తెలుగు సాహిత్యం అవిభజనీయం

March 3rd, 2014

మనం తెలుగువారం, స్వేచ్చా ప్రియులం, ప్రతిఘటనను ఆహ్వానించే వాళ్లం. తాత్వికులం, చరిత్రను అధ్యయనం చేసేవారం. సిద్ధాంతం ఏదైతేనేం, ఎవరికైనా స్వేచ్ఛ అవసరమని భావించేవారం. వందపూలు వికసించినా, వేయి ఆలోచనలు వర్ధిల్లినా ఆరోగ్యకరమేనని అనుకున్నాం. మన సాహితీ వేత్తలకు ఎల్లలెలా లేవో, మన స్వామీజీలకూ ఎల్లలూ లేవు.

తెలుగు సాహిత్యం ఇప్పుడే మార్గంలో ఉన్నది? చరిత్ర రహదారి మలుపు తిరిగినప్పుడల్లా ప్రశ్నించుకోవడం మనకు అలవాటు. తెలంగాణ రాష్ట్రం కావాలనే ఆకాంక్ష ఈ ప్రాంత రచయితలందర్నీ, కవులను, కళాకారులనూ తనలోనే ఇముడ్చుకుంది. అది ఎంత బలీయమైనదంటే కొత్త రచయితలూ, కొత్త కళాకారులు మారుమూల ప్రాంతాల నుంచీ కూడా ఉవ్వెత్తున లేచారు. జరిగింది అగ్రవర్ణాల రాజకీయోద్యమమా, రకరకాల వర్గాల ఆకాంక్షలకు ప్రతీక అయిన సామాజికోద్యమమా చెప్పలేనంతగా కలిసిపోయింది.

కానీ.. ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతం వారిని అంతగా కలుపుకోలేని ఉద్యమం ఇది కాకపోవడానికి కారణం, సామాజిక ఆకాంక్షలను అధిగమించి రాజకీయ, ఆర్థిక ఆకాంక్షలు ప్రాధాన్యం సంతరించుకోవడం కావచ్చు. అందుకే తెలుగునాట అన్ని ప్రాంతాల్లోనూ అది సాహిత్య, కళారూపాల్లో ప్రతిఫలించలేకపోయింది. తెలంగాణ విముక్తి పోరాట సమయంలో ఇలా జరగలేదు. ఎందుకంటే అది ప్రాంతీయ ఆకాంక్షల్ని అధిగమించిన ఉద్యమం.

తర్వాత ఏమిటి? విభజన ఎలాగూ జరిగింది కనుక మనం మన సంప్రదాయాలు ఎక్కడైనా తెగిపోయినట్లనిపిస్తే వాటిని పునరుద్ధరించుకోవాలి. మన ప్రశ్నించే తత్వాన్నీ, ప్రతిఘటించే స్వభావాన్ని, పోరాడే లక్షణాల్ని, అన్వేషించే ఆదర్శాల్ని సాహిత్యంలో మరింత కొనసాగించాలి. జరిగిన ఉద్యమ హేతుబద్ధతను, అందులోని సార్వత్రిక విలువలనూ ఎదుటి వారు ఆమోదించే విధంగా చేయకపోతే వచ్చిన సాహిత్యం, కళారూపాలు ఒకే ప్రాంతానికి పరిమితమవుతాయి, వాటి లక్ష్యాలు నెరవేరకుండా ఉంటాయి.

(తెలుగు జాతి రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో తెలుగు సాహిత్యం విభజనకు గురికాకుండా సార్వత్రిక విలువలకోసం ఐక్యంగా ఉండవలసిన అవసరాన్ని తాత్విక స్థాయిలో చర్చిస్తూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారావు గారు కృష్ణుడు కలం పేరుతో రాసిన ఈ రచన పూర్తి పాఠం కోసం కింది లింకును చూడండి.)

తెలుగు సాహిత్యం అవిభజనీయం

 

 

RTS Perm Link

అమరశిల్పి జక్కన – మనసే వికసించెరా

November 20th, 2011

ఈరోజు రాత్రి సన్ టీవీ సినిమా క్లబ్‌లో ‘అమరశిల్పి జక్కన’ సినిమా చూస్తున్నాను. ఒక అద్భుత వర్ణ చిత్ర ప్రపంచం కళ్లముందు అలా పరుచుకున్నట్లయింది. ఎంత గొప్ప సంగీతం, ఎంత మంచి పాటలు. ముఖ్యంగా ఈ నల్లని రాలలో వంటి ఈ చిత్రంలోని ప్రసిద్ధ పాటలు అందరికీ తెలుసు కాని ‘మనసే వికసించెరా’ అంటూ బి. సరోజా దేవి ఆడి పాడిన పాట విని చాలా కాలమయింది. వింటూంటే పరవశించిపోయాను.

లవకుశ -1963- తర్వాత తెలుగులో రెండో ఈస్ట్‌మన్ కలర్ చిత్రం అమరశిల్పి జక్కనే -1964- అనుకుంటాను.

ఆద్యంతం ఈ సినిమా నేపథ్య సంగీతాన్ని, పాటలను వింటూ పిచ్చెత్తి పోత్తున్న నేపథ్యంలో మీకు మెయిల్ చేస్తున్నాను. మీలో ఎవరివద్ద అయినా ఈసినిమా సీడీ లేదా డీవీడీ ఏదయినా ఉందా.. ఉంటే శ్రమ అనుకోకుండా నాకు ఒక కాపీ పంపగలరా..

సాలూరి రాజేశ్వరరావు గారి విశ్వరూపం చూడాలంటే ఈ సినిమా చూసి తీరాలి. ఆయన సంగీత దర్శకత్వం వహించిన చివరి సినిమా ‘తాండ్ర పాపారాయుడు’ అనుకుంటాను. ‘అభినందన మందార మాల’ అనే పాట పాతికేళ్లుగా నన్ను వెంటాడుతూ వస్తోంది. సినీ సంగీతంలో లాలిత్యాన్ని శిఖరస్థాయిలో నిలబట్టిన మహనీయుడు కదా..

ఈ పాట కూడా ఆడియో మాత్రమే దొరుకుతోంది. సినిమా కాని, వీడియో పాట కాని లభ్యం కాలేదు. మీ వద్ద ఉంటే చెప్పండి

విజయావారి సినిమాల సెట్, కెవి రెడ్డి గారి సినిమాల సెట్ లాగా సాలూరు రాజేశ్వర రావు గారి  పాటల సెట్ లేదా సినిమాల సెట్ సేకరించుకోవాలన్నది నా చిర కోరిక.

సుశీల గారు పాడిన పాటల్లో ఆమెకు బాగా నచ్చిన పాట ‘పాల కడలిపై శేషతల్పమున శయనించేవా దేవా’ పాటకు కూడా సంగీతం రాజేశ్వరరావుగారిదే అనుకుంటాను.

మణిరత్నం ‘ఘర్షణ’ చిత్రంలో ‘నిను కోరీ వర్ణం’ అనే పాటలో వినిపించే సంగీత జలపాత ఝరి అప్పటినుంచి ఇప్పటి దాకా ఆకట్టుకుంటూనే ఉంది. అది శ్రోతగా నేను పొందిన ఆనందం. కాని ఈ మధ్యే ఒక చానెల్లో సాలూరు వారి గురించి ప్రసారం చేస్తూ ఈ పాట సంగీతానికి ప్రాణం పోసిన ఇళయరాజాను ఆయన అప్పట్లోనే బాగా ప్రశంసించారని విని పొంగిపోయాను. మనం సంగీతజ్ఞులం కాకున్నా ఏది మంచి సంగీతమో గ్రహించే బుద్ది మనకూ ఉందిలే అనే నమ్మకం దీంతో మరింత బలపడింది.

ఈ ఆనందంలో నెట్లో వెతుకుతుంటే ఎస్వీ రామారావు గారు 2006లో రాసి ప్రచురించిన ‘నాటి 101 చిత్రాలు’ పరిచయాన్ని తెవికీలో చూశాను.

నాటి 101 చిత్రాలు

ఈ లింకులో తెలుగు సినిమా ఆణిముత్యాల సమాచారం చూడవచ్చు.

శ్రీనివాస్, శ్యామ్ నారాయణ, విజయవర్ధన్ గార్లకు….

దీంట్లోని 101 చిత్రాలు మీ సినిమాల కలెక్షన్లో ఏమయినా ఉన్నాయా.. చెప్పండి.

ఏంలేదు.. నా వద్ద ఓ టెరాబైట్ హార్డ్ డిస్క్ ఉంది. మీ సంపదలో కొంత కొల్లగొడదామని దురాశ. అంతే..

ఆహా… ఇంకా సినిమా చూస్తూనే ఉన్నాను. అడుగడుగునా మంత్రముగ్ధం చేస్తున్న నేపథ్య సంగీతం..ఎందుకు మనం పాత సినిమాలను చూడాలో, పాత సంగీతాన్ని వినాలో నిరూపిస్తున్న చిత్రం. ఏమి నా భాగ్యం..

మనసే వికసించెరా.. సాలూరి వారికి పాదాభివందనాలు…

పాత సినిమాల భాండాగారాన్ని సేకరిస్తున్న కె. గౌరీశంకర్ గారి మొబైల్ నెంబర్ మీ వద్ద ఉంటే తెలుపగలరు. ఈమధ్య నా మొబైల్ పోవడంతో అందరి ఫోన్ నంబర్లు పోయాయి.

నా కొత్త మొబైల్ నంబర్

7305018409

మీనుంచి మంచి వార్త వస్తుందని ఆశిస్తూ..

కె. రాజశేఖరరాజు
చెన్నయ్

జక్కన్న నిజజీవితం గురించిన వివరాలకు కింది లింకులు చూడండి.

జక్కన్న

అమరశిల్పి జక్కనాచారి

జక్కన చెక్కిన బేలూరు

తెలుగు సినిమా ‘అమరశిల్పి జక్కన’ -1964- గురించిన వివరాలకు కింది లింకు చూడగలరు.

అమరశిల్పి జక్కన

RTS Perm Link

చందమామ కథల మునితో కబుర్లు!

September 7th, 2011

శ్రీ కోలార్ కృష్ణయ్యర్ గారు

చందమామ కథల రచయిత కోలార్ కృష్ణయ్యర్ గారు డిల్లీ వెళ్తారని తెలిసి ఇవ్వాళ -23-08-2011- సాయంత్రం రెండున్నర గంటలకు మా దంపతులు ఇరువురం ఆయనను బెంగుళూరులోనే కలవడానికి నిర్ణయించుకున్నాము. అంతకు ముందురోజు రాత్రి కావలినుంచి బస్సులో ప్రయాణించి రావడంతో బాగా అలసిపోయాము. కృష్ణయ్యర్ గారు కథల ప్రచురణ కోసం రేపు ఢిల్లీ బయలుదేరి రెండు నెలలు అక్కడే ఉంటానని చెప్పారు కాబట్టి అలసటగా ఉన్నా కలవాలనుకున్నాము. ఇంటివద్దనుంచి బయల్దేరి  నాలుగన్నర గంటలకు వారు ఇప్పుడు ఉంటున్న ఇల్లు చేరాము. బెంగుళూరులో ఆయన ఉన్న ప్రాంతం మాకు చాలాదూరం. మాది తూర్పు సరిహద్దు. వారిది పడమర సరిహద్దు. వారి కుమార్తె మధ్య మధ్యలో ఫోన్ చేస్తుంటే దారిచెప్పగా వారి ఇల్లు కనుక్కుని వెళ్ళాము.

పండుముసలి ఐనా పదేళ్ళపిల్లాడిలా -89 ఏళ్లు- ఆయన తమ అనుభవాలను, అనుభూతులను పంచారు. మావారూ చాలా సరదాపడి విషయాలన్నీ విని నన్ను కొన్ని నోట్ చేసుకోమన్నారు. కృష్ణయ్య గారి కధలపై ఎవరో పేరు చెప్పారు గానీ నేను పెన్ పుచ్చుకునేలోగా చెప్పడం ఐపోయింది. వారిని తిరిగి వెనక్కు తీసుకెళ్ళడం ఇష్టం లేక మౌనంగా ఉండి విన్నాను. – ఈ కథనం చివరలో అదనపు సమాచారంలో దీనిని చూడవచ్చు-

నేను “మీరు అన్ని కధల్లోనూ’ శిల్లంగేరి’ అనే పేరు ఎందుకని పెడతారు” అని అడగ్గా , కృష్ణయ్యగారు “మాపూర్వులు ఆనాటి ముస్లింల ధాటికి ఝడిసి సొంత ఊరినుండీ పారిపోయి కర్ణాటక ప్రాంతంలోని అయిదు ఊర్లలో తలదాచుకున్నారుట. వాటిలో ఒకటి శిల్లంగేరి. అది మేము నివసించిన ప్రాంతం’ అని అన్నారు.

“మరి మీ ఇంటిపేరు ‘కోలార్’ అని ఎందుకు వచ్చింది” అనే నా సందేహానికి  వారు “మానాయన గారు చదువుకోలేదు. నిరక్షరాస్యులు. నన్ను బడిలో చేర్పించడానికి వెళ్ళినపుడు పంతుళ్ళు ‘మీ అబ్బాయి పేరేమి’ అనగా ‘కృష్ణయ్య’ అని చెప్పారుట. మరి ఇంటి పేరేమి? అని అడగ్గా “మేము ఉండేది కోలార్‌లో’ అని చెప్పగా పంతుళ్ళు తన ఇంటిపేరు ‘కోలార్’ అని రాశారుట! అలా తమ పేరు కోలార్ కృష్ణయ్య అయిందని చెప్పారు.

వారి విద్యాభ్యాసం ఎక్కువగా అనంతపురంలోనే సాగిందట. ఇంకో తమాషా ఏమంటే వారు తెలుగు కాక కన్నడ మీడియంలో చదివారుట! ఎనిమిదవ వతరగతి వరకూ తెలుగే చదివారు కానీ, ఒకరోజున తెలుగు పంతులుగారు పరీక్ష పేపర్లన్నీ దిద్ది అందరికీ ఇస్తూ కృష్ణయ్య గారి పేపర్ మాత్రం ఇవ్వక, చివరగా పిలిచి, చెవి మెలివేసి “ఏరా మొద్దూ ! ప్రతివాక్యానికీ ముందు ‘సున్న’ పెడుతున్నావ్ ! సున్నతో వాక్యం మొదలెడతారా? తెలివితక్కువ గాడిదా!” అంటూ భుజంపై ఒక్కదెబ్బ వేశారుట.

దాంతో మన కృష్ణయ్య బాబుకు (అపుడు చిన్నవాడుకదా!) కోపం, పౌరుషం వచ్చి, వాళ్ళ నాన్నగారి వద్దకెళ్ళి ‘నేను తెలుగులో చదవను’ అని చెప్పాడట. అప్పటికే కన్నడ మీడియంలో పిల్ల్లలు తక్కువై ఆ సెక్షన్ ఎత్తేస్తారనే భయంతో ఉన్న ఉపాధ్యాయులకు అదొక బాసట! దాంతో కృష్ణయ్యగారి తండ్రివెళ్ళి మావాడు కన్నడంలో చదువుతాడనిచెప్పి “వెళ్ళి ఆ సెక్షన్ లో కూర్చోపో” అని చెప్పారుట.

అప్పటినుండీ కన్నడ మీడియంలోనే చదివారాయన. కానీ పెద్దయ్యాక నాలుగు వందల తెలుగు కధలు రాసి, పండిన పండితుడు మన కోలార్ కృష్ణయ్య. కన్నడ మీడియంలో చదివి తెలుగులో చిన్నపిల్లలకోసం కధలు కాయించిన కర్పూర కల్పవృక్షం కోలార్ కృష్ణయ్యగారు. ఆయన “మరి కన్నడంలో కధలు వ్రాయలేదా?” అన్న నాసందేహానికి ” కన్నడంలో కధలేవీ వ్రాయలేదని” చెప్పారు.

చదువంటేనే తెలీని వారి తండ్రికి ఇలాంటి కధల పండితుడు తన సంతానమంటే ఎంత ఆనందించారో! మరికొన్ని విషయాలు మాట్లాడాలంటే సమయం చాలలేదు. కృష్ణయ్యగారి సంతానం , మనుమలు మనుమరాళ్ళు ,మునిమనుమలు ,మునిమనుమరాళ్ళు  అంతా తాతగారి పుస్తకాలు చదువుతారుట! విదేశాల్లో ఉన్న తన సంతతిని అక్కడివారు ‘కోలార్ ‘ అనే పేరుతోనే పిలుస్తారని మురిసిపోతూ చెప్తున్న ఆ 89 ఏళ్ళ నవ్వుల ముని ఆక్షణంలో ఎనిమిదేళ్ళ పిల్లాడిలా అనిపించారు. -ఇతరదేశాల్లో ఇంటిపేరే అసలు పేరుగా పిలుస్తారు కదా-

కళాశాల చదువు పూర్తయి ప్రభుత్వోద్యోగాలూ, ఆపై తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం అయ్యాక ప్రస్తుతం పిల్లలందరి దగ్గరా కొన్నాళ్ళు గడపుతూ, తిరుగుతూ, తిరిగి చందమామకు కధలు రాస్తూ నవ్వుకుంటూన్న నాగరికుడీయన. తాను ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ రాసిన కధలను, కొందరు పబ్లీషర్స్ విజయవాడనుండీ, మద్రాసునుండీ -ఇంకా ఢిల్లీ అని చెప్పిన గుర్తు-  ప్రింట్ చేసి వెయ్యిరూపాయలు కొందరిస్తే, అచ్చంగా ఆరే ఆరుకాపీలు కొందరు ఇస్తారుట!

ఇల్లు వెతుక్కుంటూ మధ్య మధ్య ఫోన్ చేస్తున్నమమ్ము తీసుకెళ్ళడానికి వారి పెద్దమ్మాయి అనుకుంటా.. క్రిందికి వచ్చి అప్యాయంగా పలుకరించి దారిచూపారు. అక్కడ ఉన్నకాస్తంత సమయాన్నీ కోలార్ గారితో మాట్లాడి బంగారం తవ్వుకోవాలనే ప్రయత్నంలో ఆమె  పేరు సైతం అడగడం మరచాము.

ఇటీవలే మార్చి ఐదున అనుకుంటాను  కోలార్ గారి గృహలక్ష్మి వారికి శాశ్వతంగా దూరమైందని తెలిసి బాధేసింది. వారి అమ్మాయి “ఎన్నో ఏళ్ళ అనుబంధం కదా నాన్నగారు తట్టుకోడం కష్టం” అనిచెప్పారు. కోలార్ కృష్ణయ్యగారు అందుకేనేమో తమవద్ద ఉన్న ప్రింటైన తమ రచనలన్ని అందరికీ పంచుతున్నారుట! -ఆగస్టు చివరలో కలిసిన తమకే ఆయన పాతిక పుస్తకాలు ఇచ్చేశారని హైమవతి గారు చెప్పి ఆశ్చర్యపరిచారు-

తిరుపతిలో కుమారునివద్ద కొంతకాలం , మంగుళూర్ కుమారునివద్ద కొంతకాలం, బెంగుళూర్ కుమార్తెవద్ద కొంతకాలం, ఢిల్లీలో కుమారునివద్దకు ఈరోజే ప్రయాణమవుతున్నారుట, అందుకే మేము హడావిడిగావెళ్ళి చూసి, మాట్లాడి వారు ఎంతో అప్యాయతగా మాకోసం తిరుపతి నుండీ తెచ్చిన షుమారుగా పాతిక పుస్తకాలు మాకు అందించారు, మరోమారు తీరుబాటుగా ఒక్కరోజంతా కలసి కబుర్లు చెప్పుకుందాము ” అనిచెప్పారు. సాగనంపటానికి క్రిందివరకూ రాలేమనగా, వారికి నమస్కరించి శలవుతీసుకుని మేడదిగాం.

తిరిగి ట్రాఫిక్ జోరులో డ్రైవర్ కారు నడుపుతుండగా మేమిరువురం  కోలార్ గారి కబుర్లు చెప్పుకుంటూ రెండుగంటలతర్వాత ఇల్లు చేరాం–.

అన్నట్లు – కోలార్ కృష్ణయ్యగారు నిర్మొహమాటంగా – “చందమామలో కొన్నికధలు పిల్లలకోసం లాగా ఉండవు. పెద్దవారు చదువుతున్నప్పటికీ ‘ ప్రేమించడం, పెళ్ళిచేసుకోడం, దయ్యలూ పిశాచాలూ లాంటివి పిల్లలకు అర్ధం కాకపోగా భయంకలిగిస్తాయని నా అభిప్రాయం. కొన్నిడైలాగ్స్, మాటలూ కూడా పిల్లలస్థాయిని మించి ఉంటాయి.నాకు తెలుగు కాస్తే వచ్చును, అందువలన నేను ఉపయోగించే భాషకూడా పిల్లలస్థాయికి సరిపోతుంది. (దేవునికధలు చందమామలో వేయరు అనికూడా అన్నారు).” అని వ్యాఖ్యానించారు. తాము ఏఏ పిల్లల పుస్తకాలకు వ్రాశారో కూడా చెప్పారు. (చంపక్, గోకుల్ వంటివి).

ఆయనను కలవడానికి నాలుగు గంటలు పోనూ రానూ  కష్టం అనిపించినా ఒక తలపండిన తపస్వినీ, కధల మునినీ చూసి మాట్లాడామన్న తృప్తి సంతోషం మిగిలాయి.

కోలార్ గారితో కొంతసేపు కబుర్లివే-!

అదనపు సమాచారం
కృష్ణయ్యగారి కధలపై రీసెర్చ్ చేసిన వ్యక్తి ” మీకు కధలకు ప్లాట్స్ ఎలాదొరుకుతాయి? ఈకధ రాయాలని ఎలా తోస్తుంది? ” అని అడిగారుట. దానికి కృష్ణయ్యగారు ” ఏదైనా సంఘటన చూసినపుడో, విన్నపుడో  వచ్చిన ఆలోచనను తనదైన శైలిలో కధలా మలుస్తానని చెప్పారుట.”ఏ కధకైనా ఒక సందేశం ఉండాలి, లేక పోతే ఆ కధ వలన ప్రయోజనం ఉండదు.ఇటీవల కధలు ఉత్తిగా వ్రాస్తున్నారు తప్ప, ప్రయోజనం కనిపించడంలేదు.” అన్నారు.

వారు తాను చూసే ఒక సీరియల్ లో (ఆ ఒక్కటే మేమూ చూసే సీరియల్ కావడం తమాషాగా అనిపించింది) -మొగలిరేకులు- దాన్లో దేవి (ఒక కారెక్టర్) తమ కుటుంబానికి విరోధి ఐన వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడతానని చెప్తుంది. పెద్దలకు ఇష్టం లేక పోయినా అలాచేయడంవలన తమ రెండు కుటుంబాల చిరకాల విరోధం పోయి స్నేహం తిరిగి విరుస్తుందని ఆమెభావన. ఈ ఆలోచనతో ఒక కధ వ్రాశానని చెప్పారు.

“ఏమైనా డిస్ట్రిబ్యూటర్స్‌తో చాలాబాధ. ప్రింట్ ఐందాకా నమ్మకంలేదు.” అన్నారు. ఎంతైనా ఓపిగ్గా వ్రాస్తూ  డిస్ట్రిబ్యూటర్స్‌తో తంటాలు పడుతూ ఇంకా పుస్తకాలు ప్రింట్ కోసం తపిస్తున్న ఇప్పటికి 40పైగా పుస్తకాలు ప్రచురించారు. ఇంకా 60 పిల్లల పుస్తకాల కూర్పుకు ప్రయత్నిస్తున్నారు. ఆ మహా మనీషికి మాతృభాషపట్ల, చిన్నపిల్లలకు మానవతా విలువలు నేర్పాలనే అభిలాష పట్ల ఉన్న మక్కువ ఎక్కువే!

వారు నాకు ఇచ్చిన తమ పుస్తకాలలోని కొన్ని క్యారెక్టర్స్ చారిత్రక, పురాణాలలోనివి ఇంగ్లీషులోకి అనువదించమని సూచించారు చూడాలి నావయస్సూ 65. ఆయనంత ఓపిక భగవంతుడు నాకూ ఇవ్వాలిగా! పైగా ఆయనలా డిస్ట్రిబూటర్స్‌తో ప్రింట్ కోసం తంటాలు పడటం నావల్ల అయ్యేపనికానే కాదు.

ఆదూరి హైమవతి.

(చందమామ సీనియర్ కథకులు శ్రీ కోలార్ కృష్ణయ్యర్ గారితో హైమవతి గారి కుటుంబానికి రెండు తరాల కథారూప పరిచయం ఉంది. గత 35 ఏళ్లకు పైగా వీరు ఈయన కథలు విడవకుండా చదవడమే కాకుండా తమ పిల్లలకూ కూడా వీరి కథలను పరిచయం చేశారట. ఈ కుటుంబం మొత్తానికి చందమామతో సుదీర్ఘ అనుబంధం ఉంది. కృష్ణయ్యర్ గారితో ప్రత్యేక అనుబంధం కూడానూ. మూడున్నర దశాబ్దాల తర్వాత ఈ చందమామ కథల మునితో పరిచయం కలిగే అవకాశం కోసం గత ఆరునెలలుగా ఈ కుటుంబం ఎదురు చూసింది. ఆయన తిరుపతిలో, బెంగుళూరులో, మంగుళూరులో తమ పిల్లల వద్ద గడుపుతూ రావడంతో సమయం కుదరలేదు. మొత్తంమీద ఆయన బెంగళూరు చిరునామా తీసుకుని అక్కడే కలియనున్నామని చెప్పడంతో కలిసిన తర్వాత వివరాలను రాసి పంపమని కోరాము. మరుసటి రోజే హైమవతి గారు ఆయనతో భేటీ వివరాలు రాసి పంపారు. కాస్త ఆలస్యంగా వీటిని ఇక్కడ ప్రచురించడమైనది. తెలుగు టీచర్ మందలించారనే కోపంతో తెలుగే చదవనని భీష్మించుకుని కన్నడ మాధ్యమంలోకి మారిపోయిన కృష్ణయ్యగారు తర్వాత నాలుగు వందల తెలుగు కథలు రాసి తెలుగు బాలసాహిత్యానికి తమదైన చేర్పునందించడం చూస్తుంటే హృద్యంగా అనిపిస్తోంది. ప్రస్తుతం కథల ప్రచురణ కోసం ఢిల్లీలో ఉన్న ఈయన అక్టోబర్ చివరలో తిరిగొస్తారు. జీవితం చివరి అంచులోనూ కథారచనను వదిలిపెట్టని ఈ రుషితుల్యుడితో మాట్లాడాలంటే దిగువ నంబర్లలో సంప్రదించవచ్చు.)

తిరుపతి    :   Land line : 0877-2251715
ఢిల్లీ           :   Mobile no: 09483321031 –ఇప్పుడు ఇక్కడే ఉన్నారు
బెంగళూరు: Land line: 080 23494065

 

ఆదూరి హైమవతి దంపతుల చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకులు చూడండి.

చందమామ చదవకుంటే?

 

‘చందమామ’ జ్ఞాపకాలతో వృధ్ధాప్యమూ పసితనమే…!!

RTS Perm Link

చందమామ ద్వారా హిందీ నేర్చుకుంటున్నా…

August 9th, 2011

కొంతకాలం క్రితం చెన్నయ్ చందమామ కార్యాలయానికి ఒక అరుదైన ఉత్తరం వచ్చింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉంటున్న ఒక ఇంగ్లీషు పెద్దాయన చందమామ సహాయంతో తాను హిందీ నేర్చుకుంటున్న వైనాన్ని  హిందీలో రాసి పంపారు. ఉత్తరంలో అదీ పెన్సిల్‌తో రాసి ఆయన పంపిన ఆ సుదూర ఉత్తరం ఈ అక్టోబర్ నెలలో ప్రచురణకోసం స్వీకరించడమయింది.

హిందీ భాష నేర్చుకునే క్రమంలో గురువు ద్వారా పరిచయమైన చందమామ తన జీవితంలో నూతన ద్వారాలను తెరిపించిందంటున్నారీ పెద్దాయన. ముసలివాడినైన తనకే చందమామ ద్వారా హిందీ నేర్చుకోవడం సాధ్యమవుతున్నప్పుడు మీకెందుకు సాధ్యం కాదు అంటూ పరభాషాల అధ్యయనంపై కొత్త కాంతిని ప్రసరింపజేస్తున్నారీయన.

45 ఏళ్లుగా సాధించలేనిది గత మూడేళ్లుగా గురువులు ద్వారా, చందమామ పత్రిక ద్వారా సాధించగలుగుతున్నాననే సంతోషం ఈ వృద్ధుడిది.

ఈ విదేశీ వృద్ధుడి చందమామ జ్ఞాపకాలు కింద చూడండి.

“మీ పత్రిక ద్వారా, ఇంగ్లీష్ వృద్ధుడినైన నేను హిందీ నేర్చుకోవడంలో చాలా సహాయం పొందగలిగాను. నేను ఇప్పుడు ఆస్ట్రేలియాలో హిందీ భాష నేర్చుకుంటున్నాను. హిందీ భాష నేర్చుకోవడం నాకు మొదట్లో కొంచెం కష్టంగా తోచింది. కాని నా ‘పూజ్య గురుదేవ్’ నాకు చందమామ సంచికను ఇచ్చి దానిద్వారా హిందీ నేర్చుకోమన్నారు. ఆయన ప్రసాదించిన ఈ ఆలోచనాత్మకమైన బహుమతి నా అధ్యయనాన్ని మరింత సులభతరం చేసింది. నిజం చెబుతున్నా చందమామలో నేను చదివిన కథల వంటివి నా జీవితంలో ఇంతవరకు నేను చూడలేదు.

బహుశా, నేను తప్ప ఈ ఆస్ట్రేలియాలో విక్రమ్ బేతాళ కథలు గురించి ఎవరికీ తెలియదనుకుంటున్నాను. మీవల్లే నేను ఇలాంటి కథలు తెలుసుకుంటున్నాను. మీ పత్రిక వల్లే నేనిప్పుడు హిందీని బాగా అర్థం చేసుకుంటున్నాను. గడచిన 45 ఏళ్ళకాలంలో నేను పెద్దగా నేర్చుకోలేకపోయాను. కాని గత మూడేళ్ళనుంచి ఇద్దరు పరమ గురువులు మరియు చందమామ ద్వారా నా జీవితంలో నూతన ద్వారాలు తెరుచుకున్నాయి.

నాకు సాధ్యమైంది మీకెందుకు సాధ్యం కాదు?
అందుకే, పాఠకులకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వయోవృద్ధుడినైన నేనే చందమామ ద్వారా భాష నేర్చుకోగలిగినప్పుడు.. మీకెందుకు సాధ్యపడదు. గుర్తుంచుకోండి. హిందీ,  ప్రపంచంలోని ఏకైక సుందరభాష.

నా ఈ ఉత్తరం ముగించడానికి ముందుగా నా గురువుల పేర్లు వెల్లడించాలనుకుంటున్నాను. దీపాల్ తక్కర్ అనే ఒక గుజరాతీ మహిళ హిందీ అక్షరమాలను, అక్షరాలను సరిగా ఉచ్చరించడాన్ని, అనేక పదాలను రూపొందించడాన్ని నాకు నేర్పించారు. ఆమె ఈరోజుకీ సిడ్నీలో టెలిఫోన్ ద్వారా నాకు హిందీ నేర్చుకోవడంలో శిక్షణ ఇస్తున్నారు. సోదరీ, మీకు నా కృతజ్ఞతలు!

ఇప్పుడు నా ప్రధాన గురువు విద్యాసాగర్ పట్టన్. ఈయనే నాకు తొలిసారిగా చందమామను పరిచయం చేశారు. ఇది నా జ్ఞానాన్ని మరింతగా మెరుగుపర్చింది. ఈ సందర్భంగా, వయసులో చిన్నవాడైన నా గురువుకి నా ఆశీర్వాదాలు.

ప్రియమైన చందమామా…! నీకు ముమ్మారు కృతజ్ఞతలు. నీవు చేపడుతున్న ఈ మంచి కృషిని మరో వంద సంవత్సరాలు కొనసాగించాలని  ప్రార్థిస్తున్నాను.”

ఆండ్రూ హెవెట్, మెల్‌బోర్న్, సిడ్నీ, ఆస్ట్ర్లేలియా 3071

(ఈయన పెన్సిల్‌తో హిందీలో తెల్లకాగితంపై రాసి ఎయిర్ మెయిల్ ద్వారా తన చందమామ విశేషాలు పంపారు. తన ఈమెయిల్, ఫోన్ వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాము.)

 

RTS Perm Link

చందమామ చదవకుంటే?

May 9th, 2011

చందమామ చదవకుంటే?
కోకిలమ్మ పాడకుంటే..
నెమలిఈక చూడకుంటే..
నేతిగారె తినకుంటే…
నీతికధలు వినకుంటే..

ఏం జరుగుతుంది?

పక్షులకు, పశువులకు, మృగాలకు లేని ఒక ప్రత్యేకత మానవునికి ఉంది. అదే విచక్షణ. ఇంగ్లీషులో “డిస్క్రిమినేషన్’. ఏది మంచి? ఏది చెడు? అని చెప్పగలిగిన శక్తి ఒక్కమనిషికే ఉన్నది. తతిమ్మా జాతులంతా స్వాభావికంగా ప్రవర్తిస్తూ ఉంటాయి.  మానవుడికి కావలసింది ప్రధానంగా దైవ ప్రీతి, పాపభీతి, సంఘనీతి. మానవుడు సంఘజీవి. తోటివారిపట్ల ఎలా నడచుకోవాలి? ఇతరులు ఏవిధంగా ఉంటే మనకు సంతోషం? అనేవి నర్పేవే నీతికధలు.

పరవస్తు చిన్నయసూరిగారి “నీతిచంద్రిక’లో కధలన్నీ, రాజుగారి సోమరిపోతు పుత్రులు విని, ఉత్తములైనారు. కధలు ఎటువంటివారినైనా ఆకర్షిస్తాయి. మంచిమార్గాన్ని చూపిస్తూ దుర్మార్గులు, దుష్ట స్వభావులు, ధర్మ భ్రష్టులు, ఏవిధంగా అపకీర్తి పొందారో భారత, రామాయణాలు చెప్తాయి. విష్ణుశర్మ చెప్పిన కధల్లో పక్షులు, పశువులు నిజంగా మాట్లాడతాయా లేదా అనేది ప్రశ్న కాదు, వాటి సంభాషణ ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అనేదే ప్రశ్న. విదురనీతి, సుమతీ శతకాలు నీతులు నేర్పేవేకదా! ఆకోవకు చెందినదే మన “అందాల చందమామ.”

గోరుముద్దలు పెడుతూ మంచి బుధ్ధులు నేర్పుతుంది అమ్మ. పసిపిల్లలకు మంచి చెడులు నేర్పుతూ నీతిముద్దలు పెడుతుంది “చందమామ’. నింగిలోని చందమామలో కూడా కొంతమచ్చ కనిపిస్తుంది. మన ప్రియతమ పత్రికలో ఏదైనా మచ్చ చూపించగలమా!? అందుకనే ఆబాల గోపాలమూ మెచ్చేపత్రిక ముఖ్యంగా పిల్లలకు నచ్చేపత్రిక. వెలసులభము. ఫలమధికము. ఇలా ఎంతైనా వ్రాయవచ్చు. అతిశయోక్తికానేకాదు.

చదివితే కధలెంత మధురమో, చిత్రాలు చూస్తే కళ్ళకు, మనస్సుకు అంత ఆనందం. చందమామ పత్రికను చూడగానే కొనని వారుండరు. అది అందించే పటిక బెల్లాన్ని తినని వారుండరు.

మా అబ్బాయి, అమ్మాయి, పసివాళ్ళుగ ఉన్నపుడు “శిళ్ళంగేరి’ గ్రామంలో, అని మొదలయ్యే చందమామ కధలు చదువుతూ, రాత్రి నిద్రించేవారు. (ఇవి చందమామ సీనియర్ కథకులు శ్రీ కోలార్ కృష్ణ అయ్యర్ గారు రాసే కథలు)

ఇపుడు అమ్మాయికి 37 ఏళ్ళు, అబ్బాయికి 35 ఏళ్ళూ, ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే, ఐనా ఈనాటికీ చందమామ చదవాల్సిందే!
అమెరికా చికాగోలో ఉంటున్న మా అబ్బాయి సైతం మొన్న బెంగుళూర్ వచ్చినపుడు ‘శిళ్ళంగేరి’ రచయిత, కోలార్ కృష్ణయ్యర్ గారి కధల గురించీ, మాట్లాడుకున్నాం.

నేను ముఖస్తుతికి ఈమాటలు అనడంలేదు. ఆ అమృతాన్ని గ్రోలుతూ , అనుభవిస్తూ, వ్రాస్తున్న మాటలివి. చిన్నపిల్లలతోపాటుగా పెద్దలకూ మానవత్వపు విలువలను, మంచితనాన్నీ, సద్గుణాలనూ గుర్తుచేసే పత్రిక చందమామ.

అప్పటినుండీ (1947) ఇప్పటివరకూ నిరాటంకంగా, నిర్విరామంగా, పత్రికకై చేస్తున్న కృషికి, సంపాదక వర్గానికీ, సహకరించే సిబ్బందికీ సవినయంగా నమస్సుమాంజలులు సమర్పిస్తున్నాను.

చంద్రుని కాంతి లోకానికి అందినంతకాలం’ చందమామ పత్రిక నిలవాలని, నిత్యం వెలగాలనీ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను.

ఆదూరి శ్రీనివాసరావు,
లెక్చరర్, సత్యసాయి ఇనిస్టిట్యూట్
బెంగళూరు
(చందమామ చదవకుంటే కోకిలమ్మ పాడకుంటే, నెమలి ఈక చూడకుంటే.. అంటూ చందమామను శిఖరస్థాయిలో నిలిపి ఉంచిన ఈ మామంచి  మాష్టారు గారు కావలి జవహర్ భారతి కాలేజీలో కామర్స్ పాఠాలు చెప్పారు. తర్వాత పుట్టపర్తి సాయి ప్రభావంతో బెంగళూరు వైట్‌ఫీల్డ్ ఆధ్వర్యంలోని సాయి కళాశాలలో ఉచితంగా విద్యార్థులకు బోధిస్తున్నారు. ఆధ్యాత్మికతను నిలువెల్లా పుణికిపుచ్చుకున్న మాష్టారుగారు భారత రామాయణాలు, నీతి శతకాలు, చందమామ కథలు మానవ నీతినియమాలకు పట్టం కట్టే సంస్కృతీ వారసత్వ చిహ్నాలుగా కొనియాడతారు.

‘పాతికేళ్ల క్రితం మీ కావలి కళాశాలలో నేనూ తెలుగు అధ్యాపకుడిగా అతి తక్కువకాలం పనిచేశాన’ని చెబితే ఎంత సంతోషపడ్డారో. ఈ దంపతులిరువురు -ఆదూరి హైమవతి, మాస్టారు- అమెరికాకు పిల్లలవద్దకు వెళ్లినప్పుడే సాయి అస్తమించడం వారికి శరాఘాతమైంది.

ఆధ్యాత్మికతను, ఆస్తికత్వాన్ని పక్కన బెట్టి చూస్తే సాయి బోధించిన ప్రేమ తత్వాన్ని పాటించడంలో నిస్వార్థంగా పిల్లలకు సేవలందించడంలో ఈ ఉపాధ్యాయ దంపతులు తమకు తామే సాటి. ప్రజలను సేవించటం అనే గొప్ప భావనను సమస్త వ్యవస్థలూ వదిలివేస్తున్న పాడుకాలంలో సాయి సంస్థల రూపంలో వ్యక్తులు ప్రదర్శిస్తున్న పరమ సేవాతత్వానికి అచ్చమైన ప్రతీకలు వీరు.)

శ్రీ శ్రీనివాసరావు మాస్టారు గారికి,
కోరగానే మీరు తక్షణం స్పందించి పంపిన చందమామ జ్ఞాపకాలను మెయిల్ ద్వారా అందుకున్నాము. చందమామనే చదవకుండా ఉంటే… అంటూ ఆ రోజు మీరు ఫోన్‌లో మాట్లాడిన మాటలను మళ్లీ అవే అక్షరాలలో పెట్టి మీరు పంపిన ఈ జ్ఞాపకం హృద్యంగా ఉంది.

మీకు, మీ కుటుంబానికి ఒక మంచి వార్త. మీ దంపతులూ, మీ అబ్బాయి, అమ్మాయి ఏ శిళ్లంగేరి కథల రచయిత గురించి మీ జ్ఞాపకాల్లో దశాబ్దాలుగా భద్రపర్చుకుంటూ వస్తున్నారో, ఆ చందమామ రచయిత శ్రీ కోలార్ కృష్ణ అయ్యర్ గారి చిరునామా ఇక్కడఇస్తున్నాము.

ఆయనకు ఇప్పడు 85 ఏళ్లు. ఈరోజుకీ పిల్లల సాహిత్యంపట్ల అపారమైన మక్కువతో ఆయన కథా సంపుటాలు ప్రచురిస్తూనే ఉన్నారు. ఆంగ్లంలో ఇంతవరకు 40పైగా బాల సాహిత్య సంకలనాలు తీసుకువచ్చారు. ఇంకా 60 పుస్తకాలకు పథకం రచించి పెట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన చందమామతో సంబంధం లేరు. గత సంవత్సర కాలంగా మాత్రమే ఆయనతో పరిచయమై కొనసాగుతోంది. ఆయన కొత్త కథలు కూడా వరుసగా నాలుగైదు ఈ మధ్యే ఎంపికయ్యాయి.

మీ జ్ఞాపకాల్లో చిరస్మరణీయంగా ఉంటున్న ఈ కథల మహర్షి చిరునామా కింద ఇస్తున్నాను. తప్పకుండా ఆయనతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి ఆ మధుర క్షణాలను ఆస్వాదించండి.
ఎంత మంచి పాఠకులను, ఎంత మంచి కథకుడిని కలుపుబోతున్నామో తల్చుకుంటే మనసు పరవశిస్తోంది.

Sri  Kolar Krishna Iyer
18-1-416,
Bhavani Nagar
Tirupathi-517501
Chittor (Dist)
Ap
Land line : 0877-2251715
(ఇటీవలే ఆయన తాత్కాలికంగా బెంగళూరుకు నివాసం మార్చినట్లున్నారు. తిరుపతి చిరునామా కొనసాగుతుంది.

RTS Perm Link

దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రధమ వర్ధంతి

January 25th, 2011

ఆహ్వానం

ఇతడనేక యుద్ధముల నారితేరిన వృద్ధమూర్తి

తన రచనలతో
తెలుగు పిల్లల్ని అలౌకిక లోకాలకు లాక్కెళ్ళి
వారి మదిలో
వెలుగు పువ్వులు పూయించి
తెలుగువాడి బాల్యానికి
అవ్యక్త… అనిర్వచనీయ….. కొస మెరుపు రంగులద్ది
జీవితాంతం…..
మరవలేని మధుర జ్ఞాపకాలుగా  మలచిన
అధ్బుత రస పిపాసి
అజ్ఞాత రచయిత
జానపద కథా వైశంపాయనుడు
దాసరి సుబ్రహ్మణ్యం గారి
ప్రధమ వర్ధంతికి
బాల సాహిత్య పరిషత్తు మీకు ఆహ్వానం పలుకుతోంది. .
వేదిక: హైదరాబాదు చిక్కడపల్లి లోని సిటి సెంట్రల్ లైబ్రరీ సమావేశ మందిరం
సమయం : తేదీ 27-01-2011 న సా. 6 గం. లకు

బాల్యంలో చందమామ స్మృతులున్న ప్రతి ఒక్కరు తప్పక  హాజరు కావలసిన సభ .

ఈ సభకు మీరు వచ్చినట్లయితే మీకు ముచ్చటగా మూడు లాభాలు

ఒకటి: దాసరి సుబ్రహ్మణ్యం గారి మూడు పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవాన్ని వీక్షించవచ్చు.

రెండు: అనేక మంది దాసు అభిమానులను, చందమామ అభిమానులను కలుసుకోవచ్చు.

మూడు: అరుదైన దాసరి సుబ్రహ్మణ్యం గారి రచనల ప్రదర్శనను తిలకించవచ్చు.

మరికొంత సమాచారం కోసం వేణువు (venuvu.blogspot.com) నొక్కండి.

ఆహ్వాన పత్రం కోసం అటాచ్మెంట్ చూడండి.

గమనిక: ఈ సభలో ఊక దంపుడు ఉపన్యాసాలుండవు.


దాసరి వెంకటరమణ
ప్రధాన కార్యదర్శి
బాల సాహిత్య పరిషత్తు
5-5-13/P4, Beside Sushma Theatre,
Vanasthalipuram, HYDERABAD – 500070.
04024027411. Cell: 9000572573.
email: dasarivramana@gmail.com

(మనిషన్నాక సవాలక్ష సమస్యలు… ఊపిరి తీసుకోనివ్వని వృత్తి జీవితం… ఉద్యోగ, కౌటుంబిక ఒత్తిళ్లు. ఎవరయినా వీటిని అర్థం చేసుకోవలసిందే.. అయితే, ఈ నెల  27న అంటే ఈ గురువారం సాయంత్రం హైదరాబాద్ చిక్కడపల్లి లోని సిటి సెంట్రల్ లైబ్రరీ సమావేశ మందిరంలో సాయంత్రం 6 గం.లకు జరిగే మన దాసరి గారి ప్రధమ వర్థంతికి ఏమాత్రం వీలున్నా, చందమామ అభిమానులు, పాఠకులు, పెద్దలు, పిల్లలు హాజరు కావలసిందిగా మనవి.

తెలుగు కథ మహత్తును యావద్భారతావనికి రుచిచూపిన జానపద కథా మాంత్రికుడు మన దాసరి సుబ్ర్హహ్మణ్యం గారి చిర జ్ఞాపకం కోసం మనం హాజరవుదాం. మూడు లేక నాలుగు తరాల పెద్దలు, పిల్లలం అందరం ఈ అరుదైన సమావేశంలో కలుసుకుని పలకరించుకుందాం. దాసరి గారిని తలుచుకుందాం. దాసరి వెంకటరమణ గారు చెప్పినట్లు ఈ సభలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఉండవు కనుక అందుకోసమయినా మనందరం కలుసుకుందాము. ఒక మహనీయమూర్తిని మన జ్ఞాపకాల్లో భద్రపర్చుకోవడానికయినా 27 సాయంత్రం మనం ఏమాత్రం వీలున్నా, తప్పక కలుసుకుందాం.)

RTS Perm Link

ప్రింట్‌లోనూ చందమామ జ్ఞాపకాలు

December 30th, 2010

గత ఒకటన్నర సంవత్సరంగా చందమామ పాఠకులు, అభిమానులు పంచుకుంటున్న చందమామ జ్ఞాపకాలను ఆన్‌లైన్ చందమామలో, చందమామ బ్లాగులో ప్రచురిస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చందమామ కథలతో, చందమామ అనుబంధంతో బాల్యజీవితాన్ని చల్లగా పండించుకున్న తరతరాల పాఠకులు… ఒక నాటి పిల్లలు, నేటి పెద్దలు అందరూ తమ తమ మధుర జ్ఞాపకాలను చందమామతో పంచుకున్నారు. పల్లెటూర్లనుంచి మహా నగరాల నుంచి, ఖండాంతరాలనుంచి కూడా మాన్యులు, సామాన్యులు చందమామ కథల మంత్రజగత్తులో తడిసిన తమ బాల్యాన్ని అందరిముందూ పరిచి తమ కమనీయ జ్ఞాపకాలు పంపారు.

అతిశయోక్తి అనుకోకుంటే. తెలుగునాడులో, భారతదేశంలో కొన్ని తరాల పిల్లలు, పెద్దల కాల్పనిక ప్రపంచాన్ని చందమామ కథలు ఉద్దీప్తం చేశాయి. నాగిరెడ్డి-చక్రపాణిగార్ల మహాసంకల్పం, కుటుంబరావు గారి అద్వితీయ -గాంధీ గారి-శైలి చందమామ కథలకు తిరుగులేని విజయాన్నందించింది. ఆ కథల అమృత ధారలలో దశాబ్దాలుగా ఓలలాడుతూ వస్తున్న వారు చందమామ కథాశ్రవణాన్ని తమ తదనంతర తరాల వారికి కూడా అందిస్తూ ఒక మహత్తర సంస్కృతిని కొనసాగిస్తూ వస్తున్నారు.

చందమామ విజయగాధకు దశాబ్దాలుగా తమ ప్రోత్సాహమనే ఊపిర్లు పోసిన ప్రియతమ పాఠకులకు, అభిమానులకు, చంపిలకు తమ తీపి జ్ఞాపకాలను ప్రింట్ చందమామలో కూడా పంచుకునే అవకాశం కల్పిస్తూ, వచ్చే సంవత్సరం -2011- ఫిబ్రవరి నుంచి పాఠకుల చందమామ జ్ఞాపకాలను పత్రికలో ప్రచురించబోతున్నాము. ఇప్పటికే ఆన్‌లైన్ చందమామలో, చందమామ బ్లాగులో పరిచయం అయన దాదాపు 40 పైగా “మా చందమామ జ్ఞాపకాలు”ను కూడా ప్రింట్ చందమామలో ప్రచురించడం జరుగుతుంది.

ఇంతవరకు తమ చందమామ జ్ఞాపకాలను పంపని పాఠకులు,అభిమానులు, చంపిలు కూడా ప్రింట్ చందమామ కోసం తమ తమ జ్ఞాపకాలను తప్పక పంపించవలసిందిగా అభ్యర్థన. వీలునుబట్టి మీ చందమామ జ్ఞాపకాలను చందమామ పత్రిక, వెబ్‌సైట్, బ్లాగులలో వరుసగా ప్రచురించగలము.

ఇందుకు మీరు చేయవలసిందల్లా మీ చందమామ జ్ఞాపకాలతో పాటు మీ ఫోటో, మీ వృత్తి, మీ ప్రాంతంకి సంబంధించిన వివరాలు మాత్రం పొందుపర్చి మాకు కింది ఈమెయిల్ లేదా చందమామ చెన్నయ్ చిరునామాకు పంపించడమే.

online@chandamama.com

abhiprayam@chandamama.com

లేదా

“My Chandamama memories”

The Editor
Chandamama India Limited
No.2 Ground Floor, Swathi Enclave
Door Nos.5 & 6 Amman Koil Street
Vadapalani, Chennai – 600026
Phone :  +91 44 43992828

చందమామ పత్రికను గత ఆరు దశాబ్దాలుగా తమ హృదయాల్లో పదిలపర్చుకుని ఆనందిస్తున్న, తమ పిల్లలకు, తదనంతర తరాలకు కూడా చందమామను పరిచయం చేస్తూ, తాము చదువుతూ, పిల్లలతో చదివిస్తూ చందమామ వికాసంలో ప్రతి మలుపులోనూ చేయూతనిస్తూ వస్తున్న ప్రియతమ పాఠకులకు, అభిమానులు,రచయితలు, ఆన్‌లైన్‌లో చందమామ చదువరులకు అందరికీ చందమామ స్వాగతం పలుకుతోంది.

మీ చందమామ జ్ఞాపకాలను చందమామ పాఠకులందరితో పంచుకోవడానికి కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకోవాలని, తప్పకుండా మీ చందమామ జ్ఞాపకాలను పంపుతారని ఆశిస్తున్నాము.

చందమామ

చందమామ వెబ్‌సైట్‌లో చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకు తెరిచి చూడండి.
http://www.chandamama.com/lang/story/TEL/12/49/storyIndex.htm

RTS Perm Link

చందమామ అలనాటి ముఖచిత్రం

October 27th, 2010

1948 ఫిబ్రవరి చందమామ ముఖచిత్రం

చందమామ ఈ నెల కూడా లేటుగా వచ్చింది. ఈ వారమే మాకూ ఆఫీసులో అందింది. ముఖచిత్రం చూడగానే ఆనందం. చందమామ మేటి చిత్రకారులలో ఒకరైన ఎంటీవీ ఆచార్య గారు 1948 ఫిబ్రవరి సంచికకు వేసిన ఫ్రంట్ కవర్ పేజీని ఈ అక్టోబర్ చందమామకు ముఖచిత్రంగా వేశారు.

పెద్దబ్బాయి తన తమ్ముడిని, చిన్నారి చెల్లెలిని తోపుడు బండిలో కూర్చోబెట్టి మెల్లగా లాగుతున్న దృశ్యం. బండి, పిల్లలు, శుభ్రంగా ఉన్న పల్లెదారి, పచ్చిక, గడ్డిపూలు, నేపధ్యంలో పెద్ద చెట్టు, పక్షులు, ఆకాశం… అన్నీ కొట్టొచ్చేంత స్పష్టంగా ఈ ముఖచిత్రం మనకు చూపుతోంది.  మానవ శరీర నిర్మాణాన్ని ఔపోశన పట్టి మహాభారతం సీరియల్‌‌లో, తదనంతర కాలంలో ఎంటీవీ ఆచార్య గారు చిత్రించిన అద్భుత చిత్రాలను తలపిస్తూ ఒకనాటి చందమామ చిత్రవైభవానికి చిత్రిక పడుతోందీ చిత్రం.

(ఎం.టి.వి. ఆచార్య
ఎం.టి.వి. ఆచార్య 1948లో చందమామలో ఆర్టిస్టుగా చేరాడు. చిత్రాగారు చందమామ తొలిచిత్రకారుడు కాగా, ఆచార్య గారు రెండవవారు. 1960 వరకు రెగ్యులర్‌గా చందమామలో పనిచేసిన ఈయన  మహాభారతం అట్టచివరి బొమ్మకూ, అట్టమీది బొమ్మకూ అద్భుతమైన బొమ్మలు గీశాడు. ఆయనకు మనుషుల ఎనాటమీ క్షుణ్ణంగా తెలుసు. సుమారు 20 ఏళ్ళ పాటు కొనసాగిన మహాభారతం సీరియల్‌కు ఆయన వివిధ పాత్రల ముఖాలు ఏ మాత్రమూ మార్పు లేకుండా చిత్రీకరించాడు. అందరూ బుర్రమీసాల మహావీరులే అయినా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, దుర్యోధనుడు, ఇలా ప్రతి ఒక్కరినీ బొమ్మ చూడగానే పోల్చడం వీలయేది. భీష్ముడికి తెల్ల గడ్డమూ, బట్టతలా ఆయనే మొదటగా గీశాడు. భీష్మ సినిమాలో ఎన్‌.టి.రామారావు ఆహార్యమంతా చందమామలో ఆయన వేసిన బొమ్మల నుంచి తీసుకున్నదే. ఆ తరవాత ఆయన వ్యక్తిగత కారణాలవల్ల బెంగుళూరుకు వెళ్ళిపోయారు.)

చందమామ అలనాటి చిత్రకారులకు సంబంధించిన వివరాలు దాదాపుగా దొరుకుతున్నాయి కాని ఆచార్య గారి వివరాలు అస్సలు అందుబాటులోకి రావడం లేదు. రోహిణీ ప్రసాద్ గారు తమ చందమామ జ్ఞాపకాలులో ఆచార్య గారి గురించి రాసిన పై బాగం తప్పితే ఆయన గురించి పెద్దగా వివరాలు తెలీవు.

1995 వరకు జీవించిన ఆచార్య గారు చందమామలో గీసిన ముఖచిత్రాల ఒరిజనల్ ప్రతులను రష్యా తదితర దేశాల్లో ప్రదర్శించి ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. చిత్రకారులు అప్పట్లో గీసిన పలు చిత్రాలను అప్పటి యాజమాన్యం ఉదారంగా బయటకు కూడా ఇచ్చేదని తెలుస్తోంది. ఆచార్య గారు కూడా ఇలా తన చిత్రాలను తీసుకెళ్లి ప్రదర్సనశాలల్లో ప్రదర్సించారు. తర్వాత వాటిని తిరిగి ఇవ్వలేకపోవడంతో మహాభారతంకు ఆయన గీసిన ఒరిజినల్ చిత్రాలు ప్రస్తుతం చందమామ వద్ద కూడా లేవు.

కాని ఆయన అప్పట్లో వేసిన కొన్ని చిత్రాలు మాత్రం రిజెక్ట్ కాగా వాటిని ఇప్పటికీ భద్రంగా ఆఫీసులో ఉంచారు. ఇలా ప్రచురణకు తీసుకోకపోవడంలో మిగిలిపోయిన చిత్రాలు వపా గారితో సహా ఇతర చిత్రకారుల చిత్రాలు  కూడా చందమామ ఆఫీసులో సురక్షితంగా ఉన్నాయి.

ఆచార్య గారికి కన్నడ సాస్కృతిక కళారంగంలో మంచి పేరు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకు మించి వివరాలు తెలీవు.ఎవరికయినా కన్నడిగుడైన ఎంటీవీ ఆచార్య గారి వివరాలు తెలిసే అవకాశమంటే కాస్త చందమామ చెవిన వేయగలరు.

ముందుగా, 1948 ఫిబ్రవరిలో ఆచార్య గారు చందమామకు వేసిన ముఖచిత్రాన్ని దాని ఒరిజనల్ రూపంలో చూడాలనుకుంటే ఈ అక్టోబర్ చందమామను తీసుకోగలరు. ఈవారమే చందమామ మార్కెట్‌లోకి వచ్చింది పత్రిక అందుబాటులోనే ఉంది.

ఇప్పడు చందమామ అక్టోబర్ సంచికను తప్పక తీసుకుని చూడగలరు. దీంట్లో పాత కథలు, కొత్త కథలు నిజంగానే పోటీ పడ్డాయి. అన్ని కథలూ బాగానే ఉన్నాయి. మీరే చదివి చెప్పండి.
చందమామ.

RTS Perm Link

నా చందమామ జ్ఞాపకాలు

October 25th, 2010

నా పేరు కోనె నాగ వెంకట ఆంజనేయులు. వేలాది మంది చందమామ పిచ్చివాళ్లలో -వీరాభిమానులు- నేనూ ఒకడిని. ఒకప్పుడు నా కంటే పెద్ద చందమామ పిచ్చివాడెవడూ లేరనుకునేవాడిని. ఇప్పుడు నా అభిప్రాయం  మార్చుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యనే తెలిసింది. నా కంటే పిచ్చివాళ్లు కోకొల్లలుగా ఉన్న సంగతి.

నేను యాభై ఏళ్లుగా చందమామ పాఠకుడిని. నలభై ఏళ్లుగా చందమామలు జాగ్రత్తలు చేస్తున్నవాడిని. ఇరవై సంవత్సరాలుగా చందమామకు కథలు రాస్తున్నవాడిని.

చందమామ నాకు పరిచయమయింది 1962 జూలై సంచికలోని “మేలు చేసిన వాడు” కథతో. అప్పటికి నాకు తొమ్మిదేళ్లు. ఏలూరులో మా  వీధిలో ఓ ఇంటి అరుగుమీద ఒక వ్యక్తి చందమామ చదువుతుంటే ముఖచిత్రం చూసి ఆకర్షితుడినై ఆ వ్యక్తి పక్కకు చేరి అతడితో పాటు ఆ కథ చదివాను.

బేతాళ కథకు శంకర్ గారి చిత్రం

ఆ బేతాళ కథ, శంకర్ వేసిన బురుజు విరిగి పడుతున్న దృశ్యం బొమ్మ నన్ను అమితంగా ఆకర్షించాయి. వెంటనే యింటికి వెళ్లి మా నాన్నగారితో ఆ పుస్తకం కొనిపించుకున్నాను. పేచీ పెట్టకుండానే నా కోరిక నెరవేరింది. ఆ నాటి నుండీ ఈ నాటివరకూ చందమామ నా జీవితంలో ఒక భాగమైపోయింది.

మొదట్లో చందమామలు జాగ్రత్త పెట్టడం తెలియలేదు. చాలా పుస్తకాలు మా పెద్దమ్మలు ఊరికి వెళుతూ కాలక్షేపానికి పట్టుకుపోయోవారు. అవి నాకు తిరిగి వచ్చేవి కాదు. 1962 నుంచి 1970 వరకు ఇలాగే అన్ని కాపీలూ పొగొట్టుకున్నాను. 1971 నుండి మాత్రం చందమామలు ఎవరికీ ఇచ్చే ప్రసక్తి పెట్టుకోలేదు. అప్పటినుండీ ఇప్పటి వరకూ అన్ని చందమామలూ నావద్ద భద్రంగా ఉన్నాయి. కాని ఇప్పటికీ పాత పుస్తకాల షాపులకు వెళ్లి 1971కి ముందు చందమామలు దొరుకుతాయేమోనని వెతుకుతుంటాను.

1962 జూలై చందమామ

అలా 1995లో, నేను మొట్టమొదట చూసిన -1962 జూలై- చందమామ మరి మూడు చందమామలతో కలిసి ఒకే బైండుగా దొరికింది. కనకమహాలక్ష్మి ఆలయం దగ్గరున్న ఓ షాపులో అది దొరికింది. ఆ బైండుకు అటూ ఇటూ చెదలు చేసిన కన్నాలు ఓ పాతిక ముప్పై ఉన్నప్పటికీ చదువుకోవడానికి అడ్డు రాలేదు. ఆ బైండు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ పుస్తకాలలో ఉన్న పేరు జి.సత్యనారాయణ గారిది. ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

అప్పట్లోనే -1973-లో నా క్లాసుమేటూ, బాల్యమిత్రుడూ అయిన యర్రంశెట్టి రాధాకృష్ణ యింట్లో 1950 నుండి 1965 వరకూ చందమామలు ఉన్నట్లు తెలిసింది. కానీ వాళ్ల నాన్నగారికి ఆ పుస్తకాలు ఎవరికీ ఇవ్వడం ఇష్టం ఉండదని చెప్పాడు. కానీ నేను వదలకుండా వాణ్ణి బ్రతిమాలి, చదివి ఇచ్చేస్తానని చెప్పి రోజుకో మూడు చొప్పున చందమామలు తీసుకెళ్లి చదివి తిరిగి ఇచ్చేసేవాడిని.  కొన్ని చాలా మంచి కథల్ని వదల బుద్ది కాక ఒక్కొక్క సంచికలోంచి నాకు బాగా నచ్చిన కథలు ఒక్కొక్కటి చొప్పున జాగ్రత్తగా విడదీసి తీసి మళ్లీ జాగ్రత్తగా బైండ్ చేసేవాడిని.

అలా 1950 నుంచి 1965 వరకూ నేను సేకరించిన కథలన్నీ ఓ బైండ్ ఇప్పటికీ నా దగ్గరే ఉంది. కానీ ఇప్పటికీ వాడికీ విషయం తెలియదు. తరవాత ఎప్పుడో తెలిసింది. వాళ్ల నాన్నగారు ఆ పుస్తకాలన్నీవాళ్ల స్నేహితుడెవరికో ఇచ్చేశారని. అప్పుడు చాలా బాధనిపించింది. నా సంపద నెవరో కొల్లగొ్ట్టేసినట్లు బాధపడ్డాను. కానీ ఇప్పుడా బాధ లేదనుకోండి. ఎందుకంటే పాత చందమామలన్నీ ఇప్పుడు నెట్‌లో చదువుకోవడానికి లభ్యమవుతున్నాయి. రోజుకో సంచిక చొప్పున చదువుతూ ప్రస్తుతం 1953 జూన్ వరకూ వచ్చాను.

1947 తొలి చందమామ ముఖచిత్రం

1947, 48, 49 నాటి చందమామలు కొన్ని శ్రీకాకుళం కథానిలయంలో ఉన్నట్లు తెలిసి వెళ్లి అవన్నీ జిరాక్స్ కాపీలు చేయించుకుని తెచ్చుకున్నాను. అలాగే శ్రీనివాస్ అనే ప్రెండ్ దగ్గరనుంచి 1961 నుండి 1968 వరకు ఉన్న కొన్ని చందమామలు కూడా జెరాక్స్ చేయించి తెచ్చుకున్నాను.

ఇదంతా నా చందమామల సేకరణ గురించి.

చందమామలో కథలు రాయడం గురించి చెప్పాలంటే..

చందమామల్లోని కథలు చదవగా, చదవగా నాకు కూడా చందమామకు కథలు రాయాలనే కోరిక కలిగింది. అప్పటికే మిగతా పత్రికలలో నావి కథలూ, కవితలూ, జోక్స్ మొదలైనవి వచ్చి ఉన్నాయి. చందమామలో కూడా నా కథలు చూసుకోవాలనే కోరికతో 1981లో కథ  రాసి పంపితే వెంటనే ప్రచురించారు. చాలా సంబరపడిపోయాను. చందమామలో నా పేరు చూసుకుని. అదే సంవత్సరం నా కథలు మరో మూడు చందమాలో పడ్డాయి. 1986లో మరో కథ ప్రచురణ తర్వాత ఎందుకనో ఆరు సంవత్సరాల గ్యాప్ వచ్చింది చందమామలో కథలు రాయడానికి.

1992లో జ్వరంతో బాధపడుతూ కొన్ని రోజులు ఇంట్లో విశ్రాంతిగా ఉండటంతో మళ్లీ చందమామ కథలు రాయడం మొదలు పెట్టేను. అప్పటి నుండి విరామం లేకుండా 2005 వరకూ ఎనభై పైగా కథలు చందమామకు వ్రాశాను. ఇంచుమించు ప్రతికథా హేలాపురిలో అంటూ ప్రారంభమవుతాయి నాకథలు చందమామలో. హేలాపురి మా ఊరు ఏలూరుకి పూర్వనామం, మా ఊరు మీదున్న మమకారంతో నా కథలకు ఆ పేరు పెట్టేవాడిని.

మొదట్లో సింగిల్ పేజీ కథలు రాసేవాణ్ణి. కొన్ని కథలు ప్రచురించబడిన తర్వాత, దాసరి సుబ్రహ్మణ్యం గారు – పెద్ద కథలు రాయమని ప్రోత్సహించారు తన ఉత్తరాల ద్వారా. అప్పటినుంచే పెద్ద కథలు కూడా చాలా రాసి పంపించాను. అన్నీ ప్రచురింపబడ్డాయి.

చాలా కథలు ప్రచురణ అయిన తర్వాత, చందమామ పాత సంచికలు కావలని దాసరి గారికి ఉత్తరం రాశాను. చందమామ కాపీలు  ఏజెంట్ల ఆర్డర్ల మేరకు బొటాబొటీగా ప్రింట్ చేస్తామని, పాత కాపీలు దొరకటం కష్టమనీ బాధపడుతూ ఆయన జవాబిచ్చేరు.
చందమామలో ఒక్కొక్కసారి ఒకే సంచికలో నావి రెండు కథలు ప్రచురణకు నోచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఒకే రచయిత కథలు రెండు ఒకే సంచికలో ప్రచురించకూడదన్న నియమం చందమామకున్నది. అందుకే ఒక కథ నా పేరుతోనూ, మరొక కథ కె.హనుమంతరావు పేరుతోనూ ప్రచురింపబడేది. ఈ విషయం దాసరి గారి దృష్టికి తీసుకెళితే, ఒకే సంచికలో ఒకే రచయితవి రెండు కథలు ప్రచురించకూడదన్న చందమామ నియమం కారణంగా రెండో కథకు నా పేరుకు దగ్గరగా ఉండేలా కె. హనుమంతరావు అనే పేరు పెట్టేనని తెలియపరిచేరు.  (పారితోషికం మాత్రం నా పేరు మీదే రెండు కథలకూ పంపేవారు)

ఈ కె. హనుమంతరావు పేరు నాకు రుచించక పోవడంతో ఆయనకు ఉత్తరం రాశాను. ఒకే సంచికలో నావి రెండు కథల ప్రచురణ అనివార్యమైన పక్షంలో ఆ రెండో కథకు మా అమ్మాయి పేర కో.క. గౌతమి – కోనే కనక గౌతమి- పేరుతో ప్రచురించవలసిందిగా కోరాను. తర్వాత ఆయన నాకు రాసిన ఉత్తరంలో కోక గౌతమి పేరు గుర్తు పెట్టుకుని అలానే చేస్తానని మాట ఇచ్చారు. ఇవి చందమామతో, దాసరి సుబ్రహణ్యం గారితో నాకున్న అనుబంధాలు, తీపి జ్ఞాపకాలు.

K.N.V Anjaneyulu

విశాఖపట్నం అంటే చందమామ కథకుల ఊరు. ఎంతోమంది సీనియర్ కథకులు ఈ నగర వాసులుగా జీవిస్తూ దశాబ్దాలుగా చందమామ పాఠకులుగానే కాక తదనంతర జీవితంలో చందమామ కథకులుగా కూడా రూపొందుతూ చందమామతో సజీవ సంబంధాలు కొనసాగిస్తున్నారు. శ్రీ కొనే వెంకట ఆంజనేయులు గారు కూడా ఈ కమనీయ కథా చరిత్రలో భాగస్థులు. తమ పుట్టిల్లు ఏలూరు పూర్వనామమైన హేలాపురిని తమ ప్రతి కథలో భాగం చే్స్తూ ఈయన ఇప్పటికీ చక్కటి కథలు చందమామకు పంపుతూనే ఉన్నారు.

మా అనుభవంలో చందమామ కథకులు రెండు రకాలు. చందమామ కథల నిడివి, ఇతివృత్తం, శైలి వంటివి క్షుణ్ణంగా తెలిసి చక్కటి పొందికతో పేజీల కొలతలకు సరిగ్గా సరిపోయేలా కథలు రాసేవారు. చందమామ కథల ఇతివృత్తం, శైలి వంటివి తెలియకపోయినా చందమామలో తమ కథ చూసుకోవాలనే ఆరాటంతో ఔత్సాహిక ధోరణిలో కథలు పంపేవారు. కొత్తగా కథలు పంపేవారి రచనలలో ఏమాత్రం వాసి ఉందనిపించినా సరే కాసిన్ని మార్పులతో వారికి ప్రోత్సాహం ఇచ్చి ప్రచురించే చరిత్ర చందమామకు తొలినుంచి ఉంది.

ఆంజనేయులుగారు ఈ వర్గీకరణలో తొలి కోవకు సంబంధించిన వారు. తొలినుంచి చివరి దాకా విడువకుండా చదివించే ధోరణి, కథలో బిగి సడలకుండా పక్కతోవలు పట్టకుండా సూటిగా విషయానికి కట్టుబడి రాసే కొద్ది మంది ప్రతిభావంతులలో వీరు ఒకరు. కథ ఏ కారణం చేత అయినా ప్రచురణకు తీసుకోకపోయినా సరే ఆ కథ పునఃపరిశీలనకు తీసుకోవడానికి మరోసారి ఆలోచింపజేసే శక్తి ఈయన కలానికి ఉందంటే అతిశయోక్తి కాదు.

ఈయన ఇటీవలే పంపిన తమ చందమామ జ్ఞాపకాలు ఒరిజనల్ కాపీని బస్సులో వెళుతూ పోగొట్టాను. చందమామ ఆఫీసులో పని ఎక్కువై చందమామ జ్ఞాపకాలను ఇంటి వద్ద టైప్ చేసి తీసుకువద్దామని భావించి రెండు వారాల క్రితం ఇంటికి తీసుకెళితే అనివార్య కారణాలతో  ఆ పనికాలేదు. ఇక్కడ సాధ్యం కాదని మళ్లీ మరుసటి రోజు ఆఫీసుకు తీసుకెళుతూ బస్సులో సీటు కింద పెట్టి దిగవలసిన స్టాప్ వద్ద త్వరత్వరగా దిగబోయే ఒత్తిడిలో ఆంజనేయులు గారి జ్ఞాపకాలను మర్చిపోయాను. ఎంత బాధపడ్డానంటే వారం రోజులు ఆయనకు ఫోన్ కూడా చేయడానికి సాహసించేలేకపోయాను. అంత కష్టపడి తన చందమామ జ్ఞాపకాలను పంపితే సులువుగా పోగొట్టేశానే అనే అపరాధ భావన. చివరకు సాహసించి ఫోన్ చేసి జ్ఞాపకాలు మీవద్ద జిరాక్స్ కాపీ ఉంది కదా అని అడిగి నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నాను.

ఆంజనేయులు గారూ!
మీ పని ఒత్తిడిలో ఉంటూనే చందమామకు కథలతో పాటు, చందమామ జ్ఞాపకాలను కూడా పంపించినందుకు మనఃపూర్వక కృతజ్ఞతలు. చందమామతో మీ దశాబ్దాల బంధం చివరి వరకు కొనసాగుతుందని, కొనసాగాలని కోరుకుంటున్నాము.

ఈ సంవత్సరం మీరు తీసుకోలేకపోయిన మూడు నెలల చందమామ కాపీలను తీసిపెట్టాము. తప్పక ఈ వారంలో మీకు పంపించగలము. కాంప్లిమెంటరీ కాపీలు పంపలేని మా అశక్తతను మన్నిస్తారని తలుస్తున్నాము. కొనగలిగితే ఇటీవలే చందమామ ప్రచురించిన చందమామ ఆర్ట్ బుక్ తప్పక తీసుకోగలరు. ధర ఎక్కువే అయినప్పటికీ జీవిత కాల జ్ఞాపకంగా భద్రపర్చుకోదగిన 200పైగా చందమామ అలనాటి ఒరిజినల్ ముఖచిత్రాలను ఈ పుస్తకంలో ప్రింటు చేయడం జరిగింది. రెండు ముప్పావు కిలోల బరువుండే ఈ ఆర్ట్ బుక్ రెండుభాగాల వెల రూ.1500.00. ఖచ్చితంగా ఇది మీకు సంతోషం కలిగిస్తుందనే అనుకుంటున్నాము.

చందమామ వెబ్‌సైట్‌లో కూడా మీ చందమామ జ్ఞాపకాలు ప్రచురిస్తున్నాము చూడండి.
చందమామ.

RTS Perm Link

చందమామతో నా అనుభవాలు

October 18th, 2010

చందమామతో ఒక పాఠకుడిగా, ఒక రచయితగా అనుబంధం ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా అనుభవాలు, అనుభూతులు ఒకసారి మన చందమామ కుటుంబ సభ్యులందరితో పంచుకుంటాను.

ముందుగా రచయితగా నా అనుభవాలు..

మా నాన్నగారు మొదట చీరాలలో చెప్పుల దుకాణం పెట్టారు. అందులో నష్టం రావడంతో 1965లో రేపల్లె (గుంటూరు జిల్లా) వచ్చి రైల్వే స్టేషన్‌లో స్టాల్ కాంట్రాక్ట్‌కు తీసుకున్నారు. ఆ స్టాల్‌లో సిగరెట్లు, చాక్లెట్లు, బిస్కెట్లతోపాటు వారపత్రికలు, మాసపత్రికలు కూడా ఉండేవి. అలా పరిచయం అయింది చందమామ. అప్పటికి నా వయసు అయిదేళ్లు.

రైల్వే స్టేషన్‌కి ఎదురుగా ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు నాన్న. నాకొక అక్కయ్య ఉండేది. ఇంటి అరుగుమీద కూర్చుని అక్కయ్య, నేను చందమామలోని బొమ్మలు చూస్తూ ఆనందించేవాళ్లం. అక్కయ్య కొద్దిగా చదివి నాకు కథలు చెబుతుండేది. రాజులు… రాణులు… యువరాణులు..రాక్షసులు..మాంత్రికులు. దయ్యాలు… భూతాలు… రాజ్యాలు… అరణ్యాలు… వాహ్! ఊహాలోకంలో విహరించేవాడిని. యువరాజుగా నన్ను ఊహించుకునేవాడిని.

రేపల్లెలో జలీల్ ఖాన్ చందమామ ఏజెంట్. చందమామ రాగానే సైకిల్ మీద రైల్వే స్టేషన్‌కి వచ్చి పార్సిల్ తీసుకుని ముందుగా మా షాప్‌కి ఇచ్చేవాడు. స్టేషన్ నుంచి నాన్న కేక వేసి మాకు చెప్పేవారు చందమామ వచ్చిందని. నేను రయ్‌న పరిగెత్తుకు వెళ్లి చందమామ అందుకుని అంతే వేగంగా ఇల్లు చేరేవాడిని.

పేజీలు తిప్పి బొమ్మలు చూస్తే మరో లోకం కనిపించేది. మనసంతా సంతోషంతో నిండిపోయేది.

ఏడేళ్ల ప్రాయం వచ్చింది. నాన్న భోజనానికి ఇంటికి వెళ్లినప్పుడు నేను షాపులో ఉండేవాడిని. చదవడం రావడంతో పుస్తకాలు ప్రీతిప్రాతమయ్యాయి. చందమామలోని అసలు మజా అప్పుడు తెలిసింది. కథలు, సీరియల్స్ చదివి ఆనందపడేవాడిని. శిథిలాలయం సీరియల్ లోని శిఖిముఖి, విక్రమకేసరి నా అభిమాన హీరోలు.

నేను చదివిన చందమామ కథల బడిలోని స్నేహితులకు చెప్పేవాడిని. వాళ్లు సంబరపడేవారు. ఒరేయ్! నువ్వు కథలు భలే చెబుతావురా! అనేవారు. మనసు పొంగిపోయేది.

పద్మనాభుడి పెళ్లి

ఇంటర్‌కి వచ్చాక చందమామ కథ వ్రాస్తే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది. కానీ ఎలా రాయాలి? ఎలా పంపాలి? అది తెలీదు. చెప్పేవారు లేరు. అప్పుడప్పుడు పోటో వ్యాఖ్యల పోటీకి ఉత్తరాలు పంపేవాడిని. (చందమామలో వంద కథలు నావి ప్రచురించబడినా, ఫోటో వ్యాఖ్యల పోటీలో బహుమతి గెలుపొందక పోవడం ఇప్పటికీ నాకు అసంతృప్తిగానే ఉంటోంది)

లైబ్రరీకి వెళ్లినప్పుడు అన్ని పుస్తకాలతో పాటు చందమామ పాత సంచికలు అడిగి మరీ తీసుకుని చదివేవాడిని.

పత్రికల్లో ఉత్తరాలు, చిన్న చిన్న కవితలు ప్రచురించబడసాగాయి. నాన్న ప్రోత్సాహంతో పత్రికలకు కథలు పంపడం మొదలు పెట్టాను.

అయితే చందమామలో నా పేరు చూసుకోవాలన్న తపన ఉండేది.అది కష్టం అని కూడా అనిపించేది.

డిగ్రీ పూర్తయింది. ఉద్యోగం రావడానికి మూడేళ్లు పట్టింది. నాన్నకు ఆరోగ్యం బాగుండకపోవడంతో షాపు నేనే చూసుకునేవాడిని. రైలు వచ్చినప్పుడు పది నిమిషాలు షాపు రద్దీగా ఉండేది. తరవాత ఖాళీనే. అప్పుడు చిత్తు కాగితాల మీద కథలు రాస్తుండేవాడిని.

ఉద్యోగ ప్రయత్నంతోపాటు చందమామ కథలు కూడా రాయడం మొదలెట్టాను. ఉద్యోగ ప్రయత్నం ఫలించి 1983లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది.తొలి పోస్టింగ్ విజయవాడ దగ్గర ఉన్న గుంటుపల్లెలో ఇచ్చారు. రేపల్లె నుంచి రోజూ వెళ్లిరావడం కష్టమని విజయవాడలో మా మేనత్తతగారింట్లో ఉండేవాడిని.

ఒక రోజు బ్యాంకులో ఉండగా, అక్కయ్య రాసిన ఉత్తరం వచ్చింది. అందులో నువ్వు రాసిన పిరికివాడు కథ ప్రచురిస్తున్నట్లు చందమామ నుంచి ఉత్తరం వచ్చింది అని ఉంది. మనసంతా సంతోషం. ఎప్పుడెప్పుడు ఉత్తరం చూద్దామా అనిపించింది. ప్రతి శనివారం రేపల్లె వెళ్లేవాడిని. అలా వెళ్లినప్పుడు ఉత్తరం చూశాను. ఉత్తరం మీద దాసరి సుబ్రహ్మణ్యం గారి చేతివ్రాత (అప్పట్లో ఆయనదని తెలీదు) ఉత్తరం భద్రంగా దాచుకున్నాను. స్నేహితులకి, బ్యాంకులో కొలీగ్స్‌కి చూపించాను.

వెంటనే చందమామ వారికి ఉత్తరం రాశాను. కథ ఎప్పుడు ప్రచురిస్తున్నారని? ‘వీలు వెంబడి ప్రచురిస్తాము’ అని దాసరిగారు ఓపికగా సమాధానం వ్రాశారు.

1984 జనవరి చందమామ

ఒకసారి విజయవాడ ఛాయ హోటల్‌లో బ్యాంక్ మీటింగ్ జరిగింది.అక్కడి బుక్‌స్టాల్‌లో చందమామ కొన్నాను. అది జనవరి 1984 సంచిక. ఎడిటోరియల్ కాలమ్‌లో ఈ నెల బేతాళకథ ‘పద్మనాభుడి పెళ్లి’కి ఆధారం ఎన్.శివనాగేశ్వరరావు రచన అని ఉంది. ఎంత ఆనందం పొందానో మాటల్లో చెప్పలేను.

ఆ కథ నేను ‘హసన్ పెళ్లి’ అనే పేరుతో పంపాను. పేరుమార్చి బేతాళ కథగా ప్రచురించారు.

కుముదవతీ నగరం, పద్మనాభుడు,సులక్షణ, రత్నభద్రుడు, రవివర్మ, సోమనాధుడు, భైరవ బైరాగి, గౌరవముఖుడు, నల్లభూతం.. ఇవేవీ పాత్రలకు నేను పెట్టిన పేర్లు కావు. ఎందుకంటే నేను ముస్లిం పేర్లతో కథ రాశాను. ఇంత అందమైన పేర్లు పాత్రలకు ఎవరు పెట్టి ఉంటారు? ఇంకెవరు? దాసరి గారే అయి ఉంటారు

సరాసరి బేతాళకథతో చందమామ లోకంలో ప్రవేశించడం నిజంగా కొత్త రచయితకు గొప్పవరం.

వెంటనే చందమామకు మరో లేఖాస్త్రం సంధించాను. మీరు పిరికివాడు అనే కథ ప్రచురణకు స్వీకరించినట్లు ఉత్తరం రాశారు. కానీ అది కాకుండా మరొక కథ ముందు ప్రచురించారు. కారణం ఏమిటి? అని రాశాను.

మరలా అంతే ఓపికగా దాసరిగారు ఉత్తరం రాశారు. ‘పేజీల అడ్జెస్ట్‌మెంట్ కారణంగా అలా జరిగింది’ అని.

ఆ తరవాత వెనుదిరిగి చూడవలసిన అవసరం రాలేదు. చందమామలో తరచుగా నా కథలు ప్రచురించబడేవి. మంచి పారితోషికం మనీ ఆర్డర్ రూపంలో వచ్చేది.

రచయితగా మూడువందల పై చిలుకు కథలు రాశాను. నా కథలు అన్ని ప్రముఖ వార, మాస పత్రికలలో అచ్చయ్యాయి. అందులో 100 కథలు చందమామలో ప్రచురించబడ్డాయి. రచయితగా నాకు దారి చూపింది, వెన్నుతట్టి ప్రోత్సహించిందీ నిస్సందేహంగా చందమామే! అందుకు చందమామకు సదా కృతజ్ఞుణ్ణి.

నా వందవ కథ స్వర్ణ పుష్పం బేతాళ కథగా ఏప్రిల్ 2010 సంచికలో ప్రచురించబడింది. ఆ స్వర్ణపుష్పాన్ని గురుతుల్యులు కీ.శే దాసరి సుబ్రహ్మణ్యం గారికి భక్తిపూర్వకంగా అంకితమిస్తున్నాను.

ఒక పాఠకుడిగా చందమామతో నా అనుభవాలు మరోసారి మీతో పంచుకుంటాను.

మీ
ఎన్.శివనాగేశ్వరరావు.

శివనాగేశ్వరరావు గారూ,
2010 ఏప్రిల్‌లో ప్రచురణకు తీసుకున్న మీ బేతాళకథ స్వర్ణపుష్పం మీరు చందమామకు పంపిన వందవ కథ అని మీరు చెప్పేవరకు తెలీదు. మీ బేతాళ కథను పరిశీలించడంతోనే ప్రింట్ చందమామలో నా తొలి పని ప్రారంభమవటం యాదృచ్చికమే అయినా థ్రిల్లింగ్‌గా ఉంది. మీ కథ మొదటి నుంచీ చివరిదాకా ఒకే ఒరవడి -టెంపో-లో సాగినప్పటికీ కథలో కాసింత మార్పు చేయవలసి వచ్చింది. కథను చెప్పే తీరు, దాన్ని చివరిదాకా నడిపించే తీరులో మీ వంద చందమామ కథల అనుభవం అంతా కనిపిస్తుందను కుంటున్నాను. కానీ పోస్ట్ ద్వారా కమ్యూనికేట్ చేయటం చాలా పరిమితమైన పరిస్థితుల్లో మీ ఫోన్ నంబర్ అందుబాటులో లేనందున ఇటీవల వరకు మిమ్మ్నల్ని సంప్రదించలేకపోయాము.

‘ఇక పోతే, చందమామలో వంద కథలు నావి ప్రచురించబడినా, ఫోటో వ్యాఖ్యల పోటీలో బహుమతి గెలుపొందక పోవడం ఇప్పటికీ నాకు అసంతృప్తిగానే ఉంటోంది’ అన్నారు. మీ బాధ చాలామంది చందమామ పాఠకుల, అభిమానుల బాధ. అప్పట్లో వందలాది పాఠకులు ఫోటో వ్యాఖ్యల పోటీకి ఉత్తరాలు పంపేవారు. అన్ని వ్యాఖ్యలనుంచి నెలకు ఒక వ్యాఖ్యను మాత్రమే ఎంపిక చేయవలసి రావడం ఎంత కష్టమైన పనో అప్పటి సంపాదకులకే తెలిసిన విషయం.

అడగ్గానే కథకులుగా చందమామతో మీ అనుభవాలు పంచుకున్నందుకు మనఃపూర్వక కృతజ్ఞతలు.

చందమామతో మీ అనుబంధం కలకాలం కొనసాగాలని కోరుకుంటున్నాము. మరి పాఠకుడిగా మీ అనుభవాలకోసం కూడా ఎదురు చూస్తుంటాము. పంపుతారు కదూ..!

చందమామ వెబ్‌సైట్‌లో కూడా మీ చందమామ జ్ఞాపకాలు ప్రచురిస్తున్నాము చూడండి.

మీ చందమామ జ్ఞాపకాలు పంవవలసిన చిరునామా

“Chandamama memories”

Chandamama India Limited
No.2 Ground Floor, Swathi Enclave
Door Nos.5 & 6 Amman Koil Street
Vadapalani, Chennai – 600026
Phone :  +91 44 43992828 Extn: 819

కింది ఈమెయిల్‌లో కూడా మీ చందమామ జ్ఞాపకాలు పంవవచ్చు
Email: Abhiprayam@chandamama.com

RTS Perm Link

జానపద లోకంలొ విహరింప చేసే జాబిలమ్మ మా ‘చందమామ’

September 24th, 2010

పసితనంలో చందమామను చూస్తూ ఆమ్మ చేతి గోరుముద్దలు తిన్న రోజులు, చిన్నతనంలొ చందమామ కథలు చదువుతూ హాయిగా గడిచిన అందమైన బాల్యాన్ని ఎవరైనా ఎప్పటికైనా మరువగలరా? నా చందమామ జ్ఞాపకాలను, అక్షర రూపంలొ రాయాలని అనిపించగానే, మనసంతా మధురమైన  బాల్యస్మృతులతొ  నిండిపోయింది.

నాలుగో తరగతి వేసవి శెలవులకు, మా మావయ్యవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మొట్టమొదటి సారిగా నేను చందమామలో ప్రచురితమైన తోకచుక్క ధారావాహిక బైండింగ్‌ను, మా మావయ్య చేతిలొ చూడడం జరిగింది. వాహ్..ఏమని చెప్పను…! మా మావయ్యని అడిగితే, నిర్మొహమాటంగా ఇవ్వను అని చెప్పి, వాళ్ళపిల్లల కంట కూడ పడకుండా భద్రంగా తన బీరువాలొ జాగ్రత్తగా పెట్టి, ఆఫీసుకి వెళ్లిపొయాడు.

అందమైన బైండింగ్‌ల రూపంలో మావయ్య సేకరణలొ వున్న, తోకచుక్క, కంచుకోట, ముగ్గురు మాంత్రికులు, జ్వాలాద్వీపం, మకరదేవత, పాతాళ దుర్గం, రామాయణం, మహాభారతం, దేవిభాగవతం ధారావాహికలన్నీ, నన్ను ఎంతగా ఆకర్షించాయో, మాటలలొ చెప్పలేను.

నేను మా అత్తయ్యను బ్రతిమాలి, మా మావయ్య ఆఫీసుకి వెళ్ళిన వెంటనే,ఒక్కొక్క సీరియల్ని తీసుకొని  చదవడం, మా మావయ్య ఆఫీసు నుంచి వచ్చే లోపు, మళ్లీ మా అత్తయ్యకి ఇచ్చేయడం, అలా వేసవి సెలవులు మొత్తం, మా మావయ్య సేకరించిన సీరియల్స్ అన్నీ చదివేయడం జరిగింది.

అసలు వేసవి సెలవులు రెండు నెలలు, ఎలా గడిచిపొయాయో, నాకు అర్ధం కాలేదు. దాసరి సుబ్రమణ్యం గారి అద్భుతమైన కధనంతొ కూడిన, ఆ జానపద సీరియల్స్‌ను చదువుతున్నంతసేపు, చిత్ర, శంకర్ గారి, బొమ్మలను  మంత్రముగ్దుడినై చూస్తూ, జానపద లోకంలొ విహరించడం, చందమామతొ నాకున్న ఒక అందమైన జ్ఞాపకం.

ఇంక మా వూరికి వచ్చిన తరువాత, చందమామ ఎలా చదవాలి అనుకుంటే, అప్పుడు తెలిసింది, మా వూరి గ్రామీణ గ్రంధాలయంలో వుంటుంది అని. తీరా గ్రంధాలయం వెళ్ళి చూస్తే, చందమామ ఎప్పుడూ ఎవరో ఒకరి చెతిలొ వుండేది. ఇంక లాభం లేదు అనుకొని, గ్రంధాలయం తలుపులు తెరవక ముందే వెళ్ళి, గ్రంధాలయం తలుపులు తెరిచిన వెంటనే లోపలకు వెళ్లి చందమామ పుస్తకాన్ని, విజయ గర్వంతో దక్కించుకున్న రోజులు ఇప్పటికీ  ఇంకా నాకు గుర్తు.

సరిగ్గా నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు, చందమామలోని, స్వాతంత్ర సమరానికి సంబంధించిన విషయాలన్ని క్రోడీకరించి, మా పాఠశాలలో వకృత్వ పొటీలలొ పాల్గొని, మొదటి బహుమతి గెలుచుకున్న రోజు, మరో అందమైన జ్ఞాపకం.

కొన్ని సంవత్సరాల తరువాత, మా మవయ్యను “మావయ్యా! ఇంత పెద్ద వాడివి అయ్యాక కూడ, ఇంకా చందమామని ఎందుకు చదువుతున్నావు ? ఇంకా చందమామని ఎందుకు అంత అపురూపంగా చూసుకుంటున్నావ్?” అని అడిగాను.

“చందమామ కథలన్నింటినీ జాగ్ర్తత్తగా, పరిశీలిస్తే,అన్ని కథల నేపధ్యం కూడా, ఆధునిక కాలం కాకుండా  పౌరాణిక, జానపద కాలమే. కల్మషం లేని మనుషులు,ఏ కథలోనైన ధర్మానిదే గెలుపు, న్యాయానిదే విజయం.రమణీయమైన ప్రకృతి, ముచ్చట గొలుపే జలపాతాలు,సెలయేర్లు, సుందరమైన అడవులు, ఆధునిక పోకడలు లేని, అలనాటి అందమైన కాలపు  వర్ణ చిత్రాలను చూస్తూ వుంటే, మనసంతా ఆహ్లాదకరంగా వుంటుంది. చందమామని చదువుతున్నంతసేపు, మళ్ళీ మన కళ్ళ ముందు, మన బాల్యం కదలాడదా,” అని మా మావయ్య సమాధానం ఇచ్చాడు. నిజమే కదా ! అక్షర సత్యమనిపించింది.

తెలుగు బాషపై మంచి పట్టు సాధించడానికి,  పురాణ ఇతిహాసాలపై, వివిధ దేశాల జాపపద కథలు, ముఖ్యంగా అరేబియా జానపద గాధలు సుపరిచయం కావడానికి, బేతాళ కథల ద్వారా తార్కిక జ్ఞానాన్ని పెంపొందించడానికి, చక్కని జీవితాన్ని గడపడానికి చందమామ ఎంతగానో, నాకు తోడ్పడింది.

అలనాటి చందమామలో, సంపూర్ణ భారత దేశ చరిత్ర, ప్రపంచ వింతలు, వివిధ దేశాల జానపద గాథలు, స్వాతంత్ర సమర ఘట్టాలు, స్వాతంత్ర సమర యెధుల జీవిత విశేషాలు, రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణ పురుషులు, పంచతంత్ర కథలు, అద్భుతమైన జానపద సీరియల్స్, వడ్డాది పాపయ్య, చిత్ర, శంకర్ గార్ల వర్ణచిత్రాలు, ఒకటేమిటి… ఆ రోజుల్లొని చందమామ, పిల్లలకే కాదు, పెద్దలకు కూడ ఒక విజ్ఞాన సర్వస్వం.

తెలుగు వారి వారసత్వ సంపద అయిన మహోజ్వల చందమామను, ఈనాడు చూస్తే, అలనాటి పాఠకులకు, మనస్తాపం కలగక మానదు. అర్ధం పర్ధం లేని అనునిర్వ ధారావాహిక, హాస్యాన్ని అపహాస్యం చేయడానికి వేస్తున్న హాస్య కథ. అస్సలు ఆసక్తి కలిగించని 2 కామిక్స్  ధారావాహికలు,4 పేజీల క్రీడా విశేషాలు, పంచతంత్రం, శిథిలాలయం వంటి ధారావాహికలను పునః ప్రచురిస్తున్నా, అలనాటి చిత్రాలవలే కాక, అస్సలు ఆకర్షణీయంగా వుండడం లేదు. అయినా చందమామపై, అభిమానాన్ని చంపుకోలేక,ఇప్పటికీ ప్రతీ నెలా కొంటునేవున్నా.

భారతీయ పత్రికల చరిత్రలోనే, ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ప్రారంభ సంచిక నుండి, 2000 సంవత్సరం వరకూ, అన్ని సంచికలను ఆన్‌లైన్‌లో వుంచడం ద్వారా, చందమామ మరోమారు తన ప్రత్యేకతను చాటుకుంది. అన్ని వర్గాల, అన్ని తరాల పాఠకులు మరోసారి తమ బాల్య స్మృతులను, గుర్తు చెసుకునే అవకాశం కలగడం నిజంగా మన అందరి అదృష్టం.ఈ బృహత్తర  కార్యక్రమాన్ని చేపట్టిన నేటి చందమామ యాజమాన్యపు నిర్ణయం నిజంగా అభినందనీయం.

చందమామ విషయంలో బాధాకరమైన విషయం ఏమిటి అంటే, చందమామ స్వరయుగపు రోజుల్లో, చందమామను కొని, భద్రపరుచుకొనే స్థితిలొ లేను. చందమామ కొనగలిగే స్థితిలొ వున్న ఈరొజుల్లో, చందమామ ఆ స్థితిలొ లేదు. ఏది ఏమైనా, చిన్నపిల్లల కథలు అనగానే చందమామ కథలు అనే పర్యాయపదం, భారతీయ జనమాధ్యమంలో స్థిరపడేటట్లు చేసిన చందమామ పత్రిక, త్వరలొనే పూర్వ వైభవంతో, దిన దిన ప్రవర్దమానమౌతూ మరింతగా బాలలకు చేరువ కావాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

శ్రీనివాస్ కొమ్మిరెడ్డి
బెంగళూరు
hai.nivas@gmail.com

కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు బెంగళూరులో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తూ ఉన్నారు. వయస్సు 34 ఏళ్లు. ఎన్నో రోజులుగా చందమామ జ్ఞాపకాలను రాసి పంపాలి అనుకుంటున్నా, పనుల ఒత్తిడి వల్ల వీలు కాలేదని ఇన్నాళ్లకి వీలు కుదిరిందని మెయిల్ చేశారు. అప్పటికీ, ఇప్పటికీ తనకు తీరని కోరిక ఒక్కటే, చందమామ పత్రిక అచ్చులో తన పేరు చూసుకోవాలని. ఆ కోరిక తీరే విధంగా త్వరలొనే మంచి కథలు రాసి పంపగలనని చెప్పారు. శ్రీనివాస్ గారూ, మీకు కూడా చందమామ తరపున స్వాగతం..!

మీరు పంపిన చందమామ జ్ఞాపకాలు “జానపద లొకంలొ విహరింప చేసే జాబిలమ్మ మా చందమామ”  హృద్యంగా ఉంది..

“చందమామ కథలన్నింటినీ జాగ్ర్తత్తగా, పరిశీలిస్తే, అన్ని కథల నేపధ్యం కూడా, ఆధునిక కాలం కాకుండా పౌరాణిక, జానపద కాలమే. కల్మషం లేని మనుషులు,ఏ కథలోనైనా ధర్మానిదే గెలుపు, న్యాయానిదే విజయం. రమణీయమైన ప్రకృతి, ముచ్చట గొలుపే జలపాతాలు,సెలయేర్లు, సుందరమైన అడవులు, ఆధునిక పోకడలు లేని, అలనాటి అందమైన కాలపు  వర్ణ చిత్రాలను చూస్తూ వుంటే, మనసంతా ఆహ్లాదకరంగా వుంటుంది. చందమామని చదువుతున్నంతసేపు, మళ్ళీ మన కళ్ళ ముందు, మన బాల్యం కదలాడదా,” అని మా మావయ్య సమాధానం ఇచ్చాడు.

మీ మామయ్యగారికి శత సహస్ర వందనాలు…

ప్రపంచమంతటా ఉన్న చందమామ అభిమానుల జ్ఞాపకాలను సేకరించి భావితరాల వారికి చందమామ వైభవోజ్యల గతాన్ని, జాతీయ సాంస్కృతిక రాయబారిగా అది చేసిన విశిష్ట సేవను శాశ్వతంగా అందించాలనే ఉద్దేశ్యంతో చందమామ జ్ఞాపకాలు శీర్షికను ప్రారంభించడమైంది.

అలాగే చందమామతో గతంలో, ప్రస్తుతం సంబంధంలో ఉన్న మీ మిత్రులకు, బంధువులకు కూడా చందమామ జ్ఞాపకాల గురించి తెలియజేసి వారి జ్ఞాపకాలను కూడా పంపవలసిందిగా కోరగలరు. ఇది పూర్తిగా చందమామ అభిమానులు, పాఠకులకు ఉద్దేశించిన శీర్షిక కాబట్టి, పరస్పర సమాచార పంపిణీతోనే వారి వారి జ్ఞాపకాలను సేకరించడం సాధ్యమవుతోంది

శ్రీనివాస్ గారూ, కోరకుండానే అందమైన చందమామ జ్ఞాపకాలు పంపినందుకు మనఃపూర్వక కృతజ్ఞతలు..
చందమామ.

మీ చందమామ జ్ఞాపకాలను పంపవలసిన ఈమెయిల్

abhiprayam@chandamama.com

rajasekhara.raju@chandamama.com

ఈమెయిల్, ఇంటర్నెట్ సౌకర్యం లేనివారు చందమామ చెన్నయ్ చిరునామాకు పోస్ట్ చేయగలరు.

Chandamama India Limited

No.2,  Ground Floor, Swathi Enclave

Door Nos.5 & 6 Amman Koil Street

Vadapalani, Chennai – 600026

Phone :  +91 44 43992828 Extn: 819

RTS Perm Link

చందమామ చదవడం ఒక సంస్కారం, ఒక సంస్కృతి

September 17th, 2010

ఏనాటి కథ?  ఓ యాభై  ఏళ్ళ నాటిది.  నెల్లూరులో మా పక్క ఇంట్లో ఏల్చూరి రామానుజం శెట్టి గారు ఉండేవారు. ఆయన  శ్రీ కృష్ణ రాయబారం చిత్ర నిర్మాత.  కావడానికి కమ్యునిష్టు అయినా వాళ్ళ ఇంట్లోని “సుశాంగి”(సుజాత- శాంతి- గిరీష్)  గృహ గ్రంధాలయంలో అన్ని రకాల పుస్తకాలూ ఉండేవి.

వాళ్ళ పిల్లల సంగతి ఎలా ఉన్నా నేనూ మా తమ్ముడూ అందులో దూరి పొద్దస్తమానం పుస్తకాల మధ్యనే గడిపే వాళ్ళం.

ముఖ్యంగా చందమామ బౌండ్ పుస్తకాలు మాకు ప్రధాన ఆకర్షణ. జ్వాలాద్వీపం, రాకాసిలోయ వంటి అద్భుత కథలు చదివి మైమరచి పోయేవాళ్ళం.

దాసరి సుబ్రహ్మణ్యం గారు

చందమామలో వచ్చిన ధారావాహికలన్నీ చదివానుగాని రాకాసి లోయ లాంటి కథ మాత్రం ఎక్కడా చదవలేదు. అది ఒక్కటీ ఒక ఎత్తు. దాన్ని సినిమా తీస్తే ఎలా వుంటుందో నని ఊహించు కునేవాళ్ళం.ఎవరికి ఏ వేషం ఇవ్వాలో ఏ లోకేషన్లలో తీయాలో ఆలోచిస్తుండే వాళ్ళం. దాన్ని కల్పన చేసిన రచయిత ఎవరో ఆనాడు మాకు తెలీదు. కాని అతడు సామాన్యుడు కాదని మాత్రం అర్థమైంది.

రామానుజం గారు చాలా స్ట్రిక్ట్. పుస్తకాలు ఇంటికి ఇచ్చేవారు కాదు. ఈ ఒక్క  బౌండ్ పుస్తకమూ ఇస్తే బాగుండు నని ఆశ పడేవాళ్ళం. చివరికి వాళ్ళ ఇల్లు అమ్మేసి అద్దె ఇంట్లోకి మారిపోయారు.

ఆ పుస్తకాలు ఏమయ్యాయోనని ప్రాణం విలవిలలాడి పోయింది! కాని ఆయన  మనస్సు కరగలేదు. పుస్తకాలు కొన్ని చెదలు పట్టాయట. కొన్ని వాళ్ళ పిల్లలు తీసుకెళ్ళి ఉండవచ్చు. ఏమైతేనేమి, నా రాకాసిలోయ దూరమైంది. ఆయన ఎప్పుడు గుర్తు వచ్చినా నన్ను మోసం చేశాడనే అనిపించేది.

కొన్ని దశాబ్దాలు గడిచాక  మిత్రుడు కంచనపల్లి కృష్ణారావు కర్నూలు నుండి ఫోన్ చేసి నీ రాకాసిలోయ మళ్ళీ చందమామలో వస్తోంది చూస్తున్నావా? అన్నాడు. ఎప్పటినుంచి? అని అడిగాను ఆత్రుతగా.  అయిదారునెలలనుంచి అన్నాడు. గుండె పగిలిపోయింది. తాజా సంచికనుండి కొనడం ప్రారంభించాను. పాతవి దొరికేదేలా? ఏజెంటును అడిగితే మద్రాసులో ట్రై చెయ్యమన్నాడు.

లాభంలేదని రావి కొండలరావు గారిని అడిగాను. పాపం ఆయన నాయందు దయతలిచి చందమామ ఆఫీసు వాళ్ళతో మాట్లాడారు. రెట్టింపు ధర చెల్లించాలని చెప్పారు. సరే అన్నాను. మనీఆర్డర్ పంపగానే పాత సంచికలు వచ్చేశాయి!

50 ఏళ్ల క్రితం ఇది ఓ చరిత్ర

అవి అన్నీ కలిపి బైండు చేయించాక నాకు ఏ భారత రత్న పురస్కారమో అందుకున్నంత గర్వంగా అనిపించింది. ఇప్పుడు నేను రాకాసిలోయ అధిపతిని! జాగ్రత్త!

స్పీలుబర్గులూ జార్జ్ లూకాసులూ ఎందుకు పనికొస్తారు దాసరి గారి కాల్పనిక శక్తి ముందు? చిత్ర గారి ఊహాశక్తి ముందు? ఇప్పటికైనా దాన్ని సినిమా తీయచ్చు. ఒక మగధీరను తలదన్నేలా. (రాజమౌళీ వింటున్నావా?) కాపీ రైట్ తీసుకోకుండా కాపీ కొట్టడమే మా రైట్ అనే దర్శకులు ఉన్నారిక్కడ.

చిన్నప్పుడు చందమామలో ఫోటో వ్యాఖ్యల పోటీకి పంపే వాళ్ళం. రెండుసార్లు బహుమతి వచ్చిన జ్ఞాపకం. పెద్దయినాక కూడా ఈ అభిరుచి పోలేదు. ఆంధ్రప్రభలో సబ్ఎడిటర్‌గా చేసే రోజుల్లో సైతం నేనూ కొప్పర్తి యజ్ఞన్నగారూ  దీనికి ప్రతినెలా పంపేవాళ్ళం. అదో సరదా. చాలా creative exercise.

1947 చందమామ తొలి ముఖచిత్రం

ఇక చందమామలో ఏనాటికైనా మన కథ పడితే చాలునని అల్లాడిపోయేవాడిని. చివరికి భారతిలోనైనా నా కవిత్వం ప్రచురించారుగాని చందమామలో నాకు చోటు దక్కలేదు. అంటే మన రచన అంత స్థాయిలో లేదని సరిపెట్టుకున్నాను.

కాలేజీలో నా సమకాలికుడు మాచిరాజు కామేశ్వరరావు కథలు ప్రతి నెలా చందమామలో వచ్చేవి. అతడిని కలిసి అభినందిద్దామని అతని కోసం చాలా ప్రయత్నం చేశాను. చివరికి అతను విజయవాడ లోనే ఉన్నాడని తెలిసిందిగాని కలవలేకపోయాను. అతనంటే నాకు గొప్ప admiration. చివరికి మా కంచనపల్లి కృష్ణారావు రాసిన చిన్న కథ ఈమధ్య చందమామలో వేశారు. అప్పటినుంచి నాకు అదోలా ఉంటోంది. అది ఈర్ష్యా?  ఏమో! చెప్పలేను. నేను సాధించలేనిది మా కిట్టూ సాధించాడు మరి!

చందమామ చదవడం ఒక సంస్కారం, ఒక సంస్కృతి. ఆ సంస్కృతిలో పెరిగినందుకు  గర్విద్దాము. దాసరిగారి రచనలు చదివామని, చిత్ర, శంకర్ గార్ల బొమ్మలు చూడగలిగామనీ పొంగిపోదాము. తెలుగు జాతి సంపద అయిన ఈ మహానుభావులను తగు రీతిలో గౌరవించుకోలేకపోయినందుకు మాత్రం తల వంచుకుందాము.
– ప్రసాద్ ఎం. వీ. ఎస్.

సరోజా ప్రసాద్ గారూ,

నిన్న -01-09-2010- ఫోన్‌లో మాట్లాడిన 24 గంటలలోపే మీ చందమామ జ్ఞాపకాలను హృదయంగమ రీతిలో పంపారు. అదీ ఒక విశిష్ట చరిత్రను తడిమారు. 1947నుంచి తెలుగు నేలమీద ప్రసరించిన ఒక మహత్తర భావ సంస్కారాన్ని, ఒక కమనీయ కథా సంస్కృతిని మళ్లీ మీరు అద్భుతంగా గుర్తు  చేశారు.

“స్పీలుబర్గులూ  జార్జ్ లూకాసులూ ఎందుకు పనికొస్తారు దాసరి గారి కాల్పనికశక్తిముందు?” తెలుగు కథకులు కాలరెత్తుకుని గర్వంగా తిరగగలగిన గొప్ప వ్యాఖ్య ఇది.

“చందమామ చదవడం ఒక సంస్కారం, ఒక సంస్కృతి. ఆ సంస్కృతిలో పెరిగినందుకు  గర్విద్దాము. దాసరిగారి రచనలు చదివామని, చిత్ర, శంకర్ గార్ల బొమ్మలు చూడగలిగామనీ పొంగిపోదాము. తెలుగు జాతి సంపద అయిన ఈ మహానుభావులను తగు రీతిలో గౌరవించుకోలేకపోయినందుకు మాత్రం తల వంచుకుందాము.”

నిజమే..తలవంచుకుందాం అనే మీ మాట ఎక్కడో చెళ్లున తగులుతోంది.

“ఇక చందమామలో ఏనాటికైనా మన కథ పడితే చాలునని అల్లాడిపోయేవాడిని”.

మీరు పంపనున్న కథలకు చందమామ సాదర స్వాగతం పలుకుతోంది. వాటికోసం ఎదురు చూస్తున్నాం. మీదే ఆలస్యం మరి.

దాదాపు చందమామలో వచ్చిన అన్ని సీరియళ్లను మీరు ఇప్పుడు ఆన్‌లైన్ చందమామలో ఆర్కైవ్స్‌ విభాగంలో చూడవచ్చు.
1947నుంచి 2000 వరకు అన్ని చందమామ కాపీలను ఆన్‌లైన్‌లో వివిధ భాషల్లో మీరు చూడవచ్చు.

మీ జీవిత కాల జ్ఞాపకాలలో సజీవంగా నిలిచి ఉంటున్న రాకాసిలోయ సీరియల్‌ను ఈ వారం నుంచి తెలుగు చందమామ వెబ్‌సైట్‌లో కూడా ప్రచురిస్తున్నాము చూడగలరు.

రాకాసిలోయ – 1

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=36&sbCId=94&stId=2473

మన:పూర్వక కృతజ్ఞతలతో

చందమామ

గమనిక: శ్రీ ఎంవీఎస్ ప్రసాద్ గారిని ఇవ్వాళ పరిచయం చేయవలసిన పనిలేదు. కానీ నెల క్రితం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో భారతీయ అపురూప చిత్ర సంగీత సేకర్త శ్రీ శ్యామ్ నారాయణ్ గారి విశిష్ట కృషిని ప్రపంచానికి పరిచయం చేసిన వారిగా ఆయనను గుర్తించుకుందాము.

ఇదే కథనాన్ని తెలుగు చందమామ వెబ్‌సైట్‌లో కూడా మరిన్ని చిత్రాలతో ప్రచురించటమైనది. కింది లింకులో చూడగలరు.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2472

RTS Perm Link

చందమామ – నాకు నిజంగా మామే !

September 9th, 2010

నాకు మేనమామలంటూ ఎవరూ లేరు. నాకున్నదల్లా ఒక్క చందమామ మాత్రమే. నాకు  చందమామతో ఉన్న అనుబంధం ఈ నాటిది కాదు. దాదాపు 60 ఏళ్లనాటిది. ఇప్పుడు నా వయస్సు49. అరె. అదేమిటి, 11 ఏళ్లు ఎక్కువగా చెబుతున్నానని  అనుకోవద్దు. నాకు 8,9 సంవత్సరాల వయస్సు నుండి చందమామను చదువుతున్నాను. అంటే  1969  ప్రాంతాలనుంచి.  అలనాటి జ్ఞాపకాలను ఈ నాటి పాఠకులతో పంచుకోవాలని అనిపించింది.

అయినా,  అసలు చందమామ గురించి  జ్ఞాపకం తెచ్చుకోవాలా?  చందమామ గురించి మర్చిపోతేగా, నా చందమామ నాతోనే ఉంది. అందులో కథలు ముఖ్యంగా బొమ్మలు.  అలనాటి బాపు, వపా, చిత్రా బొమ్మలు లేని చందమామను నేడు ఊహించుకొంటేనే ఎంత దిగులేస్తుందో.

చందమామ 1947 తొలి సంచిక చిత్రం

మా నాన్నగారు  బడి గ్రంథాలయానికి చందమామను తెప్పించేవారు. అంటే 1974 వరకు మా నాన్న ప్రధానోపాధ్యాయులుగా ఉన్నా అది మధ్యలోనే ఆగిపోయింది. అయినా అప్పట్లో  చందమామలు కొనే అవసరం ఉండేది కాదు. ఎవరో ఒకరింట్లో చదివేవాళ్లం. 1974 ప్రాంతానికి నేను 8వ తరగతికొచ్చాక పత్రికలు బాడుగకు ఇచ్చే అంగళ్లకు వెళ్లి  మరీ పాత సంచికలు తెచ్చి చదివేవాళ్లం. నా బాల్యమంతా తిరుపతిలోనే జరిగింది. రాములవారి గుడి దగ్గర ఒకాయన బాడుగకు పుస్తకాలిచ్చేవాడు. 10 పైసలు ఒక రోజు బాడుగ. అలా కొన్నాళ్లకు ఆయనతోనే కాక, భవానీనగర్ లో శ్రీనివాసులు అనే ఆయనతో కూడా పరిచయం పెరిగింది.

వీరినించి నాకు తెలిసిందేమిటంటే, వీరు పాత పత్రికలను అంటే 2 లేదూ3 నెలల తరవాత సగం రేటుకు అమ్మేసే వారు.  అంతే. ఈ విషయం తెలియగానే ఆ రెండు అంగళ్లపైనా దండయాత్ర చేసేసి వారిద్దరి దగ్గరా ఉండే పాత సంచికలన్నీ కొనేశా. ఇప్పటికీ గుర్తు. అట్టలు లేని పాత చందమామలో గుండుభీమన్న కథ. పరోపకారి పాపన్న కథ.  చందమామ దొరికితే  పట్టుకుని  ఇక నిత్య పారాయణ అన్నమాటే. తెరిచిన ప్రతిసారీ కొత్తగా కనిపించేది. ఒక సంచికను కనీసం 5, 6 సార్లైనా చదివితే గానీ తృప్తి ఉండేది కాదు.

అప్పట్లో, అంటే 60 దశకంలో ప్రతి ఏడాదీ కొన్ని ప్రత్యేక సంచికలు ఎక్కువ పేజీలతో వచ్చేవి. ఆ తరవాత ఆకారం, బరువు – రెండూ తగ్గిపోయాయి. నిజానికి, అప్పట్లో ఇంకా వ్రాయటం, చదవటంసరిగా రాకపోయినా, తెలుగు భాషలో ఉన్న చందమామ కథలను చదవటం, నాకు తెలుగు  భాషను నేర్చుకోడానికి ఎంతగానో ఉపకరించింది. తెలుగు తప్పులు లేకుండా వ్రాయటం అబ్బింది. అలాగే మంచి, మంచి వాడుక పదాలను కూడగట్టుకుని కొంతలో కొంత  భాష మీద పట్టు సంపాయించటానికి చందమామ దోహదపడిందనే చెప్పాలి. దీని వెనక  శ్రీ నాగిరెడ్డి, చక్రపాణి, కొ.కు. దాసరి సుబ్రహ్మణ్యం గార్ల  కృషి ఎనలేనిది.

రాతి రథం, యక్ష పర్వతం, మహాభారతం, రామాయణం, విచిత్ర కవలలూ, వినాయక కథ, జ్వాలా ద్వీపం, పంచతంత్ర కథలు – ఇలాటివి అన్ని సీరియల్స్  నేనే స్వయంగా బైండింగ్ నేర్చుకొని మరీ  చేసి నా లైబ్రరీలో  దాచాను. నా పిల్లలకు సైతం అలనాటి చందమామే  నేటికీ నేస్తం.  మా నాన్న గారు పరమపదించేదాకా  రోజూ ఆ బైండింగ్‌లతో కాలక్షేపం చేసేవారు.  ఎప్పటికప్పుడు ఈ ధారావాహికలు చదివినా అవి నిత్య నూతనంగా ఉంటాయి. దానికి, కథ, కథనం మాత్రమే కాదు చిత్రా గారి బొమ్మలూ కారణాలే.

చందమామలో వీరలక్ష్మి పెద్దక్కయ్య, గుండు భీమన్న,  పరోపకారి పాపన్న కథలు మాత్రం నాకు గుర్తు లేవు, ఇవి 1960 ముందు వచ్చాయి. అలాగే నవాబు నందిని, దుర్గేశ నందిని వంటి ధారావాహికలు కూడా. ఇవి మాత్రం ఎందుకో మళ్లీ పునర్ముద్రణ కాలేదు.

శ్రీ కొకు, శ్రీ దాసరి  గార్ల పేర్లు ఇపుడు వినవస్తున్నాయి గానీ అప్పట్లో చందమామ అంటే  శ్రీ నాగిరెడ్డి-చక్రపాణి మాత్రమే. అంత బ్రాండ్ ఇమేజి వారిద్దరిదీ. శ్రీ కొకు గారు అందించిన పౌరాణిక కథనాలు నిజంగా నాలో  దైవారాధనను పెంచాయి. నిజానికి నాస్తికులని ముద్రపడినవారే  దైవాన్ని  బాగా అధ్యయనం చేస్తారు. వారి సులభ శైలి కూడా ఎంతో చక్కని తెలుగును నేర్చుకొనే అవకాశాన్ని కలగజేసింది.

చందమామలో బొమ్మలు – ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. చిత్రా గారు ధారావాహికలకు, ఇతర కథలకు వేసిన బొమ్మలు, శంకర్ గారు వేసే  పురాణ ధారావాహికల బొమ్మలూ ధారావాహికల మొదటినుంచి చివరివరకూ ఒకేలాగ ఉండే పాత్రల బొమ్మలు అబ్బురపరచేవి.   అసలు ఆయా కథలు నిజంగా  జరిగాయా, వీరు సన్నివేశాలను చూసి మరీ చిత్రీకరించారా అన్నంత గొప్పగా ఉండేవి. నాలాటి వారికి  పురాణ కథలు సుపరిచయం కావటానికి కారణం – వీరి బొమ్మలే.

ఇక వడ్డాది పాపయ్యగారి బొమ్మల గురించి ఎంత చెప్పినా తక్కువే.  ఆయన వేసిన ముఖ చిత్రాలు, పౌరాణిక ధారావాహికలకు వేసిన చుత్రాలూ  చందమామకు ఎంతగానో వన్నె తెచ్చాయి. కొత్త చందమామను షాపువాళ్ళు వరుసగా పెట్టినప్పుడు, ఆ దుకాణానికే గొప్ప అలంకరణ చేసినట్టుగా ఉండేది. పాపయ్యగారు, అద్భుతమైన రంగుల మేళనింపు, అది ఆయనకి మాత్రమే సాధ్యమైన శైలి. తమ పార్వతీ కళ్యాణం, దక్షయజ్ఞం వంటి ధారావాహికలకు  వపా గారు వేసిన బొమ్మలు     – అంటే ఒరిజినల్ రేఖా చిత్రాలను నాకు స్వర్గీయ ఉత్పల సత్యనారాయణాచార్యులవారు   చూపారు.

నిజంగా  కావ్య రచనలో ఆయనొక మహర్షి అయితే, బొమ్మల విషయంలో వపాగారు ఒక బొమ్మర్షి.  ఈ బొమ్మలు మీకు ఎప్పటికైనా పనికొస్తాయి, దాయండని ఆనాడు చందమామ అధిపతి తమకిచ్చారని   శ్రీ ఉత్పల వారు నాతో చెబుతూ,  ”అవి నా ప్రాణం నాయనా, ఆ బొమ్మలు జాగ్రత్త !”  అనే వారు శ్రీ ఉత్పల వారు. వారి దగ్గరే  వారు రాసి చందమామ  ప్రచురించిన గంగావతరణం, శమంతకమణి వంటి రచనలను శ్రీ బాపు గారు వేసిన బొమ్మలతో  చూసి ఆశ్చర్యపోయాను.

ఎప్పటికైనా శ్రీ ఉత్పల వారి ఆ పుస్తకాలను బాలల కోసం రంగుల్లో వేయించాలని నా ఆశ.  అసలు  ఆ గంగావతరణం   శ్రీ ఉత్పల వారి గొంతులో ఆ రోజు నేను వింటూంటే,  గంగావతరణ సన్నివేశం నాకళ్ల ముందు అలాగే కనిపించింది. కాదు కాదు. శ్రీ బాపు గారు ఆ సన్నివేశాన్ని స్వయంగా  చూసి బొమ్మ గీశారేమేననిపించింది.

నా దురదృష్టం.  వారిని మళ్లీ కలిసి పాడించి రికార్డ్ చేయాలనుకొనేలోగానే  శ్రీ ఉత్పల గారు చందమామలో  ఆ అవ్వ దగ్గర కథలు వినడానికి వెళ్లి పోయారు. వారు మాటల్లో చెప్పగా నాకు తెలిసిందేమిటంటే, “ఆ రోజుల్లో  చందమామలో   ప్రచురించిన గంగావరణం, శమంతకమణి వంటి ధారావాహిక రచనలు విడిగా పుస్తకాలుగా చందమామే ప్రచురించేది. వాటికి అనూహ్యమైన స్పందన లభించేది కూడా”.   మరి ఆ సాంప్రదాయం ఎందుకు, ఎపుడు ఆగిపోయిందో అర్థం కాని విషయం.

1970 నించి నేను సేకరించిన సంచికలు ఇప్పటిదాకా అన్నీ ఉన్నాయి. కాకపోతే, 1990 దాకా సీరియల్స్ వేరేగా, కథలు వేరేగా బైండ్ చేసాను. ఆ రోజుల్లో చందమామ కోసం డబ్బులు సమకూర్చడం కూడా కష్టమైపోయేది. అయినా, ఇంటికొచ్చిన వారు  నాకిస్తూండిన రూపాయీ, ఐదు రూపాయలూ  సమయానికి నన్నాదుకొనేవి.  1975, 76 తరవాత ప్రతినెలా కొనడం మొదలెట్టాను. ప్రతి నెల ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం, చందమామ వచ్చే తేదీల ప్రకారం తిరుపతిలో చెంగారెడ్డి అనే ఆయన ఏజంటు – ఆయన అంగడికి వెళ్లి  కొనడం.  ఇలా 1987 దాకా కొనసాగింది.

1987లో ఉద్యోగ రీత్యా ఢిల్లీ వెళ్లా.  ప్రతి నెలా కన్నాట్ ప్లేస్ లో లేదంటే కరోల్ బాగ్‌లో  చందమామను చూడగానే  ప్రాణం లేచివచ్చేది.  అలా 11 ఏళ్లు ఢిల్లీలో చందమామనే కాదు, అనేక తెలుగు వార, మాస పత్రికలు కొని మా ఆఫీసులో  ఒక బుక్ క్లబ్ నెలకొలిపి, దానికి  అనుబంధంగా స్పందన అనే జిరాక్సు పత్రికనూ నడిపాను. స్పందన 1994లో ఆగిపోయింది. 1997లో హైదరాబాదుకు బదిలీ అయ్యాను.  మిగిలిన వార పత్రికలన్నిటినీ మానేసినా, చందమామను మాత్రం ఇప్పటికీ కొంటున్నాను. అదొక మరవలేని ఆనందమైన అనుభవం.

1980 దశకంలో చందమామ నాకు వాల్ట్ డిస్నీ కామిక్స్ ఆంగ్లంలో పరిచయం చేసింది. దాదాపు 3,4 ఏళ్లు వచ్చినట్టున్నాయి. అప్పట్లో దానికీ వార్షిక చందా కట్టి మరీ తెప్పించే వాడిని.  అదెందుకు ఆగిపోయిందో ఇప్పటికీ  అర్థం కాని విషయం. సంస్కతం  నేర్చుకోడానికి మా గురువుగారు  నా చేత సంస్కృతం చందమామ  కొనిపించారు. అన్ని సంచికలూ లేవు గానీ, విచిత్ర కవలలూ, ముగ్గురు మాంత్రికులూ మరి కొన్ని కథలూ మాత్ర బైండు చేయించి దాచుకొన్నా.

ఇటీవల చందమామ కార్పొరేటికరణ జరిగే సమయంలో కొద్ది రోజులు తొలి సంచికలు ఏ నెలకానెల పిడిఎఫ్  వర్షన్స్‌గా వెబ్ సైట్లో ఉంచినపుడు  ఓ వారం రోజులు ఓపిగ్గా  10 ఏళ్ల చందమామనూ డౌన్ లోడ్  చేసి దాచుకొన్నా. అదొక చక్కని అనుభూతి. కానీ ఏమైనా సరే. ప్రింట్  వర్షన్‌కు మించింది లేదు. ఆ పిడిఎఫ్ కాపీలను చదవాలంటే బద్దకం. కారణం – కంప్యూటర్ ఆన్ చేయాలి. కరెంట్ ఉండాలి. ఓపిగ్గా  మానిటర్‌కు కళ్లు అప్పగించాలి.  అవన్నీ అలా ఉంచితే, అన్ని సంచికలూ డౌన్ లోడింగుకు ఉంచితే  బావుంటుందన్నది నా ఆశ.

చందమామ కథలు నాకిచ్చిన చక్కటి ప్రవర్తనా సరళి, జీవితంలో ఎంతగానో ఉపకరించింది, హాయిగా బ్రతకటానికి అనువైన మార్గాన్ని ఎంచుకునే అలోచనా బలం కలిగింది. నేడు నన్నో రచయితగా నిలబెట్టింది. కానీ  అదే సమయంలో చందమామ బైండులను ఎవరైనా అడిగితే ఇచ్చేవాడిని కాక పోవడంతో పిసినారిగా, అడిగితే పుస్తకాలు ఇవ్వని వాడిగా ముద్ర వేసాయి.

ఇలా వ్రాసుకుంటూ పోతే చందమామ జ్ఞాపకాలు అనేకం.  మానవీయ విలువలను ఎత్తి చెప్పడం, పిల్లలలో చిన్నతనంనుంచీ నీతిని గురించి, మంచితనం గురించి, మతం, మానవత్వం – ఇలా పలు అంశాలగురించి నూరిపోయడంలో  సఫలీకృతమైంది చందమామ. పుస్తకంలేని గది ఆత్మలేని శరీరంలాటిదంటారు. చందమామ పత్రిక లేని ఇంటిని చూసినా,  శ్రీ  బాపు, వపా, చిత్రా గార్లు వేసిన బొమ్మలులేని నేటి చందమామను చూసినా అది అక్షరాలా నిజమనిపిస్తోంది.

Dr.వి.వి. రమణ

హైదరాబాద్

మీ చందమామ జ్ఞాపకాలు ఆద్యంతమూ బాగానే ఉన్నప్పటికీ కొన్ని మెరుపు వ్యాక్యాలు మీ కథనంలో అక్కడక్కడా పొందుపర్చారు. మచ్చుకు ఒకటి.
“కొకు గారు అందించిన పౌరాణిక కథనాలు నిజంగా నాలో  దైవారాధనను పెంచాయి. నిజానికి నాస్తికులని ముద్రపడినవారే  దైవాన్ని  బాగా అధ్యయనం చేస్తారు.” నాస్తికులకు ఈరోజు గొప్ప దినం అనుకుంటాను. పరమదైవ భక్తుడైన మీరు,  నాస్తికులే దైవాన్ని బాగా అధ్యయనం చేస్తారని కితాబివ్వడం మీ నిష్పాక్షిక వైఖరికి సంకేతం మాత్రమే కాదు. 1950, 60, 70 దశకాల్లో తెలుగు సాహిత్యంలో ప్రగతిశీల రచయితలందరూ భాష విషయంలో, సమాచార వ్యక్తీకరణ విషయంలో కొత్తపుంతలు తొక్కారన్నది చారిత్రక వాస్తవం కూడా. దీన్నే మీరు మరో రూపంలో చెప్పారు.

చివరగా..
చందమామ జ్ఞాపకాలు పంపినందుకు మరోసారి కృతజ్ఞతలతో..
రాజు.

RTS Perm Link

చందమామ ఒక పుస్తకం మాత్రమే కాదు…

September 3rd, 2010

మా చందమామ ఒక పుస్తకం మాత్రమే కాదు .. మా జీవితంలో భాగం, చెరపలేని ఓ మధురానుభూతి

నాకు ఊహ తెలిసి దాదాపు ఎనభయ్యో దశకం మొదట్లో అలవాటు అయ్యిందనుకుంటాను. మా నాన్నగారు తెచ్చి ఇచ్చేవారు. మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం వల్ల అప్పుడప్పుడు తెచ్చేవారు కాదు, కానీ విజయవాడలోని సత్యన్నారాయణ పురంలో ఓ పురాతన గ్రంధాలయం వారు ఈ పుస్తకాలను నలుగురికి అందుబాటులో ఉంచేవారు. మా నాన్నగారు కొనని పక్షంలో మేము అక్కడికి వెళ్ళి చదివే వాళ్ళం.

మేము ఇద్దరు అన్నదమ్ములం, నేను చిన్నవాడిని. అన్నయ్య పేరు విజయ శ్యామ కుమార్. ముద్దుగా అందరూ శ్యామూ అనే వారు. మా నాన్న గారు చందమామ తెచ్చినప్పుడల్లా మేము అన్నింటికన్నా ముందుగా చివరి పేజీలో వచ్చే రాముశ్యాముల చిత్ర కధలను చదివి ఆనందించే వారము.. అలా ఎంతకాలం గడిచిందో తెలియదు కాని ఓ సంచికనుంచి ఆ చిత్ర కధలను ఆపి వేశారు. మేము చాలా భాద పడ్డాము. మా చుట్టాలు అందరూ మమ్మల్ని రాము శ్యాము గానే పలకరించే వారంటే అది అతిశయోక్తి కాదేమో. ఇలా చందమామ మా జీవితంలో ఓ వీడలేని అనుభూతిగా మిగిలి పోయిందంటే మీరు నమ్మరు. వీలైతే అలాంటిదేదైనా తిరిగి ప్రారంభించ మనవి.

అలాగే పైన చెప్పినట్టు ఆర్థిక పరిస్తితి కారణంగా ఒకటే చందమామని ఇద్దరం ఒక్కసారే చదవాల్సి వచ్చినప్పుడు ఇద్దరం ఒక అంగీకారానికి వచ్చేవాళ్ళం, “ప్రక్కప్రక్కనే కూర్చుని చదువుదాం, ఒక వేళ నేను ఈ పేజీ చదవడం పూర్తి అయిపోతే మరో పేజీని కొద్దిగా తీసి ఉంచు నేను అవతలి పేజీలో చదువుకుంటూ ఉంటాను నువ్వు ఇవతలి పేజీలోది చదువుకో” అని ఇద్దరం ఓరకమైన రాజీకి వచ్చేవాళ్ళం.

అవన్ని మధురానుభూతులుగా మిగిలిపోయ్యాయి. “పండక్కి ఏమి కావాలిరా పిల్లలూ” అని మా నాన్నగారు అడిగితే ”చందమామ కావాలి” అని ఎన్ని సార్లు పేచీ పెట్టామో మీకు తెలియదు. ఒక వేళ చందమామని కొనిస్తాం మరింకేం కావాలంటే మరో చందమామ అనే వాళ్లమే కాని మరింకేం కావాలనే వాళ్ళం కాదంటే మీరు నమ్ముతారా. అప్పట్లో మా మట్టి బుర్రకి చందమామ నెలకు ఒకసారే వస్తుందంటే అర్థం అయ్యేది కాదు.

ఉద్యోగంలో పెద్దవాళ్ళం అయ్యాం.. సమాజంలో ఓ స్థాయి వచ్చింది.. స్థాయికి అనుగుణంగా కొంచం గంభీరంగా బ్రతకాలి.. బ్లా.. బ్లా.. (అంటే వగైరా వగైరా అన్నమాట)  అన్న ముసుగులో బ్రతికేస్తున్న నాలాంటి వాళ్ళకు ఆ జ్ఞాపకాలే అమృత ధారలు. అలాంటి అమృతాన్ని అందించిన చందమామ నిజంగా ఈ తరానికే కాకమోయినా ఏతరానికైనా ఒక చక్కని బహుమతే అని నా అభిప్రాయం. మీరు ఇలాగే పది కాలాలపాటు పచ్చగా వర్ధిల్లుతూ ఉండాలనేది నా ప్రార్ధన.

అలాగే పాత పుస్తకాలను మీరు కొంచం హై రిజల్యూషన్ తో స్కాన్ చేస్తే బాగుంటుందని నా మనవి. కొన్ని కొన్ని సార్లు పాత కధలు చదువుదాం అనుకుంటే కుదరటం లేదు. ఏది ఏమైనా ఓ మంచి సంకల్పానికి నాంది పలికిన ఈ చందమామ ప్రారంభకులకు మరియు ఇప్పటిదాకా ఈ సంచికను నడిపిస్తూ ముందుకు తీసుకు వెళుతున్న తరతరాల యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ధన్య జీవులు మీరు.

Regards,
చక్రవర్తి । Chakravarthy

శ్రీ చక్రవర్తి గారికి,
“మా చందమామ ఒక పుస్తకం మాత్రమే కాదు .. మా జీవితంలో భాగం, చెరపలేని ఓ మధురానుభూతి” అంటూ మీరు పంపిన అభిప్రాయ లేఖ హృద్యంగా ఉంది. రామూ శ్యాము మొదలుకుని చందమామ గతంలో ప్రవేశపెట్టిన మంచి శీర్షికలు కొన్ని ఇప్పుడు కొనసాగలేదు. కాలానుగణంగా, వనరుల పరంగా ఆచరణ సాధ్యం కాని వాటిని తీసివేయడం అప్పుడూ ఇప్పుడూ జరుగుతూనే ఉంది. పాఠకులు, అభిమానులు ఇలాంటి నిలిపివేతల పట్ల ఎంత అసంతృప్తి వ్యక్తం చేసినా  ఈ రకం మార్పులు తప్పటం లేదు.

ఉదాహరణకు గత 60 ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా కొనసాగిన ఫోటో వ్యాఖ్యల పోటీ ఈ జూలై సంచిక నుంచి ఆగిపోయింది. కారణం తాజా ఫోటోలు పంపించడంలో ఫోటో సేకర్తలలో ఆసక్తి సన్నగిల్లడం. దీంతో పాత ఫోటోలనే వేయవలసి వచ్చేది. ఇది సరైంది కాదని భావించడంతో దీన్నికూడా తీసివేశారు. మనకు ఇష్టం లేకపోయినా కొన్ని సంప్రదాయాలు చందమామకు దూరమవుతున్నాయి. తప్పదు.

మీరు రాము-శ్యాము తోపాటు చందమామను మీ చిన్నతనంలో అన్నదమ్ములు ఇద్దరూ ఎలా పంచుకుని చదువుతూ వచ్చారో చదువుతుంటే మాకూ మా బాల్యం తటిల్లున మెరిసింది. మేం నాలుగు  కుటుంబాలకు చెందిన 16 మంది పిల్లలం. అన్నతమ్ముళ్లు, అక్కా చెల్లెళ్లు అందరం పల్లెలో ఉండి చదువుకుంటూ ఉంటున్నప్పుడు 1970ల మొదట్లో పండువెన్నెలలాగా చందమామ పరిచయమయ్యింది.

అప్పటినుంచి ఓ ఆరేడేళ్ల కాలం మా అందరి బాల్యం చందమామ జ్ఞాపకాలతోటే గడిచిపోయింది. ఇంతమంది పిల్లలకూ, పెద్దలకూ కూడా టౌన్ నుంచి తెచ్చే ఒకే చందమామ ఆధారం కావడంతో వారంరోజుల పాటు చందమామ కనబడేది కాదు. ఎవరు చదువుతున్నారో, ఎవరు తీసుకెళుతున్నారో తెలిసేది కాదు. అందుకే ఫలాని వారి వద్ద చందమామ ఉందని తెలిస్తే చాలు… పోటీలు పడి ఒప్పందాలు చేసుకునేవాళ్లం. నీ తర్వాత నాకే ఇవ్వాలి అంటూ.

అదీ కుదరకపోతే రాత్రి పూట పొలాలకు నీళ్లు మలిపేటప్పుడు -నలభై ఏళ్లకు ముందు కూడా కరెంటు కోతలు పల్లెల్లో ఇలాగే ఉండేవి- టార్చి లైటు వెలుతురులో ఒక కయ్యనుంచి మరో కయ్యకు నీళ్లు మలిపేటప్పుడు దొరికే విరామ కాలంలో లైటు వేసుకుని మరీ చందమామను ఆబగా చదువుతూ ఆనందించేవారం. నెలరోజులు రావలసిన బ్యాటరీలు 15 రోజులకే అయిపోతే ఇంట్లో పెద్దలు తిట్టేవారు. “బ్యాటరీలను తింటున్నారట్రా. ఇంతత్వరగా కాలిపోతున్నాయి” అని. “మాకేం తెలుసు.. మడికి నీళ్లు కట్టేందుకోసమే లైటు తీసుకెళుతున్నాం” అని వాదించేవాళ్లం. ఇలా చందమామను రాత్రిపూట లైటు వేసుకుని మరీ చదవాల్సి రావడంతో ఆ ఆలవాటు తర్వాత ప్రతి పుస్తకాన్ని వినూత్న రూపంలో చదివేలా మాకు నేర్పింది.

పశువులను మేపడానికి వెళ్లినప్పుడు, పంటపొలాలను కాపలా కాయడానికి వెళ్లినప్పుడు, ఆడుకోవడానికి వెళ్లినప్పుడు. ఒక ఊరి నుంచి మరో ఊరికి ప్రయాణించవలసి వచ్చినప్పడు, ఊరికి దూరంగా ఉన్న పొలాలు, చేల వద్దకు వెళుతున్నప్పుడు నడకలో కూడా ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ పోవడం అనే అలవాటు మాకు చందమామ వల్లే అబ్బింది. ఇది ఎంతగా అలవాటయ్యిందంటే 35 సంవత్సరాల తర్వాత అదే చందమామ ఆఫీసులో పని చేసే అవకాశం వచ్చినప్పుడు కూడా ఉదయం పూట, సాయంత్రం పూట బస్సులో వెళుతున్నప్పుడు కూడా ఏదో ఒక పుస్తకం చదువుతూ పోయే అలవాటు కొనసాగుతూనే ఉంది.

ప్రతి కుటుంబమూ చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు వంటి పుస్తకాలను విడిగా కొనలేని ఆర్థిక పరిస్థితుల కారణంగానే, ఒకరు తెస్తే అందరూ చదువుకోవడం అనేది మాకు అప్పట్లో అలవాటయ్యింది. పైగా పల్లెలు కాబట్టి మాకు లైబ్రరీలు అంటూ ఉండేవి కావు. ఈ రోజు మా పల్లెలోంచి దాదాపు 40 మంది పైగా ఉన్నత చదువుల భాగ్యంతో అమెరికా, తదితర దేశాలకు వలసలు వెళ్లిపోయినా, ఈనాటికీ మా పల్లెకు లైబ్రరీ లేదు. దాదాపు దేశంలోని పల్లెలన్నింటి పరిస్థితి ఇంతేనేమో.

మీరు ఆన్‌లైన్‌లో చందమామను చూస్తున్నప్పుడు చదవడానికి కూడా వీలు లేనంతగా స్కానింగ్ పాడయి ఉంటే వెంటనే

abhiprayam@chandamama.com

లేదా

rajasekhara.raju@chandamama.com
ఈమెయిల్స్‌కి ఆ విషయం తెలుపుతూ సమాచారం పంపితే సాధ్యమయినంత త్వరలో మళ్లీ కొత్తగా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయగలము.
చాలా మంది పాఠకులు ఇలా పేజీలు చిరిగాయనో, సరిగా కనిపించలేదనో రిపోర్ట్ చేస్తే గతంలోనూ చర్యలు చేపట్టాము. కాబట్టి మీరు కూడా సూచనలు పంపితే తప్పక పరిహరించగలము. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉన్న 53 ఏళ్ల చందమామలను మళ్లీ సరిచూడటం, సరిచేయడం వంటి పనులకు మావద్ద వనరులు తగినంతగా లేవు కాబట్టే ఆన్‌లైన్ చందమామ పాఠకుల సహాయం ఈ విషయంలో చాలా అవసరం.

అలాగే మీరు ఈ లేఖలో పంపిన మీ జ్ఞాపకాలను ఆన్లైన్ తెలుగు చందమామలో, చందమామ బ్లాగులో మీ చందమామ జ్ఞాపకాలు పేరిట ప్రచురించగలము. మీకు అభ్యంతరం లేనట్లయితే మీ సమ్మతి తెలుపుతూ మీ ఫోటో, మీ సోదరుడి పోటో – కలిపి గాని లేదా విడిగా గాని- కూడా స్కాన్ చేసి పైన తెలిపిన ఈమెయిల్ చిరునామాలకు పంపండి. వచ్చే శుక్రవారం మీ చందమామ జ్ఞాపకాలను పై రెండు సైట్లలోనూ ప్రచురిస్తాము. మీ చందమామ జ్ఞాపకాలను మరింత వివరంగా పొడిగించి పంపాలనుకుంటే అలా కూడా చేయండి.

ఇంతవరకు దేశ దేశాలలో ఉన్న చందమామ పాఠకులు, అభిమానులు దాదాపు 40 మంది తమ చందమామ జ్ఞాపకాలను పంపారు. వారి జ్ఞాపకాలు కింది లింకులో మీరు చూడవచ్చు.

http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

మీరే కాకుండా అమెరికాలో మీకు తెలిసిన చందమామ అభిమానులు, పాఠకులు, ముఖ్యంగా పిల్లలున్న తల్లులకు అవకాశముంటే ఈ విషయం మీరు తెలియజేసి వారి చందమామ జ్ఞాపకాలను కూడా రాసి, టైప్ చేసి, స్కాన్ చేసి పంపమనండి. తెలుగు టైపింగ్ రాదనుకుంటే ఇంగ్లీషులో లెటర్ రూపంలో ఈ మెయిల్ చేసినా చాలు. లేదా తెలుగులో రాసి స్కాన్ చేసి పంపినా సరే. లేదా ట్రాన్స్‌లిటరేషన్ రూపంలో రోమన్ ఇంగ్లీషులో రాసి టైప్ చేసి పంపినా సరే,.. వాటిని మేము వారి పోటోలు లేదా వారి పిల్లల పోటోలతో పాటు ప్రచురించగలము.

జీవితంకోసం విదేశాలకు వలసవెళ్లిన చందమామ అభిమానులతో కూడా నిత్య సంబంధాలు కలిగి ఉండాలన్నదే చందమామ ఆకాంక్ష. మీరు మీకు తెలిసిన చందమామ అభిమానులకు ఈ విషయం తెలియజేయండి.

అలాగే చందమామకు కథలు -1, 2, 3, 4 పేజీల కథలు, బేతాళ కథలు రాసి పంపగలవారు ఉంటే వారికి చందమామ తరపున సాదర స్వాగతం పలుకుతున్నాం. ఇప్పటికే గోదావరి లలితగారు (telugu4kids.com) ఆదూరు హైమవతి గారు కూడా తమ కథలు చందమామకు అమెరికా నుంచే పంపారు. కొన్ని ప్రచురణకు తీసుకున్నాము కూడా.

అమెరికాలోని తెలుగు చందమామ అభిమానులు, పాఠకులు తమ చందమామ జ్ఞాపకాలు, స్వీయరచనలు చందమామకు పంపించాలని మేం మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. మీరు మీ పరిధిలో ఉన్న మిత్రులకు, పరిచయస్తులకు వీలైనంతమందికి ఈవిషయం తెలియజేయగలరు.
ముందుగా మీ ఇద్దరి సోదరుల ఫోటోలు కాని, లేదంటే మీ ఫోటో కాని పంపుతూ మీ జ్ఞాపకాల ప్రచురణకు సమ్మతి తెలుపుతూ ఈమెయిల్ చేయగలరు.

అలాగే గత రెండు సంవత్సరాలుగా చందమామ తరపున కొన్ని మంచి ప్రచురణలు వచ్చాయి. ప్రీమియం క్వాలిటీ కావడంతో కాస్త ధర ఎక్కువగా ఉంటుంది కాని జీవిత కాలం చందమామ అభిమానులు దాచుకోవలసిన మంచి పుస్తకాలు. ఆర్థిక లేమినుంచి కాస్త బయపడి ఉంటారు కనుకు మీరు కూడా వీలయితే, ఆసక్తి ఉంటే చందమామ ప్రచురణలను తీసుకోగలరు.

1.  Chandamama Collector’s Book – 60 సంవత్సరాల ప్రత్యేక కథల సంచిక
2. Chandamama Ramayanam – సంపూర్ణ రంగుల కార్టూన్ పుస్తకం
3. Chandamama Art Book – చందమామ చిత్ర మాంత్రికులు చిత్రా, ఎంటీవీ ఆచార్య, శంకర్, వపా చిత్రించిన 400 వర్ణచిత్రాల పుస్తకం 1,2 భాగాలు

చందమామ సంప్రదాయానికి తగినట్లుగా ఈ పుస్తకాలలో ప్రతి పేజీలో వర్ణచిత్రాలతో ప్రచురించారు. పై రెండు పుస్తకాలు డిస్కౌంట్ తో రూ.800ల లోపు వెలతో ఇస్తున్నారు.

చివరిదైన ఆర్ట్ బుక్ 2010లో ప్రచురించిన తాజా పుస్తకం. కోట్లాది భారతీయ పాఠకులను గత 60 ఏళ్లుగా జానపద, పౌరాణిక, కాల్పనిక కథా చిత్ర మంత్ర జగత్తులో విహరింపజేస్తూ వచ్చిన చందమామ చిత్ర మాంత్రికులు చిత్రా, ఎంటీవీ ఆచార్య, శంకర్, వపా గార్లు గీసిన 400 మేటి వర్ణచిత్రాల సంకలనం ఈ పుస్తకం. నిస్సందేహంగా చందమామ నుంచి వచ్చిన ప్రచురణలలో ఇదొక మాస్టర్ పీస్. A4 కంటే పెద్ద సైజులో పూర్తి పేజీలో ఒక వర్ణచిత్రాన్ని పొందుపర్చిన ఈ రెండు భాగాల పుస్తకం చందమామ చిత్రప్రపంచం గురించి తెలిసిన పాఠకులు, అభిమానులకు కన్నుల విందు అని చెప్పడం అతిశయోక్తి కాదు.

400 పేజీలతో (Size: 9.5 x 12.5 inch) కూడిన ఈ రెండు భాగాల పుస్తకం వెల స్వదేశంలో Rs.1500. -ప్రీమియం క్వాలిటీతో ప్రచురిస్తున్నారు కాబట్టి చందమామ సంకలనాల ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి కాని. జీవితకాలం దాచుకోదగిన మంచి పుస్తకాలు అనడంలో సందేహం లేదు. మీరు ఆసక్తి ఉంటే ఆర్ట్ బుక్ వివరాలకోసం chandamama.com హోమ్ పేజీలోని Art Book యాడ్ చూడండి.

http://www.chandamama.com/artbook/

దాని ధరవరలు, ఎలా తెప్పించుకోవాలి అనే విషయాలు వివరంగా పై లింకులో పొందువర్చారు. అమెరికాకు దీన్ని తెప్పించుకోవాలంటే పోస్టేజీతో పాటు 60 డాలర్లు అవుతుంది.

నిస్సందేహంగా చందమామ ప్రీమియం క్వాలిటీ ప్రచురణలు మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకుని చేస్తున్నవి కావు. ఆసక్తి కలిగిన అధికాదాయ వర్గాల ప్రజలు మాత్రమే వీటిని కొనగలరు.
అందుకే అధిక ధర ఉన్నప్పటికీ ఆసక్తి కలిగిన, కొనగలిగిన పాఠకులకు మాత్రమే ఈ పుస్తకాలను సిఫార్సు చేస్తున్నాము.

Chandamama India Ltd.
No.2 Ground Floor,
Swathi Enclave,
Door Nos.5 & 6
Amman Koil Street,
Vadapalani,
Chennai- 600026.
Phone No: 044 43992828 Ext. 819

RTS Perm Link

చందమామ : అమ్మ జ్ఞాపకాలు

August 20th, 2010

అక్షరాల రుచి చూపించిన అమ్మ, కళల పట్ల కూడా అభిరుచి పెంపొందేలా నన్ను పెంచింది. చాలా ఏళ్ల వరకు సంతానం కలగని మా పెద్దమామయ్య సంరక్షణలో తాతగారింట పెరిగాన్నేను. నాన్న ఉద్యోగ రీత్యా కలకత్తాలో ఉండేవారు. వేసవి సెలవుల్లో స్నేహితులంతా తాతగారిళ్లకు వెళ్తుంటే నేను మాత్రం అమ్మా, నాన్న దగ్గరికి వెళ్తుండేవాణ్ణి.

వేసవి సెలవుల రెండు నెలల్లో కూడబెట్టిన జ్ఞాపకాలు మూటగట్టుకుని మళ్లీ వేసవి వరకూ అవే జ్ఞాపకాలతో గడిపేవాణ్ణి. సెలవులు ముగిశాక, అమ్మనీ, నాన్ననీ వీడి తాతగారింటికి తిరుగు ప్రయాణమయ్యేటపుడు ఆ చిన్నతనంలో నేననుభవించిన మనోవేదన నాకింకా గుర్తే.

తాతగారింట్లో హద్దుమీరిన ముద్దువల్ల అల్లరి అంచులు దాటిన నాకు క్రమశిక్షణ నేర్పించింది అమ్మే, కిటికీ గుండా వెన్నెల కిరణాలు పడుతుంటే, నిద్రపోయేముందు సుద్దులు చెబుతూ, చక్కని పాటలు పాడుతూ, మంచి మంచి కథలు చెబుతూ బలమైన వ్యక్తిత్వానికి పునాది వేసింది అమ్మ.

అమ్మ ఏకసంధాగ్రాహి. ఎక్కడ ఏ శ్లోకాలు, పాటలు చదివినా, విన్నా చక్కగా గుర్తుపెట్టుకునేది. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టడం, పెద్ద చదువులు చదువుకోలేకపోవడం వంటి ప్రతిబంధకాల వలన ఆమె ప్రతిభ ఇంటి నాలుగ్గోడలకే పరిమితమైపోయింది. మిక్కిలి ఆత్మగౌరవం, నిజాన్ని నిర్భయంగా వెల్లడించడం, తెగువ, ధైర్య సాహసాలు, ఆమె విశిష్ట వ్యక్తిత్వానికి నిదర్శనాలు.

తొమ్మిదో తరగతికి వచ్చాక మళ్లీ అమ్మ సంరక్షణలోకి పూర్తిగా వచ్చాను. ఇంట్లో ఆడపిల్లలు లేని కారణంగా అమ్మకి వంటింట్లోనూ, ఇంటి పనుల్లోనూ సహాయం చేస్తుండటం వల్ల సొంతంగా పనులు చేసుకునే అలవాటు అబ్బింది. తర్వాతి రోజుల్లో ఎయిర్‌ఫోర్స్‌లో చేరాక ఆ శిక్షణ ఎంతో ఉపకరించింది.

హైస్కూలు రోజుల్లో అమ్మకోసం లైబ్రరీ నుండి పక్కటౌన్ సోంపేట కాలేజీకి వెళ్లే రోజుల్లో మధ్యాహ్నం భోజనానికి అమ్మ డబ్బులిస్తే (కాలేజీకి క్యారేజీ మోసుకెళ్లడం నామోషీగా భావించడం వల్ల) ఆ డబ్బులతో పత్రికలు కొనేసి, రోజంతా ఆకలితో గడిపేసే వాణ్ణి. అందుకే చందమామకి నేను రాసే కథల్లో ‘కంచిలి’, ‘సోంపేట’ పేర్లు కలిసి వచ్చేలా ‘కంచిపేట’ అనే ఊహాజనిత పట్టణాన్ని సృష్టించుకున్నాను.

అమ్మకు దగ్గరయ్యానని సంబరపడుతున్న సమయంలోనే, చిన్నతనంలోనే ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం రావడంతో మళ్లీ అమ్మకు దూరమవ్వాల్సి వచ్చింది. ట్రైనింగ్‌లో ఉండగా ప్రతిరోజూ ఓ ఉత్తరం రాసి పైన సీరియల్ నెంబర్ వేసి మరీ పోస్ట్ చేసేవాణ్ణి. నా ఉత్తరం కోసం పిచ్చిదాన్లా ఎదురుచూసేది అమ్మ. మళ్లీ తర్వాతి ఉత్తరం అందేవరకు పదే పదే ఆ ఉత్తరాన్ని చదువుకునేది. నారాక గూర్చి ముందుగా తెలిశాక ఆ తేదీ కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూసేది.

అమ్మతో నాది చాలా ప్రత్యేకమైన అనుబంధం. బహుశా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అలానే అనుకుంటూ ఉండవచ్చు. తనకు ఇరవై ఏళ్ల వయసులో జన్మించాన్నేను. సముద్రంలా ఎప్పుడూ గంభీరంగా ఉండే నాన్న పడ్డ కష్టాలు అమ్మ అప్పుడప్పుడూ కథల్లాగా చెప్పడం వల్ల నాన్న మొదటినుంచి నాకు రోల్ మోడల్ అయ్యారు.

మూడేళ్ల క్రితం అమ్మకి తన 49వ ఏట అండాశయ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కొన్ని రోజుల పాటు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను. కేన్సర్ పేరు వింటేనే కృంగిపోతారని ఇంట్లో ఎవరికీ ఈ విషయం తెలయబర్చలేదు. అప్పుడే దృఢంగా నిశ్చయించుకున్నాను. ‘నా లక్ష్యం అమ్మని బతికించుకోవాలి’. చాలా దీనావస్థలో అమ్మని నాతో బాటు అంబాలా (హర్యానా)కుతీసుకువచ్చాను.

అమ్మ ధైర్యం, తెగువ కలది కనుక చికిత్స మొదట్లో సానుకూల ఫలితాన్ని ఇచ్చింది. ఆ తొలిరోజుల్లో నేను అక్షరాలా ప్రపంచాన్ని మరిచిపోయాను. ఆ సమయంలోనే గర్భవతి అయిన నా భార్యని కూడా అంతగా పట్టించుకోలేకపోయేవాణ్ణి.

అప్పుడే నాకు కుటుంబంలో ప్రేమ, అప్యాయత, అనుబంధాల విలువ తెలిసింది. అమ్మ, నాన్న, నేను, నా భార్య.. మా నలుగురం ఒక ప్రపంచంలో జీవించాము. అమ్మని ఒక గాజుబొమ్మలా చూసుకున్నాను.

నా భార్య ప్రసవం వరకూ బతికనా చాలనుకున్న అమ్మ చక్కగా తేరుకుని, నాకు బాబు పుట్టేవరకూ ఉండి, వాణ్ణి చూసుకుని మురిసిపోయింది. ఇలా ఈ మూడేళ్ల కాలం –  జీవితకాలపు అనుభవాలను నేర్పింది. మా నలుగురి మధ్యా బంధం గాఢత పెరిగింది. ఇన్నాళ్లూ ఒంటరిగా ఉన్న నాకు కుటుంబ విలువల మాధుర్యం తెలిసింది.

ఇంకా ఎన్నో భవిష్యత్ ప్రణాళికలు, ఆశలు, ఊహలు, అమ్మ, నాన్న, నేను చిన్ని (నా భార్య) కూర్చుని చర్చించుకునేవాళ్లం. నా అత్యాశ దేవుడికి నచ్చలేదేమో! అమ్మని నాకు అర్థంతరంగా దూరం చేశాడు. అమ్మ ఆరోగ్యం నయమైందని ఎందరు దేవుళ్లకు ఎంతగా మొక్కానో అందరూ కలిసి నన్ను మోసం చేసినట్లనిపించింది. అమ్మ మరి నాతో లేదన్న తలంపు నిత్యం గుండెని పిండేస్తోంది.

పత్రికల్లో నా కవితలూ, కథలూ (విశేషించి ‘చందమామ’లో) అచ్చయినప్పుడల్లా ఉబ్బి, తబ్బిబ్బయిపోయే మా అమ్మ పేరు చంద్రకళ. ఇంట్లో నా ముద్దు పేరు చందు. చనిపోవడానికి ఒకరోజు ముందు చందు బాబూ అని నవ్వుతూ పిల్చిన అమ్మ నా చేతుల్లోనే చివరి శ్వాస విడిచి, శాశ్వతంగా దూరమైంది.

ఆమె ఆలోచనలతో ప్రేరేపితుడినై నేను చేసే ప్రతి పనికీ ఎంతో ప్రోత్సహించే అమృతమూర్తి, నా ప్రతి విజయానికీ ఎంతో మురిసిపోయే మా అమ్మ భౌతికంగా దూరమైనా, మానసికంగా నాతోనే, నాలోనే ఉంది. త్యాగాలమయమైన ఆమె జీవితమే నాకు స్పూర్తి, ఆమె ఆశయాల సాధనే నా జీవిత లక్ష్యం.

నా ప్రాణప్రదమైన అమ్మ స్మృతులు ఇలా నలుగురితో పంచుకునేందుకు ప్రేరేపించిన రాజు గారికి కృతజ్ఞతలు.
–మల్లారెడ్డి మురళీ మోహన్
26-07-2010

RTS Perm Link

కూరగాయల కథ

June 25th, 2010

బుడంకాయంత బుడ్డోడికి వంకాయంత వజ్రం దొరికిందట, ఆ బుడంకాయంత బుడ్డోడు ఆ వంకాయంత వజ్రాన్ని బీరకాయంత బీరువాలో దాచాడంట. ఆ చాచటాన్ని దోసకాయంత దొంగోడు చూస్తాడు. ఆ దోసకాయంత దొంగోడు బీరకాయంత బీరువా దగ్గరికి వచ్చి ఆ వంకాయంత వజ్రాన్ని తీస్తుంటే మునక్కాయంత ముసలవ్వ చూసి గుమ్మడికాయంత పోలీస్ స్టేషన్ కెళ్లి పొట్లకాయంత పోలీసులకు చెప్పుతుంది.

ఆ పొట్లకాయంత పోలీసులొచ్చి ఆ దొంగని పట్టుకొని, కాకరకాయంత కర్రతో కొట్టి, సొరకాయంత స్టేషన్లో ఉంచి, ఆ వంకాయంత వజ్రాన్ని ఆ బుడంకాయంత బుడ్డోడికి ఇప్పిస్తారు. అప్పుడు వాడు సంతోషించి, ఆ మునక్కాయంత ముసలవ్వకి చెంచలాకంత చెయ్యితో బచ్చలాకంత బహుమానం ఇస్తాడు.
– బి. గిరిబాబు

పాతాళదుర్గం 17 వ భాగాన్ని ఆన్‌లైన్ చందమామలో ప్రచురించవలసిందిగా కోరుతూ చందమామ మెయిల్ కమ్యూనికేషన్‌లోకి వచ్చిన బోయ గిరిబాబు గారు అడక్కుండానే తన చందమామ జ్ఞాపకాన్ని ఈ చిన్ని కథ రూపంలో పంపారు. కూరగాయలకు, మనుషులకు, వస్తువులకు, పోలిక పెట్టి కథ నడిపించే తీరు అచ్చంగా మన దేశంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న స్వచ్ఛమైన మౌఖిక సంప్రదాయానికి నమూనాగా నిలుస్తుంది.

ప్రస్తుతం ప్రింట్ చందమామలో ఇలాంటి కథలు అచ్చు వేయనప్పటికీ, మనందరి బాల్యం ఇలాంటి మౌఖిక కథలతో, ఊకొడితే గాని నోట్లోంచి ఊడిపడని కథలతోనే నడిచి ఉంటుంది.ఒకప్పుడు పల్లెటూళ్లలో పదిమంది పిల్లలు, పెద్దలు కూడితే చాలు… “ఒక ఊళ్లో ఒక రాజు ఉండేవాడంట. ఆతడికి ఏడుగురు కొడుకులంట..” అంటూ టకారాంత ప్రయోగంతో కథను అల్లుకుంటూ పోయే హృద్యమైన వాతావరణం రాజ్యమేలేది.

బుడంకాయంత బుడ్డోడు, వంకాయంత వజ్రం, బీరకాయంత బీరువా, దోసకాయంత దొంగోడు, మునక్కాయంత ముసలవ్వ, గుమ్మడి కాయంత పోలీస్ స్టేషన్, పొట్లకాయంత పోలీసులు.. మౌఖిక సాహిత్య శైలిలో కూడా ఆది ప్రాస ఎంత చక్కగా కుదిరిందో ఈ కథలో పోలికలన్నీ చెబుతున్నాయి.

రచయితలు, కథకులు పంపుతున్న కథలు సవరణకు గురైనప్పుడు ప్రత్యేక వ్యావహారిక భాషలోకి మారిపోయి వాటి సహజత్వం కోల్పోతున్నాయేమో అనిపిస్తుంటుంది. కాని సవరణలు లేకుండా, శిష్ట సాహిత్య రీతులకు అవతలనే ఉంటూ టకార ప్రయోగంతో మనిషి అల్లుకుంటున్న సహజమైన కథలను కూడా రికార్డు చేయవలసిన అవసరముంది. ఇప్పటికే ఇలాంటి ఎన్ని అపరూప కథలు -బహుశా వీటికి సాహిత్య గౌరవం లేకపోవచ్చు- తెలుగునేలపై అంతరించిపోయాయో చెప్పలేము.

మా చిన్నప్పుడు అంటే 1970లలో అమ్మ దగ్గిర, అవ్వ దగ్గర, తాత దగ్గిర కూర్చుని కథలు చెప్పించుకుని పిల్లలందరం సంబరపడేవాళ్లం. కొన్నాళ్లకు స్కూళ్లకు పోయాక, టౌన్లకు పోయాక కొత్త సినిమాలు, పాతసినిమాలు చూసే అవకాశం వచ్చినవారిని మధ్యలో కూచో బెట్టుకుని సినిమా కథ మొత్తం ఆ అదృష్టవంతుల నోట్లోంచి చెప్పించుకుంటూ గంటల కొద్దీ గడిపేవాళ్లం. ఇలా బాల్యమంతా కథలే. ఇంటర్మీడియట్‌లోకి వచ్చాక ఆ కథల ప్రపంచం స్థానంలో కొత్త సాహిత్యం, అభిరుచులతో కాలం కొట్టుకుపోయింది.

తన చిన్ని చందమామ జ్ఞాపకం ద్వారా మళ్లీ అందరి బాల్యాన్ని గుర్తు చేసిన గిరిబాబు గారికి ధన్యవాదాలు.
మీ చందమామ జ్ఞాపకాలను పోస్ట్ ద్వారా చందమామ ఆఫీసుకు-చెన్నయ్ చిరునామా మళ్లీ వడపళనికి మారింది- కాని, కింది ఈమెయిల్ ఐడీకి కాని పంపండి.
abhiprayam.@chandamama.com

తెలుగు ఆన్‌లైన్ చందమామలో చందమామ పాఠకులు, అభిమానులు, రచయితలు పంపిన చందమామ జ్ఞాపకాలకోసం కింది లింక్‌పై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

RTS Perm Link

‘చందమామ’ జ్ఞాపకాలతో వృధ్ధాప్యమూ పసితనమే…!!

June 18th, 2010

చందమామ యాజమాన్యం ‘ చందమామను (1947-2000) అన్‌లైన్‌లో పెట్టడమే ఓ గొప్ప సేవ! యధాలాపంగా కధలు చదువుతుండగా 1947 నాటికధ చదివి  ‘ నేను పుట్టిన సంవత్సరం నాటికధ’ నాలో స్పందన  కల్గించింది. చదివే ఊహ నాకు  కలిగినప్పటినుండీ చందమామను మానాయనగారు కొనితెచ్చేవారు.పెరిగేకొద్దీ’ కాసులు ‘దాచుకుని చందమామ కొని చదివి నాతర్వాతి వారికి వివరిస్తూ, ఊరిస్తూ చెప్పిన జ్ఞాపకం నాకింకాఉంది.

చందమామకు ఫోటో వ్యాఖ్యలు పంపాలనీ, దాన్లో అచ్చులో నాపేరు చూచుకోవాలనే కోరిక అమితంగా ఉండేది. చందమామకు కధలు వ్రాయాలనీ, అచ్చులో పేరుతోపాటుగా ఆ నా కధకు ఎలాంటి బొమ్మలు వేస్తారో అనే ఊహతో  పసితనమంతా గడచిపోయింది. ఆ ప్రయత్నం మాత్రం ఎందుకో జరగలేదు.అప్పట్లో పోస్టుకార్డు కొనడమే కష్టం, ఇహ కవరుకొని వ్రాసి పంపడమంటే మహా కష్టం.

చదువు, ఉపాధ్యాయ వృత్తిలో ఉద్యోగం, పల్లెల్లో పని చేయడం, నీతికధల పిరీయడ్‌లో పాత చందమామ కధలు పిల్లలకు  మరికొంత సంభాషణలు, వివరణలు జోడించి ఆసక్తిదాయకంగా చెప్పడం కూడానాకింకా గుర్తుంది. పల్లెల్లో పని చేసేప్పుడు స్కూల్ లోని పిల్లలందరిచేతా నయాపైసలు కూడబెట్టించి, చందమామ పుస్తకాలు నెలనెలా నేనే కొని పట్టు కెళ్ళి చదివించడమూ, ఆపైన వాటిని ‘ స్కూల్ లైబ్రరీ’లో ఉంచడమూ కూడా నాకింకాగుర్తే!.
         
స్కూల్‌లో చదువుకునేప్పుడు బోర్ కోట్టే పిరీయడ్‌లో నోట్‌బుక్‌లో చందమామ సంచిక పెట్టుకుని చదివిన రోజులూ గుర్తే. తోటి స్నేహితులు చూస్తే వారినీ  చదువుకోమని చూపిన సంఘటన ఇప్పటికీ నవ్వుతెప్పిస్తుంది. చందమామ చేసినంత సాహిత్యసేవ ఇంతింతనరానిది. చిన్నతనంలోనే పిల్లలకు, చదవడాన్నీ, కధలపట్ల మమకారాన్నీ నేర్పినది మాత్రం  చందమామే!

చందమామ నా ఉద్యోగ జీవితంలో బోధనకు సహకరించడమేకాక, ఆధ్యాత్మిక జీవితంలోనూ సహకరించడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. చందమామ ఎప్పటికీ అందరికీ ‘మామే!’ మరి. చందమామ జ్ఞాపకాలతో  వృధ్ధాప్యమూ పసితనంగానే ఉంటున్నది.  చందమామ జ్ఞాపకాలు మీఅందరితో పంచుకోడమూ ఎంతో ‘థ్రిల్లింగ్’గా ఉంది..

నేను 40 సంవత్సరాలు ఊపాధ్యాయినిగా పని చేసి విశ్రాంతి పొందిఉన్నాను. నా సర్వీసులో అంతా ‘ చందమామ కధల,నాస్టూడెంట్స్‌కు  చెప్తూ, చదివిస్తూ, వారికి తెలుగు నేర్ప్డమేకాక, కధలపట్ల ఆసక్తి  పెంచాను.నా అనుభవాలతో చిన్న చిన్న కధలు వ్రాస్తుండటం నావిశ్రాంత జీవనంలో కాలక్షేపంగా  ఉంది.

నా జీవితంలో 40సంవత్సరాలు పిల్లలతో గడపడం వల్ల నాకు పిల్లలతో మాట్లాడటమన్నా, వారికి పనికి వచ్చే పనులు కధలు, గేయాలు, నీతినేర్పే ఆటలు  క్రొత్తక్రొత్తవి  తయారు చేయడమన్నా మహా ఇష్టం. నాకు 64 సం.లు వచ్చినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా పిల్లలతోనే గడుపుతుంటాను, వారిలో ఒకరిగా, శేష జీవితాన్ని చందమామ స్నేహంతో గడపాలనేది నా కోరిక.
 
మామిత్రుడు  ఒక హైస్కుల్  ప్రధానోపాధ్యాయుడు  ఒకసభలో మాట్లాడుతూ ‘నేను హాయిగానిద్రపోతాను  అన్ని ఆలోచనలు మరచి, ఎందుకంటే పడుకునే ముందు చందమామ చదువుతాను’ అనిచెప్పారు. చందమామ పిల్లలకే కాక పెద్దలకూ మితృడేనన్నమాట!
చందమామ జ్ఞాపకాలు కోకొల్లలు. ఇంకా మరి కొన్ని ‘చందమామ జ్ఞాపకాలు’ మరోసారి…

“…..చందమామ కొనాలని ముందుగానే డబ్బు కూడబెట్టుకునే దాన్ని. ఆరోజుల్లో ఉపాధ్యాయుల జీతాలు చాలాతక్కువ. వారంలో ఓరోజు 5 కిలోమీటర్ల దూరంలో ఉండే స్కూల్‌కు నడిచి  ఆడబ్బుతో చందమామ వచ్చినరోజే కొని ఇంటికి వెళ్ళగానే ముందుగా ఫొటో వ్యాఖ్యలు చూసి, ‘అయ్యో ఇలా నేను వ్రాసి ఉండవలసింది’ అనుకుని, ఆనెల వ్యాఖ్యల గురించీ, ఆ వారమంతా ఆలోచించడమూ ఇంకా గుర్తుంది. చందమామ ‘ పిల్లలమామగా ‘ ‘మామ కాని మామ  చందమామ’. ఆకాశంలో చందమామ వెన్నెలనిస్తే, ఈచందమామ విజ్ఞానాన్నిస్తాడని  నా స్టుడెంట్స్‌కు  చెప్పడమూ గుర్తుంది.

చందమామ పిల్లల నేస్తమనీ, దాన్ని మించిన నేస్తం మరేదీ లేదనే నమ్మకంతో స్కూల్ పిల్లలచే చందమామ తప్పక ప్రతినెలా చదివించాను.. ఉద్యోగ జీవితంలో బోధనకు చందమామ బొమ్మలను, కథలను ఉపయోగించుకున్నాను.. కుమార్తె, కుమారులకూ చందమామ చదవడం అలవరచాను… 40 సంవత్సరాలు ఊపాధ్యాయినిగా పని చేసి, నా సర్వీసులో అంతా’ చందమామ కధలను, నా స్టూడెంట్స్‌కు చెప్తూ, చదివిస్తూ, వారికి తెలుగు నేర్ప్డమేకాక, కధలపట్ల ఆసక్తి  పెంచాను…”

శ్రీమతి ఆదూరి హైమవతి గారూ,

మీ ఆత్మనివేదనను జ్ఞాపకాల రూపంలో చందమామ కోసం పరిచి చూపారు.. మీ చిన్ని జీవితంలో మీరు చేసిన -పైన ఉటంకించిన- ప్రతి పనీ మంచిదే. మీ జన్మ సార్థకం అని మీరు వినమ్రంగా చెప్పుకున్నారు. కాని చందమామ జన్మ సార్థకమైందని మేం అనుకుంటున్నాము.

అక్షరాక్షరంలో పిండివెన్నెల చిలికించి మీరు అల్లిన వాక్యాలు చూస్తుంటే నాకు ఇటీవలే, రచన మే నెల ప్రత్యేక సంచిక -చందమామ కథల మాంత్రికుడు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారిపై ప్రత్యేక సంచిక- చూసిన సందర్భంగా ఢిల్లీలో కేంద్రమంత్రిత్వ శాఖలో కార్యాలయ కార్యదర్శిగా పనిచేస్తున్న మేడేపల్లి శేషు గారు చెప్పిన కింది మాటలు గుర్తుకొస్తున్నాయి.

“పిల్లలకు మెదడు ఒక్కటే కాదు, మనసూ ఉంటుందని గ్రహించకుండా వాళ్ళను ‘చదువుల యంత్రాలుగా’ మారుస్తున్న మన ప్రస్తుత విద్యవిధానమంటే నాకు మొదటినుంచీ అసహ్యమే. వాళ్ళను మరింత అసహ్యకరమైన వినోద (?) కార్యక్రమాలకు బలికావించే టి.వి. చానెల్సు అన్నా, ఇప్పటి సినిమాలన్నా నాకు మరింత అయిష్టం. నాకే కనుక విద్యావిధానాన్ని నిర్ణయించే అధికారమిస్తే, నెలకో రోజు ‘చందమామ’ చదివే పీరియడ్ పెడతాను. మార్కులతో పనిలేకుండా, వాళ్లకు కొన్ని పాఠ్య అంశాలు ప్రవేశపెడతాను. మంచి పుస్తకాలు చదివిస్తాను. మంచి చలన చిత్రాలు చూపిస్తాను. పరీక్షలకు బదులు వాటిగురించి చర్చ పెడతాను…

…..జ్ఞానంతోపాటు పిల్లల్లో మనసూ, బుద్ధీ కూడా వికసించాలి. అప్పుడే వాళ్లకు పరిపూర్ణ వ్యక్తిత్వం వస్తుంది. ఏ చదువు చదివితే ఎంత సంపాదించవచ్చు అనే పద్ధతిలోనే నడుస్తోంది మన ప్రస్తుత విద్యావిధానం. ఇది ఎటు వెళ్లి ఎటు తేలుతుందో అర్థం కాకుండా ఉంది. భాష, సాహిత్యం, కళలు అనేవి ఉపయోగంలేని వ్యాపకాలు అనే ధోరణి బాగా ప్రబలుతోంది. ఇది ముందు తరాలకు చాలా ప్రమాదం.”

మీకులాగే మేడేపల్లి శేషు గారి కల ఫలించాలని, మన రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు, బాలబాలికలకు చందమామ పత్రిక అందాలని, క్లాసుల్లో చందమామ చదివే పీరియడ్ అంటూ ఒకటి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మేం కూడా హైస్కూలులో తరగతి గదుల్లో టీచర్ పాఠం చెబుతుంటే చందమామ చదువుతూ పట్టుబడి దెబ్బలు తిన్నవాళ్లమే మరి.

కొసమెరుపు:

హైమవతి గారూ,
చందమామ నుంచి మీకు చల్లటి వార్త.

మీ ‘సందేశం’ కథను చందమామ ప్రచురణకు తీసుకుంటున్నాము. బహుశా మీ కథ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ప్రచురించబడవచ్చు. ప్రాథమిక ఎంపిక ఈరోజే పూర్తయింది.

చందమామలో కథ చూసుకోవాలనుకున్న మీ జీవిత కాల ఆకాంక్షను నెరవేరుస్తున్నందుకు మాకూ సంతోషంగా ఉంది. కొన్ని తరాల పిల్లలకు చందమామ కథలను, బొమ్మలను పరిచయం చేసిన మనీషి మీరు. మీ కథను ప్రచురించబోతూ చందమామ తనను తానే గౌరవించుకుటోందని భావిస్తున్నాము.

మీరు ఆరోగ్యం కాపాడుకుంటూ, ఇలాగే వీలు  కలిగినప్పుడల్లా 1, 2, 3 పేజీల కథలను పంపుతుంటారని ఆశిస్తున్నాము. మీరు ఉన్నది అమెరికాలోనే అయినప్పటికీ చందమామకూ మీకు అట్టే దూరం లేదు లెండి.

చందమామతో మీ ఈ కొత్త అనుబంధం కూడా దీర్ఘకాలం కొనసాగుతుందని ఆశిస్తున్నాము.

చందమామలో కథ చూసుకోవాలనుకుంటున్న మీ చిన్న ఆశను నెరవేర్చటానికి శాయశక్తులా ప్రయత్నిస్తాము. మీరు చిన్న కథలు ఇలాగే పంపిస్తూ ఉండండి. చందమామకు మీరు కధలు పంపటం మాకు గౌరవం, సంతోషం కూడా.

ఆదూరి హైమవతి గారి చందమామ జ్ఞాపకాల పూర్తి పాఠం కోసం.. కింది చందమామ వెబ్‌సైట్ లింకు చూడండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2453

మీ చందమామ జ్ఞాపకాలను పాఠకులతో పంచుకోదలిచారా? అయితే..
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.  మీ లేదా మీ పిల్లల ఫోటోతో సహా పంపండి.

లేదా
పోస్టులో కూడా, మారిన చందమామ కొత్త చిరునామా (చెన్నయ్‌)కు మీ జ్ఞాపకాలు పంపండి.

Chandamama India Limited
No.2 Ground Floor, Swathi Enclave
Door Nos.5 & 6, Amman Koil Street
Vadapalani, Chennai – 600026
Phone :  +91 44 43992828 Extn: 818

RTS Perm Link

ఊహలకు రెక్కలు తొడిగిన అందాల చందమామ

June 7th, 2010

ఇనగంటి రవిచంద్ర గారూ,

మీ చందమామ జ్ఞాపకాలు పంపిస్తూ తెలుగుభాషలోని తీయదనాన్నంతటినీ రంగరించిపోసినట్లుగా కిందివాక్యాలు రాశారు.

“మట్టి వాసన తప్ప మరో ప్రపంచం తెలియని నాకు బాహ్యప్రపంచపు ద్వారాలు తెరిచింది చందమామ.”

“చందమామలో ఉండేవి మామూలు కథలు కావు. ఊహా ప్రపంచంలోకి లాక్కుపోయే రెక్కల గుర్రాల్లాంటివి.”

“చిన్నపిల్లల మనసులు అప్పుడే పంటకు సిద్ధం చేసిన నేలలాంటివి. వాటిలో ఎలాంటి విత్తనాలు నాటితే అలాంటివి మొక్కలే మొలకెత్తుతాయి.”

“పెద్దయ్యే కొద్దీ బాహ్యప్రపంచపు వాస్తవాలతో మెదడు మొద్దుబారిపోతుందేమో గాని చిన్నపిల్లల ఊహలకు హద్దే లేదు. ఊహ ఎప్పుడూ ఆనందమే. అలాంటి ఊహలకు రెక్కలు తొడిగింది అందాల చందమామ.”

“నా వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించింది ఒకరు మా అమ్మమ్మ అయితే మరొకరు చందమామ.”

మీరు ఇంకా చిన్నవారే.. చందమామ నాలుగవ లేదా అయిదవ తరం పాఠకుల కోవకు చెంది ఉంటారనుకుంటున్నాను.అయినా చందమామ పట్ల అభిమానంలో పాత తరాలకు తీసిపోని అనురక్తి మీది.

ముఖ్యంగా “మట్టి వాసన తప్ప మరో ప్రపంచం తెలియని నాకు బాహ్యప్రపంచపు ద్వారాలు తెరిచింది చందమామ.” అనే మీ వాక్యం చదువుతుంటే గుండె పట్టేసింది నాకయితే.

చిన్నతనంలో చందమామతో మా అనుబంధపు జ్ఞాపకాల తడి తగులుతోందిప్పుడు..

మీరు చల్లగుండాలని, మీ అక్క గారి పిల్లలకు కూడా చందమామను పరిచయం చేస్తున్న మీ మమకారం చల్లగుండాలని, ఈ సాంప్రదాయం అనంతంగా ఇలా సాగిపోవాలని మేము కూడా మనసారా కోరుకుంటున్నాము.

బాల్యంలో చందమామను మీకు పరిచయం చేసిన మీ అమ్మమ్మ గారికి చందమామ పరామర్శలు తెలియజేయండి.

ఏప్రిల్ చివరలో పంపిన మీ చందమామ జ్ఞాపకాలను అనివార్య కారణాల వల్ల ఇంత ఆలస్యంగా ప్రచురిస్తున్నందుకు క్షమాపణలు.

రవిచంద్రగారి చందమామ జ్ఞాపకాలు పూర్తి పాఠంకోసం కింది లింకును తెరవండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2450
NB:
మీ చందమామ జ్ఞాపకాలను పాఠకులతో పంచుకోదలిచారా? అయితే..
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.
మీ లేదా మీ పిల్లల ఫోటోతో సహా పంపండి.

చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

RTS Perm Link

బాల్య సంస్కారం నేర్పిన చందమామ

May 14th, 2010

చందమామకు రెగ్యులర్‌గా కథలు పంపుతున్న మాన్యులు శ్రీ జొన్నలగడ్డ మార్కండేయులు గారు. రాజమండ్రిలో పుట్టి సమీపంలో ఉన్న పేరవరం గ్రామంలో పెరిగిన ఈయన  చిన్నప్పుడు చందమామ కోసం ఎదురుచూపులు చూసిన మరపురాని జ్ఞాపకాలు ఆయన పంపిన చందమామ ముచ్చట్లలో తడుముతూ, యాభై ఏళ్ల క్రితం రాజమండ్రి రావాలంటే లాంచీలలో, నావలలో ఒంటెద్దు బళ్లలో ప్రయాణం చేయవలసిన అపురూప జ్ఞాపకాలను చందమామ పాఠకులతో పంచుకున్నారు.

బాల్యంలో తాను చదివిన చందమామ కథలలోని వర్ణనను తమ చుట్టూ పరిసరాలకు అన్వయించుకుంటూ పరవశం చెందిన మార్కండేయులుగారు, “పెరట్లో దబ్బ చెట్టు కాయకపోతే చందమామ కథ చదివిన మేము లంకె బిందెలున్నాయని చెట్టు చుట్టూ తవ్వేశాము. లంకెబిందెలు దొరకలేదు గాని నేల గుల్లబారిందో ఏమో దబ్బచెట్టు కొద్ది రోజుల్లోనే పూత పూసి విరగకాసింది.” అంటూ చందమామ బాల్యాన్ని హృద్యంగా పంచుకున్నారు.

పైగా సంచార గ్రంధాలయాల లెక్కన ఊర్లుకు సైకిళ్లలో, తోపుడు బళ్లలో చందమామ, బాలమిత్ర తదితర కథల పుస్తకాలు,వారపత్రికలు తీసుకువచ్చి తెలుగువారి పుస్తక పఠనాభిరుచికి అపురూప తోడ్పాటు అందించిన రెడ్డి వంటి సాధారణ వ్యక్తుల చరిత్రను ఆయన ఈ చందమామ ముచ్చట్లలో తడిమారు.

ఎదుటివారిని ఏకవచనంతో సంబోధించిన ఘటనలో చందమామ చిన్నప్పుడు నేర్పిన సంస్కారాన్ని ఆయన తన ముచ్చటలో మనతో పంచుకున్నారు.

చందమామ ముచ్చట్లను ఆయన ఈ మెయిల్ ద్వారా ఏప్రిల్ చివరిలోనే పంపినప్పటికీ, గత రెండు వారాలుగా అనివార్య కారణాల వల్ల చందమామ వెబ్‌సైట్‌లో, బ్లాగులో పోస్టే చేయలేక పోయాము. ఆలస్యానికి క్షంతవ్యులము. అలాగే చందమామ అభిమాని ఇనగంటి రవిచంద్ర గారు కూడా చందమామ జ్ఞాపకాలను ఏప్రిల్ చివరలో పంపారు. వచ్చే శుక్రవారం వారి చందమామ జ్ఞాపకాలను పోస్ట్ చేయనున్నాము.

శ్రీ మార్కండేయులు గారు పంపిన చందమామ ముచ్చట్ల పూర్తి పాఠం కోసం కింది చందమామ వెబ్‌సైట్‌ లింకులో చూడగలరు.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2448

RTS Perm Link

బాలసాహిత్య సిరి చందమామ

April 26th, 2010

“తెలుగు సాహిత్యంలో బాల సాహిత్యానికి పెద్ద పీట వేసిన వారిలో చందమామ కుటుంబం ఒకటి. బాలసాహిత్యాన్ని బాలలే కాకుండా ఆబాల గోపాలం చదువుకొని ఆనందించే స్థాయికి తీసుకువచ్చిన ఘనత కూడా చందమామ కుటుంబానిదే అని చెప్పడం చర్విత చరిణమే! చందమామలో పనిచేసిన సాహిత్య కారులు బాలసాహిత్యానికి తమ ఊపిరులు ఊదారు. వారిలో సంచాలకులు చక్రపాణి నాగిరెడ్డి గార్ల వ్యవస్థాపక నైపుణ్యానికి తమ కలం బలంతో సాహిత్యాన్ని అత్యున్నత స్థానానికి తీసుకుపోయిన వారిలో కొడవటిగంటి కుటుంబరావు, దాసరి సుబ్రహ్మణ్యం ఆచంద్రతారార్కం తమ పేర్లు సాహిత్యాకాశంలో వెలిగింప చేశారు. చందమామకు అందిన కథలను చక్రపాణి గారి ఒరవడికి అనుకూలంగా తీర్చిదిద్దిన ఘనత వర్ణనాతీతం. పాఠకులకు కథ అందిన తీరు అమోఘంగా ఉంటే ఆ కథనందించిన వారికి తమ కథ అద్దుకున్న సొబగులు అంతకంటే అమోఘంగా కనిపించేవి.”

అంటూ చందమామ గురించి ఆప్తవ్యాక్యాలు పంపిన శ్రీ ఎమ్‌వీవీ సత్యనారాయణ గారు గత యాభైఏళ్లుగా మొదట అభిమాన పాఠకుడిగా, తర్వాత కథా రచయితగా చందమామతో సజీవ సంబంధాల్లో ఉంటూ వస్తున్నారు. తాను ఆరాధించే కుటుంబరావు గారు తన కథ ఆమోదించబడిన వార్త తెలిపితే సంతోషం. కుటుంబరావు గారి చేతుల్లో తమ కథలు పడ్డాయనే టెన్షన్, కొకు గారి సరసనే యువ మాసపత్రికలో తన కథ కూడా ప్రచురించబడితే అంబరమంత ఆనందం.

తదనంతర కాలంలో దాసరి సుబ్రహ్మణ్యం గారితో పరిచయం చివరి దాకా కొనసాగడం.. ఇవీ సత్యనారాయణ గారు తమ జీవితం పొడవునా పెంచుకుని వస్తున్న చందమామ జ్ఞాపకాలు. గత 30 ఏళ్లకు పైగా చందమామకు కథలు పంపుతూనే వస్తున్న ఈయన అలుపెరుగని చందమామ వీరాభిమాని. రెమ్యునరేషన్ మాట అటుంచితే చందమామ పత్రికలో తమ కథ పడితే చాలు.. అదే పరమానందంగా భావిస్తూ వచ్చిన అలనాటి కథకుల జాబితాలో సత్యనారాయణ గారిది కూడా తొలి వరుసే. గత 8 నెలల కాలంలో చందమామ జ్ఞాపకాలను కూడా పోస్ట్ ద్వారా పంపిన తొలి రచయిత ఈయనే మరి.

“చందమామ ఈనాడూ, ఆనాడూ, ఏనాడూ బాలలకు నిండు చందమామే! చందమమతో నా అనుబంధం యాభై ఏళ్ల నాటిదంటే అది నాకెందుకో పులకరింత కలిగించే అంశం. బాలసాహిత్యానికి చందమామ సృష్టించిన ఒరవడి ఆచంద్ర తారార్కం నిలిచే ఉంటుంది. తరాలు మారతాయి. చందమామ వెన్నెల మాత్రం అన్ని తరాలమీద ఒకే రకంగా ప్రసరిస్తుంది. తెలుగు వారి నట్టింట పత్రిక ఇప్పుడు రాష్ట్ర్రాల సరిహద్దులు చెరుపుకుంటూ ప్రయాణం సుస్థిరం చేసుకుంది. తెలుగు వారి కథలే ఇతర భాషల్లోకి తర్జుమా కావడం తెలుగు రచయితలకు గర్వకారణం. తెలుగు వెలుగుల జయకేతనం చందమామ. తరతరాల అందరి మామ చందమామ.”

ఇవి చందమామ పత్రికపై సత్యనారాయణ గారి ఆత్మీయ వాక్యాలు. రిటైరైన తర్వాత కూడా చందమామకు కథలు పంపించడానికి ఉత్సాహం చూపుతున్న సత్యనారాయణ గారికి చందమామ తరపున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు. మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చందమామకు రచనలు పంపగలరని, సూచనలు పంపించగలరని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.

ఎంవీవీ సత్యనారాయణ గారి చందమామ జ్ఞాపకాల పూర్తి పాఠం కోసం కింది లింకులో చూండండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2446

మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.

మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.  మీ లేదా మీ పిల్లల ఫోటోతో సహా పంపండి.
చందమామ.

RTS Perm Link