దైవకణాలా? దైవ ధిక్కార కణాలా?

July 4th, 2012

మూడే్ళ్ల అనంతరం దైవకణాల గుట్టు గురించి మళ్లీ వార్తలు వస్తున్నాయి.

I think we have it. You agree

అంటూ ఈ బుధవారం ఉదయం సెర్న్ డైరెక్టర్ జనరల్ రాల్ఫ్ హ్యూయర్, ‘దైవకణాలు’ అని పేరొందిన హిగ్స్ బోసోన్‌ ఉనికి నిర్ధారించబడినట్లు ప్రకటించి విజ్ఞాన శాస్త్రంలో పెను సంచలనం రేపారు.

God Particle Found Historic Milestone From Higgs Boson Hunters

కాని ‘దైవకణాలు’ అనే పదబంధమే ఇటీవలి చరిత్రలో అత్యంత వక్రీకరించబడిన భావనగా నిలిచిపోయింది. దైవ ‘ధిక్కార’ కణాలను దైవ కణాలుగా తారుమారు చేసి నిలిపిన ఈ ‘దైవకణాల’ వెనుక చరిత్రను మిత్రులు, వెన్నెలకంటి రామారావు గారు మూడున్నర ఏళ్ల క్రితమే “‘దైవ’ కణాల మహాన్వేషణ” అనే కింది వ్యాసంలో సుస్పష్టంగా వివరించారు.

ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ విభాగంలో పనిచేస్తున్న రామారావు గారి ఆమోదంతో తాను గతంలో రాసిన ఈ బృహత్ వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాను.

‘దైవ’ కణాల మహాన్వేషణ
ఏమిటి? ఎలా? ఎందుకు? అనే ప్రశ్నలు మానవ మస్తిష్కాల్ని సహస్రాబ్దాల తరబడి నిరంతరాయంగా తొలుస్తూనే ఉన్నాయి. తన గురించి, తానున్న ప్రపంచం గురించి, ఆ ప్రపంచంలో తన స్థానం గురించి నిరంతరాయమైన అన్వేషణ, పర్యవసానంగా విశ్వం ఆవిర్భావానికి చెందిన పలు నమూనాలను మానవులు సృష్టించుకున్నారు. అర్థం కాని అంశాలను విశ్వాసాలతో భర్తీ చేసుకుంటూ, ప్రకృతితో చేసే అస్తిత్వ పోరాటంలో ఆత్మవిశ్వాసం కోసం ‘దైవ’ భావనను సృష్టించుకున్నారు. సూక్ష్మ, స్థూల ప్రపంచాల అంతస్సారం మనిషికి మరింతగా అవగతమయ్యే కొద్దీ మరిన్ని శాస్త్రీయమైన, విప్లవాత్మకమైన విశ్వనమూనాలు ఉనికిలోకి వచ్చాయి.

విశ్వాసం నుంచి విజ్ఞానానికి మనిషి చేస్తున్న అనంతమైన గ్రహణ క్రమమే ఈ అన్వేషణ. అణువులు, పరమాణువులు, ఎలక్ట్రాన్-ప్రొటానుల్లాంటి ప్రాథమిక కణాలు, క్వార్క్‌లు వరుసగా విశ్వ నిర్మాణపు మౌలిక ప్రాథమిక కణాల భావనలు వచ్చాయి. వస్తూనే ఉంటాయి.. ఈ అన్వేషణ ఇంతటితో ఆగిపోయిందనడానికి లేదు. అంకెల్ని లెక్కించడం ఎలా అనంతమో, సత్యాన్వేషణ కూడా ఒక అనంత పరిణామ క్రమం ఈ క్రమంలో బిగ్‌బ్యాంగ్ విశ్వావిర్భావ సిద్ధాంతం, తొలి విశ్వ పదార్థమైన ‘హిగ్స్ బోసాన్’ భావనలు ఆవిర్భవించాయి. అణువు నుంచి బ్రహ్మాండ గోళాల ఆవిర్భావానికి ఈ హిగ్స్ బోసాన్‌లే ప్రాణం. అందుకే వీటికి ‘దైవకణాల’ని  పేరొచ్చింది. వీటి కోసమే ఈ మహాన్వేషణ.

***************

ప్రకృతి రహస్యాలను ఛేదించేందుకు మనిషి బహుముఖంగా కృషి చేస్తూనే ఉన్నాడు. విశ్వ రహస్యాలను శోధించే లక్ష్యంతో ప్రపంచంలో కెల్లా అతి పెద్ద పార్టికల్ యాక్సిలరేటర్ (కణవేగవర్ధక పరికరం) లార్జ్ హెడ్రాన్ కొల్లాయిడర్ – ఎల్‌హెచ్‌సి- ని యూరోపియన్ యూనియన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాకు సమీపంలో, ఫ్రాన్స్ సరిహద్దున కణ-భౌతిక శాస్త్ర ప్రయోగశాల కేంద్రంగా 27 కిలోమీటర్ల చుట్టు కొలతతో కూడిన ఎల్‌హెచ్‌సి నిర్మాణం జరిగింది. 2008 సెప్టెంబర్ 10న యాక్సిలేటర్ ప్రయోగం ప్రారంభంలోనే విఫలమైంది. అయస్కాంతాల చుట్టూతా ఏర్పాటు చేసిన ద్రవ  హీలియం కారిపోవడంతో ప్రయోగాన్ని అర్థాంతరంగా నిలిపివేయవలసి వచ్చింది.

దాదాపు ఏడాది కాలంపాటు దానికి మరమ్మత్తు పనులు జరిగాయి. ఈ పరికరంలో కాంతివేగంతో ప్రోటాన్ కణపుంజాలను విజయవంతంగా సృష్టించినట్లు సెర్న్ శాస్త్రవేత్తలు 2008 నవంబర్ 24న ప్రకటించారు. ప్రొటాన్ కణాలను శాస్త్రవేత్తలు నెలరోజులపాటు కొల్లాయిడర్‌లో నింపారు. ఆ ప్రొటాన్లు కొల్లాయిడర్ చుట్టుకొలత ఆసాంతం ఒక కణపుంజంగా రూపొందాయి. మొదటగా సవ్యదిశలో తిరిగే ప్రొటాన్ కణపుంజాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆ తర్వాత మూడురోజుల లోపు, అపసవ్య దిశలో చలించే మరో ప్రొటాన్ కణపుంజాన్ని సిద్ధం చేయగల్గారు. ఒక ఖచ్చితమైన, సువ్యవస్థితమైన, వ్యతిరేక దిశల్లో పరిభ్రమించే కణతరంగాలుగా శాస్త్రవేత్తలు ఈ రెండు కణపుంజాలను ఎల్‌హెచ్‌సిలో సమన్వయించారు. ఈ ప్రొటాన్ కణపుంజాలు ఒకదాన్నొకటి ఢీకొట్టుకునేందుకు దాదాపు పదిరోజుల సమయం పడుతుందని, దాంతో ప్రొటాన్ కణపుంజాలు నిర్వహణ, నియంత్రణలకు తగిన సమయం ఉంటుందని సెర్న్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

దాదాపు కాంతివేగంతో ప్రయాణించే ప్రొటాన్ కణ పుంజాలు ఢీకొట్టడంతో ఒక చిన్నపాటి బిగ్ బ్యాంగ్ ఏర్పడుతుంది. కాంతివేగంలో 99.999991 శాతం వేగంతో ప్రయాణించే ప్రొటాన్ కణ పుంజాలు సెకనుకు 11,245 చుట్లు తిరుగుతూ 600 సార్లు ఢీకొంటాయి. కాంతివేగంతో ప్రయాణించే ప్రొటాన్ కణపుంజాలను ఢీకొట్టించడం ద్వారా మహా విస్పోటనం (బిగ్‌బ్యాంగ్) నాటి పరిస్థితులను ప్రయోగశాలలో సృష్టించి, ఆ తొలి క్షణాల్లో ఏర్పడే హిగ్స్ బోసాన్ కణాలను ప్రయోగశాలలో పట్టుకునేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. విశ్వ రహస్యాలు ఈ ప్రయోగం ద్వారా వెల్లడి కాగలవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదొక గొప్ప శాస్త్ర సాంకేతిక అద్భుతమని, విజ్ఞాన శాస్త్ర చరిత్రలోనే ఇంత పెద్ద వైజ్ఞానిక కార్యక్రమం జరగలేదని యూరోపియన్ ఆర్గనేజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (సీఈఆర్ఎన్-సెర్న్) ప్రాజెక్ట్ అధిపతి లైన్ ఇవాన్స్ వ్యాఖ్యానించారు.

ఈ ప్రయోగం ద్వారా విశ్వంలో మాయమైన ద్రవ్యరాశిని గురించి మనం తెలుసుకునే వీలుంటుంది. విశ్వంలోని కేవలం నాలుగు శాతాన్ని మాత్రమే మనం ఇంతవరకు తెలుసుకోగలిగాము. 96 శాతం విశ్వ సమాచారం పట్ల మనకెలాంటి అవగాహన లేదు. అది కేవలం ఒక మార్మిక విషయంగా మిగిలింది. ఈ ప్రయోగంలో ఈ మర్మాన్ని ఛేదించే వీలుంటుంది. మహావిస్ఫోటనం తర్వాత ఏర్పడే తొలి ద్రవ్యరాశికి చెందిన మౌలిక కణాలను హిగ్స్ బోసాన్లుగా శాస్త్రవేత్తలు పిలుస్తారు.

దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఈ కణాలను సైద్ధాంతికంగా ఆవిష్కరించినప్పటికీ, ఇప్పటిదాకా ప్రయోగాత్మకంగా పట్టుకోలేకపోయారు. బ్రహ్మాండ గోళాల ఆవిర్భావానికి బొసాన్లు ప్రథమ, ప్రధాన కారణం కావడం మూలాన వీటికి ‘దైవకణాలు’ అని పేరొచ్చింది. ఎల్‌హెచ్‌‌సీ ద్వారా కృత్రిమ బిగ్ బ్యాంగ్‌ను సృష్టించి, బోసాన్లను పట్టుకోవడం ద్వారా విశ్వరహస్యాన్ని ఛేదించాలని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. అయితే ఇలాంటి కృత్రిమ బిగ్‌బ్యాంగ్‌ వల్ల బ్లాక్ హోల్స్ (కృష్ణబిలాలు) ఏర్పడి, అది 15 నిమిషాల్లో భూమినే మింగివేసే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెను నక్షత్రాలను సైతం మింగివేసే బ్లాక్ హోల్స్ ఏర్పడి, మహాప్రళయానికి దారితీస్తుందా? అన్న భయాందోళనలు శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు.

బొసాన్‌లే అన్నిటికీ మూలం!
ఉనికిలో ఉన్న విశ్వపదార్థాని కంతటికీ మూలం బోసాన్ (దైవకణం) అనేది శాస్త్రవేత్తల భావన. ప్రొటాన్ కణ పుంజాలు ఢీకొన్న విధ్వంస శిథిలాల అధ్యయనం ద్వారా విశ్వావిర్భావ రహస్యం అవగతమయ్యే అవకాశముంది. మీసాన్‌ల ద్వారా అనబంధించబడిన ప్రొటాన్లు, న్యూట్రాన్లతో ఏర్పడిన కేంద్రకం, ఎలక్ట్రాన్ల సమ్మేళనంతో విశ్వపదార్థం ఏర్పడిన విషయం తెలిసిందే. రెండు కేంద్రకాలు ఢీకొన్నపుడు సూర్యుని కేంద్రంలోని ఉష్ణోగ్రత కంటే లక్షల రెట్లు హెచ్చు ఉష్ణోగ్రత ఏర్పడే అవకాశముందని శాస్త్రవేత్తల అంచనా. అంతటి తిరుగులేని ఉష్ణోగ్రతల్లో పరమాణు ప్రాథమిక కణాలు తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. ప్రొటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ కణాలు ఆరు రకాల క్వార్క్‌ కణాలుగా విడిపోతాయి. ఈ క్వార్కులు గ్లూయన్స్‌తో అనుబందించబడి ఉంటాయి.

మహా విస్ఫోటన ఉష్ణోగ్రతల్లో అస్తిత్వాన్ని కోల్పోయిన పరమాణు ప్రాథమిక కణాల క్వార్క్‌లు, గ్లూయన్స్‌ల మిత్రమ ప్లాస్మాగా రూపాంతరం చెందుతుంది. ఆ ఉష్ణోగ్రత ఎంతటి అనితర సాధ్యమైనదైనప్పటికీ, బిగ్‌బ్యాంగ్ సమయంలో అలాంటి ఉష్ణోగ్రతలు వెలువడి విశ్వావిర్భావ తొలినాళ్లలో క్వార్క్‌లు, గ్లూయాన్ల ప్లాస్మా వాతావరణం ఏర్పడినట్లు శాస్త్రవేత్తల అంచనా. ఎల్‌హెచ్‌సీ ప్రయోగం ద్వారా విశ్వావిర్భావం నాటి తొలి కణాలను సృష్టించేందుకు సెర్న్ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాల నుంచి దాదాపు 10 వేల మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 800 కోట్ల డాలర్లను ఈ ప్రయోగ నిర్వహణకు ఖర్చు చేస్తున్నారు. 30 ఏళ్ల నాటి హిగ్స్ బోసాన్ ఉనికి ఈ ప్రయోగంతో తేలిపోతుంది.

బోసాన్ మీమాంస
బోసాన్‌లపై శాస్త్రవేత్తలు రెండు శత్రు శిబిరాలుగా చీలిపోయారు. కొంతమంది బోసాన్ కణాల ఉనికిలో ఉండే అవకాశమే లేదన్న వాదనను బలంగా ముందుకు తెస్తున్నారు. హిగ్స్ బోసాన్‌ల భావనను తప్పు పట్టిన వారిలో అభినవ ఐన్‌స్టైన్, స్టీఫెన్ హాకింగ్ ప్రముఖంగా ఉన్నారు. అసలు ఉనికిలో లేని బోసాన్ కణాల కోసం ప్రయత్నించడంలో నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఈ ప్రయోగం ద్వారా హిగ్స్ బోసాన్‌లు ఉండవని, అదొక తప్పుడు సూత్రీకరణ అని తేలిపోవడమే కాక, పలు కొత్త విషయాలు వెలుగులోకి రావడంతో సరికొత్త వైజ్ఞానిక సూత్రీకరణలను రూపొందించగలమన్న ఆశాభావాన్ని హాకింగ్ వ్యక్తం చేశారు. ఎల్‌హెచ్‌సీ ప్రయోగం ద్వారా ‘దైవకణాల’ను కనుగొనలేరని ఆయన 100 డాలర్ల పందెం కట్టారు కూడా. హిగ్స్ బోసాన్ ఆవిష్కరణ ద్వారా పదార్థ ద్రవ్యరాశి భావన గురించి మరింత లోతైన అవగాహన కలుగుతుందన్న ఆశాభావాన్ని సైతం హాకింగ్ సవాలు చేశారు. హిగ్స్ బోసాన్ కణాల భావన సూత్ర రీత్యా తప్పుడు అవగాహనతో రూపొందిందని హాకింగ్ చాలాకాలం క్రితమే పలు వ్యాసాల్లో, రచనల్లో ఖండించారు. ఈ సిద్ధాంతాన్ని ఆయన పూర్తిగా తోసిపుచ్చారు.

అయితే హాకింగ్ వ్యాఖ్యానాలను దైవకణాల  సృష్టికర్త హిగ్స్ తోసిపుచ్చారు. కణ భౌతిక శాస్త్రంలో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని హాకింగ్ చొప్పిస్తున్నారు… ఈ అంచనా నుంచి చూస్తే శుద్ధ  భౌతిక శాస్త్రవేత్తల సిద్ధాంతాలన్నీ తప్పుడు తడకలుగా కనిపిస్తున్నాయని హిగ్స్ వ్యాఖ్యానించారు.

దైవకణాలా? దైవ ధిక్కార కణాలా?
బిగ్ బ్యాంగ్ జరిగిన తరుణంలో కణాలకు ఎలాంటి బరువూ ఉండదు., సెకనులో శతకోటి వంతు కాలంలో ఆ కణాలకు బరువు చేకూరుతుంది. ఈ ప్రక్రియను అర్థం చేసుకునేందుకు ‘హిగ్స్ క్షేత్రం’ లోని హిగ్స్ బోసాన్ కణాలు పరస్పరం చర్యాప్రతిచర్యలు జరిపే పరిమాణంపై ఆధారపడి పలు ద్రవ్యరాశులతో కూడిన పదార్థాలు ఆవిర్భవించాయని హిగ్స్ ప్రతిపాదించారు. ఇప్పటివరకు ప్రపంచ శాస్త్రవేత్తలు ఈ భావననే ప్రామాణికంగా తీసుకున్నారు. ‘హిగ్స్ బోసాన్’ లను కనుగొనే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు.

ఈ భావనను దాదాపు 44 ఏళ్ల క్రితం హిగ్స్ ప్రతిపాదించారు. పీటర్ హిగ్స్ ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర శాఖలో ఎమిరటీస్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆయన స్వభావరీత్యా ఒక నాస్తికుడు. తాను ప్రతిపాదించిన మౌలిక కణాలకు ఆయన హిగ్స్ బోసాన్స్ అని మాత్రమే పిలిచారు. అయితే హిగ్స్ భావనను లియోన్ లిడర్‌మాన్ వ్యాఖ్యానిస్తూ రాసిన పుస్తకంలో ‘హిగ్స్ బోసాన్‌’లకు ‘ది గాడ్ డామ్ పార్టికల్స్’ (దైవ ధిక్కార కణాలు) అని ముద్దు పేరు పెట్టారు. అయితే లిడర్‌మాన్ పుస్తకాన్ని ప్రచురించిన ప్రచురణ కర్త ‘గాడ్ డామ్ పార్టికల్స్’ –god damn particles– అన్న పేరులోని ‘డామ్’ ను తొలగించి ‘గాడ్ పార్టికల్స్‘ -దైవ కణాలు- అని ముద్రించడం జరిగింది. అప్పటి నుండి హేతువాది హిగ్స్ అభీష్టానికి పూర్తి విరుద్ధంగా హిగ్స్ బోసాన్ కణాలకు దైవకణాలనే పేరు స్థిరపడిపోయింది. హిగ్స్ ఈ ప్రచారాన్ని అడ్డుకోలేకపోయారు.

లార్జ్ హెడ్రాన్ కొల్లాయిడర్ (ఎల్‌హెచ్‌సి)
ఎల్‌హెచ్‌సీ ఒక అద్భుతమైన పరికరం. ఇందులో అలీస్, క్రయోజనిక్ మ్యుయాన్ స్పెక్ట్రోమీటర్, ఏటర్రోయిడల్ ఎల్‌హెచ్‌సీ ఆపరేటస్ లేదా అట్లాస్ అని మూడు గొప్ప అయాన్ డిటెక్టర్లుంటాయి. వీటి నిర్మాణానికి వందలాది కోట్ల డాలర్లు ఖర్చయ్యాయి. యూరప్, భారతీయ శాస్త్రవేత్తలతో సహా పలువురు 15 ఏళ్లపాటు శ్రమించి దీన్ని రూపొందించారు. కాంతివేగంతో ప్రయాణించే ప్రొటాన్ కణపుంజాలను సృష్టించేందుకు ఈ పరికరంలో అతి పెద్ద సూపర్ కండక్టింగ్ అయస్కాంతాలను ఉపయోగించారు.

ప్రోటాన్ కణపుంజాలను సృష్టించే సమయంలో విపరీతమైన వేడి వెలువడుతుంది. మైనస్ 271 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా పరమ శూన్య ఉష్ణోగ్రత కంటే కేవలం 1.9 డిగ్రీలు అధికంగా ఉండే ఉష్ణోగ్రతల ద్వారా ఆ అయస్కాంతాలను చల్లబరుస్తారు. అందుకోసం అధునాతనమైన క్రయోజెనిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు వినియోగించారు. అతిశీతల ఉష్ణోగ్రతలను సృష్టించేందుకు ప్రారంభంలో దాదాపు 1.20 కోట్ల లీటర్ల ద్రవ నైట్రోజన్, దాదాపు 7 కోట్ల లీటర్ల ద్రవ హీలియంలు ఖర్చవుతాయి. ఈ ఎల్‌హెచ్‌సి శక్తిని విపరీతంగా వినియోగిస్తుంది. అత్యధిక శక్తి క్షేత్రంలో ప్రొటాన్ కణపుంజాలను ఢీకొట్టించడం ఒక మహాద్భుతంగా చరిత్రకెక్కనుంది.

ఎల్‌హెచ్‌సీని తిరిగి పనిచేయిస్తున్న ప్రయత్నాలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఎల్‌హెచ‌సీ పరిస్థితి ఉత్కృష్టంగా తయారయింది. అని సెర్న్ డైరెక్టర్ స్టీవ్ మేయర్స్ ప్రకటించారు. మొదటగా ప్రొటాన్ కణపుంజాలు సాపేక్షికంగా 900 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్టు (జీఈవీ) అతి తక్కువ శక్తితో ఢీకొట్టుకుంటాయి. ఒక్కొక్క కణపుంజం 450 జీఈవీ శక్తిని సరఫరాగా చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. శీతాకాలం విరామం తర్వాత, ఎల్‌హెచ్‌సీ కార్యక్రమాలు తిరిగి 2010 జనవరిలో ప్రారంభం కానున్నాయి. అప్పుడు శాస్త్రవేత్తలు ప్రొటాన్ కణపుంజాలకు 7 టీఈవీ వోల్టుల శక్తిని అందిస్తారు. అంత శక్తితో ప్రొటాన్ పుంజాలు ఢీకొట్టుకోవడంతో బిగ్ బ్యాంగ్ పరిస్థితులు నెలకొంటాయి.

బిగ్ బ్యాంగ్ కాలం నుంచి ఈనాడు మనం చూస్తున్న విశ్వం దాకా జరిగిన పరిణామ క్రమాన్ని పరిశీలించేందుకు ఎల్‌హెచ్‌సీలోని అత్యంత శక్తివంతమైన కణపుంజాల అభిఘాతం ఉపకరిస్తుందని శాస్త్రవేత్తల భావన. దాంతో విశ్వం పుట్టుక రహస్యాన్ని ఛేదించేందుకు వీలవుతుందని వారు ఆశిస్తున్నారు. బిగ్ బ్యాంగ్ జరిగిన తొలి క్షణాల్లో తొలి పదార్థ ప్రాథమిక కణాలుగా హిగ్స్ బోసాన్‌లు ఏర్పడుతాయన్న సైద్ధాంతిక పరకల్పన కూడా ఈ ప్రయోగం ద్వారా తేలిపోతుంది. హిగ్స్ బోసాన్ కణాలతో సాధారణ అణువుల నుంచి బ్రహ్మాండ గోళాల వరకు క్రమంగా ఏర్పడ్డాయన్నది శాస్త్రీయమైన అంచనా. ప్రయోగ శాలలో బిగ్ బ్యాంగ్‌ను సృష్టించేందుకు అసాధారణ జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అంతరిక్షంలోని అత్యల్ప ఉష్ణోగ్రతల కంటే తక్కువ స్థాయి ఉష్ణోగ్రతల్లో వేలాది విద్యుదయస్కాంతాలను పనిచేస్తున్నారు. ఈ విద్యుదయస్కాంతాలు భిన్న దశల్లో ప్రయాణించే ఆ రెండు ప్రొటాన్ కణపుంజాల గమనాన్ని, గమ్యాన్ని నిర్దేశిస్తాయి.

కణ భౌతిక శాస్త్రంలో ‘సెర్న్’ అగ్రగామి
ప్రకృతి చీకటి కోణాలపై దృష్టి సారించి పలు అద్భుతాల వెనుక దాగిన మర్మాలను వెలుగులోకి తెచ్చేందుకు పార్టికల్ యాక్సిలేటర్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం రెండవ ప్రపంచ యుద్ధం నుంచి కోలుకుంటున్న యూరప్ దేశాలు సెర్న్ అనే సంస్థను ఏర్పాటు చేశాయి. ఈ సంస్థ కార్యకలాపాల వలన యుద్ధ నష్టాల్లో కూరుకుపోయిన యూరప్‌లో శాస్త్ర సాంకేతిక విప్లవం మరోసారి వివృతమయింది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ మరి ఇతర యూరప్ దేశాలు సెర్న్ నిర్మాణంలో కీలకపాత్రను పోషించాయి. అమెరికా నుంచి కూడా పలువిధులను సేకరించడం జరిగింది.

సెర్న్ కార్యకలాపంలో పలు ఆవిష్కరణలు పురుడు పోసుకున్నాయి. సెర్న్ కృషి ఫలితంగా విద్యుత్ అయస్కాంత శక్తి, రేడియో ధార్మికత కేంద్ర శక్తి రెండింటి ఏకీకరణ సాధ్యమయింది. ప్రాథమిక కణాలకు సంబంధించిన తొలి ఆవిష్కరణల పర్యవసానంగా వరల్డ్ వైడ్ వెబ్‌గా పిలిచే వెబ్ కంప్యూటింగ్ వ్యవస్థ రూపొందింది. యాక్సిలేటర్ భౌతిక శాస్త్రంలో చేసిన విశేష కృషికి గాను సెర్న్‌కు చెందిన భౌతికవేత్తలు కార్లో రూబియా, సైమన్ వాండర్ మీర్‌లకు 1984లో నోబెల్ బహుమతి వచ్చింది. ప్రత్యేకించి ఎల్‌హెచ్‌సీ నిర్మాణానికి సంబంధించిన ఘనత రూబియాకు చెందుతుంది.

దైవకణాల అన్వేషణలో భారత్  పాత్ర
సెర్న్ ఏర్పాటు చేసిన తొలినాళ్లలో మన దేశం పాత్ర నామమాత్రంగా ఉండేది. 1980ల దాకా భారత్ నుంచి సెర్న్ ఒకే ఒక ప్రతినిధి ఉండేవారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌కు చెందిన పీకే మల్హోత్ర సారథ్యంలో ఒక శాస్త్రవేత్తల బృందం సెర్న్ పరిశోధనా కార్యకలాపంలో పాలు పంచుకుంది. కలకత్తాలోని ‘వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్’, భువనేశ్వర్ లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్, ఐఐటీ -బాంబే, రాజస్థాన్, జమ్మూ-కాశ్మీర్, ఛండీగఢ్, పంజాబ్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు సెర్న్‌ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. ఫోటాన్ మల్టిప్లిసిటీ డిటెక్టర్ (పీఎమ్‌డి) ఎల్‌హెచ్‌సీలో కీలక భూమిక పోషించనుంది.

సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్తలు మ్యుయాన్ ఆలీస్ డిటెక్టర్‌లో మానస్ అని పిలిచే ఒక లక్ష ఎలక్ట్రానిక్ చిప్‌ల ఆకృతి, నిర్మాణాలను చేపట్టారు. ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం సహకారంతో ఆ సంస్థ ఆలీస్ యాక్సిలరేటర్‌కు చెందిన ఒకానొక భాగాన్ని అభివృద్ధి చేసింది. ఆలీస్ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి కూడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ సంస్థ భాగస్వామిగా కొనసాగుతోంది. ప్రోటాన్ కణ పుంజం నిలిచేందుకు ఉపకరించే 40 మిలియన్ డాలర్ల విలువ చేసే సూపర్ కండక్టింగ్ స్టీర్ మాగ్నెట్ జాక్స్‌ను రాజా రామన్న సెంటర్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సంస్థ అందజేసింది. ఈ నేపథ్యంలో నక్షత్రాల్లోని ఫోటాన్ శిథిలాలను అంచనా వేసేందుకు అమెరికాకు చెందిన బ్రూకోవన్ నేషనల్ లేబొరేటరీ సంస్థ భారతీయ శాస్త్రవేత్తలను ఆహ్వానించింది.

ఎల్‌హెచ్‌సీలోని మూడు డిటెక్టర్లు ప్రొటాన్ కణ పుంజాలు ఢీకొన్న తర్వాత ఏర్పడిన శిథిలాలను పరిశీలిస్తాయి. ఆ డిటెక్టర్‌లలో అమర్చిన భారతీయ పరికరాలు పీఎమ్‌డీ, మానస్ చిప్‌లు అత్యంత ప్రాథమికమైన ప్లాస్మా పదార్థాన్ని గుర్తించేందుకు ఉపకరిస్తాయి. యుద్ధం, పేదరికం, ప్రపంచ సంక్షోభంతో మానవ జాతి అతలాకుతలం అవుతున్న ప్రస్తుత సమయంలో విశ్వపదార్థపు చీకటి కోణాలను, దైవకణాల విన్యాసాలను పరిశీలించేందుకు జరిగే కృషిని అభినందించక తప్పదు. దైవ కణాల ఉనికి నిర్ధారణ జరిగినా, జరగకపోయినా ఈ ప్రయోగంతో విశ్వానికి సంబంధించిన పలు చీకటి కోణాలు వెలుగులోకి వస్తాయని పలువురు శాస్త్రవేత్తలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
— వెన్నెలకంటి రామారావు.

NB: ఈ టపాను నిన్న ప్రచురించిన తర్వాత వివిధ పత్రికలలో ఇవ్వాళ వస్తున్న అప్‌డేట్ వార్తలు, సంపాదకీయాలు, కథనాల లింకులను కొన్నింటిని లభ్యమైన మేరకు ఇక్కడ ఇస్తున్నాను. ఆసక్తి గల పాఠకులు వీటిని తప్పక చూడగలరు.

దైవ కణం జాడ!
– సంపాదకీయం
https://www.andhrajyothy.com/editorial.asp?qry=2012/jul/5/edit/editpagemain&date=7/5/2012

మహాద్భుతం…!
సంపాదకీయం
http://sakshi.com/Main/Weeklydetails.aspx?Newsid=44773&subcatid=17&categoryid=1

దైవ కణ’ దర్శనం!

సంపాదకీయం
http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=5&ContentId=124879

దైవకణం ఉంది !

– భౌతిక శాస్త్రంలో అతికీలకమైన ఆవిష్కరణ
http://sakshi.com/main/FullStory.aspx?catid=406509&Categoryid=1&subcatid=31

దేవ రహస్యం తెలిసింది
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/jul/5/main/5main1&more=2012/jul/5/main/main&date=7/5/2012

దైవకణం దక్కింది

http://eenadu.net/news/newsitem.aspx?item=panel&no=1

విశ్వ ఆవిర్భావ సమాచారాన్నందించే కొత్త కణాన్ని కనుగొన్నాం
http://www.prajasakti.com/worldsdestiny/article-367464

విశ్వ సృష్టి శోధనలో కొత్త అధ్యాయం
http://www.visalaandhra.com/headlines/article-86374

విశ్వరహస్యం చివరి మజిలీ
http://www.suryaa.com/Main/News/Article.asp?Category=1&SubCategory=4&ContentId=88334

God Particle Found Historic Milestone From Higgs Boson Hunters
http://news.nationalgeographic.com/news/2012/07/120704-god-particle-higgs-boson-new-cern-science/?plckOnPage=4

The Bose in the particle
http://www.thehindu.com/opinion/op-ed/article3602966.ece?homepage=true

Higgs boson ‘The beauty spot on the perfect face’
http://www.thehindu.com/sci-tech/science/article3601946.ece

Elusive particle found, looks like Higgs boson
http://www.thehindu.com/sci-tech/science/article3601654.ece

This is just the beginning of a long journey
http://www.thehindu.com/sci-tech/science/article3603258.ece

What next after a Higgs boson-like particle
http://www.thehindu.com/sci-tech/science/article3602374.ece

Footprint of ‘God particle’ found
http://www.thehindu.com/sci-tech/science/article3594941.ece

 

RTS Perm Link