పనిచేసిన దాసరి గారు చివరకు వ్యక్తిగత జీవితాన్ని కూడా సుదీర్ఘకాలం పాటు ఒకే అద్దె ఇంటిలో గడపడం చారిత్రక విశేషం. ఇలా వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఒకే స్థలంలో అయిదు దశాబ్దాలపైబడి కొనసాగించడం బహుశా ప్రపంచంలో ఎవరికీ సాధ్యమయ్యే పని కాకపోవచ్చు. వృత్తి జీవితంలో చందమామ చిత్రమాంత్రికుడు శంకర్ గారు మాత్రమే ఇందుకు సంబంధించి మినహాయింపుగా ఉంటారు. ఈయన కూడా 1952 చివరినుంచి ఈ నాటి వరకు అంటే దాదాపు 58 ఏళ్లపాటు చందమామలోనే పనిచేస్తున్నారు. కాని నివాసం విషయంలో చాలా స్థలాలు మారారు.

జానపద కథా మాంత్రికుడు

చందమామలో 1952 నుంచి 1980 దాకా నిరవధికంగా జగత్ప్రసిద్ధమైన 12 సీరియల్స్ -తోకచుక్క, రాతిరథం, జ్వాలాద్వీపం, పాతాళదుర్గం, మకరదేవత, శిథిలాలయం, రాకాసిలోయ, భల్లూకమాంత్రికుడు వంటివి- రాసి చందమామ సర్క్యులేషన్‌‍ని అమాంతంగా పెంచిన ఘనత దాసరి గారి సొంతం.  అయితే ఆయన రాసిన జానపద ధారావాహికల మంత్రజగత్తులో ఉర్రూతలూగిన లక్షలాది మంది పాఠకులలో నూటికి 99 మందికి, చివరకు చందమామ రచయితలకు కూడా చందమామ సీరియల్స్ రచయిత ఎవరో ఇటీవలివరకు తెలియదంటే నమ్మశక్యం కాదు. చందమామ పత్రిక తన ఉద్యోగుల వ్యక్తిగత, వృత్తిగత జీవితంపై విధించిన అలిఖిత అజ్ఞాతవాసం అంత పటిష్టంగా కొనసాగింది మరి.

దాసరిగారి అద్దె ఇంటి నడవా

ఆయన ఆనారోగ్యంతో 2006లో విజయవాడలో బంధువుల ఇంటికి వెళ్లినప్పటికీ, 2009 వరకు పాఠకులు ఆయన పేరుతోటే ఉత్తరాలు, రచనలు పంపుతూ వచ్చిన ఉదంతమే ఇందుకు తిరుగులేని సాక్ష్యం. చివరకు తన వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన అయిదు దశాబ్దాలకు పైగా ఒకే ఇంటిలో నివసించిన విషయం ఇటీవల వరకు ఎవరికీ తెలీదు. గత 54 ఏళ్లుగా ఎలాంటి మరమ్మతులు లేని స్థితిలో,  చెన్నయ్ మహానగరంలో,  ‘భూతాల’ నిలయం వంటి పురాతన భవనంలోని ఒక ఇరుకైన గదిలో ఆయన జీవించారు. భూతాల నిలయం అనే పదం ఇక్కడ ప్రతీకగా వాడవచ్చు కాని, ఆ భవంతిలో ఈనాటికీ దాసరి గారితో దశాబ్దాల అనుబంధాన్ని పెంచుకుంటూ వచ్చిన సాధారణ మనుషులు జీవిస్తున్నారు.

ఈ 7వ నంబర్ ఇల్లే ఆయన జానపద నివాసం

చెన్నయ్‌లోని వడపళనిలో పాత చందమామ భవంతికి కూతవేటు దూరంలోని సుప్రసిద్ధమైన మురుగన్ కోయిల్ స్ట్రీట్‌లో కిందా పైనా 12 గదులు ఉన్న ఒక పాడుబడిన అపార్ట్‌మెంట్‌లో 7వ నంబర్ గదిలో దాసరి గారు దశాబ్దాలుగా అద్దెకు ఉంటూ వచ్చారు. విజయ వాహినీ స్టూడియోలోని పాత చందమామ భవంతి ఇప్పుడు లేదు. చందమామ వైభవోజ్వల శకానికి సాక్షీభూతంగా నిలిచి అయిదెకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన చందమామ భవంతి ఇప్పుడు చరిత్రలో కలిసిపోయింది. అక్కడినుంచి చందమామ కార్యాలయం చెన్నయ్ లోని ఈక్కాండి తాంగల్ -గిండీ-, జెఎల్ ప్లాజా -తేనాంపేట-, చిన్న నీలాంగరై -తిరువాన్మయూర్ అవతల- ప్రాంతాలకు వలసపోయింది.

దాసరి గారి ఇంటికి ఎడమవైపున చందమామ కార్యాలయ భవంతి

భూమి గుండ్రంగా ఉన్న చందాన 2010 మేలో చందమామ పాతభవంతికి సమీప ప్రాంతానికే చందమామ ఎడిటోరియల్ ఆఫీసు మళ్లీ వచ్చి చేరింది. చిత్రమో, యాదృచ్ఛికమో గాని దాసరి గారు 54 ఏళ్లపాటు నివసించిన ఆ పాత ఇంటికి సరిగ్గా వెనుకవైపు భవంతి -స్వాతి ఎన్‌క్లేవ్ 5-6 నంబర్లు-లోనే ప్రస్తుతం చందమామ కార్యాలయం ఉంది. దాసరి గారు వడపళని ప్రాంతంలోనే ఉండేవారని చూచాయగా తెలుసు కాని నిర్దిష్టంగా ఎక్కడ ఉండేదీ అంతవరకు నాకు తెలీదు.

మురుగన్ కోయిల్ స్ట్రీట్‌లో స్వాతి ఎన్‌క్లేవ్ భవంతిలోకి -2A- వచ్చి చేరిన మూడు నెలలకు చందమామలో ప్యాకింగ్ విభాగంలో పనిచేస్తున్న రవి ఒక రోజు ఆఫీసు బయట పిచ్చాపాటిగా మాట్లాడుతూ ‘తాతా సర్ మొదటినుంచి ఉంటూవచ్చిన ఇల్లు ఇదే సార్’ అని చూపించారు. దాసరి గారిని చందమామ సిబ్బంది మొదటి నుంచి ‘తాతా సర్’ అని పిలుస్తూ వచ్చారు. సరిగ్గా దాసరి గారి ఇంటి వెనుకవైపు చందమామ ఆఫీసు ఉంది. నాకయితే రవి ఈ విషయం చెప్పాక షాక్ అయింది. ‘ఏమిటి ఇంత పాడుబడిన భవంతి’ అని చాలా సార్లు అనుకున్నాను గాని, ఆయన దశాబ్దాలుగా గడిపిన ఇంటిపక్కకు మేం వచ్చామని సూచన ప్రాయంగా కూడా తట్టలేదు.

అరుదైన చరిత్రకు నిలయంగా మారిన ఆ ఇంటిని పోటోలు తీయాలని, ఇంటిముందుకు వెళ్లి ఆయన వివరాలు తెలుసుకోవాలని అనుకున్నా అది ఆచరణలో సాధ్యపడేందుకు మరో మూడునెలలు పట్టింది. ఈ శుక్రవారం -17-12-2010- సాయంత్రం చందమామ కొల్లీగ్ వద్ద 3 మెగా పిక్సెల్ మొబైల్ తీసుకుని రవి సాయంతో ఆ ఇంటికి వెళ్లాము.

దాసరి గారు – చెన్నయ్ అద్దె ఇల్లు
రచన జూన్ సంచికలో ‘చెట్టెక్కిన బేతాళుడు’ పేరుతో నాయుని కృష్ణమూర్తిగారు, దాసరి గారితో, ఆయన అద్దె ఇంటితో తన పరిచయాన్ని సమగ్రంగా వివరించారు. ఆయన 1974లో బొమ్మరిల్లు పత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న కాలంలో ఓ రోజు సంపాదకులు విజయబాపినీడు గారు చెన్నయ్‌లో ఒక పెద్దాయనను కలిసి ఆయన ఇచ్చే కొన్ని కాగితాలు తీసుకురావాలని చెప్పారు. (చందమామలో పనిచేస్తున్నప్పుడు, కొత్తగా ప్రారంభించబడిన బొమ్మరిల్లుకు ప్రోత్సాహం అందించాలన్న ఆలోచనతో దాసరి గారు ‘మృత్యులోయ’ జానపద సీరియల్‌ని ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో రాసి బాపినీడుగారికి పంపేవారు.)  ఆ ప్రకారం ఆ చిరునామాకు వెళ్లిన నాయుని గారు దాసరి గారిని కలిసిన ఆ ప్రథమ సమావేశపు సన్నివేశాన్ని ఇలా వర్ణించారు. విషయ విస్తరణ రీత్యా రచన జూన్ సంచికలో వచ్చిన ఈ భాగాన్ని కుదించి ఇక్కడ పొందుపర్చడమైంది.

వడపళనిలో మురుగన్ కోయిల్ ఉంది. అది తెలీని మద్రాసీయులు ఎవరూ ఉండరు. గుడికి డెబ్బై, ఎనభై మీటర్ల ముందు ఒక అడ్డరోడ్డు ఉండేది. అది చందమామ బిల్డింగు -విజయావారి పాత బిల్డింగ్- కు వెళ్లే వైపు కుడిపక్కన ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు ముందు బారుగా లోపలికి చిన్న చిన్న ఇళ్లు పదో, పన్నెండో ఉంటాయి. వీటిల్లో నేను వెళ్లవలసిన ఇంటికి సాయంకాలం ఏడున్నరకు వెళ్లాను -7వ నెంబర్ ఇల్లు- తాళం వేసుంది మళ్లీ రోడ్డు మీదికి వెళ్లి నిలబడ్డాను.

ఎనిమిదన్నర తర్వాత గుడి ఎదురు రోడ్డు క్రాస్ మీదనుండి వస్తున్న ఒకతను కనిపించాడు. ఏదో ఆలోచిస్తూ, అప్పుడప్పుడూ, తల పక్కకు తిప్పి చూస్తూ, ఆగి ఆగి సిగిరెట్టు కాలుస్తూ వస్తున్న వ్యక్తి. ఆయన నాకేసి చూసినప్పుడు ‘సుబ్రహ్మణ్యం గారికోసమండీ ఆ యింట్లో ఉంటారు’ అంటూ మధ్యలో కొన్ని ఇళ్లవైపు చేయి చూపిస్తూ అన్నాను. ‘ఎక్కణ్ణుంచి వస్తున్నారు’ అనడిగితే విజయబాపినీడు గారు పంపారని చెప్పాను. ‘రండి’ అని ఆయన ముందుకు దారితీసి తన గది ముందు ఆగి జేబులోంచి తాళంచెవి తీసి తలుపులు తెరిచారు. ‘ఉండండి,’ అంటూ చీకట్లో తనొక్కడే లోపలికి వెళ్లి ఏదో స్విచ్ నొక్కాడు. ముందు గదిలో వెలుగులు పరుచుకున్నాయి.

దాన్ని గది అనొచ్చునా, అనకూడదా అన్న మీమాంస క్షణంలో ఏర్పడింది. బాగా పొడవైన అగ్గిపెట్టె అడ్డంగా పెట్టినట్లు ఉంది ఆ గది. వెడల్పు అయిదడుగులకు మించి ఉండదు. పొడవు 12-15 అడుగుల మధ్య ఉండొచ్చు. కుడి వైపు  మూడడుగుల వెడల్పుతో లోపలికి ఒక దోవ ఉంది. ఆ మధ్యలోనే ఎడం వైపు ఒక గది ఉన్నట్లు తలుపులు వేసి ఉన్నాయి. బాగా వెనుకవైపు పెరడు అని చూస్తూనే తెలిసి పోతోంది. ముందు అయిదడుగుల వెడల్పు గదిలోనే బుక్ షెల్వ్స్ ఉన్నాయి. ఆయన కూర్చోవడానికి ఒక కుర్చీ ఉంది. ముందు తలుపుకు దగ్గరగా, లోపలకు వెళ్లే సందు ముందు వచ్చిన వాళ్లు కూర్చోవడానికి ఒక కుర్చీ, ఒక స్టూలు ఉన్నాయి.”

దాదాపు 35 ఏళ్ల క్రితం తాను చూసిన దాసరిగారి అద్దె ఇంటిని పొల్లుపోనంత నిర్దిష్టంగా వర్ణించిన నాయుని గారి జ్ఞాపకశక్తికి ఈ సందర్భంగా అందరం జేజేలు పలకాలి. ఆ ఇల్లూ, పరిసరాలూ ఈనాటికీ దాదాపు అలాగే ఉన్నాయి. వడపళని క్రాస్‌కి సమీపంగా నూరడుగుల రోడ్డులో -బీమాస్ హోటల్ వద్ద కలిసే- ఆ అడ్డరోడ్డు మాత్రమే కాస్త మెరుగయి ఉండవచ్చు.

నాయుని గారు ఆ కథనంలో వర్ణించిన తీరుకంటే మరింత ఘోరంగా ఆ ఇల్లు ఉందనిపించింది. అరవై, డెబ్బై ఏళ్లక్రితం కట్టిన ఆ భవంతిలో వర్షం వచ్చిందంటే చాలు, ముంగిట్లో నీరు వరద కడుతుంది. చెన్నయ్ లోని చాలా పాత ఇళ్లలో ఇదే పరిస్థితి. ఇంటి మట్టం కంటే రోడ్డు మట్టమే ఎత్తులో ఉన్న స్థితిలో కాస్త వర్షం పడిందంటే ఇంట్లోకి వెళ్లే దారిలో మడమలపైకి నీరు చేరుతుంది. ఈ నీళ్లు ఎటూ పోలేక నిలవ ఉండిపోయి భయంకరమైన వాసన వేస్తుంటుంది. ఆ నీళ్లలోనే కాళ్లు తడుపుతూ ఇరుకు దారి గుండా లోపలికి వెళితే అక్కడ పరిచయమైన ఇద్దరమ్మల సహాయంతో దాసరిగారు ఈ భవంతి చివరలో ఉన్న 7వ నెంబర్ గదిని చూడటం జరిగింది.

ఇద్దరమ్మలు మనవాళమ్మ, గౌరి

మార్వాడీల యాజమాన్యంలో ఉండే ఆ పాత భవంతిలో దాసరి గారు 1952 నుంచి 2006 వరకు 54 ఏళ్ల వరకు ఇక్కడి గ్రౌండ్ ప్లోర్ లోని లోని 7వ నంబర్ గదిలోనే నివసిస్తూ వచ్చారు. అనారోగ్య కారణాలతో ఇక్కడి నుంచే ఆయన 2006లో విజయవాడలోకి బంధువుల ఇంటికి వెళ్లారు. దీంట్లో మొత్తం 12 ఇళ్లు ఉంటున్నాయి., వీటిలో తెలుగు ఫ్యామిలీలే ఎక్కువ. చందమామలో గతంలో కన్నడ విభాగంలో పనిచేసిన పద్మనాభన్ బాబు, ఆయన భార్య గౌరి గార్లు 1వ నెంబర్ ఇంటిలో ఉంటున్నారు. ఈమెకు కన్నడతో పాటు తెలుగు కూడా బాగా వచ్చు. ఇక మనవాళన్ అనే తమిళ సినీ నటుడి -ఇప్పుడు లేరు- భార్య కాంతా మనవాళన్ -60- గారు 2వ నెంబర్ గదిలో ఉంటున్నారు. ఇక్కడున్న వాళ్లంతా గత 35, 40 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. అందరికంటే సీనియర్ మన దాసరి గారే. -అద్దెకొంపలో నివాసం చరిత్రలో ఒకే చోట 54 ఏళ్లు- మనవాళన్ దంపతులు దాసరి గారికి చివరివరకు సపరిచర్యలు చేశారట. చెన్నయ్‌లో ఆయనది బ్రహ్మచర్య జీవితమే కాబట్టి వేడి నీళ్లు కాచి ఇవ్వడం వంటి పనులు, సేవలను మనవాళన్ కుటుంబమే ఆయనకు అందించింది.

ఈ భవంతిలోని 6వ నంబర్ గదిలో గోపాల రావు గారనే టైలర్, దాసరి గారితో చాలా స్నేహంగా ఉండేవారట. ఈయన మురుగన్ కోయిల్ సమీపంలో టైలర్ షాపు పెట్టుకుని బతికేవారు. దాసరిగారికి ఈయనతో చివరివరకు సన్నిహిత సంబంధం కొనసాగింది. ఈయన పనిచేస్తున్న టైలర్ షాపు వద్దే దాసరి గారు ఎక్కువకాలం గడిపేవారు. తన అధ్యయనం మొత్తాన్ని ఈ షాపులోనే చేసేవారని తెలుస్తోంది. వాసిరెడ్డి నారాయణ రావుగారు ఈ విషయం చెప్పినట్లు శాయిగారు చెప్పారు. సామాన్యులే దాసరి గారి కథల్లో పాత్రలు. ఆయన స్నేహం కూడా మామూలు మనుషులతోటే కొనసాగింది. ఆయన కూడా ఇప్పుడు లేరు.

54 ఏళ్లు ఒకే ఇంటిలో ఉండటం, ఒకే ఆఫీసు -చందమామ-లో పనిచేయడం. దాసరి గారికే చెల్లింది. శంకర్ గారు కూడా చందమామలో గత 58 ఏళ్లుగా పనిచేస్తున్నా ఆయన చాలా ఇళ్లు మారారు. కాబట్టి ఇల్లు, ఆఫీసుకు సంబంధించిన దీర్ఘకాలిక రికార్డు ప్రపంచంలో బహుశా దాసరిగారికే దక్కవచ్చు. ఇది ఖచ్చితంగా గిన్నెస్ రికార్డుకు ఎక్కవలసిందే -అవసరమనుకుంటే-

ఈ ఇళ్లలోని వారిని కదిపితే చాలు దాసరి వారి జ్ఞాపకాల స్మరణలో మునిగి పోతున్నారు. చందమామ ఉద్యోగి, పెద్దాయన అనే గౌరవం కంటే ఆయన మా మనిషి అనే ఆత్మీయస్పర్శ వీళ్ల జ్ఞాపకాల్లో కొట్టొచ్చినట్లు కనబడుతుంది.

దాసరి గారి సోదరులు ఈశ్వర ప్రభు ఇక్కడికి చాలా తరచుగా వస్తూ పోతూండేవారట. ఉన్నత చదువులు చదివి అమెరికాలో ఉంటున్న ఈశ్వర ప్రభు గారి కుమార్తె మణి తన బాబాయిని కలుసుకోవడం కోసం ఇక్కడికి వస్తూండేవారట.

వడపళని - మురుగన్ కోయిల్ (ఆలయం)

దాసరి గారు చందమామ ఆఫీసులో పనిచేసినంతకాలం వడపళనిలోని మురుగన్ కోయిల్ స్ట్రీట్ పరిసరాల్లోనే 54 ఏళ్లుగా ఉంటూవచ్చారు. ఈ ఇల్లు మొదట్నించి మార్వాడీల చేతిలో ఉండేది. మూడేళ్లకు, ఆరేళ్లకు అద్దె ఇళ్లు ఖాళీ చేయాలనే ఇంటి ఓనర్లు రాజ్యమేలుతున్న కాలం మనది. మనిషికున్న భయాల్లో లీగల్ భయాలు సన్నవి కావు. కాగా 54 ఏళ్లుగా దాసరి గారిని ఆ ఇంటి నుంచి ఖాళీ చేయవలసిందిగా ఈ మార్వాడీ ఓనర్లు కోరకపోవడమే చిత్రాల్లో కెల్లా విచిత్రం.

దాసరి గారు వయోభారంతో మద్రాసు నుంచి విజయవాడకు 2006లో వెళ్లిన తర్వాత కూడా వడపళని లోని ఈ 7వ నంబర్ ఇంటితో ఆయన అనుబంధం కొనసాగింది. మొదటినుంచీ ఇద్దరు నివసిస్తున్న ఈ ఇంటిలో 2010 జనవరి వరకూ దాసరి గారి అద్దెభాగాన్ని -1000 రూపాయలు. – చందమామ పూర్వ అసోసియేట్ ఎడిటర్ బాల సుబ్రహ్మణ్యం గారు ఒక ప్రయోజనం కోసం దాసరి గారి తరపున చెల్లిస్తూ వచ్చారు.

ప్రస్తుతం ఇక్కడి స్వాతి ఎన్‌క్లేవ్‌లో ఉన్న చందమామ కొత్త ఆఫీసు బిల్డింగ్ పక్కనే ఉన్న పాతబడిన భవంతిలో ఏడవ నంబర్ ఇంటిలో దాసరి గారు అయిదు దశాబ్దాలకు పైబడి నివసించారు. ఇది చందమామ ప్రస్తుత ఆఫీసుకు సరిగ్గా వెనుకవైపున ఉండటం కాకతాళీయం.

దాసరి గారు నివసించిన ఇంటికి పక్క ఇల్లు కూడా చాలా పాతది. ప్రమాణాల ప్రకారం చూస్తే పక్కపక్కనే ఉన్న ఈ రెండు భవంతులూ చెన్నయ్ లోని అతి పురాతన భవనాలలో ఒకటిగా లెక్కించవచ్చు.

గది లోపల ఒక ఇరుకు భాగం

ఒక్కటి మాత్రం నిజం. దాసరి గారు చెన్నయ్ నగరంలో చివరి వరకూ మధ్యతరగతి జీవితమే గడిపారు. చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో సామాన్య కుటుంబాలే ఉండేవి. చందమామలో సుప్రసిద్ధమైన 12 ధారావాహికలు రచించి లక్షలాది పాఠకులను దశాబ్దాలుగా ఉర్రూతలూగించిన దాసరి గారు ఇక్కడి ఇరుకు గదిలోనే నివసిస్తూ చందమామ సీరియల్స్‌కి పాత్రల రూపకల్పన చేసి ఉంటారు. ఆయన గడిపిన మధ్యతరగతి జీవితం సాక్షిగా ఆయన సీరియల్స్ పాత్రలు ఆ మట్టి వాసనే వేసేవంటే ఆశ్చర్యపడవలసింది లేదు.

దాసరి గారి ఇంటి వెనుక తలుపు

ముఖ్యంగా మీకు తెలుపవలసింది ఏమిటంటే 7వ నెంబర్ ఇంటి మూసిన తలుపు ఫోటో, వెనుక వైపు తెరిచిన తలుపు ఫోటో తప్పితే మిగతా ఫోటోలు అన్నీ కాంతా మనవాళన్ గారి ఇంటి పోటోలే. దాసరి గారు ఉంటూ వచ్చిన గదిలో ఉంటున్న ఆయన మేం వెళ్లే సమయానికి తాళం వేసి పోవడంతో ఆయన ఇంటిలోపలి భాగాలను ఫోటోలు తీయలేకపోయాము. ఈ ప్లాట్ లోని 12 ఇళ్లూ దాదాపు ఒకే రకంగా ఉన్నాయి  గనుక పాఠకులు సౌకర్యార్థం 2వ నెంబర్ గది లోపలి, వెనుక భాగాలను ఫోటో తీసి పంపిస్తున్నాను. రచన జూన్ సంచికలో నాయని కృష్ణమూర్తి గారు వర్ణించిన దాసరి గారి ఇంటికి ఈ ఇతరుల ఇళ్లు కూడా సరిగ్గా సరిపోతున్నాయి.

మురుగన్ మెడికల్ షాప్

దాసరి – మురుగన్ మెడికల్ షాపు
వడపళని మురుగన్ కోయిల్ స్ట్రీట్‌లో దాసరి గారు 54 ఏళ్లపాటు నివసించిన ఇంటికి దగ్గరగా, మురుగన్ కోయిల్‌కి అతి సమీపంలో  మురుగన్ మెడికల్ షాపు ఉంది. ఈ మెడికల్ షాపులో మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి గత ఆరునెలల్లో చాలా సార్లు షాపుకు వెళ్లాము. దాన్ని తెలుగువారే నడుపుతున్నారు కాని దాసరి గారు దశాబ్దాలపాటు మందులు తీసుకున్న మెడికల్ షాపు ఇదేనని ఈ రోజు 24-12-2010- వరకు మాకు తెలీలేదు. బోర్డు కూడా రోడ్డుకు పైన కాకుండా లోపల కనీ కనిపించకుండా ఉండటంతో పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. చందమామ ప్యాకింగ్ విభాగంలో ఉన్న రవి చెప్పిన వివరాల ప్రకారం ఈ రోజు దీన్ని పట్టేశాము.

ధాసరి ఎక్స్‌లెన్స్ అవార్డుతో శ్రీనివాస్

ఈ మెడికల్ షాపుతో దాసరి గారికి 50 ఏళ్లపైబడిన బంధం ఉంది. 1952లో చెన్నయ్‌కి వచ్చింది మొదలుకుని దాసరి గారు  తమ వైద్య అవసరాలకు ఈ షాపుకే వచ్చేవారు. మేము వెళ్లేటప్పటికి షాపులో ఉన్న శ్రీనివాస్ గారిని దాసరి గారి గురించి ప్రస్తావిస్తే 22 ఏళ్లుగా ఆయన తనకు తెలుసని చెప్పారు. ఎందుకంటే ఇతను గత 22 ఏళ్లుగా ఈ షాపులోనే పనిచేస్తున్నారు. దాసరి గారి జ్ఞాపకాలను పంచుకోమని అడిగితే ముందుగా ఆయనకు చందమామ 2000 సంవత్సరం (?) లో జీవితకాల సాధనకు -లైఫ్ అచీవ్‌మెంట్‌- గాను అందించిన చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డు ధ్రువపత్రాన్ని దాసరిగారు తమకు ఇచ్చారని చెప్పి షాపులోనే ఉన్న ఆ ఫోటోను మాకు అందించారు. షాపులోపలే దాన్ని 3 మెగా పిక్సెల్ మొబైల్‌తో ఫోటో తీస్తే అంత సరిగా రాలేదు.

చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డులు - దాసరి, శంకర్ గార్లు

చందమామ చరిత్రలో ఎక్స్‌లెన్స్ అవార్డు ఇద్దరికి మాత్రమే లబించింది వారు దాసరి, శంకర్ గార్లు. 1999లో చందమామ బయటి వ్యక్తుల సహాయం తీసుకుని తిరిగి ఉనికిలోకి వచ్చాక, దశాబ్దాలుగా పత్రిక అభివృద్ధికి దోహదం చేసిన మాన్యులను గౌరవించాలని పత్రిక  మనుగడకు ఆర్థిక సహాయం అందించిన సుధీర్ రావు తదితరులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఇద్దరు మహనీయులకు చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డు అందించారు. వడపళనిలో ఉన్న ప్రముఖ హోటల్ ఆదిత్యలో జరిగిన ఓ ఫంక్షన్‌లో ఈ అవార్డును బహూకరించారు.

చందమామ ఆవిర్భవించిన 50 ఏళ్ల తర్వాత ఆ సంస్థకు చెందిన సిబ్బందికి అవార్డులు ప్రకటించిన చరిత్ర అదే మొదటిదీ, చివరిదీ కూడా కావడం గమనార్హం. వ్యక్తుల కంటే సంస్థ ముఖ్యమే కాని తెలుగింటి కథల మామగా పేరొందిన ఈ సుప్రసిద్ధ కథల పత్రికలో పనిచేసిన సిబ్బంది జీవితాలు ఇంత సుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండిపోవడమే బాధాకరం. చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డు వీరిద్దరికీ వచ్చినా, రాకున్నా వారి ఘనతర చరిత్రకు జరిగే లాభం, నష్టం ఏమీ ఉండవనుకోండి. కాని ఎక్కడో బాధ.

చందమామ బహూకరించిన ఈ జీవితకాల సాధన ధ్రువపత్రాన్ని దాసరి గారు 2006 వరకు పదిలపర్చుకున్నట్లు ఉంది. తర్వాత ఆయన అనారోగ్యంతో విజయవాడలో బందువుల ఇంటికి వెళ్లేటప్పుడు ఈ అపరూప జ్ఞాపకాన్ని ఈ మెడికల్ షాపులో తన స్నేహితుడికి ఇచ్చి వెళ్లినట్లుంది. ఈ రోజుకీ వారు దాన్ని షాపులోనే లోపల భద్రంగా ఉంచారు.

ఒరిజనల్ ఫోటో ఫ్రేమ్

దాసరిగారికి చందమామ బహూకరించిన ఎక్స్‌లెన్స్ అవార్డు ఫోటో ఫ్రేమును మాకు చూపించిన మురుగన్ మెడికల్స్ శ్రీనివాస్ గారి పోటో కూడా ఈ సందర్భంగా తీశాము. సాయంత్రం 4 గంటల తర్వాత వస్తే దాసరిగారితో తమ పరిచయం విశేషాలు చెబుతానని చెప్పారు. పక్కనే ఉన్నాము కాబట్టి మళ్లీ కలుద్దామని చెప్పి  మా వద్ద ఉన్న చందమామలను గౌరవంగా అందించి ఆఫీసుకు వచ్చేశాము.

ఇక్కడ ఒక మాట చెప్పాలి. భూమ్మీద వ్యక్తిగత ఆస్తి ఉండరాదని ప్రభోదించే మార్క్సిస్టు సిద్ధాంతాన్ని జీవితం చివరవరకూ నమ్మిన వారు దాసరి. అద్భుత రీతిలో చందమామ దశాబ్దాల సేవలకోసం తనకు అందించిన ఈ అపురూప ద్రువపత్రాన్ని కూడా దాసరిగారు తృణప్రాయంగానే వదిలి పెట్టి పోవడం, కీర్తికాంక్షల పట్ల ఎలాంటి మమకారం లేని ఆయన నిగర్వానికి, సగటు మనిషితనానికి తిరుగులేని నిదర్శనం. 83 ఏళ్ల వయసులో ఆయన మద్రాసు విడిచి విజయవాడ వెళుతున్నప్పుడు చందమామ పూర్వ ఎడిటర్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనకు తోడుగా వెళ్లి దింపి వచ్చారని తెలుస్తోంది. ఎక్స్‌లెన్స్ అవార్డు ఫోటో ప్రేమును తన వెంట తీసుకెళ్లడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డ్ ఎంబ్లెమ్

కాని కొన్ని పుస్తకాలు తప్పితే ఆయన చెన్నయ్ నుంచి మరేమీ తీసుకుపోలేదు. చందమామ కోసం, చందమామ సీరియల్స్ కోసం, కథలకోసం జీవితాన్ని  అర్పించినందుకు గాను వచ్చిన అరుదైన అవార్డును కూడా ఆయన తనది కాదనుకుని ఒంటరిగా వెళ్లిపోయాడు. ఈ నిర్మమకారానికి, మూర్తిమత్వానికి మనం ఎలా వెలకట్టగలం చందమామలో దాసరి గారి జీవితానికి సంబంధించిన ఈ చిరస్మరణీయ సాక్ష్యాన్ని భద్రపర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ షాపు వారు ఈ అరుదైన ఫోటోను శాశ్వతంగా భద్రపర్చడానికి, భద్రపర్చగలవారికి ఇస్తే ఎంత బాగుంటుందో! ఇప్పుడే పరిచయం అయ్యారు కాబట్టి ఆ షాపువారిని కొన్నాళ్ల తర్వాత అయినా ఈ విషయమై ప్రస్తావించాలి. దాసరి రమణ గారు కోరుకుంటున్నట్లు ఆ ఫోటోయే గనుక ఇవ్వడానికి సిద్ధమయితే బాలసాహితి తరపున దీన్ని భద్రపర్చవచ్చు.

దాసరి గారికి ఇష్టమైన హోటళ్లు
దాసరి గారు వడపళనిలోని మురగన్ కోయిల్ స్ట్రీట్‌లో ఉన్న తన ఇంటి చుట్టుపక్కల ఉన్న రెండు మూడు హోటళ్లలో టిఫన్, భోజనం చేస్తూ వచ్చారు. 1970ల చివర్లో చందమామ కథకులు ఎంవీవీ సత్యనారాయణగారు తనను చెన్నయ్‌లో కలిసిన సందర్భంలో దాసరిగారు తన హోటల్ భోజనం గురించి ఇలా అన్నారట. ‘కుటుంబరావు గారిని కలవాలని వచ్చి ఎలాగూ కలవలేకపోయారు. పోతే పోయిందిలే. బాబ్బాబు, నా పేరు కాస్త గిన్నెస్ రికార్డు బుక్‌లో ఎక్కించవా! పాతికేళ్లకు పైగా చెన్నయ్‌లో నా బతుకు ఈ హోటల్ పాలయింది. పాతికేళ్లు ఒకే హోటల్లో తిండి. ఎవరికుంటుంది ఈ రికార్డు’ అని తనపైన తానే హాస్యమాడారు.

గణేష్ భవన్ - ఆర్కాట్ రోడ్

ఆ పాతికేళ్లకు తర్వాత మరో పాతికేళ్లు తోడయ్యాయి. ఆయన చెప్పిన హోటల్ బహుశా ఆర్కాట్  రోడ్డుపై ఉన్న గణేష్ భవన్ కావచ్చు. ఇరుకిరుకుగా లేకుండా ఖాళీ స్థలంలో విశాలంగా కనిపించే ఈ ఉడిపి హోటల్ దాసరి గారి అవసరాలకు చక్కగా సరిపోయి ఉండవచ్చు. నాయని కృష్టమూర్తిగారు రచన జూన్ 2010 సంచికలో రాసిన ‘చెట్టెక్కిన బేతాళుడు’ రచనలో చెప్పిన ప్రకారం ఆయన 80లకు ముందు మురుగన్ కోయిల్ ఎదురుగా ఆర్కాట్ రోడ్‌పై ఉన్న గణేష్ భవన్ హోటల్లో చాలాకాలం టీ, ఫలహారం తీసుకున్నారు. హిందూ పేపర్ తీసుకుని ఉదయం ఇక్కడికి వచ్చే ఆయన, దాదాపు గంటకుపైగా అక్కడే ఉండి టీ, సిగిరెట్లు తాగుతూ పేపర్ చదివేవారు. ఉడిపి హోటల్లో సిగిరెట్ వెలిగించే అవకాశం ఈయనకు మాత్రమే దక్కిందని నాయని కృష్ణమూర్తిగారి రచన వ్యాసం బట్టి తెలుస్తోంది. సరిగ్గా మధ్యతరగతి వారికి సరిపోయే సాంప్రదాయకమైన గణేష్ భవన్ ఈ నాటికీ సరసమైన ధరలకే మంచి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది. ముఖ్యంగా ఇక్కడి సాంబార్ రైస్, పాయసం అద్భుతం

హోటల్ శివప్రసాద్ - మురుగన్ కోయిల్

తర్వాతకాలంలో తన ఇంటికి దగ్గరగా, సుప్రసిద్ధ మురుగన్ దేవాలయం వీధి మొదట్లో ఉన్న హోటల్ శివప్రసాద్‌కి తరచుగా వెళ్లేవారట. ఇది ఆయన ఇంటికీ మరీ దగ్గరగా ఉంటుంది. దీనికి ఒక వైపున మురుగన్ కోయిల్, దానికి ఎదురుగా ఆర్కాట్ రోడ్డువైపు దారిలో మురుగన్ మెడికల్స్ షాపు ఉంటాయి. చెన్నయ్‌లో విశేషంగా పేరొందిన ఈ ఆలయం ముందు కొసలో ఉండే శివప్రసాద్ హోటల్ ఆలయానికి వచ్చి, వెళ్లే భక్తులతో సందడిగా ఉంటుంది.

హోటల్ శరవణ భవన్

ఆ తర్వాత 2000 దశకంలో ఆర్కాట్ రోడ్డు మీది శరవణ భవన్‌లో తరచుగా ఫలహారాలు తీసుకునే వారిని తెలుస్తోంది. 54 ఏళ్లుగా ఆయన  ఈ రెండు మూడు హోటళ్లనే ఉపయోగిస్తూ వచ్చారు. తన ఇంటినుంచి రోడ్డుపై ట్రాపిక్‌ను దాటుకుని వెళ్లడం వయసురీత్యా కష్టమనిపించినప్పుడు ఆయన రోడ్డుకి ఈవైపునే ఉండే శివప్రసాద్, శరవణ హోటళ్లకు మారారనిపిస్తుంది. 90 దశకం చివర్లో చెన్నయ్‌లో ప్రారంభమైన శరవణ గ్రూప్ హోటల్స్ నగరంలో మంచి భోజనానికి మారుపేరుగా నిలిచాయి. 2000సంవత్సరం తర్వాత దాసరి గారు చందమామ పూర్వ ఎడిటర్ బాల సుబ్రహ్మణ్యంగారితో తరచుగా శరవణ హోటల్ సందర్శించేవారని తెలుస్తోంది.

చందమామ కథల సెలెక్షన్‌ – దాసరి
అలాగే చందమామ రైటర్స్ ప్యామిలీగా పేరొందిన జొన్నలగడ్డ కుటుంబానికి చెందిన జొన్నలగడ్డ రత్న -నారాయణ స్వామిగారు, వసుంధర గారి సోదరులు- ఇటీవల చెన్నయ్‌లో కలిసినప్పుడు చెప్పిన వివరాలు ప్రకారం 1980 నుంచి 95 వరకు పదిహనేళ్ల పాటు దాసరి గారు ప్రతి వారాంతంలోనూ ఒక పూట లేదా ఒక రోజు బీసెంట్ నగర్‌లో ఉంటున్న ఆయన ఇంటికి క్రమం తప్పకుండా పోయేవారట. ఐడీబీఐ బ్యాంక్ ఛీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేసి రిటైరైన జొన్నలగడ్డ రత్నగారు దాసరి గారితో తన పరిచయం గురించి, ఆయనతో కథా చర్చల గురించి చాలా సమాచారం చెప్పారు. ఈయన ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.

మంచి కథ కూడా చందమామలో ఒక్కోసారి సెలెక్టు కాకపోవడంపై దాసరి గారి ఆగ్రహం, పై వారికి -చందమామ అధికారిక సంపాదకులు- సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదంటూ విసుక్కోవడం, కథ రిజెక్టయినప్పుడు బాధపడవద్దని, చందమామలో కథ ప్రచురణకు తీసుకోనందుకు కథ లోపం కారణం కాదని, దాని వెనుక చాలా కారణాలు ఉంటున్నాయని -సహేతుక కారణాలు  కూడా- దాసరి గారు జొన్నలగడ్డ రత్నగారితో చెప్పేవారట. కథ తిరస్కరణకు గురయినప్పుడు దాసరిగారు రచయితలకు రిప్లై పంపేటప్పుడు స్వాంతన కలిగిస్తూ మీ కథ ప్రచురణకు తీసుకోనంత మాత్రాన కథ బాగా లేదనుకోవద్దని సర్దిచెప్పేవారట. కధల సెలెక్షన్‌కి సంబంధించి చందమామ అధికారిక సంపాదకుల తీరుపై కొడవటిగంటి కుటుంబరావుగారికి కూడా వ్యతిరేకత ఉండేదని విశ్వసనీయ సమాచారం. పత్రికలో కథల స్వీకరణ నిర్ణయాలకు సంబంధించి ఇది ప్రపంచంలో అప్పడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఉండే సమస్యే కదా.

(చందమామ కథల సెలెక్షన్‌పై, దాసరి గారి స్పందనపై వివరణాత్మక సమాచారాన్ని ‘రచన’ పత్రిక 2011 జనవరి సంచికలో ఈయన సామాన్యుడు కాదు పేరిట దాసరి వెంకట రమణ గారు రాసిన ప్రత్యేక రచనలో చూడండి. నా దృష్టిలో ఇది చందమామ చరిత్రకు, దాసరి సుబ్రహ్మణ్యంగారి జీవిత చరిత్రకు సంబంధించి థీసెస్‌తో సమానమైన రచన.)

తీరిన రుణం
దాసరిగారిని నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. 1970ల మొదటినుంచీ చందమామలో ఆయన సీరియల్స్‌తో పరిచయం అయినప్పటినుంచి, 2009 జనవరిలో నేను అదే చందమామలో తెలుగు విభాగంలో పనికి కుదిరిన తర్వాత కూడా ఆయన్ను చూడలేకపోయాను. చివరలో బాలుగారితో పాటు విజయవాడలో తనను కలవడానికి చాలా ప్రయత్నించి కూడా సాధ్యపడలేదు. ‘చెట్టంత మనిషి కళ్లముందు ఉన్నారులే’ అనే కాసింత ఏమరపాటు కూడా కారణం కావచ్చు. తీరా, ‘వయసుకు మించి బతికేస్తున్నానం’టూ తనను ఇంటర్వ్యూ చేసిన సిహెచ్. వేణుగారితో సరదాగా అన్న దాసరిగారు తర్వాత ఆరునెలలకే కాలం చేసినప్పుడు అందరికీ పిడుగుపాటే.

చందమామ చిత్రకారులు శంకర్ గారిపై వీడియో ఎలాగోలా విజయవర్ధన్ గారి తోడ్పాటుతో సేకరించగలిగాము. ఒక చిన్న వీడియో కెమెరా ఉండి విజయవాడకు పోగలిగి ఆయనను సజీవంగా చిత్రిక పట్టవలసిన అవసరం గురించి వేణు గారితో చర్చించినప్పటికీ కుదరలేదు. హ్యారీ పోటర్లు, అవతార్‌లు గురించి ప్రపంచానికి తెలియని రోజుల్లోనే లక్షలాది మంది పిల్లలను జానపద సీరియళ్ల మంత్రజగత్తులో ఓలలాడించిన ఈ అపరూప తెలుగు బాల కథా రచయితగురించి ఒక్కటంటే ఒక్క వీడియో చిత్రం కూడా తీయలేని బాధ ఇక అందరినీ వెంటాడుతూనే ఉంటుంది.

ఏమో.. నా జీవితంలో ఎన్నడూ చూడలేకపోయిన దాసరి సుబ్రహణ్యం గారి రుణాన్ని ఈవిధంగా తీర్చుకుంటున్నానేమో.!

నోట్
(చివరగా, దాసరి గారు చెన్నయ్‌లో నివసించిన ఇంటిని పట్టేశానంటూ నాలుగు నెలల క్రితమే చందమామ అభిమాని శ్రీ కప్పగంతు శివరాం ప్రసాద్ గారికి చెప్పినప్పుడు ఆయన వెనువెంటనే ప్రాధేయపడ్డారు. అది పాత భవంతి అంటున్నారు కనుక రాత్రికి రాత్రే దాన్ని కూల్చేసి కొత్త భవంతి నిర్మాణాలకు ప్లాన్ జరిగిపోవచ్చని, చలం గారు నివసించిన స్వంత ఇంటి ఫోటో విషయంలో కూడా ఇలా నిర్లక్ష్యం చేసినందువల్లే ఒక రోజు ఉన్నట్లుండి దాన్ని కూల్చేసి చరిత్రకే లేకుండా చేశారని శివరాం గారు బాధపడ్డారు.

అందుకే అప్పటినుంచి ఆయన పదే పదే మెయిల్స్ ద్వారా, ఫోన్ ద్వారా దాసరి గారి అద్దె ఇంటిని వీలైనంత త్వరగా ఫోటో తీయమని గుర్తు చేస్తూ వచ్చారు. మన జీవితాల్లో రియల్ ఎస్టేట్ ఒక పెద్ద భూతమని అది ఎప్పుడు ఏ కొంపను లేకుండా కూల్చి వేస్తుందోనని ఆయన భయం. శివరాంగారు హెచ్చరిస్తూ వస్తున్నప్పటికీ నా వద్ద ఉన్న డిజిటల్ కెమెరా లెన్స్ పాడవటంతో రిపేర్ చేయించడం కుదర్లేదు. కెమెరా రెడీ అయితే తర్వాత చూద్దామని తాత్సారం చేస్తూ వచ్చాను.

ఈలోగా దాసరి గారి మూడు పుస్తకాలను ప్రచురించే బాధ్యత తీసుకున్న రచన పత్రిక సంపాదకులు శ్రీ శాయిగారి చెవిన ఈ విషయం పడి, ఈ అంశంపై వ్యాసంతో పాటు ఫోటోలను కూడా పంపితే చాలా మంచిదని, మళ్లీ మళ్లీ వేయలేమని అరుదైన రికార్డుగా ఉంటుందని ఆయన సలహా ఇచ్చారు. ఇక తప్పనిసరై చందమామలో సిస్టమ్ అడ్మిన్ శశి వద్ద మొబైల్ తీసుకుని ఈ వారంలో పని కొంతవరకు పూర్తి చేయడం జరిగింది.

దాసరి గారు నివసించిన ఇంటి వివరాలు ఈ రూపంలో అయినా వెలుగులోకి వచ్చినందుకు కారణమైన శివరాం, శాయి గార్లకు మనఃపూర్వక కృతజ్ఞతలు. ఆ ఇంటి వివరాలు కావాలని చెప్పగానే దగ్గరుండి మరీ చూపించి, చుట్టుపక్కల కుటుంబాలను పరిచయం చేసిన చందమామ ప్యాకింగ్ విభాగం రవికి, మొబైల్ సాయం అందించిన శశికుమార్‌కి ఈ అన్ని ఫోటోలు తీయడంలో సహకరించిన చందమామ లే అవుట్ డిజైనర్ నరేంద్రకు, చివర్లో దాసరి గారి ఎక్సెలెన్స్ అవార్డు గురించి అరుదైన విశేషాలు తెలిపి దాని అరుదైన పోటో అందించిన మురుగన్ మెడికల్స్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.)

కె. రాజశేఖర రాజు.
చందమామ
………..

గమనిక
శాయిగారూ,
చెన్నయ్‌లో దాసరి గారి వ్యక్తిగత జీవితం, ఆయన నివసించిన ఇల్లు, సందర్శించిన హోటల్స్, వైద్యం కోసం ఉపయోగించిన మెడికల్ షాపు, చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డు గురించి లభ్యమైన సమాచారం చాలా పెద్దదయినట్లుంది. రచన పేజీల కొలతకు సరిపోయేలా మీరు దీన్ని వీలైనంత మేరకు ఎడిట్ చేయగలరు.

మీ
రాజు….

తాజా సమాచారం.

దాసరి గారి ఎక్స్‌లెన్స్ అవార్డు ఒరిజనల్ స్కాన్

మురుగన్ మెడికల్స్ శ్రీనివాస్ గారి వద్ద ఉన్న, దాసరి సుబ్రహ్మణ్యం గారికి వచ్చిన ఎక్స్‌లెన్స్ అవార్డు చందమామ స్వయంగా ఫ్రేమ్ కట్టించి ఇచ్చిందే. దాసరి గారి కోరికమేరకు దీన్ని శ్రీకాకుళంలో కథానిలయానికి అందించవలసి ఉందని తెలుస్తోంది.. ఆయన అభిప్రాయానికి ఎనలేని విలువ కల్పిస్తూ డిసెంబర్ చివర్లో శ్రీనివాస్ వద్ద ఉన్న ఒరిజనల్ ఎక్స్‌లెన్స్ అవార్డు ఫోటోను ఆయన అనుమతితో చందమామ ఆఫీసుకు తీసుకెళ్లి స్కాన్ తీయించి భద్రపర్చాము. దాని కాపీనే రచన సంపాదకులు శాయిగారికి, దాసరి వెంకటరమణ గారికి పంపాము. కనీసం కాస్తంత క్వాలిటీతో స్కాన్ అయిన ఈ కాపీ అయినా మనవద్ద ఉందని సంతృప్తి పడాలి.

24-01-2011
చెన్నయ్

Note: ఇక్కడ ఫోటోలు ప్రచురించడానికి ఇంట్లో కంప్యూటర్ సహకరించడం లేదు. రేపు ఆఫీసులో ఈ పని పూర్తి చేయగలను. అసౌకర్యానికి క్షమాపణలు. నా కాంతి సేన బ్లాగులో కూడా ఈవివరాలు చూడగలరు. ఇప్పటికే manateluguchandamama.blogspot.com లో శివరామప్రసాద్ గారు గత నెలలోనే ఫోటోలతో సహా ఈ కథనంలో కొంత భాగాన్ని ప్రచురించారు.

RTS Perm Link

దాసరి గారి గిన్నెస్ రికార్డులు

March 2nd, 2010

చందమామ సీనియర్ కథల రచయిత శ్రీఎమ్.వి.వి సత్యనారాయణ -విశాఖపట్నం- గారు కుటుంబరావు గారి కాలంనుంచి చందమామకు కథలు, బేతాళకథలు పంపుతూ వచ్చారు. అప్పట్లో దాసరి గారితో తనకు కలిగిన పరిచయాన్ని ఆయన హృద్యంగా చందమామతో ఇటీవలే పంచుకున్నారు.

ఈయన 1980కి ముందు ఓసారి కుటుంబరావుగారిని కలిసి చూసి పోదామని చెన్నయ్ లోని చందమామ ఆఫీసుకు వచ్చారట. ఆ సమయానికి కొకు ఆఫీసులో లేరు. దీంతో ఈయన చందమామ కార్యాలయంలోని కుటుంబరావు గారి కుర్చీవద్దకు వచ్చి దండం పెట్టి వెళ్లారట.

కొకు లేని సమయంలో వచ్చి ఆశాభంగంతో వెనుదిరిగి వెళుతున్న తనను దాసరిగారు రిసీవ్ చేసుకుని భోజనం కోసం హోటల్‌కు తీసుకెళ్లారట. ఆరోజు దాసరిగారు  అన్నమాటలు ఈరోజుకీ ఈయన మర్చిపోలేదు.

‘కొకును ఎలాగూ కలవలేకపోయావు గాని, కొంచెం నా పేరు ఆ గిన్నెస్‌లోకి ఎక్కేటట్టు చూడు’ అని దాసరి గారు ఈయనతో ముక్తాయించారట. ఈయనకు ముందు అర్థం కాలేదట. ‘35 ఏళ్లుగా హోటల్ తిండి తింటున్నాను. ఇంటిభోజనం తినే యోగం వస్తుందో లేదో తెలీదు. ఈలోగా సాధిస్తున్న రికార్డును ఎందుకు పోగొట్టుకోవాలి. హోటల్ వదలని వీరుడిగా నా పేరన్నా గిన్నెస్‌ బుక్‌లో ఎక్కించు బాబ్బాబు’ అని దాసరి గారు జోకులేస్తుంటే ఈయనకు నవ్వాగింది కాదట.

నిజమే మరి. దాసరి గారి వ్యక్తిగత జీవితం కూడా రికార్డుల మయమే. మద్రాసులో చందమామలో చేరినప్పటినుంచి అంటే 1952 నుంచి 2006 వరకు కూడా చెన్నయ్‌లో ఒకే అద్దె ఇంట్లో దాసరి గారు ఉంటూ వచ్చారు. ఒకే అద్దె ఇంట్లో 54 ఏళ్లకు పైగా జీవితం. మనుషులకు సాధ్యమయ్యే పనేనా ఇది.

ఒకే ఆఫీసులో 54 ఏళ్లు పనిచేయడం. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా సగటు మనుషులకు సాధ్యం కాని పని. నా ఉద్దేశ్యంలో అలవాటు బలంమీద ఆయన అన్నేళ్లపాటు చెన్నయ్‌లో ఒకే హోటల్‌లోనే భోంచేసి ఉంటారేమో అని నా సందేహం.

చివరకు బాలసాహిత్యానికి, ఆబాల గోపాల సాహిత్యానికి కూడా పేరొందిన చందమామలో వరుసగా పాతికేళ్లపాటు సీరియల్స్ రాస్తూ వచ్చిన అరుదైన రికార్డు కూడా ఈయన పేరు మీదే ఉంది.

అప్రస్తుతమనుకోకుంటే వివాహమైనప్పటికీ చెన్నయ్‌లో 50 ఏళ్లకు పైగా ఒంటరిగానే జీవించిన అరుదైన రికార్డు కూడా ఈయనదే. 84 ఏళ్ల వృద్ధాప్య దశలో చివరకు కనీసావసరాలకు మనిషి తోడు లేని పరిస్థితుల్లోనే దాసరి గారు చందమామను వదిలి విజయవాడకు వెళ్లవలసి వచ్చింది.

అప్పుడు కూడా ఆరోగ్యం బాగయితే తాను మళ్లీ చందమామకు తిరిగి వస్తానని అప్పటి చందమామ ఉద్యోగులకు మాట ఇచ్చి మరీ వెళ్లారు. కానీ రాలేకపోయారు. శివరాం ప్రసాద్ గారు తన సాహిత్య-అభిమాని బ్లాగు లో రాసినట్లుగా స్వర్గమనేది నిజంగా ఉంటే, దాసరి గారు ఇప్పుడు అక్కడ బిజీగానే ఉంటారు. ఎందుకంటే నాగిరెడ్డి, చక్రపాణి గారు ఇప్పటికే ‘స్వర్గం’లో ‘చందమామ’ పత్రికను మొదలు పెట్టేసి ఉంటారు కదా.

వేణుగారు ఈయనను ఇంటర్వ్యూ చేస్తూన్నప్పడు, తన వయసు (87సంవత్సరాలు) ఓసారి స్మరించుకొని, ‘I am over stay here!’ అని సరదాగా జోక్ చేసిన అరుదైన వ్యక్తిత్వం దాసరిగారిది. భూమ్మీద అవసరానికి మించి ఉండటం, బతకడం, బతకవలసి రావడం కూడా సరైంది కాదు అనే ప్రత్యేక సామాజిక తత్వం దాసరి గారిది.

చివరకు 87 ఏళ్ల ప్రాయంలో కూడా ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, వైద్య ప్రక్రియలతో పనిలేకుండా, సునాయాసంగా, సుఖంగా కన్నుమూసిన అపర భీష్ముడు శ్రీ దాసరి. సుఖ మరణం పొందడం అనేది మానవజాతి ప్రాచీన స్వప్నాలలో ఒకటి. నొప్పింపక, తానొవ్వక అన్న చందంగా సునాయాసంగా పోవడం ద్వారా జాతి స్వప్నాన్ని కూడా సాకారం చేసుకున్న అరుదైన మనీషి ఆయన.

బాలసాహిత్యంలో ధ్రువతారగా నిలిచే చందమామ తాతయ్య శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి దివ్యస్మృతికి చందమామ నీరాజనాలు.

RTS Perm Link

మీ విశ్వాసాలతో మేం ఏకీభవించకపోవచ్చు…

February 21st, 2010
మా సృష్టికర్తకు మా నివాళి

మా సృష్టికర్తకు మా నివాళి

చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు కన్నుమూసిన వార్త తెలియగానే చందమామ వీరాభిమాని శివరాం ప్రసాద్ గారు కొత్త రీతిలో ఆయనకు సంతాపం పలికారు. దాసరి గారు తమ ధారావాహికలలో సృష్టించిన పాత్రలనే ఆయనకు అశ్రు నివాళి పలుకుతున్నట్లుగా చందమామ బొమ్మకు మెరుగులద్దారు.

జానపద కథా బ్రహ్మగా రూపొంది లక్షలాది మంది పిల్లలను, పెద్దలను కాల్పనిక సాహితీ మంత్రజగత్తులో విహరింప జేసిన దాసరి గారు జీవితం పొడవునా కార్మిక వర్గ పక్షపాతిగా, కమ్యూనిస్టుగా సైద్ధాంతిక దృక్పధాన్ని పాటించిన విషయం ఇప్పుడు అందరికీ తెలుసు.

శివరాం గారు నాకు తెలిసి సంప్రదాయాలంటే ప్రాణమిచ్చే వ్యక్తి. కాని దాసరి గారి రాజకీయ విశ్వాసాన్ని గౌరవించడంలో ఆయనకు తన సాంప్రదాయాలు ఏవీ అడ్డురాలేదు. అందుకే చందమామ బొమ్మలో సుత్తీ కొడవలి జొప్పించి మరీ దాసరిగారికి ఆయన పాత్రలే నివాళి పలుకుతున్నట్లుగా మార్పు చేసి పంపారు.

పైగా మనుషులు కలకాలం గుర్తుంచుకోవలసిన జీవన తాత్వికతను ఈ చిత్రానికి జొప్పించారు కూడా. “We may not agree with your beliefs sir, but we respect your openions.” “మీ విశ్వాసాలతో మేం ఏకీభవించకపోవచ్చు, కానీ మీ అభిప్రాయాలను మేం గౌరవిస్తాం”. మనుషులందరూ గుర్తుంచుకోవలసిన గొప్ప సత్యం ఈ చిన్న వాక్యంలో ఇమిడ్చారు.

తరతరాలుగా పోగుపడుతూ వచ్చిన మానవ సమాజ జ్ఞాన నిధిని గుడ్డిగా వ్యతిరేకిస్తూ తోసిపారేయడం, రాజకీయ, సైద్దాంతిక, సాంస్కృతిక రంగాల్లో పరిణామక్రమంలో నెలకొంటూ వచ్చిన ప్రతి మార్పును గుడ్డిగా వ్యతిరేకించడం.. ఇవి రెండూ చారిత్రక అభాసలే.. అందుకే.. “మీ విశ్వాసాలతో మేం ఏకీభవించకపోవచ్చు, కానీ మీ అభిప్రాయాలను మేం గౌరవిస్తాం”.

మనిషి బతికి ఉన్నంతవరకూ గుర్తుంచుకోవలసిన, పాటించవలసిన పరమసత్యమిది. ఫ్రెంచి విప్లవ మూలపురుషులలో ఒకరైన వోల్టేర్ కూడా ఇదే అభిప్రాయాన్నే మరొకలా చెప్పినట్లుంది. ఎవరు చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా ఈ వాక్య సారాంశం మాత్రం సమాజానికి చిరంజీవిగా మిగలాలి.

మెరుగులద్దిన చందమామ బొమ్మను పంపిస్తూ శివరాం గారు నాకు పంపిన ఈమెయిల్‌ను, దానికి నా స్పందనను ఈ సందర్బంగా ఇక్కడ జోడిస్తున్నాను. సారాంశంలో ఇవి వ్యక్తిగత మెయిళ్లు కావు కాబట్టే వాటిని ఇక్కడ యథాతథంగా ఇస్తున్నాను.

ఫిబ్రవరి 15, 2010

DEAR RAJUGAROO, YOU MAY FIND IT STRANGE COMING FROM ME. BUT WE RESPECT THE IDEALS OF SHRI DASARI. JUST SEE THE ATTACHMENT AND LET ME KNOW YOUR OPINION AND ALSO WHETHER WE CAN USE IT WHEN RACHANA BRINGS OUT ITS SPECIAL ISSUE TO HIGHLIGHT THAT IN OUR BLOG.

THIS PICTURE IS FOR YOU ONLY FOR THE PRESENT STILL SOME MORE WORK TO BE DONE AND WORDS TO BE CHANGED. REGARDS,

శివరామప్రసాదు కప్పగంతు
బెంగుళూరు భారత్ నుండి
http://saahitya-abhimaani.blogspot.com/

డియర్ శివరాంప్రసాద్ గారూ, లేటుగా స్పందిస్తున్నా, క్షమించాలి. దాసరి గారికి ఇంతకు మించిన నివాళి ఎవరైనా తెలుపగలరంటే నేను నమ్మలేను. ఆయన సృష్టించిన సాంప్రదాయిక పాత్రలు ఆయన విశ్వాసాలను గౌరవిస్తూ, ఆయన జీవిత పర్యంతమూ పాటించిన శ్రామిక వర్గ పక్షపాతానికి గౌరవమిస్తూ ఆయనకు నివాళి పలుకుతున్న దృశ్యం..

నాకయితే కలకాలం దాచుకోవాలనిపిస్తోంది. దానికి మీరిచ్చిన పదాలంకారం కూడా చాలా బాగుంది. “We may not agree with your beliefs sir, but we respect your openions.” మనుషులందరూ గుర్తుంచుకోవలసిన గొప్ప సత్యం, తాత్వికత ఈ రెండు వాక్యాలలో ఇమిడ్చారు. చాలా బాగుంది.

మీరు రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్నాక వీలయితే వెంటనే మీ బ్లాగులో, మనచందమామబ్లాగులో పెట్టేయండి. తర్వాత చందమామ, బ్లాగులో కూడా ప్రచురిద్దాము. దాసరి గారి సంస్మరణ సభ ప్రకటనను, దాసరి రమణ గారు పంపిన విశేష కథనాన్ని కలిపి చందమామ బ్లాగులో పెట్టాలనుకుంటున్నాము. ఆయన పర్మిషన్ తీసుకుని వెంటనే రంగంలోకి దిగుదాము. ఎందుకంటే రేపే కదా సంస్మరణసభ.

మీరు దాసరి గారి సీరియల్ శిథిలాలయం బొమ్మలను కార్టూన్‌గా మారుస్తున్న విషయం పైవారికి తెలియజేస్తాము. ఇది కొంత ఆలస్యం అయినా మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను.

రాజు.

నిన్న సాక్షి ఆదివారం అనుబంధంలో, ఆంధ్రజ్యోతి పత్రిక మెయిన్ మూడో పేజీలో దాసరి సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకాలను ప్రచురించారు. కింది లింకులను చూడండి.

‘చందమామ’ను చేరుకున్నారు
http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=47656&Categoryid=10&subcatid=29

ఆరిపోయిన ‘చందమామ’ వెలుగు
-కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

ఆరిపోయిన చందమామ వెలుగు

RTS Perm Link

విజయవాడలో దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ

February 20th, 2010

Journey-459

తెలుగులో బాలసాహితీ వికాసానికి చందమామ తరపున ఎనలేని కృషి చేసిన కథల మాంత్రికుడు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు 88 ఏళ్ల ప్రాయంలో ఇటీవలే విజయవాడలో కన్నుమూసిన విషయం తెలిసిందే. చందమామ అభిమాని, రచయిత, శ్రేయోభిలాషి శ్రీ దాసరి వెంకట రమణ గారు ఈ ఆదివారం -21-02-2010- సాయంత్రం ప్రజాసాహితి వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో జరుగనున్న దాసరి సుబ్రహణ్యం గారి సంస్మరణ సభ విశేషాలను మెయిల్‌లో పంపారు.

చందమామ అభిమానులు, ప్రత్యేకించి చందమామ చరిత్రలో అత్యద్భుత విజయం సాధించిన ధారావాహికల రచయిత శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి అభిమానులు, ఆయన మిత్రులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనను ఎరిగినవారు ఈ సభకు హాజరై వారి మనోభావాలను పంచుకోవలసినదిగా ఆయన ఈ మెయిల్‌లో అందరికీ ఆహ్వానం తెలిపారు.

చందమామ జ్ఞాపకాలను, దాసరి గారి కథా రచనా పటిమను ఈనాటికి హృదయాల్లో పదిలపర్చుకుంటున్న చందమామ పాఠకులు, అభిమానులు ప్రత్యేకించి విజయవాడ నగరంలో ఉన్నవారు.. దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభకు తప్పక హాజరై ఆయనతో, ఆయన ధారావాహికలతో తమ పరిచయాన్ని అందరితో పంచుకుంటారని ఆశిస్తున్నాం.

దాసరి రమణ గారు పంపిన ఈమెయిల్ పూర్తి పాఠం కింద చూడండి.

విజయవాడలో దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ

( ప్రజాసాహితి వేదిక విజయవాడ వారి ఆధ్వర్యంలో )

( తేది21-02-2010 ఆదివారం, సా: 6 గం.లకు చండ్ర రాజేశ్వరరావు  గ్రంథాలయం, శిఖామణి సెంటర్, విజయవాడ.)

Dasari-Subrahmanyam_450

తెలుగువారి సంప్రదాయానికి ప్రతీకగా నిలిచి, మన వుమ్మడి వారసత్వ సంపదగా అభివర్ణించ దగిన చందమామ మాస పత్రికలో  53  సం.లు పని చేసిన శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు మొన్న జనవరి 27వ తేది సా. 5 గం.లకు విజయవాడలో వారి అన్నయ్య శ్రీ ఈశ్వర ప్రభు గారి కుమార్తె శ్రీమతి గోళ్ళ ఝాన్సి గారి ఇంట్లో కన్నుమూశారు.

శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను బాల సాహితీ వికాసానికి చేసిన సేవ ఎనలేనిది. దురదృష్టవశాత్తు … ఆ విషయం చాల కొద్ది  మందికి మాత్రమె తెలుసు.

tokachukka

1954 జనవరి చందమామ లో ప్రారంభమైన  శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి తోకచుక్క రంగుల జానపద కథా ధారావాహిక నాటి  తెలుగునాటి బాలల హృదయాల్లో గిలిగింతలు పెట్టింది. పిల్లలనే కాదు పెద్దలను సైతం అబ్బురంగా ఆకర్షించి ఊపిరి బిగ పట్టేంత  ఉత్కంటకు గురిచేసిన ఆ ధారావాహిక … తరువాయి భాగం ఎప్పుడా అని మరుసటి నెల చందమామ కోసం ఎదురు చూసేలా చేసింది. చందమామ సర్క్యులేషన్ గణనీయంగా పెరగడానికి కారణభూతమైనది. ఆ ధారావాహిక విజయంతో  శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు వెనక్కు తిరిగి చూడలేదు.

తోకచుక్క                        (Jan-54 – June-55 )
మకరదేవత                     (July-55 – December 56)
ముగ్గురు మాంత్రికులు (January-57 – June 58)
కంచుకోట                        (July-58 – Dec-59)
జ్వాలాద్వీపం                  (Jan-60 – June-61)
రాకాసిలోయ                  (July-61 – May-64)
పాతాళదుర్గం                  (May-66 – Dec-67)
శిథిలాలయం                  (Jan-68 – Sept-70)
రాతిరథం                         (Oct-70 – April-72)
యక్షపర్వతం                  (May-72 – June-74)
మాయా సరోవరం          (Jan-76 – June-78)
భల్లూక మాంత్రికుడు     (July-78 – April-80)

దాసరి మంత్రనగరి

దాసరి మంత్రనగరి

ఇలా..మొత్తం 12 ధారావాహికలు రాశారు. ఈ ధారావాహికల రుచి కేవలం అనుభవైకవేద్యం.  నేడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న సంచలనాత్మక హారీపోటర్ కథల కంటే  శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి కథలు, కథా కథనం లోనూ, పాత్రల సృష్టి లోనూ ఎన్నో రెట్లు మెరుగని నాటి పాటకులకు, వాటిని చందమామలో పున: ప్రచురించినందున నేటి పాఠకులకు … ఆస్వాదించిన వారికి మాత్రమే అర్థమౌతుంది. “శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం తెలుగు వాడవడం మన అదృష్టం ఆయన దురదృష్టం” అని తెనాలి వాస్తవ్యులు శ్రీ వెలగా వెంకటప్పయ్య గారు అనేవారు.

కొడవటిగంటి కుటుంబరావు గారితో పాటు చందమామ సంపాదక వర్గంలో ఒకడుగా – చందమామ కథల ఎంపిక లోనూ, వాటిని తిరిగి వ్రాసే ప్రక్రియ లోనూ శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి కృషి మరువలేనిది. 1975లో శ్రీ చక్రపాణి మరణానంతరం, ముఖ్యంగా 1980లో శ్రీ  కొడవటిగంటి కుటుంబరావు గారు మరణించాక చందమామ పత్రికా నిర్వహణలో శ్రీ విశ్వనాథ రెడ్డి గారికి  శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం వెన్నెముకలా వ్యవహరించాడని చెప్పవచ్చు.

తెనాలికి సమీపం లోని పెద్ద గాజులపర్రు లో 1922 అక్టోబర్25 న జన్మించిన శ్రీ సుబ్రహ్మణ్యం గారికి మరణించే నాటికి ఆయన వయసు 88 సం.లు.

మా సృష్టికర్తకు కథాంజలి!

మా సృష్టికర్తకు కథాంజలి!

శ్రీ కొత్తపల్లి రవిబాబు  అధ్యక్షతన, శ్రీ దాసరి వెంకటరమణ (సుబ్రహ్మణ్యం గారి బంధువు కారు- చందమామ కథల  పరిశోధకులు, ప్రధాన కార్యదర్శి-బాల సాహిత్య పరిషత్తు హైదరాబాద్)  ముఖ్య వక్తగా పాల్గొంటున్న ఈ సభలో, ఇంకా శ్రీమతి  గోళ్ళ ఝాన్సీ (సుబ్రహ్మణ్యం గారి అన్న కీ.శే.ఈశ్వరప్రభు గారి కూతురు),శ్రీ అట్లూరి అనిల్ (సుబ్రహ్మణ్యం గారి మిత్రులు, హైదరాబాద్.), రాంపల్లి  శ్రీలక్ష్మి (చందమామ అభిమాని), శ్రీ గోళ్ళ నారాయణరావు (సుబ్రహ్మణ్యం గారి అన్న కీ.శే.ఈశ్వరప్రభు గారి మనుమడు) మొదలగు వారు ప్రసంగిస్తారు.

చందమామ అభిమానులు, శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి అభిమానులు, ఆయన మిత్రులు,ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనను ఎరిగినవారు  ఈ సభకు హాజరై వారి రచనల గురించి గాని, వారితో తమకు గల అనుబంధం గురించి కాని, సుబ్రహ్మణ్యం గారి వ్యక్తిత్వం గురించి కాని, వారి మనోభావాలను పంచుకోవడానికి ఈ వేదికను ఉపయోగించుకోవలసిందిగా మనవి.

వివరాలకు సంప్రదించండి
శ్రీ కొత్తపల్లి రవిబాబు: +919490196890
e mail: ravibabu@yahoo.co.in

శ్రీ దివికుమార్ :  +919440167891, 0866-2417890:
e mail:  1949@yahoo.com

ప్రజాసాహితి వేదిక,
విజయవాడ 

సమావేశ స్థలం:
ప్రజాసాహితి వేదిక విజయవాడ వారి ఆధ్వర్యంలో
తేది. 21-02-2010 ఆదివారం, సా: 6 గం.లకు చండ్ర రాజేశ్వరరావు  గ్రంథాలయం, శిఖామణి సెంటర్, విజయవాడ.

ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం ……స్మరించుదాం.

……………….

విజయవాడలో ఈ ఆదివారం జరుగనున్న దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ వివరాలను ఈమెయిల్ ద్వారా పంపిన దాసరి వెంకటరమణ గారికి కృతజ్ఞతలు.

ఫోటోలు: వేణు, శివరాం ప్రసాద్ గార్లు, చందమామ సౌజన్యంతో

(చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారిపై ఈ ఆదివారమే సాక్షి దినపత్రిక అనుబంధంలో ‘చందమామ’ను చేరుకున్నారు! పేరిట కథనం ప్రచురించనున్నారు.)

చందమామ వెబ్‌సైట్‌లో, బ్లాగులో ఇటీవల దాసరి గారిపై ప్రచురించిన కథనాల లింకులు కింద చూడగలరు.

కథల మాంత్రికుడు దాసరి గారి సంస్మరణ
http://blaagu.com/chandamamalu/2010/02/18/%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2-%e0%b0%ae%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%81%e0%b0%a1%e0%b1%81-%e0%b0%a6%e0%b0%be%e0%b0%b8%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%97%e0%b0%be/

చందమామ కథల మాంత్రికుడి సంస్మరణ సభ
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2427

కథల మాంత్రికుడికి చందమామ నివాళి
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=40&sbCId=117&stId=2424
 
చందమామ ప్రగాఢ సంతాపం
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2423
 
దాసరి తాతగారితో మా జ్ఞాపకాలు
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=40&sbCId=117&stId=2422

RTS Perm Link

కథల మాంత్రికుడు దాసరి గారి సంస్మరణ

February 18th, 2010
దాసరి సంస్మరణ

దాసరి సంస్మరణ

(ఇటీవల కన్ను మూసిన చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ మంగళవారం హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సభకు హాజరైన వేణుగారు చందమామ కోసం కోరగానే సభ వివరాల నివేదికను శ్రమకోర్చి పంపారు. వేణుగారికి కృతజ్ఞతలు. “కథల మాంత్రికుణ్ణి స్మరించుకున్నాం!” అనే పేరిట ఆయన తన బ్లాగులో కూడా ఈ సంస్మరణ సభపై మంచి కథనం పోస్ట్ చేశారు.

వేణుగారు పంపిన ఈ సమావేశ వివరాలను యధాతథంగా ఇక్కడ పొందుపరుస్తున్నాము. చిత్రకారులు అన్వర్ గారు కూడా ఈ సభకు హాజరై విశేషాలను ఫోన్ ద్వారా పంచుకున్నారు. ఆయనకు కూడా కృతజ్ఞతలు. ఈ కథనం కోసం వేణు గారి బ్లాగులో పోస్ట్ చేసిన ఫోటోలు, రచన శాయి గారు  పంపిన పోటో  కూడా ఉపయోగించుకుంటున్నాం. వారికి ధన్యవాదాలు.)

Dasari_450-225

నిన్న 16-02-2010- హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ సమావేశ మందిరంలో దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ జరిగింది. బాలసాహిత్య పరిషత్ ఈ సభను  నిర్వహించింది. సభకు రామవరపు గణేశ్వరరావు అధ్యక్షత వహించారు.

వాసిరెడ్డి నారాయణ రావు: దాసరి గారు అంతర్ముఖుడు. అయితే తెలిసినవాళ్ళ దగ్గర అలా ఉండేవారు కాదు. తన ఇబ్బందులను ఇతరులకు ఏమీ తెలియనీయకుండా జాగ్రత్తపడే ఆత్మగౌరవం ఆయనది. పరిణామ క్రమంలో మనిషి రెక్కలు పోగొట్టుకున్నాడంటూ కథల్లో రెక్కల మనుషులను సృష్టించారు. మరో ప్రపంచంలోకి పాఠకులను తీసుకువెళ్ళిన రచయిత.

Dasari homage_450-350

అట్లూరి అనిల్ : దాసరి సుబ్రహ్మణ్యం గారు  చాలా నిరాడంబరంగా ఉండేవారు. చూపు నిశితంగా ఉండేది.సాహిత్య సభలకు వచ్చేవారు కాదు.కానీ వాటి విశేషాలు అడిగి తెలుసుకునేవారు. నేనంటే ఆయనకు  చాలా ప్రేమాభిమానాలుండేవి. మదరాసులో ఉన్నపుడు  తన కంటే ఎంతో చిన్నవాణ్నిఅయినా  నాకోసం వెతుక్కుంటూ వచ్చేవారు.

రచన శాయి: దాసరి గారితో నాకు పరిచయం లేదు. అయితే ఆయన రచనలంటే అభిమానం, ప్రేమ. అందుకే ‘రచన’ఏప్రిల్ సంచికను ఆయన ప్రత్యేక సంచికగా తీసుకువస్తున్నాం. ఆయన చిన్నపిల్లల కథలే కాకుండా పెద్దవాళ్ళ కథలు కూడా రాశారు. శ్రీకాకుళం కథా నిలయంలో ఆయనవి 25 కథలు దొరికాయి. దాసరి సుబ్రహ్మణ్యం గారి పేరిట చందమామ తరహా కథను ‘రచన’లో ప్రతినెలా వెయ్యాలనే సంకల్పం ఉంది. చందమామ బొమ్మల్లాగే వేసే ఆర్టిస్టు చేత అలాగే బొమ్మలు వేయించాలని అనుకుంటున్నాం.

దాసరి వెంకటరమణ: దాసరి సుబ్రహ్మణ్యం గారిని మద్రాసులో ఒకసారీ,విజయవాడకు వచ్చాక 2008లో ఒకసారీ కలిశాను. ఇంటిపేరు ఒకటే తప్ప వారితో బంధుత్వమేదీ నాకు లేదు. చందమామకు నేను పంపిన రచనలను ఆయన ఇష్టపడేవారు. అంతటి గొప్ప రచయిత నా రచనలు బావున్నాయంటే ఆ అనుభూతి ఎంత గొప్పదో చెప్పటం కష్టం.

ఆయన మనసు సున్నితం. గట్టివాడు, మొండివాడు. జనాలతో ఎవరితోనూ కలవడు.

Dasari-anwar_450-500

తోకచుక్క అరిష్టం అనే భావన మూఢనమ్మకమనే అంతర్లీన సందేశాన్ని ఆ సీరియల్లో అందించారు. ఆసక్తికరంగా, రోమాలు నిక్కబొడుచుకునేలా, ఒళ్ళు గగుర్పొడిచేలా ఆయన రాసేవారు. ఆయన కథనంలో చదివించే గుణం  ఎక్కువ.

చొక్కాపు వెంకటరమణ, గీతా సుబ్బారావు , మరికొందరు దాసరి గారి గురించి తమ ప్రసంగాల్లో స్మరించుకున్నారు. ఆయన రచనలను పాఠకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు.

…. వేణు.

వేణుగారి కథనాన్ని తన స్వంత బ్లాగులోనూ, మనతెలుగుచందమామ బ్లాగులో ఆడియోరూపంలో కూడా కిందిలింకులలో చూడవచ్చు.
 
కథల మాంత్రికుణ్ని స్మరించుకున్నాం!
http://venuvu.blogspot.com/2010/02/blog-post.html

ఇదే కథనాన్ని ఈ కింద ఇచ్చిన బ్లాగులో కూడ చూడవచ్చు. అక్కడ వ్యాసాన్ని ఆడియోలో కూడ వినవచ్చు.
http://manateluguchandamama.blogspot.com/

RTS Perm Link

కథల మాంత్రికుణ్ని స్మరించుకున్నాం!

February 17th, 2010

నిన్న హైదరాబాదులో చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ జరిగిన సందర్భంగా సభకు హాజరైన చందమామ అభిమాని, బ్లాగర్ వేణుగారు ఆయనపై చక్కటి స్మృతి కథనం రాశారు.

“…ఆయన అక్షరాలను మంత్రిస్తే..అవి అవధుల్లేని కథాకల్పనలయ్యాయి. వీర,బీభత్స, రౌద్ర, అద్భుత రసావిష్కరణలతో అపురూప జానపద కథలై నిలిచాయి. ఆ శైలీ విన్యాసం జవనాశ్వాలై పరుగులు పెడితే అసంఖ్యాక పాఠకులు ఉత్కంఠతో, ఆసక్తితో, ఇష్టంతో ఏళ్ళతరబడి చదివారు. ఆ అక్షర ‘చిత్రా’లను గుండెల్లో దాచుకున్నారు.

ప్రతి సంచిక కోసం విరహపడ్డారు.ఎదురుచూశారు.దశాబ్దాలు గడిచినా వాటిని తలపోసుకుంటూనే ఉన్నారు.

ఊహల విహంగాల రెక్కలపై తరతరాల పఠితలను..పిల్లలనూ, పెద్దలనూ వింత వింత లోకాల్లో విహరింపజేసి మంత్రముగ్ధులను చేశారు.

కానీ…ఆయన మాత్రం పేరు ప్రఖ్యాతులేమీ పట్టనితనంతో ఆ పాఠకులకు కూడా తనెవరో తెలియని అజ్ఞాత రచయితగానే ఉండిపోయారు!”

కింది లింకులో వేణుగారి కథనం పూర్తి పాఠం చదవగలరు.

కథల మాంత్రికుణ్ని స్మరించుకున్నాం!
http://venuvu.blogspot.com/2010/02/blog-post.html

ఇదే కథనాన్ని ఈ కింద ఇచ్చిన బ్లాగులో కూడ చూడవచ్చు. అక్కడ వ్యాసాన్ని ఆడియోలో కూడ వినవచ్చు. 

http://manateluguchandamama.blogspot.com/

RTS Perm Link

దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ

February 15th, 2010
కథకుడికి పాత్రల నివాళి

కథకుడికి పాత్రల నివాళి

(తెలుగులో బాలసాహితీ వికాసానికి చందమామ తరపున ఎనలేని కృషి చేసిన కథల మాంత్రికుడు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు 88 ఏళ్ల ప్రాయంలో ఇటీవలే విజయవాడలో కన్నుమూసిన విషయం తెలిసిందే. చందమామ అభిమాని, రచయిత, శ్రేయోభిలాషి శ్రీ దాసరి వెంకట రమణ గారు ఈ మంగళవారం -16-02-2010- సాయంత్రం బాల సాహిత్య పరిషత్తు పక్షాన హైదరాబాద్‌లో జరుగనున్న దాసరి సుబ్రహణ్యం గారి సంస్మరణ సభ విశేషాలను మెయిల్‌లో పంపారు.

చందమామ అభిమానులు, ప్రత్యేకించి చందమామ చరిత్రలో అత్యద్భుత విజయం సాధించిన ధారావాహికల రచయిత శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి అభిమానులు, ఆయన మిత్రులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనను ఎరిగినవారు ఈ సభకు హాజరై వారి మనోభావాలను పంచుకోవలసినదిగా ఆయన ఈ మెయిల్‌లో అందరికీ ఆహ్వానం తెలిపారు.

చందమామ జ్ఞాపకాలను, దాసరి గారి కథా రచనా పటిమను ఈనాటికి హృదయాల్లో పదిలపర్చుకుంటున్న చందమామ పాఠకులు, అభిమానులు ప్రత్యేకించి హైదరాబాద్‌ నగరంలో ఉన్నవారు దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభకు తప్పక హాజరై ఆయనతో, ఆయన ధారావాహికలతో తమ పరిచయాన్ని అందరితో పంచుకుంటారని ఆశిస్తున్నాం.

దాసరిగారికి ఆయన ధారావాహికలోని పాత్రలు నివాళి పలుకుతున్నట్లుగా మార్చి శివరాం ప్రసాద్ గారు పంపిన చందమామ చిత్రాన్ని ఈ బ్లాగులో ప్రచురించడమైనది. శివరాం గారికి కృతజ్ఞతలు

చందమామ పాఠకులు, అభిమానుల సౌకర్యార్థం దాసరి వెంకట రమణ గారు పంపిన ఈమెయిల్‌ను యథాతథంగా కింద పొందుపరుస్తున్నాం.)

దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ

(తేది 16 -02 -2010 మంగళవారం, సా: 5 గం.లకు నగర కేంద్ర గ్రంథాలయం, చిక్కడపల్లి, హైదరాబాద్.)

తెలుగువారి సంప్రదాయానికి ప్రతీకగా నిలిచి, మన వుమ్మడి వారసత్వ సంపదగా అభివర్ణించ దగిన చందమామ మాస పత్రికలో  53 సం.లు పని చేసిన శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు మొన్న జనవరి 27వ తేది సా. 5 గం.లకు విజయవాడలో వారి అన్నయ్య శ్రీ ఈశ్వర ప్రభు గారి కుమార్తె శ్రీమతి గోళ్ళ ఝాన్సి గారి ఇంట్లో కన్నుమూశారు.

శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను బాల సాహితీ వికాసానికి చేసిన సేవ ఎనలేనిది. దురదృష్టవశాత్తు … ఆ విషయం చాల కొద్ది  మందికి మాత్రమే తెలుసు.

1954 జనవరి చందమామ లో ప్రారంభమైన  శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి తోకచుక్క రంగుల జానపద కథా ధారావాహిక నాటి  తెలుగునాట బాలల హృదయాల్లో గిలిగింతలు పెట్టింది. పిల్లలనే కాదు పెద్దలను సైతం అబ్బురంగా ఆకర్షించి ఊపిరి బిగపట్టేంత  ఉత్కంటకు గురిచేసిన ఆ ధారావాహిక … తరువాయి భాగం ఎప్పుడా అని మరుసటి నెల చందమామ కోసం ఎదురు చూసేలా చేసింది. చందమామ సర్క్యులేషన్ గణనీయంగా పెరగడానికి కారణభూతమైనది. ఆ ధారావాహిక విజయంతో  శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు వెనక్కు తిరిగి చూడలేదు.

తోకచుక్క (Jan-54 – June-55 )
మకరదేవత (July-55 – December 56)
ముగ్గురు మాంత్రికులు (January-57 – June 58)
కంచుకోట (July-58 – Dec-59)
జ్వాలాద్వీపం (Jan-60 – June-61)
రాకాసిలోయ (July-61 – May-64)
పాతాళదుర్గం (May-66 – Dec-67)
శిథిలాలయం (Jan-68 – Sept-70)
రాతిరథం (Oct-70 – April-72)
యక్షపర్వతం (May-72 – June-74)
మాయా సరోవరం (Jan-76 – June-78)
భల్లూక మాంత్రికుడు (July-78 – April-80)

ఇలా వరుసగా మొత్తం 12 ధారావాహికలు రాశారు. ఈ ధారావాహికల రుచి కేవలం అనుభవైక వేద్యం. నేడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న సంచలనాత్మక హెర్రిపోటర్ కథల కంటే  శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి కథలు, కథా కథనం లోనూ, పాత్రల సృష్టి లోనూ ఎన్నో రెట్లు మెరుగని నాటి పాఠకులకు, వాటిని చందమామలో పున: ప్రచురించినందున నేటి పాటకులకు … ఆస్వాదించిన వారికి మాత్రమే అర్థమౌతుంది. ‘శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం తెలుగు వాడవడం మన అదృష్టం ఆయన దురదృష్టం’ అని తెనాలి వాస్తవ్యులు శ్రీ వెలగా వెంకటప్పయ్య గారు అనేవారు.

కొడవటిగంటి కుటుంబరావు గారితో పాటు చందమామ సంపాదక వర్గంలో ఒకడుగా – చందమామ కథల ఎంపిక లోనూ, వాటిని తిరిగి వ్రాసే ప్రక్రియ లోనూ  శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి కృషి మరువలేనిది.1975 లో శ్రీ చక్రపాణి మరణానంతరం, ముఖ్యంగా 1980లో శ్రీ  కొడవటిగంటి కుటుంబరావు గారు మరణించాక చందమామ పత్రికా నిర్వహణలో శ్రీ విశ్వనాథ రెడ్డి గారికి  శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం వెన్నెముకలా వ్యవహరించారని చెప్పవచ్చు.

తెనాలికి సమీపం లోని పెద్ద గాజుల పర్రు లో 1922 అక్టోబర్25 న జన్మించిన శ్రీ సుబ్రహ్మణ్యం గారికి మరణించే నాటికి ఆయన వయసు 88 సం.లు

శ్రీ సుబ్రహ్మణ్యం గారు బాల సాహిత్యానికి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని బాల సాహిత్య పరిషత్తు ఈ సంతాప సభను ఏర్పాటు చేసింది.

చందమామ అభిమానులు, శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి అభిమానులు, ఆయన మిత్రులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనను ఎరిగినవారు ఈ సభకు హాజరై వారి మనోభావాలను పంచుకోవలసినదిగా మనవి.

(తేది 16 -02 -2010 మంగళవారం, సా: 5 గం.లకు నగర కేంద్ర గ్రంథాలయం, చిక్కడపల్లి, హైదరాబాద్.)


మరిన్ని వివరాలకు కింది చిరునామాలో సంప్రదించండి.

Dasari Venkata Ramana
General Secretary,
Bala Sahitya Parishattu,
5-5-13/P4, Beside Sushma Theatre,
Vanasthalipuram, HYDERABAD – 500070.
04024027411. Cell: 9000572573.
email: dasarivramana@gmail.com

దాసరి వెంకటరమణ గారి పాత మెయిల్ వివరాలు -త్రివిక్రమ్ గారిద్వారా పంపినవి-  కూడా కింద పొందుపరుస్తున్నాము.

దాసరి సుబ్రహ్మణ్యం గారు ఈ మధ్యే పరమపదించారు. మీకు ఈ విషయం బహుశా వార్తా పత్రికల ద్వారా తెలిసివుంటుంది. ఈ నెల పదహారో తేదిన మంగళ వారం సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ లెక్చర్ హాలు నందు సంస్మరణ సభను బాల సాహిత్య పరిషత్తు హైదరాబాద్ పక్షాన ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఈ నెల ఇరవై ఒకటో తేది ఆదివారం విజయవాడలో ప్రజాసాహితి పక్షాన ఏర్పాటు చేయటం జరిగింది. ఈ విషయం చందమామ అభిమానులకు తెలియచేయగలరు.

రచన వచ్చే సంచికను -ఏప్రిల్- దాసరి సుబ్రహ్మణ్యం సంస్మరణ సంచికగా వేయటానికి రచన శాయి గారు నిశ్చయించారు. ఆవిషయమై ఒకసారి శ్రీ శాయి గారితో మాట్లాడండి.

Y V S R S Talpa Sai
Editor – RACHANA Telugu Monthly
1-9-286/2/P Vidyanagar
Hyderabad – 500 044
e mail : rachanapatrika@gmail.com
Ph : 040 – 2707 1500
Mobile : + 99485 77517
visit : www.rachana.net

మీ స్పందన కోసం ఎదురు చూస్తూ. – దాసరి వెంకట రమణ

NB: దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ గురించిన ప్రకటనను చందమామతో పంచుకున్నందుకు శ్రీ వెంకట రమణ గారికి కృతజ్ఞతలు.

RTS Perm Link

కథల మాంత్రికుడికి చందమామ నివాళి

February 12th, 2010
శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం

శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం

చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు కాలం చేశారు. ఆయన వయస్సు 85 ఏళ్లు. ఆయన అస్తమయంతో ‘చందమామ’ తొలినాటి వెలుగుల్లో మరొకటి ఆరిపోయింది. ఆయన కన్నుమూసిన విషాదవార్తను చందమామ అభిమానులకు, పాఠకులకు తెలియజేయడానికి తీవ్రంగా విచారిస్తున్నాం.

సుబ్రహ్మణ్యంగారు తన 29 వ ఏట చందమామ పత్రికలో చేరారు.‘చందమామ’ అనే పేరుతో చక్రపాణిగారు ప్రారంభించిన పిల్లల మాసపత్రికలో కొడవటిగంటి కుటుంబరావుగారితో పాటు ఈయన 1952వ సంవత్సరంలో చేరారు. 2006 దాకా అందులోనే కొనసాగారు. కథా కల్పనలో, ధారావాహికల రచనా ప్రక్రియలో అసాధారణ ప్రతిభ కలిగిన ఈయన అయిదు దశాబ్దాలపాటు చందమామలో పనిచేశారు. యాభైల మొదట్లో ‘చందమామ’ చేయి పట్టుకుంది మొదలుగా యాభైనాలుగు ఏళ్లపాటు చందమామలో అవిశ్రాంతంగా పనిచేసిన దాసరిగారు దేశవ్యాప్తంగా కథల ప్రేమికులకు కథామృతాన్ని  పంచిపెట్టారు.

అన్వర్ గారి పెయింటింగ్

అన్వర్ గారి పెయింటింగ్

తోక చుక్క, మకర దేవత, రాతి రథం, యక్ష పర్వతం. జ్వాలాదీపం, కంచుకోట, ముగ్గురు మాంత్రికులు, పాతాళ దుర్గం,రాకాసి లోయ, మాయా సరోవరం, శిధిలాలయ వంటి అద్బుత ప్రజాదరణ పొందిన ధారావాహికలను సృష్టించిన చందమామ కథల మాంత్రికుడు దాసరిగారు. ఆయన వ్రాసిన చిట్టచివరి ధారావాహిక భల్లూకమాంత్రికుడు. చందమామలో సీరియళ్ల శకం అంతటితో ముగిసింది.

చందమామ పాఠకులందరికీ ఇవి ఎంతో ఇష్టమైన కథలు. చందమామలో ధారావాహిక రచనలు ముగిసి 32 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఈనాటికీ పాత, కొత్తతరాల పిల్లలు, పెద్దలు ఆయన సీరియల్స్‌ను మళ్లీ ప్రచురించవలసిందిగా కోరుతూ చందమామకు ఉత్తరాలు రాస్తున్నారు.

దాసరి గారి స్వదస్తూరి

దాసరి గారి స్వదస్తూరి

ఆణిముత్యాల వంటి పన్నెండు జగమెరిగిన ధారావాహికలను సృష్టించిన చందమామ కథల మాంత్రికుడు ఇక లేరు. తెలుగు పిల్లలకు, దేశంలోని పిల్లలు పెద్దలందరికీ ఎంతో ఇష్టమైన పాత్రలను తన కథల్లో సృష్టించారు. ఆయన ధారావాహికలు మొదలై కొనసాగిన కాలం -1954-78- చందమామ చరిత్రలో కథల స్వర్ణయుగం. పిల్లలతో పాటు పెద్దల మనస్సులను కూడా మంత్రజగత్తులో విహరింపజేసి, ఓలలాడించిన రమణీయ కథాకథన శైలి ఆయన స్వంతం.

ధారావాహికలలో పాత్రలకు ఆయన పెట్టిన పేర్లు చందమామ పాఠకుల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా మిగిలిపోయాయి. ఖడ్గవర్మ, జీవదత్తుడు, పింగళుడు, శిఖిముఖి, విక్రమకేసరి,  కాలశంబరుడు, సమరసేనుడు, ఏకాక్షి,  మహాకలి, దూమకసోమకులు, కాంతిసేన, జయమల్లుడు, కేశవుడు వంటి జానపద కథల పాత్రలను ఎన్నిటినో ఆయన పిల్లలకు పరిచయం చేసారు. చిత్ర విచిత్ర పేర్లతో సాగే ఆయన సీరియల్ పాత్రలు పాఠకుల నోళ్లలో ఇప్పటికీ నానుతుంటాయి.

సుబ్రహ్మణ్యంగారి రచనలకు గీటురాయి పాఠకుల ఆదరణే. చందమామకు విపరీతమైన ప్రజాదరణ తెచ్చిపెట్టిన మొదటి రంగుల సీరియల్ ఆయనే రాసేవారు. 1960లలో కొన్నేళ్ళు సంచిక చివరి పేజీలలో పడిన ఒకపేజీ ‘చిత్రకథ’ను కూడా ఆయనే రాసేవారు. ఇదికాక ప్రతినెలా చందమామ సంచిక ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారు.

దాసరి గారి కథలూ చిత్రాగారి బొమ్మలూ చందమామలో ఒకదానికొకటి ప్రేరణగా తొలినుంచీ పనిచేశాయి. కేవలం చిత్రాగారి అద్భుత చిత్ర సృష్టికోసమే దాసరి గారు తన కథల్లో చిత్రవిచిత్ర పాత్రలను ప్రవేశపెడుతూ వచ్చారంటే ఈ ఇద్దరి జోడీ చందమామలో ఎంత చక్కగా అల్లుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. వారిద్దరూ చందమామకు ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చారు. చందమామ అభిమానుల మనసుల్లో వారిద్దరిదీ శాశ్వతస్థానమే.

కథల పట్ల ఆయన అంకితభావం, సంపాదకవర్గ సభ్యుడిగా ఆయన పాటించే క్రమశిక్షణ, సహోద్యోగులతో నెరపిన స్నేహం, నిష్కల్మషమైన అభిమానం మాత్రమే కాదు. చందమామ చరిత్రలోనే పాఠకులతో అత్యంత సజీవ, సహజ సంబంధాలను కొనసాగించిన ఏకైక వ్యక్తి దాసరి సుబ్రహ్మణ్యం గారు.

అరవైఏళ్లకు పైగా కథాసాహిత్య ప్రచురణలో కొనసాగుతున్న చందమామలో ఓ శకం ముగిసింది. చందమామ స్వర్ణయుగానికి కారణభూతులైన సంపాదకవర్గంలో చివరి సభ్యుడు కన్నుమూశారు. చందమామ శంకర్ గారు మాత్రమే పాతతరంలో మిగిలి ఉన్న ఏకైక మాన్యులు.

ఆరు దశాబ్దాలపాటు బాలబాలికల ఊహా ప్రపంచాన్ని తన ధారావాహికల ద్వారా వెలిగిస్తూ వస్తున్న శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి చిరస్మరణీయమైన స్మృతికి చందమామ అంజలి ఘటిస్తోంది. పత్రికా ప్రచురణలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ, చక్రపాణి, కొకు, దాసరి తదితర మాన్యులు ప్రతిష్టించిపోయిన అత్యున్నత కథా సాహిత్య విలువలను శక్తి ఉన్నంతవరకు కొనసాగిస్తామని చందమామ వాగ్దానం చేస్తోంది.

దాసరి సుబ్రహ్మణ్యంగారి అస్తమయ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, సోదరుడి కుమార్తె శ్రీమతి గోళ్ల ఝాన్షీ గారికి ‘చందమామ’ తన ప్రగాఢ సానుభూతి తెలుపుతోంది.

(ఈ కథనంలోని ఇమేజ్‌లు శ్రీ వేణు, శ్రీ అన్వర్ సౌజన్యంతో. దాసరి గారి పెయింటింగ్ వేసి పంపిన అన్వర్ గారికి కృతజ్ఞతలు )

RTS Perm Link

దాసరి సుబ్రహ్మణ్యం గారు….

January 29th, 2010
దాసరి సుబ్రహ్మణ్యం గారు

దాసరి సుబ్రహ్మణ్యం గారు

చందమామ కథల మాంత్రికుడు, చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు కన్నుమూశారన్న వార్తను అమెరికా నుంచి శ్రీ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు నిన్ననే మెయిల్ పంపించారు. అప్పటికే ఈ వార్త తెలిసి విషాదంలో ఉన్నప్పుడు ఈ మెయిల్ రావడంతో చందమామతో రోహిణీ ప్రసాద్‌గారికి ఉన్న బాంధవ్యాల దృష్ట్యా దాసరి గారితో తన జ్ఞాపకాలను చందమామతో పంచుకోవలిసిందిగా అభ్యర్థించాము.

ఆయన సత్వరమే స్పందించి మూడు పుటల జ్ఞాపకాలను పంపారు. చందమామలో దాసరి గారి జీవితం గురించి, తోకచుక్క మినహా ఆయన రాసిన మిగతా ధారావాహికలు అన్నింటినీ బైండు చేయించి తనకు బహూకరించడం గురించి ప్రసాద్ గారు మనతో పంచుకున్నారు. తోకచుక్క మినహా దాసరి గారు బహూకరించిన ఆయన సీరియల్స్ అన్నీ ఇప్పటికీ ప్రసాద్ గారివద్ద ఉన్నాయట.

చందమామ కథలు, ప్రెస్, ప్రూఫ్‌రీడింగ్, ఫైనల్ ప్రింటింగ్ వంటి వివరాలతో కూడిన సమగ్ర చార్టును ముద్దా విశ్వనాధం గారు రూపొందించడం గురించిన అరుదైన విశేషాలను ప్రసాద్ గారు తన జ్ఞాపకాలలో తెలిపారు. ప్రతి కథా ఎప్పుడు ప్రెస్‌కు వెళ్ళిందో, ఎప్పుడు ప్రూఫ్‌రీడింగ్‌కు వచ్చిందో, తిరిగి ఫైనల్ ప్రింటింగ్‌కు ఎప్పుడు పంపారో వగైరా వివరాలన్నీ నమోదు చేసేవారట. సంచిక సవ్యంగా వెలువడడానికి ఈ చార్ట్ ఉపయోగపడేదట.

చందమామ పత్రిక 1947లో మొదలైనప్పటినుంచి 1990ల వరకు అంటే ముద్దా విశ్వనాధం గారు జీవించి ఉన్నంతవరకు చందమామ చార్ట్ నిరవధికంగా రూపొందుతూ వచ్చిందని నిన్ననే తెలిసింది. దురదృష్టం అనే పదం వాడవచ్చో లేదో తెలియదు కానీ ఈ అమూల్యమైన రికార్డు చిట్టా ప్రస్తుతం చందమామ కార్యాలయంలో లేదు. కారణాలు ఏమయినా కావచ్చు.. అమూల్యమైన చందమామ కథల చరిత్ర భాండాగారం తప్పిపోయింది. చందమామ అంతర్గత విషయాలకు సంబంధించినంతవరకు  అది పెద్ద నిధి.  కానీ పోగోట్టుకున్నాం.

దాసరి సుబ్రహ్మణ్యంగారి రంగుల సీరియల్ అంటే అంతగా ఆసక్తిచూపని చక్రపాణి గారు ఆయన సీరియల్‌ను ఆపించి దుర్గేశనందిని, నవాబునందిని అనే బంకించంద్ర బెంగాలీ నవలలను నాన్న కుటుంబరావుగారి చేత రాయించారని, వెంటనే చందమామ సర్క్యులేషన్ పడిపోగా మళ్ళీ సుబ్రహ్మణ్యంగారి సీరియల్ ప్రారంభించవలసివచ్చిందని రోహిణీ ప్రసాద్ గారు ఈ జ్ఞాపకాలలో చెప్పారు. ప్రసాద్ గారి నిష్పాక్షికవైఖరికి అభినందనలు.

ఇలాంటి ఎన్నో విలువైన విషయాలపై దాసరిగారితో తన జ్ఞాపకాలను రోహిణీప్రసాద్ గారు చందమామ పాఠకులతో పంచుకున్నారు. ఆయనకు చందమామ తరపున మనఃపూర్వక కృతజ్ఞతలు. ఆయన జ్ఞాపకాలను ‘దాసరి సుబ్రహ్మణ్యంగారు’ పేరిట చందమామ వెబ్‌సైట్‌లో ప్రచురించాము. వాటిని కింది  లింకులో చూడగలరు.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2417

దాసరి గారి ఫోటో: సాక్షి పత్రిక సౌజన్యంతో

RTS Perm Link

చందమామ కథల మాంత్రికుడు ఇక లేరు

January 28th, 2010

Dasari Subrahmanyam_450

చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు కన్నుమూశారు. 1952లో చందమామ చేయి పట్టుకుంది మొదలుగా 54 ఏళ్లపాటు చందమామలో అవిశ్రాంతంగా పనిచేసి తెలుగు జాతికి, భారతీయ కథల ప్రేమికులకు కథామృతాన్ని మంచిపెట్టడమే కాక,  ఆణిముత్యాల వంటి 12 జగమెరిగిన ధారావాహికలను సృష్టించిన చందమామ కథల మాంత్రికుడు ఇక లేరు. ఆయన వయస్సు 85 ఏళ్లు. ఆయన కనుమూసిన వార్తను చందమామ అభిమానులకు, పాఠకులకు చెప్పడానికి తీవ్రంగా విచారిస్తున్నాం.

ఎనిమిది పదుల పైబడి వయసులో కూడా జీవించి ఉండటంపై తనకు తానే సెటైర్ వేసుకుంటూ ‘I am overstay here’ అని ఓ ఇంటర్వూలో చెప్పుకున్న సుబ్రహ్మణ్యం గారు జీవితం చివరివరకూ ఆరోగ్యంగానే ఉంటూ ఆస్పత్రుల జోలికి వెళ్లకుండా విజయవాడలో తన అన్న కుమార్తె గోళ్ల ఝాన్షీ ఇంటిలోనే చివరి శ్వాస విడిచారు. ఆయన మరణవార్తను కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారికి మెయిల్ చేస్తూ ప్రజాసాహితి సంపాదకులు దివికుమార్ గారు వ్యాఖ్యానించినట్లుగా తనను ఆసుపత్రిలో చేర్పించడానికి కూడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దాసరి గారు సునాయాస మరణం పొందారు.

“Daasari Subrahmanyam garu passed away.Very easy death, not given any chance to hospitalise -DVK”

చందమామ కథల మాంత్రికుడు : దాసరి సుబ్రహ్మణ్యం

భల్లూక మాంత్రికుడు

భల్లూక మాంత్రికుడు

దాసరి సుబ్రహ్మణ్యం గారు 29వ ఏట చందమామ పత్రికలో అడుగుపెట్టారు. కథా కల్పనలో, ధారావాహికల రచనా ప్రక్రియలో అసాధారణ ప్రతిభ కలిగిన ఈయన అయిదు దశాబ్దాలపాటు చందమామలో పనిచేశారు. బాల సాహిత్య రచనలో ఆయన ప్రతిభాపాటవాలను స్వంతం చేసుకోవాలని అప్పటి పత్రికలు తీవ్రంగా ప్రయత్నించినా ఆయన చందమామకే చివరివరకూ అంకితమయ్యారు.

చక్రపాణి గారి దార్శనికత, కుటుంబరావు గారి ఒరవడికి చందమామ చిత్రకారుల మంత్రజాలం తోడవటం, మొదట్లో రాజారావు, ముద్దా విశ్వనాధం గార్లు తర్వాత దాసరి సుబ్రహ్మణ్యం గారు తదితర శక్తివంతమైన రచయితల మేళవింపుతో కూడిన చందమామ సంపాదక బృందం దన్ను చందమామకు స్వర్ణయుగాన్ని తెచ్చిపెట్టాయి.

బాల్యం
తెనాలి సమీపంలో చుండూరు రైల్వేస్టేషన్ వద్ద ఉన్న పెద గాజులూరులో దాసరి సుబ్రహ్మణ్యం జన్మించారు. పెద్దగా చదువుకోనందున జన్మదినం గురించిన రికార్జులు నమోదు కాకపోవడంతో తన అక్కగారి వయసు ననుసరించి ఆయన లెక్కగట్టిన ప్రకారం 1922లో ఆయన పుట్టారు. కుటుంబ పెద్దలు 1929లో గాజులూరులో ఉన్న కొద్ది పొలాన్ని అమ్మి రేపల్లె సమీపంలోని కైతేపల్లి గ్రామానికి వెళ్లారు. అక్కడ కూడా పొలాలు సరిగా పండకపోవటంతే 1932 ప్రాంతాల్లో రేపల్లె చేరారు. తర్వాత అక్కడే ఆయనకు వివాహమై ఓ కూతురు పుట్టింది.

అయితే తన జీవిత కాలంలో అధికభాగం ఆయన మద్రాసులో ఒంటరిగానే గడిపారు. చందమామలో చేరింది మొదలుకుని ఆయన మద్రాసులో ఒకే అద్దె ఇంటిలో యాభైఏళ్లకు పైగా గడపడం విశేషం. ఓ ప్రత్యేక కారణం వల్ల మద్రాసులో అయిదు దశాబ్దాలకు పైగా తానున్న అద్దె ఇంటిలో తన వాటాను ఇప్పటికీ చెల్లిస్తూ చెన్నయ్‌తో తన సంబంధాన్ని ఈనాటికీ పరోక్షంగా కొనసాగిస్తున్నారు.

చందమామ ధారావాహికల వైభవం

తోకచుక్క

తోకచుక్క

1954 నుంచి ఈ నాటిదాకా చందమామ పాఠకులు ఎప్పటికీ మరవలేకపోతున్న అద్భుత ధారావాహికల అపరూప సృష్టికర్త దాసరి సుబ్రహణ్యం గారు. చందమామ తొలి సంపాదక వర్గ బాధ్యుడిగా పనిచేసిన రాజారావు -చక్రపాణి గారి బంధువు- గారు రాసిన విచిత్ర కవలలు చందమామలో తొలి సీరియల్‌గా చరిత్రకెక్కింది. ఈ సీరియల్ ముగిసిన కొన్నాళ్లకే రాజారావు గారు ఆకస్మికంగా మరణించడంతో చందమామలో తదుపరి సీరియల్ రాసే అరుదైన అవకాశం దాసరిగారి ముందు నిలిచింది.

దాసరిగారు రాయనున్న తోకచుక్క సీరియల్‌ కోసం చిత్రాగారు గీసిన చిత్రాలతో ముందు నెలలోనే చందమామలో ప్రకటన చేయడంతో ఆ సీరియల్‌కు ఎనలేని ప్రాచుర్యం లభించింది. సుబ్రహ్మణ్యం గారి ధారావాహికల వైభవోజ్వల శకం 1954లో అలా మొదలైంది. తన తొలి సీరియల్ రచన తోకచుక్క మొదలుకుని 1978లో భల్లూక మాంత్రికుడు వరకు పాతికేళ్ల పాటు చందమామలో దాసరి గారి ధారావాహికలు నిరవధికంగా ప్రచురించబడుతూ వచ్చాయి. ఓ కథారచయితకు, బాల సాహిత్య ధారావాహికల రచయితకు ఇంతకు మించిన గుర్తింపు మరొకటి లేదు.

ప్రత్యేకించి.. 1950, 60, 70ల కాలంలో చందమామ పాఠకులు దాసరి వారి సీరియళ్ల మంత్ర జగత్తులో విహరించారు. నాటి తరం వారే కాకుండా 80ల తర్వాత పుట్టిన తరం పిల్లలు కూడా నేటికీ దాసరి వారి ధారావాహికలను మళ్లీ ప్రచురించవలసిందిగా ఒత్తిడి చేసిన కారణంగా చందమామ పత్రికలో ఇటీవల కాలంలో వరుసగా రాకాసిలోయ, పాతాళదుర్గం సీరియళ్లను  ప్రచురించడం జరిగింది. పాతాళదుర్గం సీరియల్ త్వరలో ముగియనుండటంతో తదుపరి సీరియల్‌గా దాసరి వారి తొలి ధారావాహిక అయిన తోకచుక్కను త్వరలో ప్రచురించబోతున్నాము.

దాసరి వారి 12 ధారావాహికల జాబితా

తోకచుక్క- 1954
మకర దేవత -1955
ముగ్గురు మాంత్రికులు -1957
కంచుకోట – 1958
జ్వాలాద్వీపం- 1960
రాకాసిలోయ- 1961
పాతాళదుర్గం – 1966
శిథిలాలయం- 1968
రాతిరథం- 1970
యక్ష పర్వతం- 1972
మాయా సరోవరం- 1976
భల్లూక మాంత్రికుడు- 1978

రాకాసిలోయ

రాకాసిలోయ

సీరియల్‌కు ఆయన చేసే పరిచయం చివరి పేజీ అయిపోయేంతవరకూ పాఠకుడిని చూపు మళ్లించకుండా చేస్తుంది. మొదటినుంచి చివరి దాకా సీరియల్ బిగి సడలకుండా చేయడంలో ఆయన చూపించిన నైపుణ్యం అనితరసాధ్యం. వ్యక్తిగత కారణాలతో 1978 తర్వాత ఆయన సీరియల్ రచనలు తనకు తానుగా మానుకున్నారు. అప్పటినుంచే చందమామలో సీరియల్స్ ప్రాభవం కనుమరుగవడం ప్రారంభమయిందంటే అతిశయోక్తి కాదు.

చందమామలో రంగుల బొమ్మల సీరియల్ అంటే తెలియనివారు ఉండరు. ఈ సీరియల్స్‌ను కూడా దాసరి సుబ్రహ్మణ్యం గారే రాశారు. 1952 నుంచి 2006 వరకు 54 సంవత్సరాల పాటు చందమామ సంపాదకవర్గ సభ్యుడిగా ఉండి, అనారోగ్య కారణంగా పదవీ విరమణ చేసిన దాసరి సుబ్రహ్మణ్యం గారు అప్పటినుంచి విజయవాడలో తన అన్న కుమార్తె ఝాన్సీ గారి ఇంట్లో ఉంటున్నారు.

శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం చిరునామా:

దాసరి సుబ్రహ్మణ్యం
c/o శ్రీమతి ఝాన్సీ
G-7
వైశ్యా బ్యాంక్ ఎంప్లాయీస్ అపార్ట్ మెంట్స్
దాసరి లింగయ్య వీధి
మొగల్రాజపురం, విజయవాడ-10
ఫోన్- 0866 6536677

చివరిరోజుల్లో వినికిడి సమస్య కారణంగా ఫోన్‌లో తనతో మాట్లాడటం కూడా కష్టమైపోయింది. ప్రత్యక్షంగా కలిసి మాట్లాడినప్పుడు కూడా స్వరంలో అస్పష్టంగా ఉండేదని తెలుస్తోంది.దాదాపు 85 ఏళ్లు దాటిన ప్రస్తుత సమయంలో కూడా చందమామ తాజా సంచికలోని కథలు, బేతాళ కథలుపై తన అభిప్రాయం చెబుతూ, మార్పులు సూచిస్తూ ఆయన ఇప్పటికీ చందమామతో పరోక్ష సంబంధంలో ఉంటున్నారు. ఇటీవలి వరకు ప్రింట్ చందమామ అసోసియేట్ ఎడిటర్‌గా ఉన్న బాలసుబ్రహ్మణ్యం గారితో పాతికేళ్ల పరిచయం, ఉద్యోగ సంబంధిత సహవాసం ఆయనకు మిగిలిన సుదీర్ఘ జ్ఞాపకాల్లో ఒకటి.

పాతాళదుర్గం

పాతాళదుర్గం

వైవిధ్య భరితమైన పాత్రలు, అడుగడుగునా ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, ఊహకు కూడా అందని మలుపులు దాసరి గారి ధారావాహికల సహజ లక్షణంగా ఉంటాయి. వసుంధర గారు కౌముది.నెట్ వెబ్‌సైట్‌లో దాసరి గారి గురించి రాసిన పరిచయ వ్యాసంలో పేర్కొన్నట్లుగా  ఆయన ధారావాహికలలో “రాక్షసులూ, భూతాలూ, యక్షులూ, నాగకన్యలూ, రెక్కల మనుషులూ, మొసలి మనుషులూ, మరుగుజ్జు దేశస్థులూ, వృశ్చిక జాతివాళ్లూ, ఉష్ట్ర్ర యోధులూ, నరభక్షకులూ, మాంత్రికులూ, తాంత్రికులూ, ఆటవికులూ, అఘోరీలూ మాత్రమే కాకుండా గండభేరుండాలూ, పొలాలు దున్నే సింహాలూ, రథం నడిపే ఏనుగులూ” కూడా మనకు కనిపిస్తాయి.

ఆధునిక చదువులు పెద్దగా చదువుకోకపోయినప్పటికీ చిన్నతనంలో సోదరుడు వేంకటేశ్వర్లు -ఈశ్వర ప్రభు- ప్రభావంతో చదివిన ప్రాచీన కావ్యాలు, హేతువాద సాహిత్యం దాసరి గారి చందమామ కథలకు హేతువాదాన్ని జోడించాయి. చందమామ తొలినుంచి కూడా మతాలను నిరసించలేదు, ఇజాలకు తావివ్వలేదు కానీ  బాల సాహిత్యానికి అత్యవసరమైన హేతువాదానికి ప్రాధాన్యమివ్వడంలో కుటుంబరావు, సుబ్రహ్మణ్యం గార్ల పాత్రకు సాటిలేదు.

అన్నిటికంటే మించి ధారావాహికలలో పాత్రలకు ఆయన పెట్టిన పేర్లు చందమామ పాఠకుల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా మిగిలిపోయాయి. కాలశంబరుడు, ధూమకసోమకులు, కాంతిసేన, మహాకలి వంటి చిత్ర విచిత్ర పేర్లతో సాగే ఆయన సీరియల్ పాత్రలు పాఠకుల నోళ్లలో ఇప్పటికీ నానుతుంటాయి.

చందమామ సీరియళ్లలోని పాత్రల పేర్లకు పేర్లు పెట్టడం వెనుక నేపథ్య గమ్మత్తు కలిగిస్తుంది. ప్రాచీన సాహిత్యం బాగా చదివిన దాసరిగారు అమరకోశం, ఆంధ్రనామచంద్రిక వంటి పుస్తకాలలోని పేర్లను ఎన్నుకుని, మార్చి తన సీరియల్ పాత్రలకు పెట్టేవారట. చందమామ సంపాదక వర్గంతో చర్చించి పాత్రలకు తగిన పదాలను ఎన్నుకోవడంలో ఆయన చేసిన కసరత్తు చందమామ పాత్రలకు శాశ్వతత్వం కలిగించింది.

చందమామ పత్రిక విజయాలను, ఒడిదుడుకులను తనవిగా భావించి తీవ్రంగా స్పందించే దాసరిగారు చందమామలోని ఇతర ఉద్యోగులవలే ఆర్థిక ప్రతిఫలం విషయంలో అల్పసంతోషి. చక్రపాణి గారి తర్వాత ఎక్కువ సంవత్సరాలు చందమామ సంపాదకుడిగా వ్యవహరించిన విశ్వనాథరెడ్డి గారు చూపిన సానుకూల వైఖరి కారణంగా ఈయన చివరి వరకు చందమామలో ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేశారు.

1982 తర్వాత పాతికేళ్లపాటు చందమామ అసోసియేట్ ఎడిటర్ బాలసుబ్రహ్మణ్యం గారు దాసరి గారిపట్ల చూపించిన సౌజన్యం, ఔదార్యం కూడా ఇక్కడ తప్పక ప్రస్తావించాలి. చందమామలో అధిక పనిభారాన్ని మోస్తూ కూడా దాసరి గారి స్థానం చెక్కుచెదరకుండా చూడడంలో బాలసుబ్రహ్మణ్యం గారి సహాయం ఇంతా అంతా కాదని చెప్పాలి.

కథల పట్ల ఆయన అంకితభావం, సంపాదకవర్గ సభ్యుడిగా ఆయన పాటించే క్రమశిక్షణ, సహోద్యోగులతో నెరపిన స్నేహం, నిష్కల్మషమైన అభిమానం మాత్రమే కాదు. చందమామ చరిత్రలోనే పాఠకులతో అత్యంత సజీవ, సహజ సంబంధాలను కొనసాగించిన ఏకైక వ్యక్తి దాసరిగారంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.

కథ అందిన వెంటనే రచయితలకు కార్డు రాసి అందినట్లు తెలుపడం, ప్రచురణకు వీలుకాని రచనలను తిరుగు స్టాంపులు జతపర్చనివారికి కూడా తిప్పి పంపడం, కాంప్లిమెంటరీ కాపీ, పారితోషికం వగైరాల విషయంలో తనవి కాని బాధ్యతలు కూడా స్వీకరించడంలో దాసరి గారు అసాధారణమైన శ్రధ్దాసక్తులు ప్రదర్శించారు. -చివరకు ఆయన నాలుగేళ్లముందే చందమామనుంచి వైదొలిగినా ఈనాటికీ దాసరి సుబ్రహ్మణ్యం గారు, ఇన్‌ఛార్జ్ ఎడిటర్ పేరుతో పాఠకుల ఉత్తరాలు వస్తుంటాయంటే తరాల పాఠకులు, రచయితలు, అభిమానులపై ఆయన వేసిన సహృదయ ముద్ర మనకు బోధపడుతుంది.

ఈ కారణం వల్లే ఎందరో రచయితలు తమ కథలను ముందుగా చందమామకే పంపేవారంటే అతిశయోక్తి కాదు. తనకు రచన నచ్చినప్పటికీ, సాహిత్యేతర కారణాలతో యాజమాన్యం దానిపట్ల అభ్యంతరం చెప్పినప్పుడు దాన్ని సానుకూల దృక్ఫథంతో వ్యవహరించిన దాసరిగారు సంబంధిత రచయితలు నిరుత్సాహానికి గురి కాకుండా చూసేవారట. రచన బాగున్నప్పటికీ ఇతర కారణాల వల్ల ప్రచురణకు నోచుకోలేదని ప్రత్యేకంగా ఉత్తరం రాసి రచయితలకు సర్దిచెప్పేవారట.

స్కూలు చదువు కూడా పూర్తి చేయలేదనే మాటే గాని ప్రాచీన సాహిత్యాన్ని ఔపోశన పట్టిన దాసరి గారు హేతువాదిగా, కమ్యూనిస్టుగా మారిన క్రమంలో ఆంగ్లసాహిత్యాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. చందమామలో పనిచేసినంత కాలం ‘ది హిందూ’ పత్రికను క్రమం తప్పకుండా తెప్పించుకుని చదివేవారట. 1950 తదనంతర ప్రపంచ రాజకీయ, సామాజిక పరిణామాలపై తన పరిశీలనను వ్యక్తపరుస్తూ ఈయన మిత్రులకు, సమకాలీనులకు రాసిన అమూల్యమైన ఉత్తరాలను ఎవరయినా సేకరించగలిగి ముద్రించగలిగితే ఆయన సామాజిక దృక్పధం ప్రపంచానికి సుబోధకం కావచ్చు.

చందమామలో పేరులేని ఎడిటర్‌గా పాతికేళ్లపాటు కుటుంబరావుగారి ప్రాభవం వెలిగిపోతున్న రోజుల్లోనూ ధారావాహికల రూపంలో చందమామ విజయపతాకను ఎత్తిపెట్టిన అరుదైన రచయిత దాసరి.

అరవైఏళ్లకు పైగా కథాసాహిత్య ప్రచురణలో కొనసాగుతున్న చందమామలో ఓ శకం ముగిసింది. చందమామ స్వర్ణయుగానికి కారణభూతులైన సంపాదకవర్గంలో చివరి సభ్యుడు కన్నుమూశారు. చందమామ శంకర్ గారు మాత్రమే పాతతరంలో మిగిలి ఉన్న ఏకైక మాన్యులు.

చిరస్మరణీయమైన ఆయన స్మృతికి చందమామ అంజలి ఘటిస్తోంది. పత్రికా ప్రచురణలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ, చక్రపాణి, కొకు, దాసరి తదితర మాన్యులు ప్రతిష్టించిపోయిన అత్యున్నత కథా సాహిత్య విలువలను శక్తి ఉన్నంతవరకు కొనసాగిస్తామని చందమామ వాగ్దానం చేస్తోంది.

ఆయన అస్తమయ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యేకించి గోళ్ల ఝాన్షీ గారికి చందమామ తరపున ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాం.

దాసరి సుబ్రహ్మణ్యం గారి విశేషాలు తెలుసుకోవాలంటే వేణుగారి బ్లాగ్ చూడండి.

‘ఈనాడు’లో చందమామ కథల మాంత్రికుడు
http://venuvu.blogspot.com/2009/07/blog-post_18.html

“చందమామ రచయితను కలిసిన వేళ….”
http://venuvu.blogspot.com/2009/04/blog-post_16.html

చందమామకి వెన్నెముక- సుబ్రహ్మణ్య సృష్టి’ –వసుంధర
http://koumudi.net/Monthly/2009/april/index.html

చందమామ జ్ఞాపకాలు -కొడవటిగింటి రోహిణీ ప్రసాద్
http://www.eemaata.com/issue41/chandamama.html

 వికీపీడియాలో చందమామ వ్యాసాలు

http://చందమామ
http://చందమామ ధారావాహికలు

చందమామ సీరియల్స్ :

పాతాళదుర్గం పరిచయ వ్యాసం

చందమామ సీరియల్స్ ప్రారంభం 

http://చందమామలో పాతాళదుర్గం ధారావాహిక

http://ఆన్‌లైన్ చందమామ ధారావాహికలు

RTS Perm Link