మా నాన్న విషాదమరణం – కొడవటిగంటి కార్తీక్

September 9th, 2012

ప్రియమైన మిత్రులకు,
మా నాన్న డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు నిన్న మధ్యాహ్నం ముంబయ్‌లో కన్నుమూశారనే వార్తను మీకు తీవ్ర విషాదంతో తెలియజేస్తున్నాను. కొంత కాలంగా అస్వస్థతతో ఉంటున్న ఆయన కొద్దిరోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.

నాన్న శ్రేయోభిలాషులు, రేపు  (సెప్టెంబర్ 10) ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్యలో ఆయన భౌతిక దేహాన్ని ముంబై, వడాల ఈస్ట్ లోని లాయిడ్స్ ఎస్టేట్‌లో కడసారి దర్శించవచ్చు. తర్వాత ఆయన భౌతికదేహాన్ని గ్రాంట్ మెడికల్ కాలేజీకి తీసుకెళతాము. ఆయన కోరిక మేరకు ఆయన భౌతిక దేహాన్ని వైద్య అధ్యయనం, పరిశోధనలకు గాను సమర్పిస్తున్నాము.

మా నాన్నగారికి మీరు ఇన్నాళ్లుగా అందించిన తోడ్పాటుకు మా కుటుంబం తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

ఇన్నాళ్లుగా మీ అందరితో పరిచయాలు, సహ సంబంధాలను ఆయన ఎంతో ఆస్వాదించారు. మీతో పరిచయం తనను జ్ఞానవంతుడిగా చేసిందని ఆయన భావించేవారు.

ఒక రచయితగా, సంగీతకారుడిగా, శాస్త్రవేత్తగా, హేతువాదిగా ఆయన వంటి వ్యక్తి మళ్లీ పుట్టడానికి చాలా కాలం పడుతుందని మీ అందరి తరపున చెప్పాలనుకుంటున్నాను.

మరోసారి, మా నాన్న, మా కుటుంబం యొక్క శ్రేయోభిలాషులుగా ఉంటూ వస్తున్న మీ అందరికీ మేము వినమ్రంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.

ధన్యవాదాలతో,
కార్తీక్ కొడవటిగంటి.

Karthik Kodavatiganti
2303-D, Lloyds Estate,
Wadala East
Mumbai 400037
Mobile: +91-98190-44855
Home: +91-22-2414-3274

Email: k_karthik@outlook.com

 

కార్తీక్ గారు,

నాన్నగారి ఫోన్ నంబర్ తప్పితే ఇన్నాళ్లుగా మీతో కాని  లలిత గారితో కాని నేరుగా సంభాషించే వీలు లేకపోయింది. ‘శరీరం చాలా బాధపెడుతున్నా తన మనస్సు, బుద్ధి చాలా చురుకుగా ఉందం’టూ ముంబై ఆసుపత్రిలో మీ మాతృమూర్తి లలితగారు పది రోజుల క్రితం ఆయన ఫోన్ నుంచి చెప్పిన మాటలే ఆయన తరపున నాకు అందిన చివరి సందేశం.

చందమామలో నా ఉద్యోగ జీవితం గడిపిన గత మూడున్నరేళ్ల కాలంలో ఆయనతో పరిచయం నా ఆలోచనలను, జీవితాన్ని కూడా ప్రకాశవంతం చేసింది. పల్లెటూరి నుంచి జీవిక కోసం వచ్చిన వారు మహానగరాల్లో ఎదుర్కొనే జీవన సంక్లిష్టతలను ఆయన ఎంతో వివరంగా విశ్లేషిస్తూ ధైర్యం చెప్పేవారు.

అమెరికా నుంచి, ముంబై నుంచి, హైదరాబాద్ నుంచి గత మూడేళ్లుగా ఎన్నిసార్లు ఆయన ఫోన్ ద్వారా సంభాషించారో, చాట్ చేశారో, మెయిల్స్ పెట్టారో లెక్క తెలీటం లేదు. దురదృష్ట మేమిటంటే రెండు వారాల ముందు ఆయనను, లలితగారిని, వరూధినిగారిని తొలిసారిగా కలిసే అవకాశం నాకు నేనుగా పొగొట్టుకున్నాను.

శారీరకంగా చాలా ఇబ్బంది పడుతున్నా సాయంత్రం నాలుగు గంటల వరకు అమీర్ పేటలో బంధువుల ఇంటిలో వేచి చూశానని ఆయన చెప్పినప్పుడు నేను క్షమాపణ చెప్పాను కాని ఆయనను ఇక ఎన్నటికీ చూడలేనని కనీసంగా కూడా ఊహించలేకపోయాను.

సెప్టెంబర్ రెండోవారంలో హైదరాబాద్‌కు వస్తాను కాబట్టి ఈసారి తప్పక కలుస్తానని నేరుగా నాన్నగారి ఇంటికే వచ్చి కలుస్తానని ఆయనకు చెప్పాను. కాని ఇక సాధ్యం కాదని, ఆయన అప్పటికే జీవితంలో చివరి చలనం వైపు అడుగులేస్తున్నారని ఊహించలేకపోయాను.

హైదరాబాద్‌కు వచ్చి కూడా ఆయనను చూడలేకపోవడం ఘోరమైన తప్పిదం. కాని ఇలా జరుగుతుందని ఎవరు ఊహించగలరు?

ఇంగ్లీష్ చదవలేని తెలుగు వారికి తాను విస్తృతంగా పరిశీలిస్తున్న శాస్త్ర, సాంకేతిక విషయాలను, నూతన ఆవిష్కరణలను సులభశైలిలో పుస్తకాల రూపంలో అందివ్వాలనే మహా సంకల్పం ఆయనను అవిరామ శ్రామికుడిగా మార్చింది. ఆయన ఆయుర్దాయాన్ని కూడా ఈ మహాసంకల్ప భారమే క్షీణింపజేసిందేమో..

తండ్రి కుటుంబరావు గారి రచనా వారసత్వాన్ని కొనసాగించడంలో అత్యంత వేగంతో అక్షరాలను కూర్చి రచనలు చేయడంలో ఆయనది అనితరసాధ్యమైన మార్గం.

నండూరి రామమోహన్ రావు గారి  సైన్స్ రచనలు తర్వాత శాస్త్ర విషయాలను ఇంత తేలికగా, ఇంత హేతుపూర్వకంగా తెలుగువారికి అందించిన నాన్నగారి మేధస్సు ఇంత త్వరగా ఆలోచించడాన్ని ఆపివేయడం వ్యక్తులుగా మీ కుటుంబానికి, మిత్రులకు ఎంత విషాదకరమో, తెలుగు  పాపులర్ సైన్స్ రచనలకు అంత నష్టకరమైన విషయం కూడా.

తెలిసిన విషయాలను పదిమందికి విస్తృతస్థాయిలో చెప్పడానికి పత్రికలు ముఖ్యమార్గమని, ఎక్కువమంది పాఠకులకు మన భావాలను చెప్పగలిగే అవకాశాలను ఎన్నటికీ వదులుకోవద్దని ఆయన పదే పదే చెప్పేవారు. చివరి రోజుల్లో ఆయన ఈ విషయమై నన్ను మందలిస్తూ పంపిన చివరి ఇమెయిల్‌ని ఇక మరువలేను.

నాలుగేళ్ల స్వల్పకాలంలో ‘విశ్వాంతరాళం’, మానవ పరిణామం, ‘జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం’, ‘జీవకణాలు -నాడీ కణాలు,’ ‘ప్రకృతి పర్యావరణం,’ ‘అణువులు’, ‘దేవుడు చేసిన మనుషులు’ వంటి ఎనిమిది పాపులర్ సైన్స్ పుస్తకాలు రాశారు. శాస్త్ర సంబంధ రచనలు అంటే పెద్దగా ఆసక్తి చూపని తెలుగు పాఠకలోకంలో తెలుగు ప్రచురణల చరిత్రలో అవి ఎంత సంచలన విజయం సాధించాయో ఇవ్వాళ అందరికీ తెలుసు.

మూడేళ్ల స్వల్ప పరిచయంలో ఆయన నా పట్ల పితృసమాన వాత్సల్యాన్నే ప్రదర్శించారు. ఈ కష్టకాలంలో మీరు ఒకరికొకరు తోడుగా, ధైర్యంగా ఉంటారని, అమ్మను, నాన్నమ్మను జాగ్రత్తగా చూసుకుంటారని కోరుకుంటున్నాను. తండ్రిగా, విజ్ఞానవేత్తగా, హేతుచింతనకారుడిగా ఆయన అందించిన ప్రేరణే మీ కుటుంబానికంతటికీ మనోధైర్యాన్ని ఇస్తుందని భావిస్తున్నాను.

తన శరీరాన్ని మట్టిలో కలపటం కాకుండా వైద్య పరీక్షలకు, మానవ శ్రేయస్సు కోసం అందివ్వాలన్న ఆయన కోరికను మీరు నెరవేరుస్తున్నందుకు ఈ విషాద సమయంలో కూడా ఒకింత సంతోషంగా ఉంది. ఒక శాస్త్రజ్ఞుడికి, హేతువాదికి, తండ్రికి మీరు మీ కుటుంబం ఇస్తున్న ఈ నివాళికంటే మించినది ఏదీ ఉండదు.

మీరు తండ్రిని పోగొట్టుకున్నారు.  కాని జీవిక కోసం చెన్నయ్ నుంచి హైదరాబాద్‌కు మారాలనుకుంటున్న నాకు ‘మనం దేంట్లోనైనా పనిచేయగలం, కష్టపడగలం, కొత్త విషయాలను నేర్చుకోగలం, భాగ్యనగరంలో అనేక అవకాశాలున్నాయి, ధైర్యంగా రండి’ అంటూ చివరి వరకూ ప్రోత్సాహాన్ని, ప్రేరణను  అందించిన ఒక గొప్ప సహాయ హస్తాన్ని, ఆప్యాయ స్వరాన్ని నేను శాశ్వతంగా పోగొట్టుకున్నాను.

ఇన్నాళ్లుగా ఏ సమయంలో అయినా సరే  కాల్ చేయగానే ‘రాజుగారూ బాగున్నారా’ అంటూ పలుకరించిన నాన్నగారి మొబైల్ ఇక మూగపోతుందన్న వాస్తవాన్ని భరించలేకున్నాను.

ప్రస్తుతం నాకున్న ఆర్థిక వనరుల పరిమితి కారణంగా చివరి చూపుకు కూడా ముంబైకి నేను రాలేకపోతున్నందుకు క్షమించండి.

మీరు ఈ మెయిల్‌‍లో ఇచ్చిన మొబైల్ నంబర్‌కు కాల్ చేయాలంటే కూడా సాహసించలేకపోతున్నాను.

మీరు నిబ్బరంగా ఉంటారని, ఉండాలని కోరుకుంటూ..
రాజశేఖరరాజు.
చెన్నయ్
7305018409

krajasekhara@gmail.com

…………………….

కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి కుమారుడు కార్తీక్ తమ నాన్నగారి మిత్రులకు, శ్రేయోభిలాషులకు కాస్సేపటిక్రితం ఈమెయిల్ ద్వారా కింది సమాచారం పంపారు. వారు పంపిన ఇంగ్లీష్ ఇమెయిల్ పాఠాన్ని ఇక్కడ చూడవచ్చు.

Sad demise – Kodavatiganti Rohiniprasad

Dear Friends

It is with deep sorrow that I inform you of the passing of my father, Dr Kodavatiganti Rohiniprasad, yesterday afternoon in Mumbai. He had been ill for a brief while and was hospitalised during his last days.

His well wishers can pay their last respects tomorrow morning (10th Sep) between 9AM – 10.30 AM at Lloyds Estate, Wadala East, Mumbai. Thereafter he will be taken to Grant Medical College where his body will be donated for medical study and research, as per his wish.

On behalf of our family I would like to thank you all for your support to my father. He thoroughly enjoyed his interactions with you all and believed that it enriched him.

I think I can say on behalf of you all that a person of his caliber – Writer, Musician, Scientist and Rational Thinker – may not be found for a long time to come.

Once again, we sincerely thank you for being well wishers of my father and our family.

Best Regards,

Karthik Kodavatiganti
2303-D, Lloyds Estate,
Wadala East
Mumbai 400037
Mobile: +91-98190-44855
Home: +91-22-2414-3274

Email: k_karthik@outlook.com

RTS Perm Link