తిండి దొరకని సమాజోన్నతి నాకెందుకు?

July 6th, 2012

చందమామ చక్రపాణి గారు ఇంకా మద్రాసుకు అడుగుపెట్టనప్పుడు ఆయన బెంగాల్ భాషలోంచి అనువాదం చేసిన ‘పాంచజన్యం’ కథల సంపుటిని 1939లో నాటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య గారు పరిచయం చేశారు. ఈ అరుదైన పరిచయం 1997 మార్చి నెలలో వచ్చిన ‘చక్రపాణీయం’ పుస్తకంలో ఉంది. చక్రపాణి గారి అనువాదం అనువాదంలా కాక స్వతంత్ర రచనగా కన్పడేది అంటూ సుందరయ్య గారు చేసిన ఈ పరిచయాన్ని పాఠకుల సౌలభ్యం కోసం ఇస్తున్నాను.

1939లో చేసిన ఈ సమీక్షలో ఒక కథలోని పిల్లి పాత్ర ద్వారా చెప్పించిన వాక్యం. “తిండి దొరకని సమాజోన్నతి నాకెందుకు?”

నాలుగు కార్ల ఫ్యాక్టరీలు, రెండు విమానాశ్రయాలు, అయిదు ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, నాలుగు లైన్ల రోడ్లు వేయడమే అభివృద్ధి అని ఊదరగొడుతున్న ఈ ప్రపంచీకరణ యుగానికి కూడా వర్తించదగిన గొప్ప ప్రశ్న ఇది.

తిండి దొరకని సమాజోన్నతి నాకెందుకు?
రాసిన 70 సంవత్సరాల తర్వాత కూడా ప్రాసంగికతను కోల్పోని గొప్ప వాక్యం. చక్రపాణి గారు బెంగాలీ లోంచి అనువదించిన ఈ దొడ్డ మనసు ‘పిల్లి’ కథ ఇప్పుడు చదివేందుకు దొరికితే ఎంత బావుణ్ణో..

సుందరయ్య గారి పరిచయాన్ని కింద చూడండి.

పాంచజన్యం – కథల సంపుటి
-పుచ్చలపల్లి సుందరయ్య
ప్రజాబంధులో ‘బడదీదీ’ నవల నవశక్తిలో ‘దేవదాస్’ ‘పరిణీత’ లు ప్రకటించబడుతూ ఉన్నప్పుడు చాల ఆతురతతో చదివేవాణ్ణి. చక్రపాణి భాషాంతరీకణం భాషాంతరీకరణంగా కన్పడక అసలు స్వతంత్ర రచనగానే కన్పడేది. వారు తిరిగి పాంచజన్యమను పేర కొన్ని కథలను తర్జుమా చేశాక వాటిని కూడా చాలా ఆతురతతో చదివాను.

‘పిల్లి’లో ఆకలిబాధచే మాడుతూ ఉన్నవారికి కష్టాలూ, ధనవంతులకు, తిండికి లోటు లేనివారికి గౌరవాలూ వస్తాయి. ఈ పరిస్థితుల నుండి బయటపడాలంటే ధనవంతులు సమాజంపై తమ లాభాలకోసం విధించిన నిబంధనలను ఉల్లంఘించడమే మార్గమని పిల్లి ఉపన్యసిస్తుంది. తిండి దొరకని సమాజోన్నతి నాకెందుకు అన్నది పిల్లి. దానికే కాదు. ఏ మనిషికీ కూడా అవసరం లేదు. అసలు అది సమాజోన్నతి కూడ కాదు.

‘సామ్యవాదం మంచిదని మేము ఒప్పుకుంటాము, కాని దానికి ఒక హద్దున్నది.’ తమకు పైనున్నవారు తమ్ము సమానంగా చూడాలి. తాము మాత్రం తమ కన్న కింద ఉన్నవారిని తమతో సమానంగా చూడరు. ఈ ధోరణిని వ్యక్తీకరిస్తూ ఉన్న ఒక చిన్న వ్యంగ్యం ‘కానీ కడగండ్లు.’

ప్రభుత్వాలు, ఉద్యోగస్తులు, ‘కుట్ర’లను భయంతో ఎంత నిరాధారంగా ప్రజలపై అత్యాచారాలు దౌర్జన్యాలు చేస్తారో ‘కుట్ర’ వెల్లడిస్తూ ఉంది.

దేశద్రోహి తన సర్వస్వం దేశసేవలో ధారపోస్తాడు. తల్లికి తిండి కూడ ఏర్పాటు చేయడు. కారాగారంలో పడి క్షయతో బయటపడుతాడు. ఈతని త్యాగసేవలపై నాయకత్వం సంపాదించిన వ్యక్తి ఇతనిని నిరసిస్తాడు. ‘దేశద్రోహి’ అంటాడు. ప్రజలు ఈ వింత ‘దేశద్రోహి’ని కొట్టి చంపుతారు. ఈ చిన్న కథ ప్రస్తుతం మన దేశ సేవకుల స్థితిని ఒక పర్యాయం కన్నులకు కట్టినట్లు తెలియచేస్తూ ఉంది. దేశానికి సర్వస్వం ధారపోసి పనిచేస్తూ ఉన్న వారికి, వారి కుంటుంబాలకు తగిన ఉపాధులు కల్పించడం, వారిని మరిచిపోకుండటం ప్రజలు చేయవలసిన కనీస ధర్మమని ఇది ఎలుగెత్తి చాటుతూ ఉంది.

‘మీరూ – మేమూ’ ప్రాచ్యదేశాలకు, పాశ్చాత్య దేశాలకు ఉన్నవనుకునే భేదాలను తీసుకుని వ్యంగ్యంగా రాయబడింది. మన దేశంలోని మూఢ విశ్వాసాలను, తీవ్రంగా ఎత్తిపొడుస్తూ ఉంది. ఈ ఎత్తిపొడుపులతో పౌరుషం తెచ్చుకుని దేశ స్థితి మార్చడానికి పాఠకులు నడుము కట్టుతారనుకుంటాను.

కాని ఈ కథనలన్నిటిలోనూ పాఠకుల్ని, భారతీయుని ఎక్కువ సంతృప్తి పరచేది కథ ‘అడ్డం తిరిగితే.’ కాని ఈ సంతృప్తి చేతకాని వానికి మాత్రమే కలుగుతుంది. భారతీయులు ఇంగ్లండుపై రాజ్యాధికారం చేస్తున్నారనుకోండి. అప్పుడు మనం వారిని ఇంగ్లీషువారు మనకు నేడు చూపుతున్న మార్గాన వెళ్లితే. ఇంగ్లీషు వారిని ఏవిధంగా అవమానాలకు గురిచేయగలమో తెలియజేసే ఒక ఊహాచిత్రం.

భారతీయులకెప్పుడూ ఇంగ్లండుపై గాని మరియే ఇతర దేశంపై కాని పెత్తనం వద్దు. వారిని మనం ప్రతీకారం కోసమని నీచంగా చూడము. కానీ ఈ ఊహాచిత్రంలో ప్రతి భారతీయుడూ తన జీవితంలో ప్రతి ఘట్టమందు ఇంగ్లీషువారు తన్ను ఏ విధంగా అవమానపరుస్తూ ఉందీ గుర్తించి స్వాతంత్ర్య పిపాసి అవుతాడని వ్యంగ్యంగా రాయబడింది. ప్రతి భారతీయుడు దీనిని చదవాలి. ఆత్మ గౌరవం కాపాడుకోవాలి. దానికోసం స్వాతంత్ర్య సంపాదించుకోవాలి.

ఇలాంటి కథలు, బెంగాలీ భాషనుండీ అనువదించి ఇచ్చిన చక్రపాణికి ఆంధ్రులు కృతజ్ఞులు. కాని ఆంధ్రభాషలోనే ఇట్టి కథలు స్వతంత్రంగా ఎప్పటికి రచించడము.
(ఆగస్టు 1939)

‘చక్రపాణీయం’ నుంచి. 82వ పుట.

————————–

ఈ పుస్తకం లోని 81వ పుటలో చందమామ ఎందుకు చదవాలో, చదివించాలో చెప్పే ఒక చిన్న భాగాన్ని కూడా ఇక్కడ చూడండి.

మానసిక ప్రశాంతతను తెచ్చే చందమామ
మానసిక ప్రశాంతత కోసం డాక్టర్లు ఏ సలహా ఇస్తారో కాని, నేను మాత్రం చందమామ చదవమని చెబుతాను. ఈ రోజుల్లో పిల్లల్ని పెంచటం కష్టమని చెప్పే ప్రతి తల్లికీ, తండ్రికీ నేను చెప్పే మొదటి సలహా,  తమ పిల్లల చేతుల్లో చందమామ పత్రిక పెట్టమని. చందమామ వారి పిల్లలకు బుద్ధి కుదురు, ముడ్డి కుదురు కలుగజేసి సజ్జనులుగా తయారవటానికి పునాది వేస్తుందని.
— ఏలేశ్వరపు రఘురామశర్మ.
‘పరోక్షంగా ప్రభావితం చేసిన ప్రత్యక్ష వ్యక్తి’ కథనంలోంచి కొంత భాగం
‘చక్రపాణీయం’ నుండి, పుట 81

RTS Perm Link