సంగీత, సాహిత్య, శాస్త్రాల మేలుకలయిక: కె. రోహిణీ ప్రసాద్

September 11th, 2012

మనిషి సాధించవలసిన జ్ఞానార్జన స్పెషలైజేషన్ పేరిట ముక్కలుగా విభజించబడుతున్న కాలంలో మనముంటున్నాం. ఫలితంగా ఒక కోర్సును మాత్రమే మనం చదవగలం. జీవితమంతా ఒక వృత్తిలోనే మనం ఉండగలం. ఒక మనిషి రెండు, మూడు రంగాల్లో ప్రవేశించటం సాధ్యమేమో కాని అన్నింటిలో నిష్ణాతుడు కావడం మన కాలంలో కష్టసాధ్యం.

సమాజం ఏర్పర్చిన ఈ రకం జ్ఞాన విభజననుంచి బయటపడిన అరుదైన వ్యక్తి కొడవటివటిగంటి రోహిణీప్రసాద్. అరవైమూడేళ్ల వయస్సులో గత శనివారం అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారీయన. సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత అయిన రోహిణీప్రసాద్ పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశారు.

మనిషి సజీవంగా ఉండాలంటే బహుముఖంగానే ఉండాలన్నది కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గారి నమ్మిక. ఈ విశ్వాసమే జీవితాంతం ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది. ఈ విషయంలో కొడవటిగంటి కుటుంబరావు గారి కౌటుంబిక, సాహిత్య, సాంస్కృతిక, శాస్త్రీయ వారసత్వానికి ఈయన ప్రతిరూపం.

తదనంతర జీవితంలో మూడున్నర దశాబ్దాలపాటు భాభా అణు పరిశోధనా కేంద్రం -బార్క్‌-లో రేడియేషన్‌ సెంటర్‌‌లో హెడ్‌‌గా పనిచేసిన ఈయనకు జీవితం చివరివరకూ సంగీతంపై వ్యామోహం పోలేదు. సంగీతం, సాహిత్యం, శాస్త్రం మూడింటిలో అభిరుచి, ఆసక్తులను చివరివరకూ కొనసాగించడం మన సమాజంలో అరుదైన ఘటన. ఒక వ్యక్తి ఇన్ని రంగాల్లో ప్రావీణ్యత చూపడం, తుదివరకు వాటిపై తన ముద్ర వేయడం కూడా ఆయనకు కుటుంబ నేపధ్యంలోంచే సాధ్యమైంది.

ఇంట్లో సాహిత్య వాతావరణం, తండ్రివల్ల ప్రజాస్వామిక, శాస్త్రీయ దృక్పధం తోడుగా ఈయన చిన్నప్పటినుంచే వివిధ జ్ఞాన రూపాలపై ఆసక్తి పెంచుకున్నారు. చిన్నప్పుడు అక్క, తమ్ముడితో చదువుల పోటీలో సున్నా మార్కులే వస్తుంటే తండ్రి కుటుంబరావుగారు అన్న ఒక్క ముక్క ఆయన జీవితాన్ని నిప్పుకణంలా వెలిగించింది. “చదువుకోకపోతే ఎవరికి నష్టం? వాళ్లే మట్టికొట్టుకుపోతారు” అంటూ కొ.కు. చేసిన ఒకే ఒక వ్యాఖ్య ఈయన జీవితమంతటినీ అలర్ట్ చేసింది. ‘సంగీతజ్ఞానం తప్ప వీడికి చదువురాదు’ అని కుటుంబం నిశ్చితాభిప్రాయానికి వచ్చేసినప్పటికీ కొ.కు. గారి ఆ వ్యాఖ్యే తన భావిజీవితాన్ని అణుపరిశోధనల వరకు నడిపించిందంటారీయన.

చదువులో సున్నలు వచ్చినా సంగీతం అంటే చిన్నప్పటినుంచే చెవికోసుకునేవారు. తండ్రి కొ.కు. అద్భుతంగా వాయించే హార్మోనియం పెట్టెపైనే తను కూడా వాయిస్తూ పొల్లుపోకుండా రాగాలు నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే పద్యాలు, పాటలు రాయడం, వాటికి రాగాలు కట్టడం, నృత్యరూపకాల్ని రూపొందించడం అలవడింది. ఉన్నత విద్య చదువుకుంటున్న విశాఖపట్నంలో సితార్‌నూ వదలలేదు. ఉద్యోగ రీత్యా బొంబాయి వచ్చిన తర్వాత సంగీత సాధన కొనసాగిస్తున్న క్రమంలో అక్కడి తెలుగువారితో కలిసి తెలుగు సాహిత్య సమితిని ప్రారంభించి కుమార సంభవం బాలేకు 55 రాగాలతో సంగీత రూపకల్పన చేశారు. కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడస్సీ నృత్యాలను కలబోసి కృష్ణపారిజాతం బ్యాలే రూపొందించారు.

ఇవి బాగా పేరుకెక్కడంతో సంగీతం తన జీవితంలో భాగమైపోయింది. కర్నాటక సంగీతం, హిందూస్తానీ సంగీతంలో నిష్ణాతులైన గాయకులు అప్పట్లో తరచుగా కొకు గారి ఇంటికి వస్తుండంతో వారి మాటలను వినడం ద్వారానే ఆయన సంగీతంపై తీవ్ర వ్యామోహం పెంచుకున్నారు. ముంబైలో సంగీత కచ్చేరీలు ఇవ్వడం సరేసరి. క్రమంగా సితార్ తన జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. ప్రముఖ సితార్ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ శిష్యరికం సితార్ వాయిద్యంపై నైపుణ్యాన్ని పెంచింది. 1986లో యునెస్కో ఆధ్వర్యంలో నిర్వహించిన 40వ వార్షికోత్సవంలో సితార్ విద్వాంసుడిగా రోహిణీప్రసాద్ పలు ప్రశంసలు అందుకున్నారు. హిందూస్థానీ, కర్నాటక జుగల్‌బందీలో నిష్ణాతుడయ్యాక 90లలో అమెరికాలోని పలు నగరాలలో సంగీత కళా ప్రదర్శనలు ఇచ్చారు కూడా. ఈ అణుభౌతిక శాస్త్రవేత్త, శాస్త్రీయ సంగీతానికి కూడా సమస్థాయిని ఇచ్చి గౌరవించడం మరీ విశేషం.

ముంబైలో జరిగే సంగీత కచ్చేరీల గురించి, అక్కడి సుప్రసిద్ద సవాయీ గంధర్వ ఉత్సవ విశేషాల గురించి ఆయన ఒక ఇమెయిల్‌లో ఇచ్చిన వివరణ ఎంతో ఆసక్తి గొలుపుతుంది. దశాబ్దాల క్రితం తను చూసిన, పాల్గొన్న అంశాలను కూడా నిన్న మొన్న జరిగినట్లుగా వివరించడం ఆయన అసాధారణ జ్ఞాపకశక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. మచ్చుకు ఒకటి.

“మూడు దశాబ్దాలకు పైగా ముంబయిలో ఉన్నప్పటికీ నేను ఒక్కసారి మాత్రమే (1971లో) సవాయీ గంధర్వ ఉత్సవానికి హాజరయాను. ఎందుకంటే అక్కడికి వచ్చే కళాకారులందరూ ముంబయిలో తరుచుగా కచేరీలు చేసేవారు. కిరానా సంప్రదాయానికి చెందిన భీంసేన్ జోషీ తన గురువు పేరిట జరిపే ఈ 3 రోజుల సంగీతోత్సవం చలికాలంలో జరిగినప్పటికీ అప్పట్లో అయిదారు వేలమంది ప్రేక్షకులను ఆకర్షించేది. రాత్రి 8 ప్రాంతాల మొదలైన కచేరీలు పొద్దున్న 6 దాకా ఎడతెగక సాగేవి. చివరిరోజున మాత్రం మధ్యాహ్నం 12 దాకా జరిగేది. అందరికన్నా తరవాత భీంసేన్ కచేరీ జరిగేది. ముగింపు కోసం పాడే (సింధు) భైరవి రాగం మాత్రం సవాయీ గంధర్వ రికార్డు మోగించి వినిపించేవారు. 1971లో జరిగిన ఉత్సవంలో మా గురువు ఇమ్రత్ ఖాన్‌గారి సితార్ కచేరీ, బిర్జూ మహారాజ్ కథక్ నృత్యానికి శాంతాప్రసాద్ తబలా సహకారం, కిరానా గాయని హీరాబాయీ బడోదేకర్‌కు సన్మానం వగైరాలన్నీ జరిగాయి.”

పరమాణు భౌతికశాస్త్రంలో 70 పరిశోధనా పత్రాలు, జీవశాస్త్రం భౌతిక శాస్త్రం భౌతికవాదంలో మరో మూడొందల పైగా వ్యాసాలు రాసిన ఘనుడు రోహిణీ ప్రసాద్. ఇవన్నీ ఒక ఎత్తైతే భారతీయ సంగీతకారులపై, సంగీతవాయిద్యాలపై రోహిణీప్రసాద్ ఇచ్చిన చరిత్ర డాక్యుమెంటేషన్ ఒకెత్తు. 2000 సంవత్సరం నుండి 2012 జనవరి వరకూ హిందూస్తానీ, కర్నాటక సంగీతంలో ఘనాపాఠీలుగా తాననుకున్న విశిష్టవ్యక్తుల జీవిత విశేషాలను, భారతీయ సంగీత రాగాలను వరుసగా ఈమాట.కామ్ వెబ్ పత్రికలో వ్యాసరూపంలో పొందుపర్చారు.

“సంగీతం, సాహిత్యం, బొంబాయిలో ప్రవాసాంధ్ర జీవితం గురించి రోహిణీప్రసాద్ గారు చేసిన అనేక రచనలు, వివిధ అంశాల మీద ఆయన అభిప్రాయాలు ఈమాట పత్రికలో చదవొచ్చు.”

శాస్త్రీయసంగీతంలో, ముఖ్యంగా హిందూస్తానీసంగీతంలో, విశేషమైన ప్రతిభ ఉన్న ఈయన ప్రధానంగా సితార్‌ వాద్యకారులు. ముంబైలో ఎన్నో లలితసంగీత కార్యక్రమాలు ఇచ్చారు, ఇప్పించారు. సంగీతం గురించిన అనేక విశేషాలను వివరిస్తూ వారు రాసిన వ్యాసాలు సంగీతంతో ఇంతకుముందు పరిచయం లేని వారికి కూడా దాన్లో ఆసక్తిని, అభిరుచిని కలిగిస్తాయని పేరు పొందాయి. ఈయన భారతీయ సంగీతకారులు, సంగీత రాగాలు, సంగీత వాయిద్యాల విశేషాల గురించి దాదాపు నలభై వ్యాసాలను ఇంతవరకు ప్రచురించడం గమనార్హం.

‘శ్రుతి మించని రాగం,’ ‘మన శాస్త్రీయ సంగీతం,’ ‘రాగాలూ స్వరాలూ,’ ‘శ్రుతిలయల నందనవనం,’ ‘సినిమా పాటల్లో తాళం, నడకలు, విరుపులు,’ ‘పాటల్లో లయవిన్యాసాలు,’ ‘హిందూస్తానీ సంగీతం,’ సంగీతంతో కుస్తీ,’ ‘జుగల్‌బందీ కచేరీలు,’ ‘కీబోర్డ్ మీద రాగాలు,’ ‘హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు,’ ‘కల్యాణి రాగం – అనుబంధం,’ ‘హిందోళ రాగం – అనుబంధం,’ ‘భావతరంగాల సింధువు: భైరవి,’ ‘ఖమాజ్/ఖమాచ్/ కమాస్ రాగం,’ ‘పుష్ప విలాపం – రాగాలతో సల్లాపం’ వంటి పలు రచనలలో.. సంగీతంలోని రాగాలు స్వరాలు, లయ విన్యాసాలు, తాళం నడకలు, విరుపుల గురించిన ప్రాధమిక సమాచారాన్ని ఈయన అత్యంత సులభరీతిలో పాఠకులకు అందించారు. సంగీతం అంటే ఓనమాలు తెలియని వారికి కూడా ఆసక్తి కలిగించే రచనలివి.

హిందూస్తానీ సంగీతంలో దిగ్గజాలపై ‘సితార్, సుర్‌బహార్‌ల సవ్యసాచి ఉస్తాద్ ఇమ్రత్‌ఖాన్,’ ‘గురువుల సంస్మరణ కొనసాగిస్తున్న గాయని ప్రభా ఆత్రే,’ ‘అత్యుత్తమ హిందుస్తానీ గాయకుడు బడేగులాం ఆలీఖాన్,’ ‘వాద్య సంగీతానికి అద్భుత దీవం వెలిగించిన అల్లాఉద్దీన్‌ఖాన్,’ ‘తబలా మాంత్రికుడు అహ్మద్‌‍జాన్ థిరక్వా,’ ‘గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్‌ఖాన్,’ ‘సర్వోత్తమ సితార్ విద్వాంసుడు ఉస్తాద్ విలాయత్‌ఖాన్’ వంటివారిపై అపురూప విషయాలను పంచుకున్నారు. దక్షిణ భారతీయ సంగీతజ్ఞులు ‘మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి,’ ‘సార్థక నామధేయుడు సంగీతరావు,’ ‘నౌషాద్,’ ‘ఓపీ నయ్యర్,’ ‘బాలమురళీ కృష్ణ,’ ‘బాలమురళీ కృష్ణ సంగీతం,’ ‘అసామాన్య సంగీత దర్శకుడు సి.ఆర్. సుబ్బరామన్,’ ‘సంగీతరస పానశాల ఘంటసాల’ వంటి ప్రముఖుల కృషి వివరాలు కూడా అందించారు.

ఈయన అందించే విషయం, శైలి ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తెలుసుకోవడానికి “మన శాస్త్రీయ సంగీతం‘ అనే ఈయన ఒక్క రచన చదివితే చాలు. “అనాదిగా ప్రజలు పాడుకొనే జానపద సంగీతం నుంచి పుట్టి,”సంస్కృతీకరించబడి” ప్రస్తుతపు రూపాన్ని సంతరించుకున్న మన శాస్త్రీయ సంగీతం ఈనాటి “ప్రజల” సంగీతమైన సినీగీతాలనూ, “లలిత” సంగీతాన్ని విశేషంగా ప్రభావితం చేసింది. మారుమూల పల్లెల్లో సినిమా “షోకులు” సోకనివారు మాత్రం ఇంకా తమ జానపద సంగీతం పాడుకుంటూనే ఉన్నారు. గద్దర్‌ వంటి గాయకులు ఆ బాణీలను అనుసరించి తమ భావాలను అతి సమర్ధవంతంగా ప్రకటించడం చూస్తూనే ఉన్నాం.”

శాస్త్రీయ సంగీతపు మూలాలు కూడా అనాది ప్రజల జానపద సంగీతంలోంచే పుట్టాయని చదివితే చారిత్రక క్రమంలో సంగీతం అభివృద్ధి చెందిన తీరు పట్ల ఆసక్తి కలుగుతుంది. “శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం అనేది ఒక శిక్షలాగా అనిపించకూడదు.” అనే వీరి అభిప్రాయం చదివేవారి కళ్లల్లో మెరుపును సృష్టిస్తుంది.

“జ్ఞాపకశక్తి ఉండాలి. నేర్చిన ప్రతీదీ కంఠస్థం కావాలి. అభ్యాసం రాక్షస సాధనలాగా ఉండాలి. సాధన చేస్తున్నప్పుడు ఏ అభ్యాసం వల్ల ఏ ఫలితం కలుగుతుందో చూచాయగానైనా తెలియాలి. గాత్రం నేర్చుకోనివారు కూడా విధిగా తాము వాయించబోతున్నది పాడి చూచుకోవాలి. ఈ  పాడడం ఎంత ముఖ్యమో చాలా మందికి తెలియదు. స్వరజ్ఞానం లేనివారికి అది అబ్బే అవకాశం, పాడుకోవడం వల్ల పెరుగుతుంది.”

ఒక మిత్రుడన్నట్లుగా, సైన్స్, సంగీతం, సాహిత్యం మూడింటిలోనూ ప్రావీణ్యత సాధించిన బహుముఖ ప్రజ్ఞాశాలి రోహిణీ ప్రసాద్ గారు ఇంత హఠాత్తుగా నిష్క్రమించటం అనూహ్యం, జీర్ణించుకోలేని వాస్తవం! శాస్త్రీయ అంశాలను -సంగీత మెలకువలను కూడా- హేతువాద దృక్పథంతో సరళంగా, ఆత్మీయమైన శైలిలో వివరించటంలో ఆయన కొ.కు.ను గుర్తుకుతెస్తారు! ఒక రచయితగా, సంగీతకారుడిగా, శాస్త్రవేత్తగా, హేతువాదిగా ఆయన వంటి వ్యక్తి మళ్లీ పుట్టడానికి చాలా కాలం పడుతుంది.

ముగింపు
ఇవ్వాళ రోహిణీ ప్రసాద్ మన ముందు లేరు. సంగీతంలోని ప్రాధమిక విషయాలను మంచినీళ్ల ప్రాయంలా వివరించిన వీరి రచనలు ఇకనైనా ప్రచురించవలసిన అవసరం ఉంది. సంగీత వాయిద్యాలపై, హిందూస్తానీ, కర్నాటక సంగీత విద్వాంసులపై, ఘంటసాల వంటి అమరగాయకులపై, చిత్రసంగీత దర్శకులపై ఈయన రచనలు ఈమాట.కామ్‌లో మరోసారి చదువుతున్నప్పుడు ఒకటే ఆలోచన. శాస్త్రీయ. సంగీతంపై, చిత్రసంగీతంపై ఇంత ప్రభావవంతమైన రచనలు చేసిన ఈయన కృషి ఎందుకు ఇన్నాళ్లుగా పుస్తక రూపం దాల్చలేదనిపిస్తుంది. ఈమాట.కామ్ వారు ఇప్పటికయినా ఈ పనికి పూనుకోగలిగితే సంగీత చరిత్ర డాక్యుమెంటేషన్‌లో రోహిణీప్రసాద్ గారి ‘ఆత్మావిష్కారం’ తెలుగు పాఠకులందరికీ అందుతుంది.

రోహిణీప్రసాద్ గారితో పరిచయమున్న వారు ఇప్పుడాయన గురించి పంపుతున్న స్పందనలు ఆయన బహుముఖ వ్యక్తిత్వాన్ని మరింత తేటతెల్లంగా చేస్తున్నాయి. మొత్తం సంగీత చరిత్రనే తన చేతివేళ్లమీద పెట్టుకున్న ఈ ప్రతిభామూర్తిని, సాహిత్యం, సైన్స్, అనువాదాలు, సంగీతం వంటి పలు రంగాల్లో తన మేధస్సును ప్రశంసించడం సరే సరి. తనను కలిసేందుకు వచ్చిన వారికి పాత హిందీ, తెలుగు పాటలు, గజల్స్ కూడా పాడి వినిపించి తన్మయులను చేసేవారట. ఇతరుల సంతోషాన్ని తాను ఆస్వాదించేవారట. అత్యంత స్పష్టంగా సభల్లో సైన్స్ గురించి ఇతర విషయాల గురించి ఈయన ప్రసంగాలు విన్నవారు ఈయన భావస్పష్టతను మర్చిపోలేమని చెబుతున్నారు.

ఇన్ని రంగాల్లో ప్రావీణ్యమున్న ఈ విశిష్టవ్యక్తిని ఆంధ్రజ్యోతిలో ఆయనపై వచ్చిన నివాళి వ్యాసం చూసేంతవరకు తెలుసుకోలేక పోయామని కొందరంటున్నారు. వాదాలకు, వివాదాలకు అతీతంగా జాతి సంపదగా వెలుగొందవలసిన మనుషులు అజ్ఞాతంగానే ఉండిపోవలసిరావడం, తెలిసిన వారికి మాత్రమే వారి పరిచయ సుగంధాలు మిగలటం కన్న విషాదం ఏముంటుంది?

మరోసారి… భారతీయ సంగీత రీతులపై ఆయన రచనలు పుస్తకంగా వెలువడితే ఆయన కృషి, సంగీత చరిత్రపై ఆయన ఆలోచనలు ప్రపంచానికి మరింతగా అందే అవకాశం ఉంటుంది.

(ఈ కథనం కోసం అరుణపప్పు గారు రోహిణీ ప్రసాద్‌గారితో చేసిన ఇంటర్వ్యూనుంచి, ఈమాట.కామ్ వెబ్‌సైట్ నుంచి కొన్ని వివరాలు తీసుకోవడం జరిగింది. వీరికి కృతజ్ఞతలు.)

ఆన్‌లైన్‌లో చందమామ పరిచయం: రోహిణీప్రసాద్ కృషి
తెలుగువారి బాల్యానికి, ఇంకా చెప్పాలంటే భారతీయుల బాల్యానికి ఐకాన్‌గా నిలిచిపోయిన ‘చందమామ, పత్రిక గురించి ఈమాట.కామ్ లో రోహిణీప్రసాద్ గారు 2006లో అందించిన ‘చందమామ జ్ఞాపకాలు’ రచన ఆన్‌లైన్ పాఠకలోకంలో ఒక సంచలనం కలిగించింది.

26. “చందమామ” జ్ఞాపకాలు

చందమామ దిగ్గజ చిత్రకారుల గురించి, కొకుతో సహా సంపాదక బృందం గురించి, చందమామ చరిత్ర గురించి స్థూలంగా తెలిపిన ఈ రచన తెలుగుదేశంలో, విదేశాల్లో కూడా చందమామ గురించి కొత్త ఆసక్తి కలిగించింది. చందమామ అభిమానులు, ఆరాధకులు కలిసి చందమామ పిచ్చోళ్లు అనే స్వయం ప్రకటిత సంస్థగా ఏర్పడి చందమామ పత్రిక గురించి సంవత్సరాలపాటు ప్రచారం చేసుకుంటూ వెళ్లిన చరిత్రకు ఈ వ్యాసమే నాందిపలికింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చందమామ ప్రియులకు 1947 జూలై తొలి సంచిక నుంచి 2012 ఆగస్టు సంచిక వరకు సాఫ్ట్‌కాపీల రూపంలో లభ్యమవుతున్నాయంటే దానికి రో.ప్ర గారి తొలి వ్యాసమే మూలం.

తండ్రిలాగా కల్పనా సాహిత్యంలో రోహిణీ ప్రసాద్ గారు పెద్దగా రచనలు చేసి ఉండకపోవచ్చు కాని 2010 నుంచి చందమామలో కొన్ని పిల్లల కథలు రాశారు. తను రాసిన బేతాళ కథ కూడా ఆ సంవత్సరమే ప్రచురించబడింది. చందమామకు చాలా ఆలస్యంగా పరిచయమైన ఈయన 2010లో తెలుగు మినహా ఇతర భాషలలో చందమామ పత్రిక అనువాదకుల కోసం ఎంపికైన తెలుగు కథలను ఇంగ్లీషులోకి అనువదించారు.

ఒక అక్షరం కూడా వంకబెట్టడానికి వీల్లేదని చందమామ యాజమాన్యం నుంచి ప్రశంసలందుకున్నంత చక్కని అనువాదం ఆయనది. ఈ క్రమంలోనే 1947 నుంచి 1953 వరకు చందమామ పాత సంచికలలోని కథలన్నింటినీ ఆంగ్లంలోకి మార్చే బృహత్ ప్రాజెక్టులో ఆయన కీలకపాత్ర పోషించారు. మెరుపువేగంతో, ఖచ్చితమైన పదజాలంతో చందమామ కథలకు ఆయన చేసిన అనువాదాలు చందమామ ఆన్‌‌లైన్ లైబ్రరీలో ప్రస్తుతం భద్రంగా అమరి ఉన్నాయి.

RTS Perm Link