కేవలం గాయకుడే కాదు…..

February 19th, 2014

ఘంటసాల కన్ను మూసిన సందర్భంగా ఆయన మృతికి అందరూ నివాళి అర్పిస్తున్నారు. ఆయన మధుర స్వరాన్ని కొనియాడుతున్నారు. అయితే ఘంటసాల గురించి నిజాన్ని గ్రహించడంలో ఈ ప్రశంసలు విఫలమౌతు న్నాయి. ఎందుకంటే ఆయన గాయకుడు మాత్రమే కాదు. నిజమైన కవి. ప్రేమ, విచారం, సంతోషం, భాధ, దయ, ఆనందం, విషాదాలకు సంబంధించిన ప్రగాఢమైన అనుభూతులను మరెవరికీ సాధ్యం కానంత గొప్పగా ఆయన వ్యక్తీకరించాడు. మానవులకు సంబంధించిన ఈ ప్రాధమిక ఉద్వేగాలను ఆయన స్వయంగా అనుభూతి చెంది ఉండకపోతే, ఆ జీవిత నేపథ్యంలో ఆయన నివసించి ఉండకపోతే వాటిని అంత వాస్తవికంగా, అంత సుసంపన్నంగా, అంత ఇష్టంగా ఆ మానవానుభూతులను ఘంటసాల తన స్వరంలో పలికించి ఉండేవారు కాదు.

మానవ ఉద్వేగాలను ఇంత మహనీయ మహత్వంతో పలికించిన మహాకవులెవరూ చరిత్రలో ఇంతవరకు లేరు. సహజంగానే ఇది ఆయన హృదయ స్వచ్ఛతను, మానసిక నిర్మలత్వాన్నే సూచిస్తుంది. ఆయన పాటలను వింటూ పరవశించే శ్రోతలు ఆయన అందించిన పరిపూర్ణమైన, మహోన్నతమైన జీవన తాత్వికతను అనుభూతి చెందకుండా తమ మనోభావాలను అణుచుకోలేరు. మానవ జీవితానికి సంబంధించిన తాత్వికతను ఆయన తన పాటల్లో అత్యంత స్పష్టంగా ప్రతిబింబించారు.

ఇంతవరకు చరిత్రలో పదాలు, పదబంధాలు ఎన్నడూ వ్యక్తీకరించలేనంత గాఢంగా, జీవితాన్ని వ్యక్తపరిచేందుకు ఆయన తన పాటల ద్వారా ప్రయత్నించారు. సినిమా కథలో భాగంగానే ఆయన చాలా పాటలు పాడి ఉండొచ్చు. కాని ఒక క్రమంలో అవి స్వతంత్ర స్థాయిని పొంది, తమ స్వంత అర్థం సంతరించుకుని, సినిమా కథ సందర్భం నుంచి తమను తాము విముక్తి చేసుకునేవి. ఈ వాస్తవాన్ని ప్రజలు గ్రహించారు కాబట్టే థియేటర్లలో చూడటం కంటే థియేటర్ల బయట ఆ పాటలను వినడానికే పదే పదే ప్రయత్నించేవారు.

చదువుకున్న, చదువుకోని తెలుగు ప్రజలపై ఆయన పాటల ప్రభావం ఎంతగా ఉండేదంటే తెలుగు ప్రజల రోజువారీ ఆంతరంగిక జీవితాలను అవి గుణాత్మకంగా మార్చాయి. ఇవ్వాళనుంచి (1974) ఆంధ్రప్రదేశ్‌లో జనజీవితం ఉద్వేగరహితంగా, బోసిపోతుందని మనం వెరపు లేకుండా చెప్పవచ్చు. నిస్సందేహంగా, ఘంటసాల రాక తోటే తెలుగు ప్రజల భావోద్వేగాల చరిత్రలో ఓ కొత్త శకం మొదలైంది. ప్రజల హృదయాలలో నిక్షిప్తమై ఉన్న రహస్య నిధులను ఆయన వెలికి తీశారు. ఆయనే లేకుంటే అవి నేటికీ నిద్రాణ స్థితిలోనే పడి ఉండేవి. అంతవరకు హిందీ సినిమా సంగీతం కోసం ఎదురు చూసే తెలుగు ప్రజలకు ఒక వినూత్నమైన ఊహాత్మక అనుభవం అందుబాటు లోకి వచ్చేసింది. ఆ విశిష్ట అనుభవమే ఘంటసాల పాట.

ఆశ్చర్యం ఏమిటంటే, ఆయన తనలోని కళను విస్తృతంగా వాణిజ్య ప్రయోజనం కోసమే ఉపయోగించినప్పటికీ నాణ్యత విషయంలో కాని, నిజమైన ప్రేరణను కలిగించడంలో కాని ఆ కళ తన నాణ్యతను ఎన్నడూ కోల్పోలేదు. అనేకానేక చెడు ప్రభావాలకు గురికాకుండా ఆయన చిత్రపరిశ్రమలో వెలుగొందుతూ వచ్చారు. అసంఖ్యాకంగా ఆయన పాటలు పాడినప్పటికీ జీవితం చివరివరకు ఆయన అలిసిపోలేదు, పాటపై అనురక్తి తగ్గిపోయిన దాఖలాను ప్రదర్శించలేదు.

తన మరణంతో మనం మరో నేపధ్య గాయకుడిని మాత్రమే కోల్పోలేదు. ఒక కవీశ్వరుడిని కోల్పోయాం. ఒక జాతి ప్రజల భావోద్వేగాలను మేల్కొలిపి తారాస్థాయికి తీసుకెళ్లిన కవీంద్రుడిని కోల్పోయాం. వాస్తవంగానే, ఘంటసాల పాట లేని తెలుగు ప్రజలను ఊహించడం అసాధ్యం. ఆయన వదిలివెళ్లిన ఖాళీని పూరించగల గాయకుడు లేడు. సాధారణ లలిత సంగీతకారుడి లేదా సాంప్రదాయేతర సంగీతకారుడి స్థాయిని ఘంటసాల నిస్సందేహంగానే శిఖరస్థాయిలో నిలబెట్టారు.

సత్యం పట్ల, సౌందర్యం పట్ల తృష్ణతోపాటు, తన ప్రభావ ప్రపంచంలోకి ఇతరులను కూడా తీసికొచ్చి ప్రాథమికమైన స్వీయ ఎరుకను తీసుకొచ్చిన ఘనుడు ఘంటసాల. ఆయన దుర్బల దేహాన్ని గమనించిన ఎవరయినా, ఆయనలో సంగీత స్ఫూర్తి ఇంత స్థాయిలో ఉందని ఊహించలేరు. కాని తన జీవిత క్రమం సంగీతాన్ని ఆయనకు పేటెంట్‌గా మార్చేసింది. దాన్నే ఇవ్వాళ అందరూ చూస్తున్నారు.. వింటున్నారు..

ఆయన మరణం తర్వాత ఆయన సంగీతం అన్ని కాలాల్లోనూ నిలిచి ఉంటుందని, ఉనికిలో ఉంటుందని పలువురు భావిస్తుండవచ్చు. ఈ మృత కవీంద్రుడి సజీవ స్వరం మనల్ని సమ్మోహన పర్చడానికి, దాసానుదాసులుగా మార్చుకోవడానికి అలా అలా కొనసాగుతూనే ఉంటుందని పలువురు భావిస్తూండవచ్చు. అయితే ఈ విశిష్ట, నిరుపమాన గాయకుడితో వస్తున్న చిక్కల్లా ఏమిటంటే మనం ఇంకా ఈయన సాధించినదానితో సంతృప్తి చెందడం లేదు.

ఆయన స్వరం నుంచి వెలువడిన మేధోపరమైన, శాశ్వతమైన, వినిర్మలమైన, నాజూకైన, సృజనాత్మకమైన సంగీతం పట్ల మన అనురక్తి, తృష్ణ ఇంకా ముగియలేదు. ఆయన నుంచి చాలినంత సంగీతామృతాన్ని పొందామని కొంతమంది భావిస్తుండవచ్చు కాని, ఆయన సంగీతంతో మనలో చాలామంది ఇంకా సంతృప్తి చెందడం లేదు. విన్న కొద్దీ మళ్లీ మళ్లీ వినాలని పించే అమృత గుళికలను మనముందుంచి వెళ్లారు. ఆ పాటలతో సంతృప్తి చెంది ఇక చాలు అనుకోవడం అసాధ్యం. ఘంటసాల అనే ఈ గాన గంధర్వుడితో వస్తున్న చిక్కు ఇదే..

(ఈ రచన ఘంటసాల గారు కన్నుమూసిన రెండు రోజుల తర్వాత నాటి ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రికలో 14-02-1974వ తేదీన ప్రచురితమైంది. దీన్ని రచించిన వారు కె. కుమార శేఖర్, ఎలుగు. అంతకుమించి తన విశేషాలు ప్రస్తుతం ఎవరికీ తెలీవు. ఘంటసాల గానమాధుర్య శకాన్ని అనన్యసాధ్యమైన రీతిలో ఆవిష్కరించిన ఆ రచయిత ఎవరో ఇవ్వాళ ఎవరికీ తెలియదు. ఈ వ్యాసం ఆంగ్లపాఠాన్ని ప్రచురించిన ఘంటసాల. ఇన్పో వెబ్‌సైట్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది.

“No Mere Singer” అనే పేరుతో వచ్చిన నాటి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనానికి ఇది స్వేచ్ఛానువాదం.

కేవలం గాయకుడే కాదు…..

http://www.andhraprabha.com/cinema/nostalgia/no-mere-singer/12087.html#.UvuVfVA15k8.facebook

RTS Perm Link

జాతి అమరగానం… ఘంటసాల

February 19th, 2014

సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం ఈ భూమ్మీద నుండి ఒక మనిషి వెళ్లిపోయాడు. ఒక అమర స్వరం ఇక పాడలేనని సెలవు తీసుకుంది. ‘దివిజ కవివరుల్ గుండియల్ దిగ్గురనంగ’ చందాన ఆ మనిషి, ఆ స్వరం ఈ భౌతిక ప్రపంచం నుంచి వెళ్లిపోయాయి. మనిషి లేడు… ఆయన స్వరం లేదు. నాలుగు దశాబ్దాలు గడిచాయి. కాని ఆ మనిషి, ఆ స్వరం ఈ గడ్డ జ్ఞాపకాల్లోంచి అంతరించి పోలేదు. కొన్ని లక్షల కుటుంబాలు ఆయన పాటలు వింటూనే తరిస్తున్నాయి. జీవితంలో తమకెదురవుతున్న సమస్త బాధలను, సంతోషాలను, ప్రేమాభిమానాలను, పిడుగుపాటులా తగిలే ఎదురుదెబ్బలను, విచారాన్ని, వేదనను, భక్తిభావనను, శృంగారాన్ని, కరుణ రస హృదయ స్పందనలను ఆయన పాటల ద్వారా వింటూ స్వాంతన పొందుతూ ఈ నేల మీది మనుషులు సేద తీరుతున్నారు. ఆయన పాడింది మూడు దశాబ్దాలు.. ఆయన గతించిన తర్వాత గడిచిన కాలం నాలుగు దశాబ్దాలు. గత ఏడు దశాబ్దాలుగా ఈ నేల ఆయన పాటలతో పునీతమవుతూనే ఉంది.

ఊళ్లలో హరికథలు పాడుతూ బాల భరతుడిలా జనాన్ని మెప్పించిన వాడు, తెలుగుసీమలో ఒక మారుమూల నాలుగిళ్లలో అన్నం అడుక్కుని, కొందరమ్మలు పెట్టిన బిక్ష సాక్షిగా సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న ఓ పిల్లాడు.. తెలుగు నేల నలుచెరగులా, ప్రపంచంలో తెలుగువాళ్లు కాలు మోపిన ప్రతి చోటా తన ఉనికిని పాట రూపంలో, పద్యం రూపంలో చాటుకుంటూ చిరంజీవిగా మనందరిమధ్యే ఉంటున్నాడు. కంచుకంఠానికి శాశ్వత నిదర్శనంలా నిలిచి, మూడు తరాలపాటు తెలుగుదేశంలో ఆబాలగోపాలాన్ని తన కమనీయ కంఠ మాధుర్యంతో పరవశింప జేసిన గంధర్వ గాయకుడు ఘంటసాల. తెలుగు పాట, తెలుగు పద్యం గొప్పతనాన్ని ప్రపంచానికి కమ్మటి గొంతుతో పరిచయం చేసిన ఘంటసాల… మరో వెయ్యేళ్ల పాటు తెలుగు సినీ సంగీత, నేపధ్య గాన చరిత్రలో కరిగిపోని సంతకంలా తెలుగు వారి హదయాల్లో నిలిచిపోయాడు.

ఆయన గాత్రం, అసలున్నాడో లేడో తెలియని ‘దేవుడు’ కరుణించి, తెలుగు ప్రజలకి ప్రసాదించిన అపురూప వరమని కొనియాడుతున్నారు. అటు ఆస్తికులను, ఇటు నాస్తికులను కూడా, స్వరపేటికలోంచి పెల్లుబికి వచ్చే మహా వేదనలో ముంచెత్తి ఏడ్పించి, కన్నీరుపెట్టించిన అమరగానం ఆయనది. పాటలోని భావానికి పడిపోకున్నా, లోబడిపోకున్నా, మాంత్రిక మహనీయ కంఠస్వరంతో వాదాలను, సిద్ధాంత భేదాలకు అతీతంగా మనుషులను కరిగింపజేసిన అపర తుంబుర నాదానికి ఆయన గొంతు ఒక అచ్చమైన ప్రతిబింబం. ‘శాస్త్రీయ సంగీత ఛాయలనుంచి, లలిత సంగీతంలోకి తెలుగు సినిమాపాట పరిణామం చెందుతున్న క్రమంలో వేలకొద్దీ పాటలు, పద్యాలూ పాడి, తెలుగు సినీ గాన చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించిన గొప్పకళాకారుడు’ ఆయన.

ఎలా సాధ్యం ఒక మనిషికి అతడి గొంతుకు ఇది ఎలా సాధ్యమైంది ఒక గొంతు ప్రేమను పలికించవచ్చు, ఒక గొంతు విచారాన్ని తారాస్థాయికి తీసుకుపోవచ్చు.. ఒకరు చిలిపితనానికి తేనెసొగసులద్ది పరవశింపజేయవచ్చు. ఓ గొంతు విషాదానికి శిఖర స్థాయి నిచ్చి ఉద్వేగంలో ముంచెత్తవచ్చు. ఓ గొంతు శృంగారాన్ని అపర శ్రీనాధ కవి సార్వభౌముడిలా శిఖరస్థాయిలో నిలిపి కంచుడక్కను పగులగొట్టవచ్చు… ఒక గొంతు నవ్వించవచ్చు, ఒక గొంతు కన్నీరు తెప్పించవచ్చు. ఓ గొంతు ఆథ్యాత్మిక ప్రపంచపు సరిహద్దుల్లోకి మనిషిని తీసుకుపోయి అక్కడే విడిచి రావచ్చు.

కాని ఇదేమిటి అటు భక్తిని, ఇటు రక్తిని, అటు ప్రేమను, ఇటు ఎడబాటును, అటు వేదనను ఇటు అనుకంపనను, విరక్తిని, అల్లరిని, సంతోషాన్ని ‘ఒక్క మనిషి సమస్తజీవుల తానైన’ చందాన నవరసాలను ఒక్క గొంతులో పలికించడమేమిటి మన కళ్లముందు ఈ ప్రపంచంలో ఎన్ని భాషల్లో, ఎంతమంది ప్రసిద్ధ గాయనీ గాయకులు పాడటాన్ని, పాటలతో జీవితాన్ని పండించుకోవడాన్ని మనం చూడలేదు కనలేదు..! వినలేదు.. ప్రేమను పలికించినవారు, విషాదాన్ని గుండెనిండా నింపినవారు.. భక్తిని రంగరించి పాడినవారు ఎంతమందిని మనం చూడలేదు. కాని ఇన్ని మానవ అనుభూతులను ఒక గొంతు.. ఒకే ఒక్క గొంతు పలకడమేమిటి ఒక జాతి గొంతును తన గానంతో తరింపజేయడమేమిటి

అనితర సాధ్యమైన ఈ గంధర్వ గాన కళ ఈయనకే ఎలా సాధ్యమైంది ఆయన కంఠంలో పలికిన భక్తి, విచారం, వేదన, విరక్తి, ప్రేమ, చిలిపితనం, శృంగారం, అల్లరి, గడుసుదనం మరొకరికి అనుకరణ సాధ్యంకాదని తెలుగు జాతి ముక్త కంఠంతో శ్లాఘిస్తోంది. ప్రపంచ గాన చరిత్రలో ఒక గాయకుడు ఇన్ని మానవ మనోభావాలను, సంవేదనలను మూడు దశాబ్దాలపాటు ఒకే స్థాయిలో పాడటం జరిగిందా, మన దేశంలో కాని, ఇతర దేశాలలో కాని నవరసాలను జీవిత పర్యంతమూ పలికించిన గొంతు ఎక్కడైనా ఉందా అనేది రేపటి పరిశోధకులకే వదిలేద్దాం…

కాని.. అనేకులు చెబుతున్నట్లు ఆయన కారణ జన్ముడు కాడు. గంధర్వగాయకుడు కాడు.. దేవుడు ప్రసాదించిన వరప్రసాదం అంతకంటే కాదు. పేదరికాన్ని జీవితపు తొలినాళ్లలో ఘోరంగా అనుభవించిన ఆ చిన్ని జీవితం, ఆకలి విశ్వరూపాన్ని తాను చేపట్టిన మధూకర వృత్తి సాక్షిగా చవిచూసిన ఆ పిల్లాడి జీవితం తన గొంతును రాగరంజితం చేసింది. మానవ జీవితపు సమస్త వేదనలను, ఆశలను, ఆరాటాలను, అభిమానాలను, అనురక్తులను ఆయన కంఠం తనవిగా చేసుకుంది. పేదరికం, ఆకలి ఆ గొంతుకు అమృతాన్ని అందించి కమ్మటి స్వరాన్ని ఈ ప్రపంచానికి చిరస్థాయిగా అందించాయి.

జీవితంలో బాధ పడనివాడు, బాధ అంటే ఏమిటో తెలియని వాడు, ఆకలి రుచెరుగనివాడు, సమస్త బాధల వెనుక ఒక జీవితం అంటూ ఉంటుందన్న ఆశను, వాస్తవాన్ని ఆకలి సాక్షిగానే గుర్తెరగని వాడు… మనిషిని కరిగించే పాట పాడలేడు. అతడు త్యాగరాజు కావచ్చు, అన్నమయ్య కావచ్చు.. రామదాసు కావచ్చు.. చివరకు గద్దరే కావచ్చు… వీరి పాటల వెనుక ఉన్న మహిమాన్విత శక్తికి వారి జీవిత నేపథ్యమే కారణం. వీరిలో ఏ ఒక్కరు సంపన్నులై ఉన్నా వారికి చరిత్రలో స్థానం ఉండేది కాదన్నది వాస్తవం. తదనంతర జీవితంలో వారు ఎంత ఉన్నత స్థాయికైనా ఎదగవచ్చు. కాని పేదరికమే వారిని నడిపించింది. జీవితంలో లేమితనం వారిని రగిలించింది. కష్టభూయిష్ట బాల్యమే వారిని రాటుదేల్చింది.

మన కన్నీళ్లు, మన వేదన, మన దుఃఖం ఇవి పాటకు, గానానికి ప్రాణ ప్రతిష్ట చేస్తాయనే సత్యాన్ని, అన్నమయ్య గీతాలాపనకు ప్రాణంపోసిన శోభారాజు ఒక సందర్బంలో అన్నట్లు గుర్తు. తిండికి ముఖం వాచిపోయిన తన పేదరికమే, తన ఆకలే తన పాటకు మూలమైందని, అన్నమయ్య పాట రూపంలో తన అకలిబాధ వెలికి వచ్చిందని ఆమె పాతికేళ్ల క్రితమే ఒక సందర్భంలో అన్నారు. చరిత్రకెక్కిన, చరిత్రను చరితార్థం చేసిన ప్రతి గొప్ప వ్యక్తి జీవితం వ్యక్తిగత బాధనుంచే మొదలైంది. ఘంటసాల దానికి అతీతుడు కాదు. ఆయన గొంతు పలికించిన అద్భుత రాగాలకు, కమనీయ వ్యక్తీకరణలకు ఆయన అనుభవించిన బాధ కారణం. ఆకలి కారణం, కటిక పేదరికం కారణం. జీవుడి వేదన కారణం.

ఆయనను ఇలాగే స్మరించుకుందాం. గుర్తించుకుందాం… ఆయన గొంతులో తారాడిన పాట పలికించిన సహస్ర వ్యక్తీకరణలను మనం ఇలాగే భద్రపర్చుకుందాం. మరో వెయ్యేళ్లు గడిచినా జాతి మర్చిపోని ఈ గాన గంధర్వుడికి ఇలాగే నివాళి పలుకుదాం.

(ఫిబ్రవరి 11 ఘంటసాల వర్థంతి)

జాతి అమరగానం… ఘంటసాల

http://www.andhraprabha.com/specials/ghantasala-a-nations-eternal-singer/11998.html

దాదాపు 17 నెలల తర్వాత బ్లాగ్ లోకం లోకి వస్తూ నేనిక్కడ పోస్ట్ చేస్తున్న తొలి రచన. తొలుత ఆంధ్రప్రభ.కామ్ లో ఇది ఇటీవలే ప్రచురితమైంది.

RTS Perm Link

పునరాగమనం

February 19th, 2014

2012 సెప్టెంబర్ 15.. చందమామతో నా అనుబంధం తెగిపోయిన రోజు. మద్రాసుతో 16 సంవత్సరాల అనుబంధం చెదిరిపోయిన రోజు. ఒక మహానగరం నుంచి మరో మహానగరానికి,  భాగ్యనగరానికి జీవిక కోసం వలస వచ్చిన రోజు. గత 17 నెలలుగా వృత్తి జీవితానికి తప్పితే వ్యక్తిగత జీవితానికి, అభిరుచులకు ఇంటర్నెట్‌ను చాలా తక్కువగా, అరుదుగా మాత్రమే ఉపయోగించగలిగిన నేపథ్యంలో బ్లాగ్ ప్రపంచానికి, మిత్రులకు దూరమయ్యాను.

ప్రింట్ మీడియాలో రోజువారీ జీవితంలో మహదానుభవాలను, అనుభూతులను, రాత విషయంలో రోజువారీ పరీక్షలను పొందుతూ, ఎదురీదుతూ కొత్త జీవితంలో నిత్యం నేర్చుకుంటూ వచ్చిన కాలం. ఆన్‌లైన్ నుంచి ప్రింట్‌ మీడియాకు, మళ్లీ ఇటీవలే ఆన్‌లైన్‌కు మారవలసిన కాలం. వ్యాఖ్యలు పెట్టడానికి కూడా సమయం సరిపోని కాలం. కొద్దిగా అయినా బ్లాగ్ ప్రపంచంలోకి అలా తొంగి చూసి మళ్లీ దాటుకుని పోయిన కాలం.

మళ్లీ ఎందుకో బ్లాగ్ లోకంలోకి రావాలనిపిస్తోంది. కాని మునుపటిలా కాదు. అలా సాధ్యం కాదేమో.. వృత్తి జీవితంలో నేను రాస్తున్న రచనలను, వాటి లింకులను కొన్నింటిని నాకోసం భద్రపర్చుకోవాలనే చిరు కోరిక మళ్లీ బ్లాగ్ లోకం లోకి తీసుకువస్తోంది.

సమయం దొరికో దొరక బుచ్చుకునో నాలోని రచనా స్పూర్తికి పదునుబెట్టిన బ్లాగుతో మళ్లీ సయ్యాటలాడాలనే ప్రయత్నం. ఇది ఒకరి కోసం కాకుండా నా మనో నివేదనగానే ఉంటుందని, ఉండాలని కోరిక. ఇది నా మానసిక స్పందనల సమాహారం. మనల్ని వదలివెళ్లిపోయిన మిత్రులు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి జ్ఞాపకాలు మాత్రమే మిగిలిన ప్రపంచంలోకి మరోసారి రావాలనే ప్రయత్నం.

రాజశేఖర రాజు

8341571371

 

 

 

 

RTS Perm Link