చందమామ బ్లాగ్ కనుమరుగవుతున్న వేళ….

March 7th, 2015

చందమామ చరిత్ర (blaagu.com/Chandamamalu) బ్లాగ్ పాఠకులకు చివరి పరామర్శ

ఈ బ్లాగులో ఇది నా చివరి టపా. ఎందుకంటే ఈ బ్లాగ్ ఇక నుంచి ఏ క్షణంలో అయినా ఇంటర్నెట్‌లో కనిపించకుండా పోవచ్చు. blaagu.com నిర్వాహకులు (jalleda.com జాలయ్యగారు) ఈ బ్లాగ్‌ను ఇక నిర్వహించలేమని, త్వరలో దీన్ని మూసివేయడం తప్ప మరో మార్గం లేదని ఇటీవలే తెలిపారు. వీలైనంత త్వరలో నా ఈ బ్లాగ్ కంటెంటును బ్యాకప్ తీసుకోవాలని సూచించారు. ముందస్తు సమాచారంతో ఇవాళ్టికి ఆరేళ్లపాటు కొనసాగిన నా బ్లాగ్ టపాలను పూర్తిగా కాపీ చేసుకున్నాను.

భారతీయుల సాంస్కృతిక రాయబారిగా పేరొందిన చందమామ పత్రిక చరిత్రకు సంబంధించి ఇంతవరకు బయటి ప్రపంచానికి తెలియని అరుదైన సమాచారాన్ని 2009 నుంచి 2012 వరకు ఈ బ్లాగులో పొందుపరుస్తూ వచ్చాను. చందమామ చరిత్రకు రంగులద్దిన ఉజ్వల సంపాదకులు, యజమానులు, అద్భుత చిత్రకారులు, రచయితలు, చందమామ పనిని ఇంటిపనిలా, తమ సొంత పనిలా స్వీకరించి అత్యున్నత ప్రమాణాలతో దాన్ని ఆరు దశాబ్దాలపైగా నెలనెలా క్రమం తప్పకుండా పాఠకులకు అందిస్తూ వచ్చిన వివిధ విభాగాల సిబ్బంది, 66 సంవత్సరాల పాటు చందమామ పత్రికను శిరసున పెట్టుకుని దాని ప్రతి మలుపులోనూ దాని దశా దిశలను నిర్దేశించిన లక్షలాది అపురూప పాఠకులు, అభిమానుల సమాహారంతో సాగిన ఒక అద్భుత ఉద్వేగ చరిత్రను ఈ బ్లాగ్ ద్వారా ఆన్‌లైన్ పాఠకులకు, చందమామ అభిమానులకు తెలుపడానికి నాలుగేళ్లపాటు శక్తిమేరకు ప్రయత్నించాను.

40 సంవత్సరాల క్రితం మా పల్లెటూరి బాల్యాన్ని కమ్మటి కథలతో, చక్కటి చిత్రాలతో చల్లగా పండించిన చందమామలో నేనూ ఒక చివరి ఉద్యోగిగా పనిచేస్తానని నా కల్లోకూడా ఊహించలేదు. అలాంటిది జీవితం చెన్నయ్‌లో స్థిరపడుతున్న క్రమంలో నాటి చందమామ నిర్వాహకులు పిలిచి మరీ ఉద్యోగ ప్రతిపాదన చేయడంతో ఎగిరి గంతేసి ఒప్పుకున్నాను. చందమామ ఆన్‌లైన్ ఎడిషన్ అసోసియేట్ ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొద్దికాలానికే కొన్ని అనివార్య పరిణామాల కారణంగా చందమామ పత్రిక బాధ్యతలు కూడా స్వీకరించాను. ఒకరకంగా ప్రింట్ చందమామ, ఆన్‌లైన్ చందమామ చివరి సహ సంపాదకుడిని నేనే కావడంలో ఏ విశేషమూ లేదు కానీ చందమామ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంలో మూడున్నర సంవత్సరాలపాటు నా పాత్ర కూడా కొంచెం ఉండటం అన్నది ఒకవైపు సంతోషాన్ని, మరోవైపు విషాదాన్ని కూడా కలిగించింది.

ఈ బ్లాగ్ ఆరంభించింది మొదలుకుని చందమామ పట్ల చెదరని అభిమానం చూపుతున్న ప్రింట్, ఆన్‌లైన్ పాఠకులకు వారధిగా పనిచేసింది. దేశవిదేశాల్లోని ఎంతో మంది చందమామ అభిమానులను, చంపి (చందమామ పిచ్చోళ్లు) లను, చందమామ ప్రియులను, పిల్లలను, పండు ముదుసళ్లను కూడా ఈ బ్లాగ్ ఒకటి చేసింది. చందమామపై ఆసక్తి, అభిరుచిని చివరివరకూ కోల్పోని అద్భుత బ్లాగర్లతో చందమామ జ్ఞాపకాలను పంచుకుంది. రచన పత్రిక సంపాదకులు శాయి గారు చందమామ చరిత్రపై చెరగని సంతకంలా 2010 మే నెలలో తీసుకువచ్చిన దాసరి సుబ్రహ్మణ్యం గారిపై (చందమామ సీరియల్స్ రచయితగా జగత్ర్పసిద్ధి పొందినవారు) ప్రత్యేక సంచికకు సహకరించిన బ్లాగుల్లో ఇదీ ఒకటయింది. పాత్రికేయ వృత్తిలోనూ పెద్దగా పరిచయాలు లేని నాకు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మంచిమిత్రులను తెచ్చిపెట్టింది.

blaagu.com లో తెలుగు బ్లాగులు రూపొందించిన వారు ఎవరూ లేకపోవడం చిరకాలంగా నా బ్లాగు ఒక్కటి మాత్రమే యాక్టివ్‌గా ఉండటం (ఈ బ్లాగు కూడా ఇటీవలికాలంలో తరచుగా అప్‌డేట్ కావటం లేదు), నిర్వహణ పరంగా సమస్యలు తలెత్తుతుండటంతో దీని మూసివేత తప్పదనిపిస్తోంది. ఇతర బ్లాగులు నిర్వహిస్తున్నా, ఈ బ్లాగ్ నాకెంతో సౌకర్యాన్ని కలిగించింది. అద్బుతమైన థీమ్ టెంప్లెట్‌తో చందమామ పాఠకులతో, అభిమాన బ్లాగర్లతో నిత్య సంబంధాలు కొనసాగించడంలో ఇది అందించిన సహకారం వర్ణించలేనిది. అందుకే అనివార్యంగా ఇది ఇప్పుడు దూరమవుతున్నప్పటికీ ఇన్నాళ్లుగా blaagu.com/chandamamalu తో నేను పొందిన సేవలను కానీ, అమూల్యమైన అనుభూతులను కాని ఎన్నటికీ మర్చిపోలేను.

ఈ బ్లాగు నిర్వాహకులు జల్లెడ.కామ్ జాలయ్యగారికి ఇన్నాళ్లుగా అందించిన ఎనలేని సహకారానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.

ఈ బ్లాగులోని టపాలను అన్నింటినీ భద్రపర్చుకున్నాను కాబట్టి సమయం దొరికినప్పుడు వాటిలోని ప్రధాన టపాలను మరొక కొత్త బ్లాగులో పోస్ట్ చేయడానికి ప్రయత్నించగలను. అంతవరకు నా నెలవంక బ్లాగ్ (http://kanthisena.blogspot.in) మాత్రమే నా ప్రధాన బ్లాగ్‌లా ఉంటుంది.

జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ఇది సమాజానికీ, వ్యక్తులకూ కూడా నిరూపిత సత్యమే కాబట్టి ఒక మంచి బ్లాగ్‌ను కోల్పోతున్నాను, దూరమవుతున్నాననే బాధను పక్కనపెట్టాల్సిందే. మిత్రులారా మనం మరోచోట కలుసుకుంటూనే ఉందాము.

ఇక్కడ మాత్రం…..
అందరికీ వీడ్కోలు…..
కె.రాజశేఖరరాజు
8341571371
krajasekhara@gmail.com
http://kanthisena.blogspot.in

RTS Perm Link