అందమైన చందమామ బంధం

September 8th, 2009
మా చందమామ జ్ఞాపకాలు

మా చందమామ జ్ఞాపకాలు

సిహెచ్ వేణు గారికి
మనఃపూర్వక కృతజ్ఞతలు.

పని ఒత్తిడిలోనూ తీరిక చేసుకుని మీరు పంపిన చందమామ జ్ఞాపకాలు -‘అందమైన చందమామ బంధం’- అందింది (06-09-09). కోరగానే మీ అమూల్యమైన చందమామ జ్ఞాపకాలను ఆన్‌లైన్ చందమామకు పంపినందుకు కృతజ్ఞతలు.

“నేను పుట్టకముందు ప్రచురితమై నేను గతంలో ఎన్నడూ చూడని చందమామలనూ చదవగలిగానంటే ఇంటర్నెట్టే కారణం.”
 
మీరన్నది నిజం. ఎంత నాసిరకంగానే అయినప్పటికీ ఆన్‌లైన్‌లో చందమామ ఆర్కైవ్‌లు పెట్టకపోయి ఉంటే 50, 60 ఏళ్ల క్రితంనాటి అద్భుత కథలను ఇలా మనం చదివే వాళ్లం కాము. నాకు తెలిసి 60 ఏళ్ల సంచికలను మొత్తంగా ఆన్లైన్‌లో పెట్టాలని నిర్ణయించుకుని ఆ పనిలో ముందుకు సాగుతున్న పత్రిక చందమామ మినహా ప్రపంచంలోనే మరొకటి ఎక్కడాలేదు. నేషనల్ జాగ్రఫీ వాళ్లు కూడా 112 సంవత్సరాల సంచికలను టోకున సీడీలలో పెట్టి అమ్మారు తప్ప ఉచితంగా ఆన్‌లైన్‌లో పొందుపర్చలేదు.

ఆన్‌లైన్‌లో 60 సంవత్సరాల క్రితం నాటి అపరూప సంచికలు. ఒక్కచోటే అన్ని చందమామలు… తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది నాకు. వేణుగారూ ఈ విషయంపైనే మీరు ఎందుకు ఓ కథనం రాసి మీ బ్లాగులో పెట్టకూడదు? చందమామ యాజమాన్యం తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఇంటర్నెట్‌లో చందమామ ఆర్కైవ్స్ ఒకటి.

ఏ మహత్తర క్షణంలో ఈ నిర్ణయం తీసుకున్నారో కాని తెలుగు వాళ్లకు తమదైన సాంస్కృతిక సంపద కళ్లముందు కనిపిస్తోందిప్పుడు. ఇప్పుడు కొన్ని కారణాల రీత్యా అంతకు ముందు ఉన్న పీడీఎఫ్ డౌన్లోడ్ సౌకర్యం తీసివేసి చదవగలిగేలా ఫ్లాష్ ఇమేజ్ ఫార్మేట్‌లో చందమామలను ఇంటర్నెట్‌లో పెట్టారు.

“అనంతమైన ప్రకృతిలో ఒదిగిన అరణ్య సౌందర్యం చందమామ బొమ్మల్లో అద్భుతంగా సాక్షాత్కరిస్తుంది.”     

“సజీవమైన, చక్కని తెలుగు వాడుక భాష చందమామ ద్వారానే నాకు అందింది. బాల్యంలోనే నాలో తరగని పఠనాసక్తిని పెంచింది  చందమామే!”

“చందమామ అంటే అక్షరాల్లో సంపూర్ణంగా వ్యక్తం కానంత అపురూపమైన అనుబంధం!”

మీ ‘చందమామ జ్ఞాపకాలు’ లో ఇవన్నీ మెరుపు వాక్యాలే మరి. అక్షర సత్యాలు కూడా. ఈరోజు కూడా మనం ఒక పరీక్ష పెట్టుకోవచ్చు. ఎవరైతే బాల్యంలో కథలు వినడానికి, కథలు చదవడానికి దూరమైపోయారో వారు సాహిత్యానికి కూడా దూరమైపోయి ఉంటారు. . వారి కుటుంబంలో సాహిత్య వాతావరణం కూడా దూరంగానే ఉంటుంది.

బాల్యంలో ఎలాంటి సాహిత్య పరిచయం లేనివారు మధ్యలో సాహిత్య వాతావరణంలోకి రావడం కూడా అరుదుగానే జరుగుతుందనుకుంటాను.

అయితే సమాజంలో లక్షలాది మంది ఇప్పటికీ సాహిత్యానికి, పుస్తక పఠనానికి దూరంగా ఉంటూ ఉండడానికి సామాజిక, ఆర్థిక, బౌద్ధిక కారణాలు ఎన్నో ఉన్నాయనుకోండి.

పని గట్టుకుని మంచి పుస్తకం మనం ఇచ్చి, కొనిపించి చదివించినట్లయితే కొంతమంది పిల్లల్లో ఈనాటికీ పుస్తకాల పట్ల అనురక్తి ఏర్పడుతోంది. అంటే పిల్లలు పుస్తకాలు చదవరనే మాట వట్టిదే. వారికి చదివే అవకాశం, తీరిక సమయాన్ని ఇంట్లో, పాఠశాలల్లో కల్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

జీవితంలో పోరాటం అవసరమైన పరిస్థితుల్లో కాకుండా, మంచి సాహిత్యం చదివి, అన్యాయంపై ఆగ్రహంతో ఉద్యమాల బాటను ఎంచుకున్న వారు ఎంతోమంది ఉన్నారని నా అనుభవంలో తెలిసింది.

వేణుగారూ.. చెప్పుకుంటూ పోతే కాలం సరిపోదు. మరి సెలవు.

మీ చందమామ జ్ఞాపకాలను ఒక్కరోజు వ్యవథి తీసుకుని రేపు (07-09-09) తప్పకుండా ఆన్‌లైన్‌లో ప్రచురించగలం. వచ్చిన వెంటనే ప్రచురించడం రివాజు అయినప్పటకీ, మా ఆన్‌లైన్ కంటెంట్ హెడ్ ఆఫీసుకు రాకపోవడంతో ఈ ఇబ్బంది ఏర్పడింది. ఒకసారి ఆమెతో మీ జ్ఞాపకాలను పంచుకున్న తర్వాత రేపు అంటే మంగళవారం దీన్ని తప్పక పోస్ట్ చేయగలం. ఇది చిన్న సాంకేతిక విషయంతో ముడిపడిన విషయం మాత్రమే అని గుర్తించగలరు….

అన్యధా భావించరని ఆశిస్తూ….

మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలతో.. ఈ చందమామ జ్ఞాపకాల అనుబంధం ఇలాగే కొనసాగుతుందని ప్రగాఢంగా ఆశిస్తూ…

మీ
చందమామ

వేణుగారి చందమామ జ్ఞాపకాలు చదవాలనుకుంటే ఈ కింది లింకుపై క్లిక్ చేయండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2197

బీవీ ఫణి, రోహిణీ కుమార్, త్రివిక్రమ్, శివరామ్ ప్రసాద్ గార్లు ఇదివరకే పంపిన వారి చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకుపై క్లిక్ చేయండి.

http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49
………………………….

మా చందమామ జ్ఞాపకాలు

చందమామ జ్ఞాపకాలను దశాబ్దాలుగా తమ హృదయంలో పొదవుకుని భద్రపర్చుకున్న వందలాదిమంది చందమామ అభిమానులకు, బ్లాగర్లకు, నెటిజన్లకు ఆన్‌లైన్ చందమామను సాదర నిలయంగా మార్చాలనే ఆశయంతో telugu.chandamama.com లో “మా చందమామ జ్ఞాపకాలు” విభాగాన్ని రూపొందించాము. చందమామతో తమ జ్ఞాపకాలను, అనుభూతులను ఈ విభాగంలో పంచుకోవాలని భావిస్తున్న అభిమానులకు ఇదే మా ఆహ్వానం.

ఆ రోజుల్లో మీ చిన్ననాటి చిరునేస్తంగా పలకరిస్తూ వచ్చిన చందమామ జ్ఞాపకాలను మీరు తెలుగులో లేదా ఇంగ్లీషులో కింది లింకుకు పంపించగలరు.  వీలయితే మీ ఫోటో, ప్రొఫైల్ వివరాలను కూడా పంపగలరు.

abhiprayam@chandamama.com

చందమామ పాతసంచికలలోని కథలను చదువదలిస్తే కింది ఆర్కైవ్స్ లింకులో చూడండి. గత సంచికల కోసం వెనక్కు వెళ్లి మీ అభిమాన కథలను మళ్లీ చదవండి. మా ఆర్కైవ్‌లను చూసి, ఆనందించండి.

http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

 నోట్:

చందమామ అభిమానులందరినీ ఉర్రూత లూగించే ఒక చల్లటి వార్త త్వరలో మీ ముందుకు…  సర్వశ్రీ ఎంటీవీ ఆచార్య, చిత్ర, వడ్డాది పాపయ్య, శంకర్ గార్ల పేర్లు తెలుసు కదూ.. చందమామ చరిత్రకే మణిభూషణాలను దిద్దిన ఈ అపరూప చిత్రకారులకు సంబంధించిన ఓ మంచి విషయం కోసం త్వరలో ఇక్కడే కలుసుకుందాం.

 చందమామ.

RTS Perm Link

చందమామ జ్ఞాపకాలు

September 2nd, 2009
చందమామ జ్ఞాపకాలు : శివరాంప్రసాద్ కప్పగంతు.

చందమామ జ్ఞాపకాలు : శివరాంప్రసాద్ కప్పగంతు.

శివరాం ప్రసాద్ గారూ,

మనఃపూర్వక కృతజ్ఞతలు. అడిగిన వెంటనే తీరిక చేసుకుని మరీ మీ చందమామ జ్ఞాపకాలు పంపారు. మీరు కోరినట్లు మీరు సూచించిన ఫోటోయే ఆన్‌లైన్ చందమామలో ప్రచురించాము. పెద్ద పెద్ద పేరాలను చిన్నవిగా చేయడం తప్పిస్తే మీరు పంపిన పూర్తి పాఠాన్ని యధాతథంగా ప్రచురించాము. నిన్ని త్రివిక్రమ్ గారు, ఇవ్వాళ మీరు… వెంటవెంటనే చందమామ జ్ఞాపకాలను పంపడం.. నిజంగా చక్కటి అనుభూతి.

‘చందమామలో బొమ్మలను ఉదహరించకపోతే, చందమామ జ్ఞాపకాలేమిటి’  చక్కటి వ్యాఖ్య. కొత్తగా వచ్చిన చంద్రబాల అలనాటి చందమామను గుర్తుకు తెస్తూ బొమ్మలతో అదరగొడుతోంది. దాంట్లో పూర్తి పేజీ రంగుల చిత్రాలను చూస్తుంటే చందమామ పోగొట్టుకున్నదేమిటో అర్థమవుతుంది. ఇప్పటికైనా చందమామ మేలుకుంటే మంచిది.

‘కొత్త చందమామను షాపువాళ్ళు వరుసగా పెట్టినప్పుడు, ఆ దుకాణానికే గొప్ప అలంకరణ చేసినట్టుగా ఉండేది’

మళ్లీ ఆరోజులు రావాలనే కోరుకుంటున్నా. మన అందరి ఆశలు, ఆకాంక్షలు, డిమాండ్లు అన్నీ ఒక్కటొక్కటిగా నెరవేరుతాయనే అనుకుంటున్నా. పాత చందమామలు దుకాణాల్లో పేర్చి ఉన్న ఫోటోలు ఒకటో రెండు దొరికితే బాగుండు. చందమామ ఆఫీసులో పేర్చి ఉన్న చందమామలను చూస్తుంటేనే మనసు తుళ్లింతలు పోతుంది. అలాంటింది పాత చందమామల ముఖచిత్రాల గురించి చెప్పపనిలేదు.

‘ఇంతటి అద్భుతమైన బొమ్మలను సేకరించి, ఒక పుస్తకం వెయ్యగలిగితే చందమామ వారు తెలుగు సాహిత్యానికి చిత్రలేఖన  కళకు ఎంతగానో సేవచేసినవారిగా చరిత్రకు ఎక్కుతారు’.

ఇప్పుడు చందమామ అభిమానులు, పాఠకులు, చంపిలు పత్రికకు పంపే డిమాండ్లలో దీన్నికూడా మొదటి వరుసలో చేర్చాలి. చందమామకు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇంగ్లీషులో కలెక్టర్ ఎడిషన్ వేసి తెలుగు వారి సెంటిమెంట్లను గాయపర్చారు. కనీసం ఈ ప్రతిపాదనను అయినా చందమామ నిర్వాహకులు పరిగణనలోకి తీసుకుని చందమామ ఆస్థాన చిత్రకారుల త్రయం గీసిన చిత్రాలను ఒక పుస్తకంగా వేస్తే అది ఓ అద్భుత ఆవిష్కరణగా చరిత్రలో మిగులుతుంది.

చక్కటి రిజల్యూషన్‌తో చందమామ చిత్రాలను ప్రచురిస్తే ఎంత ఖర్చైనా వెచ్చించి తీసుకోవడానికి పాఠకులు పూనుకుంటారనే నా నమ్మకం. Chandamama Collector’s edition పుస్తకం చివర్లో Art Galleryలో చిత్రాలు ఓసారి చూడండి. అదిరిపోయేలా వేశారు. మళ్లీ మెయిన్ పుస్తకంలో వేసిన చిత్రాలు అంత కళగా లేవు. కాని అరుదైన పుస్తకంగా దీన్ని మనం కొని భద్రపర్చుకోవచ్చు.

చందమామ చిత్రాలు పుస్తక రూపంలో రావాలంటే చందమామకు అభిమానులు పంపే ఉత్తరాలు, ఈ మెయిళ్లలో దీన్నికూడా చేర్చి పంపించాలి. చందమామ ధారావాహికలు, చందమామ చిత్రాలు వంటివి తిరిగి ముద్రించబడితే ఎంతగా పాఠకుల ఆదరణ పొందుతాయో నిజంగానే నిర్వాహకులకు తెలియకపోవచ్చు కూడా. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడితే ఈరోజు కాకపోతే రేపయినా వీటి పునర్ముద్రణ విషయం ఆలోచిస్తారు.

అందుకే వీలయినంత మంది చంపిల, చందమామ అభిమానుల, పాఠకుల ఈమెయిళ్లు మనం సేకరించగలగితే ఏక కాలంలోనే నిర్దిష్ట సంఖ్యలో పాఠకులు ఓ ప్రత్యేక అంశంపై డిమాండును మరిత బలంగా పంపించడానికి అవకాశముంటుంది. అలా అది యాజమాన్యంపై తప్పకుండా ప్రభావం చూపుతుంది కూడా. ఎంతలేదన్నా సంఖ్యా బలానికి ప్రాధాన్యత ఉన్న కాలం కదా ఇది.

దీన్నే నా బ్లాగులో కూడా చందమామ అభిమానులకోసం పోస్ట్ చేస్తాను.

మరోసారి మీ చందమామ జ్ఞాపకాలకు కృతజ్ఞతలు.

మీ చందమామ జ్ఞాపకాల కోసం కింది లింకును తెరవండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2176

రాజు.

నోట్: చందమామ అభిమానులకు, చంపిలకు విజ్ఞప్తి.  చందమామతో మీ బాల్య, తదుపరి జీవిత జ్ఞాపకాల గురించి రెండు పుటలకు మించని కథనం కింది లింకుకు పంపగలరు. మీ ఫోటోతో  సహా పంపితే మరీ మంచిది. తెలుగు పాఠకుల చందమామ జ్ఞాపకాలకు ఆన్‌లైన్ చందమామ వేదిక కావాలన్న మా ఆకాంక్షను మన్నిస్తారని ఆశిస్తూ..

చందమామ జ్ఞాపకాలు పంపవలసిన లింకు

abhiprayam@chandamama.com

RTS Perm Link

చందమామతో చెలిమి – మా చందమామ జ్ఞాపకాలు

September 1st, 2009
చందమామ జ్ఞాపకాలు : త్రివిక్రమ్

చందమామ జ్ఞాపకాలు : త్రివిక్రమ్

త్రివిక్రమ్ గారూ,
మనఃపూర్వక కృతజ్ఞతలు. పని ఒత్తిళ్లలో ఉండి కూడా ఆలస్యంగా అయితేనేం, మీ చందమామ జ్ఞాపకాలను “చందమామతో చెలిమి మా చందమామ జ్ఞాపకాలు’ పేరిట  తీపిగుర్తులుగా ఆన్‌లైన్ చందమామకు పంపారు.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2166

ఈ శీర్షిక మొదలు పెట్టినప్పుడు మొదట మీదే రావలసి ఉండె. మొత్తంమీద 30, 40 సంవత్సరాల క్రితం తెలుగు చదవగలిగిన కుటుంబాలు ఆంధ్రరాష్టం నలుమూలలా సాగించిన చందమామ ఒరవడిని మీ ‘చందమామతో చెలిమి’ కథనం చక్కగా వివరించింది. చదువుతుంటే మా యింట్లో నాన్న చందమామను తొలిసారిగా తీసుకువచ్చి మాకు పరిచయం చేసిన నాటి అమృత గడియలు ఒక్కసారిగా జ్ఞాపకానికి వచ్చాయి.

రెండు మూడు తరాల క్రితం కుటుంబానికి చందమామకు లంకె కుదర్చాలంటే నాన్నే ప్రధాన ఆధారం. అందుకే తెలుగునాట చందమామ నాన్నల ఆదరణ సాక్షిగా మొగ్గతొడిగిందంటే అతిశయోక్తి కాదనుకుంటా. (అమ్మల ప్రోత్సాహం, తమపిల్లలకు వారు కథలతో జోకొట్టడం వంటివి ఉన్నప్పటికీ, ఊకొడితే చాలు ఆ గడియకో కథ చెబుతూ పిల్లల కథా దాహాన్ని తీర్చడంలో అమ్మల పాత్ర తక్కువేమీ కాదు) 

ఈ శీర్షిక కేవలం చందమామ అభిమానులకు, ‘చంపి’ లకు, పాఠకులకు మాత్రమే సంబంధించింది కాబట్టి  వీలైనంత మంది చందమామ ప్రేమికులు తమ చందమామ జ్ఞాపకాలను కింది లింకుకు తమ ఫోటోతో సహా పంపితే బాగుంటుంది.

చందమామను తన సవతుల్లో ఒకటిగా భావించిన మీ జీవన సహచరి చివరకు తానే చందమామ ప్రేమికురాలిగా మారడం…
ఇంతకంటే చందమామకు ఏం కావాలి. తెలుగు జాతికి, చందమామకు ఏర్పడిన ఈ రుణానుబంధం ఎన్నటికీ చెరిగి పోకూడదని ఆశించడం తప్ప మనం ఏం చేయగలం చెప్పండి.

అంతవరకూ పాఠకుల ‘చందమామ జ్ఞాపకాలు’ కోసం నిరీక్షిస్తూ…

రాజు.

 

త్రివిక్రమ్ గారి ‘చందమామతో చెలిమి’ కథనం కోసం కింది లింకులో చూడగలరు

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2166

ఆన్‌లైన్ చందమామ హోమ్ పేజీలో కూడా చూడగలరు.

telugu.chandamama.com కు మీ రచనలు, చందమామ జ్ఞాపకాలు, సూచనలను కింది లింకుకు పంపండి.

abhiprayam@chandamama.com

RTS Perm Link

పాత బంగారం మాకు ఎప్పటికి ముద్దే

August 27th, 2009
పాత చందమామ కవర్ పేజీ

పాత చందమామ కవర్ పేజీ

(చందమామ పాత సంచికల పట్ల, పత్రిక పాత నమూనా పట్ల అపారమైన ప్రేమాభిమానాలు పెంచుకున్న వెలువలి రామకృష్ణ రోహిణీ కుమార్ గారు చందమామ పాత తరం శ్రేయోభిలాషుల్లో ఒకరు. చందమామలో కథలు తగ్గిపోతున్న రీతి, రివాజుల పట్ల బాగా అసంతృప్తి ఉన్న రోహిణీ కుమార్ గారు దాదాపు 3 నెలల క్రితం పత్రికకు ఆప్తవాక్యాలు పలుకుతూ మొదటగా కింది మెయిల్ పంపారు. ఆయన అసంతృప్తిని గౌరవిస్తూనే, దృష్టిలో ఉంచుకుంటూనే చందమామకు ఆయన తెలిపిన శుభాకాంక్షలను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాము. అయన కోరిన డిమాండ్లు అన్నీ ఇప్పటికప్పుడు తీర్చలేకపోతున్నప్పటికీ, చందమామ హితం కోరే వారిని, వారి విలువైన అభిప్రాయాలను ఎన్నటికీ మర్చిపోమని, చందమామ మంచి దశవైపు మళ్లే శుభక్షణం కోసం మాకు వీలైనంత మేరకు, చేయగలిగనంత కృషి తప్పక చేస్తామని మరోసారి హామీ ఇస్తూ… వారు నిండు నూరేళ్లు చల్లగా బతకాలని కోరుకుంటూ….)

 

చందమామకు గల అశేష పాఠక ప్రజానీకంలో నేనూ ఒకడిని.

కొత్త సంచిక ఎప్పుడెప్పుడు అందుకుంటానా అని ఆశగా ప్రతి నెల ఎదురు చూస్తుంటా.

చందమామ కథలు అమ్మ చెప్పిన కథలను తలపించే రీతిన ఉంటాయనటంలో అతిశయోక్తి లేదు.

నా చిన్నతనంలో మండువేసవి సెలవుల్లో చక్కటి నీతి కథలతో సేద తేర్చిన ఈ చందమామ, నేటికీ పసి హృదయాలను, పెద్దల మనసులను గెలుచుకోవడం ముదావహం.

మహోత్కృష్టమయిన ఉద్దేశ్యంతో స్థాపించబడిన ఈ చందమామ “ఇంతింతై వటుడింతై” అన్న చందాన దినదిన ప్రవర్థమానమై ఆచంద్రార్కం అలరారాలని మనసారా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.

భవదీయుడు

వెలువలి రామకృష్ణ రోహిణీ కుమార్.
—————

మా చందమామ జ్ఞాపకాలు

చందమామ జ్ఞాపకాలను దశాబ్దాలుగా కొనసాగిస్తున్న వందలాదిమంది అభిమానులకు, బ్లాగర్లకు, నెటిజన్లకు ఆన్‌లైన్ చందమామను సాదర నిలయంగా మార్చాలనే ఆశయంతో “మా చందమామ జ్ఞాపకాలు” విభాగాన్ని రూపొందిస్తున్నాము. చందమామతో తమ జ్ఞాపకాలను, అనుభూతులను ఈ విభాగంలో పంచుకోవాలని భావిస్తున్న అభిమానులకు ఇదే మా ఆహ్వానం. ఆ రోజుల్లో మీ చిన్ననాటి చిరునేస్తంగా పలకరిస్తూ వచ్చిన చందమామ జ్ఞాపకాలను మీరు తెలుగులో లేదా ఇంగ్లీషులో కింది లింకుకు పంపించగలరు.  వీలయితే మీ ఫోటో, ప్రొఫైల్ వివరాలను కూడా పంపగలరు. 

abhiprayam@chandamama.com

చందమామ పాతసంచికలలోని కథలను చదువదలిస్తే కింది ఆర్కైవ్స్ లింకులో చూడండి. గత సంచికల కోసం వెనక్కు వెళ్లి మీ అభిమాన కథలను మళ్లీ చదవండి. మా ఆర్కైవ్‌లను చూసి, ఆనందించండి.

http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

RTS Perm Link

తరగని తీపి అనుభవం చందమామ

August 3rd, 2009

చందమామని చూపిస్తూ అమ్మ తినిపించే గోరుముద్దలు, రాముడు మారాం చేస్తె కంచంలొ చందమామను భువికి దించిన కథ మన అందరికి చందమామ తోటి మొదటి మరపురాని తీపి పరిచయం. చందమామ పుస్తకం కూడా అలాంటి మరువలేని తీపి అనుభవమే, ఇది వయసు పెరిగినా తరగని తీపి అనుభవం.

చందమామతో నా మొదటి జ్ఞాపకాలు ఇవీ.. నా చిన్నప్పుడు ఇంకా నాకు చదవటం పూర్తిగా రాని వయసులో నేను ప్రతి నెల చందమామ పుస్తకం కోసం కళ్లు కాయలు కాసేలాగ వేచి ఉండటం, పుస్తకం రాగానే, అమ్మని చదివి చెప్పమని విసిగించడం. ఇంటి పని పూర్తి అయ్యాక రాత్రి పడుకునేటప్పుడు అమ్మ ఒడిలొ కూర్చొ పెట్టుకుని రోజుకి ఒక కథ చొప్పున వినిపించటము….

అమ్మ ప్రేమతొ కుడిన ఆ చందమామ జ్ఞాపకాలు ఎన్నటికీ మరచి పోలేము.

తెలుగు నేర్చుకోవటానికి మొదటి స్పూర్తి చందమామ అని చెపితే అది అతిశయోక్తి అనిపించుకోదు. నలభై ఏళ్ల తరువాత ఈరోజుకి కూడ ప్రతి నెల ఎక్కడ ఉన్నా చందమామ కోసం ఎదురు చూస్తాను. చందమామలొ 25 ఏళ్ల నాటి కథ చదివినప్పుడల్లా ఆ చిన్ననాటి తీపి గుర్తులు మనసును కదల్చి వేస్తాయి.

నా ఇన్నేళ్ల అనుభవం బట్టి చెబుతున్నా. 60 ఏళ్ల పైబడిన చందమామ.. నేను గమనించినంత వరకు ప్రపంచ సాహిత్యంలో ఇంత గొప్ప పత్రిక మరొకటి లేదు. కొన్ని తరాల ప్రజలమీద ఇంతటి ప్రభావం చూపిన పత్రిక మరొకటి నేను చూడలేదు. తెలుగులో, ఇతర భాషల్లో పిల్లల పత్రికలు చాలానే ఉన్నాయనడంలో సందేహం లేదు.

కానీ, 60 ఏళ్లుగా చందమామలా నాణ్యమైన కథలు, రచనలు నిరంతరంగా అందిస్తూ వస్తున్న పత్రిక ప్రపంచంలో మరొకటి లేదనే నా అభిప్రాయం. ఇంతటి చరిత్ర ఉన్న చందమామ ఆన్‌లైన్‌లో కూడా వస్తుండటం సంతోషకరం. ఆన్‌లైన్ చందమామ కూడా ప్రింట్ చందమామలా వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నా.

రచయిత:  బివి ఫణి

కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్

నోట్‌: కాన్పూర్‌ ఐఐటి ప్రొఫెసర్ బివి ఫణిగారితో పరిచయమే గమ్మత్తుగా జరిగింది. చెన్నయ్‌లో చదువుతున్న వారి అమ్మాయి మానస ఈ వేసవి సెలవుల్లో రెండు నెలల పాటు చందమామలో అప్రెంటిస్‌గా పనిచేసినప్పుడు మాటల సందర్భంలో నాన్నకు చందమామ అంటే ప్రాణం అని చెప్పారు. ఇక ఉండబట్లలేక  ఫణిగారి ఇమెయిల్ ఐడి తీసుకుని చందమామ జ్ఞాపకాలు పంవవలసిందిగా కోరడమైంది.

ఈ మెయిల్ చూసుకున్నది తడవుగా ఆయన వెంటనే కాన్పూర్ నుంచి ఫోన్ చేసి చందమామతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. పసిపిల్లాడిలాగా చందమామతో తన అనుబంధం, అమ్మ చెప్పిన చందమామ కథల గురించి రెండు నెలల క్రితం ఆయన ఫోన్ ద్వారా మాట్లాడిన మాటలు ఇప్పటికీ సజీవ జ్ఞాపకంలా వినిపిస్తున్నాయి.

తర్వాత బిజీ అకడమిక్ షెడ్యూల్ మధ్యలోనే తీరిక చేసుకుని ఆయన క్లుప్తంగా చందమామ గురించి తన బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఈమెయిల్ పంపారు. ఆయన ఆరోజు ఫో‌న్‌లో మాట్లాడినవి, ఈమెయిల్‌లో పంపినవి కలిపి “తరగని తీపి అనుభవం చందమామ” పేరిట ఆన్‌లైన్ చందమామలో పోస్ట్ చేయడం జరిగింది.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=1907

బీవీ ఫణిగారి చందమామ జ్ఞాపకాలను చందమామ అభిమానులకోసం ఇప్పుడు ఇక్కడ పోస్ట్ చేయడమైంది.

కృతజ్ఞతలు ఫణిగారూ.. ఊహించని సందర్భంలో మీరు సత్వరం స్పందించి చందమామ జ్ఞాపకాలను పంపినందుకు ధన్యవాదాలు. మిడిల్ ఈస్ట్ నుంచి తిరిగి వచ్చాక ఆర్థిక తదితర అంశాలపై చిన్ని చిన్ని రచనలు పంపుతామని మీరు ఆరోజు చెప్పారు. ఎదురు చూస్తున్నాం.

మానస ఈమధ్య అకడమిక్ ఒత్తిళ్లలో పడి చందమామలో సైన్స్ రచనలు (విశ్వం) పంపడం తగ్గింది. వీలు చూసుకుని ఏదయినా రాయమని తనకు చెప్పండి. ఒక అనుహ్య క్షణంలో ఒకే కుటుంబంలో తండ్రీ కుమార్తె ఇద్దరూ ఆన్‌లైన్ చందమామతో అనుబంధంలోకి రావడం నిజంగా చెప్పలేని సంతోషాన్నిస్తోంది మాకు.

చందమామతో మీ ఈ అనుబంధం కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ…

రాజశేఖర్

మా చందమామ జ్ఞాపకాలు

చందమామ జ్ఞాపకాలను దశాబ్దాలుగా కొనసాగిస్తున్న వందలాదిమంది అభిమానులకు, బ్లాగర్లకు, నెటిజన్లకు ఆన్‌లైన్ చందమామను సాదర నిలయంగా మార్చాలనే ఆశయంతో “మా చందమామ జ్ఞాపకాలు” విభాగాన్ని రూపొందించాము. చందమామతో తమ జ్ఞాపకాలను, అనుభూతులను ఈ విభాగంలో పంచుకోవాలని భావిస్తున్న అభిమానులకు ఇదే మా ఆహ్వానం.

ఆ రోజుల్లో మీ చిన్ననాటి చిరునేస్తంగా పలకరిస్తూ వచ్చిన చందమామ జ్ఞాపకాలను మీరు తెలుగులో లేదా ఇంగ్లీషులో కింది లింకుకు పంపించగలరు.  వీలయితే మీ ఫోటో, ప్రొఫైల్ వివరాలను కూడా పంపగలరు.

abhiprayam@chandamama.com

చందమామ పాతసంచికలలోని కథలను చదువదలిస్తే కింది ఆర్కైవ్స్ లింకులో చూడండి. గత సంచికల కోసం వెనక్కు వెళ్లి మీ అభిమాన కథలను మళ్లీ చదవండి. మా ఆర్కైవ్‌లను చూసి, ఆనందించండి.

http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

RTS Perm Link

మా చందమామ జ్ఞాపకాలు

July 25th, 2009

1st-chandamama-1947

బాల్యాన్ని ఎవరు మర్చిపోగలరు? బాల్యంతో ముడిపడిన చందమామ అనుభూతులను ఎవరు మర్చిపోగలరు? చందమామతో కలగలసిన ఆ పసితనాన్ని ఎవరు మరువగలరు? ఆ జ్ఞాపకాలను, చందమామ పరిమళాలను అందరికీ పంచండి. మనకంటూ మిగిలిన జాతి సంపద, సాంస్కృతిక సంపద చందమామ ఒక్కటే కదా…

చందమామ జ్ఞాపకాలను దశాబ్దాలుగా కొనసాగిస్తున్న వందలాదిమంది అభిమానులకు, బ్లాగర్లకు, నెటిజన్లకు ఆన్‌లైన్ చందమామను సాదర నిలయంగా మార్చాలనే ఆశయంతో http://telugu.chandamama.com     లో “మా చందమామ జ్ఞాపకాలు” విభాగాన్ని రూపొందించాము.

తెలుగునాడులో ఎంతమంది చందమామతో తమ బాల్యజీవితంలోని తాదాత్మ్య క్షణాలను గుర్తుతెచ్చుకుంటూ పలవరిస్తున్నారో ఈ ప్రపంచానికి చాటి చెప్పాలనే చిరు ఆకాంక్షతో… ఆన్‌లైన్ చందమామలో ఈ విభాగాన్ని ఏర్పర్చాము.

http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

తెలుగు జాతి సాంస్కృతిక సంపద అయిన చందమామను ఈ నాటికీ తమ జ్ఞాపకాల దొంతరలలో పదిలపరుచుకుంటున్న చందమామ అభిమానుల గుండె చప్పుళ్లను ఓ చోట చేర్చి అందరికీ పంచిపెట్టాలనే చిరు కోరికే ఈ “మా చందమామ జ్ఞాపకాలు” విభాగం రూపకల్పనకు మూలం.

జీవించడం కోసం ప్రపంచం నలుమూలలకు వలసపోయిన తెలుగు వారు చందమామ పత్రికతో తమ తరాల అనుబంధాన్ని నేటికీ ఎలా కాపాడుకుంటూ వస్తున్నారో, చందమామ జ్ఞాపకాలను పరస్పరం ఎలా పంచుకుంటున్నారో తెలిపే అమూల్యమైన వ్యాసాలు, లింకులు, తదితర సమాచారం ఈ విభాగంలో పొందుపర్చడం జరుగుతుంది.

చందమామతో తమ జ్ఞాపకాలను, అనుభూతులను ఈ విభాగంలో పంచుకోవాలని భావిస్తున్న అభిమానులకు, ‘చంపి’లకు(చందమామ పిచ్చోళ్లు) ఇదే మా సాదర ఆహ్వానం.

బాల్యంలో మీ చిన్ననాటి చిరునేస్తంగా పలకరిస్తూ వచ్చిన చందమామ జ్ఞాపకాలను మీరు తెలుగులో లేదా ఇంగ్లీషులో కింది లింకుకు పంపించగలరు. వీలయితే మీ ఫోటో, ప్రొఫైల్, ఈమెయిల్ చిరునామా తదితర వివరాలను కూడా పంపగలరు. 

ఆన్‌లైన్ చందమామకు మీ ఈమెయిల్ చిరునామాను పంపగలిగితే త్వరలో తీసుకువస్తున్న చందమామ న్యూస్‌లెటర్‌ను మీకు ప్రతివారం నేరుగా మీ ఈమెయిల్ ద్వారా పంపడానికి వీలవుతుంది.

చందమామతో మీ జ్ఞాపకాలు, మీ స్వంత రచనలు, సలహాలు, సూచనలు, విమర్శలను కింది లింకు ద్వారా ఆన్‌లైన్ చందమామకు పంపగలరు.

abhiprayam@chandamama.com

చందమామ పిచ్చోళ్లకు, అభిమానులకు చందమామ తరపున ఇదే మా ఆహ్వానం. మీ అమూల్యమైన సమయంలో కొంత కేటాయించి ఆన్‌లైన్ చందమామకు చందమామతో మీ అనుబంధం గురించి, మీకు ఆసక్తి ఉన్న అంశాలపైనా చిన్ని చిన్ని రచనలు అయినా సరే రాసి పంపడానికి మీకు వీలవుతుందా?

కథలు, గేయాలు, మీకు నచ్చిన పద్యాలు,  పాటలు, సైన్స్, టెక్నాలజీ, హాస్యం, మీకు తెలుసా, లోకజ్ఞానం, భారత దర్శిని, ప్రపంచ దర్శిని,  సాహిత్యం, శ్రావ్యమైన సంగీతం మీ ఇతర అభిరుచులు, ఆసక్తులకు సంబంధించి ఏ విషయంపైన అయినా సరే మీరు రచనలు పంపగలరు.

ప్రతి చందమామ పిచ్చోడికి, పిచ్చోళ్లకి, అభిమానులకు చందమామ ఆన్‌లైన్ తమదిగా ఫీలయ్యే వేదికగా ఉండాలని మా ప్రగాడ కాంక్ష, విశ్వాసం కూడా. హృదయం నిండా చందమామ తలపులను దివ్యంగా పొదవుకున్న మీ వంటి అభిమానులకు ఆన్‌లైన్ చందమామ సాదర నిలయంగా మారాలని కోరుకుంటున్నాం. మీరు పంపే ఏ రచనను అయినా సరే మీ పేరుతోనే చందమామలో పోస్ట్ చేస్తాము.

మీ రచన మీ స్వంతమేనని, ఆన్‌లైన్ చందమామలో ప్రచురణకు దాన్ని పంపుతున్నట్లుగా చిన్న ధ్రువీకరణను  మీ ఈమెయిల్ ఐడి ద్వారా abhiprayam@chandamama.com కు పంపితే చాలు.

చందమామతో మీ అనుబంధం గురించి ఇప్పటికే మీరు బ్లాగుల్లో, వెబ్‌సైట్లలో పోస్ట్ చేసి ఉంటే ఆ లింకులను (url) ఆన్‌లైన్ చందమామకు పంపగలరు. అన్నిటినీ ఒకచోట అమర్చి పాఠకులందరికీ అందించడానికి వీలవుతుంది.

ఈ లోపల మీనుంచి మీ వంటి చందమామ అభిమానుల నుంచి మాకు నిజమైన సహకారం ఒకటి కావాలి. ఆశిస్తున్నాం కూడా. ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న ఆన్‌లైన్ చందమామ రచన, డిజైన్, హోమ్ పేజీతో సహా ప్రతి ఒక్క అంశంపై మాకు మీ సలహాలు, సూచనలు, విమర్శలు, నిర్మోహమాటమైన అభిప్రాయాలు కావాలి.

చందమామ మరింత మెరుగుపడాలని, పాఠకుల కోరికలకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్న మా కోరికను మీరు మన్నించినట్లయితే ఈ కింది లింకులకు మీరు మీ సూచనలు, సలహాలు, ప్రతిపాదనలు దయచేసి పంపగలరు. మీకు తెలిసిన చందమామ అభిమానులకు, ‘చంపి’లకు కూడా ఈ సమాచారం వీలయితే పంపగలరు.

abhiprayam@chandamama.com
Online@Chandamama.com

చందమామ పాత సంచికలలోని కథలను చదువదలిస్తే కింది ఆర్కైవ్స్ లింకులో చూడండి. గత సంచికల కోసం వెనక్కు వెళ్లి మీ అభిమాన కథలను మళ్లీ చదవండి. మా ఆర్కైవ్‌లను చూసి, ఆనందించండి.

http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

చందమామతో మీ జ్ఞాపకాలను ఆన్‌లైన్ చందమామకు తప్పక పంపించగలరు. చందమామ పాఠకులు, అభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం.

RTS Perm Link

‘చందమామ’లో చంద్రయాత్ర విశేషాలు

July 23rd, 2009

గగన చంద్రుడు

‘చందమామ రావే జాబిల్లి రావే’ అంటూ పాడుతూ బిడ్డను జోకొట్టని తెలుగు తల్లి ఉండదని ఓ కవి గతంలో అన్నారు. చందమామను చూపిస్తూ బిడ్డకు జోల పాడని సంస్కృతి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదంటే అతిశయోక్తి కాదు కూడా.. రామాయణ కాలంలో కూడా పసిబాలుడుగా ఉన్న రాముడు చందమామ కావాలని మారాం చేస్తే కిటికీలోంచి చందమామ మిలమిలలను చూపి తల్లి అతడికి అన్నం తినిపించిందని చాటువు.

చందమామ రావే జాబిల్లి రావే అని మనసు విప్పి పాడుకున్న మనిషి ఎంతగా పిలిచినా చంద్రుడు రాకపోయేసరికి మనమే అక్కడికి పోతే పోలా అని కలకన్నాడు. శతాబ్దాలుగా ఊహాలోకంలో గగనయాత్ర చేశాడు. ప్రపంచంలోని ప్రేమికులందరికీ చెలికాడు, భూమ్మీది పిల్లలందరికీ మామ అయిన చందమామ మానవజాతికి అందరాని పండుగా వేల సంవత్సరాలుగా మనిషిని ఊహల్లో ముంచెత్తాడు.

నేటికి సరిగ్గా 40 ఏళ్ల క్రితం.. సహస్రాబ్దాలుగా మనిషికి అందనివాడు.. అయినప్పటికీ అందరివాడు… గా ఉంటూ మానవజాతి బాల్యాన్ని లాలించి, బుజ్జగించి, మైమరిపించి, మురిపించిన అందాల చంద్రుడు మనిషికి దొరికిపోయాడు. నువ్వు రానంటే రాకుండా ఉంటానా అని పాడుకుంటూ, మనిషే చంద్రుడి వద్దకు ప్రయాణమయ్యాడు. 

పిండివెన్నెల కురిపిస్తూ మానవజాతిని శీతల సోయగంతో మురిపించిన చంద్రుడు… మనిషి చిరకాల స్వప్నం శాస్త్ర సాంకేతిక విజయంగా పరిణమించిన మహత్తర క్షణంలో మనిషికి దొరికిపోయాడు. మానవజాతి సుదీర్ఘ స్వప్నాలకు, మేధస్సుకు చందమామ చిక్కిన చారిత్రక క్షణం అది. అది 1969 జూలై 20. అంతర్జాతీయ కాలమానం ప్రకారం అర్థరాత్రి దాటి 2.17 నిమిషాలు.

చంద్రుడిపై మనిషి అడుగు పెట్టాలని అమెరికా పదేళ్లుగా కంటూ వచ్చిన కలలను సాకారం చేస్తూ అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపిన 1969 జూలై 16న పంపిన ఈగిల్ వాహకనౌక 20వ తేదీ తొలి ఘడియల్లో చంద్రుడిపై దిగింది. చంద్రుడిపై ఉన్న సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అని శాస్త్రజ్ఞులు పిలుచుకున్న చోట ఈగిల్ దిగింది. వెంటనే అమెరికాలోని హూస్టన్ కంట్రోలు రూంకు నీల్ ఆమ్‌స్ట్రాంగ్ తొలి సందేశం. ‘ఈగల్‌ క్షేమంగా చంద్రుడిని చేరింది’

ఆ తర్వాత మరో 39 నిమిషాలు భారంగా గడిచాయి. ఆనాటికి ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల మంది టీవీలముందు హత్తుకు పోయి చూస్తుండగా నీల్ ఆమ్‌స్ట్రాంగ్ మెల్లగా ఈగిల్ నుంచి బయటకు వచ్చాడు. ముందుగా తన ఎడమకాలును చంద్రుడిపై మోపాడు. ఆ క్షణం మానవ జాతిని అంతులేని ఉద్వేగంలో ముంచెత్తింది. చంద్రుడినే దొరికించుకున్న అనంత ఆనంద క్షణాల మధ్య ఆమ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై తన తొలి అడుగు అనుభూతిని భూమితో పంచుకున్నాడు.

చందమామపై మనిషి పాదం మోపిన ఆ మహత్తర క్షణాల గురించి చందమామ పత్రిక 40 సంవత్సరాల క్రితమే 6 పుటల పెద్ద వ్యాసంలో తన పాఠకులకు అందించింది. 1969 నవంబర్ ప్రత్యేక సంచికలో 7నుంచి 12 వరకు గల పుటలలో “గగన చంద్రుడు” అనే పేరిట చందమామ తన పాఠకులకు చంద్రయాత్ర విశేషాలను సచిత్ర సమేతంగా అందించింది.

సరిగ్గా 40 ఏళ్ల క్రితం చందమామ (1969 నవంబర్ సంచిక) లో ప్రచురించిన చంద్రయాత్ర విశేషాలు చదవాలనుకుంటున్నారా? అయితే ఈ కింది లింకును చూడండి.
http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

ఇంటర్నెట్‌లో ఈ లింకును ఓపెన్ చేసి చందమామ ఆర్కైవ్స్ పుటలో కింది భాగంలో కనిపించే భాష, సంవత్సరం, నెల అనే గళ్లలో వరుసగా తెలుగు, 1969, నవంబర్ అని ఎంచుకోండి. తర్వాత ‘వెళ్లండి’ పై క్లిక్ చేయండి. ప్లాప్ అప్ అయిన నాటి చందమామ పత్రికలో 7-12 పేజీలను తెరిచి ‘గగన చంద్రుడు’ వ్యాసం చదవండి.

జూలై 20న చంద్రుడిపై మనిషి పాదం మోపిన చరిత్రకు 40 ఏళ్లు నిండిన సందర్భంగా ఆన్‌లైన్ చందమామలో కొన్ని రచనలు పోస్ట్ చేయడమైంది. మచ్చుకు ఒకటి కింది లింకులో చూడగలరు.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=44&sbCId=110&stId=1960&pg=1

ఆన్‌లైన్ చందమామలో ప్రస్తుతం పాత రచనలను డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం తీసివేశారు. మీరు చంద్రయాత్ర గురించిన విశేషాలను మీ సిస్టంలోకి కాపీ చేసుకోవాలంటే కింది లింకును ఇంటర్నెట్‌లో ఓపెన్ చేసి ఆ పేజీలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

http://rapidshare.com/files/258429260/MAN_ON_THE_MOON_CHANDAMAMA.pdf

చందమామతో మీ జ్ఞాపకాలను పాఠకులకు పంచుకోదలిచారా? అయితే..
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.

చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

RTS Perm Link

వెన్నెల చల్లదనం

July 21st, 2009

నా చిన్నప్పుడు ఒక పున్నమి రాత్రి మాయమ్మ మమ్మల్ని ఒడిలో కూర్చొండబెట్టుకుని చంద్రుని కథ చెప్పింది. వెన్నెలకు ఆ చల్లదనం ఎలా వచ్చింది అనేదే ఆ కథ. చంద్రుడి వెన్నెల చల్లదనం గురించి చందమామ మాసపత్రిక అప్పట్లో చెప్పిన మరుపురాని మానవీయ కథ ఇది. ఇక్కడ మా ఊర్లో మా చిన్నతనంలో చందమామ పత్రిక మాకు ప్రసాదించిన జ్ఞానం గురించి కొంత నేపథ్యం తెలుసుకుంటే మంచిదనుకుంటా…

కడప జిల్లా రాయచోటి తాలూకా సుండుపల్లి మండలంలో బాహుదా (చెయ్యేరు) నది దాటితే వచ్చే మా ఊరులో దాదాపు ముప్పై లేదా ముప్పై అయిదేళ్లకు ముందు మా కుటుంబం (నలుగురు అన్నదమ్ములు, వారి పిల్లలు, అవ్వాతాతలు కలిసి 30మంది) మొత్తం ఇంటికొకటి చొప్పున చందమామ, బాలమిత్ర, బుజ్జాయి వంటి కథల పత్రికలను క్రమం తప్పకుండా తెప్పించుకునేది. వాటిని చదవడంలో పెద్దలు, పెదపెద్దలు, పిల్లలు, పినపిల్లలు అంతా పోటీలు పడేవాళ్లం. వ్యవసాయపనుల్లో అందరూ మునుగుతున్నందున ఎవరికి తీరిక ఉంటే వారు కథ చదివితే తక్కినవారి వంతు తర్వాత వచ్చేది.

ఆ రోజుల్లో సీరియల్‌గా మహాభారతం, రామాయణం, భాగవతం కథలు, భేతాళ కథలు వంటివి వచ్చేవి కాబట్టి ముందుగా చదవని వారు ఈ నెల ఫలానా కథ ఏమైంది అని అప్పటికే చదివిన వారిని అడగటం, వారు యథాశక్తిగా తమ తీరులో కథను చెప్పటం, తర్వాత పుస్తకం వంతులు మారి చేతికొచ్చినప్పుడు మళ్లీ ఆ కథలను చదివి మననం చేసుకోవటం.. ఇలా మా చిన్నతనంలో -1970-77- ఏళ్ల తరబడి ఈ కథా పారాయణం, పఠనం సాగుతూ వచ్చింది. పుస్తకాన్ని కొని చదివే స్తోమత, సాహిత్య పరిచయం కలిగిన తెలుగు కుటుంబాలకు 60, 70 ల కాలం స్వర్ణయుగంగా చెప్పవచ్చేమో…

ఈ నేపథ్యం నుంచి బయటకి వస్తే చందమామకు ఆ చల్లదనం ఎక్కడినుంచి వచ్చింది…. ఏ మహత్తర క్షణంలో మా అమ్మ చందమామ చల్లదనం గురించి చందమామ పత్రికలో వచ్చిన ఆ వెన్నెల రాత్రి కథను చల్లగా చెప్పిందో కాని ఈ రోజుకూ కథ విన్న ఆ రాత్రినీ, ఆ అనుభూతినీ, అది రేపెట్టిన ఆలోచనలను మర్చిపోలేకున్నానంటే నమ్మండి. చందమామలో ఆ నాడు వచ్చిన, అమ్మ చెప్పిన ఆ చల్లదనపు కథను నేను గుర్తుపెట్టుకున్నంతమేరకు చెబుతున్నా వింటారా…. చదవటం కూడా వినటంతో సమానమే కదా..

సూర్యుడు, వరుణుడు, అగ్ని, చంద్రుడు ఈ నలుగురికీ ఒకే తల్లి అట. అల్లారు ముద్దుగా ఎక్కువ తక్కువ తేడాలు లేకుండా ఆ తల్లి తన పిల్లలను పెంచి పెద్ద చేసిందట.. ఒకరోజు దేవతలలో ఎవరో ఒకరికి పెళ్లి జరుగుతోందట…వీళ్ల తండ్రి పనిమీద బయటకు వెళ్లాడట. -దేవతలకు పని ఏముంటుంది అని అడగకండి వాళ్ల స్థాయిలో వాళ్ల పనులు వాళ్లకుంటాయి కదా…కంటెంట్ ప్రొవైడర్లకు, లోకలైజర్లకే కాక కార్పొరేట్ ఆఫీసుల్లో ఎడిటర్లకు, మేనేజర్లకు కూడా వాళ్ల స్థాయి పని వాళ్లకున్నట్లు మరి-

పాపం మరి భర్త లేనప్పుడు ఎంత దేవతా స్త్రీ అయితే మాత్రం ఆ సూర్యవరుణాగ్నిచంద్ర మాత తన ఇల్లు విడిచి బయటకు పోవచ్చా మరి. పోకూడదు కదా… అలాగని పెళ్లికి హాజరు కాకపోతే ఆ పెళ్లాడే దేవతా కుటుంబం ముఖం మళ్లీ చూడాలాయె. అందుకన్జెప్పి తాను పోకున్నప్పటికీ తన పిల్లలను ఆ పెళ్లికి పంపించిందామె.

అలా పిల్లలను పెళ్లికి పంపుతూ తల్లి ఒక మాట చెప్పింది. నాయనా… పెళ్లి పందిర్లో ఎవరితో గొడవపడకండి, అల్లరి చేయకుండా, తోటి పిల్లలతో కొట్లాడకుండా పదిమందిలో పేరు తెచ్చుకోండి. మన ఇంటి పేరు నిలబెట్టండి.. ఇలాంటి బుద్ధి మాటలు చెబుతూ చివరలో పెళ్లి విశేషాలను తిరిగొచ్చాక వివరంగా చెప్పమంది. పెళ్లికి పోయినందుకు గుర్తుగా ఏదైనా అక్కడినుంచి తీసుకురమ్మని చెప్పింది.

తల్లి మాటలకు ఓ అన్నారు పిల్లలు. తల్లి సాగనంపింది. నలుగురు పిల్లలూ ఏ ఒకరూ తనకు ఎక్కువా కాదు తక్కువా కాదు. పేగు బంధం భేదమెరుగదు కదా..వెళుతున్న పిల్లలకేసి చూస్తూ ఆలోచనలతో ఇంటి మార్గం పట్టింది. మరోవైపు ఈ నలుగురూ పెళ్లికెళ్లారు. మాట ప్రకారం మెత్తగా, ఎవరితో గొడవపడకుండా గడిపారు. ముహూర్తం రాగానే అక్షంతలు చల్లారు. తంతు పూర్తి కాగానే విస్తళ్లు పడ్డాయి. పోటీగా పరుగెత్తి భోజనాలకు కూర్చున్నారు. పంచభక్ష్య పరమాన్నాలు సుష్టుగా భోంచేశారు. ఇకేముంది తోటి పిల్లలకు వస్తామంటూ చెప్పి బయలుదేరారు.

ఇంటికి రాగానే తల్లి దగ్గరకు తీసుకుని ముద్దాడింది. పెళ్ళి విశేషాలు నలుగురు పిల్లలనూ అడిగి మరీ తెలుసుకుంది. తర్వాత తీరిగ్గా అడిగింది. పెళ్లి గుర్తుగా నాకేమన్నా తెచ్చారామ్మా అంటూ….పెద్దవాడు సూర్యుడు బిక్కచూపులు చూశాడు. నడిపోడు వరుణుడు తేల ముఖం వేశాడు. చిన్నోడు అగ్ని పాలిపోయాడు. అమ్మ చెప్పిన మాట మర్చిపోయారుగా. ఇక కట్టకడపటివాడు చంద్రుడు..తల్లి పిలిచింది. తలమీద చేయివేసి హత్తుకుంది. నువ్వు కూడా ఏమీ తేలేదామ్మా అంటూ చిన్నబోయిన స్వరంతో అడిగింది.

తేకేం.. తెచ్చానమ్మా పెళ్లి భోజనంలో లడ్డూ కారాలు పెట్టారు.. లడ్డు కొంత తిని కొంత ఇదిగో నా గోట్లో పెట్టుకుని తీసుకొచ్చా.. అంటూ గోట్లోంచి తుంపిన లడ్డుముక్క తీసి తల్లి చేతిలో పెట్టాడు. (గోట్లో ఎంత లడ్డుపడుతుంది అని అడగకండి.. అవి దేవతల గోళ్లు..) తింటూంటే నువ్వు చెప్పింది గుర్తుకొచ్చింది. జేబులో పెట్టుకుంటే తింటున్న పక్కవారు చూసి నవ్వుతారు కదా అని పట్టినంత ముక్క గోటిలో పెట్టుకుని తీసుకొచ్చా అంటూ చెప్పాడు మెత్తగా….

తల్లి గుండె నీరయింది. కంట నీరు చిప్పిల్లింది. మాతృహృదయం ఒక్కసారిగా ఒణికింది. ఆబగా పిల్లాడిని కౌగలించుకుంది. జుట్టు చెరిపింది. సంతోషంతో తల్లి కడుపు సగం నిండిపోయింది. చాలమ్మా.. నువ్వయినా మాట గుర్తు పెట్టుకున్నావు. చెప్పిన మాట నిలబెట్టావు అంటూ మనసారా నవ్వింది. అంతలోనే రోషకషాయిత నేత్రాలతో పెద్దపిల్లలకేసి చూసింది. నిజంగా వణికిపోయారు వాళ్లు. వాళ్లకేసి తీవ్రంగా చూస్తూ ఇలా శపించింది.

మీరు పెళ్లిలో తిన్నదాంట్లో భాగం అడగలేదురా నేను…తల్లిని నన్ను మర్చిపోవద్దన్నానంతే.. ఏదైనా గుర్తుగా తీసుకురమ్మని చెప్పాను. మరి కనీసం తల్లి మాటను గుర్తు పెట్టుకోలేకపోయారు మీరు. అందుకే తల్లి మనసును బాధించిన మీరు ఎంత మంచిపని చేసినప్పటికీ లోకంచే తిట్లు పడుతూ ఉండండి కలకాలం అంటూ శపించింది.

పెద్ద కొడుకులకు శాపాల వరాలు పూర్తయ్యాక చిన్నపిల్లాడికేసి చూసింది. పెళ్లి తీపి తెచ్చినందుకు, తినిపించినందుకు కాదురా…. నా మాట గుర్తుపెట్టుకున్నావు. అంతే చాలు నాకు..తల్లి మనసును సంతోషపెట్టావు. జన్మకిది చాలు.. ఈ క్షణం తల్లిగా నేను అనుభవిస్తున్న ఈ సంతోషాన్ని నువ్వు కలకాలం లోకమంతటికీ పంచెదవు గాక అంటూ దీవించింది.

ఇంకేముంది ఆ రోజే సూర్యచంద్రాదుల గతులు నిర్దేశించబడ్డాయట. నలుగురూ లోకకళ్యాణంకోసమే పాటు పడుతున్నప్పటికీ ఆ ఆరోజునుంచి తొలి ముగ్గురూ లోకంలో అందరిచేత తిట్లు, శాపనార్థాలు తింటూ ఉండసాగారు. ఎందుకో తెలుసా…

సకల జీవులకు వెలుగునిచ్చే సూర్యుడు మార్తాండావతారమెత్తి ఆయా పనులు చేసుకునే వారికి ఉక్క పుట్టించి చెడతిట్లు తింటాడు గదా… మరి వరుణుడు…..సకల పంటలకూ, ఫలాలకు, ఫలితాలకు కారకుడైనప్పటికీ అడ్డదిడ్డంగా వర్షాలు కురిపించి, తుపానులు పుట్టించి, ఊర్లకు ఊర్లనే లేపుతూ ప్రపంచంలో ఏదో ఓ చోట ప్రతిరోజూ అకాలవర్ష బాధ్యుడిగా, అతివృష్టి కారకుడిగా జనం శాపనార్థాలకు గురవుతుంటాడు గదా..

ఇక పోతే అగ్ని. భూమిని పునీతం చేసే పని. సకల వ్యర్థాలు, చెత్తలను తనలో మరిగించుకుని కొత్త సృష్టికి నాంది పలికే పని. పనికిమాలినదాన్ని ఎంత తగులబెట్టి అరగించుకున్నప్పటికీ, శాపకారణంగా మనుషులకు ఉపయోగపడే వాటిని కూడా లాగించేస్తుంటాడు. ఎంతమంది కొంపలు ఆ రోజునుంచి ఆర్పేశాడని మరి….ఎన్ని ఊళ్లను మటుమాయం చేశాడని…తల్లి శాపం తగిలిన క్షణంలో అడుగుపెట్టిన చోటల్లా భస్మీపటలమే కదా. మరి తిట్లు గాక దీవెనలు దక్కుతాయా…

మరి చంద్రుడూ… సొంత అన్నలు కూడా గమనించనంత జాగ్రత్తగా పెళ్లి లడ్డును తుంపి గోటిలో ఉంచుకుని తెచ్చి తల్లికి ఇచ్చాడు కదా. ఆ అభిమాన బలం ఊరకే పోతుందా మరి..అందుకే తల్లి దీవెన ఫలించి చల్లటి జీవితం దక్కింది. తన ఈ చిన్ని కార్యంతో తల్లిని సంతోషపెట్టిన వాడు, తల్లి మనస్సును చల్లబరచిన వాడు…సమస్త లోకానికే చల్లదనం పంచి ఇచ్చే మహా వరం పొందాడు.

ఆనాటినుంచి ఈనాటిదాకా చంద్రుడు ఎక్కడ అడుగుపెట్టినా చల్లదనం పారాడుతుంది. సమస్త జీవరాశులూ పిండి వెన్నెలను ఆస్వాదించి పరవశిస్తాయి. తల్లి మనసులో చల్లదనం పోసిన చంద్రుడు సూర్యవరుణాగ్నుల అసందర్భ క్రియలనుంచి లోకాన్ని కాపాడి అందరికీ వెన్నెల చల్లదనాన్ని పంచిపెడతాడు…అన్నిటికంటే మించి చంద్రుడి కంటే మించిన సోషలిస్టు, సమానత్వ వాది ఈ ప్రపంచంలోనే దొరకడేమో కదా…

సూర్యుడు బలవంతులనూ ధనవంతులనూ తాకలేడు వేధించలేడు. ప్రాచీన మధ్యయుగాలలో భారీ ఎత్తు మందపు రాతి కట్టడాలు సూర్యుడి బారినుంచి రాజులను చక్రవర్తులను, నిచ్చెన మెట్ల పైభాగంలో ఉన్నవారిని కాపాడితే ఇప్పుడు ఎసి ఉన్న మారాజులు సూర్యుడి వేడిని ఏ మాత్రం లెక్క చేయరు. రాజమందిరాలు, ధనికుల సౌధాలు అప్పుడూ ఇప్పుడూ కూడా వరుణుడి ప్రతాపానికి, మహోగ్నిజ్వాలలకు బెదిరిపోవు, చెదిరిపోవు..

మరి చంద్రుడి విషయానికి వస్తేనో….చంద్రుడు నిజంగా పేదల మనిషి. రాజాంతఃపురాలకంటే ఆకాశ హర్మ్యాల కంటే అపార్ట్‌మెంట్ బతుకులకంటే మిన్నగా చంద్రుడు పేదలపట్లే పక్షపాతం చూపిస్తాడు. చంద్ర వెన్నెల సోయగం నిజంగా పేదల గుడిసెలలోనే తారాడుతుంది. సామాన్యుల ఇళ్లలోనే వెన్నెల తెల్లగా వెల్లివెరుస్తుంది. తాపం బారిన పడే జనాలకు నిజమైన స్వాంతన వెన్నెల చల్లదనం నుంచే లభిస్తుంది. ప్రజల మిత్రులు ఎవరంటే తనకే సాధ్యమైన రీతిలో చల్లదనాన్ని పంచి పెట్టే చంద్రుడి లాంటి వారే కదా………

అమ్మ కథ ఆపేసింది…. ఆ రాత్రివేళ, ఒక అందమైన స్వాప్నిక ప్రపంచం హద్దుల్లోకి తీసుకు పోయి మమ్మల్ని అక్కడ వదిలేసింది. చల్లదనపు మహత్తు గురించిన అనుభూతిలో మమ్మల్ని ముంచెత్తింది. కథా శ్రవణం నుంచి, పిల్లలకే సాధ్యమైన మంత్రజగత్తులోంచి మెల్లగా లోకంలోకి వచ్చి పడ్డాం. చుట్టూ చూస్తే వెన్నెల.. పిండారబోసినట్లుగా, అమ్మ మనసును సంతోషపెట్టినట్లుగా, తరతరాలుగా, యుగయుగాలుగా ఒకే బాట.. చల్లదనాన్ని లోకంముందు పరుస్తూ పోతూ వెన్నెల..పిండి వెన్నెల….

కధ విన్నది ముగ్గురు పిల్లలం. నోటిమాటలేదు మాకు. మూగబోయాం. ఆ మహిమాన్విత చంద్రకాంతి చల్లదనంలో తడిసి ముద్దయ్యాం. ఆ కథ వినక ముందు మా జీవితాలకు విన్న తర్వాత ఆ క్షణంలో మా జీవితాలకు ఏదో వార..ఏదో అగాథం..ఏదో వ్యక్తావ్యక్తవేదన… స్వప్న, వాస్తవ ప్రపంచాలకు మధ్య ఏదో తేడా. తెలిసీ తెలియని తేడా….ఆ తేడా ఏమిటి అని మేం కొట్టుమిట్లాడుతున్నాం… ఏం చెప్పాలో ఏమని చెప్పాలో అర్థం కాని స్థితి.

కథ చెప్పినప్పుడల్లా అమ్మ అడుగుతుంది మమ్మల్ని.. ఆ కథలోని నీతి ఏమిటి అని..దాంట్లోంచి ఏం గ్రహించారు అని. మాకు తెలియని, ఆనాటి మా ఊహకు అందని మాటల్లో మెల్లగా గొణిగాం…అమ్మ మనసును కష్టపెట్టకూడదు ఇదే కదా ఆ కథలో ఉన్న నీతి..ముగ్గురు పిల్లలమూ దీనికే ఓటేశాం. అమ్మ చాలాసార్లు మేం గ్రహించిన కథాసారాన్ని ఖండించో లేక ఇంకాస్త సవరించో దాంట్లోని అసలు విషయాన్ని చివర్లో వివరించేది…

కానీ ఆరోజు అమ్మ ఆశ్చర్యకరంగా మా ఓటు వైపే మొగ్గు చూపింది. అదే ఆకథలోని అసలు నీతి అని తేల్చి చెప్పేసింది. ఇన్నాళ్లకు అమ్మ మనస్సును అర్థం చేసుకున్నాం, గెలిచాం అని అనుకుంటున్నాం.. ఇంతలో ఉన్నట్లుండి ఒక ప్రశ్న విసిరింది. “తల్లి మనసుకు కష్టం తగలనివ్వని వారు ఈ లోకంలో ఉన్నారా ఎవరైనా…”

మా పసిహృదయాలకు ఆరోజు అర్థం కాని ప్రశ్న అది. మూగబోయాం.. మాకే తెలియని ఓ కొత్త నిశ్శబ్దం….తన పాతికేళ్ల నవ యవ్వన మాతృ జీవితంలో పొందిన ఏ బాధాకర అనుభవాలు ఆమెను ఆ క్షణంలో ముంచెత్తాయో… ఆ సమయంలో ఆ కథలోని అమ్మ స్థానంలో తానే ఆవహించిందో… తండ్రితో, భర్తతో, మొత్తం సమాజంతో తన హృదయానికి తూట్లు పడిన గాయాల చరిత్రనే ఆరోజు ఆమె అలా ప్రశ్న రూపంలో వెలువరించిందో..

ఇదీ మేము పుట్టిపెరుగుతున్న రోజుల్లో చందమామ పత్రిక మాకు అందించిన గొప్ప మానవీయ కథ. ఆరోజు మేం ఏం చెప్పాలో తెలీని క్షణాల్లో అమ్మను గట్టిగా హత్తుకుని ఆమె మానుంచి ఏ క్షణాల్లో అయినా జారిపోతుందేమో, దూరమైపోతుందేమో అనే భయాందోళనల మధ్య గడిపాం…

కాని ఈ రోజు.. దాదాపు 30 సంవత్సరాలు దాటాక…ఆ తల్లే మాకు దూరమయ్యాక, సమాజం పట్ల కొంచెంగా పెరిగిన జ్ఞానంతో ఆ ప్రశ్నను కాస్త మార్చి ఇలా చెప్పుకుంటే.. స్త్రీల మనసుకు కష్టం తగులనివ్వని వారు ఈ లోకంలో ఉన్నారా ఎవరైనా

కాస్తంత విశాలంగా ఆలోచిస్తే….. మనిషికి మనిషికి మధ్య భయంకరమైన అగాధాలు, అంతరాలు, వ్యక్తిత్వ హత్యలు, అహంకారాలు, జీవన విధ్వంసాలు పెచ్చరిల్లుతున్న పాడుకాలంలో… మనిషికి ఎందుకు కష్టం తగులుతోంది. మనిషి మనసు ఎందుకు బాధపడుతోంది..అనే ప్రశ్నలోనే పై ప్రశ్నకు కూడా సమాధానం ఉందేమో మరి.

మహిళలకే కాదు, సమాజంలో ఏ ఒక్కరికీ ప్రశాంతత లేదు. తినడం, సంపాదించడం, చావడమే జీవితచక్రంగా మారి మిగిలిన అన్నివిలువలూ లుప్తమవుతున్న కాలంలో స్త్రీల మనస్సుకు కష్టం అనే సమస్య సమస్త మానవుల కష్టం అనే మౌలిక సమస్యలోనే దాగి ఉందేమో…

మనిషి జీవితంలో సుఖమే లేదా మరి. అనుబంధాలలో, బాంధవ్యాలలో చల్లదనమే లేదా…చల్లదనాన్ని పంచిపెట్టే గుణమే సమాజంలో హరించుకుపోయిందా.. ఆ తల్లి మొత్తం సమాజానికే ఇంత గాఢమైన ప్రశ్న సంధించి ఉండవచ్చు కాని ఆమె జీవితంలో ఎప్పుడూ ఏ సుఖమూ అనుభవించలేదా… మరీ ఇంత ప్రతికూల ధోరణితో మానవ జీవితంపైనే వ్యాఖ్యానాలు చేయవచ్చా అనే ప్రశ్నలు ఎవరికయినా రావచ్చు…

అయితే మనం మన అవ్వలను, తాతలను, కాటికి సిద్ధంగా ఉన్న కడు వృద్ధులను ఒకసారి అడిగి చూస్తే తెలుస్తుంది. నా అనుభవంలో, లోకంలో పుట్టి మహత్కార్యాలు సాధించిన వారు, సాధించకున్నా నిండు జీవితాలను తమ స్థాయిలో తమదైన రీతిలో గడిపి చివరికి మిగిలేదేమిటి అని చివరి పరామర్శకు దిగినవారిని ప్రశ్నించినప్పుడు వారు దాదాపు ఒకేలా సమాధానం ఇచ్చారు.

ఎవరి వద్దకో ఎందుకు తన కూతురు వెళ్లిపోయినా ఇంకా బ్రతికే ఉన్నానంటూ వ్యధ చెందుతున్నప్పటికీ, జీవితసారమిదే, మనం దీనిని భరించాల్సిందే అని చెప్పే మా అవ్వే తన జీవితానుభవాల్లో మానవసారాన్ని ఎత్తి చూపుతుంది. జీవితంలో సుఖం కన్నా కష్టం పాలే ఎక్కువ. సుఖపడుతున్నాం, సంతోషంగా ఉంటున్నాం అనుకునే క్షణంలోనే ఏదో ఒక కష్టం మనలను వెన్నాడుతుంది, ముప్పుతిప్పలు పెడుతుంది. దాన్ని భరించడమే తప్ప మనం ఏం చేయలేం.. అనే సాంప్రదాయ జీవన తాత్వికతకు మా అవ్వ ప్రతిరూపంగా కనిపిస్తుంది.

మొత్తం మీద మనిషి జీవితంలో చల్లదనం లేదు. మానవ సమాజంలో చల్లదనం లేదు. ఇదే వాస్తవమైతే మనలో, మనందరిలో ఆ చల్లదనాన్ని రకరకాలుగా హరించివేసే ఉష్ణతాపం రగులుతూ ఉన్నట్లే… ఇక్కడ స్త్రీల మనస్సే కాదు, పురుషుల మనస్సే కాదు, వృద్ధుల మనస్సే కాదు లోకంలో బతికే ఎవరి మనస్సు కూడా చల్లదనంతో లేదన్నదే వాస్తవం. మనిషి జీవితం వేడెక్కుతుందో లేదో చూడాలంటే… ముప్పై ఏళ్లక్రితమే వచ్చిన అపరూప చిత్రం తాతామనవడు చూడండి చాలు.

ఆ చిత్రంలో, కాటికి కాళ్లు చాపుకున్న కన్నతండ్రి ఇక ఒక్క క్షణం ఉన్నా కుటుంబానికి భారమే అనే ఉద్దేశ్యంతో సాక్షాత్తూ పుత్రరత్నమే తన ముదుసలి తండ్రికి గొయ్యి తవ్వుతూంటే ఆ పుత్రరత్నపు సుపుత్రరత్నం (తాతకు మనవడు) తన తండ్రికి సైతం గొయ్యి తవ్వాలని బయలుదేరుతాడు.. ఈ ఘోరం ఏమిట్రా తండ్రీ అని వాడి కన్నతండ్రి…. అదే తన తండ్రికి గొయ్యి తవ్వాలని చూసిన కొడుకే తన కుర్రాడిని అడిగితే… ఇదే చెబుతాడు. నీవు నేర్పిన న్యాయమే కదా తండ్రీ, నువ్వు నీ తండ్రికి గొయ్యి తవ్వుతున్నప్పుడు కొన్నాళ్లకయినా నా తండ్రికి నేనే గొయ్యి తవ్వాలి కదా..అందుకని ఇప్పుడే మొదలెట్టేస్తున్నా అంటాడు.

ఇదీ మన జీవితాల్లోని విషాదం, విధ్వంసం, ఉష్ణప్రతాపం. జీవితాల్లో వ్యాపించిన ఈ వేయికోణాల వేడి చల్లబడకుండా, చల్లార్చకుండా మనిషి జీవితం చల్లారుతుందా.. మహిళలకే కాదు ఎవరికైనా చల్లదనం లభిస్తుందా…చల్లదనాన్ని అందరికీ పంచిపెట్టే ఆ మహిమాన్విత కాలం ఎప్పుడొస్తుందని కాదు.. అందరికీ రావాలని ఆశించడంలో తప్పులేదు కదా.. వెన్నెల చల్లదనాన్ని పంచిపెట్టే ఆ చంద్రుడే మనకు సాక్షి, నిదర్శనం కావాలని భావించడం తప్పు కాదు కదా……

చందమామా వర్థిల్లు…

వెన్నెల చల్లదనమా వర్ధిల్లు…….

(1973లో మా అమ్మ మా ముగ్గురు పిల్లలకు చెప్పింది మొదలుకుని ఈ కథ నన్ను జీవితం పొడవునా వెంటాడుతూ వస్తోంది. చందమామ చదవండి జ్ఞానం వస్తుంది అని ఏ మహత్తర క్షణంలో మా నాన్న చందమామను చిన్నప్పుడు మాకిచ్చి చదివించాడో అప్పటినుంచి మా లోకమంతా చందమామకే పట్టం. మా బాల్యాన్ని వెన్నెలతో స్పర్శించిన, పండించిన ఆ చందమామ ఇప్పుడీ నడివయసులో.. నాకు చందమామలోనే ఆన్‌లైన్ ఉద్యోగాన్ని పిలిచి మరీ ఇచ్చింది. పల్లెటూరులో పుట్టిపెరిగిన ఓ చిన్ని జీవితానికి ఇంకేం కావాలి.)

RTS Perm Link

చందమామ – త్రివిక్రమ్ బాట

July 14th, 2009

చందమామ గురించి త్రివిక్రమ్ గారు తదితరులు  వికీపీడియాలో పోస్టు చేసిన పెద్ద వ్యాసాన్ని చిన్న చిన్న భాగాలుగా ఈ బ్లాగులో మొదట ప్రచురిస్తున్నాము. చందమామ పత్రిక చరిత్ర గురించి, దాని విశేషాల గురించి అంతర్జాలంలో విపులంగా, వీలైనంత మేరకు వాస్తవానికి అతి దగ్గరగా చెప్పిన, రాసిన వ్యక్తి ఎవరు అని అడిగితే మొదట త్రివిక్రమ్ గారి పేరే చెప్పుకోవాలి.

అనేకమంది రచయితలు, అభిమానులు చందమామ గురించి రాసినా, ప్రస్తుతం రాస్తూ ఉన్నా అంతర్జాలంలో చందమామ విశేషంగా వ్యాప్తి పొందడానికి, బ్లాగర్లు చందమామను తమదిగా హత్తుకోవడానికి మూల కారకులు త్రివిక్రమ్ గారే అని అంటే అతిశయోక్తి కాదు. చందమామ పత్రిక, దాని యాజమాన్యంలో మార్పులు, పత్రికలో చోటు చేసుకుంటున్న కొత్త మార్పులు వంటి ఇటీవలి చరిత్రను కూడా తాజాగా పొందుపర్చి అంతర్జాల పాఠకులకు అందివ్వడంలో త్రివిక్రమ్ గారే మొదటి వరుసలో ఉన్నారు.

అంతర్జాలంలో చందమామ పిచ్చోళ్లు లేదా ‘చంపి’ అనే పదబంధం బాగా వ్యాప్తిలోకి రావడానికి, వీరంతా కలిసి చందమామను నెట్‌లోంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకుని తెలుగుజాతి సంపదనే తమదిగా జాగ్రత్త పర్చుకున్న అద్భుత చరిత్రకు శ్రీకారం చుట్టింది, ప్రేరణ ఇచ్చిందీ కూడా త్రివిక్రమ్ గారి చందమామ వ్యాసమే -వికీపీడియా- అని చెప్పాలి.

తర్వాత చందమామ పత్రిక, దాంట్లో గత 50, 60 ఏళ్లుగా పనిచేస్తున్న వారి గురించి, చందమామ శైలి, చరిత్ర గురించి సాధికారికంగా చెప్పగలిగిన వ్యక్తి రోహిణీ ప్రసాద్ గారు -కొడవటిగంటి కుటుంబరావు గారి అబ్బాయి. అమెరికాలో న్యూక్లియర్ ఫిజిక్స్ రంగంలో పనిచేస్తున్నారు-.

నాగమురళి, బ్లాగాగ్ని (ఫణి), ఇటీవల వేణు గారు కూడా చందమామ అభిమానుల కోవలో మంచి రచనలు చేయడం, విలువైన సమాచారం అందివ్వడం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో చందమామను డౌన్‌లోడ్ చేయడానికి తన వంతుగా సాప్ట్‌వేర్ ప్రోగ్రామ్ రూపకల్పన చేసి అందించిన బ్లాగాగ్ని (ఫణి) గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి.

సదాశయంతో, సదుద్దేశంతో వ్యక్తులు చేసే చిన్నపాటి మంచి పనులు కూడా ఒక సమాజపు కథల దాహాన్ని తీర్చడానికి ఎంతగా తోడ్బడగలదో చెప్పడానికి బ్లాగాగ్ని గారి ఉదంతం ఓ సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.

చందమామ పిచ్చోళ్లు ఆన్‌లైన్‌లో స్వంతంగా ఓ కమ్యూనిటీని సైతం ఏర్పర్చుకుని చందమామ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు, కలబోసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే 1940ల చివరినాటి చందమామలు, 50, 60, 70ల నాటి చందమామలను ఎవరు చదివారు అంటూ ఆన్‌లైన్ పోల్ సర్వే కూడా నిర్వహిస్తూ వీరు చందమామను  తమ సజీవ జ్ఞాపకంగా మల్చుకుంటున్నారు.

తెలుగుజాతి సాంస్కృతిక సంపద చందమామను తమ జీవితంలో ఓ భాగం చేసుకున్న, చేసుకుంటున్న ఇలాంటి చందమామ పిచ్చోళ్లకు హృదయ పూర్వక అభివందనలు తెలియజేస్తున్నాను.

వీరి రచనలు, అభిప్రాయాలు, వ్యాఖ్యలను, వీరిలో కొందరితో నేను వ్యక్తగతంగా పెట్టుకున్న పరిచయ విశేషాలను కూడా వివరంగా ఈ బ్లాగులో ఉంచాలని చిరు ప్రయత్నం చేస్తున్నాను. కేవలం చందమామ చరిత్ర, వివరాలు, జ్ఞాపకాలతో కూడిన ఈ బ్లాగును చందమామ అభిమానులు తమదిగా చేసుకుంటారని, చేసుకోవాలని ఆశిస్తూ…

ఎందరో చందమామ అభిమానులు…. అందరికీ వందనాలతో..
రాజు
చందమామ

చందమామ పాత సంచికలను చదవదలిచిన వారు ఈ కింది లింకుపై క్లిక్ చేయండి. మీకు కావలిసిన సంచిక నెల, సంవత్సరం ఎంచకుని చూడండి. 1947 నుంచి 80ల దాకా పాత సంచికలను ఇందులో చూడవచ్చు.

http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

ఇప్పుడిప్పుడే రూపు దిద్దుకుంటున్న ఆన్‌లైన్ చందమామను చూడండి. మీ వ్యాఖ్యలు కింది లింకుకు పంపండి.

abhiprayam@chandamama.com

చందమామతో పాఠకులు, అభిమానులు తమ జ్ఞాపకాలను పంచుకోవడానికి గాను అవకాశమిస్తున్న కింది లింకును చూడండి. చందమామతో మీ చిన్ననాటి అనుబంధాన్ని పాఠకులతో పంచుకోండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=1907

RTS Perm Link