అలనాటి చందమామ రాయితీ…

May 17th, 2011

“పాపాయిలూ!
క్రిందటిసారి నేను కోరినదానికి మీ దగ్గరనుంచి చాలా ఉత్సాహకరమైన జవాబులు వచ్చినై. కొంతమంది ఇద్దరూ, ముగ్గురూ, కొంతమంది అయిదుగురి వరకూ చందమామను చదువుతున్నామని వ్రాశారు. ఇది చాలా ఆనందం కలిగించింది మాకు. కాని, కొంతమంది హరిజనులు తమకు చందమామ దొరకటం లేదనీ, వాళ్ల స్కూళ్లు కూడా తెప్పించటం లేదనీ వ్రాశారు. అయితే దీనికి మేము చేయగలిగింది చేస్తాము.

ఈలోపల హరిజనులకు, బీదలకు మాత్రం చందమామ రు.4-0-0 చందా చేశాము -నాలుగు రూపాయలు- కాబట్టి చందాదారులుగా చేరదలిచిన బీదవారు జూలై నెలాఖరులోగా చేరవలసింది. ఆ పైన  చందాకు చేర్చుకోము.
-మీ చందమామ”

పై మాటలు 1949, జూలై సంచిక సంపాదకీయంలోనివి. ఆవిర్భవించిన రెండేళ్లలోపే పేదవారికి రాయితీ ధరకు చందమామను అందించాలన్న సంపాదకుల సత్ సంకల్పం పై మాటల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చందమామ మొదటనుంచి ఆర్థికంగా అంతో ఇంతో స్తోమత కలిగిన మధ్యతరగతి కుటుంబాల వారికే అందుబాటులో ఉంటూ వచ్చిందేమో అన్న అనుమానాన్ని ఈ చిన్ని సంపాదకీయం పటాపంచలు చేస్తోంది.

1949లో విడి చందమామ సంచిక 6 అణాలు. సాలు చందా రు. 4-8-0. రెండేళ్లకు 8-0-0 గా ఉండేది. కాని హరిజనులకు, బీదలకు మాత్రం జూలై నెలాఖరులోగా చేరువారికి సాలుచందా రు.4-0-0 మాత్రమే విధిస్తూ అదనంగా ప్రకటన కూడూ ఆ సంచికలో ప్రచురించారు. 1970ల మొదట్లో కూడా పల్లెల్లో నాలుగైదు తెలుగు కుటుంబాలు టోకున అన్ని పిల్లల పత్రికలను, ఇతర సాహిత్యాన్ని టౌన్ నుంచి తెప్పించుకుని వంతులవారీగా చదువున్న రోజులు ఉండేవి.

పుస్తకాన్ని కొని చదవలేని స్థితిలో ఉన్న కుటుంబాలు చందమామనే కాదు ఇతర పత్రికలను కూడా చదవాలంటే, సాహిత్యంతో పరిచయం చేసుకోవాలంటే సామూహిక గ్రంధాలయాలను మించిన పరిష్కారం లేదు. లేదంటే సంపన్నులైన దాతలు ఔదార్యంతో పిల్లలకు పుస్తక దానం చేయడానికి తమవంతు ప్రయత్నం చేయవచ్చు కూడా. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారి జీవన సహచరి సుధామూర్తి గారి  ఔదార్య గుణం వల్ల కర్నాటకలో 5 వేల గ్రామీణ పాఠశాలల గ్రంధాలయాలకు కన్నడ చందమామ నిరంతరం అందుతూ వస్తోంది.

పాఠ్య పుస్తకాలు కొనడమే భారంగా ఉంటున్న కుటుంబాలు పత్రికలను కొని చదవడం ఈనాటికీ కష్టసాధ్యంగానే ఉంటోంది. విద్య భారంగా, వైద్యం భారంగా, ఉపాధి భారంగా, చివరకు జీవితానికి జీవితమే భారంగా మారుతున్న గ్లోబల్ కుగ్రామాలు కదా మనవి. నిజాన్ని పచ్చిగా చెప్పుకోవాలంటే నగరాలు, పల్లెల్లో 30 లేదా 40 కోట్లమంది సంపన్న, ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు మాత్రమే మనదేశంలో ఈనాటికీ కొనుగోలు శక్తి ఉంటోంది. తతిమ్మా 80 కోట్లమందికి జీవితమే మహాభారం.

కొనుగోలు శక్తి పరిధిలోకి వచ్చిన పై కుటుంబాల వారికే బాలసాహిత్యంతో సహా సమస్త సాహిత్యమూ అందుబాటులో ఉంటోంది.ప్రభుత్వం భారీస్థాయిలో పాఠశాలలకు కథల పుస్తకాలను, సాహిత్యాన్ని అందివ్వకపోతే తరాల పిల్లలకు పాఠ్యపుస్తకాలే గతి.

సోవియట్ యూనియన్ ఉజ్వలంగా వెలిగిపోయిన రోజుల్లో కోటాను కోట్ల పుస్తకాలను చిన్నారులకు, విద్యార్థులకు గ్రంధాలయాల ద్వారా, యువజన క్లబ్బుల ద్వారా అందించిన చరిత్రను ఇంకా మనం మర్చిపోలేదు. రాజకీయ ఆచరణ పరంగా సోషలిజం ఘోర వైఫల్యాలను పక్కన బెట్టి చూస్తే, 60, 70, 80ల వరకు సోవియట్ యూనియన్ వివిధ భారతీయ భాషల్లో, ఇంగ్లీషులో ప్రచురించిన అద్భుతమైన బాలసాహిత్యాన్ని, తరాల పిల్లలపై దాని ప్రభావాలను మర్చిపోవడం అసాధ్యం.

సోవియట్ యూనియన్ కుప్పగూలిపోవడం చారిత్రక, రాజకీయ నేపథ్యంలో అనివార్య పరిణామమే కావచ్చు. కాని ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో అది అందించిన సాహిత్యం, సాటి లేని కాగితపు నాణ్యతతో కొన్ని తరాల జీవితాలపై అది ఆవిష్కరించిన రంగుల ప్రపంచాన్ని మర్చిపోవడం, దాని రుచి చూసిన వారికి సాధ్యం కాదు.

చందమామ కోట్లాది భారతీయుల ఊహాలోకాలపై కలిగించిన ప్రభావం కూడా తక్కువేం కాదు. దేశంలో ఏ పత్రికకూ సాధ్యం కాని రీతిలో ఆరు దశాబ్దాలుగా రంగుల ప్రపంచాన్ని అది ఆవిష్కరిస్తోంది. చందమామ ధారావాహికల విశిష్ట రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారు చివరి క్షణం వరకూ చెబుతూ వచ్చినట్లుగా చందమామ విజయం, దాన్ని ఏ పత్రిక కూడా అనుసరించలేక పోవడంలోనే ఉంది.

చూస్తూనే దివ్యత్వాన్ని మనసులో కలిగించే చందమామ అలనాటి మేటి చిత్రాలు కానీ, -దీని అర్థం తెలియాలంటే చందమామ ఇటీవలే ప్రచురించిన ‘ఆర్ట్‌బుక్’ చూడాలి-, మానవనీతిసారాన్ని అరటిపండు ఒలిచి పెట్టినట్లు వివరించే దాని అద్బుతమైన కథలు కాని ఒకసారి అనుభవంలోకి వచ్చిన తర్వాత మర్చిపోవడం, మళ్లీ వాటి గురించి ఆలోచించలేక పోవడం ఎవరికీ సాధ్యం కాదు.

అందుకే చందమామ అభిమానుల – చంపిలు, చందమామ పిచ్చోళ్లు- కంటే మించిన వ్యసనపరులు ఈ ప్రపంచంలోనే ఉండరు. ఆన్‌లైన్‌లో 58 ఏళ్ళ చందమామలను 1947 ఆవిర్బావ సంవత్సరం నుంచి మొదలు పెట్టి మళ్లీ చదువుతూ వస్తున్నపెద్దవాళ్లు, ఆస్పత్రిపాలై పొద్దుపోక బెడ్‌మీద పడుకొని తొలిసారిగా చందమామ కథలను చదివి, తర్వాత దాన్ని వదలలేని పిల్లలు.. చందమామ కథలు వింటూ అలాగే జీవితం ముగించాలనే వయోవృద్ధుల ‘చిర’ కోరికలు..

మన కళ్లముందు సాగుతున్న ఈ సన్నివేశాలను, దృశ్యాలను, పరిణామాలను చూస్తున్నప్పడు మాకున్న ఆలోచన ఏమిటంటే చందమామను ఇంకా విస్తృత స్థాయిలో, విశాల ప్రజానీకానికి ఎలా అందించాలన్నదే. ఒక్క చందమామే కాదు బాలసాహత్య పత్రికలూ, ప్రామాణిక సాహిత్యరూపాలు కూడా కొనుగోలు శక్తి లేని మెజారిటీ ప్రజలకు అంది తీరాలి.

డిగ్రీలూ, ఉద్యోగాలూ, జీవితాల కొనుగోళ్లూ, డబ్బు కట్టలూ, అధికారాంధకార మదోన్మత్త జనిత సమస్త వికారాలూ దాటి ప్రపంచంలో ఇంకా మిగిలి ఉన్న మంచిని అందరికీ ఎలా పంచాలన్నదే ఇప్పటి సమస్య. ‘హరిజనులకు’, పేదలకు రాయితీ ప్రకటించిన అలనాటి చందమామ స్పూర్తిగా ఇది జరుగుతుందని ఆశిస్తూ, జరగాలని ఆకాంక్షిస్తూ….

పాఠాలు మాత్రమే కాకుండా, పాఠ్యేతర పుస్తకాలు ఎందుకు చదవాలో, ఆంధ్రజ్యోతి మే నెల 2, 2011 నాటి వివిధ సాహిత్య వేదిక పేజీలో వచ్చిన “నేనూ.. మా ఇల్లూ.. కాసిని నెమలీకలూ…” పేరిట పి. తెరేష్ బాబుగారు రాసిన ఆ సాహితీ నెమలీకలను విప్పి చూడండి. ఆన్‌లైన్ ఆంధ్రజ్యోతి హోమ్‌పేజీలో వివిధ ఆర్కైవ్స్ విభాగంలో “2-5-11” పేరిట ఇది ఉంది కూడా.

వైరం లేని క్రూరత్వ ప్రదర్శన -ఉద్యోగంలో భాగంగా కాల్చిచంపడాలు, ఉరి తీయడాలు- హింసకు దారితీసి సమాజానికే ప్రమాదకరమవుతుందంటూ రాముడికే అహింసను బోధించిన సీత ఎంత ప్రాచీనురాలో, ఎంత అర్వాచీనురాలో ఈ కాసిని నెమలీకలను చూస్తే తెలుస్తుంది.

ఈ ఒక్క వాక్యాన్ని ఈ నెమలీకలలో చదివిన తర్వాత పీకాక్ క్లాసిక్స్ వారు ప్రచురించిన వాల్మీకి రామాయణం -వచనం: ముసునూరు శివరామ కృష్ణారావు- తప్పకుండా కొని చదవాలనిపిస్తోంది.

ఈ నెమలీకలను చదవాలంటే  కింది లింకుపై క్లిక్ చేయండి.

http://www.andhrajyothy.com/VividhaNews.asp?qry=dailyupdates/vividhapdf

RTS Perm Link