చందమామ మాన్య పాఠకులు

November 16th, 2011

చందమామ సీనియర్ పాఠకులు శ్రీ బొడ్డపాటి రాజేశ్వరమూర్తి గారు 1950 నుంచి ఇప్పటిదాకా దాదాపు అరవై ఏళ్లపాటు చందమామను విడవకుండా చదువుతూ వస్తున్నారు. 1946 నాటి ‘చిత్రగుప్త’, ‘ఆంధ్రపత్రిక’ నుంచి మొదలుకుని గత 60 ఏళ్లుగా వివిధ తెలుగు దిన వార పత్రికలకు కంటెంట్ ఇస్తున్న సీనియర్ కంట్రిబ్యూటర్ ఈయన. ప్రత్యేకించి అయిదు దశాబ్దాలుగా, అనేక తెలుగు దిన, వార పత్రికలకు జర్నలిస్టుని అని ఈయన సగర్వంగా ప్రకటిస్తుంటారు. నేటికీ ఈయన వ్యాసాలను తెలుగు పత్రికలు ప్రచురిస్తూ ఆదరిస్తున్నందుకు ఈయన ‘బాల్య సంతోషం’ అనుభవిస్తుంటారు.

చందమామ కథాపఠనంతో జీవితాన్ని పండించుకుంటున్న ‘కురువృద్ధబాంధవుడీ’యన. మీగడతరగల్లాంటి తెల్లకాగితంపై అద్భుత వర్ణచిత్రాలను పిండారబోసిన చందమామ గతకాలపు ముద్రణా నాణ్యతను గురించి ఈయన చెబుతుంటేనే మనం వినాలి. చందమామ ఫోటో వ్యాఖ్యల పోటీలో అందరికంటే ఎక్కువ సార్లు విజేతగా బహుమతి అందుకున్న ఘనత తనదే అని చెబుతుంటే ఆయన మాటల్లో పొడసూపే గర్వరేఖలు మనం వినితీరాలి. ప్రైజ్ మనీగా చందమామ నుంచి వందరూపాయలు గెల్చుకుని తీసుకునేవాడినని చెబుతూ ఆయన పొందే సంతోషం అనిర్వచనీయమైనది.

సహస్రచంద్ర దర్శనాలను చూసిన ఈ మాన్య పాఠకులు జీవితపు మలి సంధ్యలో చందమామతో ప్రత్యక్ష సంబంధంలోకి వచ్చారు. నాలుగు నెలల క్రితం వారి చందమామ జ్ఞాపకాలు పంపించినప్పుడు వాటిని అందుకున్నామని ఫోన్‌లో మాట్లాడితే ఆయనలో సంతోషం అంబరమంటిన ఫీలింగ్. 20 నిమిషాల పాటు ధారాపాతంగా తన చందమామ తీపి గురుతులు చెబుతూ పోతుంటే ఆలా వింటూండిపోయాము.

“భారతీయులందరికీ నిజాయితీతో ఈ సూచన చేస్తున్నాను. చందమామను మీ భాషలోనే చదివి దాన్ని జీర్ణం చేసుకోండి. నీతిని గ్రహించడానికి, మన వైభవోజ్వల గతాన్ని దర్శించేందుకు, మన ప్రాచీన రుషులు, మహర్షుల సనాతన వారసత్వాన్ని మన పిల్లలకు అర్థం చేయించి వారిని సరైన మార్గంలో పయనింపజేసేందుకు, దయచేసి చందమామను చదవండి, మీ పిల్లలచేత చదివించండి.”

అంటూ చందమామను ఈ రోజు కూడా సమున్నత స్థానంలో నిలిపి గౌరవిస్తున్న ఈ వయోవృద్దుడికి చందమామ కృతజ్ఞతాంజలులు అర్పిస్తోంది. హృదయపు లోతుల్లోనుంచి పొంగి పొరలి వచ్చిన మీ ఆశీస్సులు ఫలించాలని, చందమామ మరి కొన్ని దశాబ్దాలపాటు పిల్లలకూ, పెద్దలకూ తన దైన కథామృతాన్ని అందిస్తూనే ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. మీ వంటి మాన్యుల ప్రేమాభిమానాల అండదండలతో చందమామ తన ప్రయాణం సాగిస్తుందని, నెల్లు, పొల్లు వేరు చేస్తూ తమ గమ్యాన్ని సాగిస్తుందని వినమ్రంగా ప్రకటిస్తున్నాము.

మీ ఆరోగ్యం, మీ ఉనికి మాకు, చందమామకు శక్తిని ప్రసాదించాలని, మీమాట వేదంలా, నాదంలా సకల జనుల మనస్సులలో ప్రతిధ్వనించాలని, మీ శుభాశీస్సులు చందమామ భవితవ్యాన్ని మరింత ముందుకు నడపాలని హృదయ పూర్వకంగా కోరుకుంటూ మనస్సుమాంజలి ఘటిస్తున్నాము.

–చందమామ సిబ్బంది.

రాజేశ్వర మూర్తిగారి చందమామ జ్ఞాపకాలను నవంబర్ సంచికలో ప్రచురించిన తర్వాత ఆయన రాసి పంపిన మూడు లేఖలు, ఆయనతో ఫోన్ సంభాషణ సారాంశాన్ని ఇక్కడ చూడగలరు.

చందమామ పత్రిక ‘కథల కాలక్షేపం’ కాదు
నవంబర్ సంచిక సకాలంలో అందడమే గాక, చందమామతో నా జ్ఞాపకాలు ప్రచురించినందులకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. కొన్ని నెలల క్రితం చందమామ నాకు ఫోన్ చేసి మీ జ్ఞాపకాలు ఈ డిసెంబర్ మాసంలో రావచ్చని తెలిపింది. అప్పుడు నేను సమాధానమిస్తూ నాకు ఇప్పుడు 82 సంవత్సరాలని జీవితం నీటిబుడగ లాంటిది కాబట్టి, దేవుడు ఎప్పుడు పిలిచినా నేను ‘పరంధామం’ చేరవలసిందే కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా జ్ఞాపకాలు ప్రచురించమని కోరాను. దేవుడు నన్ను కరుణించాడు. సరిగ్గా రెండు రోజుల క్రితమే నేను చందమామలో నా జ్ఞాపకాలు చదివాను. ఈ నవంబర్ నెల సంచికలోనే నా జ్ఞాపకాలు ప్రచురించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అప్పుడే పాఠకుల లేఖలకు రాసి పంపాను కూడా.

అందాల చందమామతో అపురూప ప్రేమానుబంధం అతిమధురం, శాశ్వతం. ఒక విషయంలో పత్రికా ప్రపంచానికి ఛాలెంజ్ చేస్తున్నాను. దేశీయ భాషల్లోనే గాక ఇతర దేశభాషల్లో కూడా ప్రచురించబడుతున్న కథల పత్రిక ఎక్కడైనా ఉందా? ఒక్క చందమామ తప్ప. దీంతో ఇతర కథల పత్రికలు ఎందుకు పోటీపడలేక పోతున్నాయి?

భారతీయులందరికీ నిజాయితీతో ఈ సూచన చేస్తున్నాను. చందమామను మీ భాషలోనే చదివి దాన్ని జీర్ణం చేసుకోండి. నీతిని గ్రహించడానికి, మన వైభవోజ్వల గతాన్ని దర్శించేందుకు, మన ప్రాచీన రుషులు, మహర్షుల సనాతన వారసత్వాన్ని మన పిల్లలకు అర్థం చేయించి వారిని సరైన మార్గంలో పయనింపజేసేందుకు, దయచేసి చందమామను చదవండి, మీ పిల్లలచేత చదివించండి.

82 ఏళ్ల ముదివయస్సులో మీకందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చందమామ పత్రిక కేవలం ‘కథల కాలక్షేపం’ కాదు. మానవ నీతి, రుజువర్తనకు సంబంధించి ఇదొక శాశ్వత నిధి. “నవ గ్రహాలు అన్నీ అనుకూలించిన శుభ ముహూర్తంలో” నాగిరెడ్డి, చక్రపాణి గార్లు తమ స్వర్ణ హస్తాలతో చందమామను 1947లో ప్రారంభించారు. ఆ ముహూర్త బలం ఎంత మహత్తరమైనదంటే 65 ఏళ్లుగా చందమామ దేశభాషల్లో ప్రచురితమవుతూ కోట్లాదిమందిని తన వెన్నెల కిరణాలతో తడుపుతూ జాతికి చల్లదనం కలిగిస్తూనే ఉంది. చందమామ మీది, మాది, మనందరిదీనూ.. మీరు చదవండి..మీ పిల్లల చేత చదివించండి చాలు…

ఈనాడు పత్రిక 2006లో చందమామపై కవర్ పేజీ కథనం ప్రచురిస్తూ నా పేరు వెలుగులోకి తెచ్చింది.

ఇపుడు చందమామలో ఫోటోతో సహా నా అభిమాన పత్రికతో నా జ్ఞాపకాలు నిండుపేజీలో ప్రచురించడం ‘హోమ్‌లీ’గా ‘మహదానందంగా’ ఫీల్ అయినాను. మా కుటుంబ సభ్యులు ముఖాముఖిగా, నా సారస్వత మిత్రులు, నా తోటి ప్రభుత్వాధికారులు ఫోన్లోను, ఇమెయిల్ ద్వారా, చందమామతో నాకున్న శాశ్వత బంధాన్ని ప్రశంసిస్తూ పొగడటం నాకు గర్వకారణమైనది. మధుర జ్ఞాపకాలతో జేజేలు పలికినట్లయింది. చందమామ సంపాదకులు, సిబ్బందికి నా ధన్యవాదాలు.

నేను గత 5 దశాబ్దాల నుండి ప్రముఖ తెలుగు దిన, వార పత్రికలకు కంట్రిబ్యూటర్‌ని. 1946లో మదరాసులోని ‘చిత్రగుప్త’ మాస పత్రికతో మొదలై ఆంధ్రపత్రిక వారపత్రిక -1952- నుండి ఈనాటివరకు ఉన్న దాదాపు అన్ని మాసపత్రికలకు జర్నలిస్టుగా పనిచేశాను. నేటికీ వారు నా రచనలు ప్రచురిస్తూ ఆదరిస్తూన్నారు. ఇది నా హాబీ.

చందమామ చిన్న కథలు నిమ్మ తొనలు
ఈ నవంబర్ మాసం ముఖచిత్రం ముచ్చటగొలిపే అమ్మాయి అబ్బాయి, కాసారంలో పడవ విహారం, క్షీరనీరన్యాయం చేసే రాజహంస, హరిత వాతావరణం అద్భుతం. నెహ్రూగారి సందేశ పునర్ముద్రణ అమోఘం. కథలు ఎక్కువగానే ఉన్నాయి. చిన్న కథలు నిమ్మతొనల్లా అలరిస్తూ ఉన్నాయి. పాత ఫోటో వ్యాఖ్యల పోటీని పునరుద్దరించండి. ప్రస్తుత క్విజ్ ఎత్తివేయండి. పాత చందమామల్లో ఉండే పాలతెలుపు కాగితాలే మిన్న. మీగడ తరకల్లాంటి చందమామ కాగితం పదిహేను సంవత్సరాల తర్వాత కూడా వన్నె తగ్గకుండా మిలమిలలాడుతూ ఉండేది.

1950 నుంచి చందమామను చదువుతూనే ఉన్నాను. దశాబ్దాలపాటు చందమామలు బైండ్ చేయించినప్పటికీ బంధువులు వస్తూ పోతూ వాటిని పట్టుకెళ్లిపోయారు. ఒక్కరూ తిరిగి ఇవ్వలేదు. చందమామకు గ్రహణం వీడాక 2000 సంవత్సరం నుంచి అన్ని చందమామల ప్రతులను బైండ్ చేయంచి భద్రంగా ఉంచుకున్నాను. మా బంధువులు, పుత్రులు, మనవళ్లు, మనవరాళ్లు ఎవరడిగినా సరే బయటికి మాత్రం చందమామలను ఇవ్వడం లేదు. నేను ఎంతవరకు ఉంటానో.. ఎప్పుడు పోతానో కూడా తెలియదు. కాని మా పిల్లలకు నేను గత పదేళ్ళ చందమామలను లీగల్ వారసత్వంగా అందించదలిచాను. వారు వాటిని కాపాడతారని, తమ పిల్లలకూ చందమామను అందిస్తారని కోరుకుంటున్నాను. ఇది తప్ప ఈ ముదివయస్సులో నాకిక ఏ కోరికలూ లేవు.

గమనిక: ఇటీవలి సూర్యా పత్రికలో చందమామ చిత్రకారులు చిత్రా గారి గురించి కథనం ప్రచురించారు. దాని కటింగ్ మీకు పంపిస్తున్నాను. గతంలో చందమామ చిత్రకారులు శంకర్ గారి గురించి కూడా ఈ పత్రిక కథనం ప్రచురించింది.

సాటిలేని చందమామ చిత్రాలు

అలాగే ఈ ఆదివారం -13-11-2011- సాక్షి అనుబంధంలో ‘ఇది పిల్లల ప్రపంచం’ అనే పేరుతో చక్కటి ముఖచిత్ర కథనం ప్రచురించారు. దాంట్లో చందమామ కథల గురించి ఆణిముత్యాల్లాంటి వాక్యాలతో ప్రశంసల వర్షం గుప్పించారు. చందమామ కోరకుండానే దానికి ఇంత గౌరవం కల్పించిన ఆ వ్యాసం కటింగ్ కూడా చందమామ కార్యాలయానికి పంపిస్తున్నాను. చూడండి. –

ఇది పిల్లల ప్రపంచం

(అయితే, ప్రధాన కథనంలో భాగంగా చందమామ గురించి సాక్షి పత్రికలో బాక్స్ ఐటమ్ గా వచ్చిన ఈ భాగం సాక్షి ఆన్లైన్ ఎడిషన్లో ఎందుకో రాలేదు.-సాక్షి పత్రిక ఆదివారం అనుబంధం కథనంలో భాగంగా చందమామపై వచ్చిన ప్రశంసను ఇప్పుడు కింద పొందుపర్చడమైనది.

మామ… చందమామ!

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు వెళ్లాడు. శవాన్ని దింపాడు. ఎప్పటిలాగానే భుజాన వేసుకున్నాడు. . .  చాలు… చాలు.. ఈ మాత్రం నెరేషన్ చాలు..  చందమామ కథ చెబుతున్న విషయం పిల్లలకి అర్థమైపోతుంది. విక్రమ భేతాళ్ అంటూ మన కంటే ముందు వారే లోగుట్లన్నీ విప్పుతారు. చందమామ మాసపత్రిక అంతగా బాలభారతాన్ని అల్లుకు పోయింది. అరవై నాలుగేళ్ల కిందట చెన్నపట్నంలో పుట్టి తరాలకు తారలానే తన వెంట తిప్పుకుంటోంది.

నాగిరెడ్డి, చక్రపాణి మిత్రద్వయం దీన్ని 1947లో తెలుగు, తమిళాల్లో ప్రారంభించారు. నేడిది ఇంగ్లీష్ సహా పదమూడు భాషల్లో వెలువడుతోంది. పిల్లలందరూ ఈ పత్రిక కోసం ప్రతినెలా వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు. దీనిమీదున్న కుందేలు బొమ్మతో జట్టుకడతారు… పెద్దాళ్లు కూడా ఈ పుస్తకాన్ని చిన్నాళ్లకి కొనిచ్చేందుకు ముచ్చటపడతారు. మెదడుకు మేతపెట్టే సంగతులు, పసిదనాన్ని నిలువెల్లా నింపుకున్న చిన్న కథలు, భారతీయతను ఒడలంతా రంగరించుకున్న ధారావాహికలు చందమామ ప్రత్యేకత. అసలా  పేరులోనే ఉంది పెన్నిధి. మామ అని అమ్మ తమ్ముణ్ణి పిలుచుకున్నట్టు హాయిగా పిలుచుకోవచ్చు. అందమైన వర్ణచిత్రాలతో, అద్భుతమైన కథనాలతో అలరారే చందమామ పిల్లల రాజ్యానికి నేడూ మహాప్రభువే.

సాక్షిలో ‘ఇది పిల్లల ప్రపంచం’ కథన కర్త డా. చింతకింది శ్రీనివాసరావు గారికి అభినందనలూ… కృతజ్ఞతలూనూ

గమనిక: నిన్న సాయంత్రం చందమామ అభిమాని, మిత్రులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు సాక్షిలో చందమామపై చిరు కథనాన్ని మరో లింకులో ఇచ్చారంటూ మెయిల్ పంపారు. ఆ లింకు ఇక్కడ చూడవచ్చు.

మామ… చందమామ!

http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=30615&Categoryid=10&subcatid=29

కె. శ్రీనివాస్ గారూ, ఆ ప్రధాన కథనానికి ఇతర లింకులు సాక్షి ఆన్‌లైన్‌లో కనిపించాయి కాని చందమామ లింకు నాకు తగల్లేదు. పంపిన మీకు ధన్యవాదాలండీ. )

జీవితంలో 80 ఏళ్ళు గడిపిన తర్వాత చందమామ నేరుగా నాకు ఫోన్ చేయడం. నా చందమామ జ్ఞాపకాలు ప్రచురించడం, కాంప్లిమెంటరీ కాపీ పంపడం. నా ఉత్తరాలు రెగ్యులర్‌గా పాఠకుల పేజీలో రావడం. వృద్ధాప్యంలో నేను కోరుకోకుండా నాకు దక్కిన అపురూప వరాలు అనుకుంటాను. మరొక్క విషయం పంచుకోవాలని ఉంది. చందమామ చరిత్రలో బహుశా ఫోటో వ్యాఖ్యల పోటీకి ఎక్కువ సార్లు ప్రైజ్ గెల్చుకున్నది నేనే అని గర్వంగా చెప్పగలను. చందమామ నుంచి ప్రైజ్ మనీగా వందరూపాయలు అందుకోవడం ఎంత సంతోషదాయకమో. మళ్లీ ఫోటో వ్యాఖ్యల పోటీని ప్రారంభిస్తే బాగుంటుంది.

చందమామ సంపాదకులు, సిబ్బందికి నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు. మేలురత్నం లాంటి ఈ పత్రికలో మీరు పనిచేస్తున్నారు. మీ పని లక్షలాది మందికి వెన్నెల కిరణాలను పంచుతోంది. జాతి పట్ల బాధ్యతతో, గౌరవంతో మీ పని కొనసాగించండి. దీర్ఘాయుష్మాన్ భవ.

-బి.రాజేశ్వరమూర్తి, చిలకలపూడి, బందరు, కృష్ణాజిల్లా, ఎపి.

నిన్ననే -15-11-2011- ఆయన మరొక కార్డు ముక్క చందమామకు పంపించారు. చందమామ కథా, చిత్ర చరిత్రకు కేతనమెత్తిన ఈ హృదయోల్లాస లేఖా వ్యాఖ్యను కింద చూడండి.

‘చందమామ’ ప్రకాశ రహస్యం!!
ప్రారంభదశలో పిల్లల మాసపత్రిక అన్నట్లు గుర్తు! కాని ఇది చదివి వృద్ధులు బాలురైనారు. “నవ్యప్రాచీననవ్యుడితడు” అని పొగడబడిన జ్ఞానపీఠ అవార్డు తొలి గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు చందమామ పత్రిక చిరకాల పాఠకుడు. కొత్త చందమామ కోసం నౌకరును పంపి, రాలేదని చెబితే ‘వెధవా! నువ్వు అబద్దాలు ఆడుతున్నావ్’ అని విసుగుకొని తానే వెళ్లి, ఆలస్యం అయితే కొట్టువాడితో దెబ్బలాడేవారు.

పత్రిక వచ్చిన తర్వాత ఆసాంతం చదివి, “ఆహా! ఏమి హాయి” అని అనేవారు. ఆ కాసేపు తన నవలా రచన పక్కన పెట్టేవారు. అలాంటి వారిలో ఎందరో సాహిత్య పీఠాధిపతులు ఉన్నారు. ఐ.ఎ.ఎస్ అధికారులున్నారు. కొడవటిగంటి కుటుంబరావు, ఆరుద్ర, శ్రీశ్రీ, పాలగుమ్మి పద్మరాజు మున్నగువారు నేపథ్య ప్రతిభాశాలురు ఉన్నారు. చక్రపాణి చిత్రాలకు ప్రాతినిథ్యమిస్తూ కథల్ని సైజుతగ్గిస్తూ, ‘టైలరింగ్’ చేసేవారు. చిత్ర, వపా, శంకర్, ఆచార్య గారలు కథలకనుగుణంగా, కళాత్మకంగా, చారిత్రికంగా, సంసార పక్షంగా, పండితులు మెచ్చేటట్లు, పామరులు రంగుల సొగసుతో అబ్బురపడేటట్లు, కథాసన్నివేశాల పక్కనే గీస్తూ వచ్చిన చిత్రాల అమరిక చందమామను జాజ్వల్యమానంగా ప్రకాశింపచేశాయి.

ఇక చిత్రకళాకారుల ప్రతిభా కౌశలం, వారు మన భారత, రామాయణ, భాగవత ఇతిహాసాలకు అనుగుణంగా వస్త్రాలు, నగలు, కిరీటాలు, అంతఃపుర వైభవ దృశ్యాలు, సరోవరాలు, పచ్చటి పకృతి, భీకరారణ్యాలు, గుహలు, ఆటవికుల ఆహార్యాలు, పట్టణాల భవనాల అందచందాలు, పల్లెటూళ్లలోని జానపదుల విచిత్రవైఖరులు, వింత వింత ద్వీపాలలోని  మానవ మృగాల పాశవికత్వాన్ని దేశంలోని ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులను ప్రతిబింబించే కేశాలంకరణ హోదాలను బట్టి దుస్తులు, అచటి జంతువుల రూపాలు,విన్యాసాలు, కురుక్షేత్ర సంగ్రామంలోని పద్మవ్యూహాలు, సేనా పరంపర ‘ఏరియల్ వ్యూ’ గా చిత్రించడం వీరికే చెల్లు.

కీర్తిశేషులైన చందమామ చిత్రకారులకు జోహార్లు. సజీవులైన వారికి అనంత కోటి అభినందనలు. ఎన్నో బాలపత్రికలు వీరిని అనుకరించి కృతకృత్యులు కాలేకపోవడం ‘మామామ’ విశిష్టత. చందమామ చిరంజీవి!!!
-బి.రాజేశ్వరమూర్తి, చిలకలపూడి

రాజేశ్వరమూర్తిగారు చెప్పిన ఈనాడులో ‘చందమామ కథ’ కోసం కింది లింకు చూడగలరు.

ఈనాడులో చందమామ
http://blaagu.com/chandamamalu/category/%E0%B0%88%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE/

దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సంచికగా ‘రచన’ మాసపత్రిక 2010 మే నెలలో తీసుకువచ్చిన ప్రత్యేక సంచిక వివరాలు దురదృష్టవశాత్తూ మూర్తిగారికి ఇంతవరకూ తెలియవట. నిన్న -15-11-2011- ఆయనతో ఫోన్ సంభాషణలో ఈ విషయం తెలిసింది. చందమామ సీరియల్స్ గురించి ప్రత్యేక సంచికను రచన పత్రిక తీసుకువచ్చిందని తెలియగానే ఆయన చాలా సంతోషించారు.

కొన్ని పనులు సకాలంలో చేయగలిగితే ఎంత బాగుంటుందో అర్థమవుతూ వస్తోంది. దాసరి సుబ్రహ్మణ్యం గారు బొమ్మరిల్లు పత్రికలో 70లలో రాసిన ‘మృత్యులోయ,’ యువ పత్రికలో వచ్చిన ‘అగ్నిమాల’ జానపద నవలలు, దాసరి గారి కథా సంపుటిని కూడా రచన-వాహిని బుక్ ట్రస్ట్ 2011 జనవరిలో అచ్చేసింది. వీలయినంత త్వరలో ఆ పుస్తకం పంపే ఏర్పాట్లు చేయగలనని ఆయనకు మాట ఇచ్చాను.

రచన శాయి గారూ,
‘రచన’ మాసపత్రిక 2010 మే నెలలో తీసుకువచ్చిన ప్రత్యేక సంచిక, దాసరిగారి ‘మృత్యులోయ,’ ‘అగ్నిమాల’ జానపద నవలలు, దాసరి గారి కథల సంపుటి మొత్తం నాలుగు పుస్తకాలు మీవద్ద అందుబాటులో ఉంటే చందమామ సీనియర్ పాఠకులు, రాజేశ్వరమూర్తి గారికి వీలైనంత త్వరలో కింది చిరునామాకు పంపించగలరు. వాటికి సంబంధించిన నగదు మొత్తంగా మీకు త్వరలోనే పంపించగలను.

వారి చిరునామా.

Sri B.Rajeswara murthy
Co-operative Sub Registrar (Retd)
Srikrishna Nagar,
Chilakalapudi -521002
Bandar-2
Krishna (dist)
Andhrapradesh
Land Phone: 08672-254040

నవంబర్ చందమామలో శ్రీ రాజేశ్వరమూర్తిగారి మధుర జ్ఞాపకాలను కింద చూడండి.

చందమామ జ్ఞాపకాలు

 

RTS Perm Link