కోట్లమంది కంట కన్నీరు… “బొమ్మరిల్లు”

August 26th, 2012

బొమ్మరిల్లు బాస్కర్ గారూ,
నమస్కారం,

ఈ రోజు ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో “నన్ను మార్చింది మా నాన్న కన్నీరే” శీర్షికతో వచ్చిన మీ ఇంటర్ప్యూ చూశాను. 35 ఏళ్ల ముందటి నా బాల్య జ్ఞాపకాలను మళ్లీ తట్టిలేపారు మీరు. పుస్తకాల విషయంలో సరిగ్గా నాలాగే ఉన్నారు మీరు. ఇంట్లో, లైబ్రరీలో పుస్తకాలు చదవటం అయిపోతే, రోడ్డుమీద నడుస్తూ దార్లో కిందపడిపోయి ఉన్న కాగితం ముక్కలో ఏముందోనని తీసుకుని చదివిన బాల్యం నాది కూడా.

చిన్నప్పుడు మా నాన్న చందమామ పత్రికను తీసుకొచ్చి,’ జ్ఞానం వస్తుంది చదవండిరా!’ అన్నారు. జ్ఞానం వచ్చిందో లేదో తెలియదు కాని వందల వేల పుస్తకాలను ఆబగా చదివేసిన అపురూప బాల్యం మాత్రం నా స్వంతమైంది. 35 సంవత్సరాల క్రితం చందమామ నా బాల్యాన్ని ఆడిస్తే ప్రస్తుతం అదే చందమామలో తెలుగు అసోసియేట్ ఎడిటర్‌‌గా పనిచేస్తున్నాను. నా చందమామ బాల్యానికి, ప్రస్తుతం దాంట్లోనే నా పనికి ఎంత కో ఇన్సిడెన్స్ ఉందో చూడండి. -కాని మరో పది రోజుల్లో చందమామ నుంచి బయటపడవలసిన పరిస్థితి.-

నాన్న కన్నీరు మీ జీవితాన్ని మార్చింది. అది బొమ్మరిల్లయి కోట్లాది తెలుగువారి హృదయాల్లో కన్నీరొలికించింది. ఒక కమర్షియల్ దర్శకుడికి జీవితంలో ఇంతకు మించి ఏం కావాలి?

1980ల మొదట్లో రాయచోటి పట్టణంలో శంకరాభరణం సినిమాను 13 సార్లు చూసి -అదే మొదటి సారి చివరిసారి కూడా-  ‘దొరకునా ఇటువంటి సేవ’ పాట వింటూ, చూస్తూ 13 సార్లూ ధియేటర్లోనే ఏడ్చిన అనుబవం నాది. ఇప్పటికీ ఈ పాటను లేదా సినిమాను చూస్తే కన్నీళ్లు అలాగే ఒలికిపోతాయి నాకు. (ఆ సినిమా సారాంశంతో నేను ఏకీభవించినా ఏకీభవించకున్నా..)

బాలచందర్ గారి ‘ఆకలిరాజ్యం’ సినిమాలో కమల్ హసన్ తన ప్రియురాలు కూడా దూరమవుతున్న విపత్కర క్షణంలో పాడుకున్న శ్రీశ్రీ గీతం ‘ఏదిసత్యం ఏదసత్యం ఓ మహాత్మా, ఓ మహర్షీ’ ని వింటూ బావురుమని విలపించడం కూడా మర్చిపోలేను నేటికీ. ఇప్పటికీ ఆ గీతం విన్నా, చూసినా అదే ఏడుపు. విషాదం సామాజికరూపం తీసుకున్నప్పుడు మనుషుల ఉద్వేగాలను అమాంతం తట్టిలేపే కమనీయ దృశ్యమిది.

తర్వాత అన్నమయ్య సినిమాలో ‘అంతర్యామీ.. అలసితీ..’ అనే చివర్లో వచ్చే పాట అలాగే ఏడిపించిది. ఇప్పటికీ అది నన్ను ఏడిపిస్తోనే ఉంది. భక్తిసాహిత్య చరిత్రలో మనకాలంలో వచ్చిన అద్వితీయ రచన ఇది.

ఆ తర్వాత మీ బొమ్మరిల్లు.. ‘మొత్తం మీరే చేశారు’ అంటూ సిద్ధూ తండ్రిపై చేసిన ఆరోపణ.. కోట్లమంది యువతరాన్నే కాదు తల్లిదండ్రులనే కాదు. ఒక సమకాలీన సమాజాన్నే తీవ్రంగా కదిలించివేసింది. పిల్లలు ఏం తినాలి, ఏం చూడాలి, ఏం చదవాలి, ఎవరిని ప్రేమించాలి, ఎవరిని చేసుకోవాలి అనే సమస్త అశాలనూ తల్లిదండ్రులే నిర్దేశిస్తున్న, శాసిస్తున్న సమాజానికి సిద్ధూ ఆక్రోశం ఒక పొలికేకలా తగిలింది.

అడుగడుగునా పిల్లల బాల్యం ఖండితమవుతోదిక్కడ. పిల్లల ఇష్టాలు ఖండితమైపోతున్నాయి. వాళ్ల ఉద్వేగాలు, భావాలు సమస్తమూ ఖండించబడుతున్నాయిక్కడ

ఖండిత భావాలు, ఖండిత ఆలోచనలు, ఖండిత ఇష్టాలు, ఖండిత ఉద్వేగాలు… ఇలా బాల్యం బాల్యమే ఖండించబడుతున్న సమాజానికి బొమ్మరిల్లు సినిమా ఒక మేలుకొలుపు అయింది కాబట్టే తెలుగు సమాజం ఆ సినిమాలో తనను తాను పోల్చుకుంది.

నాన్న కన్నీరు మిమ్మల్ని మారిస్తే, బొమ్మరిల్లు సినిమాలో ఆ ఒక్క సంభాషణతో కోట్లమందికి కన్నీరు తెప్పించారు.

బొమ్మరిల్లు ధనికవర్గ జీవితానికి పట్టం కట్టి ఉండవచ్చు…. టేకిట్ ఈజీ అనే మన కాలపు తారకమంత్రాన్ని అది దృశ్యరూపంలోకి మార్చి ఉండవచ్చు..

కాని అది కోట్ల హృదయాలను ఒక్క సింగిల్ డైలాగ్‌తో ఊగించింది. బాల్యం అనే ఖండిత జ్ఞాపకాలకు, పిల్లల బాధలకు, ఆరాటాలకు ఆక్రోశాలకు శ్వాసగా, ప్రతిరూపంగా మారింది.

ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా కళను దీప్తిమంతం చేసిన డైలాగ్ అది.

అందుకే మీరు నిలిచిపోయారు. తెలుగు సినీ ప్రేమికుల హృదయాల్లో శాశ్వతంగా నిల్చిపోయారు. సమకాలీన ప్రపంచం గుండెల్లో బొమ్మరిల్లు కట్టుకుని ఉండిపోయారు. బొమ్మరిల్లు ముందూ, తర్వాతా మీకు మరేమీ లేదన్నంతగా ఈ తరం జ్ఞాపకాల్లో మిగిలిపోయారు.

బొమ్మరిల్లు భాస్కర్ గారూ! ఈ ఆదివారం ఒక కమ్మటి జ్ఞాపకాన్ని మళ్లీ గుర్తుచేసి చెమ్మగిల్లజేసినందుకు మీకు మనఃపూర్వక కృతజ్ఞతలు..

మీకు యూనికోడ్ గౌతమి ఫాంట్‌లోని ఈ తెలుగు ఇమెయిల్ అందుతుందో లేదో, బిజీ షెడ్యూల్‌లో మీరు ఈమెయిల్స్‌ చూడగలరో లేదో తెలియదు.
అందుకే నా చందమామలు బ్లాగులో కూడా నా ఈ స్పందనను ప్రచురిస్తున్నాను.

కోట్లమంది కంట కన్నీరు… “బొమ్మరిల్లు”

blaagu.com/chandamamalu

రాజశేఖర రాజు.
చందమామ
7305018409

 

బాల్యం ఖండించబడుతుండటానికి సంబంధించి నా మరో బ్లాగులో కింది కథనం గతంలో ప్రచురించాను. వీలయితే చూడండి.

పాలు ఒలికిపోయినప్పుడు

http://kanthisena.blogspot.in/2010/12/blog-post_1521.html

 

RTS Perm Link


3 Responses to “కోట్లమంది కంట కన్నీరు… “బొమ్మరిల్లు””

 1. SKY on August 26, 2012 2:55 AM

  అందరి బాల్యమూ చందమామ కథల్లాగా ఆహ్లాదంగా, ఆనందంగా సాగిపోయి ఉంటే ఎంత బాగుండు…

 2. chandamama on August 26, 2012 5:38 AM

  SKY గారు,

  అద్భుతమైన ఊహ. చందమామ కథల్లాంటి అందమైన బాల్యం… కానీ.. జీవితం ఆలాగే సాగదు కదండీ..

  ధన్యవాదాలు.

 3. DR.G.V.KRISHNAIAH on September 5, 2012 12:21 PM

  వినయక ఉత్సవాలు – ప్రజల ఇబ్బందులు :- వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నతీరువల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు అందరికీ తెలిసిందే. భక్తిపూరితమైన వాతావరణంకన్నా యువతకు ఇది తాగి సరదాగా అనుభవించే ఒక సందర్భంగా రూపొందింది . దభాయించి బలవంతంగా వసూళ్ళు చేసే దుస్సాంప్రదాయం సమాజంలొకి ప్రభలంగా వచ్చింది . రొడ్డుకు అడ్డంగ అవరొదాలు సౄష్టించడాన్ని, మైకులుపెట్టి రొజులుతరబడి ప్రజలను తిప్పలుపెట్టడం ఎంతవరకు సమంజసం. విగ్రహాల్ని నిమజ్జనంచెసి ప్రమాదకరమైన రసాయనాలతొ మన నీటివనరులను కలుషితం చేయడాన్ని నిరొధించి ప్రజల ఆరొగ్యాన్ని కాపాడమంటున్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసి రంగుబొమ్మల గురించి ఆలోచించమంటున్నాం. ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక ప్రదర్సనల పేరుతో సాంస్కృతిక విలువల నిమజ్జనం గురించి ఆలోచించమంటున్నాం . మన యువతను పెడదారి పట్టించకుండా వారికి మంచి పద్దతులు నేర్పమనీ పెద్దలందరినీ,మంచి మనసున్న వారందరినీ కోరుతున్నాం. పై అభిప్రాయలతో ఎకీభవించేవరూ , లౌకిక విలువలపట్ల నమ్మకమున్నవారూ , అభ్యుదయవాదులూ, ప్రజాస్వామ్యవాదులూ ,పర్యావరణ స్పృహకలవారూ, వామపక్ష విప్లవ భావజాలం కలవారూ, తార్కిక దృస్టికలవారూ,జోక్యం చేసుకోవాల్సిన సందర్భంగా గుర్తించి, స్పందించి మా ఆలోచనలో ఆవేదనలో బాగం పంచుకోవల్సినదిగా విజ్ఙప్తి చేస్తున్నాం…. దా// జి.వి.కృష్ణయ్య . కొత్తపట్నం, ప్రకాశం జిల్లా. 9866381977 mail: drgvkrishnaiahkp@gmail.com

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind