చందమామ శంకర్ గారికి 89 వసంతాలు..

July 17th, 2012

ఇవాళ్టితో చందమామ దిగ్గజ చిత్రకారులు శంకర్ గారికి 89 ఏళ్లు.

ఆయనకు ఫేస్‌బుక్ వంటి సాంకేతిక విప్లవాలతో సంబంధం లేదు కాబట్టి, పుట్టినరోజు వంటి ఆధునిక అలవాట్లలో పాలు పంచుకోవడం తెలీదు కాబట్టి చందమామలో పనిచేసేవారికి కూడా ముందస్తు సమాచారం తెలీదు. తీరా ఉదయం ఆఫీసుకు వచ్చిన గంట సేపటి తర్వాత ఆయన నుంచి యధాప్రకారంగా చందమామ లో పనిచేసే ‘పిల్లలందరికీ’ స్వీట్స్ అందాయి. ఆఫీసుకు వచ్చి పనిచేసేటప్పుడు ఆయన సాయంత్రం పూట చాక్లెట్ చప్పరిస్తూ పక్కనున్న వారికి కూడా తలొకటి అందించడం తనతో కలిసి పనిచేసేవారందరికీ అపురూపమైన అంశం కాగా, ఇంటినుంచి పని చేస్తూ కూడా, ఈరోజున తనకూ చందమామకు ఉన్న దశాబ్దాల బంధాన్ని గుర్తు చేస్తూ అయన ఆఫీసుకు మర్చిపోకుండా చాక్లెట్ పంపారు.

యాజమాన్యం ఆయనతో ఇవ్వాళ మాట్లాడి ఆశీస్సులు తీసుకోవడమే గాకుండా, ఆయనకు పండ్లు, తీపి పదార్థాలు పంపారు.

పుట్టినరోజు అనేది ఆయనకు అంతగా పట్టింపు లేని ఘటనే అయినప్పటికీ ఈ రోజు సందర్భంగా చందమామను పరామర్శించడం, అందరితో మాట్లాడటం ఆయనకు చిరకాలంగా అలవాటు. బాగున్నారు కదా అనే పలకరింపుతో మొదలై అరవైఏళ్ల అనుభవాలను ఆయన పంచుకుంటుంటే చెవులు రిక్కించి అలా వింటూ పోవటం మాకందరికీ అలవాటు.

రాజకుమారి చిత్రం గీసినా, నెమలి బొమ్మ గీసినా, ఫుల్ పేజీలో డేగ బొమ్మ గీసినా 90 ఏళ్ల వయసులో కూడా ఆయన కుంచె కాదు కాదు.. ఆయన కలానికి మాత్రం వృద్ధాప్యం తెలియదు. ఆయన గత సంవత్సరం డిసెంబర్ నెల బేతాళ కథ ‘అమృతవర్షిణి నిర్ణయం’ కు గీసిన చిత్రాలు కొన్ని ఇక్కడ చూస్తే ఆయన కలం గొప్పదనం అర్థమవుతుంది. ఒక చిన్న స్పేస్‌లో ఎన్ని వివరాలను బొమ్మలో చూపుతారో మళ్లీ ఆ బొమ్మ ఎంత ప్లెయిన్‌గా ఉంటుందో చూడాలంటే శంకర్ గారి చిత్రాలు తప్పక చూడాల్సిందే.

మాష్టారు గారూ! మీకు నిండు నూరేళ్లు… మీతో ఎప్పుడూ చెప్పేమాటే ఇప్పుడు కూడా… మీరు చల్లగుంటే మేమూ -చందమామలో- చల్లగుంటాము.

ఆయన గత సంవత్సర కాలంగా చందమామ పనిమీద ఫోన్‌లో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయన చెప్పిన జీవితానుభవాలను కొన్నింటిని ఇక్కడ చూడండి.

“స్టోరీస్ రీటోల్డ్ అని కథల గురించి చెబుతుంటారు. కాని చందమామ కథలు స్టోరీస్ రీటోల్డ్ రకం కాదు. అవి స్టోరీస్ ఆఫ్ రీబర్త్ వంటివి. చందమామ నిజంగానే అనేక కథలకు పునర్జన్మ నిచ్చింది. పశుల కాపరి వెదురు బొంగులో దాచుకుని మరీ చదువుకునేటటువంటి ఆసక్తికరమైన కథలకు చందమామ తిరిగి జన్మనిచ్చింది.”

“చందమామ ఈజ్ నాట్ ఎ కమ్మోడిటీ. హౌ కెన్ వియ్ గెస్ హై ప్రాపిట్స్ ప్రమ్ చందమామ. మేగజైన్ అంటే నీ బిడ్డలాంటిది. నీ బిడ్డను నిన్ను ఎలా పోషిస్తావో, దాన్ని అలా పోషించుకోవాలి.”

చందమామ నన్ను  బిడ్డలా పెంచింది. నేను దాన్ని పెంచాను అనుకుంటున్నాను. దానికి నేను రుణపడి ఉన్నాను. అనేది శంకర్ గారు ఎప్పుడూ తల్చుకునే మాట. అందుకే ఎంత మంది తమ వద్దకు వచ్చి పనిచేయమని కోరినా ఆయన ప్రలోభ పడలేదు. 1980లలో శంకర్ గారికి చందమామలో నెలజీతం వెయ్యి రూపాయలట. అప్పట్లోనే పూణేకి చెందిన ఒక ప్రముఖ పబ్లిషింగ్ హౌస్ ఆయనకు బంఫర్ ఆఫర్ లాంటిది ఇచ్చిందట. మీకు సెపరేట్‌గా రూము, బోర్డింగ్, లాడ్జింగ్‌తో సహా అన్ని సౌకర్యాలను కల్పించి నెలకు 3 వేల రూపాయల జీతం కూడా ఇస్తామని వారు ఆహ్వానించినా ఈయన చలించలేదు.

‘”రాముడికి ఒకే మాట ఒకే బాణం అనే చందాన జీవితంలో ఒకే పత్రికలో, ఒకే యాజమాన్యం కింద నేను పనిచేసాను., అదీ చందమామలో పనిచేశాను.. జీవితమంతా పనిచేసాను. ఈ సంతోషం చాలు నాకు. డబ్బు కోసం నేను పనిచేయలేదు. డబ్బు చూసి కూడా పనిచేయలేదు. సంస్థను విడవకుండా, మారకుండా పని చేయవచ్చని జీవితమంతా ఒకే చోట పనిచేయవచ్చని చందమామ నిరూపించింది. దానికి నేనే సాక్ష్యం.’ అంటారు శంకర్ గారు.

దక్షిణ చిత్ర వారు ఈమధ్య శంకర్ గారి బేతాళ కథల బొమ్మలను పెద్ద సైజులో మద్రాసులో మాయాజాల్ భవనం పక్క భవంతిలో పెట్టి ప్రదర్సించారు. శంకర్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆయనతో బేతాళ కథల చిత్రాల నేపధ్యం చెప్పించుకని పరవశించారు అక్కడికి వచ్చిన పిల్లలూ, పెద్దలూ.

దశాబ్దాలుగా తను గీస్తూ వచ్చిన బేతాళ బొమ్మలు భారీ సైజులో అక్కడ కనిపించేసరికి ఆయన మహదానందపడ్డారు. దక్షిణ చిత్ర నిర్వాహకులు ముందే చందమామను సంప్రదించి బేతాళ కథల ఒరిజనల్ శాంపుల్ చిత్రాలను అడిగి తీసుకోవడంతో ఆ కార్యక్రమానికి నిండుతనం చేకూరింది.

ఆ ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు పిల్లలు, పెద్దలు అందరూ ఆయన చుట్టూ మూగిపోయారట. ‘బేతాళ కథ బొమ్మలు గీయడంలో మీకు ఎవరు ఇన్‌స్పిరేషన్ అని అందరూ అడిగారట. కథకు తగిన బొమ్మ మీకు ఎలా స్ట్రయిక్ అవుతుంది. ఆ రహస్యం చెప్పండి’ అంటూ కోరారట.

చాలా సింపుల్‌గా సమాధానమిచ్చారాయన. ‘బొమ్మకు కథ ప్రాణం. కథ బాగా నడిచిందంటే సగం బొమ్మ అప్పుడే పూర్తయిపోయినట్లే. ఒకటికి రెండు సార్లు కథ చదువుతాను. తర్వాత కథతో పాటు చందమామ సంపాదకులు పంపించిన బొమ్మల వివరణ -ఇమేజ్ డిస్క్రిప్షన్- కూడా చూస్తాను. ఆవివరణకు తగినవిధంగా మనసులోనే బొమ్మ తయారయిపోతుంది. అన్నిటికంటే మించి చందమామకు బొమ్మ గీస్తున్నప్పుడు దేవుడు నన్ను ఆదేశించినట్లే ఉంటుంది నాకు. ఎందుకంటే ఆయన కదా నన్ను చందమామకు రమ్మని పిలిచింది. ఆయన కదా నన్ను తన బొమ్మలు వేయమని అడిగింది. ఇదే నా బొమ్మల రహస్యం’ అనేశారట ఆయన.

తనముందు నిలువెత్తు బేతాళ బొమ్మల చిత్రాల ప్రదర్శనను చూసిన ఆయన ఈ ప్రదర్శనపై అబిప్రాయాన్ని నిర్వాహకులు అడిగినప్పుడు ఒకే మాట అన్నారట. ‘వీటిని చూస్తుంటే నా వయస్సు ఒక్కసారిగా పదేళ్లు తగ్గిపోయినట్లనిపిస్తోంది.’

ఆయన మాటలు వింటున్న వారు మొత్తంగా కదిలిపోయారు. ఆ భవంతిలోని ఆ పెద్ద గది మొత్తంలో మౌన  ప్రశాంతత.

మద్రాసులో కొత్తగా ఆర్ట్స్ స్కూల్స్‌లో కోర్సులు చదువుతున్న పిల్లలు ఈ ప్రదర్శనకు వచ్చారు. ఆయన చుట్టూ మూగి ప్రశ్నలు సంధించారు. ‘ఈ కోర్సు పూర్తయిన తర్వాత మాకు ఉద్యోగావకాశాలు ఉంటాయా? చిత్రలేఖనాన్నే కెరీర్‌గా మార్చుకోవచ్చా?’ అని అడిగారు వారు. ఆయన ఇచ్చిన సమాధానం హృద్యంగా ఉంది.

‘పది నెలల తర్వాతే కదా బిడ్డ వస్తుంది. వెంటనే బొమ్మలు వేసేయాలి. పెద్ద జీతం పెద్ద ఉద్యోగం రావాలి అనుకుంటే ఎలా. మీరు ప్రతిఫలం ఆశించకుండా కృషి చేయండి సంవత్సరం, అయిదేళ్లు, పదేళ్లు మీకు మెచూరిటీ వచ్చేంతవరకు బొమ్మలు గీస్తూ పోండి. మీరు నమ్మి ఒక పని చేస్తే అది మీకు తప్పకుడా మేలు చేస్తుంది. ప్రతిఫలం ఇస్తుంది.’

‘మీరు పిల్లలు. మీముందు చాలా అవకాశాలు ఉన్నాయి. మంచి జీవితం దొరకదేమో అని భయపడవద్దు. మీలో వర్త్ ఉంటే ప్రపంచం మిమ్మల్ని ఎప్పటికైనా గుర్తిస్తుంది’ అని శంకర్ గారు వారికి సలహా ఇచ్చారు.

‘ఇన్ని సంవత్సరాలు బొమ్మలు వేశారు కదా మీకు విసుగు పుట్టలేదా అనడుగుతారు. పని మీద శ్రద్ద ఉంటే అది నా పని అనుకుంటే విసుగు ఎందుకొస్తుంది అన్నది నా ప్రశ్న’ ఇదీ ఆయన జీవన తాత్వికత.

శ్రీనివాస్ అని శంకర్ గారి బ్యాచ్‌లో పైన్ ఆర్ట్స్ కోర్స్ పూర్తి చేశారు. కాని ఆ రంగంలో ఇమడలేక తర్వాత మేస్త్రీ పనిలోకి దిగి దాంట్లోనే స్థిరపడిపోయారు. చాన్నాళ్ల తర్వాత ఆయన శంకర్ గారిని కలిసినప్పుడు ‘ఎప్పుడూ బొమ్మలేనా దాంట్లోంచి బయటకు రాలేవా’ అంటూ ఎకసెక్కాలాడారట మిత్రుడు.

‘నీకు బొమ్మల పిచ్చిరా’ అని మిత్రుడు అంటే ‘నీకు మేస్త్రీ పని పిచ్చిరా మరి!’ అన్నారట శంకర్ గారు. ‘నువ్వు జీవితమంతా తాపీ పని చేస్తూ నన్ను మాత్రం బొమ్మలు వేసే పని మానమంటావేంరా’ అని ఈయనా దెప్పిపొడిచారట.

తనతో పాటు ఆర్ట్స్ స్కూల్‌లో చదువుకున్న మిత్రులు చాలామంది చిత్రలేఖన రంగంలో ఇమడలేక ఇతర వృత్తులు చేపట్టారట. వీటిలో ఇదొక ఉదాహరణ.

(తమిళ చిత్ర హీరో సూర్య తండ్రి, అలనాటి తమిళ సినీ హీరో శివకుమార్ గారు ఇటీవలే శంకర్ గారి ఇంటికి వెళ్లి తాను చిత్రలేఖనం నుంచి నటనలోకి ఎలా జంప్ అయ్యారో చెప్పి నవ్వించారట. డబ్బులొచ్చే మార్గం బొమ్మల్లో కనబడలేదు కాబట్టే ముందస్తుగానే నేను తప్పుకుని నటనలోకి వెళ్లిపోయానని చెప్పారట. ప్రపంచమంతా డబ్బు మార్గమే చూడండి అంటూ ఈయన నవ్వడం ఫోన్‌లో..)

“గాడ్ విల్ బి యువర్ సైడ్ వెన్ యు పుట్ ఎపర్ట్ ఇన్ యువర్ వర్క్.”

‘దైవం మానుషరూపేణా’ అంటూ దైవం మనిషిరూపంలో వస్తాడనే మన పెద్దవారు అన్నారే తప్ప దైవం దైవం రూపంలో వస్తాడని ఎక్కడా చెప్పలేదు. మనుషుల్లోనే దేవుడున్నాడు. వారి పనిలో దేవుడున్నాడు. ఆ పనిని నీవు చిత్తశుద్దితో చేస్తే చాలు. అదే దేవుడికి నీవు అర్పించే నిజమైన పూజ. సేవ కూడా.

ఇది శంకర్ గారు గత 60 ఏళ్లుగా స్మరిస్తున్న మంత్రవ్యాక్యం.

Sri. K.C.Sivasankaran
(Chandamama Sr. Artist)
F2. Santham Apartments
No.46, Venkatesh Nagar Main Road
Virugambakkam
Chennai – 600092
Ph.044-64508610

 

గత సంవత్సరం హిందూ పత్రికలో చందమామ శంకర్ గారిపై వచ్చిన విశేష కథనం లింక్ ఇక్కడ చూడండి

Vikram, Vetala and Sankar

Bishwanath Ghosh

November 9, 2011 (in online. Aricle published in the hindu metro plus in 10-11-2011

http://www.thehindu.com/life-and-style/metroplus/article2611627.ece?homepage=true

గమనిక: శంకర్ గారి జన్మదినంకి సంబంధించి చిన్న సవరణ. ఆయనకు ఇప్పుడు 87 సంవత్సరాలు నిండి 88వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. స్వయంగా ఆయనను అడిగి నిర్ధారించుకున్న తర్వాతే ఆయన జన్మ సంవత్సరానికి సవరణను ఇక్కడ పొందుపర్చడమైనది. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు.


RTS Perm Link


2 Responses to “చందమామ శంకర్ గారికి 89 వసంతాలు..”

  1. SriRam on July 19, 2012 1:55 PM

    ఇటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. శ్రీ శంకర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

  2. chandamama on July 20, 2012 11:49 AM

    శ్రీరామ్ గారూ,
    ఆలస్యంగా మీ వ్యాఖ్య చూశాను. శంకర్ గారికి మీరు పంపిన శుభాకాంక్షల గురించి చెబుతాను. ధన్యవాదాలు.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind