సైన్స్ రచనల్లో సరికొత్త ఒరవడి: కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

September 20th, 2012

అంతర్జాలంలో, ప్రత్యామ్నాయ పత్రికల్లో, దినపత్రికల్లో పాపులర్ సైన్స్ రచయితగా ఒక మెరుపులా మెరిసి అర్థాంతరంగా మననుంచి వెళ్లిపోయిన మంచి రచయిత కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు. ఒక మిత్రురాలు అన్నట్లుగా…. మనకి అభివృద్ధితో కూడిన ఆధునిక జీవనాన్ని అందించిన పాత తరం క్రమేపీ కనుమరుగయిపోతోంది.. ఆ జాబితాలో రోహిణి ప్రసాద్ గారి పేరు కూడా చేరింది. ‘నాకైతే కుటుంబరావుగారే మరో సారి కన్ను మూసినట్టు అనిపించింది’ అన్నారామె.

తనకు పట్టున్న విషయాలను అందరికీ పంచిపెట్టడంలో అసాధారణ నైపుణ్యం చూపడమే కాదు. భావప్రచారం కోసం ఇంటర్నెట్‌ను, ప్రింట్ మీడియాను ఇంత విస్తృతంగా ఉపయోగించుకున్న రచయిత ఇటీవలి కాలంలో లేరని చెప్పాలి. సంవత్సరాలుగా వెంటాడుతున్న మధుమేహాన్ని కూడా ధిక్కరించి ఇంత తీవ్రాభినివేశంతో రచనలు చేసిన మరొక రచయితను ఈ మధ్య కాలంలో మనం చూసి ఉండం. మానవ సమిష్టి శ్రమ ఫలితమైన సాంకేతిక ఆవిష్కరణలను ఉపయోగించుకోవడంలో షరా మామూలుగానే వెనుకబడుతున్న ప్రగతిశీల సంస్థలను, పత్రికా నిర్వహణకర్తలపై ఆయన ఎన్ని మొట్టికాయలు వేశారో మరి.

తను కొన్న పుస్తకాన్ని, తన వద్దకు వచ్చిన పుస్తకాన్ని వెంటనే చదవటం, దానిపై పది ముక్కలు రాసి పంపటంలో అసాధారణ వేగాన్ని చూపిన తండ్రి కొడవటిగంటి కుటుంబరావు గారి సాహిత్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారీయన.

జీవిత విశేషాలు

అణుభౌతిక శాస్త్రవేత్త, పాపులర్ సైన్స్ రచయిత, సంగీతకారుడు, వక్త కొడవటిగంటి రోహిణీప్రసాద్ గత ఐదు సంవత్సరాలలో ఏడు పాపులర్ సైన్స్ పుస్తకాలు ప్రచురించి దాదాపు పది పత్రికలలో శాస్త్రవిజ్ఞాన విషయాలను సుబోధకంగా విరివిగా రాస్తున్న రచయితగా, ఇటీవలి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్ర విజ్ఞాన విషయాలపై ప్రసంగాలు చేస్తున్న వక్తగా తెలుగు సమాజంలో సుప్రసిద్ధులయ్యారు.

సుప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు – వరూధిని దంపతుల కొడుకుగా రోహిణీప్రసాద్ డిగ్రీ వరకు మద్రాసులో చదువుకున్నారు. చిన్ననాటి నుంచి శాస్త్రీయ సంగీతం మీద చాలా ఆసక్తి కనబరిచి సితార్ వాదన అభ్యసించారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అణు భౌతిక శాస్త్రంలో ఎంఎస్సీ చేసి, ట్రాంబేలోని భాభా అణు పరిశోధనా కేంద్రం (బార్క్)లో శాస్త్రవేత్తగా చేరారు. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి అణుధార్మికత అన్వేషణ సాధనాల గురించి పరిశోధనా పత్రానికి పి.హెచ్.డి పొందారు. మూడు దశాబ్దాలుగా బొంబాయిలోనే ఉద్యోగం చేసిన రోహిణీప్రసాద్, ఉద్యోగ విరమణ తర్వాత అమెరికాలోని అట్లాంటాలో కొంతకాలం కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఇటీవల ఇసిఐఎల్‌లో కన్సల్టెంట్‌గా పనిచేయడానికి హైదరాబాద్ వచ్చారు.

బొంబాయి రోజుల నుంచే రోహిణీప్రసాద్‌లో సంగీత, సాహిత్య అభిరుచులు ఎంతగానో విస్తరించాయి. పాపులర్ సైన్స్ రచనలు చేయడం ప్రారంభించారు. పదవీ విరమణ అనంతరం ఆయన సాహిత్య సృష్టి మరింతగా విస్తరించింది. సైన్స్ వ్యాసాల తొలి సంపుటం ‘జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం’ 2008లో వెలువడింది. అప్పటి నుంచీ ఆయన తెలుగులో ప్రధాన స్రవంతి పత్రికలలోనూ, ప్రత్యామ్నాయ పత్రికలలోనూ పాపులర్ సైన్స్ వ్యాసాలు రాస్తూ వచ్చారు. మధుమేహం కారణంగా తీవ్ర అస్వస్థతతో ముంబై జస్లోక్ ఆసుపత్రిలో సెప్టెంబర్ 8న కన్నుమూశారు. తన శరీరాన్ని మట్టిలో కలపడం కాకుండా, వైద్యపరిశోధనల కోసం ఆసుపత్రికి ఇవ్వాలన్న ఆయన కోరికను కుటుంబం నెరవేర్చింది.

విస్తృతస్థాయి రచనలు

ప్రజాసాహితి, వీక్షణం, అరుణతార, విశాలాంధ్ర, ఆంధ్రభూమి, ది హాన్స్ ఇండియా వంటి పత్రికలు… ఈమాట.కామ్, ఎపివీక్లీ.కామ్, పొద్దు.నెట్, ప్రజాకళ. ఒఆర్‌జి, ప్రాణహిత.ఒఆర్‌జి వంటి వెబ్‌సైట్లలో సైన్స్, సంగీతం, భాష, సాహిత్యం, విశిష్టవ్యక్తులతో జ్ఞాపకాలు,.. ఇలా గత పన్నెండేళ్లుగా ఎంతో వైవిధ్యపూరిమైన రచనలను శరవేగంగా విస్తృత స్థాయిలో అందించిన ప్రజా రచయిత రోహిణీ ప్రసాద్.

తండ్రి కొ.కు. మార్క్సిస్ట్ పదజాలాన్ని వాడకుండా, సామాజిక, ఆర్థిక పరిణామాలను ప్రగతిశీల కోణం నుంచి విశ్లేషిస్తూ కల్పనాసాహిత్యంలో కొత్త పుంతలు తొక్కి చరిత్ర సృష్టిస్తే,, తనయుడు కమ్యూనిజం పేరెత్తకుండా శాస్త్రీయతకు, అశాస్త్రీయతకు మధ్య ఉన్న తేడాను ఎవరినీ నొప్పించకుండా వీలైనంత సయమనంతో, అందరినీ ఆలోచింపజేసేలా రాయడంలో నిష్ణాతుడయ్యారు.

ఆయన గడిపిన చివరి సంవత్సరాలు వ్యక్తిగా తనను తీవ్రమైన అధ్యయనానికి, విస్తృతమైన రచనావ్యాసంగానికి అంకితం చేసి ఉండవచ్చు. అదే సమయంలో పాపులర్ సైన్స్ రచనా ప్రక్రియ తన ద్వారా ఒక కొత్త ఒరవడిని అందుకుంది. ఎక్కడా సిద్ధాంతం పేరెత్తకున్నప్పటికీ, సైన్స్ ఆవిష్కరణల పరిణామాన్ని హేతుపూర్వకంగా వివరించడంలో విశ్లేషించడంలో, సూటిగా విషయాన్ని అన్ని వర్గాల పాఠకులకు అందించి అర్థం చేయించడంలో అసాధారణ నైపుణ్యం చూపిన ప్రజ్ఞాశాలి ఈయన.

సైన్స్ పరిశోధనలు ఆవిష్కరిస్తున్న తాజా పరిణామాలను ఎంత సులభ శైలిలో ఆయన పేర్కొంటారో, ఆ పరిణామాలను వివరిస్తున్నప్పుడు చిన్న చిన్న పదబంధాలతో ఆయన చేసే వ్యాఖ్యలు ఎన్నో మెరుపు వాక్యాలను సృష్టించాయి. తన ప్రధాన రచన కంటే తను చేసిన వ్యాఖ్యలు మళ్లీ మళ్లీ చదువుకోవాలనిపించేంత ఆసక్తి కలిగిస్తాయి. అలాగని మూల పాఠాన్ని తేలికపరుస్తున్నట్లు కాదు.

వెంట్రుకవాసిలో ర్యాంకును, సీటును లేకుండా చేసే పోటీ ప్రపంచపు పరుగుపందెంలో, సాఫ్ట్‌‍వేర్ మాయాజాలంలో పడి పుస్తక అధ్యయనం అంటే ఏమిటో తెలియనంతగా కొట్టుకుపోతున్న యువతరం కూడా ఆయన రచనలను విశేషంగా చదవటం ప్రారంభించిందని తెలిసినప్పుడు ఆయన నూటికి నూరుపాళ్లూ తన లక్ష్య సాధనలో విజయం సాధించినట్లే లెక్క. ఒకే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పవలసి వచ్చినప్పుడు అనివార్యంగా కనిపించే పునరావృత్తి లోపం కూడా గమనించనంతగా తన రచనలు మనల్ని ముందుకు నడిపిస్తాయి.

‘జీవశాస్త్ర విజ్ఞానం సమాజం’ అనే పుస్తకం ప్రజాసాహితి ప్రచురించిన ఆయన తొలి పుస్తకాల్లో ఒకటి. వృత్తిరీత్యా పరమాణు శాస్త్రవేత్తే అయినప్పటికీ, జీవపరిణామ శాస్త్రంలో జరుగుతున్న విప్లవాత్మమైన ఆవిష్కరణలను విభ్రమంగా పరిశీలిస్తూ తన దృష్టికి వచ్చిన ప్రతి కొత్త భావనను తెలుగు మాత్రమే తెలిసిన పాఠకులకు వివరించాలనే అభిప్రాయంలో రచయిత రాసి ప్రచురించిన విలువైన వ్యాస సంపుటి ఇది. ఇవి కేవలం శుద్ధ సైన్స్ వ్యాసాలే అయితే వాటికి ఇంత ప్రాచుర్యం లభించేది కాదేమో.

ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలపై గతితార్కిక దృక్పథం నుండి చేసిన వ్యాఖ్యలు, వ్యంగ్యోక్తులు, చురకలు, నిక్కచ్చి విమర్శలతో కూడుకోవటంతో రచయిత సైన్స్ వ్యాసాలకు విశిష్ట ప్రాముఖ్యత లభించింది. ఈ వ్యాసాలు చదువుతున్నప్పుడు ఎంగెల్స్ 130 సంవత్సరాల క్రితం అప్పటి సైన్స్ పరిణామ గతిపై రచించిన ప్రామాణిక పుస్తకం ‘డయలెక్టిక్స్ ఆఫ్ నేచుర్’ గుర్తొచ్చిందంటూ ఈ పుస్తకం పరిచయకర్త అతిశయ రహితంగానే చెప్పారు.

దైవశక్తి కాదు… భౌతిక శక్తి…

“దేవుడున్నాడని వాదించేవారితో లేడని చెప్పడంతో ఊరుకోకుండా జరుగుతున్న సంఘటనల వెనక ఎటువంటి భౌతిక శక్తులు పనిచేస్తాయో హేతువాదులు వివరించగలగాలి. అని “భౌతిక వాద దృక్పధం ఆవశ్యకత’ అనే వ్యాసంలో సూచించిన రచయిత మూఢవిశ్వాసాలకు కొత్తరంగులు పులుముకుంటూ, వాటిని బలపరచడం తమ జన్మహక్కయినట్లు ప్రవర్తించే ఆధునిక ఆటవికులపై అనేక వ్యాసాల్లో వ్యంగ్యవిమర్శలు చేశారు.

‘ఈరోజు మనమనుకున్నది రేపు తప్పు కావచ్చు’ అనే ఏకవాక్యం ద్వారా శాస్త్రీయ ఆలోచనలు నిత్య ప్రయోగాలతో ఎలా మారుతూ వచ్చాయో అత్యంత స్పష్టంగా వివరించారు. 19వ శతాబ్దంలో సమాజంలో ఉనికిలో ఉన్న అనేక సత్యాలు 20వ శతాబ్దపు నూతన ఆవిష్కరణల వెలుగులో పాక్షిక సత్యాలుగా, అసత్యాలుగా తేలిపోయాయని, యావత్తు మానవ, సమాజ పరిణామాల విజ్ఞానం ఇలా సత్యాసత్యాల నిర్దిష్ట ప్రయోగ ప్రక్రియల్లోంచే నిగ్గుదేలుతూ వస్తోందని, స్తంభించిన ఆలోచనలకు, అజ్ఞానానికి సంబంధించిన మతభావనలకు, ప్రకృతిలోని రహస్యాలను నిరంతరం వెదుకుతూ, పాతభావనలను సరిదిద్దుతూ, తిరస్కరిస్తూ కొత్త భావనలను ఊహించే శాస్త్ర భావనలకు ఏరకంగానూ పొత్తు కుదరదని తేల్చిచెప్పారు.

అదే సమయంలో ప్రాచీన కాలపు ప్రజల విశ్వాసాలు అప్పటి పరిమితమైన సైన్స్‌లో భాగమేనని చెప్పడంలో రచయిత ఏమాత్రం వెనుకాడలేదు. సంతానోత్పత్తి సామర్థ్యానికి ప్రతీకలైన అమ్మతల్లి బొమ్మలు, లింగరూపాలు వంటివి తమ మనుగడకు మేలు జరుగుతుందని నమ్మిన ప్రజలు చేస్తూవస్తున్న తంతులేనని, ఇవి అప్పటి సమాజ శ్రేయస్సు కోసం జరిపిన తంతులే తప్ప, మతం పేరుతో అల్పసంఖ్యాకులు ఇతరులను మభ్యపెట్టే దశ అప్పటికింకా ప్రారంభం కాలేదని చెబుతారు. ప్రాచీనుల సామూహిక జీవిత అవసరాల్లో భాగంగా ఏర్పడిన ఈ రకమైన తంతులను వివరించే కృషి కూడా సైన్స్‌లో భాగమేనంటారు.

ప్రకృతిలోని ప్రతి పరిణామాన్ని సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తూ వచ్చిన ప్రాచీన మానవులు, గుహల్లో మారుమోగే చప్పుళ్లకు, ప్రతిధ్వనులకు కూడా అతీత శక్తులను ఆపాదించి ఉంటారని, ప్రపంచమంతటా ప్రాచీన ఆరాధనా స్థలాలలో పుట్టిన మంత్రోచ్చాటనలకు శక్తిని ఆపాదించడం వెనుక ఇదే దాగి ఉందని రచయిత వ్యాఖ్యానిస్తారు. మంత్రాల ఉచ్చారణకు ఇప్పటికీ మన దేశంలో ఎంతో శక్తిని ఆపాదించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తారు.

‘అమరమైనది’ ఆత్మకాదు. ‘జన్యుపదార్థం’

చావుపుటకలు అనే వ్యాసంలో ‘ఆత్మకు చావు లేదు’ అనే సాంప్రదాయ భావనకు వ్యతిరేకంగా సైన్స్ పరంగా అద్భుత వ్యాఖ్య చేశారీయన.  మనవాళ్లు అనుకుంటున్నట్లుగా మనలో ‘అమరమైనది’ -శాశ్వతమైనది- ఆత్మకాదు. ‘జన్యుపదార్థం’ అని తేల్చి చెబుతూ షాక్ కలిగిస్తారు. ఎన్నో సంవత్సరాలు బతికి, ఆలోచించి, నవ్వి, ఏడ్చి, ఏదో ఒకనాడు శ్వాస పీల్చడం మానేసిన మనిషి ఉనికికి చావు అనేది శాశ్వతమైన అంతం అని అంగీకరించడానికి ‘మనసొప్పదు’. కానీ జీవపరిణామానికి మరణం అనేది తప్పనిసరి అవసరం అంటూ రిచర్డ్ డాకిన్స్ -‘Selfish Gene,’ ‘The Blind watchmaker’ గ్రంథాల రచయిత- భావనను పరమ తార్కికంగా వ్యాఖ్యానిస్తారు రచయిత.

చచ్చిన తర్వాత మనలో ‘నశించనిది’ ఏదీ ఉండదని, మనిషి శరీరం యంత్రపరంగా నూట యాభై ఏళ్లకు మించి ‘నడవద’ని, అది అరిగి, తరిగి, శిథిలమవుతుందని, అందుకే నూట ఇరవై దాటిన ‘శతాధిక’ వృద్ధులెవరూ ప్రపంచంలో ఉండరంటూ సంభ్రమం గొలిపించే వ్యాఖ్య చేస్తారు. మొత్తం మీద జీవపరిణామంలో చావు అనేది ప్రకృతి పరంగా చూస్తే లాభదాయకం -cost effective-. నానాటికీ అరిగిపోయే ప్రతి ప్రాణి శరీరాన్ని బాగుచేస్తూ కలకాలం మన్నేట్టు చెయ్యడం కంటే ఆ శరీరంలో పనికొచ్చే పదార్థాన్ని కొత్త శరీరంలో ప్రవేశపెట్టి ముసలి శరీరాన్ని అవతలికి నెట్టడమే ప్రకృతికి సులభం అవుతుంది. కాబట్టి పనికొచ్చే పదార్థం అంటే మనలో జన్యుపదార్థమేనని పేర్కొంటూ ఆత్మల శాశ్వతత్వాన్ని, అమరత్వాన్ని చావు దెబ్బ కొడతారు.

అన్నిటినీ ఆడించే శక్తి, అన్నిటిని సృష్టించిన సృష్టికర్త అనే ఆటవిక దశలోని మానవుల మానసిక భావనలను ఆధునిక సైన్స్ పూర్వ పక్షం చేస్తోందని, ప్రాణులు పుట్టడం, పెరుగుదల, వాటిలో కలిగే శారీరక మార్పులు వంటి వాటన్నింటినీ నియంత్రించడం సాధ్యమేనని విజ్ఞానశాస్త్రం నిరూపిస్తోందని, మనిషే సృష్టికర్త అవుతున్న ప్రస్తుత కాలంలో ‘విశ్వామిత్ర సృష్టి’ని ఎవరైనా చేయవచ్చని సవాలు చేస్తున్నారు రోహిణీ ప్రసాద్.

“జీవరాశి చరిత్ర యావత్తూ డిఎన్ఎ తదితర జన్యుపదార్థాలన్నీ తమను తాము పునసృష్టి చేసుకునే కార్యక్రమం మాత్రమే. ప్రాణులన్నీ ఇందుకు తల ఒగ్గవలసిందే. ఇందులో వివేకమూ, వివేచనా మొదలైనవాటికి స్థానం ఉన్నట్లు కనబడదు” అని వ్యాఖ్యానించడం ద్వారా దైవ సృష్టి భావనను ఎదుర్కొన్నారీయన.

అలాగే మనుషులందరూ సమానం కాదనే విషయం జన్యు స్థాయిలో కూడా సరైనదే అని తేలుతోందని, కాని ఈ విషయం సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి మనని ప్రేరేపించాలి. బలహీనులను గాలికి వదిలేయకుండా కాపాడుకుని, జంతువులకు, మనకు భేదం ఉందనేని నిరూపించాలి అని వ్యాఖ్యానించడం ద్వారా జన్యుపరమైన అసమానతలను సమాజంలోని అసమానతలతో సరిచేసి పోల్చరాదని సూచిస్తారు.

‘జీవశాస్త్ర విజ్ఞానం సమాజం’ అనే పుస్తకం పొడవునా రోహిణీ ప్రసాద్ గారు గుప్పించిన స్పూర్తిదాయకమైన వాక్యాలూ, వ్యాఖ్యలను మనం ఇక్కడ చూడవచ్చు.

“దీర్ఘాయుస్సు కలిగించే ప్రత్యేక జన్యువు ఏదీ లేదు కానీ మనకు మంచి ఆరోగ్యాన్ని, పటుత్వాన్ని ఇవ్వగలిగిన జన్యువులు చాలానే ఉన్నాయి.

చావు అనేది జన్యువుల అంతిమ వైఫల్యం అనుకోవచ్చు. అలాగే ముసలితనం కూడా క్రమంగా జరిగిన, జరుగుతున్న జన్యుపరమైన క్షీణత అని భావించవచ్చు.

‘అమరత్వం’ సిద్ధించకపోయినా ఆయుర్దాయం పెరుగుతుంది.”

–చావు గురించి వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న జడాత్మక తాత్విక భావనల స్థానంలో ‘జన్యువుల అంతిమ వైఫల్యమే చావు’ అనే భావనను మనకాలపు  సైంటిస్టు మాత్రమే ప్రతిపాదించగలడు.

“కష్టాల్లో ఉన్నవాళ్లు దేవుణ్ణి తలుచుకున్నట్లుగా, ప్రపంచవ్యాప్తంగా అంటురోగాలు లేదా వాటి గురించిన భయం పెరిగినప్పుడల్లా ప్రజల్లో సైన్స్ విషయాల పట్ల కాస్త ఆసక్తి పెరుగుతుంది.

ఇప్పుడు మనకున్న స్వాతంత్ర్యమల్లా టీవీలు చూస్తూ ఇండియన్ ఐడల్ గురించి ఎస్‌ఎమ్ఎస్‌లు పంపటమే.

పక్కవాడికేసి చూడకుండా బస్సుల్లో కూర్చున్నప్పుడు కూడా చెపుల్లో పెట్టుకు వినడానికి సీడి ప్లేయర్లూ, కేసెట్ ప్లేయర్లూ ఉన్నాయి. మరీ గుబులు పుడితే మొక్కుకోవడానికి దేవుళ్లూ, బాబాలూ, జైలుకెళ్లని స్వాములార్లూ ఉండనే ఉన్నారు.

పొట్టకోసం చదివే చదువులూ, సైన్సూ ఒంటబట్టే అవకాశం ఎలాగూ లేదు కనక అదంతా మర్చిపోయిన ‘విద్యాధికులు’ అన్నిటినీ ఆడించే పవరు గురించి ఊహలల్లుకుంటూ ఉంటారు.

అన్నిటికీ అతీతంగా ‘జన్మరాహిత్యం’ సాధించడమే గొప్ప అని ప్రతిపాదించబడింది. ప్రాణమూ, స్పృహా అన్నీ త్యజించాక ‘గొప్ప’ అనే భావన ఎలా కలుగుతుందీ ఎవరికీ తెలీదు.”

‘నొసటి రాత’ నొసటి మీద కాక అతి సూక్ష్మ జీవకణాల్లో నిక్షిప్తమై ఉందనడంలో సందేహం లేదు.

–పైవాటిలో ఏ వాక్యం చూసినా, సమాజ నడకపై, అవాంఛనీయ విశ్వాసాలపై తీవ్రమైన సెటైరే కనబడుతుంది మనకు.

“క్షణాల్లో రోగాలు నయం చేసెయ్యగలమని మందుల కంపెనీలు కేకలు పెట్టడంతో మామూలు ప్రజలు ప్రతిదానికీ ఇటువంటివి వాడటం మొదలుపెడితే జబ్బుకన్నా చికిత్సే ప్రమాదకరం అవుతుంది.”

–రోగనిరోధానికి అవసరమైన మందులు మాత్రమే ఇవ్వకుండా ఎంత చిన్న పెద్ద డాక్టరైనా సరే విటమిన్ టాబ్లెట్లు ఇస్తున్నాడంటే అతడు పూర్తిగా మందుల కంపెనీలకు అమ్ముడుపోయినట్లే లెక్క. నూటికి 75 శాతం వ్యాధులు కేవలం ఆహారం తీసుకోవడం ద్వారానే తగ్గిపోతాయని డాక్టర్ సమరం గారు పాతికేళ్లుగా మొత్తుకుని చెబుతున్నా మనం వినం. మన దగ్గరి సందులోని డాక్టర్ మాటంటే అంత గురి మనకు. సూదిమంది పొడిస్తేనే వాడు సరైన డాక్టర్ అనే ఒకప్పటి పల్లెజనం నమ్మకం ఎంతమంది డాక్టర్లకు బతుకునిచ్చిందో మరి.

జన్యుప్రయోగాల్లో… మూడుకాళ్ల కోడిపిల్లలనూ, ఆవులంత పాలివ్వగలిగిన ఎలుకలనూ శాస్త్రవేత్తలూ కృత్రిమంగా సృష్టించగలుగుతున్నారంటే ప్రాణుల ఎదుగుదలను నియంత్రించే ప్రక్రియలను అర్థం చేసుకున్నారని తెలుస్తోంది.

పాశ్చాత్య దేశాల్లో  పనిచేసే చాలామంది శాస్త్రవేత్తలు దైవసృష్టిని ఏ మాత్రమూ నమ్మనివారే. ఎటొచ్చీ వాళ్లు మన భౌతికవాదుల్లాగా మార్క్సిస్టులై ఉండకపోవచ్చు. మార్కిజానికి వ్యతిరేకులైనా కావచ్చు. వారి ప్రయోగాలు మాత్రం హేతువాదానికి బలం చేకూర్చుతాయి. ఆ వివరాలు కొన్నయినా తెలుసుకోవడం భౌతికవాదులకు అవసరం.”

–సిద్ధాంతంపై అతిప్రేమ, సిద్ధాంత వ్యతిరేకులపై గుడ్డి వ్యతిరేకత ఏ సమాజానికైనా మంచిది కాదు. మార్క్సిస్టు వ్యతిరేకుల ప్రయోగాలు కూడా హేతువాదానికి బలం చేకూర్చుతాయనడంలో రచయిత జీవిత కాలసాధన ద్వారా పొందిన అనుభవమే కనబడుతుంది మనకు.

“పునరుత్పత్తికి జీవకణాలు ప్రస్తుతపు ఆత్మహత్య పద్ధతిని ‘ఎన్నుకున్నాయంటే’ జీవపరిణామ క్రమంలో తక్కిన పద్ధతుల కన్నా ఇదే బలంగా నిలవగలిగిందని ఊహించాలి. ఇది ప్రకృతి సిద్ధంగా ‘అతీత శక్తుల’ ప్రమేయమేమీ లేకుండా జరిగిన పరిణామం.”

–జీవరాసుల చావు పుట్టుకల ప్రక్రియలో దాగిన ‘ప్రకృతి ఎంపిక’ను ఎంత ప్రభావవంతంగా రచయిత ఇక్కడ చెప్పారో చూడండి మరి. అందుకే ముసలితనం, చావు అనేవి ప్రకృతిపరంగా ‘విధివిధానం’ అనిపిస్తాయంటారీయన. 300 కోట్ల సంవత్సరాలనుంచి జీవకణాలు తమ చుట్టూ ఉన్న పరిస్థితులకు తట్టుకుంటూ తమ మనుగడనీ, సంతానోత్పత్తిని కొనసాగించడానికి విజయవంతంగా ప్రయత్నించిన ఈ కణాల ఫార్ములాయే ‘చావుపుట్టుకలు’ అంటూ జీవన్మరణ రహస్యాన్ని సైన్స్ పరిభాషలో నిర్వచిస్తారు రచయిత.

“డైనోసార్ల పుట్టుక, ఎదుగుదల ప్రక్రియ భూమ్మీద 16 కోట్ల సంవత్సరాలు కొనసాగిందంటే ఇది ఎంత విజయవంతమైన జీవపరిణామమో ఊహించుకోవచ్చు… మనవాళ్లకు డైనోసార్ల సంగతి తెలిసి ఉంటే దాన్ని కూడా విష్ణువు అవతారంగా అభివర్ణించేవారేమో కాని, ఈ భయంకర ప్రాణులను ఏ దేవుడు ఏ ఉద్దేశంతో అన్ని కోట్ల ఏళ్లు ఉండేట్టు సృష్టించాడో, అవి ఎందుకు అంతరించాల్సి వచ్చిందో పురాణాలు చెప్పవు. సైన్స్ మాత్రం అతి సామాన్యమైన కారణాలతో వివరణలిస్తుంది.”

“వ్యక్తుల బలహీనతల్ని ఉపయోగించుకునే దొంగస్వాములూ, నిజాయితీగానే తప్పుడు నమ్మకాలను ప్రచారం చేసే మహనీయులూ తెలిసి కొందరూ, తెలియక కొందరూ అనేకమందిని తప్పుదారి పట్టిస్తున్నారు. జలుబును ఏమాత్రం నయం చెయ్యని ఇన్‌హేలర్లలాగా మూఢనమ్మకాల, తప్పుడు వేదాంతమూ చాలామందికి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తున్నాయనేది నిజమే. అయినా యధార్థమేమిటో తెలుసుకోవడం ఆధునిక మానవుడికి జన్మహక్కు వంటిది. అది విప్లవానికి ఆయుధం కూడా.”

పరమాణువు నుంచి జీవ పరిణామం వరకు…

పతాక స్థాయికి చేరిన రచయితలోని ఈ భావ స్పష్టత వృత్తి జీవితం నుంచే తనకు అలవడినట్లుంది. పరమాణు భౌతికశాస్త్రంలో 70 పరిశోధనా పత్రాలు, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, భౌతికవాదంలో మరో 300 వ్యాసాలు రాసిన ఈ ఘనాపాఠి… బాబా అణు పరిశోధన కేంద్రంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ‘You shape the work. Work shapes you.’ అనే భావనను నమ్ముకున్నారట.  “ఏ పనినీ వద్దనే ప్రసక్తేలేదు. అలా ఏ పనినైనా దిగ్విజయంగా చేసే స్థాయికి వెళ్ళాను. చేసే ప్రతిపనినీ, అంతర్జాతీయ సదస్సులకు పంపే ప్రతి పేపర్‌ను ఇతరుల దృక్కోణం నుంచి చూడటం, విస్పష్టంగా, ఎటువంటి సందేహాలకూ తావులేకుండా రాయడం, చెప్పాలనుకన్న విషయాన్ని సూటిగానూ, అర్ధమయ్యేరీతిలో కమ్యునికేట్‌ చేయడం వీటిపైనే నా దృష్టి అంతా వుండేది. బహుశా ఈ స్కిల్‌ నేను పెరిగిన వాతావరణం, నేను చదివిన పుస్తకాలే నాకు ఇచ్చాయి. తెలుగులోకి అనువాదమైన రష్యన్‌ సాహిత్యం, సైన్స్‌ పుస్తకాలు, నాన్న రచనలు నేను మొదటిగా చదివిన పుస్తకాలు. చిన్నతనంలో మా నాన్న ఏర్పరచిన వాతావరణమే దీనికి కారణం.”

“పరమాణు శాస్త్రవేత్తనైన నేను జీవశాస్త్రం వ్యాసాలు రాయాలనుకోవడం మరో మలుపు. అదీ ఆసక్తి వున్న సాధారణ మనిషికి బోధపడే రీతిలో రాయాలనుకోవడం … సాహసమే. అయితే నేను దానిలో విజయం సాధించాననే అనుకుంటాను. గతితార్కిక భౌతికవాదాన్ని నమ్మడంతో, ప్రజలందరూ బహుముఖ పార్శ్వాలను కలిగివుండే సమాజం సాధ్యమేనని నమ్మడంతో ఇప్పుడు మన పని ముగిసిపోవడంలేదు. దానిని ఆచరిస్తూ, పదిమందికీ చెప్పడమనే అవసరం రోజురోజుకూ మరింత విస్పష్టంగా కళ్ళముందు గోచరిస్తోంది. నా దారి నాకు స్పష్టంగా కనబడుతూనే వుంది.’’ (అరుణపప్పు గారి బ్లాగ్ నుంచి)

ప్రపంచంలోనే అతి కష్టమైన పని ఏదో చెప్పండిరా చూద్దాం అంటూ చిన్నప్పుడు స్కూల్లో మా తెలుగు మాస్టారు ప్రశ్నించేవారు. కొండలెక్కడం, బరువుమోయడం అంటూ మా అనుభవంలో మాకు తెలిసినదల్లా జవాబే అనుకుని చెప్పేవాళ్లం. అన్నిటినీ ఖండించి మా మాస్టారు ఒక చిన్నమాటతో తేల్చేసేవారు.

ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పని ఏమిటంటే  ‘సులభంగా రాయడమేరా’ అనేవారాయన.

రోహిణీ ప్రసాద్ గారు అలా సులభంగా రాయడాన్ని సాధించారు. అది శాస్త్రం కావచ్చు, శాస్త్రీయ సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరినీ చదివించే సరళశైలి రచనలను ఆయన తెలుగు సమాజానికి అందించారు.

సైన్సుకు సంబంధించిన పుస్తకాలతోపాటు ఆయన అంతర్జాలంలో సరళమైన రీతిలో తెలుగులోవ్యాసాలు రాసారు. వాటిలో ప్రతి ఒక్కటీ విలువైనదే. పరిచయమున్న వారందరికీ షాక్ కలిగిస్తూ ఆయన ఇంత అర్థాంతరంగా పోవడం వారి కుటుంబానికి, మిత్రులకూ ఎంత నష్టమో, తెలుగు పాపులర్ సైన్స్ రచనా ప్రక్రియకు అంతకంటే అధిక నష్టం.

గత నాలుగేళ్లలో ఆయన రాసిన ‘జీవ శాస్త్ర విజ్ఞానం-సమాజం’, ‘మానవ పరిణామం’, ‘విశ్వాంతరాళం’, ‘జీవకణాలు-నాడీకణాలు’, ‘ప్రకృతి-పర్యావరణం’, ‘మనుషులు చేసిన దేవుళ్లు’, ‘అణువులు’ వంటి సైన్స్ పుస్తకాలు పాఠకులను ఆలోచింపజేయడమే కాకుండా సైన్స్ విషయాల్లోని సంక్లిష్టతను తొలగించాయని ప్రతీతి పొందాయి.

ప్రతి హేతువాదీ, భౌతికవాదీ, సామాజిక కార్యకర్తా రోహిణీ ప్రసాద్ గారి సైన్స్ రచనలను స్వంతం చేసుకోవాలి, నిబద్ధతతో అధ్యయనం చేయాలి.

ఆయన వదిలివెళ్లిన రచనలు చదివే బాధ్యత మనపై ఉంది. వినమ్రంగా ఆయనకు మనం ఇవ్వగలిగే నివాళి ఇదొక్కటే మరి.

 

(This full length article was edited and published in Prajasakthi daily paper and website on 16-09-2012 by same heading. Now i am posting this full article for broder purpose. My heartious thanks to Prajasakthi and perticularly its Rajamundry edition chief Mr. Satya ji for his friendly support. I couldn’t type this in telugu as i am not having unicode font in my hand now.)

K.Raja Sekhara Raju

07305018409

Hyderabad

 

 

RTS Perm Link