చందమామ ‘ఆర్ట్‌బుక్’

August 11th, 2011

చందమామ ఇటీవలి సంవత్సరాలలో తీసుకువచ్చిన ప్రచురణలలో చందమామ ‘ఆర్ట్‌బుక్’కి విశిష్టస్థానం ఉంది. దశాబ్దాలపాటు చందమామ కార్యాలయంలో బొమ్మలు వేస్తూ లక్షలాదిమందిని మంత్రముగ్ధులను చేస్తూ మెరిసిన నలుగురు మహా చిత్రకారుల చిత్రరచనలలో కొన్నింటిని ఆర్ట్‌బుక్‌ పేరుతో చందమామ 2010 మే నెలలో తీసుకువచ్చింది. ఎంటివి ఆచార్య, శంకర్, చిత్ర, వపా గార్లు భారతీయ చిత్రకళా వైభవానికి చందమామ అందించిన అద్భుత చేర్పులు.

‘అనంతమైన ప్రకృతిలో ఒదిగిన అరణ్య సౌందర్యం చందమామ బొమ్మల్లో అద్భుతంగా సాక్షాత్కరించ’డానికి, జానపద, పౌరాణిక చిత్ర సంపద చందమామలో దశాబ్దాలుగా మిరుమిట్లు గొల్పుతూ ప్రకాశించడానికి కారణభూతులైన ఈ నలుగురు చిత్రబ్రహ్మలు ప్రసాదించిన 200 ఒరిజనల్ చిత్రాలను తొలిసారిగా చందమామ ‘ఆర్ట్‌బుక్’ భారతీయ పాఠకులకు సగర్వంగా అందించింది.

ఆసక్తి చంపుకోలేక రూ. 1500లు వెలను కూడా తట్టుకుని కొనగలిగిన పాఠకులు, కథకులు, చిత్రకారులు, చందమామ అభిమానులు… ఆర్ట్‌బుక్ వెన్నెల కాంతులను చూసి పరవశిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగుతో పాటుగా ప్రాంతీయ చందమామల చివరి లోపలి పేజీలో వేస్తున్న ఆర్ట్‌బుక్ చిత్రాలు పాఠకులను తీవ్రంగా ఆకట్టుకుంటున్నాయి. ఇంత వెల పెట్టినా సంవత్సరంలోపే ఆర్ట్ బుక్ రెండు ముద్రణలు పూర్తి చేసుకోవడం గమనార్హం.

ఆర్ట్‌బుక్‌పై పాఠకుల, కథకుల, చిత్రకారుల స్పందనలలో కొన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాము.  అలాగే చందమామ పత్రికతో చందమామ బొమ్మలతో తన జ్ఞాపకాలను హృద్యంగా పంచుకున్న సిహెచ్ వేణుగారి కథనంలో కొంత బాగాన్ని ఇక్కడ చేర్చడమైనది. అలాగే, ‘ఆర్ట్‌బుక్‌’లో చందమామ చిత్రకారులపై ఆంగ్లంలో ఉన్న సమాచారాన్ని సమయాభావం కారణంగా ఇక్కడ ఇంగ్లీషులోనే యధాతథంగా ప్రచురించడమైనది.

1.
అలనాటి చందమామ వీరాభిమాని, తెలుగువారికి సున్నిత హాస్యం రుచిచూపిన ప్రముఖ కార్టూనిస్టు శ్రీ మట్టెగుంట అప్పారావు గారు ఇటీవలే చందమామ ఆర్ట్‌బుక్ తీసుకుని చూసి దాన్ని 64కళలు.కామ్ అనే వెబ్‌సైట్‌లో పరిచయం చేశారు.

చందమామ ఆర్ట్‌బుక్ 1, 2 భాగాలు
64kalalu.com కోసం శ్రీ మట్టెగుంట అప్పారావు గారు ఆర్ట్‌బుక్ గురించి చేసిన పరిచయ కథనం కోసం కింది లింకును చూడగలరు. ఆర్ట్‌బుక్‌పై ఆన్‌లైన్‌లో తొలి పరిచయం ఇదే.

http://64kalalu.com/book-review?start=8

(క్షమించాలి. 64 కళలు.కామ్ లో చందమామ ఆర్ట్ బుక్ పై సమీక్ష వచ్చిన గతంలోని లింకు స్థానంలో మరొక పుస్తక సమీక్ష లింకు వచ్చి చేరింది. పాత లింకు పనిచేయడం లేదు. కాబట్టి కింది ఇమేజ్‌లోని విషయాన్ని చూడండి)

 

చందమామ ఆర్ట్‌బుక్

2.

ఆర్ట్ బుక్ రెండు వాల్యూమ్స్ అందాయి. పేజీలు తిరగేసాక నేను పొందిన అనుభూతి అనిర్వచనీయం.
చందమామలో తొలి కథ ప్రచురించబడినప్పుడు ఎంత సంతోషించానో అంతకు మించి ఆనందించాను.
వీటిని నేను మహానుభావులు ఆచార్య,శంకర్, చిత్ర, వపా గార్లు భారతీయులకు అందించిన విలువైన నిధిగా భావిస్తున్నాను. ఆర్ట్ బుక్ ఆద్యంతం అద్భుతం. రంగుల లోకంలో విహరింపజేసింది. దివ్యలోకాలను ఆవిష్కరించింది. పురాణ పురుషుల సన్నిధిని నిలిపింది.ఎంత చూసినా, ఎన్నిసార్లు చూసినా తనివి తీరని విచిత్ర పరిస్థితి.
ఈ ఆర్ట్ బుక్ భవిష్యత్ తరాలకు మార్గ దర్శిని.  పెద్దలు, ఈ ఆర్ట్ బుక్‌ని పిల్లలకు చూపితే పురాణ పురుషుల దివ్య రూపాలు వారి చిన్నారి హృదయాల్లో ముద్రించుకుపోతాయి. చందమామ కుటుంబీకులదగ్గర తప్పక ఉండవలసిన చందమామ కురిపించిన వెన్నెల ఇది. ఆర్ట్‌బుక్ అందించే ఆనందానుభూతిముందు మనం చెల్లించే మూల్యం అత్యల్పం. వెన్నెల లోకం చేరుకోవడానికి త్వరపడండి.
శ్రీ ఎన్.శివ నాగేశ్వరరావు, తెనాలి
(చందమామ రచయిత)

3.

‘చందమామ ఆర్ట్‌బుక్‌’లో బాల్య స్మృతులను గుర్తుకు తెచ్చిన వడ్డాది పాపయ్య గారి చిత్రాలు, శంకర్, చిత్ర, MTV ఆచార్య గార్ల చిత్రాలు- కంటికి అందంగా, ఆరోగ్యంగా – మధురానుభూతిని మిగిల్చాయి! చందమామలో వచ్చిన నాటి చిత్రాలు – చక్కటి ప్రింటింగ్‌తో అందంగా అందించిన -ఈ ప్రయోగం – చిత్రాభిమానులకు అపురూపమైన కానుక! జీవిత కాలం పదిలంగా దాచుకోవాల్సిన అమూల్యమైన సంపద!
ఇక – చిత్ర విషయాలకు వస్తే – శంకర్ గారు వేసిన ఖాండవ దహనం – “ప్రజ్జ్వలిస్తున్న అగ్నికీలల వేడిమి” అనుభూతిని కలగజేసింది. అలాగే అచార్య గారు వేసిన కృష్ణుడు గోపికలతో “వెన్నెలలో రాసక్రీడలు” చిత్రం “విజయా” వారి వెన్నెలను కళ్ళముందు ఆవిష్కరించింది! వ.పా.గారి ఏకలవ్యుడు చిత్రంలో -ద్రోణాచార్య పోలికలతో రూపొందిన ఆయన శిల్పం – పోలికలు ఒకేలా ఉన్నా – మనిషికి, శిల్పానికి తేడా అద్భుతం!
-పోతే సందేహమే అయినా – వడ్డాది పాపయ్య గారి – రామాయణ చిత్రమాలికలో – రాముడు, సీత – లవ కుశులు ఒకేసారి కలవకపోయినా – వారు నలుగురూ ఉన్న చిత్రం చాలా అందంగా ఉన్నది!
ఈ కోవలోనే – పూర్వం – యువ దీపావళి ప్రత్యేక సంచికలలో వచ్చిన వ.పా. గారి చిత్రాలు కూడా ప్రత్యేకంగా అందిస్తారని ఆశిస్తూ – అభినందనలతో –
శ్రీ  పి.శ్రీరామ చంద్ర మూర్తి, తెనాలి
చందమామ అభిమాని.

4.

నెలనెలా వెన్నెలలద్దుకుని, చకచకా సొగసులు సరిదిద్దుకుని, పదారుభాషల వారి కితాబులందుకుని భారతీయ పత్రికగానే కాక, అంతర్జాతీయ స్థాయిని చేరుకున్న చందమామ పుట్టింది మన భాషలోనే అని తలుచుకుంటే ఉప్పొంగని తెలుగు గుండె ఉండదు. కాలక్షేపం కథలతోనే సరిపెట్టుకోక శాస్త్రీయ పరిశోధనాత్మత వ్యాసాలూ, మెదడుకి మేతగా పోటీలూ, అన్యభాషలు నేర్పే ఏర్పాట్లూ– ఇవన్నీ కంటికి నదురైన రంగులతో, అచ్చుతో, అనువైన సైజుతో ఇక్కడ కాక మరెక్కడ దొరుకుతుందని! ఈ సంస్థ పుస్తకరూపంలో పిల్లలకందించే విజ్ఞాన వర్గకోశాలు ఎన్నెన్నని!

ఇంతెందుకు ఇటీవల వీరు ప్రచురించిన ‘చందమామ ఆర్ట్‌బుక్‌’ చూశారా! పదిహేనువందల ఖరీదు కాస్త ఎక్కువే అనిపించవచ్చు కాని అది అందించే శతకోటి అందాల మాట!

నా తొలి ప్రేమ చందమామ. వాక్రూప వర్ణార్ణవం…
ఈ నాటికీ కథాసుధల్ని వెదజల్లుతూ హాయిగా జీవించగలిగే నా మనోధృతికి నాటి చందమామే మధురస్మృతి!

శ్రీ  అవసరాల రామకృష్ణారావు, విశాఖపట్నం
తొలి చందమామ -1947-లో తొలి కథ రాసిన వారు. తొలిచందమామ కథకులలో మిగిలి ఉన్న ఏకైక మాన్యులు.

5.

అందమైన చందమామ బంధం!

“చందమామ’ అంటే  అమాయకమైన, అందమైన నా బాల్యం!

చందమామ పేజీల్లోకి  చూపులు సారిస్తే.. చెప్పలేనంత పరవశం. ఆ అక్షరాలు ఊహలకు రెక్కలు తొడిగేవి. అద్భుత కథల లోకాల్లోకి అలవోకగా తీసుకెళ్ళేవి. అంతులేని కుతూహలాన్ని రేకెత్తించేవి.

ఉత్కంఠ కలిగించే  కథలూ,  ధారావాహికలూ; కథలో పాత్రలకు  ప్రాణం పోసే అద్భుతమైన రంగుల బొమ్మలూ… !

ముఖ్యంగా జానపద, పౌరాణిక ధారావాహికల్లో పేజీ సైజులో మురిపించే  అపురూప చిత్రాలు నా చిన్ననాటి స్మృతులను  వర్ణ రంజితం చేశాయి.

అవి  ఏవో మామూలు  బొమ్మలని  అనిపించవెప్పుడూ. జీవం తొణికిసలాడుతూ కథల్లో భాగమౌతాయి. చాలాసార్లు  కథలకే  కొత్త అందాలను సంతరిస్తాయి. ఒక్కోసారైతే ఆ  కథలనే  మించిపోయేంతగా  మురిపిస్తుంటాయి!

‘ఎప్పుడైనా అరణ్యాలను చూశావా’ అని ఎవరైనా అడిగితే  ‘లేదు!’ అని చప్పున చెప్పాలనిపించదు.  ఎందుకంటే  కీకారణ్యాలూ,  కారడవులూ నాకు  సుపరిచితమే అనిపిస్తుంది.  అందమైన ఆకులూ, పూలూ, ఫలాలతో పొడుగ్గా, విశాలంగా  పెరిగిన వృక్షాలూ; ఆ చెట్లను పెనవేసుకుపోయే ఊడలూ; నేల మీద హొయలు పోయే రెల్లు పొదలూ … సుదూరంగా కొండలూ … ఇలా అనంతమైన ప్రకృతిలో ఒదిగిన అరణ్య సౌందర్యం చందమామ బొమ్మల్లో అద్భుతంగా  సాక్షాత్కరిస్తుంది.

చందమామ కోసం  ప్రతి నెలా ఆత్రంగా ఎదురుచూసేవాణ్ణి.  మంత్రముగ్ధం చేసే  వ.పా. ముఖచిత్రం, దానిపై సన్నని తెలుపు బోర్డరుతో ఎర్రని  త్రికోణాకృతి… దానిలో ఉండే 1 రూపాయి…  వీటన్నిటినీ తనివి తీరా చూడటం వల్లనేమో  మనసులో  ముద్రించుకుపోయాయి.

మూడు సంవత్సరాల క్రితం కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు ‘ఈమాట’ వెబ్ మ్యాగజీన్ లో రాసిన ‘చందమామ జ్ఞాపకాలు’ వ్యాసం చదివాను.  అప్పటివరకూ  చందమామ గురించి నాకు తెలియని ఎన్నో విశేషాలు గ్రహించాను.  చందమామకు అద్భుత ముఖచిత్రాలను అందించిన, ‘మహా భారతం’ పాత్రలకు రూపురేఖలు దిద్దిన-  ఎంటీవీ ఆచార్య అనే గొప్ప చిత్రకారుడి గురించి రోహిణీప్రసాద్ గారి వ్యాసమే పరిచయం చేసింది.

సజీవమైన, చక్కని  తెలుగు వాడుక భాష  చందమామ ద్వారానే నాకు  అందింది. బాల్యంలోనే నాలో తరగని పఠనాసక్తిని పెంచింది  చందమామే!

పది సంవత్సరాల క్రితం చందమామ ప్రచురణ ఆగిపోయినప్పుడు  ఆత్మీయ నేస్తం దూరమైన బాధ. మళ్ళీ  ప్రచురణ ఆరంభమైనపుడు ఎంతో సంబరం !

చందమామ అంటే అక్షరాల్లో సంపూర్ణంగా వ్యక్తం కానంత అపురూపమైన అనుబంధం!”

శ్రీ  సి.హెచ్ వేణు, హైదరాబాద్
‘చంపి’ -చందమామ పిచ్చోళ్లు బృందసభ్యులలో ముఖ్యులు-

5. ‘ఆర్ట్‌బుక్‌’లో చందమామ చిత్రకారులపై ఆంగ్లంలో ఉన్న సమాచారాన్ని యధాతథంగా ఇక్కడ ప్రచురించడమైనది.

SANKAR

Sankar, a professionally trained artist, joined Chandamama in 1952. For nearly six decades,
he has enthralled readers with his artwork. He recalls several touching instances of people
from different parts of the country traveling far to meet him, or calling him up to offer warm words of appreciation. Today, for old and new readers of the magazine, his name is synonymous with Vikram-Vetal. Now in his eighties, Sankar continues to work with the same passion and dedication that he had at the start of his career. Prior to Chandamama, he had worked with a literary magazine, Kalaimagal, Manjari (a digest) and another, Kannan.
He received the Chandamama Excellence Award for Drawing in 2002.

CHITRA

Chitra was ‘discovered’ by Chakrapani. His real name was TV (Tiruvallur Veera) Raghavulu, and he worked for Chandamama from 1947 to 1978, the year he passed away. Chitra was a self-taught artist with no formal training in art. He was also an excellent photographer and some of his works have won awards nationally and internationally. He was in the ARP during the Second World War. Later, he worked with Kleir & Peyerl as a photographer and block maker. Following this, he worked with Oxford University Press as artist and salesman, before joining Chandamama. He consistently did the back cover, called the wrapper, in Chandamama.

MTV ACHARYA

MTV Acharya, a prolific artist, joined Chandamama when the magazine was launched in 1947. Mostly, he worked on cover illustrations. Some of his best works include those done for the Mahabharata series. Later, MTV started an art school in Bangalore, Acharya Chitrakala Parishes, and became the first in Indian history to start a postal art correspondence school. He worked as an art director for several magazines. He was the recipient of several national awards like the Kala Beeshma and Kala Bagheeratha.

VAPA

Vaddari Papayya, affectionately called Vapa, was with Chandamama between 1960 and 1991. With almost 470 covers to his credit, Vapa transformed the face of Chandamama cover art with his explosive palette. His style is unique in that he took care to embed layers of meaning that would reveal themselves only on close examination.

6.

Art Book Add in online chandamama
https://www.chandamamashop.com/index.php?action=productDetails&productId=211

Chandamama Art Book is a unique anthology of art work created by Chandamama’s celebrated artists. Stunning pictures by illustrators such as Sankar, Chitra, M.T.V. Acharya, and Vapa will take you down memory lane. Each illustration is a beautiful depiction of a scene in Chandamama’s favourite stories. With intricate details in vibrant colours, this collection will appeal to everyone.

Specifications: Published in 2 volumes

Size: 9.5 x 12.5 inch
Weight: 2.75 kg’s
Pages: 384  (Two Books)

Language : English
Price        : 1500.00
Overseas Price : $ 60.00

సిహెచ్ వేణు గారూ,
ఆర్ట్ బుక్ సమాచారం కావాలని కోరారు. కాస్త ఆలస్యంగానే అయినా ఆర్ట్ బుక్‌పై స్పందనలను ఇలా కూర్చి పొందుపర్చాము చూడండి. మీ నుంచి ఆర్ట్ బుక్‌పై విశిష్ట వ్యాసం త్వరలోనే ఆశించవచ్చా…?

చందమామ ఆర్ట్‌బుక్ కావాలంటే నేరుగా ముంబై కార్యాలయానికి రూ. 1500 ఎంఓ లేదా చెక్ పంపి తెప్పించుకోవచ్చు. లేదా చెన్నయ్ ఆఫీసు నుంచి కూడా తెప్పించుకోవచ్చు. కావలసినవారు కింది ల్యాండ్ లైన్ లేదా మొబైల్ నంబర్లకు కాల్ చేసి సంప్రదించవచ్చు.

Chandamama India Limited
No.2 Ground Floor, Swathi Enclave
Door Nos.5 & 6 Amman Koil Street
Vadapalani, Chennai – 600026
Phone :  +91 44 43992828 Extn: 819
Mobile : +91 9884612596

RTS Perm Link