ఆమె కావాలి… ఇండియాకు పంపించండి….

July 25th, 2012

మిత్రులు సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు ఇవ్వాళ ఉదయమే ఒక మహాద్భుతమైన వార్తను ఈమెయిల్‌లో పంపించారు.

ఆస్ట్రేలియాలో 81 సంవత్సరాల వృద్దురాలు ఎవా ఎస్టెల్లెకు జీవిత చరమాంకంలో ఒక అనూహ్య ఘటన ఎదురైంది. ఇద్దరు దొంగలు 18 ఏళ్ల వయసున్న ఈ బామ్మ మనవరాలిపై లైంగిక అత్యాచారం చేశారు. నడవడం కూడా కష్టంగా ఉండే ఆ పండువయసులో ఆ బామ్మ రాంబోవతారం ఎత్తి వారం రోజుల పాటు గాలించి తన మనవరాలిపై అత్యాచారం జరిపిన ఇద్దరు దుండుగలను పట్టుకుంది. తనదైన ప్రత్యేక మార్గంలో వారిపై ప్రతీకారం తీర్చుకుంది.

హోటల్‌లో ఉన్న దుండుగుడు డేవిస్ ఫర్త్, అతడి మాజీ జైలు సహచరుడు స్టాన్లీ థామస్‌లను హోటల్ రూమ్‌లో వెతికి పట్టుకున్న ఈ బామ్మ తన వద్ద ఉన్న 9-ఎమ్ ఎమ్ పిస్టల్‌‌తో వారి అంగాలను, వృషణాలను ఛిద్రమయ్యేలా  కాల్చిపారేసింది.

తర్వాత నింపాదిగా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సార్జెంట్ బల్లపై పిస్తోలు పెట్టి ఇలా అంది.

“దేవుడి దయవల్ల, ఈ లం.. కొ.. లు  ఇకపై ఎవరినీ అత్యాచారం చేయలేరు.”

“ఆమె చేసింది తప్పే, ఆమె చట్టాన్ని ఉల్లంఘించారు. కాని 81 సంవత్సరాల వయస్సున్న ఈ  ముదుసలిని జైలులో పెట్టటమంటే చాలా కష్టమైన విషయం… అందులోనూ మెల్‌బోర్న్ నగరంలోని 3 మిలియన్ల మంది ప్రజలు ఆమెను నగర మేయర్‌గా ఎన్నుకోవాలనుకుంటున్నప్పుడు ఈ పని చేయడం మరీ కష్టం…” అంటూ ఒక అధికారి వ్యాఖ్యానించారు.

తన కుటుంబ సమస్యకు ఒక వృద్దురాలు ఎన్నుకున్న భయానక పరిష్కారం సమాజానికి సమ్మతం అవునో కాదో కాని పురుషాంగం కలిగి ఉన్న మదాంధకారంతో కన్ను మిన్ను గానకుండా ప్రవర్తించే ముష్కరులు జీవితాంతం మర్చిపోలేని ‘తూటా మూద్ర’ను ఆమె ఈ ప్రపంచానికి చూపించారు.

“Those bastards will never rape anybody again, by God.”

ప్రపంచ చరిత్రలో ఏ నాటకంలో అయినా, ఏ నవల్లో అయినా, ఏ సినిమాలో అయినా ఇంతటి భారమైన, ఇంతటి న్యాయపూరితమైన ధర్మాగ్రహ ప్రకటనను మనం ఇంతవరకూ ఎక్కడైనా చూశామా?

దీంతో పోలిస్తే కాళీపట్నం రామారావు గారి “యజ్ఞం” కథలో తన అప్పులు వారసత్వంగా లభించకూడదంటూ తన కొడుకునే ఉన్న ఫళానా నరికివేసిన ఆ తండ్రి చర్య ఏపాటిది?

దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం అమెరికాలో, లోరెనా బాబిట్ అనే వివాహిత మహిళ తన తాగుబోతు భర్త పెడుతున్న క్రూర హింసలను భరించి భరించి ఒక మంచి రోజు చూసుకుని అతడి ఆంగాన్ని వంట కత్తితో తరిగేసి దాన్ని పట్టుకుని కాలువలో విసిరేసి తీరిగ్గా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కూచున్న ఘటన బహుశా అందరికీ గుర్తుండవచ్చు. భర్త అంగాన్ని పరపరా కోసేసిన ఆ ధీరురాలికి మద్దతు ప్రకటించడంలో, వ్యతిరేకత ప్రదర్శించటంలో అమెరికా సమాజం అప్పట్లో రెండుగా చీలిపోయింది.

లోరెనా బాబిట్ చేసిన ఈ సాహసోపేత చర్యకు గుర్తుగా ఆమె చర్య బాబిటైజేషన్ -Babitization- అనే పదంగా నిఘంటువుల్లో కూడా ఎక్కిపోయింది.

స్త్రీలపై అత్యాచారాలు ప్రాచ్య, పాశ్చాత్య సమాజాలు రెండింట్లోనూ సహజ వికారమైపోయిన పాడుకాలంలో ఆస్ట్రేలియా అవ్వ, అమెరికా పడతి ఎంచుకున్న పరిష్కారాలను ఎవరైనా సమర్థించవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు కాని…

నన్నెందుకో ఆ ఇంగ్లీషు మెయిల్‌ లోని చివరి వాక్యం విశేషంగా ఆకర్షిస్తోంది.

DEPORT HER TO INDIA , WE NEED HER!

ఆమె మనక్కావాలి.. తనను ఇండియాకు పంపించండి.

(అప్రస్తుతమనుకోకుంటే, నా బాల్యంలోకి ఒకసారి వెళ్ళి చూస్తే మా ఊళ్లో మాంచి వయసుకొచ్చిన ఎద్దులు, దున్నలు జంతు సహజాతాలతో కనిపించిన ఆవును, ఎనుమును -గేదె- వెంటాడి మీదబడి లైంగిక కార్యం పూర్తి చేసుకునేవి. మేతకు వదిలితే వాటి మేటింగ్ సీజన్‌ పొడవునా ఇవి ప్రతిరోజూ తమ జతగత్తెల వెంటబడేవి. ఇలా కనిపించిన ప్రతి ఆవు, గేదె వెంట బడి పోతుండటం వాటి యజమానులు చూశారంటే వాటికి మూడినట్లే మరి.

రోజూ అవి లైంగిక కృత్యాలకు పాల్పడితే వాటి శక్తి హరించుకుపోతుందని, వ్యవసాయానికి పనికిరావనే ఉద్దేశంతో రైతులు అలా ఏపుకొచ్చి విర్రవీగే వ్యావసాయక మగ జంతువులు -ఎద్దు, దున్న- లను గుంజకు కట్టేసి వాటి వృషణాలను కొయ్య బద్దలతో పగులకొట్టేవారు. దీన్ని కడపజిల్లా పల్లె భాషలో “వట్ట గొట్టడం” అంటారు. ఈ పనికోసం ప్రతి గ్రామంలో ఒక వృషణ విచ్ఛేదక నిపుణుడు -వట్ట గొట్టేవాడు- ఉండేవాడు కూడా. విచ్ఛేదనకు గురయిన తర్వాత అవి బుద్దిగా మసులుకునేవి.

మగ జంతువులు తమ ప్రకృతి సహజమైన కార్యక్రమాన్ని చేసుకోనీయకుండా శాశ్వతంగా వాటిని లైంగిక వ్యంధత్వానికి గురి చేసే ఈ చర్యను చూసినప్పుడల్లా చిన్నతనంలో అయ్యో పాపం అనిపించేది. కాని పల్లె జీవితంలో ఇదీ ఒక వాస్తవమే..

జంతు ప్రేమికులకు ఇది భయంకరమైన చర్యగా అనిపించవచ్చు కాని యుక్తవయస్సులో పడి అదుపు తప్పి వ్యవహరించే జంతువులను పల్లె సమాజం ఇలాగే అదుపులో పెట్టేది. వయసులో అడ్డూ ఆపూ లేనితనం ప్రారంభమయ్యాక ఒక్కోసారి ఈ మగ పశువులు యజమాని మీద కూడా తిరగబడేవి. ‘నువ్వెంత.. నీ తాహతెంత అనే వయోగత కండర ధిక్కారంతో.  పశుపాలకులకు ఇక వేరే మార్గముండేది కాదు మరి.)

జంతువుల చరిత్రతో పోలిస్తే మానవుల చరిత్ర, లైంగిక అత్యాచారాల చరిత్ర కొత్త పుంతలు తొక్కుతున్నట్లుగా ఉంది.

వృషణ విచ్ఛేదన తప్ప రేపిస్టుల సమస్యకు పరిష్కారం దొరకని దశలోకి సమాజం పయనిస్తోందా…

అవధులు మీరి ప్రవర్తించే పశువు వ్యవసాయానికి పనికిరాకుండా పోయే చందాన, లైంగిక అత్యాచారాన్ని ఆయుధంగా చేసుకుంటూ విర్రవీగుతున్న ముష్కరులు కూడా సమాజానికి పనికిరాకుండా పోయే కాలం వస్తుందా..!

మన బామ్మ చర్యను ఎలా అర్థం చేసుకోవాలి? మీరే చెప్పండి.

ప్రసాద్ గారు పంపిన ఈమెయిల్ లో ఆ సాహసోపేతమైన అసాధారణమైన బామ్మ ఫోటో కూడా ఉంది. ఎందుకో దాన్ని ప్రచురించాలనిపించటం లేదు.

ఒకటి మాత్రం చెప్పగలను. ఇది చందమామ కథ కాదు. ఇది చందమామ లాంటి అందమైన ప్రపంచపు అనుభపమూ కాదు.

సుబ్రహ్మణ్య ప్రసాద్ గారూ, మీనుంచి మరికొందరు మిత్రులనుంచి ఇలా మెయిల్స్ అందుకోవడం ఒక సమాజాన్ని నిత్యం చదువుకుంటున్నంత చక్కని అనుభూతిని కలిగిస్తోందండి. ధన్యవాదాలు సర్.

ఆ ఇంగ్లీష్ ఈమెయిల్ పూర్తి పాఠం….

The Rambo Granny of Melbourne, Australia
     
    Gun-toting granny Ava Estelle, 81, was so ticked-off when two thugs raped her 18-year-old granddaughter that she tracked the unsuspecting ex-cons down… And shot off their testicles.
     
    “The old lady spent a week hunting those men down and, when she found them, she took revenge on them in her own special way,” said Melbourne police investigator Evan Delp.
     
    Then she took a taxi to the nearest police station, laid the gun on the sergeant’s desk and told him as calm as she could be:  “Those bastards will never rape anybody again, by God.”
     
    Rapist and robber Davis Furth, 33, lost both his penis and his testicles when outraged Ava opened fire with a 9-mm pistol in the hotel room where he and former prison cell mate Stanley Thomas, 29, were holed up.  
     
    Now, baffled lawmen are trying to figure out exactly how to deal with the vigilante granny..
    “What she did was wrong, and she broke the law, but it is difficult to throw an 81-year-old Woman in prison,” Det. Delp said, “especially when 3 million people in the city want to nominate her for Mayor.”
      
    DEPORT HER TO INDIA , WE NEED HER!

— Anand Ma

RTS Perm Link

చందమామ@66

July 20th, 2012

1947 జూలై తొలి చందమామ ముఖచిత్రం

ఈ జూలై నెలతో చందమామ 66వ… సంవ…త్సరంలోకి అడుగుపెడుతోంది. అలనాటి ఉజ్వల గతాన్ని గుర్తు చేసుకుంటూ 1947 జూలై నెలలో ప్రచురించబడిన చందమామ తొలి ముఖచిత్రాన్ని మళ్లీ మీముందుకు తీసుకువ…స్తున్నాము. ఈ ముఖచిత్రంలో ప్రచురించబడిన ఆరణాల పత్రిక ధరను కూడా మీరు చూడవ…చ్చు. కథలను ఇంపుగా చెప్పడం ద్వారా మన ఘనమైన దేశపు సంస్కృతి, వారసత్వాన్ని భారతీయ… చిన్నారులకు అందించాలనే గొప్ప ఆలోచనతో శ్రీ చక్రపాణి, శ్రీ నాగిరెడ్డి గార్లు చందమామ పిల్లల పత్రికను తీసుకొచ్చారు.

అప్పటి మద్రాస్‌ ప్రెసిడెన్సీలో విస్తృతంగా వ్యవ…హారంలో ఉన్న రెండు భాషలలో -తెలుగు, తమిళం- 1947లో ప్రారంభించబడిన చందమామ తర్వాతి నాలుగేళ్లలోపే ఆరు భాషల్లో ప్రచురించబడింది. ఇప్పుడు చందమామ పత్రికను 12 భాషలలో, ఇంగ్లీషులో కూడా ప్రచురిస్తున్నాము. ఈ వార్షిక సంచికలో మా సంస్థాపకుల ఉన్నతాశయాన్ని మా కర్తవ్యాన్ని మరోసారి మననం చేసుకుంటూ, చందమామ మన సమాజానికి తన వంతు దోహదం అందించేందుకు మరింత కష్టపడి పనిచేస్తామని ప్రతిన చేస్తున్నాము.

భారతీయ… చిన్నారులు బాధ్యతాయుత పెద్దలుగా ఎదిగేలా చేయ…డానికి, తమ సంస్కృతి పట్ల వారు గర్వించేలా చేయ…డానికి శతథా కృషి చేస్తామని చెబుతున్నాము. భారతదేశంలో ప్రతి కుటుంబంలోనూ పెద్దలు మరో ఆలోచన లేకుండా చందమామ పత్రికను తమ పిల్లల చేతిలో పెట్టగలిగేటంత నమ్మకాన్ని వారిలో కలిగిస్తామని, మేం పిల్లల ఎదుగుదలకు నిజమైన మిత్రులమని నిరూపించుకుంటామని మాట ఇస్తున్నాము.

ఈ మహా సామ్రాజ్యం ఎలా నిర్మించబడిందో తెలిపే కొన్ని చిత్రాలను  ఈ సందర్భంగా పాఠకులతో పంచుకోవాలని అనుకుంటున్నాము. అలనాటి చందమామ కార్యాలయం, ప్రెస్‌, సిబ్బంది గది, పంపిణీ విభాగం వంటి కొన్ని ఫోటోలను మీముందుకు తీసుకొస్తున్నాము.

వీటి వివరాలకోసం ప్రస్తుతం మార్కెట్లో ఉన్న జూలై చందమామ సంచికలో చూడగలరు.

చందమామ విజయ…గాథ
ఈ జూలై నెలతో చందమామ 66వ… సంవ…త్సరంలోకి అడుగుపెడుతోంది. అలనాటి ఉజ్వల గతాన్ని గుర్తు చేసుకుంటూ 1947 జూలై నెలలో

ప్రచురించబడిన చందమామ తొలి ముఖచిత్రాన్ని మళ్లీ మీముందుకు తీసుకువ…స్తున్నాము. ఈ ముఖచిత్రంలో ప్రచురించబడిన ఆరణాల పత్రిక

ధరను కూడా మీరు చూడవ…చ్చు. కథలను ఇంపుగా చెప్పడం ద్వారా మన ఘనమైన దేశపు సంస్కృతి, వారసత్వాన్ని భారతీయ… చిన్నారులకు

అందించాలనే గొప్ప ఆలోచనతో శ్రీ చక్రపాణి, శ్రీ నాగిరెడ్డి గార్లు చందమామ పిల్లల పత్రికను తీసుకొచ్చారు.

అప్పటి మద్రాస్‌ ప్రెసిడెన్సీలో విస్తృతంగా వ్యవ…హారంలో ఉన్న రెండు భాషలలో -తెలుగు, తమిళం- 1947లో ప్రారంభించబడిన చందమామ తర్వాతి

నాలుగేళ్లలోపే ఆరు భాషల్లో ప్రచురించబడింది. ఇప్పుడు చందమామ పత్రికను 12 భాషలలో, ఇంగ్లీషులో కూడా ప్రచురిస్తున్నాము. ఈ వార్షిక సంచికలో

మా సంస్థాపకుల ఉన్నతాశయాన్ని మా కర్తవ్యాన్ని మరోసారి మననం చేసుకుంటూ, చందమామ మన సమాజానికి తన వంతు దోహదం

అందించేందుకు మరింత కష్టపడి పనిచేస్తామని ప్రతిన చేస్తున్నాము.

భారతీయ… చిన్నారులు బాధ్యతాయుత పెద్దలుగా ఎదిగేలా చేయ…డానికి, తమ సంస్కృతి పట్ల వారు గర్వించేలా చేయ…డానికి శతథా కృషి చేస్తామని

చెబుతున్నాము. భారతదేశంలో ప్రతి కుటుంబంలోనూ పెద్దలు మరో ఆలోచన లేకుండా చందమామ పత్రికను తమ పిల్లల చేతిలో పెట్టగలిగేటంత

నమ్మకాన్ని వారిలో కలిగిస్తామని, మేం పిల్లల ఎదుగుదలకు నిజమైన మిత్రులమని నిరూపించుకుంటామని మాట ఇస్తున్నాము.

ఈ మహా సామ్రాజ్యం ఎలా నిర్మించబడిందో తెలిపే కొన్ని చిత్రాలను  ఈ సందర్భంగా పాఠకులతో పంచుకోవాలని అనుకుంటున్నాము. అలనాటి

చందమామ కార్యాలయం, ప్రెస్‌, సిబ్బంది గది, పంపిణీ విభాగం వంటి కొన్ని ఫోటోలను మీముందుకు తీసుకొస్తున్నాము. మనం స్వాతంత్య్ర

దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆగస్ట్ సంచికలో ప్రత్యేక ముఖచిత్రంతో త్వరలో మీముందుకు వ…స్తాము.
సౌమ్యా భరద్వాజ్‌

RTS Perm Link

చందమామ శంకర్ గారికి 89 వసంతాలు..

July 17th, 2012

ఇవాళ్టితో చందమామ దిగ్గజ చిత్రకారులు శంకర్ గారికి 89 ఏళ్లు.

ఆయనకు ఫేస్‌బుక్ వంటి సాంకేతిక విప్లవాలతో సంబంధం లేదు కాబట్టి, పుట్టినరోజు వంటి ఆధునిక అలవాట్లలో పాలు పంచుకోవడం తెలీదు కాబట్టి చందమామలో పనిచేసేవారికి కూడా ముందస్తు సమాచారం తెలీదు. తీరా ఉదయం ఆఫీసుకు వచ్చిన గంట సేపటి తర్వాత ఆయన నుంచి యధాప్రకారంగా చందమామ లో పనిచేసే ‘పిల్లలందరికీ’ స్వీట్స్ అందాయి. ఆఫీసుకు వచ్చి పనిచేసేటప్పుడు ఆయన సాయంత్రం పూట చాక్లెట్ చప్పరిస్తూ పక్కనున్న వారికి కూడా తలొకటి అందించడం తనతో కలిసి పనిచేసేవారందరికీ అపురూపమైన అంశం కాగా, ఇంటినుంచి పని చేస్తూ కూడా, ఈరోజున తనకూ చందమామకు ఉన్న దశాబ్దాల బంధాన్ని గుర్తు చేస్తూ అయన ఆఫీసుకు మర్చిపోకుండా చాక్లెట్ పంపారు.

యాజమాన్యం ఆయనతో ఇవ్వాళ మాట్లాడి ఆశీస్సులు తీసుకోవడమే గాకుండా, ఆయనకు పండ్లు, తీపి పదార్థాలు పంపారు.

పుట్టినరోజు అనేది ఆయనకు అంతగా పట్టింపు లేని ఘటనే అయినప్పటికీ ఈ రోజు సందర్భంగా చందమామను పరామర్శించడం, అందరితో మాట్లాడటం ఆయనకు చిరకాలంగా అలవాటు. బాగున్నారు కదా అనే పలకరింపుతో మొదలై అరవైఏళ్ల అనుభవాలను ఆయన పంచుకుంటుంటే చెవులు రిక్కించి అలా వింటూ పోవటం మాకందరికీ అలవాటు.

రాజకుమారి చిత్రం గీసినా, నెమలి బొమ్మ గీసినా, ఫుల్ పేజీలో డేగ బొమ్మ గీసినా 90 ఏళ్ల వయసులో కూడా ఆయన కుంచె కాదు కాదు.. ఆయన కలానికి మాత్రం వృద్ధాప్యం తెలియదు. ఆయన గత సంవత్సరం డిసెంబర్ నెల బేతాళ కథ ‘అమృతవర్షిణి నిర్ణయం’ కు గీసిన చిత్రాలు కొన్ని ఇక్కడ చూస్తే ఆయన కలం గొప్పదనం అర్థమవుతుంది. ఒక చిన్న స్పేస్‌లో ఎన్ని వివరాలను బొమ్మలో చూపుతారో మళ్లీ ఆ బొమ్మ ఎంత ప్లెయిన్‌గా ఉంటుందో చూడాలంటే శంకర్ గారి చిత్రాలు తప్పక చూడాల్సిందే.

మాష్టారు గారూ! మీకు నిండు నూరేళ్లు… మీతో ఎప్పుడూ చెప్పేమాటే ఇప్పుడు కూడా… మీరు చల్లగుంటే మేమూ -చందమామలో- చల్లగుంటాము.

ఆయన గత సంవత్సర కాలంగా చందమామ పనిమీద ఫోన్‌లో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయన చెప్పిన జీవితానుభవాలను కొన్నింటిని ఇక్కడ చూడండి.

“స్టోరీస్ రీటోల్డ్ అని కథల గురించి చెబుతుంటారు. కాని చందమామ కథలు స్టోరీస్ రీటోల్డ్ రకం కాదు. అవి స్టోరీస్ ఆఫ్ రీబర్త్ వంటివి. చందమామ నిజంగానే అనేక కథలకు పునర్జన్మ నిచ్చింది. పశుల కాపరి వెదురు బొంగులో దాచుకుని మరీ చదువుకునేటటువంటి ఆసక్తికరమైన కథలకు చందమామ తిరిగి జన్మనిచ్చింది.”

“చందమామ ఈజ్ నాట్ ఎ కమ్మోడిటీ. హౌ కెన్ వియ్ గెస్ హై ప్రాపిట్స్ ప్రమ్ చందమామ. మేగజైన్ అంటే నీ బిడ్డలాంటిది. నీ బిడ్డను నిన్ను ఎలా పోషిస్తావో, దాన్ని అలా పోషించుకోవాలి.”

చందమామ నన్ను  బిడ్డలా పెంచింది. నేను దాన్ని పెంచాను అనుకుంటున్నాను. దానికి నేను రుణపడి ఉన్నాను. అనేది శంకర్ గారు ఎప్పుడూ తల్చుకునే మాట. అందుకే ఎంత మంది తమ వద్దకు వచ్చి పనిచేయమని కోరినా ఆయన ప్రలోభ పడలేదు. 1980లలో శంకర్ గారికి చందమామలో నెలజీతం వెయ్యి రూపాయలట. అప్పట్లోనే పూణేకి చెందిన ఒక ప్రముఖ పబ్లిషింగ్ హౌస్ ఆయనకు బంఫర్ ఆఫర్ లాంటిది ఇచ్చిందట. మీకు సెపరేట్‌గా రూము, బోర్డింగ్, లాడ్జింగ్‌తో సహా అన్ని సౌకర్యాలను కల్పించి నెలకు 3 వేల రూపాయల జీతం కూడా ఇస్తామని వారు ఆహ్వానించినా ఈయన చలించలేదు.

‘”రాముడికి ఒకే మాట ఒకే బాణం అనే చందాన జీవితంలో ఒకే పత్రికలో, ఒకే యాజమాన్యం కింద నేను పనిచేసాను., అదీ చందమామలో పనిచేశాను.. జీవితమంతా పనిచేసాను. ఈ సంతోషం చాలు నాకు. డబ్బు కోసం నేను పనిచేయలేదు. డబ్బు చూసి కూడా పనిచేయలేదు. సంస్థను విడవకుండా, మారకుండా పని చేయవచ్చని జీవితమంతా ఒకే చోట పనిచేయవచ్చని చందమామ నిరూపించింది. దానికి నేనే సాక్ష్యం.’ అంటారు శంకర్ గారు.

దక్షిణ చిత్ర వారు ఈమధ్య శంకర్ గారి బేతాళ కథల బొమ్మలను పెద్ద సైజులో మద్రాసులో మాయాజాల్ భవనం పక్క భవంతిలో పెట్టి ప్రదర్సించారు. శంకర్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆయనతో బేతాళ కథల చిత్రాల నేపధ్యం చెప్పించుకని పరవశించారు అక్కడికి వచ్చిన పిల్లలూ, పెద్దలూ.

దశాబ్దాలుగా తను గీస్తూ వచ్చిన బేతాళ బొమ్మలు భారీ సైజులో అక్కడ కనిపించేసరికి ఆయన మహదానందపడ్డారు. దక్షిణ చిత్ర నిర్వాహకులు ముందే చందమామను సంప్రదించి బేతాళ కథల ఒరిజనల్ శాంపుల్ చిత్రాలను అడిగి తీసుకోవడంతో ఆ కార్యక్రమానికి నిండుతనం చేకూరింది.

ఆ ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు పిల్లలు, పెద్దలు అందరూ ఆయన చుట్టూ మూగిపోయారట. ‘బేతాళ కథ బొమ్మలు గీయడంలో మీకు ఎవరు ఇన్‌స్పిరేషన్ అని అందరూ అడిగారట. కథకు తగిన బొమ్మ మీకు ఎలా స్ట్రయిక్ అవుతుంది. ఆ రహస్యం చెప్పండి’ అంటూ కోరారట.

చాలా సింపుల్‌గా సమాధానమిచ్చారాయన. ‘బొమ్మకు కథ ప్రాణం. కథ బాగా నడిచిందంటే సగం బొమ్మ అప్పుడే పూర్తయిపోయినట్లే. ఒకటికి రెండు సార్లు కథ చదువుతాను. తర్వాత కథతో పాటు చందమామ సంపాదకులు పంపించిన బొమ్మల వివరణ -ఇమేజ్ డిస్క్రిప్షన్- కూడా చూస్తాను. ఆవివరణకు తగినవిధంగా మనసులోనే బొమ్మ తయారయిపోతుంది. అన్నిటికంటే మించి చందమామకు బొమ్మ గీస్తున్నప్పుడు దేవుడు నన్ను ఆదేశించినట్లే ఉంటుంది నాకు. ఎందుకంటే ఆయన కదా నన్ను చందమామకు రమ్మని పిలిచింది. ఆయన కదా నన్ను తన బొమ్మలు వేయమని అడిగింది. ఇదే నా బొమ్మల రహస్యం’ అనేశారట ఆయన.

తనముందు నిలువెత్తు బేతాళ బొమ్మల చిత్రాల ప్రదర్శనను చూసిన ఆయన ఈ ప్రదర్శనపై అబిప్రాయాన్ని నిర్వాహకులు అడిగినప్పుడు ఒకే మాట అన్నారట. ‘వీటిని చూస్తుంటే నా వయస్సు ఒక్కసారిగా పదేళ్లు తగ్గిపోయినట్లనిపిస్తోంది.’

ఆయన మాటలు వింటున్న వారు మొత్తంగా కదిలిపోయారు. ఆ భవంతిలోని ఆ పెద్ద గది మొత్తంలో మౌన  ప్రశాంతత.

మద్రాసులో కొత్తగా ఆర్ట్స్ స్కూల్స్‌లో కోర్సులు చదువుతున్న పిల్లలు ఈ ప్రదర్శనకు వచ్చారు. ఆయన చుట్టూ మూగి ప్రశ్నలు సంధించారు. ‘ఈ కోర్సు పూర్తయిన తర్వాత మాకు ఉద్యోగావకాశాలు ఉంటాయా? చిత్రలేఖనాన్నే కెరీర్‌గా మార్చుకోవచ్చా?’ అని అడిగారు వారు. ఆయన ఇచ్చిన సమాధానం హృద్యంగా ఉంది.

‘పది నెలల తర్వాతే కదా బిడ్డ వస్తుంది. వెంటనే బొమ్మలు వేసేయాలి. పెద్ద జీతం పెద్ద ఉద్యోగం రావాలి అనుకుంటే ఎలా. మీరు ప్రతిఫలం ఆశించకుండా కృషి చేయండి సంవత్సరం, అయిదేళ్లు, పదేళ్లు మీకు మెచూరిటీ వచ్చేంతవరకు బొమ్మలు గీస్తూ పోండి. మీరు నమ్మి ఒక పని చేస్తే అది మీకు తప్పకుడా మేలు చేస్తుంది. ప్రతిఫలం ఇస్తుంది.’

‘మీరు పిల్లలు. మీముందు చాలా అవకాశాలు ఉన్నాయి. మంచి జీవితం దొరకదేమో అని భయపడవద్దు. మీలో వర్త్ ఉంటే ప్రపంచం మిమ్మల్ని ఎప్పటికైనా గుర్తిస్తుంది’ అని శంకర్ గారు వారికి సలహా ఇచ్చారు.

‘ఇన్ని సంవత్సరాలు బొమ్మలు వేశారు కదా మీకు విసుగు పుట్టలేదా అనడుగుతారు. పని మీద శ్రద్ద ఉంటే అది నా పని అనుకుంటే విసుగు ఎందుకొస్తుంది అన్నది నా ప్రశ్న’ ఇదీ ఆయన జీవన తాత్వికత.

శ్రీనివాస్ అని శంకర్ గారి బ్యాచ్‌లో పైన్ ఆర్ట్స్ కోర్స్ పూర్తి చేశారు. కాని ఆ రంగంలో ఇమడలేక తర్వాత మేస్త్రీ పనిలోకి దిగి దాంట్లోనే స్థిరపడిపోయారు. చాన్నాళ్ల తర్వాత ఆయన శంకర్ గారిని కలిసినప్పుడు ‘ఎప్పుడూ బొమ్మలేనా దాంట్లోంచి బయటకు రాలేవా’ అంటూ ఎకసెక్కాలాడారట మిత్రుడు.

‘నీకు బొమ్మల పిచ్చిరా’ అని మిత్రుడు అంటే ‘నీకు మేస్త్రీ పని పిచ్చిరా మరి!’ అన్నారట శంకర్ గారు. ‘నువ్వు జీవితమంతా తాపీ పని చేస్తూ నన్ను మాత్రం బొమ్మలు వేసే పని మానమంటావేంరా’ అని ఈయనా దెప్పిపొడిచారట.

తనతో పాటు ఆర్ట్స్ స్కూల్‌లో చదువుకున్న మిత్రులు చాలామంది చిత్రలేఖన రంగంలో ఇమడలేక ఇతర వృత్తులు చేపట్టారట. వీటిలో ఇదొక ఉదాహరణ.

(తమిళ చిత్ర హీరో సూర్య తండ్రి, అలనాటి తమిళ సినీ హీరో శివకుమార్ గారు ఇటీవలే శంకర్ గారి ఇంటికి వెళ్లి తాను చిత్రలేఖనం నుంచి నటనలోకి ఎలా జంప్ అయ్యారో చెప్పి నవ్వించారట. డబ్బులొచ్చే మార్గం బొమ్మల్లో కనబడలేదు కాబట్టే ముందస్తుగానే నేను తప్పుకుని నటనలోకి వెళ్లిపోయానని చెప్పారట. ప్రపంచమంతా డబ్బు మార్గమే చూడండి అంటూ ఈయన నవ్వడం ఫోన్‌లో..)

“గాడ్ విల్ బి యువర్ సైడ్ వెన్ యు పుట్ ఎపర్ట్ ఇన్ యువర్ వర్క్.”

‘దైవం మానుషరూపేణా’ అంటూ దైవం మనిషిరూపంలో వస్తాడనే మన పెద్దవారు అన్నారే తప్ప దైవం దైవం రూపంలో వస్తాడని ఎక్కడా చెప్పలేదు. మనుషుల్లోనే దేవుడున్నాడు. వారి పనిలో దేవుడున్నాడు. ఆ పనిని నీవు చిత్తశుద్దితో చేస్తే చాలు. అదే దేవుడికి నీవు అర్పించే నిజమైన పూజ. సేవ కూడా.

ఇది శంకర్ గారు గత 60 ఏళ్లుగా స్మరిస్తున్న మంత్రవ్యాక్యం.

Sri. K.C.Sivasankaran
(Chandamama Sr. Artist)
F2. Santham Apartments
No.46, Venkatesh Nagar Main Road
Virugambakkam
Chennai – 600092
Ph.044-64508610

 

గత సంవత్సరం హిందూ పత్రికలో చందమామ శంకర్ గారిపై వచ్చిన విశేష కథనం లింక్ ఇక్కడ చూడండి

Vikram, Vetala and Sankar

Bishwanath Ghosh

November 9, 2011 (in online. Aricle published in the hindu metro plus in 10-11-2011

http://www.thehindu.com/life-and-style/metroplus/article2611627.ece?homepage=true

గమనిక: శంకర్ గారి జన్మదినంకి సంబంధించి చిన్న సవరణ. ఆయనకు ఇప్పుడు 87 సంవత్సరాలు నిండి 88వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. స్వయంగా ఆయనను అడిగి నిర్ధారించుకున్న తర్వాతే ఆయన జన్మ సంవత్సరానికి సవరణను ఇక్కడ పొందుపర్చడమైనది. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు.


RTS Perm Link

తిండి దొరకని సమాజోన్నతి నాకెందుకు?

July 6th, 2012

చందమామ చక్రపాణి గారు ఇంకా మద్రాసుకు అడుగుపెట్టనప్పుడు ఆయన బెంగాల్ భాషలోంచి అనువాదం చేసిన ‘పాంచజన్యం’ కథల సంపుటిని 1939లో నాటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య గారు పరిచయం చేశారు. ఈ అరుదైన పరిచయం 1997 మార్చి నెలలో వచ్చిన ‘చక్రపాణీయం’ పుస్తకంలో ఉంది. చక్రపాణి గారి అనువాదం అనువాదంలా కాక స్వతంత్ర రచనగా కన్పడేది అంటూ సుందరయ్య గారు చేసిన ఈ పరిచయాన్ని పాఠకుల సౌలభ్యం కోసం ఇస్తున్నాను.

1939లో చేసిన ఈ సమీక్షలో ఒక కథలోని పిల్లి పాత్ర ద్వారా చెప్పించిన వాక్యం. “తిండి దొరకని సమాజోన్నతి నాకెందుకు?”

నాలుగు కార్ల ఫ్యాక్టరీలు, రెండు విమానాశ్రయాలు, అయిదు ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, నాలుగు లైన్ల రోడ్లు వేయడమే అభివృద్ధి అని ఊదరగొడుతున్న ఈ ప్రపంచీకరణ యుగానికి కూడా వర్తించదగిన గొప్ప ప్రశ్న ఇది.

తిండి దొరకని సమాజోన్నతి నాకెందుకు?
రాసిన 70 సంవత్సరాల తర్వాత కూడా ప్రాసంగికతను కోల్పోని గొప్ప వాక్యం. చక్రపాణి గారు బెంగాలీ లోంచి అనువదించిన ఈ దొడ్డ మనసు ‘పిల్లి’ కథ ఇప్పుడు చదివేందుకు దొరికితే ఎంత బావుణ్ణో..

సుందరయ్య గారి పరిచయాన్ని కింద చూడండి.

పాంచజన్యం – కథల సంపుటి
-పుచ్చలపల్లి సుందరయ్య
ప్రజాబంధులో ‘బడదీదీ’ నవల నవశక్తిలో ‘దేవదాస్’ ‘పరిణీత’ లు ప్రకటించబడుతూ ఉన్నప్పుడు చాల ఆతురతతో చదివేవాణ్ణి. చక్రపాణి భాషాంతరీకణం భాషాంతరీకరణంగా కన్పడక అసలు స్వతంత్ర రచనగానే కన్పడేది. వారు తిరిగి పాంచజన్యమను పేర కొన్ని కథలను తర్జుమా చేశాక వాటిని కూడా చాలా ఆతురతతో చదివాను.

‘పిల్లి’లో ఆకలిబాధచే మాడుతూ ఉన్నవారికి కష్టాలూ, ధనవంతులకు, తిండికి లోటు లేనివారికి గౌరవాలూ వస్తాయి. ఈ పరిస్థితుల నుండి బయటపడాలంటే ధనవంతులు సమాజంపై తమ లాభాలకోసం విధించిన నిబంధనలను ఉల్లంఘించడమే మార్గమని పిల్లి ఉపన్యసిస్తుంది. తిండి దొరకని సమాజోన్నతి నాకెందుకు అన్నది పిల్లి. దానికే కాదు. ఏ మనిషికీ కూడా అవసరం లేదు. అసలు అది సమాజోన్నతి కూడ కాదు.

‘సామ్యవాదం మంచిదని మేము ఒప్పుకుంటాము, కాని దానికి ఒక హద్దున్నది.’ తమకు పైనున్నవారు తమ్ము సమానంగా చూడాలి. తాము మాత్రం తమ కన్న కింద ఉన్నవారిని తమతో సమానంగా చూడరు. ఈ ధోరణిని వ్యక్తీకరిస్తూ ఉన్న ఒక చిన్న వ్యంగ్యం ‘కానీ కడగండ్లు.’

ప్రభుత్వాలు, ఉద్యోగస్తులు, ‘కుట్ర’లను భయంతో ఎంత నిరాధారంగా ప్రజలపై అత్యాచారాలు దౌర్జన్యాలు చేస్తారో ‘కుట్ర’ వెల్లడిస్తూ ఉంది.

దేశద్రోహి తన సర్వస్వం దేశసేవలో ధారపోస్తాడు. తల్లికి తిండి కూడ ఏర్పాటు చేయడు. కారాగారంలో పడి క్షయతో బయటపడుతాడు. ఈతని త్యాగసేవలపై నాయకత్వం సంపాదించిన వ్యక్తి ఇతనిని నిరసిస్తాడు. ‘దేశద్రోహి’ అంటాడు. ప్రజలు ఈ వింత ‘దేశద్రోహి’ని కొట్టి చంపుతారు. ఈ చిన్న కథ ప్రస్తుతం మన దేశ సేవకుల స్థితిని ఒక పర్యాయం కన్నులకు కట్టినట్లు తెలియచేస్తూ ఉంది. దేశానికి సర్వస్వం ధారపోసి పనిచేస్తూ ఉన్న వారికి, వారి కుంటుంబాలకు తగిన ఉపాధులు కల్పించడం, వారిని మరిచిపోకుండటం ప్రజలు చేయవలసిన కనీస ధర్మమని ఇది ఎలుగెత్తి చాటుతూ ఉంది.

‘మీరూ – మేమూ’ ప్రాచ్యదేశాలకు, పాశ్చాత్య దేశాలకు ఉన్నవనుకునే భేదాలను తీసుకుని వ్యంగ్యంగా రాయబడింది. మన దేశంలోని మూఢ విశ్వాసాలను, తీవ్రంగా ఎత్తిపొడుస్తూ ఉంది. ఈ ఎత్తిపొడుపులతో పౌరుషం తెచ్చుకుని దేశ స్థితి మార్చడానికి పాఠకులు నడుము కట్టుతారనుకుంటాను.

కాని ఈ కథనలన్నిటిలోనూ పాఠకుల్ని, భారతీయుని ఎక్కువ సంతృప్తి పరచేది కథ ‘అడ్డం తిరిగితే.’ కాని ఈ సంతృప్తి చేతకాని వానికి మాత్రమే కలుగుతుంది. భారతీయులు ఇంగ్లండుపై రాజ్యాధికారం చేస్తున్నారనుకోండి. అప్పుడు మనం వారిని ఇంగ్లీషువారు మనకు నేడు చూపుతున్న మార్గాన వెళ్లితే. ఇంగ్లీషు వారిని ఏవిధంగా అవమానాలకు గురిచేయగలమో తెలియజేసే ఒక ఊహాచిత్రం.

భారతీయులకెప్పుడూ ఇంగ్లండుపై గాని మరియే ఇతర దేశంపై కాని పెత్తనం వద్దు. వారిని మనం ప్రతీకారం కోసమని నీచంగా చూడము. కానీ ఈ ఊహాచిత్రంలో ప్రతి భారతీయుడూ తన జీవితంలో ప్రతి ఘట్టమందు ఇంగ్లీషువారు తన్ను ఏ విధంగా అవమానపరుస్తూ ఉందీ గుర్తించి స్వాతంత్ర్య పిపాసి అవుతాడని వ్యంగ్యంగా రాయబడింది. ప్రతి భారతీయుడు దీనిని చదవాలి. ఆత్మ గౌరవం కాపాడుకోవాలి. దానికోసం స్వాతంత్ర్య సంపాదించుకోవాలి.

ఇలాంటి కథలు, బెంగాలీ భాషనుండీ అనువదించి ఇచ్చిన చక్రపాణికి ఆంధ్రులు కృతజ్ఞులు. కాని ఆంధ్రభాషలోనే ఇట్టి కథలు స్వతంత్రంగా ఎప్పటికి రచించడము.
(ఆగస్టు 1939)

‘చక్రపాణీయం’ నుంచి. 82వ పుట.

————————–

ఈ పుస్తకం లోని 81వ పుటలో చందమామ ఎందుకు చదవాలో, చదివించాలో చెప్పే ఒక చిన్న భాగాన్ని కూడా ఇక్కడ చూడండి.

మానసిక ప్రశాంతతను తెచ్చే చందమామ
మానసిక ప్రశాంతత కోసం డాక్టర్లు ఏ సలహా ఇస్తారో కాని, నేను మాత్రం చందమామ చదవమని చెబుతాను. ఈ రోజుల్లో పిల్లల్ని పెంచటం కష్టమని చెప్పే ప్రతి తల్లికీ, తండ్రికీ నేను చెప్పే మొదటి సలహా,  తమ పిల్లల చేతుల్లో చందమామ పత్రిక పెట్టమని. చందమామ వారి పిల్లలకు బుద్ధి కుదురు, ముడ్డి కుదురు కలుగజేసి సజ్జనులుగా తయారవటానికి పునాది వేస్తుందని.
— ఏలేశ్వరపు రఘురామశర్మ.
‘పరోక్షంగా ప్రభావితం చేసిన ప్రత్యక్ష వ్యక్తి’ కథనంలోంచి కొంత భాగం
‘చక్రపాణీయం’ నుండి, పుట 81

RTS Perm Link

దైవకణాలా? దైవ ధిక్కార కణాలా?

July 4th, 2012

మూడే్ళ్ల అనంతరం దైవకణాల గుట్టు గురించి మళ్లీ వార్తలు వస్తున్నాయి.

I think we have it. You agree

అంటూ ఈ బుధవారం ఉదయం సెర్న్ డైరెక్టర్ జనరల్ రాల్ఫ్ హ్యూయర్, ‘దైవకణాలు’ అని పేరొందిన హిగ్స్ బోసోన్‌ ఉనికి నిర్ధారించబడినట్లు ప్రకటించి విజ్ఞాన శాస్త్రంలో పెను సంచలనం రేపారు.

God Particle Found Historic Milestone From Higgs Boson Hunters

కాని ‘దైవకణాలు’ అనే పదబంధమే ఇటీవలి చరిత్రలో అత్యంత వక్రీకరించబడిన భావనగా నిలిచిపోయింది. దైవ ‘ధిక్కార’ కణాలను దైవ కణాలుగా తారుమారు చేసి నిలిపిన ఈ ‘దైవకణాల’ వెనుక చరిత్రను మిత్రులు, వెన్నెలకంటి రామారావు గారు మూడున్నర ఏళ్ల క్రితమే “‘దైవ’ కణాల మహాన్వేషణ” అనే కింది వ్యాసంలో సుస్పష్టంగా వివరించారు.

ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ విభాగంలో పనిచేస్తున్న రామారావు గారి ఆమోదంతో తాను గతంలో రాసిన ఈ బృహత్ వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాను.

‘దైవ’ కణాల మహాన్వేషణ
ఏమిటి? ఎలా? ఎందుకు? అనే ప్రశ్నలు మానవ మస్తిష్కాల్ని సహస్రాబ్దాల తరబడి నిరంతరాయంగా తొలుస్తూనే ఉన్నాయి. తన గురించి, తానున్న ప్రపంచం గురించి, ఆ ప్రపంచంలో తన స్థానం గురించి నిరంతరాయమైన అన్వేషణ, పర్యవసానంగా విశ్వం ఆవిర్భావానికి చెందిన పలు నమూనాలను మానవులు సృష్టించుకున్నారు. అర్థం కాని అంశాలను విశ్వాసాలతో భర్తీ చేసుకుంటూ, ప్రకృతితో చేసే అస్తిత్వ పోరాటంలో ఆత్మవిశ్వాసం కోసం ‘దైవ’ భావనను సృష్టించుకున్నారు. సూక్ష్మ, స్థూల ప్రపంచాల అంతస్సారం మనిషికి మరింతగా అవగతమయ్యే కొద్దీ మరిన్ని శాస్త్రీయమైన, విప్లవాత్మకమైన విశ్వనమూనాలు ఉనికిలోకి వచ్చాయి.

విశ్వాసం నుంచి విజ్ఞానానికి మనిషి చేస్తున్న అనంతమైన గ్రహణ క్రమమే ఈ అన్వేషణ. అణువులు, పరమాణువులు, ఎలక్ట్రాన్-ప్రొటానుల్లాంటి ప్రాథమిక కణాలు, క్వార్క్‌లు వరుసగా విశ్వ నిర్మాణపు మౌలిక ప్రాథమిక కణాల భావనలు వచ్చాయి. వస్తూనే ఉంటాయి.. ఈ అన్వేషణ ఇంతటితో ఆగిపోయిందనడానికి లేదు. అంకెల్ని లెక్కించడం ఎలా అనంతమో, సత్యాన్వేషణ కూడా ఒక అనంత పరిణామ క్రమం ఈ క్రమంలో బిగ్‌బ్యాంగ్ విశ్వావిర్భావ సిద్ధాంతం, తొలి విశ్వ పదార్థమైన ‘హిగ్స్ బోసాన్’ భావనలు ఆవిర్భవించాయి. అణువు నుంచి బ్రహ్మాండ గోళాల ఆవిర్భావానికి ఈ హిగ్స్ బోసాన్‌లే ప్రాణం. అందుకే వీటికి ‘దైవకణాల’ని  పేరొచ్చింది. వీటి కోసమే ఈ మహాన్వేషణ.

***************

ప్రకృతి రహస్యాలను ఛేదించేందుకు మనిషి బహుముఖంగా కృషి చేస్తూనే ఉన్నాడు. విశ్వ రహస్యాలను శోధించే లక్ష్యంతో ప్రపంచంలో కెల్లా అతి పెద్ద పార్టికల్ యాక్సిలరేటర్ (కణవేగవర్ధక పరికరం) లార్జ్ హెడ్రాన్ కొల్లాయిడర్ – ఎల్‌హెచ్‌సి- ని యూరోపియన్ యూనియన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాకు సమీపంలో, ఫ్రాన్స్ సరిహద్దున కణ-భౌతిక శాస్త్ర ప్రయోగశాల కేంద్రంగా 27 కిలోమీటర్ల చుట్టు కొలతతో కూడిన ఎల్‌హెచ్‌సి నిర్మాణం జరిగింది. 2008 సెప్టెంబర్ 10న యాక్సిలేటర్ ప్రయోగం ప్రారంభంలోనే విఫలమైంది. అయస్కాంతాల చుట్టూతా ఏర్పాటు చేసిన ద్రవ  హీలియం కారిపోవడంతో ప్రయోగాన్ని అర్థాంతరంగా నిలిపివేయవలసి వచ్చింది.

దాదాపు ఏడాది కాలంపాటు దానికి మరమ్మత్తు పనులు జరిగాయి. ఈ పరికరంలో కాంతివేగంతో ప్రోటాన్ కణపుంజాలను విజయవంతంగా సృష్టించినట్లు సెర్న్ శాస్త్రవేత్తలు 2008 నవంబర్ 24న ప్రకటించారు. ప్రొటాన్ కణాలను శాస్త్రవేత్తలు నెలరోజులపాటు కొల్లాయిడర్‌లో నింపారు. ఆ ప్రొటాన్లు కొల్లాయిడర్ చుట్టుకొలత ఆసాంతం ఒక కణపుంజంగా రూపొందాయి. మొదటగా సవ్యదిశలో తిరిగే ప్రొటాన్ కణపుంజాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆ తర్వాత మూడురోజుల లోపు, అపసవ్య దిశలో చలించే మరో ప్రొటాన్ కణపుంజాన్ని సిద్ధం చేయగల్గారు. ఒక ఖచ్చితమైన, సువ్యవస్థితమైన, వ్యతిరేక దిశల్లో పరిభ్రమించే కణతరంగాలుగా శాస్త్రవేత్తలు ఈ రెండు కణపుంజాలను ఎల్‌హెచ్‌సిలో సమన్వయించారు. ఈ ప్రొటాన్ కణపుంజాలు ఒకదాన్నొకటి ఢీకొట్టుకునేందుకు దాదాపు పదిరోజుల సమయం పడుతుందని, దాంతో ప్రొటాన్ కణపుంజాలు నిర్వహణ, నియంత్రణలకు తగిన సమయం ఉంటుందని సెర్న్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

దాదాపు కాంతివేగంతో ప్రయాణించే ప్రొటాన్ కణ పుంజాలు ఢీకొట్టడంతో ఒక చిన్నపాటి బిగ్ బ్యాంగ్ ఏర్పడుతుంది. కాంతివేగంలో 99.999991 శాతం వేగంతో ప్రయాణించే ప్రొటాన్ కణ పుంజాలు సెకనుకు 11,245 చుట్లు తిరుగుతూ 600 సార్లు ఢీకొంటాయి. కాంతివేగంతో ప్రయాణించే ప్రొటాన్ కణపుంజాలను ఢీకొట్టించడం ద్వారా మహా విస్పోటనం (బిగ్‌బ్యాంగ్) నాటి పరిస్థితులను ప్రయోగశాలలో సృష్టించి, ఆ తొలి క్షణాల్లో ఏర్పడే హిగ్స్ బోసాన్ కణాలను ప్రయోగశాలలో పట్టుకునేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. విశ్వ రహస్యాలు ఈ ప్రయోగం ద్వారా వెల్లడి కాగలవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదొక గొప్ప శాస్త్ర సాంకేతిక అద్భుతమని, విజ్ఞాన శాస్త్ర చరిత్రలోనే ఇంత పెద్ద వైజ్ఞానిక కార్యక్రమం జరగలేదని యూరోపియన్ ఆర్గనేజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (సీఈఆర్ఎన్-సెర్న్) ప్రాజెక్ట్ అధిపతి లైన్ ఇవాన్స్ వ్యాఖ్యానించారు.

ఈ ప్రయోగం ద్వారా విశ్వంలో మాయమైన ద్రవ్యరాశిని గురించి మనం తెలుసుకునే వీలుంటుంది. విశ్వంలోని కేవలం నాలుగు శాతాన్ని మాత్రమే మనం ఇంతవరకు తెలుసుకోగలిగాము. 96 శాతం విశ్వ సమాచారం పట్ల మనకెలాంటి అవగాహన లేదు. అది కేవలం ఒక మార్మిక విషయంగా మిగిలింది. ఈ ప్రయోగంలో ఈ మర్మాన్ని ఛేదించే వీలుంటుంది. మహావిస్ఫోటనం తర్వాత ఏర్పడే తొలి ద్రవ్యరాశికి చెందిన మౌలిక కణాలను హిగ్స్ బోసాన్లుగా శాస్త్రవేత్తలు పిలుస్తారు.

దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఈ కణాలను సైద్ధాంతికంగా ఆవిష్కరించినప్పటికీ, ఇప్పటిదాకా ప్రయోగాత్మకంగా పట్టుకోలేకపోయారు. బ్రహ్మాండ గోళాల ఆవిర్భావానికి బొసాన్లు ప్రథమ, ప్రధాన కారణం కావడం మూలాన వీటికి ‘దైవకణాలు’ అని పేరొచ్చింది. ఎల్‌హెచ్‌‌సీ ద్వారా కృత్రిమ బిగ్ బ్యాంగ్‌ను సృష్టించి, బోసాన్లను పట్టుకోవడం ద్వారా విశ్వరహస్యాన్ని ఛేదించాలని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. అయితే ఇలాంటి కృత్రిమ బిగ్‌బ్యాంగ్‌ వల్ల బ్లాక్ హోల్స్ (కృష్ణబిలాలు) ఏర్పడి, అది 15 నిమిషాల్లో భూమినే మింగివేసే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెను నక్షత్రాలను సైతం మింగివేసే బ్లాక్ హోల్స్ ఏర్పడి, మహాప్రళయానికి దారితీస్తుందా? అన్న భయాందోళనలు శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు.

బొసాన్‌లే అన్నిటికీ మూలం!
ఉనికిలో ఉన్న విశ్వపదార్థాని కంతటికీ మూలం బోసాన్ (దైవకణం) అనేది శాస్త్రవేత్తల భావన. ప్రొటాన్ కణ పుంజాలు ఢీకొన్న విధ్వంస శిథిలాల అధ్యయనం ద్వారా విశ్వావిర్భావ రహస్యం అవగతమయ్యే అవకాశముంది. మీసాన్‌ల ద్వారా అనబంధించబడిన ప్రొటాన్లు, న్యూట్రాన్లతో ఏర్పడిన కేంద్రకం, ఎలక్ట్రాన్ల సమ్మేళనంతో విశ్వపదార్థం ఏర్పడిన విషయం తెలిసిందే. రెండు కేంద్రకాలు ఢీకొన్నపుడు సూర్యుని కేంద్రంలోని ఉష్ణోగ్రత కంటే లక్షల రెట్లు హెచ్చు ఉష్ణోగ్రత ఏర్పడే అవకాశముందని శాస్త్రవేత్తల అంచనా. అంతటి తిరుగులేని ఉష్ణోగ్రతల్లో పరమాణు ప్రాథమిక కణాలు తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. ప్రొటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ కణాలు ఆరు రకాల క్వార్క్‌ కణాలుగా విడిపోతాయి. ఈ క్వార్కులు గ్లూయన్స్‌తో అనుబందించబడి ఉంటాయి.

మహా విస్ఫోటన ఉష్ణోగ్రతల్లో అస్తిత్వాన్ని కోల్పోయిన పరమాణు ప్రాథమిక కణాల క్వార్క్‌లు, గ్లూయన్స్‌ల మిత్రమ ప్లాస్మాగా రూపాంతరం చెందుతుంది. ఆ ఉష్ణోగ్రత ఎంతటి అనితర సాధ్యమైనదైనప్పటికీ, బిగ్‌బ్యాంగ్ సమయంలో అలాంటి ఉష్ణోగ్రతలు వెలువడి విశ్వావిర్భావ తొలినాళ్లలో క్వార్క్‌లు, గ్లూయాన్ల ప్లాస్మా వాతావరణం ఏర్పడినట్లు శాస్త్రవేత్తల అంచనా. ఎల్‌హెచ్‌సీ ప్రయోగం ద్వారా విశ్వావిర్భావం నాటి తొలి కణాలను సృష్టించేందుకు సెర్న్ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాల నుంచి దాదాపు 10 వేల మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 800 కోట్ల డాలర్లను ఈ ప్రయోగ నిర్వహణకు ఖర్చు చేస్తున్నారు. 30 ఏళ్ల నాటి హిగ్స్ బోసాన్ ఉనికి ఈ ప్రయోగంతో తేలిపోతుంది.

బోసాన్ మీమాంస
బోసాన్‌లపై శాస్త్రవేత్తలు రెండు శత్రు శిబిరాలుగా చీలిపోయారు. కొంతమంది బోసాన్ కణాల ఉనికిలో ఉండే అవకాశమే లేదన్న వాదనను బలంగా ముందుకు తెస్తున్నారు. హిగ్స్ బోసాన్‌ల భావనను తప్పు పట్టిన వారిలో అభినవ ఐన్‌స్టైన్, స్టీఫెన్ హాకింగ్ ప్రముఖంగా ఉన్నారు. అసలు ఉనికిలో లేని బోసాన్ కణాల కోసం ప్రయత్నించడంలో నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఈ ప్రయోగం ద్వారా హిగ్స్ బోసాన్‌లు ఉండవని, అదొక తప్పుడు సూత్రీకరణ అని తేలిపోవడమే కాక, పలు కొత్త విషయాలు వెలుగులోకి రావడంతో సరికొత్త వైజ్ఞానిక సూత్రీకరణలను రూపొందించగలమన్న ఆశాభావాన్ని హాకింగ్ వ్యక్తం చేశారు. ఎల్‌హెచ్‌సీ ప్రయోగం ద్వారా ‘దైవకణాల’ను కనుగొనలేరని ఆయన 100 డాలర్ల పందెం కట్టారు కూడా. హిగ్స్ బోసాన్ ఆవిష్కరణ ద్వారా పదార్థ ద్రవ్యరాశి భావన గురించి మరింత లోతైన అవగాహన కలుగుతుందన్న ఆశాభావాన్ని సైతం హాకింగ్ సవాలు చేశారు. హిగ్స్ బోసాన్ కణాల భావన సూత్ర రీత్యా తప్పుడు అవగాహనతో రూపొందిందని హాకింగ్ చాలాకాలం క్రితమే పలు వ్యాసాల్లో, రచనల్లో ఖండించారు. ఈ సిద్ధాంతాన్ని ఆయన పూర్తిగా తోసిపుచ్చారు.

అయితే హాకింగ్ వ్యాఖ్యానాలను దైవకణాల  సృష్టికర్త హిగ్స్ తోసిపుచ్చారు. కణ భౌతిక శాస్త్రంలో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని హాకింగ్ చొప్పిస్తున్నారు… ఈ అంచనా నుంచి చూస్తే శుద్ధ  భౌతిక శాస్త్రవేత్తల సిద్ధాంతాలన్నీ తప్పుడు తడకలుగా కనిపిస్తున్నాయని హిగ్స్ వ్యాఖ్యానించారు.

దైవకణాలా? దైవ ధిక్కార కణాలా?
బిగ్ బ్యాంగ్ జరిగిన తరుణంలో కణాలకు ఎలాంటి బరువూ ఉండదు., సెకనులో శతకోటి వంతు కాలంలో ఆ కణాలకు బరువు చేకూరుతుంది. ఈ ప్రక్రియను అర్థం చేసుకునేందుకు ‘హిగ్స్ క్షేత్రం’ లోని హిగ్స్ బోసాన్ కణాలు పరస్పరం చర్యాప్రతిచర్యలు జరిపే పరిమాణంపై ఆధారపడి పలు ద్రవ్యరాశులతో కూడిన పదార్థాలు ఆవిర్భవించాయని హిగ్స్ ప్రతిపాదించారు. ఇప్పటివరకు ప్రపంచ శాస్త్రవేత్తలు ఈ భావననే ప్రామాణికంగా తీసుకున్నారు. ‘హిగ్స్ బోసాన్’ లను కనుగొనే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు.

ఈ భావనను దాదాపు 44 ఏళ్ల క్రితం హిగ్స్ ప్రతిపాదించారు. పీటర్ హిగ్స్ ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర శాఖలో ఎమిరటీస్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆయన స్వభావరీత్యా ఒక నాస్తికుడు. తాను ప్రతిపాదించిన మౌలిక కణాలకు ఆయన హిగ్స్ బోసాన్స్ అని మాత్రమే పిలిచారు. అయితే హిగ్స్ భావనను లియోన్ లిడర్‌మాన్ వ్యాఖ్యానిస్తూ రాసిన పుస్తకంలో ‘హిగ్స్ బోసాన్‌’లకు ‘ది గాడ్ డామ్ పార్టికల్స్’ (దైవ ధిక్కార కణాలు) అని ముద్దు పేరు పెట్టారు. అయితే లిడర్‌మాన్ పుస్తకాన్ని ప్రచురించిన ప్రచురణ కర్త ‘గాడ్ డామ్ పార్టికల్స్’ –god damn particles– అన్న పేరులోని ‘డామ్’ ను తొలగించి ‘గాడ్ పార్టికల్స్‘ -దైవ కణాలు- అని ముద్రించడం జరిగింది. అప్పటి నుండి హేతువాది హిగ్స్ అభీష్టానికి పూర్తి విరుద్ధంగా హిగ్స్ బోసాన్ కణాలకు దైవకణాలనే పేరు స్థిరపడిపోయింది. హిగ్స్ ఈ ప్రచారాన్ని అడ్డుకోలేకపోయారు.

లార్జ్ హెడ్రాన్ కొల్లాయిడర్ (ఎల్‌హెచ్‌సి)
ఎల్‌హెచ్‌సీ ఒక అద్భుతమైన పరికరం. ఇందులో అలీస్, క్రయోజనిక్ మ్యుయాన్ స్పెక్ట్రోమీటర్, ఏటర్రోయిడల్ ఎల్‌హెచ్‌సీ ఆపరేటస్ లేదా అట్లాస్ అని మూడు గొప్ప అయాన్ డిటెక్టర్లుంటాయి. వీటి నిర్మాణానికి వందలాది కోట్ల డాలర్లు ఖర్చయ్యాయి. యూరప్, భారతీయ శాస్త్రవేత్తలతో సహా పలువురు 15 ఏళ్లపాటు శ్రమించి దీన్ని రూపొందించారు. కాంతివేగంతో ప్రయాణించే ప్రొటాన్ కణపుంజాలను సృష్టించేందుకు ఈ పరికరంలో అతి పెద్ద సూపర్ కండక్టింగ్ అయస్కాంతాలను ఉపయోగించారు.

ప్రోటాన్ కణపుంజాలను సృష్టించే సమయంలో విపరీతమైన వేడి వెలువడుతుంది. మైనస్ 271 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా పరమ శూన్య ఉష్ణోగ్రత కంటే కేవలం 1.9 డిగ్రీలు అధికంగా ఉండే ఉష్ణోగ్రతల ద్వారా ఆ అయస్కాంతాలను చల్లబరుస్తారు. అందుకోసం అధునాతనమైన క్రయోజెనిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు వినియోగించారు. అతిశీతల ఉష్ణోగ్రతలను సృష్టించేందుకు ప్రారంభంలో దాదాపు 1.20 కోట్ల లీటర్ల ద్రవ నైట్రోజన్, దాదాపు 7 కోట్ల లీటర్ల ద్రవ హీలియంలు ఖర్చవుతాయి. ఈ ఎల్‌హెచ్‌సి శక్తిని విపరీతంగా వినియోగిస్తుంది. అత్యధిక శక్తి క్షేత్రంలో ప్రొటాన్ కణపుంజాలను ఢీకొట్టించడం ఒక మహాద్భుతంగా చరిత్రకెక్కనుంది.

ఎల్‌హెచ్‌సీని తిరిగి పనిచేయిస్తున్న ప్రయత్నాలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఎల్‌హెచ‌సీ పరిస్థితి ఉత్కృష్టంగా తయారయింది. అని సెర్న్ డైరెక్టర్ స్టీవ్ మేయర్స్ ప్రకటించారు. మొదటగా ప్రొటాన్ కణపుంజాలు సాపేక్షికంగా 900 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్టు (జీఈవీ) అతి తక్కువ శక్తితో ఢీకొట్టుకుంటాయి. ఒక్కొక్క కణపుంజం 450 జీఈవీ శక్తిని సరఫరాగా చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. శీతాకాలం విరామం తర్వాత, ఎల్‌హెచ్‌సీ కార్యక్రమాలు తిరిగి 2010 జనవరిలో ప్రారంభం కానున్నాయి. అప్పుడు శాస్త్రవేత్తలు ప్రొటాన్ కణపుంజాలకు 7 టీఈవీ వోల్టుల శక్తిని అందిస్తారు. అంత శక్తితో ప్రొటాన్ పుంజాలు ఢీకొట్టుకోవడంతో బిగ్ బ్యాంగ్ పరిస్థితులు నెలకొంటాయి.

బిగ్ బ్యాంగ్ కాలం నుంచి ఈనాడు మనం చూస్తున్న విశ్వం దాకా జరిగిన పరిణామ క్రమాన్ని పరిశీలించేందుకు ఎల్‌హెచ్‌సీలోని అత్యంత శక్తివంతమైన కణపుంజాల అభిఘాతం ఉపకరిస్తుందని శాస్త్రవేత్తల భావన. దాంతో విశ్వం పుట్టుక రహస్యాన్ని ఛేదించేందుకు వీలవుతుందని వారు ఆశిస్తున్నారు. బిగ్ బ్యాంగ్ జరిగిన తొలి క్షణాల్లో తొలి పదార్థ ప్రాథమిక కణాలుగా హిగ్స్ బోసాన్‌లు ఏర్పడుతాయన్న సైద్ధాంతిక పరకల్పన కూడా ఈ ప్రయోగం ద్వారా తేలిపోతుంది. హిగ్స్ బోసాన్ కణాలతో సాధారణ అణువుల నుంచి బ్రహ్మాండ గోళాల వరకు క్రమంగా ఏర్పడ్డాయన్నది శాస్త్రీయమైన అంచనా. ప్రయోగ శాలలో బిగ్ బ్యాంగ్‌ను సృష్టించేందుకు అసాధారణ జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అంతరిక్షంలోని అత్యల్ప ఉష్ణోగ్రతల కంటే తక్కువ స్థాయి ఉష్ణోగ్రతల్లో వేలాది విద్యుదయస్కాంతాలను పనిచేస్తున్నారు. ఈ విద్యుదయస్కాంతాలు భిన్న దశల్లో ప్రయాణించే ఆ రెండు ప్రొటాన్ కణపుంజాల గమనాన్ని, గమ్యాన్ని నిర్దేశిస్తాయి.

కణ భౌతిక శాస్త్రంలో ‘సెర్న్’ అగ్రగామి
ప్రకృతి చీకటి కోణాలపై దృష్టి సారించి పలు అద్భుతాల వెనుక దాగిన మర్మాలను వెలుగులోకి తెచ్చేందుకు పార్టికల్ యాక్సిలేటర్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం రెండవ ప్రపంచ యుద్ధం నుంచి కోలుకుంటున్న యూరప్ దేశాలు సెర్న్ అనే సంస్థను ఏర్పాటు చేశాయి. ఈ సంస్థ కార్యకలాపాల వలన యుద్ధ నష్టాల్లో కూరుకుపోయిన యూరప్‌లో శాస్త్ర సాంకేతిక విప్లవం మరోసారి వివృతమయింది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ మరి ఇతర యూరప్ దేశాలు సెర్న్ నిర్మాణంలో కీలకపాత్రను పోషించాయి. అమెరికా నుంచి కూడా పలువిధులను సేకరించడం జరిగింది.

సెర్న్ కార్యకలాపంలో పలు ఆవిష్కరణలు పురుడు పోసుకున్నాయి. సెర్న్ కృషి ఫలితంగా విద్యుత్ అయస్కాంత శక్తి, రేడియో ధార్మికత కేంద్ర శక్తి రెండింటి ఏకీకరణ సాధ్యమయింది. ప్రాథమిక కణాలకు సంబంధించిన తొలి ఆవిష్కరణల పర్యవసానంగా వరల్డ్ వైడ్ వెబ్‌గా పిలిచే వెబ్ కంప్యూటింగ్ వ్యవస్థ రూపొందింది. యాక్సిలేటర్ భౌతిక శాస్త్రంలో చేసిన విశేష కృషికి గాను సెర్న్‌కు చెందిన భౌతికవేత్తలు కార్లో రూబియా, సైమన్ వాండర్ మీర్‌లకు 1984లో నోబెల్ బహుమతి వచ్చింది. ప్రత్యేకించి ఎల్‌హెచ్‌సీ నిర్మాణానికి సంబంధించిన ఘనత రూబియాకు చెందుతుంది.

దైవకణాల అన్వేషణలో భారత్  పాత్ర
సెర్న్ ఏర్పాటు చేసిన తొలినాళ్లలో మన దేశం పాత్ర నామమాత్రంగా ఉండేది. 1980ల దాకా భారత్ నుంచి సెర్న్ ఒకే ఒక ప్రతినిధి ఉండేవారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌కు చెందిన పీకే మల్హోత్ర సారథ్యంలో ఒక శాస్త్రవేత్తల బృందం సెర్న్ పరిశోధనా కార్యకలాపంలో పాలు పంచుకుంది. కలకత్తాలోని ‘వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్’, భువనేశ్వర్ లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్, ఐఐటీ -బాంబే, రాజస్థాన్, జమ్మూ-కాశ్మీర్, ఛండీగఢ్, పంజాబ్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు సెర్న్‌ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. ఫోటాన్ మల్టిప్లిసిటీ డిటెక్టర్ (పీఎమ్‌డి) ఎల్‌హెచ్‌సీలో కీలక భూమిక పోషించనుంది.

సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్తలు మ్యుయాన్ ఆలీస్ డిటెక్టర్‌లో మానస్ అని పిలిచే ఒక లక్ష ఎలక్ట్రానిక్ చిప్‌ల ఆకృతి, నిర్మాణాలను చేపట్టారు. ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం సహకారంతో ఆ సంస్థ ఆలీస్ యాక్సిలరేటర్‌కు చెందిన ఒకానొక భాగాన్ని అభివృద్ధి చేసింది. ఆలీస్ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి కూడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ సంస్థ భాగస్వామిగా కొనసాగుతోంది. ప్రోటాన్ కణ పుంజం నిలిచేందుకు ఉపకరించే 40 మిలియన్ డాలర్ల విలువ చేసే సూపర్ కండక్టింగ్ స్టీర్ మాగ్నెట్ జాక్స్‌ను రాజా రామన్న సెంటర్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సంస్థ అందజేసింది. ఈ నేపథ్యంలో నక్షత్రాల్లోని ఫోటాన్ శిథిలాలను అంచనా వేసేందుకు అమెరికాకు చెందిన బ్రూకోవన్ నేషనల్ లేబొరేటరీ సంస్థ భారతీయ శాస్త్రవేత్తలను ఆహ్వానించింది.

ఎల్‌హెచ్‌సీలోని మూడు డిటెక్టర్లు ప్రొటాన్ కణ పుంజాలు ఢీకొన్న తర్వాత ఏర్పడిన శిథిలాలను పరిశీలిస్తాయి. ఆ డిటెక్టర్‌లలో అమర్చిన భారతీయ పరికరాలు పీఎమ్‌డీ, మానస్ చిప్‌లు అత్యంత ప్రాథమికమైన ప్లాస్మా పదార్థాన్ని గుర్తించేందుకు ఉపకరిస్తాయి. యుద్ధం, పేదరికం, ప్రపంచ సంక్షోభంతో మానవ జాతి అతలాకుతలం అవుతున్న ప్రస్తుత సమయంలో విశ్వపదార్థపు చీకటి కోణాలను, దైవకణాల విన్యాసాలను పరిశీలించేందుకు జరిగే కృషిని అభినందించక తప్పదు. దైవ కణాల ఉనికి నిర్ధారణ జరిగినా, జరగకపోయినా ఈ ప్రయోగంతో విశ్వానికి సంబంధించిన పలు చీకటి కోణాలు వెలుగులోకి వస్తాయని పలువురు శాస్త్రవేత్తలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
— వెన్నెలకంటి రామారావు.

NB: ఈ టపాను నిన్న ప్రచురించిన తర్వాత వివిధ పత్రికలలో ఇవ్వాళ వస్తున్న అప్‌డేట్ వార్తలు, సంపాదకీయాలు, కథనాల లింకులను కొన్నింటిని లభ్యమైన మేరకు ఇక్కడ ఇస్తున్నాను. ఆసక్తి గల పాఠకులు వీటిని తప్పక చూడగలరు.

దైవ కణం జాడ!
– సంపాదకీయం
https://www.andhrajyothy.com/editorial.asp?qry=2012/jul/5/edit/editpagemain&date=7/5/2012

మహాద్భుతం…!
సంపాదకీయం
http://sakshi.com/Main/Weeklydetails.aspx?Newsid=44773&subcatid=17&categoryid=1

దైవ కణ’ దర్శనం!

సంపాదకీయం
http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=5&ContentId=124879

దైవకణం ఉంది !

– భౌతిక శాస్త్రంలో అతికీలకమైన ఆవిష్కరణ
http://sakshi.com/main/FullStory.aspx?catid=406509&Categoryid=1&subcatid=31

దేవ రహస్యం తెలిసింది
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/jul/5/main/5main1&more=2012/jul/5/main/main&date=7/5/2012

దైవకణం దక్కింది

http://eenadu.net/news/newsitem.aspx?item=panel&no=1

విశ్వ ఆవిర్భావ సమాచారాన్నందించే కొత్త కణాన్ని కనుగొన్నాం
http://www.prajasakti.com/worldsdestiny/article-367464

విశ్వ సృష్టి శోధనలో కొత్త అధ్యాయం
http://www.visalaandhra.com/headlines/article-86374

విశ్వరహస్యం చివరి మజిలీ
http://www.suryaa.com/Main/News/Article.asp?Category=1&SubCategory=4&ContentId=88334

God Particle Found Historic Milestone From Higgs Boson Hunters
http://news.nationalgeographic.com/news/2012/07/120704-god-particle-higgs-boson-new-cern-science/?plckOnPage=4

The Bose in the particle
http://www.thehindu.com/opinion/op-ed/article3602966.ece?homepage=true

Higgs boson ‘The beauty spot on the perfect face’
http://www.thehindu.com/sci-tech/science/article3601946.ece

Elusive particle found, looks like Higgs boson
http://www.thehindu.com/sci-tech/science/article3601654.ece

This is just the beginning of a long journey
http://www.thehindu.com/sci-tech/science/article3603258.ece

What next after a Higgs boson-like particle
http://www.thehindu.com/sci-tech/science/article3602374.ece

Footprint of ‘God particle’ found
http://www.thehindu.com/sci-tech/science/article3594941.ece

 

RTS Perm Link