చందమామ చిత్ర బ్రహ్మ వపా విశ్వరూపం

September 14th, 2011

గణపతి విశ్వరూపం

చందమామ సెప్టెంబర్ సంచిక మార్కెట్లోకి ఆగస్ట్ 25వ తేదీనే వచ్చేసింది. పాఠకులందరికీ మహదానందం. వినాయక చతుర్థి పర్వదినానికి ఐదు రోజుల ముందే గజాననుడి ముఖచిత్రంతో కనులవిందుగా, కంటికింపుగా చందమామ. నిజంగా కవర్ పేజీపై ఉన్నది వినాయకుడి విశ్వరూపం కాదు. చందమామ అపర చిత్ర బ్రహ్మ వపాగారి విశ్వరూపం అంటే ఇంకా ఖచ్చితంగా ఉంటుందేమో. బ్రహ్మ మహేశ్వరులను కూడా అవలీలగా అలా పక్కన పెట్టిన చిత్రరాజసం వపాగారికి తప్ప మరెవరికి చెల్లుతుంది మరి!  ఈ ముఖ చిత్రం కోసం చందమామ వర్ణన కూడా కింద చదవగలరు.

అట్టమీది బొమ్మ
విశ్వరూపం

ఈ నెల ముఖచిత్రాన్ని -సెప్టెంబర్ 2011- దివంగతులైన మా సీనియర్‌ చిత్రకారుడు శ్రీ వడ్డాది పాపయ్య 1980లలో చిత్రించారు. వినాయక చవితి వర్వ దినం సందర్భంగా ఈ చిత్రాన్ని ఈ నెల అట్టమీది బొమ్మగా తిరిగి ప్రచురిస్తున్నాము.

గణపతి తన అయిదు తలలతో భారీ రూపం ధరించిన నేపథ్యంలో ఆ విశ్వరూపాన్ని ఈ చిత్రం ప్రదర్శిస్తోంది. బ్రహ్మదేవుడు గణేశ విగ్రహ విశేషాలను వివరిస్తూ కథ చెబుతాడు.

ఒకసారి స్వర్గాధిపతి దేవేంద్రుడు, ఐరావతం సహోదరుడైన గజేంద్రుడిని అవమానిస్తాడు. ఈ సందర్భంగా ‘దేవేంద్రుడు ఏదో ఒక రోజు తన ముందు తలవంచుతాడ’ని గజేంద్రుడు జోస్యం చెబుతాడు. ఆ సందర్భాన్ని తలపిస్తూ ఏనుగు తలను తనదిగా చేసుకున్న వినాయకుడి విశ్వరూపానికి దేవేంద్రుడు మొక్కుతాడు. గణపతిని తాను గతంలో అవమానించినందుకు పశ్చాత్తాపం తెలుపుతూ ఇంద్రుడు తన చెవుల్ని రెండు చేతులతో పట్టుకుంటాడు.

ఈ దృశ్యాన్ని బ్రహ్మదేవుడు మరింత వివరంగా వర్ణిస్తున్నాడు. విఘ్నేశ్వరుడు పూర్తిగా బ్రహ్మ సృష్టి. అయిదు గణాలు లేదా పంచభూతాలను -నీరు, గాలి, అగ్ని, భూమి, ఆకాశం-  తనలో కలిగి ఉన్నందున అతడు మహాగణపతి అయ్యాడు. భౌతిక, మానసిక శక్తులకు ప్రతీకగా గణపతి ఏనుగుతొండం నిలుస్తుంది. ఇతడి విశ్వరూపంలో ఈ అంశమే వ్యక్తీకరించబడింది.

అదే సమయంలో అతడు తన చిన్న వాహనమైన మూషికంపై ప్రయాణిస్తుంటాడు. ఏనుగు తల రెండు చిన్న కళ్లను కలిగి ఉంటుంది. కాని అవి సూక్ష్మాతి సూక్ష్మ వస్తువులను కూడా చూడగలిగేటంత శక్తిమంతంగా ఉంటాయి. అంటే గణపతి చూపునుంచి ఏదీ దాక్కోలేదని ఇది తెలుపుతుంది. అతడి పెద్ద చెవులు విశ్వం లోని ఏమూల నుంచైనా భక్తులు చేసే ప్రార్థనలను వినగలుగుతాయి. అదేవిధంగా పొడవాటి తొండం తను కోరుకున్న ప్రతిదాన్ని అందుకోగలుగుతుంది.

ఆవిధంగా విశ్వ సంపదను మొత్తంగా అతడు పొందగలిగే స్థానంలో ఉన్నాడు. ఏదైనా కార్యాన్ని సాధించాలని కోరుకునే ప్రతి ఒక్కరూ మొదటగా విఘ్నేశ్వరుడినే పూజిస్తారు. విఘ్నేశ్వరుడు భాద్రపద మాసంలోనే అవతరించాడు.

అందుకనే భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థినాడు విఘ్నేశ్వరుడిని పూజించినవారికి కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయని ఒక నమ్మకం. ఆవిధంగా కార్యసాధనలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని ఎదుర్కొనేందుకు కావలసిన శక్తిని, ధైర్యాన్ని వీళ్లు పొందుతారు.

ఈ నెల అట్టమీది బొమ్మను, దానితో పాటు ప్రచురించిన ఉన్న కథను మీరు ఆస్వాదించారని భావిస్తున్నాము. వచ్చే నెలలో కూడా అట్టమీద బొమ్మ రూపంలోని మరొక చందమామ సుందరమైన కళా సృష్టితో మీ ముందుకు వస్తాము.”

ఈనెల చందమామపై పాఠకుల లేఖలు

సెప్టెంబర్ చందమామను ఆగస్ట్ 27నే అందుకున్నాను. వపాగారి వినాయక చవితి ముఖచిత్రం అద్భుతంగా ఉంది. చందమామకు పూర్వ వైభవం వచ్చినట్టుంది. లోపలి కథలు కూడా చాలా బాగున్నాయి. అచ్చులో నా కథ చూసుకుంటే మహదానందమేసింది.
–ఆరుపల్లి గోవిందరాజులు, విశాఖపట్నం

సెప్టెంబర్ చందమామ వినాయకుడి ముఖచిత్రంతో అబ్బురమనిపించింది. వపాగారి మార్కు ముఖచిత్రాల్లో ఇది హైలెట్. అలాగే ఈ నెల బేతాళ కథలో కొట్టొచ్చినట్లు మార్పు ఏమంటే శంకర్ గారు పూర్తి పేజీ బొమ్మ వేయడం. బేతాళ కథకు ఫుల్ పేజీ బొమ్మ వేయడం చందమామ చరిత్రలో ఇదే తొలిసారేమో. రాజు, గుర్రం, పాముని శంకర్ పూర్తి పేజీలో అందంగా చిత్రించారు. కథ కూడా బాగుంది.
సారయ్య, కరీంనగర్, ఎపి.

సెప్టెంబర్ సంచిక సకాలంలో అందటం మహదానందంగా ఉండటమే కాకుండా ఇంతవరకు చందమామ సుదీర్ఘ చరిత్రలో ముఖచిత్ర వివరణ, -వినాయకుడు- చిత్రకారుని ప్రతిభ గురించి ఎప్పుడూ విశ్లేషించలేదు. వడ్డాది పాపయ్య గారు చందమామకు జీవనాడి. అలాగే నేడు కూడా కథోచిత చిత్రాలు అందిస్తున్న సీనియర్ చిత్రకారులు శంకర్ -కె.సి. శివశంకరన్- గారికి పెద్ద పీట వేసి గౌరవించాలి. పాత కొత్తల మేలుకలయికతో చందమామ చల్లని కిరణాలతో పరవశించని పాఠకుడు ఉండడంటే అతిశయోక్తి కానేరదు. ఆబాలగోపాలాన్ని హిమశీకరాలతో షష్ఠిపూర్తి దాటినా అందాల చందమామ అలరించడం ఎంత చిత్రం. వంద ఏళ్ళు చదవాలనే పాఠకుల ఆశ ఎంత విచిత్రం. ఇది దురాశ కాదెంతమాత్రం. ఇది మీకు నా శాశ్వత శుభప్రశంస.
–బి. రాజేశ్వరమూర్తి, చిలకలపూడి, కృష్ణా జిల్లా, ఎపి.

RTS Perm Link