ఆదిలక్ష్మిగారు : చందమామ జ్ఞాపకాలు

September 20th, 2011

ఆపీసులో కూర్చుని పనిచేస్తుంటే కూడా ఆదిలక్ష్మి గారి కుటుంబ విషాద పరిణామాలు గుర్తుకొచ్చి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. ప్రస్తావనకు వస్తుంటేనే బాథ తన్నుకొస్తోంది. విషయం మా పైవాళ్లకు క్లుప్తంగా తెలిపి మౌనంగా ఉంటున్నాను. ఈ మౌనం కూడా నన్ను కాలుస్తోంది. భరించక తప్పదు.  వృత్తిగత సంబంధంలో ఎంత గొప్ప మేధో సాహచర్యం వారి కుటుంబంతో అబ్బిందో మాటల్లో చెప్పలేను. తల్చుకుంటేనే దుఖం దుఖంగా ఉంటోంది.

విషయం తెలియగానే చందమామ కార్యాలయంలో విషాద వాతావరణం. ఈ సెప్టెంబర్ నెల చందమామలో అచ్చయిన “తీపికి చేదు చెల్లుకు చెల్లు” కథ ఆమె రాసిందే అని చెప్పగానే అందరూ కదిలిపోయారు. చిన్న పిల్ల తెలిసీ తెలియని వయసులో తీసుకున్న అనూహ్య నిర్ణయం ఒక పచ్చటి కుటుంబం పునాదిని ఎంతగా కదిలించివేసిందో తల్చుకుంటూ బాధపడ్డారు. కార్పొరేట్ విద్య పెడుతున్న అపరిమిత ఒత్తిడి మాత్రమే కాకుండా పిల్లలను ఇంత సున్నితంగా మారుస్తూ, వారిని అవాంఛనీయ చర్యలవైపు కొట్టుకుపోయేలా చేసే ప్రథమ శత్రువు టెలివిజన్ అంటూ విమర్శించారు.

కష్టాలొస్తే ఉరి ఒక పరిష్కారం అనేంత భయంకరమైన రీతిలో టీవీలు ప్రదర్శస్తున్న సీరియల్స్, ఉరి తగిలించుకుంటున్న దృశ్యాలు పిల్లల సున్నితత్వంపై దెబ్బతీస్తున్నాయని ఫీలయ్యారు. పిల్లల విషయంలో ఎలా ఉండాలో, వారి మనస్సులో దాగి ఉన్న విషయాలను ఎలా బయట పెట్టాలో కూడా తెలియడం లేదంటూ తమ తమ అనుభవాలు పంచుకున్నారు.

చందమామ ఇటీవల సంపాదించుకున్న ఓ మంచి కథా రచయిత్రి ఆదిలక్ష్మిగారు. ఆన్‌లైన్ చందమామలో తన చందమామ జ్ఞాపకాలు ద్వారా ఆమెతో ఏర్పడిన పరిచయం తర్వాత కథకురాలిగా, అనువాదకురాలిగా బహు రూపాలలోకి విస్తరించింది. స్కేల్ పెట్టి కొలిచినట్లుగా అక్షరాలను ఎంత అందంగా ఆమె చెక్కుతారో. ఆమె 2010లో రాసి పంపగా ఆన్‌లైన్‌లో, ఈ బ్లాగులో ప్రచురించిన ‘చందమామ జ్ఞాపకాలు’ చూస్తే తెలుస్తుంది.

ఆమెకు కలిగిన తీరని కష్టానికి చలించిపోతూనే ఆమెగురించి తెలిసినవారికోసం, చందమామ పాఠకులకోసం ఆమె గతంలో పంపిన చందమామ జ్ఞాపకాలు ప్రచురిస్తున్నాము. తెలుగు అక్షరాలపై ఇంత పట్టు ఉన్న, ఇంత చక్కటి భావుకత, అద్వితీయ ఊహాశక్తి కలిగిన ఈ చందమామ కథకురాలి చందమామ జ్ఞాపకాలను ఇక్కడ ముందస్తు పరిచయంతో పాటు మరోసారి చూడగలరు.

పరిచయం:
‘చందమామ’ జ్ఞాపకాలకు సంబంధించి ‘అమ్మఒడి’ ఆదిలక్ష్మిగారిది ఓ వినూత్న అనుభవం. చిన్నప్పుడు నాన్న చదివి వినిపిస్తే తప్ప చందమామ కథను వినలేని అశక్తత లోంచి ‘నేనే చదువు నేర్చుకుంటే పోలా’ అనే పట్టుదలతో, స్వయంకృషి తోడుగా శరవేగంగా చదువు నేర్చుకున్న అరుదైన బాల్యం తనది. ఈ తీపి జ్ఞాపకాలను ఆమె మాటల్లోనే ఇక్కడ కొద్దిగా విందాం..

నాన్నకి చదవటం వచ్చు కాబట్టి కదా చక చకా చదివేసాడు. మొదటి సారి ఇష్టంగా చదివేసేవాడు. మళ్ళీ చదవమంటే కుదరదనే వాడు.

అదే నాకూ చదవటం వస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు, ఎంచక్కా చదివేసుకోవచ్చు’ – అన్న భావన, అక్షర క్రమం తెలియకుండానే మనసుకి అందింది. చదవటం రాక చందమామ బొమ్మలు పదేపదే చూసుకునే కొద్దీ పసి మనస్సు లోతుల్లో అక్షరాలు నేర్చుకోవాలనే తపన పెరిగింది.

వీధిబడిలో చేర్చగానే, ఇష్టంగా మారాం చేయకుండా అక్షరాలు నేర్చేసాను. పెద్ద బాలశిక్ష చాలా కొద్దీ రోజుల్లో పూర్తి చేసాను. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేటప్పటికే నాకు కథలు చదవటం వచ్చేసింది.

ఆ విధంగా చందమామ నాకు చదవటం నేర్పింది. చదువు కోవాల్సిన అవసరం నేర్పింది. చదువు నేర్పిన గురువుని గౌరవించటమూ నేర్పింది.”

గీతాప్రియదర్శిని

చందమామ ద్వారా చదవటం నేర్చిన, చదువు నేర్పిన గురువును గౌరవించడం నేర్చిన ఆదిలక్ష్మిగారు, ఒకప్పుడు నాన్నతో తను పొందిన అనుభవాన్ని తన పాపాయి నుంచి కూడా ఎదుర్కొన్నారట. చందమామ కథను ఒకసారి చదివి వినిపిస్తే మళ్లీ మళ్లీ వినాలి అనే కుతూహలంతో తప్పుల తడకగా చందమామ కథను చదివి నవ్వించే పాప గీతాప్రియదర్శిని, ఒకట్రెండుసార్లు చదివి ఇక కుదరదంటే “నేను పెద్దయ్యాక నా పాపకి నీలా చదవను ఫో అనను. ఎన్నిసార్లయినా చదివి వినిపిస్తాను తెలుసా?” అంటూ బుంగమూతి పెట్టేదట.

ఇదీ చందమామ ఘనత, చందమామతో బంధం అల్లుకున్న తరతరాల తెలుగు కుటుంబాల ఘనత. ఆదిలక్ష్మిగారు, ఆమె జీవన సహచరుడు, వారి పాపాయి దశాబ్దాలుగా నింగిలోని చందమామతో పాటు నేలమీది ‘చందమామ’తో కూడా చెలిమి కొనసాగిస్తున్నారు. నేలమీది ‘చందమామ’తో ఇటీవలి వరకు ప్రత్యక్ష సంబంధం లేని ఆదిలక్ష్మి గారు ఇటీవలే చందమామతో పరిచయంలోకి వచ్చారు.

నాన్న ద్వారా పరిచయం అయిన చందమామను కన్నకూతురికి కూడా పరిచయం చేయడమే కాదు… తాను పాఠాలు చెబుతున్న స్కూలు పిల్లలకు కూడా కథామృతాన్ని పంచిపెడుతూ, రేపటి తెలుగు తరాన్ని తయారుచేస్తున్న ఆదిలక్ష్మిగారూ… మీ చందమామ కుటుంబాన్ని చూసి చందమామ సిబ్బందిగా మేం గర్వపడుతున్నాం.

చందమామతో మీ జ్ఞాపకాలను పంచుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఆదిలక్ష్మి గారి చందమామ జ్ఞాపకాలు పూర్తి పాఠం ఇక్కడ చూడండి.
————–

అరచేతిలో అందాల చందమామ
ఆదిలక్ష్మి

బాల్యం నుండి ఇప్పటికీ చందమామ మా జీవితంలో ఓ భాగం. అక్షరాలు నేర్చుకోవాలన్న ఆకాంక్షని రేకెత్తించిందే చందమామ.

అమ్మఒడిలో కాళ్ళు చేతులు ఆడిస్తూ, స్వయంక్రీడా వినోదితమైన శైశవ దశలో, ఎవ్వరికైనా పంచభూతాలైన భూమి (మట్టి), ఆకాశం(చందమామ), అగ్ని (వెలిగే దీపం), గాలి, నీళ్ళు పరమ ఆకర్షణలు!

’అనగ అనగా ఓ రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఏడుగురూ వేటకెళ్ళి ఏడు చేపలు తెచ్చారు’ అంటూ కథ చెబితే ’ఊ’ కొట్టటం వచ్చిన నాటి నుండే ఆకాశంలోని చందమామతో పాటు అరిచేతిలోని చందమామా పరమ ఆకర్షణే!

రంగు రంగుల బొమ్మలు; ఒంటికొమ్ము రాక్షసులు, చింతచెట్టు దెయ్యాలు, మాయల మారి మాంత్రికులు, బుద్ది చెప్పే గ్రామాధికారులు, మంచి దారిలోకి మారిపోయే గజ దొంగలు…. ఎన్నో పాత్రలు! ఇతిహాసాలు నేర్పిందీ చందమామే!

విచిత్ర కవలలు జానపద కథలతో వింత లోకాలకి తీసి కెళ్ళిందీ చందమామే!

చిన్నప్పుడు…. అప్పటి కింకా బడిలో చేరలేదు. నాన్న ప్రతి నెలా చందమామ తెచ్చేవాడు. నాన్న చందమామ బిగ్గరగా పైకి చదవాలంటే, ఇద్దరు ఆయన కాళ్ళు పట్టాలి. ఒకరు ఆయన తల దగ్గర కూర్చొని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి మెల్లిగా మర్ధన చెయ్యాలి. అప్పుడు గాని బిగ్గరగా చదివేవాడు కాదు.

తల దగ్గర కూర్చొన్న వాళ్ళు, బొమ్మలు కూడా కనబడుతుండగా కథ వినవచ్చన్న మాట. ఎప్పుడూ నేనే నాన్న తల దగ్గర కూర్చొనే అవకాశం పొందేదాన్ని. నాన్న కథలన్నీ ఒకసారి చదివి పెట్టేవాడు. అంతే! మళ్ళీ మళ్ళీ చదవమంటే “మొన్నే చదివాను కదమ్మా!” అనేవాడు.

నాన్నకి చదవటం వచ్చు కాబట్టి కదా చక చకా చదివేసాడు. మొదటి సారి ఇష్టంగా చదివేసేవాడు. మళ్ళీ చదవమంటే కుదరదనే వాడు.

’అదే నాకూ చదవటం వస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు, ఎంచక్కా చదివేసుకోవచ్చు’ – అన్న భావన, అక్షర క్రమం తెలియకుండానే మనసుకి అందింది. చదవటం రాక చందమామ బొమ్మలు పదేపదే చూసుకునే కొద్దీ పసి మనస్సు లోతుల్లో అక్షరాలు నేర్చుకోవాలనే తపన పెరిగింది.

వీధిబడిలో చేర్చగానే, ఇష్టంగా మారాం చేయకుండా అక్షరాలు నేర్చేసాను. పెద్ద బాలశిక్ష చాలా కొద్దీ రోజుల్లో పూర్తి చేసాను. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేటప్పటికే నాకు కథలు చదవటం వచ్చేసింది.

ఆ విధంగా చందమామ నాకు చదవటం నేర్పింది. చదువు కోవాల్సిన అవసరం నేర్పింది. చదువు నేర్పిన గురువుని గౌరవించటమూ నేర్పింది.

చందమామ బొమ్మలు చూసి ఏకలవ్వుడులా రంగుల్లో బొమ్మలు వేయటం నేర్చాను. నా అనుభవాలన్నీ మా వారితో పంచుకోబోతే తానూ మరికొన్ని అనుభవాలు చెప్పాడు. మా పాపని చూస్తే నా బాల్యం మరో సారి కళ్ళముందు కదలాడింది. (రంగుల్లో బొమ్మలతో సహా)

ఓ సారి చదివేసిన చందమామని, మళ్ళీ మా చేత చదివించుకునేందుకు, మా టక్కరి పాప చందమామ పట్టుకుని పక్కనే పడుకుని ఒక్కో పుట తిప్పుతూ తనకి అర్ధమైన కథని తప్పుల తడకగా చెప్పేది. “అలా కాదు నాన్నా! ఆ కథలో ఇలా ఉంది” అని పొరబాటున అన్నామో! అంతే…. “మళ్ళీ చదవవూ” అంటూ బతిమాలేది.

ఒకట్రెండుసార్లు చదివి ఇక కుదరదంటే “నేను పెద్దయ్యాక నా పాపకి నీలా చదవను ఫో అనను. ఎన్ని సార్లయినా చదువుతాను తెలుసా?” అంటూ బుంగమూతి పెట్టేది. “అయితే ముందు నువ్వే చదవటం నేర్చుకో!” అని అనటంతో అక్షరాలు అలవోకగా నేర్చింది.

అదీ చందమామ! అందాల చందమామ! అరచేతిలో చందమామ! కథలతో జీవితాన్ని అనుసంధానించి, భారతానికి రామాయణానికి భగవంతుడికీ దగ్గర చేసింది చందమామ. గురువుకి చెప్పినంత కృతజ్ఞత చందమామకీ చెప్పాలి!

మా విద్యార్ధుల్లో ఒకరి ఇంట్లో చందమామలు బైండింగ్ చేయించి మరీ గృహ గ్రంధాలయంలో దాచి ఉంచుకుంటే చూచి “అబ్బా! వీళ్ళెంత సంపన్నులో కదా!” అన్పించింది.

(నాన్న ద్వారా పరిచయం అయిన చందమామను కన్నకూతురికి కూడా పరిచయం చేయడమే కాదు… స్కూలు పిల్లలకు కూడా కథామృతాన్ని పంచిపెడుతూ, రేపటి తెలుగు తరాన్ని తయారుచేస్తున్న ఆదిలక్ష్మిగారికి… చందమామతో తమ జ్ఞాపకాలను పంచుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. సం.)

ఇది 2010 ఏప్రిల్ 9న చందమామ వెబ్‌సైట్‌లో, బ్లాగులో ప్రచురించబడిన కథనం.

తెలిసి తాను జీవితంలో ఎవరికీ అన్యాయం చేయలేదని,  కానీ 18 ఏళ్లుగా కష్టాలమీద కష్టాలను ఎదుర్కొంటున్నానని ఆదిలక్ష్మిగారు మాటలో సందర్బంలో చెప్పేవారు.  ఎన్ని దెబ్బలు తగిలినా కోలుకున్నానంటే, నిబ్బరంగా సహిస్తున్నానంటే తాను నమ్మిన భగవద్గీతే కారణమని, అంతులేని కష్టాల్లో కూడా అనంత శక్తిని ఇస్తూ బతికిస్తూ వచ్చింది ఆ గీతాసారమే అని ఆమె పదే పదే అనేవారు.

ఎంత మంచి మనిషికి, ఎంత మంచి కుటుంబానికి ఇంత కష్టం తగిలింది?

RTS Perm Link

లెనిన్ లేరు… ఆదిలక్ష్మి ఉండలేరు…

September 17th, 2011

సుజాతగారు, వలబోజు జ్యోతి గారు చెప్పిన ఒక విషాదవార్తను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గీతాప్రియదర్శిని కన్నతల్లిదండ్రులు, అమ్మఒడి తదితర తెలుగు ఇంగ్లీషు బ్లాగుల నిర్వాహకులు ఆదిలక్ష్మి, లెనిన్‌బాబు గార్లు.. జీవితం నుంచి సెలవు తీసుకునే ప్రయత్నం చేశారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల వేళ కూడా నాతో మాట్లాడిన లెనిన్ బాబు గారు ఇక లేరు. నిద్రమాత్రలు మింగిన ఆదిలక్ష్మిగారు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితినుంచి కోలుకుంటున్నారని వార్త. (స్వచ్చందంగానే వారిద్దరూ లోకంనుంచి తప్పుకోవడానికి సిద్ధపడే ఇలా చేశారని సుజాత గారి తాజా వార్త -బజ్ ద్వారా- ద్వారా తెలుస్తోంది. )

జూలై 15న గీతాప్రియదర్శిని విద్యాశిక్షణా పరమైన ఒత్తిళ్లకు లోనై జీవితం ముగించుకున్నప్పటినుంచి ఈ కన్న తల్లిదండ్రులకు తమ జీవితమే ఓ ప్రశ్నార్థకమైపోయింది. ‘అమ్మఒడిని లేకుండా చేశారు, అమ్మఒడిని చంపేశారు’ అంటూ ఆరోజు ఆదిలక్ష్మిగారు ఫోన్‌లో చేసిన ఆక్రందన ఇంకా వెంటాడుతూనే ఉంది.

-20 ఏళ్లక్రితం ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా పారిశ్రామికురాలిగా జీవితం మొదలెట్టిన ఈమె జీవితంలో అనూహ్యమైన ఎత్తుపల్లాలను చవిచూసి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జాతీయంగా అంతర్జాతీయంగా పాలకవ్యవస్థలు సాగిస్తూ వస్తున్న రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలపై కణిక వ్యవస్థ పేరుతో వందలాది కథనాలు అమ్మఒడి తదితర బ్లాగుల్లో రాశారు.-

నిన్న సాయంత్రం -శుక్రవారం- కూడా లెనిన్ బాబుగారితో చందమామ ఆఫీసునుంచి ఫోన్ చేసి మాట్లాడాను. ఆదిలక్ష్మిగారు గతంలో పంపిన కథ “తీపికి చేదు చెల్లుకు చెల్లు”ను ఈ సెప్టెంబర్‌ నెలలోనే చందమామ ప్రచురించిందని, మీ కొత్త చిరునామా పంపితే చందమామ కాపీ, రెమ్యునరేషన్ పంపుతామని, ఆయనతో మాట్లాడితే శనివారం తప్పుకుండా చిరునామా పంపుతానని చెప్పారు. తీరా శనివారమే ఘోరం జరిగిపోయింది. లెనిన్‌గారు ఉన్నారు కాబట్టే ఆమె గత నెలన్నర రోజులగా బతికి ఉన్నారు.

వ్యవస్థపై తమదైన పోరాటంలో వాళ్లిద్దరూ తన చిట్టితల్లి గీతాప్రియదర్శినిని తమ జీవిత సర్వస్వంగా ప్రేమించారు. పదిహేనేళ్లకు పైగా వారు పడుతూ వస్తున్న తీవ్ర ఆర్థిక, మానసిక బాధలకు కన్నకూతురిపై ప్రేమ రూపంలో వారికి స్వాంతన దొరికిందనుకుంటాను. భారతీయ సాంప్రదాయిక విశ్వాసాలపై ఎనలేని ప్రేమ గల ఆమెకు తన కన్న కూతురు చితాభస్మాన్ని గంగానదికి తీసుకెళ్లి కలపాలని ఉండేది.

స్థలం మారితే అన్నా కాస్త తెప్పరిల్లుతుందేమో అనిపించి, ఈ విషయం లెనిన్ బాబుగారు వారం రోజుల క్రితం చెబితే తప్పకుండా తీసుకెళ్లమని చెప్పాను. చివరకు ఆ కోరికకూడా తీరనట్లుంది. ఎన్నడూ లేనిది శుక్రవారం మాట్లాడినప్పుడు ఆయన గొంతు చాలా డల్‌గా వినిపించింది. మీరెలా ఉన్నారు. ఆమె కోలుకున్నారా అని అడిగితే బతకాలి కాబట్టి బతుకుతున్నాం అన్నారు. ఇప్పుడనిపిస్తోంది. ఆయన అప్పుటికే ఇక జీవితం వద్దు అని నిర్ణయానికి వచ్చారేమో.

వారు కన్నకూతురు తమనుంచి దూరమయినందుకు కూడా పెద్దగా బాధపడలేదనుకుంటాను. కాని నరకబాధలు పెట్టిన ఆ కోచింగ్ సెంటర్‌ నిర్వాహకుడిని చివరిసారిగా కలిసి ఒకే  కోరిక కోరారట. ఏమంటే ఆ సెంటర్లో పాపను ఒక పనామె చాలా బాగా చూసుకుందట. రోజూ ప్రియదర్సిని ఆ పనామె ఆదరణ గురించి ఇంట్లో చెప్పేదట. బతికి ఉండగా తమ పాపను స్కూల్లో అందబాగా చూసుకున్న ఆ పనావిడకు కృతజ్ఞతలు చెబుతామనే ఉద్దేశంతో ఆమెను చూపించమని నిర్వాహకుడిని అడిగితే ఆమె క్లాసుల వద్దకు పనిమీద వెళ్లిందని, కలపడం కుదరదని చెప్పాడట ఆ రాక్షసుడు.

తమ పాప మరణానికి కారణమంటూ కోచింగ్ సెంటర్ మీద కేసు పెట్టాలని ఎంతో మంది సలహా ఇచ్చినా మనిషే పోయాక ఇక కేసు ఎందుకు అనే నిర్వేదంలో ఆ పనికి పూనుకోలేదు వీళ్లు. అలాంటిది ఆ నిర్వాహక రాక్షసులు ఆ పనామెను చివరిసారిగా కలుసుకునేందుకు కూడా తమకు అవకాశం ఇవ్వకపోవడం చూసిన క్షణంలోనే వారి గుండె బద్దలయిపోయింది. లోకం ఎందుకింత అన్యాయంగా మారిపోయిందనే వేదన… కూతురు ప్రాణాలు పోవడానికి కారకులైనవారిని కూడా క్షమించిన తమ పట్ల ఇంత నిర్దయగా వారు ఎలా వ్యవహరించారన్న ఆక్రోశం.. వారి బాధను మరింత రెట్టింపు చేసి ఉన్నట్లుంది.

జూలై 15న చందమామలు బ్లాగులో ప్రియదర్శిని ఆత్మహత్య గురించి ప్రచురించిన కథనాన్ని వాళ్లు చాలా లేటుగా చూశారట. నా అభ్యర్థనను మన్నించి కొంతమంది అజ్ఞాతంగా పంపిన సహాయానికి లెనిన్ బాబు గారు కృతజ్ఞతలు చెప్పారు. సానుభూతి కంటే, తమను మరింతగా పట్టించుకుని ఉంటే, ఇంటివద్దకు ఎవరైనా వచ్చి కలిసి ఉంటే, ఆమెకు స్వాంతన చెప్పి ఉంటే చాలా బావుండేదని ఆయన బాధ వ్యక్తం చేశారు.

ఒక మాటమాత్రం నిజం. వాళ్లు మహానగరంలో ఉండి కూడా భయంకరమైన ఒంటరితనం బారిన పడే ఈ ఘోరానికి పాల్పడ్డారనిపిస్తోంది. పిల్లలకోసం పెట్టిన స్కూలు కూడా నిలిపేశారు. బంధువుల ఒత్తిడి మేరకు వారికి దగ్గరగా ఉన్న అద్దె ఇంటికి మారారు. రెండు నెలలపాటు ఏ పనీ లేకుండా, పైగా అపరిమిత బాధలో ఉన్న ఈ తల్లిదండ్రులు ఇరవై ఏళ్లుగా తాము చేస్తున్న జీవన పోరాటం ఇక చాలని అలసి పోయారనుకుంటాను.

గత పద్దెనిమిదేళ్లుగా బంధువులకు పూర్తిగా దూరమైపోయిన వీళ్లు ఈ మధ్యనే ఓ ఫంక్షన్‌ కోసం హైదరాబాదుకు వెళ్లి బంధువులను అందరినీ కలిసి వచ్చారు. నంద్యాలలో ఎందుకు దూరంగా ఉండటం మహానగరానికి వస్తే మా పిల్లలే చాలామంది ఉన్నారు. స్కూలు పెడితే బాగా జరుగుతుంది అని భరోసా ఇస్తే నంద్యాల నుంచి హైదరాబాద్ వెళ్లారు. బతుకు జరగడం మాటేమిటో కానీ మహానగరం నిలువునా ఒక కుటుంబాన్ని కాల్చేసింది.

పాప  చనిపోవడానికి నెలరోజుల క్రితం  కూడా, ‘ఒక్కసారి చెన్నయ్ రండి, మీ కుటుంబం ఫోటోలు పంపండి’ అని శోభ కోరితే ‘నేరుగా వచ్చి కనబడితే సర్‌ప్రయిజ్‌గా ఉంటుంది కదా. వీలైనంత త్వరలో వస్తాము’ అని చెప్పింది. వృత్తిపర సంబంధంలోకి వచ్చిన నాకంటే శోభతో ఆమె చాలా విషయాలు పంచుకుందట. “లక్ష్మిగారు ఎంత ధైర్యంగా ఉండేవాళ్లు ఇలా ఎలా చేయగలిగారు” అని శోభ ఇప్పుడు షాక్ తింటూ వలవలా ఏడ్చేసింది. ఆమె ఫోన్‌లో నవ్వితే కూడా అంత స్వచ్ఛంగా, ఆనందంగా వినిపించేదని, అన్ని బాధలు, బరువులు, ఒత్తిళ్లు సంవత్సరాలుగా మోస్తూ కూడా ఎలా భరించి ఆమె అంత సహజాతిసహజంగా నవ్వగలిగేదని శోభకు ఆశ్చర్యం. -కారుణ్య.బ్లాగ్‌స్పాట్.కామ్-

నంద్యాలలో ఉన్నప్పుడు ఆమె అద్దె తక్కువగా ఉంటుందని టౌన్‌కు ఆనుకుని ఉన్న పల్లెలో ఇల్లు తీసుకున్నారు. ప్రకృతంటే ప్రాణం, పక్షులంటే ప్రాణం, రోడ్డుమీద తిరుగాడే పశువులంటే ప్రాణం, సాయంత్రం వేళల్లో ఇల్లు వదిలి వాళ్లిద్దరూ, అప్పుడప్పుడూ పాప కూడా పల్లె బాటలో పొలాల గుండా నడుస్తున్నప్పుడు మంద్రమంద్రంగా వీచే ఆ చల్లటి గాలి గురించి, పల్లె అందాల గురించి ఎన్నిసార్లు ఆమె మాట్లాడారో.. హైదరాబాద్‌లో కొత్తగా స్కూలు తెరిచి పిల్లలకు పాఠాలు చెబుతుండగా వారికి మంచినీళ్ల క్యాన్‌లను కూడా అందనీయకుండా చేసిన, తమను చిరకాలంగా వెంటాడుతూ వస్తున్న ఆ అదృశ్య శక్తుల గురించి నవ్వుతూనే ఎంత ధర్మాగ్రహం ప్రకటించారో.

రంగనాయకమ్మగారు ‘జానకి విముక్తి’  నవలలో సత్యం పాత్ర ద్వారా పలికిస్తారు. కష్టాల పట్ల సానుభూతి ప్రకటించగల హృదయం ఉండీ కూడా లోకంలో చాలామంది సహాయం చేయలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారనే అర్థంలో సత్యం, విశాలాక్షికి ఉత్తరం రాస్తాడు. పాతికేళ్ల క్రితమూ ఇంతే. ఇప్పుడూ ఇంతే.

చెన్నయ్ నుంచి 400 కిలోమీటర్లు దూరంలో ఉన్న హైదరాబాదుకి వెళ్లి వారిని పలకరించలేకపోయాను. ఆమె కోలుకోవడం కష్టమనిపిస్తున్నప్పటికీ కొన్నాళ్లు ఆమెకు తోడు నీడగా ఉండి కాపాడుకోమని లెనిన్ బాబు గారికి  చెప్పానే గాని, భరించలేమనుకున్నప్పుడు కొన్నాళ్లు అన్నీ వదిలి చెన్నయ్‌కి వచ్చి మావద్ద ఉండమని చెప్పలేకపోయాను.

కొన్నాళ్లు వాళ్లిద్దరినీ అలా వదిలేస్తేనే బాగుంటుందని పూర్తిగా కోలుకుంటే తప్పక కలుసుకోవచ్చనుకున్నామే కాని ఒకటన్నర నెల కాకముందే ఇంత ఘోరానికి ఒడిగడతారని అస్సలు ఊహించలేదు. పాప, ఇప్పుడు ఆమె జీవన సహచరుడు కూడా లేకుండా మిగిలిన ఆమె విషం మింగి కూడా బయటపడిందని తెలుస్తోంది. బతికి బయటపడినా ఆమె జీవచ్చవమే. ఆమె జీవిస్తుందనే భరోసా ఈ క్షణంలో నాకయితే కలగడం లేదు. అమ్మ ఒడి నిజంగా ఇప్పుడే ఇవ్వాళే ఖాళీ అయిపోయింది.

తిరుపతిలో ఎలక్ట్రానిక్ షాపులో పనిచేస్తూ చేస్తూ ఉన్నట్లుండి ఇంటికి రాకుండా మాచెల్లెలు కొడుకు మాయమైపోతే గత ఆరునెలలుగా వాడి అనుపానులు కూడా తెలియని స్థితిలో ఉన్నాం మేం. మావాడు కనిపించలేదని పోలీసు స్టేషన్‌లో కంప్లయింట్ చే్స్తే దానికి అతీ గతీలేదు. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మేనకోడలు మహానగరం నడిబొడ్డున స్వంత ఇంట్లో చంపబడితే కూడా దిక్కులేదు ఈ దేశంలో… మాలాంటి, మనలాంటి సామాన్యుల సమస్యలకు ఎక్కడ పరిష్కారం దొరుకుతుందో అర్థం కాని పరిస్థితి.

చదువుల కోసం, మంచి బతుకుకోసం రాష్ట్రం నుంచి వేలాది కిలోమీటర్ల దూరానికి మనుషులు వెళ్లిపోతున్నారు. దగ్గరే ఉండి కూడా ఇబ్బందుల్లో ఉన్నవారిని, పిడుగుపాటుకు గురయినవారిని కలవలేకుండా ఉన్నాము. రాతలకు చేతలకు మధ్య సంబంధం ఎక్కడో పెటిల్లున తెగిపోయినట్లుంది.

ఆదిలక్ష్మిగారిని తెలిసిన వాళ్లం సకాలంలో స్పందించి ఉంటే, పాప దుర్మరణం తర్వాత మరో ఘోరం ఇలా జరిగి ఉండేది కాదు. ఆమె  కుప్పగూలిపోయినా ధైర్యంగా కనిపించిన, ఆత్మస్థైర్యంతో మాట్లాడిన సహచరుడు లెనిన్ గారి అండ ఉందని, కొన్నాళ్ల తర్వాతయినా ఆమె కోలుకుంటుందని నిజంగానే నమ్మాను నేను.

“వస్తామని కలుస్తామని మాటిచ్చిన లెనిన్ గారు తిరిగిరాని తీరాలకు తరలి వెల్లటం. ఆయనను అనుసరించాలని పోరాడుతున్న ఆదిలక్ష్మీ గారిద్దరూ మాటతప్పారు. మరో పాపానికి ఒడిగట్టారు. ఇంతకంటే ఆత్మీయుల్ని తిట్టలేను. దుఃఖం గుండెను పిండేస్తుంది. లెనిన్, ఆదిలక్ష్మిగార్లు మాట తప్పారు” అంటూ దుర్గేశ్వర గారు తమ హరిసేవలో రాసిన మాట అక్షరసత్యం.

పిల్లలను ప్రేమించడమే, సర్వస్వంగా ప్రేమించడమే తప్పయిపోయే కాలం ముంచుకొస్తోందా? పిల్లలు లేని మాకు ఈ అనుభూతి  గాఢత గురించి ఎన్నటికీ తెలీకపోవచ్చు.

కన్నవారిని కొడుకులు తన్ని తరిమేస్తుంటే కూతుర్లు కాస్త అన్నం పెడుతున్న కాలం వచ్చేసింది. ఆ నమ్మకాన్నే నీ చుట్టూ అమ్మా, నాన్నా అల్లుకున్నారేమో..!

గీతా ప్రియదర్శినీ, అనంత దరిద్రాన్ని ప్రేమించిన కన్నవారు నువ్వు లేని లోకాన్ని ఇలా శపిస్తున్నారు.. ఎందుకిలా చేశావు తల్లీ?

ఆదిలక్ష్మిగారూ, క్షమించండి.. ఘోరమైన తప్పిదం చేశాను. ఇలా చేస్తారని, ఇలా జరుగుతుందని ఊహించలేదు. మీ గురించి సమాచారం తెలుసుకునే చివరి వనరును కూడా పొగొట్టుకున్నాను. ఎప్పుడు కాల్ చేసినా లెనిన్ గారు అందుకునే మీ ఫోన్ ఈ సాయంత్రం నుంచి స్విచ్ఛాఫ్ అయిపోయింది. కష్టాల్లో ఉన్నవారిని కాపాడుకోవడం తెలీని, చేతకాని జీ్వచ్ఛవాలం. మా పాపాలను మన్నించండి..

చందమామ కుటుంబాలకు విషాదవార్త
http://blaagu.com/chandamamalu/2011/07/15/%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE-%E0%B0%95%E0%B1%81%E0%B0%9F%E0%B1%81%E0%B0%82%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B5/

లోకంలోని పిల్లలందరూ ఇక మీ పిల్లలే…
http://blaagu.com/chandamamalu/2011/07/17/%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B1%82-%E0%B0%87%E0%B0%95-%E0%B0%AE/

 

విషాదవార్త

http://kaburlu.wordpress.com/2011/09/17/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A6-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4/#comment-388

ఆదిలక్ష్మిగారు ఎందుకిలా చేసారు??

http://jyothivalaboju.blogspot.com/2011/09/blog-post_17.html

 

లెనిన్ ,ఆదిలక్ష్మిగార్లు మాటతప్పారు

http://durgeswara.blogspot.com/2011/09/blog-post_17.html

 

ఈ బ్లాగులు ఇక ఎన్నటికీ అప్‌డేట్ కాకపోవచ్చు.

అమ్మఒడి
http://ammaodi.blogspot.com/

ఆహా! ఓహో!
http://paalameegada.blogspot.com/

కింది తాజా సమాచారం చూడగలరు.

కార్పోరేట్ విష సంస్కృతి..

http://vasantalakshmi.blogspot.com/2011/09/blog-post_18.html

 

2004 డిసెంబర్ 26న విరుచుకుపడిన సునామీ సమాచారంతో ఉన్న కింది లింకును చూసిన ఆదిలక్ష్మిగారు కింది బ్లాగర్‌కు జీమెయిల్‌లో పంపిన కామెంట్ కింది లింకులో చూడగలరు.

జ్ఞాపకాల అలజడిలో…!

http://kaarunya.blogspot.com/search/label/%E0%B0%B8%E0%B1%81%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AE%E0%B1%80%20%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%AA%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81

 

తాజా ఆత్మీయ సమాచారం కోసం కింది లింక్ చూడండి

అమ్మఒడి ఆదిలక్ష్మిగారు

http://teluguyogi.blogspot.com/2011/09/blog-post_19.html

 

RTS Perm Link