రోహిణీ ప్రసాద్ సంస్మరణ సభ

September 14th, 2012

అణుభౌతిక శాస్త్రవేత్త, పాపులర్ సైన్స్ రచయిత, సంగీతకారుడు, వక్త కొడవటిగంటి రోహిణీప్రసాద్ సంస్మరణ సభ సెప్టెంబర్ 15 (శనివారం) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరుగుతుంది. ఎన్. వేణుగోపాల్ సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. దివికుమార్, గీతా రామస్వామి, కాకరాల, బాబు గోగినేని, వరవరరావు తదితరులు వక్తలుగా పాల్గొని ప్రసంగిస్తారు. గత ఐదు సంవత్సరాలలో ఏడు పాపులర్ సైన్స్ పుస్తకాలు ప్రచురించి దాదాపు పది పత్రికలలో శాస్త్రవిజ్ఞాన విషయాలను సుబోధకంగా విరివిగా రాస్తున్న రచయితగా, ఇటీవలి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్ర విజ్ఞాన విషయాలపై ప్రసంగాలు చేస్తున్న వక్తగా రోహిణీప్రసాద్ తెలుగు సమాజంలో సుప్రసిద్ధులయ్యారు.

సుప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు – వరూధిని దంపతుల కొడుకుగా రోహిణీప్రసాద్ డిగ్రీ వరకు మద్రాసులో చదువుకున్నారు. చిన్ననాటి నుంచి శాస్త్రీయ సంగీతం మీద చాలా ఆసక్తి కనబరిచి సితార్ వాదన అభ్యసించారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అణు భౌతిక శాస్త్రంలో ఎంఎస్సీ చేసి, ట్రాంబేలోని భాభా అణు పరిశోధనా కేంద్రం (బార్క్)లో శాస్త్రవేత్తగా చేరారు. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి అణుధార్మికత అన్వేషణ సాధనాల గురించి పరిశోధనా పత్రానికి పి.హెచ్.డి పొందారు. మూడు దశాబ్దాలుగా బొంబాయిలోనే ఉద్యోగం చేసిన రోహిణీప్రసాద్, ఉద్యోగ విరమణ తర్వాత అమెరికాలోని అట్లాంటాలో కొంతకాలం కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఇటీవల ఇసిఐఎల్‌లో కన్సల్టెంట్‌గా పనిచేయడానికి హైదరాబాద్ వచ్చారు.

బొంబాయి రోజుల నుంచే రోహిణీప్రసాద్‌లో సంగీత, సాహిత్య అభిరుచులు ఎంతగానో విస్తరించాయి. పాపులర్ సైన్స్ రచనలు చేయడం ప్రారంభించారు. బొంబాయిలోని కాలనిర్ణయ్ పంచాంగంక్యాలెండర్‌లో తెలుగు సాహిత్యాన్ని చేర్చడంలో సహాయం చేశారు. పదవీ విరమణ అనంతరం ఆయన సాహిత్య సృష్టి మరింతగా విస్తరించింది. సైన్స్ వ్యాసాల తొలి సంపుటం ‘జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం’ 2007లో వెలువడింది. అప్పటి నుంచీ ఆయన తెలుగులో ప్రధాన స్రవంతి పత్రికలలోనూ, ప్రత్యామ్నాయ పత్రికలలోనూ పాపులర్ సైన్స్ వ్యాసాలు రాస్తూ వచ్చారు. సమాజంలో శాస్త్రీయ దృష్టిని పెంపొందించడానికి విద్యార్థుల స్థాయి నుంచే పాపులర్ సైన్స్ ఉపన్యాసాలు ఏర్పాటు చేయాలనీ, తాను ఎక్కడికైనా వచ్చి ఉపన్యాసం ఇస్తాననీ చెపుతూ ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వంద చోట్ల ఉపన్యసించారు.

– కొడవటిగంటి రోహిణీప్రసాద్ మిత్రులు

(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)

రోహిణీ ప్రసాద్ సంస్మరణ సభ

http://andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/sep/14/edit/14edit6&more=2012/sep/14/edit/editpagemain1&date=9/14/2012

 

RTS Perm Link