ఏది మంచి కథ?

June 22nd, 2012

పత్రిక, పాఠకులు, రచయితలు మధ్య సంబంధ బాంధవ్యాలు అరిటాకు లాంటి సున్నిత పునాది మీదే కొనసాగుతుంటాయి, చెదిరిపోతుంటాయి కూడా. పత్రిక నిర్వాహకుల అహం, పాఠకుల అహం, రచయితల అహం.. వీటిలో ఏ ఒక్కటీ తక్కువ కాదు. -ఇక్కడ అహం అనేమాటను పాజిటివ్‌గా తీసుకుంటేనే మంచిది- చందమామ కూడా దీనికి మినహాయింపు కాదు. అసలు ఒక పత్రికలో రచనలు ఏ ప్రాతిపదికన సెలెక్ట్ అవుతాయి, తిరస్కరింపబడతాయి అనేది పై మూడు కేటగిరీలలో ఏ ఒక్కరూ స్పష్టంగా చెప్పలేకపోవచ్చు.

కథ చాలా బాగుంది అనుకున్న సందర్భాల్లో కూడా అతి స్వల్పమైన కారణాల వల్ల ఎంపిక కాకపోవచ్చు. అవి సాహిత్య కారణాలు, సాహిత్యేతర కారణాలు, రాజకీయ కారణాలు, శైలి, కథలోని టోన్ ద్వారా వచ్చే సమస్యల కారణాలు, మంచి కథను కూడా పాడుచేసేలా పాత్రల చిత్రీకరణలో జరుగుతున్న లోపానికి సంబంధించిన కారణాలు ఇలా ఏవయినా కావచ్చు. కథ స్వీకరించడానికి, స్వీకరించకపోవడానికి ఇవన్నీ దోహదం చేసేవే.

పైగా వీటన్నిటికి మించి ఎంపిక దారుల మానసిక స్థితి -మూడ్- ఎలా ఉందనేది కూడా కథల ఎంపికలో గణనీయ ప్రభావమే చూపుతుందనుకుంటాను. ఒక సమయంలో అంత బాగాలేదనిపించిన కథ మరో సందర్భంలో ఫర్వాలేదు వేసుకోవచ్చు అనిపించి దాన్ని స్వీకరిస్తున్న సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. ఒక సారి సెలెక్షన్ కాని కథలు మరోసారి సులభంగా స్వీకరించబడటానికి ఎంపికదారుల మూడ్ కూడా అంతో ఇంతో పనిచేస్తుందనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవలిసిందే.

అందుకే కథను ఎందుకు ఎంపిక చేస్తున్నారు, ఎందుకు చేయలేదు అనే విషయంపై నూటికి నూరుపాళ్లు ఎవరూ సాధికారతను కలిగి ఉండరనుకుంటాను. దశాబ్దాలుగా కథలను స్వీకరిస్తున్న చందమామ కూడా దీనికి భిన్నం కాదు. లబ్ద ప్రతిష్టులైన రచయితల కథలు, కొత్తగా పంపుతున్న రచయితల కథలు కూడా స్వీకరించలేనప్పుడు మీ కథలో లోపం కాదని, అనేకానేక చిన్న చిన్న కారణాలతో మీ కథ తీసుకోలేకపోతున్నామని చెబుతూ చందమామ గతంలోనే సంజాయిషీతో కూడిన వివరణను రచయితలకు పంపుతూ కొత్త కథలు పంపవలసిందిగా అభ్యర్థించేది.

ఒక రచయిత కథలు పదే పదే చందమామలో ప్రచురించబడటానికి, స్వీకరించబడటానికి, 20, లేదా 30 కథలను ఒక రచయిత పంపినా ఒక కథ కూడా స్వీకరించలేకపోవడానికి ఇలాంటి సకారాణ, అకారణ అంశాలు పనిచేస్తుండవచ్చు.

చందమామలో ఎలాంటి కథలు పడుతాయి, పడవు?

1. ఏ జాతికైనా దానికే సంబంధించిన మూల కథలు -బేసిక్ స్టోరీస్- ఉంటాయి. వాటిని ఆధారంగా చేసుకుని ఇప్పటికే కొన్ని డజన్లసార్లు పలు పత్రికలలో కథలు గత కొన్ని దశాబ్దాలుగా ప్రచురించబడి ఉంటాయి. ఆ బేసిక్ కథల సారాంశాన్ని తీసుకుని పూర్తిగా రూపాన్ని మార్చి కొత్త కథ రాసి పంపినా ప్రచురణకు తీసుకోకపోవచ్చు.

ఈ కారణంవల్లే ఒకప్పుడు జంతువుల పాత్రలతో నడిచే కథలకు ప్రాముఖ్యతనిచ్చిన చందమామ తర్వాత కాలంలో రీటోల్డ్ స్టోరీస్ రూపంలో వస్తున్న జంతు కథలను పూర్తిగా పక్కన పెట్టేయడం జరిగింది. ప్రస్తుతం చందమామలో జంతుకథలు వస్తున్నాయంటే అవి చందమామలోని పాత కథలే అయి ఉంటుంది.

2. స్త్రీలను, వృద్ధులను, అంగవికలురను, బలహీన వర్గాల ప్రజలను కించపర్చే, నిందించే రకం కథలు గత సమాజాలలో లేదా శతాబ్దాల క్రితం పుట్టిన సాహిత్యంలో వచ్చి ఉండవచ్చు. కాని సమానత్వం సార్వజనిక విలువగా మారిన ఆధునిక కాలంలో వాటిని యధాతథంగా స్వీకరించడం పరమ అభ్యంతరకరం కాబట్టే కథ ఎంత బాగున్నా ఇలాంటి కించపర్చే సంభాషణలు కథలో వచ్చాయంటే వాటిని ఏ పత్రిక కూడా స్వీకరించలేకపోవచ్చు.

పీడకుడు పీడితుడిని తిట్టడం, దూషించడం పాత్రస్వభావ రీత్యా సహజమే కావచ్చు కాని ఇలాంటి వాటిని కూడా యధాతథంగా స్వీకరించలేని సున్నితత్వం సమాజంలో ప్రబలుతోంది కాబట్టి ఇలాంటి కథలను జాగ్రత్తగానే పరిశీలించడం జరుగుతోంది.

3. కుటుంబరావు గారు చందమామ అనధికారిక సంపాదకులుగా ఉన్నప్పుడే ఒరిజనల్ బేతాళ కథలను రెండు మూడింటిని యధాతథంగా ప్రచురించి ఇక సాధ్యం కాని పరిస్థితుల్లో వాటికి ఆధునిక సంస్కారాన్ని, కొత్త భావజాలాన్ని తొడిగి కొత్త బేతాళ కథలను తీసుకురావడం జరిగింది. గత 50 ఏళ్లకు పైగా చందమామ బేతాళ కథలు ఎంత సంచలనానికి కారణమవుతున్నాయో చెప్పవలసిన పనిలేదు.

4. సాధారణీకరణలు
ఆడదాని నోట్లో నువ్వు గింజ కూడా నానకూడదు అనే శాపాన్ని ధర్మరాజు పెట్టాడని భారతంలో అందరూ చదివే ఉంటారు. కర్ణుడు తనకే పుట్టాడనే విషయాన్ని కర్ణుడి మరణ సందర్భంలో గాని చెప్పలేకపోయిన కుంతీదేవిపై ఆగ్రహంతో ధర్మరాజు ‘ఇకపై స్త్రీల నోటిలో ఏ రహస్యమూ దాగకుండు గాక’ అని శపించాడట. ఇది సమాజంలోని మొత్తం స్త్రీలకు వ్యతిరేకంగా తీర్చి దిద్దబడిన గతకాలపు భావజాలం నుంచి పట్టిన పదబంధం. ఇలాంటి సాధారణీకరించిన సంభాషణలను స్త్రీ పాత్రలకు, నిస్సహాయులకు, వెనుకబడిన ప్రజలకు ఆపాదించి కథలు తయారైతే ఆధునిక సాహిత్యం వాటిని తిరస్కరించడమే జరుగుతుంది.

5. చిన్న ఉదాహరణ. పంచతంత్రకథల్లో ఆషాడభూతికి ఆశ్రయం ఇచ్చిన మంగలి తన భార్యను అనుమానిస్తూ ‘ఓసి ముక్కిడి ముండా’ అని తిట్టిన సందర్భాన్ని 70లలో చందమామలో వచ్చిన పంచతంత్రకథల్లో యధాతథంగా ప్రచురించారు. దీన్ని మళ్లీ 2011లో ప్రచురించినప్పుడు ఆ పదం వెనుక స్త్రీలను కించపరిచే భావజాలాన్ని గమనించకుండా అలాగే ప్రచురించడంతో పాఠకులనుంచి తీవ్ర నిరసన వచ్చింది. చందమామ కథల మంచిచెడ్డలను పాఠకులే నిర్దేశిస్తున్న చక్కటి పఠనా పురోగతిని, పరిశీలనను ఇక్కడ గమనించవచ్చు.

6. కథ ఎంత బాగా రాసినప్పటికి దాన్ని పోలిన, దాని సారాంశాన్ని పోలిన కథ అంతకుముందే చందమామలో వచ్చి ఉంటే, స్వీకరణ సాధ్యం కాదు. ఉదాహరణ చందమామలో వైద్యుల కథలు, దయ్యాల కథలు, జంతువుల కథలు, చాలా ఎక్కువగా వచ్చాయి. ఈ కోవలోని కథలు ఒకటి రెండు వరుసగా పడగానే వాటిని పోలిన ఇతివృత్తంతో చాలామంది కొత్త కథలను పంపడం సహజం. దాదాపు అన్ని పత్రికల విషయంలో ఇలాంటి ధోరణి ఉందేమో మరి. నాలుగైదు చందమామలను వరుసగా చూసి వాటిని పోలిన కథలు పంపితే వేసుకుంటారేమో అనే ఊహతో కొన్ని కథలు పంపించండం అందరి శ్రమ వృధా కావడానికే దారితీస్తుంది.

7. ప్రతి కథలోనూ వైవిధ్యతను ప్రదర్సించడం, కథను పోలిన కథను ఎట్టి పరిస్థితుల్లోనూ పంపకపోవడం గతంలో వచ్చిన కథను మార్చి, పాలిష్ చేసి కొత్త రూపంలో పంపడం వంటివి ఎక్కడైనా ప్రచురణార్హతకు నోచుకోవనుకుంటాను.

8. ఆడదాని సలహా అనే పాత కథను ఈ సంవత్సరం ఏప్రిల్ చందమామలో ప్రచురించడమైనది. బెస్తవాడి చర్యలకు దురుద్దేశ్యం అంటగట్టిన రాణిని ఉద్దేశించి పర్షియా ప్రభువు చివరలో నగరంలో చాటింపు వేస్తాడు “ఆడదాని సలహా ప్రకారం ఎవరూ నడుచుకోవద్దు. వారి సలహా విన్నట్లయితే సగం పొరపాటును దిద్దుకోవడానికి రెండు పొరపాట్లు అదనంగా చేయవలసివస్తుంది”
ఈ ప్రకటన మహిళలపై ప్రస్తుత సమాజం అంగీకరించని అభిప్రాయాలను వ్యక్తీకరిస్తోంది.  ఈ మూలకథను నలభై ఏళ్ల క్రితం ఆడదాని సలహా పేరుతో యధాతథంగా ప్రచురించారు. ఈకథను అలాగే మళ్లీ ప్రచురిస్తే పాఠకులు దాడిచేయడం తప్పదు. మొత్తం స్త్రీ జాతినే అవమానిస్తున్న పై ప్రకటనను మార్చకుంటే కొంప మునుగుతుందని భావించి యాజమాన్యం వారి దృష్టికి తీసుకుపోయి అన్ని భాషల్లోనూ పై వాక్యాన్ని ఇలా మార్చడం జరిగింది.
“మన సన్నిహితులు, ఆంతరంగికులు చెప్పిన సలహా ప్రకారంమాత్రమే ఎవరూ నడుచుకోవద్దు. ఇతరుల సలహాను గుడ్డిగా విన్నట్లయితే సగం పొరపాటును దిద్దుకోవడానికి రెండు పొరపాట్లు అదనంగా చేయవలసి వస్తుంది”
మార్చిన కథకు అనుగుణంగా ఆడదాని సలహా అనే కథ శీర్షికను కూడా నష్టం మూడుసార్లు అని మార్చటం జరిగింది. అలనాటి తమిళ చందమామలో ఇదే పేరుతో ఈ కథను ప్రచురించడంతో ప్రస్తుత సందర్భానికి ఇదే బాగుందని దాన్నే స్వీకరించడం జరిగింది.

కథనం పెద్దది కావడంతో ఇప్పటికి ముగించి మరోసారి కలుద్దాము.
చందమామ.

RTS Perm Link

బానిసత్వం తప్పదు గాని మరీ ఇంతగానా..!

December 22nd, 2011

సాఫ్ట్‌వేర్ రంగం అమానుష పనివిధానానికి, శ్రమ అమానవీకరణకు నెలవుగా మారిపోయిన క్రమం గురించి ఇటీవలే చర్చించుకున్నాము. చర్చలో పాల్గొన్న అందరూ దాదాపుగా 8 గంటలనుంచి 12 గంటలు, 15 గంటల వరకు ఈ రంగంలో పెరుగుతున్న పనిభారం గురించి అంగీకరించారు. ఈ రోజు నేను సాక్షి పత్రికలో చదివిన ఈ వ్యాసం ఓ భయంకర సత్యాన్ని చాటుతోంది.

పని చేసుకుంటూ చదువుకునే పరిస్థితులున్న  పాశ్చాత్య దేశాలలో, పొదుపు చర్యలు, బడ్జెట్ కోతలు పేరుతో అక్కడి ప్రభుత్వాలు తీసుకువస్తున్న సంస్కరణల కారణంగా విద్యార్థుల జీవితాలు తల్లకిందులవుతున్న వైనం గురించి ఈ వ్యాసం హృద్యంగా వివరిస్తోంది.

బ్రిటన్‌లో చదువుకుంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగం  వెతుక్కుంటున్న మూడు లక్షల మంది విద్యార్థులు తమకు నిరుద్యోగ భృతి లభించాలంటే ఇంటర్న్‌షిప్ -అప్రెంటిస్‌షిప్- పేరుతో సూపర్ మార్కెట్లలో, మాల్స్ లలో మూడు వారాలపాటు ఉచితంగా పనిచేసి పెట్టవలసిన వైనాన్ని ఈ వ్యాసం తెలిపింది.

ఉన్నత విద్యావంతులు, సాంకేతిక నిపుణులు, ఉద్యోగాలు కోల్పోయిన సీనియర్లు, తాజాగా మార్కెట్లోకి అడుగుపెట్టిన జూనియర్లు అందరూ బానిసత్వం కంటే అధ్వాన్నమైన ఈ ఉచిత ఇంటర్న్‌షిప్‌ల కోసం పోటీలు పడుతున్నారట. ఇలా ఏ పనిచెప్పినా చేయడానికి సిద్ధమవుతుంటే జీతాలిచ్చి ఉద్యోగులను పనిలో పెట్టుకోవడం దండగని యజమానులు బహిరంగంగానే చెబుతున్నారట.

బ్రిటన్ ప్రభుత్వం ప్రజాధనంతో ఇస్తున్న నిరుద్యోగ భృతిని పొందాలంటే విద్యార్థులు బడా కంపెనీలకు బానిస చాకిరీ చేయవలసిన ఆగత్యం ఏమిటి అంటూ ఆ వ్యాసం చివర్లో ప్రస్తావించింది.

సంస్కరణల పేరుతో పొదుపు చర్యల పేరుతో ప్రజల జీవితాలపైనే అన్నిరకాలుగా కోతలు విధిస్తూ పారిశ్రామిక సంస్థల, యజమానుల జోలికి వెళ్లని పాశ్చాత్య ప్రభుత్వాలు ఏ నాగరికతను గొప్పగా చూపబోతున్నాయి?

ఇంటర్న్‌షిప్‌ పనికి ఎర్ర ఏగానీ కాదు కదా ఒక పూట భోజనం కూడా పెట్టరట.

మన పల్లెలు గుర్తు వస్తున్నాయి. ఎవరైనా ఊర్లలో గంట పని చేయించుకుంటే డబ్బులు ఇవ్వలేక పోయినా కడుపునిండా అన్నం పెట్టి పంపేవారు. మన కోసం  కాసింత పని చేసిపెట్టిన  వారిని ఊరికే పంపవద్దన్నది మన గ్రామీణ సంప్రదాయం.

పాశ్యాత్య నాగరికతకు ఏ నీతి కూడా లేకుండా పోతోందా?

ఈ వ్యాసంలోని నిజానిజాలను పాశ్చాత్య దేశాలలో చదువుతున్న మన విద్యార్థులు, మన ఉద్యోగులు తేలిస్తే బాగుంటుంది. అక్కడి పరిస్థితి నిజంగా ఇంత భయంకరంగా ఉంటోందా..

నేటి ప్రపంచంలో బానిసత్వం తప్పదు కాని మరీ ఇంతగానా..!

పరిశీలన కోసం కింది వ్యాసం లింకును చూడండి.

చదువు‘కొనడానికి’ పడుపు వృత్తి!

 

RTS Perm Link

అమెజాన్‌లో చందమామ

January 19th, 2010

Chandamama Ramayana

ప్రవాస భారతీయులకు, చందమామ అభిమానులకు శుభవార్త. “చందమామ కలెక్టర్స్ ఎడిషన్” – 60 సంవత్సరాల విశేష సంచిక-ను, “చందమామ రామాయణం” కార్టూన్ పుస్తకాన్ని (అన్ని పేజీలూ రంగుల్లో) స్వదేశం నుంచి తెప్పించుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్న విదేశాల్లో ఉంటున్న భారతీయులకు ఈ రెండు పుస్తకాలు ఇప్పడు ఆన్‌లైన్‌లో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చాయి.

Chandamama Collection Edition art1[6]_400-519

చందమామ 60 సంవత్సరాల ఉజ్వల శకానికి సంబంధించిన కథలు, చిత్రాలతో చందమామ సంస్థ 2008లో “Chandamama- Celebrating 60 Wonderful Years” అనే పేరుతో ఓ కలెక్టర్స్ ఎడిషన్‌ను ప్రచురించింది. అలాగే, ఇతిహాసాలలో బాగా ప్రాచుర్యం పొందిన రామాయణంను “Chandamama’ Ramayana – An epic Journey” పేరిట కార్టూన్‌లలోకి మార్చి ఆద్యంతం రంగుల పుటల్లో తీసుకువచ్చింది (2008)

Chandamama Collector's Edition

హార్డ్‌కవర్‌లో, అద్భుతమైన పేపర్ క్వాలిటీతో రూపొందిన ఈ రెండు విశిష్ట పుస్తకాలను అమెజాన్.కామ్‌లో ఒక్కొక్కటి 43.85 డాలర్ల చొప్పున చందమామ అభిమానులు తీసుకోవచ్చు. -అమెజాన్.కామ్ వారి నిర్ణయం బట్టి ప్యాకింగ్ రుసుము కింద 3 డాలర్లను అదనంగా చెల్లించవలసి ఉంటుంది. –

చాలా కాలం తర్వాత చందమామ ఈ రెండు ప్రచురణల ద్వారా, పూర్తిస్థాయిలో ఓ రంగుల ప్రపంచాన్ని పాఠకుల ముందుకు తీసుకువచ్చింది. ‘చందమామ’ చరిత్రకు వన్నెలద్దుతున్న ఈ పుస్తకాలను మీరు ఇకపై నేరుగా అమెజాన్‌.కామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఇంటర్నెట్‌లో amazon.com ను తెరిచి Searchలోని కేటగిరీలలోనుంచి  ‘Books’ని సెలెక్ట్ చేసుకుని పక్కనున్న ఖాళీ స్థలంలో సెర్చ్‌వర్డ్‌గా Chandamama పదాన్ని టైప్ చేసి Go పై క్లిక్ చేయండి. అమెజాన్‌లో చందమామ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ రెండింటిని లేదా మీకు నచ్చిన దానిని ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసి నేరుగా మీ ఇంటికే తెప్పించుకోవచ్చు.

చందమామ కలెక్టర్స్ ఎడిషన్‌ – 2008‌ పుస్తకంపై సమీక్ష, వ్యాఖ్యలకోసం కింది లింకులో చూడండి.

చందమామ కలెక్టర్స్ ఎడిషన్ – 2008

Chandamama Collection Edition art2[6]_400-500

పై రెండు పుస్తకాలను భారతీయ భాషల్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి కాస్త సమయం పట్టవచ్చు. అలాగే చందమామ అలనాటి చిత్రకారులు సర్వశ్రీ చిత్రా, ఎంటీవీ ఆచార్య, శంకర్, వపా గార్లు చిత్రించిన అద్భుత చిత్రాల సంకలనం అతి త్వరలో చందమామ పాఠకులకు, అభిమానులకు అందుబాటులోకి రానుంది.

చందమామ చిత్రాలకున్న ప్రాధాన్యత జగమెరిగిన సత్యమే కాబట్టి మీతోపాటు చందమామలో పనిచేస్తున్న మేము కూడా ఎంతో ఆసక్తిగా వాటికోసం ఎదురుచూస్తున్నాం.

అమెజాన్‌లో చందమామ పుస్తకాల కొనుగోలుకు సంబంధించిన లింకులకోసం ఇక్కడ కూడా చూడగలరు

Chandamama CTB and Ramayan is available on amazon.com…

For ordering the Candamama Collector’s edition (“Chandamama- Celebrating 60 Wonderful Years”)  and Ramayana (“Chandamama’ Ramayana – An epic Journey”) in cartoons -all pages in colour-,

….see and use the below mentioned links.

అమెజాన్‌లో చందమామ పుట

OR

Ordering from Amazon.com is quick and easy
సత్వర అర్డర్ కోసం

మీ
చందమామ

RTS Perm Link

చందమామ : ఓ పరామర్శ

December 4th, 2009

ఇది చందమామలో ‘ఆర్కైవ్‌లు’ అనే పదాన్ని తెలుగు చేయడానికి సంబంధించి ఈ మధ్యే ఓ మిత్రుడితో జరిగిన ఈమెయిల్ చర్చ. ఈ చర్చలో చందమామకు సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు రావడంతో వాటిని ఇక్కడ పొందుపర్చడమైంది. ఈ కథనంలో ముద్దక్షరాలతో ఉన్న భాగాలు మా మిత్రుడి వ్యాఖ్యలని గుర్తించాలి.

రావు గారూ,
 
ఆన్‌లైన్ చందమామలోని ఆర్కైవ్‌లు అనే పదప్రయోగంపై మీ జోడింపుకు ధన్యవాదాలు. అది కధల భాండాగారానికి ఆంగ్ల పదం. తెలుగు పదాన్ని కేటగిరీగా ఉంచాలనుకున్నా మొదట్లో స్పేస్ అందుకు అనుమతించడం లేదని ఆర్కైవ్ అనే పదాన్నే ఎంచుకోవడం జరిగింది.తర్వాత సాంకేతిక కారణాలతో అది అలాగే కొనసాగుతూ వస్తోంది. ఆర్కైవ్స్ అంటే మరీ ఇంగ్లీషులాగా ఉంటుందని ఎస్‌కు బదులు ‘లు’ తగిలించి ఆర్కైవ్‌లు అని ఉంచడమైంది. ఇది మన డుమువుల తంటా అనుకోండి.
 
ఈ కథల భాండాగారంలో 1947 నుంచి 90 వరకు వచ్చిన చందమామ కథలు అలాగే ఆన్‌లైన్ పుస్తక రూపంలో లభ్యమవుతాయి. త్వరలో 2000 సంవత్సరం వరకు కథలను దీంట్లో అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

“నాకు తెలిసి తెలుగు బాగా బతికి బట్టకడుతున్నది బహుశా… మీ ‘చందమామ’ వంటి పత్రికల్లోనే”

“మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు… ఇక్కడే మేం ఇంకా ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని పనిచేయవలసి ఉంటుంది. అక్షర దోషం లేకుండా, తప్పులు లేకుండా, పిల్లలు, పెద్దలు ఇష్టపడే విషయాలు ఏవీ వదలకుండా, ముఖ్యంగా చందమామ పట్ల పాతతరం వారి మనోభావాలు దెబ్బతినకుండా.. పత్రికను నడపడం అంటే చాలా కష్టమే. పాత కంటెంట్ వద్దు నూతన తరాల అభిరుచులకు అనుగుణమైన చందమామ రావాలి అనే యాజమాన్యం వైఖరికి, పాత కథలే మాకు ముద్దు.. అవే వెయ్యండి అనే పాత తరం పాఠకులకు మధ్య చందమామ ప్రస్తుతం నలుగుతోంది.

సరైన సమయంలోనే దీంట్లోకి అడుగుపెట్టాననుకోండి. ఎవరివైపు మొగ్గితే ఎవరికి కోపం వస్తుందో.. ఇరు పక్షాల మధ్య బ్యాలెన్స్‌గా నడవడం నేర్చుకోవాలిప్పుడు. నిజంగా చందమామ పాఠకులు, వారి లేఖలు, పత్రికలో కొత్తదనం పేరిట జరుగుతున్న మార్పులపై అలనాటి పాఠకుల శాపనార్ధాలు ఇవన్నీ చూస్తుంటే కొత్త లోకంలో అడుగుపెట్టినట్లే ఉంది లెండి. ఏమయినా మరోవైపు భయం కూడా ఉంది.”

“ఒకటి మాత్రం నిజమండీ,. చందమామ కలెకర్స్ ఎడిషన్ కోసం కథలు అనువాదం చేయవలసి వచ్చినప్పుడు అదో కొత్త అనుభవం. ఇంగ్లీష్ ముక్క వాడకుండా ఆ మధ్యయుగాల రాజూ రాణీల కథలు తెలుగు చేయాలి. సాధ్యమా అనుకున్నాను. కానీ పుటలు నడిచే కొద్దీ సంపూర్ణ తెలుగు అనువాదం వంట బట్టిందనుకోండి. ఇలా రాయలేమేమో అని భయపడ్డాను. కాని అలా కూడా రాయవలసిన అవసరం నాకు చందమామే నేర్పిందనుకోండి.”

“చందమామ మాత్రమే కాదనుకోండి. అయితే భాష, విషయం వరకు చూస్తే మూడు నాలుగు తరాల పిల్లలు, పెద్దలపై చందమామ ప్రభావం చరిత్రలో నిలిచిపోయేలాగే ఉంది. 10 సంవత్సరాల వయసులో చందమామ చదవడం మొదలు పెట్టిన వారు ఇప్పుడు 73 సంవత్సరాల వయసులో కూడా చందమామలను ఆప్యాయంగా కొని చదువుతూ రేపటి తరం పిల్లల కోసం భద్రపరుస్తూ వస్తున్న తీరు ప్రపంచ చరిత్రలోనే ఏ పత్రిక విషయంలోనూ జరిగి ఉండదనుకుంటాను.

ఇలాంటి ఘటనలు ఒకటీ రెండూ కాదు. వందల మంది పాత తరం పిల్లలు నేటి పెద్దలు చందమామతో తమ అనుబంధాన్ని ఇప్పటికీ మర్చిపోలేకున్నారు. ఇన్ని సమస్యల మధ్య కూడా చందమామ ఇంకా బతికి ఉందంటే అది ఇలాంటి ఘనతర పాఠకుల వల్లేననిపిస్తోంది.”

“గత రెండు మూడు నెలలుగా చందమామ అభిమానులైన బ్లాగర్లతో పరిచయాలు పెంచుకుని, అభిప్రాయాలు పంచుకుని బ్లాగురూపంలో వ్యక్తిగతంగా నేను చేసిన కృషి ఫలించిందనే చెప్పాలి. చందమామ అభిమానుల ఆదరణ సాక్షిగానే నా పర్సనల్ బ్లాగు చందమామకే అధికారిక బ్లాగుగా మారింది. ఇంతకుమించిన గౌరవం ఇంకేం కావాలి.

ఇప్పుడు చందమామ బ్లాగు చందమామ అభిమానులు నిత్యం పంచుకునే వేదికగా మారింది. ప్రపంచంలో ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు చందమామ బ్లాగును దానిలోని వంద కథనాల్లో తమకు నచ్చినదాన్ని చూస్తున్నారు. తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇంతకు మించి నా బ్లాగుకు,నా జీవితానికి ఏం కావాలి?”

“మచిలీ పట్నం సమీపంలోని ఓ గ్రామీణ ప్రాంతం నుంచి వారం క్రితం ప్రభావతి అనే ఓ చందమామ చందాదారు ఉత్తరం పంపారు. మారుమూల ప్రాంతమేమో మరి.. పిన్ నంబర్ వేయలేదు. నేరుగా మాట్లాడడానికి మొబైల్, ల్యాండ్ లైన్ నంబర్లు పొందుపర్చలేదు. పైగా తమ చందా నెంబర్ కూడా వేయలేదు.వీరు రామాయణం సీరియల్ కోసమే చందమామకు చందా కట్టారట. కానీ ఈ సంవత్సరం దాదాపు నాలుగైదు నెలల చందమామలు వారికి చేరలేదట.నవంబర్ సంచిక కూడా రాలేదు.పైగా ఫిబ్రవరి నెల ఇంగ్లీష్ చందమామ అందిందట. రామాయణం సీరియల్ కోసం చందమామను తెప్పించుకుంటుంటే ఇంగ్లీష్ చందమామను ఏం చేసుకోనూ అని ఆమె బాధ.

ఆమె గతంలో చందమామలు రానప్పుడు వెంటనే ఆఫీసుకు  ఉత్తరం పంపారో నాకు తెలీదు. ఆ ఉత్తరం చూసిన వెంటనే వివరాలను సంబంధిత చందమామ విభాగానికి మెయిల్ చేస్తూ వీలయితే వారు పొందకుండా పోయిన అన్ని చందమామలను వారికి ప్రత్యేక మినహాయింపు కింద పంపవలసిందిగా సూచించాను. గ్రామీణ ప్రాంతం నుంచి చందమామ  తెప్పించుకుంటున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయమని ఇటువంటి వారిని చందమామ ఎన్నటికీ పోగొట్టుకోకూడదని,  కారణాలేవయినా సరే.. వారికి పరిహారంగా ఆ చందమామలను త్వరలో పంపాలని సలహా ఇచ్చాను.ప్యాకింగ్ విభాగం వారు సానుకూలంగా స్పందించారనుకోండి.”
 
“…రావు గారూ, నాదో చిన్న కోరిక. మీ పిల్లలకు చందమామ కొనిపిస్తారా లేదా. అయితే ఎప్పుడు? దీన్ని పోటీ పత్రిక లేదా సైట్‌గా చూడవద్దండి. చందమామ మన జాతి సాంస్కృతిక సంపద. తరాలు గడిచినా అది పిల్లలను పెద్దలను ఆకట్టుకుంటూనే ఉంది. పరాయి రాష్ట్రంలో ఉన్నప్పటికీ మీ పిల్లలు కూడా చందమామ పాఠకులుగా అయితే బాగుంటుందేమో కదూ.. ఆలోచించండి..”

“మా పిల్లలకు చందమామ. ముందు వారికి నేను తెలుగు నేర్పాలి. మీ పత్రిక కోసమైనా నేర్పుతాను. అలాగైనా పరాయి రాష్ట్రంలో పరాయి భాషను నేర్చుకుంటున్న మా పిల్లలు పరాయి రాష్ట్రంవారు కాకుండా తెలుగువారుగానే ఉంటారు. మరొక విషయం ఏమిటంటే భవిష్యత్ దర్పణంలో తమిళనాడులో తెలుగుకు “తెగులు” ఏ స్థాయిలో ఉండబోతోందోనన్న ఆందోళన కూడా నాలో కలిగింది. కానీ ఏం చేద్దామండీ.”

“…తమిళనాడులో తెలుగు నేర్చుకున్న వారు ఒక రకంగా శాపగ్రస్తులే. వారిలో కష్టపడే తత్వం, ర్యాంకులు తెచ్చుకునే సామర్థ్యం ఉన్నా ఇది సరైందా, తప్పా అనే భాషా పరిజ్ఞానం లేకుండానే వారి జీవితంలో తదుపరి దశల్లోకి పోతున్నారు. ఇదే వారిని చివరివరకూ వెంటాడుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే, తమిళనాడులో అంతంతమాత్రంగానే తెలుగు పట్ల ప్రభుత్వం చూపిస్తున్న ఆదరణ మరికాస్త కరువైతే వచ్చే తరాల పిల్లల పరిస్థితి ఎలా మారుతుందో ఊహించడం కూడా సాధ్యం కాదు. పరాయిరాష్ట్రంలో తెలుగు నేర్చుకోలేని వారి దౌర్భాగ్యం ఇది.  వాళ్ల చేతుల్లో లేని దానికి,  వాళ్లు నేర్చుకోలేకపోయిందానికి కూడా వారే బలవుతున్నారేమో కదా..”

మీ అభిమాన పూర్వకమైన పలకరింపుకు..
హృదయపూర్వక కృతజ్ఞతలతో..

రాజు.

RTS Perm Link

మామా! మమ్మల్ని మర్చిపోవు కదూ!

December 2nd, 2009

“మామా! మారుతున్న కాలానికి అనుగుణంగా నువ్వు కూడా మారాలని ప్రయత్నిస్తున్నావు కదూ! కాని ఒక్కటి మాత్రం నిజం. ఈ నాటి చాలా మంది ‘టెక్నో పిల్లలు’ జానపద లోకాలలో కాక-సాంకేతిక లోకాలలో విహరిస్తున్నారు. మరి వారికి అనుగుణంగా నువ్వూ మారాలని అనుకోవడం- పొరపాటు కాదేమో! కానీ మామా! యాభై ఏళ్లుగా నీతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ- నీ స్నేహ మాధుర్యాన్ని అనుభవించినవాళ్లం. మేము కూడా ఉన్నామని గుర్తుంచుకుంటావా? మమ్మల్ని కూడా అలరించాలని ప్రయత్నిస్తావు కదూ!”

ఇది చందమామ డిసెంబర్ సంచికలో శివకుమార్ అనే కొంపల్లి పాఠకుల లేఖా పలకరింపు. చందమామలో వస్తున్న ఆధునిక రీతుల పట్ల ఆగ్రహం ప్రకటిస్తున్న పాఠకుల స్పందనలకు కాస్త భిన్నంగా… గతాన్ని, ఆనాటి పాఠకుల అభిరుచులను కాస్త పట్టించుకోవలిసిందిగా కోరుతూ ఈయన చందమామకు ఉత్తరం పంపడానికి ముందే చందమామ మళ్లీ పాత రూపంలోకి మారింది.

పాఠకుల అభిప్రాయాలకు, విమర్శలకు, ఆగ్రహ ప్రకటనలకు తలొగ్గిన చందమామ మళ్లీ కథల పత్రికగా మారుతోంది. ఇంకా మారవలసి ఉందనుకోండి. కథా విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ పాఠకులు కోరుకుంటున్న పాత అభిరుచులకే పట్టం గడుతూ చందమామ మారుతోంది. మళ్లీ పూర్వ రూపానికి క్రమక్రమంగా పరిణమిస్తోంది.

ఈ డిసెంబర్ సంచికలో నమ్మలేని విధంగా నాలుగు చిన్న కథలు, ఒక జానపద కథ, ఒక హాస్య కథ, 25 ఏళ్లనాటి చందమామ కథ, రామాయణం, బేతాళ కథలు, పాతాళదుర్గం ధారావాహికలతో చందమామ కథల పత్రికగా నిండుగా ముస్తాబైంది.

వీటితోపాటుగా అలనాటి చందమామ పాఠకులను రంజింపచేసిన పంచతంత్రం కథలు మళ్లీ చందమామలో అచ్చవుతున్నాయి. సరిగ్గా ఈ డిసెంబర్ నుంచే ఈ కథల ముద్రణ ప్రారంభమైంది. విష్ణుశర్మ, అతడి శిష్యులతో వడ్డాది పాపయ్య గారి ముఖచిత్రం రంగులీనుతూ డిసెంబర్ చందమామను కాంతివంతం చేసింది.

‘మామా! యాభై ఏళ్లుగా నీతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ- నీ స్నేహ మాధుర్యాన్ని అనుభవించినవాళ్లం. మేము కూడా ఉన్నామని గుర్తుంచుకుంటావా? మమ్మల్ని కూడా అలరించాలని ప్రయత్నిస్తావు కదూ!’ అంటూ పాఠకుడు శివకుమార్ వెల్లడించిన చిరుకోరికతో చందమామ మమేకమవుతోంది.

యాభై ఏళ్లుగా తన స్నేహమాధుర్యంతో పరవశించిన పాఠకులను పోగొట్టుకునేది లేదని ఘంటాపధంగా చందమామ ప్రకటిస్తూ మీ ముందుకు వస్తోంది. ఇది ఆరంభం మాత్రమే… కొత్త సంవత్సరంలో మరిన్ని మార్పులతో మీ ముందుకు రావడానికి చందమామ తొలి అడుగులు వేసింది.

మునుపటి లాగే మీ ఆదరణ, అభిమానాలను కోరుకుంటూ…
చందమామ.

గమనిక: పంచతంత్ర కథల పరిచయం కోసం ఈ బ్లాగులో నిన్న పోస్ట్ చేసిన “చందమామ – పంచతంత్ర కథలు” చదవండి.

RTS Perm Link

చందమామ – పంచతంత్ర కథలు

November 30th, 2009

ప్రపంచ సాహిత్యానికి భారత దేశం అందించిన గొప్ప రచనలలో ఎన్నదగినది పంచతంత్రం . క్రీ. శ. 5 వ శతాబ్దంలో విష్ణుశర్మ అనే గురువర్యుడు సంస్కృత భాషలో రచించిన ఈ గ్రంధం ఎన్నో ప్రపంచ భాషలలోకి అనువదింపబడి, ఎంతో ప్రాచుర్యం పొందింది. తన వద్ద నేర్చుకోదలచిన విద్యార్ధులకు పాఠ్యగ్రంధంగా ఈ పుస్తకాన్ని ఆయన రచించాడు.

ఐదు భాగాలుగా విభజించిన ఈ పుస్తకం అనేక చిన్నచిన్న కథల సమాహారం. మానవ జీవితంలో అవసరమైన ఎన్నో ధర్మాలను, నీతి సూత్రాలను చక్కటి కథల రూపంలో, ఆసక్తికరమైన కథనంతో విష్ణుశర్మ బోధించాడు.

పంచతంత్ర నేపథ్యం

దక్షిణ భారతాన మిహిలారోప్యము అనే రాజ్యానికి అమరశక్తి రాజు. ఆతనికి బహుశక్తి, ఉగ్రశక్తి, అనంతశక్తి అని ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురు చదువుసంధ్యలు లేక మూర్ఖుల వలె తయారయ్యారు. ఎంత ప్రయత్నించినప్పటికీ వారికి చదువుపై శ్రద్ధ కలుగలేదు. మనోవేదన చెందిన రాజు తన బాధను మంత్రుల వద్ద వ్యక్తపరచి తరుణోపాయం సూచింపుమన్నాడు. ఒక మంత్రి విష్ణుశర్మ అనే గురువు గురించి చెప్పి అతనికి రాకుమారులను అప్పగింపుమని సలహా ఇచ్చాడు.

రాజు విష్ణుశర్మను పిలిపించి, రాకుమారుల చదువు విషయమై తన వేదనను వివరించి, ‘నా బిడ్డలకు విద్యా బుద్ధులు నేర్పండి, మీకు తగిన పారితోషికం ఇస్తాను’ అని అన్నాడు. విష్ణుశర్మ బదులిస్తూ ‘నేను విద్యను అమ్ముకోను, నీ బిడ్డలను నీతిశాస్త్ర కోవిదులను చేస్తాను, నాకే విధమైన పారితోషికం అవసరం లేదు’ అని చెప్పి రాకుమారులను తీసుకొని వెళ్ళాడు.

వారికి బోధించదలచిన పాఠ్య ప్రణాళిక ప్రకారం కొన్ని కథలను స్వయంగా రచించి, బృహత్కథ నుండి కొన్ని కథలను గ్రహించి, పంచతంత్రమును రచించాడు. ఆ కథలను వారికి చెప్పి, నీతిని బోధించి ఆరు నెలలలో వారిని నీతిశాస్త్ర కోవిదులను చేసి, రాజుకిచ్చిన మాటను చెల్లించుకున్నాడు.

విశిష్టత

విషయ పరిజ్ఞానం, బోధనా సామర్థ్యం, చక్కని పాఠ్య ప్రణాళిక ఉంటే, చదువంటే ఇష్టము, ఆసక్తి లేని వారికి కూడా బోధించి విద్యావంతులను చెయ్యవచ్చని 5 వ శతాబ్దం లోనే విష్ణుశర్మ నిరూపించాడు. 1500 సంవత్సరాల నాటి ఈ రచన ఈనాటికీ ప్రతి సమాజానికీ అనుసరణీయమే, ఆమోదయోగ్యమే! అదే పంచతంత్రం యొక్క విశిష్టత.

పంచతంత్రం 5 విభాగాల, 69 కథల సంపుటి. కథలలోని పాత్రలు ఎక్కువగా జంతువులే. పాత్రల పేర్లు వాటి మనస్తత్వాన్ని, సహజ ప్రవృత్తినీ, నడతను సూచిస్తూ ఉంటాయి. కథనం సరళంగా ఉంటూ, సామెతలు, ఉపమానాలను గుప్పిస్తూ, ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. సమాజం గురించి, వ్యవస్థ, మనుష్య ధర్మం గురించిన ఎన్నో విషయాలు కథలలో మిళితమై వస్తాయి. పంచతంత్రం ఒక ప్రాంతానికి, ఒక కాలానికి పరిమితం కాని, చిరస్థాయిగా నిలిచిపోయే సార్వత్రిక విజ్ఞానం.

ఈరోజుకి మనకి తెలిసినంతవరకు, క్రీ.శ. ఆరవ శతాబ్దం నుంచి మొదలుపెట్టి మన పంచతంత్రం కనీసం యాభై ప్రపంచ భాషల్లోకి అనువదించబడిందట. పంచతంత్ర కథలు అనేక దేశాల సంస్కృతుల్లోనూ, కథా సాహిత్యంలోనూ కలిసిపోయి, ఆయా దేశాల సామాన్య ప్రజల నోళ్ళలో నాని, వాళ్ళ ప్రాంతీయమైన రంగు, రూపు, వాసనల్ని పొంది, చివరికి ఆ ప్రాంతాల కథలుగానే ఇప్పటికీ చెలామణీ అవుతున్నాయట. పాశ్చాత్య కథా సాహిత్యం మీద పంచతంత్రం ప్రభావం అపారమని చాలామంది పండితులు అభిప్రాయపడుతుంటారు.

పంచతంత్రం క్రీ.శ. ఆరవ శతాబ్దంలో పహ్లవీ (పర్షియా) భాషలోకి అనువదించబడిందనీ, అదే తర్వాత సిరియన్ భాషలోకి, సిరియన్ అనువాదం ఖలీల్ వదిమ్న అన్న పేరుతో అరబ్బీ భాషలోకి అనువదించబడిందని తెలుస్తోంది. అరబిక్ పంచతంత్రం తర్వాత శతాబ్దాల్లో గ్రీకు, లాటిన్, హిబ్రూ ల్లోకి అనువాదం చెయ్యబడింది. ఆ తర్వాత క్రమంగా అనేక యూరోపియన్ భాషల్లోకి కూడా అనువాదాలు వచ్చాయట. ఏషియా, యూరోపు, ఆఫ్రికాలో కూడా పంచతంత్ర కథలు వ్యాపించాయని ప్రతీతి.

గ్రీకుభాషలోని ఈసప్ కథల్లోనూ, అరేబియన్ నైట్సులోనూ కూడా పంచతంత్ర కథలు కలిసిపోయాయని రచయితలు అభిప్రాయపడ్డారు. అయితే పంచతంత్ర కథలకి మూలం గ్రీకు కథలని కూడా వాదాలు ఉన్నాయి. భారత, గ్రీకు సంస్కృతుల మధ్య జరిగిన ఆదాన, ప్రదానాల్లో ఇక్కడి కథలు అక్కడికీ, అక్కడి కథలు ఇక్కడికీ వెళ్ళి ఉండచ్చని కూడా ఒక ఊహ.

(ఈ పంచతంత్ర కథల పరిచయానికి పూర్తిగా తెవికీ, నాగమురళి గారి బ్లాగ్‌లోని వ్యాస భాగాలే ఆధారం.)

పంచతంత్రం ధారావాహికగా తెలుగులో ప్రచురించిన ఘనత చందమామ పత్రికకు దక్కింది. సరళమైన తెలుగులో, ఆకర్షణీయమైన బొమ్మలతో కొన్ని సంవత్సరాల పాటు, పంచతంత్రం ధారావాహికగా ప్రచురించారు.

కొన్ని దశాబ్దాల క్రితం చందమామలో వచ్చిన ఈ పంచతంత్ర కథలను పాఠకుల కోరిక మేరకు ఈ డిసెంబర్ నుంచి చందమామ మళ్లీ ప్రచురిస్తోంది. దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు కొనసాగే పంచతంత్ర కథలను చందమామ నూతన సంవత్సర కానుకగా తన పాఠకులకు తిరిగి అందిస్తోంది.

ప్యాకింగ్‌కు తయారవుతున్న డిసెంబర్ చందమామ ముఖచిత్రాన్ని సోమవారం ఉదయం ఆఫీసులో దూరంనుంచి చూడగానే కళ్లముందు ఓ మెరుపు మెరిసినట్లయింది. రాజకుమారులకు కథలు చెబుతున్న విష్ణుశర్మను ముఖచిత్రంగా చూడగానే మళ్లీ ఓ నాలుగు దశాబ్దాలకు ముందునాటి చందమామ ముఖచిత్రాన్ని చూసిన అనుభూతి.

చందమామను చదవండి. వీలైతే చందా కట్టండి అని ధైర్యంగా మిత్రులకు సిఫార్సు చేయడానికి ఇప్పుడు ఏ సందేహాలూ లేవు. ఒక పంచతంత్రం కథలు, బేతాళ కథలు, దాసరి సుబ్రహ్మణ్యం గారి పాతాళదుర్గం సీరియల్, రామాయణం, 25 ఏళ్ల నాటి చందమామ కథ, జానపద కథ ఇవి చాలు…. చందమామను చూడండి, చదవండి, తీసుకోండి అని రెకమెండ్ చేయడానికి…

అందుకే గతంలో లేని ధైర్యంతో ఇప్పుడు మిత్ర బృందానికి, బంధువులకు, తెలిసిన వారికి చందమామను చూడమని ఫోన్లు చేయడం. ఇప్పుడీ బ్లాగులో కూడా చందమామ అభిమానులకు తెలియజేయడం.

ఇంతకు ముందే ప్రస్తావించినట్లుగా… ఒక ప్రాంతానికి, ఒక కాలానికి పరిమితం కాని, చిరస్థాయిగా నిలిచిపోయే సార్వత్రిక విజ్ఞానం పంచతంత్ర కథలు.. ఈ డిసెంబర్ నుంచి మళ్లీ మీ ముందుకు ప్రింట్ రూపంలో వస్తోంది. వడ్డాది పాపయ్య గారి ముఖచిత్రంతో జిగేలుమంటున్న డిసెంబర్ చందమామ ఈ వారం మొదట్లోనే మార్కెట్‌లోకి రావచ్చు. తీసుకుని చదువుతారు కదూ..

ఆద్యంతం జంతువుల పాత్రలతో సమాజం గురించి, వ్యవస్థ, మనుష్య ధర్మం గురించిన ఎన్నో విషయాలను మానవజాతికి సుబోధకం చేసిన ఇప్పటికీ చేస్తున్న అపూర్వ కథా సాగరం పంచతంత్ర కథలు.

తల్లిదండ్రులారా! అలనాటి చందమామ పాఠకాభిమానులారా! ఈ డిసెంబర్ నుంచి చందమామను మీ పిల్లలకు తప్పక పరిచయం చేయండి. ఓ అరగంటైనా వారితో కూర్చుని పంచతంత్ర కథలను చదివించండి.. చదివి వినిపించండి.

RTS Perm Link

వంద కథనాల చందమామ బ్లాగు

November 19th, 2009
చందమామ తొలిసంచిక ముఖచిత్రం

చందమామ తొలిసంచిక ముఖచిత్రం

మిత్రులారా! ఇవ్వాళ్టితో నా బ్లాగులో వంద పోస్టులు చేరాయి. నాలుగు నెలల క్రితం అంటే జూలై 7న ‘చందమామ’ జ్ఞాపకాలను పదిలపర్చాలన్న చిరుకోరికతో, సదసత్సంశయంతో మొదలుపెట్టిన ‘చందమామలు’ బ్లాగు ‘చందమామ చరిత్ర’ సాక్షిగా నేటికి 130 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే ఈ పోస్టుతో కలిపి ఈ నాలుగు నెలలూ ఈ బ్లాగులో పొందుపర్చిన కథనాలు, కథలు, పరిచయాలు, జ్ఞాపకాలు సరిగ్గా వందకు చేరుకున్నాయి. ఈ నాలుగు నెలల కాలంలోనే దాదాపుగా 14 వేల హిట్లు కూడా ఈ బ్లాగు సాధించింది.

ప్రధానంగా పాఠకులు, చందమామ అభిమానులు… మీరే ఈ విజయానికి నిజమైన కారకులు. తొలి పేరాలో సదసత్సంశయం అని ఎందుకు వాడానంటే చందమామతో అనుభూతులు, జ్ఞాపకాలు, పరిచయాలు ప్రధానంగా ఈ బ్లాగులో ఉంచాలని మొదట్లో అనుకున్నప్పుడు ఓ చిన్నపాటి సందేహం కూడా కలిగింది

గతంలో ఉజ్వలంగా వెలిగిన ఈ నిరుపమాన కథల పత్రిక గురించి, దాని చరిత్ర గురించి, మరుగున పడిన చందమామ అంతర్గత విషయాల గురించి, దాంట్లో దశాబ్దాలుగా పనిచేస్తూవచ్చిన ధీమంతుల గురించి రాస్తే ఎవరు చూస్తారు, ఎవరికి చందమామ గత చరిత్రను చదవగలిగిన ఓపిక, తీరిక ఈ స్పీడ్ యుగంలో ఉందని భయపడిన మాట వాస్తవం. అందుకే మంచి పనిని కించిత్ సంశయంతోనే మొదలు పెట్టాను.

అయితే ఆగస్టు నెలలో కూడలి, జల్లెడ, హారం వంటి తెలుగు బ్లాగుల సమాహారంలో చేరిన తర్వాత ఈ బ్లాగులో కదలిక పుంజుకుంది. చందమామతోడుగా బాల్యంలో పెరిగి పెద్దయిన వారు, చందమామను మధ్యలో స్కూలు, కాలేజీ రోజుల్లో చదివి దానిపై మమకారం పెంచుకున్నవారు, ఒక ఇంటలెక్చువల్ ప్యాషన్‌తో చందమామ చరిత్రను తలపులనిండా ఉంచుకుని తమ బ్లాగుల్లో అలనాటి చందమామపై మంచి మంచి వ్యాసాలు, కథనాలు ఇప్పటికే పోస్ట్ చేసిన వారు, చేస్తున్నవారు… సామాన్యుల నుంచి మాన్యుల వరకు, ఇలా ప్రతి ఒక్కరూ.. ఈ బ్లాగును తమ స్వంతం చేసుకున్నారు.

చందమామ చరిత్రను, వ్యక్తుల పరంగా, కథల పరంగా, సంఘటనల పరంగా అక్షరబద్ధం చేస్తూ వచ్చిన ప్రతి దశలోనూ మీరంతా హితవచనాలు పలుకుతూ, విలువైన వ్యాఖ్యల ద్వారా నాలో మరింత ప్రోత్సాహాన్ని ప్రోది చేశారు. రాష్ట్రం సరిహద్దులు దాటి ప్రపంచం నలుమూలలనుంచి మీరు ఎప్పటికప్పుడు ఈ బ్లాగును చూస్తూ, వ్యాఖ్యలు రాస్తూ, వ్యక్తిగతంగా కూడా ఈమెయిల్ సందేశాలు పంపుతూ చందమామ చరిత్రను సాధ్యమైన మేరకు వెలికి తీయాలన్న నా కుతూహలాన్ని రెట్టింపు చేశారు.

నిజం చెప్పాలంటే ఒక బ్లాగర్‌కు తోటి బ్లాగర్లతో, ఒక చిన్న రచయితకు తోటి రచయితలతో, చందమామ అభిమానులతో ఏర్పడిన స్నేహం, పరిచయం, హృదయ స్పందనలు ఉద్దీప్తం చెందిన రోజులివి. సరిగ్గా 10 నెలల క్రితం ఆన్‌లైన్‌ చందమామలో ఉద్యోగిగా చేరిన నాకు గత నాలుగు నెలలుగా మనసుకు స్వాంతన కలిగించిన రోజులివి.

గత 30 ఏళ్లుగా చందమామ ప్రింట్ ఎడిషన్‌లో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేస్తున్న బాలుగారు, ఇదే చందమామలో 1952 నుంచి గత 57 సంవత్సరాలుగా శ్రమిస్తూ వచ్చిన చందమామ చిత్రమాంత్రికుడు శంకర్ గారు… నేను లేవనెత్తిన ప్రతి సందేహాన్ని ఓపిగ్గా వివరించడం ద్వారా చందమామ గత చరిత్ర తలుపుల వద్ద నన్ను నిలబెట్టారు.

చందమామ తీరంలో గవ్వలు ఏరుకోవడానికి ఆబగా పరుగెత్తిన నన్ను సంస్థ లోపలనుంచి ప్రోత్సహించడంలో, అడిగిన ప్రతి సమాచారాన్ని దాచుకోకుండా చెప్పడంలో వీరు అందించిన నిజమైన సహకారం జీవితకాలంలో మరువలేను. అలాగే చందమామ అమూల్యనిధిని – సర్వశ్రీ చిత్రా, ఎంటీవీ ఆచార్య, శంకర్, వడ్డాది పాపయ్య గార్లు గీసిన చిత్రాలు- పరిరక్షించిన వైనం గురించి చందమామ లైబ్రేరియన్ బాలసుబ్రహణ్యం గారు ఇచ్చిన సమాచారం కూడా మరువలేనిది.

ఈ బ్లాగు మొదలు పెట్టేటప్పుడు ఈ బ్లాగులక్ష్యం గురించి నాగురించి పరిచయంలో ఇలా రాసుకున్నాను.

“తెలుగు జాతి సాంస్కృతిక సంపద అయిన చందమామను ఈ నాటికీ తమ జ్ఞాపకాల దొంతరలలో పదిలపర్చుకుంటున్న చందమామ అభిమానుల గుండె చప్పుళ్లను ఓ చోట చేర్చి అందరికీ పంచిపెట్టాలనే చిరు కోరికే ఈ బ్లాగ్ రూపకల్పనకు మూలం.
 
…జీవించడం కోసం ప్రపంచం నలుమూలలకు వలసపోయిన తెలుగు వారు చందమామ పత్రికతో తమ తరాల అనుబంధాన్ని నేటికీ ఎలా కాపాడుకుంటూ వస్తున్నారో, పరస్పరం చందమామతో తమ జ్ఞాపకాలను ఎలా పంచుకుంటున్నారో తెలిపే అమూల్యమైన వ్యాసాలు, లింకులు, తదితర సమాచారం కోసం ఈ బ్లాగులో చూడవచ్చు. చందమామ చరిత్ర, చందమామ కథల సమీక్ష, పరిచయం, వ్యక్తుల పరామర్శ తదితర చందమామ సంబంధింత సమాచారాన్ని ఈ బ్లాగులో అందరూ చూడవచ్చు.”

చందమామ సంస్థ లోపలనుంచి నేను గత నాలుగు నెలలుగా సేకరించిన సమాచారం, పత్రిక చరిత్ర, అడపా దడపా అంతర్గత విషయాలు ఈ బ్లాగు పాఠకులకు, చందమామ అభిమానులకు, పెద్దలకు ఏ మేరకు సమ్మతమైనాయో, ఉపయోగపడ్డాయో నాకయితే తెలీదు కాని ప్రతి కథనంలోనూ, మీరు చేస్తూ వచ్చిన వ్యాఖ్యలు, స్పందనలు, హితోక్తులు మాత్రమే, ఇంత తక్కువ కాలంలో ఈ బ్లాగులో వంద పోస్టులు పూర్తి కావడానికి ప్రేరణగా నిలిచాయని వినమ్రంగా చెబుతున్నాను.

వ్యక్తిగతంగా నేను  రూపొందించుకున్న ఈ బ్లాగు చివరకు సంస్థకే అధికారిక బ్లాగుగా మారిందంటే ఇంతకు మించిన విజయం మరొకటి ఉండదనే అనుకుంటున్నాను. ఇది నా స్వంత బ్లాగుగా ఉండకపోవచ్చు కానీ చందమామ అభిమానులందరి ఆదరణను పొందిన బ్లాగుగా మీరిచ్చిన ఈ భాగ్యాన్ని, సంతోషాన్ని, మహదానుభూతిని జీవితం చివరి వరకు మర్చిపోలేను.

చందమామ చరిత్రపై మీరు చూపుతూ వచ్చిన ఈ ఆదరణ, అభిమానం రేపోమాపో చందమామపై రాసే, రాయబోయే ప్రతి బ్లాగరుకూ అందిస్తారని, ప్రతి చందమామ చరిత్ర కథనాన్ని, మన చందమామ గత వైభవాన్ని ఇలాగే పంచుకుంటారని, పంచుకుంటూ ఉండాలని కోరుకోవడం తప్ప ఈ తరుణంలో మరేమీ చెప్పలేను.

మీ అందరికీ శతసహస్రవందనాలతో
చందమామ రాజు

RTS Perm Link

అపురూప శిల్పాల చెన్నయ్ మ్యూజియం -1

November 18th, 2009
నటరాజ శిల్పం

నటరాజ శిల్పం

ఇది నా చిన్నప్పటి మాట. 1977లో పదో తరగతి చదువుతున్న రోజులు. మా స్కూలు తరపున కంచికామాక్షి, మదుర మీనాక్షి మహాబలిపురం ఆలయాలు, అప్పటి మద్రాసు నగర సందర్శన కోసం ఓ విహారయాత్ర ఏర్పాటు చేశారు. ఓ బస్సులో 50 మంది విద్యార్థులు, అధ్యాపకులు కలిసి చేసిన ఆనాటి యాత్ర ఇప్పటికీ గుర్తు ఉంది.

ముఖ్యంగా కంచి దేవాలయంలో బంగారు బల్లి, మదుర దేవాలయం శిల్పకళా సంపద, మహాబలిపురంలో ఆ పెద్ద రాతిగోడపై దిగ్భ్రాంతి కలిగించే రూపంలో ఉన్న మహా గజరాజ శిల్పం, చెన్నయ్ -ఎగ్మూరు మ్యూజియంలో ఓ పెద్ద రూమునిండా వ్యాపించిన తిమింగలం అస్థిపంజరం, ఈ నగరంలోని బతికిన, చచ్చిన కాలేజీల విశేషాలు వంటివి ఎప్పటికీ మర్చిపోలేను కూడా.

ఎగ్మూరులోని ప్రభుత్వ మ్యూజియంపై ఆన్‌లైన్ చందమామ తరపున కథనాలు ప్రచురించేందుకోసం రెండు వారాల క్రితం మరోసారి దానిని సందర్శించాము. చిన్నప్పుడు మా స్కూలు విహారయాత్రలో భాగంగా దాన్ని చూడటం జరిగింది. 1996లో ఓ పూర్తిరోజు అక్కడే గడిపాము. తిరిగి 13 ఏళ్ల తర్వాత మళ్లీ పక్షంరోజుల క్రితం చందమామ పనిలో భాగంగా అక్కడికి వెళ్లాము. ఆ విశేషాలను తొలి భాగాన్ని ఇక్కడ అందిస్తున్నాం.

అపురూప శిల్పాలు

పాతవస్తువులు ఏవైనా ఉంటే అటకెక్కించండిరా అని పల్లెల్లో పెద్దలు అంటుంటారు. ఏ వస్తువును కూడా అంత సులభంగా వదులుకోలేని మనస్తత్వం పల్లెటూళ్లలో ఎక్కువగా ఉంటుంది. ఈ జీవిత నేపథ్యంలోంచే అటక, అటకెక్కించడం అనే పదాలు పుట్టాయి. పాత వస్తువులను పెద్ద ఎత్తున సేకరించి ఒక చోట పెట్టడమే కాలక్రమంలో మ్యూజియం, వస్తుప్రదర్శన శాలల ఉనికికి దారి తీసి ఉంటుంది.

మరి పాత వస్తువులు అంటే ఎంత పాతవి. పదేళ్లకు ముందు ఉన్నవీ, 50 ఏళ్లు లేక వందేళ్ల ముందు ఉన్నవీ అయితే వాటికి పెద్దగా విలువ ఇవ్వలేము కదా. కొన్ని వందల, వేల ఏళ్లు, లక్షల ఏళ్ల క్రితం నాటి అపురూప వస్తువులు, శిలాజాలు, మనుషులు ఉపయోగించిన పనిముట్లు, తదితర వస్తువులను మనం ప్రపంచ వ్యాప్తంగా మ్యూజియాలలోనే చూడగలం.

మరి చెన్నయ్‌లో ఎగ్మూరులో ఉన్న సుప్రసిద్ధ ప్రభుత్వ మ్యూజియం విశేషమేమిటి? మ్యూజియంలోఅడుగు పెట్టినప్పటి నుంచి పురాతన చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన అద్భుత శిల్పాలు మన కళ్లముందు కనబడతాయి. ఇవి మన ప్రాచీన చరిత్రకు, శిల్పకళా వైదగ్ధ్యానికి నమూనాలుగా మిగిలిన మౌనసాక్షులు. వీటిని తావులేక బయటపెట్టారేమో కాని మ్యూజియంలో ఆ పాడుబడిన చోట గోడ పక్కన ఆనించి ఉంచారు. ఒకరకంగా చెప్పాలంటే ఇవి చరిత్ర లేని రాతి శిల్పాలు

రెండు కోట్ల ఏళ్ల నాటి శిలాజ దుంగ

రెండు కోట్ల ఏళ్ల నాటి శిలాజ దుంగ

రెండు కోట్ల ఏళ్ల నాటి శిలాజ దుంగ

వెయ్యేళ్లకు ముందు నాటి విశేషం మనకు కనబడితేనే మనం ఆశ్చర్యంతో నోరు తెరిచేస్తాం. అలాంటిది.. 2 కోట్ల సంవత్సరాల క్రితం భూమి పొరల్లో కప్పబడి శిలాజంగా మారిపోయిన అరుదైన కొయ్య శిలాజం మనకు ఈ మ్యూజియం బయటే దర్శనమిచ్చి అబ్బురపరుస్తుంది. ఇంగ్లీషులో దీన్ని Fossile tree trunk అంటారు. మానవ చరిత్రలో బయల్పడిన అత్యంత పురాతన వస్తువులలో ఒకటి మన కళ్లముందు మ్యూజియం బయటే ఉందంటే నిజంగా ఆశ్చర్యమేస్తుంది.

సాధారణంగా ఏ కొయ్య అయినా, దుంగ అయనా, చెట్టు మొద్దు అయినా ఉపయోగంలో లేకుండా పడి ఉంటే కొన్నాళ్లకు చెదలు పట్టి భూమిలో కలిసిపోతుంది. అలాంటిది రెండు కోట్ల సంవత్సరాలుగా ఈ అరుదైన కొయ్య ఎలా సురక్షితంగా ఉండిపోయిందో తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

మ్యూజియం బయట ఆ పురాతన కొయ్య ముందు ఫలకం మీద రాసిన దాని ప్రకారం నదులలో కొట్టుకు వచ్చిన చెట్లు లోతట్టు సరస్సులలో భద్రపర్చబడతాయి. అవి తర్వాత పరిణామక్రమంలో శిలాజాలుగా రూపొందుతాయి. ఇలా ఏర్పడిన ఈ శిలాజ దుంగలలోని కొయ్య భాగాన్ని సిలికాన్ పదార్థం భర్తీ చేస్తుంది.

అలా ఏర్పడేదే ఫాజిల్ ట్రీ ట్రంక్. ఇవి మానవులకు ప్రకృతి ప్రసాదిత నిధులుగా మిగిలిపోతాయి. ఇలాంటి శిలాజ దుంగలు తమిళనాడులో విల్లుపురం జిల్లా వన్నూరు తాలూకాలోని తిరువక్కారై నేషనల్ ఫాజిల్ పార్క్‌లో కూడా ఉన్నాయట.

ఎగ్మూర్ మ్యూజియం విశేషాలు…

great statue 400-330

పాత చెన్నయ్‌ నగరంలో దట్టమైన చెట్లమధ్య ప్రభుత్వ మ్యూజియం నెలకొని ఉంది. ఆ ప్రాంతంలోని అన్ని భవంతులూ మ్యూజియంకు చెందినవే మరి. మ్యూజియంలో 6 గ్యాలరీలు ఉన్నాయి. ఇవి ఒకదానికి ఒకటి తీసిపోవు. వీటిలో మొదటిది మెయిన్ బిల్డింగ్. ఇది పురావస్తుశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, భూగర్భశాస్త్రం, పోస్టల్ స్టాంపుల అధ్యయన శాస్త్రం వంటి అధ్యయన విశేషాలతో కూడి ఉంటుంది.

ఇక రెండవదైన ఫ్రంట్ బిల్డింగ్‌లో తోలుబొమ్మలు, పూర్వచరిత్ర, ఆయుధాలు, మందుగుండు, సంగీత వాయిద్యాలు, శరీర నిర్మాణ శాస్త్రం, జానపద సంస్కృతి, కొయ్య శిల్పాలు, అలంకరణ శిల్పం వంటి అంశాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.

ఇక మూడవదైన బ్రాంజ్ గ్యాలరీలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దినుంచి క్రీస్తు శకం 18వ శతాబ్ది వరకు లభ్యమైన అపురూపమైన కంచు శిల్పాలు ఉన్నాయి. నాలుగవదైన చిల్డ్రన్స్ మ్యూజియంలో అలంకృత బొమ్మలు, ప్రపంచ నాగరికత, సైన్స్, రవాణా, టెక్నాలజీ, సైన్స్ పార్కు ఉన్నాయి.

అయిదవదైన నేషనల్ ఆర్ట్ గ్యాలరీలో మొఘలాయీ, రాజపుత్ర చిత్రాలు, తంజావూరు చిత్రాలు, ఇతర సాంప్రదాయిక చిత్రాలు, ఏనుగు దంతాలతో చేసిన కళాకృతులు వంటివి ఉన్నాయి. ఇక ఆరవదైన సమకాలీన ఆర్ట్ గ్యాలరీలో తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధి, బ్రిటిష్ చిత్తరువులు, రవివర్మ చిత్రాలు, హోలోగ్రాములు, శిలా, గుహా కళా రూపాలు వంటివి ఉన్నాయి.

మరిన్ని చిత్రాలు చూడాలంటే ఈ లింకులో చూడండి.

వచ్చే వారం మరికొన్ని విశేషాలతో…..

RTS Perm Link

తరాల ఊహలను ఒడిసి పట్టుకున్న చిత్రకారుడు

November 17th, 2009
శంకర్ - బేతాళ కథలు

శంకర్ - బేతాళ కథలు

అనగా అనగా ఓ ఊరిలో శివశంకరన్ అనే ఓ అబ్బాయి ఉండేవాడు. ఆ ఊరిపేరు కారత్తొళువు. ఇది కోయంబత్తూరు సమీపంలో ఉండే చిన్న ఊరు. పదేళ్ల వయసులో అతడు చదువుకోడానికి మద్రాసు మహానగరానికి వచ్చాడు. పదవ తరగతి పూర్తి చేశాడు. తనకు డ్రాయింగ్ నేర్పిన టీచర్ అతడిని డిగ్రీ చదువుకు పోవద్దని, ఎగ్మూరులో ఉండే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరమని సలహా ఇచ్చారు.

తన టీచర్ సలహాను పాటించిన ఆ అబ్బాయి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చిత్రకళను అభ్యసించాడు. తర్వాత ఓ ప్రముఖ పిల్లల పత్రికలో చిత్రకారుడిగా చేరాడు. తను గీసిన చిత్రాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. దాంతో అతడి జీవితం సాఫీగా, సంతోషంగా గడిచిపోయింది.

ఇది.. శంకర్ గారి కథ. ఓ రకంగా చందమామ కథ కూడా. ఆయనకు ఇప్పుడు 85 ఏళ్లు.  మీరు, మీ తల్లిదండ్రులు, చివరకు మీ తాత ముత్తాతలు కూడా దేన్నయితే చదువుతూ, పెరిగి పెద్దవారవుతూ వచ్చారో.. ఆ ‘చందమామ’ పత్రికను ఉన్నత శిఖరాలమీద నిలిపిన అలనాటి మేటి బృందంలో, మన కళ్లముందు సజీవంగా మిగిలి ఉన్న ఏకైక చిత్రకారుడు శంకర్ గారే.

కత్తి చేత బట్టి వీపుపై శవాన్ని మోసుకుని నడిచే సాహస చక్రవర్తిని వర్ణించే ‘బేతాళ కథలు’ ధారావాహికకు గత యాభై ఏళ్లుగా చిత్రాలు గీస్తూ వస్తున్న చిత్రకారులు శంకర్. 1950ల మధ్యలో తొలిసారిగా బేతాళ కథలకు బొమ్మలు గీయడం ప్రారంభించారు. తర్వాత చందమామ పత్రికకు వందలాది చిత్రాలు గీసిన చరిత్రను సొంతం చేసుకున్నారు.

శంకర్ గారు అధికారికంగా రెండు దశాబ్దాలకు ముందే పదవీవిరమణ చేశారు. అయితే ఎప్పుడు రిటైర్ అయ్యిందీ ఆయనకు కాని ఆయన సతీమణికి కాని ఇప్పుడు స్పష్టంగా తెలీదు. అయితే రిటైర్ అయన తర్వాత కూడా చందమామకు చిత్రాలు గీయడం మాత్రం కొనసాగించారాయన. ఆయన జ్ఞాపకశక్తి ప్రస్తుతం అంత చురుగ్గా లేకపోవచ్చు కానీ, ఆయన చిత్రరేఖలు మాత్రం ఇప్పటికీ వాడిగానే ఉంటున్నాయి.

ఈ నవంబర్ మొదటి వారం వరకు ఆయన చందమామ ఆఫీసుకు వెళ్లి పనిచేసేవారు. నవంబర్ 2న ఆయన ఉదయం ఆఫీసుకు వస్తుండగా క్యాబ్‌లోనే స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాక కోలుకున్నారు. దీంతో ఇకపై ఇంటినుంచే చందమామ పని చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆయన 1952లో రూ.300ల వేతనంతో చందమామలో చేరారు.

శంకర్ గారి కథ చందమామతో పెనవేసుకుపోయింది. నిజంగానే చందమామ, శంకర్ ఇరువురూ తమ ఆరోగ్యం గురించి ఆలోచించవలసిన సమయమిది. శంకర్ గారికి విశ్రాంతి అవసరం. చందమామకు కాయకల్ప చికిత్స జరగడం అవసరం.

ఈ కథనం పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 NB: ప్రస్తుతం ఇంట్లోనుంచే చందమామ చిత్రరచన చేస్తున్న శంకర్‌గారితో మాట్లాడాలంటే కింది ల్యాండ్ ఫోన్ నంబర్‌కు కాల్ చేయండి.

044-64508610

ఆన్‌లైన్ చందమామలో శంకర్ గారిపై వివిధ సందర్భాలలో వచ్చిన కథనాలను కింద చూడగలరు.

చందమామ చిత్ర మాంత్రికుడు : శంకర్

చివరి శ్వాసవరకు చందమామ తోటే ఉంటా…

చందమామ శంకర్ గారి జీవిత వివరాలు…

చందమామలో శంకర్‌గారు అడుగుపెట్టినవేళ

శంకర్ గారి నోట కమ్మటి తెలుగు భాష

చందమామ శంకర్ గారికి అనారోగ్యం

ఇకపై ఇంటివద్దనుంచే పనిచేస్తా…

మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.

RTS Perm Link

ఇంటివద్దనుంచే పనిచేస్తా: శంకర్

November 12th, 2009
ఆఫీసులో శంకర్ గారు

ఆఫీసులో శంకర్ గారు

గత 57 ఏళ్లుగా చందమామలో అవిశ్రాంతంగా చిత్రాలు గీస్తూ వచ్చిన శంకర్ గారు వయోపరిమితుల కారణంగా చందమామ ఆఫీసుకు “సెలవు” తీసుకున్నారు. కార్యాలయానికి సెలవే కాని పనికి కాదు. రెండువారాల క్రితం క్యాబ్‌లో చందమామ కార్యాలయానికి వస్తూ మైకం కమ్మి పడిపోయిన శంకర్ గారు ఓ వారం రోజుల పాటు ఇంట్లో విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇక ఇంటినుంచి చందమామ చిత్రాలు గీయాలని నిర్ణయించుకున్నారు.

‘చివరి వరకూ చందమామతో ఉంటాను, చందమామలోనే పని చేస్తాను’ అంటూ 85 ఏళ్ల వయసులో కూడా పంటిబిగువన వాహన ప్రయాణ భారం సహిస్తూ వచ్చిన శంకర్ గారు, వృద్ధాప్యం ఇక ప్రయాణానికి సహకరించదన్న గ్రహింపుతో తన పనిరంగాన్ని ఇంటికి పరిమితం చేసుకున్నారు.

ఇప్పటికే వారంలో తొలి మూడు రోజులు మాత్రమే చందమామ కార్యాలయంలో పనిచేస్తూ వస్తున్న ఆయన ఇకపై అయిదు రోజులూ ఇంటిలోనే ఉండి చందమామ బొమ్మలు గీయనున్నారు. ఓ వైపు తన కుటుంబం, మరోవైపు చందమామ యాజమాన్యం, సిబ్బంది కూడా ఎప్పటినుంచో ఇస్తూ వస్తున్న సలహాను ఈ నవంబర్ రెండో వారం నుంచే శంకర్ గారు అమలులో పెట్టేశారు.

గత అయిదు దశాబ్దాలకు పైగా భారతీయ పిల్లల మనో ప్రపంచంలో దాగిన ఊహలను ఒడిసి పట్టుకుని ఓ సరికొత్త చిత్రప్రపంచాన్ని కళ్లముందు ఆవిష్కరించిన చందమామ మేటి చిత్రకారులలో ఈయన ఒకరు. లక్షలాది పిల్లల బాల్యాన్ని జీవం ఉట్టిపడే బొమ్మలతో తేజోవంతం చేసిన చందమామ తొలి చిత్రకారుల బృందంలో ఒకరైన శంకర్ గారు చందమామ మూలస్తంభాల్లో మనకు మిగిలిన ఏకైక వ్యక్తి.

చందమామను, దాని బొమ్మలను చూసి చదువు నేర్చుకున్న ఆ తెలుగు మహిళ… చందమామలో శంకర్ గారు గీసిన కృష్ణుడి ముఖ చిత్రాన్ని తీసుకుని పూజలు సల్పి ఇంట్లోని దేవుడికి పూజ చేసినప్పటికంటే ఎక్కువగా తాదాత్మ్యత పొందిన చెన్నయ్ కృష్ణ భక్తుడు… చందమామను వెదురుబొంగులో భద్రంగా దాచుకుని ఏనాటికైనా శంకర్, చిత్రా గార్ల లాగా బొమ్మలు గీయక పోతానా  అని కలలు కంటూ వచ్చిన ఆ ఒరిస్సా గొర్రెలకాపరి…

ఇలా ఒకటేమిటి, భారతదేశంలోని నలుమూలల నుంచి లక్షలాది పిల్లలు, పెద్దలు, వయోవృద్ధులు చందమామను తమదిగా చేసుకుని హత్తుకున్న చరిత్రకు ప్రతీకలుగా నిలిచిన సజీవ వ్యక్తులలో శంకర్ గారు ఒకరు.

ఆయన ఇకనుంచి చందమామ ఆఫీసుకు రారు. ఇంట్లోంచే చందమామ పని చేస్తారు. 10  కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసి వచ్చే ఆ స్పురద్రూపి, మెల్లగా కాళ్లు ఈడ్చుకుంటూ ఆఫీసులో తన చోటు వద్దకు సాగిపోయే ఆ వయోవృద్ధుడు… తనతో కాస్సేపు అభిమానంగా మాట్లాడితే చాలు, పలకరిస్తే చాలు, ఇంటికి వెళ్లిపోయేటప్పుడు రివాజుగా పాపిన్స్ బిళ్లలను తలొకటి చేతిలో పెట్టే తీపిని పంచే ఆ చిత్రమాంత్రికుడు…. ఇక చందమామకు రారు.

తాను దశాబ్దాలుగా దాచుకుంటూ వస్తున్న అరుదైన చిత్రాలను ఒక్కటొకటిగా చూపిస్తూ, పేజీలు తిరగేస్తూ, ఆనాటి వ్యక్తుల, మిత్రుల, సన్నిహితుల ఫోటోలను పట్టి పట్టి చూస్తూ, చూపిస్తూ అలనాటి చరిత్రను కళ్లముందు నిలిపే ఆ ఎనిమిదన్నర పదుల చందమామ తాత ఇక ఆఫీసుకు రారు. ఆయనతో నేరుగా సంభాషిస్తూ, నవ్వుతూ, ఒకనాటి చరిత్ర జ్ఞాపకాల చిత్తడిలో మునిగితేలుతూ నమ్రతగా కాగితంపై రాసుకునే అరుదైన అవకాశం ఇక లేదు.

లేకపోతేనేం. ఆయన మాటకు కట్టుబడి ఇప్పటికీ చందమామ పని చేస్తూనే ఉన్నారు. ఆఫీసులో కాకుండా ఇంట్లో.. మరింత విశ్రాంతిగా, మరింత సౌకర్యంగా,, మరింత భక్తి శ్రద్ధలతో నమ్ముకున్న లక్ష్యానికి, ఆడిన మాటకు త్రికరణ శుద్ధిగా న్యాయం చేస్తూ చందమామకు చిత్రవర్ణాలను అద్దుతూ మాకూ, ప్రపంచానికి కూడా స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

ఆయన మాట, గీత, రేఖ, లక్ష్యం చిరకాలం కొనసాగుతాయని, కొనసాగాలని ఆశించడం తప్ప మనమిక ఏం చేయగలం.

శంకర్ గారూ ఉంటాము.. మీరు ఇంటినుంచి వేసి పంపే బొమ్మల ద్వారా మిమ్మల్ని చూసుకుంటూ చందమామ చిత్రాలలో మీ రూపాన్ని తలుచుకుంటూ ఉంటాము.

సర్వదా మీ ఆయురారోగ్యాలను కోరుకుంటూ…

 

ఆన్‌లైన్ చందమామలో, ఈ బ్లాగులో శంకర్ గారిపై వివిధ సందర్భాలలో వచ్చిన కథనాలను కింద చూడగలరు.

చందమామ చిత్ర మాంత్రికుడు : శంకర్

చివరి శ్వాసవరకు చందమామ తోటే ఉంటా…

చందమామ శంకర్ గారి జీవిత వివరాలు…

చందమామలో శంకర్‌గారు అడుగుపెట్టినవేళ

శంకర్ గారి నోట కమ్మటి తెలుగు భాష

చందమామ శంకర్ గారికి అనారోగ్యం

 శంకర్ గారు ఆకస్మికంగా క్యాబ్‌లో స్పృహ తప్పి పడిపోయిన ఆ రోజు, టైమ్స్ ఆఫ్ ఇండియా విలేఖరి బిశ్వాస్ ఘోష్ ఆయనను ఇంటర్వ్యూ చేయాలని చందమామ ఆఫీసుకు వచ్చే కార్యక్రమం పెట్టుకున్నారు. కోలుకున్న తర్వాత గత వారం ఆయనను కలిసి మాట్లాడిన సందర్భాన్ని ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో చెన్నయ్ ఈ-పేపర్ ఆర్టికల్‌గా 4వ పేజీలో పబ్లిష్ చేశారు.

ఆ ఆర్టికల్ పేరు An Artist Who Caught IMAGINATION OF GENERATIONS

దాని వివరాలకు ఈ లింకుపై క్లిక్ చేయండి. ఒకవేళ కింది లింకు ఏ కారణం వల్ల అయినా తెరుచుకోకపోతే చెప్పండి. తర్వాత దాని ఆంగ్లపాఠాన్ని పంపుతాము.

RTS Perm Link

చందమామ బేతాళ కథల నేపథ్యం

November 4th, 2009
చందమామ తొలి సంచిక

చందమామ తొలి సంచిక

గుణాఢ్యుని బేతాళ కథలకు సంబంధించి ఈ బ్లాగులో ఇటీవలే రెండు కథనాలు ప్రచురించడమైంది. 1.గుణాఢ్యుని బేతాళ కథలు 2. బేతాళ కథలు – కుటుంబరావు గారి ఒరవడి. చందమామ అభిమానులు ఈ రెండు కథనాల పట్ల మంచి స్పందన కనబర్చినందుకు అందరికీ ధన్యవాదాలు.

అయితే మరుగున పడిన చందమామ చరిత్రను వెలికి తీసి అక్షరబద్దం చేద్దామనే లక్ష్యంతో నేను సంస్థ లోపలినుంచి చేస్తున్న ప్రయత్నాలు మరింత నిర్దిష్టంగా, ఖచ్చితంగా, సత్యసమ్మతంగా ఉండాలనే భావంతో ఈ బ్లాగులో నేను పొందుపరుస్తున్న కథనాలు, వాటిలోని సమాచారాన్ని మళ్లీ మళ్లీ నాకు నేనుగా నిర్ధారించుకుంటూ, వెనక్కి తిరిగి చూసుకుంటూ పెద్దల సలహాలను తీసుకుంటూ వస్తున్నాను.

ఈ బ్లాగులో సందర్భానుసారం పొందుపరుస్తున్న విషయాలు నూటికి నూరుపాళ్లు వాస్తవమేనని నాకు నేనే సర్టిఫికెట్ ఇచ్చుకునే సాహసం చేయలేను. ఎందుకంటే ఇది 63 సంవత్సరాల చరిత్రకు, చందమామ నేపథ్యానికి సంబంధించిన విషయాలతో కూడిన బ్లాగు.

దశాబ్దాలుగా మరుగున పడి ఉన్న అపరూప చరిత్రను సేకరించే ప్రయత్నంలో పలుసార్లు మనకు అందుబాటులోకి వస్తున్న, పలు కోణాలు, మార్గాలనుంచి అందుతున్న విషయాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకుని వీలయితే మార్చవలసిన, సవరించ వలసిన, ఇంకా నిర్దిష్ట రూపమివ్వ వలసిన అవసరం ఎంతైనా ఉంది.

అందుకే ఈ బ్లాగులో వస్తున్న వ్యాసాలు, కథనాలు వేటికవిగా శాశ్వతాలు అనే అభిప్రాయం అప్పుడూ, ఇప్పుడూ కూడా నాకు లేదు. ఇకపై ఉండదు కూడా. ఓ అరుదైన చరిత్రకు సమగ్ర రూపం ఇవ్వడానికి ప్రయత్నించడంలో ఎన్ని పురిటినొప్పులు పడవలసి ఉంటుందో నాకు తెలీంది కాదు కూడా.

అందుకే బేతాళ కథలుపై నేను కూర్చిన, సమీక్షించిన విషయాలు, అందులో చందమామతో ముడిపడిన అంశాలకు సంబంధించి లోపాలు, ఇంకా సవరించవలసిన విషయాలపై తగు సూచనలు అందించమని ప్రింట్ చందమామ అసోసియేట్ ఎడిటర్ బాలసుబ్రహ్మణ్యం గారిని కోరి ఆ రెండు కథనాల కాపీలను నిన్న అందించాను. ఈ రోజు సాయంత్రం ఆఫీసులోనూ, క్యాబ్‌లోనూ తనతో జరిపిన సంభాషణకు అనుగుణంగా చందమామ బేతాళ కథల నేపథ్యాన్ని మరికొంత వివరంగా పొందుపర్చే ప్రయత్నం చేస్తున్నా.

బాలు గారు ప్రధానంగా రెండు విషయాలను ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అవి. 1.బేతాళ కథలను ఎప్పుడు కూడా మార్చి రాయలేదు. మొదట్లో మూలంలోని కథలను కొన్నింటిని యధాతథంగా ప్రచురించారు.

తర్వాతనుంచి చందమామ రచయితలు పంపుతూ వచ్చిన మామూలు కథలనే బేతాళ కథలుగా పజిల్ రూపంలో, ప్రశ్నలు – సమాధానాల రూపంలో ట్విస్ట్ చేసి పిల్లలకు అనుగుణంగా కథను మార్చారు. తర్వాత పెద్దలకు కూడా అవి ఇష్టమైన కథలుగా మారిపోయాయి.

2. చందమామలోని బేతాళ కథలకు ఘనత ప్రాథమికంగా కథల రచయితలదే. బేతాళ కథలకు సంబంధించి చక్రపాణి, కొకు, శంకర్ గారు వంటి వ్యక్తుల ప్రాముఖ్యత, ఒరవడిల గురించి ప్రస్తావించే క్రమంలో కథల రచయితలను మర్చిపోకూడదు. వారి విలువను విస్మరించవద్దు.

బాలుగారు చెప్పిన ఈ రెండు విషయాలను వివరంగా ప్రస్తావించుకుందాము. ఆయన ఎరుక ప్రకారం…

బేతాళ కథలను చందమామ పత్రిక ఎన్నడూ మార్చి రాయలేదు. 1955 సెప్టెంబర్ సంచికలో తొలి బేతాళ కథను “మహామంత్రి మనోవ్యాధి” అనే పేరుతో ప్రచురించారు. గుణాఢ్యుని మూల కథల్లో ఒకటో కథ, రెండవ కథ, మూడవ కథ అనే ఉంటాయి. తర్వాత అక్టోబర్‌లో “మారిన తలలు” నవంబర్‌లో ఏడ్పు – నవ్వు, డిసెంబర్‌లో ఆత్మబలిదానం అని బేతాళ కథలను మూలంలోనివే వేశారు.

మృతసంజీవనీ మంత్రం వరకు మొత్తం 9 కథలను ప్రచురించిన చందమామ ఆ కథల ముగింపు పుటలో కల్పితం అని వేయలేదు. 1956 జూన్ సంచికలో మాత్రమే బేతాళ కథకు చివర కల్పితం అని ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇక్కడినుంచే బేతాళ కథలను ఒరిజనల్ కథలనుంచి కాక రచయితలు పంపిన కథలనుంచే ఏరుకుని ట్విస్ట్ చేసినట్లుంది.

ఇంకా చెప్పాలంటే బాలుగారి ప్రకారం 1955 సెప్టెంబర్ నుంచి మొదటి మూడు కథలు మాత్రం నిఖార్సుగా మూల కథలే అయి ఉంటాయి. తర్వాత నుంచి మామూలు కథలనే బేతాళ కథలుగా మార్చి రాశారు. ఎందుకంటే దీనికి నేపథ్యం ఉంది. గుణాడ్యుని బేతాళ మూల కథలు వాస్తవానికి పెద్దల కథలు అంటే అడల్ట్ కథలు. అంటే కేవలం శృంగారానికి మాత్రమే సంబంధించినవి అని కాదు. అవి భార్యాభర్తలు, స్త్రీపురుషుల సంబంధాలు, సంసార నీతి, కుటుంబ విలువలు వంటి పెద్దలకు సంబంధించినవి. కుటుంబ నీతిని ధిక్కరించిన కథలు కూడా మూలంలో ఉన్నాయి.

కాబట్టి తొలి రెండు మూడు కథలను ప్రచురిస్తున్న క్రమంలో చందమామ సంపాదకులకు, సంపాదక వర్గ సభ్యులకు ఈ పెద్దల విషయాన్ని పిల్లలకు ఎలా చెప్పడం అనే ధర్మసందేహం ఎదురై మూల కథల్లోని ట్విస్ట్‌ను తీసుకుని చందమామ రచయితల కథలనే బేతాళ కథలుగా మార్చి రాస్తే బాగుంటుంది కదా.. ఇలా ఎందుకు చేయకూడదు అనే థాట్ వచ్చిందట.

ఇది చక్రపాణి, కుటుంబరావు గార్లలో ఎవరికయినా వచ్చి ఉండవచ్చు. లేదా కొకు గారే సలహా ఇస్తే దాన్ని చక్రపాణిగారు ఆమోదించి ఉండవచ్చు. ఏదేమైనా మూలకథలను కాకుండా ఆధునిక కథలనే మధ్యలోనో లేదా చివర్లోనూ లేదా కథ మొత్తంగానో మార్పు చేసి పజిల్ లేదా ప్రశ్న-సమాధానం రూపంలో మార్చి ప్రచురించాలనే ఆ ఆలోచనకు గుణాడ్యుని మూలకథలే ఆస్కారం ఇచ్చాయి.

కాబట్టి బేతాళ కథలను చందమామ ఎన్నడూ మార్చి రాయలేదు. చందమామలో తొలి మూడు, లేదా తొమ్మిది కథల తర్వాతే కొత్త కథలను చందమామీకరణ చేసి ఉంటారన్నది బాలూగారి అభిప్రాయం. తొలి 3 కథలూ నిఖార్సయిన మూల కథలే అని తానంటారు.

ఇకపోతే రెండోది. చందమామ బేతాళ కథలకు ఘనత ప్రాథమికంగా రచయితలదే. ఏ కారణాలతో అయినా సరే చందమామకు కథలు రాస్తూవచ్చిన రచయితలను విస్మరించకూడదు. ఎందుకంటే వీరు రాసి పంపుతూ వచ్చిన సాధారణ కథలనే బేతాళ కథలుగా సంపాదకులు మార్చి రాస్తూ వచ్చారు. బేతాల కథలకు అని ఉద్దేశించకుండా రచయితలు పంపిన సాధారణ కథలను కూడా బాగుంటే, బేతాళీకరణకు అనువుగా ఉంటే వాటిని సెపరేట్ చేసి సవరించేవారట.

దీనికి తొలి పాతికేళ్లూ అంటే 1955 నుంచి 1980 వరకు చక్రపాణి, కుటుంబరావు గార్లు మార్గదర్శకత్వం వహించగా, తర్వాతి దశలో విశ్వంగారు, దాసరి సుబ్రహ్మణ్యం గారు 2006 వరకు బాధ్యత వహించారట. కొకు గారి తర్వాత బేతాళకథలను సాపుచేసే బాధ్యత దాదాపుగా దాసరి గారిదే అని బాలు గారి అభిప్రాయం. 2006 తర్వాత బాలుగారే ఈ బాధ్యతను చేపట్టారనుకోండి. పైగా ఇతర సంపాదకవర్గ సభ్యుల వలే కాక ఈయన స్వతహాగానే చందమామ అవసరాలకు గాను బేతాళ కథలను అడపాదడపా రాస్తున్నారని తెలిసింది. దీన్ని కూడా పైకి అంగీకరించని మోడెస్టీ ఈయనది.

అయితే చక్రపాణి, కుటుంబరావు, విశ్వం, దాసరి సుబ్రహ్మణ్యం గార్లలో ఏ ఒక్కరూ స్వంతంగా బేతాళ కథలను రాయలేదని కథకులు పంపిన కథలలోంచి ఏరిన వాటినే కొకు, దాసరి గార్లు బేతాళ కథలుగా మార్పు చేసేవారని అంటారీయన. కథ మధ్యలో మార్చినా, చివర్లో మార్చినా, లేదా కథ మొత్తంగా మార్పులకు గురిచేసినా చందమామ బేతాళ కథలకు మూలం చందమామ కథకులే. వీరిలోనూ రాజగోపాలరావు -వసుంధర- గారిదే అగ్రతాంబూలం అని బాలుగారి ప్రకటన.

చందమామ సంపాదక బృంద సభ్యులు సాపు చేసి తుది రూపమిచ్చిన  బేతాళ కథలకు కూడా సవరణలు సూచించినవారు చందమామ చరిత్రలో ఇద్దరే ఇద్దరు. వారు చక్రపాణి గారు, విశ్వనాథ రెడ్డి గారు. బేతాళ కథకు మార్పులను సూచించడంలో చక్రపాణి గారి కంటే విశ్వంగారే రెండాకులు ఎక్కువగా చదివారన్నిది బాలూగారి అభిప్రాయం.

సంపాదక సిబ్బంది బాగా లేదు అని కొట్టిపారేసిన కథను కూడా మధ్యలోనో, చివర్లోనూ మార్పులు చేసి బేతాళకథగా మార్చవచ్చు కదా అని విశ్వంగారు సూచించేవారట. చక్రపాణిగారికి ఎంత సంపాదక అనుభవం ఉందో అంత అనుభవం విశ్వంగారికి ఉందని, ఇందుకు 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం తోడయిందని బాలు గారు చెప్పారు.

ఇలా పిల్లలకోసం తయారైన బేతాళకథలు తర్వాత ఆంధ్రదేశంలో అన్నివయస్సుల వారిని దశాబ్దాలుగా ఆకట్టుకున్నాయి. చనుబాల కథలుగా మాత్రమే పేరొందిన చందమామ కథల పట్ల తర్వాత పెద్దలు కూడా బాగా ఆసక్తి చూపేలా చేయడంలో మొదటి మలుపు బేతాళ కథలనుంచే ప్రారంభమయ్యిందిని చెప్పవచ్చు.

పెద్దల విషయంగా పేరొందిన బేతాళ మూల కథలను మినహాయించి పిల్లల కంటెంట్‌గా మార్పుకు గురయిన బేతాళ కథలు అచిర కాలంలోనే కుటుంబంలోని స్త్రీ, బాల, వృద్ద బాంధవ్యులందరికీ నచ్చిన అద్భుత విజయ గాధలుగా చరిత్రలో నిల్చిపోయాయి.

బాలు గారికి కృతజ్ఞతలతో…

చివరగా చందమామ బేతాళ కథల ప్రాశస్త్యం గురించి శివరాం గారు తన బ్లాగులో రాసిన కథనంలోని చివరి పేరాతో దీన్ని ముగిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.

“కథా సంపుటి లేదా ధారావాహికగా మొదలు పెట్టబడినా, చివరకు ఒక కథా శీర్షికగా స్థిరపడినాయి ఈ బేతాళ కథలు.చిన్న చిన్న ధారావాహికలు మొదలు పెట్టినప్పుడల్లా తమ సంపాదకీయంలో ఆ ధారావాహిక గురించి కొద్దో గొప్పో చందమామలో వ్రాసే వారు. కాని చారిత్రాత్మకమైన బేతాళ కథల ధారావాహిక (శీర్షిక) చడి చప్పుడూ లేకుండా మొదలు పెట్టేశారు. మరి అప్పట్లో ఈ కథలను ఎలా వేయ్యలో ఇంకా నిర్ణయించుకోలేదేమో.

చివరికి , ఇలా ఎటువంటి ప్రకటన లేకుండా మొదలు పెట్టబడినా, చందమామలోని అన్ని ధారావాహికలలోనూ ఎక్కువరోజులు ప్రచురించబడింది, ఇంకా ప్రచురిస్తూనే ఉన్నారు. భారత పత్రికా చరిత్రలో ఇది ఒక మైలురాయి (రికార్డు)అని నా అభిప్రాయం. తెలుగు పత్రికా చరిత్రలో అన్ని శీర్షికలకన్న ఎక్కువకాలం ప్రచురించబడిన, ఇంకా ప్రచురించబడుతున్న శీర్షిక ఇది ఒక్కటే అయి ఉండవచ్చును.ఈ చక్కటి సాహిత్య ప్రక్రియ వెనుక ప్రసిద్ధ రచయిత, చందమామకు ఎక్కువకాలం సంపాదకుడిగా పనిచేసిన, శ్రీ కొడవటిగంటి కుటుంబరావు కృషి ఎంతగానో ఉన్నది.

బేతాళకథలు ధారావాహిక అనండి లేదా శీర్షిక అనండి, ఏది ఏమైనా కథలను ఏకధాటిగా ఇంత ఆసక్తికరంగా, పిల్లలకు(అనేకసార్లు పెద్దలకే) తెలివితేటలు పెంపొందించే విధంగా ప్రచురించటం నభూతో నభవిష్యతి.”

మరిన్ని వివరాలు

గుణాఢ్యుడి బేతాళ కథలు

బేతాళ కథలు – కుటుంబరావు గారి ఒరవడి

RTS Perm Link

శంకర్ గారి నోట కమ్మటి తెలుగుమాట

November 2nd, 2009
శంకర్ గారి తెలుగు మాట

శంకర్ గారి తెలుగు మాట

శంకర్ గారికి ఇప్పుడు ఫర్వాలేదు. రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాతే ఆయన చందమామ కార్యాలయానికి రావచ్చు. ఆపీసుకు రాకుండా ఇంట్లో నుంచే తాను పనిచేసుకునే అవకాశాన్ని, సౌలభ్యాన్ని కల్పిస్తామని చందమామ వారు ఎప్పుడో తనకు సూచించినప్పటికీ ఒంటరిగా కాకుండా మనుషుల్లో ఉంటూ పనిచేసుకోవడంపై మమకారంతో ఆయన స్వచ్చందంగా చందమామ ఆఫీసుకు వస్తున్నారు. ఆయన స్వస్థత పొందిన సందర్భంగా ఆయనలోని ఓ అరుదైన గుణాన్ని చందమామ అభిమానులతో పంచుకోవాలని ఉంది.

ఈ మూడు నెలల పరిచయ కాలంలో తనతో మాట్లాడిన ప్రతిసారీ ఆయన చక్కటి తెలుగులో మాట్లాడటం గమనించాను. మద్రాసులో ఉన్న లేదా తమిళనాడులో ఉన్న తెలుగువారు రెండు భాషల సంపర్క ప్రభావానికి గురై తెలుగు క్రియకు నుకారాంతాన్ని జోడించి వినగానే నవ్వు వచ్చేలా పదజాలాన్ని ప్రయోగించడం నాకు గత 13 ఏళ్లుగా అనుభవమే.

వాక్యం చివరలో వచ్చును, తెచ్చును, కొట్టును, పాడును, చేయును, పూడ్సును అని మద్రాసుకు మాత్రమే తెలిసిన పద ప్రయోగాలతో కూడిన వింత భాషను చదువుకున్న తెలుగువారే ఉపయోగించడం చాలా సహజంగా ఉంటోంది. అలాంటిది… తమిళుడైన శంకర్ గారు స్వచ్ఛమైన తెలుగును తియ్యగా పలుకడం చూస్తుంటే విన్నప్పుడల్లా ఆశ్చర్యమేస్తూ ఉంటుంది.

మూడు వారాల క్రితం ఈ విషయమై సందేహ నివృత్తికోసం ఆయననే నేరుగా అడిగేశాను. ఆ సందర్భంగా భాషాధ్యయన, భాషాభ్యసన చరిత్రలోనే అపూర్వమైన విషయాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. జన్మతా తమిళుడైన మీరు ఇంత స్వచ్ఛంగా తెలుగులో ఎలా మాట్లాడగలుగుతున్నారని అడిగితే ఇలా సమాధానం చెప్పాపాయన.

రాయడం, చదవడం తెలియక పోయినా తెలుగు బాగా మాట్లాడడానికి వారి తల్లి ప్రధమ కారకురాలట. ఎందుకంటే చిన్నతనంలో తల్లి బయట పనులు చేసే క్రమంలో మద్రాసులోనే అన్ని భాషలవారితో పరిచయాలు ఏర్పడ్డాయట. ఒకసారి వింటే చాలు అట్టే పట్టేసుకునేటటువంటి నిశిత గ్రాహ్య శక్తితో ఆమె ఏకకాలంలోనే అయిదారు భాషలను అలవోకగా నేర్చుకుని మాట్లాడేదట.

అప్పట్లో మద్రాసు అంటే తెలుగు నాడు అని లెక్క కాబట్టి ఈమె ఇంట్లో తెలుగు కూడా ఉపయోగించేదట. ఇది బాల్య ప్రభావం కాగా, ఆయన నోట తీయటి తెలుగు మాట రావడానికి మరో కారణం తెలుసుకుంటే గమ్మత్తుగా ఉంటుంది.

మరేంలేదు.. చందమామే శంకర్ గారికి తెలుగు భాషను నేర్పింది. అదీ చక్కటి తెలుగు భాషను మాట్లాడటం నేర్పించింది. ఎలా అంటే కథలకు బొమ్మలు వేసేటప్పుడు విషయాన్ని చిత్రకారులు తమ తమ మార్గాలలో గ్రహిస్తారు. రచయిత లేదా సంపాదకుడు కథను తన మాటల్లో వివరిస్తే దాన్ని బట్టి బొమ్మలు గీసేవారు ఒక రకం, కథను పాయింట్లుగా రాసి ఇస్తే దాన్ని చూసుకుని బొమ్మలు గీసేవారు కొందరు.

శంకర్ గారికి కథను పూర్తిగా చెప్పించుకుని తర్వాత మనసులో బొమ్మను ఊహించుకుని గీయటం అలవాటు. ఎవరో ఒకరి వద్ద తెలుగులో ముందుగా కథను పూర్తిగా చదివించుకుని వింటారీయన. తర్వాత కథకు తగిన బొమ్మ గీయటానికి పూనుకుంటారు.

ఇలా ఒకటి, రెండూ, మూడూ కాదు.. 57 ఏళ్లుగా చందమామ కథను తెలుగులో చదివించుకున్న క్రమంలో శంకర్ గారికి యాదృచ్ఛికంగా తెలుగు మాట్లాడటం వచ్చేసింది. మరి తెలుగు యాస లేకుండా ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటే ఇంకా గమ్మత్తైన విషయం చెప్పారీయన. దానికి కూడా చందమామే కారణమట.

ఎలాగంటే.. చందమామ మొదటినుంచీ ప్రాంతీయ యాసలకు దూరంగా ఉంది. ఒక్కో ప్రాంతానికే పరిమితమై ఉండే రకం జాతీయాలకు, నుడికారాలకు, వర్ణనలకు చందమామ చాలా దూరంగా ఉంది. ఒక ప్రాంతం వారికి అర్థం కాని రీతిలో ఉండే యాసను పత్రికలోకి ఎందుకు తెస్తారు అనేది చక్రపాణి గారి మార్కు వ్యాఖ్య.

దీంతో చందమామను ఆబాలగోపాలమూ, ప్రాంత భేదాలెరుగకుండా తెలుగు దేశంలోని అన్ని రీజియన్లు తమ స్వంతం చేసుకునేవి. ఈ క్రమంలోనే శంకర్ గారికి చందమామ భాష వచ్చేసింది. చిత్రరచనకోసం చందమామ కథలను దశాబ్దాలుగా చదివించుకుని వింటూ వచ్చిన శంకర్ గారు అలా చందమామ భాషకు దాసోహమైపోయారు.

“మా తెలుగు బాల్యానికి ధన్యవాదాలు” అని గత రాత్రి పంపిన టపాలో నేను రాసినట్లుగా “ఐ నెవర్ స్పీక్ తెలుగు” బాపతు గాళ్లు రాజ్యమేలుతున్న పాడు కాలమిది. తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్ది బతుకుతున్న విషకీటకాలు చెప్పే చదువుల రంధిలో తెలుగు దేశం ప్రస్తుతం కాలిపోతోంది.

ఇక్కడ… 55 సంవత్సరాలుగా చందమామ అనుబంధంతో జీవితం పండించుకుంటూ వచ్చిన కేసీ శివశంకరన్ అనే ఓ తమిళుడు.. అదే… మన శంకర్ గారు… చందమామ కథా శ్రవణం సాక్షిగా తెలుగు మాటలు నేర్చుకుని తెలుగు భాష విలువను ఆకాశమంత ఎత్తులో నిలిపారు. జీవిత ఔన్నత్యానికి, పతనానికి వార మనకు ఇక్కడ సులభంగానే బోధపడుతోంది కదా!

శంకర్ గారూ, మీకూ, మీరు వాడే ఆ చక్కటి చందమామ భాషకు శతకోటి వందనాలు..

మీ నోట జాలువారే ఆ చందమామ భాష తియ్యదనాన్ని ఆస్వాదించేందుకోసమయినా మీరు ఆరోగ్యంగా ఉంటూ, మాతో కలిసి మరి కొంతకాలం పనిచేయండి. మా చిన్ని జీవితాలకు ఇది చాలు…

RTS Perm Link

చందమామ శంకర్ గారికి అనారోగ్యం

November 2nd, 2009
శంకర్ గారు

శంకర్ గారు

వారాంతపు సెలవుల తర్వాత ఉదయం చందమామ కార్యాలయానికి క్యాబ్‌లో వస్తున్నాం. తిరువాన్మయూర్ దాటుకుని నీలాంకరై వేపుకు బండి వస్తుండగా ఉన్నట్లుండి మా మరో క్యాబ్ డ్రైవర్ మా వైపు పరుగెత్తుకొచ్చారు. ఏమై ఉంటుంది అని ఒక్కసారిగా మాలో ఉద్రిక్తత. ఆ క్యాబ్‌కు ప్రమాదం ఏమైనా జరిగిందా అని కలవరం.

విషయం మరోలా ఉంది. ఆ క్యాబ్‌లో విరుగంబాక్కం నుంచి వస్తున్న శంకర్ గారు ఉన్నట్లుండి అనారోగ్యానికి గురయ్యారట. తనకే తెలీకుండా ముఖం వివర్ణమయిపోయిందట. పక్కన ఉన్నవారు గమనించి పక్కనే ఉన్న ఆసుపత్రికి బండిని తీసుకెళ్లి ఆయనకు ఈసీజీ వగైరా పరీక్షలు చేయించారు.

ప్రమాదం లేదని, నాడి మామూలుగా కొట్టుకుంటోందని వైద్యులు చెప్పారట. ఉన్నట్లుండి ఆయన శరీరంలో మార్పులు సంభవించాయి ఒక రోజంతా విశ్రాంతిలో ఉంచి పరీశీలనలో పెట్టాలని సూచించారట. తర్వాత మిగిలిన సిబ్బందితో పాటు ఆయనా ఆఫీసుకు అదే క్యాబ్‌లో వచ్చారు.

రాగానే, ఆయనను కలిశాము. పరామర్శించడానికి రావడంతో ఆయన మాకే ధైర్యం చెప్పారు. “ఏం జరగలేదు. ఉన్నట్లుండి ఒళ్లు అలసినట్లనిపించింది. ఏమయిందో నాకు అర్థం కాలేదు. ఎందుకయనా మంచిదని మనవాళ్లు పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకుపోయారు. ఈసీజీ, మరికొన్ని పరీక్షలు చేయించారు. అంతా నార్మల్‌గానే ఉందని చెప్పారు. ఒక రోజు పని చేయవద్దని, విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అంతే మరేం కాలేదు” అంటూ చేయి పట్టుకుని నవ్వారు.

“ఇదీ దైవకృపే మరి. నిద్రలోనే ఏదయినా జరిగి ఉంటే ఏమయ్యేదో కదా.. ఇంతమంది మధ్యన క్యాబ్‌లో అలా జరిగింది కాబట్టి వెంటనే చికిత్స చేయించారు. ఏం కాలేదు. వారి సలహా ప్రకారం ఇంటికి వెళుతున్నా” అని  చెప్పారు.

తర్వాత ఆయనను ఇంటివరకు తీసుకుపోయి దింపడానికి సహాయకులు వెంటరాగా ఆయన వెళ్లిపోయారు. 85 ఏళ్లు పైబడిన ఆయన చివరివరకు చందమామలో పనిచేయాలనే మొండి పట్టుదలతోటే దాదాపు 10 కిలోమీటర్ల పైగా దూరం క్యాబ్‌లో ప్రయాణం చేస్తున్నారు. వారంలో తొలి మూడు దినాలు కార్యాలయానికి వస్తూ మిగతా రెండు రోజులు ఇంటివద్దే ఉండి పనిచేస్తున్నారు.

ఈ క్యాబ్‌లో ప్రయాణం వల్ల వళ్లు అదురుతూ, నడుము నొప్పి వస్తోందని, అందుకనే మా ఆవిడ ఈ వయసులో ఇంత శ్రమ ఎందుకు, పని ఆపేయకూడదా అంటోందని పది రోజుల క్రితం కలిసినప్పుడు చెప్పారు. నడుము కాసేపు వత్తించుకుంటే తగ్గిపోతుందని ఈ మాత్రం దానికి అలసిపోతే ఎలాగన్నది ఆయన పట్టుదల.

తన బిడ్డలు ఎదిగి వచ్చి పైకి ప్రస్తుతం చెన్నైలోనే మంచి  స్థితిలోనే ఉన్నా, ఓ మేరకు సుఖమైన విశ్రాంతి జీవితాన్ని చివరి దశలో గడిపే సౌకర్యం ఆయనకు బిడ్డల ద్వారా ఏర్పడినా సరే తాను పనిచేయడం ద్వారా మాత్రమే బతకాలని, కన్న బిడ్డలమీద అయినా సరే ఆధారపడకూడదని ఆయన చెప్పారు. అదే విశ్వాసంతోటే చందమామలో పనిచేస్తున్నారు కూడా. ఈ వయసులో మీరు పనిచేసి బతకాలా అని బిడ్డలు నిష్టూరమాడినా గత కొన్ని ఏళ్లుగా ఆయన ఇలాగే పనిచేస్తున్నారు.

తన తరం ఆయుఃప్రమాణాల ప్రకారం చూసినా మరో పదేళ్లు ఆరోగ్యంగా గడిపే అవకాశం ఆయనకు ఉంది. ఏ దుర్వ్యసనాలకు అలవాటు పడని శరీరం కాబట్టి ప్రాథమికంగా ఇంతవరకు ఆయన ఆరోగ్యవంతుడి కిందే లెక్క. ఇప్పుడు ఉన్నట్లుండి ఇలా జరగడంతో మాకందరికీ ఒక్కసారిగా కలవరం.

రాత్రి 11 గంటల వరకు పనిచేస్తూ పోయానని. ఆ శ్రమ భారం కూడా ఇలా బయటపడిందేమో అని ఆయన సందేహం. జీవితంలో ఒక దశకు చేరుకున్న తర్వాత రాత్రిపూట ఎక్కువసేపు మేల్కోవడం ఆరోగ్యానికి భంగకరమే.. ఇక అయినా జాగ్రత్తలు తీసుకోమని సూచించాము.

మా కళ్లముందే ఆయన క్యాబ్‌లో వెళ్లారు. ప్రింట్ విభాగంలోంచి కొందరు పెద్దలు తోడు రాగా ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనకు ఏమీ కాదనే, కాకూడదని, మళ్లీ మాతో కలిసి పనిచేయాలని. మాతో ఉండాలని ప్రగాఢంగా కోరుకుంటూ లోపలకు వచ్చేశాం.

చందమామ అభిమానులు, చందమామ స్పర్ణయుగ ప్రేమికులు, చందమామ చిత్రకారుల ఏకలవ్య శిష్యులూ కూడా ఆయన ఆరోగ్యం గురించి పరామర్శిస్తారని, ఆయన మరి కొంతకాలం చల్లగుండాలని కోరుకుంటారని ఆశిస్తున్నాం. .

శంకర్ గారూ!

మీకోసం బేతాళుడు కూడా కలవరపడుతూ ఉంటాడు. కోరిన కోరికలు నెరవేర్చే ఆ బేతాళుడు మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహిస్తాడని, తన బొమ్మలు మీ చేత మరికొంత కాలం గీయించుకుంటాడని, చందమామ బేతాళుడికి ‘శంకర’ పురస్కారం భవిష్యత్తులో కూడా అందుతుందని, అందాలని మేం  మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

మా ఈ చిన్న కోరికను మీరు మన్నిస్తారని ఆశిస్తూ,

మీ ఆరోగ్యం చల్లగా ఉండాలని కోరుకుంటూ…  మీనుంచి చల్లటి వార్తకోసం ఎదురుచూస్తూ…

మీ చందమామ.

RTS Perm Link

బేతాళ కథలు – కుటుంబరావు గారి ఒరవడి

October 31st, 2009

వేణుగారూ! గుణాఢ్యుని బేతాళ కథలు పరిచయంపై మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు. అసలు ఈ పుస్తకం చివర్లో బేతాళుడు విక్రమాదిత్యుడికి ప్రసన్నమై దొంగ బిక్షువు పన్నాగాలను వివరించి అతడిని తుదముట్టించడంలో సహకరించిన తర్వాతి ఘట్టం చదివినప్పుడు రోమాలు నిక్కపొడుచుకున్నాయి నాకు. “మనోహరాలైన యీ యిరవై నాలుగు ప్రశ్న కథలూ, వీటితోపాటు యీ చిట్ట చివరి ఇరవై ఐదవ కథా లోక ప్రసిద్ధాలై ప్రకాశించాలి అని నా కోరిక” అని త్రివిక్రమ సేన మహారాజు అడిగితే అలాగే అని వరమిచ్చిన బేతాళుడు ఇలా అంటాడు.

“అలాగే అవుతుంది… ముందు చెప్పిన ఇరవై నాలుగూ, ఈ చివరి కథా కలిపి బేతాళ పంచవింశతి అన్న పేరుతో విశ్వ విఖ్యాతమై, పూజనీయమై, మంగళకరమవుతాయి. ఇందులో ఏ కొద్ది భాగాన్నయినా ఎవరు ఆదరంగా చదివినా, విన్నా వాళ్లు పాప విముక్తులవుతారు. బేతాళ పంచవింశతి ప్రసంగ, శ్రవణాలు జరిగే చోట యక్ష, బేతాళ, పిశాచ, రాక్షసాదులు ప్రవేశించలేరు”

రెండు వేల సంవత్సరాల క్రితం గుణాఢ్యుడు బేతాళ పంచవింశతి కథలకు ఇలా ముగింపునిచ్చాడు అనే విషయం తల్చుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది నాకు. “పాప విముక్తులు కావడం, యక్ష, బేతాళ, పిశాచ, రాక్షసాదులు ప్రవేశించలేకపోవడం” వంటి వర్ణనలు గుణాఢ్యుడి కాలంనుంచి నేటి దాకా భారతీయ భావనా ప్రపంచంలో కొనసాగుతుండటం మనం హరికథలు, నాటక ప్రదర్శనల సమయంలో చూస్తూనే ఉన్నాం.

అయితే పాఠకులు విమర్శనాత్మకంగానే పరిశీలించి, తమదైన విచక్షణతోనే వీటిని స్వీకరించాల్సిన అంశాలు ఒరిజనల్ బేతాళ కథల్లో చాలానే ఉన్నాయి. ఉదాహరణకు ఈ పుస్తకంలోని మూడో కథ చివర్లో “స్త్రీలు సహజంగా క్రూర హృదయులు, కుత్సితులు” అని చిత్రరధుడనే గంధర్వుడు వ్యాఖ్యానిస్తాడు. “పాప స్వభావులు, దురాచారపరులు అయిన పురుషులు ఎప్పుడో, ఎక్కడో ఒకప్పుడు ఉండవచ్చును. తరచూ స్త్రీలలో ఎప్పుడూ అలాంటివారే ఎక్కువ” అని త్రివిక్రమ మహారాజు చేత గుణాడ్యుడు చెప్పిస్తాడు.

స్త్రీపురుషుల స్వభావాన్ని ఇంతగా సాధారణీకరించి -జనరలైజ్- చెప్పిన ఈ వ్యాఖ్యానాన్ని ఆనాటి పితృస్వామిక సమాజపు నేపధ్యంలోనే అర్థం చేసుకోవాలి. రెండువేల సంవత్సరాల తర్వాత కూడా స్త్రీల గురించి పురుషులలో చాలా మందికి ఈ భావాలే ఉండటం మనం చూస్తున్నాం కదా. స్త్రీపురుషుల మధ్య వ్యవస్థాగతంగా ఏర్పడిన వైరుధ్యానికి ఇవి ప్రతిరూపాలే కదా..

ఇక్కడే చందమామ సవరించి, రూపొందించిన బేతాళ కథల గొప్పతనం మనకు అర్థమవుతుంది. గుణాఢ్యుడి కథల్లో ఇలాంటి పితృస్వామిక సమాజ మానవ స్వభావానికి సంబంధించిన తప్పు వ్యాఖ్యానాలు ఎన్నో ఉండవచ్చు. కాని వాటిని మనం తప్పుపట్టలేం. అవి ఆనాటి సమాజానికి సంబంధించిన సాధారణ మానవ భావనలు.

ఈ పితృస్వామిక వర్గీకరణల అసహజత్వాన్ని విమర్శనాత్మకంగా, విచక్షణతో వేరుపర్చి స్త్రీపురుషులు సమానులు అనే నేటి సమానత్వ భావనాధారను చందమామ బేతాళ కథలు గత 55 ఏళ్లుగా ఎంత చక్కగా పిల్లల్లో, పెద్దల్లో ప్రసారం చేస్తూ వచ్చాయో మనందరికీ  తెలుసు. చందమామలో తొలి బేతాళ కథను చూసినా ఈ 2009 అక్టోబర్ చందమామ సంచికలోని బేతాళకథను చూసినా సరే, బేతాళ కథల విషయంలో చందమామ చూపిస్తూ వచ్చిన విచక్షణ, హేతుబద్ధత మనకు స్పష్టంగా అర్థమవుతుంది.

చందమామ బేతాళ కథలు ప్రదర్శిస్తూ వస్తున్న ఈ విచక్షణా దృక్పధానికి, నూతన భావ సంస్కారానికి ఇద్దరు మహనీయులు కారణం. వారు చక్రపాణి, కుటుంబరావు గార్లు. ప్రత్యేకించి 1930ల చివరికే మార్క్సీయ భావధారను తనలో నిక్షిప్తం చేసుకున్న కుటుంబరావు గారు… సిద్ధాంత రాద్దాంతాలు, పదాడంబరాల జోలికి పోకుండా తాను నమ్మిన హేతుపూర్వక ఆలోచనా సరళిని బేతాళ కథలకు జోడించి వాటిని ఆధునిక మానవ సంస్కారానికి ప్రతీకలుగా చేసి ప్రాణప్రతిష్ట పోశారు.

దానికి చక్రపాణిగారి ఆమోదముద్ర ఉండటంతో మూడు దశాబ్దాలపాటు కుటుంబరావుగారి ప్రజాస్వామిక ఆలోచనా ధార బేతాళ కథలలో నిరంతరాయంగా కొనసాగుతూ వచ్చింది. మార్క్సిజానికి సంబంధించిన పదజాలం వాడకుండానే కుటుంబరావుగారు తన ఇతర అన్ని రచనల్లోనూ ఆధునిక మానవ సంస్కారాన్ని ఎలా ప్రతిఫలిస్తూ వచ్చారో చందమామ కథలు కూడా దానికి మినహాయింపు కాదు.

బూర్జువా, భూస్వామ్యం, అర్ధవలస, అర్ధభూస్వామ్య వంటి ఒక పట్టాన కొరుకుడు పడని  పదాలతో మన దేశపు సామాన్య ప్రజలను భయపెట్టడానికి బదులుగా భూమ్మీద తనకే సాధ్యమైన తేలిక పదాలతో, సరళ వచనంతో ఆయన చందమామ కథలకు రూపురేఖలు దిద్దారు. మధ్యయుగాల జానపద సంస్కృతికి ఆధునిక మానవ సంస్కారాన్ని జోడించి కుటుంబరావుగారు దేశ దేశాల కథలను మలచడంలో చూపించిన నైపుణ్యం చందమామకు భారతీయ కథాసాహిత్యంలో, ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం కల్పించింది.

చక్రపాణి గారి దార్శనికత, కుటుంబరావు గారి ఒరవడికి చందమామ చిత్రకారుల మంత్రజాలం తోడవటం, మొదట్లో రాజారావు, ముద్దా విశ్వనాధం గార్లు తర్వాత దాసరి సుబ్రహ్మణ్యం గారు తదితర శక్తివంతమైన రచయితల మేళవింపుతో కూడిన చందమామ సంపాదక బృందం దన్ను చందమామకు స్వర్ణయుగాన్ని తెచ్చిపెట్టాయి. వీరి సహాయ సహకారాలు లేకుండా చందమామ కోట్లాది పాఠకులను అలరిస్తూ రావడం జరగని పని కూడా.

బాల సుబ్రహ్మణ్యం గారి సహాయ సంపాదకత్వంలో వస్తున్న చందమామ ఈనాటికీ ప్రాథమికంగా అదే ఒరవడిలో కొనసాగుతుండటం యాదృచ్చికం కాదు. (సహాయ సంపాదకత్వం అనేది టెక్నికల్ ఫ్యాక్ట్ మాత్రమే.. నిజానికి చందమామ ప్రింట్ విభాగం మంచిచెడ్డలన్నింటికీ గత కొంతకాలంగా ఆయనే బాధ్యులు. విశ్వంగారు చందమామలో ఉన్న రోజుల్లో కూడా అంటే గత మూడు దశాబ్దాలుగా కూడా చందమామ కథల ఎడిటింగ్‌లో, ఇతర చాకిరీలో ప్రధాన భారం బాలుగారిదే అనేది చరిత్ర చెబుతున్న సాక్ష్యం)

కథలకు కొసమెరుపు ఇవ్వడంలో, చివరి క్షణంలో కూడా పలానా కథలో మార్పు చేస్తే బాగుంటుందేమో అంటూ విశ్వంగారు  మూడు దశాబ్దాల క్రితంనుండి ఇటీవలి వరకూ చందమామకు నెరుపుతూ వచ్చిన సంపాదకత్వ బాధ్యతలు కూడా తక్కువేం కాదు. మరి చందమామ ఆవరణలో పుట్టిపెరిగిన విశ్వంగారు నలబై, యాబై ఏళ్ల పాటు దానిలోని ప్రతి శాఖలో జరుగుతున్న పనిని ఆకళింపు చేసుకున్న అనుభవాన్ని పుణికి పుచ్చుకున్నారాయె.

ఇది కుటుంబరావు గారి శత జయంతి సంవత్సరం. ఈ అక్టోబర్ 28న ఆయన నూరవ పుట్టిన రోజుకు సంబంధించిన జ్ఞాపకాలను తల్చుకుంటున్నప్పుడు తెలుగు పాఠకులు, రచయితలు, సాహిత్యాభిమానులు, చందమామ ప్రియులు మర్చిపోకూడని అంశం చందమామ బేతాళ కథలు.

శతాబ్దాలు గడిచినా గుబాళింపు తగ్గని గుణాఢ్యుడి బేతాళ మూలకథల మూసలోనే గత 55 ఏళ్లుగా ఎన్నో కొత్త, ఆధునిక భావప్రేరిత కథలను సృష్టించి ‘చందమామ’ తన పిల్ల పాఠకుల, పెద్ద పాఠకుల మనసులను ఏళ్ల తరబడి రంజింప చేసింది. ఈ నాటికీ చేస్తూనే ఉంది. ఈరోజుకీ చందమామ కార్యాలయానికి వస్తున్న పాఠకులు లేఖలు బేతాళ కథల పటుత్వాన్ని, గొప్పదనాన్ని ప్రశంసించకుండా ఉండటం లేదంటే మనం ఆశ్చర్యపడనవసరం లేదు.

ఒక విషయం మాత్రం నిఖార్సుగా చెప్పవచ్చు. మానవ సంస్కారానికి, మానవ సద్బుద్ధికి పట్టం కట్టే కథలకు తెలుగులో కుటుంబరావు గారే ఆద్యులు కాకపోవచ్చు కాని, ఈ కోణంలో ఆయన ప్రవేశపెట్టిన ఒరవడి మాత్రం చందమామ కథలపై శాశ్వతమైన ముద్ర వేసింది. ఎంతగా అంటే చందమామ కథల స్వభావాన్ని ఎవరూ మార్చలేనంతగా.

మరో వంద సంవత్సరాలు చందమామ కొనసాగిన పక్షంలో కూడా, చందమామ కథల స్వభావం మారబోదని ఇన్ని ఒత్తిళ్లు, ఆటుపోట్ల మధ్య కూడా మనం సగర్వంగా చెప్పవచ్చు. చందమామ రూపం ఎన్ని కొత్త లేదా అసంబద్ధ (?) ధోరణులలో కొట్టుకుపోయినా సరే దాని కథల స్వభావం మాత్రం మారదు గాక మారదు. తరాలు మారుతున్నా, చదివే పాఠకుల ప్రాధాన్యతలు మారుతున్నా చందమామ మనగలుగుతోందంటే దశాబ్దాలుగా చెక్కుచెదరని దాని కథల ఘనతర పునాదే కారణం.

ఈ రూపంలోనే మనం చక్రపాణి, కుటుంబరావుల దార్శనికతను, చందమామ కథల్లోని ఆధునిక సమాజపు నూతన భావధారను మన హృదయాల్లో నింపుకుందాం. అదే వారికీ, చందమామ స్వర్ణయుగంలో తమ వంతు పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ నిజమైన నివాళి కూడా.

మూలంలోని కథలు అని మాత్రమే కాదు.. పీకాక్ క్లాసిక్స్ వారి ఆ ఆకర్షణీయమైన గోదుమ వర్ణపు నిసర్గ ముద్రణా సౌందర్యాన్ని, మరణ శయ్యపై ఉండి కూడా ఆధునిక అనువాద మాంత్రికుడు సహవాసి గారు సృజించిన చిట్టచివరి రమణీయ అనుసృజనను ఆస్వాదించడానికయినా “గుణాఢ్యుని బేతాళ కథలు” పుస్తకం తప్పక చదవండి. కొని చదవండి. అవి 2 వేల ఏళ్ల క్రితం గుణాఢ్యుడు రాసిన బృహత్ కథలనే విషయం గుర్తుపెట్టుకుని మరీ చదవండి.

వేణుగారి స్పందన, వ్యాఖ్య ప్రభావంతో రూపొందిన ఈ కథనానికి తొలి భాగాన్ని కింది లింకులో చూడగలరు.

http://blaagu.com/chandamamalu/2009/10/30/%e0%b0%97%e0%b1%81%e0%b0%a3%e0%b0%be%e0%b0%a2%e0%b1%8d%e0%b0%af%e0%b1%81%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%ac%e0%b1%87%e0%b0%a4%e0%b0%be%e0%b0%b3-%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2%e0%b1%81/

RTS Perm Link

గుణాఢ్యుడి బేతాళ కథలు

October 30th, 2009

“అనగనగనగా ఒక ఊర్లో ఓ రాజు ఉండేవాడట. ఆయనకేమో ఏడుగురు కొడుకులంట. వాళ్లేమో చేపలు పట్టాలని ఒక రోజు వేటకు పోయారట.. ఊకొట్టండిరా.. ఉలకరు పలకరూ….” తొలి వాక్యం చదువుతుంటేనే మనందరికీ అర్థం అవుతుంది. ఒక అమ్మో, అక్కో, చెల్లో తన చుట్టూ పిల్లలను కూచోబెట్టుకుని ఈ భూమ్మీద ఎక్కడో ఓచోట ‘కత’ చెబుతోందని. పిల్లలు రాత్రి మీరాక తూగు కళ్లతోనే ‘కత’లు వింటూ, ఊకొడుతున్నారని.

ఈ ప్రపంచంలో ఎవరు మర్చి పోగలరు దీన్ని? తరతరాలుగా మానవజాతి బాల్యాన్ని ఉద్దీపింప జేసిన, చేస్తున్న స్వప్నలోకం కదా ఇది. మరి, రెండు వేల సంవత్సరాలుగా భారతీయులను ఉత్కంఠ భరిత వాతావరణంలోకి తీసుకుపోయిన, నేటికీ తమదైన ప్రభావం వేస్తున్న గొప్ప కథల మాటేమిటి? అవి….బేతాళ పంచవింశతి పేరుతో విశ్వవిఖ్యాతమైన కథలు. అవి చందమామ పత్రిక చరిత్రకు శిరోభూషణంగా వెలుగొందుతున్న అజరామర కథలు.

ఆంధ్ర దేశంలొనే కాదు ప్రపంచమంతటా కూడా చిన్నపిల్లలకు నిద్రపోవడానికి తల్లిదండ్రులు చిన్న చిన్నకథలు చెప్పడం బాగా అలవాటు. ఇవి ప్రపంచ జానపద సంస్కృతిలో భాగం. పాత కాలపు కథల్లో తూర్పుదేశాల కథలు ప్రసిద్ధిపొందాయి. కథ అంటే కొంత సత్యాంశతో కూడిన కల్పిత గద్యం. ప్రధానంగా కథలు ముఖ్యంగా నీతి, ధర్మం, సాహసం, ఔదార్యం, శృంగారం వంటి విషయాలు ప్రధాన వస్తువుగా నడుస్తాయి. చందమామ కథలు కూడా ఈ గీత వెంబడే పయనిస్తూ వచ్చాయి.

చందమామ కథల ప్రత్యేకతలు


చదవడానికి, వినటానికి మధ్య వారను చెరిపివేసిన చరిత్ర చందమామ కథలది. చందమామ మాసపత్రికలో ప్రచురించబడ్డ కథలే చందమామ కథలు. చందమామ మొదట్లో పిల్లల కథలకు ప్రత్యేకించబడినదే కావచ్చు కాని అది క్రమేణా పెద్దలు చదివే పిల్లల కథలకు పేరు పడింది. విశ్వనాథ సత్యనారాయణ వంటి వారిని కూడా సమ్మోహనపర్చిన చరిత్ర చందమామ కథలది.

దేశంలో చదవగలిగిన, సాహిత్యంతో అంతో ఇంతో పరిచయం కలిగిన ప్రతి కుటుంబమూ, చందమామను తన పిల్లలకు బహూకరించిన ఘనచరిత్రను కలిగి ఉందంటే, ఈనాటికీ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తోందంటే కథా సాహిత్యంలో చందమామ సాధించిన ఘనత ఏమిటో అర్థమవుతుంది. చందమామ కథలు చదువుతూ పెరిగిన పిల్లలు ఐదారు తరాలవరకు ఉంటారు. చందమామ కథల ముఖ్యమైన ప్రత్యేకత సరళమైన భాష, చక్కటి శైలి, చిన్న చిన్న పదాలు ఆపైన వాటి అర్ధవంతమైన వాడుక.

చందమామ కథలన్నీ కూడ ప్రస్తుతపు ఆధునిక ప్రపంచానికి సంబంధించినవి కావు. మధ్యయుగాల జానపద సంస్కృతికి మూలకందాలుగా మిగిలిన ఆనాటి మానవ జీవితానుభవాలను అందరికీ అర్థమయ్యే సరళ భాషలో కథల రూపంలో చందమామ తెలుగువారికి, భారతీయులకు అందించింది.

చందమామ కథల్లో ఆనాటికీ, ఈనాటికీ, ఏనాటికీ కూడా వన్నెచెదరని ఆణిముత్యాలు “బేతాళ కథలు.” ఇవి వందలాది సంవత్సరాల క్రితం గుణాడ్యుడు అనే కవి రాసిన బృహత్కథలో భాగంగా చరిత్రకెక్కాయి. ఈ 25 కథలు ఒకే ఒక రాత్రి కాలంలో బేతాళుడికి, విక్రమాదిత్యుడికి మధ్య జరిగిన మౌనభంగ పరిణామాలకు ప్రతిరూపం.

క్రీ.శ. 1వ శతాబ్ధిలో గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృత భాషలో బృహత్కథ అనే పెద్ద కథా కావ్యం వ్రాశాడు. కాశ్మీరదేశ గాథననుసరించి పైశాచీప్రాకృతమున బృహత్కథను రచించిన గుణాఢ్యుడు, ఆంధ్రరాజస్థానాన్ని అలంకరించిన విద్వాంసుడు. బృహత్కథ అనే పెద్ద తానులో బేతాళ పంచవింశతి ఓ ముక్కగా చెప్పవచ్చు. పంచవింశతి అంటే ఇరవై అయిదు. ఇది మూలంలో బేతాళ కథల సంఖ్య.

బృహత్కథ రాసి ఇప్పటికి 2 వేల సంవత్సరాలు గడిచాయి. శతాబ్దాలు, సహస్రాబ్దాలు గడిచినా గుణాడ్యుడి బేతాళ కథల అందం చెక్కుచెదరలేదు. వందల ఏళ్లు గడిచినా ఈ కథల గుబాళింపు తగ్గనే లేదు. చందమామ పుణ్యమా అని బేతాళ కథలు అనగానే అవి పిల్లల కథలు అని చాలామందికి అనిపించవచ్చు. వాస్తవానికి బేతాళ కథలు పిల్లల కథలు కావు. ఒరిజనల్ బేతాళ కథల్లో చాలావరకు శంగార కథలే అంటే ఆశ్చర్యం వేస్తుంది.

అయితే బేతాళ కథలు పేరుతో గత 55 ఏళ్లుగా బాలల మాసపత్రిక ‘చందమామ’ వందలాది కథలను అందిస్తూ వస్తున్నందవల్ల బేతాళ కథలు అంటే పిల్లల కథలుగానే చాలామందికి స్పురిస్తున్నాయి. నిజం చెప్పాలంటే బేతాళ కథలు మార్చి రాయాలని తీసుకున్న నిర్ణయం చందమామ చరిత్రనే ఓ కొత్త దశకు మళ్లించింది. ప్రపంచ చరిత్రలో ఏ పత్రికా సాధించలేనంత అద్బుత రికార్డును చందమామకు కట్టబెట్టినవి కూడా ఈ బేతాళ కథలే మరి.

జీవితంలో ఎన్నో చిక్కుముడులు ఉంటాయని ఎన్నో ధర్మసూత్రాలు ఎదురవుతాయని, వాటిని పరిష్కరించడానికి విచక్షణ, విజ్ఞత అవసరమని బేతాళ కథలు మనకి తెలియజేస్తాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ఈ మూల కథల్లో లభించే పరిష్కారాలన్నింటితో మనం ఏకీభవించవలసిన అవసరం లేదు.

త్రివిక్రమాదిత్యుడు లేక తెలుగులో బాగా ప్రాచుర్యంలో ఉన్న విక్రమార్కుడి విచక్షణ సర్వకాల సర్వావస్థల్లోనూ చెల్లిపోతుంది అని ఎవరూ భావించనవసరం లేదు. బేతాళ కథలులో దేవుళ్లూ, దెయ్యాలూ, మాయలూ, మర్మాలూ అన్నీ ఉన్నాయి. బలులున్నాయి. చచ్చినవాడిని బతికించడాలు ఉన్నాయి. వీటిని పాఠకులు విమర్శనాత్మకంగానే పరిశీలించాలి. మనదైన విచక్షణతోనే వీటిని స్వీకరించాలి.

ఈ మూలకథలు రాసిననాటికి ఇప్పటికీ ఎన్నో శతాబ్దాలు గడిచాయి. జీవితంలో మంచి చెడుల విచక్షణలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. మనందరికీ తెలుసు. ఒకనాడు మంచి అనుకున్నది ఈనాడు కాకపోవచ్చు. ఈ కథల్లో ఉన్న ఒక సుగుణం ఏమిటంటే ఏ విషయంలో అయినా మంచిచెడులనూ, ధర్మాధర్మాలనూ, ఉచితానుచితాలనూ వేరు చేసి చూడాలంటే ఎంతో వివేచనా, ఎంతో తర్కశక్తీ అవసరమని మనకివి తెలియజేస్తాయి. అనుకున్న పని సాధించాలంటే ఎంతో ఓపికా పట్టుదలా అవసరమని చెబుతాయి. ప్రమాదాల బారినుంచి తప్పించుకోవాలంటే కేవలం ధైర్యం ఒక్కటే చాలదు. తెలివి కూడా కావాలని బేతాళ కథలు మనకు బోధిస్తాయి.

ఇరవై అయిదు భాగాలతో కూడిన బేతాళ మూల కథలు గతంలోనూ వావిళ్ల వారి ప్రచురణల కింద వచ్చాయి. ఈ మధ్య కూడా తెలుగులో బేతాళ కథలు, ఆధునిక బేతాళ కథలు పేరుతో పలు పుస్తకాలు వచ్చాయి. ఈ కోవలో వచ్చిన మరో పుస్తకం ‘గుణాఢ్యుడి బేతాళ కథలు’. ఎన్ని సామ్రాజ్యాలు కూలినా, వ్యవస్థలు అంతర్ధానమైపోయినా, జీవన విలువలు క్రక్కదలి పోయినా, ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా  గుణాఢ్యుడి బేతాళ కథలకున్న పటుత్వం సడలలేదు. రెండు వేల సంవత్సరాలుగా కాలపరీక్షకు తట్టుకుని నిలబడిన గొప్ప కథలివి.

తెలుగు పాఠకలోకానికి అనువాద మాంత్రికుడు సహవాసి అందించిన చివరి పుస్తకం ఇది. సహవాసి తన జీవితం చివరి దశలో అందించిన అరుదైన అనుసృజన ఇది. ఈ కథలను చదువుతుంటే జబ్బుపడిన మనిషి రాసినట్లుగా పాఠకునికి తెలీదని, అదే సహవాసి విశేషమని ప్రచురణ కర్తలు చెప్పారు. ‘గుణాఢ్యుడి బేతాళ కథలు’ ను పీకాక్ క్లాసిక్స్ వారు 2008లో ప్రచురించారు.

చందమామలో బేతాళ కథలను గత నాలుగైదు తరాలుగా చదువుతున్న పాఠకులు, అభిమానులు ఈ పుస్తకాన్ని గుండెలకు హత్తుకోవచ్చు. బేతాళ కథలు మొదటి భాగం ఎలా మొదలైంది, విక్రమాదిత్యుడు బేతాళుడు సంధించిన చిక్కుముడిని విప్పలేకపోయినప్పుడు ఏమి జరుగుతుంది అనేదే పెద్ద ఉత్కంఠ భరితమైన అంశం.

బేతాళ కథలు కధాసాహిత్య చరిత్రలో, ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఎలా నిలిచిపోయాయో తెలుసుకోవాలంటే ‘గుణాఢ్యుడి బేతాళ కథలు’ కొని చదవండి. 135 పుటల ఈ అపురూప పుస్తకం వెల 50 రూపాయలు. ఇది విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ వంటి పుస్తకాల అంగళ్లవద్ద ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి.

ఇప్పటికే కొని ఉంటే సరి. లేకపోతే ఇప్పుడైనా ఈ పుస్తకాన్ని కొని చదవండి. సాహిత్య అభిమానులు, చందమామ ప్రియులు కూడా కలకాలం దాచుకుని భద్రపర్చుకోవాల్సిన గొప్ప పుస్తకం ఇప్పుడు చక్కటి అనువాదంతో మీముందు ఉంది మరి.

RTS Perm Link

కాకతీయ రుద్రమ్మ

October 18th, 2009

ఇది చందమామ తొలి సంచిక -1947 జూలై- లో ప్రచురించిన కథ. దీపావళి సందర్భంగా మనం ప్రతిసారీ సత్యభామను తలుచుకుంటాం. నరకాసురుడిపై యుద్ధ సమయంలో కృష్ణుడితో సరిసమానంగా రధంపై ఆసీనురాలై నరకాసురవధలో సమాన పాత్ర పోషించిన ధీరవనిత సత్యభామ. చరిత్రలో వాస్తవంగా కూడా ఓ మహాసామ్రాజ్య భారాన్ని పురుషవేషం దాల్చి మోసి కాపాడిన ధీరవనిత మరొకరు ఉన్నారు.

ఆమె కాకతి రుద్రమ్మ. రుద్రమ్మ గణపతిదేవుడు, నారమ్మల ముద్దుబిడ్డ. దక్షిణదేశ చరిత్రలో అతి గొప్ప సామ్రాజ్యాలలో ఒకటిగా పేరుపొందిన కాకతీయ సామ్రాజ్య చక్రవర్తిని ఆమె. మహిళా లోకానికి మణిపూసగా మిగలిన రుద్రమ్మ కథను ఈ దీపావళి సందర్భంగా చందమామ పాఠకులకు అందిస్తున్నాం.

కథ చదవండి.

మనం మూడుసార్లు మహాసామ్రాజ్యం స్థాపించాము. మొదటిది ఆంధ్ర సామ్రాజ్యం, రెండోది కాకతీయ సామ్రాజ్యం, మూడోది విజయనగర సామ్రాజ్యం, ఈ మూడు సామ్రాజ్యాలు దక్షిణదేశానికి చేసిన సేవ అంతా ఇంతా కాదు. వీటిని నెలకొల్పకుండా ఉన్నట్లయితే దక్షిణదేశ చరిత్ర మరొక విధంగా ఉండేది.

ఈ సామ్రాజ్యాలను సమర్థతతో పరిపాలించిన వారు స్త్రీలు కూడా ఉన్నారు. వారిలో రుద్రమ్మ ముఖ్యురాలు.

కాకతి గణపతిదేవ మహారాజుకు ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా రుద్రమ్మ ఒక్కతే, తండ్రి తరువాత రాజ్యం చేయవలసింది ఆమే, అందువల్ల గణపతి దేవుడు రాజుకు కావలసిన విద్యలన్నీ రుద్రమ్మకు చెప్పించసాగాడు. రుద్రమ్మ కత్తిసాము నేర్పింది. గుర్రపుస్వారీ నేర్పింది. సేనలను నడప నేర్చింది. కోటలు పట్ట నేర్చింది. ఇంకా మంచి రాజుకు ఎన్ని విద్యలు కావాలో అన్ని విద్యలూ నేర్చుకుంటూ వుంది.

కాకతి రుద్రమ్మ కథ పూర్తి పాఠం చదవాలంటే కింది లింకును క్లిక్ చేయండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=92&stId=2286

RTS Perm Link

చందమామ పిలుపు

October 8th, 2009
కారుమేఘాలు కురిపించిన కుంభవృష్టి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ కనీ వినీ ఎరుగని ఉత్పాతాన్ని చవిచూస్తోంది. దీంతో రిజర్వాయర్ల కడుపు చీల్చుకుంటూ వెల్లువెత్తిన వరద ఉధృతి తెలుగు నేలను కకావికలం చేసింది. పడగెత్తిన ప్రకృతి విలయతాండవం బారిన పడి సర్వం కోల్పోయి, నిండా నీరైపోయిన కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, కృష్ణా, గుంటూరు, కడప, అనంతపూర్, విశాఖపట్నం జిల్లాలు ఇప్పుడు సాటిమనుషుల సహాయం కోసం కోటికళ్లతో ఎదురుచూస్తున్నాయి.

ఊరూవాడా బురదమయం అయిపోయిన కనీవినీ ఎరుగని విపత్కర స్థితిలో సహాయం చేయవలసిందిగా కోరడానికి కూడా గొంతు పెగలని స్థితిలో లక్షలాది మంది ప్రజలు మనుషుల స్పందనకోసం వేచి చూస్తున్నారు. ఎందుకిలా జరిగింది అని ప్రశ్నించేందుకు, నిలదీసేందుకు, ఆరోపణలు గుప్పించేందుకు ఇది సమయం కాదు.

ఆంధ్రప్రదేశ్‌లో వరద బారిన, బురద బారిన పడి నలుగుతున్న లక్షలాది మంది ప్రజల విషాదాన్ని ‘చందమామ’ తనదిగా భావిస్తోంది. చేతనైనంతగా ధనం, వస్తురూపాల్లో సహాయపడే ఆపన్న హస్తాలకు చందమామ చేతులు జోడించి నమస్కరిస్తూ సహాయాన్ని మరింతగా కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి  చేస్తోంది.

లక్షలమంది నిరాశ్రయులై, అంచనాలకు సైతం అందని స్థాయిలో జరిగిన ఈ దారుణ నష్టాన్ని భర్తీ చేయడానికి ఎందరు ఎన్నిరకాలుగా సహాయం చేసినా సరిపోదు  కాబట్టి పునరావాస చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు, టీటీడీ వంటి ధర్మసంస్థలూ (7 కోట్ల విరాళం అందించింది), మీడియా చేస్తున్న ప్రయత్నాలకు వ్యక్తులుగా ప్రతిఒక్కరూ చేయూతనివ్వాలని చందమామ పిలుపునిస్తోంది.
 
దేశదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు, చందమామ పాఠకులు, అభిమానులు, రాష్ట్రంలో సహాయం చేయగల స్థితిలో ఉన్న వారు. ప్రతిఒక్కరూ వరదబాధితులకు తమ వంతు సహాయం చేయాలని చందమామ అర్థిస్తోంది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ చేయలేం అనే రీతిలో దెబ్బతిన్న మనవారిని, తెలుగువారిని ఆదుకోవడానికి కలిసిరావలసిందిగా విన్నవిస్తున్నాం.

మన కళ్లముందు సర్వస్వం కోల్పోయి శక్తి ఉడిగిపోయిన మనవారికి, మన తెలుగు ప్రజలకు జీవితంపై కాసింత ఆశను కలిగించే దిశగా మానవీయ సహాయాన్ని పంపవలసిందిగా చందమామ కోరుతోంది. కాసింత తిండి, బట్ట, తాగడానికి నీరు, వ్యాధుల నివారణకు మందులు… కోటి ఆశలతో ఎదురు చూస్తున్న మనవారికి వీటిలో ఏది మనవద్ద ఉండి సమర్పించినా అది వారి జీవితాశలకు ఆలంబనంగా ఉంటుందని చందమామ గుర్తుచేస్తోంది.

వరద బాధితులను ఆదుకోవడానికి రాష్ట్రం ఏకమైంది. చిన్నా..పెద్దా, పేద..ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేయడానికి ముందుకు కదులుతున్నారు. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ వరద పీడితులకు ఆసరాగా నిలబడటానికి చేయిచేయి కలిపి ముందుకు సాగుతున్నారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్యులు, ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, సినీ నటులు, వ్యాపారస్తులు, పత్రికలు, టీవీఛానళ్లు, స్వచ్ఛంద సంస్థలతో పాటు ఎంతో మంది సాధారణ ప్రజానీక వరద బాధితులకోసం తమవంతు సహాయాన్ని చేస్తున్నారు. విద్యార్థులు వీధి వీధి తిరిగి విరాళాలను సేకరిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు బస్టాండ్లలో హుండీలు పెట్టి సేకరిస్తున్నారు.

ఇలా వరద బాధితులకోసం యావత్‌ రాష్ట్రం ఏకమయి మానవతా హృదయాన్ని చాటుకొంటోంది. ఇప్పటికే పలు సంస్థలు స్వచ్చందంగా విరాళాలను, సహాయాలను ఒకచోట చేర్చి వరదబాధితులకు అందించడానికి తమ వంతుగా కృషి చేస్తున్నాయి.

ప్రాణాలు మాత్రమే దక్కించుకని బిత్తర చూపులు చూస్తున్న మనవారిని ఆదుకోవడానికి మనం కూడా మనకు చేతనైన సహాయం చేద్దాం. కొన్ని సంస్థల ఫండ్ వివరాలను ఇక్కడ ఇస్తున్నాం.

మీ విరాళాలు పంపవలసిన సంస్థల వివరాలు.

1. ‘ ముఖ్యమంత్రి సహాయనిధి , ఆంధ్రప్రదేశ్ ‘ పేరిట క్రాస్ చేసిన చెక్ , డీడీలు పంపాలి

2. ‘ ప్రధానమంత్రి సహాయనిధి , ఢిల్లీ ‘ పేరిట క్రాస్ చేసిన చెక్ , డీడీలు పంపాలి.

3. రెడ్ క్రాస్ , ఆంధ్రప్రదేశ్ ‘Indian Red Cross Society, AP State branch’ పేరిట నగదు , క్రాస్ చేసిన చెక్ , డీడీలు పంపాలి.

ఇక్కడ పేర్కొన్న చిరునామాలే కాకుండా, మీడియా, టీవీ ఛానెళ్లు ప్రకటిస్తున్న హెల్ప్‌లైన్లు, రిలీఫ్ పండ్‌లు ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే దానికి, మీ సహాయం ఎంత చిన్నదైనా సరే దయచేసి అందించాలని చందమామ అభ్యర్థిస్తోంది.

మీ వీధిలో, ఊర్లో,  మీ కాలనీలో వరద బాధితుల కోసం విరాళాలు, వస్తువులు సేకరించే ప్రతి మానవతా మూర్తికి, సంస్థకు మీ ఆపన్న హస్తాన్ని అందించాలని చందమామ కోరుతోంది.

సందేహ నివృత్తికోసం మీ స్పందనలను abhiprayam@chandamama.com కు పంపండి.

RTS Perm Link

చందమామ శంకర్‌ గారి జీవిత వివరాలు…

September 25th, 2009
శంకర్ గారు

శంకర్ గారు

చందమామ చిత్రమాంత్రికులు శంకర్ గారు 1946 నుంచి చిత్రలేఖన పనిని వృత్తిగా ఎంచుకున్నారు. అప్పటినుంచి చిత్రాలు గీయడమే తప్ప మరొక వ్యాపకం పెట్టుకున్న చరిత్ర లేదు. నిజంగా చెప్పాలంటే బొమ్మలు గీయడం. పరమ భక్తిప్రపత్తులతో పనిలో దిగటం తప్ప మరొక పని ఈయనకు తెలియదు.

ఏమీ తెలియకపోవడం కూడా మంచిదయ్యిందేమో మరి. చందమామ చిత్రప్రపంచానికి, చిత్రలేఖన చరిత్రకు వన్నెలద్దిన గొప్ప హస్తనైపుణ్యం మన కాలం ప్రపంచానికి సజీవంగా ఇన్ని దశాబ్దాలుగా మిగలడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చు.

ప్రస్తుతం వయసు మీద పడిన కారణంగా (85 ఏళ్లు) వారంలో తొలి మూడు రోజులు మాత్రమే చందమామ కార్యాలయానికి వచ్చి పని చేస్తారు. గురు, శుక్ర వారాల్లో మాత్రం ఇంటివద్దే ఉంటూ చందమామ చిత్రాలు గీస్తారు.

రోడ్లమీద మలుపుల్లో, గతుకుల్లో ఊగుతూ వచ్చే క్యాబ్‌లో అందరితోపాటు కూర్చుని 85 ఏళ్ల వయసులో రోజూ ఆఫీసుకు రాలేనని చెబితే యాజమాన్యం ఈయనకు మినహాయింపు ఇచ్చి చివరి రెండు రోజులు ఇంటివద్దే పనిచేయడానికి వీలు కల్పించింది. మొదటి మూడు రోజులు ప్రింట్ చందమామ వర్క్ ప్లాన్‌ అమలుకోసం తప్పక రావలసి ఉంటుంది.

వయోభారం మీద పడుతూనే ఉన్నా సరే.. ‘జీవితం చివరి వరకూ  చందమామలోనే పనిచేయాల’నే సంకల్పబలం సాక్షిగా శంకర్ గారు చందమామ ఆఫీసుకు వస్తూనే ఉన్నారు. జీతం పట్ల, పదవి పట్ల, హోదా పట్ల కించిత్ ఆశలు, ఆకాంక్షలు కూడా లేని ఈ నిగర్వి… మా వంటి తదుపరి తరాలకు, ప్రస్తుతం చందమామలో పనిచేస్తున్న పిల్లలకు (20 నుంచి 25 ఏళ్ల వయసులోపు) ఓ అద్భుతమైన ‘శ్రామిక ఉదాహరణ’లాగే ఉంటారు.

పని సంస్కృతికి నిలువుటద్దంలా నిలిచే ఈ మహనీయ మూర్తిమత్వం మాతో ఉంది. మేం ఆయనతో కలిసి పనిచేస్తున్నాం. ఆయనతో మా ఉద్యోగ జీవితాన్ని, మాటలను, చూపులను, ప్రయాణాన్ని కూడా పంచుకుంటున్నాం అనే విషయం తల్చుకుంటేనే మాకు ఒళ్లు గగుర్పొడుస్తూ ఉంటుంది.

శంకర్ గారి జీవిత వివరాల పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2253
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&sbCId=&stId=2253&pg=1

RTS Perm Link

చందమామీకరణ

September 16th, 2009

తెలుగుభాషకు ఓ కొత్త పదం దొరికిందా అనిపిస్తోంది. అంతర్జాతీయీకరణ, పరాయీకరణ, సాంస్కృతికీకరణ, సైనికీకరణ, వర్గీకరణ వంటి పదాలను మనం గతంలోనే చదువుకున్నాం. కానీ ఇప్పుడు వీటి సరసన మరోకొత్త పదం చేరిందా…! అవుననే అనిపిస్తోంది. అదే.. “చందమామీకరణ.” ఇంగ్లీషులో దీనినే “Chandamamization” అని అంటారేమో.

నేపథ్యంలోకి పోయి చూస్తే… కథారచయితలు పంపుతున్న కథలను చందమామకు అనుగుణంగా కాస్త మెరుగులు దిద్ది, మూలకథకు కొన్ని మార్పులు చేసి చందమామలో ప్రచురిస్తూ వస్తున్న సంప్రదాయానికే “చందమామీకరణ” అని పేరు వచ్చినట్లుంది. దీన్ని గతంలోనే రోహిణీ ప్రసాద్ గారు తన “చందమామ జ్ఞాపకాలు” వ్యాసంలోనూ, వికీపీడీయాలో చందమామ అభిమానులు రాసిన “చందమామ” ప్రధాన వ్యాసంలోనూ ప్రస్తావించినట్లుంది.

మూలకథకు మెరుగులు దిద్దినా, మార్పు చేసినా, ఆ కథారచయితలకు నగదు విషయంలో ఖచ్చితంగా వ్యవహరించి ఎప్పటికప్పుడు చెల్లించే విషయంలో చందమామ ఎన్నడూ వెనుకడుగు వేయకపోవడం వల్ల తమ కథల్లోని మార్పులను సంబంధిత రచయితలు పెద్దగా పట్టించుకునేవారు కారని చందమామపై ఈ రకమైన వ్యాసాలు తెలుపుతూ వచ్చాయి.

మానవ ప్రయత్నానికి అంతిమంగా  విజయం దక్కేలా కథను తీసుకురావడం అనే మహత్వ సంప్రదాయాన్ని చందమామ మొదటినుంచి పాటిస్తున్నందువల్ల చందమామ కథలు దాదాపుగా ఈ కోణంలోంచే మార్పులకు గురవుతూ వస్తున్నాయి. దయ్యాలు, భూతాల ఇతివృత్తంతో నడిచే కథల్లో కూడా ఆ దయ్యాలే, భూతాలే మంచివాళ్లకు సహాయం చేసేలా ముగిసే కథలు చందమామలో తప్ప ఇంకెక్కడ ఉంటాయి.

పిశాచాలు, దెయ్యాలు చందమామ కథల్లో ఎక్కువగా ఉంటున్నాయని మొదటినుంచి చందమామపై విమర్శలు కూడా వస్తున్నప్పటికీ చందమామ సంపాదకుల అభిప్రాయం మరొక రకంగా ఉంటూవచ్చింది. దెయ్యాల కథల్లో కూడా చెడుకు విజయం లభించినట్లు ఏ కథా ముగియలేదు. పిశాచాలు కూడా మంచిమనుషులకు సహాయం చేస్తాయి.

చందమామ కథలకు వరవడి దిద్దిన కొడవటిగంటి కుటుంబరావు గారిపైనే దయ్యాలు, భూతాల కథలకు ప్రాధాన్యం ఇస్తున్నారని గతంలో చాలా విమర్శలు వచ్చాయట. ఈ విమర్శలన్నింటినీ కొకు గారు ఒకే వాదనతో కొట్టిపడేశేవారట. మనం ఎన్ని దయ్యాలు, భూతాల కథలు వినిపించి భయపెట్టినా 15 ఏళ్లు దాటిన ఏ పిల్లలూ దయ్యాలు, భూతాలను నమ్మరని ఆయన వాదించేవారట.
 
కథల్లో పిశాచాల కేరెక్టర్లు ఉండాలి. కాని అవి మంచికి తోడ్పడాలి. అలాగే కథ ముగియాలి. అనే ఓ గొప్ప ధర్మసూత్రాన్ని కొకుగారి హయాంనుంచి కూడా చందమామ పాటిస్తూనే వస్తోంది. దీన్నే చందమామీకరణ అంటారేమో మరి. అంతిమంగా గెలవాల్సినవి మానవ ప్రయత్నమూ, సద్బుద్దీ మాత్రమేనని కొకు పదే పదే చెప్పేవారట.

అందుకే సాంప్రదాయక రీతిలో కథలు రాసి పంపినా వాటిలో బలమున్నప్పుడు స్వీకరిస్తూ చివరలో మూలకథకు కొంచెం ట్విస్ట్ ఇవ్వడం ద్వారా మనిషి ప్రయత్నానికి విలువ ఇవ్వడాన్నే చందమామ కథలు అప్పుడూ ఇప్పుడూ కూడా పాటిస్తున్నాయి. ఇదే “చందమామీకరణ.”

సరిగ్గా దాన్ని నిరూపిస్తోందా అనే విధంగా ఈ సెప్టెంబర్ చందమామ సంచికలో ‘తీరిన సందేహం’ అనే కథను సంపాదకులు మార్చినట్లుంది. ఆ మార్పుల పట్ల సంబంధిత రచయిత ఏ మాత్రం నొచ్చుకోకుండా తన స్వంత కథకు జరిగిన “చందమామీకరణ”ను మెచ్చుకుంటూ, తన కథను ఎన్నుకుని మార్పులు చేసి మరీ ప్రచురించినందుకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ చందమామ ఆఫీసుకు ఉత్తరం రాశారు.

తన కథను ప్రచురించడం ద్వారా చందమామ ఇచ్చిన ప్రోత్సాహం, అభిమానం పట్ల రచయిత కృతజ్ఞత తెలుపుకుంటూనే ప్రపంచస్థాయి పత్రికలో ఈ కొంచెం స్థానం తనకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ రచయిత ఉత్తరం ముగించారు.

చందమామ ద్వారా తెలుగు భాషకు అందిన “చందమామీకరణ” వెనుక రచయితల సంపూర్ణ అంగీకారం ఉందనిపిస్తుంది. లేకుంటే చందమామకు, కథారచయితలకు మధ్య ఇంతటి అవినాభావ సంబంధం ఏర్పడి ఉండేది కాదనిపిస్తుంది. గత 60 సంవత్సరాలుగా చందమామలో ‘చందమామీకరణ’ నిరంతరాయంగా సాగిపోతూండటానికి ఈ అవినాభావ సంబంధమే ప్రధాన కారణం.

చందమామలో తమ కథలు అచ్చుకాకపోవడం, ప్రచురణకు స్వీకరించకపోవడం వల్ల ప్రముఖ రచయితలు కూడా నొచ్చుకుని ఉండవచ్చు, మనసు బాధపడి ఉండవచ్చు కానీ, తమ కథలకు చందమామ దిద్దిన మెరుగులను ఇంతవరకు ఏ కథా రచయిత కూడా అడ్డు చెప్పిన చరిత్ర ఉన్నట్లు లేదు.

ఇది చందమామ గొప్పతనం. అంతకు మించి చందమామ కథకుల సహృదయత గొప్పదనం. అందుకే “చందమామీకరణ”కు జై..

చందమామ పాతకథలు చదవాలంటే కింది లింకును క్లిక్ చేయండి.

http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

మీ చందమామ జ్ఞాపకాలను కింది లింకుకు దయచేసి పంపండి.

abhiprayam@chandamama.com

RTS Perm Link

మన చందమామ

August 6th, 2009

అఖిలాంధ్ర, అఖిల భారత, అఖిల ప్రపంచ చందమామ పాఠకులకు, అభిమానులకు, చందమామ పిచ్చోళ్లకు ఇందుమూలంగా తెలియజేయుచున్నది ఏమనగా…

చందమామ అతి త్వరలో పాత రూపంలోకి రాబోతోందొహో… ఆరునెలలుగా చందమామ పాఠకులను కలవరపెడుతున్న, కలత సృష్టిస్తున్న ఒక అతి పెద్ద సమస్యకు త్వరలో పరిష్కారం లభించబోతోంది.

60 సంవత్సరాలుగా రూటు మార్చకుండా పంథా విడవకుండా అవిచ్చిన్నంగా కొనసాగిన చందమామ పత్రిక లే అవుట్ యంగ్ జనరేషన్ అభిరుచులకు అనుగుణంగా  అన్ని రకాలుగా మార్పు చెందాలనే కొత్త పాలసీ చేపట్టింది.

తెలుగు జానపద చిత్రశైలితో దశాబ్దాలుగా పాఠకులను మంత్రముగ్దులను చేస్తున్న చిత్రా, వడ్డాది పాపయ్య, శంకర్ చిత్రాల స్థానంలో చందమామకు ఆధునిక రూపం తొడగాలని భావించిన యాజమాన్యం పాలసీ ప్రకారం, చందమామ తన చరిత్రను తానే అభాస చేసుకుని పాఠకుల తీర్పుకోసం బోనులో నిలబడింది.

ఆదునిక రూపం తొడుగుకున్నది మొదలుకొని కొత్త చందమామ గత నాలుగయిదు నెలలుగా పాఠకులు, అభిమానుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొంటూ వచ్చింది.

సాధారణ పాఠకులు మినహాయిస్తే చందమామ  చరిత్రను తొలినుంచి నిశితంగా పరిశీలిస్తున్న సీరియస్ పాఠకులు, అంతకు మించి అభిమానులు చందమామ నూతన మార్పులను ఏ మాత్రం జీర్ణం చేసుకోలేకపోయారు.

యూనివర్శిటీ ప్రొఫెసర్లనుంచి వృద్ధ పాఠకాభిమానుల వరకు చందమామ రూపంలో, విషయంలో మార్పులను గత కొద్ది నెలలుగా ఎంతగా బండకేసి ఉతికారంటే ఇది సూర్యుడు ఎప్పుడూ తూర్పువైపునే ఉదయిస్తాడన్నంత నిజం.

నా కన్నబిడ్డను రేప్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవలసి వస్తోంది అని ఒకరు, నా బిడ్డ చనిపోయిందనుకుని ఇవ్వాళ్టినుంచి చందమామను పూడ్చి పెడుతున్నాను అని మరొకరు, చిత్రా, వపా, శంకర్ బొమ్మలు లేని చందమామ మాకు అవసరం లేదు చందా వెనక్కు పంపమని రాసిన వారు కొందరు, చందమామకు చందా కట్టి ఎంత మతిహీనమైన పని చేశాను అని కొందరు.

కేవలం ఆరు నెలలు. ఇంకా చెప్పాలంటే నాలుగు నెలలు… 60 ఏళ్ల చరిత్రను తృణప్రాయంగా మార్చి తెలుగు పాఠకుల ఓపికను పరీక్షించిన చందమామ నూతన రూపం, ఎట్టకేలకు చందమామ సాంప్రదాయక రూపాన్ని మోహిస్తున్న తెలుగు పాఠకుల, అభిమానుల ధర్మాగ్రహ జ్వాలల బారిన పడి అంతర్ధానమవుతోందా?

అవుననే చెప్పాలి. ‘పాఠకుల అబిరుచులకు దూరంగా జరిగే పత్రిక మనలేద’నే శ్రేయోభిలాషుల హెచ్చరికలను నిజం చేస్తూ త్వరలోనే చందమామ పాత రూపాన్నే తిరిగి తలకు ఎత్తుకోబోతోంది.

ఇది చందమామ పాఠకుల విజయం. చందమామ చరిత్రనే తారుమారు చేసేంత సమూల మార్పులకు గురవుతున్న కొత్త చందమామపై పాత తరం పాఠకులు సాగించిన సుదీర్ఘ విజయంలో  ఓ పెద్ద మలుపు ఇది. ఈ గొప్ప పరిణామంపై ఎవరు ఎలా వ్యాఖ్యానాలు చేసినప్పటికీ, అంతిమ సత్యం ఇదీ..

చందమామ…. తెలుగు జాతికి కథల దాహం తీర్చిన చందమామ… తెలుగు లోగిళ్లలో దశాబ్దాల పాటు కథల అమృతాన్ని వర్షిస్తూ దోబోచులాడిన చందమామ… వ్యవస్థాపకుటు చక్రపాణి అభిప్రాయాలను కూడా కొన్ని సందర్భాల్లో తోసిరాజని తన పంధాలో తాను నడిచిన చందమామ…

మీ చందమామ… మా చందమామ..

ఇకపై…..

మన ‘చందమామ’ లాగే ఉండబోతోంది.

RTS Perm Link