మన రహంతుల్లాగారి తెలుగు గోస…

July 7th, 2011

ఆఫీసులో కాస్త పని తక్కువ ఉన్నట్లనిపిస్తే మళ్లీ బ్లాగ్ ప్రపంచంకేసి తొంగిచూస్తే నా కళ్లముందు ఒక అద్భుతం.

మళ్లీ మన రహంతుల్లా గారే…. మళ్లీ మన తెలుగు భాష మీదే… మన ఇంటి భాషమీదే నూరు జన్మల ప్రేమను ఒకేసారిగా కురిపిస్తూ మాలిక అనే వెబ్‌ పత్రిక ద్వారా ఒక బ్రహ్మాస్త్రాన్ని మనమీదికి వదిలారు. -మరుజన్మలున్నాయా లేవా అనేది మరోవిషయం-

“మన పల్లె భాషను గౌరవించుదాం. మన పక్కెలు, జెల్లలు, గెడ్డలు, మదుములు, పరసలు, పరజలు,… ఇంకా నీచమని భావించి మన సంస్కృతాభిమాన పండితులు వదిలేసిన తెలుగు పదాలన్నీ తెలుగు నిఘంటువుల్లోకి ఎక్కిద్దాం.” అంటూ ఆయన తొలిబాణం వదిలింది మొదలు ఈ పెద్ద వ్యాసం రూపంలోని పెద్ద గోసను ముగించేవరకు రెప్పవేయకుండా చదివాను.

‘ప్రజలు మనకంటే ఎంతో గొప్పవారు.. వారికి నేర్పడానికి ముందు మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ఒక మహా నేత చెప్పిన ఆ మంత్ర వాక్యాలు మళ్లీ మళ్లీ గుర్తొచ్చాయి నాకయితే.

కొల్లేరు ప్రజలు తమకు తెలిసిన చేపల,పక్షుల రకాలను ఈ వ్యాసంలో చదువుతుంటే ఒళ్లు గగుర్పొడిచింది నాకు.

మట్టగిడస, కర్రమోను, బొమ్మిడాయి, శీలావతి, గొరక, ఇంగిలాయి, జెల్ల, బొచ్చె, జడ్డువాయి, చేదు పరిగె, కొరమీను, వాలుగ, పండుకప్ప, గండి బొగడ, కొయ్యంగ, మునుగపాము, గడ్డు గాయి, చామరాయి, పొట్టిదిలాసు, కట్టినెరసు, బుడపార, చాకరొయ్య, గడ్డికొయ్య, మాల తప్పడాలు, ఏటిజెల్ల, మార్పులు, పల్లెంకాయ, పాలజెల్ల, పారాటాయి….

మిత్రులారా చదువుతున్నారా? ఇవన్నీ మన తెలుగు నేలమీద జనం నోట్లో ఇంకా ఊరుతున్న, చేపల  రకాలను సూచించే పదాలివి.

మెదక్ జిల్లా రాయికోడు మండలం షంషుద్దీన్ పూర్ గ్రామనివాసి ఏర్పుల కమలమ్మ స్వయంగా సాగుచేసి సరఫరా చేస్తున్న 50 రకాల విత్తనాల పేర్లు చూడండిః

“తైదలు, ఉలవలు, సజ్జలు, పచ్చజొన్నలు, తోక జొన్నలు, తెల్లమల్లెజొన్న, ఎర్రజొన్న, బుడ్డజొన్న, అత్తకోడళ్ళ జొన్న, నల్లతొగరి, ఎర్రతొగరి, తెల్లతొగరి, అనుములు, కొర్రలు, బొబ్బర్లు, పెసర్లు, వడ్లు, తెల్లనువ్వులు, ఎర్రనువ్వులు, గడ్డినువ్వులు, పుంట్లు, శనగలు, ఆవాలు, తెల్లకుసుమ, ధనియాలు, వాము, బటాని, సిరిశనగ, మిరప, కోడిసామలు, పల్లీలు, గోధుమ, సాయిజొన్న, నల్లకుసుమ, అవశలు, లంకలు, సిరిశనగ.”

“ఈ తెలంగాణా తల్లికి ఏమి ఇంగ్లీషొచ్చు అయినా ఈ తెలుగు నేల తల్లులు ఎన్నో వందల ఏళ్ళనుండి మొక్కల పేర్లు, విత్తనాల పేర్లు మక్కువగా గుర్తు పెట్టుకొని వ్యవసాయం నడపలేదా? ఇంగ్లీషు, లాటిన్ పదాలకిచ్చిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత మన తెలుగు పదాలకు కూడా ఇవ్వలేకపోవటానికి కారణం ఏమిటి? మనం మనకి అర్థం కాకపోయినా, ఇంగ్లీషు వాళ్ళకు అర్థం కావాలి.”

వీటిలో పావుశాతం పేర్లు అయినా ప్రస్తుత తరం తెలుగువాళ్ల జ్ఞాపకాల్లో ఉంటున్నాయా?

ఇరవయ్యేళ్లు పల్లెటూరికి దూరం కాగానే మమతలు, అనురాగాలనే కాదు బాల్యజీవితం పొడవునా నీడనచ్చి చల్లదనం పంచిపెట్టిన చెట్ల పేర్లు కూడా మర్చిపోతున్న పాడుజీవితం మనది.

రహంతుల్లాగారు, తెలుగు భాషను చంపొద్దంటూ తెలుగు పట్ల భక్తిని రంగరించి సంధించిన ములుకులు మనలో కాస్త లోతుగా గుచ్చుకుని ఉంటే గుచ్చుకోనివ్వండి. కాని ఆయన  తన వ్యాసంలో చేసిన ఔద్దత్య ప్రకటనను చూస్తే ఆయన ధర్మాగ్రహం వెనుక నేపథ్యం కాస్తయినా అర్థమవుతుంది.

“అత్యధిక జనాభా మాట్లాడేభాషను నాశనం చేస్తూ పరాయిభాషకు పట్టం గట్టడం అంటే పరస్త్రీ ముందు భార్యను అగౌరవపరచటం లాంటిది. ఇది భాషా వ్యభిచారం, అనైతికం, అసహజం, తెలుగు జాతి ప్రజల హక్కుల ఉల్లంఘన.” అంటున్నారీయన.

నాకయితే వణుకు పుడుతోంది పై అక్షర శస్త్రాలను చూస్టుంటే.

“తెలుగును ప్రాచీన భాషగా ప్రకటించాలని అన్ని పార్టీలవాళ్లూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కేంద్రానికి పంపారు. కోర్టుకు గూడా వెళ్ళారు. కొద్ది రోజులకే జార్జిబుష్ హైదరాబాద్ రావటం, సిలికాన్ వ్యాలీలో ఉన్న ప్రతి ముగ్గురు భారతీయ ఉద్యోగుల్లో ఒకరు ఆంగ్లప్రదేశ్‍కు చెందిన వారేనని తేల్చటం, దిల్‍కుష్ అతిథి భవనంలో అమెరికా వెళ్ళటానికి వీసాలిచ్చే కేంద్రం పెడతామనటం, మన మధ్యతరగతి కుటుంబాలన్నిటికీ ఇంగ్లీషు ఉచ్చు బిగించిపోవటం చకచకా జరిగి పోయాయి. మరోసారి తాజాగా తెలుగుతల్లి సాక్షిగా ఉద్యోగాల కోసం మన పెద్దలు మోకరిల్లారు”

“మన సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, విద్య, పరిపాలన మన భాషలోనే ఉండాలి. కంప్యూటర్ కోసం తెలుగును బలి పెట్టటం ఎలుకలున్నాయని ఇంటికి తగులబెట్టడంతో సమానం. కంప్యూటర్‍నే తెలుగులోకి వంచుతాం. ఎన్నో భాషల గ్రంథాలు ఇంగ్లీషులోకి అనువదించుకున్నారు. అవసరం అటువంటిది.”

‘కంప్యూటర్‌నే తెలుగులోకి వంచుతాం…’ అంటున్నారీయన.

ఫ్రౌఢ డిండిమభట్టు ఔద్ధత్యం ఎలా ఉండేదో తెలీదు కాని, ఈ మధ్య కాలంలో తెలుగు వాక్యంలో ఇంత ఔద్ధత్య ప్రకటనను నేను చూడలేదంటే చూడలేదు.

తెలుగు భాషా ప్రేమికుడిగా మనందరికీ ఎంతకాలంగానో తెలిసి ఉన్న మన రహంతుల్లాగారి ఒక్కో వ్యాక్యం ఒక్కో ఉల్లేఖనలా కనిపిస్తోంది.

మనం ఏం కోల్పోతున్నామో, మన పిల్లలకు ఏం జరుగబోతోందో తెలుసుకోవడానికయినా ఆయన వ్యాసం పూర్తి పాఠాన్ని కింది లింకులో చూడగలరు.

ఇంటి భాషంటే ఎంత చులకనో!
http://magazine.maalika.org/?p=193

ఈ రోజే ఈ వెబ్‌పత్రికను పరిచయం చేసిన వలబోజు జ్యోతి గారికి కృతజ్ఞతలతో…

చందమామ

RTS Perm Link