కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు ఇకలేరు.

September 8th, 2012

ఇప్పుడే అందిన దుర్వార్త.

అణుధార్మిక శాస్త్రవేత్త, శాస్త్ర, సంగీత, సాహిత్య రంగాలలో సుపరిచితులు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు కాసేపటికి ముందు కన్నుమూశారని ఇప్పుడే తెలిసింది. గత పది రోజులుగా అస్వస్థులై ముంబైలో జెస్లోక్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ శనివారం మధ్యాహ్నమే కన్నుమూశారని విశ్వసనీయంగా తెలిసింది. -ఉదయం 11 గంటలకు పోయారని నిర్ధారించబడింది-  దీర్ఘకాలంగా డయాబెటిక్‌తో ఇబ్బందిపడుతున్న ప్రసాద్ గారికి గత కొద్ది రోజులుగా కిడ్నీ సమస్య తీవ్రమై కోలుకోలేకపోయారు. ఈరోజు ఉదయమే ఆయనకు అమర్చిన వెంటిలేటర్ తీసివేశారని తెలుస్తోంది.

సరిగ్గా రెండువారాలకు ముందు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన్ను కలిసే అవకాశం కొద్దిలో తప్పిపోయింది. ప్రత్యక్షంగా చూడలేకపోయినప్పటికీ, గత మూడు సంవత్సరాలుగా ఆయనతో నాకు వ్యక్తిగతంగా, భావజాల పరంగా కూడా అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. చందమామ కథలకు ఆర్నెల్లపాటు ఆయన చక్కటి అనువాదాలను విస్తృత స్థాయిలో చేశారు కూడా. చివరి దశలో చందమామకు కథలు, సైన్స్ రచనలు పంపారు.

శాస్త్రరంగంలో తాజా ఆవిష్కరణలు, శాస్త్ర భావనల గురించి 50 పుస్తకాలు రాయాలని ఆయన సంకల్పించారు. గత రెండేళ్లుగా ‘విశ్వాంతరాళం’, మానవ పరిణామం, ‘జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం’, జీవకణాలు -నాడీ కణాలు, ప్రకృతి పర్యావరణం, ‘అణువులు’, ‘దేవుడు చేసిన మనుషులు’ వంటి ఎనిమిది పాపులర్ సైన్స్ పుస్తకాలు రాశారు. ఇవి సంచలన విజయం సాధించాయి కూడా. కొన్ని రచనలు మూడు నాలుగు ముద్రణలు కూడా పొందాయి.

వివిధ పత్రికలు, ఆన్‌లైన్ మీడియాకు గత అయిదారేళ్లుగా ఈయన విస్తృతంగా రచనలు పంపుతున్నారు. సైన్స్, సంగీతం, సాహిత్యం మూడింటిలోనూ ప్రావీణ్యత సాధించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.

ఆయన గురించి మరిన్ని వివరాలు త్వరలో…

శాస్త్ర విషయాలపై ఆయన రాసిన గొప్ప రచనలలో ఒకటి ఇక్కడ చూడండి.

చావుపుటకలు – డా.కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

http://prajakala.org/mag/2008/02/krp_feb_essay

 

RTS Perm Link


4 Responses to “కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు ఇకలేరు.”

 1. anwar on September 8, 2012 12:33 PM

  అయ్యో!!

 2. Prasad on September 8, 2012 11:46 PM

  నాకు ఈ మెయిల్ ద్వారా కొంచెం పరిచయం. ఆయన రచనల లో కొ.కు గారి శాస్త్రీయ దృక్పధం కొట్టొచ్చినట్లు కనపడేది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

 3. వేణు on September 9, 2012 6:11 AM

  రోహిణీ ప్రసాద్ గారు ఇంత హఠాత్తుగా నిష్క్రమించటం అనూహ్యం, జీర్ణించుకోలేని వాస్తవం!
  ‘ఈమాట’లోని ప్రసిద్ధ వ్యాసం ‘చందమామ జ్ఞాపకాలు’ ద్వారానే రోహిణీప్రసాద్ గారితో పరోక్ష పరిచయం మొదలైంది. తర్వాత మెయిల్సూ, ఫోన్లూ.

  ఆయన రాతల వల్లనే ఎం.టి.వి. ఆచార్య గారి గురించి తెలిసింది. అలాగే దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రతిభావిశేషాలను గురించి తెలిసింది. అందువల్లనే విజయవాడలో సుబ్రహ్మణ్యం గారిని కలుసుకోగలిగాను. రోహిణీ ప్రసాద్ గారిని మాత్రం ముఖాముఖీ కలుసుకోలేకపోయాను. ఇది తీరని లోటు. ఆయన హైదరాబాద్ షిఫ్టయ్యాక కలుసుకునే అవకాశం రెండుసార్లు వచ్చి చేజారిపోయింది!

  ఆన్ లైన్ లో ఆడియో, వీడియోతో చెప్పగలిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని వీలైనంతగా వినియోగించుకోవాలని రోహిణీ ప్రసాద్ గారు చెప్పేవారు. ఆయన దాన్ని పాటించి మార్గదర్శకులయ్యారు.

  శాస్త్రీయ అంశాలను హేతువాద దృక్పథంతో సరళంగా, ఆత్మీయమైన శైలిలో వివరించటంలో ఆయన కొ.కు.ను గుర్తుకుతెస్తారు!

 4. నింగి కెగసిన తార రోహిణి « వసుంధర అక్షరజాలం on September 12, 2012 12:34 AM

  […] ఆ విషాదవార్తకు విచలితులైనవారు ఒకరా, ఇద్దరా, ఎందరో! ఈ సందర్భంగా వారి గురించిన […]

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind